ఎం కోటేశ్వరరావు
పరీక్షల్లో మార్కులు తగ్గితే విద్యార్దుల గ్రేడ్ (నాణ్యత) తగ్గుతుంది.సమాధానాల పేరుతో పేజీల కొద్దీ రాసినా అసలు విషయాలు లేకపోతే మార్కులు పడవు. పదకొండు సంవత్సరాల పాలనలో నరేంద్రమోడీ సర్కార్ అందచేస్తున్న జిడిపి వృద్ధి అంకెల నాణ్యతను అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ(ఐఎంఎఫ్) గతంలో ప్రశ్నించింది. ఎలాంటి స్పందన మార్పులు లేకపోవటంతో కొద్ది రోజుల క్రితం సి గ్రేడ్‌కు తగ్గించింది.దీని గురించి గురువారంనాడు (2025 డిసెంబరు 4) లోక్‌సభలో సమర్ధించుకుంటూ వచ్చే ఏడాదినుంచి 2022-23 సంవత్సరాన్ని నూతన ప్రాతిపదికగా తీసుకుంటామని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. ఎన్‌సిపి సభ్యురాలు సుప్రియా సూలే అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ గణాంకవిధానం గురించి ఐఎంఎఫ్ చెప్పింది తప్ప అభివృద్ధి గురించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదని, అనేక అంకెలకు బి గ్రేడ్ ఇచ్చిందని నిర్మలమ్మ అన్నారు.మన అంకెల నాణ్యత నాలుగు గ్రేడ్లలో దిగువ నుంచి రెండవదిగా ఉంది.దీనికి అభివృద్ధి అంచనాలకు సంబంధం లేదు, వాటికి చెబుతున్న భాష్యం మీదనే పేచీ. గణింపుకు మీరు తీసుకున్న ప్రాతిపదిక, పద్దతి తప్పు, పాతబడిన సంవత్సరాన్ని ప్రాతిపదికగా తీసుకొని భాష్యాలను చెబుతున్నారంటూ 2025 ఆర్టికల్ నాలుగు నివేదికలో తలంటింది. మోడీ సర్కార్ అనుసరిస్తున్న విధానం గురించి ఇంటా బయటా గత పదేండ్ల నుంచి అనేక విమర్శలు వచ్చినప్పటికీ ఎలాంటి చలనం లేదు. ప్రస్తుతం 2011-12 సంవత్సర అంకెలను ప్రాతిపదికగా తీసుకొని గణాంకాలను రూపొందిస్తున్నారు. వచ్చే ఏడాది నుంచి 2022-23 ప్రాతిపదికగా కొత్త సూచీలను రూపొందిస్తామని కేంద్ర ప్రభుత్వ గణాంక మరియు కార్యక్రమాల అమలు శాఖ ప్రకటించింది. అయినప్పటికీ ఐఎంఎఫ్ మనదేశ సమాచార నాణ్యత గ్రేడ్‌ను తగ్గించింది. అంతర్జాతీయంగా ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి కొత్త ప్రాతిపదికన నూతన సూచీలను తయారు చేస్తారు. ఐఎంఎఫ్ చర్యతో మరోసారి కేంద్రం చెబుతున్న అభివృద్ధి అంకెల విశ్వసనీయత గురించి మీడియా, సామాన్య జనంలో చర్చలేకపోయినా ఆర్థికవేత్తలలో మొదలైంది.
మన దేశ జిడిపి గురించి ప్రభుత్వం చెప్పే అంకెలకు ఐఎంఎఫ్ అంచనాలకు తేడా ఉంది. అది విడుదల చేసిన పత్రికా ప్రకటన ప్రకారం 2024-25 ఆర్థిక సంవత్సరంలో నిజమైన జిడిపి వృద్ధి రేటు 6.5శాతం కాగా 2025-26 తొలి మూడు మాసాల్లో 7.8శాతం ఉంది. అయితే ఐఎంఎఫ్ మాత్రం 2025-26లో 6.6శాతం ఉంటుందని, మరుసటి ఏడాది 6.2శాతమని అంచనా వేసింది.మన ప్రభుత్వం అనుసరిస్తున్న గణాంక, విశ్లేషణ పద్దతులపై ఐఎంఎఫ్ చాలా సంవత్సరాల నుంచి విబేధిస్తున్నప్పటికీ సంస్థ నిబంధనల ప్రకారం సభ్యదేశాలు ఇచ్చిన అధికారిక సమాచారాన్ని ప్రాతిపదికగా తీసుకొని తన విశ్లేషణలను అందిస్తున్నది. వాటి గురించి తన భిన్నాభిప్రాయాన్ని చెప్పవచ్చు తప్ప సమాచారాన్ని తిరస్కరించేందుకు వీల్లేదు. కొద్ది సంవత్సరాలుగా వెల్లడిస్తున్న అభిప్రాయాలను జనం దృష్టికి తేలేదు. ఇప్పుడు కుండబద్దలు కొట్టినట్లు చెప్పింది.గత పదేండ్లలో పెద్ద నోట్ల రద్దు, జిఎస్‌టి, కరోనా తరువాత చెప్పే అంకెలకు, వాస్తవానికి తేడా ఉంటోందని ఐఎంఎఫ్ భావించింది. కొద్ది సంవత్సరాలుగా అంతర్గతంగా తన విబేధాలను వెల్లడిస్తూనే ఉంది, చివరికి 2025లో సమాచారం నాణ్యత గురించి గ్రేడ్‌ను తగ్గించింది. ఇప్పుడెందుకు ఆపని చేసింది. ముందే చెప్పుకున్నట్లుగా వచ్చే ఏడాది 2022-23 సంవత్సరాన్ని ప్రాతిపదికగా తీసుకొని కొత్త సిరీస్‌ను విడుదల చేయనుంది గనుక ఇప్పటి వరకు గమనించిన లోపాలను సరిదిద్దాలనే ఉద్దేశ్యంతోనే ఈ పనిచేసిందని చెబుతున్నారు.ప్రస్తుతం ప్రభుత్వం కార్పొరేట్ సంస్థలు ఇచ్చే సమాచారాన్నే ప్రాతిపదికగా తీసుకుంటున్నది తప్ప సంఘటిత, అసంఘటితరంగ సమాచారాన్ని నిర్దిష్టంగా సేకరించటం లేదనే విమర్శ ఉంది. ద్రవ్యోల్బణాన్ని లెక్కించేందుకు టోకు ధరలను ప్రామాణికంగా తీసుకుంటున్నది, దీనికి బదులు ఉత్పత్తి ధరలు, రంగాల వారీ ధరలను పరిగణనలోకి తీసుకోవాలని చెబుతున్నారు. మొత్తం మీద ఆర్థిక రంగం గురించి ఎలాంటి వ్యాఖ్య చేయలేదు కదా, నాణ్యత లేని సమాచారం ఆధారంగా తీసుకోవటాన్ని ఐఎంఎఫ్ తప్పుపట్టిందని మాత్రమే కొందరు సూత్రీకరిస్తున్నారు. రుణాలు, విదేశీమారకద్రవ్యం, ఖర్చు గురించి సరైన లెక్కలే చెబుతున్నారు కదా అంటున్నారు. ముఖం ఎలా ఉందో ఎవరికైనా తెలుస్తుంది,దాన్ని వేరేగా చెబితే వెంటనే బండారం బయటపడుతుంది. శరీరం అంతర్భాగంలో ఉన్నవాటిని ఎవరో ఒక నిపుణుడు చెబితేనే కదా మనకు తెలిసేది, ఆ చెప్పటంలోనే నిపుణుల మధ్య ఏకాభిప్రాయం, నాణ్యత లేదన్నది సమస్య. కేవలం చెయ్యి చూసి అంతాబాగానే ఉందంటే కుదురుతుందా ? నాణ్యత లేని వస్తువును కొన్నపుడు అది ఎంతకాలం మన్నుతుందో తెలియదు, నాణ్యత లేని సమాచారం ప్రాతిపదికగా ఏ రంగమైనా దీర్ఘకాలిక వ్యూహాలను ఎలా రూపొందించుకుంటుంది ?
జిడిపి వృద్ధి రేటు ఎక్కువగా ఉందని చూపుతున్నపుడు దానికి తగినట్లుగా కార్పొరేట్ ఫలితాలు కనిపించటం లేదన్నది కొందరి ప్రశ్న. వర్తమాన ఆర్థిక సంవత్సరంలో జడిపి వృద్ధి రేటు 7.4శాతం ఉంటుందని, పబ్లిక్ ఫైనాన్స్ మరియు విధాన జాతీయ సంస్థ(ఎన్‌ఐపిఎఫ్‌పి) చెప్పింది.మూడీస్ రేటింగ్ సంస్థ 2026, 2027 సంవత్సరాలలో ప్రపంచ వృద్ధి రేటు 2.5 -2.6శాతం మధ్య, భారత వృద్ధి 6.4 మరియు 6.5, చైనా 4.5శాతం ఉంటుందని పేర్కొన్నది. ఇవి చూడటానికి బాగానే ఉన్నాయి.పశ్చిమ దేశాల సూత్రం ప్రకారం జిడిపి వృద్ధి రేటు కంటే కార్పొరేట్ లాభాల రేటు మూడు, నాలుగుశాతం ఎక్కువగా ఉంటుంది.మనదేశంలో కూడా దశాబ్దాల పాటు అలాగే ఉంది. కానీ సెప్టెంబరుతో ముగిసిన మూడు మాసాల్లో నిఫ్టీ 50 సూచికలో పెరుగుదల కేవలం ఏడుశాతమే. మొత్తం లాభాలు 13శాతం కాగా పన్నులు పోను నిఖర లాభం తొమ్మిదిశాతమే ఉంది. ఇది మొత్తం ఆర్థిక వ్యవస్థను ప్రతిబింబించకపోవచ్చుగానీ దాన్ని విస్మరించలేము.నిప్టీ మైక్రోకాప్ 250 అమ్మకాల వృద్ధి 12శాతం ఉన్నా, మొత్తం లాభాలు ఆరుశాతమే ఉన్నాయి. జిడిపి వృద్ధి రేటు స్థిరంగా ఉంటే ఈ ఫలితాల సంగతేమిటి ? ఏ అంకెలు వాస్తవానికి దగ్గరగా ఉన్నట్లు ? ఆసియన్ పెయింట్స్ మేనేజింగ్ డైరెక్టర్ 2024 మేనెలలో జిడిపి అంకెలు ఎలా వస్తున్నాయో నాకు నమ్మకం లేదు అని వ్యాఖ్యానించాడు. ఆ మాటలు వైరల్ కావటంతో ఒక్క రోజులోనే తన వ్యాఖ్యలను వెనక్కు తీసుకున్నారు. ఎక్కడి నుంచి వత్తిడి వచ్చిందో అర్ధం చేసుకోవటం కష్టం కాదు.
పిండికొద్దీ రొట్టె అన్నారు.కుండలో కూడు కూడు అసలుందో లేదో ఉంటే ఎంత ఉందో,పిల్లాడు తిన్నాడో లేదో తెలియదు గానీ దుడ్డులా ఉన్నాడు అని చెబుతున్నట్లుగా అభివృద్ధి గొప్పగా ఉందని భాష్యం చెబుతున్నారు. జిడిపికి దోహదం చేసేవాటిలో వినియోగవృద్ధి ఒకటి.దేశంలో నిజవేతనాలు పడిపోవటం లేదా గిడసబారి పోయినట్లు చెబుతుండగా గృహస్తుల వినియోగం పెరిగిందని చెప్పటం మీద అనుమానాలు ఉన్నాయి. రెండవ అంశం పెట్టుబడులు, మొత్తం పెట్టుబడుల్లో ప్రైవేటు పెట్టుబడులు నరేంద్రమోడీ అధికారానికి వచ్చినపుడు జిడిపిలో 31.3శాతం ఉంటే 2024-25లో 29.6శాతం ఉన్నాయి. మధ్యలో ఒక ఏడాది మాత్రమే 31.2శాతం నమోదయ్యాయి. మిగిలిన అన్ని సంవత్సరాలలో అంతకంటే తక్కువే.ఈ కాలంలో కార్పొరేట్ పన్ను మొత్తం ప్రైవేటు రంగానికి ఇచ్చిన ప్రోత్సాహాన్ని చూస్తే కార్పొరేట్ పన్ను విధింపు 30శాతం నుంచి 15కు తగ్గించారు. అయినా పారిశ్రామికరంగం వాటా జిడిపిలో 2014తో పోల్చితే తగ్గింది లేదా స్థిరంగా ఉంది తప్ప పెరగలేదు. చైనాలో సాధారణ కార్పొరేట్ రేటు 25శాతం కాగా మన దేశంలో కొత్త సంస్థలకు 15శాతంగా రాయితీ ఇచ్చినప్పటికీ చైనా నుంచి కంపెనీలు ఆశించిన స్థాయిలో రాలేదు. మేకిన్ ఇండియా విధానంతో 2022 నాటికి జిడిపిలో పారిశ్రామిక రంగం వాటా 25శాతం లక్ష్యంగా చెప్పారు.తరువాత దాన్ని 2025కు పొడిగించామన్నారు. వాస్తవ పరిస్థితి ఏమిటి 2006లో 17.3శాతం ఉండగా మోడీ అధికారానికి వచ్చినపుడు 2014లో 15.07 నమోదైంది తరువాత నేటి వరకు చూస్తే 13శాతానికి పడిపోయింది. దున్నబోతే దూడల్లో మెయ్యబోతే ఎద్దుల్లో అన్నట్లుగా పదవ స్థానంలో ఉన్న జిడిపిని ఐదుకు తెచ్చామంటారు, మరి దీని సంగతేమిటి ? జిడిపిని 2022 నాటికి ఐదు లక్షల కోట్ల డాలర్లకు పెంచుతామన్నారు, పారిశ్రామిక ఉత్పాదకత పెరగకుండా అదెలా సాధ్యం ? ప్రైవేటు పెట్టుబడులు తగ్గిపోయాయి, ప్రభుత్వ పెట్టుబడులు పెట్టటం లేదు. ఆర్థిక మాంద్యం వచ్చినపుడు అమెరికాలో భారీ మొత్తంలో రోడ్లు, వంతెనలు, రైల్వే వంటి మౌలిక సదుపాయాల మీద అక్కడి ప్రభుత్వం ఖర్చు చేసి కొనుగోలు శక్తి పెంచేందుకు చూసింది. అక్కడి మాదిరి మాంద్యాలు లేకపోయినా మందగమనం కారణంగా మనదేశంలో కూడా జరుగుతున్నది అదే. ప్రైవేటు రంగంలో తనకు లాభం ఉంటుందా లేదా అని ఆచితూచి పెట్టుబడులు పెడుతోంది.వాజ్‌పారు నుంచి మధ్యలో మన్మోహన్ సింగ్, ఇప్పుడు నరేంద్రమోడీ వరకు భారీమొత్తాలను కేటాయించి జాతీయ రహదారులనిర్మాణం, రైల్వే విస్తరణ, సరిహద్దుల్లో రోడ్లు, వంతెనల వంటివి నిర్మిస్తున్నారు.అవి లేకపోతే పరిస్థితి మరింత దిగజారి ఉండేది, బిజెపి నేతలు రోడ్లను చూపి చూశారా మా ప్రతిభ అంటున్నారు. అదే సామర్ధ్యాన్ని ఉత్పాదకరంగంలో ఎందుకు చూపలేకపోతున్నారు ? మోటారు వాహనాలు, ఎలక్ట్రానిక్స్ వంటి వాటి ఉత్పాదకతను పెంచకపోయినా పడిపోకుండా చూసేందుకు ఇటీవల తగ్గించిన జిఎస్‌టి కూడా ఆయా రంగాలకు ఉద్దీపనలో భాగమే.చిత్రం ఏమిటంటే జిఎస్‌టి తగ్గించిన రెండు నెలల తరువాత నవంబరు మాసంలో పన్ను వసూలు పెరగకపోగా వర్తమాన ఆర్థిక సంవత్సరంలో అతి తక్కువగా నమోదైంది. అందుకే నరేంద్రమోడీ, చంద్రబాబు నాయుడు వంటి భజనబృందాలు ఇప్పుడు మూగపోయాయి.
జిఎస్‌టి తగ్గింపు గురించి గతేడాదే సంప్రదింపులు మొదలయ్యాయి. తగ్గింపుతో డిమాండ్ పెరిగి ప్రైవేటు రంగానికి పెద్ద ఊపువస్తుందన్న అంచనాతో 2025-26 బడ్జెట్‌లో ప్రభుత్వ పెట్టుబడులను తగ్గించేందుకు పూనుకుంది. వాటిలో గ్రామీణ ఉపాధిపథకానికి నిధుల కోత ఒకటి.2023-24లో రు.89,154 కోట్లు ఖర్చు చేస్తే 2025-26లో రు.86వేల కోట్లకు కుదించారు.2025 జనవరిలో చూస్తే ఏడు రాష్ట్రాలలో ప్రకటించిన వేతన సగటు రు.294 కాగా చెల్లించిన మొత్తం రు.257 మాత్రమే. తెలంగాణాలో రు.319కిగాను రు.276, ఆంధ్రప్రదేశ్‌లో రు.300కు గాను రు.258 చెల్లించారు. జిడిపిలో ప్రభుత్వ ఖర్చు వాటాను 15.6 నుంచి 15శాతానికి తగ్గించారు. వాస్తవంలో ఇంకా దిగజారుతుందేమో తెలియదు. మొత్తంగా దేశమంతటా శ్రామికుల నిజవేతనాలు పెరగకుండా వస్తు, సేవలకు గిరాకీ పెరగదు. ఉద్యోగులకు వేతన సవరణ చేసినంత మాత్రాన మొత్తం గిరాకీ మీద దాని ప్రభావం పెద్దగా ఉండదు. ఉదాహరణకు రెండు తెలుగు రాష్ట్రాలలో చూస్తే కోట్లాది మంది రాబడిని పెంచే అసంఘటిత రంగ కార్మికుల వేతనాలను ఉమ్మడి రాష్ట్రంలో మాత్రమే పెంచారు. ఐదేండ్లకు ఒకసారి సవరిస్తే ఈ పాటికి మూడుసార్లు పెరిగేవి.ప్రభుత్వాల ఖర్చు అంటే ఏదో ఒక రూపంలో జనాలకు చేరే మొత్తాలతో పాటు పారిశ్రామిక, వాణిజ్య సంస్థలకూ లబ్ది చేకూరుతుంది. ప్రైవేటు పెట్టుబడులలు అలాంటివి కాదు, వాటి లాభాలే ప్రాతిపదికగా ఉంటాయి. అందువలన ప్రభుత్వ వైఖరిలో వచ్చిన మార్పు రానున్న రోజుల్లో ఏ పరిణామాలు, పర్యవసానాలకు దారి తీస్తుందో చూడాల్సి ఉంది.అధికారంలో ఎవరున్నా చేసింది అంకెల గారడీ గనుకనే సామాన్యుల స్థితిలో పెద్దగా మార్పులేదు, వచ్చే ఏడాది నూతన సీరీస్ అంటున్నారు గనుక మరో జిమ్మిక్కు చేయనున్నారా !
