Tags
#Failed Narendra Modi, Beti Bachao Beti Padhao, BJP, Gender Inequality, India’s gender gap 131 Rank, inequality, Narendra Modi Failures, RSS
ఎం కోటేశ్వరరావు
ఇన్ని మంచి విషయాలు చెప్పారు కదా మీ వాడిలో ఉన్న రెండు లోపాలు చెబుతారా అని పిల్లనివ్వటానికి వచ్చిన పెద్దలు తండ్రిని అడిగారట. ఓస్ అంతేనా ఒకటి వాడికి తెలియదు, రెండు ఇతరులు చెప్పేది వినడు అన్నాడట. కొందరు పాలకులను చూస్తుంటే అదే అనిపిస్తోంది. పదకొండు సంవత్సరాల నరేంద్రమోడీ పాలన విజయోత్సవాలంటూ బిజెపి, దాని మిత్రపక్షాలు సంబరాలు చేసుకుంటున్నాయి.సగం మందిగా ఉన్న మహిళల స్థితి బాగుపడకుండా ఎన్నికబుర్లు చెప్పినా అది నిజమైన వృద్ధి కాదు. పచ్చి నిజం ఏమిటంటే నరేంద్రమోడీ అధికారానికి వచ్చిన తరువాత దేశంలో లింగఅంతరం తగ్గలేదు కదా , అంతకు ముందు ఉన్నదానికంటే దిగజారింది. దీని వలన జిడిపికి జరుగుతున్న నష్టం మామూలుగా లేదు.2015లో మెకెన్సీ గ్లోబల్ సంస్థ చెప్పినదాని ప్రకారం(2015 సెప్టెంబరు 25వ తేదీ టైమ్స్ ఆఫ్ ఇండియా) పురుషులతో సమంగా ఉపాధి, సమానపనికి సమానవేతనం గనుక అమలు జరిపితే ప్రపంచ జిడిపికి 2025నాటికి 12లక్షల కోట్ల డాలర్లు తోడవుతుందని, దానిలో ఎక్కువ మొత్తం 2.9లక్షల కోట్ల డాలర్లు భారత్‌లో తోడవుతుందిని స్పష్టంగా పేర్కొన్నది. అది నాటి వేతనాలు, ద్రవ్యోల్బణం తదితరాల ప్రాతిపదికన వేసిన అంచనా అది. ఈ మొత్తం ఇప్పుడు అంచనా వేస్తున్న 4.187లక్షల కోట్ల డాలర్లకు అదనం, జర్మనీని కూడా దాటి మూడో స్థానంలోకి వెళ్లిపోయి ఉండేది. అసమానతల తగ్గింపు కృషికి మోడీని ఎంపిక చేసినట్లు చెప్పటం మరొక ప్రహసనం. అధికారానికి వచ్చిన మూడేండ్లకే అలాంటి నిర్ణయానికి సియోల్ బహమతి ఎంపికదార్లు ఎలా వస్తారు.ప్రధాని నరేంద్రమోడీకి 2018 సియోల్(దక్షిణ కొరియా) శాంతి బహమతి ఇచ్చారు.దేనికటా ! 2018 అక్టోబరు 24వ తేదీ మనవిదేశాంగశాఖ వెబ్‌సైట్‌లో పెట్టిన సమాచారం మేరకు మోడినోమిక్స్ ద్వారా ప్రపంచ ఆర్థిక పురోగతిని పెంచటానికి, ఆర్థిక వృద్ధితో భారతీయుల మానవాభివృద్దిని వేగవంతం చేసేందుకు, ప్రజాస్వామ్య వృద్ధి, దేశంలో పేదలు, ధనికుల మధ్య అంతరాన్ని తగ్గించేందుకు చేసిన కృషిని బహుమతి కమిటీ గుర్తించి ఎంపిక చేసిందని పేర్కొన్నారు. పదేండ్ల అనుభవం ఏమిటి ? 1961లో మన దేశంలో ధనికులుగా ఉన్న ఎగువ ఒకశాతం మంది వద్ద జాతీయ సంపదలో 12.9శాతం పోగుపడితే అది ఇప్పుడు 40శాతం దాటింది. నూతన ఆర్థిక విధానాలు ప్రవేశపెట్టిన 1991లో 20శాతంగా ఉన్న కేంద్రీకరణ మోడీ అధికారానికి వచ్చే నాటికి 30శాతానికి చేరింది, మోడీ దాన్ని 40శాతానికి చేర్చారు, అసమానత తగ్గింది ఎక్కడ ? దిగువ 50శాతం మంది సంపద 1961నుంచి 2023 మధ్య 11.4 నుంచి 6.5శాతానికి దిగజారింది, మధ్యతరగతి అనుకొనేవారిది కూడా 43.7 నుంచి 29శాతానికి దిగజారింది, అంటే వారు కూడా పేదల్లోకి వచ్చారు. చిత్రం ఏమిటంటే ఇంత అసమానతలు పెరుగుతుంటే నిష్టదారిద్య్రం నుంచి పాతిక కోట్ల మందిని మెరుగైన స్థితిలోకి నెట్టామని చెప్పుకుంటున్నారు. ఇదొక ప్రహసనం, అంకెల గారడీ !
కేంద్రంలోనూ, మెజారిటీ రాష్ట్రాలలో మేము, మామిత్రులు ఉన్నాం అని చెబుతున్న నరేంద్రమోడీ గుజరాత్ సిఎంగా అనుభవంఉన్నప్పటికీ మెకెన్సీ నివేదిక చెప్పిందేమిటో అర్ధం కాలేదా, వారేమిటి మాకు చెప్పేది అని ఖాతరు చేయలేదా ? ఇంతవరకు లింగ అంతరం, ఆర్థిక అసమానతల తగ్గింపుకు ఎందుకు చర్యలు తీసుకోలేదు ? మోడీ విజయగీతాలాపనలో తలమునకలుగా ఉన్న మీడియాలో ఎక్కడా దీని ప్రస్తావన కనిపించదు, వినిపించదు.2014లో ప్రపంచ ఆర్థికవేదిక విడుదల చేసిన నివేదిక ప్రకారం లింగఅంతరంలో 142 దేశాల్లో మన స్థానం 114, వచ్చిన పాయింట్లు 0.6455 కాగా అదే సంస్థ విడుదల చేసిన 2025 నివేదికలో 148దేశాలకు గాను 131వ స్థానంలో ఉన్నాం, వచ్చిన మార్కులు 0.644, గతం కంటే తగ్గాయి. జపాన్ కంటే ఈ ఏడాది కొన్నివేల కోట్ల డాలర్లు ఎక్కువగా ఉండి నాలుగో స్థానంలోకి వస్తుందన్న అంచనాలను చూసి పండగచేసుకున్న వారు లింగ అంతరం దిగజారటం గురించి మాట్లాడరేం ! మహిళలంటే చిన్నచూపు, నిర్లక్ష్యం, దీని గురించి చర్చ జరిగితే మోడీ విజయ బండారం బయటపడుతుందని తప్ప మరొక కారణం ఏముంది ?
పదకొండు సంవత్సరాలుగా ఎన్ని కబుర్లు చెప్పినా తరతరాలుగా జరుగుతున్న అన్యాయానికి అంతం లేదు. ఉట్టికొట్టలేనయ్య స్వర్గానికి ఎగురుతాడా అన్నట్లుగా 2047నాటికి దేశాన్ని ఎక్కడికో తీసుకుపోతానని చెబుతున్నారు.లింగ అంతరం అంటే స్త్రీ, పురుషుల మధ్య ఉన్న సమానత్వంలో ఉన్న తేడా మదింపు. అవకాశాలు, విద్య, ఆరోగ్యం, రాజకీయ సాధికారత, బతికి ఉండటం సంబంధిత అంశాలను పరిగణనలోకి తీసుకొని ఇచ్చే మార్కుల ఆధారంగా సూచికలను తయారు చేస్తారు, వాటికి ఆయా దేశాలు ఇచ్చే సమాచారమే ప్రాతిపదిక. ఆర్థికభాగస్వామ్యం, విద్య,వైద్యం,రాజకీయ సాధికారత అనే నాలుగు అంశాలపై విడివిడిగా సూచికలు రూపొందిస్తారు, వాటన్నింటిని కలిపి సాధారణ లింగఅంతర సూచికను తయారు చేస్తారు. వీటిలో కొన్ని పెరుగుదల తగ్గుదల ఉన్నప్పటికీ పది సంవత్సరాలలో మొత్తం మీద స్వల్ప తగ్గుదల నమోదైంది. పార్లమెంటులో మహిళలకు రిజర్వేషన్లు కల్పిస్తామని బిల్లు ఆమోదించినప్పటికీ గత ఎన్నికలలో తగిన ప్రాధాన్యత ఇవ్వలేదు. అందువలన మహిళా సాధికారత సూచికలో 2023 కంటే 2025లో 14.7 నుంచి 13.8కి పాయింట్లు తగ్గిపోయాయి.మహిళలకు మంత్రిపదవులు కూడా 6.5 నుంచి 5.6శాతానికి పడిపోయాయి. మరోవైపు త్వరలో జిడిపిలో మూడో స్థానానికి ఎదుగుతాం, అభివృద్ధి చెందిన దేశంగా మారనున్నాం అని అరచేతిలో వైకుంఠం చూపుతున్నారు మన ఇరుగు పొరుగుదేశాల స్థితి గతులను చూద్దాం. అన్నింటికంటే అధమ స్థానంలో ఉన్న పాకిస్తాన్‌తో 148తో పోల్చుకుంటే 131లో మెరుగ్గా ఉన్నాం. తాజా సూచికలో ఏకంగా 75 స్థానాలను మెరుగుపరచుకొన్న బంగ్లాదేశ్ 24, చైనా 103,భూటాన్ 119, నేపాల్ 125, శ్రీలంక 130, మాల్దీవులు 138వ స్థానంలో ఉన్నాయి.
బేటీ పడావో బేటీ బచావో (ఆడపిల్లల్ని చదివించండి, ఆడపిల్లల్ని రక్షించండి) అంటూ పదేండ్ల క్రితం పెద్దగా ఒక పధకాన్ని నరేంద్రమోడీ ప్రారంభించారు.దరిద్రం ఏమిటంటే దానికి కేటాయించిన నిధులే స్వల్పం కాగా ఆ మొత్తాన్ని కూడా ఖర్చు చేయటం లేదు. ఆరేండ్లలోపు బాలబాలికల నిష్పత్తి 1961నుంచి మనదేశంలో పడిపోతోంది.1991లో ప్రతి వెయ్యి మంది బాలురకు గాను 945 మంది బాలికలు ఉండగా క్రమంగా తగ్గుతూ 2011 నాటికి 918కి పడిపోయింది, తరువాత ఇంతవరకు జనాభా లెక్కలు జరగలేదు గనుక కేవలం అంచనాలు మాత్రమే చెబుతున్నారు.2019 21 జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే ప్రకారం అంతకు ముందు 201516తో పోల్చితే 919 నుంచి 929పెరిగిందని చెబుతున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో 934, తెలంగాణాలో 894 మంది ఉన్నారు. కేంద్ర గణాంకశాఖ 2023లో విడుదల చేసిన భారత్‌లో స్త్రీ, పురుషులు అనే నివేదిక ప్రకారం 2036నాటికి ప్రతి వెయ్యి మంది మగపిల్లలకు 952 మంది ఆడపిల్లలు ఉంటారని అంచనా వేశారు. మొత్తంగా స్త్రీ, పురుషుల నిష్పత్తిని చూస్తే 2025లో ప్రతి 106.453 మంది పురుషులకు వందమంది మహిళలు ఉన్నారని, దీని ప్రకారం జనాభాలో పురుషులు 51.56 శాతం ఉన్నారని పేర్కొన్నారు. ప్రస్తుతం 48.44శాతంగా ఉన్న మహిళలు 2036 నాటికి 48.8శాతానికి పెరుగుతారని అంచనా.2010లో ప్రతి వంద మంది ఆడపిల్లలకు 109.6 మంది మగపిల్లలు ఉన్నారని అంచనా. ఈ కారణంగానే అనేక మంది యువకులకు వివాహాలు కావటం లేదు. మంచి ఉద్యోగం, సంపద, రాబడి ఉన్నవారిని మాత్రమే అమ్మాయిలు ఎంచుకుంటున్నారని, వ్యవసాయంలో ఉన్నవారికి ఆలశ్యం అవుతోందని చెబుతున్నారు. జనాభా లెక్కలను 2027లో సేకరించనున్నందున వాటిని నిర్ధారించిన తరువాత మాత్రమే వాస్తవ పరిస్థితి వెల్లడి అవుతుంది. అప్పటి వరకు చెప్పేవన్నీ అంచనాలు మాత్రమే. ఉదాహరణకు 2025లో మన జనాభా 144కోట్లని గతంలో అంచనా చెప్పారు. ఇప్పుడు 146.39 కోట్లంటున్నారు. ఆడపిల్లల పట్ల వివక్ష, లింగనిర్దారణ పరీక్షలు చేయించి అబార్షన్లు చేయించటం వంటి దుర్మార్గం జరుగుతున్న కారణంగా బేటీ బచావో పథకాన్ని 2015 జనవరి 22న ప్రవేశపెట్టారు గానీ ఆచరణలో అలాంటి చర్యలను ఆపేందుకు నిర్దిష్ట చర్యలు తీసుకోలేదు.లింగ అంతరం తగ్గకపోగా మరింతగా పడిపోవటానికి కారణం ఏమిటో ప్రధాని లేదా ఆయన మద్దతుదారులు చెప్పాలి. ఇంతవరకు ఏ బిజెపీ నేతా కాషాయదళాల మేథావులు కూడా స్పందించలేదు.
లింగ అంతరంలో ఆడపిల్లలు బతికి బట్టకట్టటాన్ని కూడా పరిగణనలోకి తీసుకుంటారు, ఈ పథకంలో బేటీ బచావో అన్నా అదే. అందుకే ఈ పథకం వైఫల్యం కూడా అంతరం మరింతగా పతనం కావటానికి దోహదం చేసిందని చెప్పాల్సి వస్తోంది. ఈ పథకానికి కేటాయించిన నిధులతో నరేంద్రమోడీ బొమ్మతో ప్రచారానికే ఎక్కువ ఖర్చు చేశారు. ఏడాదికి రెండు పాయింట్ల చొప్పున మెరుగుదల సాధించాలన్నది లక్ష్యం. అది జరిగినట్లు కనిపించటం లేదు. మహిళా సాధికారతపై పార్లమెంటరీ కమిటీ 2021 సమీక్షలో ఈ పథకానికి కేటాయించిన సొమ్ములో కేవలం 25.13శాతమే ఖర్చు చేసినట్లు, వాటిలో కూడా 80శాతం ప్రకటనలకే వెచ్చించినట్లు, ప్రత్యేకించి పంజాబ్, హర్యానాలతో పాటు అనేక రాష్ట్రాలలో పథక లక్ష్యాలు నెరవేరలేదని కూడా తేలింది. కాగ్ నివేదికలు కూడా దీన్నే సూచించాయి. పదేండ్లు దాటుతున్నా దీని అమలు గురించి సర్వేలే చేయలేదు.2019లో ప్రభుత్వమే పార్లమెంటుకు ఈ విషయాన్ని చెప్పింది. లింగ నిష్పత్తి ఏమాత్రం పెరిగినా దానికి ఈ పథకమే కారణం అని చెప్పే స్థితిలో పాలకులు లేరు. లింగ నిష్పత్తి ఈ పధకం ప్రారంభమైన తరువాత కేంద్ర పాలిత ప్రాంతమైన యానంలో 2014లో 1107 ఉండగా 201617 నాటికి 976కు, నికోబార్ దీవుల్లో 985 నుంచి 839కు పడిపోయిందని వార్తలు రాగా 201921 జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే ప్రకారం పుదుచ్చేరిలో 959, అండమాన్, నికోబార్‌లో 914 ఉన్నట్లు పేర్కొన్నారు.
2024 లింగ అంతరం నివేదిక ప్రకారం పురుషుడు రు.100 సంపాదిస్తే అదే పనికి మహిళకు ఇస్తున్నది రు. 39.80 మాత్రమే.ఇది ఒక్క చిన్న చిన్న ఉపాధి, ఉద్యోగాలకే కాదు, టెక్నాలజీ, క్రీడలు, సినిమా రంగాల్లో కూడా ఇదే పరిస్థితి అంటే అతిశయోక్తి కాదు.ప్రఖ్యాత హీరోయిన్ దీపికా పడుకోన్ 2021 ఆగస్టులో ప్రతిఫల చెల్లింపులో వివక్షను ప్రశ్నించారు. తన భర్త రణవీర్ సింగ్ ఎంత కష్టపడతారో తానూ అదే చేస్తానని తనకు తక్కువ మొత్తం ఇవ్వచూపినందుకు సంజయ్ లీలా బన్సాలీ సినిమా బైజు బావరాలో నటించేందుకు తిరస్కరించినట్లు ఆమె బహిరంగంగా చెప్పారు. ఆమె ఒక స్థాయికి ఎదిగారు గనుక అలా చెప్పగలిగారు, ఎందరికి అలాంటి అవకాశం ఉంది. నిజానికి ఇది బాలీవుడ్‌లోనే కాదు దేశంలోని అన్ని సినిమా రంగాల్లో , ఇతర చోట్ల ఉంది.హాకీలో పది రెట్లు ఉన్నట్లు ఫెమినిజమ్ ఇండియా నివేదిక అదే ఏడాది పేర్కొన్నది. 2015లో కేరళలో జరిగిన జాతీయ స్క్వాష్ ఛాంపియన్‌షిప్‌లో బహుమతిగా పురుషులకు రు.1.2లక్షలు, మహిళలకు రు.50వేలుగా నిర్ణయించటాన్ని నిరసిస్తూ తాను పోటీలలో పాల్గొనటం లేదని దీపికా పాలికల్ నిరాకరించింది. మనదేశ శ్రమశక్తి మార్కెట్‌లో వేతన వ్యత్యాసం పెద్ద సమస్యగా ఉంది. నరేంద్రమోడీ తన మన్‌కీ బాత్‌లో ఎన్నడూ దీని గురించి ప్రముఖంగా ప్రస్తావించినట్లు, తొలగించేందుకు చర్యలు తీసుకున్నట్లు ఎక్కడా కనిపించదు. కరోనా సమయంలో అంతకు ముందున్నదానికంటే వేతన వ్యత్యాసం ఏడుశాతం పెరిగిందని పిఎల్‌ఎఫ్‌ఎస్ సర్వే సమాచారం వెల్లడిరచింది.
ఉద్యోగాల్లో చేరటంలో ఒకే స్థాయిలో 46శాతం ఉన్నప్పటికీ సిఇఓ,సిఎఫ్‌ఓ, సివోవో వంటి ఉన్నత స్థానాలో 25శాతానికి మించి మహిళలు లేరని కెపిఎంజి, మరియు ఏఐఎంఏ 2024 సర్వేలో తేలింది.అసంఘటిత రంగంలో పనిచేస్తున్నవారిలో మహిళలే ఎక్కువగా ఉన్నప్పటికీ వారికి సమానవేతనాలు లేకపోవటం ప్రసూతి సెలవు వంటి సామాజిక భద్రత లేని విషయం తెలిసిందే.శ్రామిక మహిళలకు 26వారాల ప్రసూతి సెలవు ఇవ్వాలనే చట్టసవరణ తరువాత అనేక మంది యజమానులు పిల్లల్ని కనేవయస్సులో ఉన్నవారిని పనిలో పెట్టుకోవటం తగ్గించటం లేదా రాజీనామా చేయించి తరువాత చేర్చుకోవటం వంటి పనులకు పాల్పడిన ఉదంతాలు ఉన్నాయి. స్త్రీని దేవతగా పూజించే దేశం కదా ! కొన్నిదేశాల్లో తండ్రులకు కూడా పిల్లల సంరక్షణ సెలవులు ఇస్తున్నకారణంగా మహిళల నియామక వివక్ష కొంత మేర తగ్గింది. మనదేశంలో సైతం ఎందుకు దాన్ని ప్రవేశపెట్టకూడదు ? చట్టసభల్లో మూడోవంతు సీట్లు ఇవ్వటానికే వామపక్షాలు మినహా మిగిలిన రాజకీయ పార్టీలన్నీ ఎన్ని నాటకాలాడాయో చూశాము. ? భూస్వామిక వ్యవస్థ భావజాలం నుంచి బయపడతారా ? ఒకవైపు పురోగమనంలో ఉన్నామని చెబుతూ మహిళలను అణచివేసిన సనాతన ధర్మాన్ని, మనువాదాన్ని తలకెత్తుకుంటున్న శక్తులు రెచ్చిపోతున్న తరుణంలో పురుషులతో సమంగా స్త్రీలను చూసేందుకు అంగీకరిస్తారా !

