Tags

, , , , , , , , ,


ఎం కోటేశ్వరరావు


చైనా నేత షీ జింపింగ్‌ను గృహ నిర్బంధంలో ఉంచారు, అధికారాలన్నీ లాగేసుకున్నారంటూ మన దేశంలోని కొన్ని మీడిియా సంస్థలు, సామాజిక మాధ్యమంలోని కాషాయ మరుగుజ్జులు (ట్రోల్స్‌), వారిని గుడ్డిగా నమ్మే వారు చేసిన ప్రచారం వామపక్ష శ్రేణుల్లో అనేక మందిని గందరగోళానికి గురిచేసింది. ఈ వార్తలను చూసి అనేక మంది కమ్యూనిస్టు అభిమానులు ఆందోళన చెందారు. చైనా వ్యతిరేకులైతే ఇంకే ముంది జింపింగ్‌ శకం ముగిసింది, చైనా పతనం మన దేశానికి శుభసూచకం అంటూ సంబరపడ్డారు.సామాజిక, సంప్రదాయ మీడియా సంస్థలలో ఉన్న అలాంటి వారంతా వండి, వార్చి, వడ్డించిన దాన్ని తిన్నవారు పండగ చేసుకున్నారంటే అతిశయోక్తి కాదు. అది ఉత్తిదే అని తేలటంతో వారంతా మానసికంగా తీవ్రంగా గాయపడ్డారు. అసలీ వదంతి ఎలా పుట్టింది, మన దేశంలోని వారు వాటిని ఎందుకు భుజాన వేసుకున్నారు, వారి మానసిక స్థితి ఏమిటి అన్నది ప్రశ్నగా ముందుకు వచ్చింది. వాట్సప్‌ పండితులు వండి వారుస్తున్న కుహనా వార్తలను ప్రధాన స్రవంతి మీడియా జనాలకు అందించటం ఒక ప్రధాన పరిణామంగా ఉన్నట్లు గత కొంత కాలంగా తెలుస్తున్నప్పటికీ ఈ ఉదంతం మరింతగా నిర్ధారించింది.


అసలే కోతి, దానికి పిచ్చి ఎక్కింది, దొరికిన కల్లుతాగింది,ఆపై నిప్పు తొక్కింది అన్న కథ తెలిసిందే. కొంత మందికి చైనా అంటే అసలే ద్వేషం, అందునా అక్కడి సోషలిస్టు వ్యవస్థ, కమ్యూనిస్టు పార్టీ అంటే పిచ్చి ఎక్కినట్లుంటుంది. గాల్వన్‌ ఉదంతంతో మానసికంగా చికిత్సలేని వ్యాధికి గురైన వారికి అధ్యక్షుడు షీ జింపింగ్‌ గృహ నిర్బంధం, పదవి నుంచి తొలగింపు వార్తలంటే స్టెరాయిడ్స్‌ వంటివి. ఇంకేముంది అలాంటి వారంతా రెచ్చిపో యారు. ఇంతకీ వారికి వాటిని ఇచ్చిందెవరో తెలుసా ? ఉల్లాసయువతుల( ఛీర్‌ గరల్స్‌ ) పెద్దక్క లేదా అమెరికా సిఐఏ ఒళ్లో కూర్చుని చెప్పమన్న కబుర్లు చెప్పే జెన్నిఫర్‌ జెంగ్‌ అనే మహిళ.ఆమె చైనాలో అసంతృప్తవాదిగా మారి అమెరికా చేరుకొని అక్కడి నుంచి పుంఖాను పుంఖాలుగా విషం చిమ్ముతోంది.ఆమెతో సహా అనేక మంది ఫాలున్‌ గాంగ్‌ (ధర్మ చక్రం ) పేరుతో ధ్యానంతో కొన్ని క్రీడలను ప్రచారం చేస్తున్నామనే పేరుతో తలెత్తిన కమ్యూనిస్టు వ్యతిరేక ముఠా. చైనా ప్రభుత్వం తొలుత వారిని ఉపేక్షించినప్పటికీ వారి వెనుక ఉన్న కుట్రదారులను గుర్తించిన తరువాత కత్తెర వేసింది. దాని నేతతో సహా అందరూ ఇప్పుడు అమెరికాలో కొలువుదీరారు. వారి చెత్తను ప్రచారం చేసేందుకు ఎపోచ్‌ టైమ్స్‌ అనే ఒక పత్రికను కూడా సిఐఏ ఏర్పాటు చేసింది. అదిగాక ఇతర పత్రికల్లో కూడా రాస్తుంటారు, స్వంతంగా దుకాణాలు కూడా తెరిచారు. వాట్సాప్‌ విశ్వవిద్యాలయాలు సరేసరి. వారు సముద్రం ఉందన్న చోట ఎడారి తప్ప నీటి చుక్క కనిపించదు.


దేశభక్తి గురించి మన జనానికి ఎవరూ కొత్తగా పాఠాలు చెప్పాల్సిన పనిలేదు. స్వాతంత్య్ర పోరాటంలో ఎందరో తమ మాన ప్రాణాలను,సంపదలను తృణ ప్రాయంగా అర్పించిన వారు వేగుచుక్కలా స్ఫూర్తినిస్తూనే ఉంటారు. అలాంటి వారు ఒక వైపు ఉంటే అసలు ఉద్యమంతో ఎలాంటి సంబంధాలు లేని, బ్రిటీష్‌ వారికి లొంగి ప్రేమలేఖలు రాసి తెరవెనుక పడి ఉంటామని చెప్పిన వారి వారసులు ఇప్పుడు జనాలకు దేశభక్తి గురించి బోధలు చేస్తున్నారు. వారికైనా ఎవరికైనా దేశభక్తి గురించి చెప్పే అర్హత లేదని ఎవరూ అనటం లేదు. అసలైన దేశభక్తులం మేమే, మేము చెప్పేదే సిసలైన దేశభక్తి అంటున్నందునే కాదన్నవారిది దేశద్రోహం అన్న దగ్గరే సమస్య మొదలౌతున్నది. ఇరుగు పొరుగు దేశాలతో సరిహద్దు సమస్యలుంటే సామరస్య పూర్వకంగా పరిష్కరించుకోవాలి.చైనాతో సరిహద్దు వివాదానికి బ్రిటీష్‌ వారు కారకులు, కాశ్మీరు సమస్యకు అమెరికా,బ్రిటన్‌, వారికి మద్దతు ఇస్తున్నదేశాలు బాధ్యులు. వాటి పరిష్కారం కంటే ఆ దేశాల మీద విద్వేషాన్ని రెచ్చగొట్టటాన్ని, వ్యతిరేకతను నూరిపోయటం, దాన్ని బుర్రల నిండా ఎక్కించుకోవటమే దేశభక్తి అని చెబుతున్నారు. తప్పన్న వారిని దేశద్రోహులుగా చిత్రిస్తున్నారు.ఉచ్చగుంటల్లో చేపలు పట్టేవారి మాదిరి సరిహద్దుల్లో నిరంతరం ఉద్రిక్తతలు కొనసాగితే ఆ పేరుతో ఓట్లు దండుకోవచ్చని చూస్తున్నారు. పరిష్కారానికి పూనుకోవటం లేదు.


పశ్చిమ దేశాల్లో కూడా జనాలను చైనా వ్యతిరేక వార్తలతో అలరించినప్పటికీ మన దేశంలో మాదిరి జనాల్లో విద్వేషాన్ని ఎక్కించలేదు. రెండవది గొర్రెల గోత్రాలు కాపరులకు ఎరుక అన్నట్లుగా ఫాలున్‌ గాంగ్‌ చెప్పే కబుర్ల బండారం ఏమిటో మనకంటే ఎక్కువగా వారికి తెలిసి ఉండటం కూడా షి జింపింగ్‌పై పుకార్ల గురించి సంయమనం పాటించటానికి కారణంగా కనిపిస్తున్నది. కాషాయ దళాలు ఒక పధకం ప్రకారం వివిధ సంస్థల్లోకి తమ భావజాలం ఉన్నవారిని పంపటమే గాక వాట్సాప్‌ ఉన్నవారి బుర్రలను చాలావరకు ఖరాబు చేశాయి. పిచ్చి మొక్కలు మొలిచేందుకు అనువైన వాతావరణం ఉంది గనుక షీ జింపింగ్‌ నిర్బంధం అనగానే దున్నఈనిందంటే దూడను కట్టివేయమన్నట్లుగా తాము అనుకుంటున్నదీ లేదా కోరుకుంటున్నది జరిగింది అనగానే వెనుకా ముందూ చూడకుండా ఎలాంటి నిర్ధారణలకు పూనుకోకుండా మీడియాలో ఉన్నవారు రెచ్చిపోయారు. తామే కాదు, తమ వార్తలను గుడ్డిగా నమ్మేవారిని కూడా వెర్రి వెంగళప్పలుగా మార్చివేశారు. ఇప్పటికే మీడియా సంస్థలు విశ్వసనీయత సమస్యలను ఎదుర్కొంటుండగా తాజా వార్తను పతాక శీర్షికలకు ఎక్కించి మరింత ప్రశ్నార్ధకంగా మార్చివేశారు,ప్రతిష్టను దిగజార్చారు.


ప్రపంచంలో కొందరు ప్రధానులు, అధ్యక్షుల మాదిరి కొత్త చొక్కాలు వేసుకొని ప్రతిరోజూ కెమెరాల ముందు చైనా నేతలు ఎప్పుడూ నిలవలేదు. ప్రతి రోజూ టీవీల్లో ఫోజులు కొట్టరు. షి జింపింగ్‌ కూడా అంతే. సామరకండ్‌ సమావేశాలకు వెళ్లి వచ్చిన తరువాత కరోన జాగ్రత్తల్లో భాగంగా కొద్ది రోజులు కనిపించలేదు. అదే సమయంలో కొందరు ప్రముఖ మాజీల మీద చర్యలు తీసుకున్నట్లు వార్తలు రావటం.ఆరుగురు మాజీ మంత్రులు లేదా ఉన్నతాధికారుల అవినీతి రుజువు కావటంతో ఇటీవలనే వారికి శిక్షలు వేశారు.వారు తిరుగుబాటుకు పూనుకున్నారని చిత్రించారు. గత కొద్ది నెలలుగా జింపింగ్‌ మీద కుట్ర, ప్రత్యర్ధులు సవాలు చేస్తున్నారు, జీరో కరోనా పేరుతో లాక్‌డౌన్లు విధించి జనాన్ని ఇబ్బందులు పెడుతున్నారు తప్ప దేశ ఆర్ధిక వృద్ధి పట్టలేదు వంటి అంశాలతో కుట్ర విశ్లేషణలను ఒక పధకం ప్రకారం రాస్తున్నవారు ఇప్పుడు చెబితే జనం కచ్చితంగా నమ్ముతారు అంటూ ఏకంగా జింపింగ్‌ను నిర్బంధించారని సృష్టించారు. చైనా గురించి రాసే నిపుణుడిగా పేరున్న మనోజ్‌ కేవల్‌రమణి ఈ తప్పుడు వార్త గురించి చెబుతూ ” భారత మీడియా దాన్ని అందిపుచ్చుకొని పరుగెత్తుతూ దాన్ని టాంటాం వేసింది. ఒక్క తూటా కూడా పేలకుండా ఇలాంటిది జరిగే అవకాశం ఉందని అనుకోవటం విడ్డూరంగా ఉంది. బీజింగ్‌ ఉత్తర కొరియా కాదు, అక్కడ విదేశీ విలేకర్లు జీవిస్తున్నారు. భారత్‌లో చైనా వ్యతిరేకత విశేషంగా ఉంది. అది లడఖ్‌లో రెండు దేశాలు ఘర్షణ పడక ముందునుంచీ ఉంది ” అన్నారు. ” భారత్‌లోని సామాజిక మాధ్యమాల్లో ఈ పుకార్లపై స్పందన వారు కోరుకుంటున్నదానికి ప్రతిబింబం, షీ జింపింగ్‌ను అరెస్టు చేశారు అన్న పుకారు షికారు చేసేందుకు కారణం బీజింగ్‌లో సున్నితమైన రాజకీయ కదలికలు ఉండటమే ” అని సింగపూర్‌లోని చైనా అంశాల నిపుణుడు డ్రా థాంప్సన్‌ చెప్పాడు. ” చైనా రాజకీయాలు బ్లాక్‌బాక్స్‌(విమానాల్లో జరిగేవాటిని రికార్డు చేసే ఒక పరికరం. విమానం మొత్తం ధ్వంసమైనా అది చెక్కుచెదరదు. దాన్ని విప్పిచూస్తే జరిగిందేమిటో తెలుస్తుంది) కంటే కఠినంగా ఉంటాయి . సామాజిక మాధ్యమంలోని పుకార్లను ధృవీకరించేందుకు ఈ రోజు బీజింగ్‌లో ఎలాంటి óఆధారం దొరకలేదు ” అని హిందూ పత్రిక బీజింగ్‌ విలేకరి అనంత కృష్ణన్‌ పేర్కొన్నారు.

శుక్రవారం(23వ తేదీ) ప్రారంభమైన వదంతులు శనివారం నాటికి పతాకస్థాయికి చేరాయి. అమెరికాలో ఫాలున్‌ గాంగ్‌ పేరుతో తిష్టవేసిన చైనా అసంతృప్త జీవులు, సిఐఏ కిరాయి మనుషులు సృష్టించిన ఈ పుకారును వారు నడిపే ఎన్‌టిడిటివి అనే మీడియా వదిలింది, దాన్ని ట్విటర్‌, యు ట్యూబ్‌లో ఆ ముఠావారే పెద్ద ఎత్తున ప్రచారం చేశారు, దాన్ని మన దేశంలోని సామాజిక మాధ్యమంలోని చైనా వ్యతిరేకులు మరింత పెద్దగా వ్యాపింప చేశారు.చైనాలో ఈ ఏడాది లాక్‌డౌన్లు లేనపుడు మార్చి నెలలో రోజుకు ఆరువేల విమానాలు ఎగిరేవి, లాకడవున్ల కారణంగా తగ్గాయి .అలాంటిది బీజింగ్‌ గగనతల మీద రోజుకు 16వేలు ఎగురుతాయని వాటిలో తొమ్మిదివేలను రద్దు చేశారని ప్రచారం జరిగింది.చైనా నుంచి పారిపోయి జర్నలిస్టుగా చెప్పుకొనే ఝావో లాంజియాన్‌ అనే వాడు విమానాల రద్దు ఈ కథను అల్లాడు. ఆ మేరకు ఉపగ్రహాల చిత్రాలంటూ కొన్నింటిని చూపారు. అదంతా వట్టిదే అని తరువాత కొందరు స్పష్టం చేశారు. శనివారం నాడు అమెరికాలో స్థిరపడిన చైనా మహిళ జెన్నిఫర్‌ జెంగ్‌ ట్వీట్‌ చేస్తూ బీజింగ్‌ వైపుకు కదులుతున్న 80కిలోమీటర్ల పొడవైన మిలిటరీ దళాల బారు అంటూ ఒక వీడియోను జత చేసింది. సంచలనం కోసం ఎదురు చూసే మీడియా దున్న ఈనిన దూడను మనకు చూపెట్టింది. మన దేశంలో జరిగిన ప్రచారాన్ని చూసి బీజింగ్‌లో ఉన్న డెర్‌ స్పీగల్‌ అనే జర్మన్‌ పత్రిక విలేకరి జార్జి ఫారియన్‌ ఒక సైకిల్‌ రిక్షాలో కూర్చున్న ఒక మహిళ, తియనన్‌మెన్‌ మైదానం దగ్గర ఉన్న కొందరు సందర్శకుల చిత్రాలను పోస్టు చేస్తూ వాటి కింద ” ఆశ సన్నగిల్లుతున్నది, కుట్రదారుల అదనపు బలాలు సాయుధశకటాల్లో వచ్చాయని ” అపహాస్యం చేస్తూ చేసిన ట్వీట్‌ను కొన్ని టీవీ ఛానళ్లు మరోరకంగా చెప్పాయి. చైనా మిలిటరీ రకరకాల వేషాల్లో రూపంలో ఉంటుందన్నాయి .

అధికారాలన్నీ లాగేసుకొని వేరేవారికి అప్పగించారంటూ వచ్చిన ఆధారం లేని వార్తలను సరి చూసుకోకుండా రెచ్చిపోయిన వారు అది అవాస్తవం అని తేలిన తరువాత ఉలుకూ పలుకూ లేకుండా ఉన్నారు. కొందరు తేలుకుట్టిన దొంగల మాదిరి నోరు మూసుకుంటే, కొండంత రాగం తీసి కీచుగొంతుతో అరచినట్లు ఉత్తిదే అని ప్రశ్నార్ధకమిచ్చిన వారు కొందరు. సిద్దాంతం పట్ల స్థిరత్వం లేని వారు, అవినీతి అక్రమాల పట్ల చూసీ చూడనట్లు ఉన్నవారు, ప్రధాన అంశాల మీద స్పష్టత లేని వారిని అక్టోబరు 16 నుంచి జరగనున్న కమ్యూనిస్టు పార్టీ మహాసభకు ప్రతినిధులుగా ఎన్నుకోలేదని వార్తలు. ఈ సభకు ఎన్నికైన మొత్తం ప్రతినిధులు 2,296 కాగా వారిలో లడఖ్‌ సరిహద్దులలో పని చేస్తున్న 13 మందితో సహా పిఎల్‌ఏ పశ్చిమ కమాండ్‌కు చెందిన 30 మంది మిలిటరీ అధికారులు, ఇతర కమాండ్‌ల నుంచి మొత్తంగా మిలిటరీ నుంచి 304 మంది ఎన్నికైనట్లు వచ్చిన వార్తలు. పుకార్ల గురించి ప్రస్తావించకుండా చైనాలో ఎలాంటి పరిణామాలూ జరగలేదని అర్ధం వచ్చేలా వాటికి తెరదించుతూ షీ జింపింగ్‌ నేతృత్వంలోని పార్టీ మార్గదర్శకాల మేరకు ఎన్నికైన ప్రతినిధులందరూ పార్టీ మహాసభకు సిద్దమౌతున్నారంటూ కమ్యూనిస్టు పార్టీ ఆదివారం నాడు ఒక ప్రకటన విడుదల చేసింది.
.