అమెరికా వుచ్చులోకి దేశాన్ని నెడుతున్న నరేంద్రమోడీ ప్రమాదకర క్రీడ
సత్య
అమెరికాతోనూ, వుగ్రవాదులతో జట్టు కట్టి బాగుపడిన దేశం గానీ, ముప్పును తప్పించుకున్న నేతలు గానీ అరుదుగా కనిపిస్తారు. అకాలీదళ్‌ను దెబ్బతీసేందుకు భింద్రన్ వాలే అనే ఖలిస్తాన్ వుగ్రవాదిని పెంచి పెద్ద చేసి ఇందిరా గాంధీ, ఒక దశలో తమిళ ఎల్‌టిటియి వుగ్రవాదులకు ఆయుధాలు ఇచ్చి తరువాత మారిన పరిస్థితుల్లో వారిని అణచివేతకు సైన్యాన్ని పంపి రాజివ్ గాంధీ వారి చేతుల్లోనే బలైన వుదంతం మన కళ్ల ముందే జరిగింది. తాలిబాన్లను తయారు చేసి చివరకు వారి చేతుల్లో చావు దెబ్బలు తిని ఆఫ్ఘనిస్తాన్ నుంచి సేనలను వుపసంహరించుకున్న అమెరికా నిర్వాకాన్ని చూశాము. ఇంత జరిగాక వాటి నుంచి గుణపాఠాలేమీ తీసుకోకుండా నరేంద్రమోడీ సరికొత్త ప్రమాదకర క్రీడ మొదలు పెట్టారు. ఇప్పటివరకు మన దేశం అనుసరించిన విదేశాంగ విధానానికి భిన్నంగా స్నేహ సంబంధాలను మెరుగుపరుచుకోవటం లేదా ఏర్పరుచుకోవటానికి బదులు ఇరుగు పొరుగు దేశాలతో గిల్లి కజ్ఞాలకు దిగి కొత్త ప్రమాదాలను కొని తెచ్చుకొనే విధంగా ఎన్‌డిఏకు మార్గదర్శకత్వం వహిస్తున్న ఆర్ఎస్ఎస్ దేశాన్ని ప్రమాదకర స్ధితిలోకి నెడుతోంది.
కేంద్రంలోని నరేంద్రమోడీ సర్కార్ ఆప్ఘనిస్తాన్‌కు ఒక బిలియన్ డాలర్ల సాయం చేయటానికి నిర్ణయించుకకుంది. ఆ దేశ అధ్యక్షుడు అష్రాఫ్ ఘనీ న్యూఢిల్లీ పర్యటన సందర్బంగా ఆ మొత్తాన్ని ప్రకటించారు .అందుకు గాను వెంటనే అమెరికా సర్కార్ మోడీ ప్రభుత్వాన్ని పొగడ్తల వరదలో ముంచెత్తింది. సాయం ప్రకటించింది మన దేశం, లబ్ది పొందేది ఆఫ్ఘనిస్తాన్. మధ్యలో అమెరికా పొగడ్తలు ఎందుకు ? వాటిని చూసి మీడియాలోని మోడీ భక్తులు కొందరికి ఒంటి మీద బట్టలు ఎందుకు నిలవటం లేదు. అష్రాఫ్ మన దేశ పర్యటనకు ముందు తాలిబాన్లు ఒక ప్రకటన చేస్తూ తమను అణచేందుకు ఆఫ్ఘన్ ప్రభుత్వానికి భారత్ మిలిటరీ సాయం అందచేస్తున్నదని దానిని నిలిపివేయాలని వినతితో కూడిన హెచ్చరిక చేశారు.
మన అవసరాల కోసం మనమే ప్రపంచబ్యాంకు, అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్ధ, ఎవరిస్తామంటే వారి దగ్గర అందిన కాడికి అప్పు చేస్తున్నాం కదా ? అటువంటపుడు మనం మరొక దేశానికి సాయం చేయటం ఏమిటి ? మనమే విదేశాల నుంచి మిలిటరీ ఆయుధాలు కొంటున్నాం కదా వాటిలో కొన్నింటిని ఆఫ్ఘనిస్తాన్‌కు ఇవ్వటం ఏమిటి ? ఈ ఏడాది మార్చి నెలాఖరుకు మన విదేశీ అప్పు 485.6 బిలియన్ డాలర్లు. దానిలోంచి లేదా మనం చేయి చాపి తెచ్చుకున్న మొత్తంలోంచి ఒక బిలియన్ డాలర్లు ఆఫ్ఘనిస్తాన్‌కు సాయంగా ఇస్తున్నాం. అంటే దాదాపు ప్రతి ఒక్కరం తలకు 60 రూపాయల చొప్పున విరాళం ఇస్తున్నట్లు. తాజా వందకోట్లతో కలిసి ఇంతవరకు మొత్తం సాయం 200 కోట్ల డాలర్లకు చేరుకోనుంది. ప్రజల జీవన ప్రమాణాలు మెరుగు పడటానికి, విద్య, వైద్య సాయం అందించటానికి అవసరమైన సాయం ఏ దేశానికి అందించినా ఎవరూ తప్పు పట్టరు. అయితే ఎక్కడో స్విచ్ వేస్తే మరెక్కడో లైట్ వెలిగినట్లు ఇలాంటి సాయాలను ఏ దేశం కూడా చివరికి చైనా వంటి సోషలిస్టు దేశాలు సైతం వుత్తి పుణ్యానికే చేయవు. ఏదో ఒక ప్రతిఫలం ఇంకా చెప్పాలంటే తనకు అవసరమైన వాటి కోసమో లేదా తన దగ్గరవున్న వస్తువులకు మార్కెట్ కోసమో, రాజకీయ ప్రయోజనం కోసమో ఏదో ఒక లక్ష్యం లేకుండా వుండదు. ఆప్ఘనిస్తాన్‌తో మనకు సరిహద్దు సంబంధాలు లేవు, పొరుగు దేశం కాదు, మధ్యలో పాకిస్తాన్ వుంది.ఈ నేపధ్యంలో మోడీ సర్కార్ ఆర్ధిక సాయానికే పరిమితం కాకుండా మిలిటరీ ఆయుధాలు ఎందుకు అందిస్తున్నట్లు ? ఎవరికైనా సందేహం కలగక తప్పదు. పోనీ ఆర్ధిక, మిలిటరీ సాయం అందించటం ద్వారా మనం ఆశిస్తున్న ప్రయోజనాలేమిటి ? మన్‌కీ బాత్‌తో సహా ఎక్కడా మనకు చెప్పలేదు.
మన దేశం గురించి చెప్పుకోవాలంటే గత రెండు దశాబ్దాలుగా చైనా తరువాత అత్యధిక సగటు వృద్ధి రేటుతో ముందుకు పోతున్న ఏకైక దేశం. అభివృద్ధి ఫలం అంతా కొద్ది మంది బిలియనీర్ల చేతుల్లోకి పోతున్నది. గత పది సంవత్సరాలలో ప్రపంచంలో బిలియనీర్లు సగటున 68శాతం వృద్ధి చెందితే మన దేశంలో 330 శాతం వుంది. ఇంత వేగంగా కొంత మంది చేతుల్లోకి డబ్బు చేరుతున్నది కనుకనే వారిని చూసి ప్రతివారూ ఏదో విధంగా తాము కూడా ఇలా చూసి అలా తిరిగే లోపల కోటీశ్వరులు కావాలనుకుంటున్నారు. మన దగ్గర అణ్వాయుధాలున్నాయి వాటిని వుపయోగించలేము కనుక ఇతర ఆయుధాలను విదేశాల నుంచి కొనుగోలు చేస్తున్నాము. అంతరిక్ష రంగంలో కూడా అనేక విజయాలు సాధించాము. పెద్ద మిలిటరీ, వైమానిక దళం వుంది. అయినా ధనిక దేశాల ముందు చేయి చాపుతున్నాం, మనకు వచ్చిన మొత్తంలో లేదా అప్పు చేసి కొంత మొత్తాన్ని మన దగ్గర చేయి చాచే వారికి ఇస్తున్నామన్న విషయం ‘నయా దేశ భక్తులతో’ సహా కొంత మందికి మింగుడు పడకపోవచ్చు. ప్రపంచబ్యాంకు సమాచారం ప్రకారం 2011లో మన దేశం చేయి చాస్తున్న వరుసలో ఆరవ స్ధానంలో వున్నాం. మనం 2011లో 3.2, 2012లో 1.6, 2013లో 2.4 బిలియన్ డాలర్లు తీసుకున్నాంhttps://thelogicalindian.com/story-feed/exclusive/know-everything-about-how-much-india-receives-and-donates-foreign-aid/ మన కంటే దరిద్రపు దేశాలకు ఇచ్చేందుకు 2015-16లో మన బడ్జెట్లో 1.6 బిలియన్ డాలర్లు కేటాయించాం.మనం చేస్తున్న సాయంలో భూటాన్‌కు గణనీయ మొత్తం ఇచ్చాం. ముందే చెప్పుకున్నట్లు ఎలాంటి ప్రయోజనం లేకుండా కాదు సుమా ! మన సాయంతో వారు హిమాలయ పర్వత ప్రాంతాలలో జల విద్యుత్ ప్రాజెక్టులు నిర్మిస్తారు, 2020 నాటికి మన దేశం వారి నుంచి పదివేల మెగావాట్ల విద్యుత్ కొనుగోలు చేసేందుకు ఒప్పందం చేసుకున్నాం. భూటాన్ నుంచి విద్యుత్ తెచ్చుకుంటున్నాం, తెచ్చుకుంటాం మరి ఆప్ఘనిస్తాన్ నుంచి మోడీగారు ఏం తెస్తారు ? వుగ్రవాదాన్ని, తాలిబాన్లనా ?
ఆఫ్ఘనిస్తాన్ అంటే చాలా మందికి తెలిసినట్లు వుండి వివరాలు లోతుగా తెలియని దేశం. రాబందులు ఆకాశంలో తిరుగుతుంటాయి, ఎక్కడ కళేబరం కనిపిస్తే అక్కడ వాలి పోతాయి. ప్రపంచంలో మిలిటరీ, ఆర్ధిక, రాజకీయంగా కీలక ప్రాంతాలుగా వున్న వాటిని తమ ఆధీనం చేసుకొనేందుకు అమెరికా సామ్రాజ్యవాదులు కూడా నిత్యం అలాగే ప్రయత్నిస్తుంటారు. అలాంటి వాటిలో ఒకటైన ఆఫ్ఘనిస్తాన్‌లో పాగావేసేందుకు పూనుకున్న సమయంలో దానిని పసిగట్టిన మిలిటరీలోని అభ్యుదయ వాదులైన అధికారులు తిరుగుబాటు చేసి దేశాధికారాన్ని స్వాధీనం చేసుకున్నారు. ి పొరుగునే వున్న నాటి సోవియట్ యూనియన్ మద్దతు ఇవ్వటమే కాదు, ఆ ప్రభుత్వాన్ని నిలబెట్టేందుకు, దానిని కూల్చేందుకు ప్రయత్నిస్తున్న శక్తులను అణచివేసేందుకు వారి ఆహ్వానం మేరకు మిలిటరీ సాయాన్ని కూడా పంపింది. ఆ ప్రభుత్వాన్ని కూల్చి వేసే కుట్రలో భాగంగానే అధికారంలో వున్న వారిని కమ్యూనిస్టులని ప్రచారం చేశారు. అయితే మిలిటరీ అధికారులు కమ్యూనిజం పట్ల అభిమానం వున్నవారు నుక తాము కమ్యూనిస్టులం కాదని ఖండించలేదు. కమ్యూనిస్టుల కారణంగా ఇస్లాం మతానికి ముప్పు ఏర్పడింది, దానిని కాపాడుకోవాలంటే తాలిబాన్లుగా మారి ఆయుధాలు పట్టుకొని ప్రభుత్వాన్ని కూల్చివేయాలని అమెరికన్లు ఒక పధకం ప్రకారం రెచ్చగొట్టారు. అందుకు పక్కనే వున్న పాకిస్థాన్‌కు అలాంటి వారిని తరలించి అన్ని రకాలుగా శిక్షణ ఇచ్చి సాయుధులను చేసి పంపారు. ఆఫ్ఘనిస్తాన్‌లో తాలిబాన్ల ముసుగులో తిష్ట వేయటానికి అమెరికా పూనుకుందన్న విషయం గ్రహించగానే మరో పొరుగు దేశం ఇరాన్ కూడా తన మద్దతుదారులను అక్కడ వుంచేందుకు అది కూడా తాలిబాన్లను తయారు చేసింది. మొత్తం మీద వారూ వీరూ తయారు చేసిన వారు అక్కడి వామపక్ష ప్రభుత్వానికి, వారికి సాయంగా వచ్చిన సోవియట్ సేనల మీద దాడులు, వత్తిడి తెచ్చి చివరకు వుపసంహరించుకొనే విధంగా, వామపక్ష ప్రభుత్వాన్ని కూలదోయటంలో జయప్రదం అయ్యారు. తరువాత ఆ తాలిబాన్లే అమెరికా, పాకిస్థాన్‌కు ఏకు మేకయ్యారు. వారిని నాశనం చేయటానికి అమెరికా సైన్యాన్ని దించి చావు దెబ్బలు తిన్నది, దేశాన్ని సర్వనాశనం చేసింది, చివరకు తాలిబాన్లను అదుపు చేయలేక ఒక తొత్తు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి తన సేనలను వుపసంహరించుకుంది. వుగ్రవాదులను గానీ, మరొక సంఘవ్యతిరేక శక్తుల అణచివేత గానీ ఆయా దేశాల అంతర్గత వ్యవహారం మాత్రమే. పొరుగువారు వెళ్లి ఆ పని చేయటం తగని పని. తమకు హాని చేసే వుగ్రవాదాన్ని రూపుమాపే శక్తి ఆ సమాజాలకు అంతర్గతంగానే వుంటుంది. కానీ అమెరికా ఆ పేరుతో అనేక దేశాలలో జోక్యం చేసుకొంటోంది, చావు దెబ్బలు తింటోంది. ఇప్పుడు వుగ్రవాద వ్యతిరేక పోరు, ఆప్ఘనిస్తాన్ పునరుద్దరణ పేరుతో అక్కడే తిష్టవేసింది. తాలిబాన్లను అణచివేసేందుకు తమతో పాటు ఇతర దేశాలు కూడా అన్ని రకాలుగా భాగం పంచుకోవాలని వత్తిడి తెస్తూ తన భారాన్ని తగ్గించుకుంటున్నది. ఆ వుచ్చులోకి భారత్‌ను లాగుతున్నది. నరేంద్రమోడీ సర్కార్ ఎలాంటి ముందు వెనుకలు చూడకుండా ఆ బాటలో ముందుకు పోతున్నది.
ఆప్ఘనిస్తాన్‌ను అన్ని విధాలుగా నాశనం చేసింది అమెరికా, తామరతంపరగా తాలిబాన్లను సృష్టించి ప్రపంచంలో అనేక దేశాలకు వారిని ఎగుమతి చేసింది అమెరికా, గతంలో దేశ భక్తులుగా ప్రచారం చేసిన వారిని ఇప్పుడు టెర్రరిస్టులుగా చిత్రిస్తూ వారిపై పోరు, అభివృద్ధి పేరుతో జరిగే ఖర్చును ప్రపంచ దేశాలన్నీ పంచుకోవాలని వత్తిడి తెస్తోంది అమెరికా. గతంలో మన్మోహన్ సింగ్ ప్రభుత్వం తాలిబాన్ల చేతిలో నాశనమైన పార్లమెంట్ భవనాన్ని నిర్మించేందుకు అంగీకరించి నిర్మించింది. దానిని నరేంద్రమోడీ తన చేతుల మీదుగా ప్రారంభించారు. ఇప్పుడు మరొక వంద కోట్ల డాలర్ల సాయం ప్రకటించారు. ఇది కాకుండా ఇప్పటికే రష్యా తయారీ ఎంఐ-25 గన్‌షిప్ హెలికాప్టర్లను మూడింటిని పంపారు. మరొకదానిని పంపనున్నారు. తమకు మరిన్ని మారణాయుధాలు,ఎంఐ-35 గన్‌షిప్ హెలికాప్టర్లు కూడా కావాలని అక్కడి ప్రభుత్వం కోరుతున్నది. ఇలా ఆయుధాలు ఇవ్వటం ఇప్పటివరకు అనుసరిస్తున్న విదేశాంగ విధానానికి భిన్నం. అమెరికా ఆదేశాల మేరకు తాలిబాన్లను తయారు చేసిన పాకిస్తాన్ తరువాత కాలంలో అమెరికా ఆదేశాల మేరకు ఆ తాలిబాన్లనే అణచివేయటం ప్రారంభించింది. తమ దేశంలో తలదాచుకున్న ఒసామాబిన్ లాడెన్‌ను హతమార్చటానికి అమెరికాకు తోడ్పడిన విషయం తెలిసిందే. ఈ కారణంగా ఇప్పుడు ఐఎస్ వుగ్రవాదులు, తాలిబాన్లు కలిసి పాకిస్థాన్‌పై దాదాపు ప్రతి రోజూ దాడులు చేస్తున్నారు.దానికి తోడు ఆఫ్ఘన్లో ఎప్పుడేం జరుగుతుందో తెలియని స్ధితి. చాలా ప్రాంతాలపై ప్రభుత్వానికి అదుపు లేదు. తాలిబాన్లదే పెత్తనం. తెగల వారీ ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్కరిది ఆధిపత్యం. కాబూల్ గద్దెపై ఎవరుంటే ఆ తెగవారు చూసీ చూడనట్లు వుంటారు తప్ప మిగతావారు శత్రువులే. తమ అణచివేతకు తోడ్పడుతున్న పశ్చిమ దేశాలలో తాలిబాన్లు, ఐఎస్ తీవ్రవాదులు దాడులకు పాల్పడటాన్ని చూస్తున్నాము. ఇప్పటికే పాక్ ప్రేరేపిత వుగ్రవాదులతో నిత్యం కాశ్మీర్ రావణకాష్టంలా మండుతున్నది. ఇప్పుడు తాలిబాన్ -ఐఎస్ తీవ్రవాదులను కూడా మోడీ సర్కార్ ఆహ్వానించేందుకు పూనుకున్నట్లు కనిపిస్తున్నది. మనదైన స్వతంత్ర విదేశాంగ విధానం మనకు వుండాలి తప్ప మరొక దేశం అది అమెరికా లేదా మరేదైనా దాని ప్రయోజనాలకు, ఎత్తుగడలకు అనుగుణంగా వుంటే నష్టపోయేది మనమే. ఇప్పటికైనా మించి పోయింది లేదు. మేలుకోవటం మంచిది. మొండిగా వ్యవహరిస్తే జరిగే పరిణామాలకు ఎన్డిఏదే బాధ్యత అవుతుంది.
చైనా ప్రభుత్వం సాయం చేస్తున్నదంటే అది ప్రభుత్వ రంగ కంపెనీలకు ఆర్డర్లు సంపాదించుకుంటున్నది. దాని ద్వారా వచ్చే లాభం, ప్రయోజనం ప్రజలకు చెందుతుంది. బిల్ గేట్స్ వంటి కార్పొరేట్లు అంద చేసే సాయం వారి కంపెనీలకు ఆర్డర్లకోసం వుపయోగపడుతుంది. అమెరికా,జపాన్, బ్రిటన్ ప్రభుత్వాలు చేసే సాయం ఆ దేశాలలోని కార్పొరేట్ కంపెనీల ప్రయోజనాలకు లంకె వుంటుంది. నరేంద్రమోడీ సర్కార్ వున్న ప్రభుత్వ రంగ సంస్ధలను తెగనమ్మటం లేదా మూసివేతలకు పూనుకుంది. పెట్టుబడులు పెడుతున్నది ప్రయివేటు కార్పొరేట్ కంపెనీలే అంటే సాయం పేరుతో ఏటా బడ్జెట్ నుంచి కేటాయించే 160 కోట్ల డాలర్ల సాయంలో ఎక్కువ విదేశాలలో పెట్టుబడులు పెట్టే భారతీయ కార్పొరేట్లకు అందచేస్తున్న సబ్సిడీ అవుతుంది తప్ప మరొకటి కాదు. మన జనానికి సబ్సిడీలలో కోత, కార్పొరేట్లకు మోత !