బరిలో కమ్యూనిస్టు నేత : సంకుల సమరంగా చిలీ అధ్యక్ష ఎన్నికలు !

Tags

, , , ,

ఎం కోటేశ్వరరావు

చిలీ చరిత్రలో, బహుశా లాటిన్‌ అమెరికా చరిత్రలో ఇతర పార్టీల పేరుతో కమ్యూనిస్టులుగా, మార్క్సిస్టులుగా ఉన్న వారు పోటీ చేసి గెలిచిన ఉదంతాలు ఉన్నాయి గానీ ఒక కమ్యూనిస్టు పార్టీ నేత జీనెటె జారా విశాల వేదిక పేరుతో ఉన్న వామపక్ష, ప్రజాతంత్ర సంఘటన తరఫున పోటీ చేయటం ఇదే ప్రధమం.గతంలో పాబ్లో నెరూడా, గ్లాడీ మారిన్‌ పోటీ చేసినప్పటికీ పెద్దగా ప్రభావితం చేయలేదు. ఉత్తర, దక్షిణ అమెరికా ఖండాలలో పెద్ద ఎత్తున కమ్యూనిస్టు వ్యతిరేకతను రెచ్చగొట్టిన పూర్వరంగాన్ని చూసినపుడు ఒక కరుడు గట్టిన కమ్యూనిస్టుగా పేరున్న జీనెటె జారా పోటీకి దిగటం చిన్న విషయమేమీ కాదు, సంకుల సమరంగా సాగనున్న పోటీలో 51 ఏండ్ల లాయర్‌, మాజీ మంత్రి అయిన ఆమె గెలిస్తే లాటిన్‌ అమెరికా వామపక్ష రాజకీయాల్లో అదొక మైలు రాయి అవుతుంది. పదిపార్టీలతో కూడిన చిలీ ఐక్య సంఘటన వామపక్ష కూటమి అభ్యర్థి ఎంపికకు జూన్‌29న జరిగిన పోటీలో 60శాతం ఓట్లతో కమ్యూనిస్టు పార్టీ నేత ముందంజలో ఉండటంతో అమెనే అభ్యర్థిగా ఖరారు చేశారు. ప్రస్తుతం అదే ఫ్రంట్‌ నేత గాబ్రియెల్‌ బోరిక్‌ అధ్యక్షుడిగా ఉన్నారు. అక్కడి రాజ్యాంగం ప్రకారం వరుసగా రెండవ సారి పోటీ చేసే అవకాశం లేదు. ఎన్నికల్లో పోటీ చేసేందుకు జారా మంత్రిపదవికి రాజీనామా చేశారు.


జూలై 14వ తేదీన జీనెటె జారా చిలీ ఎన్నికల ట్రిబ్యునల్‌ కార్యాలయానికి వెళ్లి తనను బలపరిచిన పార్టీల నేతలతో కలసి అధికారికంగా విశాల వేదిక పేరుతో ఉన్న వామపక్ష, ప్రజాతంత్ర ప్రంట్‌ తరఫున అభ్యర్థిగా నమోదు చేసుకున్నారు(మన దగ్గర నామినేషన్‌ వంటిదే). నలుగురు మితవాద పార్టీల నేతలు ఆమెతో మొదటి రౌండ్‌లో పడనున్నారని వార్తలు. ఆగస్టు 18వ తేదీలోగా కనీసం 35వేల ఓటర్ల సంతకాల ప్రతిపాదనతో వచ్చిన ప్రతి ఒక్కరిని అభ్యర్థిగా అంగీకరిస్తారు. కొందరు స్వతంత్రులు కూడా ఆ ప్రయత్నాల్లో ఉన్నారు. పార్లమెంటు ఎన్నికలు కూడా ఒకేసారి జరగనున్నందున వివిధ పార్టీలతో కూటములు ఆ సీట్ల సర్దుబాటు యత్నాల్లో ఉన్నాయి. అధ్యక్ష పదవికి తొలి రౌండ్‌లో పోటీ పడినప్పటికీ దామాషా విధానం గనుక కొన్ని పార్టీలు పార్లమెంటు ఎన్నికల్లో సర్దుబాటు చేసుకుంటున్నాయి. వామపక్ష కూటమి క్రిస్టియన్‌ డెమోక్రటిక్‌ పార్టీతో అవగాహనకు వచ్చేందుకు చూస్తున్నట్లు వార్తలు.


లాటిన్‌ అమెరికాలో జరుగుతున్న ఎన్నికల్లో వామపక్ష అభ్యర్థులు రంగంలో ఉన్న చోట అమెరికా సిఐఏ, మితవాద, ఫాసిస్టు శక్తులు, నేరగాండ్ల ముఠాలు, వారికి మద్దతుగా నిలిచే మీడియా మొత్తంగా వామపక్షాలకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నాయి. చిలీలో కూడా అదే జరుగుతోంది. ఇప్పటికే అందరూ రంగంలోకి దిగారు. పచ్చిమితవాది కాస్ట్‌ ప్రధాన స్రవంతి మితవాదిగా ముందుకు రావటం, కమ్యూనిస్టులు పోటీలో ఉండటంతో చిలీ రాజకీయాలను నేరాలు వణికిస్తున్నట్లు ఫైనాన్సియల్‌ టైమ్స్‌ పత్రిక రాసింది. మితవాద శక్తులకు విజయావకాశాలు ఉండటంతో నవంబరులో జరిగే ఎన్నికలకు ముందు సంఘటిత నేరాలు రాజకీయాలకు ఒక రూపం ఇస్తున్నట్లు పేర్కొన్నది. హింసాత్మక చర్యలు గత పదేండ్లలో రెట్టింపు అయిన కారణంగా జనాలు మిగతా అంశాల కంటే అలాంటి శక్తుల నుంచి రక్షణే ప్రధాన ఎన్నికల అంశంగా భావిస్తున్నట్లు వ్యాఖ్యానించింది. దీంతో మూడవసారి ఎన్నికల్లో పోటీ చేస్తున్న జోస్‌ ఆంటోనియో కాస్ట్‌కు లబ్ది కలిగినట్లు పేర్కొన్నది. ఇంకా నాలుగు నెలల వ్యవధి ఉండగానే ఒక అభ్యర్థి ముందున్నట్లు చిత్రించటం జనాలను ప్రభావితం చేసే యత్నాలలో ఒకటని వేరే చెప్పనవసరం లేదు.ఫైనాన్సియల్‌ టైమ్స్‌ కమ్యూనిస్టు వ్యతిరేక పత్రిక తప్ప అనుకూలం కాదు. నేరాలు చిలీలో కొత్త కాదు, వాటిని మాదకద్రవ్యాల ముఠాల వంటి కొన్ని శక్తులు పెంచి పోషిస్తున్నాయి. అలాంటి శక్తులపై చర్యలు తీసుకొనే చిత్తశుద్ధి ఇతర అభ్యర్థులకు లేదని కాస్ట్‌ నాయకత్వం వహిస్తున్న రిపబ్లికన్‌ పార్టీ చెప్పుకుంటున్నది.


లాటిన్‌ అమెరికాలో ఒక విచిత్రమైన స్థితి.దాన్లో మంచీ చెడూ రెండూ ఉన్నాయి.అధ్యక్ష ఎన్నికలు ప్రత్యక్ష పద్దతిలో జరిగితే పార్లమెంటు ఎన్నికలు దామాషా విధానంలో ఉంటాయి. అందువలన అధ్యక్షపదవిని గెలుచుకున్నవారు పార్లమెంటులో మెజారిటీ సాధిస్తారని చెప్పలేము. 2021లో జరిగిన చిలీ ఎన్నికల్లో తొమ్మిది పార్టీల వామపక్ష కూటమి అభ్యర్ధి గాబ్రియెల్‌ బోరిక్‌ గెలిచినప్పటికీ పార్లమెంటు ఉభయ సభల్లో మెజారిటీ లేదు. పార్లమెంటు ఎన్నికలకు వచ్చే సరికి వామపక్ష కూటమిలో ఐదు మాత్రమే ఉన్నాయి. చిలీ పోడెమాస్‌ మాస్‌ నాలుగు మితవాద పార్టీల కూటమి 25.43శాతం ఓట్లతో 155 స్థానాలున్న దిగువ సభ డిప్యూటీస్‌లో 53 సీట్లు తెచ్చుకొని పెద్ద కూటమిగా ఉంది. కమ్యూనిస్టులతో పాటు మరో నాలుగు వామపక్ష పార్టీల కూటమి 20.94శాతం ఓట్లు 37 సీట్లు తెచ్చుకోగా కమ్యూనిస్టులు 12 మంది ఉన్నారు. వామపక్షాలు, ఉదారవాద పార్టీలతో కూడిన ఆరు పార్టీల కూటమి 17.16శాతం ఓట్లు 37 సీట్లు తెచ్చుకుంది. మిగతా సీట్లను ఇతర పార్టీలు, ఒక స్వతంత్ర అభ్యర్ధి తెచ్చుకున్నాడు. ఇలాంటి పరిస్థితే ఈ ఏడాది కూడా పునరావృతమైతే కమ్యూనిస్టు జారానే కాదు ఏ పార్టీ గెలిచినా తాము నమ్మిన విధానాలను పూర్తిగా అమలు జరపటానికి కుదరదు, రాజీ పడాల్సిందే. గాబ్రియెల్‌ బోరిక్‌ ప్రభుత్వం అలాంటి పరిస్థితినే ఎదుర్కొన్నది. అందువలన ఎన్నికల్లో చేసిన వాగ్దానాలను పూర్తిగా అమలు జరపకపోవటంతో విఫలమైందనే విమర్శలను ఎదుర్కోక తప్పటం లేదు.ఇది ఒక ఇబ్బందికర పరిస్థితి, అదే మితవాదులు అధ్యక్షులుగా గెలిచినా వారికీ ప్రతిఘటన ఉంటుంది, అది కొంతమేరక ప్రజాఅనుకూల స్థితి.ప్రపంచంలో పెన్షన్‌ సంస్కరణలు కార్మికవర్గానికి ఎంతో నష్టదాయకమైనందున ఆ విధానాన్ని సంస్కరించాలని వామపక్ష ప్రభుత్వం ప్రయత్నించినా పూర్తిగా కుదరలేదు.


లాటిన్‌ అమెరికాలో 1970 అధ్యక్ష ఎన్నికల్లో గెలిచిన తొలి వామపక్ష నేత సాల్వడార్‌ అలెండీపై 1973లో మిలిటరీ జనరల్‌ అగస్టో పినోచెట్‌ తిరుగుబాటు చేశాడు. దాన్ని ఎదుర్కొనే క్రమంలో తుపాకి పట్టిన అలెండీ ఆ పోరులో అమరుడుయ్యాడు. అధికారానికి వచ్చిన పినోచెట్‌ 1980లో తన నియంతృత్వాన్ని సుస్థిరం గావించుకొనేందుకు ఒక రాజ్యాంగాన్ని రుద్దాడు. వాడు విధిలేని స్థితిలో 1990లో గద్దె దిగాడు. ఆ రాజ్యాంగాన్ని మార్చాలని గాబ్రియెల్‌ బోరిక్‌ ప్రయత్నించి ఒక ముసాయిదాను తయారు చేసి 2022లో జనం ఆమోదానికి పెడితే దాన్ని ఓటర్లు తిరస్కరించారు. అది వామపక్ష భావజాలంతో కూడి ఉందని, విప్లవాత్మకంగా, చాలా పెద్దదిగా ఉందంటూ మీడియా, ప్రతిపక్షాలు పెద్ద ఎత్తున జనం చెవుల్లో విద్వేషాన్ని నూరిపోశాయి. తరువాత 2023లో నూతన రాజ్యాంగ మండలి మరొక రాజ్యాంగాన్ని ప్రతిపాదించింది. అది మితవాదంతో, మార్కెట్‌ శక్తులకు అనుకూలంగా ఉందనే విమర్శలు వచ్చాయి. జనం దాన్ని కూడా తిరస్కరించారు. ఏతావాతా నియంత పినోచెట్‌ రాజ్యాంగమే ఇప్పుడు అమల్లో ఉంది.కార్మికవర్గానికి అనుకూలమైన రాజ్యాంగం లేకుండా అధికారంలో ఉన్నప్పటికీ వామపక్షాలకు అనేక పరిమితులు ఉంటాయన్నది చిలీ నేర్పిన గుణపాఠం.

పినోచెట్‌ ఎంతగా జనం నుంచి దూరమయ్యాడంటే వాడి పేరు చెప్పుకొని ఎన్నికల్లో పోటీ చేసేందుకు తరువాత కాలంలో ఎవరూ ధైర్యం చేయలేదు. అయితే పదవి నుంచి దిగిపోయిన తరువాత ఎనిమిదేండ్లు మిలిటరీ అధిపతిగా, 2006లో చచ్చేంతవరకు సెనెటర్‌గా ఉండేందుకు పాలకులు సానుకూలంగా ఉన్నారు. జోస్‌ ఆంటోనియో కాస్ట్‌ మూడవసారి ఎన్నికల్లో పోటీ చేస్తున్నాడు. ఇతడు పినోచెట్‌ మద్దతుదారు. పినోచెట్‌ భావజాలంతో ఉన్నవారు గానీ, కమ్యూనిస్టులుగానీ ఇంతవరకు చిలీలో గెలవలేదని, 2025 ఎన్నికలు అసాధారణమైనవని న్యూయార్క్‌ విశ్వవిద్యాలయ ప్రొఫెసర్‌ పాట్రిసియో నవియా చెప్పాడు. కరోనా సమయంలో అధికారంలో ఉన్న వారి వైఫల్యం 2021ఎన్నికల్లో వామపక్షం గెలవటానికి అవకాశం కల్పించిందని కొందరు చెబుతారు.పినోచెట్‌ అధికారం నుంచి తప్పుకున్న తరువాత జరిగిన ఎన్నికల్లో అమరజీవి సాల్వెడార్‌ అలెండీ నాయకత్వం వహించిన సోషలిస్టు పార్టీ నేత మిచెల్లీ బాచ్‌లెట్‌ రెండుసార్లు, మరో ఉదారవాద నేత ఒకసారి మితవాదులు రెండుసార్లు ఎన్నికయ్యారు. అందువలన అలాంటి సూత్రీకరణలు చెల్లవు. అయితే బాచ్‌లెట్‌ పాలన మీద కూడా జనంలో అసంతృప్తి వల్లనే తరువాత ఎన్నికల్లో వామపక్ష నేతలు ఓడిపోయారు. ఈ ఎన్నికల్లో విదేశాల్లో ఉన్న చిలియన్లు ఆరుశాతం( పది లక్షల మంది) కీలకంగా మారనున్నారని చెబుతున్నారు. గతంలో కూడా వారు ఉన్నారు, అయితే ఈ సారి ఒక కమ్యూనిస్టు నేరుగా రంగంలోకి దిగుతున్న కారణంగా మితవాద శక్తులకు మద్దతుగా వారు పని చేస్తారని వారి ఓట్లు ఫలితాన్ని తారు మారుచేస్తాయని సూత్రీకరిస్తున్నారు.

కాడెమ్‌ సంస్థ తాజా ప్రజాభిప్రాయసర్వేలో కమ్యూనిస్టు జారాకు 29శాతం, మితవాద కాస్ట్‌కు 27, మిగతా మితవాద శక్తులందరికీ 25శాతం మద్దతు ఉన్నట్లు పేర్కొన్నారు.ఎన్నికల నిబంధనావళి ప్రకారం ప్రత్యక్ష పద్దతిలో జరిగే ఎన్నికలలో 50శాతంపైగా ఓట్లు తెచ్చుకున్నవారిని విజేతగా ప్రకటిస్తారు. లేనట్లయితే ప్రధమ, ద్వితీయ స్థానాల్లో ఉన్న అభ్యర్థుల మధ్య డిసెంబరు నెలలో మరోసారి ఎన్నికలు జరిపి విజేతను తేలుస్తారు. మితవాదుల మొత్తం ఓట్లు 52శాతం ఉన్నాయి గనుక గంపగుత్తగా రెండవ దఫా ఓటింగ్‌లో పడతాయి గనుక కమ్యూనిస్టు గెలిచే అవకాశం లేదని సూత్రీకరిస్తున్నారు. గత ఎన్నికలలో తొలి దఫా ఏడుగురు పోటీ చేశారు.కాస్ట్‌కు 27.91శాతం ఓట్లు రాగా వామపక్ష అభ్యర్థి గాబ్రియల్‌ బోరిక్‌ 25.82శాతంతో ద్వితీయ స్థానంలో ఉన్నాడు. ముగ్గురు మితవాదులకు వచ్చిన మొత్తం ఓట్లు 53.51శాతం ఉన్నప్పటికీ తుది పోరులో బోరిక్‌ 55.87శాతం ఓట్లతో విజయం సాధించాడు. అప్పుడు కూడా ఎన్నికల పండితులు కాస్ట్‌ గెలుపు గురించి జోశ్యాలు చెప్పారు. ఇదే కాడెమ్‌ సంస్థ ఆ ఎన్నికలలో జరిపిన చివరి సర్వేలో కాస్ట్‌ 29, బోరిక్‌ 27శాతం ఓట్లతో మొదటి రెండు స్థానాల్లో ముందున్న ఉన్నట్లు చెప్పింది. కాడెమ్‌ అనే సంస్థ తాజాగా ప్రకటించిన రేటింగ్‌ ప్రకారం జారా 29, కాస్ట్‌ 27, కొద్ది నెలల క్రితం ప్రధాన నేతగా ముందుకు వచ్చిన మరో మితవాద నాయకురాలు ఎవలిన్‌ మత్తయ్‌ 14శాతంతో మూడో స్థానంలో ఉన్నారు. కమ్యూనిస్టు జారా జూలై ఆరవ తేదీన ఒక సంస్థ సర్వేలో ఆమెకు 39శాతం మద్దతు వున్నట్లు తేలింది. ఇంకా నాలుగు నెలల వ్యవధిలో ఏ మార్పులు జరుగుతాయో, ఏ అంశాలు ఓటర్లను ప్రభావితం చేస్తాయో చూడాల్సి ఉంది.


కమ్యూనిస్టు వ్యతిరేకతను బాగా రెచ్చగొట్టిన లాటిన్‌ అమెరికాలో కమ్యూనిస్టులకు ఆదరణ పెరగటం గమనించాల్సిన అంశం. వర్తమాన ఎన్నికల్లో కూడా జారాకు ప్రధాన ప్రత్యర్ధిగా ఉన్న కాస్ట్‌ అదే చేస్తున్నాడు. ఆమె గెలిస్తే క్యూబా, వెనెజులా మాదిరి నియంత పాలనను రుద్దుతారంటూ తప్పుడు ప్రచారానికి దిగాడు. మానవహక్కులకు భంగం కలిగించే దేశాలకు జారా మద్దతు ఇస్తారంటూ మీడియా కూడా రెచ్చగొడుతున్నది. విదేశీ ప్రభుత్వాలకు లేదా నమూనాలకు లోబడి ఉండేవిధంగా చిలీ ఉండాలని తాను కోరుకోవటం లేదని, మానహక్కులకు భంగం వాటిల్లిన చోట వాటి రక్షణకు, స్వతంత్ర చిలీ స్వతంత్ర విదేశాంగ విధానాన్ని, బహుపాక్షికత మార్గాన్ని అనుసరిస్తాను తప్ప ఇతర దేశాలను అనుకరించేది లేదంటూ జారా దాన్ని తిప్పికొట్టారు. రెండవ ప్రపంచ యుద్ధానికి ముందు కమ్యూనిస్టు పార్టీ చిలీలో ఒక గణనీయశక్తి. తరువాత కాలంలో ప్రభావాన్ని కోల్పోయింది. పది సంవత్సరాల క్రితం నామమాత్రంగా ఉండి ఇప్పుడు అధ్యక్ష పదవికి అధికారంలో ఉన్న కూటమి అభ్యర్థిగా ఎంపిక కావటం చిన్న విషయమేమీ కాదు.చిలీ సమాజంలో కమ్యూనిస్టు వ్యతిరేకత కరిగిపోతున్నదనటానికి ఒక చిహ్నం. అయితే ఇంకా ఎంతో మార్పు రావాల్సి ఉంది !

రైతాంగానికి పొంచి ఉన్న ముప్పు : ఇండోనేషియా మాదిరే భారత వాణిజ్య ఒప్పందం అన్న ట్రంప్‌, రఘురామ రాజన్‌ హితవచనం తలకెక్కుతుందా!

Tags

, , , , , , , , ,

ఎం కోటేశ్వరరావు


అమెరికా అధినేత డోనాల్డ్‌ ట్రంప్‌ విధించిన వాణిజ్య ఒప్పంద బెదిరింపు గడువు ఆగస్టు ఒకటవ తేదీ దగ్గరపడుతున్నది. ఏం చేస్తే దేశీయంగా ఏ పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందో అన్న ఆందోళనలో ప్రధాని నరేంద్రమోడీ ఉన్నారు. జూలై 21వ తేదీ నుంచి పార్లమెంటు సమావేశాలు జరుగుతున్నాయి. ఆపరేషన్‌ సిందూర్‌తో పాటు వాణిజ్య ఒప్పందం గురించి ప్రతిపక్షాలు నిలదీసే అవకాశం ఉంది. ఇరుదేశాల లావాదేవీలలో పైచేయిగా ఉన్నా ఒకటికి పదిసార్లు మనవారు ట్రంప్‌ గడప తొక్కటమే ఒక బలహీన సూచన. ఇండోనేషియాతో కుదుర్చుకున్న ఒప్పందం మాదిరే భారత్‌తోనూ ఉండబోతోందని ట్రంప్‌ ఇప్పటికే ఒక లీకు వదిలాడు.వాణిజ్య చర్చల్లో డోనాల్ట్‌ ట్రంప్‌తో జాగ్రత్తగా ఉండండి, ముఖ్యంగా విదేశీ సబ్సిడీలు ఎక్కువగా ఉండే వ్యవసాయరంగంలో కుదుర్చుకొనే ఒప్పందాలు దేశంలోని చిన్న రైతులకు హానికరంగా ఉంటాయని రిజర్వుబ్యాంకు మాజీ గవర్నర్‌ రఘురామ్‌ రాజన్‌ హెచ్చరించారు. పిటిఐ వార్తా సంస్థతో మాట్లాడుతూ ఎలాంటి ఆటంకాలు లేని వ్యవసాయ ఉత్పత్తుల దిగుమతులు హానికలిగిస్తాయన్నారు. బహుశా ఇండోనేషియా ఒప్పందం గురించి ఉప్పంది ఉంటుంది.మన దేశంలోకి బయటి నుంచి మరిన్ని పాల ఉత్పత్తులను స్వాగతించటం కంటే ఆ రంగంలో విలువ ఆధారిత ఉత్పత్తుల పెంపుదలకు ప్రత్యక్ష పెట్టుబడులను ఆహ్వానించాలని రాజన్‌ చెప్పారు. అమెరికా పన్నులతో ఆరు నుంచి ఏడు శాతం మధ్య ఉన్న మన జిడిపి వర్తమాన వృద్ధి రేటు స్వల్పంగా తగ్గుతుందని, చైనా వస్తువులపై పన్నులు ఎక్కువగా ఉన్నందున ప్రత్నామ్నాయంగా మన ఎగుమతులు పెరగవచ్చని అన్నారు.


లోకం దృష్టిలో ఎంతటి సమర్ధులైనా ఏదో ఒక సమయంలో ఏదో ఒక సమస్యతో అల్లాడిపోకతప్పదు. ఇప్పుడు ప్రధాని నరేంద్రమోడీ స్థితి అదేనా ? కరవ మంటే కప్పకు, విడవ మంటే పాముకు కోపం తెలిసిందేగదా ! ఇక్కడ భారతీయులు కప్పలు, అమెరికా కార్పొరేట్లు పాములు. సుత్తిలేకుండా సూటిగా చెప్పాలంటే మన మార్కెట్‌ను తెరవాలని ట్రంప్‌ వత్తిడి తెస్తుంటే మన జనాలు ఎలా స్పందిస్తారో అని మోడీ ఎటూతేల్చుకోలేకపోతున్నారు. జూలై తొమ్మిదవ తేదీలోగా ఒప్పందంపై సంతకాలు జరగాల్సిందే అని వత్తిడి చేసిన డోనాల్డ్‌ ట్రంప్‌ ఆగస్టు ఒకటవ తేదీ వరకు గడువు పొడిగించాడు. ఒప్పందం కుదిరిందన్నట్లుగా ఎప్పటి నుంచో పదేపదే చెబుతున్నప్పటికీ మన పాలకులు మౌనం తప్ప మాటలేదు. మీడియాలో రకరకాల ఊహాగానాలు వస్తున్నాయి.అయినా స్పందన లేదు. పోనీ ప్రతిపక్షాలను పిలిచి సమస్యలు, సవాళ్ల గురించి ఏదైనా సలహాలు తీసుకున్నారా అంటే అదీ లేదు, అంతా గుంభనం.
భారత్‌తో కుదిరే ఒప్పందం ఇండోనేషియాతో కుదిరిన దానికి ప్రతిబింబంగా ఉంటుందని ట్రంప్‌ సూచన ప్రాయంగా చెప్పాడు. ఆగస్టు ఒకటవ తేదీలో ఒప్పందానికి రాకుంటే ఇండోనేషియా ఉత్పత్తులపై 32శాతం దిగుమతి పన్ను విధిస్తామని లేఖా బెదిరింపులో పేర్కొన్నాడు. పద్దెనిమిది బిలియన్ల డాలర్ల మేర వాణిజ్య మిగులుతో ఉన్న ఇండోనేషియాతో కుదిరిన ఒప్పందం ప్రకారం 32కు బదులు 19శాతం పన్ను విధిస్తారు. అయితే అమెరికా వస్తువులపై ఇండోనేషియాలో ఎలాంటి పన్నులు ఉండవని ట్రంప్‌ చెప్పాడు. పశుపెంపకదారులు, రైతులు, మత్స్యకారుల ఉత్పత్తులను సులభంగా ఇండోనేషియాలో అమ్ముకోవచ్చని అన్నాడు. అయితే ఒప్పంద వివరాలు ఇంకా వెల్లడి కాలేదు గానీ, నామ మాత్ర పన్నులు ఉండవచ్చని భావిస్తున్నారు. ఇది ఇండోనేషియాకు నష్టదాయకమని నిపుణులు వ్యాఖ్యానించారు. అమెరికా వస్తువులకు పూర్తి మార్కెట్‌ను తెరుస్తారు. బోయింగ్‌ 777 రకం 50విమానాలను, 15బిలియన్‌ డాలర్ల ఇంథనం, 4.5 బిలియన్‌ డాలర్ల వ్యవసాయ ఉత్పత్తులను కొనుగోలు చేసేందుకు ఇండోనేషియా అంగీకరించింది. వారు విమానాలను ఆమ్ముకోవాలి, మాకు వాటి అవసరం ఉందని అధ్యక్షుడు ప్రభువు సుబియాంతో చెప్పాడు. ఎలాంటి పన్నులు లేకుండా అమెరికా వస్తువులను దిగుమతి చేసుకుంటున్నారా అన్న ప్రశ్నకు సూటిగా చెప్పకుండా ప్రతిదాన్నీ సంప్రదిస్తున్నామని మాత్రమే అన్నాడు. పాదరక్షలు, దుస్తులు, పామాయిల్‌ను ఇండోనేషియా ఎగుమతి చేస్తున్నది.


పరస్పర లబ్ది చేకూర్చే నూతన యుగం అని ఒప్పందం గురించి ఇండోనేషియ నేత ప్రభువు వర్ణించగా కొత్త పన్నుల విధానంతో గణనీయ మొత్తంలో పెట్టుబడులను ఆకర్షిస్తామని, ఎగుమతులు పెరుగుతాయని వాణిజ్య మంత్రి బుడి సంతోసో అన్నాడు. ఒప్పందం ప్రతికూలంగా ఉంటుందని ఒక ఇండోనేషియా అధ్యయన సంస్థ డైరెక్టర్‌ భీమా యుధిష్టిర చెప్పాడు.(ఇండోనేషియాలో ముస్లింల పేర్లు మహాభారత, రామాయణ,పురాణాల్లోవే ఎక్కువగా ఉంటాయి). ఎగుమతులు పెరిగినా అమెరికా నుంచి దిగుమతులు ఇబ్బడిముబ్బడి అవుతాయన్నాడు. వియత్నాం పోటీ సామర్ధ్యం ఎక్కువ, రెండు దేశాలకు పన్నుల్లో ఇండోనేషియాకు ఒకశాతమే తక్కువ గనుక పోటీలో నష్టపోతామని చెప్పాడు. అమెరికా నుంచి దిగుమతి చేసుకొనే వస్తువులు స్థానికంగా ఉత్పత్తి చేసేవే అయితేగనుక దేశీయ పరిశ్రమలకు దెబ్బ అని ప్రొఫెసర్‌ విశాంతి చెప్పారు. స్థానిక వస్తువుల బదులు విదేశీ వస్తువులతో మార్కెట్‌ను నింపితే ప్రతికూలమే అని అమె అన్నారు.

గూగుల్‌తల్లిని అడిగితే కృత్రిమ మేథ రూపంలో అందించిన సమాచారం ప్రకారం అమెరికాలో కోడి మాంసం ధరలు అన్ని చోట్లా ఒకే విధంగా లేవు.ఉదాహరణకు సెలీనా వాముసీ వివరాల మేరకు పౌండు(450గ్రాములు) ధర 1.6 నుంచి 2.97 డాలర్ల వరకు ఉంది. అదే గ్రేజ్‌కార్ట్‌ వివరాల ప్రకారం డజను కోళ్ల ధర 428 డాలర్లు, ఒక్కొక్కదాని ధర 35.67 డాలర్లు, ఒక్కో కోడి సగటున 4.2 పౌండ్లు, అంటే రెండు కిలోలకు వంద గ్రాములు తక్కువ.హడ్సన్‌ వాలీ కోళ్ల ఫారంలో 4 పౌండ్ల బరువు ఉండే ఒక మొత్తం కోడి ధర 18 డాలర్లు. చికెన్‌ బ్రెస్ట్‌ ధర పౌను 8.5 నుంచి 12 డాలర్ల వరకు, కోడి డ్రమ్‌స్టిక్స్‌ వెల 4.99, కాళ్ల ధర 5.36 డాలర్ల వరకు ఉంది. అమెరికాలో కోడి కాళ్లు తినరు. అందుకే బ్రెస్ట్‌, కాళ్ల ధరలో అంత తేడా ఉంది. ఎప్పటి నుంచో అమెరికన్లు తమ దగ్గర గుట్టలుగా పడిఉన్న కోడి కాళ్లను మన దేశానికి ఎగుమతి చేయాలని చూస్తున్నారు. అమెరికాతో పోలిస్తే మనదేశంలో కోడి మాంసం ధర తక్కువ. అందువలన అంతకు మించి ఎక్కువ ఉంటే దిగుమతి చేసుకున్న సరకును కొనుగోలు చేసే అవకాశం లేదు. కనుక మన ధరలకు సమానంగా ఉండేట్లు చూస్తారు. అందుకు గాను అమెరికా ప్రభుత్వం పెద్ద మొత్తంలో సబ్సిడీ ఇస్తుంది, మన ప్రభుత్వం దిగుమతులపై సుంకాన్ని గణనీయంగా తగ్గించాల్సి ఉంటుంది. అదే జరిగితే మన కోళ్ల పరిశ్రమ కుదేలే.

తమ కోడి మాంస ఉత్పత్తులకు మార్కెట్‌ తెరవాలని, దిగుమతి పన్ను తగ్గించాలని అమెరికా పదేండ్ల క్రితమే మోడీ సర్కార్‌ మీద వత్తిడి తెచ్చింది. దాన్ని మన యావత్‌ పరిశ్రమ వర్గాలు వ్యతిరేకించాయి.వెనక్కు తగ్గిన కేంద్రం తరువాత ప్రపంచ వాణిజ్య సంస్థ నిబంధనల పేరుతో టర్కీ, బాతు మాంసంపై ఉన్న 30శాతం పన్నును ఐదుశాతానికి తగ్గించింది. కోళ్ల ఉత్పత్తులపై వందశాతం పన్ను అమలు చేస్తున్నారు.చిన్నా, పెద్ద రైతులు, వారి మీద ఆధారపడిన వారు కోళ్ల పెంపకంలో 30లక్షల మంది ఉన్నారు. అమెరికా తెస్తున్న వత్తిడిలో జన్యుమార్పిడి మొక్కజొన్నల దిగుమతి కూడా ఒకటి. ఇది కూడా మన రైతాంగాన్ని దెబ్బతీసేదే. మొక్క జొన్నల దిగుమతి అనుమతించాలని కోళ్ల పరిశ్రమవారు, కూడదని సాగు రైతులు డిమాండ్‌ చేస్తున్నారు. ఇది మిత్ర వైరుధ్యం.ఎవరి లాబీ బలంగా ఉంటే వారి ప్రయోజనం నెరవేరే అవకాశం ఉంది, అయితే దానికి ప్రతికూల ఫలితాలను కూడా పాలక పార్టీ అనుభవించాల్సి ఉంటుంది. శ్రీలంకలో కోడి మాంస ఉత్పత్తుల దిగుమతులను అనుమతించటంతో అక్కడి పరిశ్రమ దెబ్బతిన్నది. ఇప్పుడు మొక్కజొన్నల దిగుమతి కోసం పరిశ్రమ, వద్దంటూ రైతులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.దిగుమతి చేసుకున్న సరకు కిలో ధర 0.43 నుంచి 0.46 డాలర్లు గిడుతున్నది, తమకు 0.56 డాలర్లు వస్తే తప్ప గిట్టుబాటు కాదు గనుక దిగుమతులు వద్దని, దిగుమతి సుంకం పెంచాలని రైతులు అంటున్నారు. కోళ్ల పరిశ్రమ దీన్ని వ్యతిరేకిస్తున్నది ప్రస్తుతం కిలోకు 0.08 డాలర్లు దిగుమతి పన్ను ఉందని, ఇంకా పెంచితే కోడి మాంసం, గుడ్ల ధరలు పెరుగుతాయని, తమకు గిట్టుబాటు కాదని వారంటున్నారు.

అమెరికా పాడి ఉత్పత్తులకు మనం ద్వారాలు తెరిస్తే సగటున 15శాతం మేరకు పాల ధరలు పతనమై ఏటా రు.1.8లక్షల కోట్లు నష్టం వస్తుందని, దానిలో రైతులు రు.1.03లక్షల కోట్లు నష్టపోతారని స్టేట్‌బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా( ఎస్‌బిఐ) అధ్యయనం హెచ్చరించింది. భారీ మొత్తంలో దిగుమతులు పెరిగి కోట్లాది మంది రైతుల జీవితాలు దెబ్బతింటాయని పేర్కొన్నది.(పాడి పరిశ్రమపై ఎనిమిది కోట్ల మంది ఆధారపడి ఉన్నారని ఒక అంచనా) పాల ధరలు తగ్గితే గిరాకీ 1.4 కోట్ల టన్నులు పెరుగుతుందని, అదే సమయంలో 1.1 కోట్ల టన్నుల సరఫరా తగ్గుతుందని, రెండిరటి మధ్య తేడా 2.5 కోట్ల టన్నులను దిగుమతుల ద్వారా పూడ్చుకోవాల్సి ఉంటుందని, చిన్న డైరీలు, రైతులు తీవ్రంగా దెబ్బతింటారని కూడా ఎస్‌బిఐ హెచ్చరించింది. అమెరికా జన్యుమార్పిడి ఉత్పత్తులతో ఆరోగ్య సమస్యలు కూడా తలెత్తుతాయని పేర్కొన్నది. వాణిజ్య ఒప్పందం కుదిరితే జపాన్‌, మలేసియా, దక్షిణ కొరియాల నుంచి అమెరికాకు రసాయనాల ఎగుమతులు తగ్గి మన ఎగుమతులు మరొక శాతం పెరుగుతాయని జిడిపి0.1శాతం పెరుగుతుందని, దుస్తుల ఎగుమతులు ఆరు నుంచి 11శాతానికి పెరుగుతాయని చెప్పింది. జనరిక్‌ ఔషధాలతో పాటు ఆర్గానిక్‌ వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులు ప్రస్తుతం ఉన్న ఒక బిలియన్‌ నుంచి మూడు బిలియన్‌ డాలర్ల వరకు పెరుగుతాయని పేర్కొన్నది.ప్రతిపాదిత వాణిజ్య ఒప్పందం రెండంచుల పదును గల కత్తి వంటిదని కూడా హెచ్చరించింది. అమెరికా పాడి ఆవులకు ఇచ్చే మేతలో జంతు సంబంధిత అంశాలు లేవని నిర్ధారిస్తూ హామీ ఇవ్వాలని భారత్‌ గతంలో పేర్కొన్నది. ఇప్పుడు దానికి కట్టుబడి ఉందా లేదా అన్నది ఒక చర్చ సాగుతున్నది. అలాంటి పాలను మాంసాహారంగా పరిగణించే 30శాతం మందిగా ఉన్న శాఖాహారులు వాటి ఉత్పత్తులైన జున్ను, వెన్న, పాలను భుజించేందుకు అంగీకరించరు. మొత్తం మీద వ్యవసాయం, అనుబంధ పాడి, కోళ్ల పెంపకం వంటి మీద ఏం జరుగుతుందో అన్న అనుమానం, భయం రైతాంగంలో ఉన్నాయి. ట్రంప్‌ చెప్పినట్లు ఇండోనేషియా మాదిరి మనతో ఒప్పందం ఉంటే అది కచ్చితంగా ముప్పే. మోడీ దేవుడు అని నమ్ముతున్నవారికి ఒప్పందం పీక్కుతినే దెయ్యంగా మారుతుందా ఏం జరుగుతుందో చూడాల్సిందే !

ఉక్రెయిన్‌ పోరుకు 50 రోజుల గడువు : తగ్గేదేలే అన్న పుతిన్‌, మాటమార్చిన ట్రంప్‌!

Tags

, , , , ,

ఎం కోటేశ్వరరావు


రానున్న యాభై రోజుల్లో ఉక్రెయిన్‌పై దాడులను ఆపకపోతే తీవ్రమైన ఆంక్షలు విధిస్తానని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ తాజాగా గడువు ప్రకటించాడు.దీనితో పాటు ఉక్రెయిన్‌కు పేట్రియాట్‌ క్షిపణులు అందిస్తానని కూడా వెల్లడిరచాడు. ఈ బెదిరింపు, ఆయుధ సరఫరాను చూసి భయపడేదేలేదని, పోరు కొనసాగింపుకే వ్లదిమిర్‌ పుతిన్‌ ముందుకు పోవాలనే వైఖరితో ఉన్నట్లు మాస్కో వర్గాలు చెప్పినట్లు రాయిటర్‌ వార్త పేర్కొన్నది. ఇదిలా ఉండగా మాస్కోపై ఎలాంటి దాడులు చేయవద్దని ఉక్రెయిన్‌ నేత జెలెనెస్కీని ట్రంప్‌ ఆదేశించాడు, బెదిరించిన ఒక రోజులోనే ట్రంప్‌ మాట మార్చాడు. ఉక్రెయిన్‌ సంక్షోభం బుధవారం నాటికి 1,238వ రోజులో ప్రవేశించింది. పరస్పరదాడులు సాగుతున్నాయి, కొత్త ప్రాంతాలను రష్యా ఆధీనంలోకి తెచ్చుకుంటూనే ఉంది. అధికారం స్వీకరించిన 24గంటల్లో పోరును ఆపివేస్తానని ప్రకటించిన ట్రంప్‌ అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎన్ని మాటలు మార్చాడో, ప్రగల్భాలు పలికాడో తెలిసిందే. పోరును గనుక ఆపకపోతే రష్యా నుంచి దిగుమతులు చేసుకొనే దేశాలపై 100 శాతం సుంకాలు విధిస్తానని తాజాగా బెదిరించాడు, కొద్ది రోజుల క్రితం 500శాతం అని చెప్పిన సంగతి తెలిసిందే. జూన్‌ నెల సమాచారం ప్రకారం మనదేశం రష్యా నుంచి దిగుమతి చేసుకుంటున్న ముడి చమురు రోజుకు 20.8లక్షల పీపాలకు చేరి పదకొండు నెలల గరిష్ట రికార్డును సృష్టించింది. తాజా సమాచారం ప్రకారం రష్యా నుంచి తమ అవసరాల్లో చైనా 47, భారత్‌ 38, ఐరోపా యూనియన్‌, టర్కీ ఆరేసి శాతాల చొప్పున దిగుమతి చేసుకుంటున్నాయి. మన దేశం ఇతర దేశాల నుంచి చూస్తే ఇరాక్‌ 18.2, సౌదీ అరేబియా 12.1, యుఏయి 10.2, అమెరికా నుంచి 6.3శాతాల చొప్పున దిగుమతి చేసుకుంటున్నాము.

సోమవారం నాడు ప్రగల్భాలు పలికిన ట్రంప్‌ మంగళవారం నాడు మాట మార్చాడు.దీర్ఘశ్రేణి క్షిపణులను ఉక్రెయిన్‌కు ఇచ్చే అవకాశం ఉందా అన్న ప్రశ్నకు లేదు, ఆలాంటి ఆలోచన చేయటం లేదని చెప్పాడు. జూలై నాలుగవ తేదీన మాస్కో, సెంట్‌పీటర్స్‌బర్గ్‌లపై దాడి చేయగలరా అంటూ ఫోన్లో జెలెనెస్కీని ట్రంప్‌ అడగ్గా కచ్చితంగా మీరు గనుక మాకు ఆయుధాలిస్తే కొడతాం, రష్యా పట్టణాల మీద దాడి చేసి వారికి నొప్పితెలిసేట్లు చేయండని ట్రంప్‌ వ్యాఖ్యానించినట్లు ఫైనాన్సియల్‌ టైమ్స్‌ రాసింది. హత్యలను ఆపాలని కోరుతున్న తాను, పోరు ఆపాలని, మానవత్వంవైపు తప్ప ఎవరి పక్షమూ కాదని మంగళవారం నాడు అధ్యక్ష భవనంలో ట్రంప్‌ విలేకర్లతో చెప్పాడు. అధ్యక్షుడు కేవలం ప్రశ్నలను అడిగాడు తప్ప హింసాకాండను ప్రోత్సహించేందుకు కాదని ట్రంప్‌ ప్రతినిధి చెప్పాడు. సైనిక చర్య ముగింపు గడువు విధింపు, ఆధునిక ఆయుధాలు అందచేయాలన్న ట్రంప్‌ ప్రకటనను రష్యా నేత పుతిన్‌ ఖాతరు చేయలేదని రాయిటర్స్‌ పేర్కొన్నది. మిలిటరీ చర్యను ముగించే ఆలోచనలో కూడా లేదని, లక్ష్యాన్ని సాధించేవరకు కొనసాగుతుందని క్రెమ్లిన్‌ వర్గాలు తెలిపినట్లు వెల్లడిరచింది. ట్రంప్‌, పశ్చిమదేశాల బెదిరింపులకు భయపడటం లేదని యుద్ధం కొనసాగించటానికి వీలుగా తమ ఆర్థిక పరిస్థితి ఉందని అన్నట్లు కూడా రాసింది.


గత కొద్ది నెలలుగా ముఖ్యంగా ట్రంప్‌ గెలిచిన తరువాత ఉక్రెయిన్‌కు ఆయుధ సరఫరాల గురించి అమెరికా, ఇతర నాటో కూటమి దేశాలు తర్జన భర్జనలో ఉన్నాయి. ట్రంప్‌ ఓవల్‌ ఆఫీసులో సోమవారం నాడు నాటో ప్రధాన కార్యదర్శి మార్క్‌ రూటే భేటీ జరిపినపుడు ట్రంప్‌ తమ నిర్ణయాన్ని వెల్లడిరచాడు. యాభై రోజుల్లో గనుక పోరు విరమణ ఒప్పందం కుదరకపోతే వందశాతం పన్నులు విధిస్తాం, దాని అర్ధం మీకు తెలిసిందే, అనేక అంశాలపై వాణిజ్యాన్ని వినియోగిస్తాను, అవి యుద్ధాల పరిష్కారాలకు ఎంతో దోహదం చేస్తాయి అన్నాడు. ఆపరేషన్‌ సిందూర్‌ నిలిపివేసి పాకిస్తాన్‌తో రాజీకి వచ్చే విధంగా భారత్‌ను రప్పించేందుకు వాణిజ్య ఆయుధాన్ని వినియోగించినట్లు చెప్పిన అంశాన్ని ఇక్కడ గుర్తుకు తెచ్చుకోవటం అవసరం. తమ అధ్యక్షుడు చెప్పిన పన్నుల విధింపు అంటే రష్యాతో వాణిజ్యం చేసే ఇతర దేశాల మీద అని అధికారవర్గాలు వివరించాయి. రష్యాతో అమెరికా వాణిజ్యం పెద్దగా ఏమీ లేదు గనుక దాని మీద అపరాధ సుంకాలు విధించేదేమీ ఉండదు. వాస్తవానికి రష్యా మీద ఆంక్షలేమీ ఉండవని, దాని దగ్గర నుంచి చమురు కొనుగోలు చేసేవారి మీద విధించే పన్నుల గురించి ట్రంప్‌ చెప్పినట్లు నాటోలో అమెరికా రాయబారి వైట్‌కర్‌ మాట్‌ చెప్పాడు.ఈ చర్యతో రష్యాపై నాటకీయంగా ప్రతికూల ప్రభావాలు ఉంటాయని అన్నాడు. అయితే అమెరికా బెదిరింపులను గతంలోనే అమెరికా, భారత్‌ ఖాతరు చేయని సంగతి తెలిసిందే. రష్యా కూడా లెక్క చేయలేదు.


గత ఆరునెలలుగా పుతిన్‌తో సంప్రదింపుల గురించి చెబుతున్నప్పటికీ ఉక్రెయిన్‌పై దాడులు పెరుగుతున్నాయే తప్ప తగ్గలేదని రష్యాతో వాణిజ్యం చేసే దేశాలపై 500శాతం పన్ను విధించాలనే తీర్మానాన్ని పార్లమెంటులో ప్రవేశపెడతానని చెప్పిన సెనెటర్‌ లిండ్సే గ్రాహమ్‌ చెప్పాడు. గొప్పలు చెప్పుకున్న ట్రంప్‌ అది జరగకపోవటంతో అవమానభారంతో ఏం
మాట్లాడుతున్నాడో, ఏం చేస్తాడో తెలియని స్థితిలో ఉన్నాడంటే అతిశయోక్తి కాదు. పుతిన్‌ సేనలు, రష్యాపై దాడులు చేసేందుకు పేట్రియాట్‌ క్షిపణులు ఇస్తామని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ ప్రకటించి సంక్షోభాన్ని మరోమలుపు తిప్పాడు. పరిష్కరించాలనే చిత్తశుద్ది అమెరికాకు లేదన్నది స్పష్టం. ఈ క్షిపణి విధ్వంసక వ్యవస్థ ధర ఒక్కొక్కటి 40లక్షల డాలర్లు ఉంటుంది. ఉక్రెయిన్‌కు సరఫరా చేసే ఆయుధాలను ఐరోపాకు విక్రయించి అక్కడి నుంచి ఉక్రెయిన్‌కు తరలించే విధంగా అమెరికా నిర్ణయించింది. కీలక ఆయుధ సరఫరా నిలిపివేస్తున్నట్లు ప్రకటించి రష్యాను బుట్టలో వేసుకోవాలని ట్రంప్‌ చూశాడు. ఆ పప్పులు ఉడకలేదు, దాంతో ఆయుధాల సరఫరా పునరుద్దరించనున్నట్లు అమెరికా అధికారులు వెల్లడిరచారు. మరోవైపున శాంతి చర్చలకు చొరవ చూపేందుకు పోప్‌ లియో సుముఖంగా ఉన్నారని ఆయనను కలిసిన తరువాత జెలెనెస్కీ ప్రకటించాడు. దాని గురించి ఎటూ తేలక ముందే సరికొత్త ఆంక్షల గురించి ట్రంప్‌ ప్రకటించాడు. పుతిన్‌ గురించి నోరుపారవేసుకున్న ట్రంప్‌ తీరును తాము పట్టించుకోవటం లేదని గతవారంలో రష్యా స్పందించింది.ఆయుధ ఒప్పందం ఆటతీరునే మార్చి వేస్తుందని రూటే వర్ణించాడు.జర్మనీతో సహా ఫిన్లాండ్‌, డెన్మార్క్‌, స్వీడన్‌, నార్వే వంటివి అమెరికా నుంచి తీసుకొని నూతన ఆయుధాలను సరఫరా చేస్తాయని చెప్పాడు. తాను ముందుగా ఐరోపా దేశాలు ఇలాంటి చొరవ తీసుకుంటాయని అనుకోలేదని కానీ అవి చేశాయని ట్రంప్‌ అభినందించాడు.త్వరలో మరికొన్ని క్షిపణులను కూడా అందించేందుకు అమెరికా పూనుకుంది. రష్యా క్షిపణులను అడ్డుకొనేందుకు పేట్రియాట్‌ వ్యవస్థలను వినియోగిస్తామని, అయితే ఎదురుదాడి చేసే ఆయుధాలను కూడా ఇచ్చే అవకాశం ఉందని నాటోలో అమెరికా రాయబారి చెప్పాడు. నేరుగా ఉక్రెయిన్‌కు ఆయుధాలు విక్రయిస్తే వచ్చే విమర్శల నుంచి తప్పుకొనేందుకు, తన చేతికి మట్టి అంటకుండా, ఖజానా మీద భారం మోపకుండా ఐరోపా దేశాలకు ఆయుధాలను విక్రయించి అటు నుంచి తరలించేందుకు ట్రంప్‌ వేసిన ఎత్తుగడ ఇది.


అధికారానికి వచ్చిన తరువాత ఆర్భాటంగా పుతిన్‌తో నేరుగా మాట్లాడాడు. రష్యాకు రాయితీలు ఇవ్వాల్సిందే, కొన్ని ప్రాంతాలు వదులుకోవాల్సిందే, మేం 350 బిలియన్‌ డాలర్లు ఇచ్చినా యుద్దంలో గెలిచేది లేదు చచ్చేది లేదని జెలెనెస్కీతో చెప్పాడు. అతగాడిని మంచి హాస్యనటుడు అంటూనే ఎన్నికలు జరపని నియంత అన్నాడు.ఫిబ్రవరి 28న అధ్యక్ష భవనంలో బహిరంగంగా ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెనెస్కీని అవమానించి ఐరోపా భాగస్వాములను నిర్ఘాంతపరిచాడు. రష్యాను ఖండిస్తూ ఐరాసలో ప్రవేశపెట్టిన తీర్మానాన్ని వ్యతిరేకించాడు.ఐరోపా దేశాలన్నీ ఈ తీరును చూసి నిజంగానే ట్రంప్‌ తమను వదలి పుతిన్‌తో చేతులు కలిపి ఉక్రెయిన్ను అప్పగిస్తాడా అన్నంతగా భయపడ్డాయి. చివరికి భద్రతా మండలిలో రష్యామీద ఎలాంటి విమర్శలు లేని తీర్మానానికి మద్దతు ఇచ్చాయి. ఈలోగా ఉక్రెయిన్‌లోని విలువైన ఖనిజాలున్న ప్రాంతాన్ని తమకు అప్పగించాలని అమెరికా రాయించుకొని ఒప్పందం చేసుకుంది. ఎత్తుగడ ఏమిటో తెలియదు గానీ పదేండ్ల క్రితమే పుతిన్‌ గురించి ట్రంప్‌ పొగడ్తలు ప్రారంభించాడు. గత వారంలో చెప్పిన అంశాల సారాంశం ఇలా ఉంది. పుతిన్‌ పైకి కనిపించేంత మంచి వాడు కాదు, నేను ఎంతో ఆశాభంగం చెందాను, అతన్ని హంతకుడు అని చెప్పాలనుకోవటం లేదు కానీ గట్టి పిండం అని ఎన్నో సంవత్సరాలుగా రుజువైంది. బిల్‌క్లింటన్‌, బుష్‌,ఒబామా,జో బైడెన్‌ అందరినీ వెర్రి వెంగళప్పలను గావించాడు గానీ నన్ను చేయలేకపోయాడు.. ఒక రోజు ఇంటికి వెళ్లి నా సతీమణితో మాట్లాడుతూ నేను ఈ రోజు పుతిన్‌తో మాట్లాడాను, అద్భుతతమైన సంభాషణ చేశాను తెలుసా అని చెప్పాను. ఆమె తాపీగా అవునా నిజమేనా అంటూ మరో(ఉక్రెయిన్‌) పట్టణంపై దాడి జరిగింది అని చెప్పింది అన్నాడు. ఎవరైనా నేతలు అతగాడితో ఫోన్లో మాట్లాడుతుండగానే ఉక్రెయిన్‌పై దాడులు చేయిస్తుంటాడు అని ట్రంప్‌ చెప్పాడు.


గత గురువారం నాడు రోమ్‌ నగరంలో ఉక్రెయిన్‌ స్వస్థత సమావేశం జరగటానికి ముందు జెలెనెస్కీ ఇటలీలో ట్రంప్‌ ప్రతినిధి కెయిత్‌ కెలోగ్‌తో సమావేశం సందర్భంగా రష్యా దాడులను తీవ్రం కావించింది. పోప్‌ లియోను రెండు నెలల్లోనే జెలెనెస్కీ రెండుసార్లు కలిశాడు. పోరు ఇంకా కొనసాగుతుండగానే ఉక్రెయిన్‌ పునరుద్దరణ పథకాలు దానికి అవసరమైన పెట్టుబడులు, దానిలో పాలుపంచుకొనే దేశాలు, నిర్మాణ సంస్థల గురించి పశ్చిమదేశాలు వాణిజ్య చర్చలు జరిపాయి. ఇప్పటికే ఐరోపాలో ఉన్న పేట్రియాట్‌ క్షిపణులను వెంటనే ఉక్రెయిన్‌కు తరలించి మిగతావాటిని అమెరికా ఫ్యాక్టరీల్లో తయారు చేసి అందచేస్తారు. మీరు గనుక ఉక్రెయిన్‌ మీద దాడి చేస్తే నేను మాస్కో మీద బాంబులు వేయిస్తానని పుతిన్‌తో మాట్లాడినపుడు ట్రంప్‌ బెదిరించాడన్న వార్త గుప్పుమన్నది. అయితే వారి మధ్య ఆ సంభాషణ ఎప్పుడు జరిగిందో, అది నిజమో కాదో నిర్ధారణ కాలేదు గానీ, ఆధునిక ఆయుధాలను ఇస్తాన్న ట్రంప్‌ మాటలు దాన్ని నిర్ధారిస్తున్నాయి.కొద్ది వారాల క్రితం రష్యా భూభాగంలో ప్రవేశించి అనేక చోట్ల ఉక్రెయిన్‌ జరిపిన దాడుల వెనుక అమెరికా హస్తం లేదని ఎవరూ చెప్పలేరు.


రష్యా ఆధీనంలోని జపోర్‌రిaయా ప్రాంతంలో ఉన్న అణువిద్యుత్‌ కేంద్రంపై వందలాది రౌండ్ల కాల్పులు జరిపినట్లు అంతర్జాతీయ అణు ఇంధన సంస్థ చెప్పింది. అక్కడ అణు ప్రమాదం జరిగితే దానికి రష్యాను బాధ్యురాలిగా చేసి వత్తిడి తేవాలన్న కుట్ర దీనిలో కనిపిస్తోంది. దీని వెనుక పశ్చిమ దేశాల హస్తం ఉందని వేరే చెప్పనవసరం లేదు. పేట్రియాట్స్‌తో సహా ఆధునిక ఆయుధాలను అందచేయాలన్న నిర్ణయం నాటకీయంగా జరగలేదు. గత కొద్ది వారాలుగా మల్లగుల్లాలు పడుతున్నారు. వీటితో పుతిన్‌ దారికి వస్తాడని భావిస్తున్నట్లుగా కనిపిస్తున్నది. జూన్‌ లో జరిగిన నాటో సమావేశాల్లో ఒక కొలిక్కి వచ్చిన ఈ ఆలోచనపై అంతకు ముందే విధి విధానాల గురించి చర్చ మొదలైంది.నాటో నేరుగా ఆయుధాలు పంపితే అది రష్యాకు ఒక అస్త్రంగా మారుతుంది, అన్నింటికీ మించి నాటో కూడా యుద్ధంలో పాల్గ్గొన్నట్లే, అందుకే కొన్ని దేశాలను ఎంపిక చేసి వాటి ద్వారా కథనడిపిస్తున్నారు. ఒకవేళ అమెరికా తప్పుకుంటే తామే ఉక్రెయిన్‌కు బాసటగా నిలవాలని ఐరోపా దేశాలు స్థూలంగా ఒక అభిప్రాయానికి వచ్చిన తరువాత అయితే మా దగ్గర ఆయుధాలు కొని మీరే జెలెనెస్కీకి ఇవ్వండని అమెరికన్లు వారిని కట్టుబడేట్లు చేసినట్లు కూడా చెప్పవచ్చు. మీరు ఆధునిక ఆయుధాలు ఇస్తారు, అవి రష్యా క్షిపణులను అడ్డుకుంటాయి సరే, మా కుటుంబాల ప్రాణాలను కాపాడతాయో లేదో చెప్పండని ఉక్రేనియన్‌ సైనికులు కొందరు సిఎన్‌ఎన్‌తో మాట్లాడిన మాటలు ఒక్క మిలిటరీలోనే కాదు, యావత్తు ఉక్రేనియన్లలో ఉంటాయని వేరే చెప్పనవసరం లేదు. అందుకే జెలెనెస్కీ అవమానాలు భరించి కూడా ఆయుధాల కోసం విలువైన ఖనిజాలున్న ప్రాంతాలను అమెరికాకు రాసి ఇచ్చిన తరువాత దేశం మొత్తాన్ని నాటో కూటమికి తాకట్టు పెట్టినా ఆశ్చర్యం లేదు. ఏం జరుగుతుందో చూద్దాం !

ఎడారిలో ఇసుక అమ్మకం – ఎలన్‌ మస్క్‌ అమెరికా పార్టీ !

Tags

, , , , , ,

ఎం కోటేశ్వరరావు


ప్రపంచ ధనికుడు ఎలన్‌ మస్క్‌ అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ మీద ఆగ్రహంతో ‘‘ అమెరికా పార్టీ ’’ పేరుతో రాజకీయ సంస్థను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించేశాడు. దాని మీద రాజకీయ పండితులు చర్చలు చేస్తున్నారు. తమకు ప్రయోజనం కలిగించని లేదా వ్యతిరేకించిన పాలకుల మీద ఆగ్రహించిన వాణిజ్య, పారిశ్రామికవేత్తలు డబ్బుమదంతో తెల్లవారేసరికి పార్టీ పెట్టి తడాఖా చూపుతామంటూ హడావుడి చేయటం అన్ని దేశాలలో జరిగేదే. అమెరికాలో కూడా అదే జరిగింది. ఇప్పుడున్న స్థితిలో అతగాడి ప్రయత్నం ఎడారిలో ఇసుక అమ్మటమే అవుతుందన్నది ఒక వ్యాఖ్య. ట్రంప్‌తో ప్రేమాయణానికి కటీఫ్‌ చెప్పిన తరువాత తన ఫ్యాక్టరీలు, వ్యాపారాలను చూసుకుంటానని చెప్పిన పెద్దమనిషి బిగ్‌, బ్యూటీఫుల్‌( పెద్దది, అందమైన) బిల్లుగా వర్ణించినదానిని పార్లమెంటు గనుక ఆమోదిస్తే తాను రాజకీయ పార్టీని పెడతానని ప్రకటించాడు.ఆమోదం పొందటం, రాజకీయ పార్టీ ప్రకటన వెంటనే జరిగాయి.మఖలో పుట్టి పుబ్బలో అంతరించే పార్టీలు ప్రపంచమంతటా ఉన్నాయి. ఇది కూడా అలాంటిదే అవుతుందా, 24.7బిలియన్‌ డాలర్ల వ్యక్తిగత సంపదతో ప్రపంచ ధనికుడిగా ఉన్న మస్క్‌ డబ్బును వెదజల్లి అమెరికా రాజకీయాలను మలుపుతిప్పుతాడా, అక్కడ ఇప్పటికే తిష్టవేసిన రిపబ్లిన్‌, డెమోక్రటిక్‌ పార్టీలకు ప్రత్యామ్నాయంగా నిలుపుతాడా ? ఇలా పరిపరి విధాలుగా ప్రపంచ మీడియాలో చర్చలు జరుగుతున్నాయి. నిన్నటి వరకు ముద్దులాడుకున్న వారు నేడు దెబ్బలాడుకుంటున్నారు. రేపేం చేస్తారో తెలియదు, రాజకీయాలు, వ్యాపారాల్లో ఏదైనా జరగవచ్చు.


అసలు వారెందుకు విడిపోయారు ? తాను తయారు చేసే టెస్లా విద్యుత్‌ కార్లతో అమెరికాను ప్రపంచాన్ని నింపాలని ఎలన్‌ మస్క్‌ ఆశపడ్డాడు. అందుకు అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్‌ ఉంటే తన ఆటలు సాగించుకోవచ్చనుకున్నాడు. ట్రంప్‌ పలుకుబడితోనే నరేంద్రమోడీపై వత్తిడి తెచ్చి మనదేశంలో స్టార్‌లింక్‌ను సాధించిన సంగతి తెలిసిందే, టెస్లా కార్లను కూడా మార్కెటింగ్‌ చేస్తానని ప్రకటించాడు.మస్క్‌ కంపెనీకి స్థానిక మార్కెట్‌ మొత్తాన్ని అప్పగిస్తే అమెరికాలో పెట్రోలు, డీజిలు, గ్యాస్‌ వ్యాపారం చేసేవారు, వాటితో నడిచే కార్లు తయారు చేసేవారు చేతులు ముడుకు కూర్చుంటారా ? రంగంలోకి దిగి ట్రంప్‌కు వార్నింగ్‌ ఇవ్వటంతో అతగాడు వెనక్కు తగ్గాడు.అక్కడే మొదలైంది రచ్చ. దాన్ని బయటకు చెప్పుకోలేడు గనుక ట్రంప్‌ యంత్రాంగం రూపొందించిన పొదుపు బిల్లు ఆమోదం పొందితే అమెరికా సర్వనాశనం అవుతుందంటూ ధ్వజమెత్తాడు. ట్రంప్‌ ఊరుకుంటాడా ఇలాగే వాగితే నీ కార్లకు ఇస్తున్న సబ్సిడీల మొత్తాన్ని ఎత్తివేస్తా ఆలోచించుకో అన్నాడు. కాస్త మెత్తబడినప్పటికీ ఆవిరైన ప్రేమ తిరిగి చిగురించలేదు, ఛీ పో అంటే ఛా పో అనుకున్నారు. ఇప్పుడేం జరుగుతుందన్నది ఆసక్తి కలిగించే అంశం.


అమెరికాను మరోసారి గొప్పదాన్ని చేయాలనే పిలుపును సమర్ధించిన వారందరికీ మస్క్‌ నిర్ణయం రుచించలేదు.ట్రంప్‌ ద్వారా గరిష్టంగా లబ్దిపొందాలని చూసిన బడాబాబులకు అమెరికా పార్టీ గురించి భయం లేదుగానీ మస్క్‌ తెస్తున్న వత్తిడి గురించి ఎక్కువగా ఆందోళన చెందుతున్నారు. పార్లమెంటు ఆమోదించి ట్రంప్‌ సంతకం అయిన పొదుపు చట్టం అమలు జరిగితే కార్మికవర్గ సంక్షేమ కార్యక్రమాల మీద తొలివేటు పడుతుందనే భయంతో ఇప్పటికే జనం భారీ ఎత్తున రెండుసార్లు నిరసన ప్రదర్శనలు చేశారు.ప్రాధమిక వార్తల ప్రకారం ఇది అమల్లోకి వస్తే కోటీ 30లక్షల మందికి ఆరోగ్యబీమా గల్లంతు లేదా ఉన్నప్పటికీ నిరుపయోగంగా మారుతుందనే విశ్లేషణలు వచ్చాయి.జనాల నుంచి ఎదురయ్యే నిరసనలను ఎలా అణచివేయాలా అని చూస్తుంటే మధ్యలో మస్క్‌ గొడవేంటని ఇతర కార్పొరేట్‌ శక్తులు చిరాకు పడుతున్నాయి. ట్రంప్‌ చట్టంతో ఇప్పటికే ఉన్న దేశ రుణానికి మరో నాలుగున్నరలక్షల కోట్ల డాలర్లు తోడవుతుందని మస్క్‌ ధ్వజమెత్తాడు. ఇప్పటికే జిడిపిలో 122శాతం 36.2లక్షల కోట్ల డాలర్ల అప్పు ఉంది. దాన్ని మరో నాలుగులక్షల కోట్ల డాలర్లు పెంచుకొనేందుకు మే నెలలో అనుమతి ఇచ్చారు, ఇప్పుడు మరో ఐదు లక్షల కోట్లడాలర్ల వరకు పెంచాల్సి ఉంటుంది. దక్షిణాఫ్రికాలో జన్మించి 2002లో అమెరికా పౌరసత్వం పొందిన మస్క్‌కు కెనడా పౌరసత్వం కూడా ఉంది. నిబంధనల ప్రకారం అమెరికా గడ్డమీద పుట్టిన వారు మాత్రమే అధ్యక్షపదవికి అర్హులు. ప్రస్తుతం రెండు పార్టీలు పోటాపోటీగా పార్లమెంటు ఉభయ సభల్లో సీట్లు తెచ్చుకుంటున్న పూర్వరంగంలో తనకున్న ధనబలంతో సెనెట్‌లో రెండు మూడు, ప్రజాప్రతినిధుల సభలో 8 నుంచి 10 తెచ్చుకుంటే చక్రం తిప్పవచ్చన్నది మస్క్‌ ఎత్తుగడ.తాజాగా మస్క్‌ వ్యతిరేకించిన ట్రంప్‌ ముందుకు తెచ్చిన బిగ్‌, బ్యూటీఫుల్‌ బిల్లు పార్లమెంటులో చావుతప్పి లొట్టపోయినట్లుగా నెగ్గింది. వంద మంది ఉన్న సెనెట్‌లో వ్యతిరేక, అనుకూల ఓట్లు 50 చొప్పున రాగా ఉపాధ్యక్షుడిగా ఉన్న జెడి వాన్స్‌ తన నిర్ణయాత్మక ఓటుతో బిల్లును గట్టెక్కించాడు. ప్రజాప్రతినిధుల సభలో రిపబ్లికన్లకు 220 ఓట్లు ఉన్నప్పటికీ బిల్లుకు అనుకూలంగా 218 మాత్రమే రాగా 212 ఉన్న డెమోక్రాట్లతో మరో ఇద్దరు అధికారపక్ష సభ్యులు చేతులు కలపటంతో వ్యతిరేకంగా 214 వచ్చాయి. ఇలాంటి సమయాల్లో మూడో పక్షానికి ఎంపీలు ఉంటే కింగ్‌ మేకర్‌లుగా మారతారు. ఎలన్‌ మస్క్‌ ఆకాంక్ష, యత్నం అదే. రెండు పార్టీల విధానాలకు ప్రత్యామ్నాయం గురించి కాదు. గతంలో డెమోక్రటిక్‌ పార్టీకి, గత ఎన్నికల్లో రిపబ్లికన్‌ ట్రంప్‌కు మద్దతు ఇచ్చాడు. ఎవరికి బాసటగా ఉన్న తన లాభమే పరమావధి.

రెండు పార్టీలకు పరిష్కారం తన పక్షమే అని, అమెరికన్లు కోల్పోయిన స్వాతంత్య్రాన్ని తిరిగి ఇస్తానని మస్క్‌ చెప్పాడు. మూడిరట రెండు వంతుల మంది కొత్త పార్టీ కావాలని కోరుకుంటున్నట్లు చెప్పాడు. ట్రంప్‌ ఏలుబడిలో ప్రభుత్వ సిబ్బంది సామర్ధ్యం పెంచే పేరుతో ఎలన్‌ మస్క్‌ చేపట్టిన డోజ్‌ ఉద్యోగులను తొలగించేందుకు పని చేసింది తప్ప మరొకటి కాదు. ట్రంప్‌ తెచ్చిన చట్టం కార్పొరేట్లకు పన్నుల తగ్గింపు, సామాన్యుల సంక్షేమం కుదింపుకు ఉద్దేశించింది. ప్రస్తుతం 7.1 కోట్ల మంది ఆరోగ్యబీమాపై ఆధారపడి ఉన్నారు. రానున్న పది సంవత్సరాల్లో కోటీ 70లక్షల మంది ఈ పథకానికి దూరం అవుతారు. మనదేశంలో ఆహార భద్రతా పథకం కింద 80 కోట్ల మందికి ఉచిత బియ్యం, గోధుమలు ఇస్తున్నట్లుగానే అమెరికాలో అదనపు పోషకాహారం పేరుతో 4 కోట్ల మంది ఆహార కూపన్లు ఇస్తున్నారు. వీరిలో 47 లక్షల మంది వాటిని కోల్పోతారు. కొత్త చట్టం అమలుచేస్తే సంక్షేమ పథకాలకు లక్ష కోట్లడాలర్లు కోతపడుతుందని అధ్యక్ష భవనం రూపొందించిన పత్రమే చెప్పింది. ఈ సొమ్మును దేనికి ఖర్చు చేస్తారో తెలుసా ! అక్రమంగా సరిహద్దు దాటకుండా ఉండేందుకు మెక్సికో సరిహద్దులో ఏర్పాటు చేసిన ఇనుప గోడకు 46బిలియన్‌ డాలర్లు, వలస వచ్చిన వారికి నిర్బంధ శిబిరాల్లో పడకలకు 45బి.డాలర్లు, వలస వచ్చిన వారిని గుర్తించి 2029 నాటికి దేశం నుంచి తరిమివేసేందుకు అవసరమైన మరో పదివేల మంది సిబ్బంది నియామకానికి ఇలా మొత్తం 350 బిలియన్‌ డాలర్లు ఖర్చు చేయనున్నారు. కొత్త లేదా పాత విద్యుత్‌ కార్లు కొనుగోలు చేసే వారికి ఇస్తున్న పన్ను రాయితీలు సెప్టెంబరు 30తో ముగుస్తాయి, వాటిని 2032వరకు పొడిగిస్తారు. పార్లమెంటు అనుమతి లేకుండా ప్రభుత్వం అప్పులు చేయటానికి లేదు, ఒక పరిమితి ఉంటుంది. అయితే 1960 నుంచి ఇప్పటికి 78 సార్లు నిబంధనలను సవరించారు. ట్రంప్‌ తొలిసారి పాలనా కాలంలో 8లక్షల కోట్ల మేర కొత్త అప్పు చేసేందుకు నిబంధనలు సడలించారు. ఇలాంటి సవరణలకు రెండు పార్టీలూ సై అంటాయి.


అమెరికా రాజకీయాల్లో బ్లాక్‌మెయిల్‌ చేయటం కూడా మామూలే, పెరోట్‌ కుమార్తె గురించి బుష్‌ తప్పుడు ప్రచారం చేయటం, అదివాస్తవం కాదని నిరూపించుకోలేని స్థితిలో 1992 ఎన్నికల్లో తొలుత పోటీ నుంచి వెనక్కు తగ్గాడు, తరువాత తిరిగి రంగంలోకి వచ్చాడు. బుష్‌ కుటుంబం మీద ఉన్న ఆగ్రహంతో రాస్‌ పెరోట్‌ అనే బిలియనీర్‌ 1992 అధ్యక్ష ఎన్నికలలో రిఫామ్‌ పార్టీ పేరుతో పోటీ చేశాడు. బిల్‌ క్లింటన్‌ డెమోక్రటిక్‌ పార్టీ (43) జార్జి బుష్‌ రిపబ్లికన్‌ పార్టీ 37.5 శాతం ఓట్లు తెచ్చుకోగా పెరోట్‌కు 18.9శాతం ఓట్లు వచ్చాయి. అయితే అధ్యక్ష ఎన్నికకు కావాల్సిన ఎలక్టరల్‌ కాలేజీలో ఒక్క ఓటూ రాలేదు. ఎలన్‌ మస్క్‌ కూడా బ్లాక్‌మెయిలింగ్‌లో తక్కువ తినలేదు. ఎప్‌్‌స్టెయిన్‌ అనేవాడు బడాబాబులకు పిల్లల్ని తార్చి డబ్బుగడిరచటంలో పేరు మోశాడు. అతగాడి జాబితాలో డోనాల్డ్‌ ట్రంప్‌ కూడా ఉన్నట్లు విమర్శలు వచ్చాయి. అనుమానాస్పద స్థితిలో వాడు జైల్లో చచ్చాడు. దాంతో ఎప్‌స్టెయిన్స్‌ ఫైల్స్‌ గురించి దర్యాప్తును మూసివేసి పెద్దలను కాపాడారని గుప్పు మంది. అందే అంశాన్ని ట్రంప్‌తో చెడిన తరువాత మస్క్‌ ముందుకు తెచ్చాడు. ఆ విషయాలు అతగాడికి ఎప్పుడో తెలిసినప్పటికీ గత ఎన్నికల్లో ట్రంప్‌కు మద్దతుగా సర్వశక్తులూ వడ్డాడు, తన సామాజిక మాధ్యమం ఎక్స్‌ను ఉపయోగించాడు, పెద్ద మొత్తంలో స్వంతంగా సొమ్ము ఖర్చు చేశాడు. అందువలన పార్టీ పెట్టి తమను దెబ్బతీస్తాడనుకుంటున్నటున్న మస్క్‌ను వేరే రూపంలో దెబ్బతీసే అవకాశాలు లేకపోలేదు.

పార్టీలను ఏర్పాటు చేయటంలోనూ, రాజకీయాల్లో బిలియనీర్లు పాల్గొనటం ఎలన్‌ మస్క్‌తో ప్రారంభం కాలేదు. రెండు సంవత్సరాల క్రితం జరిగిన ఒక అధ్యయనంలో ఫోర్బ్స్‌ రూపొందించిన జాబితా ప్రకారం ప్రపంచంలోని 2072 మంది బిలియనీర్లలో 11శాతం మంది రాజకీయాల్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. అధికారాన్ని చేజిక్కించుకొనేందుకు, తమ ప్రభావాన్ని చూపేందుకు ధనికులు ముందుకు వస్తున్నారనటానికి ఇదొక సూచిక. వారు ఎలాంటి విధానాలకు మద్దతు ఇస్తారో కూడా వేరే చెప్పనవసరం లేదు. వారికి ప్రపంచంలో బలమైన సంబంధాలు ఉన్నప్పటికీ సైద్ధాంతికంగా పెద్దగా తెలియదని తేలింది. ప్రపంచ ధనికుల కేంద్రం అమెరికా అయినప్పటికీ ఇక్కడి బిలియనీర్లు ప్రపంచ సగటు కంటే తక్కువగా కేవలం 3.7శాతమే రాజకీయాల్లో ఉన్నారు. రెండు ప్రధాన పార్టీల్లో వీరు తమను అధ్యక్షపదవి అభ్యర్థులుగా ఎన్నుకోవాలని భారీ మొత్తాల్లో నిధులు ఖర్చు చేశారు.లాస్‌ ఏంజల్స్‌ నగర మేయర్‌ పదవి కోసమే రెండుసార్లు జెబి ప్రిట్జ్‌కర్‌ 35 కోట్ల డాలర్లు ఖర్చు చేశాడంటే అధ్యక్ష పదవికి స్వయంగా లేదా మద్దతు ఇచ్చేవారు ఎంత మొత్తాలు ఖర్చు చేస్తారో అర్ధం చేసుకోవచ్చు. 2022 మధ్యంతర పార్లమెంటు ఎన్నికల్లో రెండు ప్రధాన పార్టీలకు బిలియనీర్లు ఇచ్చిన విరాళాల మొత్తం 88 కోట్ల డాలర్లు. అగ్రస్థానంలో ఉన్న ఇరవై మందిలో 14గురు రిపబ్లికన్‌ పార్టీకి ఇచ్చినట్లు తేలింది. వివిధ దేశాల ప్రభుత్వాలలో కొలువుదీరిన వారు 242 మంది కాగా సగటున 2.5 పదవులు చేపట్టారు. మనకు మిరేజ్‌, రాఫేల్‌ యుద్ద విమానాలు అమ్మిన కంపెనీ యజమాని సెర్గీ దసాల్ట్‌ ఫ్రాన్సులో ఏకంగా 16 పదవుల్లో పని చేశాడు. తన భార్య రాఫేల్‌ పేరునే విమానానికి పెట్టాడు. బిలియనీర్లు నిరంకుశ, నియంత పాలనలోనే ఎక్కువగా పదవుల్లో రాణించారట. అమెరికా బిలియనీర్లలో డెమోక్రాట్ల కంటే రిపబ్లికన్లను సమర్ధించిన వారు రెండున్నరరెట్లు ఎక్కువ, ఐరోపాలో అత్యధికులు మితవాద శక్తుల మద్దతుదార్లు. ఎలన్‌ మస్క్‌ కార్మికవర్గానికి వ్యతిరేకి. వచ్చే ఏడాది జరిగే ఎన్నికలలో అతగాడి పార్టీ గెలుస్తుందో లేదో చెప్పలేము గానీ ఓట్లను చీల్చితే రిపబ్లికన్‌ పార్టీ బలం తగ్గి డెమోక్రాట్లు లాభపడితే ట్రంప్‌కు అడుగుడుగునా ప్రతిఘటన తప్పదు !
 

తొంభై రోజులు ముగిసినా 90 ఒప్పందాలు లేవు, భంగపడిన ‘‘ రారాజు ’’ డోనాల్డ్‌ ట్రంప్‌ ! బంతి అమెరికా మైదానంలో ఉందన్న భారత్‌ !!

Tags

, , , , , , , , ,


ఎం కోటేశ్వరరావు


తొంభై రోజుల్లో తొంభై ఒప్పందాలు ఏప్రిల్‌ రెండవ తేదీ అమెరికా విముక్తి దినం పేరుతో డోనాల్డ్‌ ట్రంప్‌ పలికిన ప్రగల్భాలలో ఒకటి. ఆ గడువు జూలై 9వ తేదీతో ముగిj. అనుకున్నది పగటికలగా మారింది. దాంతో తమతో ఒప్పందాలకు రాకపోతే అపరాధ సుంకాలు విధిస్తానని ఆగస్టు ఒకటి వరకు అవకాశం ఇస్తున్నట్లు ప్రకటించాడు. బెదిరింపులో భాగంగా పద్నాలుగు దేశాలు ఎంతెంత సుంకాన్ని ఎదుర్కోవాల్సిందీ వెల్లడిస్తూ లేఖల రూపంలో ఆదేశాలను పంపాడు. ఒప్పందాలు కుదుర్చుకోవటం లేదా సిద్దంగా ఉన్నట్లు తిరుగులేఖలు రాయకపోతే ఆగస్టు ఒకటవ తేదీ నుంచి తన సుంకాలు అమల్లోకి వస్తాయన్నాడు. చర్చలకు ఇంకా ద్వారాలు తెరిచే ఉన్నాయని కూడా చెప్పాడు. మాటి మాటికి గడువు పొడిగిస్తా అనుకుంటున్నారేమో నూటికి నూరు శాతం గట్టిగా చెబుతున్నా, వారు గనుక తనకు ఫోన్‌ చేసి వేరే పద్దతులను ఆలోచిస్తున్నట్లు చెబితే సరే, దానికి అవకాశం ఇస్తున్నా లేకపోతే ఏం చేస్తానో తెలుసుగా అన్నట్లుగా పొడిగించిన గడువుకు అయినా కట్టుబడి ఉంటారా లేదా అని అడిగిన విలేకర్లతో చెప్పాడు. ఏప్రిల్‌లో వివిధ దేశాల సరకులపై ఎంత మేరకు పన్ను విధించేది ప్రకటించిన ట్రంప్‌ ఏ దేశమూ ముందుకు రాకపోవటంతో మూడు నెలలపాటు వాయిదా వేస్తున్నట్లు, జూలై 9వ తేదీతో గడువు ముగుస్తుందన్నాడు. అయినప్పటికీ స్పందన లేకపోవటంతో ఆగస్టు వరకు పొడిగిస్తున్నట్లు వెల్లడిరచాడు. ఆలోగా ఒప్పందానికి రాకుంటే ఏప్రిల్‌ రెండవ తేదీన ప్రకటించిన విధంగా పన్నులను విధిస్తామని వాణిజ్యశాఖ మంత్రి లుటినిక్‌ చెప్పాడు. మనదేశంతో ఎనిమిదవ తేదీలోగా ఒప్పందం కుదుర్చుకోనున్నట్లు లీకులు వదిలిన సంగతి తెలిసిందే. తాజా వార్తలను బట్టి ఆ గడువు ఆగస్టు ఒకటి వరకు పొడిగించినట్లు చెబుతున్నారు. నాటకీయంగా ఏదో కుదిరిందని మొక్కుబడి ప్రకటన చేస్తే చెప్పలేము.మేం చెప్పాల్సింది చెప్పాం, తేల్చుకోవాల్సింది ట్రంపే, బంతి అమెరికా కోర్టులో ఉంది అని మనదేశం తరఫున చర్చల్లో పాల్గొన్న ఒక అధికారి చెప్పినట్లు ఒక వార్త. ఏం జరుగుతుందో చూద్దాం !


రష్యాతో వాణిజ్యం చేస్తే భారత్‌, చైనాలపై 500శాతం పన్నులు విధిస్తానని ట్రంప్‌ ప్రకటించిన సంగతి తెలిసిందే. బ్రిక్స్‌ సమావేశాల్లో అమెరికా బెదిరింపు వైఖరిని విమర్శించిన తరువాత తమ వ్యతిరేక విధానాలను అనుసరించే బ్రిక్స్‌ దేశాలతో వాణిజ్యం జరిపే దేశాల మీద కూడా పదిశాతం పన్ను విధిస్తానని బెదిరింపులకు దిగాడు.ఏకపక్ష పన్ను ప్రకటనలు ప్రపంచ వాణిజ్యాన్ని దెబ్బతీస్తాయని బ్రిక్స్‌ పేర్కొన్నది. వివిధ దేశాలపై డోనాల్డ్‌ ట్రంప్‌ ప్రకటించిన పన్నుశాతాలు గతంలో ప్రకటించినవి కొన్నింటిలో మార్పులేదు, మరికొన్నింటిని సవరించాడు. ఆయా దేశాల వస్తువులపై జపాన్‌ 25,దక్షిణ కొరియా 25, థాయ్‌లాండ్‌ 36, మలేసియా 25, ఇండోనేషియా 32, దక్షిణాఫ్రికా 30,కంపూచియా 36, బంగ్లాదేశ్‌ 35,కజకస్తాన్‌ 25, ట్యునీసియా 25, సెర్బియా 35,లావోస్‌ 40, మయన్మార్‌ 40 శాతం పన్నులు ఉంటాయి. ఒక వేళ ఈ దేశాలు గనుక ప్రతి సుంకాలు పెంచినట్లయితే తాను ప్రకటించిన మొత్తాల మీద మరో అంత మొత్తం పెంచుతామని కూడా ట్రంప్‌ బెదిరించాడు. రానున్న రోజుల్లో మిగిలిన దేశాలకు కూడా ఎంత పన్ను విధించేదీ లేఖల రూపంలో తెలియచేస్తామని అధ్యక్ష భవన మీడియా అధికారిణి కారాలోని లీవిట్‌ చెప్పారు. వివిధ దేశాల నుంచి దిగుమతి చేసుకొనే వస్తువులపై పన్ను మొత్తాలను పెంచితే ఆ భారం అమెరికా వినియోగదారుల మీదనే పడుతుందన్నది తెలిసిందే.ఆర్థికవేత్తలు చెప్పినదాని ప్రకారం ఒక్కో కుటుంబం మీద 3,800 నుంచి నాలుగువేల డాలర్ల వరకు భారం పడుతుందని, అది ఒకటి నుంచి ఒకటిన్నర శాతం వరకు ద్రవ్యోల్బణాన్ని పెంచుతుంది.


జపాన్నుంచి కార్లు, ఎలక్ట్రానిక్స్‌, వైద్య పరికరాలు, దక్షిణ కొరియా నుంచి సెమీకండక్టర్లు, ఆటోవిడి భాగాలు, ఓడలు, మలేషియా నుంచి సెమికండక్టర్లు, రబ్బరు, బంగ్లాదేశ్‌ నుంచి దుస్తులు, పాదరక్షలు, కంపూచియా నుంచి తక్కువ వెలగల దుస్తులు, ఫర్నీచర్‌, ఇండోనేషియా ఓడల్లో ధరించే పాదరక్షలు, పామ్‌ఆయిల్‌, ఎలక్ట్రానిక్స్‌, దక్షిణాఫ్రికా లోహాలు, పండ్లు, ఆభరణాలు, తాజా వ్యవసాయ ఉత్పత్తులు, ఆటోవిడి భాగాలు, సెర్బియా యంత్రాలు, వ్యవసాయ ఉత్పత్తులు లావోస్‌ పాదరక్షలు, కలప వస్తువులు, మయన్మార్‌ నుంచి చౌకగా లభించే ఉత్పత్తులు, బోస్నియా కలప, లోహాలు, కజకస్తాన్‌ లోహాలు, తైలాలు, రసాయనాలు, టునీసియా ఆలివ్‌ ఆయిల్‌ వంటి వాటిని అమెరికా దిగుమతి చేసుకుంటున్నది. వాటి మీద ఎంత పన్ను విధిస్తే అంత మొత్తాన్ని వినియోగదారులు అదనంగా చెల్లించాలి, ఆమొత్తాలతో ట్రంప్‌ లోటుబడ్జెట్‌ పూడ్చుకొనేందుకు లేదా కార్పొరేట్లకు పన్ను రాయితీలు ఇచ్చేందుకు వినియోగించాలన్నది అసలు ఎత్తుగడ. జూలై తొమ్మిదవ తేదీలోగా ఒప్పందాలు చేసుకోని దేశాలకు ఆగస్టు ఒకటవ తేదీ వరకు అవకాశం ఇస్తున్నామని అమెరికా ఆర్థిక మంత్రి స్కాట్‌ బెసెంట్‌ చెప్పాడు. వచ్చే మూడు రోజులు తాము ఊపరిసలపని పనిలో ఉంటామని ఆదివారం నాడు సిఎన్‌ఎస్‌ టీవితో అన్నాడు. ఆగస్టు ఒకటవ తేదీని కొత్తగడువుగా అభివర్ణించకూడదని, పనులు వేగంగా జరగాలంటే ఏదో ఒకటి ఉండాలన్నాడు. కొత్త పన్నులు కావాలా లేదా గతంలో ప్రకటించినవే కావాలా అన్నది లేఖలు అందుకున్నదేశాలు తేల్చుకోవాలని చెప్పాడు.తాము పద్దెనిమిది ప్రధాన వాణిజ్య భాగస్వాముల మీద కేంద్రీకరిస్తున్నామని అనేక పెద్ద ఒప్పందాలు పూర్తి కావచ్చాయన్నాడు. ఏ దేశ ఉత్పత్తులపై తామెంత పన్ను విధించేది 100 చిన్న దేశాలకు లేఖల ద్వారా తెలియచేస్తామని అన్నాడు. ఇది అమెరికా దురహంకారం తప్ప మరొకటి కాదు.పూర్వం పెద్ద దేశాల రాజులు చిన్న లేదా సామంత దేశాలు తమకు ఏటా ఇంత కప్పం కట్టాలని లేకపోతే తమ తడాఖా చూపుతామని బెదిరించేవారు. అయితే బెసెంట్‌ మాటలను బట్టి ఏదీ ఖరారు కాలేదన్నది స్పష్టం. అమెరికాలో వాషింగ్టన్‌ కాలమానం ప్రకారం సోమవారం మధ్యాహ్నానికల్లా తన లేఖలు సంబంధిత దేశాలకు అందుతాయని ఆదివారం నాడు ట్రంప్‌ చెప్పాడు. కొన్ని దేశాలు బుధవారం లోగా కొన్ని ఒప్పందాలు కుదుర్చుకోవచ్చు లేదా లేఖలు అందించే అవకాశం ఉందన్నాడు.


ట్రంప్‌ లేఖలు అంటే ఏకపక్షంగా జారీ చేసినవి, బెదిరించే ఎత్తుగడ తప్ప మరొకటి కాదు.చైనాతో ఒప్పందం కుదిరిందని ఏకపక్షంగా ట్రంప్‌ ప్రకటించటం తప్ప వివరాలేమిటో ఇంతవరకు తెలియదు. అదే విధంగా వియత్నాంతో వచ్చినట్లు చెబుతున్న అవగాహన కూడా అదే స్థితిలో ఉంది.అంశాలు ఇంకా ఖరారు కాలేదు.మనదేశంతో ఒప్పందం గురించి కూడా రకరకాల వార్తలను ప్రచారంలో పెట్టారు. అసలు ఒకసారి కుదిరిందని ట్రంప్‌ చెప్పాడు. అంతిమ ఒప్పందం అని, తరువాత తాత్కాలిక ఒప్పందం, మరోసారి చిన్న ఒప్పందం ఇలా రకరకాలుగా వర్ణించారు. మధ్యలో అమెరికా వస్తువులపై పన్నులను తగ్గించేందుకు భారత్‌ అంగీకరించటం లేదని లీకులు వదిలారు.మంగళవారం నాడు ఇది రాసిన సమయానికి ఒప్పందం గురించి ఎలాంటి వార్తలు లేవు. రాజకీయంగా, మిలిటరీ, ఆర్థికంగా ఏ రీత్యా చూసినప్పటికీ జపాన్‌, దక్షిణ కొరియా ఇప్పటి వరకు అమెరికా కనుసన్నలలోనే వ్యవహరించాయి. అలాంటి దేశాలపై 25శాతం పన్ను విధిస్తానని ఏకపక్షంగా ప్రకటించాడు ట్రంప్‌.అమలుకు ఆగస్టు ఒకటి వరకు గడువు ఉందన్నాడు. ఇప్పటి వరకు వివిధ దేశాల వైఖరుల సారాంశం దిగువ విధంగా ఉంది.

జపాన్‌లో కూడా ఆటోపరిశ్రమ పెద్దదే. తన ప్రయోజనాలను కాపాడుకొనేందుకు, ఏ పరిస్థితి ఎదురైనా ఎదుర్కొనేందుకు, తట్టుకొనేందుకు సిద్దంగా ఉన్నట్లు ఆదివారం నాడు ప్రధాని షిగెరు షిబా ఫూజీ టీవీ కార్యక్రమంలో ఆదివారం నాడు చెప్పాడు. అమెరికా వస్తువుల మీద దిగుమతి పన్ను తగ్గిస్తామని మనదేశం సంకేతాలిచ్చినప్పటికీ దానికంటే మన పాడి,వ్యవసాయ రంగాలను అమెరికా ఉత్పత్తులకు తెరవాలని గట్టిగా పట్టుబడుతున్నట్లు వార్తలు.ఏం జరుగుతుందో తెలియదు.ఇరవై ఏడు దేశాలతో కూడిన ఐరోపా యూనియన్‌తో చర్చల్లో మంచి పురోగతి ఉందని అమెరికా చెప్పటం తప్ప అలాంటి సూచనలు కనిపించటం లేదు. సమాఖ్యదేశాల కార్లపై 50శాతం పన్ను విధిస్తానని ట్రంప్‌ ప్రకటించిన సంగతి తెలిసిందే. అసలుకే మోసం రాకుండా ఒప్పందం ఉందాలని జర్మనీ చెబుతుండగా హానికరమైన ఒప్పందానికి తాము వ్యతిరేకమని ఫ్రాన్సు పేర్కొన్నది. బ్రిటన్ను అదిరించి బెదిరించి ఒప్పందం కుదుర్చుకున్నారు.పదిశాతం కనీస పన్నులు విధిస్తారు, దానికి ప్రతిగా అమెరికా కార్లు, విమానాలకు బ్రిటన్‌ తలుపులు తెరిచింది. తాము జూలై 21లో ఒప్పందం కుదుర్చుకుంటామని కెనడా చెప్పటంతో దానికి లేఖ పంపలేదు. ఎవరైనా ఇదే మాదిరి ఒప్పందానికి దగ్గరగా ఉంటే వాటికి వ్యవధిని పెంచుతామని ట్రంప్‌ సలహాదారు కెవిన్‌ హాసెట్‌ చెప్పాడు.


చైనాతో ఒప్పందం కుదిరిందని లండన్‌ భేటీ తరువాత డోనాల్డ్‌ ట్రంప్‌ ప్రకటించాడు. దాని మీద చైనా అవుననిగానీ కాదని గానీ ప్రకటించలేదు. నువ్వెంత దిగివస్తే నేనంత తగ్గుతాను అన్నట్లుగా చైనా వ్యవహరిస్తున్నది.లాభం లేదని గ్రహించిన ట్రంప్‌ తొలుత ఆ దిశగా కొన్ని చర్యలు తీసుకున్నాడు.ప్రముఖ ఎలక్ట్రానిక్‌ సంస్థలు చైనాకు ఆటోమేషన్‌ సాఫ్ట్‌వేర్‌ అందించేందుకు, విమాన ఇంజన్ల ఎగుమతులకు అవకాశం కల్పించాడు. దానికి ప్రతిగా ఆంక్షలున్న ఎనిమిది వస్తువుల ఎగుమతులపై నిబంధనలను సడలించేందుకు చైనా చర్యలు తీసుకుంది. ఈ విధంగా ఇరుదేశాల వాణిజ్య యుద్ధ రాజీ ఒప్పందం ముందుకు పోతున్నదని రాయిటర్స్‌ పేర్కొన్నది.అమెరికా దిగిరావటానికి అక్కడి బహుళజాతి గుత్త సంస్థలు ట్రంప్‌ మీద తెస్తున్న వత్తిడే ప్రధాన కారణం. ఉదాహరణకు 2014లో ఇంటెల్‌ కంపెనీ మొత్తం రాబడిలో 27శాతం ఉంది. క్వాల్‌కామ్‌ ఆదాయంలో 50శాతం చైనా నుంచి ఉంది. దీనికి తోడు చైనా పారిశ్రామిక ఉత్పత్తిలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రవేశపెట్టటంతో ఆ ఉత్పత్తులున్న అమెరికన్‌ కంపెనీలకు అది పెద్ద మార్కెట్‌గా మారింది. ట్రంప్‌ రెండవసారి అధికారానికి వచ్చిన తరువాత అమెరికా అనేక పాఠాలు నేర్చుకుంది. ఇతర దేశాల మాదిరి లేఖల ఆదేశాలు పంపి గరిష్టంగా వత్తిడితో అదిరించి బెదిరిస్తే లొంగే ఘటం కాదు అన్నది ఒకటి. కలసి ఉంటే కలదు సుఖం ఘర్షణ పడితే లాభం లేదని, పరస్పరం లాభదాయకమైన అంశాల్లో రాజీపడటమే మేలని గ్రహించటం రెండవది.కృత్రిమ గోడలు కట్టి సరఫరా వ్యవస్థలను విచ్చిన్నం చేస్తే అమెరికా పొందే లాభం లేదని, తన స్వంత చట్టాలతో ఇతర దేశాలను శిక్షించినట్లుగా చైనాతో వ్యవహరిస్తే కుదరదని గ్రహించటం వంటి అంశాలు ప్రభావతం చేశాయి.అయితే ఇంకా బయోటెక్నాలజీ, సెమీకండక్టర్లు, నూతన ఇంథనం వంటి కొన్ని రంగాల్లో చైనాను కట్టడి చేసేందుకు అమెరికా చూస్తూనే ఉంది. చైనాలో పెట్టుబడులు పెట్టేవారి మీద పన్నులు విధిస్తున్నది. దానికి తగినట్లుగా చైనా కూడా తన తురుపు ముక్కలను వాడుతున్నది. ఐరోపా యూనియన్‌, ఇతర దేశాలు అమెరికా మాదిరి మడికట్టుకు కూర్చోవటం లేదు, అది ఆడమన్నట్లుగా ఆడకుండా చైనాతో తమ ప్రయోజనాలను బేరీజు వేసుకుంటున్నాయి. ఇది కూడా అమెరికా మీద ప్రభావం చూపుతున్నది.

దలైలామా వారసుడు : అడుసుతొక్కనేల కాలుకడగనేల ! చైనా అంతర్గత వ్యవహారాల్లో వేలుపెట్టటం అవసరమా, దేశానికి ఒరిగేదేమిటి ?

Tags

, , , , , ,

ఎం కోటేశ్వరరావు


పద్నాలుగవ దలైలామా 90వ జన్మదినోత్సవం హిమచల్‌ ప్రదేశ్‌ ధర్మశాలలో లిటిల్‌ లాసాగా పిలిచే మెక్‌లియోడగంజ్‌లో జూలై ఆరవతేదీ ఆదివారం జరిగింది. కేంద్ర ప్రభుత్వ ప్రతినిధులుగా మంత్రులు కిరణ్‌ రిజుజు, లాలన్‌ సింగ్‌ హాజరయ్యారు.ఒక భక్తుడిగా దలైలామా నిర్ణయమే తనకు శిరోధార్యమని, మద్దతు ఇస్తామని ఈ సందర్భంగా కిరణ్‌ రిజుజు పునరుద్ఘాటించారు. దలైలామా వారసుడి గురించి కొద్ది రోజులుగా పెద్ద రచ్చే జరిగింది.పరిణామాలు, పర్యవసానాల గురించి భయపడిన టిబెట్‌ బౌద్ద దలైలామా టెంజిన్‌ జియాట్సో ఆ వివాదానికి తాత్కాలికంగా తెరదించారు. సుగలాగ్‌ఖాంగ్‌ ప్రధాన బౌద్ద ఆలయంలో దీర్ఘకాలం ఆయన జీవించాలని కోరుతూ జరిపిన ప్రార్ధనల సందర్భంగా మాట్లాడుతూ తాను మరో 30 నుంచి 40 సంవత్సరాలు జీవిస్తానని ప్రకటించారు. ‘‘ అనేక జోశ్యాలను చూసినపుడు అవలోకితేశ్వర ఆశీస్సులు ఉన్నట్లు భావించాను. ఇప్పటి వరకు చేయగలిగిందంతా చేశాను. ఇంకా 30`40 సంవత్సరాలు జీవించగలనని అనుకుంటున్నాను , ఇప్పటి వరకు మీ ప్రార్ధనలు ఫలించాయి. మనం దేశాన్ని కోల్పోయినప్పటికీ భారత్‌లో ప్రవాసం ఉంటున్నాము. ఇక్కడ నేను ఎన్నో పొందాను, ధర్మశాలలో నివసిస్తున్న వారంతా కూడా అలాగే లబ్దిపొందాలని, నేను చేయగలిగిన సేవ చేయాలని కోరుకుంటున్నా’’ అన్నారు. అంతకు ముందు తనవారసుడు చైనా వెలుపలే జన్మిస్తాడని చేసిన ప్రకటన వివాదాన్ని రేపింది.


దలైలామా తరువాత ఏం మాట్లాడతారో, ఏం చేస్తారో తెలియదు గానీ మనదేశం చైనా అంతర్గత వ్యవహారమైన వారసుడి విషయంలో అనవసరంగా వేలుబెట్టి చైనాతో చెప్పించుకొని, సంజాయిషీ ఇచ్చుకోవాల్సి వచ్చింది. ఇది గౌరవప్రదమా, అసలు అవసరమా ! ఐదు సంవత్సరాల తరువాత రెండు దేశాల మధ్య సాధారణ సంబంధాలు నెలకొంటున్న తరుణంలో చైనాను రెచ్చగొట్టటం ద్వారా మనదేశానికి ఒరిగేదేమిటని ప్రతివారూ ఆలోచించాల్సిన అవసరం ఉంది. వారసుడి విషయంలో దలైలామా ఆకాంక్షలను అనుసరించాలని మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రి, బౌద్దుడైన కిరెన్‌ రిజుజు చేసిన వ్యాఖ్య వివాదాస్పదమైంది.చైనా తీవ్ర అభ్యంతరం తెలిపిన తరువాత మతవ్యవహారాల్లో ప్రభుత్వం ఎలాంటి వ్యాఖ్య చేయలేదని మనవిదేశాంగశాఖ ప్రతినిధి రణధీర్‌ జైస్వాల్‌ వివరణ ఇచ్చారు. తన తదనంతరం దలైలామా వ్యవస్థ కొనసాగుతుందని, 2011లో తాను ఏర్పాటు చేసిన గాడెన్‌ ఫోడ్రాంగ్‌ ట్రస్టు తన వారసుడిని నిర్ణయిస్తుందని కొద్ది రోజుల క్రితం దలైలామా చేసిన ప్రకటనతో రచ్చ మొదలైంది. గతంలో చేసిన ప్రకటననే పునరుద్ఘాటించారు. గాడెన్‌ ఫోడ్రాంగ్‌ అనేది టిబెట్‌లోని లాసాలో ఉన్న 17వ శతాబ్దం నాటి డ్రెపంగ్‌ సంఘారామంలో ఉన్న దలైలామా నివాసం పేరు. ఆ ట్రస్టుకు దలైలామా చైర్మన్‌, ఆయన సన్నిహితులుగా ఉన్నవారు సభ్యులు, దలైలామా కార్యాలయమే దాని వ్యవహారాలను చూస్తున్నది.పదిహేనవ దలైలామా, తదుపరి పరంపరను నిర్ణయించాల్సింది ఆ ట్రస్టు మాత్రమే అని ప్రభుత్వంతో సహా మరొకరికి అధికారం లేదని దలైలామా ప్రకటించారు. ఈ ట్రస్టుతో పాటు న్యూఢల్లీి, జూరిచ్‌ నగరాల్లో కూడా ట్రస్టులను ఏర్పాటు చేశారు. మతానికి చెందిన లామాలు, ఇతర పెద్దలు వారసుడిని గుర్తించి ప్రతిపాదిస్తే అంతిమంగా ఈ ట్రస్టు ఆమోదిస్తేనే వారసత్వం ఖరారు అవుతుందని ట్రస్టు నిబంధనావళి పేర్కొన్నది.


ఇక్కడే అసలు సమస్య ఉంది. గతంలో ఎంపిక చేసిన వారసుల పేర్లను ఒక బంగరు కలశంలో వేసి లాటరీ పద్దతిద్వారా ఎంపిక చేస్తారు, ఆ పేరును చైనా కేంద్రప్రభుత్వం ఆమోదిస్తేనే అమల్లోకి వస్తుందని, గతంలో ఇలాగే జరిగిందని బీజింగ్‌ ప్రకటించింది.తన ఎంపిక అలాగే జరిగిందని తెలిసినప్పటికీ ఈ విధానాన్ని 14వ దలైలామా అంగీకరించటం లేదు. అతగాడి ప్రకటనపై తాము ఎలాంటి వ్యాఖ్య చేయబోమని, మత వ్యవహారాలపై ఎలాంటి వైఖరిని తీసుకొనేది లేదని మన కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. దలైలామా ప్రకటన సంబంధిత వార్తలను చూశామని, మతాలకు సంబంధించిన విశ్వాసాలు, వ్యవహారాలకు సంబంధించి ఎలాంటి జోక్యం చేసుకోవటం లేదని. మత స్వేచ్చకు కట్టుబడి ఉన్నామని విదేశాంగశాఖ పేర్కొన్నది. క్వింగ్‌ రాజరిక పాలన నాటి నుంచి బంగారు కలశంలో ఉంచిన పేర్లతో లాటరీ తీసి ఎంపిక చేసిన దానిని చైనా ప్రభుత్వ ఆమోదిస్తే దలైలామా, పెంచన్‌ లామాలను ఖరారు చేస్తారని, ఆ మేరకు ప్రభుత్వ అధికారం కొనసాగుతున్నదని, దానికి తిరుగులేదని చైనా విదేశాంగశాఖ ప్రతినిధి మావో నింగ్‌ స్పష్టం చేశారు.ప్రస్తుత దలైలామాను కూడా అదే పద్దతిలో ఎంపిక చేయగా నాటి ప్రభుత్వం ఆమోదించిందని చెప్పారు. తమ అంతర్గత వ్యవహారాల గురించి జాగ్రత్తగా వ్యాఖ్యానించాలని ఆమె మన కేంద్ర మంత్రి కిరణ్‌ రిజుజు చేసిన ప్రకటన గురించి పేర్కొన్నారు. టిబెట్‌పై ప్రకటించిన వైఖరికి భారత్‌ కట్టుబడి ఉండాలని, టిబెట్‌ సంబంధిత వ్యవహారాలపై చేసే వ్యాఖ్యలు ఇరుదేశాల సంబంధాల మెరుగుదల, అభివృద్ధికి విఘాతం కలిగించకూడదని హితవు చెప్పారు. దలైలామా ప్రకటనను చైనా ఖండిరచిన తరువాత అతగాడికి మద్దతుగా కేంద్ర మంత్రి కిరణ్‌ రిజుజు మాట్లాడటంతో చైనా స్పందించింది. దలైలామా వైఖరిని పునరుద్ఘాటిస్తూ వారసుడి నిర్ణయంలో మరొకరి పాత్ర లేదని మంత్రి మాట్లాడారు. గాల్వన్‌ ఉదంతం తరువాత రెండు దేశాల సంబంధాలు స్థంభించిన సంగతి తెలిసిందే. గతేడాది రష్యాలోని కజాన్‌లో జరిగిన బ్రిక్స్‌ సమావేశాల సందర్భంగా ప్రధాని మోడీ, చైనా అధ్యక్షుడు షీ జింపింగ్‌ భేటీ తరువాత ఏడాది కాలంలో సంబంధాలు తిరిగి సాధారణ స్థితికి వచ్చాయి. కైలాష్‌,మానస సరోవర్‌ యాత్రలను పునరుద్దరించారు.


టిబెట్‌ బౌద్ధ మతానికి ఉన్నత మతాధికారి దలైలామా. మన దేశంలో పీఠాధిపతులకు చాంతాడంత పేర్లు ఉన్నట్లే ప్రస్తుత దలైలామా మతపరమైన పేరు జెస్టన్‌ జాంఫెల్‌ గవాంగ్‌ లొబసాంగ్‌ యెషే టెంజిన్‌ గియాస్టో. పొట్టిగా టెంజిన్‌ గియాస్టో అని పిలుస్తారు. పుట్టినపుడు పెట్టిన పేరు లామో తోండప్‌. ఇతగాడు వివాదాస్పదమైన మతగురువు, 1935 జూలై ఆరున జన్మించారు. దలైలామాలను జీవించి ఉన్న బుద్ధుడు లేక బోధిసత్వుడు అని నమ్ముతారు. మరణానంతరం వారసులను ఎన్నుకుంటారు. దలై అంటే సముద్రం, ఇది మంగోలియన్‌ భాషా పదం.పదమూడవ దలైలామా మరణించిన నాలుగు సంవత్సరాల తరువాత 1937లో అతడి వారసుడిగా టెంజిన్ను ఎంపిక చేశారు, 1939లో దలైలామాగా ప్రకటించారు. మరుసటి ఏడాది ఫిబ్రవరి 22న చైనా ప్రభుత్వం ఆమోదముద్రవేసింది. అమెరికా, బ్రిటన్‌ కుట్రలో భాగంగా కమ్యూనిస్టు ప్రభుత్వానికి వ్యతిరేకంగా 1959లో టిబెట్‌లో తిరుగుబాటు పేరుతో సాయుధులను రంగంలోకి దించారు. వారిని చైనా ప్రభుత్వం అణచివేసింది, తిరుగుబాటు కేంద్రంగా దలైలామా కార్యక్షేత్రాన్ని గుర్తించారు.దాంతో 1959 ఏప్రిల్‌ 29న సిఐఏ పథకం ప్రకారం దలైలామాను నేపాల్‌ ద్వారా దాటించి అసోంలోని బ్రహ్మపుత్ర నది ఒడ్డున ఉన్న తేజ్‌పూర్‌ పట్టణంలో ప్రవేశపెట్టి ఆశ్రయం కల్పించారు.ఉత్తర ప్రదేశ్‌లోని ముస్సోరీలో దలైలామాతో ప్రవాస ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయించారు, మరుసటి ఏడాది హిమచల్‌ ప్రదేశ్‌లోని ధర్మశాలకు రప్పించారు.చైనాపై సిఐఏ రూపొందించిన కుట్ర సిద్దాంతాన్ని నమ్మిలేదా అమెరికా వత్తిడికి లొంగి నాటి ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రూ దలైలామాకు ఆశ్రయం కల్పించారు. మూడవ ప్రపంచ యుద్ధంలో టిబెట్‌ నుంచి చైనా భారత్‌ ఇతర దేశాల మీద దాడి చేసేందుకు పథకం రూపొందించిందన్నది సిఐఏ కట్టుకథ. అమెరికా, బ్రిటన్‌ కుట్రల కారణంగా కమ్యూనిస్టు చైనా ప్రభుత్వం తొలి పది సంవత్సరాలలో అనేక సవాళ్లను ఎదుర్కొన్నది. వాటిలో టిబెట్‌లో తిరుగుబాటు కుట్ర ఒకటి. దలైలామా అన్న గయలో తోండుప్‌ సిఐఏ ఏజంట్‌గా మారాడు. తెరవనుక ఉండి కథంతా నడిపించింది అతనే (97 సంవత్సరాల వయస్సులో ఈ ఏడాది ఫిబ్రవరి 8న పశ్చిమబెంగాల్లోని కలింపాంగ్‌లో మరణించాడు) అని, కుట్ర గురించి పూర్తిగా దలైలామాకు తెలియదని కూడా చెబుతారు. ఏమైనప్పటికీ తరువాత కాలంలో తెలిసినా అదే అమెరికా ప్రాపకంలో నాటి నుంచి నేటి వరకు చైనాకు వ్యతిరేకంగా పనిచేస్తూనే ఉన్నాడు.2011వరకు టిబెట్‌ ప్రవాస ప్రభుత్వ అధినేతగా చలామణి అయ్యాడు. తరువాత వేరేవారికి బాధ్యతలను అప్పగించాడు.

చైనాను అస్థిరపరచటం సాధ్యం కాదని గ్రహించిన అమెరికా విస్తారమైన దాని మార్కెట్‌లో ప్రవేశించేందుకు పూనుకొని ఐరాసలో కమ్యూనిస్టు ప్రభుత్వమే అసలైన చైనా ప్రతినిధిగా గుర్తించటంతో పాటు సాధారణ సంబంధాలను ఏర్పరుచుకుంది. దాంతో టిబెట్‌ తిరుగుబాటుదార్లకు అందచేస్తున్న సాయాన్ని 1972 నుంచి తగ్గించింది తప్ప ఇప్పటికీ కొనసాగిస్తూనే ఉంది.దలైలామాకు 1989లో నోబెల్‌ శాంతి బహుమతిని కూడా ఇప్పించింది.మనదేశంలో ఎవరు అధికారంలో ఉన్నప్పటికీ సకల వసతులు కల్పిస్తూ చైనా వ్యతిరేక ప్రచారానికి అన్ని రకాలుగా తోడ్పడుతున్నారు. దలైలామా తరువాత స్వతంత్రుడైౖన పెంచెన్‌ లామా బౌద్దులకు ముఖ్యుడు. అతగాడే పదమూడవ దలైలామా వారసుడిగా గుర్తించిన ముగ్గురిలో ఒకడు లామో ధోండప్‌ తరువాత 14వ దలైలామా అయ్యాడు.క్రీస్తుశకం 1642 నుంచి కమ్యూనిస్టులు అధికారానికి వచ్చిన 1949వరకు చైనా ప్రభుత్వానికి లోబడి పరిమిత అధికారాలతో టిబెట్‌ ప్రాంతంపై దలైలామాలు లేదా అతగాడి ప్రతినిధులు రాజకీయ అధికారాన్ని కూడా చెలాయించేవారు. దీన్నే టిబెట్‌ స్వతంత్రదేశమని వక్రీకరించారు.1912లో చైనాలో తలెత్తిన తిరుగుబాటుతో క్వింగ్‌ రాజరికం పతనమై స్వతంత్రదేశంగా అవతరించింది, ఆ సమయంలో బ్రిటీష్‌ వారి కుట్రలో భాగంగా టిబెట్‌ స్వాతంత్య్రాన్ని పదమూడవదలైలామా ప్రకటించాడు. అయితే సన్‌యేట్‌ సేన్‌ నాయకత్వంలోని జాతీయ ప్రభుత్వం గుర్తించలేదు, టిబెట్‌ ప్రాంతం చైనాలో అంతర్భాగమే అని స్పష్టం చేసింది. కమ్యూనిస్టులు అధికారానికి వచ్చిన తరువాత కూడా అదే విధంగా కొనసాగింది. రెండవ ప్రపంచ యుద్ద సమయంలో కొందరు టిబెటన్లు జపాన్‌కు అనుకూలంగా వ్యవహరించటంతో వారిని అణచివేసేందుకు నాటి పాలకుడు చాంగ్‌కై షేక్‌ మిలిటరీని పంపి అణచివేశాడు. తరువాత జరిగిన పరిణామాల్లో ఖామ్‌ అనే యుద్ద ప్రభువు ఆధీనంలో ఉన్న టిబెట్‌ ప్రాంతాన్ని తన ఆధీనంలోకి తెచ్చుకొనేందుకు కమ్యూనిస్టు ప్రభుత్వం 1950 అక్టోబరులో ప్రజాసైన్యాన్ని పంపి స్వాధీనం చేసుకుంది. అదే ఏడాది పదిహేనేండ్ల వయస్సులో 14వ దలైలామాను టిబెట్‌ పాలకుడిగా ప్రకటించినప్పటికీ కమ్యూనిస్టు ప్రభుత్వం అంగీకరించలేదు.1951లో చైనా ప్రభుత్వానికి లోబడి స్వయంపాలిత ప్రాంతంగా టిబెట్‌ ఉండేందుకు దలైలామా ఒక ఒప్పందాన్ని చేసుకున్నాడు.1954లో మావోతో భేటీ అయ్యాడు, చైనా పార్లమెంటు స్టాండిరగ్‌ కమిటీ ఉపాధ్యక్షుడిగా నియమితుడయ్యాడు. మావో తనను ఒక కొడుకు మాదిరి చూశాడని దలైలామా తన ఆత్మకథలో చెప్పాడు.

1954 తరువాత సిఐఏ తనకుట్రను అమలు ప్రారంభించింది.1956లో దలైలామా భారత్‌ను సందర్శించినపుడు ఒకవేళ తాను రాజకీయ ఆశ్రయం కోరితే అంగీకరిస్తారా అని ప్రధాని నెహ్రూను కోరాడు.చైనా ప్రభుత్వంతో అప్పటికే ఒప్పందం ఉన్నందున అలాంటి పని చేస్తే అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవటం, రెచ్చగొట్టినట్లు అవుతుందని నెహ్రూ సున్నితంగా తిరస్కరించారు. ఆ తరువాత అమెరికా వత్తిడికి లొంగిన నెహ్రూ ఆశ్రయమే కాదు, తిరుగుబాటు ప్రభుత్వ ఏర్పాటుకు కూడా సహకరించారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ అంశం రెండు దేశాల మధ్య ఒక ప్రధాన సమస్యగానే ఉంటోంది. మన ప్రభుత్వం టిబెట్‌ను చైనాలో అంతర్భాగంగా గుర్తిస్తూనే వేర్పాటు వాదులకు అనధికారిక మద్దతు కొనసాగిస్తున్నది.మనదేశంలో కాలు పెట్టిన తరువాత 1967లో తొలిసారిగా దలైలామా విదేశీ పర్యటనకు జపాన్‌ వెళ్లారు. ఆయనకు వీసా ఇచ్చిన ప్రభుత్వం తమ గడ్డమీద ఉన్నంత వరకు చైనా వ్యతిరేక మాటలు మాట్లాడవద్దని షరతు విధించింది.కానీ మనపాలకులు మాత్రం పూర్తి స్వేచ్చ ఇచ్చారు.

మూడువందల మంది చైనా ఇంజనీర్లు వెనక్కు- దీని వెనుక కుట్ర ఉందా , మోడీ సర్కార్‌ నిర్వాకం సంగతేంటి !

Tags

, , , , ,

ఎం కోటేశ్వరరావు

గాల్వన్‌లోయ ఉదంతాల తరువాత రెండు దేశాలూ సాధారణ సంబంధాలను ఏర్పాటు చేసుకున్నాయి. సరిహద్దు సమస్యను శాశ్వతంగా పరిష్కరించుకోవాలని తాజాగా మన రక్షణ మంత్రి రాజనాధ్‌ సింగ్‌ ఆకాంక్ష వెలిబుచ్చారు. ఐదేండ్ల పాటు నిషేధించిన చైనా పెట్టుబడులను అనుమతించేందుకు మోడీ సర్కార్‌ దిగివచ్చింది. రెండు దేశాల మధ్య విమానరాకపోకలకు, వీసాల జారీకి అంగీకారం కుదిరింది. అంతా బాగుందని అందరూ భావిస్తున్న తరుణంలో మనదేశంలో యాపిల్‌ కంపెనీ తయారు చేస్తున్న ఫోన్ల ఫ్యాక్టరీల నుంచి 300 మంది చైనా ఇంజనీర్లు, సాంకేతిక నిపుణులు గత రెండు నెలల్లో స్వదేశానికి వెళ్లినట్లు, చైనా ప్రభుత్వమే తిరిగి రావాలని ఆదేశించినట్లు వార్తలు వచ్చాయి.వారితో పోటీపడి ఫోన్లు తయారు చేస్తున్నామన్న దుగ్దతో మనదేశం మీద జరిగిన కుట్రగా ఈ పరిణామాన్ని వర్ణించారు. అయితే మన కేంద్ర ప్రభుత్వం గానీ, యాపిల్‌ కంపెనీగానీ నోరెత్తలేదు. మన వాహన పరిశ్రమలకు అవసరమైన మాగ్నెట్లను ఎగుమతికి అనుమతించకుండా చైనా ఆంక్షలు విధించి ఆ రంగాన్ని సంక్షోభంలోకి నెట్టేందుకు చూసిందని కూడా విమర్శలు చేసిన సంగతి తెలిసిందే.మాగ్నట్ల సరఫరా నిలిచిపోయిన ప్రతికూల ప్రభావం తొలుత అంచనావేసినదాని కంటే ఎక్కువగా ఉందని భారత పరిశ్రమల సమాఖ్య(సిఐఐ) అధ్యక్షుడు రాజీవ్‌ మెమానీ గురువారం నాడు మీడియాతో చెప్పారు. పంటల దిగుబడిని గణనీయంగా పెంచే ఎరువులను కూడా మనకు రాకుండా తగ్గిస్తున్నదని, ఈ ఏడాది నిషేధం లేకపోయినా పూర్తిగా నిలిపివేసిందని సొల్యుబుల్‌ ఫర్జిలైజర్‌ ఇండస్ట్రీ అసోసియేషన్‌ అధ్యక్షుడు రజివ్‌ చక్రవర్తి చెప్పారు. ఐదు సంవత్సరాల క్రితం గాల్వన్‌ ఉదంతాల తరువాత చైనా యాప్‌లు, విమానాలు, పెట్టుబడులు, టెలికాం పరికరాల కొనుగోలుపై మనదేశం నిషేధం విధించింది. మాగ్నట్‌లు, ఎరువులు నిలిచిపోయింది ఈ ఏడాదే అని చెబుతున్నారు తప్ప ఐదేండ్లుగా సజావుగానే వచ్చాయి. మన ఔషధ పరిశ్రమలకు అవసరమైన ఎపిఐ వంటి కీలక ముడిసరకుల వంటి వాటిని మనకు అందకుండా చైనా ఎలాంటి నిషేధాలు పెట్టలేదు. ఇలాంటి వాటిని ఐదేండ్లుగా అడ్డుకొని ఉంటే మన పరిస్థితి ఎలా ఉండేదో ఊహించుకోవాల్సిందే.చైనాగాక పోతే మరొకచోట నుంచి తెచ్చుకొనేవారం అనవచ్చు, ఆ పని ఇప్పుడూ చేయవచ్చు కదా, తర్కానికి నిలవని కుట్ర కతలెందుకు ?

బిజెపి నేతలు, మోడీ సమర్ధకులు మనదేశం కూడా ఆయుధాలను ఇతర దేశాలకు ఎగుమతి చేస్తున్నదని పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. ఇటీవల దుబాయిలో జరిగిన రక్షణ ఉత్పత్తుల ప్రదర్శన సందర్భంగా బ్రహ్మోస్‌ క్షిపణిని మాకు విక్రయిస్తారా అని పాకిస్తాన్‌ మిలిటరీ అధికారి ఒకరు దాని రూపకర్త డాక్టర్‌ అపతుకాంత శివథాను పిళ్లేను అడిగారట. ఏమి సమాధానం చెప్పిఉంటారో ఊహించుకోండి ! మన క్షిపణులను అమ్మి వాటినే మనమీద వేయించుకుంటామా ! ఎవరైనా అంతే కదా !! డోనాల్డ్‌ ట్రంప్‌తో మన మోడీ ఎంత రాసుకుపూసుకు తిరిగినా అమెరికా వద్ద ఉన్న అత్యాధునిక మిలిటరీ పరికరాలను మనకు ఇచ్చారా ? వారు ఇవ్వకపోగా రష్యా నుంచి ఎస్‌ 400 క్షిపణి వ్యవస్థలను కొనుగోలు చేయరాదని మన మీద వత్తిడి తెచ్చిన దుశ్చర్యను మనం మరచిపోగలమా ! రామాయణంలో రావణుడు సవతిసోదరుడు కుబేరుడిని ఓడిరచి అతగాడి దగ్గర ఉన్న పుష్పక విమానాన్ని స్వాధీనం చేసుకున్నాడని చెబుతారు. కాసేపు నిజమే అనుకుందాం. సీతను రక్షించేందుకు రాముడికి కూడా నిర్మాణ కంపెనీ పుష్పక విమానం ఇచ్చి ఉన్నా లేదా సాంకేతిక పరిజ్ఞాన బదిలీ చేసినా లంకకు వెళ్లేందుకు వారధితో అవసరం లేకపోయేది, రాముడు ఇలా వెళ్లి అలా సీతను ఎక్కించుకు వచ్చేవాడు కదా ! ఎందుకు విమానం కొనుగోలు చేయలేదు ? విధి అలా రాసి ఉంది అంటారు, అదే అయితే ఇప్పుడు కూడా అదే అని సరిపెట్టుకోకుండా చైనా కుట్ర అంటున్నారెందుకు ?

జూన్‌ 30 నుంచి జూలై రెండవ తేదీ వరకు అమెరికా రాజధాని వాషింగ్టన్‌ డిసిలో క్వాడ్‌ విదేశాంగ మంత్రుల సమావేశం జరిగింది. అమెరికా, భారత్‌, జపాన్‌, ఆస్ట్రేలియాలతో కూడిన కూటమి నరేంద్రమోడీ అధికారానికి వచ్చిన తరువాత 2017 నుంచి క్రమం తప్పకుండా సమావేశాలు జరిపి, ప్రకటనలు చేస్తున్నది.చైనాను దెబ్బతీసేందుకు ఏర్పడిన ఈ కూటమి ఏడవ అధినాయక సమావేశం ఈడాది చివరిలో మనదేశంలో జరగనుంది.దీనికి సన్నాహంగానే కూటమి విదేశాంగ మంత్రుల సమావేశం వాషింగ్టన్‌డిసిలో జరిగింది. చైనాను ఉద్దేశించి ఆర్ధికబలవంతం, ధరల తిమ్మినిబమ్మిని,సరఫరా వ్యవస్థల విచ్చిన్నం, అక్రమ మార్కెట్‌ పద్దతులు, కీలకమైన ఖనిజాల ఉత్పత్తి మీద కేంద్రీకరణ వంటి చర్యలకు పాల్పడుతున్న దేశాలంటూ ధ్వజమెత్తుతూ ఒక తీర్మానం చేశారు. దక్షిణ చైనా సముద్రంలో నౌకల స్వేచ్చారవాణాకు ఆటంకం కలిగించకూడదంటూ చర్చలు చేశారు. ఈ పరిణామాలకు ఏదైనా కార్యాకారణ సంబంధం ఉందా ?

నిజంగా చైనా నుంచి మనదేశానికి ముప్పు ఉందని భావిస్తే లేదా కుట్ర జరుగుతోందని అనుకుంటే జరుగుతున్న పరిణామాలకు, అనుమానాలకు పొంతన కుదరటం లేదు. లావాదేవీలు తగ్గించుకోకపోగా ఇంకా పెంచుకొనేందుకు మన ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తున్నది. గాల్వన్‌ ఉదంతాల తరువాత చైనాను మనకాళ్ల దగ్గరకు తెచ్చుకోవాలంటే దిగుమతులు నిలిపివేసి డ్రాగన్‌ పీకనొక్కాలంటూ కాషాయ అలగా జనం వీధుల్లో వేసిన వీరంగం తెలిసిందే.మరోవైపు కేంద్ర ప్రభుత్వం ఐదు సంవత్సరాల పాటు నిలిపివేసిన చైనా పెట్టుబడులకు ఎర్రతివాచీ పరచి స్వాగతం పలుకుతున్నది. ఐదేండ్ల క్రితం నిలిపివేసిన విమానాలు, వీసాల జారీని పునరుద్దరించేందుకు నిర్ణయించారు. వస్తు దిగుమతుల్లో మోడీ తన రికార్డులను తానే బద్దలు కొట్టుకున్నారు. చైనా ప్రభుత్వం మీద తిరుగుబాటు చేసి పారిపోయి వచ్చిన దలైలామాకు మనదేశం ఆశ్రయం ఇచ్చింది. అనేక మంది చైనా వ్యతిరేక టిబెటన్లు దేశంలో ఉన్నారు.వారిలో కొందరితో ప్రత్యేక మిలిటరీ దళాలను తయారు చేసి సరిహద్దుల్లో నియమించారు.దలైలామా తరచూ చైనా వ్యతిరేక వ్యాఖ్యలతో కార్యకలాపాలు చేస్తుంటే అనుమతిస్తున్నారు. వారసుడిని నిర్ణయించే అధికారం దలైలామాకే ఉందని కేంద్ర మంత్రి కిరణ్‌ రిజు స్వంత అభిప్రాయాన్ని బహిరంగంగా చెప్పారు. ఇది చైనా వ్యవహారాల్లో జోక్యం తప్ప మరొకటి కాదు. ఉన్న సరిహద్దు వివాదాన్ని శాశ్వతంగా పరిష్కరించుకోవాలని రక్షణ మంత్రి బీజింగ్‌లో ప్రతిపాదిస్తారు, చైనా నుంచి మన రక్షణకు ముప్పు ఉందంటూ పరోక్షంగా వాషింగ్టన్‌లో విదేశాంగమంత్రి ప్రకటనలు చేస్తారు.

తమదేశాన్ని మరోసారి అగ్రస్థానంలో నిలపాలనే నినాదంతో ముందుకు పోతున్న అమెరికా నేతలు మనతో సహా ఇతరదేశాలు తమకంటే ముందుకు పోవటానికి అనుమతిస్తారా ? జాతీయవాదం ప్రబలి ప్రతిదేశమూ రక్షణాత్మక చర్యలకు పాల్పడుతున్న తరుణమిది. దానికి విరుగుడు ఏమిటో కనుక్కోవాలి. అలాంటి ప్రయత్నం మనదేశంలో జరుగుతున్నదా ? అవసరమైన నిపుణులను తయారు చేసుకోవటంలో వైఫల్యమే దానికి నిదర్శనం.బొమ్మరిల్లు సినిమాలో అన్నీ మీరే చేశారని అన్నట్లుగా ఎప్పుడో కాలం చేసిన గాంధీ, నెహ్రూలను ఆడిపోసుకోవటం తప్ప బిజెపి వారు చేసిందేమిటి ? ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం గురించి శాస్త్రవేత్తలకే పాఠాలు చెప్పగలిగిన చంద్రబాబు నాయుడి వంటి ముందుచూపు కలిగిన మిత్రులు ఉన్నప్పటికీ అడుగుముందుకు కదలటం లేదు.

యాపిల్‌ కంపెనీ 2017 నుంచి మనదేశంలో ఫోన్లు ఉత్పత్తి చేస్తున్నది. దాన్నుంచి మూడువందల మంది చైనా నిపుణులు స్వదేశానికి వెళ్లిపోతే కుట్ర అని గుండెలుబాదుకుంటున్నవారు కనీసం ప్రత్నామ్నాయంగా అంతమందిని అందించలేని దుస్థితి దేశంలో ఎందుకు ఉన్నది, ఎనిమిది సంవత్సరాలు గడచినా మనం ఎందుకు తయారు చేసుకోలేకపోయామని మన పాలకులను, రాయితీలు, కార్పొరేట్‌ పన్ను తగ్గింపుతో లక్షల కోట్ల మేర లబ్దిపొందుతున్న పరిశ్రమల వారిని ఎందుకు ప్రశ్నించరు. సదరు యాపిల్‌ కంపెనీ ఎగుమతులతో లాభాలు పోగేసుకోవటం తప్ప తనకు అవసరమైన స్థానిక నిపుణులను ఎందుకు తయారుచేయలేకపోయింది ? మన ప్రభుత్వ విధానాలను ప్రశ్నిస్తున్నామా ? వేతన అసమానతలు మనదేశంలో 25శాతం ఉంటే చైనాలో 5 నుంచి 12శాతం మధ్య ఉన్నాయి. వేతనాల్లేకుండా కష్టపడి, నైపుణ్యంతో పని చేయాల్సిన అవసరం ఏముందన్న భావన అసమానత ఎక్కువగా ఉన్న చోట ఉంటుంది. చైనాలో విద్యకు ప్రాధాన్యత ఇచ్చారు.హైస్కూలు, ఆపై స్థాయి విద్యగలవారు 25శాతం మంది వృత్తి విద్యా శిక్షణలో చేరితే మనదేశంలో కేవలం రెండుశాతమే ఉన్నారు.

రోజు రోజుకూ సాంకేతికరంగంలో విప్లవాత్మక మార్పులు వస్తున్నాయి. ఆవు పేడ, మూత్రం నుంచి బంగారాన్ని ఎలా తయారు చేయాలా అన్న దగ్గరదారి మీద మీద పెట్టిన శ్రద్ధ ఉత్పాదకరంగంపై లేదు ! మిగతా అన్నింటిలో ప్రావీణ్యం సంపాదించిన తరువాత జనాలను ఖాళీగా ఉంచకుండా ప్రతి ఇంటికి ఒక గోవును ఇచ్చి పేడ, మూత్రంతో పరిశోధనలు చేయించటాన్ని ఎవరూ తప్పుపట్టరు. దేశంలో పరిశోధనలకు చేసే ఖర్చు జిడిపిలో 0.7శాతానికి లోపుగానే ఉంది. అదే చైనాలో రెండున్నర శాతం దాటింది. నరేంద్రమోడీ వచ్చిన తరువాత పెరిగిందేమీ లేదు.కుండలో కూడు అలాగే ఉండాలి బిడ్డ దుడ్డుగా పెరగాలంటే కుదురుతుందా ! 2015 నుంచి రకరకాల నైపుణ్యాలను వృద్ధి చేసే పేరుతో పలు పథకాలను ప్రకటించారు పద్దెనిమిది రకాల చేతివృత్తుల వారికి ప్రధాని విశ్వకర్మ పధకం ఒకటి.2024 ఆగస్టు 5న కేంద్ర ప్రభుత్వం రాజ్యసభలో ఒక ప్రశ్నకు సమాధానం చెప్పింది. దాని ప్రకారం అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలలో దీని కింద నమోదు చేసుకున్నవారు 2,30,47,956 కాగా శిక్షణకు వచ్చిన వారు కేవలం 14,43,129 మాత్రమే. బిజెపి పాలిత ఉత్తర ప్రదేశ్‌లో 28.68లక్షలకు 39వేలు, మధ్య ప్రదేశ్‌లో 29లక్షలకు 82వేలు, బీహార్‌లో 15.6లక్షలకు గాను 32వేలు మాత్రమే అని పేర్కొన్నారు, తమిళనాడులో 8.4లక్షలు, పశ్చిమబెంగాల్లో 7.74లక్షలకు ఒక్కొక్కరు మాత్రమే హాజరైనట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. 2015 నుంచి ప్రధానమంత్రి కౌశల్‌ వికాస్‌ యోజన(పిఎంకెవివై) కింద కోటీ 40లక్షల మందికి శిక్షణ ఇచ్చినట్లు 2023 డిసెంబరు 26న పిఐబి జారీ చేసిన వివరాల్లో పేర్కొన్నారు. అంతమందిలో యాపిల్‌ కంపెనీలో పనిచేసేందుకు 300 మంది ప్రత్యామ్నాయ నిపుణులు లేరా ? చైనా కుట్ర అని మాట్లాడటమే దేశభక్తి అనుకుంటున్నారా ? ఈ రాతలు, మాటలు చైనా దృష్టిలో పడవా, రాగద్వేషాలకు వారు అతీతంగా ఉంటారా ? జనాలు ఇలాంటి వాటన్నింటినీ ఆలోచించాలి.

మన దేశం నుంచి ప్రతి ఏటా పెద్ద మొత్తంలో డాలర్లను పొందుతున్న చైనా మనకు వ్యతిరేకంగా కుట్ర చేయటం ఏమిటంటూ కొందరు ఉడుక్కుంటున్నారు. బీజింగ్‌లోని మన రాయబార కార్యాలయం వెబ్‌సైట్‌లో ఉన్న సమాచారం ప్రకారం 201415 నుంచి 2024`25 వరకు చైనాతో మనం జరిపిన వాణిజ్య లావాదేవీల్లో చైనా మిగులు 702.05 బిలియన్‌ డాలర్లు అంటే అంతమొత్తం నరేంద్రమోడీ సమర్పించినట్లే, మేకిన్‌ ఇండియా విఫలం కాబట్టే కదా ఇదంతా ! చైనా నుంచి స్వచ్చందంగానే దిగుమతి చేసుకున్నాం. అమెరికా మాదిరి పరస్పరం ప్రతికూల సుంకాలను విధించుకోలేదు. చైనా మీద ప్రతిదానికీ మనం ఆధారపడకూడదని కొందరు పదే పదే చెబుతుంటారు. నిజమే, ఎవరు వద్దన్నారు ? అమెరికాకు పోటీగా చైనా ఎదిగితే ఎవరైనా అడ్డుకోగలిగారా ?కొందరు చెబుతున్నట్లు నిజంగా చైనా మనల్ని అడ్డుకుంటే మనం భాగస్వామ్య, మిత్రదేశాలుగా పరిగణిస్తున్న అమెరికా, ఐరోపా ధనికదేశాలు మనకు ఎందుకు సాయంగా రాలేదు ? దేవుడి మీద భారం వేసి కూర్చుంటే లాభం లేదు మానవ ప్రయత్నం కూడా చేయాలని అంటారు కదా, అలాంటపుడు చైనా నుంచి కంపెనీలు వస్తాయని, నిపుణులు కూడా అక్కడి నుంచే వస్తారు, మనకు వస్తువులను ఉత్పత్తి చేస్తారని ఆశపెట్టుకోవటం ఏమిటి ? మన ప్రయత్నం మనం ఎందుకు చేయటం లేదు ?

అమెరికాకు హడలు పుట్టిస్తున్న చైనా అంతరిక్ష కార్యక్రమం !

Tags

, , , , , , ,


ఎం కోటేశ్వరరావు


ఆర్థిక రంగంలోనే కాదు, అంతరిక్షంలోనూ సోషలిస్టు చైనా ప్రస్తుతం అమెరికాను హడలెత్తిస్తున్నదా ? అంటే వాషింగ్టన్‌ స్పందన చూస్తే అలాగే ఉంది, అయితే వక్రీకరణ షరా మామూలే అని చెప్పనవసరం లేదు. అమెరికా అంతరిక్ష దళాల(యుఎస్‌ఎస్‌ఎఫ్‌) జనరల్‌ కమాండర్‌ స్టీఫెన్‌ వైటింగ్‌ మనదేశంతో పాటు ప్రపంచాన్ని భయపెట్టేందుకు పూనుకున్నాడు. చైనా గురించి అనేక కుట్ర సిద్దాంతాలు ప్రచారంలో ఉన్న సంగతి తెలిసిందే. అందువలన ఈ పూర్వరంగంలోనే అతగాడు ఇటీవల ‘‘ బ్రేకింగ్‌ డిఫెన్స్‌ ’’ అనే వెబ్‌సైట్‌తో మాట్లాడిన అంశాలను చూడాల్సి ఉంది.ప్రపంచ వ్యాపితంగా 80దేశాలలో 750 చిన్నా, పెద్ద మిలిటరీ కేంద్రాలను నిర్వహిస్తున్న అమెరికా ఇతర దేశాల నుంచి ముప్పు ఉన్నట్లు స్వంత జనాలను నిరంతర భయపెడుతున్నది. దాని వెనుక ఉన్న అసలు రహస్యం ఏమంటే స్వంత పౌరులు భారీ మిలిటరీ బడ్జెట్‌ను ప్రశ్నించకుండా ఉండేందుకు, ఇతర దేశాలను మిలిటరీ శక్తిని చూపి భయపెట్టేందుకు, దాడులు చేసేందుకు చేసేందుకు తప్ప వేరుకాదు. ఆశ్చర్యకరమైన వేగంతో చైనా ఉపగ్రహాల ప్రయోగం ఇండోపసిఫిక్‌ ప్రాంతానికి ప్రమాదకరంగా మారటం అత్యంత ముఖ్యమైన సమస్యల్లో ఒకటని వైటింగ్‌ చెప్పాడు. దొంగే దొంగని అరచినట్లుగా 2019లో డోనాల్డ్‌ ట్రంప్‌ తొలిసారి అధ్యక్షుడిగా ఉన్నపుడు అమెరికా అంతరిక్ష దళం పేరుతో మిలిటరీ విభాగాన్ని ఏర్పాటు చేశాడు. అది మినహా మరోదేశమేదీ ఇప్పటి వరకు అలాంటి విభాగాలను ఏర్పాటు చేసినట్లు వార్తలు లేవు.

అంతరిక్షంలో ఎన్ని ఉపగ్రహాలు లేదా అలాంటివి ఉన్నాయన్నది ఒక అంచనా తప్ప నిర్దిష్ట సంఖ్య చెప్పటం కష్టం. వాటిలో పనిచేసేవాటితో పాటు చేయనివీ ఉన్నాయి. గడువు మీరిన తరువాత కూడా అవి పరిభ్రమిస్తూనే ఉంటాయి. తొలి ఉపగ్రహం స్పుత్నిక్‌ నాటి సోవియట్‌ యూనియన్‌లో 1957 అక్టోబరు నాలుగున నింగిలో ప్రవేశించింది. ఈ ఏడాది మార్చి నెల నాటికి 20,985 ప్రయోగించగా భూకక్ష్యలో 14,904 ఉన్నట్లు తేల్చారు. కొన్ని భూ కక్ష్యలో ఉండగా మరికొన్ని అంతకు మించి ఎగువన ఉన్నాయి. అయితే ఇవన్నీ పనిచేస్తున్నట్లు చెప్పటానికి లేదు. కొన్ని అదుపుతప్పినవి, మరికొన్ని ఇంథనం అయిపోయి పనిచేయనివి, మరికొన్ని కాలం చెల్లినవి, ఇలా రకరకాలుగా దాదాపు నాలుగువేలు మన తలల మీద గంటకు 28వేల కిలోమీటర్ల వేగంతో తిరుగుతున్నాయి.1972లో నాటి సోవియట్‌ యూనియన్‌ ప్రయోగించిన కాస్మోస్‌ 482 ఉపగ్రహం ఈ ఏడాది భూఉపరితలంలో నాలుగు ముక్కలై హిందూమహా సముద్రంలో గుర్తు తెలియని చోట కూలిపోయింది. అందువలన ఇలాంటివి ఏదో రూపంలో తిరిగి రావటానికి ఎన్నో సంవత్సరాలు పట్టవచ్చని భావిస్తున్నారు. అమెరికా తొలిసారిగా 1958 మార్చి 17న వాన్‌గార్డ్‌ ఒకటి ఉపగ్రహాన్ని పంపింది.గడచిన ఐదు సంవత్సరాల్లో(63 నెలల్లో) 11,951 ప్రయోగించగా అంతకు ముందు 9,034 మాత్రమే ప్రయోగించారంటే ఇటీవలి కాలంలో అంతరిక్ష ప్రయోగాలు, మార్కెట్‌ ఎంతవేగంగా విస్తరించిందో అర్ధం చేసుకోవచ్చు. ఈ ఏడాది తొలి మూడు నెలల్లోనే 639 ప్రయోగాలు జరిగాయి. ఈ స్థితిలో ఫలానా దేశం ముందుందని ఏడ్చి పెడబొబ్బలు పెడుతూ సమయాన్ని వృధాచేసుకోవటంకంటే వెనుకబడి ఎందుకున్నామని ప్రతిదేశం ఆలోచించుకోవటం ఆరోగ్యకరం. తొలి స్పుత్నిక్‌ బరువు 83.4కిలోలు కాగా అతిపెద్ద ఎన్విశాట్‌ 8211 కిలోలు ఉంది. డబుల్‌ డెక్కర్‌ బస్సంత పరిమాణంలో ఉంది. 2003లో ప్రయోగించిన తొలి అతిచిన్న క్యూబ్‌ఉపగ్రహం బరువు కేవలం రెండు కిలోలు మాత్రమే.తరువాత ఒక కిలో, కొన్ని గ్రాములు మాత్రమే ఉన్నవాటిని కూడ నింగిలోకి పంపారు. ఇలాంటి వాటిని జతచేసి పంపేవి కొన్ని కాగా కేవలం ఒకటి మాత్రమే నింగిలో తిరిగేవి కూడా ఉన్నాయి. ఉదహరణకు ఎలన్‌మస్క్‌ స్టార్‌లింక్‌ ఏడువేలు ఉండగా, ప్లానెట్‌ ఇవో 150 కలిగి ఉంది. క్యూబ్‌ ఉపగ్రహాల తయారీకి చాలా తక్కువ ఖర్చు కావటంతో అనేక దేశాలు ఇతర దేశాల్లో ఉన్న కేంద్రాల నుంచి వాటిని ప్రయోగించటానికి దోహదం చేసింది. ఇది వాణిజ్యంగా మారింది. అంతే కాదు, పరస్పర అనుమానాలతో రక్షణ చర్యల్లో భాగంగా అనేక దేశాలు నింగితో పాటు ఉపగ్రహాలను కూడా మిలిటరీ అవసరాలకు వినియోగిస్తున్నాయి. ఈ పోటీలో ఎవరు వెనుకబడితే వారికి అదొక లోపంగా మారుతుంది.

ఇటీవల ఇరాన్‌పై ఇజ్రాయల్‌ జరిపినదాడుల వెనుక తాము గూఢచర్యంతో సమాచారం సేకరించామని ఎంతగా చెప్పుకున్నప్పటికీ మిలిటరీ ఉపగ్రహాల సమాచారం ఎంతో దోహదం చేసింది. ఆపరేషన్‌ సిందూర్‌ సందర్భంగా కూడా అదే జరిగినట్లు కొందరు చెప్పిన అంశం తెలిసిందే. అమెరికా, ఇతర ఐరోపా ధనిక దేశాలు ఈ రంగంలో ముందుండటమే కాదు, తన చుట్టూ కుట్రలు జరుపుతున్నపుడు చైనా దూరంగా ఉండజాలదు.తనపై కుట్ర చేస్తున్న దేశాలకు సంబంధించిన మిలిటరీ కదలికలు, స్థావరాలు,అంతరిక్షంలో మిలిటరీ ఉపగ్రహాలు వాటి కార్యకలాపాలపై నిఘావేసేందుకు తనదైన జాగ్రత్తలు తీసుకుంటున్నది. ఉపగ్రహాలను ప్రయోగిస్తున్నది.ప్రత్యర్థి కదలికలు,లక్ష్యాలను గుర్తించటం, వాటి మీద నిర్దిష్టంగా దాడులు ఎలా జరపాల్సిందీ సంబంధిత అంశాలు ఒక్క యుద్దం లేదా ఉద్రిక్తతలు తలెత్తినపుడు మాత్రమే చేసేవి కాదు. నిరంతరం జరుగుతూనే ఉంటాయి. మిలిటరీ పరిభాషలో కిల్‌ చైన్‌ అంటున్నారు. చైనా పెద్ద ఎత్తున అలాంటివాటిలో నిమగ్నమైందని అమెరికా ఆరోపిస్తోంది. ఉదాహరణకు రష్యాలో కొన్ని వందల కిలోమీటర్ల లోపలికి వెళ్లి సైనిక కేంద్రాల మీద డ్రోన్లతో ఒకరోజు దాడులు చేసేందుకు పద్దెనిమిది నెలల పాటు పని చేశామని ఉక్రెయిన్‌ ప్రకటించిన సంగతి తెలిసిందే. ముందుగా పథకాలు సిద్దం చేసుకుంటే అవసరమైనపుడు వాటిని అమలు చేస్తారు, లేదా మార్పులకు అనుగుణంగా సవరిస్తారు.మనదేశానికి తగినన్ని మిలిటరీ ఉపగ్రహాలు లేని కారణంగా అమెరికా, ఇతర దేశాల ప్రయివేటు ఉపగ్రహాల నిఘా సమాచారాన్ని మన మిలిటరీ తీసుకుంటున్నది.మన మీడియా కూడా వాటిని కథనాలుగా ముందుకు తెస్తున్నది. మనం ఇతరుల నుంచి తీసుకున్నట్లే పాకిస్తాన్‌ కూడా ఇటీవల అదేపని చేసి మన విమానాలను కూల్చినట్లు చెబుతున్నారు. ఇండోపసిఫిక్‌ ప్రాంతంలో ఉన్న తమ, మిత్రదేశాల మిలిటరీ కేంద్రాలను గుర్తించేందుకు, వెంబడిరచేందుకు, లక్ష్యాలుగా చేసుకొనేందుకు చైనా మెరుపువేగంతో పని చేస్తున్నదని అమెరికా అధికారి వైటింగ్‌ ఆరోపించాడు.


నిజంగా చైనా అలాంటి సాంకేతిక పరిజ్ఞానం సంపాదించిందా లేదా అన్నది నిర్ధారణ కాలేదు, అమెరికా అనుమానిస్తున్నది.తమ, మిత్రదేశాల విమానవాహక నౌకలతో సహా ఎక్కడ ఎలాంటి మిలిటరీ కార్యకలాపాలు జరుగుతున్నదీ కచ్చితత్వంతో కనిపెట్టగల సత్తాను చైనా సంపాదించిందని, దాని ఆయుధ వ్యవస్థలుసుదూరంగా ఉన్న లక్ష్యాల మధ్య అంతరం తగ్గిపోయిందని వైటింగ్‌ చెబుతున్నాడు. ఉపగ్రహ వ్యతిరేక ఆయుధాల మోహరింపు,అంటే సైబర్‌ దాడులు, ఉపగ్రహాలు, జిపిఎస్‌ పనిచేయకుండా స్థంభింపచేయటం, లేజర్‌ కిరణాల ద్వారా ధ్వంసం చేయటం వంటివి చేయగలదన్నాడు. అంతరిక్ష సాంకేతిక పరిజ్ఞానాన్ని మిలిటరీతో అనుసంధానం చేయటం కూడా అమెరికా ఊహించని పరిణామం. ఇరాన్‌పై ఆపరేషన్‌ మిడ్‌నైట్‌ హామర్‌ పేరుతో అమెరికా జరిపిన దాడిలో ఇలాంటి మిలిటరీ ఉపగ్రహాలు నిర్దేశిత లక్ష్యాలను గుర్తించటం, వాటిపై బాంబులు వేయటంలో ఎంతో కీలకపాత్ర పోషించటాన్ని చూసిన తరువాత అమెరికా అధికారి ఈ విషయాలను మీడియాతో చెప్పాడు. రానున్న రోజుల్లో చైనా తమను మించిపోతుందేమో అన్న భయం అమెరికాను వెన్నాడుతున్నదంటే అతిశయోక్తి కాదు.2008లో పని చేయని తన ఉపగ్రహాలలో ఒకదానిని భూమి మీద నుంచి ప్రయోగించిన క్షిపణితో చైనా కూల్చివేసిందని, అయినప్పటికీ అమెరికా దాన్ని పట్టించుకోలేదని కొందరు చెబుతున్నారు. మిలిటరీ ఉపగ్రహాలు అందచేసే సమాచారాన్ని త్రివిధ దళాలతో అనుసంధానించటంలో గతంలో అమెరికా, చైనాల మధ్య అంతరం ఎంతో ఎక్కువగా ఉండదని, ఇటీవల క్రమంగా తగ్గిందని అంచనా వేస్తున్నారు.చైనా ఉపగ్రహ కెమెరాలు వంద కిలోమీటర్ల దూరంలో ఉన్న వాటిని మిల్లీ మీటర్ల వరకు ఫొటోలు తీయగలవని చెబుతున్నారు. 2024లో యుఎస్‌ఎస్‌ఎఫ్‌ నివేదిక ప్రకారం చైనా మిలిటరీ అవసరాల కోసం 500 ఉపగ్రహాలను వినియోగిస్తున్నది, వాటిలో గత ఒక్క ఏడాదిలోనే 67 ప్రయోగించింది. దాదాపు ఎనిమిదివేల ఉపగ్రహాలను నిర్వహిస్తున్న అమెరికా కేవలం వెయ్యి ఉన్న చైనా గురించి ఇలాంటి భయాలను రెచ్చగొడుతున్నది. చైనా వద్ద డ్రోన్ల దిశను మార్చగల, క్షిపణులు పని చేయకుండా చేయగల, కీలకమైన మౌలిక సదుపాయాలను ధ్వంసం చేయగల పరిజ్ఞానం ఉందని యుఎస్‌ఎస్‌ఎఫ్‌ ఇండోపసిఫిక్‌ కమాండర్‌ జనరల్‌ ఆంథోనీ మాస్టలర్‌ చెప్పాడు.


అమెరికా తన గగనతల రక్షణతో పాటు ఇజ్రాయెల్‌, మరికొన్ని చోట్ల క్షిపణులను అడ్డుకోగల రక్షణ వ్యవస్థలను డోమ్‌ పేరుతో ఏర్పాటు చేసింది.చైనా, ఉత్తర కొరియా, రష్యా నుంచి ఎదురవుతున్న సవాళ్ల పూర్వరంగంలో డోనాల్డ్‌ ట్రంప్‌ గతంలోనే ముందుకు తెచ్చిన గోల్డెన్‌ డోమ్‌(అంతరిక్షంలో ఆయుధాలు) పధకాన్ని ఇప్పటికే అమలు జరపాల్సిందని విమర్శకులు తప్పుపడుతున్నారు. అలాంటి పథకాలతో అంతరిక్షం పోరుకేంద్రంగా మారుతుందని చైనా గతంలోనే హెచ్చరించింది. సాయుధ సంఘర్షణకు అంతరిక్షాన్ని కేంద్రంగా మారుస్తున్నట్లు చైనా, రష్యా కొద్ది వారాల క్రితం అమెరికాను విమర్శించాయి. తమ నుంచి ముప్పు ఉందనే ప్రచారాన్ని అమెరికా చేస్తున్నదని తమ ఉపగ్రహాలు వాతావరణ మార్పుల పరిశీలన, తదితర ప్రజోపయోగ అవసరాలకు మాత్రమే పని చేస్తున్నాయని చైనా పదే పదే చెబుతున్నది. స్టాటిస్టా సంస్థ సేకరించి విశ్లేషించిన సమాచారం మేరకు అనేక దేశాలు గగనతల కార్యక్రమాలకు పెద్ద ఎత్తున నిధులు కేటాయిస్తున్నాయి, ఏటేటా బడ్జెట్‌లను పెంచుతున్నాయి. ఈ విషయంలో అమెరికా మిగతా దేశాలకు ఎంతో ఎత్తున ఉంది. 2021 నుంచి 2024 మధ్య 51బిలియన్‌ డాలర్ల నుంచి 80కి పెంచగా ఇదే కాలంలో చైనా పది నుంచి 20, జపాన్‌ 4నుంచి ఏడు బిలియన్‌ డాలర్లకు పెంచాయి. తరువాత స్థానాలలో ఉన్న రష్యా, ఫ్రాన్స్‌, ఐరోపా యూనియన్‌, జర్మనీ, ఇటలీ బడ్జెట్‌లలో స్వల్ప మార్పులు తప్ప భారీ పెరుగుదల లేదు. తొమ్మిదవ స్థానంలో ఉన్న మనదేశం 1.96 నుంచి 1.89 బిలియన్‌ డాలర్లకు తగ్గించింది.మన తరువాత స్థానంలో ఉన్న బ్రిటన్‌ కేటాయింపులో పెద్ద మార్పులేదు. చైనా తిరుగుబాటు రాష్ట్రమైన తైవాన్‌ ప్రధాన భూభాగంలో విలీనం కాకుండా చూసేందుకు అమెరికా చేయని యత్నం లేదు. ఒక వేళ మిలిటరీ చర్య ద్వారా అందుకు పూనుకుంటే తైవాన్‌లో ఉన్న ఆధునిక చిప్స్‌ తయారీ కేంద్రాలను పేల్చివేస్తామని గతంలో అమెరికా బెదిరించింది. ఏటేటా తైవాన్‌ ప్రభుత్వానికి ఆధునిక ఆయుధాలను అందచేస్తున్నది. విలీనాన్ని వ్యతిరేకించే శక్తులకు మద్దతు ఇస్తూ ఎన్నికలలో జోక్యం చేసుకుంటున్నది. తైవాన్‌ పేరుతో తూర్పు ఆసియాలో అవసరమైతే మరో యుద్ద రంగాన్ని తెరిచేందుకు పావులు కదుపుతున్నది, ఆ దిశగా కొత్త కూటములను ఏర్పాటు చేస్తున్నది. ఈ నేపధ్యంలో తన రక్షణకు తగిన చర్యలు తీసుకోవటంలో చైనా తప్పు కనిపించటం లేదు, అదే స్థానంలో మనదేశం ఉన్నప్పటికీ చేసేది అదే కదా !

మేడిపండు చూడ మేలిమై ఉండు పొట్ట విప్పిచూడ పురుగులుండు :అంతర్జాతీయ పార్లమెంటరీ దినోత్సవం !

Tags

, , , , , ,

ఎం కోట్వేరరావు

నేడు జూన్‌ 30న ప్రపంచ వ్యాపితంగా అంతర్జాతీయ పార్లమెంటరీ దినోత్సవం జరిగింది. వివిధ దేశాల్లో అనేక కార్యక్రమాలు నిర్వహించారు. ప్రతి ఏటా ఒక ఇతివృత్తాన్ని ఎంచుకొని దాన్ని ప్రచారం చేస్తూ వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తారు.ఈ ఏడాది ” చిన్న చిన్న కార్యాచరణలతో లింగ సమానత్వ సాధన ” గా నిర్ణయించారు. ఈ మేరకు ప్రపంచంలో అనేక కార్యక్రమాలను రూపొందించారు.1889 జూన్‌30వ తేదీన తొలిసారిగా పారిస్‌లో అంతర పార్లమెంటరీ యూనియన్‌(ఐపియు) సమావేశం జరిగింది. ఉనికిలోకి వచ్చి 136 సంవత్సరాలైనప్పటికీ 2023వరకు 147 సమావేశాలు జరిగాయి. ఇటీవల ఏడాదికి రెండేసి చోట్ల నిర్వహిస్తున్నారు. .

ఐపియు తొలి అధ్యక్షుడిగా బెల్జియంకు చెందిన అగస్ట్‌ బీర్‌నియర్ట్‌ పనిచేయగా, ప్రస్తుతం టాంజానియాకు చెందిన తులియా అక్సాన్‌ ఉన్నారు. గతంలో మన దేశానికి చెందిన జిఎస్‌ థిల్లాన్‌, నజమాహెప్తుల్లా అధ్యక్ష బాధ్యతలు నిర్వహించారు. ఐపియు ప్రధానంగా మూడు లక్ష్యాలతో పనిచేస్తుంది. రిజర్వేషన్లు, ఇతర బృందాల ద్వారా పార్లమెంట్లలో మహిళల ప్రాతినిధ్యం పెరిగేందుకు, పార్లమెంట్లలో మహిళలకు మద్దతు ఇచ్చేందుకు, మహిళల హక్కుల కోసం పనిచేసే సంస్థలుగా పార్లమెంట్లను మార్చేందుకు కృషి చేస్తున్నది. హేగ్‌లో అంతర్జాతీయ శాశ్వత కోర్టు ఏర్పాటులో ఇది ప్రముఖపాత్ర పోషించింది. ప్రారంభలో స్విడ్జర్లాండ్‌లోని బెర్న్‌ నగరం తరువాత బెల్జియంలోని బ్రసెల్స్‌, కొన్ని సంవత్సరాలు నెదర్లాండ్స్‌లోని ఓస్లో నగరంలో 1921 నుంచి ఇప్పటివరకు స్విడ్జర్లాండ్‌లోని జెనీవాలో ప్రధాన కార్యాలయం కొనసాగుతున్నది. అంతర్జాతీయ సహకారానికి ఉద్దేశించిన తొలి రాజకీయ సంస్థగా దీన్ని చెప్పవచ్చు. అయితే దీని ప్రభావం ఎంత అంటే అనుమానాస్పదమే.

ప్రజాస్వామ్యం ఖూనీ..
ఒక వైపు అనేక దేశాలలో ప్రజాస్వామ్యం ఖూనీ అవుతున్నది. ఈ సంస్థ ఉనికిలోకి వచ్చిన తరువాతనే అనేక దేశాల్లో పార్లమెంట్లను రద్దు చేసి, నియంతలు అధికారానికి వచ్చారు. హిట్లర్‌ ఏకంగా పార్లమెంటు భవనాన్ని తగులబెట్టించి, నెపాన్ని కమ్యూనిస్టులపై నెట్టి ఆ సాకుతో అణచివేత సాగించాడు. సంప్రదింపులు, మధ్యవర్తిత్వం వంటి అంశాలను చేపట్టినప్పటికీ అనేక దేశాల మధ్య తలెత్తిన వివాదాలను పరిష్కరించటంలో ఐపియు పాత్ర ఎక్కడా కనిపించదు. దీని స్థాపకులలో కొందరికి నోబెల్‌ శాంతి బహుమతి వచ్చినప్పటికీ ప్రపంచంలో నేడున్న అశాంతి, దానికి దోహదం చేసే శక్తులు చెలరేగిపోవటాన్ని చూస్తున్నాము. ఒక స్వచ్చంద సంస్థలా ఉంది తప్ప ఇది చేసే నిర్ణయాలు, తీర్మానాలకు ఎలాంటి చట్టబద్దత లేదు.

ప్రపంచంలో 190 దేశాల్లో పార్లమెంట్లు ఉన్నాయి. వీటిలో 78 చోట్ల ఎగువ, దిగువ సభలు ఉండగా 112 దేశాల్లో ప్రజాప్రతినిధుల సభలు మాత్రమే ఉన్నాయి. మొత్తంగా 268 సభలు ఉన్నాయి. ఐపియులో 181 దేశాలు మాత్రమే సభ్యులుగా ఉన్నాయి. ప్రజాస్వామ్యం గురించి కబుర్లు చెప్పే అమెరికా, ఆఫ్రికాలోని నైగర్‌, సూడాన్‌ ఈ యూనియన్లో లేవు. దీనికి అనుబంధ సభ్యులుగా 13 ప్రాంతీయ పార్లమెంటులు ఉన్నాయి. మేడిపండు చూడ మేలిమై ఉండు పొట్టవిప్పి చూడ పురుగులుండు అన్నట్లుగా అనేక దేశాలలో పార్లమెంటరీ ప్రజాస్వామ్యం అపహాస్యం పాలవుతున్నది. అయినప్పటికీ ప్రతి ఏటా పార్లమెంటరీ దినోత్సవం పాటించటం ఒక తద్దినంగా మారిందంటే అతిశయోక్తి కాదు.2024 మార్చి 18 నుంచి 20వ తేదీ వరకు దక్షిణ కొరియా ఆధ్వర్యంలో ప్రజాస్వామ్య మూడవ ప్లీనరీ సమావేశం ఆన్‌లైన్‌లో జరిగింది. దీనికి ఆ దేశ అధ్యక్షుడు యూన్‌ సుక్‌ యోల్‌ అధ్యక్షత వహించాడు. నరేంద్రమోడీతో సహా అనేక మంది సందేశాలు ఇచ్చారు. సదరు యూన్‌ తరువాత డిసెంబరులో సైనిక పాలన ప్రకటించాడు. పార్లమెంటు దాన్ని వ్యతిరేకించటంతో కొద్ది గంటల్లోనే ఎత్తేశాడు. తరువాత అభిశంసనకు గురై, పదవి పోగొట్టుకున్నాడు. ఇప్పుడు విచారణ ఎదుర్కొంటున్నాడు. దోషిగా తేలితే జీవిత ఖైదు లేదా మరణశిక్ష అంటున్నారు. అందువలన ప్రజాస్వామ్యం గురించి కబుర్లు చెప్పేవారి గురించి జనం సదా అప్రమత్తంగా ఉండాలి.

మహిళల ప్రాతినిధ్యం తక్కువే!
ఐపియు వెబ్‌సైట్‌ సమాచారం ప్రకారం 2025 జూన్‌ ఒకటవ తేదీ నాటికి దిగువ, ఎగువ సభల్లో, ఒకే సభ ఉన్న చట్టసభల్లో ఉన్న మొత్తం సభ్యుల సంఖ్య 37,303. ఎగువ సభల్లో ఉన్నవారు 7,168 మంది. వీరిలో పురుషులా,స్త్రీలా అని వివరాలు ఉన్న వారు 43,729 మంది. పురుషులు 31,858 మంది కాగా మహిళలు 11,871 (27.1శాతం). ఎగువ సభల్లో 27.7 శాతం ఉన్నారు. మోడీ వర్ణించినట్లు ప్రజాస్వామ్య కన్నతల్లి మనదేశం చట్టసభలకు మహిళలకు ప్రాతినిధ్యం కల్పించటంలో 181కి గాను 149వ స్థానంలో ఉంది. లోక్‌సభలో 13.8, రాజ్యసభలో 16.7 శాతం ఉన్నారు. తూర్పు ఆఫ్రికాలో ర్వాండా అనే చిన్న దేశం కోటీ 40 లక్షల మంది జనాభాతో ఉంది.1962లో స్వాతంత్య్రం పొందింది. అక్కడ దిగువసభలో 63.8, ఎగువ సభలో 53.9 శాతం మంది మహిళలు ఉన్నారు. రెండు, మూడు స్థానాలలో క్యూబా, నికరాగువా ఉన్నాయి. దిగువ సభలో 40 శాతంపైగా మహిళలు ఉన్న దేశాలు 29 ఉన్నాయి.మనతో సహా 15 శాతం లోపుఉన్నవి 40 దేశాలు ఉన్నాయి. అసలు ప్రాతినిధ్యం లేని దేశం ఓమన్‌. పాకిస్తాన్‌తో పోల్చుకోవద్దని అనుకున్నా మన కంటే ఎగువన 134వ స్థానంలో ఉన్నందుకు సిగ్గుపడాలి. వయస్సుడిగిన తరువాత అయ్యప్పస్వామి అన్నా తన ఆలయంలోకి మహిళలను రానిస్తున్నాడంటే ఆయనే కాస్త ”మెరుగు” లా ఉంది. ప్రజాస్వామ్య సదస్సుల్లో మోడీ చెప్పినట్లు చంద్రయాన్‌తో జయప్రదంగా చంద్రుడి మీద కాలుపెట్టాంగానీ మహిళలను మాత్రం చట్టసభల్లోకి రానివ్వటం లేదు.. ”మహత్తర విజయాల్లో ” దీన్ని ఎందుకు చెప్పరు? మొత్తం మీద ప్రపంచ దేశాల్లో మహిళల ప్రాతినిధ్యం చట్టసభల్లో తక్కువగా ఉంది. ప్రాంతాల వారీ చూసినపుడు అమెరికా ఖండంలో గరిష్టంగా 35.6, ఐరోపాలో 31.7, సబ్‌సహారా ఆఫ్రికాలో 26.9, పసిఫిక్‌ 24.5, ఆసియా 21.9, మధ్యప్రాచ్యం, ఉత్తర ఆఫ్రికా 16.7 శాతం ఉన్నారు.

అపహాస్యంగా అంతర్జాతీయ దినం..
పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం పాలు చేస్తున్న రోజుల్లో దాన్ని కాపాడాలంటూ ఒక అంతర్జాతీయ దినాన్ని పాటిస్తున్నాము. మన దేశంలో అసెంబ్లీలు, పార్లమెంటు కేవలం ప్రభుత్వ కార్యక్రమానికి ఆమోద ముద్ర వేయించుకొనేందుకు ఆరునెలలకు ఒకసారి సమావేశం కావాలన్న నిబంధన మేరకు కొద్దిరోజుల పాటు సమావేశం కావటం తప్ప, చర్చలకు అవకాశం ఇవ్వటం లేదు. ప్రతిపక్షాల నోరు నొక్కేందుకు పూనుకోవటంతో పాటు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చేందుకు పాలకపక్షాలు సిద్ధం కావటం లేదు. పహల్గాంలో పాకిస్తాన్‌ ఉగ్రమూకల దాడి దానికి ప్రతీకారంగా ఆపరేషన్‌ సిందూర్‌, పాక్‌ దుర్మార్గాలను ఎండగడుతూ వివిధ దేశాలకు మన పార్లమెంటరీ బృందాలు వెళ్లటం చూశాము. యావత్‌ దేశాన్ని కుదిపివేసిన ఈ పరిణామం గురించి ప్రత్యేక పార్లమెంటు సమావేశం జరపాలన్న కనీస డిమాండ్‌ను పాలకపక్షం తిరస్కరించింది. దాన్ని సాధారణ వర్షాకాల సమావేశాల్లోనే చర్చిస్తామని చెప్పింది. గత సమావేశాల తీరుతెన్నులను చూసిన తరువాత అవి ఎలా ఉండేదీ ఊహించుకోవచ్చు. ఐపియు కోరుకున్న జవాబుదారీ తనానికి ఇది విరుద్ధం.

మనదేశం సుభాషితాలు..
ఈ అంతర్జాతీయ సమావేశంలో నరేంద్రమోడీ ఎన్నో సుభాషితాలు చెప్పారు.ప్రజాస్వామ్యానికి భారత్‌ మాతృమూర్తి అన్నారు, అంతకు ముందు కూడా చెప్పారు. ”సబ్‌కా సాత్‌, సబ్‌కా వికాస్‌, సబ్‌కా విశ్వాస్‌” అనే మంత్రంతో గత పదేండ్లుగా భారత్‌ ముందుకు పోతున్నదన్నారు. దేశంలో 15శాతం జనాభా ఉన్న ముస్లిం సామాజిక తరగతి నుంచి ఒక్కరంటే ఒక్కరి కూడా బిజెపి తరఫున ఎంపీగా పోటీ చేసేందుకు సీట్లు ఇవ్వని పెద్దమనిషి నుంచి ప్రజాస్వామ్యం, సబ్‌కా సాత్‌ కబుర్లు. ఇదే ప్రసంగంలో 14 లక్షల మంది ఎంపికైన మహిళా ప్రజాప్రతినిధులు మహిళల నాయకత్వంలో అభివృద్ధి సాధించేందుకు దిగువస్థాయిలో ఉన్నారని చెప్పారు.

అసమానతలకు వ్యతిరేకంగా..
అంతర పార్లమెంటరీ యూనియన్‌ (ఐపియు) లో మహిళా పార్లమెంటేరియన్ల వేదిక గడచిన నాలుగు దశాబ్దాలుగా చురుకుగా పని చేస్తున్నది.1985లో ఉనికిలోకి వచ్చి 40వ వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్నది. మహిళల సాధికారతకు అవసరమైన చట్టాలు, విధానాలు, వాటికి అవసరమైన బడ్జెట్‌ కేటాయింపులు జరగాలని, లింగ అసమానతలకు వ్యతిరేకంగా, పార్లమెంటరీ బృందాలలో మహిళల ప్రాతినిధ్యం పెంపు వంటి అంశాల మీద ఈ వేదిక కేంద్రీకరిస్తున్నది. అత్యధిక చట్ట సభలు పురుషాధిక్యంలోనే ఉన్నాయి. నిర్ణయాలు చేసే సంస్థలలో మహిళలు తక్కువగా ఉన్నారు. తాము చట్టసభల్లో మానసిక హింసకు గురైనట్లు ఆఫ్రికాలోని 80 శాతం మంది మహిళలు ఒక సర్వేలో చెప్పారు.1978లో ఐపియు సభల్లో కేవలం 7.7 శాతమే మహిళలు. ప్రస్తుతం దాదాపు 30 శాతం ఉన్నారు. 2024లో ప్రపంచవ్యాపితంగా 73 సభలకు ఎన్నికలు జరిగాయి. కేవలం 0.3 శాతం మాత్రమే మహిళలు పెరిగారు. 2017 తరువాత ఇది అత్యంత తక్కువ వృద్ధి రేటు. ప్రభుత్వాల్లో ప్రాతినిధ్యం 0.4 శాతం తగ్గింది.

నిరాయుధీకరణ గురించి..
దీనిపై ఐపియు సుభాషితాలు వల్లిస్తుంటే పట్టించుకొనేదెవరు? ప్రపంచ ఆధిపత్యం కోసం, అనేక దేశాలను తన అదుపులో ఉంచుకొనేందుకు అమెరికా, ఐరోపా ధనికదేశాలు అనేకచోట్ల ఉగ్రవాదులను తయారుచేసి ఆయుధాలు ఇస్తున్నాయి. ఐపియు చొరవతో ప్రభుత్వేతర శక్తుల చేతుల్లో మారణాయుధాలు పడకూడదన్న ఐరాస భద్రతా మండలి 1540 తీర్మానానికి విలువ ఏముంది? సద్దాం హుసేన్‌ నాయకత్వంలో ఇరాక్‌ మారణాయుధాలను గుట్టలుగా పోసిందనే పేరుతో అమెరికా దాడి చేసి దురాక్రమణకు పాల్పడింది. సద్దాంను ఉరితీసింది. చివరికి అక్కడ అలాంటివేమీ లేవని అదే అమెరికా చెప్పింది. అయినప్పటికీ దాన్ని అంతర్జాతీయ నేరం కింద బోనులో నిలబెట్టలేదు. యుద్ధాలు, దాడుల సమయంలో మహిళలు, యువత మీద ప్రభావం పడకుండా చూడాలని భద్రతామండలి 1325, 2250 తీర్మానాల్లో స్పష్టంగా పేర్కొన్నారు. గాజాలో ఇజ్రాయెల్‌ చేతుల్లో మరణించిన వారిలో 80 శాతం మంది పిల్లలు, మహిళలే ఉన్నప్పటికీ అదే భద్రతామండలి చేసిందేమీ లేదు. ఆ దుర్మార్గాన్ని ఖండించే తీర్మానాన్ని కూడా చేయనివ్వకుండా అమెరికా వీటో చేసింది. మారణకాండను ఆపాలని కోరుతూ సాధారణ అసెంబ్లీలో చేసిన తీర్మానాన్ని మనదేశం బలపరచాల్సిందిపోయి, ఓటింగ్‌కు దూరంగా ఉండి అమెరికా, ఇజ్రాయెల్‌ను సంతుష్టీకరించింది. గాజాలో ఇజ్రాయెల్‌ సాగిస్తున్న నరమేథంలో 55 వేల మందికి పైగా పిల్లలు, మహిళలు, వృద్ధులు బలైనా, ఆ ప్రాంతాన్ని నేలమట్టం గావించటాన్ని నిస్సిగ్గుగా సమర్ధిస్తున్న అమెరికా అధినేత డోనాల్డ్‌ ట్రంప్‌కు శాంతి బహుమతి ఇవ్వాలని నోబెల్‌ కమిటీకి పాకిస్తాన్‌ ప్రతిపాదించిందంటే ఇంతకంటే దారుణం ఏముంటుంది? ఆ ప్రతిపాదన ప్రకటన వెలువడిన తరువాత ఇరాన్‌పై భీకరదాడికి ట్రంప్‌ ఆదేశించాడు. ‘అతగాడొక ప్రజాస్వామికవాది..!’ అంటూ పాకిస్తాన్‌ వంతపాడుతున్నది.

లౌకికవాదం, సోషలిస్టు పదాలపై ఏమి నాటకాల్రా బాబూ : సుప్రీం కోర్టు తీర్పును ధిక్కరిస్తున్న ఆర్‌ఎస్‌ఎస్‌, బిజెపి నిబంధనావళి నుంచి తొలగిస్తారా !

Tags

, , , , , , , , , , , ,

ఎం కోటేశ్వరరావు


రాజ్యాంగ పీఠికలో ఉన్న లౌకికవాదం, సోషలిస్టు అనే పదాల గురించి పునరాలోచించాల్సిన తరుణం ఆసన్నమైందని ఆర్‌ఎస్‌ఎస్‌ ప్రధాన కార్యదర్శి దత్తాత్రేయ హోసబలే పిలుపునిచ్చారు.దేశంలో అత్యవసర పరిస్థితిని విధించి 50ఏండ్లు గడచిన సందర్భంగా ఢల్లీిలో జరిగిన ఒక సభలో ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రజాస్వామ్య క్రమాన్ని పక్కన పెట్టిన అత్యవసరపరిస్థితి కాలంలో 1976లో 42వ రాజ్యాంగ సవరణ ద్వారా ఈ పదాలను రాజ్యాంగంలో చేర్చారని, తొలుత ఆమోదించిన దానిలో ఇవి లేవని చెప్పారు. సోషలిజం, లౌకికవాదాలను ఎన్నడూ ఆమోదించకపోవటమే కాదు తీవ్రంగా వ్యతిరేకించే ఆర్‌ఎస్‌ఎస్‌ నేత నుంచి ఇలాంటి ప్రతిపాదన రావటం ఆశ్చర్యం కాదు. కేశవానంద భారతికేరళ రాష్ట్రం మధ్య నడచిన వివాదం (1973) తీర్పులో రాజ్యాంగ వ్యవస్థ మౌలిక ఉపదేశంలో మౌలిక భావనలైన లౌకికవాదం, సోషలిజాలకు సంబంధించిన వాటిని మార్చటానికి వీల్లేదని ప్రవచించినట్లు సుప్రీం కోర్టు తీర్పు చెప్పింది. ఆ తరువాత 42వ రాజ్యాంగ సవరణ ద్వారా వాటిని నిర్ధిష్టంగా చేర్చారు. ఎస్‌ఆర్‌ బొమ్మయ్‌కేంద్ర ప్రభుత్వం మధ్య నడచిన వివాదం(1994)లో లౌకికవాదం రాజ్యాంగ మౌలిక అంశమని రాజ్యాంగ సవరణ ద్వారా పార్లమెంటు దానిని మార్చటానికి వీల్లేకుండా చేసిందని తొమ్మిదిమంది సభ్యులుగల సుప్రీం కోర్టు రాజ్యాంగధర్మాసనం తీర్పు చెప్పింది. రాజ్యాంగ పరిషత్‌ సభ్యులు మన రాజ్యాంగంలో ఉండాల్సిన అంశాల చర్చలో తడమని అంశం లేదంటే అతిశయోక్తి కాదు. అనేక భిన్నాభిప్రాయాలు, రాజీల తరువాత ఒక రాజ్యాంగాన్ని ఆమోదించారు. లౌకిక వాదం గురించి ఆ చర్చలో జవహర్‌లాల్‌ నెహ్రూ చెప్పిందేమిటి ? ‘‘ లౌకిక రాజ్యం … అర్ధ సారం ఏమిటంటే ఏ ఒక్క మతమూ ఏది ఏమైనా రాజ్యం నుంచి ఎలాంటి ప్రాపకమూ పొందకూడదు.ఈ విషయంలో మనం ఎంతో జాగ్రత్తగా ఉండాలి.మన ఈ గడ్డమీద ఏ ఒక్కరికీ ఏమతమైనా అనుసరించటానికి, చెప్పటానికి మాత్రమే కాదు ప్రచారం చేయటానికి కూడా హక్కు నిరాకరించకూడదు ’’ అన్నారు. అసలు తొలిసారి ఆమోదించిన రాజ్యాంగంలో ఈ మేరకు రాజ్యాంగంలో లౌకికవాదం అనే పదమే అసలు లేనట్లు ఆర్‌ఎస్‌ఎస్‌ పెద్దలు జనాన్ని నమ్మింప చేస్తున్నారు. అనేక అంశాలను ఆర్టికల్‌ 25లో క్రోడీకరించారు.దానిలోని క్లాజ్‌ 2(ఏ)లో లౌకికవాద ప్రస్తావన ఉంది అలాంటి దానిని సమీక్షించాలని ఆర్‌ఎస్‌ఎస్‌ చెబుతోంది.దోపిడీ రహిత సమాజం గురించి అనేక మంది ప్రతిపాదించారు, దానికి సోషలిజమని పేరు పెట్టలేదు తప్ప రాజ్యాంగం ఆదేశిక సూత్రాలలో చేర్చిన అంశాల సారమదే. సోషలిజాన్ని వ్యతిరేకించేవారు ఆదేశిక సూత్రాలకు కట్టుబడి ఉంటారన్న హామీ ఏముంది ?


అసలు ఆర్‌ఎస్‌ఎస్‌ రాజ్యాంగాన్ని, జాతీయ పతాకాన్ని కూడా ఆమోదించలేదు. రెండవ సర్వసంఘసంచాలక్‌ ఎంఎస్‌ గోల్వాల్కర్‌ తన బంచ్‌ ఆఫ్‌ థాట్స్‌ అనే గ్రంధంలో మనది అని చెప్పుకొనే అంశం మన రాజ్యాంగంలో ఒక్కటీ లేదని రాశారు. రాజ్యాంగాన్ని ఆమోదించిన తరువాత ఆర్‌ఎస్‌ఎస్‌ పత్రిక ఆర్గనైజర్‌ 1949 నవంబరు 30వ తేదీ సంచికలో పురాతన భారత్‌లో ఉన్న రాజ్యాంగాన్ని ప్రస్తావించకుండా విస్మరించారని, శతాబ్దాల తరబడి ఆచరిస్తూ, అభిమానించిన మనుస్మృతిలో వర్ణించిన మను చట్టాలను విస్మరించారని సంపాదకీయంలో ధ్వజమెత్తింది. మను కాలం నాటి రోజులు అంతరించాయని అంబేద్కర్‌ చెప్పారు. కానీ అంతిమంగా మనుస్మృతి మాత్రమే హిందువులకు సాధికారత ఇస్తుందని అదే ఆర్గనైజర్‌ పత్రిక 1950 ఫిబ్రవరి ఆరవ తేదీ సంచికలో రిటైర్డ్‌ హైకోర్టు న్యాయమూర్తి శంకర్‌ సుబ్బ అయ్యర్‌ రాసిన వ్యాసాన్ని ప్రచురించారు.


1975 జూన్‌25న ప్రకటించిన అత్యవసరపరిస్థితి 1977 మార్చి 21వ తేదీ వరకు అమల్లో ఉంది.అంతర్గత కల్లోలం, విదేశీ ముప్పు పరిస్థితుల కారణంగా రాజ్యాంగంలోని 352 ప్రకారం ఈ నిర్ణయం తీసుకున్నట్లు నాటి రాష్ట్రపతి ఫక్రుద్దీన్‌ అలీఅహమ్మద్‌ ప్రకటించారు. రాజకీయంగా తనను వ్యతిరేకించిన వివిధ రాజకీయపార్టీలు, సంస్థలకు చెందిన 1,10,806 మందిని ఇందిరా గాంధీ జైలుపాలు చేశారు.1971లోక్‌సభ ఎన్నికలలో రాయబరేలీ నియోజకవర్గం నుంచి గెలిచిన ఆమె ప్రభుత్వ యంత్రాంగాన్ని వినియోగించి అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని సోషలిస్టు పార్టీ తరఫున పోటీ చేసిన రాజనారాయణ్‌ కోర్టును ఆశ్రయించారు. తొలిసారిగా మనదేశంలో ఒక ప్రధానిని హైకోర్టులో దాదాపు ఐదుగంటల పాటు బోనులో నిలబెట్టి విచారించటం అదే ప్రధమం. అలహాబాద్‌ హైకోర్టు న్యాయమూర్తి జగ్‌మోహన్‌ సిన్హా 1975జూన్‌ 12న ఇందిరా గాంధీ ఎన్నిక చెల్లదని తీర్పునిచ్చారు. ఆ తీర్పును సుప్రీం కోర్టులో సవాలు చేశారు. జస్టిస్‌ విఆర్‌ కృష్ణయ్యర్‌ ధర్మాసనం జూన్‌ 24న హైకోర్టు తీర్పును సమర్ధించింది. అయితే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు జరిగే వరకు ప్రధాని పదవిలో కొనసాగవచ్చని అవకాశం ఇచ్చారు. దాన్ని అవకాశంగా తీసుకొని మరుసటి రోజే అత్యవసరపరిస్థితిని విధించారు.1976 నవంబరులో మాధవరావు మూలే, దత్తోపంత్‌ టేంగిడీ, మోరోపంత్‌ పింగ్లే వంటి 30 ప్రముఖులు తమ ఆర్‌ఎస్‌ఎస్‌ కార్యకర్తలను జైలు నుంచి విడుదల చేస్తే ప్రభుత్వానికి మద్దతు ఇస్తామని ప్రతిపాదించారు(వికీపీడియా) ఆ లొంగుబాటు పత్రం ప్రకారం 1977 జనవరిలో వారు విడుదల కావాల్సి ఉంది. దాన్ని నాటి కీలక అధికారి హెచ్‌వై శారదా ప్రసాద్‌ ఆమోదించారు.ఇదీ ఆర్‌ఎస్‌ఎస్‌ అత్యవసర పరిస్థితికి వ్యతిరేకంగా పోరాడిన తీరు. అయితే కొంత మంది లొంగుబాటును వ్యతిరేకించారని కూడా చెబుతారు. నిజమేమిటో ఆర్‌ఎస్‌ఎస్‌ అధికారికంగా చెప్పాల్సి ఉంది.


ఇక లౌకికవాదం, సోషలిస్టు పదాల గురించి బిజెపి, ఆర్‌ఎస్‌ బండారం ఏమిటో చూద్దాం. వాటిని సమర్ధిస్తూ మాట్లాడిన ఆ సంస్థల నాయకులను ఎవరైనా చూశారా ? భారతీయ జనతా పార్టీ నవీకరించిన(2012) నిబంధనావళి పత్రం ఇప్పుడు ఆ పార్టీ వెబ్‌సైట్‌లో అందరికీ అందుబాటులో ఉంది.మొదటి పేజీలోనే లౌకికవాదం, సోషలిజం, ప్రజాస్వామ్యాలకు కట్టుబడి ఉన్నట్లు రాసుకున్నారు. నిత్యం కుహనా లౌకికవాదం అని, సోషలిజం మీద విషం గక్కుతున్నారంటే ఆచరణలో వారు రాజ్యాంగాన్ని ధిక్కరిస్తున్నట్లే. అది దేశద్రోహంతో సమానం. బిజెపిని కన్నతల్లి ఆర్‌ఎస్‌ఎస్‌ అన్నది జగమెరిగిన సత్యం. జనతా పార్టీ లేదా ఆర్‌ఎస్‌ఎస్‌ ఏదో ఒకదానిలో మాత్రమే సభ్యులుగా ఉండాలని ద్వంద్వ సభ్యత్వం కూడదన్న వివాదం వచ్చినపుడు ఆ సంస్థతో బంధం తెంచుకోవటానికి తాము సిద్దం కాదని కావాలంటే జనతా పార్టీ నుంచే వైదొలుగుతామని ప్రకటించి బిజెపిని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు హోసబలే లౌకికవాదం, సోషలిజం గురించి సమీక్షించాలని ప్రతిపాదించారంటే అది బిజెపికి కూడా వర్తిస్తుంది. ముందుగా బిజెపి నిబంధనావళి నుంచి దాన్ని తొలగించవచ్చు, కానీ ఆ పని చేయకుండా మొత్తం రాజ్యాంగానికే ఎసరు పెడుతున్నారంటే దాని వెనుక ఉన్న కుట్ర గురించి వేరే చెప్పనవసరం లేదు. బిజెపి చెప్పలేని అంశాలను ఆర్‌ఎస్‌ఎస్‌ నేతల ద్వారా పలికించటం ఒక ఎత్తుగడ. జనంలో వచ్చిన స్పందన అనుకూలమా ప్రతికూలమా అని సరిచూసుకోవటం గతంలో జరిగింది, ఇప్పుడూ ఆ నాటకమే మొదలెట్టారు.


రాజకీయాలతో నిమిత్తం లేని ప్రముఖులతో ఏర్పాటు చేసే కమిటీ ద్వారా రిజర్వేషన్లను సమీక్షించాలని ఆర్‌ఎస్‌ఎస్‌ అధిపతి మోహన భగవత్‌ 2015 ప్రతిపాదించారు. అది పెద్ద వివాదాన్ని రేపింది. తరువాత 2017లో మరో నేత మన్మోహన్‌ వైద్య భిన్న నేపధ్యంలో ఎస్‌సి, ఎస్‌టిలకు రిజర్వేషన్లు నిర్ణయించారని, అంబేద్కర్‌ కూడా అవి నిరవధికంగా కొనసాగటం అభిలషణీయం కాదు, ఒక పరిమితి ఉండాలని చెప్పారంటూ అంబేద్కర్‌ భుజం మీద తుపాకితో కాల్చాలని చూశారు. అది రాజకీయంగా బిజెపికి నష్టం అని జనంలో వచ్చిన స్పందనను చూసిన తరువాత తాము రిజర్వేషన్లను సమర్ధిస్తున్నామని, వివక్ష ఉన్నంత వరకు కొనసాగాలని పదే పదే ప్రకటనలు చేశారు. బిజెపి నేతలు అంబేద్కర్‌ గురించి ఇటీవలి కాలంలో ఎక్కడ లేని ప్రేమ ఒలకబోస్తున్నారు. పదే పదే ఆయన భజన చేస్తున్నారు. చిత్రం ఏమిటంటే మహాత్మాగాంధీ కాదు అసలైన మహాత్ముడు హంతకుడు గాడ్సే అని సంఘపరివార్‌ దళాలు నిత్యం ప్రచారం చేస్తాయి. తమ పార్టీ మౌలిక సూత్రంగా మానవతావాదం ముఖ్యమైనదిగా ఉంటుందని బిజెపి నిబంధనావళి చెప్పింది. పార్టీ జాతీయవాదం, జాతీయ సమగ్రత, ప్రజాస్వామ్యాలతో పాటు దోపిడీ రహిత సమసమాజ స్థాపన కోసం ఆర్ధిక, సామాజిక సమస్యలపై గాంధీయిజవైఖరిని అనుసరిస్తామని కూడా పేర్కొన్నది. సానుకూల లౌకికవాదం అంటే సర్వధర్మ సంభవం మరియు విలువలతో కూడిన రాజకీయాలకు కట్టుబడి ఉన్నామని చెప్పింది. ఎక్కడా బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ వాంఛించి ప్రవచించిన కులరహిత లేదా కులవివక్షలేని సమాజం కోసం లేదా అంబేద్కర్‌ భావజాలానికి కట్టుబడి ఉన్నామనే మాటే లేదు. ఇదీ అంబేద్కర్‌ పట్ల దాని నిజవైఖరి.


నిజానికి కుల,మత రహిత సమాజం కాషాయ దళాల అజెండాలోనే లేదు. పక్కా హిందూత్వ ఛాంపియన్లమని గల్లీ నుంచి ఢల్లీి నేతల వరకు రోజూ చెప్పటాన్ని చూస్తున్నాము.కులగణనను వ్యతిరేకించి చివరకు చేపడతామని చెప్పింది. బిజెపి ముందు రూపమైన జనసంఘం నేత దీనదయాళ్‌ ఉపాధ్యాయ 1965లో సమగ్రమానవతావాదం పేరుతో రాసిన గ్రంధంలో పేర్కొన్న పకారం ‘‘ నాలుగు కులాల(చాతుర్వర్ణ)పై మా దృక్ఫధం ప్రకారం అవి విరాట పురుషుని భిన్నమైన నాలుగు భాగాల(లింబ్స్‌`శాఖల)తో సమానమైనవి. అవి ఒకదానికొకటి సహకరించుకొనేవి మాత్రమే కాదు దేని ప్రత్యేకత దానిదిగా ఉండటంతో పాటు ఐక్యంగా ఉంటాయి, దేనికదే స్వతంత్రమైన గుర్తింపు, అభిరుచి కలిగి ఉంటాయి ’’ అంటే ఉన్న మనువాద కులవ్యవస్థను కొనసాగించాలనటం తప్ప వేరే భాష్యం లేదు.1990లో ప్రధాని విపి సింగ్‌ మండల్‌ కమిషన్‌ సిఫార్సుల అమలుకు పూనుకున్నపుడు ఆర్‌ఎస్‌ఎస్‌ పత్రిక ఆర్గనైజర్‌ సంపాదకీయంలో కులయుద్ధాలకు దారి తీస్తుందని రాశారు. పదమూడు సంవత్సరాల వయస్సులో ఆర్‌ఎస్‌ఎస్‌లో చేరిన దళితుడైన భన్వర్‌ మేఘవంశీ ‘‘ నేను హిందువును కాలేను ’’ అనే పేరుతో రాసిన పుస్తకంలో కులవ్యవస్థపట్ల ఆర్‌ఎస్‌ఎస్‌ వైఖరి గురించి అనేక అంశాలను లేవనెత్తారు. తన గ్రామానికి సంఘపరివార్‌ సభ్యులు వచ్చినపుడు వారికి తాను ఆహారాన్ని సిద్దం చేయగా దాన్ని తినకుండా మూటగట్టి పారవేయటంతో ఆర్‌ఎస్‌ఎస్‌లో కులతత్వం గురించి తనకు అవగతమైందని రాశారు.కొన్ని పదవుల్లో దళితులకు అవకాశం ఇవ్వరని, కేవలం ముస్లింల మీద దాడికి మాత్రమే తమను వినియోగించుకున్నారని కూడా పేర్కొన్నారు. అంబేద్కర్‌ గురించి నేరుగా చదివిన తరువాత బయటకు చెప్పిదానికి భిన్నంగా ప్రతిదీ సంఘపరివార్‌లో ఉన్నట్లు పేర్కొన్నారు. అంబేద్కర్‌ భావజాలాన్ని ముందుకు తీసుకుపోతామని బిజెపి నిబంధనావళిలో చేర్చకపోవటానికి కారణమిదే.
మనదేశంలో కులవ్యవస్థ, అంటరానితనం ఎందుకు ఉన్నదంటే కాషాయ దళాలు వెంటనే చెప్పే సమాధానం అరబ్‌, ఇస్లామిక్‌ దండయాత్రలే కారణం అంటారు. హిందూ స్వాభిమానాన్ని దెబ్బతీసేందుకు హిందూ ఖైదీలను చర్మం తీసేవారిగా, గొడ్డు మాంసం కొట్టే అంటరానివారిగా మార్చారని చెబుతారు. ఎనిమిదవ దశాబ్దం తరువాత ఇస్లామిక్‌ దండయాత్రలు ప్రారంభమై ఉత్తర ఆఫ్రికా, మధ్యఆసియా, మధ్యప్రాచ్యదేశాల్లో సాగాయి. పదకొండవ శతాబ్దంలో మనదేశం మీద జరిగాయి. ఇతర దేశాలలో కూడా అక్కడ ఉన్న ఏదో మతానికి చెందిన వారిని ఖైదీలుగా పట్టుకొని ఉంటారుగా వారినెందుకు అంటరానివారిగా మార్చలేదు ? నరేంద్రమోడీ సర్కార్‌ ఎదుర్కొంటున్న సవాళ్లు రోజు రోజుకూ పెరుగుతున్నాయి, ఆపరేషన్‌ సిందూర్‌ గురించి జనంలో పెరిగిన అనుమానాలు బలపడటం తప్ప వాటిని తీర్చే స్థితిలో బిజెపి లేదు. అందుకే అంత్యవసరపరిస్థితి 50 ఏండ్ల సభ పేరుతో జనం దృష్టిని మళ్లించేందుకు రాజ్యాంగంలో సోషలిస్టు, లౌకికవాద పదాలను సమీక్షించాలన్న వివాదాన్ని రేపారు .75 ఏండ్లు గడచిన సందర్భంగా రాజ్యాంగం నుంచి ఆ రెండు పదాలను తొలగించాలని సుప్రీం కోర్టులో అనేక కేసులు దాఖలయ్యాయి. వాటి మీద సుదీర్ఘవిచారణ జరిపిన కోర్టు 2024 నవంబరు 25న ఇచ్చిన తీర్పులో వాటిని కొట్టివేసింది. తొలుత ఆమోదించిన రాజ్యాంగ పీఠికలో ఆ పదాలు లేవు గనుక వాటిని తొలగించాలనే వాదనలను తోసిపుచ్చింది. రాజ్యాంగబద్దమే అని స్పష్టం చేసింది. ఆ తరువాత కూడా హోసబలే సమీక్ష చేయాలని అంటున్నారంటే ఆ తీర్పును కూడా అంగీకరించటం లేదన్నది స్పష్టం. అధికారం ఉంది గనుక ఏమైనా చేయగల సమర్ధులు, ఏకంగా పార్లమెంటునే తగులబెట్టించిన హిట్లర్‌ను ఆదర్శంగా తీసుకుంటున్నవారు రాజ్యాంగానికి, న్యాయవ్యవస్థకూ ముప్పు తెచ్చినా ఆశ్చర్యం లేదు, జనం ఆలోచించాలి మరి !