Tags

, , , , ,


ఎం కోటేశ్వరరావు


గుజరాత్‌, హిమచల్‌ ప్రదేశ్‌ ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. గుజరాత్‌లో 182కు గాను 156 సీట్లు తెచ్చుకుంది. కాంగ్రెస్‌ 17, ఆప్‌ 5 సీట్లు తెచ్చుకుంది. గతంలో కాంగ్రెస్‌ తెచ్చుకున్న 149 సీట్ల రికార్డును బిజెపి బద్దలు కొట్టింది. గత ఎన్నికలతో 49.05 శాతం తెచ్చుకున్న బిజెపికి ఈసారి 52.5 శాతం రాగా కాంగ్రెస్‌కు 41.44 నుంచి 27.28 శాతానికి తగ్గగా , ఆమ్‌ ఆద్మీ 12.92శాతం తెచ్చుకుంది. హిమచల్‌ ప్రదేశ్‌లో కాంగ్రెస్‌ 40, బిజెపి 25, ఇతరులు మూడు సీట్లు తెచ్చుకున్నారు. హౌరా హౌరీగా సాగిన పోరులో ఈ సారి బిజెపి ఓట్లు 48.8 నుంచి 43శాతానికి తగ్గగా కాంగ్రెస్‌ 41.7 నుంచి 43.9శాతానికి పెంచుకుంది. ఈ ఫలితాల గురించి వెంటనే కొన్ని సాధారణ విశ్లేషణలు వెలువడ్డాయి. రానున్న రోజుల్లో లోతైన పరిశీలనలు రావచ్చు. ఈ లోగా దేశంలో తిరిగి ఎన్నికల కోలాహలం ప్రారంభం కానుంది. ఫిబ్రవరిలో బిజెపి లేదా దాని మిత్రపక్షాల ఏలుబడిలోని త్రిపుర, నాగాలాండ్‌, మేఘాలయ రాష్ట్రాల్లో, మే నెలలో కర్ణాటక, నవంబరులో చత్తీస్‌ఘర్‌ (కాంగ్రెస్‌), మిజోరాం(ఎంఎఎన్‌ఎఫ్‌), మధ్య ప్రదేశ్‌(బిజెపి), డిసెంబరులో తెలంగాణా(బిఆర్‌ఎస్‌), రాజస్తాన్‌(కాంగ్రెస్‌) అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉంది. వీటికి గడువు ప్రకారమే జరిగితే మూడు సార్లు అంటే దాదాపు ఏడాది మొత్తం ఎక్కడో ఒక చోట ఎన్నికల వాతావరణం ఉంటుంది. రెండు తెలుగు రాష్ట్రాల పాలకపార్టీల నేతలు ముందుస్తు ఎన్నికలు లేవని చెబుతున్నప్పటికీ రావని చెప్పలేము. జరుగుతున్న మధింపు, సర్వేలు ముగిశాక ఒక స్పష్టత రావచ్చు. కర్ణాటకతో పాటు తెలంగాణా, ఆంధ్రప్రదేశ్‌లో కూడా ఎన్నికలు జరిగే అవకాశాలు లేకపోలేదు. ఏం జరుగుతుందనేది చూడాల్సి ఉంది.


కుక్క మనిషిని కరవటం సాధారణం, మనిషి కుక్కను కరిస్తేనే వార్త అవుతుంది.నరేంద్రమోడీ నాయకత్వానికి ఎదురు లేదు, ఎవరైనా వస్తే పుట్టగతులుండవన్న రీతిలో ప్రచారం జరుగుతోంది. గతంలో ఇందిరా గాంధీ గురించి కూడా ఇలాగే చెప్పారు. రెండు సార్లు నరేంద్రమోడీ తిరుగులేని మెజారిటీతో కేంద్రంలో అధికారానికి వచ్చిన తరువాత చివరికి అసెంబ్లీ ఎన్నికల్లో కూడా తనకే ఓటు వేసినట్లుగా భావించాలని మోడీ కోరినప్పటికీ హిమచల్‌ ప్రదేశ్‌లో ఫలితం దక్కలేదు. అందుకే గుజరాత్‌లో గెలుపు కంటే ఇక్కడ ఓటమి వార్తగా మారింది. కేంద్రంలోనూ, రాష్ట్రంలోనూ ఒకే పార్టీ ప్రభుత్వం ఉంటే రాష్ట్రాలు బాగా వృద్ది చెందుతాయని గతంలో కాంగ్రెస్‌ ఇప్పుడు బిజెపి అంటున్నది. కేంద్రంలోని ప్రభుత్వం, పార్టీతో సఖ్యతతో ఉంటే రాష్ట్రాలకు నిధులు ఎక్కువ తెచ్చుకోవచ్చని చెప్పే ప్రాంతీయ పార్టీల సన్నాయి నొక్కులను చూస్తున్నాము. ” గుజరాత్‌ పర్యటనలో రు. 9.4లక్షల కోట్ల పధకాలను ప్రారంభించనున్న ప్రధాని ” అంటూ హిందూస్తాన్‌ టైమ్స్‌ పత్రిక ఒక వార్తను 2022 సెప్టెంబరు 30న ప్రచురించింది. ఇవన్నీ కేంద్ర ప్రభుత్వ పధకాలే అనుకోవాల్సిన అవసరం లేదు, కొన్నింటికి శంకుస్థాపనలు, ప్రారంభాలు ఉండవచ్చు. హిమచల్‌ ప్రదేశ్‌లో కూడా ఉన్నది బిజెపి ప్రభుత్వమే కదా అక్కడ ప్రారంభించిన పథకాల గురించి అలాంటి వార్తలు కనిపించలేదు. హిమచల్‌ ప్రదేశ్‌లో రు.3,650 కోట్ల మేర వివిధ పథకాలకు శంకుస్థాపన చేయనున్న ప్రధాని అంటూ 2022 అక్టోబరు మూడవ తేదీ దక్కన్‌ క్రానికల్‌ పత్రిక ఒక వార్తను ప్రచురించింది. పోనీ అంతకు ముందు అక్కడ మరో రెండు రెట్ల విలువగల పథకాలను ప్రారంభించారనుకుందాం అవి గుజరాత్‌కు సాటి వచ్చేవేనా ? ఒకే పార్టీ రెండు ఇంజన్ల పాలన ఉన్నప్పటికీ గుజరాత్‌కు మరొక రాష్ట్రానికి ఇంత తేడా ఎందుకున్నట్లు ? ఏ పీఠమెక్కినా, ఎందుకాలిడినా చూపరా గుజరాత్‌ పక్షపాతం అన్నట్లుగా నరేంద్రమోడీ గుజరాత్‌ ప్రధాని అని ఎవరైనా ఎద్దేవా చేస్తే , కాదు దేశానికే ప్రధాని అని బిజెపి పెద్దలు లేదా వారిని సమర్ధించేవారు ఎలానో వెల్లడించాలి.


సిఎంగా నరేంద్రమోడీ గుజరాత్‌ను ఎంతో వృద్ది చేశారని అందుకే దేశమంతటా గుజరాత్‌ మోడల్‌ను అమలు చేస్తామని 2014లో చెప్పారు, మోడీ ప్రధాని పీఠమెక్కారు గానీ సదరు మోడల్‌ను చివరికి తమ ఏలుబడిలోని రాష్ట్రాల్లో కూడా అమలు జరపలేదు, అసలు ఇంతవరకు ఎక్కడా దాని ప్రస్తావన కూడా తేలేదు. ఇది నరేంద్రమోడీ విశ్వసనీయతను ప్రశ్నించటం లేదూ ! ప్రణాళికా సంఘాన్ని పక్కన పెట్టి తన పేరును శాశ్వతంగా తలచుకొనే విధంగా మోడీ నీతిఅయోగ్‌ను రంగంలోకి తెచ్చారు. అది వెల్లడించిన సమాచారం ప్రకారం 2021 దేశ ఆరోగ్యసూచికలో మొత్తం మీద పని తీరులో కేరళకు 82.2 పాయింట్లు రాగా దేశానికే నమూనా అని పేర్కొన్న గుజరాత్‌కు వచ్చింది 63.59 మాత్రమే. నరేంద్రమోడీ ఏలుబడిలో ఏమి సాధించించినట్లు ? రెండో ఇంజను తగిలించిన తరువాత కూడా కేరళ కంటే అంత వెనుకబడి ఎందుకు ఉన్నట్లు ? అక్కడే కాదు మధ్య ప్రదేశ్‌లో కూడా దశాబ్దాల తరబడి బిజెపి పాలనే కొనసాగుతున్నది దానికి వచ్చిన పాయింట్లు 36.72 , పందొమ్మిది పెద్ద రాష్ట్రాల్లో మధ్య ప్రదేశ్‌, బీహార్‌, ఉత్తర ప్రదేశ్‌ చివరన ఉన్నాయి, గుజరాత్‌లో, ఇతర చోట్ల తమ పని తీరును చూసి జనం ఓటేశారని బిజెపి నేతలు చెప్పుకుంటున్నారు. వారి ముందు నవ్వటానికి జనానికి భయం అన్నది తెలిసిందే. అదే అభివృద్దని బిజెపి చెప్పినా జనం భావించినా ఎవరూ చేసేదేమీ లేదు.దారిద్య్రనిర్మూలనలో ఆర్‌బిఐ ప్రకటించిన 2013 నివేదిక ప్రకారం గుజరాత్‌ 14వ స్థానంలో ఉంది.అది నరేంద్రమోడీ పన్నెండేళ్ల పాలన తరువాత. తాజా వివరాల ప్రకారం దేశంలో సగటున 2021-22లో 21.92 శాతం మంది దారిద్య్రరేఖకు దిగువున ఉంటే గుజరాత్‌లో 16.63 శాతం ఉన్నారు. కేరళలో 0.71శాతం మాత్రమే ఉన్నారు. రెండింజన్లు ఉండి ఏమి సాధించినట్లు ? ఇది దేశానికి ఆదర్శం(మోడల్‌) ఎలా అవుతుంది.


గుజరాత్‌లో ఘన విజయానికి కారకుడు నరేంద్రమోడీ అని బ్రహ్మరధం పడుతున్నారు.అమిత్‌ షా దగ్గరుండి అన్నీ చూసుకున్నారని చెబుతున్నారు. వరుసగా గెలవటమే గొప్ప అనుకుంటే గతంలో కాంగ్రెస్‌కూ అలాంటి రికార్డులున్నాయి. అక్కడ బిజెపి ఏలుబడి ప్రారంభం నుంచి చూస్తే క్రమంగా తగ్గుతూ 2017ఎన్నికల్లో 182కు 99 (మెజారిటీ 92 ) మాత్రమే బిజెపి తెచ్చుకుంది. తమ నేత ప్రధానిగా ఎదిగిన తరువాత జరిగిన తొలి ఎన్నికల్లో అక్కడి జనం పెద్దగా స్పందించలేదు. అంతకు ముందు మోడీ నేతగా ఉన్నపుడు వచ్చిన 115 సీట్లు 99కి తగ్గాయి. దీనికి కారకులెవరు ? అమిత్‌ షా మంత్రాంగం అప్పుడు ఎందుకు పని చేయలేదు. నరేంద్రమోడీ తరువాత 2014 నుంచి ముగ్గురు సిఎంలను అక్కడ బిజెపి మార్చింది. ఇతర పార్టీల నుంచి ఫిరాయింపులు చేయించి 99 నుంచి 112కు పెంచుకుంది.ఇదంతా నీతి సూత్రాలు వల్లించే నరేంద్రమోడీకి తెలియకుండా జరిగిందనుకోలేము. ఎందుకంటే ఈ దేశంలో ఏది జరిగినా మోడీ వలనే అని చెబుతున్నారు గనుక దీనికి మినహాయింపు ఎందుకివ్వాలి ?


గుజరాత్‌లో బిజెపి ఈ సారి ముందు జాగ్రత్త పడింది. అనేక సామాజిక తరగతులను సంతుష్టీకరించింది. ముస్లిం విద్వేషాన్ని కొనసాగించింది. అనేక చోట్ల కాంగ్రెస్‌ అనుసరించిన ఎత్తుగడలనే పునరావృతం గావించింది. ఆ పార్టీ నుంచి డజన్ల కొద్దీ నేతలను తెచ్చుకొని బరిలో నిలిపింది. బలమైన పటేల్‌ సామాజిక తరగతి లేకుండా గెలవలేమని గ్రహించి జైన్‌ బనియా సామాజిక తరగతికి చెందిన విజయ రూపాని చేత అవమానకరంగా సిఎం పదవికి రాజీనామా చేయించి 2021 సెప్టెంబరులో భూపేంద్ర పటేల్‌ను గద్దె నెక్కించారు. రూపాని నాయకత్వంలో 2017లో ఎన్నికలు జరిగినపుడు నరేంద్రమోడీ ఎన్నికల ప్రచారానికి దూరంగా లేరు. ఆ ఎన్నికల్లో 99 రావటానికి రూపాని బలహీన నాయకత్వమే కారణమని, బలహీనమైన సిఎం అని, కరోనాను ఎదుర్కోవటంలో విఫలం చెందారని ప్రచారం చేసి రాజీనామా చేయించారు. అలాంటపుడు ఐదేండ్లు ఎందుకు కొనసాగించినట్లు? మోడీ-షా ఏం చేస్తున్నట్లు ? ఇప్పుడు రికార్డు స్థాయిలో వచ్చిన సీట్లకు కారకుడు నరేంద్రమోడీ అంటున్నారు. అంటే గెలుపు మోడీ ఖాతాకు, పరాజయం ఇతరుల ఖాతాకు వేస్తారని స్పష్టమైంది. ప్రస్తుత సిఎం భూపేందర్‌ పటేల్‌ ఎక్కువ మంది జనానికి తెలియదని రాష్ట్ర బిజెపి ప్రధాన ప్రతినిధి యామల్‌ వ్యాస్‌ చెప్పినట్లు 2022 డిసెంబరు ఐదవ తేదీ అవుట్‌లుక్‌ పత్రిక పేర్కొన్నది. అంటే పలుకుబడి కలిగిన పటేల్‌ సామాజిక తరగతి మద్దతు కోసమే ఒక బొమ్మగా సిఎం గద్దె మీద కూర్చోపెట్టారన్నది స్పష్టం. రూపాని కాబినెట్‌లోని మంత్రులందరినీ తొలగించారు. తాజా ఎన్నికల్లో 41మంది సిట్టింగ్‌లకు సీట్లు నిరాకరించారు. రాష్ట్ర పార్టీ సారధినీ మార్చివేశారు. చిత్రం ఏమిటంటే మూడు దశాబ్దాల పాలన తరువాత గుజరాత్‌ ఆత్మగౌరవం అంటూ బిజెపి కొత్త పల్లవి అందుకుంది. ఎవరి నుంచి దాని గౌరవానికి ఎసరు వచ్చినట్లు ?


ఇక ఏకత, శీలము అంటూ కబుర్లు చెప్పే సంఘపరివార్‌కు గుజరాత్‌ పెట్టని కోట. ఆ కోటలోకి కాంగ్రెస్‌ నుంచి2007, 2012లో గోద్రాలో గెలిచిన సికె రావుల్జీ 2017 ఎన్నికల ముందు బిజెపిలో చేరి ఆ పార్టీ తరఫున అదే ఏడాది కేవలం 258 ఓట్ల తేడాతో గెలిచారు.అతగాడు 2002 గోద్రా మారణకాండలో అత్యాచారానికి గురైన బిల్కిస్‌ బానో కేసులో శిక్షలు పడి జైలు జీవితం అనుభవిస్తున్న 11 మంది శిక్షా కాలం తగ్గించి వెలుపలికి రప్పించేందుకు కృషి చేసిన అపర శీలవంతుడు. 2022 ఆగస్టు 19న కోర్టు నిర్ధారించి నేరగాండ్లుగా తేల్చిన 11మంది గురించి మాట్లాడుతూ ” వారు నేరానికి పాల్పడిందీ లేనిదీ నాకు తెలియదు. వారు బ్రాహ్మలు, బ్రాహ్మలు మంచి సంస్కారవంతులని తెలిసిందే ” అని అప్పటికే ఏడు సార్లు గెలిచి ఒకసారి మంత్రి పదవి వెలగబెట్టిన ఆ పెద్దమనిషి సెలవిచ్చారు.తాజా ఎన్నికల్లో 35వేల 198 ఓట్ల మెజారిటీతో అక్కడ గెలిచారు. గుజరాత్‌లో తిరుగులేని ప్రభావం చూపుతున్న సంఘపరివార్‌ సంస్థలు అక్కడి జనాలకు నేర్పిన ” సంస్కారానికి ” ఫలితమిది. ఇలాంటి వారిని బరిలోకి దించిన బిజెపి తప్ప గుజరాత్‌ గౌరవాన్ని మరో పార్టీ ఎలా దెబ్బతీస్తుంది ? జర్మనీలో హిట్లర్‌ యుూదుల మీద ఉన్మాదాన్ని, విద్వేషాన్ని రెచ్చగొట్టినపుడు అక్కడి జనం నీరాజనాలు పలికిన ఉదంతాన్ని ఈ సందర్భంగా గుర్తుకు తెచ్చుకోవాలి. నాడు హిట్లర్‌ను నెత్తిమీద పెట్టుకున్న జర్మన్లు నేడు వాడి పేరు ఉచ్చరించటానికి కూడా ఇష్టపడరు. ఎక్కడైనా రోజులన్నీ ఒకే విధంగా ఉండవు.


హిమచల్‌ ప్రదేశ్‌లో ఓటమికి అక్కడ ఒకసారి కాంగ్రెస్‌ ఉంటే మరోసారి బిజెపి అధికారానికి రావటం రివాజుగా ఉందని దాని కొనసాగింపు తప్ప వేరేఏమీ కాదని బిజెపిని సమర్ధించే వారు కొట్టి పారవేస్తున్నారు. ఆ ముక్క ఎన్నికలకు ముందే చెప్పి ఈ వుంటే అది వేరుగా ఉండేది. నరేంద్రమోడీ పరువు దక్కేది. అందని ద్రాక్ష పుల్లన అన్నట్లుగా ఫలితాల తరువాత చెబుతున్నారు. దేశంలో రివాజులను మార్చటమే మోడీ గొప్పతనమని, ఐదు దశాబ్దాల్లో కాంగ్రెస్‌ చేయలేని వాటిని ఐదేండ్లలో మోడీ చేసి చూపించారని నీరాజనాలు పలికారు. ఉత్తరాఖండ్‌, ఉత్తర ప్రదేశ్‌లో కూడా అలాగే ఉన్న రివాజును మార్చివేశామని, హిమచల్‌ ప్రదేశ్‌లో కూడా అదే జరగనున్నట్లు బిజెపి పెద్దలు చెప్పారు. పార్టీ అభ్యర్ధులను చూసి కాదు, కమలం గుర్తుకు ఓటేస్తే తనకు వేసినట్లే అని మోడీ స్వయంగా చెప్పుకున్నారు. కమలం ఓడి వాడింది కనుక నరేంద్రమోడీ కూడా అక్కడ ఓడినట్లా కాదా ? తిరుగుబాటు అభ్యర్ధులు బిజెపిని దెబ్బతీశారని ఒక ముక్తాయింపు. జెపి నడ్డా బిజెపి పార్టీ దేశ అధ్యక్షుడు కావచ్చుగానీ హిమచల్‌ ప్రదేశ్‌ బిజెపిలో ఒక ముఠానేత అని అందరికీ తెలుసు. కాంగ్రెస్‌ కూడా ఆ సమస్యను ఎదుర్కొన్నది. లేకుంటే దానికి ఇంకా సీట్లు వచ్చేవేమో ? అయినా కాంగ్రెస్‌ నేతలను పార్టీలో చేర్చుకొని వారికి పెద్ద పీటవేస్తే బిజెపిలో అధికార రుచిమరిగిన వారు మడి కట్టుకు కూర్చుంటారా ? వారంతా రంగంలో ఉన్నప్పటికీ తమదే అధికారం అని చెప్పినవారు ఇప్పుడు అంతా వారే చేశారు అంటే కుదురుతుందా ? ఒకసారి అధికారం వస్తే వారు వీరవుతారన్నది స్పష్టం.


బిజెపి అంటే మోడీ – మోడీ అంటే బిజెపి అంటున్నారు. దేశంలో మోడీ ఎక్కడ బలహీనంగా ఉంటే అక్కడ ఇడి చురుకుగా పని చేస్తుందని జనం గ్రహిస్తున్నారు. ఇతర పార్టీలు బలంగా ఉంటే వారి మద్దతుదార్ల మీద దాడులు జరుగుతాయి, భయపెడతారు. అత్యాచారం చేసిన వారు సంస్కారవంతులని కితాబునిచ్చిన గుజరాత్‌ బిజెపి ఎంఎల్‌ఏ తిరిగి రికార్డు మెజారిటీతో గెలిచిచారంటే అక్కడి జనానికి కాషాయ దళాలు కలిగించిన అపర చైతన్యానికి నిదర్శనం. ఉత్తర ప్రదేశ్‌లోని రాంపూర్‌ సాదర్‌లో తొలిసారిగా ఒక హిందువు అసెంబ్లీకి ఎన్నికైనట్లు మరొక వార్త. వీటి గురించి మరొక విధంగా చెప్పాలంటే ఎక్కడ ముస్లిం విద్వేషాన్ని, హిందూ భావోద్వేగాలను రెచ్చగొడితే అక్కడ బిజెపికి ఓట్ల పంట ఎక్కువగా పండుతున్నది. గుజరాత్‌లో గోద్రా మారణకాండ ఇంకా లబ్ది చేకూర్చుతూనే ఉంది. అక్కడ జనాభాలో 2011లెక్కల ప్రకారం 88.6శాతం హిందువులు, 9.7శాతం ముస్లింలు ఉన్నారు. గోద్రా మారణకాండకు ముందు 1960, 80దశకాల్లో తీవ్రమైన మత ఘర్షణలు జరిగిన పూర్వరంగం ఉంది. అదే హిమచల్‌ ప్రదేశ్‌లో ముస్లింలను బూచిగా చూపేందుకు అవకాశం లేదు.అక్కడ జనాభాలో దేశంలో ఎక్కడా లేని విధంగా 95.17శాతం మంది హిందువులే ఉన్నారు. అక్కడ 2.18శాతం మందే ముస్లిం జనాభా ఉంది. ఈ కారణంగా అక్కడ ముస్లిం విద్వేష భావోద్వేగాన్ని రగిల్చే అవకాశం లేనందున మోడీ-బిజెపి ఎత్తుగడలు పారలేదని కొందరు చెబుతున్నారు. ప్రభుత్వ పనితీరును బట్టే జనం ఓట్లేశారని, ఆమేరకు బిజెపి వైఫల్యం ఓటమికి దారి తీసిందని అభిప్రాయపడుతున్నారు. హిందూమతానికి ముప్పు వచ్చిందని, లవ్‌ జీహాద్‌, ఉమ్మడి పౌరస్మృతి, వెనుకబడిన తరగతుల వంటి అంశాలు అక్కడ ఓటర్లను ఆకర్షించేవికాదు.జనాభాలో మూడోవంతు మంది ఠాకూర్లు, 25.2శాతం దళితులు(33శాతం మంది ఉన్న పంజాబ్‌ తరువాత ఇంత మంది మరొక రాష్ట్రంలో ఎక్కడా లేరు) 18శాతం బ్రాహ్మణులు,13.5శాతం వెనుకబడిన తరగతులు 5.7శాతం మంది గిరిజనులు ఉన్నారు. ఇక్కడ మరొక పార్టీ ఎదగలేదు. జనాభాలో అగ్రవర్ణాలుగా పేర్కొనబడుతున్నవారే ఎక్కువగా ఉన్నందున ఇతర రాష్ట్రాల్లో మాదిరి ఎక్కువగా ఉన్న వెనుకబడిన తరగతుల సామాజిక సమీకరణలకూ అవకాశం లేదు. పంజాబ్‌లో కూడా ముస్లిం విద్వేషాన్ని రెచ్చగొట్టేందుకు వీలుగా అక్కడ ఆ సామాజిక తరగతి జనాభా లేకపోవటంతో బిజెపి ఓటు బాంకును ఏర్పరుచుకోలేకపోయిందని సూత్రీకరించిన వారున్నారు.

ఉత్తర ప్రదేశలో చేసిన మాదిరి పదమూడు శాతం ఉన్న ముస్లింలు ఉన్న కర్ణాటకలో రెచ్చగొడుతున్న వివాదాలు, తెలంగాణాల టిఆర్‌ఎస్‌ను నడిపిస్తున్నది మజ్లిస్‌ అని ప్రచారం చేయటం, కేరళలో ముస్లిం మతశక్తుల గురించి చేస్తున్న ప్రచారం వంటివన్నీ ఈ సూత్రీకరణలకు ఊతం ఇస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో ముస్లిం విద్వేషాన్ని రెచ్చగొడితే కుదరదు, జగన్మోహన్‌ రెడి ్డ క్రైస్తవమతానికి చెందిన వారు గనుక హిందూ మతానికి ముప్పు వచ్చిందని ప్రచారం చేస్తున్నారు. ఇదే సమయంలో ఢిల్లీలో తీవ్ర విద్వేషాన్ని రెచ్చగొట్టినా పదిహేను సంవత్సరాలు మున్సిపల్‌ పాలన సాగించిన బిజెపి తాజాగా దెబ్బతిన్నది. కేరళలో దాని ఎత్తుగడలు పారలేదు, ఉన్న ఒక్క సీటును, గతంలో తెచ్చుకున్న ఓట్లనూ అది పోగొట్టుకుంది. శబరిమల పేరుతో మెజారిటీ మతాన్ని రెచ్చగొట్టాలని చూసినా కుదరలేదు. క్రైస్తవుల ఓట్ల కోసం వెంపర్లాడుతున్నది. బెంగాల్లో కొంత మేరకు ముస్లిం విద్వేషం ఫలించినా గత అసెంబ్లీ ఎన్నికల్లో బొక్కబోర్లా పడింది. అంతకు ముందు తెచ్చుకున్న ఓట్లను తెచ్చుకోలేకపోయింది. ఇలా బిజెపికి మిశ్రమ ఫలితాలు ఎదురవుతున్నా దాని ముస్లిం విద్వేషం తగ్గలేదు. సబ్‌కా సాత్‌ సబ్‌కా విశ్వాస్‌, వికాస్‌ అని చెబుతున్న ఆ పార్టీ గుజరాత్‌లో పదిశాతం ఉన్న ముస్లింలకు ఒక్క సీటంటే ఒక్కటీ ఇవ్వలేదు. ఇచ్చిన వారికి ముస్లిం సంతుష్టీకరణ పార్టీలని ముద్రవేస్తున్నది. స్వాతంత్య్ర పోరాటంలో అందరినీ కూడగట్టేందుకు కాంగ్రెస్‌ అనుసరించిన ఎత్తుగడలు, తరువాత మైనారిటీలను ఓటు బాంకుగా మార్చుకున్న తీరును బిజెపి బాగా ఉపయోగించుకుంది.అసలు స్వాతంత్య్ర పోరాటంతో సంబంధం లేని సంఘపరివార్‌, తరువాత దాని రాజకీయ ముసుగులుగా ముందుకు వచ్చిన జనసంఘం, బిజెపి డిఎన్‌ఏలోనే ముస్లిం విద్వేషం ఉంది. షాబానో కేసు వంటి వాటితో మైనారిటీలను సంతుష్టీకరిస్తూనే బిజెపిని ఎదుర్కొనేందుకు బాబరీ మసీదును కూడా తెరిపించి మెజారిటీ మతస్తుల సంతుష్టీకరణకు కాంగ్రెస్‌ తెరలేపింది. రెండింటికీ చెడింది. బిజెపి గతంలో జరిగిన వాటి పేరుతో ముస్లిం విద్వేషం, మెజారిటీ హిందువుల సంతుష్టీకరణకు తెరతీసింది. కానీ ఎక్కడా దానికి మెజారిటీ హిందువుల మద్దతు ఇంతవరకు రుజువు కాలేదు. ప్రతిపక్షాల్లో చీలికల కారణంగానే అది ఎక్కువ సీట్లు తెచ్చుకుంటున్నది.

.