Tags
BJP, Donald Trump foul mouth, farmers agitation 2020, Kangana ranaut, Narendra Modi Failures, Rahul gandhi
ఎం కోటేశ్వరరావు
అంతే, కొందరి నోటిని అదుపు చేయటం ఆ బ్రహ్మతరం కూడా కాదంటారు. విశ్వగురువుగా ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపగలరు, అమెరికా అధ్యక్షుడిని తన కాళ్లదగ్గరకి తెచ్చుకోగలరు అనుకుంటున్నవారిది భ్రమగాకపోతే కంగన రనౌత్ నోటిని అదుపులో పెట్టటం నరేంద్రమోడీ వల్ల అవుతుందా ? ఆయనకంటే శక్తివంతురాలు గాకపోతే నెల రోజుల్లోనే రెండు సార్లు బిజెపిని ఇరకాటంలో పెట్టగలరా ? రైతుల ఉద్యమం, రద్దు చేసిన మూడు సాగు చట్టాల గురించి తాను చేసిన వ్యాఖ్యలను వెనక్కు తీసుకుంటున్నట్లు 2024 సెప్టెంబరు 25 ఆమె ప్రకటించారు. దానిలో చిత్తశుద్ధి కనిపించటం లేదు. ఆగస్టు చివరి వారంలో దైనిక్ భాస్కర్ అనే పత్రికతో మాట్లాడిన కంగన 202021లో జరిగిన రైతు ఉద్యమం గురించి నోరుపారవేసుకున్నారు. ఆ సందర్భంగా మృతదేహాలు వేలాడాయని,మానభంగాలు జరిగాయని ఆరోపించారు.రైతు ఉద్యమం జరిగిన హర్యానాలో లోక్‌సభ ఎన్నికల్లో పదికి గాను ఐదు సీట్లు పోగొట్టుకున్న బిజెపి అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం దూరం కానుందనే భయంతో ఉంది. సరిగ్గా ఈ తరుణంలో ఆమె చేసిన వ్యాఖ్యలు హర్యానా రైతాంగాన్ని మరింతగా రెచ్చగొట్టేవే. పార్టీకి నష్టం కలిగిస్తాయని హర్యానా పార్టీ నేతలు గగ్గోలు పెట్టారు. దాంతో కేంద్ర బిజెపి వెంటనే కంగన మాటలతో పార్టీకి సంబంధం లేదని చెప్పుకుంది తప్ప కనీసంగా ఆమెను మందలించలేదు. బంగ్లాదేశ్‌లో మాదిరి పరిస్థితిని భారత్‌లో సృష్టించే పథకం ఉందని, రైతుల నిరసనల వెనుక చైనా, అమెరికా హస్తం ఉందని కూడా అంతకు ముందు ఆరోపించారు. పార్టీ విధానాల గురించి ప్రకటనలు చేసేందుకు కంగన రనౌత్‌కు అధికారం లేదా అనుమతి ఇవ్వలేదని, భవిష్యత్‌లో అలాంటి ప్రకటనలు చేయకూడదని కోరినట్లు బిజెపి ప్రకటించింది. అయినప్పటికీ తగ్గేదేలే అన్నట్లుగా నెల రోజులు తిరక్క ముందే మరోసారి నోరు పారవేసుకున్నారు. బిజెపి కూడా మరోసారి ఆమె ప్రకటనతో తమకే సంబంధం లేదని గత ప్రకటననే తేదీ మార్చి ప్రకటించింది తప్ప కనీసం మందలించలేదు.
హిమచల్ ప్రదేశ్ మండి లోక్‌సభకు ఆమె బిజెపి తరఫున ఎన్నికైన సంగతి తెలిసిందే. ఆ నియోజకవర్గ పరిధిలోని నాచన్ అసెంబ్లీ నియోజకవర్గంలో 2024 సెప్టెంబరు 23వ తేదీన ఒక మతపరమైన కార్యక్రమంలో, ఆ సందర్భంగా కొంత మంది విలేకర్లతో మాట్లాడుతూ రద్దు చేసిన సాగు చట్టాలను తిరిగి ప్రవేశపెట్టాలని రైతులు డిమాండ్ చేయాలన్నారు. ఇలా మాట్లాడటం వివాదాస్పదం కావచ్చు గానీ అవి ఒకే దేశం `ఒకే ఎన్నికల మాదిరి ఎంతో ప్రయోజనకరమైనవని కూడా వర్ణించారు. అక్టోబరు ఐదవ తేదీన హర్యానాలో జరగనున్న ఎన్నికల పూర్వరంగంలో వెంటనే కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ, రైతు సంఘాల నేతలు తీవ్రంగా ఖండిరచారు. ఆమె మాటలతో పార్టీకి సంబంధం లేదని, వ్యక్తిగతమని హిమచల్ ప్రదేశ్ బిజెపి నేత కరణ్ నందా అన్నారు. సంయుక్త కిసాన్ మోర్చా జాతీయ సమన్వయ కమిటీ సభ్యుడు డాక్టర్ దర్శన్ పాల్ స్పందిస్తూ కంగన రైతులను రెచ్చగొడుతున్నారు. బహుశా తన సినిమా ప్రచారం కోసం ఇలా చేస్తుండవచ్చని, ఆమెకు మూడు సాగు చట్టాల ప్రతికూల ప్రభావం తెలియదని అన్నారు. నిత్యం వివాదాల్లో ఉండాలన్న యావతో ఉన్నట్లు చెప్పారు. మరొక రైతు నేత జగమోహన్ సింగ్ డకుండా మాట్లాడుతూ ప్రధాన మంత్రే వాటిని రద్దు చేసిన తరువాత అమలు జరపాలని చెప్పటానికి ఆమె ఎవరని ప్రశ్నించారు. ఆ ప్రకటనలపై కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి, ప్రధాని మోడీ వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు.
బుధవారం నాడు (సెప్టెంబరు 25న) ఎక్స్‌లో ఒక వీడియో ప్రకటన చేస్తూ రైతుల చట్టాల గురించి గత కొద్ది రోజులుగా మీడియా నన్ను కొన్ని ప్రశ్నలు అడుగుతోంది. ఆ చట్టాలను తిరిగి తీసుకురమ్మని రైతులు ప్రధాని మోడీని కోరాలని నేను చెప్పాను. రైతుల చట్టాలను ప్రతిపాదించినపుడు మేమంతా మద్దతు ఇచ్చాము. కానీ ఎంతో సున్నిత అంశం, రైతుల పట్ల సానుభూతితో గౌరవ ప్రధాని వాటిని వెనక్కు తీసుకున్నారు. తాను ఒక కళాకారిణి మాత్రమే కాదని, బిజెపి సభ్యురాలిగా కూడా ఉన్నానని, తన ప్రకటనలు పార్టీ వైఖరికి అనువుగా ఉండాలన్నారు. అంతే కాదు బిజెపి సభ్యురాలిగా తన అభిప్రాయం పార్టీ వైఖరికి అనుగుణంగా ఉండాలి తప్ప వ్యక్తిగతంగా ఉండకూడదు.నా మాటలు, అభిప్రాయాలు ఎవరినైనా ఆశాభంగానికి గురిచేస్తే విచారం వెల్లడిస్తున్నాను. నా మాటలను వెనక్కు తీసుకుంటున్నాను అని పేర్కొన్నారు. మరొక పోస్టులో రైతుల చట్టాలపై నా అభిప్రాయాలు వ్యక్తిగతమైనవి, అవి పార్టీ వైఖరికి ప్రాతినిధ్యం వహించవు, కృతజ్ఞతలు అని చెప్పారు.
‘‘ బిజెపి జనాలు కొన్ని అభిప్రాయాలను పరీక్షకు పెడతారు. ఒక అభిప్రాయాన్ని వెల్లడిరచమని కొందరికి పని అప్పగిస్తారు. దాని మీద వచ్చే ప్రతి స్పందనను చూస్తారు. గతంలో ఇదే జరిగింది. మూడు నల్ల సాగు చట్టాలను పునరుద్దరించాలని వారి ఎంపీ ఒకరిచేత చెప్పించారు. ఇలాంటి వాటికి మీరు వ్యతిరేకమా లేక మరోసారి ఇలాంటి చెరుపే చేయిస్తారా ?మోడీ గారు మీరు స్పష్టత ఇవ్వాలి. మూడు సాగు చట్టాలను పునరుద్దరిస్తారా లేదా చెప్పండి. మీరు గనుక అలా చేసేట్లయితే ఇండియా కూటమి మొత్తంగా దాన్ని వ్యతిరేకిస్తుందని మీకు స్పష్టం చేస్తున్నాను, ఏడు వందల మంది ప్రాణాలర్పించారు, వారిని స్మరించుకోవాలి, గౌరవించాలి ’’ అని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఎక్స్ ద్వారా స్పందించారు. కంగనా రనౌత్ ప్రకటనతో తమకేమీ సంబంధం లేదని పార్టీ ప్రకటించిన తరువాత క్షమాపణ చెప్పటం తప్ప ఆమెకు మరొక దారి లేదని బిజెపి మిత్ర పక్షం జెడియు ప్రతినిధి రాజీవ్ రంజన్ ప్రసాద్ వ్యాఖ్యానించారు. నిజానికి ఆమె తన ప్రకటనను వెనక్కు తీసుకున్నట్లు, విచారం ప్రకటించారు తప్ప క్షమాపణ చెప్పలేదు.
బస్తీమే సవాల్ అన్నట్లుగా అనేక సందర్భాలలో ఆమె నోటి తీట తీర్చుకున్నారు.బిజెపి ఆమెను అదుపుచేయలేకపోతోందన్నది వాస్తవం.గతంలో చేసిన అనేక వివాదాస్పద ప్రకటనలు, ప్రత్యర్థులపై ఎదురుదాడికి దిగినపుడు బిజెపి నోరు మెదపలేదు. నరేంద్రమోడీ అధికారానికి వచ్చిన 2014లోనే దేశానికి నిజమైన స్వాతంత్య్రం వచ్చిందని 2021లో టైమ్స్ నౌ సమావేశంలో చెప్పారు.స్వీయ అనుభవంతో తానీ మాటలు చెబుతున్నట్లు, తన అతి మంచితనం కారణంగా వ్యవస్థ తనను దేశం విడిచి అమెరికా వెళ్లేట్లు చేసిందని, మోడీ అధికారానికి వచ్చాక తాను తిరిగి వచ్చానని అందుకే అసలైన స్వాతంత్య్రం వచ్చినట్లు భావిస్తున్నట్లు చెప్పుకున్నారు. నరేంద్రమోడీ అంటే అభిమానం మరొకటి ఉండవచ్చు, ప్రాణాలు అర్పించి, సర్వంధారపోసి పోరాడిన సమరయోధులను అవమానించానని ఆమె గ్రహించలేకపోయారు.బిజెపి నేత వరుణ్ గాంధీ ఈ వ్యాఖ్యలను ఉన్మాదమనాలా లేక విద్రోహమనాలా అని స్పందించారు. తాను గనుక సమర యోధులను అవమానించినట్లు నిరూపిస్తే తన పద్మ అవార్డును తిరిగి ఇచ్చివేస్తానంటూ కంగన చిందులు వేశారు. గతంలో కత్రినా కైఫ్ వంటి విదేశీ హీరోయిన్లు ఎంతో రాణించారని కానీ 2014తరువాత స్వదేశీ నటీనటులు, కథలకు ప్రాధాన్యత ఇస్తున్నారని, విదేశీయుల నృత్యాలు ఆపాలని జనం చెప్పారని, ఇటాలియన్ ప్రభుత్వాన్ని తొలగించి ఒక చాయ్‌వాలాను ప్రధానిని చేశారని కూడా సెలవిచ్చారు.సుభాస్ చంద్రబోస్‌ను భారత ప్రధమ ప్రధాని అని చెప్పటమే కాదు, ఆయన అజాద్ హింద్ ప్రభుత్వాన్ని ఏర్పరచిన కారణంగా బోసే ప్రధమ ప్రధాని అని సమర్ధించుకున్నారు.తనను విమర్శించిన వారికి రెండు రకాల మెదడు కణాలు ఉంటాయని వారికి ఇది అర్ధం కాదని కూడా ఎదురుదాడి చేశారు.రామనాధ్ కోవింద్‌ను కోవిడ్‌గా పలకటమేగాక, ప్రధమ దళిత రాష్ట్రపతిగా వర్ణించి తరువాత నాలుక కరుచుకున్నారు. 2022లో దర్శకుడు ఆర్యన్ ముఖర్జీ, నిర్మాత కరణ్ జోహర్ సినిమా బ్రహ్మాస్త్ర విడుదల సందర్భంగా వారి మీద దాడి చేశారు. హిందూయిజాన్ని వాడుకున్నారని, సినిమా ప్రచారానికి దక్షిణాది వారిని అడుక్కున్నారని నోరుపారవేసుకున్నారు.దర్శకుడు ఆరువందల కోట్లను బూడిదపాలు చేశారన్నారు. ఆ సినిమా దారుణంగా ఉంటుందని శాపనార్ధాలు పెట్టారు. కరణ్ జోహర్ నిరంకుశుడన్నారు. ఫిలింఫేర్ పత్రిక అనుసరిస్తున్న అనైతిక, అవినీతి చర్యల కారణంగా తాను 2014 నుంచి ఆ పత్రికను బహిష్కరించినప్పటికీ తనను పదే పదే ఆహ్వానిస్తున్నారని, తన తలైవి సినిమాకు అవార్డు ఇస్తామని చెపితే తాను దిగ్భ్రాంతి చెందానన్నారు. దానికి గాను ఆ పత్రిక మీద దావా వేస్తానని బెదిరించారు. క్రిష్ సినిమా హీరో హృతిక్ రోషన్‌తో తాను ప్రేమాయణం నడుపుతున్నట్లు 2013 కంగన చేసిన ప్రకటన వాస్తవం కాదని సదరు హీరో ఖండిరచాడు.తరువాత ఇద్దరూ పత్రికలకు పలు ఇంటర్వ్యూలు ఇచ్చారు. ముంబై పోలీసులు మాఫియా గ్యాంగుల కంటే బాలీవుడ్ నటుల కోసమే ఎక్కువగా వేటాడతారని 2020లో ఆరోపించారు. ముంబై మరో పాక్ ఆక్రమిత కాశ్మీరుగా మారిందన్నారు. శివసేన నేత సంజయ్ రౌత్ తనను బహిరంగంగా బెదిరించారని ఆరోపించారు. అయితే కంగన ఒక మెంటల్ కేసు, స్వయంగా అన్నం తినే కంచంలో ఉమ్మి ఊసే రకం, అలాంటి వారిని కొన్నిపార్టీల వారు సమర్థిస్తున్నారని వ్యాఖ్యానించారు. ఆ సమయంలో ముఖ్యమంత్రిగా బిజెపిని వ్యతిరేకించే ఉద్దావ్ థాకరే సిఎంగా ఉన్నారు.
రైతులపై నోరుపారవేసుకున్న కంగన కుల గణన జరగదు అని మరొక ప్రకటన వదిలారు. వెంటనే అది మా వైఖరి కాదు అంటూ బిజెపి జనానికి సంజాయిషీ చెప్పుకోవాల్సి వచ్చింది.న్యూస్ 24 అనే టీవీతో మాట్లాడుతూ కుల గణన తప్పకుండా చేయాలా అన్న ప్రశ్నకు అవసరమే లేదు అంటూ కంగన చెప్పేశారు. కుల గణన మీద యోగి ఆదిత్యనాథ్ వైఖరే తనదని, అందరం కలసి ఉంటేనే మంచిదని, విడిపోతే నాశనం అవుతామన్నారు.‘‘ కులగణన జరపకూడదు.నటుల కులమేమిటో మనకు తెలియదు.ఎవరికీ ఏమీ తెలియదు.నా చుట్టూ ఉన్నవారు కులం గురించి పట్టించుకోరు. దాన్ని ఎందుకు ఇప్పుడు తేల్చాలి.గతంలో మనం చేయలేదు, ఇప్పుడూ అవసరం లేదు.కేవలం పేదలు, రైతులు, మహిళలు అనే మూడు కులాలు మాత్రమే ఉన్నాయి, నాలుగో కులం ఉండకూడదు’’ అన్నారు. రైతు ఉద్యమంలో పాల్గన్న ఒక సిక్కు మహిళ రోజుకు వంద రూపాయల సంపాదన కోసం పాల్గంటున్నదని ఆమే అంతకు ముందు ఢల్లీిలో జరిగిన షాహిన్ బాగ్ ఆందోళనలో ఉన్నట్లు కంగన తప్పుడు ట్వీట్ చేశారు. తన సినిమా మణికర్ణికను విమర్శిస్తూ సమీక్షించినందుకు జస్టిన్ రావు అనే జర్నలిస్టుపై విరుచుకుపడితే చివరకు సినిమా నిర్మాతలు క్షమాపణ చెప్పాల్సి వచ్చింది. నిబంధనలను అతిక్రమించి విద్వేష పూరిత ట్వీట్లు చేసినందుకు కంగనను ట్విట్టర్ శాశ్వతంగా బహిష్కరించింది. ఇలాంటి నోటి దూల వ్యక్తులను నరేంద్రమోడీ అదుపుచేయలేని స్థితిలో ఉన్నట్లు కనిపిస్తోంది.మొదటి సారి పార్టీ తప్పని చెప్పిన తరువాత ఆమె తన ప్రకటనను వెనక్కు తీసుకోలేదు. నెలకూడా గడవక ముందే మరోసారి అదే మాటలను మరో రూపంలో చెప్పటాన్ని ఎలా అర్ధం చేసుకోవాలి. హర్యానా ఎన్నికల కారణంగా పార్టీ నుంచి తీవ్ర వత్తిడి వల్లనే నామ మాత్రంగా ప్రకటనను వెనక్కు తీసుకుంటున్నట్లు చెప్పారన్నది స్పష్టం. మొత్తం మీద చూస్తే మోడీ కంటే కంగన బలవంతురాలిగా కనిపిస్తున్నారు.
