Tags

, , ,

ఎం కోటేశ్వరరావు

ఈనెల 20వ తేదీన విజయవాడలో ప్రముఖ సంపాదకులు పొత్తూరు వెంకటేశ్వరరావు రచించిన’అమరావతి ప్రభువు -వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు’ అనే గ్రంధాన్ని ముఖ్య మంత్రి చంద్రబాబు నాయుడు ఆవిష్కరించారు. ఈ సందర్బంగా ఆయన చేసిన ప్రసంగంలోని అంశాల గురించి ప్రభుత్వ మీడియా సలహాదారు కార్యాలయం ఒక అధికారిక ప్రకటన విడుదల చేసింది. దానిలోని కొన్ని అంశాల మంచి చెడ్డల గురించి చూద్దాం.

1.’గతంలో వుమ్మడి ఆంధ్రప్రదేశ్‌ని ఐటిలో అభివృద్ధి చేయగా నవ్యాంధ్రప్రదేశ్‌లో పోర్టుల(రేవుల) అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు చంద్రబాబు స్పష్టం చేశారు.ఓడ రేవుల ఆధార ఆర్ధిక వ్యవస్ధగా రూపొందితే భవిష్మత్‌ వుజ్వల రీతిలో వుంటుందని వివరించారు.’

   కొంత మంది అంగీకరించినా అంగీకరించకపోయినా, అతిశయోక్తులు చెబుతారని అన్నా చంద్రబాబు నాయుడు అంటే ఐటి రంగ అభివృద్దికి మారుపేరుగా కీర్తి కండూతి దక్కింది. అంతకంటే ఎక్కువగా ఇరుగు పొరుగు రాష్ట్రాలు అభివృద్ది చెందాయి కనుక విమర్శకులు అంగీకరించరు. దానివలన నష్టం లేదు వదిలేద్దాం. ఇప్పుడేం చేయాలన్నదే అసలు సమస్య. ఇజాలేమీ లేవు ఒక్క టూరిజం తప్ప అని ఒకసారి, ఐటి తప్ప చరిత్ర పాఠాలు చదవనవసరం లేదు అని ఒకసారి ఇలా చంద్రబాబు నాయుడు తన సుదీర్ఘ అధికార ప్రస్తానంలో ఎన్నో ఆణిముత్యాలను ప్రవచించారు. గతంలో గ్రామాలలో హరికధలు, బుర్ర కధల వంటి జానపద కళారూపాలను ప్రదర్శించేవారు భుక్తి కోసం ఏ వూరు వెళితే ఆ వూరును మీ వూరు చుట్టుపక్కల అరవై ఆరు గ్రామాలకు పోతు గడ్డ అని చెప్పేవారు. కొంత మంది నిజమే కదా అనుకొనే వారు.

    ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్‌లో ఐటి రంగం అభివృద్ధి పట్ల ఆ దిగ్గజాలకు ఆసక్తి లేదని ఆపిల్‌ సిఇవో టిమ్‌ కుక్‌ హైదరాబాదు పర్యటనలో చేసిన హడావుడి స్పష్టం చేసింది. గతంలో ఏ కంపెనీ సిఇఓ వచ్చినా చంద్రబాబును కూడా తోటి సిఇఓగా పరిగణించి కలవకుండా వెళ్లే వారు కాదు. కానీ ఇప్పుడా పరిస్థితి లేదు. అందుకనే ఐటి గురించి గాక రేవుల అభివృద్ధి గురించి ప్రత్యేక శ్రద్ధ పెడతానని చెబుతున్నారా ? ఇదే నిజమైతే ఇంజనీరింగ్‌ కళాశాలల పెట్టుబడిదారులు, ఏటా లక్షల మంది పట్టభద్రులను తయారు చేస్తున్న వారి పరిశ్రమలు ఏం కావాలి ?

  చంద్రబాబు నాయుడు గొప్ప దార్శనికుడని చెప్పటానికి గతంలోనూ, ఇపుడు మరొకసారి రూపొందించిన విజన్‌ పత్రాలు సజీవ సాక్ష్యాలు. ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధికి చంద్రబాబు నాయుడు కన్న కలలు ఏమిటి అని ఎవరైనా భవిష్యత్‌లో పరిశోధన చేస్తే వారికి మంచి సమాచారంగా అవి వుపయోగపడతాయి.ఆంధ్రప్రదేశ్‌ ప్రస్తుతం వ్యవసాయ ఆర్ధిక వ్యవస్థగా వుంది. పరిశ్రమలు, సేవారంగం వంటివి అభివృద్ధి చెందకుండా యువతరానికి వుపాధి దొరకదు. ఇప్పటికే వున్న ఓడ రేవుల ద్వారా జరిగే అభివృద్ధి ఏదో జరిగింది. మన తూర్పు, పశ్చిమ తీరాలలో మన కంటే పెద్ద ఓడరేవులు ఇప్పటికే వున్నాయి. సింగపూర్‌ మాదిరి తయారు చేయటానికి మన భౌగోళిక పరిస్థితులు అనువుగా లేవు.

   పరిశ్రమలు పెట్టటానికి, వారికి పదేళ్ల పాటు పలు రాయితీలు ఇవ్వటానికి ఏపికి ప్రత్యేక రాష్ట్ర హోదా రాదని తేలిపోయింది. అందువలన వారు మరొకదారి చూసుకుంటారు. లేదా ఇరుగు పొరుగు రాష్ట్రాలతో పోటీపడి పారిశ్రామికవేత్తలకు రాయితీలు కుమ్మరించటానికి రాష్ట్ర ఖజానాలో డబ్బు లేదని, లోటుతో వున్నట్లు చంద్రబాబే స్వయంగా చెబుతున్నారు. అది ఇప్పట్లో పూడేది కాదన్నది వాస్తవం. పరిశ్రమలు లేకుండా రేవులను అభివృద్ధి చేసి ఏమి ఎగుమతి చేస్తారు. బొగ్గు దిగుమతులు చేసుకోవటానికి ఇప్పటికే కృష్ణపట్నం వంటివి వున్నాయి. చంద్రబాబు నాయుడు పుట్టక ముందు నుంచీ చెబుతున్న భావనపాడు, నిజాంపట్నం చేపల రేవులు ఏమయ్యాయో తెలియదు. ఈ స్ధితిలో ఓడరేవుల ఆధారిత ఆర్థిక వ్యవస్థగా అభివృద్ధి చెందటానికి వున్న అవకాశాలేమిటో నిపుణులు చెప్పాలి.

2. తాను జపాన్‌లో పర్యటించినపుడు జపాన్‌లో బౌద్దాన్ని ఆచరించేవారు బుద్ధిజం అమరావతి నుంచే వచ్చిందని తమకు చెప్పారని, నాగార్జునుడి పేరు విన్నామని తెలిపారని చంద్రబాబు తెలిపారు.

3.లండన్‌లో పర్యటించినపుడు లండన్‌ మ్యూజియాన్ని సందర్శించానని అక్కడ రెండే రెండు గ్యాలరీలు వున్నాయని ఒకటి గ్రీసు గ్యాలరీ, రెండు అమరావతి గ్యాలరీ అని మ్యూజియం అధికారులు వివరించారని చెప్పారు. అమరావతి గ్యాలరీ అని ఎందుకు నామకరణం చేశారని తాను ప్రశ్నించానని, ప్రపంచంలో అమరావతి వుత్కృష్టమైనదిగా వారు తనకు చెప్పారని ముఖ్యమంత్రి గుర్తు చేసుకున్నారు.

    ఈ రెండూ చరిత్రకు సంబంధించిన అంశాలు. ఈ మధ్య సౌదీ అరేబియాలో అక్కడి యువతులు భారత మాతాకీ జై అని నినాదాలు చేస్తున్న వీడియో ఒక దానిని సామాజిక మాధ్యమంలో కొందరు పెద్ద ఎత్తున ప్రమోట్‌ చేశారు. వారు మాత భక్తులని వేరే చెప్పనవసరం లేదు. ప్రధాని నరేంద్రమోడీ సౌదీ పర్యటన సందర్భంగా ఆయనకు పలికిన ఆహ్వానంలో అదొక భాగం. దీన్ని గురించి ఎందుకు చెప్పుకోవాల్సి వచ్చిందంటే ఎవరైనా విదేశీ అతిధులు వచ్చినపుడు వారిని ప్రసన్నం చేసుకొనేందుకు వారి మనసెరిగి ఇష్టమైన కార్యక్రమాలు రూపొందించటం, వంటకాలు వడ్డించటం అంతర్జాతీయ దౌత్యం మొదలైప్పటి నుంచి జరుగుతున్నదే. దానిలో భాగంగానే మోడీని వబ్బేయటానికి భారత మాతాకు జై అనిపించారు సౌదీవారు. అక్కడి ముస్లింలే జై అంటే ఇక్కడి వారు ఎందుకు అనరనే వాదనలో భాగంగా ఆ వీడియోను హిందుత్వ భక్తులు వినియోగించుకున్నారు.

    జపాన్‌, లండన్‌ పర్యటనలో చంద్రబాబు నాయుడికి కూడా అదే జరిగిందా అన్న అనుమానం కలుగుతోంది. చంద్రబాబు నాయుడి పుణ్యమా అంటూ ఇప్పుడు చరిత్ర పాఠాలు చదివేవారు లేకుండా పోయారు. ఒక వేళ హైస్కూలు స్ధాయిలో కాస్తో కూస్తో చదివినా అదెవరికీ గుర్తుండటం లేదు. అయినా చరిత్ర చరిత్రే. దాన్నెవరూ చెరిపి వేయలేరు.

   జపాన్‌కు అమరావతి నుంచి బుద్ధిజం వెళ్లిందని ఏ చరిత్ర చెప్పలేదు. చైనీయుల నుంచి కొరియా అక్కడి నుంచి జపాన్‌కు వెళ్లినట్లు చరిత్ర చెబుతోంది.జపనీయులు అలా ఎందుకు చెప్పారన్నది ప్రశ్న.

   రెండవది లండన్‌ మ్యూజియంలో వున్న గ్యాలరీల గురించి ఇంటర్నెట్‌లో ఎన్నిసార్లు వెతికినా అమరావతి, గ్రీసు గ్యాలరీల పేరే మనకు కనపడదు, మిగతా గ్యాలరీల గురించి మాత్రమే మనకు దొరుకుతోంది. అక్కడి అధికారులు కూడా చంద్రబాబును తప్పుదారి పట్టించారా ?

   రాజకీయ నేతలు అనేక అంశాలను చెబుతుంటారు, వాటిని అధికారిక ప్రకటనలలో చేర్చినపుడు అధికారయంత్రాంగం ముందు వెనుకలు ఆలోచించి తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సి వుంటుంది. లేకపోతే చంద్రబాబు నాయుడి వంటి వారు ఇబ్బందులలో పడతారు.