Tags
#Anti China, anti china, Apple iPhones, BJP, Narendra Modi Failures, Narendra Modi skill development failure
ఎం కోటేశ్వరరావు
గాల్వన్‌లోయ ఉదంతాల తరువాత రెండు దేశాలూ సాధారణ సంబంధాలను ఏర్పాటు చేసుకున్నాయి. సరిహద్దు సమస్యను శాశ్వతంగా పరిష్కరించుకోవాలని తాజాగా మన రక్షణ మంత్రి రాజనాధ్ సింగ్ ఆకాంక్ష వెలిబుచ్చారు. ఐదేండ్ల పాటు నిషేధించిన చైనా పెట్టుబడులను అనుమతించేందుకు మోడీ సర్కార్ దిగివచ్చింది. రెండు దేశాల మధ్య విమానరాకపోకలకు, వీసాల జారీకి అంగీకారం కుదిరింది. అంతా బాగుందని అందరూ భావిస్తున్న తరుణంలో మనదేశంలో యాపిల్ కంపెనీ తయారు చేస్తున్న ఫోన్ల ఫ్యాక్టరీల నుంచి 300 మంది చైనా ఇంజనీర్లు, సాంకేతిక నిపుణులు గత రెండు నెలల్లో స్వదేశానికి వెళ్లినట్లు, చైనా ప్రభుత్వమే తిరిగి రావాలని ఆదేశించినట్లు వార్తలు వచ్చాయి.వారితో పోటీపడి ఫోన్లు తయారు చేస్తున్నామన్న దుగ్దతో మనదేశం మీద జరిగిన కుట్రగా ఈ పరిణామాన్ని వర్ణించారు. అయితే మన కేంద్ర ప్రభుత్వం గానీ, యాపిల్ కంపెనీగానీ నోరెత్తలేదు. మన వాహన పరిశ్రమలకు అవసరమైన మాగ్నెట్లను ఎగుమతికి అనుమతించకుండా చైనా ఆంక్షలు విధించి ఆ రంగాన్ని సంక్షోభంలోకి నెట్టేందుకు చూసిందని కూడా విమర్శలు చేసిన సంగతి తెలిసిందే.మాగ్నట్ల సరఫరా నిలిచిపోయిన ప్రతికూల ప్రభావం తొలుత అంచనావేసినదాని కంటే ఎక్కువగా ఉందని భారత పరిశ్రమల సమాఖ్య(సిఐఐ) అధ్యక్షుడు రాజీవ్ మెమానీ గురువారం నాడు మీడియాతో చెప్పారు. పంటల దిగుబడిని గణనీయంగా పెంచే ఎరువులను కూడా మనకు రాకుండా తగ్గిస్తున్నదని, ఈ ఏడాది నిషేధం లేకపోయినా పూర్తిగా నిలిపివేసిందని సొల్యుబుల్ ఫర్జిలైజర్ ఇండస్ట్రీ అసోసియేషన్ అధ్యక్షుడు రజివ్ చక్రవర్తి చెప్పారు. ఐదు సంవత్సరాల క్రితం గాల్వన్ ఉదంతాల తరువాత చైనా యాప్‌లు, విమానాలు, పెట్టుబడులు, టెలికాం పరికరాల కొనుగోలుపై మనదేశం నిషేధం విధించింది. మాగ్నట్‌లు, ఎరువులు నిలిచిపోయింది ఈ ఏడాదే అని చెబుతున్నారు తప్ప ఐదేండ్లుగా సజావుగానే వచ్చాయి. మన ఔషధ పరిశ్రమలకు అవసరమైన ఎపిఐ వంటి కీలక ముడిసరకుల వంటి వాటిని మనకు అందకుండా చైనా ఎలాంటి నిషేధాలు పెట్టలేదు. ఇలాంటి వాటిని ఐదేండ్లుగా అడ్డుకొని ఉంటే మన పరిస్థితి ఎలా ఉండేదో ఊహించుకోవాల్సిందే.చైనాగాక పోతే మరొకచోట నుంచి తెచ్చుకొనేవారం అనవచ్చు, ఆ పని ఇప్పుడూ చేయవచ్చు కదా, తర్కానికి నిలవని కుట్ర కతలెందుకు ?
బిజెపి నేతలు, మోడీ సమర్ధకులు మనదేశం కూడా ఆయుధాలను ఇతర దేశాలకు ఎగుమతి చేస్తున్నదని పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. ఇటీవల దుబాయిలో జరిగిన రక్షణ ఉత్పత్తుల ప్రదర్శన సందర్భంగా బ్రహ్మోస్ క్షిపణిని మాకు విక్రయిస్తారా అని పాకిస్తాన్ మిలిటరీ అధికారి ఒకరు దాని రూపకర్త డాక్టర్ అపతుకాంత శివథాను పిళ్లేను అడిగారట. ఏమి సమాధానం చెప్పిఉంటారో ఊహించుకోండి ! మన క్షిపణులను అమ్మి వాటినే మనమీద వేయించుకుంటామా ! ఎవరైనా అంతే కదా !! డోనాల్డ్ ట్రంప్‌తో మన మోడీ ఎంత రాసుకుపూసుకు తిరిగినా అమెరికా వద్ద ఉన్న అత్యాధునిక మిలిటరీ పరికరాలను మనకు ఇచ్చారా ? వారు ఇవ్వకపోగా రష్యా నుంచి ఎస్ 400 క్షిపణి వ్యవస్థలను కొనుగోలు చేయరాదని మన మీద వత్తిడి తెచ్చిన దుశ్చర్యను మనం మరచిపోగలమా ! రామాయణంలో రావణుడు సవతిసోదరుడు కుబేరుడిని ఓడిరచి అతగాడి దగ్గర ఉన్న పుష్పక విమానాన్ని స్వాధీనం చేసుకున్నాడని చెబుతారు. కాసేపు నిజమే అనుకుందాం. సీతను రక్షించేందుకు రాముడికి కూడా నిర్మాణ కంపెనీ పుష్పక విమానం ఇచ్చి ఉన్నా లేదా సాంకేతిక పరిజ్ఞాన బదిలీ చేసినా లంకకు వెళ్లేందుకు వారధితో అవసరం లేకపోయేది, రాముడు ఇలా వెళ్లి అలా సీతను ఎక్కించుకు వచ్చేవాడు కదా ! ఎందుకు విమానం కొనుగోలు చేయలేదు ? విధి అలా రాసి ఉంది అంటారు, అదే అయితే ఇప్పుడు కూడా అదే అని సరిపెట్టుకోకుండా చైనా కుట్ర అంటున్నారెందుకు ?
జూన్ 30 నుంచి జూలై రెండవ తేదీ వరకు అమెరికా రాజధాని వాషింగ్టన్ డిసిలో క్వాడ్ విదేశాంగ మంత్రుల సమావేశం జరిగింది. అమెరికా, భారత్, జపాన్, ఆస్ట్రేలియాలతో కూడిన కూటమి నరేంద్రమోడీ అధికారానికి వచ్చిన తరువాత 2017 నుంచి క్రమం తప్పకుండా సమావేశాలు జరిపి, ప్రకటనలు చేస్తున్నది.చైనాను దెబ్బతీసేందుకు ఏర్పడిన ఈ కూటమి ఏడవ అధినాయక సమావేశం ఈడాది చివరిలో మనదేశంలో జరగనుంది.దీనికి సన్నాహంగానే కూటమి విదేశాంగ మంత్రుల సమావేశం వాషింగ్టన్‌డిసిలో జరిగింది. చైనాను ఉద్దేశించి ఆర్ధికబలవంతం, ధరల తిమ్మినిబమ్మిని,సరఫరా వ్యవస్థల విచ్చిన్నం, అక్రమ మార్కెట్ పద్దతులు, కీలకమైన ఖనిజాల ఉత్పత్తి మీద కేంద్రీకరణ వంటి చర్యలకు పాల్పడుతున్న దేశాలంటూ ధ్వజమెత్తుతూ ఒక తీర్మానం చేశారు. దక్షిణ చైనా సముద్రంలో నౌకల స్వేచ్చారవాణాకు ఆటంకం కలిగించకూడదంటూ చర్చలు చేశారు. ఈ పరిణామాలకు ఏదైనా కార్యాకారణ సంబంధం ఉందా ?
నిజంగా చైనా నుంచి మనదేశానికి ముప్పు ఉందని భావిస్తే లేదా కుట్ర జరుగుతోందని అనుకుంటే జరుగుతున్న పరిణామాలకు, అనుమానాలకు పొంతన కుదరటం లేదు. లావాదేవీలు తగ్గించుకోకపోగా ఇంకా పెంచుకొనేందుకు మన ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తున్నది. గాల్వన్ ఉదంతాల తరువాత చైనాను మనకాళ్ల దగ్గరకు తెచ్చుకోవాలంటే దిగుమతులు నిలిపివేసి డ్రాగన్ పీకనొక్కాలంటూ కాషాయ అలగా జనం వీధుల్లో వేసిన వీరంగం తెలిసిందే.మరోవైపు కేంద్ర ప్రభుత్వం ఐదు సంవత్సరాల పాటు నిలిపివేసిన చైనా పెట్టుబడులకు ఎర్రతివాచీ పరచి స్వాగతం పలుకుతున్నది. ఐదేండ్ల క్రితం నిలిపివేసిన విమానాలు, వీసాల జారీని పునరుద్దరించేందుకు నిర్ణయించారు. వస్తు దిగుమతుల్లో మోడీ తన రికార్డులను తానే బద్దలు కొట్టుకున్నారు. చైనా ప్రభుత్వం మీద తిరుగుబాటు చేసి పారిపోయి వచ్చిన దలైలామాకు మనదేశం ఆశ్రయం ఇచ్చింది. అనేక మంది చైనా వ్యతిరేక టిబెటన్లు దేశంలో ఉన్నారు.వారిలో కొందరితో ప్రత్యేక మిలిటరీ దళాలను తయారు చేసి సరిహద్దుల్లో నియమించారు.దలైలామా తరచూ చైనా వ్యతిరేక వ్యాఖ్యలతో కార్యకలాపాలు చేస్తుంటే అనుమతిస్తున్నారు. వారసుడిని నిర్ణయించే అధికారం దలైలామాకే ఉందని కేంద్ర మంత్రి కిరణ్ రిజు స్వంత అభిప్రాయాన్ని బహిరంగంగా చెప్పారు. ఇది చైనా వ్యవహారాల్లో జోక్యం తప్ప మరొకటి కాదు. ఉన్న సరిహద్దు వివాదాన్ని శాశ్వతంగా పరిష్కరించుకోవాలని రక్షణ మంత్రి బీజింగ్‌లో ప్రతిపాదిస్తారు, చైనా నుంచి మన రక్షణకు ముప్పు ఉందంటూ పరోక్షంగా వాషింగ్టన్‌లో విదేశాంగమంత్రి ప్రకటనలు చేస్తారు.
తమదేశాన్ని మరోసారి అగ్రస్థానంలో నిలపాలనే నినాదంతో ముందుకు పోతున్న అమెరికా నేతలు మనతో సహా ఇతరదేశాలు తమకంటే ముందుకు పోవటానికి అనుమతిస్తారా ? జాతీయవాదం ప్రబలి ప్రతిదేశమూ రక్షణాత్మక చర్యలకు పాల్పడుతున్న తరుణమిది. దానికి విరుగుడు ఏమిటో కనుక్కోవాలి. అలాంటి ప్రయత్నం మనదేశంలో జరుగుతున్నదా ? అవసరమైన నిపుణులను తయారు చేసుకోవటంలో వైఫల్యమే దానికి నిదర్శనం.బొమ్మరిల్లు సినిమాలో అన్నీ మీరే చేశారని అన్నట్లుగా ఎప్పుడో కాలం చేసిన గాంధీ, నెహ్రూలను ఆడిపోసుకోవటం తప్ప బిజెపి వారు చేసిందేమిటి ? ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం గురించి శాస్త్రవేత్తలకే పాఠాలు చెప్పగలిగిన చంద్రబాబు నాయుడి వంటి ముందుచూపు కలిగిన మిత్రులు ఉన్నప్పటికీ అడుగుముందుకు కదలటం లేదు.
యాపిల్ కంపెనీ 2017 నుంచి మనదేశంలో ఫోన్లు ఉత్పత్తి చేస్తున్నది. దాన్నుంచి మూడువందల మంది చైనా నిపుణులు స్వదేశానికి వెళ్లిపోతే కుట్ర అని గుండెలుబాదుకుంటున్నవారు కనీసం ప్రత్నామ్నాయంగా అంతమందిని అందించలేని దుస్థితి దేశంలో ఎందుకు ఉన్నది, ఎనిమిది సంవత్సరాలు గడచినా మనం ఎందుకు తయారు చేసుకోలేకపోయామని మన పాలకులను, రాయితీలు, కార్పొరేట్ పన్ను తగ్గింపుతో లక్షల కోట్ల మేర లబ్దిపొందుతున్న పరిశ్రమల వారిని ఎందుకు ప్రశ్నించరు. సదరు యాపిల్ కంపెనీ ఎగుమతులతో లాభాలు పోగేసుకోవటం తప్ప తనకు అవసరమైన స్థానిక నిపుణులను ఎందుకు తయారుచేయలేకపోయింది ? మన ప్రభుత్వ విధానాలను ప్రశ్నిస్తున్నామా ? వేతన అసమానతలు మనదేశంలో 25శాతం ఉంటే చైనాలో 5 నుంచి 12శాతం మధ్య ఉన్నాయి. వేతనాల్లేకుండా కష్టపడి, నైపుణ్యంతో పని చేయాల్సిన అవసరం ఏముందన్న భావన అసమానత ఎక్కువగా ఉన్న చోట ఉంటుంది. చైనాలో విద్యకు ప్రాధాన్యత ఇచ్చారు.హైస్కూలు, ఆపై స్థాయి విద్యగలవారు 25శాతం మంది వృత్తి విద్యా శిక్షణలో చేరితే మనదేశంలో కేవలం రెండుశాతమే ఉన్నారు.
రోజు రోజుకూ సాంకేతికరంగంలో విప్లవాత్మక మార్పులు వస్తున్నాయి. ఆవు పేడ, మూత్రం నుంచి బంగారాన్ని ఎలా తయారు చేయాలా అన్న దగ్గరదారి మీద మీద పెట్టిన శ్రద్ధ ఉత్పాదకరంగంపై లేదు ! మిగతా అన్నింటిలో ప్రావీణ్యం సంపాదించిన తరువాత జనాలను ఖాళీగా ఉంచకుండా ప్రతి ఇంటికి ఒక గోవును ఇచ్చి పేడ, మూత్రంతో పరిశోధనలు చేయించటాన్ని ఎవరూ తప్పుపట్టరు. దేశంలో పరిశోధనలకు చేసే ఖర్చు జిడిపిలో 0.7శాతానికి లోపుగానే ఉంది. అదే చైనాలో రెండున్నర శాతం దాటింది. నరేంద్రమోడీ వచ్చిన తరువాత పెరిగిందేమీ లేదు.కుండలో కూడు అలాగే ఉండాలి బిడ్డ దుడ్డుగా పెరగాలంటే కుదురుతుందా ! 2015 నుంచి రకరకాల నైపుణ్యాలను వృద్ధి చేసే పేరుతో పలు పథకాలను ప్రకటించారు పద్దెనిమిది రకాల చేతివృత్తుల వారికి ప్రధాని విశ్వకర్మ పధకం ఒకటి.2024 ఆగస్టు 5న కేంద్ర ప్రభుత్వం రాజ్యసభలో ఒక ప్రశ్నకు సమాధానం చెప్పింది. దాని ప్రకారం అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలలో దీని కింద నమోదు చేసుకున్నవారు 2,30,47,956 కాగా శిక్షణకు వచ్చిన వారు కేవలం 14,43,129 మాత్రమే. బిజెపి పాలిత ఉత్తర ప్రదేశ్‌లో 28.68లక్షలకు 39వేలు, మధ్య ప్రదేశ్‌లో 29లక్షలకు 82వేలు, బీహార్‌లో 15.6లక్షలకు గాను 32వేలు మాత్రమే అని పేర్కొన్నారు, తమిళనాడులో 8.4లక్షలు, పశ్చిమబెంగాల్లో 7.74లక్షలకు ఒక్కొక్కరు మాత్రమే హాజరైనట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. 2015 నుంచి ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన(పిఎంకెవివై) కింద కోటీ 40లక్షల మందికి శిక్షణ ఇచ్చినట్లు 2023 డిసెంబరు 26న పిఐబి జారీ చేసిన వివరాల్లో పేర్కొన్నారు. అంతమందిలో యాపిల్ కంపెనీలో పనిచేసేందుకు 300 మంది ప్రత్యామ్నాయ నిపుణులు లేరా ? చైనా కుట్ర అని మాట్లాడటమే దేశభక్తి అనుకుంటున్నారా ? ఈ రాతలు, మాటలు చైనా దృష్టిలో పడవా, రాగద్వేషాలకు వారు అతీతంగా ఉంటారా ? జనాలు ఇలాంటి వాటన్నింటినీ ఆలోచించాలి.
మన దేశం నుంచి ప్రతి ఏటా పెద్ద మొత్తంలో డాలర్లను పొందుతున్న చైనా మనకు వ్యతిరేకంగా కుట్ర చేయటం ఏమిటంటూ కొందరు ఉడుక్కుంటున్నారు. బీజింగ్‌లోని మన రాయబార కార్యాలయం వెబ్‌సైట్‌లో ఉన్న సమాచారం ప్రకారం 201415 నుంచి 2024`25 వరకు చైనాతో మనం జరిపిన వాణిజ్య లావాదేవీల్లో చైనా మిగులు 702.05 బిలియన్ డాలర్లు అంటే అంతమొత్తం నరేంద్రమోడీ సమర్పించినట్లే, మేకిన్ ఇండియా విఫలం కాబట్టే కదా ఇదంతా ! చైనా నుంచి స్వచ్చందంగానే దిగుమతి చేసుకున్నాం. అమెరికా మాదిరి పరస్పరం ప్రతికూల సుంకాలను విధించుకోలేదు. చైనా మీద ప్రతిదానికీ మనం ఆధారపడకూడదని కొందరు పదే పదే చెబుతుంటారు. నిజమే, ఎవరు వద్దన్నారు ? అమెరికాకు పోటీగా చైనా ఎదిగితే ఎవరైనా అడ్డుకోగలిగారా ?కొందరు చెబుతున్నట్లు నిజంగా చైనా మనల్ని అడ్డుకుంటే మనం భాగస్వామ్య, మిత్రదేశాలుగా పరిగణిస్తున్న అమెరికా, ఐరోపా ధనికదేశాలు మనకు ఎందుకు సాయంగా రాలేదు ? దేవుడి మీద భారం వేసి కూర్చుంటే లాభం లేదు మానవ ప్రయత్నం కూడా చేయాలని అంటారు కదా, అలాంటపుడు చైనా నుంచి కంపెనీలు వస్తాయని, నిపుణులు కూడా అక్కడి నుంచే వస్తారు, మనకు వస్తువులను ఉత్పత్తి చేస్తారని ఆశపెట్టుకోవటం ఏమిటి ? మన ప్రయత్నం మనం ఎందుకు చేయటం లేదు ?
