Tags

, , , , , , ,


ఎం కోటేశ్వరరావు


మే డే అంటే కార్మికులు కొన్ని చోట్ల సంబరాలు జరుపుతున్నారు. మరికొన్ని చోట్ల దీక్షాదినంగా పాటిస్తున్నారు. అసలు ఏదీ పాటించకుండా, మే డే అంటే ఏమిటో కూడా తెలియకుండా ఆ రోజున కూడా పనిలో ఉండేవారు ఉన్నారు. కరోనా సమయంలో శ్రామికులు తక్కువగా అందుబాటులో ఉన్నందున రోజుకు పన్నెండు గంటలపాటు పని చేయించేందుకు గుజరాత్‌ ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్‌ చెల్లదని సుప్రీం కోర్టు 2020 అక్టోబరు ఒకటవ తేదీన తీర్పు చెప్పింది. కేంద్ర ప్రభుత్వం చేసిన విధాన నిర్ణయం ప్రకారం వారానికి నాలుగు రోజులు, రోజుకు పన్నెండు గంటల చొప్పున పని గంటలు ఉన్నాయి. వాటిని అమలు జరపాల్సింది రాష్ట్రాలు గనుక అసెంబ్లీలు ఆమోదించాల్సి ఉంది. ఇప్పటికే కర్ణాటకలో ఆమోదించారు. తాజాగా తమిళనాడులో ఆమోదం మీద తీవ్ర నిరసన వెల్లడి కావటంతో రాష్ట్ర ప్రభుత్వం దాన్ని నిలిపివేసింది తప్ప రద్దు చేయలేదు. అది తాత్కాలికం, దేశమంతటా ఆ కత్తి కార్మికుల మెడమీద వేలాడుతూనే ఉంది.మూడు సాగు చట్టాలను ప్రతిఘటిస్తూ రైతాంగం సాగించిన ఏడాది పోరాటం, దానికి తలొగ్గి క్షమాపణలు చెప్పి మరీ వాటిని రద్దు చేసిన తీరు తెలిసిందే. రైతన్నల పోరు, దేశంలో దిగజారుతున్న ఆర్థిక స్థితి, వివిధ రాష్ట్రాలలో జరిగిన అసెంబ్లీ ఎన్నికలు, 2024లో లోక్‌సభ ఎన్నికల కారణంగా లేబర్‌ కోడ్‌ల పేరుతో కార్మికుల మీద రుద్దనున్న చట్టాలను ఆలశ్యం చేస్తున్నారు తప్ప వెనక్కు తగ్గే ధోరణిలో లేరు. ఇప్పటికే పార్లమెంటు ఆమోదించింది. అనేక రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు కొన్ని అంశాలపై ముసాయి నిబంధనలను ప్రకటించాయి. ఒక విధానంగా చట్ట సవరణ చేస్తే దాన్ని కోర్టులు కొట్టివేసేందుకు అవకాశాలు దాదాపు లేవు. కార్మికులను కోర్టులు కూడా ఆదుకోలేవు. ఇప్పుడున్న ఎనిమిది గంటల షిప్టులను పన్నెండు గంటలకు పెంచుకోవటమా లేదా అన్నది యజమానులు నిర్ణయించుకోవచ్చని, దీనికి కార్మికుల అంగీకారం కూడా అవసరమే అని సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు.తమకు వచ్చిన ఆర్డర్లను సకాలంలో పూర్తి చేయాలనో మరో సాకునో యజమానులు చూపితే పన్నెండు గంటలు ఏకబిగిన పని చేయక తప్పదు.చట్టాలు యజమానులకు చుట్టాలు తప్ప కార్మికులకు కాదు. చట్టాల ఆటంకం కారణంగానే మన దేశానికి విదేశీపెట్టుబడిదారులు రావటం లేదని, ఎగుమతుల్లో పోటీ పడలేమని అందువలన వారు కోరుకున్నట్లుగా భూమి, కార్మిక చట్టాలను మార్చాలని ఎప్పటి నుంచో చెబుతున్న సంగతి తెలిసిందే. అందుకే ఈ మార్పులన్నీ వారి కోసం తప్ప కార్మికుల కోసం కాదు.


ఆసుపత్రులు, మరికొన్ని చోట్ల ఇప్పటికే అరకొర వేతనాలతో పన్నెండు గంటల షిప్టుల్లో పని చేస్తున్నవారు ఎందరో ఉన్నారు. వారికి వారానికి ఒక రోజు సెలవు తప్ప అదనంగా ఇవ్వటం లేదు. ఇప్పుడు వారికి మూడు రోజులు సెలవులు, వాటికి వేతనం ఇస్తారా, ప్రభుత్వం ఇప్పిస్తుందా ? నాలుగు రోజులు పని చేస్తే వచ్చే వేతనంతో ఏడు రోజులు ఎలా గడుపుకుంటారు ? కొన్ని చోట్ల పని స్థలాలకు వెళ్లి వచ్చేందుకు కార్మికులకు రెండు నుంచి నాలుగు గంటలు పడుతున్నది. అంటే పదహారు గంటలు కుటుంబాలకు దూరంగా ఉండి ఇంటికి వెళ్లిన తరువాత కుటుంబ సభ్యులతో గడిపేందుకు, విశ్రాంతి తీసుకొనేందుకు వ్యవధి దొరుకుతుందా ? ఇదే అమలు జరిగితే వారానికి నాలుగు రోజులు వారు ఇంటికి దూరమై ఫ్యాక్టరీల గేట్ల ముందు పడుకున్న 150 సంవత్సరాల నాటి పరిస్థితులు పునరావృతం అవుతాయంటే అతిశయోక్తి కాదు. ఈ విధానం అమల్లోకి వస్తే తొలి బాధితులు, పనికి దూరమయ్యేది మహిళలు. వారు ఇంట్లో పని చేసుకొని పద్నాలుగు నుంచి పదహారు గంటల సమయాన్ని పనికి వెచ్చించగలరా ? పసి పిల్లలను సంరక్షించుకోగలరా ? పన్నెండు గంటల షిఫ్టులు పెడితే ఆహారపు అలవాట్లు, వేళలు మారతాయి. మూడు పూటలా తినేందుకు వీలుండదు, మూడుసార్లు తినాల్సినదాన్ని రెండుసార్లు కుక్కటం జరిగేదేనా ? ఇవి అలసట, ఆరోగ్య, మానసిక వత్తిడి, తాగుడు వంటి వాటికి దారితీస్తాయి.ఇప్పటికే అనేక సమస్యలను ఎదుర్కొంటున్న కుటుంబాలకు, కుటుంబ జీవనానికి కొత్త వాటిని జోడిస్తాయి.


అదనపు వేతనం ఇచ్చేందుకు నిరాకరిస్తూ, ఇచ్చినా అరకొరా చెల్లిస్తూ అడిగిన వారిని పని నుంచి తొలగిస్తున్న యజమానులకు చట్టబద్దంగా అధికారమిచ్చి ఎనిమిది గంటలకు ఇస్తున్న వేతనంతోనే పన్నెండు గంటలు చేయించినా అడిగేవారు ఉండరు. దశాబ్దాల తరబడి కనీస వేతనాలను పెంచని పాలకులు కళ్ల ముందు కనిపిస్తున్నపుడు ఇంతకు మించి కార్మికులకు ఒరిగేదేమీ ఉండదు.చట్టవిరుద్ద దోపిడీని చట్టబద్దం చేస్తుంది. కొత్త చట్టాల ప్రకారం మొత్తం వేతనంలో మూలవేతనం సగం ఉండాలని చెబుతున్నారు. అంటే ఆ మేరకు కార్మికులు, యజమానులు చెల్లించే ప్రావిడెంట్‌ ఫండ్‌ వాటా పెరుగుతుందని, ఉద్యోగ విరమణ చేసినపుడు గ్రాట్యూటీ పెరిగి పెద్ద మొత్తాలు చేతికి అంది సుఖంగా జీవించవచ్చని ఆశ చూపుతున్నారు. పిఎఫ్‌ వాటా పెరగటం అంటే తమ పెన్షన్‌కు తామే ముందుగా చెల్లించటం తప్ప మరొకటి కాదు. దీని వలన వచ్చే వేతనాల మొత్తం తగ్గి రోజువారీ గడవటం ఎలా అన్నది అసలు సమస్య. అలవెన్సులు, కరువు భత్యం వంటివి మూలవేతనంలో సగానికి మించకూడదంటే అది కార్మికులకు నష్టమే.
కొత్త చట్టం వస్తే సెలవులేమీ పెరగవు. ఇప్పుడు 45 రోజులకు ఒక వేతనంతో కూడిన సెలవు ఇస్తున్నారని, దాన్ని ఇరవై రోజులకు ఒకటి వచ్చేట్లు చేస్తున్నామని చెబుతున్నారు. ఎనిమిదికి బదులు నాలుగు గంటలు పని చేస్తే ఓవర్‌టైమ్‌ వేతనం చెల్లించాలి. ఇప్పుడు మామూలు వేతనానికే అదనంగా రోజుకు నాలుగు గంటలు పని చేయాలి.కంపెనీలో చేరిన 240 రోజుల తరువాత సెలవు పెట్టుకొనే దానిని ఇప్పుడు 180రోజులకే తగ్గిస్తున్నట్లు ఆశచూపుతున్నారు. ఇప్పుడు ఏడాదికి వారాంతపు సెలవులు 52 పోగా పని రోజులు 300 వరకు ఉంటున్నాయి. నాలుగు రోజులే పని అమల్లోకి వస్తే పని రోజులు రెండువందలకు తగ్గుతాయి. ఏదైనా ఒకటే కదా ! వాస్తవంగా నిబంధనలు అమల్లోకి వస్తే తప్ప కార్మికులు ఎంత పొగొట్టుకొనేది, యజమానులకు కలిగే లబ్ది ఏమిటనేది స్పష్టం కాదు.


అనేక దేశాల్లో మాదిరి సంస్కరణల్లో భాగంగా షిప్టులను మారిస్తే తప్పేమిటి అని కొందరు వాదించవచ్చు. ఒక సినిమాలో దేన్నీ ఒక వైపే చూడకు అన్న డైలాంగ్‌ తెలిసిందే. వీటినీ అంతే. చైనాలో సంస్కరణలు అక్కడ సంపదలను సృష్టిస్తే మన దేశంలో అలాంటిదేమీ జరగలేదు. అదే చైనాలో పన్నెండుగంటల పనికి అనుమతి ఉంది అని కొందరు కొన్ని కంపెనీలను చూపి ఉదాహరించవచ్చు.వాస్తవాలేమిటి ? చైనాలో రోజుకు ఎనిమిది గంటలపని, వారానికి 44 గంటలు అన్న చట్టాన్ని మార్చి పన్నెండుగంటలుగా, నాలుగు రోజులుగా మార్చలేదు. ప్రభుత్వం ఇచ్చిన కొన్ని వెసులుబాట్లను అవకాశంగా తీసుకొని కొన్ని కంపెనీలు వారానికి ఆరు రోజులు, రోజుకు పన్నెండు గంటల షిప్టులను అమలు జరిపాయి. దాన్నే 996 పని సంస్కృతి అని పిలిచారు. ఆలీబాబా కంపెనీ అధినేత జాక్‌ మా వంటి వారు దాన్ని అమలు జరిపారు. అలాంటి పని పద్దతులను అమలు జరిపితే కఠిన చర్యలు తీసుకుంటామని చైనా ప్రభుత్వం గట్టి హెచ్చరిక చేసింది. అనేక కోర్టులు పన్నెండు గంటలపని చట్టవిరుద్దమని తీర్పులు చెప్పాయి. 2021 సెప్టెంబరు 21 చైనా సుప్రీం కోర్టు, కార్మిక మంత్రిత్వశాఖ సంయుక్తంగా ఒక ప్రకటనలో పది కోర్టు తీర్పులను ఉటంకిస్తూ కార్మికుల చేత చట్టాలకు భిన్నంగా ఏ రంగంలోనూ బలవంతంగా పని చేయించటాన్ని సహించేది లేదని స్పష్టం చేశాయి. విశ్రాంతి సమయంలో, సెలవు రోజుల్లో కార్మికులతో పని చేయిస్తే చట్టపరంగా చెల్లింపు లేదా పరిహారాన్ని కోరే హక్కు కార్మికులకు ఉందని పేర్కొన్నాయి. టెక్నాలజీ (ఐటి) కంపెనీలు నిబంధనలకు విరుద్దంగా ఎక్కువ సేపు పని చేయించినట్లు, పరిహారం చెల్లించలేదన్న ఆరోపణలు ఉన్నాయి.2019లో కొంత మంది ప్రోగ్రామర్లు రంగంలోకి దిగి అందరికీ అందుబాటులో ఉండే (ఓపెన్‌ సోర్స్‌ కోడ్స్‌ ) సంకేతాలను ఉపయోగించుకొని పని చేసే అంకుర సంస్థలు చట్టాలను ఉల్లంఘిస్తే వాటిని బ్లాక్‌ లిస్టులో పెట్టాలని డిమాండ్‌ చేశారు. అలా ఎక్కువ గంటలు పనిచేసి అనారోగ్యాలకు గురై కొందరు నిపుణులు మరణించిన తరువాత నిరసనలు వెల్లువెత్తాయి. మన దగ్గర స్విగ్గీ, జొమాటో వంటి సంస్థల తరఫున ఆహారాన్ని అందించే కార్మికులు తమకు చట్టాలను వర్తింప చేయటం లేదని ఫిర్యాదు చేసిన తరువాత చైనా ప్రభుత్వం అలాంటి సంస్థలను కట్టడి చేసి కార్మికులకు రక్షణ కల్పించింది. అనేక సంస్థలు దారికి వచ్చాయి. అలాంటి చిత్తశుద్ది మన ప్రభుత్వాలకు ఉన్నాయా అన్నది ప్రశ్న.చైనాలో కార్మిక చట్టాలను కఠినతరం గావించటం, కనీసవేతనాల పెంపుదల వంటి కారణాలతో అక్కడ ఇంకేమాత్రం వాణిజ్యం, ఫ్యాక్టరీలను నడపటం లాభసాటి కానందున అక్కడి నుంచి వచ్చే కంపెనీలను మన దేశం ఆకర్షించాలని మన దేశంలో అనేక మంది చెబుతున్నారు. ఇదే తరుణంలో ఇక్కడ కార్మికులను యజమానుల దయాదాక్షిణ్యాలకు వదలివేసే, జీవితాలను ఫణంగా పెట్టే పని పద్దతులను రుద్దేందుకు చూస్తున్నారు. ఏదో దేశంలో తొడకోసుకుంటే మన దేశంలో మెడకోసుకోవాల్సిన అవసరం లేదు. విదేశీ సిద్దాంతాలు, విదేశీ పద్దతులు వద్దని చెప్పేవారు కార్మికుల మీద విదేశీ పద్దతులనే ఎందుకు బలవంతంగా రుద్దుతున్నట్లు ?


అంబేద్కర్‌ అంటే దళితుల నాయకుడని, ( కొంత మంది దళితులలో ఒక ఉప కులానికే పరిమితం చేస్తున్నారు) మహాత్మా జ్యోతిరావు పూలే అంటే బిసిల నేతగా చిత్రించే ప్రయత్నం జరుగుతోంది.ఈ ఇద్దరికీ కమ్యూనిస్టులు వ్యతిరేకమనే తప్పుడు ప్రచారం కొందరు చేస్తున్నారు.మరికొందరు వారిని తమ మనువాద, తిరోగామి చట్రంలో బంధించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇది వారి స్ధానాన్ని తక్కువ చేసి చూపటమే. మన దేశంలో కార్మికోద్యమ పితామహుడు, కార్మిక, సామాజిక సమస్యలపై కేంద్రీకరించిన తొలి పత్రిక ‘దీన బంధు ‘ సంపాదకుడు నారాయణ్‌ మేఘాజీ లోఖండే అని, ఆయన మహాత్మా జ్యోతిబా పూలే ఏర్పాటు చేసిన సత్య శోధక సమాజ కార్యక్రమాల వుత్తేజంతోనే దేశంలోనే తొలి కార్మిక సంఘాన్ని ఏర్పాటు చేశారనే విషయం ఎందరికి తెలుసు. కమ్యూనిస్టు మానిఫెస్టో వెలువడిన 1848లో జన్మించిన నారాయణ్‌ కేవలం 49 సంవత్సరాలకే ప్లేగు వ్యాధి గ్రస్తులకు సేవలందిస్తూ అనారోగ్యంతో మరణించారు. రైల్వే, తపాల శాఖలో పని చేసిన ఆయన 1870లో మాండవీ బట్టల మిల్లులో స్టోరు కీపరుగా చేరారు. ఆ సమయంలో మిల్లు కార్మికుల దయనీయ స్ధితిని ప్రత్యక్షంగా చూశారు. కార్మికులు పది నుంచి 14 గంటలు పని చేసేవారు.

బాంబే మిల్‌ హాండ్స్‌ అసోసియేషన్‌ పేరుతో తొలి కార్మిక సంఘాన్ని 1884లో నారాయణ్‌ ఏర్పాటు చేశారు. అదే ఏడాది ప్రభుత్వం కూడా ఫ్యాక్టరీ కమిషన్‌ను ఏర్పాటు చేసింది. ఈ అవకాశాన్ని వినియోగించుకొని కార్మికుల సంక్షేమ చర్యలలో భాగంగా ప్రమాదానికి గురైనపుడు సాయం, మరణించినపుడు గ్రాట్యూటీ, కుటుంబ పెన్షన్‌ వంటి వాటిని అమలు జరపాలని కోరుతూ మిల్లు కార్మిక సంఘ అధ్యక్షుడి హౌదాలో ఆ కమిషన్‌కు ఒక పిటీషన్‌ అందచేశారు.దానిపై వేలాది మంది కార్మికుల సంతకాలను సేకరించారు. ఒకవైపు వాటితో పాటు 1884 సెప్టెంబరు 23న తొలిసారిగా కార్మికుల సభను ఏర్పాటు చేసి అవే డిమాండ్లను పునరుద్ఘాటిస్తూ వారానికి ఒక రోజు ఆదివారం సెలవు ఇవ్వాలని, వుదయం ఆరున్నర నుంచి సాయంత్రం పొద్దుగూకే వరకు మాత్రమే పని చేయించాలని, మధ్యాహ్నం ఒక గంట విశ్రాంతి ఇవ్వాలని కూడా సభ ఒక తీర్మానం చేసింది.అయితే వాటిని యజమానులు అంగీకరించలేదు. 1890 నాటికి ప్రపంచ పెట్టుబడిదారీ వ్యవస్ధలో ఒక సంక్షోభం వచ్చింది. వస్త్రాలకు డిమాండ్‌ లేని కారణంగా మిల్లులను మూసివేస్తున్నామని యజమానులు ఏకపక్ష చర్యలకు పూనుకున్నారు. దానికి నిరసనగా 1890 ఏప్రిల్‌ 24న లోఖండే ఒక పెద్ద కార్మిక సభను నిర్వహించారు. అదే ఏడాది జూన్‌ పదిన యజమానుల సమావేశంలో ఆదివారం రోజు సెలవు ఇవ్వాలని నిర్ణయించారు. సంఘటిత కార్మికవుద్యమానికి లభించిన విజయమది. మాంద్యం ఎంతకాల కొనసాగుతుందో తెలియదు కనుక ఒక రోజు సెలవు ఇస్తే వచ్చే నష్టం కంటే పని చేస్తే తమపై పడే భారం ఎక్కువ కనుక యజమానులు సెలవుకు అంగీకరించారన్నది మరొక కోణం.


దీన్ని బట్టి యజమానులకు ఏది లాభంగా ఉంటే దాన్నే కోరుకుంటారన్నది స్పష్టం. పన్నెండు గంటల షిప్టు, మూడు రోజుల సెలవు వెనుక ఉన్నది కూడా అదే.మన దేశంతో సహా ప్రపంచమంతటా వినిమయ సంస్కృతిని ప్రోత్సహిస్తున్నారు.ఎనిమిది గంటల బదులు పన్నెండు గంటలు చేసి వారానికి మూడు రోజులు సెలవు తీసుకుంటే కుటుంబాలతో సంతోషంగా గడపవచ్చంటూ రంగుల కలను చూపుతున్నారు. ఇలా మార్చాలని అసలు ఎవరు అడిగారు. అన్ని రోజులు సెలవులు గడిపి ఖర్చు చేసేందుకు ఎందరి వద్ద మిగులు ఉంటుంది. పశ్చిమ దేశాలలో జనం ఎంత ఖర్చు చేస్తే అక్కడి కార్పొరేట్లు, వాణిజ్య సంస్థలకు లబ్ది. అందుకోసం అప్పులూ ఇప్పిస్తారు, వాటిని ఖర్చు చేసేందుకు సెలవులూ ఇస్తున్నారు. మన దేశం ఆ స్థితికి ఇంకా చేరిందా? అక్కడున్న మాదిరి సామాజిక రక్షణలు ఇక్కడ ఉన్నాయా ?


2005లో ఆయన స్మారకార్ధం పోస్టల్‌ స్టాంపును విడుదల చేసిన సందర్భంగా ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ మాట్లాడుతూ లోంఖడేలో జ్యోతిబా పూలే సామాజిక సంస్కరణ, మహిళాభ్యుదయంతో పాటు కారల్‌ మార్క్సు-ఫెడరిక్‌ ఎంగెల్స్‌ కార్మిక పక్షపాతం కూడా మిళితమై వుందని చెప్పారు. బ్రిటీష్‌ ప్రభుత్వం ఆయనకు రావు బహద్దూర్‌ బిరుదును ప్రకటించటాన్ని బట్టి ఒక సంస్కర్తగానే చూసిందన్నది స్పష్టం. ఒక కార్మిక నేతకు అలాంటి బిరుదులను వూహించలేము. అంతమాత్రాన కార్మికోద్యమానికి ఆయన వేసిన బలమైన పునాదిని విస్మంరించకూడదు. మే డే సందర్భంగా పూలే, అంబేద్కర్‌లను విస్మరించలేము. పూలే, ఆయన సత్యశోధక సమాజం, సంస్కరణలకోసం కషే నారాయణ మేఘజీ లోఖండేను కార్మిక పక్షపాతిగా కూడా మార్చిందన్నది స్పష్టం.ఈ సందర్భంగా పూలే, లోఖండే, అంబేద్కర్‌లను వామపక్ష వుద్యమం విస్మరించిందనే ఒక విమర్శ వుంది. అది గత చరిత్ర. నేడు వామపక్షాలు గతం కంటే వారి కషిని గుర్తించిన మాట వాస్తవం. పూలే, అంబేద్కర్‌లను వామపక్షాలు సముచిత స్ధానంతో గౌరవించలేదని విమర్శించే వారు తాజా వైఖరిలో వచ్చిన మార్పును గమనించవచ్చు. ఈ సందర్భంగానే పూలే-అంబేద్కరిస్టులుగా ముద్రపడిన వారు కుల వివక్ష సమస్యకే పరిమితమై కార్మికవర్గ, ఇతర పోరాటాలను విస్మరిస్తున్నారనే విమర్శను మరచి పోకూడదు. అందువలన ఎవరి వైఖరికి వారు కట్టుబడి వున్నప్పటికీ రెండు సమస్యల మీద ఐక్య వుద్యమాలు చేయటానికి అవి ఆటంకం కానవసరం లేదు. అవి శత్రువైరుధ్యాలు కావు.


కార్మికవర్గం ఎదుర్కొనే సమస్యలు మరింత తీవ్రతరం అవుతాయే తప్ప తగ్గవు అన్నది స్పష్టం. పన్నెండు గంటల షిప్టు నిబంధన అందరికీ వర్తిస్తుంది. దానిలో ఎవరికీ మినహాయింపులు ఉండవు. అందువలన తామేం చేయాలో కూడా కర్తవ్యాన్ని నిర్ణయించుకోవాలి. అదే మే డే సందేశం. ఎనిమిది గంటల పని దినం కోసం జరిపిన పోరాటాలకు ప్రతి రూపమే మే డే. ఇప్పుడు ఆ విజయాన్ని వమ్ము చేసి పన్నెండు గంటల పనిని రుద్దబోతున్నారు. కార్మికులు ఈ సవాల్‌ను స్వీకరించాలా వద్దా ? ప్రపంచీకరణ యుగంలో కార్పొరేట్ల లాభాలు తగ్గేకొద్దీ శ్రమజీవుల సంక్షేమ చర్యల మీద ముందు దాడి జరుగుతుంది. అందువలన ప్రతి పరిణామాన్ని జాగరూకులై పరిశీలించాల్సి వుంది.ఈ రోజుల్లో కూడా మేడే ఏమిటండీ. ప్రపంచమంతా సోషలిజం, కమ్యూనిజం అంతరించిపోయింది. కొంత మంది పొద్దున్నే జండాలు ఎగరేసి, మధ్యాహ్నం నుంచి తాగి తందనాలాడటం, లేకపోతే మొక్కుబడిగా ఒక ర్యాలీ, సభో జరపటం తప్ప చేస్తున్నదేమిటి? అయినా అసలు మేడే గురించి దానిని పాటించే వారికి ఎందరికి తెలుసు, ఒక రోజు పని మానివేయటం తప్ప ఎందుకిది అని పెదవి విరిచే వారి సంఖ్య రోజు రోజుకూ పెరిగి పోతోంది. ప్రపంచవ్యాపితంగా కార్మికోద్యమాలు వెనుక పట్టుపట్టిన కారణంగా ఇటువంటి చైతన్య రహిత భావాలు ప్రబలుతున్నాయి. తెల్లచొక్కాల వారు తాము కార్మికులం కాదనుకుంటున్నారు.యాజమాన్యంలో భాగం కాకుండా వేతనం తీసుకొనే ప్రతివారూ కార్మికులే. మే డేని ఎలా జరుపుకోవాలా అన్నది వారి చైతన్యానికి గీటురాయి. ఇది ఒక్క రోజుతో ముగిసేది కాదు. దోపిడీకి గురవుతున్న ప్రతి కార్మికుడు ప్రతి రోజూ మేడేను స్మరించుకుంటూ కార్యోన్ముఖులు కావాలి.