Tags

, , , , ,

ఎం కోటేశ్వరరావు

      భావ ప్రకటనా స్వేచ్చ అవధులు లేని హక్కు కాదు అని సుప్రీం కోర్టు 2016 మే 13వ తేదీన ఒక ముఖ్యమైన తీర్పు ఇచ్చింది. పరువు నష్టం జరిగినపుడు భారతీయ నేర శిక్షా స్మృతి(ఐపిసి) కింద చర్యలు తీసుకోవటం సబబే అని దానిలో వున్న అంశాలు రాజ్యాంగ వ్యతిరేకమైనవి కాదని కోర్పు పేర్కొన్నది. ఐపసిి సెక్షన్‌ 499, 500 నేరపూరిత పరువు నష్టం గురించి వివరించాయి.నేరపూరితమైన పరువు నష్టం అంటే ఏమిటో 499 వివరించగా దానిని వుల్లంఘిస్తే ఎలాంటి శిక్ష వేయాలో 500 పేర్కొన్నది. ఈ తీర్పు ప్రత్యేకించి రాజకీయవేత్తలు, వివిధ సంస్థల కార్యకర్తలు, జర్నలిస్టులపై ఎంతో ప్రభావం చూపే అవకాశం వుంది. న్యాయమూర్తులు దీపక్‌ మిశ్రా, ప్రఫుల్ల సి పంత్‌లతో కూడిన బెంచ్‌ ఈ తీర్పునిచ్చింది. భావప్రకటనా స్వేచ్చ, వ్యక్తీకరణలపై నేరపూరితమైన పరువు నష్టపు అంశాలు తీవ్ర ప్రభావం చూపుతాయని భావించలేమని, ఒక వ్యక్తి భావ ప్రకటనా స్వేచ్ఛ హక్కు మరొక వ్యక్తి గౌరవహక్కుతో సమంగా వుండాలని న్యాయమూర్తులు పేర్కొన్నారు.తమిళనాడు, మహారాష్ట్రలలో బిజెపి నాయకుడు సుబ్రమణ్యస్వామి, కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ రాజకీయ ప్రసంగాల ద్వారా తమ పరువు నష్టం కలిగించే నేరం చేశారని ఆరోపిస్తూ దాఖలైన కేసులపై కోర్టు విచారణ జరిపింది. వలస పాలనా కాలంలో ఆమోదించిన చట్టాన్ని ఇప్పుడు వర్తింప చేయటం అసహేతుకం, నియంత్రత్వమని, స్వతంత్ర భారత్‌లో వాటి గురించి ఎలాంటి చర్చ, రాజ్యాంగబద్దత గురించి పరీక్ష లేకుండానే కొనసాగిస్తున్నారని స్వామి, రాహుల్‌ వాదించారు. బిజెపి నేత నితిన్‌ గడ్కరీ, ఇతరులు కూడా ఇదే అంశాల ఆధారంగా ఆమ్‌ ఆద్మీపార్టీ నాయకుడు అరవింద్‌ కేజ్రీ వాల్‌పై కూడా కేసులు దాఖలు చేశారు. నేరమయ జాబితా నుంచి పరువు నష్టం చట్టాన్ని తొలగించాలని కక్షిదారులు వాదించారు. సామాజిక మాధ్యమం ద్వారా జనాన్ని అప్రతిష్టపాలు చేసే ధోరణి పెరుగుతున్నందున దానిని అడ్డుకునేందుకు ఐపిసిలోని సెక్షన్లు 499,500లను కొనసాగించాలని కేంద్రం సమర్ధించింది. రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 19 ప్రసాదించిన భావ ప్రకటనా స్వేచ్చ హక్కు హామీతో పాటు ఆర్టికల్‌ 19(2) తగినన్ని రక్షణలు కల్పించటంతో పాటు సహేతుకమైన ఆంక్షలు కూడా వున్నాయని పేర్కొన్నది. కోర్టు ఆదేశం మేరకు తన అభిప్రాయం వెలిబుచ్చిన (అమికస్‌ క్యూరీ) టిఆర్‌ అంధ్యార్జున కూడా ఈ వాదనను సమర్ధించారు. గతేడాది ఆగస్టు 13తో వాదనలు ముగిసిన తరువాత న్యాయమూర్తులు తీర్పును వాయిదా వేసి మేనెలలో వెలువరించారు. వివిధ హైకోర్టులలో పరువు నష్టం కేసులను ఎదుర్కొంటున్న సుబ్రమణ్యస్వామి, రాహుల్‌ గాంధీ, అరవింద కేజ్రీవాల్‌కు ఎనిమిది వారాల గడువు ఇస్తూ ఆ కేసులను సవాలు చేయటం లేదా విచారణను ఎదుర్కోవాలని పేర్కొన్నది.

    ఇతర దేశాలలో పరువు నష్టం కేసులు సత్వరమే పరిష్కారం అవుతుండగా మన దేశంలో సంవత్సరాలు, దశాబ్దాల తరబడి కూడా కొనసాగుతున్నాయి. సెక్షన్‌ 500 ప్రకారం పరువు నష్టం కలిగించినట్లు రుజువైతే రెండు సంవత్సరాల వరకు సాధారణ జైలు శిక్ష లేదా జరిమానా లేదా రెండూ విధించవచ్చు. భావ ప్రకటనా స్వేచ్చ దారీ తెన్నూ తెలియని వర్తమానంలో పరువు నష్టం కేసులు నేరపూరితమైన వనే అంశాన్ని, వాటి రాజ్యాంగ బద్దతను సవాలు చేయటం దేశంలో బహుశా ఇదే ప్రధమంగా జరిగిందని అనేక మంది చెబుతున్నారు. వివిధ సందర్బాలలో కోర్టులు ఇచ్చిన తీర్పులు భావ ప్రకటనా స్వేచ్చను అడ్డుకొనేవిగానే వున్నాయనే అభిప్రాయం కూడా వుంది. వర్గ ప్రయోజనాలు న్యాయవ్యవస్ధను నడిపిస్తున్నాయనే అభిప్రాయం వెలిబుచ్చినందుకు గాను కమ్యూనిస్టు అగ్రనేత నంబూద్రిపాద్‌ను సుప్రీం కోర్టు శిక్షించింది. సినిమాలలో చూపే అధివాస్తవికత కారణంగా రెచ్చగొట్టినపుడు సహజంగానే తమను తాము అదుపుచేసుకోలేని భారతీయ ప్రేక్షకుల స్థితి కారణంగా సినిమాలను ముందుగానే సెన్సార్‌ చేయటం చట్టబద్దమే అని కోర్టు తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే. అంతేకాదు బసవేశ్వరపై కన్నడ రచయిత బరాగుర్‌ రామచంద్రప్ప రాసిన పుస్తకంపై నిషేధాన్ని సమర్ధిస్తూ ఇతరుల మనోభావాలను గాయపరిచే హక్కు ఇతరులకు లేదని కూడా ఇదే కోర్టు తీర్పు చెప్పింది. మహిళల ఆలయ ప్రవేశంపై సంప్రదాయాలు, మనో భావాలకు వ్యతిరేకంగా కోర్టులు మరోవైపు తీర్పు ఇవ్వటాన్ని కూడా చూశాము.

    భావ ప్రకటనా స్వేచ్చకు అవకాశం ఇవ్వటంతో పాటు సహేతుకమైన ఆంక్షలు కూడా విధించింది. సమస్య. ఈ సహేతుకమైన వాటికి వ్యాఖ్యానం చెప్పటాన్ని బట్టి, అవి అనేక పరిస్థితులపై ఆధారపడి వుంటాయని వేరే చెప్పనవసరం లేదు. గతంలో ఎన్నో పురోగామి తీర్పులు ఇచ్చిన అవే కోర్టులు తిరోగామి తీర్పులు కూడా ఇవ్వటాన్ని ఎలా అర్ధం చేసుకోవాలి.

   పరువు నష్టం విషయానికి వస్తే ఒకపుడు ఐరోపాలో ఎవరైనా అవాస్తవాలను ప్రచారం చేసినట్లు రుజువైతే అలాంటి వారి నాలికను కత్తిరించే శిక్ష వేసేవారు. ఇప్పుడు వాస్తవాలు చెప్పినా, విమర్శలు చేసినా పరువు నష్టం పేరుతో నోరు నొక్కేసే పరిస్థితులు ఇలాంటి తీర్పులతో వస్తున్నాయంటే అతిశయోక్తి కాదు. మన కళ్ల ముందే రెండు ఎకరాలున్న ఒక వ్యక్తి రెండువేల కోట్ల రూపాయలకు అధిపతి అయ్యాడనుకోండి, మనలో ఒకరిగా సైకిలు మీద తిరిగిన ఒక జర్నలిస్టు ఒక పెద్ద సంస్ధకు అధిపతి, ఒక వీధి రౌడీ, రౌడీ షీటర్‌గా ఒకపుడు రికార్డులకెక్కిన వారు ప్రజా ప్రతినిధిగా, మన కళ్ల ముందే మత ఘర్షణలను రెచ్చగొట్టి మారణకాండకు కారకులైన వారు పెద్ద మనుషులు, రాజ్యాంగ బద్ద, ప్రభుత్వ పదవులకు ఎలా ఎగబాకారని, లేదా రాజధర్మాన్ని విస్మరించి మారణకాండను కొనసాగనిచ్చారని ఎవరైనా విమర్శించి ఆధారాలు చూపకపోతే పరువు నష్టం కింద శిక్షించవచ్చు. అలాంటి ఆరోపణలను ప్రచురించిన లేదా ప్రసారం చేసిన మీడియాపై కూడా చర్య తీసుకోవచ్చు. కళ్ల ముందు కనిపిస్తున్న వాటన్నింటికీ సామాన్యులు లేదా అసామాన్యులుగాని ఆధారాలు చూపటం సాధ్యం అవుతుందా? కానపుడు మౌన ప్రేక్షకుల మాదిరిగా వుండిపోవటం తప్ప మాట్లాడకూడదు. ఇది ఎవరికి లాభం?

     ఎవరిదైనా ఒక కుక్క అదుపు తప్పి మరొకరిని కరిచిందనుకోండి దాని దాడికి గురైన వారు కుక్క యజమాని మీద కేసు వేసి పరిహారం పొందవచ్చు. ఆ డబ్బుతో బొడ్డు చుట్టూ ఇంజక్షన్లు వేయించుకోవచ్చు.అంతటితో సమస్య పరిష్కారం అవుతుంది. పిచ్చి కుక్కల వంటి కొన్ని శక్తులు అదుపు తప్పి మారణకాండకు పాల్పడుతున్నా అధికారంలో వున్న వారు అదుపు చేసేందుకు రాజధర్మాన్ని నిర్వర్తించకుండా వదలి వేస్తే అది అనేక పర్యవసానాలకు దారితీసే సామాజిక సమస్య అవుతుంది. దానిని ఎవరైనా రాజకీయంగా విమర్శించినపుడు అది తన పరువుకు నష్టం కలిగిందని కోర్టుకు ఎక్కితే విమర్శించిన వారు ఆధారాలు చూపకపోతే వారితో పాటు విమర్శలను వెల్లడించిన మీడియాను కూడా శిక్షించటానికి వీలు కలిగింది.

     బ్రిటీష్‌ వారి వలసగా అమెరికా వున్న సమయం, 1735లో న్యూయార్క్‌ వీక్లీ అనే పత్రికలో బ్రిటీష్‌ ప్రభుత్వ ప్రతినిధిగా వున్న న్యూయార్క్‌ గవర్నర్‌ విలియం కాస్బీని విమర్శిస్తూ ఒక వ్యాసాన్ని ప్రచురించారు.అది దేశద్రోహకర పరువు నష్టంగా చిత్రిస్తూ ఒక కేసును దాఖలు చేశారు. రచయితతో పాటు పత్రికను ముద్రించిన వ్యక్తిని కూడా దోషిగా నిలబెట్టారు.అయితే దానిలో వ్యాస రచయిత రాసినవన్నీ నిజాలే కావటంతో ఇద్దరూ పరువు నష్టం కేసునుంచి విముక్తి అయ్యారు. 1964లో అమెరికాలోని అలబామా రాష్ట్ర కోర్టు ఒకటి న్యూయార్క్‌ టైమ్స్‌ పత్రిక పరువు నష్టానికి పాల్పడిందని ఒక తీర్పు ఇచ్చింది. పత్రికలో ప్రచురించిన ఒక అడ్వర్టయిజ్‌మెంట్‌లో విద్యార్ధి పౌర హక్కుల కార్యకర్తల పట్ల అలబామా అధికార యంత్రాంగం అనుచితంగా ప్రవర్తించిందనే విమర్శ దానిలో వుంది. ఆ ప్రకటనలో కొన్ని అవాస్తవాలు వున్నప్పటికీ న్యూయార్క్‌ టైమ్స్‌ పత్రికకు అనుకూలంగా సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చింది.తెలిసి గానీ తెలియక గానీ వాస్తవానికి విరుద్దంగా ప్రచురించిన దాని వెనుక వున్న వాస్తవమైన దుర్బుద్ధి గురించి అధికార యంత్రాంగం సాక్ష్యాలు చూపాలని కోర్టు పేర్కొన్నది.

     బ్రిటన్‌లో మధ్య యుగాలలో పరువు నష్టాన్ని నేరపూరితమైనదిగా చేయటం ఆ నాటి పరిస్థితులలో దానిని ప్రజా ప్రయోజనాలకోసం అంటే ఆశ్చర్యం కలుగుతుంది. ఎవరైనా తమ పరువు తీశారని భావిస్తే ఆరోజులలో ఎదుటివారితో కత్తులు, తుపాకులతో అమీతుమీ తేల్చుకొనేవారు. ఇది మధ్యయుగం కాదు, పరస్పరం తలపడాల్సిన అవసరం లేదు. వ్యక్తిగతమైన పరువు నష్టం విషయంలో మాత్రమే దానిని నేరపూరితమైనదిగా చేశారు. అటువంటి వాటికి మొత్తం ప్రజానీకానికి సంబంధించిన చట్టాలను పరిష్కారంగా చేయటం ఏమిటన్నది కొందరి అభ్యంతరం. ఒక వ్యక్తికి వ్యతిరేకంగా మరొక వ్యక్తి చేసిన తప్పిదం మొత్తం సమాజానికి వ్యతిరేకంగా చేసిన తప్పిదం ఎలా అవుతుందన్నది ప్రశ్న. పరువు నష్టానికి సంబంధించి సివిల్‌ చట్టాలుండగా నేర చట్టాల వర్తింపు అవసరం ఏమిటని కూడా ప్రశ్నిస్తున్నారు.

    న్యూయార్క్‌ టైమ్స్‌ కేసులో అమెరికా సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పుకు దగ్గరగా మన సుప్రీం కోర్టు కూడా ఒక తీర్పు ఇచ్చింది. అయితే దానిని తాజా తీర్పు సందర్భంగా న్యాయమూర్తులు పరిగణనలోకి తీసుకోలేదన్నది ఒక సమాచారం. ఆ కేసు వివరాలు క్లుప్తంగా ఇలా వున్నాయి. చెన్నయ్‌ నుంచి ప్రచురితమయ్యే నక్కీరన్‌ వారపత్రిక తరఫున సంపాదకుడు, ముద్రాపకుడు, ప్రచురణకర్త, సహసంపాదకుడు కోర్టుకు ఎక్కటం విశేషం. అదే ఆర్‌ రాజగోపాల్‌-తమిళనాడు ప్రభుత్వం మధ్య నడిచిన కేసు.తమ పత్రికలో అచ్చవుతున్న సమాచారాన్ని నిలిపివేయకుండా తమిళనాడు ప్రభుత్వ అధికారులకు రాజ్యాంగం ఆర్టికల్‌ 32 ప్రకారం ఆదేశాలు జారీ చేయాలని నక్కీరన్‌ తరఫున పిటీషన్‌ దాఖలైంది.

     ఒక హత్య కేసులో శిక్ష అనుభవిస్తున్న అటో శంకర్‌ అనే ఖైదీ ఆత్మకధ ప్రచురణ నిలిపివేయాలని కోరుతూ తమిళనాడు జైళ్ల ఐజి 1994 జూన్‌ 15న తమకు వర్తమానం పంపారని అది తమ ప్రచురణలలో జోక్యం చేసుకోవటమే కనుక నిలువరిస్తూ ఆదేశాలు జారీ చేయాలని నక్కీరన్‌ పిటీషనర్లు కోరారు. అనేక మంది జైలు అధికారులతో తనకు సంబంధాలు వున్నాయని, తన నేరాలలో వారు కూడా భాగస్వాములే అన్న వర్ణనలు దానిలో వున్నాయి.ఆత్మకధను ఆటో శంకర్‌ తన భార్యకు ఇచ్చాడు. అది జైలు అధికారులకు కూడా తెలుసు. దానిని ప్రచురించాలని శంకర్‌ కోరాడు. భార్య దానిని నక్కీరన్‌ పత్రికలో ప్రచురణకు అందచేసింది. మూడు భాగాలు ప్రచురితమైన తరువాత శంకర్‌ ఆత్మకధలో పేర్కొన్న అంశాలు అవాస్తవాలని,ప్రచురించటం జైళ్ల నిబంధనలకు విరుద్దం గనుక తదుపరి ప్రచురణ నిలిపి వేయకపోతే చట్టపరమైన చర్య తీసుకుంటామని జైళ్ల ఐజి నక్కీరనన్‌ ప్రచురణ కర్తలకు తెలిపారు. దాంతో పర్యవసానాలకు భయపడిన పత్రికా నిర్వహకులు కోర్టును ఆశ్రయించారు.తమకు ప్రచురించే హక్కుందని వాదించారు.ఈ కేసులో ఖైదీ లేదా అతని భార్య ఈ కేసులో కక్షిదారులుగా లేకపోవటంతో ఖైదీ ఆత్మకధ రాయటంగానీ దానిని ప్రచురణకు అనుమతించటం గానీ జరగలేదనే భావనతో ఆ కేసును స్వీకరించింది. ఈ కేసులో ముందుకు అంశాలు క్లుప్తంగా ఇలా వున్నాయి. 1. ఈ దేశ నివాసి మరొక వ్యక్తి తన కధ లేదా జీవిత చరిత్రను రాయకుండా ఆపగలరా ? అనుమతి లేకుండా రాసిన రాత నివాసి యొక్కు గోప్యత హక్కును హరిస్తుందా ? మరొక నివాసి జీవితం, కార్యకలాపాల గురించి రాసిన అటువంటి అనుమతి లేని రాతలను ప్రచురించటం ఆర్టికల్‌ 19(1) ప్రకారం హామీ ఇచ్చిన పత్రికా స్వేచ్ఛకిందకు వస్తుందా ? వస్తే అది ఎంతవరకు, ఎటువంటి పరిస్థితులలో చేయవచ్చు? ఒక వేళ అటువంటి రాతలు గోప్యత హక్కుకు , పరువు నష్టం కలిగించేట్లయితే దానికి పరిష్కారాలు ఏమిటి ? 2.ప్రభుత్వం తన పరువు నష్టానికి చర్య కొనసాగించవచ్చునా ? తన అధికారుల పరువునకు భంగం కలిగించే సమాచారాన్ని ప్రచురించకుండా పత్రికలను నిరోధించేందుకు చట్టపరమైన అధికారం ప్రభుత్వానికి వున్నదా ? ప్రభుత్వ అధికారులు తాము లేదా తమ సహచరుల పరువు పోవచ్చనే కారణంతో అటువంటి రాతలను ప్రచురించకుండా పత్రికలపై ముందుగానే ఆంక్షలు విధించవచ్చా? 3. జైలులో బందీగా వున్న ఒక ఖైదీ చట్టపరంగా పరిష్కారాలను చూసుకోలేని స్ధితిలో అతని జీవిత కథ ప్రచురణ కాకుండా జైలు అధికారులు అడ్డుకోగలరా ? అతని తరఫున వారు వ్యవహరించవచ్చా ?

     ఈ పూర్వరంగంలో ఒక అంశాన్ని ప్రచురించకుండా ముందస్తుగా ఎవరూ నిరోధించలేరు, ఏదైనా పరువు నష్టం కలిగించే అంశాలుంటే ప్రచురణ తరువాత వాటిని సవాలు చేయాలి అని భావించి ఈ కేసుకు వర్తించే కొన్ని సాధారణ సూత్రాలను కోర్టు రూపొందించింది.1.ఈ దేశ వాసులకు రాజ్యాంగం ఆర్టికల్‌ 21లో హామీగా ఇచ్చిన జీవిత, స్వేచ్ఛా హక్కులలోనే గోప్యత హక్కు కూడా ఇమిడి వుంది. తమ మానాన తమను వదిలేయమనే హక్కు అది. ఒక నివాసి తన స్వంత గోప్యతను కాపాడుకొనే, తన కుటుంబం, వివాహం, సంతానం, మాతృత్వం, బిడ్డలను కనటం, విద్య వంటి ఇతర అంశాలలో ఆ నివాసి అనుమతి లేకుండా ఎవరూ ప్రచురించటానికి వీలమైనాలేదు. అది నిజమైనదైనా, అభినందించేది లేదా విమర్శనాత్మకమైనా ప్రచురించకూడదు. ఎవరైనా దానిని వుల్లంఘిస్తే ఒక వ్యక్తి గోప్యత హక్కును వుల్లంఘించినట్లే.నష్టపరిహారానికి అలాంటి వారిపై చర్యలు తీసుకోవచ్చు.అయితే ఒక వ్యక్తి స్వచ్చందంగా వివాదంలోకి దిగినా, వివాదాన్ని ఆహ్వానించినా అప్పుడు పరిస్ధితి భిన్నంగా వుంటుంది.2. పైన పేర్కొన్న నిబంధనకు మినహాయింపులు వున్నాయి. ప్రచురణలో పై అంశాలు అభ్యంతరం కానివి అయితే, అది బ హిరంగ రికార్డులను బట్టి రాసిదై వుండాలి. ఒక సారి ఈ అంశాలు బహిరంగ రికార్డులకు ఎక్కిన తరువాత ఇతరులతో పాటు పత్రికలు, మీడియాకు వాటిపై వ్యాఖ్యానించేందుకు చట్టబద్ద అంశం అవుతుంది. అయినప్పటికీ ఈ నిబంధన మర్యాద, యోగ్యతలకు లోబడే వుంటుంది. వుదాహరణకు ఒక మహిళ లైంగిక దాడి, అపహరణ, ఆటంకాల వంటి నేరాలలో బాధిత అయితే ఆ వుదంతాన్ని పత్రికలు, మీడియాలో ప్రచారం చేయటం ద్వారా ఆమె పేరుకు అప్రతిష్ట తీసుకురాకూడదు. ఈ కారణంగానే ఇలాంటి బాధితుల పేర్లు , వుదంతాల వివరాలు రాయకుండా నేరగాళ్ల పేర్లు మాత్రమే వెల్లడిస్తున్నారు.3.దీనికి మరొక మినహాయింపు కూడా వుంది, నిజానికి ఇది మినహాయింపు కంటే ఒక స్వతంత్ర నిబంధన. ప్రభుత్వ అధికారుల విషయానికి వస్తే గోప్యత హక్కు లేదా దానికి సంబంధించిన అంశాలలో నష్టం జరిగినపుడు పరిష్కరించేందుకు కేవలం వారి అధికారిక విధులు నిర్వర్తించటం ద్వారా మాత్రమే కుదరదు. వాస్తవం కాని అంశాలు, ప్రకటనలను ప్రచురించినప్పటికీ నిజం పట్ల మీడియా వారు నిర్లక్ష్యంగా వ్యవహరించారని అధికారులు రుజువులు చూపితే తప్ప కుదరదు. అటువంటి వుదంతంలో వాస్తవాలను సహేతుకమైన తనిఖీ తరువాతనే ప్రచురించినట్లు మీడియా వ్యక్తులు రుజువు చేసుకోవాల్సి వుంటుంది. రాసినది వాస్తవమే అని రుజువు చేయాల్సిన అవసరం లేదు. ప్రచురణ దుర్బుద్ధితో కూడినది లేదా వ్యక్తిగత ద్వేషంతో కూడినదని రుజువైతే ప్రచురణ కర్తలు సమర్ధించుకొనేందుకు ఏమీ వుండదని వేరే చెప్పనవసరం లేదు.

    రాజ్యాంగం సంక్రమింప చేసిన విధంగా కోర్టు ధిక్కరణకు పాల్పడితే శిక్షించే హక్కు కోర్టుకు, పార్లమెంట్‌, శాసనసభల హక్కులకు వ్యతిరేకంగా వ్యవహరిస్తే శిక్షించే హక్కు మాదిరి ఇతర ప్రభుత్వ సంస్థలకు లేదు. ప్రభుత్వ అధికారాలను వుపయోగిస్తున్న ప్రభుత్వం, స్ధానిక సంస్ధలు, ఇతర సంస్ధలు పరువు నష్టానికి దావాలను వేయజాలవు. ముందుగా ప్రచురణలను నిలిపివేసే అధికారం రాజ్యం దాని అధికారులకు అధికారమిచ్చే చట్టం లేదు. అందువలన ప్రభుత్వ రికార్డుల నుంచి తీసుకున్న సమాచారంతో కూడిన జీవిత చరిత్రను సంబంధిత వ్యక్తుల అనుమతితో నిమిత్తం లేకుండానే ప్రచురించటానికి ప్రచురణ కర్తలకు హక్కు వున్నదని కోర్టు తీర్పు చెప్పింది. ప్రభుత్వ రికార్డులలో వున్న దానికి మించి ప్రచురించినట్లయితే ఖైదీ గోప్యత హక్కులకు భంగం కలిగించినట్లే అవుతుంది.

   ఈ తీర్పు పర్యవసానాల విషయానికి వస్తే అధికారంలో వున్న వారు ముందుగా ఎంతో సంతోషిస్తారు. ఎందుకంటే ప్రతిపక్షంలో వున్న వారు ఎవరైనా అధికార పక్షానికి చెందిన వారిపై అవినీతి, ఇతర ఆరోపణలు చేయాలంటే ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోవాల్సి వుంటుంది. చేసిన ఆరోపణలకు తగిన ఆధారాలు చూపకుండా అవసరమైనపుడు చూపుతామని తప్పించుకుంటే కుదరదు.ఇది రాజకీయ పార్టీలు, వ్యక్తులకే కాదు మీడియాకు సైతం మెడమీద కత్తే అవుతుంది. అనేక మంది తమ పేరు బయటకు రాకుండా అనేక అంశాలను మీడియాకు తెలియచేస్తారు. వాటిని మీడియా అనధికారిక కధనాలు, వనరుల పేరుతో ప్రచురిస్తోంది. తాను సేకరించిన వార్తల వనరుల గురించి మీడియా వెల్లడించనవసరం లేదు, అయితే తాను ప్రచురించిన అంశాలు వాస్తవమే అని రుజువు చేసుకోవాల్సి వుంటుంది. ఇది ఒక్క అవినీతి ఆరోపణలు, ఆశ్రిత పక్షపాతం వంటివాటికే పరిమితం చేస్తారా ?

    బిజెపి, మజ్లిస్‌ వంటి వాటిని మతోన్మాద పార్టీలని రాజకీయ నాయకులు, మీడియా వ్యాఖ్యాతలు కూడా విమర్శిస్తున్నారు. కోర్టు ఖర్చులు తగ్గించుకొనేందుకు ఆ రెండు పార్టీలు వుమ్మడిగా ఒక లాయర్‌ను పెట్టి తమపై చేసిన విమర్శలను రుజువు చేయమని కేసులు వేస్తే పరిస్థితి ఏమిటి ? సాధుపుంగవుడిగా చెప్పబడే పార్లమెంట్‌ సభ్యుడు సాక్షి మహరాజ్‌ ఇటీవల ఒక మహిళ జీన్స్‌ బొత్తాలు విప్పితే అందరూ చూస్తుండగానే ఆమె ప్రయివేటు భాగాలు చూశారని వార్తలు వచ్చాయి. ఇక ముందు అలాంటి వార్తలను ప్రచురించటానికి, టీవీలలో చూపటానికి అవకాశం వుంటుందా ? ఈ తీర్పు పర్యవసానంగా ఆర్నాబ్‌ గోస్వామి వంటి యాంకర్లు ప్రతి రోజూ రాత్రి కాగానే జైలుకు పోవాల్సి వస్తుందని ఒక వ్యాఖ్యాత జోక్‌ వేశారు.

    ఇప్పటికే మీడియాపై దాడులు, వాటి ఆదాయ మూలాలను దెబ్బతీయటం ద్వారా తమ చేతులలో వుంచు కొనేందుకు అనేక శక్తులు పరోక్షంగా ప్రయత్నిస్తున్నాయి. వాటికి చట్టం కూడా మరొక ఆయుధంగా మారితే మరింత ప్రమాదం. రాబోయే రోజుల్లో అనేక పర్యవసానాలకు దారి తీసే సుప్రీం కోర్టు తీర్పు గురించి భావ ప్రకటనా స్వేచ్చను కోరుకొనే వారు, మీడియా నిపుణులు, జర్నలిస్టు సంఘాలు కూడా నిశితంగా అధ్యయనం చేసి అవసరమైతీ చట్టబద్దమైన పోరాటం చేయటానికి సిద్ధం కావాల్సి వుంది.

    ఈ వ్యాసం ఆంధ్రప్రదేశ్‌ వర్కింగ్‌ జర్నలిస్ట్స్‌ ఫెడరేషన్‌ ఆధ్వర్యాన వెలువడే ‘వర్కింగ్‌ జర్నలిస్టు సమాచార స్రవంతి’ మాస పత్రిక జూన్‌ సంచికలో ప్రచురణ నిమిత్తం రాసినది.