ఎం కోటేశ్వరరావు
పద్దెనిమిదవ లోక్‌సభ చివరిదశ ఎన్నికల ప్రచారం ముగిసింది. భక్తులకు వినసొంపుగా వారు కోరుకున్నట్లుగా, వ్యతిరేకులకు అనేక విమర్శనాస్త్రాలు అందిస్తూ, నిష్పాక్షికంగా వాస్తవాలను పరిశీలించేవారు అవాక్కయ్యే విధంగా ఎన్నికల ప్రసంగాలు చేసిన నరేంద్రమోడీ ప్రక్షాళన కోసమో, మరొకదానికోసమో 45 గంటల పాటు కన్యాకుమారిలోని వివేకానంద కేంద్రంలో ధ్యానదీక్ష చేశారు.నువ్వు చెయ్యాల్సింది చెయ్యి, ఫలితాలు, పర్యవసానాలు, విమర్శల గురించి పట్టించుకోకు మౌనవ్రతమే నీ ఆయుధం అన్నట్లుగా దేవుడి అంశతో జన్మించినట్లు చెప్పుకున్న మోడీ కార్యాచరణలో నిమిత్తమాత్రుడు తప్ప ఆటాడించిందీ, మాట్లాడించిందీ ఆ దేవుడే గనుక ప్రతిష్టో అప్రతిష్టో ఆయన ఖాతాకు తప్ప మోడీకి కాదని వేరే చెప్పనవసరం లేదు. పచ్చి అవాస్తవాలు,ఎడారిలో సముద్రాల మాదిరి మాటలు, ప్రలోభాలు, బెదరింపులు,బ్రతిమిలాటలు ఇలా ఎన్నో. సకలకళా వల్లభుల ప్రదర్శనలను దేశం చూసింది. మంచో చెడో ఒక నిర్ణయం తీసుకొని ఓటర్లు తమ తీర్పునిచ్చారు. జూన్ నాలుగున వెలువడే ఫలితాలలో గెలిచిన పార్టీల, అభ్యర్థుల హడావుడి, ఓడిన పార్టీలు, అభ్యర్థుల వాదనలు, వేదనలు సరేసరి.. ఏ పార్టీ లేదా ఏ కూటమికి మెజారిటీ రాకుండా హంగ్ ఏర్పడితే ఏం జరుగుతుందో అనూహ్యం. ఎన్‌డిఏ-ఇండియా కూటమి రెండూ మెజారిటీ సాధనకు తలపడతాయి. చిన్న పార్టీలు ప్రభుత్వ ఏర్పాటు వరకు కింగ్‌మేకర్లుగా మారతాయి.తరువాత వాటి భవిష్యత్ చెప్పలేము.చిన పాముపు పెద పాము, చిన చేపను పెద చేప మింగినట్లుగా జరిగే అవకాశం ఉంది. లోక్‌సభలోని 543 స్థానాలకు గాను మెజారిటీ 272 సాధించుకున్న పార్టీ లేదా కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది.గత ఎన్నికలను చూసినపుడు 2014లో బిజెపి 31శాతం ఓట్లతో 282 సీట్లు తెచ్చుకుంది,2019లో 37.3శాతం ఓట్లు 303 సీట్లు తెచ్చుకుంది. కాంగ్రెస్ విషయానికి వస్తే 2014లో 19.31శాతం ఓట్లు 44 సీట్లు, తదుపరి ఎన్నికల్లో 19.46శాతం ఓట్లు, 52 సీట్లు తెచ్చుకుంది. బిజెపి హిందూత్వను ఎంతగా రెచ్చగొట్టినా, నరేంద్రమోడీని హిందూ హృదయ సామ్రాట్టుగా జనం ముందుకు తెచ్చినా గత రెండు ఎన్నికల్లో మెజారిటీ ఓట్లు రాలేదు. అదే కాంగ్రెస్‌ను చూస్తే ఓట్ల శాతంలో పెద్ద మార్పు లేదు.2014కు ముందు జరిగిన ఎన్నికల్లో బిజెపి తెచ్చుకున్న 18.8శాతం ఓట్లను 31శాతానికి పెంచుకోగా, కాంగ్రెస్ 28.55 నుంచి 19.31శాతానికి కోల్పోయింది. అంతకు ముందు ఎన్నికలతో పోల్చితే 2014లో బిజెపి 12.2శాతం అదనంగా తెచ్చుకోగా 2019లో అదనంగా 6.36శాతం తెచ్చుకుంది. కాంగ్రెస్ 2014తో పోల్చితే 2019లో 0.18శాతం ఓట్లు అదనంగా తెచ్చుకుంది. తినబోతూ రుచెందుకు అన్నట్లుగా 2024లో తీరుతెన్నుల గురించి జోశ్యాలు చెప్పాల్సిన అవసరం లేదు.
ప్రేమ కోసం, యుద్ధంలో గెలుపుకోసం అబద్దాలు చెప్పవచ్చు అన్నట్లుగా ఈ ఎన్నికలలో నరేంద్రమోడీ, బిజెపి నేతల ప్రసంగాల తీరు ఉంది. ఎవరేమనుకుంటే మాకేటి అన్నట్లు వ్యవహరించారు.చివరి దశలో ప్రధాని నరేంద్రమోడీ ఎబిపి టీవీ ఛానల్‌కు జర్నలిస్టులతో మాట్లాడుతూ రిచర్డ్ అటెన్‌బరో గాంధీ సినిమా తీసిన తరువాతే మహాత్మాగాంధీ ఎవరు అనే ఉత్సుకత ప్రపంచంలో పెరిగిందని చెప్పారు. నిజానికి ఇది ఎన్నికల అంశంగా ఏ పార్టీ కూడా ప్రస్తావన తేలేదు. ఆకర్షణీయమైన నేతలు తప్పులు ఎందుకు చేస్తారంటూ ”అవెంటస్ ” పార్టనర్స్ అనే ఒక వెబ్‌సైట్‌లో తేదీలేని ఒక సర్వే విశ్లేషణ ఉంది. నేతలు అందునా ఉత్తమ నేతలు కూడా అవివేకమైన తప్పులు తరచుగా చేస్తుంటారని పేర్కొన్నది.పదవి మరియు తెలివితేటల కారణంగా మితిమీరిన విశ్వాసం మరియు అధికారంతో తీవ్రమైన తప్పులు చేస్తుంటారని దీన్ని సైద్దాంతిక వేత్తలు (హ్యూమన్ ఫోలీ) మానవ అజ్ఞానం లేదా మూర్ఖత్వమని పిలిచారని పేర్కొన్నది. దానిలో పేర్కొన్న ఐదు తప్పుల సారం ఇలా ఉంది. సంవత్సరాల తరబడి నిరంతరం అందుకునే ప్రశంసల కారణంగా అత్యధిక నేతలు తమ తెలివితేటలు, సామర్ధ్యాల గురించి తిరుగులేని విశ్వాసాన్ని అభివృద్ధి చేసుకుంటారట.కీలకమైన నిర్ణయాలు తీసుకొనే సమయంలో తమ మీద తమకు ఏర్పడిన అతివిశ్వాసం కారణంగా ఇతరులు వెల్లడించే అభిప్రాయాలు, సూచనలను పట్టించుకోరు, దీంతో చురుకైన నేతలు తప్పుడు నిర్ణయాలు తీసుకొనే ముప్పు ఎక్కువగా ఉంటుందట. సూక్ష్మ నిర్వహణ(మైక్రోమేనేజ్‌మెంట్) సమస్య నేతలకు మాత్రమే కాదు సంస్థలలోనూ ఉంది.నాయకత్వ స్థానాల్లో సూక్ష్మ నిర్వహణ, బదలాయింపు లేకపోతే మొత్తం జట్టు మీద ప్రభావం చూపుతుంది. సంక్షోభ సమయాల్లో చురుకైన నేతలు జట్టు హస్తం అందుకొనేందుకు చూస్తారు, కానీ కొత్త ఆలోచనల అన్వేషణలో వారి ఆసరా తీసుకోరు. చురుకైన నేతలు తాము రూపొందించిన నిబంధనలను పాటించటంలో విఫలమైనపుడు ఆ సంస్థల విలువలు, సూత్రాల మీదనే సందేహాలు తలెత్తుతాయి. తరువాత వాటన్నింటినీ పరిరక్షించాల్సిన వ్యక్తి విశ్వసనీయతే ప్రశ్నార్ధకం అవుతుంది. చురుకైన వారు ఇతరులు చెప్పేదానికి విలువ ఇవ్వరు. తమకు సలహాలు ఇచ్చేంత గొప్పవారా అనుకుంటారు.తమ తప్పును అంగీకరించరు. తరచుగా మంచిచెడ్డల స్వీకరణ నిలిపివేత వీరు చేసే అవివేకమైన తప్పు. బలమైన నేతలకు అవకాశాలు సులభంగా వచ్చినపుడు అన్నింటినీ చేసేయగలమనే వ్యక్తిత్వాలను పెంచుకుంటారు. లక్ష్యాలను పెద్దగా నిర్ణయించుకుంటారు, అనుకున్న విధంగా జరగకపోతే తగిన ప్రయత్నం లేకపోవటం అనుకుంటారు.వాస్తవ విరుద్దమైన లక్ష్యాలను నిర్ణయించుకొని ఎలాగైనా సాధించాలనుకొని జనాలను ఇబ్బందుల్లోకి నెడతారు. చురుకైన తెలివితేటలు కలిగిన వారందరూ పైన పేర్కొన్న లక్షణాలు, ధోరణులు గల నేతలు ఎవరన్నది ఎవరికి వారు అన్వయించుకొని ఒక అంచనాకు రావచ్చు.
నరేంద్రమోడీని అనేక మంది చురుకైన, ఆకర్షణ కలిగిన నేత అని చెబుతారు. ఆయనకు ఉందని చెబుతున్న పట్టా రాజకీయ శాస్త్రంలో అని కూడా అందరం చదువుకున్నదే. అలాంటి వ్యక్తికి చరిత్ర తెలియదా లేక కావాలనే ఎన్నికల ప్రచారంలో అనేక అంశాలను వక్రీకరించినట్లుగా జాతిపిత గురించి కూడా మాట్లాడారా ? రెండూ వాస్తవం కావచ్చు. ప్రపంచ వలస దేశాల చరిత్రను చూసినపుడు మనదేశమంత పెద్దది బ్రిటీష్ సామ్రాజ్యంలో మరొకటి లేదు. వారి పాలనను అంతం చేసిన స్వాతంత్య్ర పోరాటానికి నాయకత్వం వహించిన వారెవరు అన్న చర్చ జరిగినపుడు అంటే నరేంద్రమోడీ పుట్టక ముందే మహాత్మాగాంధీ అని ప్రపంచం తెలుసుకుంది. స్వాతంత్య్ర ఉద్యమంతో సంబంధం లేని ఆర్‌ఎస్‌ఎస్ శాఖల్లో గాడ్సే గురించి తప్ప గాంధీ గురించి పెద్దగా బోధించి ఉండరు. భగవద్గీత వంటి గ్రంధాల కంటే ” నేనెందుకు గాంధీని చంపాను ” అంటూ గాడ్సే కోర్టులో మాట్లాడిన అంశాలను పెద్ద ఎత్తున బోధిస్తారని వినికిడి. ఆ పుస్తకాన్ని అచ్చువేసి, పెద్ద ఎత్తున ప్రచారంలోకి తెచ్చిన అంశం తెలిసిందే.మహాత్మాగాంధీ జాతిపిత అని ఎవరు చెప్పారు, ఎలా అయ్యారంటూ, దేశానికి చేసిన ద్రోహాలంటూ వాట్సాప్ యూనివర్సిటీలో ప్రచారం చేసే ఊరూపేరు చెప్పుకొనేందుకు ధైర్యం లేని చీకటి బతుకుల బాపతు ఎవరు అన్నది వేరే చెప్పనవసరం లేదు.
మహాత్ముడు కాక ముందు అంటే నరేంద్రమోడీ పుట్టక ముందే బహుశా ఆయన తండ్రి లాగూలు(అప్పటికి నిక్కర్లు వచ్చి ఉండవు) వేసుకొంటున్న సమయానికే 1920దశకంలోనే మోహనదాస్ కరంచంద్ గాంధీ గురించి పశ్చిమ దేశాలలో చర్చ జరిగింది. కేంద్ర ప్రభుత్వం చరిత్రను ఆర్‌ఎస్‌ఎస్ భావజాలానికి అనుగుణ్యంగా తిరగరాస్తున్నది. గాంధీ హత్య నేపధ్యం గురించి భావితరాలకు తెలియకూడదు అనే లక్ష్యంతో ఎన్‌సిఇఆర్‌టి ద్వారా 2022జూన్‌లో రాజకీయ శాస్త్రంలో ఉన్న అంశాలను తొలగింపచేయించిన ఉదంతం తెలిసిందే.ఏమిటవి ? ” పాకిస్తాన్ ముస్లింలకు అన్నట్లుగా ఇండియా హిందువుల దేశంగా మారాలని లేదా హిందువులు ప్రతీకారం తీర్చుకోవాలని కోరుకున్నవారికి ప్రత్యేకించి ఆయన(గాంధీ) అంటే అయిష్టం…హిందువులు-ముస్లింలు ఐక్యంగా ఉండాలనే స్థిరమైన అనుసరణతో రెచ్చిపోయిన హిందూ ఉగ్రవాదులు ఆ మేరకు అనేక సార్లు గాంధీజీని హత్య చేసేందుకు చూశారు….గాంధీజీ మరణం దేశంలో ఉన్న మతపరిస్థితిపై దాదాపు మాయా ప్రభావం(మేజికల్ ఎఫెక్ట్) చూపింది…..మతవిద్వేషాన్ని రెచ్చగొడుతున్న సంస్థలపై భారత ప్రభుత్వం చర్యలు తీసుకున్నది. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఫ్‌ు వంటి సంస్థలపై కొంత కాలం నిషేధం విధించింది…” ఇలాంటి కుదురు నుంచి వచ్చిన నరేంద్రమోడీ నోట మహాత్మా గాంధీ గొప్ప వ్యక్తి అని వెలువడటం వెనుక చిత్తశుద్ది ఉందని ఎవరైనా అనుకోగలరా ?
ఇంతకీ మహాత్ముడి గురించి నరేంద్రమోడీ సెలవిచ్చిందేమిటి ? ప్రతిపక్షాలు రామమందిర ప్రారంభోత్సవానికి ఎందుకు రాలేదు, ఎన్నికలలో దీని ప్రభావం ఉంటుందా అని ఎబిపి విలేకర్లు అడిగిన ప్రశ్నపై స్పందించిన మోడీ ప్రతిపక్షం బానిసత్వ భావనలనుంచి బయటకు రాలేదు అంటూ ” మహాత్మా గాంధీ గొప్ప వ్యక్తి. మహాత్మా గాంధీ గురించి ప్రపంచం తెలుసుకొనే విధంగా ఈ 75 సంవత్సరాలలో చేయాల్సిన బాధ్యత మనది కాదా ? మహాత్మా గాంధీ గురించి ఎవరికీ తెలియదు. గాంధీ సినిమా తీసిన తరువాత మాత్రమే ఈ మనిషి ఎవరన్న జిజ్ఞాస ప్రపంచంలో పెరిగింది.మనమాపని చేయలేదు. అది మన బాధ్యత. మార్టిన్ లూథర్ కింగ్ గురించి ప్రపంచానికి తెలిసిందంటే, దక్షిణాఫ్రికానేత నెల్సన్ మండేలా ప్రపంచానికి తెలిశారంటే వారికంటే గాంధీ తక్కువేమీ కాదు. మీరు దీన్ని అంగీకరించాలి.ప్రపంచమంతా తిరిగిన తరువాత నేను ఈ విషయాన్ని చెబుతున్నాను” అని మోడీ చెప్పారు. బ్రిటీష్ సినిమా దర్శకుడు రిచర్డ్ అటెన్‌బరో గాంధీ సినిమాతీశాడు, బెన్‌కింగ్‌స్లే గాంధీ పాత్ర పోషించాడు. దానికి పదకొండు అకాడమీ అవార్డులు వచ్చాయి. ఆ సినిమా తరువాతే గాంధీ గురించి ప్రపంచానికి తెలిసిందని చెప్పటం మహాత్ముడిని అవమానించటం తప్ప మరొకటి కాదు.ఆ సినిమా తరువాతనే నాకు గాంధీ గురించి తెలిసిందని మోడీ చెప్పి ఉంటే ఎంతో హుందాగా ఉండేది. దక్షిణాఫ్రికా స్వాతంత్య్ర పోరాటం మీద గాంధీ ప్రభావం గురించి స్వయంగా నెల్సన్ మండేలానే చెప్పారు. ఆ పోరాటం గాంధీ సినిమా చూసిన తరువాత ప్రారంభం కాలేదు.
మహాత్మా గాంధీ పుట్టిన గుజరాత్‌కు సిఎంగా పని చేసిన నరేంద్రమోడీ అమ్మా గూగులమ్మా మా గాంధీ గురించి కాస్త చెప్పమ్మా అని మోడీ అడిగినా, ఆయన సిబ్బంది అడిగినా గాంధీ సినిమాకు ముందు, తరువాత కూడా ఎన్నో విషయాలు తెలిసి ఉండేవి. సామాజిక మాధ్యమంలో ప్రతిపక్షాల నుంచి ఇప్పుడు ఇన్ని విమర్శలు ఎదుర్కోవాల్సి వచ్చి ఉండేది కాదు. గాంధీ గురించి ఉన్న వెబ్‌సైట్‌ను అసలు ఒక్కసారైనా చూసి ఉంటారా అన్నది అనుమానమే. చూసి ఉంటే ఇలా మాట్లాడేందుకు ధైర్యం చేసి ఉండేవారు కాదు.బ్రిటన్ వార పత్రిక గ్రాఫిక్‌లో 1922లో గాంధీ అరెస్టయినపుడు గాంధీ గురించి రాశారు. నైరోబీలో గాంధీ అరెస్టు గురించి చేసిన ఆందోళనపై రాయిటర్స్ వార్తా సంస్థ ఇచ్చిన వార్తను అదే ఏడాది లాహౌర్ నుంచి వెలువడిన సివిల్ మరియు మిలిటరీ గెజెట్‌లో ప్రచురించారు.” సదాచార గాంధీ :1930వ సంవత్సర పురుషుడు ” అంటూ టైమ్ పత్రిక 1931 జనవరి ఐదవ తేదీన ప్రచురించింది. ఉప్పు సత్యాగ్రహం సందర్భంగా 1930లో గాంధీతో పాటు అరెస్టు అయిన 30వేల మందిని ఏం చేయాలా అని బ్రిటీష్ సామ్రాజ్యం భయంతో ఉంది. ఆ ఏడాది చివరిలో ఒక అర్దనగ మనిషిని చూసింది, ప్రపంచ చరిత్ర 1930లో ఆ మనిషి సంకేతం నిస్సందేహంగా అన్నింటికంటే పెద్దది ” అని దానిలో రాసింది. అదే ఏడాది సెప్టెంబరు 20న అమెరికా నుంచి వెలువడే బర్లింగ్టన్ హాక్ ఐ అనే పత్రిక ఒక పూర్తి పేజీ కేటాయించి గాంధీ గురించి రాసింది.” ప్రపంచంలో ఎక్కువ మంది చర్చించిన మనిషి ” అనే శీర్షిక పెట్టింది. రాట్నం వడుకుతున్న మహాత్మాగాంధీ ఫొటో ఎంత ప్రాచుర్యం పొందిందో తెలిసిందే. అమెరికా ఫొటోగ్రాఫర్ మార్గరెట్ బుర్కే వైట్ తీసిన దాన్ని 1946 మే 27వ తేదీన లైఫ్ అనే పత్రిక ” భారత నేతలు ‘ అనే శీర్షికతో ప్రచురించింది.
మహాత్మాగాంధీ హత్య గురించి న్యూయార్క్‌టైమ్స్ పత్రిక ఒక పతాక శీర్షికతో ప్రచురించింది.” ఒక హిందూ చేతిలో గాంధీ హత్య, కంపించిన భారత్,కొట్లాటల్లో బాంబేలో 15 మంది మృతి ” అని రాసింది.గార్డియన్, వాషింగ్టన్ పోస్టు, డెయిలీ టెలిగ్రాఫ్ వంటి పత్రికలన్నీ పతాక శీర్షికలతో గాంధీ హత్య వార్తను ప్రచురించాయి. గాంధీతో ప్రముఖ సినిమా నటుడు చార్లీ చాప్లిన్ భేటీ, ఆల్బర్ట్ ఐనిస్టీన్ ఉత్తర ప్రత్యుత్తరాలు, గాంధీ గురించి మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ రాసిన అంశాలన్నీ సుపరిచతమే.అమెరికా జర్నలిస్టు లూయీస్ ఫిశ్చర్ 1950లో ” మహాత్మాగాంధీ జీవితం ” పేరుతో రాసిన జీవిత చరిత్రను ఎంతో మంది చదివారు. గాంధీ సినిమాకు ముందే అనేక దేశాలు గాంధీ గౌరవార్ధం పోస్టల్ స్టాంపులను ప్రచురించాయి. ఇంత ప్రాచుర్య చరిత్ర ఉంటే నరేంద్రమోడీ చేసిన వ్యాఖ్యలు వాస్తవ విరుద్దమే గాక అసహ్యం కలిగిస్తున్నట్లు విమర్శలు వెలువడ్డాయి.



