ఎడియూరప్పా మజాకా ! కుటుంబవారసత్వంపై నరేంద్ర మోడీ నోటికే తాళం వేసిన ఘటికుడు !!

Tags

, , , , , , ,


ఎం కోటేశ్వరరావు


దేశంలో ఎక్కడైనా ప్రధాని నరేంద్రమోడీ హవా నడుస్తుందేమో గానీ కన్నడ సీమలో చెల్లదని అధికార రాజకీయాల్లో తలపండిన కర్ణాటక మాజీ సిఎం బిఎస్‌ ఎడియూరప్ప తనకు తిరుగులేదని నిరూపించుకున్నారు. ఎదుటి వారికి చెప్పేటందుకే నీతులు తప్ప మాకుటుంబానికి వర్తించవు, రాష్ట్ర బిజెపి అధ్యక్షుడిగా తన కుమారుడి నియామకంలో నరేంద్రమోడీయే అంతిమ నిర్ణయం తీసుకున్నారని కుండబద్దలు కొట్టారు. బిజెపి విలువల వలువలను నడిబజారులో విప్పేశారు. వారసత్వ రాజకీయం అని ఎవరైనా అంటే అనుకోనివ్వండి లెక్క చేయను అన్నారు. కుటుంబ,వారసత్వ రాజకీయాలు, ఒకే కుటుంబానికి పలు పదవులకు వ్యతిరేకం అని సుభాషితాలు చెప్పిన ప్రధాని నరేంద్రమోడీ తన మాటలను తానే దిగమింగాల్సిన దుస్థితి ఏర్పడింది. ఎడియూరప్పవేసిన తాళంతో బహుశా ఇంక ఎక్కడా వారసత్వ రాజకీయాల గురించి ఇతర పార్టీల మీద ఎక్కక పోవచ్చు. ఎడియూరప్ప కుమారుడు, తొలిసారి ఎంఎల్‌ఏగా గెలిచిన బివై విజయేంద్రను కర్ణాటక పార్టీ అధ్యక్షుడిగా బిజెపి అధిష్టానం నియమించింది.ఎడియూరప్ప పార్టీ పార్లమెంటరీ బోర్డు పదవిలో ఉన్నారు. మరో కుమారుడు రాఘవేంద్ర లోక్‌సభ ఎంపీగా ఉన్నారు. కర్ణాటక రాజకీయాల గురించి తెలిసిన వారికి ఎడియూరప్ప కుటుంబం ఒక రాజకీయ సైనిక పటాలం వంటిది. ముగ్గురు కుమార్తెలు, వారి కుటుంబాలు, ఇద్దరు కుమారులు వారి కుటుంబాలు ఎవరు చక్కపెట్టాల్సినవాటిని వారు చేస్తారు. ఇప్పటి వరకు వారి మధ్య ఎలాంటి పేచీలు రాలేదు. గతంలో ఎడియూరప్ప కాబినెట్‌ మంత్రి కెఎస్‌ ఈశ్వరప్ప పదవిలో ఉండగానే గవర్నర్‌కు ఐదు పేజీల లేఖ రాసి సిఎం కుటుంబం ఎలా జోక్యం చేసుకుంటున్నదో వివరించారు. అనేక మంది విధిలేక మౌనంగా ఉన్నారు. ఇవన్నీ అధిష్టానానికి, ప్రత్యేకించి నరేంద్రమోడికి తెలియదు అనుకుంటే అంతకంటే అమాయకత్వం మరొకటి ఉండదు. మనం చేస్తే సంసారం మరొక చేస్తే మరొకటి !


తన కుమారుడిని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ప్రకటించటం గురించి ఎడియూరప్ప నాటకాన్ని రక్తి కట్టించారు. బెంగలూరులో శనివారం నాడు విలేకర్లతో మాట్లాడుతూ మీరు నమ్మండి నమ్మకపోండి, ఈ నియామకం గురించి మేమెవరం ఊహించలేదు. ఒక్కసారి కూడా ఢిల్లీలో ఈ విషయమై ఏ నాయకుడినీ అడగలేదు. కావాలంటే మీరు ఎవరినైనా అడగండి అని ఒక విలేకరి ప్రశ్నకు చెప్పారు.” అంతిమ నిర్ణయం ప్రధాని నరేంద్రమోడీ, అమిత్‌ షా, పార్టీ అధ్యక్షుడు జెపి నడ్డా తీసుకున్నారు, నాకేమీ సంబంధం లేదు.” అన్నారు. వారు తగిన సమయంలో తగిన నిర్ణయం తీసుకున్నారు. విజయేంద్రను అధ్యక్షుడిగా నియమించినందుకు రాష్ట్రమంతటా ఉత్సవాలు జరుపుకుంటున్నారని ఎడియూరప్ప చెప్పారు. బిజెపిలో వారసత్వ రాజకీయాలకు ఈ నియామకం రుజువు అని కాంగ్రెస్‌ చేసిన వ్యాఖ్య గురించి మాట్లాడుతూ వారు అలాంటి ఆరోపణ చేయనివ్వండి పట్టించుకోను అన్నారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో 28గాను 25 చోట్ల గెలిచేందుకు తాను, విజయేంద్ర విడివిడిగా రాష్ట్రంలో పర్యటిస్తామని చెప్పారు. తన కుమారుడి నియామకం పట్ల పార్టీలో నేతలెవరూ అసంతృప్తిని వెల్లడించలేదని, అందరూ ఐక్యంగా స్వాగతించారని, ఎవరూ పార్టీని వీడకుండా తాము చూస్తామని, గతంలో వెళ్లిన వారిని కూడా వెనక్కు తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తామని ఎడియూరప్ప చెప్పారు.


కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఊహించని ఎదురుదెబ్బ తిన్న బిజెపి ఆరునెలలుగా దిక్కుతోచని స్థితిలో పడింది. ఎంతగా మైండ్‌బ్లాక్‌ (మెదడు పని చేయకపోవటం) లేదా బ్లాంక్‌ (మెదడు ఖాళీ కావటం) అయిందంటే పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిని, శాసనసభా పక్ష నేతను కూడా ఎన్నుకోలేకపోయింది. ప్రతిపక్ష నేత లేకుండానే అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. మరో ఆరు నెలల్లో జరగనున్న లోక్‌సభ ఎన్నికలలో ఎలాగైనా గెలవాలన్న ఏకైక లక్ష్యంతో బిజెపి ఉంది. కుటుంబ పార్టీ అంటూ గతంలో తెలుగుదేశాన్ని, తెలంగాణాలో బిఆర్‌ఎస్‌ను విమర్శిస్తున్న ఆ పార్టీ కర్ణాటకలో కుటుంబ పార్టీగా ఉన్న జెడిఎస్‌ను తన మిత్రపక్షంగా చేర్చుకుంది. కాంగ్రెస్‌ను కుటుంబవారసత్వ పార్టీ అని ధ్వజమెత్తుతున్న అదే పార్టీ ఎదుటివారికి చెప్పేటందుకే నీతులు అన్నట్లుగా ఎడియూరప్ప కుమారుడిని పదవికి ఎంపిక చేసింది. కర్ణాటక శాఖను ఒక కుటుంబ పార్టీగా మార్చివేసింది. ఎడియూరప్ప గాలి తీసి పక్కన పెట్టాం గనుక లింగాయత్‌ సామాజిక తరగతి దూరం కావటంతో గత అసెంబ్లీ ఎన్నికల్లో పరాభవం జరిగిందన్న వాదనను పార్టీ గుర్తించినట్లుంది. తిరిగి వారి మద్దతు పొందాలంటే మరోదారి లేదని భావించి ఆ పెద్దమనిషి కుటుంబ వారసుడినే అధ్యక్షుడిగా నియమించింది. ఎంతవారలైనా అధికార కాంతదాసులే, నరేంద్రమోడీ ఆ కోవకు చెందిన వ్యక్తే గనుక చేసేదేముంది, సరే అనక తప్పలేదు. దీంతో పార్టీలో ఇప్పుడు ఎడియూరప్ప వ్యతిరేకులు ఏం చేస్తారన్నది ఆసక్తికరం.కాళ్లబేరానికి వస్తారా ? తిరుగుబాటు చేస్తారా ? తన కుమారుడి నియామకానికి నరేంద్రమోడీ అంతిమ నిర్ణయం తీసుకున్నారని ఎడియూరప్ప చెప్పిన తరువాత దాన్ని ధిక్కరించే సాహసం బిజెపిలో ఎవరికైనా ఉందా అంటే సందేహమే. అవమానాలను దిగమింగి లోలోపల కుములుతూ పార్టీలోనే ఉండాలి లేదా వెళ్లిపోవాలి. పార్టీ పదవి పంచాయతీ తేలింది, ఓట్ల రాజకీయం గనుక వెంటనే శాసనసభా పక్ష నేతను కూడా ఎన్నుకుంటారు, లింగాయత్‌ కాని వారే అవుతారు.


కర్ణాటక రాజకీయాల్లో అధికారం కోసం ఎవరితోనైనా చేతులు కలిపే పక్కా అవకాశవాద పార్టీగా జెడిఎస్‌ పేరు తెచ్చుకుంది.గతంలో దాని మద్దతుదారులుగా ఉన్న అనేక మంది కాంగ్రెస్‌వైపు మొగ్గటంతో 2023 మే నెలలో జరిగిన ఎన్నికల్లో చావుదెబ్బ తిన్నది. కాంగ్రెస్‌తో చేతులు కలిపేందుకు దారులు మూసుకుపోవటంతో మరోసారి బిజెపి తలుపుతట్టింది.రాష్ట్రంలో గెలుపు ఓటములను ప్రభావితం చేసే లింగాయత్‌, ఒక్కళిగ సామాజిక తరగతులు కలిస్తే తిరుగుండదు, వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో గెలుస్తామనే బిజెపి అంచనా దీని వెనుక ఉంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో లింగాయత్‌ల ప్రభావం ఉందని చెబుతున్న 69చోట్ల బిజెపి 20, కాంగ్రెస్‌ 40 గెలుచుకుంది. ఒక్కళిగలు ప్రభావం చూపే 64 చోట్ల ఆ సామాజిక తరగతి పార్టీగా ఉన్న జెడిఎస్‌ 14స్థానాలతో సరిపెట్టుకుంది. జెడిఎస్‌ను సంతుష్టీకరించేందుకు మాండ్య లోక్‌సభ నియోజకవర్గంలో బిజెపి మద్దతుతో స్వతంత్రురాలిగా గెలిచిన సినీనటి సుమలతను అక్కడి నుంచి తప్పుకోవాలని, కావాలంటే ప్రస్తుత సభ్యుడు డివి సదానంద గౌడ ఎన్నికల్లో పోటీ చేయనని ప్రకటించారు గనుక బెంగలూరు ఉత్తరం నుంచి అవకాశం కల్పిస్తామని బిజెపి చెప్పినట్లు వార్తలు. స్వచ్చందంగా లేదా ఇతర కారణాలతో పోటీకి దూరంగా ఉన్నామని ప్రకటనలు చేయించటం ప్రారంభమైంది. వచ్చే ఎన్నికల్లో మరో ఎనిమిది నుంచి పదమూడు మంది ఎంపీలను కూడా ఇంటికి పంపాలని నిర్ణయించినట్లు లీకులు వదిలారు.ఇలా చేస్తే బిజెపి గెలుస్తుందా అంటే చెప్పలేము. అసెంబ్లీ ఎన్నికల్లో 75 మంది కొత్తవారికి సీట్లిస్తే 14 మందే గెలిచారు. ఇరవై నాలుగు మంది ఎంఎల్‌ఏలను పక్కన పెడితే పది స్థానాల్లో మాత్రమే పార్టీ గెలిచింది.


పార్టీ శాసనసభా పక్ష నేతను ఎన్నుకోకపోతే బెలగావిలో జరిగే శీతాకాల అసెంబ్లీ సమావేశాలను బహిష్కరిస్తామని బిజెపి ఎంఎల్‌ఏలు కేంద్ర నాయకత్వానికి ఈనెల మొదటి వారంలో అల్టిమేటం జారీ చేశారు. ఏ పార్టీకైనా ఇంతకంటే అవమానం మరొకటి ఉండదు.అధికారపక్షం కాంగ్రెస్‌ చేసే విమర్శలతో మొహాలు ఎక్కడ పెట్టుకోవాలో అర్ధం కావటం లేదని వాపోయారు. ఆరునెలలకు పైగా శాసనసభా పక్ష నేతను ఎన్నుకోలేని స్థితి గతంలో ఎన్నడూ లేదని కాంగ్రెస్‌ నేత గుండూరావు అన్నారు. మే పదవ తేదీన జరిగిన ఎన్నికలలో కాంగ్రెస్‌కు 135, బిజెపికి 66, జెడిఎస్‌కు 19 సీట్లు వచ్చాయి.వచ్చే శుక్రవారం నాడు శాసనసభా పక్ష నేతను నియమిస్తామని బివై విజయేంద్ర విలేకర్లతో చెప్పారు. జెడిఎస్‌తో కూటమి గురించి కేంద్ర నాయకత్వం రాష్ట్ర నేతలతో సంప్రదించలేదని సదానంద గౌడ బహిరంగంగా చెప్పారు. ఆ తరువాత గౌడను ఢిల్లీ రావాల్సిందిగా ఆదేశించారు. ఆ తరువాతే వచ్చే లోక్‌సభ ఎన్నికలలో తాను పోటీ చేయటం లేదని ప్రకటించటం గమనార్హం. రాష్ట్రంలో కరవు పరిస్థితి గురించి అధ్యయన కమిటి హసన్‌ పట్టణానికి వచ్చింది. ఆ సందర్భంగా హడావుడిగా ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో గౌడ అసందర్భంగా పోటీలో ఉండనని ప్రకటించారు. అంతకు ముందు అక్టోబరు ఏడవ తేదీన విలేకర్లతో మాట్లాడుతూ శాసనసభా పక్ష నేతను ఎన్నుకోలేకపోవటం పార్టీలో సంకటస్థితిని సృష్టించిందని,జెడిఎస్‌తో పొత్తు పట్ల తాను సంతోషంగా లేనని, రాష్ట్రనేతలతో నిమిత్తం లేకుండా చేశారని, తాము దీని గురించి కనీసంగా చర్చించలేదన్నారు. పార్టీ జాతీయ ప్రయోజనాలను గమనంలో ఉంచుకొని, కాంగ్రెస్‌ను వ్యతిరేకించేందుకు చేసి ఉండవచ్చు అన్నారు. ఆ తరువాత అక్టోబరు 25వ తేదీన ఢిల్లీ వచ్చి అలా ఎందుకు మాట్లాడారో సంజాయిషీ ఇవ్వాలని అధిష్టానం కోరింది. బిజెపిలో జరిగిన పరిణామాల గురించి మాజీ సిఎం, అసెంబ్లీ ఎన్నికలకు ముందు బిజెపి నుంచి కాంగ్రెస్‌లో చేరిన లింగాయత్‌ నేత జగదీష్‌ షెట్టార్‌ మాట్లాడుతూ పర్యవసానాలను త్వరలోనే చూస్తారు అంటూ వ్యాఖ్యానించారు. ఆరునెలల పాటు పార్టీ, శాసనసభా పక్ష నేతలను ఎంపిక చేయలేకపోవటంతో ఎప్పుడు చేస్తారని బిజెపి కార్యకర్తలందరూ ప్రశ్నించారు, ఎట్టకేలకు నేతను ఎంపిక చేశారు, ఆగండి పర్యవసానాలను త్వరలోనే చూస్తారు అని షెట్టార్‌ అన్నారు.

ఆకలో రామచంద్రా తప్ప అచ్చేదిన్‌ జాడలేదు – మరో ఐదేండ్లు ఉచిత బియ్యం పధక అర్ధమిదేనా ?

Tags

, , , , ,


ఎం కోటేశ్వరరావు


ఉచిత ఆహార ధాన్యాల పంపిణీ పధకాన్ని మరో ఐదు సంవత్సరాలు పొడిగిస్తున్నట్లు ప్రధాని నరేంద్రమోడీ చత్తీస్‌ఘర్‌ ఎన్నికల సభలో ప్రకటించారు. గతేడాది జరిగిన రాష్ట్రాల ఎన్నికలపుడు ప్రకటించి ఏడాది పొడిగింపు డిసెంబరు వరకు ఉంది. కానీ మోడీ కోయిల ముందే కూసింది అంటే ఇప్పుడు జరుగుతున్న ఐదు రాష్ట్రాల ఎన్నికల గానమే ! వచ్చే ఏడాది జరగనున్న లోక్‌సభ ఎన్నికలు కూడా ఎంతో దూరం లేనందున అప్పుడు కూడా దీని గురించి ఊదరగొడతారని వేరే చెప్పనవసరం లేదు. ఈ పధకం ఖజానా మీద మరింత భారం మోపుతుందని కొందరు అంటున్నారు. కొత్తగా పడేదేమీ లేదన్నది మరొక వాదన.ఏది ఏమైనా పేదలకు మేలు చేస్తుంది. ఉచిత పధకాల వలన రాష్ట్రాలు దివాలా తీస్తాయని నరేంద్రమోడీ కర్ణాటక ఎన్నికల సందర్భంగా చెప్పారు. ఉచిత ఆహార భారాన్ని భరిస్తున్న కేంద్ర ప్రభుత్వం ఇబ్బందుల్లో పడదా ? చెప్పే మాటలకు చేతలకు పొంతన లేదంటే ఎక్కడో తేడా కొడుతోందని మోడీ గ్రహించారనుకోవాలి. పౌరులు గౌరవ ప్రదమైన, ఆరోగ్యకర జీవనం గడపాలంటే తగినంత ఆహారం, పోషకాలు అవసరం. వాటిని హక్కుగా పరిగణిస్తూ 2013 జాతీయ ఆహార భద్రతా చట్టాన్ని పార్లమెంటు ఆమోదించింది. 2011 జనాభా లెక్కల ఆధారంగా గ్రామాలలో 75శాతం, పట్టణాలలో 50శాతం మంది అర్హులని పేర్కొన్నారు. కొత్తగా నరేంద్రమోడీ సర్కార్‌ దేశంలో ఎక్కడైనా రేషన్‌ పొందేందుకు వీలుగా కార్డులు జారీ చేస్తామని ప్రకటించింది. బహుశా దేశ భద్రతకు సంబంధించిన రహస్యంగా భావించి లేదా పరువు పోతుందని సిగ్గుపడిగానీ ఉచిత పధకాన్ని పొడిగించటానికి కారణం ఏమిటో ప్రధాని చెప్పలేదు అనుకోవాలి. ఒకవైపు ఆహార భద్రతకు తూట్లు పొడిచేందుకు మోడీ మంత్రాంగంలో భాగమైన నీతి ఆయోగ్‌ చూస్తుంటే మరోవైపు ఓట్లకోసం పడుతున్న పాట్లు ! అల్లుడికి బుద్ది చెప్పిన మామ అదే తప్పు చేసినట్లు !


మోడీ కేంద్రంలో అధికారానికి వచ్చినపుడు ఆకలి సూచికలో దేశం 120కిగాను 99వ స్థానంలో ఉంది.అది 2022లో 121దేశాల్లో 107కు, 2023లో 125దేశాల్లో 111కు దిగజారింది. ఈ సూచికలను గత పదేండ్లలో ఏనాడూ కేంద్ర ప్రభుత్వం, బిజెపి అంగీకరించలేదు, తప్పుల తడక అని చెప్పటం తప్ప ఆకలి గురించి మాట్లాడదు. ఉచిత ఆహార ధాన్యాల పంపిణీ పధకాన్ని మరో ఐదేండ్లు పొడిగించటం అంటే పదేండ్ల నాడు చెప్పిన అచ్చేదిన్‌ (మంచి రోజులు) రాలేదని, జనం చచ్చే ఆకలితో ఉన్నారని, పరిస్థితి దిగజారుతున్నది వాస్తవమేనని అంగీకరించటం కాదా ! నిర్దిష్టమైన సమాచారాన్ని ప్రభుత్వం సేకరించలేదు. జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే, ఇతర అంచనాల ప్రకారం పదేండ్ల అమలు తరువాత కుర్రవాళ్లలో 40శాతం మందికి తగినంత ఆహారం లేదు. మూడోవంతు మంది దేశ జనాభా పోషకార లేమితో ఉన్నారు. మనకు రెండు భారత దేశాలు కనిపిస్తున్నాయి. తగినంత ఆహారం లేక గిడసబారి పోయిన, బానకడుపుల వారు ఒకవైపు, ఉన్న డబ్బుతో విచ్చలవిడిగా తిని పెంచుకున్న ఊబకాయాలతో కార్పొరేట్‌ ఆసుపత్రులను పోషిస్తున్న వారిని మరోవైపు చూడవచ్చు.


తగినంత ఆహారం, పోషకపదార్ధాలు అందుబాటులో లేని కారణంగా దేశంలో ఉన్న ఆడా మగా రక్తహీనతతో ఉన్నారు.ఆహార భద్రతా పధకం ఈ సమస్యను పరిష్కరించటంలో విఫలమైంది. మరోవైపున నరేంద్రమోడీ, కేంద్ర ప్రభుత్వానికి, బిజెపి పాలిత రాష్ట్రాల పాలకులకు మార్గదర్శనం చేస్తున్న ఆర్‌ఎస్‌ఎస్‌ ఏర్పాటు చేసిన సంస్థ ఆరోగ్య భారతి. దేశంలో ” ఉన్నతమైన తెలివితేటలతో అందమైన, పొడవైన ” పిల్లలను పుట్టించేందుకు గర్భవిజ్ఞాన అనుసంధాన కేంద్రం పేరుతో గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో ఒక పరిశోధనా కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. తలిదండ్రులు నల్లగా ఉన్నా, తెలివితేటలు పెద్దగా లేనివారైనప్పటికీ పురాతన భారత విజ్ఞానంతో పైన పేర్కొన్న లక్షణాలతో పిల్లలను పుట్టించేందుకు సంస్థ నిపుణులు పని చేస్తున్నట్లు ప్రచారం చేస్తున్నది. తరుణ్‌ విజరు అనే బిజెపి నేత నల్లవారితో కలసి సామరస్యపూర్వకంగా జీవిస్తున్నట్లు చేసిన ప్రకటన గురించి తెలిసిందే. ఇదే ఆరోగ్యభారతి మేథావులు ఆకలితో వచ్చే అనారోగ్య సమస్యలకు పరిష్కారాన్ని ఎందుకు చూపలేకపోతున్నారు. ప్రాచీన విజ్ఞానం, వేదాల్లో ఉన్నాయంటున్న పరిష్కార మార్గాలను వెలికి తీసి పైసా ఖర్చు లేకుండా లోపాలను సరి చేయవచ్చు కదా !


కరోనా కాలం నుంచి 80 కోట్ల మందికి ఉచితంగా ఆహారధాన్యాలు ఇస్తున్నట్లు, రెండు లక్షల కోట్ల రూపాయలను అందుకు ఖర్చు చేస్తున్నట్లు బిజెపి పెద్దలు విజయగాధలను గానం చేస్తుంటారు. వారి జేబుల్లోంచి తీసి ఖర్చు చేయటం లేదు. దేశంలో ఆకలి ఇవాళ కొత్తగా ప్రారంభం కాలేదు.యుపిఏ పాలనకు ముందు అధికారంలో ఉన్న బిజెపి వాజ్‌పాయి సర్కార్‌ ఆహార భద్రతా పధకం గురించి ఎలాంటి ఆలోచనా చేయలేదు. సిఎంగా ఉన్న నరేంద్రమోడీ ఎన్నడూ అలాంటి ప్రతిపాదన కూడా చేసినట్లు తెలియదు. ఇక 80 కోట్ల సంఖ్య ఎలా వచ్చిందంటే గ్రామాల్లో 75శాతం, పట్టణాల్లో 50శాతం లెక్కన 67శాతం మందికి ఆహార భద్రత కల్పించాలని 2013 చట్ట చెప్పింది. అప్పటికి ఉన్న జనాభా 122 కోట్లు వారిలో 67శాతం అంటే 81.74 కోట్లు. ఇప్పుడు 142 కోట్లకు చేరింది, అంటే ఇవ్వాల్సింది 95.14 కోట్ల మందికి. పదిహేను కోట్ల మందికి మొండిచేయి చూపుతున్నారు. మరోవైపు ఆరోగ్య సూచికలేవీ మెరుగుపడిన దాఖలా లేదు. అందువలన ఆహార భద్రత, పోషకాహార పధకాలను సవరిస్తే తప్ప దీనివలన ఎలాంటి ప్రయోజనం లేదని అనేక మంది చెబుతున్నారు. అది వాస్తవం కాదని చెప్పేందుకు ప్రభుత్వం ఎలాంటి సర్వేలను నిర్వహించలేదు.దేశంలో ఆహార సబ్సిడీ కేటాయింపులు తగ్గుతున్నాయి. 2020-21లో కేంద్ర ప్రభుత్వం రు.5.41లక్షల కోట్లు ఖర్చు చేసింది.(2016 నుంచి ఎఫ్‌సిఐ తీసుకున్న అప్పులను ఒక్కసారే కేంద్ర ప్రభుత్వం తీర్చిన కారణంగా ఒక ఏడాదిలో ఇంతగా పెరిగింది) 2021-22లో వాస్తవ ఖర్చు రు.3,06,571 కోట్లు, 2022-23లో సవరించిన అంచనా రు.2,96,523, 2023-24లో ప్రతిపాదించిన మొత్తం రు.2,05,765 కోట్లు. యుపిఏ చివరి సంవత్సరం నుంచి నరేంద్రమోడీ తొలి ఆరు సంవత్సరాలలో ఆహార సబ్సిడీ మొత్తం లక్ష కోట్లకు అటూ ఇటూగా ఉంది. కరోనా లేకున్నా ఇప్పుడు కొనసాగిస్తున్న ఆహార ధాన్యాల ఉచిత పధకం గురించి అంతకు ముందు మోడీకి ఎందుకు తట్టలేదు. తన ఏలుబడిలో పరిస్థితి ఆకస్మికంగా దిగజారిందా ? గతంలో ఏ ప్రభుత్వం చేయలేనంతగా దేశ జిడిపిని పెంచినట్లు ప్రచారం చేసుకుంటున్నారు. కాసేపు అంగీకరిద్దాం, దానికి అనుగుణంగా ఆహార సబ్సిడీ పెంచకపోగా తగ్గించారు.


2014-15లో ఆహార సబ్సిడీ కేటాయింపు జిడిపిలో 0.9శాతం, తరువాత 2019-20 నాటికి 0.5శాతానికి కోత పెట్టారు. కరోనా కాలంలో పాత బకాయిల చెల్లింపుతో 2.7శాతానికి పెరిగింది, క్రమంగా దిగజార్చుతూ 2023-24లో దాన్ని 0.7శాతానికి తగ్గించారు. ఇదేదో ఏదో అలా జరిగిపోయిందని చెప్పినట్లుగా సంభవించింది కాదు.పౌర పంపిణీ వ్యవస్థ(పిడిఎస్‌)ను ప్రైవేటీకరించాలని, ఉచిత ఆహార లబ్దిదారులను, సబ్సిడీలు తగ్గించాలని కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన నీతి ఆయోగ్‌ చేసిన సూచనలు తెలిసిందే. ప్రపంచబాంకు, ఐఎంఎఫ్‌ వేసిన బాటలో నడుస్తున్న రాజు కనుసన్నలలోనే సిబ్బంది పని చేస్తారు.ఆహార భద్రత పధకం కింద లబ్దిదారులను స్థంభింప చేశారని, అదనంగా అవసరమైన వారికి ఇవ్వటం లేదంటూ దాఖలైన పిటీషన్‌ మీద లబ్దిదారులను పెంచాలని సుప్రీం కోర్టు 2021 జూన్‌ 29న చేసిన సూచనను కేంద్ర ప్రభుత్వం పట్టించుకోలేదు.( ఎనభై కోట్ల సంఖ్య 2011 జనాభాప్రాతిపదిక అని ముందే చెప్పుకున్నాం.) దాంతో అదే ఏడాది సెప్టెంబరులో పిటీషనర్ల తరఫు లాయర్‌ ప్రశాంత భూషణ్‌ సంబంధిత కేంద్ర మంత్రికి నోటీసు పంపారు. అయినా చలనం లేకపోవటంతో 2022జనవరిలో కోర్టు సూచనలను అమలు జరపాలంటూ మరోపిటీషన్‌ దాఖలు చేశారు.దాంతో విధిలేక కొత్త జనాభా లెక్కలను సేకరించిన తరువాతనే విస్తరణ సాధ్యమని, సమీప భవిష్యత్‌లో విస్తరించే పధకాలేవీ లేవని కూడా ప్రభుత్వం కోర్టుకు తెలిపింది. ఏదో ఒక మార్గాన్ని చూడాలని కోర్టు కేంద్రానికి చెప్పింది. అయినా ఇంతవరకు చేసిందేమీ లేదు.


జనాభా లెక్కల సేకరణ ఎప్పుడు జరుగుతుందో తెలియని స్థితి. అప్పటి వరకు కోట్లాది మంది ఆకలితో మాడాలన్నమాట. కేంద్రం తన వాదనకు మద్దతుగా సమర్పించిన అఫిడవిట్‌లో కొన్ని నీతి ఆయోగ్‌ అభిప్రాయాలను పొందుపరచింది. మూడింట రెండువంతుల మందికి ఉచిత ఆహార ధాన్యాలు అందచేతకు ఉన్న అవకాశాలు, అవసరమా అన్న అంశాలను పరిశీలించాలని ఆ సంస్థ పేర్కొన్నది. అంతేకాదు ఆహార ధాన్యాల సేకరణ, పధకాల పంపిణీకి ప్రభుత్వ వ్యవస్థలను ఉపయోగించుకొనే విధంగా ప్రైవేటు,కార్పొరేట్‌ సంస్థలకు బాధ్యతలను అప్పగించాలని కూడా సూచించింది. అంతకంటే దారుణం ఏమంటే సుప్రీం కోర్టు సూచించింది తప్ప ఆదేశాలు జారీ చేయలేదని, ఆహార భద్రత పధకం వర్తింప చేసేందుకు జనాభా అంచనాలను పరిగణనలోకి తీసుకోవాలని గతంలో చేసిన చట్టంలో లేదని అందువలన కోర్టు మార్గదర్శనం చట్టంలోని సెక్షన్‌ 9కి విరుద్దమని కూడా నీతి ఆయోగ్‌ 2022 ఆగస్టు 31న జరిపిన సమీక్షా సమావేశంలో ఒక వాదనను కేంద్రానికి అందించింది. అయితే ఈ అంశాలను ప్రభుత్వం కోర్టు ముందు సమర్పించలేదు. నిబంధనల సాకుతో అర్హులైన వారికి ఆహార హక్కు లేకుండా మాడ్చి చంపాలని చట్టం చెప్పిందా ? ఆ తరువాత అంటే అదే ఏడాది సెప్టెంబరులో నీతి ఆయోగ్‌ మేథావులు కొత్త వాదనను ముందుకు తెచ్చారు. ఆహార భద్రత పధక చట్టం అమలు జరిపిన ఎనిమిదేళ్ల కాలంలో జనాభా తలసరి ఆదాయం 33.4శాతం పెరిగిందని, అందువలన జనమంతా 2013-14లో ఉన్న మాదిరి ఉండరు గనుక పెరిగిన తలసరి ఆదాయాన్ని పరిగణనలోకి తీసుకోవాలని నీతి ఆయోగ్‌ పెద్దలు వాదించారు. ఇది అసంబద్దమైన వాదన. అంబానీ, అదానీల సంపదను, అడుక్కొనేవారి ఆదాయాన్ని సరాసరి కట్టే లెక్కలవి.


ఆహార సబ్సిడీ అనేది అటు రైతాంగానికి ఇటు వినియోగదారులకు ఇచ్చేది. ఎఫ్‌సిఐ లేదా రాష్ట్ర ప్రభుత్వ సంస్థలు పంటలను మద్దతు ధరలకు కొనుగోలు చేసి ప్రభుత్వ విధానాల మేరకు వినియోగదారులకు అందచేస్తాయి. వాటిలో ధరకు విక్రయించేవి, ఉచితంగా అందచేసేవీ ఉంటాయి. ఈ లావాదేవీల్లో వచ్చే తేడా మొత్తాన్ని కేంద్ర ప్రభుత్వం భరిస్తున్నది.గతంలో ఆయా రాష్ట్రాలలో ఉన్న దారిద్య్రాన్ని బట్టి ఏ రాష్ట్రానికి ఎంత ఆహారం కేటాయించేదీ నిర్ణయించేవారు. 2017-18 నుంచి దారిద్య్ర సర్వే, కొత్త కార్డులు ఇవ్వటం నిలిపివేశారు. రాష్ట్రాలు జారీ చేస్తే అందుకయ్యే ఖర్చును అవే భరించాల్సి ఉంటుంది. ఉచితంగా ఇస్తున్నారు కాబట్టి ఎవరు ఎక్కడైనా రేషన్‌ తీసుకోవచ్చని ఒకే కార్డు పద్దతిని ముందుకు తెచ్చారు. మన దేశంలో దారిద్య్రరేఖ నిర్వచనంలో అనేక లోపాలు ఉన్నాయి. ఒక నిర్దిష్టత లేనికారణంగా ఎవరికి తోచిన అంచనాను ఆయా కమిటీలు ఇచ్చాయి. ప్రపంచ బాంకు అంతర్జాతీయ దారిద్య్ర రేఖను రూపొందించింది. దాని ప్రకారం 2011లో రోజుకు 1.90 డాలర్ల కంటే తక్కువ ఆదాయం వచ్చే వారు దారిద్య్ర రేఖకు దిగువన(దుర్భరదారిద్య్రంలో) ఉన్నట్లు. దాన్ని 2017 ధరల ప్రకారం 2022 సెప్టెంబరులో 2.15 డాలర్లకు పెంచింది. ప్రస్తుతం డాలరుకు 83 రూపాయలు ఉంది కనుక నెలకు రు.5.353 కంటే తక్కువ ఆదాయం వచ్చిన వారు దుర్భరదారిద్య్రంలో ఉన్నట్లు. కానీ మన ప్రభుత్వం పట్టణాల్లో నెలకు రు.1,260, గ్రామాల్లో రు.1,059గా గీత గీసింది.ఎందుకంటే ఏ దేశానికి ఆ దేశం తన రేఖను నిర్ణయించుకోవచ్చు.వాటిని చూపి దారిద్య్రాన్ని తగ్గించినట్లు చెప్పుకోవచ్చు. ప్రపంచ బాంకు తాజాగా రూపొందించిన మూడు ప్రమాణాల ప్రకారం డాలర్లలో రాబడితో వివిధ దేశాలలో దారిద్య్రం ఎలా ఉందో, ఉంటుందో పేర్కొన్నది.దాని ప్రకారం భారత్‌, చైనాల పరిస్థితి దిగువ విధంగా ఉంది. రాబడి గీతను బట్టిి ఎంత మంది దారిద్య్రంలో ఉన్నారో ఈ పట్టిక సూచిస్తుంది. ఉదాహరణకు రోజుకు 2.15 డాలర్లకంటే తక్కువ ఆదాయం వచ్చే వారు ఆఫ్రికాలోని కాంగో డెమోక్రటిక్‌ రిపబ్లిక్‌లో 69.9శాతం ఉన్నారు, అంటే వారంతా దుర్భరదారిద్య్రంలో ఉన్నట్లు లెక్క.
దేశం ×× 2.15 ×× 3.65 ×× 6.85
భారత్‌ ×× 11.9 ×× 46.5 ×× 83
చైనా ×× 0.10 ×× 2.00 ×× 24.7
పై అంకెల అర్ధం ఏమంటే చైనా గనుక దారిద్య్ర రేఖను రోజుకు 6.85 డాలర్లుగా నిర్ణయిస్తే అక్కడ 24.7శాతం మంది, అదే మనదేశంలో అయితే 83శాతం మంది దారిద్య్రంలో ఉన్నట్లు భావించాలి. 2.15 డాలర్లంటే చైనాలో దారిద్య్రం లేనట్లే. అందువలన మన పాలకులు దారిద్య్ర రేఖను ఎంతగా నిర్ణయిస్తారో, ఏ దేశంతో పోల్చుకుంటారో చూడాలి. దున్నబోతే దూడల్లో మెయ్యబోతే ఎద్దుల్లో అన్నట్లుకాకుండా చైనాను త్వరలో అధిగమిస్తామని చెబుతున్నారు గనుక దానితో పోల్చుతారా ?


ప్రపంచ ఆకలి సూచికను తయారు చేస్తున్న వారు పిల్లల్లో గిడసబారుతనం,ఎత్తుకు తగిన బరువు లేకపోవటం, బరువు తక్కువగా పుట్టటం, పసి ప్రాయ మరణాలు, తగినన్ని కాలరీల శక్తిని తీసుకోకపోవటాన్ని పరిగణనలోకి తీసుకుంటారు. పిల్లల్లో ఈ లోపాలు ఉన్నాయంటే తలిదండ్రులకు తగిన రాబడి లేకపోవటం తప్ప వేరు కాదు.2019 నుంచి 2021 మధ్య జరిపిన ఐదవ జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వేలో వెల్లడైన వివరాల ప్రకారం ఐదేండ్ల లోపు పిల్లల్లో 35.5శాతం మంది గిడసబారిన వారు, 19.3శాతం ఎత్తుకు తగిన బరువు లేమి, 32.1శాతం మంది ఉండాల్సినదాని కంటే తక్కువ బరువుతో ఉన్నట్లు తేలింది. అచ్చేదిన్‌ అని చెప్పి అధికారానికి వచ్చిన వారి ఏలుబడిలో గురజాడ చెప్పినట్లు భావిభారత పౌరులు ఈసురోమంటున్నారు. పోషణ అభియాన్‌ పేరుతో బడుల్లో మధ్యాహ్న భోజన పధకం అమలు చేస్తున్నారు. దాని లక్ష్యం ఏమిటి అంటే ఆరు సంవత్సరాల లోపు ఉన్న పిల్లల్లో 38.4శాతంగా ఉన్న గిడసబారుతనాన్ని 2016 నుంచి 2022 నాటికి ఏటా రెండుశాతం చొప్పున 25శాతానికి తగ్గింపు, పూర్తిగా పోగొట్టాలంటేే మరో పదమూడు సంవత్సరాలు పడుతుంది. ఇదే విధంగా పోషకాహార లేమి, తక్కువ బరువుతో పుట్టే పిల్లల తగ్గింపు కూడా ఏటా రెండు శాతం అని, రక్తహీనతను మూడుశాతం చొప్పున తగ్గిస్తామని పేర్కొన్నారు.రక్త హీనత అనేక అనర్దాలకు హేతువుగా ఉంది. రక్తహీనత ముక్త భారత్‌ పేరుతో కేంద్ర ప్రభుత్వం 2018లో కొన్ని పధకాలను ప్రారంభించింది. ఐదవ జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే 2019-20 ప్రకారం దేశంలో 15-49 సంవత్సరాల వయస్సు ఉన్న మహిళల్లో 50శాతం మంది, ఆరు నెలల నుంచి ఆరేండ్ల లోపు పిల్లల్లో 59శాతం మంది రక్తహీనతతో ఉన్నారు.ఏటా మూడు శాతం చొప్పున 2018 నుంచి 2022లోపు దాన్ని తగ్గిస్తామని చెప్పారు.ఇప్పుడు ఎలా ఉందో తెలియదు. సర్వేకు ఎంపిక చేసిన ప్రశ్నావళి నుంచి రక్తహీనత అంశాన్ని తొలగించారు. అంటే వాస్తవ పరిస్థితి తెలవకుండా పాతరేసేందుకు పూనుకున్నారు. ఐదులక్షల కోట్ల డాలర్ల ఆర్ధిక వ్యవస్థ గురించి కలలు కంటున్నా, ప్రపంచంలో ఐదవ స్థానానికి జిడిపిని వృద్ది చేశామని చెప్పినా ప్రయోజనం ఏమిటన్నది ప్రశ్న. జనాలకు ఒక్క బియ్యమో, గోధుమలో ఉచితంగా ఇస్తే సమగ్ర పోషకాహారం లభిస్తుందా ? మిగతా వాటి సంగతేమిటి ? వాటికి కావాల్సిన ఆదాయాన్ని పెంచేందుకు ప్రభుత్వ విధానాలేమిటి ?

గాజాలో ఇజ్రాయెల్‌ శాశ్వత తిష్ట -తెరపైకి రష్యా, ఉక్రెయిన్‌ శాంతి చర్చలు !

Tags

, , , , , ,


ఎం కోటేశ్వరరావు


హమస్‌ను అణచే సాకుతో పశ్చిమ దేశాల మద్దతు ఉన్న ఇజ్రాయెల్‌ గాజాలోని పాలస్తీనియన్ల మీద ప్రారంభించిన మారణకాండకు నెలదాటింది. అవే పశ్చిమ దేశాల అండచూసుకొని రష్యాను దెబ్బతీస్తామని బీరాలు పలికిన ఉక్రెయిన్‌ సంక్షోభం ప్రారంభమై 622 రోజులు అవుతున్నది. ఇంతకాలం గడచినా సాధించలేనిది ముందు రోజుల్లో రష్యాను వెనక్కు కొడతారంటే ఎలా నమ్మాలనే సందేహాలు మొదలయ్యాయి. మరోసారి శాంతి చర్చలను తెరమీదకు తెచ్చారు. హమస్‌ సాయుధులను అణచివేసేందుకు నిరవధికంగా గాజా రక్షణ బాధ్యత తీసుకుంటామని ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహు ప్రకటించాడు.” మేము అక్కడ లేకపోతే ఏమి జరిగిందో చూశారు. హమస్‌ తీవ్రవాదం ఇంత పెద్ద ఎత్తున ఉంటుందని మేము ఊహించలేదు. నిరవధికంగా గాజా రక్షణ బాధ్యత తీసుకోవాలని అనుకుంటున్నాము ” అన్నాడు.ఇజ్రాయెల్‌ మారణకాండలో మంగళవారం ఉదయానికి అందిన సమాచారం మేరకు గాజాలో 4,100 మంది పిల్లలతో సహా 10,022 మంది మరణించగా 25,408 మంది గాయపడ్డారు. పశ్చిమగట్టు ప్రాంతంలో మరణించిన వారు 163 కాగా 2,100 మంది గాయపడ్డారు. గాజాలో ఉన్న 35 ఆసుపత్రులలో పదహారింటిని పనికిరాకుండాచేశారు. అదే విధంగా ప్రాధమిక ఆరోగ్యకేంద్రాలు 72కు గాను 51మూత పడ్డాయి. ఇజ్రాయెల్‌ మిలిటరీ బాంబులు, క్షిపణులతో దాడులు జరుపుతూ గాజా జనాభా 23లక్షలకు గాను 16.1లక్షల మందిని నివాసాల నుంచి తరిమివేశారు. మరణించిన వారిలో 88 మంది ఐరాస సహాయ సిబ్బంది ఉన్నారంటే హమస్‌ తీవ్రవాదుల స్థావరాల మీద దాడుఉ చేస్తున్నట్లు చేస్తున్న ప్రచార బండారం ఏమిటో అర్ధం అవుతున్నది. ఇంతవరకు ఏ ఒక్క దేశంలో ఒక ఉదంతంలో ఇంత మంది మరణించిన దాఖలా లేదు. మారణకాండను నిరసిస్తూ బహరెయిన్‌, ఛాద్‌, చిలీ, కొలంబియా, హొండురాస్‌, జోర్డాన్‌, దక్షిణాఫ్రికా, టర్కీ ఇజ్రాయెల్‌లోని తమ దౌత్యవేత్తలను వెనక్కు రప్పించాయి. బొలీవియా అన్ని రకాల సంబంధాలను తెగతెంపులు చేసుకున్నది. వందల కోట్ల డాలర్ల విలువగల మారణాయుధాలను అందిస్తున్న అమెరికా గతంలో ఎర్ర సముద్ర ప్రాంతానికి రెండు విమానవాహక యుద్ధ నౌకలు, క్షిపణి ప్రయోగ యుద్ధ నౌకలను పంపగా ఇప్పుడు ఒక జలాంతర్గామిని ఆ ప్రాంతానికి పంపి ఆ ప్రాంత దేశాలను బెదిరిస్తున్నది. .


తాము అంచనా వేసిన విధంగా రష్యా సేనలను ఎదుర్కోవటంలో ఉక్రెయిన్‌ విఫలం కావటంతో పశ్చిమ దేశాలు పునరాలోచనలో పడటమే గాక, ఏదో విధంగా రాజీచేసుకోవాలంటూ వత్తిడికి శ్రీకారం చుట్టినట్లు వార్తలు వచ్చాయి. రష్యా సైనిక చర్య ప్రారంభమై ఇరవై నెలలు దాటింది. తమ ప్రాంతాల్లోకి చొచ్చుకు వచ్చిన పుతిన్‌ సేనలను వెనక్కు కొట్టేందుకు ప్రతిదాడులను ప్రారంభించినట్లు ప్రకటించి ఐదు నెలలు గడుస్తున్నప్పటికీ రష్యా సేనలు ఖాళీ చేసిన ఒకటి రెండు గ్రామాలు, ప్రాంతాలు తప్ప చెప్పుకోదగిన పరిణామాలేవీ లేవు. రష్యా మందుపాతరలను ఏర్పాటు చేసినందున వాటిని తొలగించేందుకు చాలా సమయం పడుతున్నదని ఉక్రెయిన్‌ చెప్పుకుంటున్నది. నిజానికి అదే వాస్తవమైతే ప్రతిదాడులతో ఆ ప్రాంతాలన్నింటినీ స్వాధీనం చేసుకోవటమే తరువాయి అన్నట్లుగా మే, జూన్‌ మాసాలలో మీడియాలో కథనాలను ప్రచురించారు. పశ్చిమ దేశాలన్నీ మధ్యప్రాచ్యం, ఇజ్రాయెల్‌ మీద కేంద్రీకరించటం, భవిష్యత్‌లో సాయం కొనసాగదేమో అన్న సందేహాలు తలెత్తటం, మరోవైపు రష్యా వైమానిక దాడులు నిరంతరం కొనసాగుతుండటం, చలికాలం ముందుంటంతో ఉక్రెయిన్‌ మిలిటరీ, పాలకులకు దిక్కుతోచటం లేదు.నవంబరు ఐదవ తేదీన ఉక్రెయిన్‌ మిలిటరీ అవార్డుల సభమీద జరిగిన దాడిలో కనీసం 20 మంది సైనికులు మరణించటంతో జెలెనెస్కీ కలవర పడ్డాడు.యుద్ధం సాగుతున్నపుడు ఆ ప్రాంతంలో అలాంటి కార్యక్రమం నిర్వహించటం ఏమిటని సామాజిక మాధ్యమంలో జనాలు ప్రభుత్వం మీద తీవ్ర విమర్శలు చేస్తున్నారు.


రష్యాతో చర్చలకు ఉక్రెయిన్ను ఒప్పించేందుకు పశ్చిమ దేశాలు పూనుకున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే ఇన్ని నెలల తరువాత రాజీపడితే అసలు ఇంతకాలం ఎందుకు ఆపని చేయలేదనే ప్రశ్నలు తలెత్తుతాయి. ముందు మీరు రాజీకి అంగీకరిస్తే గౌరవ ప్రదంగా బయటపడటం గురించి మార్గాన్ని చూద్దామని నాటో కూటమి దేశాల ప్రతినిధులు అంటున్నారు. అందువలన అమెరికా కూటమి ముందుగా ఒక స్పష్టమైన వైఖరికి వస్తేనే చర్చలకు దారి ఏర్పడుతుంది.గత నెలలో జరిగిన ఒక సర్వేలో శాంతి కోసం కొంత భూభాగాన్ని వదులు కోవచ్చా అన్న ప్రశ్నకు ససేమిరా అంగీకరించం అని 74శాతం మంది చెప్పినట్లు తేలింది. వచ్చే ఏడాది ఉక్రెయిన్‌లో ఎన్నికలు జరగాల్సి ఉంది, అవి జరుగుతాయా లేదా అన్నది ఒకటైతే ఒకవేళ రాజీపడితే జెలెనెస్కీ ఇంటిదారి పట్టాల్సిందే.బహుశా అందుకనే యుద్ధంలో ఉన్నందున అసలు వచ్చే ఏడాదైనా ఎన్నికలేంటి అనేపల్లవిని ఎత్తుకున్నాడు. ఇప్పటికిప్పుడు కాకున్నా కొన్ని నెలల తరువాతైనా జెలెనెస్కీ చర్చలకు దిగిరాక తప్పదనే భావం రోజు రోజుకూ పెరుగుతున్నది. జెలెనెస్కీ ముందుకు తెచ్చిన పది అంశాల శాంతి పధకం గురించి మాల్టాలో జరిగిన సమావేశానికి చైనా హాజరుకాలేదు. ఈ పరిణామం ఉక్రెయిన్‌ కోరుకున్న శాంతి ప్రతిపాదనకు పెద్ద ఎదురుదెబ్బ.


రష్యాను కొద్ది వారాల్లో వెనక్కు నెట్టవచ్చన్న పశ్చిమ దేశాల అంచనాలు తలకిందులయ్యాయి.అక్కడ విజయం సాధించారు, ఇక్కడ ముందుకు పోయారు అంటూ పశ్చిమ దేశాల మీడియా చూపిన దృశ్యాలు, ఇచ్చిన వార్తలు వాస్తవం కాదని తేలిపోయింది.ఇప్పటికీ మద్దతు ఇస్తామని చెబుతున్నప్పటికీ కొనసాగుతుందన్న హామీ లేదు. 2022 మే నెలలో 400 కోట్ల డాలర్ల సాయం అందించాలన్న అమెరికా నిర్ణయానికి పార్లమెంటులో 368 అనుకూల, 57 వ్యతిరేక ఓట్లు వచ్చాయి. ఈ సెప్టెంబరులో జరిగిన 30కోట్ల డాలర్ల బిల్లు ఆమోదం పొందినప్పటికీ వ్యతిరేకించిన వారు 117 మంది ఉన్నారు.ప్రస్తుతం ప్రతిపక్ష రిపబ్లికన్లు పార్లమెంటులో మెజారిటీ ఉన్నారు. వచ్చే ఏడాది ఎన్నికల్లో జో బైడెన్ను ఓడించాలని చూస్తున్న వారు ప్రతి ప్రతిపాదనను అడ్డుకొనేందుకు, ఎన్నికల్లో లబ్ది పొందేందుకు చూస్తారు.జాతీయ భద్రతా సహాయ నిధి పేరుతో అమెరికా పక్కన పెట్టిన 105 బిలియన్‌ డాలర్లలో ఉక్రెయిన్‌ ఒక్కదానికే 60బి.డాలర్లు ఇస్తామని చెప్పారు. అంత మొత్తం ఇచ్చేందుకు రిపబ్లికన్‌ పార్టీ సిద్దంగా లేదు. ఆ పార్టీ పార్లమెంటులో మెజారిటీగా ఉన్నందున వారి మద్దతు లేకుండా ఒక్క డాలరు కూడా జో బైడెన్‌ విడుదల చేయలేడు. అది లేకుండా ఉక్రెయిన్‌ ఎంతకాలం నిలబడుతుందన్నది సమస్య. ఇప్పుడు ఇజ్రాయెల్‌-పామస్‌ పోరు ముందుకు రావటంతో అమెరికా దృష్టి అటువైపు మళ్లింది,భారీ ఎత్తున ఇజ్రాయెల్‌కు నిధులు, ఆయుధాలు సమకూరుస్తోంది. ఇది కూడా ఉక్రెయిన్‌కు ఎదురు దెబ్బే. పశ్చిమ దేశాల మీడియా అంతటా నెల రోజుల క్రితం వరకు ఉక్రెయిన్‌ విజయగాధలతో ఉండేవి. ఇప్పుడు వాటి స్థానాన్ని ఇజ్రాయెల్‌ హమస్‌ దాడులు, మధ్యప్రాచ్య పరిణామాలు ఆక్రమించాయి. ఐరోపా యూనియన్‌ అక్టోబరు నెలలో వచ్చే నాలుగు సంవత్సరాల బడ్జెట్‌ గురించి బ్రసెల్స్‌లో జరిపిన సంప్రదింపులలో ఉక్రెయిన్‌కు మరింత సాయం చేయకూడదంటూ పోలాండ్‌, హంగరీ, స్లోవేకియా అడ్డం తిరిగాయి.ఉక్రెయిన్‌ తక్కువ ధరలకు ఆహార ధాన్యాల ఎగుమతి తమ రైతాంగానికి నష్టం కలిగిస్తున్నదంటూ పోలాండ్‌ అభ్యంతరం తెలుపుతున్నది. వచ్చే ఏడాది ఎన్నికలు జరుగుతున్నందున పోలాండ్‌ ప్రధాని మోరావిక్కీ తన గెలుపు గురించి ఆందోళన చెందుతున్నాడు, ధాన్య ధరలు తన పతనానికి కారణం అవుతాయోమనని భయపడుతున్నాడు.


పశ్చిమ దేశాలు ఇప్పటికే తమ వద్ద ఉన్న ఆధునిక విమానాలు తప్ప అన్ని రకాల ఆయుధాలను ఉక్రెయిన్‌కు అందచేశాయి. వాటినే ఇంకా సరఫరా చేయటం తప్ప అంతకు మించి మరో అడుగువేయలేని స్థితి. జెలెనెస్కీని ముందుకు నెట్టటం తప్ప నేరుగా నాటో కూటమి దేశాలు రంగంలోకి దిగే అవకాశాలు ప్రస్తుతానికి కనిపించటం లేదు. ప్రస్తుతం ఎలాంటి స్థంభన లేదంటూ బింకాలు పలుకుతున్నప్పటికీ ఎంతకాలం అన్న ప్రశ్న ముందుకు వస్తున్నది.రష్యాతో శాంతి చర్చలకు ఉన్న అవకాశాలేమిటి అంటూ అమెరికా, ఐరోపా సమాఖ్య ప్రతినిధులు ఉక్రెయిన్‌ అధికారులను అడిగినట్లు అమెరికా ఎన్‌బిసి టీవి పేర్కొన్నది. ఉక్రెయిన్‌కు మద్దతునిస్తున్న 50కిపైగా దేశాల ప్రతినిధులతో అక్టోబరు నెలలో బ్రసెల్స్‌లో జరిగిన సమావేశం సందర్భంగా ఈ మేరకు కదిలించి చూసినట్లు అది వెల్లడించింది. దీని గురించి జెలెనెస్కీ స్పందిస్తూ చర్చలకు ఇది తరుణం కాదని, అందుకోసం పశ్చిమ దేశాల నేతలెవరూ తనను వత్తిడి చేయటం లేదని చెప్పుకున్నాడు. రష్యాతో తమ పోరు కదలిక లేని, ఘర్షణపూర్వక బలహీన స్థితి ఉండే దశలోకి ప్రవేశిస్తున్నదని, ఇలాంటి పరిస్థితి రష్యా తనమిలిటరీ శక్తిని తిరిగి సమకూర్చుకొనేందుకు వీలు కల్పిస్తుందని ఉక్రెయిన్‌ దళాధిపతి జనరల్‌ వాలెరీ జలుఝని ఎకానమిస్ట్‌ పత్రికలో రాసిన వ్యాసంలో పేర్కొన్నాడు. ఆ తరువాతే ఎన్‌బిసి వార్త, దాని మీద జలెనెస్కీ స్పందన వెలువడింది. ” కాలం గడిచింది జనాలు అలసిపోయారు, కానీ ఇది ప్రతిష్ఠంభన కాదు ” అని కూడా అన్నాడు. 2014లో రష్యా విలీనం చేసుకున్న క్రిమియా ద్వీపంతో పాటు గత ఏడాది నుంచి ఉక్రెయిన్లో స్వాధీనం చేసుకున్న ప్రాంతాలన్నింటినీ తిరిగి స్వాధీనం చేసుకుంటామని ఉక్రెయిన్‌ చెబుతున్నది. ప్రస్తుతం ఉక్రెయిన్లో స్వాతంత్య్రం ప్రకటించుకున్న రెండు రిపబ్లిక్‌లను రష్యా గుర్తించింది. వాటితో సహా అంతర్జాతీయంగా గుర్తించిన ఉక్రెయిన్లో 17.5శాతం ప్రాంతం రష్యా దళాల అదుపులో ఉంది. ఉక్రెయిన్‌ నాటోలో చేరబోనని, పశ్చిమ దేశాలతో కలసి తమ భద్రతకు ముపు కలిగించబోమని హామీ ఇస్తే క్రిమియా మినహా తమ స్వాధీనంలో ఉన్న వాటిని వెంటనే అప్పగిస్తామని పుతిన్‌ మొదటి నుంచీ చెబుతున్నాడు. పశ్చిమ దేశాలు దాన్ని పడనివ్వకుండా అడ్డుపడటమే కాదు, ఫిన్లండ్‌, స్వీడన్‌లను నాటోలో చేర్చుకొని మరోవైపు నుంచి రష్యాను దెబ్బతీసేందుకు పూనుకున్నాయి.


ప్రస్తుతానికి పశ్చిమ దేశాల సాయం నిలిచిపోతుందని చెప్పలేము గానీ వచ్చే ఏడాది నుంచి జరగవచ్చని ఐరోపా విశ్లేషకులు చెబుతున్నారు. రానున్న పద్దెనిమిది నెలలు ప్రస్తుత పోరులో కీలకంగా మారనున్నాయని, 2025 వసంత రుతువుకు ముందు రష్యన్లు విజయవంతమైన ఎదురుదాడి చేయలేరని, వచ్చే ఏడాది ఉక్రెయిన్‌ పెద్ద ముందడుగు వేయవచ్చని కొందరు అంచనా వేస్తున్నారు. తాము కోల్పోయిన ప్రాంతాలన్నింటినీ తిరిగి ఇస్తే తప్ప చర్చలు లేవని ఉక్రెయిన్‌ చెబుతుండగా, తమ ఆధీనంలోకి వచ్చిన ప్రాంతాలను వదిలేదని రష్యా చెబుతున్నందున రెండు దేశాల మధ్య చర్చలకు ప్రస్తుతం ప్రాతిపదిక లేదనే పద్దతిలో విశ్లేషణలు సాగుతున్నాయి. రష్యా మమ్మల్నందరినీ చంపిన తరువాత వారు నాటో దేశాల మీద దాడి చేస్తారు, అప్పుడు గాని మీ కొడుకులూ, కుమార్తెలను పోరాటానికి పంపరా అని జెలెనెస్కీ ఒక అమెరికా టీవీ ఎన్‌బిసి ఇంటర్వ్యూలో నాటో కూటమి మీద అసహనాన్ని వెళ్లగక్కాడు. ఒకసారి డోనాల్డ్‌ ట్రంప్‌ తమ దేశానికి వస్తే కేవలం 24 నిమిషాల్లో అంతా వివరిస్తానని గెలిస్తే 24 గంటల్లో యుద్ధాన్ని అంతం చేస్తాడని అన్నాడు. మొత్తం మీద ఉక్రెయిన్‌ సంక్షోభం మరో మలుపు తిరిగే సూచనలు కనిపిస్తున్నాయి.

నరేంద్రమోడీ పదేండ్ల పాలన : పేదల పాసింజరు రైళ్లు రద్దు – బడా బాబుల విమానాలు రెట్టింపు !

Tags

, , , , , , ,


ఎం కోటేశ్వరరావు


కరోనా కాలం నుంచి కేంద్రం ఉచితంగా ఇస్తున్న బియ్యం పధకాన్ని మరో ఐదు సంవత్సరాల పాటు పొడిగించనున్నట్లు ప్రధాని నరేంద్రమోడీ ఒక ఎన్నికల సభలో ప్రకటించారు. ఇదే సమయంలో నవంబరు మూడవ తేదీన అమెరికా న్యూయార్క్‌టైమ్స్‌ పత్రిక ” భారత్‌ మాదిరి ఎక్కువగా విమానాలను కొనుగోలు చేస్తున్న దేశం మరొకటి లేదు, ఎందుకో ఇక్కడ చూడండి ” అనే శీర్షికతో వార్త ఇచ్చింది. చూశారా జనం పట్ల మోడీకిఎంత శ్రద్ద ఉందో అని ఉచిత బియ్యం గురించి, విమానాల కొనుగోలులో మనమే టాప్‌ అంటే పదేండ్లలో మోడీ దేశాన్ని ఎంత అభివృద్ధి చేశారో చెప్పటానికి ఇంతకంటే ఏం కావాలి అని తబ్బిబ్బు అవుతున్నారు. రాజుల వద్ద భట్రాజులు (కుల ప్రస్తావన కాదని గమనించాలి) ఉండేవారు. రాజుగారి నోటి నుంచి ఏ మాట వచ్చినప్పటికీ ఆహా ఓహౌ అని పొగడటమే వారి పని, ఎంతగొప్పగా పొగిడితే వారికి అంత ఎక్కువగా ప్రతిఫలం ముట్టేది. మోడీని పొగిడేవారు వారిని గుర్తుకు తెస్తున్నారు. జనం మీద ఇతర అంశాల్లో లేని ప్రేమ ఉచిత బియ్యం మీద ఎందుకు చూపుతున్నారు ? ఐదు రాష్ట్రాల్లో బిజెపికి పరీక్షగా మారిన అసెంబ్లీ, వచ్చే లోక్‌సభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని రాఖీ బహుమతి పేరుతో ఉజ్వల పధక గాస్‌ సబ్సిడీని 200 నుంచి 400కు పెంచగా, ఇతరులకు రు.200 రాయితీ ఇచ్చారు.పొయ్యి మీదకు ఐదు కిలోల ఉచిత బియ్యం ఇస్తున్నారు. పొయ్యి కిందకు అవసరమైన గాస్‌ ధర మోడీ గద్దె నెక్కినపుడు రు.420వరకు ఉండగా రు.1,150 కు పెంచారు (రాష్ట్రాలలో ధరల్లో తేడాలు ఉన్నాయి). అంతగా పెంచినపుడు మహిళలు గుర్తుకు రాలేదా ? నరేంద్రమోడీ పదేండ్ల ఏలుబడిలో దేశంలో ఆకలి పెరిగింది తప్ప తగ్గలేదు అన్నది పచ్చి నిజం. పెరగకపోతే ఉచిత బియ్యం ఇవ్వాల్సిన అవసరం ఏముంది. కిందపడ్డా పైచేయి నాదే అన్నట్లుగా నరేంద్రమోడీ వైఫల్యాన్ని అంగీకరిస్తారా ? అందుకే ఉచిత బియ్యం ఓట్ల కోసం ఎర. మోడీ అధికారానికి వచ్చినపుడు ఆకలి సూచికలో దేశం 120కిగాను 99వ స్థానంలో ఉంది.2023నాటికి అది 125దేశాలకు గాను 2022లో 121కి 107 కాగా 2023లో 125దేశాల్లో 111కు దిగజారింది. ఈ సూచికలను ఏనాడూ కేంద్ర ప్రభుత్వం అంగీకరించలేదు, తప్పుల తడక అని చెప్పటం తప్ప దేశంలో ఆకలి ఎంత ఉందో అసలు లేదో అన్నది కూడా ఇంతవరకు చెప్పలేదు.


భారత్‌కు అదనంగా వెయ్యి విమానాలు కావాల్సి ఉందని 2018జూన్‌ మొదటివారంలో నాటి పౌరవిమానయాన శాఖ మంత్రి సురేష్‌ ప్రభు ప్రకటించారు. మేకిన్‌ ఇండియాలో భాగంగా విదేశీ కంపెనీలు మన దేశంలోనే తయారు చేస్తాయని కూడా చెప్పారు. రానున్న రెండు దశాబ్దాల్లో భారత్‌ తమనుంచి 1,750 కొనుగోలు చేయవచ్చని ఎయిర్‌ బస్‌, 2,100 ఆర్డర్లు తమకు రావచ్చని బోయింగ్‌ కంపెనీ 2017లోనే చెప్పింది. కొత్తగా వెయ్యి విమానాలను కొనుగోలు చేస్తున్నట్లు సంస్థలు ప్రకటించాయి. దీంతో ఎవరికీ పేచీ లేదు. వీటి వలన సామాన్యులకు ఒరిగేదేమిటి ? డబ్బున్నోళ్లు ఎక్కుతారు.పెరుగుతున్న రైలు ప్రయాణీకులకు అనుగుణంగా రైళ్లను పెంచాలని నెత్తీ నోరు కొట్టుకుంటున్నా పట్టించుకోలేదు. మూడేండ్లనాటి రైల్వే శాఖ అంచనా ప్రకారం కనీసం ఇరవై వేల రైళ్లు అవసరం కాగా పదమూడువేలు మాత్రమే ఉన్నాయి. ఏటా వీటిలో ప్రయాణిస్తున్నవారు 2010 నుంచి 2020 వరకు సగటున ఏడాదికి 811 కోట్ల మంది ఉన్నారు. 2010లో 724 కోట్లు కాగా 2020లో 809 కోట్ల మంది ఉన్నారు. తగినన్ని రైళ్లు లేని కారణంగా ప్రయాణీకులు పెరగటం లేదని ఈ అంకెలు వెల్లడిస్తున్నాయి. నూటనలభై కోట్ల మందికి అవసరమైన రైళ్లను గడచిన ఆరు సంవత్సరాల్లో ఎనిమిది వందలు మాత్రమే పెంచారు. 2022-23 సంవత్సరరలో దేశంలో విమాన ప్రయాణీకులు 37.7 కోట్లు కాగా వారిలో విదేశీయులు 5.9 కోట్ల మంది ఉన్నారు. వీరి కోసం ఈ ఒక్క ఏడాదే వెయ్యి విమానాలు కొనుగోలు చేస్తున్నట్లు ప్రకటించారు. పోనీ అవి ప్రైవేటు సంస్థలు అనుకుందాం, రైళ్లను పెంచాల్సిన బాధ్యత ప్రభుత్వానికి లేదా ? అసలు సంగతేమంటే జనాలకు అచ్చేదిన్‌ అని చెప్పిన మోడీ కరోనా పేరుతో రద్దు చేసిన పాసింజరు రైళ్లను, రాయితీలను ఇంతవరకు పునరుద్దరించలేదు.వాటి మీద ఒక నిర్దిష్ట ప్రకటన కూడా లేదు. అనేక పాసింజర్లను ఎక్స్‌ప్రెస్‌లుగా మార్చి ప్రయాణీకుల నుంచి జేబులు కొల్లగొడుతున్న సంగతి తెలిసిందే. తక్కువ ఖర్చుతో ప్రయాణించే రైళ్ల బదులు వందే భారత్‌లను ప్రవేశపెట్టేందుకు మాత్రమే శ్రద్ద చూపుతున్నారు. హైస్పీడు, బుల్లెట్‌ రైళ్లు వాటికోసం మార్గాల నిర్మాణం గురించి చూపుతున్న శ్రద్ద సామాన్య జన అవసరాల మీద లేదు. భారత్‌ విమానాల కొనుగోలు గురించి గొప్పగా రాయటం మోడీని మునగ చెట్టు ఎక్కించే యత్నం తప్ప మరొకటి కాదు.


ఒక్కసారిగా వెయ్యి విమానాలను కొనుగోలు చేస్తే అసలు అవి నిండే అవకాశం ఉందా ? ప్రస్తుతం దేశంలో ఇరవై ప్రయాణాలు రైల్లో చేస్తే ఒకటి విమానంలో జరుగుతున్నట్లు అంచనా. విమానం కంటే రైల్లో మొదటి తరగతి ఛార్జీలను ఎక్కువగా నిర్ణయించి జనాలను విమానాలవైపు వెళ్లేట్లు చేస్తున్నారు. ఇది ప్రైవేటు సంస్థలకు లబ్ది చేకూర్చే వైఖరి తప్ప మరొకటి కాదు. ఎయిర్‌ ఇండియాను స్వాధీనం చేసుకున్న టాటా గ్రూపు కొత్తగా 470 విమానాలను కొనుగోలు చేయాలని నిర్ణయించింది. మరో సంస్థ ఇండిగో మరో ఐదువందలు కొనుగోలు చేయనున్నట్లు ప్రకటించింది. తక్కువ ఖర్చుతో ప్రయాణించే విమానాల ద్వారా రద్దీ పెంచుకొని లబ్దిపొందేందుకు అవి చూస్తున్నాయి.ప్రభుత్వం కూడా గత తొమ్మిది సంవత్సరాల్లో 74గా ఉన్న విమానాశ్రయాలను 148కి పెంచింది, 2030 నాటికి 230కి పెంచుతామని చెబుతున్నారు. ఇది తమ ఘనతగా అధికార బిజెపి ప్రచారం చేసుకుంటున్నది. ఇదే మాదిరి రైలు ప్రయాణీకులకు అవసరమైన ఖర్చు , వేగంగా ప్రయాణించే మార్గాలకు ప్రభుత్వం ఖర్చు పెట్టిందా అంటే లేదు. వందేభారత్‌ రైళ్లు కూడా పూర్తి వేగంతో నడవటంలేదు. రెండు వందల కిలోమీటర్లకు పైగా తిరిగే అన్ని పాసింజరు రైళ్లను ఎక్స్‌ప్రెస్‌లుగా మార్చటంతో దేశంలో ఐదువందలకు పైగా రైళ్లు సామాన్యులకు దూరమయ్యాయి. అనేక గ్రామాల్లో ఉన్న రైల్వే స్టేషన్లలో రైళ్లను ఆగకుండా చేశారు. ఈ కారణంగా కలసి వచ్చిన సమయం గురించి చెప్పకుండా వేగం పెంచి ప్రయాణీకులకు మేలు చేసినట్లు చెప్పారు. ఎక్స్‌ప్రెస్‌లుగా మార్చినందున గతంతో పోలిస్తే ప్రతి ప్రయాణీకుడి మీద 20 నుంచి 60 రూపాయల వరకు అదనపు భారం పడింది. దీనికి తోడు ఎక్స్‌ప్రెస్‌ రైళ్లలో సాధారణ స్లీపర్‌ కోచ్‌లను తగ్గించి ఎసి కోచ్‌లను పెంచారు. సీట్లు దొరక్క అనివార్యంగా అదనపు ఛార్జీలు చెల్లించాల్సి వస్తున్నది.వృద్దులు, మహిళలకు ఇస్తున్న ప్రయాణ రాయితీలను రద్దుచేశారు. టిక్కెట్ల రిజర్వేషన్‌, రద్దు చార్జీలను విపరీతంగా పెంచి మరో రూపంలో జేబులును కొల్లగొడుతున్నారు. పేరుకు చార్జీలను పెంచలేదనటం తప్ప కరోనా తరువాత పరోక్షంగా మోపిన భారం మామూలుగా లేదు. రద్దీ ఉన్న మార్గాలలో ఏండ్ల తరబడి ప్రత్యేక రైళ్ల పేరుతో నడుపుతూ జనం దగ్గర అదనపు ఛార్జీలను వసూలు చేస్తున్న సంగతి తెలిసిందే. వాటినే సాధారణ రైళ్లుగా ఎందుకు నడపరు ?

ప్రయాణీకుల రైళ్ల నిర్వహణ గిట్టుబాటు కావటం లేదంటూ ప్రతి ఏటా కేంద్ర ప్రభుత్వ పెద్దలు చెబుతుంటారు. ఆ లెక్కలకు ఆధారం ఏమిటో తెలియదు. ప్రతి ప్రయాణీకుడి నుంచి కేవలం 47శాతమే వసూలు చేస్తున్నట్లు ప్రభుత్వం చెబుతున్నది. సామాన్యులకు విమానాలను అందుబాటులోకి తేవాలనే పేరుతో అవి నడిచేందుకు అవసరమైన ఇంథన మీద రాయితీలు ఇస్తున్నారు. మరోవైపు రాష్ట్రాల్లో ప్రజారవాణా సంస్థల బస్సులకు ఎలాంటి ఇంథన సబ్సిడీలు లేవు. సరకు రవాణాకు ఎలాంటి రాయితీలేదు.కేంద్ర ప్రభుత్వం ప్రయాణీకులకు 2019-20లో ఇచ్చిన సబ్సిడీ మొత్తం రు.59,837 కోట్లు. సగటున ముందే చెప్పుకున్నట్లు ఏడాదికి ప్రయాణీకులు 811 కోట్లు, అంటే ఒక్కో ప్రయాణం మీద ఇస్తున్న రాయితే రు.73.78 మాత్రమే. ఈ మాత్రానికే అంతా దోచిపెడుతున్నట్లు గుండెలు బాదుకుంటున్నారు. నాసిరకం భోజనం,టిఫిన్లు, టీ, కాఫీలకు ప్రయాణీకులు చెల్లిస్తున్న మొత్తాలతో బేరీజు వేస్తే జనమే అధికంగా చెల్లిస్తున్నట్లు స్పష్టం అవుతుంది. ప్రభుత్వ రంగంలోని రవాణా వ్యవస్థలు అయ్యే ఖర్చును మాత్రమే రాబట్టాలి తప్ప లాభాలు తేవాలని చూడటమే తప్పు. ఆ లాభం కూడా సామాన్యుల నుంచి మరో రూపంలో వసూలు చేస్తున్నదే.


ఏ చిన్న అవకాశం దొరికినా ప్రయాణీకుల రైళ్లను రద్దు చేయటం పరిపాటిగా మారింది. ఇవి కూడా స్వల్పదూరాల్లో ప్రయణించేవే కావటం గమనించాలి. సమాచార హక్కు చట్టం కింద అడిగిన ప్రశ్నలకు 2022వ సంవత్సరంలో ఆరు నెలల్లో తొమ్మిది వేలకు పైగా రైలు సర్వీసులను రద్దు చేశారు. వాటిలో బొగ్గు రవాణాకు ప్రాధాన్యత ఇచ్చే పేరుతో రద్దు చేసినవి 1,934 ఉన్నాయి, మరో 6,995 రైళ్లను మార్గ మరమ్మతులు, నిర్వహణ పేరుతో రద్దు చేశారు.వీటిలో 3,395 మెయిల్‌ లేదా ఎక్స్‌ప్రెస్‌లు, 3,600 పాసింజర్లు ఉన్నాయి. సరకు రవాణా లాభసాటి అన్నది తెలిసిందే. ప్రభుత్వం ఆ లాభాలను చూస్తున్నది తప్ప ప్రయాణీకులను గాలికి వదలి వేస్తునది.2021-22లో రైళ్ల రద్దు, తగినన్ని రైళ్లు లేని కారణంగా కోటీ అరవైలక్షల మంది ప్రయాణించలేదు. చివరి క్షణాల్లో వారెంత ఇబ్బంది పడి ఉంటారో ఊహించుకోవాల్సిందే. విమాన ప్రయాణీకుల పెరుగుదల గురించి చెబుతున్న పాలకులకు రైల్వే ప్రయాణీకులు పెరుగుతున్నారని తెలియదా ?


ఒక విశ్లేషణ ప్రకారం 2019లో మనదేశంలో తలసరి విమాన సీట్లు 0.13 కాగా చైనాలో 0.52, అమెరికాలో 3.03 ఉన్నాయి. స్టాటిస్టా సంస్థ వెల్లడించిన సమాచారం ప్రకారం 2021లో ఆయా దేశాల్లో నమోదైన విమాన సంస్థల వద్ద ఉన్న వివరాల ప్రకారం అమెరికాలో ప్రయాణీకులు 66.615 కోట్లు, చైనాలో 44.03, ఐరోపా సమాఖ్యలో 25.169, రష్యాలో 9.685, మనదేశంలో 8.396 కోట్ల మంది ఉన్నారు. మన హైదరాబాద్‌ కంటే తక్కువగా అంటే 70లక్షల 52వేల మంది ఉన్న ఐర్లండ్‌లో 7.047 కోట్ల మంది ఉన్నారు. ఈ అంకెలు వాస్తవాలను ప్రతిబింబించవు. ఉదాహరణకు మన దేశంలో ఇండిగో సంస్థ బ్రిటన్‌-రష్యా మధ్య విమానాలను నడిపితే వాటిలో ఎక్కే ప్రయాణీకులను కూడా మనదేశ ఖాతాలోనే వేస్తారు. రానున్న రోజుల్లో దేశంలోని మధ్య తరగతి జనాలు ఇంకా పెరుగుతారనే అంచనాతో కొత్తగా విమానాలను కొనుగోలు చేసేందుకు పూనుకున్నారు. మిగతా దేశాల వద్ద ఇప్పటికే ఎక్కువ ఉన్నాయి. అందువలన ఏ దేశమూ కొననన్ని విమానాలను మనం కొంటున్నామని ఎవరైనా అంటే మనకు మనమే జబ్బలను చరుచుకోవాల్సిన అవసరం లేదు.


బిజినెస్‌ టుడే పత్రిక 2023 ఫిబ్రవరి 16న రాసిన వార్త ప్రకారం మన దేశంలో ఉన్న విమానాలు 800-900 మధ్య, చైనాలో 4,500 ఉన్నాయి.మనజనాభాకు కనీసం 3,500 నుంచి ఐదువేల వరకు ఉండాలని మార్టిన్‌ కన్సల్టింగ్‌ సంస్థ సిఇఓ మార్క్‌ మార్టిన్‌ చెప్పినట్లు పేర్కొన్నది. మన జిడిపి వృద్ది రేటు కంటే విమాన ప్రయాణాల వృద్ది రేటు ఒకటిన్నర రెట్లు ఎక్కువగా ఉన్నందున ప్రైవేటు సంస్థలు ఒక్కసారే భారీ సంఖ్యలో విమానాల కొనుగోలుకు నిర్ణయించాయి. ఈ ఏడాది ప్రారంభంలో ప్రధాని నరేంద్రమోడీ మాట్లాడుతూ రానున్న పదిహేను సంవత్సరాల్లో దేశంలో రెండువేలకు పైగా విమానాల అవసరం ఉంటుందని చెప్పారు. ఏ దేశంలోనైనా నెలకు కనీసం ఐదు నుంచి పది విమానాలకు ఆర్డరు ఉంటే అక్కడ విమానాల( అసెంబ్లింగ్‌) తయారీ గురించి ఆలోచిస్తామని, భారత్‌ ఒక్క సారే వెయ్యింటిని కొనుగోలు చేస్తున్నందున పరిశీలిస్తున్నట్లు చెబుతున్నారు తప్ప నిర్దిష్ట ప్రతిపాదనలేవీ లేవు. వివిధ దేశాల నుంచి విడిభాగాలను తెచ్చి చైనాలోని కమర్షియల్‌ ఏవియేషన్‌ కార్పొరేషన్‌ తొలిసారి స్వంతంగా వాణిజ్య విమానాలను తయారు చేసింది. చైనా ప్రభుత్వం 490 కోట్ల డాలర్లను సమకూర్చగా 2007లో శ్రీకారం చుట్టి 2015లో నమూనాను రూపొందించి 2022లో 164 మంది కూర్చునే తొలి చిన్న విమానాన్ని తయారు చేశారు. అది 2023 మే నెలలో తొలి ప్రయాణం చేసింది. షాంఘై-చెంగ్‌డు నగరాల మధ్య తిరుగుతున్నది.


స్వంత తయారీ సి 919తో బోయింగ్‌, ఎయిర్‌ బస్‌ కంపెనీలకు చైనా సవాలు విసిరింది. పశ్చిమ దేశాలతో సంబంధాలు దిగజారుతున్న పూర్వరంగంలో ప్రస్తుతం దిగుమతి చేసుకుంటున్నవాటిని నిలిపివేసి స్వంతంగా తయారు చేసుకొనేందుకు అవసరమైన ప్రణాళికలను కూడా సిద్దం చేసుకున్నది. దీని వలన ఖర్చు తక్కువతో పాటు ఇతర దేశాల మీద ఆధారపడాల్సిన అగత్యం కూడా తప్పుతుంది. మన దేశం వెయ్యి విమానాలను విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటుంటే చైనా స్వంత తయారీ సి919 విమానాలు 1,200 కావాలని అక్కడి విమాన సంస్థలు ఆర్డర్లు పెట్టాయి. అందువలన చైనాకు దిగుమతులతో పనిలేదు.రానున్న ఐదు సంవత్సరాల్లో 150 రకాల విమానాల తయారీకి నమూనాలను సిద్దం చేశామని, ఉత్పత్తిని ప్రతి ఏటా పెంచుతామని చైనా కంపెనీ కోమాక్‌ ప్రకటించింది.అది ప్రస్తుతం ఎగుమతి చేస్తున్న సరకుల మాదిరి విమానాలను కూడా ఎగుమతి చేసినా ఆశ్చర్యపోనవసరం లేదు. మన దేశంలో అలాంటి మేకిన్‌ ఇండియా విమానం సాకారం కావాలంటే ఎన్ని దశాబ్దాలు పడుతుందో ఊహించుకోవాల్సిందే.

ఐరాస ఘోర వైఫల్యం – వీటోలతో ఇజ్రాయెల్‌ మారణకాండకు అమెరికా దన్ను !

Tags

, , , , , , , ,


ఎం కోటేశ్వరరావు


ప్రపంచంలో శాంతి, దేశాల భద్రత కాపాడేందుకు, మారణకాండలను నివారించేందుకు ఏర్పాటు చేసుకున్న ఐక్యరాజ్యసమితి వైఫల్యం మరోసారి వెల్లడైంది. ఇజ్రాయెల్‌ జరుపుతున్న మారణకాండ నివారణలో భాగంగా గాజాలో దాడులు నిలిపివేయాలని కోరే తీర్మానాలను భద్రతా మండలిలో అమెరికా అడ్డుకుంది. ఇజ్రాయెల్‌కు ఆత్మరక్షణ హక్కు ఉందని, అందువలన అది చేస్తున్న దాడులు సమర్ధినీయమే అంటూ అమెరికా తెచ్చిన తీర్మానాన్ని చైనా, రష్యా వీటో చేశాయి. దాడులను నిరసిస్తూ మెజారిటీ ఆమోదించిన ఐరాస సాధారణ అసెంబ్లీ తీర్మానం దేనికీ కొరగాకుండా పోయింది. 1948లో ఐరాస చరిత్రలో ఐరాస సాధించిన విజయం ఇది అని చెప్పుకొనేందుకు ఒక్కటంటే ఒక్కటి లేదంటే అతిశయోక్తి కాదు. ఇదే సందర్భంలో శాంతి పరిరక్షక దళాల మాటున హైతీలో కలరా బాక్టీరియాను విస్తరింపచేసిన దుర్మార్గానికి అది పాల్పడటాన్ని చరిత్ర మరచిపోదు. ఉద్రిక్తతలు తలెత్తిన ప్రాంతాల్లో శాంతి పరిరక్షక దళాల ఏర్పాటును విజయంగా కొందరు వర్ణిస్తారు. అంతిమంగా సాధించింది ఏమిటన్నదే గీటురాయి. ఇప్పటి వరకు గడచిన ఏడున్నర దశాబ్దాలలో వివిధ ప్రాంతాలు, దేశాల్లో ఇరవైలక్షల మంది శాంతి దళాలను ఏర్పాడు చేశారు. వివిధ దేశాల్లో జరిగిన దాడులు, ప్రతిదాడుల ఉదంతాల్లో 4,200మందికి పైగా ఈ దళాల్లోని సైనికులు ప్రాణాలు కోల్పోయారు.ఇజ్రాయెల్‌-అరబ్‌ కాల్పుల విరమణ ఒప్పందాల అమలును పరిరక్షించేందుకు 1948లో భద్రతా మండలి అక్కడకి శాంతి పరిరక్షక దళాలను పంపాలని నిర్ణయించింది. అవి చేసిందేమీ లేకపోగా తరువాత యూదు దురహంకారులు ఇరుగు పొరుగుదేశాల మీద, పాలస్తీనా ప్రాంతాల మీద దాడులు చేసి వాటిని అక్రమించుకుంటూనే ఉన్నారు. సాధారణ జనాన్ని అణచివేస్తున్నా గుడ్లప్పగించి చూడటం తప్ప ఐరాస చేసిందేమీ లేదు.


ప్రచ్చన్న యుద్ధం వలన ప్రపంచంలో శాంతి కొరవడిందని అనేక మంది చెబుతారు, దానికి సోవియట్‌ యూనియనే అని కూడా నిందించేవారు లేకపోలేదు.దాన్ని 1990 దశకంలో విచ్చిన్నం చేశారు.అప్పటికి వివిధ ప్రాంతాల్లో పదకొండు వేల మంది శాంతిపరిరక్షణ దళాలు ఉన్నాయి. పదహారు చోట్ల 2014నాటికి లక్షా 30వేలకు పెరిగారు. దీనికి అమెరికా దాని మిత్రదేశాలే కారణం.ఆఫ్రికా, ఆసియా, ఐరోపా, మధ్యప్రాచ్య ప్రాంతంలో పన్నెండు సమస్యాత్మక ప్రాంతాల్లో 87వేల మంది పని చేస్తున్నారు.ఘోరమైన వైఫల్యాలుగా చెప్పుకోవాల్సి వస్తే 1994లో ఆఫ్రికా దేశమైన ర్వాండాలో టుట్సీ-హుటు తెగల మధ్య తలెత్తిన హింసాకాండను నివారించటంలో చేతులెత్తేసింది. ఫలితంగా ఎనిమిది లక్షల మంది ప్రాణాలు పోయాయి.ఐరోపాలో 1995లో జరిగిన బోస్నియా దాడుల్లో ఎనిమిదివేల మంది ముస్లింలను చంపివేసినా చేసిందేమీ లేదు. 1950దశకంలో ఉత్తర కొరియా మీద జరిపిన దాడుల్లో పదిహేను లక్షల మందికి పైగా మరణించగా ప్రతిదాడుల్లో దాదాపు పది లక్షల మంది దక్షిణ కొరియన్లు చనిపోయారు. దీనికి ఐరాస చేసిన నిర్ణయమే కారణం. కమ్యూనిస్టుల పాలనలో ఉన్న చైనాకు బదులు కొద్ది మంది తిరుగుబాటుదార్లతో తైవాన్‌లో తిష్టవేసిన ప్రభుత్వానికి బదులు ప్రధాన భూభాగంలో అధికారంలో ఉన్న ప్రభుత్వాన్నే గుర్తించాలని కోరుతూ సోవియట్‌ యూనియన్‌ ప్రవేశపెట్టిన తీర్మానాన్ని భద్రతా మండలి తిరస్కరించింది. దాంతో తాము 1950జనవరి 13నుంచి ఐరాసను బహిష్కరిస్తున్నట్లు సోవియట్‌ ప్రకటించింది. సరిగ్గా ఆ సమయంలో ఉత్తర కొరియా దురాక్రమణకు పాల్పడిందనే సాకుతో అమెరికా, దాని మిత్రదేశాలు ప్రవేశపెట్టిన తీర్మానం ఆమోదం పొందటంతో ఉత్తర కొరియా మీద దాడి జరిగింది.దాంతో సోవియట్‌, చైనా రెండూ ఉత్తర కొరియా రక్షణకు రంగంలోకి దిగాయి.1953లో కాల్పుల విరమణ ఒప్పందం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు అదే కొనసాగుతోంది తప్ప సాంకేతికంగా యుద్ధ విరమణ జరగలేదు. ఉభయ కొరియాల విలీనానికి ఇంకా తగిన తరుణం రాలేదనే పేరుతో అమెరికా ఇతర దేశాలు అడ్డుపడుతున్నాయి. చైనాలో తైవాన్‌ ఒక రాష్ట్రం తప్ప దేశం కాదంటూ ఐరాస గుర్తించి అంతకు ముందు దానికి ఉన్న గుర్తింపును రద్దు చేసి కమ్యూనిస్టు చైనాను గుర్తించి నాలుగు దశాబ్దాలు దాటినా తైవాన్‌ విలీనం బలవంతంగా జరగకూడదు అంటూ దానికీ అడ్డుపడుతున్నారు. ఒక దేశంగా పరిగణించి ఆయుధాలు పెద్ద ఎత్తున అందచేస్తూ చైనా మీద తిరుగుబాటుకు మద్దతు ఇస్తున్నారు. ఇలా తాను చేసిన తీర్మానాలను అమలు జరిపేందుకు తరువాత తానే వెనక్కు తగ్గటం లేదా అసమర్ధంగా ఉండటం, ఇతర అనేక అంశాల పరిష్కారంలో ఐరాస విఫలమైంది. వర్తమాన అంశం పాలస్తీనాలో జరుగుతున్నది కూడా అదే.


ఆత్మరక్షణ పేరుతో గాజాలో సాధారణ పౌరుల మీద వైమానిక, టాంకులతో ఇజ్రాయెల్‌ సాగిస్తున్న హత్యాకాండ నివారణను అడఐర్డుకొనే వారే లేరా అన్న ప్రశ్నకు సమాధానం లేదు. ప్రతి రోజూ పిల్లలు, మహిళలతో సహా వందలాది మందిని చంపివేయటాన్ని ఆపాలని భద్రతా మండలిలో ప్రవేశపెట్టిన తీర్మానాలను అమెరికా ఇప్పటికే వీటో చేసి మరోసారి తానేమిటో ప్రపంచానికి వెల్లడించింది. శనివారం ఉదయానికి అందిన సమాచారం మేరకు గాజాలో 3,826 మంది పిల్లలు, 2,405 మంది మహిళలతో సహా మొత్తం 9,227 మందిని ఇజ్రాయెల్‌ చంపింది. దీనికి పశ్చిమగట్టులో చేసిన హత్యలు అదనం. ఒక నిర్వాసిత శిబిరం, ఒక ఆసుపత్రి అని లేదు, జనం ఎక్కడ ఉంటే అక్కడ బాంబులు వేస్తూ మారణకాండ సాగిస్తున్నది. దానికి అమెరికా కూడా ప్రత్యక్షంగా పాల్గొని సాయం చేస్తున్నది. గాజా ప్రాంతం మీద దాడులు చేస్తున్న ఇజ్రాయెల్‌ మిలిటరీకి అవసరమైన సమాచారం అందించేందుకు గాజా ప్రాంతం మీద మానవరహిత డ్రోన్లను అమెరికా ఎగురవేస్తున్నది. హమస్‌ వద్ద బందీలుగా ఉన్న వారి కోసమే అలా చేస్తున్నట్లు అమెరికా రక్షణశాఖ పెంటగన్‌ నిర్ధారించింది. మానవతా పూర్వక చర్యగా కాల్పులను విరమించాలన్న తీర్మానాన్ని వీటో చేసిన అమెరికా ఏ అధికారంతో ఈ పని చేస్తున్నది. దానికి భద్రతా మండలి తీర్మానం లేదా మరొకటి లేదు. ఇది అడ్డగోలు వ్యవహారం తప్ప మరొకటి కాదు. బందీలను విడుదల చేయించాల్సిన బాధ్యతను తీసుకోవాల్సింది ఐరాస. రోజూ వందల మందిని హతమారుస్తుంటే అది తీసుకున్న చర్యలేమీ లేవు. బందీల ప్రాణాలెంత విలువైనవో పాలస్తీనా అమాయక పౌరుల ప్రాణాలు కూడా అంతే విలువైనవి కాదా ! డ్రోన్లతో ఇజ్రాయెల్‌కు మద్దతు ఇస్తే పరిస్థితి మరింత విషమిస్తుంది తప్ప మెరుగుపడుతుందా ?


ఐరాస చేసిన తీర్మానం మేరకు ఏర్పడాల్సిన పాలస్తీనాను అడ్డుకోవటమే గడచిన ఏడున్నర దశాబ్దాలుగా అక్కడ సాగుతున్న అణచివేత-ప్రతిఘటనకు మూలం. దీనిపై భద్రతా మండలి ఏర్పడిన నాటి నుంచి ఇప్పటి వరకు శాంతి నెలకొనేందుకు, ఇజ్రాయెల్‌ను ఖండిస్తూ, పాలస్తీనాకు మద్దతుగా ప్రవేశపెట్టిన 42 తీర్మానాలను పాఅమెరికా వీటో చేసింది. ఇప్పటి వరకు భద్రతా మండలి చరిత్రలో అమెరికా చేసిన మొత్తం వీటోలే 83 కాగా సగానికి పైగా ఇజ్రాయెల్‌ను కాపాడేందుకు ప్రయోగించిందంటే అమెరికా దుర్మార్గం ఎలాంటిదో అర్దం చేసుకోవచ్చు. యూదు దురహంకారులను సమర్ధిస్తూ ప్రవేశపెట్టిన మరో రెండింటిని రష్యా, చైనా అడ్డుకున్నాయి.లెబనాన్‌పై దాడి, సిరియా గోలన్‌ గుట్టలను ఆక్రమించుకోవటంతో సహా ఇజ్రాయెల్‌ ప్రమేయం ఉన్న మొత్తం 46 తీర్మానాలను అమెరికా అడ్డుకున్నది. దుర్మార్గం ఏమంటే జరూసలెం నగరాన్ని తటస్థంగా ఉంచుతూ ఐరాస చేసిన నిర్ణయాన్ని ఉల్లంఘించి ఆక్రమించుకొని తమ రాజధాని అని ఇజ్రాయెల్‌ ప్రకటించుకుంది. దాన్ని అమెరికా 2017లో గుర్తించింది.ఐరాస తీర్మానాలకు అనుగుణంగా దాని భవిష్యత్‌ నిర్ణయం జరగాలని భద్రతా మండలిలో 14దేశాలు ఓటు వేస్తే అమెరికా వీటో చేసింది.1991 నుంచి 2011 కాలంలో అమెరికా 24 వీటోలు చేయగా వాటిలో 15 ఇజ్రాయెల్‌కు కాపు కాసేందుకే. పాలస్తీనా ప్రాంతాల్లో మారణకాండకు పాల్పడుతున్నది ఇజ్రాయెల్‌ మిలిటరీ, ఉగ్రవాదులు అయినప్పటికీ వారిని వెనుక ఉండి నడిపిస్తున్నది అమెరికా, ఇతర పశ్చిమ దేశాలు గనుక అక్కడ చిందే ప్రతి రక్తపు బొట్టుకూ బాధ్యతనుంచి తప్పించుకోలేవు.


గతం, వర్తమాన పరిణామాలను చూస్తున్నపుడు ఐరాసను ఒక ప్రజాస్వామిక సంస్థగా మార్చేందుకు సమగ్ర సంస్కరణలు అవసరమన్నది స్పష్టం.లక్ష మంది జనాభా ఉన్న కరీబియన్‌ ప్రాంత దేశమైన సెయింట్‌ విన్సెంట్‌, నూటనలభై కోట్ల జనాభా ఉన్న భారత, చైనాలు ఐరాస సాధారణ అసెంబ్లీలో ఒక్కో ఓటును మాత్రమే కలిగి ఉంటాయి. అది ప్రజాస్వామ్య బద్దమే అయినప్పటికీ అక్కడ చేసే తీర్మానాలకు ఎలాంటి విలువా ఉండదు. పదిహేను మంది ప్రతినిధులు ఉండే భద్రతా మండలిలో ఏదైనా ఒక తీర్మానాన్ని 14 మంది ఆమోదించినా ఐదు శాశ్వత సభ్య దేశాలలో ఏ ఒక్కటి కాదన్నా దానికీ అదే గతి పట్టటం పెద్ద లోపం. ఇజ్రాయెల్‌ దుర్మార్గం, క్యూబాపై అమెరికా అమలు జరుపుతున్న అష్టదిగ్బంధనాన్ని ఖండిస్తూ ప్రతి సంవత్సరం అత్యధిక మెజారిటీ దేశాలు తీర్మానాలు చేస్తున్నా జరుగుతున్నదేమీ లేదు. గాజాలో జరుపుతున్న దాడులను మానవతా పూర్వకంగా నిలిపివేయాలని సాధారణ అసెంబ్లీలో 121 దేశాలు అనుకూలంగా, 14 వ్యతిరేకంగా ఓటు చేయగా మనతో సహా 44 దేశాలు ఓటింగ్‌కు దూరంగా ఉన్నాయి.భద్రతా మండలిలో ప్రవేశ పెట్టిన నాలుగు తీర్మానాలను అమెరికా వీటో చేసింది. ఇజ్రాయెల్‌కు ఆత్మరక్షణ దాడులు చేసే హక్కుందని అమెరికా తెచ్చిన తీర్మానాన్ని రష్యా, చైనా అడ్డుకున్నాయి.


మొదటి ప్రపంచ యుద్దం ముగిసిన తరువాత ఏర్పడిన నానాజాతి సమితిలో భద్రతా మండలి మాదిరి వ్యవస్థలో ఉన్న 15 సభ్యదేశాలకూ వీటో హక్కు ఉండటంతో ఏ ఒక్క సమస్యనూ పరిష్కరించలేక అది ఘోరంగా విఫలం కావటమే కాదు, రెండవ ప్రపంచ యుద్ధాన్ని కూడా అడ్డుకోలేకపోయింది.రెండవ ప్రపంచ యుద్ధం ముగిసిన తరువాత విజేతలుగా ఉన్న దేశాల ప్రమేయంతో ఏర్పడిందే ఐరాస. 1945లో అది ఉనికిలోకి వచ్చినపుడు అమెరికా, సోవియట్‌యూనియన్‌,చైనా, బ్రిటన్‌, ఫ్రాన్సులకు వీటో హక్కు కల్పించారు. తొలి రోజుల్లో ఐరాస సాధారణ అసెంబ్లీ, భద్రతా మండలిలో అమెరికా, పశ్చిమ దేశాల అనుకూలురే ఎక్కువ.దాంతో వారికి అనుకూలమైన తీర్మానాలను సోవియట్‌ అడ్డుకుంది. 2022 మే నెల వరకు సోవియట్‌ , తరువాత దాని వారసురాలిగా ఉన్న రష్యా 121సార్లు, అమెరికా 83, బ్రిటన్‌ 29, చైనా 17, ఫ్రాన్సు 16సార్లు వీటోను ప్రయోగించాయి. వీటో హక్కు ప్రజాస్వామ్య బద్దం కాదన్నది నిజమే అయినప్పటికీ అది లేకపోతే తొలి రోజుల్లో తమ కూటమికి ఉన్న బలంతో మొత్తం ప్రపంచాన్ని అమెరికా తనపెత్తనం కిందకు తెచ్చుకొని ఉండేది. ఇప్పుడు మెజారిటీ దేశాలు దాన్ని వ్యతిరేకిస్తున్నందున ప్రజాస్వామిక అభిప్రాయాన్ని అడ్డుకొనేందుకు వీటోను ఆయుధంగా చేసుకుంటోంది. అందుకే పైకి ఏమి చెప్పినప్పటికీ ఆచరణలో ఐరాస సంస్కరణలకూ అది ససేమిరా అంటున్నది.

ఇజ్రాయెల్‌ మారణకాండలో ఎక్కువగా పిల్లలు, మహిళలే బలి ! ఏకపక్ష దాడి తప్ప పోరు అబద్దం !!

Tags

, , , , , ,


ఎం కోటేశ్వరరావు


గాజా ప్రాంతంలో అమాయక పౌరులపై కొనసాగుతున్న ఇజ్రాయెల్‌ మారణకాండ. నెతన్యాహును ఎవరూ నమ్మటం లేదు, ఇజ్రాయెల్‌ యుద్ధ మంత్రివర్గంలో విబేధాలు.వివాద విస్తరణకు సిరియాపై అమెరికా దాడులు. లెబనాన్‌ సరిహద్దులో హిజబుల్లా – ఇజ్రాయెల్‌ మిలటరీ పరస్పరదాడులు, దాడులను ఆపేది లేదన్న యూదు దురహంకారులు. ఈ వార్తల తీరు తెన్నులు చూసినపుడు మధ్య ప్రాచ్యంలో మంటలు రేపేందుకు పశ్చిమ దేశాలు పూనుకున్నాయా అన్న సందేహాలు తలెత్తుతున్నాయి. గాజాలో భీకర పోరు జరుగుతున్నట్లు కొన్ని పత్రికల్లో తప్పుడు వార్తలను ప్రచురిస్తున్నారు. అక్టోబరు ఏడు నుంచి నవంబరు ఒకటి ఉదయం వరకు వచ్చిన వార్తల ప్రకారం గాజాలో 8,525 మంది మరణించారు. వారిలో 3,542 మంది పిల్లలు, 2,187 మంది మహిళలు. వీరుగాక పశ్చిమ గట్టు ప్రాంతంలో మరో 120 మందిని ఇజ్రాయెల్‌ మూకలు బలితీసుకున్నాయి. గాజాలో ఇంతవరకు తొమ్మిది మంది తమ సైనికులు మరణించినట్లు ఇజ్రాయెల్‌ చెప్పటం తప్ప నిర్దిష్ట సమాచారాన్ని వెల్లడించలేదు.అక్కడ జరుగుతున్నది ఏకపక్ష మారణహౌమం తప్ప మరొకటి కాదు. రోజుకు మరణిస్తున్న లేదా గాయపడుతున్న పిల్లల సంఖ్య రోజుకు 420గా ఉంది. గడచిన నాలుగు సంవత్సరాల్లో 24 దేశాల్లో జరిగిన దాడులు, ఘర్షణల్లో ఏ ఒక్క సంవత్సరంలో కూడా ఇంత మంది పిల్లలు చనిపోలేదు. పిల్లల్ని రక్షించండి(సేవ్‌ చిల్డ్రన్‌) అనే సంస్థ ఆదివారం నాడు వెల్లడించిన సమాచారం ప్రకారం 2020లో ఇరవై రెండు దేశాల్లో 2,674 మంది,ఇరవైనాలుగు దేశాల్లో 2021లో 2,515 మంది, 2022లో 2,985 మంది మరణించారు. ఈ ఏడాది కేవలం అక్టోబరు ఏడు నుంచి 31వ తేదీ వరకు ఒక్క గాజాలో 3,542, పశ్చిమగట్టులో 36 మంది మరణించారు. తాము చంపుతున్నది హమస్‌ తీవ్రవాదులను అని చెబుతున్న ఇజ్రాయెల్‌ ప్రకటనలను నిస్సిగ్గుగా సమర్ధిస్తున్న అపర మానవతావాదులు ఈ వివరాల గురించి ఏమంటారో !


ఇజ్రాయెల్‌ పాలక యంత్రాంగంలో ఉన్న విబేధాలు, కుమ్ములాటలు బయటికి వచ్చాయి. అక్టోబరు ఏడవ తేదీన జరిగిన హమస్‌దాడి గురించి తనకు ముందుగా ఎవరూ ఎలాంటి సమాచారం అందించలేదని ఆదివారం తెల్లవారు ఝామున ప్రధాని నెతన్యాహు ఒక ట్వీట్‌లో పేర్కొన్నాడు. హమస్‌ భయపడిందని, ఒక పరిష్కారానికి సిద్దంగా ఉందనే విశ్లేషణను మిలిటరీ, గూఢచార అధిపతులు అందించారని ఆరోపించాడు. దాంతో తీవ్ర ఆగ్రహం, ఆందోళన వెల్లడి కావటంతో వెంటనే తన ట్వీట్‌ను వెనక్కు తీసుకోవటమేగాక తాను ఉపయోగించిన పదజాలం తప్పని క్షమించాలని కోరాడు. పాలకుల్లో ఉన్న విబేధాలకు ఇది నిదర్శనమని విశ్లేషకులు పేర్కొన్నారు. మిలిటరీ ఎంతో కష్టమైన దాడులను కొనసాగిస్తున్నపుడు ప్రధానిగా ఉన్న వ్యక్తి ఇలా మాట్లాడటం ఏమిటని ప్రశ్నించారు. దేశ భద్రత, బందీలుగా ఉన్నవారి గురించి గాక కేవలం రాజకీయాలు చేస్తున్నాడని ధ్వజమెత్తారు. నెతన్యాహు తొలుత 1996లో అధికారానికి వచ్చాడు, మధ్యలో విరామం వచ్చింది, ఇప్పటివరకు మొత్తం పదమూడు సంవత్సరాలు పదవిలో ఉన్నాడు.


ఇజ్రాయెల్‌ ఇరుగుపొరుగున ఉన్న దేశాలను కూడా యుద్ధంలోకి లాగేందుకు అమెరికా పూనుకుంది. అంతా చేస్తున్నది ఇరాన్‌ అంటూ రెచ్చగొడుతున్నది. వివిధ దేశాల్లో ఉన్న సాయుధ సంస్థలకు వెన్నుదన్నుగా ఉన్నట్లు ప్రచారం చేస్తున్నది. సిరియాలోని అలెప్పో నగర పరిసరాల శరణార్ధి శిబిరాల్లో ఇరాన్‌ మద్దతుదారులైన సాయుధులు ఇరాక్‌, సిరియాల్లోని తమ స్థావరాల మీద దాడులు చేశారని, తాము ఆత్మరక్షణ ప్రతిదాడులు చేసినట్లు అమెరికా అమెరికా రక్షణ మంత్రి లాయడ్‌ ఆస్టిన్‌ ప్రకటించాడు. గత కొద్ది రోజుల్లో పదమూడు సార్లు దాడులు జరిగినట్లు ఆరోపించాడు. ఈ ప్రాంతంలో పరిస్ధితులు దిగజారాలని తాము కోరుకోవటం లేదని తెర వెనుక నుంచి ఇరాన్‌ దాడులు చేయిస్తున్నట్లు ఆరోపించాడు. తమ మీద దాడి చేస్తే తాము వారిని వదలబోమన్నాడు. గాజాలో హమస్‌, లెబనాన్‌లో హిజబుల్లా, ఎమెన్‌లో హౌతీలు, ఇరాక్‌, సిరియాల్లోని వివిధ సాయుధ బృందాలకు ఇరాన్‌ ఆయుధాలు, నిధులు అందుతున్నాయన్నాడు. మరోవైపున లెబనాన్‌లో ఉన్న హిజబుల్లా సాయుధ బృందాలపై అక్టోబరు ఏడు నుంచి ఇజ్రాయెల్‌ రెచ్చగొట్టే దాడులు జరుపుతోంది. ఇంతవరకు హిజబుల్లా రంగంలోకి దిగలేదు. రెచ్చగొట్టే సాయుధ కవ్వింపులతో పాటు మీడియా ద్వారా పెద్ద ఎత్తున తప్పుడు ప్రచారదాడి ముఖ్యంగా ఇరాన్‌పై సాగిస్తున్నారు.


గతంలో 1890దశకంలో అమెరికాలో న్యూయార్క్‌ వరల్డ్‌, న్యూయార్క్‌ జర్నల్‌ అనే రెండు పత్రికల మధ్య పోటీ తలెత్తి సంచలనాత్మక, వక్రీకరణ, కుహనా వార్తలను పెద్దక్షరాలతో ప్రచురించి పాఠకులను పెంచుకొనేందుకు చూశాయి.దీన్ని ఎల్లో జర్నలిజం అని పిలిచారు. ఆ క్రమంలోనే స్పెయిన్‌ ఆధీనంలో ఉన్న వలసలను ఆక్రమించేందుకు అమెరికా ప్రభుత్వం వాటికి మద్దతు కూడా ఇచ్చింది. స్పానిష్‌-అమెరికా యుద్ధానికి మద్దతుగా మైనే అనే అమెరికా నౌకను స్పెయిన్‌ ముంచివేసిందనే తప్పుడు వార్తను న్యూయార్క్‌ జర్నల్‌ ప్రచురించింది. ఆ పోరులో గెలిచిన అమెరికన్లు క్యూబా, ఫిలిప్పీన్లను తమ స్వాధీనంలోకి తెచ్చుకున్నారు. నాటి నుంచి నేటి వరకు సామ్రాజ్యవాదులు జరిపే దాడులకు జనాన్ని తప్పుదారి పట్టించేందుకు అలాంటి తప్పుడు వార్తలను మీడియాలో ప్రవేశపెడుతూనే ఉన్నారు. హమస్‌, ఇరాన్‌, చైనా, రష్యా ఇలా సంస్థలు, దేశాల మీద ఎన్నో కట్టుకథలను రాయిస్తున్నారు. అనేక వారాల ముందే ఇజ్రాయెల్‌ మీద అక్టోబరు ఏడున జరిగిన దాడి కుట్రకు ఇరాన్‌ సాయం చేసిందని వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌ మరుసటి రోజే కథ అల్లింది. తరువాత రోజు మరో పిట్టకత చెప్పింది. ఇరాన్‌-సౌదీ అరేబియా మధ్య సయోధ్య కుదిర్చేందుకు చైనా ప్రయత్నిస్తున్నపుడే ఏప్రిల్‌ నుంచి హమస్‌ తదితర సంస్థలకు ఇరాన్‌ శిక్షణ ఇవ్వటం ప్రారంభించిందని కూడా రాశారు. ఆ ముక్క ఇజ్రాయెల్‌కు లేదా అమెరికా పాలకులకు సదరు పత్రిక ఎందుకువెల్లడించలేదు ? ఇరాన్‌ మీద చమురు ఆంక్షలను అమలు జరపటంలో బైడెన్‌ విఫలమైన కారణంగా వచ్చిన చమురు సొమ్ముతో హమస్‌ సంస్థకు ఇరాన్‌ సాయం చేసిందని కూడా కధ అల్లింది. మరోవైపు అమెరికా మంత్రి ఆంటోని బ్లింకెన్‌ ఇరాన్‌ పాత్ర గురించి ఆధారాలు లేవు అని చెబుతాడు. ఇజ్రాయెల్‌ వేగులు కూడా దాన్ని పసిగట్టలేదని ఒక వైపు వారు నెత్తీనోరు కొట్టుకుంటుండగా కొద్ది వారాల ముందే కుట్ర జరిగిందని సదరు పత్రిక రాసింది. ఇలాంటి అమెరికా కట్టుకథల ఉదాహరణలను అనేకం చెప్పవచ్చు. న్యూయార్క్‌టైమ్స్‌ పత్రిక విలేకరి ఒకడు 2002లో ఇరాక్‌ తన అణ్వాయుధ కార్యక్రమాలకు అవసరమైన అల్యూమినియం గొట్టాలను సేకరించేందుకు పూనుకుందని రాశాడు. బాంబులు తయారు చేయగలిగిన వారు గొట్టాలను రూపొందించలేరా ? పాలస్తీనా ఏర్పాటుకు కేటాయించిన ప్రాంతాలను ఇజ్రాయెల్‌ దురాక్రమించటం గతం, తాజా పరిణామాలకు కారణం అన్నది తెలిసిందే. వారి ప్రాంతాల నుంచి వైదొలిగితే ఎవరి బతుకు వారు బతుకుతారు.దాన్ని దాచి పెట్టి అమెరికా ఒక వాణిజ్య మార్గాన్ని ఏర్పాటు చేయదలచిందని, దానికి ఈజిప్టులోని సూయజ్‌ కాలువ, ఇరాన్‌-ఎమెన్‌లను కలిపే హార్ముజ్‌ జలసంధి, ఎమెన్‌-జిబౌటీ మధ్య ఉన్న ఎర్ర సముద్రం-అరేబియా సముద్రాన్ని కలిపే బాబ్‌ అల్‌ మండే జలసంధులు కీలకమని, ఈ వాణిజ్య మార్గాన్ని అడ్డుకొనేందుకు హమస్‌ దాడులు చేసినట్లు కథలను వ్యాపింపచేశారు.


మధ్యప్రాచ్యంలో ప్రాంతీయ యుద్ధం చెలరేగితే తమకు ఇబ్బడి ముబ్బడిగా లాభాలు వస్తాయని అమెరికా ఆయుధ వ్యాపారులు, ఉత్పత్తిదారులు కోరుకుంటున్న సంగతి తెలిసిందే. అదే జరిగితే పరిస్థితి ఎలా ఉంటుందనే చర్చ ఇప్పుడు మొదలైంది.పొరుగున ఉన్న ఈజిప్టు, సిరియా, లెబనాన్‌, జోర్డాన్‌, ఆ ప్రాంత దేశాలైన ఇరాన్‌, కతార్‌ తదితర దేశాల పాత్ర ఉండే అవకాశం ఉంది. ప్రస్తుత ఈజిప్టు అధ్యక్షుడు అబ్దుల్‌ ఫతా ఎల్‌ సిశి 2013 నుంచి అధికారంలో ఉన్నాడు. అంతకు ముందు ముస్లిం బ్రదర్‌హుడ్‌ అధికారంలో ఉంది. హమస్‌సంస్థకు చెందిన వారు దాని నుంచి విడగొట్టుకున్నవారే. తాజా పరిణామాలతో జనంలో ఇజ్రాయెల్‌ మీద ఉన్న వ్యతిరేకత, పాలస్తీనియన్లకు మద్దతు కారణంగా అనేక ఆంక్షల మధ్య పరిమితంగా కైరో, ఇతర చోట్ల నిరసన ప్రదర్శనలకు ఎల్‌ సిశి ప్రభుత్వం అవకాశం కల్పించింది తప్ప ఇష్టం ఉండి కాదు. స్వేచ్చగా అనుమతిస్తే ఆ ప్రదర్శనల పేరుతో ప్రతిపక్షం తనకు వ్యతిరేకంగా జనాన్ని సమీకరించే అవకాశం ఉందనే భయం కూడా ఉంది. అందువలన ప్రాంతీయ యుద్ధం వస్తే ఈజిప్టు పాల్గొనే అవకాశాలు లేవన్నది కొందరి భావన. గాజా నుంచి నిర్వాసితులు వస్తే తనకు సమస్యలు వస్తాయని కూడా భయపడుతున్నాడు.అందుకే గాజాతో ఉన్న సరిహద్దు తెరిచేందుకు సిద్దంగా లేడు.


లెబనాన్‌ ఎదుర్కొంటున్న ఆర్థిక సమస్యల కారణంగా జనంలో అసంతృప్తి ఉంది. ఈ దశలో ఇజ్రాయెల్‌తో యుద్దాన్ని అది కోరుకోవటం లేదు. అక్కడ ఉన్న షియా ముస్లిం సామాజిక తరగతికి చెందిన హిజబుల్లా మిలిటెంట్‌ సంస్థ సరిహద్దులో ఇజ్రాయెల్‌తో ఇప్పటికే అడపాతడపా పోరాడుతోంది. యుద్ధం జరిగితే 2006 నుంచి రెండు దేశాల మధ్య నెలకొన్న శాంతి దెబ్బ తింటుంది. దానికి తోడు క్రైస్తవ-ఇస్లామిక్‌ వర్గాల మధ్య గతంలో జరిగిన మాదిరి అంతర్యుద్ధం పునరావృతమైనా ఆశ్చర్యం లేదు. అయితే హిజబుల్లా సంస్థ లెబనాన్‌ ప్రభుత్వంలో పాతుకుపోయింది. లక్ష మంది సాయుధులున్న దాన్ని విస్మరించటం ప్రభుత్వానికి సాధ్యం కాదు. అక్కడి మిలిటరీ కంటే ఇదే శక్తివంతమైనది, అందువలన ప్రభుత్వం కూడా దాన్ని అనుసరించటం మినహా మరొక మార్గం లేదు. ఈ సంస్థకు ఇరాన్‌ నుంచి సాయం అందుతోంది. అందువలన ఇరాన్‌ అనుమతి మీదనే హిబబుల్‌ నిర్ణయం ఉంటుందని చెబుతున్నారు. ఇజ్రాయెల్‌తో ఉన్న సరిహద్దులోని అనేక గ్రామాల్లో ఉన్న జనాన్ని ఇప్పటికే సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఇటీవలి వారాల్లో జరిగిన చిన్న చిన్న ఘర్షణల్లో తమ మిలిటెంట్లు 50 మంది మరణించినట్లు హిజబుల్లా ప్రకటించింది. గాజాలో భారీ ఎత్తున హత్యాకాండ కొనసాగితే హిజబుల్‌ జోక్యానికి మద్దతు ఇస్తామని జనం చెబుతున్నట్లు వార్తలు వచ్చాయి. లెబనాన్‌లో కూడా పాలస్తీనియన్ల హమస్‌, ఇతర సాయుధ బృందాలు ఉన్నాయి.వారు లెబనాన్‌ ప్రాంతం నుంచి కొన్ని రాకెట్లను ఇజ్రాయెల్‌ మీద ప్రయోగించారు. సిరియాలో 2011 నుంచి అంతర్యుద్ధం జరుగుతోంది. అధ్యక్షుడు బషెర్‌ అల్‌ అసాద్‌కు ఇరాన్‌, రష్యా మిలిటరీ మద్దతు ఉంది. ఆ కారణంగానే ,ఇజ్రాయెల్‌ అమెరికా, ఇతర పశ్చిమ దేశాలూ కిరాయి మూకలు, ఉగ్రవాద సంస్థలకు ఎంతగా సాయపడినా అది నిలదొక్కుకుంటున్నది. అక్టోబరు ఏడు తరువాత రాజధాని డమాస్కస్‌, అలెప్పో నగరాలపై ఇజ్రాయెల్‌, అమెరికా జరిపిన దాడుల్లో ఎనిమిది మంది సిరియా సైనికులు మరణించారు. ఇక్కడ కూడా ఇరాన్‌ మద్దతు ఉన్న సాయుధశక్తి ఉంది. మరోదేశం కతార్‌కు ముస్లిం బ్రదర్‌హుడ్‌ సంస్థతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. హమస్‌ రాజకీయ కార్యాలయం కతార్‌లోని దోహాలో ఉంది. ఆర్థికంగా కూడా పెద్ద ఎత్తున తోడ్పడుతోంది. ఇటీవల హమస్‌ వద్ద ఉన్న బందీలలో నలుగురిని విడిపించటంలో కతార్‌ కీలక పాత్ర పోషించింది.ఈ ప్రాంతంలో తన పలుకుబడిని పెంచుకోవాలని చూస్తున్న కతార్‌కు ఇజ్రాయెల్‌తో దౌత్య సంబంధాలు లేవు, ఎలాంటి పాత్ర పోషించేది ఇంకా స్పష్టం కాలేదు. మొత్తం మీద చూసినపుడు ఇరాన్‌ కీలకంగా ఉన్నందున దాన్ని కవ్వించేందుకు అమెరికా పూనుకుంది.ఏం జరిగేదీ ఎవరూ ఊహించలేకపోతున్నారు.

అమెరికాకు భారత కోళ్ల రైతుల బలి: మన్మోహన్‌ సింగ్‌ అడ్డుకుంటే నరేంద్రమోడీ అప్పగించారు !

Tags

, , , , , , ,


ఎం కోటేశ్వరరావు


ఉల్లి తల్లి వంటిది అని చెబుతారు. చాలా మంది హరిదాసు-ఉల్లి కథ వినే ఉంటారు.జనానికి చెప్పే కథల సందర్భంగా ఒక హరిదాసు ఉల్లిపాయలు తినొద్దు అని హితవు చెప్పాడు. ఆ శ్రోతల్లో ఒకరిగా ఉన్న భార్య మరుసటి రోజు ఉల్లిపాయ లేకుండా కూరలు వండింది. కోపంతో చిర్రెత్తిన దాసు ఎందుకు వేయలేదు అని అరిచాడు. రాత్రి మీరే కదా తినొద్దని చెప్పారు అని నసిగింది . ఊరందరినీ తినొద్దని చెప్పాను తప్ప నీకు చెప్పానా అంటూ చిందులు వేయటంతో ఆ ఇల్లాలు నివ్వెరపోయింది. ఎందుకు ఈ కథను చెప్పాల్సి వచ్చిందంటే ఆదివారం నాడు మన ప్రధాని నరేంద్రమోడీ 106వ మన్‌కీ బాత్‌ సుభాషితాల్లో స్థానిక వస్తువులనే కొనండి అని మరోసారి పునరుద్ఘాటించారు. ఆ మాటలు విన్నతరువాత ఇతరులకు నీతులు చెప్పే హరిదాసు గుర్తుకు వచ్చారు. ప్రపంచంలో కోడి మాంసం ఎక్కువగా ఉత్పత్తి చేసే దేశాల్లో ఎఫ్‌ఏఓ సంస్థ 2021 వివరాల ప్రకారం భారత్‌ ఆరవ స్థానంలో ఉంది. అమెరికా 2,06,52,971 టన్నులతో మొదటి స్థానంలో, చైనా 1,47,00,000, బ్రెజిల్‌ 1,46,36,478, రష్యా 46,17,338, ఇండోనేషియా 38,44,346,భారత్‌ 36,70,156 టన్నులతో, తొలి పది స్థానాల్లో మన తరువాత మెక్సికో, జపాన్‌, అర్జెంటీనా,టర్కీ ఉన్నాయి.చైనా, మనదేశం జనాభాలో ఒకే విధంగా ఉన్నప్పటికీ జనాభా కొనుగోలు శక్తి ఎక్కువ గనుక చైనా ఇంకా దిగుమతి చేసుకుంటోంది.మన దగ్గర ఉత్పత్తి అవుతున్న కోడి మాంసం, గుడ్లనే పూర్తిగా వినియోగించలేని స్థితిలో ఇతర దేశాలకు ఎగుమతి చేస్తున్నాం.2014-2019 సంవత్సరాల్లో తలసరి సగటు కోడి మాంస వినియోగం చైనాలో 12.1 నుంచి 14.9 కిలోలకు పెరగ్గా మన దేశంలో 2.49 నుంచి 3.17 కిలోలకు పెరిగింది.పాకిస్తాన్‌లో 5.11 నుంచి 6.8 కిలోలకు పెరిగింది. ప్రపంచంలో 2021లో బహామాస్‌ 70.2 కిలోలతో ప్రధమ స్థానంలో ఉంది.


తాజాగా నరేంద్రమోడీ సర్కార్‌ అమెరికాతో కుదుర్చుకున్న ఒప్పందాలలో భాగంగా అక్కడ తినటానికి తిరస్కరించే కోడి కాళ్లను మన దేశం దిగుమతి చేసుకొనేందుకు, భారీగా పన్ను తగ్గించేందుకు అంగీకరించింది. అమెరికా మోజులో ఉన్న నరేంద్రమోడీకి అక్కడి కోడి కాళ్లు, ఉత్పత్తిదారులు, వారి లాభాలు తప్ప భారతీయ కోడి మాంసం, దాని ఉత్పత్తి, మార్కెటింగ్‌లో భాగస్వాములయే లక్షల మంది రైతులు, కార్మికులు, చిన్న వ్యాపారులు గుర్తుకు రాలేదు. నిత్యం పారాయణం చేసే దేశభక్తి, స్వప్రయోజనాలను తుంగలో తొక్కారా లేక విశ్వగురువుగా నీరాజనాలందుకొనేందుకు అమెరికాకు దాసోహం అన్నారా ? ఏడు సంవత్సరాల క్రితం మన కోళ్ల పరిశ్రమ మార్కెట్‌ విలువ యాభైవేల కోట్లు, 2022లో రు.1,90,530 కోట్లకు పెరిగింది, 2028 నాటికి రు.3,40,780 కోట్లకు చేరుతుందని అంచనా. లక్షలాది మంది ఉపాధి పొందుతున్నారు. ఇలాంటి పరిశ్రమకు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పెద్ద దెబ్బ అని భావిస్తున్నారు. అమెరికా నుంచి దిగుమతి చేసుకొనే కోడి మాంసం, ఇతర కొన్ని దిగుమతుల మీద భారీగా పన్నుల తగ్గింపును అడ్డుకొనేందుకు కొందరు సుప్రీం కోర్టుకు వెళ్లనున్నట్లు ప్రకటించారు. కోర్టులో ఎవరు ఏం వాదిస్తారో చెప్పలేము, ప్రభుత్వ విధాన నిర్ణయాలను సాధారణంగా కోర్టులు సమర్ధిస్తాయి. అమెరికాలో కోడి బ్రెస్ట్‌ తప్ప కాళ్లు, లివరు తినరు, అందువలన వారికి పనికిరాని వాటిని ఇతర దేశాలకు చౌకగా ఎగుమతి చేస్తారు. అవి ఆయా దేశాల పరిశ్రమను దెబ్బతీస్తాయి గనుక అనేక దేశాలు రక్షణ చర్యలు తీసుకుంటున్నాయి. అమెరికా కోళ్లు, బాతుల మాంసంతో పాటు యాపిల్స్‌, బాదం పప్పు, కాబూలీ(పెద్ద) సెనగలు, కాయధాన్యాలు తదితర వ్యవసాయ ఉత్పత్తులపై మనదేశం భారీగా దిగుమతి పన్ను తగ్గించనుంది. దిగుమతి చేసుకొనే ఉత్పత్తులతో గతంలో పంటలు, పర్యావరణాన్ని దెబ్బతీసే కలుపు మొక్కలు, తెగుళ్ల వంటివి మన దేశానికి వచ్చాయి.1950లో పిఎల్‌ 480 పేరుతో అమెరికా అందచేసిన నాసిరకం గోధుమలతో పాటు వయ్యారి భామ, కాంగ్రెస్‌ గడ్డి అని పిలిచే పార్థీనియం అనే విషపూరితమైన కలుపు మొక్క మన దేశానికి వచ్చింది.అదే విధంగా ప్రపంచంలోని అనేక దేశాల్లో ఇది వ్యాపించింది. దీని వలన మనుషులకు చర్మ, శ్వాస సంబంధమైన రుగ్మతలు కలుగుతాయని తేలింది.


2022లో అమెరికాలో బర్డ్‌ ఫ్లూ అనే వ్యాధితో కోట్లాది కోళ్లు మరణించాయి. వాటితో పాటు ఆ వ్యాధి మనుషులకూ వ్యాపిస్తుంది. అలాంటి అవకాశం ఉన్న చోట నుంచి కోడి, బాతు మాంస ఉత్పత్తులను దిగుమతికి నరేంద్రమోడీ సర్కార్‌ తలుపులు బార్లా తెరిచి జనాల ఆరోగ్యానికి కూడా హాని తలపెట్టినట్లు అనేక మంది భావిస్తున్నారు. రెండవది అమెరికాలో కోళ్ల దాణా పశు, పంది మాంసం, ఎముకల నుంచి తయారు చేస్తారు. అలాంటి వాటితో పెంచిన కోళ్ల మాసం తినేందుకు అనేక మంది మనోభావాలు అంగీకరించవు. మోడీ సర్కార్‌ వాటిని పట్టించుకోలేదు.ఈ దాణాతో పెంచిన కోళ్ల, బాతుల మాంసం అని వాటి ఉత్పత్తుల మీద ప్రకటిస్తారో లేదో తెలియదు. ఒక వేళ ప్రకటించినప్పటికీ వినియోగదారులకు అలా ముద్రించిన పాకెట్లలో సరఫరా చేస్తే అదొక దారి. హౌటళ్లలో వాటిని వడ్డిస్తే వినియోగదారులు కనుక్కోలేరు.దేశ కోళ్ల పరిశ్రమ రైతులకు హానికలిగించే ఈ ఏకపక్ష నిర్ణయాన్ని సవాలు చేస్తూ సుప్రీం కోర్టుకు వెళ్లనున్నట్లు భారత కోళ్ల పరిశ్రమ ఫెడరేషన్‌ అధ్యక్షుడు రాణ్‌పాల్‌ ధండా చెప్పారు. కేంద్ర ప్రభుత్వం అమెరికన్‌ కంపెనీల లాభాలను కాదు, దేశంలోని రైతుల ప్రయోజనాలను చూడాలని అన్నారు.ఈ నిర్ణయంతో అమెరికా ఉత్పత్తిదారులకు మరిన్ని అవకాశాలు పెరుగుతాయని, ఉత్పత్తులు మరింతగా భారత్‌లో అందుబాటులోకి వస్తాయని అమెరికా వాణిజ్య ప్రతినిధి కాథరీన్‌ తారు ప్రకటించారు.బాదం పప్పు, సెనగలు, కాయధాన్యాలు, యాపిల్స్‌ దిగుమతుల మీద పన్ను పెంచాల్సిందిపోయి తగ్గించటం నరేంద్రమోడీ సర్కార్‌ రైతుల ప్రయోజనాలను దెబ్బతీయటమే అని, ఈ ఉత్పత్తులపై అమెరికా ఇచ్చే ఎగువుతి సబ్సిడీలకు వ్యతిరేకంగా ప్రపంచ వాణిజ్య సంస్థలో మనదేశంతో కలసి పోరాడిన దేశాలను కేంద్ర ప్రభుత్వం మోసం చేయటం తప్ప మరొకటి కాదని రాష్ట్రీయ కిసాన్‌ మహాసంఫ్‌ు జాతీయ సమన్వయకర్త కెవి బిజు అన్నారు.ఈ నిర్ణయం వలన కాశ్మీర్‌, హిమచల్‌ ప్రదేశ్‌, మధ్య ప్రదేశ్‌ రైతుల ప్రయోజనాలు దెబ్బతింటాయన్నారు. అమెరికా, ప్రపంచబాంకు వత్తిడికి లొంగి ఇలాంటి నిర్ణయాలు తీసుకొనేందుకు తీసుకు వచ్చిన మూడు సాగు చట్టాలకు వ్యతిరేకంగా పోరాడి వాటిని తిప్పి కొట్టేందుకు రైతాంగాన్ని కదిలించిస సంయుక్త కిసాన్‌ మోర్చా, ఇండియా కూటమి కూడా కేంద్ర నిర్ణయాన్ని ప్రశ్నించింది. భారత్‌లో టర్కీ కోడి మాంసంపై ప్రస్తుతం ఉన్న 30శాతం దిగుమతి పన్నును ఐదు శాతానికి తగ్గిస్తారని అమెరికా పార్లమెంటు సభ్యురాలు అమీ క్లోబుచర్‌ ప్రకటించారు.


తమ కోళ్ల ఉత్పత్తులను మనదేశంలో కుమ్మరించేందుకు అమెరికా చాలా కాలం నుంచి చూస్తోంది. బెదిరింపు, వత్తిడి వంటి అనేక రూపాల్లో అది ప్రయత్నించి చివరికి అనుకున్నది సాధించింది.2007లో మన్మోహన్‌ సింగ్‌ ప్రధానిగా ఉన్న నాటి యుపిఏ ప్రభుత్వం అమెరికా కోళ్ల ఉత్పత్తులపై నిషేధం విధించింది. అది చెల్లదంటూ అమెరికా ప్రపంచ వాణిజ్య సంస్థలో కేసు దాఖలు చేసింది.అమెరికా తన కోళ్ల ఉత్పత్తుల్లో 15 నుంచి 20శాతం వరకు ఎగుమతులు చేస్తున్నది.2014లో అమెరికా కేసు గెలిచింది. అధికారానికి వచ్చిన కొత్త రోజులు గనుక మోడీ సర్కార్‌ ఆ తీర్పును అమలు చేసేందుకు భయపడింది.ప్రపంచ వాణిజ్య సంస్థ ద్వారా భారత్‌ మీద ఆంక్షలను విధింపచేయిస్తామని అమెరికా బెదిరించటంతో కేంద్ర ప్రభుత్వం చికెన్‌లెగ్స్‌ దిగుమతులకు అనుమతిస్తున్నట్లు 2017లో తెలిపింది. నిజానికి మన దేశంలో ఉత్పత్తి అవుతున్న చికెన్‌ మాంసం, గుడ్లు అవసరాలకు మించి ఉండటంతో 2016-17లోనే రు.532 కోట్ల మేరకు వివిధ దేశాలకు ఎగుమతి చేశాము. నరేంద్రమోడీ రెండవ సారి విజయం సాధించిన తరువాత నాటి అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ ఒకవైపు మోడీని పొగడ్తలు, ఆలింగనాలతో ముంచెత్తుతూనే మరోవైపు మరింత వత్తిడి పెంచాడు. అప్పటి వరకు మన దేశం నుంచి అమెరికాకు ఎగుమతి చేస్తున్న వస్తువుల మీద జిపిఎస్‌ పేరుతో 600 కోట్ల డాలర్ల మేర ఇస్తున్న దిగుమతిపన్ను రాయితీలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించాడు.దానికి ప్రతిగా మన దేశం కూడా అమెరికా నుంచి దిగుమతి చేసుకుంటున్న యాపిల్స్‌ వంటి 28రకాల వస్తువులపై దిగుమతి పన్ను పెంచింది. మన మార్కెట్‌ను మరింతగా తెరవాలని డిమాండ్‌ చేస్తున్న అమెరికా ఇంతవరకు జిపిఎస్‌ను పునరుద్దరించలేదు.ట్రంప్‌ పోయి బైడెన్‌ వచ్చినా జరిగిందేమీ లేదు గానీ మనదేశం మాత్రం అమెరికా వస్తువుల మీద విధించిన పన్నులను మోడీ సర్కార్‌ తాజాగా తగ్గించింది. అమెరికా-చైనా వాణిజ్యపోరుతో మన దేశం లబ్దిపొందవచ్చని కొందరు ఆశించారు.అది కార్యరూపందాల్చలేదు. తొలి రోజుల్లో అమెరికా మీద మోడీ సర్కార్‌ చూపిన పరిమిత ప్రతిఘటన తరువాత నీరుగారింది. ఇప్పుడు పూర్తిగా లొంగిపోయింది. నిజానికి నరేంద్రమోడీ జూన్‌ నెలలో అమెరికా వెళ్లినపుడే పన్నుల తగ్గింపు నిర్ణయం తీసుకున్నారు, సెప్టెంబరులో వెల్లడించారు.


కోళ్ల పరిశ్రమలో మార్కెట్‌ను మరింత తెరిచారు. రైతాంగ స్పందన చూసిన తరువాత అమెరికా, ఐరోపా, ఇతర దేశాల నుంచి పాల ఉత్పత్తులను అనుమతించి పాడి పరిశ్రమకూ మంగళం పాడేందుకు చూస్తున్నారు. అన్నీ ఒకేసారి చేస్తే ప్రతిఘటన తీవ్రంగా ఉంటుంది గనుక దశలవారీ నిర్ణయాలు తీసుకుంటారు. మన దేశంలో పాల పదార్ధాల ధరల్లో సగానికి దిగుమతి చేసుకున్నవాటిని విక్రయిస్తారని గతంలోనే అనేక మంది చెప్పారు.2020లో మన దేశంలో పాలపొడి ధర కిలో రు.130 నుంచి 150వరకు ఉండగా 30శాతం దిగుమతి పన్నుతో సహా అమెరికా నుంచి రు.70కే దిగుమతి చేసుకోవచ్చని తేలింది. ఇప్పుడు కూడా ధరల్లో మార్పులు ఉండవచ్చు తప్ప విదేశాలు ఇచ్చే సబ్సిడీలు భారీ ఎత్తున ఉంటాయి.చైనాతో అమెరికా 2018లో ప్రారంభించిన వాణిజ్య యుద్ధం ఇంకా కొనసాగుతూనే ఉంది. అందువలన అమెరికన్లు తమ వస్తువులకు కొత్త మార్కెట్లకోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.
అమెరికా వత్తిడిని అడ్డుకొనేందుకు మనసుండాలేగానీ మార్గం దొరక్కపోదు.గతంలో మన్మోహన్‌ సింగ్‌ ప్రభుత్వం అమెరికాలో వ్యాపించిన బర్డ్‌ ఫ్లూను పేర్కొంటూ కోళ్ల ఉత్పత్తుల దిగుమతులను నిషేధించింది. నరేంద్రమోడీ ఆంక్షలను, దిగుమతి పన్నులను సడలిస్తున్న సమయంలో అమెరికాలోని వాణిజ్య పౌల్ట్రీ ఫారాల్లో ఫ్లూ కనిపించింది. 2022 నుంచి ఇప్పటి వరకు ఈ వ్యాధికి అక్కడ 5.88 కోట్ల కోళ్లు, టర్కీ కోళ్లు మరణించినట్లు 2023 అక్టోబరు పదవ తేదీన రాయిటర్స్‌ వార్తా సంస్థ పేర్కొన్నది. అమెరికాలో అతి పెద్ద గుడ్ల ఉత్పత్తి సంస్థ కాల్‌ మైన్‌ ఫుడ్స్‌ విక్రయించే గుడ్ల ధర గత ఏడాది కాలంలో 48శాతం పడిపోయింది. సెప్టెంబరు రెండవ తేదీనాటికి అంతకు ముందు నాలుగు నెలల్లో అమ్మకాలు 30శాతం పడిపోయినట్లు పేర్కొన్నది. బర్డ్‌ ఫ్లూ మనుషుల్లో కూడా సులభంగా వ్యాప్తి చెందవచ్చని ప్రపంచ ఆరోగ్య సంస్ధ, ప్రపంచ జంతు ఆరోగ్య సంస్థకూడా జూలైనెలలో హెచ్చరికలు జారీచేశాయి. 2022లో 67దేశాల్లో వ్యాధికారణంగా 13 కోట్ల కోళ్లను వధించటం లేదా మరణించినట్లు లెక్కలు ఉన్నాయి. ఈ ఏడాది ఇప్పటి వరకు మరో 14దేశాల్లో వ్యాధి కనిపించింది. అందువలన ఈ కారణంగా కూడా అమెరికా ఉత్పత్తులను అడ్డుకోవచ్చు.


అమెరికా నుంచి దిగుమతి చేసుకొనే వాటి మీద దిగుమతి పన్ను ఐదు నుంచి పదిశాతానికి పరిమితం చేసేందుకు కేంద్రం అంగీకరించింది. అయితే ఇది ఒక్క అమెరికాకే కాదు, ప్రపంచ వాణిజ్య సంస్థలో ఉన్న అన్ని దేశాలకూ అదే రేటు వర్తిస్తుంది. గతంలో దిగుమతి చేసుకున్న కోడి కాళ్ల మీద మన ప్రభుత్వం వందశాతం పన్ను విధించేది. తరువాత దాన్ని 35 నుంచి 45శాతానికి తగ్గించింది. వచ్చే ఆరునెలల్లో ఐదు, పదిశాతాన్ని ఏ వస్తువు మీద ఎంత అనేది నిర్దిష్టంగా నిర్ణయిస్తారు. అందుకే ఈ లోగా పన్ను తగ్గింపు నిర్ణయాన్ని సుప్రీం కోర్టులో సవాలు చేసేందుకు కొందరు పూనుకున్నారు. వందశాతం పన్ను విధించినప్పటికీ భారీ మొత్తాలు సబ్సిడి ఇస్తున్న అమెరికా నుంచి దిగుమతి చేసుకున్న చికెన్‌ లెగ్స్‌ మనదేశంలో ఉన్న ప్రస్తుతం ఉన్న ధరల కంటే తక్కువకే దొరుకుతాయని అది మన పరిశ్రమకు తీరని దెబ్బ అని సంయుక్త కిసాన్‌ మోర్చా హెచ్చరించింది.అమెరికాలో చికెన్స్‌ లెగ్స్‌ ఉత్పాదన ఖర్చు టన్నుకు 700 నుంచి 800 డాలర్లు ఉంటుందని, వందశాతం పన్ను విధిస్తే 1,500 నుంచి 1,600 డాలర్లకు దిగుమతి చేసుకోవచ్చని, మన దేశంలో టన్ను ఉత్పత్తి ఖర్చు 1,800 డాలర్లుగా ఉందని ఒక ప్రకటనలో పేర్కొన్నది. అదే ఐదు, పదిశాతం పన్ను మాత్రమే విధిస్తే ఎంత చౌకగా మన మార్కెట్‌ను ముంచెత్తుతారో ఊహించుకోవాల్సిందే.

జాడలేని భారత ఉత్పత్తి, తయారీ – చైనాతో వాణిజ్యలోటుపై కొత్త డ్రామాకు తెరతీసిన మోడీ సర్కార్‌ !

Tags

, , , , , ,


ఎం కోటేశ్వరరావు


2018 ఏప్రిల్‌ నెలలో మన ప్రధాని నరేంద్రమోడీ చైనాలోని ఊహాన్‌ నగరంలో చైనా నేత షీ జింపింగ్‌తో కలసి ఊయల ఊగేందుకు వెళ్లారు. అప్పుడు నీతి ఆయోగ్‌ ఒక పత్రాన్ని ప్రధాని బృందానికి సమర్పించింది. దానిలో ఏం చెప్పిందంటే గడచిన దశాబ్దకాలంలో చైనాతో వాణిజ్యలోటు పదమూడు రెట్లు పెరిగిందనీ, పాత స్వేచ్చావాణిజ్య ఒప్పందాలను సమీక్షించాలని, నూతన ఒప్పందాల్లో ఏదైనా ఉపేక్ష ఉంటే అది మన మార్కెట్లను దెబ్బతీస్తుందని, భారత్‌ పట్ల చైనా ఔదార్యాన్ని ప్రదర్శించాల్సిన సమయం వచ్చిందని, చైనాతో మనదేశం జాగ్రత్తగా ఉండాలని సలహా ఇచ్చింది. మంచిదే, అంతకంటే కావాల్సిందేముంది ! ఇప్పటికి ఐదున్నర సంవత్సరాలు గడిచాయి. జరిగిందేమిటి ? రెండు దేశాల మధ్య కొత్త ఒప్పందాలేమీ కుదరలేదు. ఉన్నవి రద్దు కాలేదు. 2004-05నుంచి 2013-14 మధ్య కాలంలో 148 కోట్ల డాలర్లుగా ఉన్న చైనా-భారత వాణిజ్య లోటు 3,621కోట్లకు చేరిందని, అది 2,346శాతం పెరుగుదల అని అప్పటి నుంచి తమ ఏలుబడిలో 2021-22 నాటికి 7,331 కోట్లకు అంటే కేవలం వందశాతమే పెరిగిందని రాజ్యసభకు వెల్లడించిన సమాచారంలో కేంద్ర మంత్రి పియూష్‌ గోయల్‌ సమర్ధించుకున్నారు. మరుసటి ఏడాది అంది పదివేల కోట్ల డాలర్లకు చేరింది.ఈ ఏడాది తొలి ఆరునెలల్లో 5,653 కోట్ల డాలర్లు ఉంది.చైనాతో వాణిజ్య లోటును తగ్గించేందుకు అవసరమైన సూచనలు చేసేందుకు నవంబరు ఏడవ తేదీలోపు దరఖాస్తులు చేసుకోవచ్చని నీతి ఆయోగ్‌ సంస్థ తాజాగా కన్సల్టెన్సీ సంస్థలను కోరింది. రెండు రకాల అధ్యయనాలు చేస్తారట.సిఫార్సులు చేయటం, నివేదికలను రూపొందించటం తప్ప అధికారాలు లేని ఈ కేంద్ర ప్రభుత్వ సంస్థను నరేంద్రమోడీ ప్రణాళిక సంఘాన్ని రద్దుచేసి నెలకొల్పారు.


వాస్తవానికి చైనా నుంచి విధిగా దిగుమతులు చేసుకోవాలనే ప్రత్యేక ఒప్పందమేమీ మనదేశానికి లేదు. మనకు అవసరం ఎక్కువగా ఉంది గనుక అక్కడి నుంచి తెచ్చుకుంటున్నాం, వారికి మన నుంచి పెద్దగా దిగుమతులు అవసరం లేదు గనుక లోటు పెరుగుతోంది. అందువలన వాణిజ్య లోటు తగ్గించాలన్నా పూర్తిగా లేకుండా చేయాలన్నా చైనా నుంచి దిగుమతులను నిలిపివేస్తే సరిపోతుంది. లేదా మన ఎగుమతులు పెంచాలి. గత పదేండ్లుగా ఈ రెండూ చేతగాని స్థితిలో మోడీ దేశాన్ని ఉంచారా ? ఏం చేయాలో నీతి అయోగ్‌ సంస్థకు తెలియదా ? కొన్ని కోట్లు సమర్పించుకొని సలహలను కొనుక్కోవాలా ? లడక్‌ సరిహద్దులో జరిగిన ఘర్షణ ఉదంతాల తరువాత మన దేశంలో అనేక మంది మనం చైనా నుంచి దిగుమతులను నిలిపివేస్తే అది మన కాళ్ల దగ్గరకు వస్తుందని చెప్పారు. ఇంతకాలం రికార్డు స్థాయిలో తన రికార్డులను తానే బద్దలు కొట్టుకొని నరేంద్రమోడీ సర్కార్‌ దిగుమతులకు అనుమతులు ఇచ్చింది. స్టాటిస్టా సంస్థ వివరాల ప్రకారం 2022లో మన దేశం చేస్తున్న ఎగుమతుల్లో 18.5శాతం అమెరికాకు, 6.65శాతం యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌కు, మూడవ స్థానంలో ఉన్న చైనాకు 5.04శాతం ఉన్నాయి. ఇదే కాలంలో చైనా ఎగుమతుల్లో 16.2శాతం అమెరికాకు ఆరవ స్థానంలో ఉన్న మన దేశానికి 3.29శాతమే ఉన్నాయి. అందువలన మనం దిగుమతులు, ఎగుమతులు నిలిపివేస్తే అరిటాకు మీద ముల్లు సామెత అవుతుంది. పదేండ్లుగా చెబుతున్న మేకిన్‌ ఇండియా(భారత ఉత్పత్తి), మేడిన్‌ ఇండియా(భారత తయారీ), ఆత్మనిర్భరత పిలుపుల వలన జరిగిందేమీ లేదు. 2022-23లో మన జిడిపిలో ఉత్పాదకరంగం వాటా 14.7శాతం, మోడీ ఏలుబడి పది సంవత్సరాల్లో దీనికి అటూ ఇటూగానే ఉంది తప్ప 25శాతానికి పెంచాలన్న లక్ష్యం ఎండమావిగానే ఉంది. పన్నెండు రంగాలలో దేశాన్ని ఉత్పత్తి కేంద్రంగా మార్చేందుకు సలహాలు ఇవ్వాలని నీతి అయోగ్‌ కోరుతున్నది. చైనా నుంచి దిగుమతులను తగ్గించాలని 2018లోనే నీతి అయోగ్‌ చెప్పింది కదా ! పోనీ అప్పుడే ఎందుకు అడగలేదు ? తగ్గించకపోగా ఎందుకు పెంచినట్లు ? ఇప్పుడు జనాన్ని మభ్య పెట్టేందుకు తన వైఫల్యాలను దాచిపెట్టేందుకు నీతి అయోగ్‌ పేరుతో కేంద్ర ప్రభుత్వం ఆడుతున్న ఒక నాటకం తప్ప ఇది మరొకటి కాదు. అమెరికా, జర్మనీ వంటి దేశాలు మేము చైనా మీద ఆధారపడకుండా ఉండలేంగానీ మీరు ప్రత్యామ్నాయంగా ఎదిగేందుకు ప్రోత్సహిస్తామని మనలను మునగచెట్టు ఎక్కిస్తున్నాయి.


వాటికే సాధ్యం కానిది మనకెలా కుదురుతుంది ! చైనా నుంచి దిగుమతి చేసుకొనే వస్తువులు ఎక్కడైనా దొరుకుతాయి. మరి ఎందుకు ఇతర దేశాల నుంచి తెచ్చుకోవటం లేదంటే చైనా మాదిరి తక్కువ ధరలకు మరొకదేశమేదీ ఇవ్వదు. అధిక ధరలకు ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకుంటే మన చేతి చమురు మరింత వదులుతుంది.ద్రవ్యోల్బణం, ధరలు పెరుగుతాయి. మన జనం కొనాలంటే జిఎస్‌టి పెంచుతారు, విదేశాలకు పద్నాలుగు రకాల వస్తువులను చౌకగా ఎగుమతి చేసేందుకు జనం సొమ్ము రెండు లక్షల కోట్ల రూపాయల మేర సబ్సిడీ ఇస్తున్నా ఎదుగూబొదుగూ లేదు. చైనాను పక్కకు నెట్టి ఆ స్థానాన్ని మనదేశం ఆక్రమిస్తుందని చెప్పటం పరిణితిలేనితనమని ఆర్‌బిఐ మాజీ గవర్నర్‌ రఘురామ రాజన్‌ గతంలో చెప్పాడు. ఐఎంఎఫ్‌ తాజా అంచనా ప్రకారం 2028నాటికి మన జిడిపి 5.94లక్షల కోట్ల డాలర్లకు చేరుతుందని, అదే చైనాలో 23.61లక్షల కోట్ల డాలర్లు ఉంటుంది. కానీ కొందరు అప్పటికి మన దేశం చైనాను అధిగమిస్తుందని చెబుతుంటే మరి కొందరు నిజమే కామోసనుకుంటున్నారు. ఎవరి నమ్మకం వారిది ? వినేవారుంటే చెప్పేవారికి కొదవ ఉండదు. చైనా వ్యతిరేక కళ్లద్దాలను పెట్టుకొని చూస్తే అలాగే కనిపిస్తుంది మరి ! గోల్డ్‌మాన్‌ శాచస్‌ సంస్థ అంచనా ప్రకారం 2075 నాటికి చైనా 57లక్షల కోట్ల డాలర్లతో ప్రధమ స్థానంలో 52.5లక్షల కోట్ల డాలర్లతో మనదేశం రెండవదిగా 51.5లక్షల కోట్ల డాలర్లతో అమెరికా మూడవ స్థానంలో ఉంటుందని చెప్పింది. ఇవన్నీ అంచనాలు తప్ప యాభై ఏండ్ల తరువాత రాజెవరో రెడ్డెవరో !


ప్రపంచం రక్షణాత్మక చర్యలు తీసుకుంటోందని, చైనా మీద ఇప్పటికే అమెరికా వాణిజ్యపోరు ప్రారంభించిందని, చైనా మీద అన్ని వైపుల నుంచి వత్తిడి పెరుగుతున్నందున దాన్ని అవకాశంగా మలుచుకోవాలని, మనదేశం చైనా వస్తువులకు మార్కెట్‌ను తెరవకూడదని నీతి అయోగ్‌ 2018 పత్రంలో స్పష్టంగా పేర్కొన్నది. చైనా వస్తువులను మన దేశంలో కుమ్మరించటం గాకుండా చైనా తమ దేశంలో తయారు చేస్తున్నవాటిని మన దేశంలో కూడా పెట్టుబడులు పెట్టి, మన కంపెనీలతో కలసి తయారు చేయించాలని నరేంద్రమోడీకి సలహా ఇచ్చింది. అలా చేస్తే దానికి బదులు ప్రపంచంలో ఇతర దేశాల రక్షణాత్మక చర్యలకు వ్యతిరేకంగా మనదేశ సహాయాన్ని చైనా కోరే అవకాశం ఉందని కూడా చెప్పింది. తెలివితేటలకు తక్కువేం లేదు. అదైనా చేశారా ? లడక్‌ సరిహద్దు ఉదంతం తరువాత చైనాను ఒక శత్రుదేశంగా పరిగణిస్తున్న సంగతి తెలిసిందే.పోనీ మనలను ఎగదోస్తున్న అమెరికా, ఇతర ఐరోపా దేశాలు మనకేమైనా సాయం చేస్తున్నాయా ? తమ దేశంలో ఒక సిక్కు ఉగ్రవాదిని భారత్‌ దేశమే హత్య చేయించిందన్న కెనడా ఆరోపణకు అమెరికా, ఐరోపా దేశాలు మద్దతు ప్రకటించిన సంగతి తెలిసిందే.


ప్రతి దేశం తన ప్రయోజనాలను తాను చూసుకుంటున్నది, తన పరిస్థితిని బట్టి అభివృద్ధి వ్యూహాన్ని రూపొందించుకోవాలి తప్ప చైనా దెబ్బతింటే మనకు అవకాశం వస్తుందని చెప్పేవారి మాటలు వింటే జరిగేదేమీ ఉండదని ఇప్పటికే తేలిపోయింది. ఇతర దేశాల వైఫల్యాల కారణంగా చైనా నేడు ఈ స్థితికి రాలేదు. తన స్వంత విధానాలను రూపొందించుకుంది. కరోనా నిరోధానికి అక్కడ అమలు జరిపిన కఠిన ఆంక్షలు కొంత మేరకు వృద్ధిని దెబ్బతీశాయి తప్ప అనేక మంది ఆశించినట్లు కుప్పకూలలేదు, ఇప్పుడు అలాంటి మాటలు చెప్పేవారి నోళ్లు మూతపడ్డాయి. నాలుగు సంవత్సరాల నాడు ప్రాంతీయ సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పంద(ఆర్‌సిఇపి) చర్చల నుంచి మనదేశం వైదొలిగిన తరువాత మనం సాధించిందేమీ లేదు. 2022 జనవరి నుంచి ఆ ఒప్పందం అమల్లోకి వచ్చింది. దానిలో చేరాలని తాజాగా బంగ్లాదేశ్‌, శ్రీలంక దరఖాస్తు చేసుకున్నాయి. దానిలో మనం చేరితే దిగుమతి వ్యాపారం చేసే శక్తులు లాభపడతామని భావిస్తుండగా నష్టపోతామని పారిశ్రామిక రంగం వ్యతిరేకిస్తోంది. మన దేశానికి తలుపులు తెరిచే ఉంచామని ఆ కూటమి పదే పదే చెబుతోంది.


అసలు చైనాతో మనదేశం పూర్తిగా తెగతెంపులు చేసుకోగలదా ? చైనా సంస్థలను నిరోధించగలదా ? చైనా నుంచి వస్తు దిగుమతులను నిలిపివేయవచ్చు. అదే జరిగితే ఆ దిగుమతులతో లబ్ది పొందుతున్న ఫార్మా, ఇతర రంగాల కార్పొరేట్ల నుంచి ప్రతిఘటన ఎదురవుతుంది. చైనా సభ్యురాలిగా ఉన్న ఆసియన్‌ డెవలప్‌మెంట్‌ బాంక్‌(ఎడిబి), ఏఐఐబి, ప్రపంచబాంకు వంటి ఆర్థిక సంస్థలలో మనదేశం కూడా భాగస్వామి. వాటి నుంచి రుణాలు తీసుకొని మనదేశంలో అమలు జరిపే ప్రాజెక్టులలో కాంట్రాక్టులను దక్కించుకొనేందుకు చైనా సంస్థలకు హక్కు ఉంటుంది. వాటికవి దూరంగా ఉంటే లేదా నిబంధనలను ఉల్లంఘిస్తే తప్ప నిరాకరించటానికి కుదరదు. గాల్వన్‌ ఉదంతాల తరువాత ఢిల్లీ-మీరట్‌ రాపిడ్‌ రైల్‌ మార్గంలో చైనా కంపెనీల కాంటాక్టులను రద్దు చేయాలని ఆర్‌ఎస్‌ఎస్‌ అనుబంధ స్వదేశీ జాగరణ మంచ్‌ తదితర సంస్థలు ఆందోళన చేసినప్పటికీ కుదరలేదు.ఎందుకంటే అవసరమైన నిధులను ఏడిబి నుంచి రుణాలుగా తీసుకున్నారు. చైనా కంపెనీలు పూర్తి చేసిన మార్గాన్నే ఇటీవల ప్రధాని నరేంద్రమోడీ ప్రారంభించారు. మన దేశంలో దాదాపు ఎనిమిది వందల చైనా కంపెనీలు పెట్టుబడులు పెట్టాయి. స్నాప్‌డీల్‌, ఫ్లిప్‌కార్ట్‌, బైజూస్‌,స్విగ్గీ, జొమాటో,ఉడాన్‌, ఓలా,పేటియం, పేటియం మాల్‌, బిగ్‌బాస్కెట్‌,పోలసీబజార్‌,ఓయో వంటి కంపెనీలలో చైనా పెట్టుబడులు ఉన్నాయి. వాటన్నింటిని తెల్లవారేసరికి వెళ్లిపొమ్మని నరేంద్రమోడీ చెప్పవచ్చు, వాటికవి వెళ్లిపోతే సరే, లేకుంటే నష్టపరిహారం చెల్లించాల్సి ఉంటుంది. దాన్ని ప్రభుత్వం భరిస్తుందా ? ఇష్టం లేదని ఈ రోజు చైనా కంపెనీలను వెళ్లగొడితే మనదేశాన్ని నమ్మి పెట్టుబడులు పెట్టేందుకు ఇతర దేశాల కంపెనీలు ముందుకు వస్తాయా ? పాలకులకు ఇష్టం లేకపోతే రేపు మనకూ అదే గతి అని ఆలోచించవా ? సరిహద్దు వివాదం తరువాత మనం చైనా వైపు తలుపులు మూసుకున్నాం తప్ప ఇతర దేశాల నుంచి సాధించిందీ లేదు, ఏ ఒక్క చైనా కంపెనీ కూడా వెనక్కు వెళ్లిపోలేదు.


చైనా టెక్‌ కంపెనీల ఉత్పత్తులను దిగుమతి చేసుకుంటే తమ సమాచారాన్ని తస్కరించే అవకాశం ఉందని, రక్షణకు ముప్పని అమెరికా, ఐరోపా దేశాలు చెబుతున్నాయి.ఇప్పుడు మన దేశమూ అదే చెబుతోంది. నిజమే అనుకుందాం. ఇంటెల్‌ వంటి అమెరికా, ఐరోపా కంపెనీల ఉత్పత్తులను దశాబ్దాల తరబడి చైనా దిగుమతి చేసుకుంది.వాటితో చైనాకూ భద్రతా ముప్పు ఉన్నట్లే కదా ! పోనీ మన దేశం చైనా బదులు ఇతర దేశాల నుంచి కొనుగోలు చేస్తే వాటి నుంచి మనకు ముప్పు ఉండదా ? మన సమాచారాన్ని అవి తస్కరించవా ? జపాన్‌ నాగసాకీ నగరంలో 2023 మే నెలలో జరిగిన జి7 దేశాల సమావేశం చైనాతో ఉన్న సరఫరా గొలుసు నుంచి విడగొట్టుకుంటామని చెబుతూ మన దేశాన్ని చైనా స్థానంలోకి నెడతామని చెప్పాయి.వాటిని నమ్ముకుంటే కుక్కతోక పట్టుకొని గోదావరిని దాటేందుకు చూసినట్లే ! దశాబ్దాల తరబడి చైనా నుంచి వస్తువులను దిగుమతి చేసుకున్న పశ్చిమ దేశాలకు ఇప్పుడెందుకు జ్ఞానోదయం కలిగినట్లు ? వాటి మాటలు నమ్మి చైనా అనే కొండను ఢ కొడతామని మనం అనుకోవటం సరైందేనా ? చైనాతో తెగతెంపులు చేసుకుంటే తమ ఆర్ధిక వ్యవస్థలు మెరుగుపడతాయని పశ్చిమ దేశాలు అనుకుంటున్నాయి. అలాంటివి తమ దేశాల్లోనే పరిశ్రమలు, పెట్టుబడులు పెట్టుకుంటాయి తప్ప మనదేశం ఎందుకు వస్తాయి ? చైనా మీద ఆధారపడి చేతులు కాల్చుకున్నామని భావిస్తున్నవారు మన మీద ఆధారపడి మరోసారి అదే తప్పు చేస్తారా ? సొల్లు మాటలను కట్టిపెట్టి ముందు చైనాతో విడగొట్టుకోమనండి !

కొనసాగుతున్న ఇజ్రాయెల్‌ మారణకాండ – మధ్యధరాలో చైనా యుద్ధ నౌకలు !

Tags

, , , , , ,


ఎం కోటేశ్వరరావు


అక్టోబరు ఏడవ తేదీన హమస్‌ సాయుధులు జరిపిన దాడులలో 1400 మరదికి పైగా మరణించారు. దానికి ప్రతీకారం పేరుతో ఇప్పటి వరకు ఇజ్రాయెల్‌ మిలిటరీ, యూదు దురహంకార సాయుధులు పాలస్తీనాలోని గాజా, పశ్చిమగట్టు ప్రాంతాలలో జరుపుతున్న దాడుల్లో మరణాలు, గాయపడిన వారు ఆరు, పద్దెనిమిదివేలు దాటారు. ఇజ్రాయెల్‌ దాడుల్లో మరణించిన వారికి సంతాపం తెలిపేందుకు ఎవరూ ఉండటం లేదనే శీర్షికతో అల్‌ జజీరా పత్రిక వార్త ఇచ్చింది. దానిలో పేర్కొన్నదాని ప్రకారం మంగళవారం నాటికి గాజాలో 2,360 మంది పిల్లలు, 1,119 మంది మహిళలతో సహా 5,791 మంది మరణించారు. గాయపడిన వారు 18వేలు దాటారు. పాలస్తీనాలో ఆక్రమించిన పశ్చిమ గట్టు ప్రాంతంలో ఇజ్రాయెలీ మూకలు మరో 95 మందిని చంపగా 1,650 మంది గాయ పడ్డారు. ఇక హమస్‌ జరిపిన ఒక రోజు దాడిలో1,405 మంది మరణించగా, 5,431 మంది గాయపడ్డారు.వీరు గాక పాలస్తీనాలో 720 మంది పిల్లలతో సహా1,400 మంది కనిపించటం లేదు. పశ్చిమ గట్టు ప్రాంతంలో 1,215 మందిని ఇజ్రాయెల్‌ అరెస్టు చేసింది. బందీలుగా ఉన్న ఇద్దరు ఇజ్రాయెలీ వృద్ద మహిళలను మానవతాపూర్వక వైఖరితో హమస్‌ విడుదల చేసింది. ఇజ్రాయెల్‌ ప్రతీకార ఏకపక్ష దాడులతో ఇరవై మూడులక్షల మంది గాజా పౌరులు నరకయాతన అనుభవిస్తున్నారు. రక్తదాహం తీరని యూదు దురహంకారులు పశ్చిమ దేశాలు ఇస్తున్న మద్దతుతో మరింతగా దాడులు చేసి జనాన్ని మట్టుపెట్టాలని చూస్తున్నారు. ఏ క్షణంలో ఏం జరుగుతుందో తెలియని స్థితి.


దాడులు, మారణకాండ నివారణలో ఐక్యరాజ్యసమితి విఫలమైంది. ఇజ్రాయెల్‌ పూర్తి యుద్ధ సన్నాహాల్లో ఉంది. ఒక్క గాజా మీదనే గాక ఇరుగుపొరుగు అరబ్‌ దేశాలను రెచ్చగొడుతూ ఉగ్రవాదుల సాకుతో అడపదడపా దాడులు చేస్తున్నది. వాటి తీవ్రతను పెంచేందుకు సరిహద్దుల్లోని తమ గ్రామాల్లో ఉన్న జనాన్ని ఖాళీ చేయిస్తున్నది. దానికి ప్రతిగా లెబనాన్‌ కూడా తన పౌరులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నది. ఇజ్రాయెల్‌-అమెరికా కూటమి దేశాల దుండగాలను నివారించేందుకు, పాలస్తీనియన్ల తరఫున అవసరమైతే రంగంలోకి దిగేందుకు ఇరుగు పొరుగు దేశాలు కూడా సిద్దపడుతున్నాయి. మరోవైపున అమెరికా, ఐరోపాలోని అనేక పట్టణాల్లో లక్షలాది మంది జనం వీధుల్లోకి వచ్చి గాజాపై దాడులను నిరసిస్తున్నారు. యూదుల రక్షణ పేరుతో అరబ్బులపై మారణకాండకు పూనుకోవద్దని కోరుతున్న వారిలో యూదులు అనేక మంది ఈ ప్రదర్శనల్లో పాల్గొంటున్నారు. శనివారం నాడు భద్రతా మండలిలో అమెరికా ప్రతిపాదించిన ఒక తీర్మానంలో ఇజ్రాయెల్‌కు ఆత్మరక్షణ చేసుకొనే హక్కు ఉందంటూ సమర్ధనకు పూనుకుంది.దాడుల విరమణకు ఇది సమయం కాదని ప్రకటించింది.గాజాలో జరుపుతున్న కొన్ని దాడులు ఇజ్రాయెల్‌కు ఎదురుదెబ్బకావచ్చని మాజీ అధ్యక్షుడు బరాక్‌ ఒబామా హెచ్చరించాడు.దాడులకు మద్దతు తెలిపేందుకు ఫ్రెంచి అధ్యక్షుడు మక్రాన్‌ మంగళవారం నాడు ఇజ్రాయెల్‌ రాజధాని టెల్‌ అవీవ్‌ చేరుకున్నాడు. అతని కంటే ఘనుడు అన్నట్లు బైడెన్‌, రిషి కంటే మరొక అడుగు ముందుకు వేసి అంతర్జాతీయంగా ఒక్కటై హమస్‌ను అణచివేయాలని పిలుపునిచ్చాడు. తాజా పరిణామాలను చర్చించేందుకు గురువారం నాడు ఐరాస సాధారణ అసెంబ్లీ సమావేశం జరగనుంది.


గాజా ప్రాంతంలో చిక్కుకు పోయిన ఇజ్రాయెల్‌, ఇతర దేశాల పౌరులు రెండువందల మందికి పైగా హమస్‌ చేతుల్లో బందీలుగా ఉన్నారు. వారందరినీ విడుదల చేసిన తరువాతే కాల్పుల విరమణ గురించి మాట్లాడాలని అమెరికా అధినేత జో బైడెన్‌ చెప్పాడు. ఏదో విధంగా వారిని విడిపించుకున్న తరువాత ఇప్పటి వరకు వైమానిక దాడులు జరుపుతున్న ఇజ్రాయెల్‌ తదుపరి దశ పేరుతో భూతల దాడులకు సిద్దం అవుతున్నది. ఇదంతా హమస్‌ను నాశనం చేసే పేరుతో జరుగుతోంది.మరణించిన వారిలో 70 శాతం మంది పిల్లలు,వృద్దులు, మహిళలే ఉన్నారు. అంటే జనం మీదనే దాడి జరుగుతోందన్నది స్పష్టం. మరింతగా పెరిగితే లెబనాన్‌లోని హిజబుల్‌ వంటి సాయుధ శక్తులు ప్రతిదాడులకు సిద్దం అవుతున్నాయి. ఇజ్రాయెల్‌కు మద్దతుగా ప్రత్యక్షంగా దాడులకు దిగేందుకు అమెరికా రంగం సిద్దం చేసుకుంటున్నది. దానికిగాను తమ సైనికులపై దాడులు జరిగినట్లు కట్టుకథలను ప్రచారంలో పెట్టింది. అక్టోబరు 19,20 తేదీలలో ఎమెన్‌ నుంచి తమ మీద, ఇజ్రాయెల్‌పై ప్రయోగించిన డ్రోన్లు, క్రూయిజ్‌ క్షిపణులను కూల్చివేసినట్లు ప్రకటించింది. అదంతా రాత్రి సమయంలో సముద్ర జలాల మీద జరిగింది గనుక ఎలాంటి ఆనవాళ్లు ఉండవని అధికారులు చెప్పారు. నిజానికి ఎమెన్‌లో ఇరాన్‌ మద్దతు ఉన్న హౌతీ సాయుధుల రాడార్‌ కేంద్రాలపై అమెరికా నౌకా దళమే ఎర్ర సముద్రం నుంచి క్షిపణులతో దాడి చేసి రెచ్చగొట్టిందని వార్తలు.ఎమెన్‌ రాజధాని సనా నగరంతో సహా ఉత్తర ప్రాంతం హౌతీల ఆధీనంలో ఉంది. వారి మీద పోరాడుతున్న ఎమెన్‌ ప్రభుత్వానికి 2015 నుంచి సౌదీ అరేబియా మద్దతు ఇస్తున్నది. ఇటీవల చైనా మధ్యవర్తిత్వంలో ఇరాన్‌-సౌదీ మధ్య సయోధ్య కుదిరిన నేపధ్యంలో గతంలో మాదిరి హౌతీ దళాలు సౌదీపై క్షిపణులు ప్రయోగించే అవకాశం లేదు. అందువలన అసలు నిజంగా ప్రయోగించారా లేక ఆ పేరుతో అమెరికా నాటకం ఆడుతోందా అన్న అనుమానాలు తలెత్తాయి. అమెరికా గనుక గాజాపై దాడికి జోక్యం చేసుకుంటే తాము దాడులకు దిగుతామని, గీత దాటవద్దని హౌతీ దళాల నేత అబ్దుల్‌ మాలిక్‌ అల్‌ హౌతీ హెచ్చరించాడు.


ఇప్పటికే మధ్యధరా సముద్ర ప్రాంతంలో ఉన్న పేట్రియాట్‌ గగనతల క్షిపణి బెటాలియన్‌కు తోడు థాడ్‌ రక్షణ వ్యవస్థను కూడా పంపనున్నట్లు అమెరికా వెల్లడించింది. ఇప్పటికే రెండు విమానవాహక యుద్ధ నౌకలు, వాటికి అనుబంధ నౌకలతో పాటు రెండువేల మంది మెరైెన్లను మోహరించింది. శనివారం నాడు కైరోలో జరిగిన శాంతి సమావేశం ఎలాంటి ఫలితం లేకుండానే ముగిసింది. ఇజ్రాయెల్‌ హాజరు కాలేదు. కైరోలోని ఒక జూనియర్‌ అధికారిని అమెరికా పంపింది, అతగాడు నోరువిప్పలేదు.అరబ్‌ నేతలు గాజాపై దాడులను ఖండించారు.ఐరోపా దేశాల నుంచి వచ్చిన వారు దాడుల నుంచి పౌరులను మినహాయించాలని సూచించారు.హిజబుల్లా మీద దాడులకు పూనుకోవద్దని జో బైడెన్‌, ఇతర నేతలు ఇజ్రాయెల్‌కు సూచిస్తున్నారని, అదే జరిగితే తాము కూడా యుద్ధంలో ప్రవేశించాల్సి ఉంటుదని కొన్ని అరబ్బు దేశాలు చెప్పినట్లు వార్తలు వచ్చాయి. పూర్తి స్థాయి యుద్ధమే వస్తే ఇజ్రాయెల్‌ తన దక్షిణ, ఉత్తర భాగంలో దాడులను ఎదుర్కోవాల్సి వస్తుంది, అప్పుడు అమెరికా-ఇరాన్‌ కూడా పాల్గొనే అవకాశం ఉంది. అదే జరిగితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయి. మధ్యధరా సముద్రంలో అమెరికా మిలిటరీ కేంద్రీకరణ నేపధ్యంలో చైనా ఆరు యుద్ధ నౌకలను ఆ ప్రాంతానికి తరలించినట్లు వార్తలు వచ్చాయి. అయితే వీటి గురించి చైనా రక్షణ శాఖ ఒక ప్రకటన చేస్తూ మే నెల నుంచి తమ నౌకలు ఆ ప్రాంతంలో ఉన్నాయని, గత వారంలో ఓమన్‌ నౌకాదళంతో కలసి సంయుక్త విన్యాసాలు సాగించినట్లు పేర్కొన్నది. అవి పూర్తైన తరువాత అక్టోబరు 18వ తేదీన కువైట్‌ రేవు షావయాఖ్‌కు తమ నావల్‌ ఎస్కార్ట్‌ దళాలు వచ్చినట్లు తెలిపింది. వాటిలో నిర్ణీత లక్ష్యాలను ఛేదించే క్షిపణి నౌక, ఫ్రైగేట్‌, ఇతర నౌకలు ఉన్నాయి. చైనా-కువైట్‌ మధ్య వ్యూహాత్మక భాగస్వామ్య ఒప్పందం కుదిరి ఐదు సంవత్సరాలు అవుతున్నది. పది సంవత్సరాలుగా బిఆర్‌ఐ పధకం కింద పెట్టుబడులు పెట్టింది. చైనా నౌకలు ఎందుకు వచ్చినప్పటికీ ఈ ప్రాంతంలో రాజకీయంగా వాటి ప్రభావం ఉంటుంది. అమెరికా మిలిటరీ శక్తిని చూసి ఆందోళన చెందుతున్న శక్తులకు భరోసా దొరికినట్లు అవుతుంది.


ప్రస్తుతం ఇజ్రాయెల్‌ పరిమితంగా జరుపుతున్న దాడులు, ఒకవేళ వాటి తీవ్రతను పెంచితే రాగల పరిణామాలు, పర్యవసానాల గురించి అమెరికా మదింపు వేస్తోంది. ఇరాన్‌ అందచేసిన డ్రోన్లు, ఇతర ఆయుధాలతో హమస్‌ కంటే పెద్ద శక్తిగా ఉన్న హిజబుల్లా గనుక పోరుకు దిగితే తీవ్ర పరిస్థితి ఏర్పడుతుందని విశ్లేషకులు చెబుతున్నారు.హమస్‌ దగ్గర పరిమితమైన ఆయుధాలు మాత్రమే ఉన్నాయి, శిక్షణ పొందిన హిజ్‌బుల్లా దగ్గర స్వల్ప శ్రేణి ఖండాంతర క్షిపణులు, డ్రోన్లు, మానవరహిత ప్రయోగ వ్యవస్థలు ఉన్నాయి. వాటిని రంగంలోకి దింపితే పోరు తీరే మారిపోతుంది.ప్రస్తుతం అది యుద్ధాన్ని కోరుకోవటం లేదని, అమెరికా, ఇజ్రాయెల్‌ గనుక వారిని ఆవైపుకు నెడితే రంగంలోకి దిగుతుందని పరిశీలకులు అంటున్నారు. బహుశా దానిలో భాగంగానే లెబనాన్‌ సరిహద్దులో ఉన్న హిజబుల్లా సాయుధులపై ఇజ్రాయెల్‌ దాడులు చేసి కవ్విస్తున్నది.2019లో అమెరికా మిలిటరీ గూఢచారుల సమాచారం మేరకు హిజబుల్లా వద్ద లక్షా 50వేల రాకెట్లు, ఇజ్రాయెలీ సంస్థ ఒకటి గతేడాది చెప్పినదాని ప్రకారం రెండువేల మానవరహిత ఆయుధ ప్రయోగ వాహనాలు ఉన్నాయి. వెయ్యి కిలోమీటర్ల దూరం వరకు వెళ్లే ఆయుబ్‌, షాహేద్‌ వంటి క్షిపణులు కూడా ఉన్నాయి. ఇజ్రాయెల్‌ వద్ద అధునాతన వైమానిక దళం ఉన్నప్పటికీ హిజబుల్లా వంటి సంస్థల వద్ద ఉన్న నిఘా, ఇతర పరికరాలతో గురిచూసి విమానాలను కూల్చివేసే అవకాశం ఉంది. ఐరన్‌ డ్రోమ్‌, ఐరన్‌ బీమ్‌ వంటి రక్షణ వ్యవస్థల గురించి ఇజ్రాయెల్‌ ఎప్పటి నుంచో చెబుతున్నప్పటికీ అవి ఎంతవరకు దాడులను నివారించగలవో ఇంతవరకు రుజువు కాలేదు. గడచిన ఏడు దశాబ్దాలుగా పాలస్తీనా యోధులను అణచేందుకు ఇజ్రాయెల్‌ చేయని ప్రయోగం లేదు. కానీ ఎప్పటికప్పుడు కొత్త శక్తులు, గెరిల్లా పద్దతుల్లో దాడులతో తెగబడుతూనే ఉన్నాయి. ఇప్పుడు హమస్‌ను అణచివేయటం కూడా జరిగేది కాదని చెబుతున్నారు. ఇజ్రాయెల్‌ తాను చేయదలచుకున్న విధ్వంసాన్ని నెల రోజుల్లోపల పూర్తి చేయాలని తరువాత అమెరికా అనుమతించే అవకాశం ఉండదని, భూతల దాడికి దిగితే ఇజ్రాయెల్‌ కూడా భారీ సంఖ్యలో సైనికులను కోల్పోతుందని, దాంతో పౌరుల్లో సహనం కూడా నశిస్తుందని ఒక నిపుణుడు చెప్పాడు.2006లో జరిగిన రెండవ లెబనాన్‌ పోరులో హిజబుల్లా పెద్ద సంఖ్యలో ఇజ్రాయెల్‌ సైనికులను హతమార్చింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు అది సామర్ధ్యాన్ని మరింతగా పెంచుకుంది.ప్రస్తుతం లక్ష మంది యోధులున్నట్లు అంచనా. ఇజ్రాయెల్‌ పరిసరాలన్నీ నివురు గప్పిన నిప్పులా ఉన్నాయి. ప్రపంచ శాంతి శక్తులు కోరుతున్నట్లు యూదు దురహంకారులు వెనక్కు తగ్గుతారా అమెరికా, ఐరోపా ధనిక దేశాల అండచూసుకొని మరింతగా మారణకాండకు పాల్పడతారా అన్నది చెప్పలేము.

చైనా కరెన్సీలో చమురు డబ్బు డిమాండ్‌ చేస్తున్న రష్యా – పరువు పోతుందని నరేంద్రమోడీ భావిస్తున్నారా ?

Tags

, , , , , ,

ఎం కోటేశ్వరరావు

గత పదేండ్లలో ఎన్నడూ లేని కొత్త ఇరకాటంలో నరేంద్రమోడీ సర్కార్‌ చిక్కుకుందా ? చైనా కరెన్సీలో రష్యాకు డబ్బు చెల్లించి ముడి చమురు కొనుగోలు అవమానకరంగా భావిస్తోందా ? చైనా మీద కోపంతో అధిక ధరలకు ఇతర దేశాల నుంచి కొని జనం మీద భారం మోపేందుకు సిద్దపడుతుందా ? తాజాగా తలెత్తిన పరిస్థితి నుంచి పుట్టుకువస్తున్న అనుమానాలివి. తమ ముడి చమురుకు చైనా యువాన్లు చెల్లించాలన్న రష్యా డిమాండ్‌ను భారత ప్రభుత్వం తిరస్కరించే అవకాశం ఉందని అధికారులు చెప్పినట్లుగా బ్లూమ్‌బెర్గ్‌ మీడియా పేర్కొన్నది. ఉక్రెయిన్‌ సంక్షోభం ప్రారంభమైన తరువాత పశ్చిమ దేశాలు విధించిన ఆంక్షల కారణంగా రష్యన్లు తమ వద్ద కొనుగోలు చేసే దేశాలకు రాయితీ ధరలకు చమురును విక్రయిస్తున్నారు. ఈ క్రమంలో గతం కంటే ఎంతో ఎక్కువగా చైనాపై ఆధారపడ్డారు. ఐరోపా యూరోలు, అమెరికా డాలర్లను మార్చుకొనేందుకు ఆంక్షలు అడ్డువస్తున్నందున తమకు చైనా యువాన్లలో చెల్లించాలని రష్యా మన దేశాన్ని కోరింది. దీనికి మనదేశం అంగీకరించే అవకాశాలు లేవని బ్లూమ్‌బెర్గ్‌ వ్యాఖ్యానించింది. అదే జరిగితే రష్యా నుంచి కొనుగోలు నిలిపివేసి డాలర్లు చెల్లించి అధిక ధరకు ఇతర మార్కెట్లో చమురు కొనుగోలు చేయాల్సి ఉంటుంది. గతంలో ప్రభుత్వ రంగ సంస్థ ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ యువాన్లలో చెల్లించినప్పటికీ, ఇప్పుడు హిందూస్తాన్‌ పెట్రోలియం, భారత పెట్రోలియం కార్పొరేషన్‌ చెల్లింపుల అంశానికి వస్తే ప్రభుత్వం విముఖంగా ఉందని రాయిటర్స్‌ వార్తా సంస్థ కొద్ది రోజుల క్రితం పేర్కొన్నది. కొత్తగా కేంద్ర ప్రభుత్వానికి వచ్చిన అభ్యంతరం ఏమిటో తెలియదు. గతేడాది నవంబరు నాలుగున ఒపెక్‌ దేశాల నుంచి మనం కొనుగోలు చేస్తున్న ముడి చమురు పీపా ధర 93.86 డాలర్లు ఉండగా తరువాత మే మూడవ తేదీకి 70.52 డాలర్లకు తగ్గింది.సెప్టెంబరు 29న 97.03 డాలర్లకు పెరిగి తరువాత కాస్త తగ్గి అక్టోబరు 19న 91.71 డాలర్ల వద్ద ఉంది.

చైనాతో సరిహద్దు వివాదంలో ఎలాంటి పురోగతి లేకపోవటం, అంతర్జాతీయ రాజకీయ పరిణామాల్లో చైనాకు వ్యతిరేకంగా పశ్చిమ దేశాలకు మరింత సన్నిహితం కావటం వంటి కారణాలు ఉండవచ్చు. లేదా రూపాయిని అంతర్జాతీయ మారక కరెన్సీగా మారుస్తామన్న మాటల ప్రచార బండారం సంగతేమిటని జనం అడుగుతారన్న భయం కావచ్చు. 2022-23లో రోజుకు 7.8లక్షల పీపాల రష్యా చమురు దిగుమతి చేసుకోగా 2023-24లో ఇప్పటి వరకు 17.6లక్షలకు పెరిగింది. ఈ మేరకు ఒపెక్‌(చమురు ఎగుమతి దేశాలు) నుంచి దిగుమతులు తగ్గాయి. 2022 ఏప్రిల్‌-సెప్టెంబరు కాలానికి మన మొత్తం అవసరాల్లో 63 శాతం ఒపెక్‌ నుంచి దిగుమతి చేసుకోగా ఈ ఏడాది తొలి ఆరునెలల్లో 40శాతానికి తగ్గింది. ఒపెక్‌ దేశాల నుంచి దిగుమతి చేసుకొనే చమురుతో పోలిస్తే తక్కువ ధర, రూపాయల్లో చెల్లింపుల వెసులుబాటు వంటి సానుకూల కారణాలు ఉన్న కారణంగానే మనదేశం రష్యా నుంచి దిగుమతి చేసుకుంటున్నది. మన రూపాయలతో ప్రపంచ మార్కెట్లో ముడి చమురు దొరకదు. అందుకోసం డాలర్లు ఖర్చు చేయాల్సిందే. వాటి బదులు యువాన్లలో చెల్లిస్తే మనకు పడే అదనపు భారం ఉండదు. మన వినియోగదారులకు మేలు కలుగుతున్నపుడు, ఖజానా మీద భారం పడనపుడు ఏ విదేశీ కరెన్సీలో చెల్లిస్తే ఏమిటి ? వివాదాలకు – వ్యాపారానికి సంబంధం లేదంటూ గత రికార్డులన్నింటినీ బద్దలు కొట్టి చైనా నుంచి దిగుమతులు సజావుగానే మనం చేసుకుంటున్నాం.వాటి దగ్గర లేనిది యువాన్ల దగ్గర పట్టుదల అవసరమా ?అంతర్జాతీయ మార్కెట్లో యువాన్లను కొనుగోలు చేయటం అవమానంగా భావిస్తున్నామా ?

ప్రయివేటు సంస్థలు యువాన్లలో చెల్లింపులు జరపటంపై ఎలాంటి నిషేధం లేదని మన ప్రభుత్వం ప్రకటించింది. అయితే అలాంటి లావాదేవీలను ప్రోత్సహించటం గానీ, వీలు కల్పించటం గాని చేసేది లేదని కూడా పేర్కొన్నది. తాము డాలర్లను స్వీకరించేది లేదని, యువాన్లు లేదా రూబుళ్లను చమురు లావాదేవీల్లో అంగీకరిస్తామని రష్యా కంపెనీ గాజ్‌ ప్రోమ్‌ స్పష్టం చేసింది. ప్రపంచ లావాదేవీలు యువాన్లతో జరపాలన్న ప్రతిపాదనల పట్ల మనదేశం సంతోషంగా లేదని ఆర్థికశాఖ అధికారులు చెప్పినట్లుగా వార్తలు వచ్చాయి. ఏ కరెన్సీతో లావాదేవీలు జరపాలన్న అంశం తేలకపోవటంతో రష్యాకు సెప్టెంబరు నుంచి ఏడు టాంకర్ల చెల్లింపులు నిలిచిపోయాయి.ఇప్పటికే తన దగ్గర భారీ మొత్తంలో రూపాయి నిల్వలు ఉన్నందున చమురు చెల్లింపులకు గాను తనకు యువాన్లలో చెల్లించాల్సిందేనని రష్యా పట్టుబట్టింది. తాను చైనా దిగుమతుల మీద ఆధారపడి నందున యువాన్ల అవసరం ఉందని స్పష్టం చేసింది. ఇప్పటికే ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌, ప్రయివేటు చమురుశుద్ధి సంస్థలు కొంత మేరకు చెల్లింపులు జరిపాయి. యుఏఇ దిర్‌హామ్స్‌లో కూడా రష్యాకు చెల్లించాము. కొన్ని రష్యన్‌ కంపెనీలు దిరహామ్స్‌ను కూడా అంగీకరించటం లేదు. పీపా ముడి చమురును 60 డాలర్లకు మించి రష్యా దగ్గర కొనుగోలు చేస్తే అమెరికా ఆంక్షలను అమలు జరుపుతున్న సంగతి తెలిసిందే. మన రూపాయిని అంతర్జాతీయ కరెన్సీగా మారుస్తామని చెబుతున్న తరుణం, సరిహద్దు వివాదం కారణంగా చైనా కరెన్సీలో చెల్లింపులు చేసేందుకు మోడీ సర్కార్‌ ఇబ్బంది పడుతోంది.బ్రిక్స్‌ దేశాల కూటమిలో ఉమ్మడి కరెన్సీ ప్రతిపాదన రాగా మనదేశం మాత్రమే వ్యతిరేకించింది. ఒకవేళ అంగీకరిస్తే యువాను అవుతుందన్నభయం ఉందని వార్తలు. ప్రస్తుతం రూపాయి అంతర్జాతీయ లావాదేవీల్లో పూర్తిగా మారకం కావటం లేదు. అందువలన తన దగ్గర ఉన్న వందల కోట్ల రూపాయలను ఏం చేసుకోవాలని రష్యా అడుగుతోంది. ఇప్పటి వరకు స్థానిక కరెన్సీలో లావాదేవీలు జరిపిన కారణంగా రష్యాకు యువాన్లు వస్తున్నాయి. రష్యా రాయితీల వలన చైనా 10, భారత్‌ 7 బిలియన్ల డాలర్లను పొదుపు చేసుకున్నాయి.ప్రపంచంలో పరిస్థితులు మారుతున్నాయి, వాటికిి ప్రతికూలంగా నడిచే పరిస్థితి మనకు ఉందా అన్నది సమస్య.

అమెరికా డాలరు పెత్తనానికి రోజులు దగ్గర పడుతున్నాయా ? అనేక వైపుల నుంచి వస్తున్న వార్తలు ఏదో జరగబోతోందనే సూచిస్తున్నాయి. తన బిఆర్‌ఐ పధకం కింద గతంలో ఎక్కువగా డాలర్లు ఇచ్చిన చైనా ఇప్పుడు తన కరెన్సీ యువాన్‌ ఇవ్వటం ప్రారంభించింది. అక్టోబరు మూడవ వారంలో ఈ మేరకు అనేక ఒప్పందాలను కుదుర్చుకుంది. రాయిటర్స్‌ వార్తా సంస్థ కథనం ప్రకారం చైనా అభివృద్ధి బాంకు మలేషియా, ఈజిప్టు, పెరూ కేంద్ర బాంకులతో ఒప్పందాలు చేసుకుంది.చైనా ఎగుమతి-దిగుమతి బాంకు సౌదీ నేషనల్‌ బాంకుతో, బాంక్‌ ఆఫ్‌ చైనా ఈజిప్టుకు 47.9 కోట్ల డాలర్ల విలువగల యువాన్‌ పాండా బాండ్లను జారీ చేసింది. సిల్క్‌ రోడ్‌ నిధులకు గాను 80 బిలియన్ల యువాన్లను అదనంగా చైనా పక్కన పెట్టింది. అంతర్జాతీయ లావాదేవీల్లో డాలర్ల వాటా ఎంతో ఎక్కువగా ఉంది. ఆగస్టు నెలలో 83.95శాతంగా ఉన్నది సెప్టెంబరులో 84.15కు పెరిగింది. యూరో వాటా 6.43 నుంచి 5.43శాతానికి తగ్గగా చైనా యువాన్‌ లావాదేవీలు 4.82 నుంచి 5.8శాతానికి చేరి రెండవ స్థానంలో నిలిచింది. తరువాత స్థానాలలో యూరో, జపాన్‌ ఎన్‌, సౌదీ రియాల్‌ ఉన్నాయి.యువాన్‌ వాటా తక్కువే అయినప్పటికీ క్రమంగా పెరుగుతోంది. ఇరవై భాగస్వామ్య దేశాలతో చైనా ఇప్పటి వరకు పదిహేడింటితో యువాన్‌ మార్పిడి ఒప్పందాలు కుదుర్చుకుంది. అర్జెంటీనాలో ఆరున్నర బిలియన్‌ డాలర్ల విలువగల యువాన్‌ మార్పిడి ఒప్పందం చేసుకుంది.అంతర్జాతీయ వాణిజ్యంలో 15శాతం వాటా ఉన్న చైనా కరెన్సీయే అంత తక్కువగా ఉన్నపుడు కేవలం 1.8శాతం వాణిజ్యం ఉన్న మనదేశ కరెన్సీ వాటా ఎంత ఉంటుందో చెప్పనవసరం లేదు.

బ్లాక్‌ మార్కెట్‌ కారణంగా కరెన్సీ మారకపు విలువలో సంభవిస్తున్న హెచ్చు తగ్గుల వలన తమ దేశానికి పదిబిలియన్‌ డాలర్ల మేర నష్టం జరుగుతున్నదని ఇరాక్‌ కేంద్ర బాంకు పెట్టుబడులు, స్వీకరణల డైరెక్టర్‌ జనరల్‌ మజెన్‌ అహమ్మద్‌ చెప్పాడు.డాలరు దిగుమతుల్లో సగం అక్రమంగా జరుగుతున్నవే అన్నాడు. 2023లో స్వీకరించిన డాలరు డిపాజిట్లను వచ్చే ఏడాది ఉపసంహరిస్తామని,2024 జనవరి ఒకటి తరువాత స్వీకరించబోమన్నాడు. ఆంక్షల కారణంగా గత రెండు దశాబ్దాలుగా ఇబ్బందులు పడుతున్న ఇరాక్‌ బ్రిక్స్‌ కూటమిలో చేరాలని, డాలరుతో నిమిత్తం లేకుండా ఆర్ధిక వ్యవస్థ నిర్వహణ జరపాలని చూస్తున్నది.ఆహ్వానం వస్తే బ్రిక్స్‌లో చేరేందుకు సిద్దంగా ఉన్నామని ఇరాక్‌ ప్రధాని మహమ్మద్‌ షియా అల్‌ సుదానీ ప్రకటించాడు.తమ ఆర్థిక వ్యవస్థను వృద్ధి చేసేందుకు అవసరమైన పెట్టుబడుల ఆకర్షణకు వ్యవస్థాగతమైన సంస్కరణలు చేపడుతున్నట్లు, తద్వారా స్థానిక కరెన్సీకి ఆసరా దొరుకుతుందని మలేసియా ప్రధాని అన్వర్‌ ఇబ్రహీం చెప్పాడు. బ్రిక్స్‌ దేశాల స్ఫూర్తితో తమ కరెన్సీ రింగెట్‌ను స్థిరపరిచేందుకు చూస్తామన్నాడు. ఇండోనేషియా, చైనా, థాయిలాండ్‌తో కుదుర్చుకున్న ఒప్పందాలలో రింగెట్‌ను వినియోగిస్తామన్నాడు. డాలరు మీద పూర్తిగా ఆధారపడటం కష్టమన్నాడు.డాలరు బదులు స్థానిక కరెన్సీ బ్రిక్స్‌ దేశాలు గనుక తమతో జరిపే లావాదేవీలలో ముఖ్యంగా ఇంథనానికి తమకు స్థానిక కరెన్సీలలోనే చెల్లింపులు జరపాలని అమెరికా, ఐరోపా దేశాలను డిమాండ్‌ చేస్తే పరిస్థితి ఏమిటి అన్నది ఒక చర్చ. తమకు డాలర్లలోనే చెల్లింపులు జరపాలనేదేమీ లేదని స్థానిక కరెన్సీలను కూడా అంగీకరిస్తామని సౌదీ అరేబియా ప్రకటించింది. బ్రెజిల్‌, రష్యా, భారత్‌, చైనా, దక్షిణాఫ్రికాలతో కూడిన బ్రిక్స్‌ కూటమి న్యూ డెవలప్‌మెంట్‌ బాంక్‌ (ఎన్‌డిబి) ఏర్పాటు చేసింది. రానున్న మూడు సంవత్సరాల్లో సభ్య దేశాలు డాలరు బదులు ఆయా దేశాల కరెన్సీలలో లావాదేవీలు జరుపుకోవాలన్న లక్ష్యాన్ని ప్రకటించింది. ఇప్పటికే ఆయా దేశాల కరెన్సీలలో ఇతర దేశాలకు రుణాలు ఇవ్వాలని సూచించింది. 2026 నాటికి డాలర్‌ పెత్తనం తగ్గటం ప్రారంభమవుతుందని అంచనా.ప్రస్తుతం బ్రిక్స్‌ కూటమి ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో 30శాతం వాటా కలిగి ఉంది, దాన్ని మరింతగా విస్తరించాలనే యత్నాల్లో ఉన్నారు. ఈ కూటమిలో చేరాలని 40కి పైగా దేశాలు ఆసక్తి కనపరుస్తున్నాయి. సెప్టెంబరులో జరిగిన కూటమి సమావేశంలో సౌదీ అరేబియా, ఇరాన్‌, ఈజిప్టు, ఇథియోపియా,అర్జెంటీనా, యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ను చేర్చుకోవాలని నిర్ణయించారు. వచ్చే ఏడాది నుంచి అమల్లోకి వస్తుంది. వీటిలో అర్జెంటీనా మినహా ఐదు దేశాలూ చమురు ఎగుమతి దేశాలే అన్నది తెలిసిందే. ఇప్పటి వరకు ఉన్న పశ్చిమ దేశాల పెత్తనం క్రమంగా తూర్పు దేశాలకు వస్తుందని భావిస్తున్నారు.