Tags

, , , , , , ,

Image result for gandhi

ఎం కోటేశ్వరరావు

మనిషిని కుక్క కరవటం సాధారణం, మనిషి కుక్కను కరవటమే వార్త అన్నది పాత చింతకాయ పచ్చడి. అధ్యక్షులు, ప్రధానులు, ఛాన్సలర్‌లు ఇలా ఏ పేరుతో వున్నా వారు అబద్దాలు చెప్పటం సాధారణం, ఎన్ని నిజాలు చెప్పారన్నదే వార్త అన్నది కొత్త చింతకాయ పచ్చడి. ఏప్రిల్‌ 29వరకు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ పదివేలకు పైగా అబద్దాలు చెప్పారని వాషింగ్టన్‌ పోస్టు ఫాక్ట్‌ చెక్కర్‌( వాస్తవాలు, అవాస్తవాలను కనుకొనే వ్యవస్ధ) వెల్లడించింది. ట్రంప్‌ అధికారంలో వున్న 827రోజుల్లో ఈ రికార్డు నెలకొల్పారు. ఆయన పదవీకాలం నాలుగు సంవత్సరాలు పూర్తయ్యే సరికి ఆ సంఖ్య ఇరవై వేలకు చేరుతుందా, పాతికవేలు అవుతుందా అన్నది ఇప్పుడు అసలైన వార్తగా మీడియాలో విశ్లేషిస్తున్నారు. ఏప్రిల్‌ 25-27 తేదీల మధ్య అంటే మూడు రోజుల్లో ట్రంప్‌ మహాశయుడు 171 అబద్దాలు లేదా వక్రీకరణలకు గానీ పాల్పడ్డారట. రోజుకు 57 అబద్దాలు చెప్పటం అంటే సామాన్యులకు సాధ్యమయ్యేది కాదు, ఇదొక రికార్డు. మరి మన దేశంలో ఇలా అబద్దాలు చెప్పేవారిని కనుక్కొనే వ్యవస్ధలను ఒక్క బడాపత్రిక లేదా ఛానల్‌ కూడా ఎందుకు ఏర్పాటు చేయలేదు? పాకేజీలు ఆగిపోతాయనా ? ఏమో !

అబద్దాలు, వక్రీకరణలు, తప్పుడు సమాచారాన్ని వ్యాపింప చేయటం నిత్యజీవితంలో ఒక భాగమైంది. సామాజిక మాధ్యమాల్లో నేను సైతం ఫేస్‌బుక్కుకు, ట్విటర్‌కు ఫేక్‌ పోస్టును సమకూర్చాను అన్నట్లుగా పరిస్ధితి వుంది. అబద్దాల కోరు ట్రంప్‌కు అడుగులకు మడుగులొత్తటం, కౌగిలింతల దౌత్యం, మమేకం అయ్యే వారికి ట్రంప్‌ లక్షణాలు అబ్బకుండా ఎలా వుంటాయి. మనలోని అసహ్యాన్ని, దుష్టాలోచనలను కనిపించకుండా వేసుకొనేది ముసుగు. అది పలు రూపాలు, వ్యక్తీకరణలు, ఇతరత్రా వుంటుంది. కొన్ని శరీరాల నుంచి వెలువడే దుర్గంధం, చెడువాసనల నుంచి ఇతరులను రక్షించేందుకే అత్తర్లను తయారు చేశారని కొంత మంది చెబుతారు. భారతీయ సంస్కృతికి, నాగరికతకు వారసురాలు అని స్వయంగా మన ప్రధాని నరేంద్రమోడీ నుంచి ప్రశంసలు అందుకున్న ప్రజ్ఞా ఠాకూర్‌ మహాత్మా గాంధీ హంతకుడు గాడ్సే గొప్ప దేశభక్తుడు అని సెలవిచ్చారు. మహాత్మాగాంధీని హత్య చేసిన గాడ్సే దేశంలో తొలి వుగ్రవాది, అతను హిందువు అని ప్రముఖ చలన చిత్ర నటుడు కమల్‌ హాసన్‌ చేసిన వ్యాఖ్యలకు ప్రతిగా ఒక వుగ్రవాద కేసులో నిందితురాలిగా వుండి, అసత్యాలతో బెయిలు మీద బయటకు వచ్చి, బిజెపి అభ్యర్ధిగా రాజకీయ రంగ ప్రవేశం చేసిన ‘యోగిని’ ప్రజ్ఞ తీసిన దెబ్బకు దెబ్బ అది. ఆమె మీద కేసు తేలేంత వరకు యోగిని ముసుగు వేసుకున్న మహిళ అంటే తప్పు లేదు. అయితే డేరాబాబా, ఆశారాంబాపు వంటి హంతకులు, అత్యాచారాలకు పాల్పడిన వారికి శిక్షలు పడేంతవరకు వారి మీద మాటపడనివ్వలేదు సరికదా వారితో అంటకాగారు బిజెపి వారు అని గుర్తు చేయటం అవసరం. ప్రజ్ఞ ఠాకూర్‌ నోటి నుంచి వెలువడిన దుర్గంధాన్ని కప్పి పుచ్చేందుకు బిజెపి క్షమాపణ అనే అత్తరు పూసింది.దుర్గంధం సహజలక్షణం, అత్తరు తాత్కాలికం, మళ్లీ మళ్లీ పూసుకుంటే తప్ప ఫలితం లేదు. ఆమె అత్తరు పూసుకున్నప్పటికీ నేను ఆమెను ఎప్పటికీ క్షమించను అన్న నరేంద్రమోడీ అతిశయోక్తి అలంకార ప్రయోగాన్ని చూసి నవరసాల నటుడు కమల్‌ హసనే కాదు, యావత్తు దేశ, ప్రపంచ సినీ రంగం తమకు 56అంగుళాల ఛాతీ గలిగిన కథ, స్క్రీన్‌ప్లే, సంగీతం, గాయకుడు, దర్శకుడు, నటుడు ఒకే వ్యక్తిలో దొరికారని సంతోషించక తప్పదు. మరో విధంగా చెప్పాలంటే నరేంద్రమోడీ రెండింటికీ చెడ్డ రేవడి అయ్యారు.ఆయన చేసిన ప్రకటనను మిగతా వారే కాదు మోడీ భక్తులు కూడా నమ్మరని వేరే చెప్పనవసరం లేదు.ఒక మనిషి ప్రయాణం ఎక్కడ ప్రారంభమైనా అంతిమంగా ఎక్కడ ముగిసింది అనేది ముఖ్యం. వినాయక దామోదర సావర్కర్‌ అందరు యువకుల మాదిరే స్వాతంత్య్ర వుద్యమంలోకి వచ్చారు. అండమాన్‌ జైలుకు పంపగానే పిరికిబారి అనేక మంది మాదిరే బ్రిటీష్‌ వారికి లొంగిపోయారు, లేఖల మీద లేఖలు రాశారు, చివరికి తెల్లవారి దయాదాక్షిణ్యాలతో బయట పడ్డారు. అలాంటి వ్యక్తినే దేశభక్తుడు అని కీర్తిస్తున్నవారు, గాడ్సేను దేశభక్తుడు అనటంలో ఆశ్చర్యం ఏముంది? జనానికి మతిమరుపు ఎక్కువ అని జర్మన్‌ నాజీ గోబెల్స్‌ ఎప్పుడో నిరూపించారు. ఆయనను అనుసరించేవారు వేరే దారిలో ఎలా నడుస్తారు?

Image result for gandhi godse

రాజకీయాల్లోకి వచ్చిన కమల్‌హసన్‌ రాబోయే రోజుల్లో ఏం చేస్తారో తెలియదు గానీ ఇప్పటి వరకైతే గాడ్సే గురించి వ్యాఖ్యానించి ఎవరెటువైపు వుంటారో తేల్చుకోవాల్సిన సవాలును మన జాతి ముందుంచారు. ఇప్పుడు సమస్య గాంధీ కాదు, గాడ్సే అయ్యారంటే అతిశయోక్తి కాదు. మహాత్మాగాంధీ, ఆయన సిద్ధాంతాలు, ఆచరణ గురించి గతంలోనే చర్చ జరిగింది. తొలుత ఆయనను అనుసరించిన ఇఎంఎస్‌ నంబూద్రిపాద్‌ వంటి వారు తరువాత కమ్యూనిస్టులయ్యారు. ఆయన ఆశయాలనే పాటిస్తున్నామని చెప్పేవారు ఇప్పుడెక్కడ వున్నారో చూస్తున్నాము. స్వాతంత్య్రవుద్యమంలో ఆయనతో విబేధించిన వారు సైతం ఆయనను జాతి పితగా, మహాత్ముడిగా పిలవటాన్ని ఎన్నడూ వ్యతిరేకించలేదు, ప్రశ్నించలేదు. స్వాతంత్య్రం వుద్యమంలో ఆయనతో కొంత కాలం నడచిన కొందరు వ్యక్తులు లేదా నడచినట్లు చెప్పుకొనే వారు, దూరంగా వున్నవారు తరువాత కాలంలో హిందూత్వవాదులుగా మారారు. స్వాతంత్య్ర వుద్యమంలో ఆయన పాత్రను సవాలు చేశారు, చేస్తున్నారు. ఆయన మహాత్ముడని ఎవరు చెప్పారు, జాతి పిత ఎలా అయ్యారు అని ప్రశ్నిస్తూనే వున్నారు. వినాయక్‌ దామోదర్‌ సావర్కర్‌ను సంఘీయులందరూ ‘వీర’ బిరుదుతో కలిపి పిలుస్తారు. వారు తగిలించటం తప్ప ఆ బిరుదును ఎవరిచ్చారో చెప్పమనండి. సదరు సావర్కర్‌ వేరే పేరుతో తన చరిత్రను తానే రాసుకొని దానిలో తన వీరత్వం గురించి కూడా జోడించారు. అంటే స్వంతడబ్బా కొట్టుకున్నారు. మహాత్మా గాంధీ ఎక్కడా ఆ స్ధాయికి దిగజారలేదు. మహాత్ముడిని హతమార్చిన వాడిని దేశభక్తుడు అంటూ అధికార పార్టీ ప్రసిద్ధ వ్యక్తి ప్రజ్ఞా ఠాకూర్‌ వ్యాఖ్యానించారు.ఆమెను సమర్ధిస్తూ ట్వీట్లు, ఫేస్‌బుక్‌లో వ్యాఖ్యలు చేస్తున్న వారందరూ చౌకీదార్‌ నామం తగిలించుకున్న నరేంద్రమోడీ అనుయాయులే. వారందరి చేత బిజెపి లేదా దానికి మార్గదర్శనం చేస్తున్నామని చెప్పుకొనే సంఘపరివారం, నరేంద్రమోడీ క్షమాపణ చెప్పిస్తారా, చెప్పినా వారిని కూడా క్షమించనని నరేంద్రమోడీ అంటారా ? బంతి ఆయన కోర్టులోనే వుంది. ఐదేండ్లలో ఒక్కసారి కూడా విలేకర్ల సమావేశంలో మాట్లాడేందుకు ధైర్యం చేయని వ్యక్తి, ఐదేండ్ల గడువు ముగిసేలోగా అమిత్‌ షా పత్రికా గోష్టిలో ప్రధాని నరేంద్రమోడీ కూడా పాల్గొన్నారు స్ధాయికి దిగిపోయారు. ప్రతమూ చెడింది, ఫలితమూ రాలేదు. మరోసారి ఆలిండియా రేడియోలో మనసులోని మాట చెప్పేందుకు అవకాశం వుంటుందో తెలియదు, ఎలా వెల్లడిస్తారనేది ఆయనకే వదిలేద్దాం !

ఆర్‌ఎస్‌ఎస్‌ సభ్యులుగా లేదా దాని ప్రభావానికి లోనైన వారి విశ్వసనీయత ఎల్లవేళలా ప్రశ్నార్దకమే. వారు ముసుగు మనుషులు. వారు చెప్పే ఆదర్శాలు, అందుకు విరుద్దమైన ఆచరణే దానికి నిదర్శనం. ఇలాంటి వారి తీరు, తెన్ను మనకు ఇటలీ,జర్మనీలోని ఫాసిస్టులు, నాజీల్లోనూ వారి బాటలో నడిచే నియంతల్లో మాత్రమే కనిపిస్తుంది. బిజెపిలో వాజ్‌పేయి ఒక ముసుగు వంటి వారు, నిజమైన నేత అద్వానీయే అని ఆర్‌ఎస్‌ఎస్‌ ప్రముఖుడు గోవిందాచార్య మన్‌కీ బాత్‌లో వెల్లడించిన విషయం తెలిసిందే. ఒక ఆర్‌ఎస్‌ఎస్‌ నేతవై వుండి కూడా నిజాలు చెబుతావా నీకెంత ధైర్యం అన్నట్లుగా సదరు ఆచార్యను పక్కన పెట్టిన విషయం తెలిసిందే. గాడ్సేను దేశభక్తుడని ప్రజ్ఞ వ్యాఖ్యానించటంలో ఆశ్చర్యం లేదు. మహాత్ముడి హత్య కుట్రలో భాగస్వామి అని తీవ్ర విమర్శలు వచ్చిన, శిక్ష పడకుండా కేసునుంచి తప్పించుకున్న విడి సావర్కర్‌ను నరేంద్రమోడీ స్వయంగా దేశభక్తుడు అని కితాబిచ్చారు. ఆ సావర్కర్‌ స్వాతంత్య్ర సమర కార్యకర్తగా అండమాన్‌ జైలుకు వెళ్లి అక్కడ వుండలేక బ్రిటీష్‌ సర్కార్‌కు లేఖలు రాసి తాను ప్రభుత్వానికి విధేయుడనై వుంటాను, సహకరిస్తాను అని లొంగిపోయిన పిరికి పందగా జైలు నుంచి బయటకు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే దానికి సంఘపరివార్‌ పెద్దలు ఏమి చెబుతారంటే ఒక ఎత్తుగడగా అలా లేఖలు రాశారు తప్ప ఆయన లొంగలేదు అంటారు. అంటే సావర్కర్‌ ఒక ముసుగు వేసుకున్నట్లు ఆయన శిష్యులే అంగీకరించటం. లేదా శిష్యులే ఆయనకు ఆ ముసుగు వేశారని అనుకోవాలి. ఆ పెద్దమనిషి వేసుకోవటం ఏమిటి ఆర్‌ఎస్‌ఎస్‌ స్వయంగా తమకు రాజకీయాలతో సంబంధం లేదు, రాజకీయాలకు పాల్పడం, తమది సాంస్కృతిక సంస్ధ అని ఒక అఫిడవిట్‌ను కేంద్ర ప్రభుత్వానికి సమర్పించి తమ మీద వున్న నిషేధాన్ని ఎత్తివేయించుకుంది. ఇది దేశ చరిత్రలో అతి పెద్ద ముసుగు.గత ఏడు దశాబ్దాలుగా దాని వెనుక అది ఎన్ని రాజకీయాలు నడిపిందో, ఏమి చేసిందో, ఎలాంటి శక్తులను సృష్టించి దేశం మీదకు వదలిందో, అనేక మతకల్లోలాలు, గుజరాత్‌ మారణకాండ, బాబరీ మసీదు కూల్చివేత, అనంతర పరిణామాల్లో తెలిసిందే.

మహాత్మాగాంధీ హత్యానంతరం దానిలో ఆర్‌ఎస్‌ఎస్‌ ప్రమేయం కారణంగా నాటి ప్రభుత్వం నిషేధం విధించింది. వల్లభాయ్‌ పటేల్‌ నాడు హోం మంత్రి. ఆర్‌ఎస్‌ఎస్‌ సృష్టించిన విషపూరిత వాతావరణమే గాంధీ హత్యకు దారితీసిందని ఆయనే స్వయంగా ప్రకటించారు. నిషేధం మీద సంతకం చేసింది, తరువాత ఎత్తివేసింది కూడా ఆయనే.గోల్వాల్కర్‌తో సహా అనేక మందిని జైలులో వేశారు. ఆ సమయంలో వున్నత స్ధాయిలో జరిగిన కుట్ర లేదా అధికారంలో వున్న పెద్దల కారణంగా కానీ నిషేధం ఎత్తివేశారు. దానికి గాను ప్రభుత్వం పెట్టిన షరతు ఏమిటి? హింసాకార్యకలాపాలనుంచి ఆర్‌ఎస్‌ఎస్‌ వైదొలగాలి, రాతపూర్వకమైన నిబంధనావళితో అది బహిరంగ కార్యకలాపాలు నిర్వహించాలి. రాజకీయాలను వదలి పెట్టాలి, జాతీయ పతాకాన్ని గౌరవించాలి, భారత్‌ను లౌకిక దేశంగా గుర్తించాలి. ఆ మేరకు గోల్వాల్కర్‌ విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. అప్పుడు భారత్‌ను లౌకిక దేశంగా గుర్తిస్తున్నారా అన్న ప్రశ్నకు ఒక హిందువుకు దేశం ఎల్లవేళలా లౌకిక రాజ్యమే అని సమాధానమిచ్చాడు. నాటి ప్రభుత్వానికి సమర్పించిన నిబంధనావళిలో తమది సాంస్కృతిక సంస్ధ అని పేర్కొన్నారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు దాని కార్యకలాపాలు, ఆచరణ ప్రభుత్వానికి ఇచ్చిన వాగ్దానానికి విరుద్దమే. అన్నింటికీ వక్రీకరణలే. అందుకే దేశంలో, ప్రపంచంలో వున్న అనేక ముసుగు సంస్ధలలో ఆర్‌ఎస్‌ఎస్‌ పెద్దది. దాని రహస్య అజెండాను అమలు చేసేందుకు అప్పటి వరకు రాజకీయ సంస్ధగా వున్న ఆర్‌ఎస్‌ఎస్‌ తన రాజకీయ విభాగంగా జనసంఘ్‌ను ఏర్పాటు చేసింది. ఇప్పుడు బిజెపి, విశ్వహిందూ పరిషత్‌, భజరంగ్‌దళ్‌, హిందూవాహిని, దుర్గావాహిని వంటి అనేక సంస్ధలను ఏర్పాటు చేసి వాటి ద్వారా కార్యకలాపాలను నిర్వహిస్తోంది. వాటిలో వున్న వారందరూ ఆర్‌ఎస్‌ఎస్‌ సభ్యులే. అయితే ఆ విషయాన్ని బహిరంగంగా అంగీకరించే ధైర్యం దానికి లేదు. గాంధీని చంపింది హిందూమహాసభకు చెందిన గాడ్సే అని చెబుతారు. అదే హిందూమహాసభకు చెందిన శ్యాంప్రసాద్‌ ముఖర్జీతో జనసంఘ్‌ను ఏర్పాటు చేశారు. అంటే సాంకేతిక ఆటంకాలను తప్పించుకొనేందుకు తప్ప నిజానికి దానిలో దీనిలో పనిచేసేది ఆర్‌ఎస్‌ఎస్‌ వారే. గాడ్సే ఎన్నడూ ఆర్‌ఎస్‌ఎస్‌ను వదలిపెట్టలేదని కుటుంబసభ్యులే చెప్పారు. పోనీ వారేమైనా ఆర్‌ఎస్‌ఎస్‌ లేదా బిజెపి వ్యతిరేకులా అంటే కాదు. అందువలన వారికి అలాచెప్పాల్సిన అవసరం లేదు.

ట్రంప్‌ పెద్ద అబద్దాల కోరైతే మన దేశ నేతలను ఏమనాలి. నిత్యం వందల కుహనా వార్తలు, అసత్యాలు, అర్ధసత్యాలతో సామాజిక మాధ్యమాలను నింపేస్తున్నదెవరు? ఎవరికి అనుకూలంగా వస్తున్నాయో వారే ఆ పని చేస్తున్నారు. వాటి పర్యవసానాలు తీవ్రంగా వుంటాయని మేథావులు గుర్తించటం లేదు. అలాంటి సమాజంలో నియంతలు, నిరంకుశులు పెరగటం చాలా సులభం. గతంలో సుభాష్‌ చంద్రబోస్‌ మరణం గురించి జవహర్‌లాల్‌ నెహ్రూ మీద పెద్ద ఎత్తున తప్పుడు ప్ర చారం చేశారు. అది 2016లో ఎన్నికలకు ముందు ప్రారంభమై ఎన్నికలు ముగిసే వరకు సాగింది. సుభాష్‌ చంద్రబోస్‌ కుటుంబ సభ్యులు బిజెపిలో చేరారు. బెంగాల్లో ఆయన గురించి ప్రచారం చేస్తే ఓట్లు వస్తాయని ఆపని చేశారు. పోనీ కేంద్ర ప్రభుత్వం సుభాష్‌ చంద్రబోస్‌ మరణం గురించి నిజాలేమైనా బయట పెట్టిందా అంటే ఏమీ లేదు. ప్రభుత్వం దగ్గర గతంలో బహిర్గతం కాని పత్రాలను కొన్నింటిని బహిర్గతం చేయటం తప్ప జరిగిందేమిటి?

సంఘపరివార్‌ శక్తులు బయట చేస్తున్న తప్పుడు ప్రచారాలనే అదే పరివార్‌ సభ్యుడైన నరేంద్రమోడీ పార్లమెంట్‌ వేదికగా చేసుకొని అవే విషయాలను చెప్పారు. సర్దార్‌ పటేల్‌ గనుక నాడు ప్రధాని అయి వుంటే కాశ్మీరు పూర్తిగా మన చేతుల్లోనే వుండేది అన్నారు. ఇది చరిత్రకు విరుద్ధం. చరిత్రను వక్రీకరించటానికి కొందరు వ్యక్తులు అవసరం. అందుకే నెహ్రూ, గాంధీని ఎన్నుకున్నారు. గాంధీని నేరుగా తిడితే పరువు దక్కదు కనుక ఆయన మీద సామాజిక మాధ్యమాల్లో, నెహ్రూమీద ప్రత్యక్షంగా దాడి చేస్తున్నారు. అసలు మనకు స్వాతంత్య్రం రాక ముందే ఏర్పడిన ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో చైనాకు శాశ్వత సభ్యత్వం రావటానికి నెహ్రూ కారకుడని స్వయంగా కేంద్రమంత్రి అరుణ్‌జైట్లీలో పచ్చి అబద్దమాడారు.భారత ఫాసిజం చర్చిల్‌ మాదిరి ముసుగు ధరించిందని బ్రిటన్‌ పత్రిక ఇండిపెండెంట్‌ 1998ఫిబ్రవరి 15న బిజెపి నేత అతల్‌ బిహారీ వాజ్‌పేయి గురించి రాసింది. సౌమ్యుడంటూ చిత్రించిన వాజ్‌పేయి నికార్సయిన ఆర్‌ఎస్‌ఎస్‌ కార్యకర్త. బాబరీ మసీదు కూల్చివేతకు బాధ్యులైన ఎవరి మీదా పార్టీ పరంగా ఎలాంటి చర్యలూ తీసుకోలేదు. గుజరాత్‌ మారణకాండ సమయంలో నరేంద్రమోడీ మీద చర్య లేదు. ఇప్పుడు ప్రజ్ఞ మీద అలాగే ఇతర బిజెపి నేతల మీద పార్టీ పరంగా ఎలాంటి చర్యలూ లేవు.

Image result for gandhi godse

సంఘపరివార్‌ కార్యకర్తలు నేతలు, కార్యకర్తలు హిందూమతానికి చెందిన గ్రంధాలు ఎంత మంది చదివారో తెలియదు, సెల్‌ఫోన్లలో భగవద్గీత అయినా వుందో లేదో చెప్పలేము గానీ ఇప్పుడు వారి సెల్‌పోన్లలో గాంధీని నేను ఎందుకు చంపాను అనే గాడ్సే పుస్తకం వుందంటే అతిశయోక్తి కాదు. వారు దానిని బలవంతంగా ఇతరులకు పంపుతున్నారు. ఆ మధ్య మన ఇతిహాసాలలో హింస వుంది, హిందువులు హింసకు అతీతులు కాదు అని చేసిన వ్యాఖ్య మీద రగడ జరిగింది. భారత, రామాయణాలు చదివిన వారు ఎంత మంది హింసకు పాల్పడ్డారు లేదా వుగ్రవాదులయ్యారు అని సంఘీయులు అడ్డు సవాళ్లు విసిరారు. మహాత్మా గాంధీ, నాధూరామ్‌ గాడ్సే ఇద్దరూ భగవద్గీతను చదివిన వారే ఒకరు ప్రాణాలను బలిదానమెందుకు ఇచ్చారు, మరొకడు ప్రాణాలు ఎందుకు తీసినట్లు ? భగవద్గీత నుంచి ఏమి నేర్చుకున్నట్లు? కేసు విచారణ సమయంలో తన చర్యకు సమర్ధనగా భగవద్గీతనే వుదాహరించాడు. అందుకే సంఘీయులు ఇప్పుడు దాన్ని జనాల మెదళ్లకు ఎక్కించటానికి పుస్తక రూపంలో వచ్చిన గాడ్సే వాదననే విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. నిజంగా గాంధీ మీద అభిమానం, గౌరవం వుంటే అలా చేస్తారా? రాజకీయంగా, ఓట్ల పరంగా నష్టం అనే భయంతో క్షమాపణ చెప్పించటం, చెప్పినా నేను క్ష మించను అని మోడీ అనటం తప్ప నిజంగా వారి మనసులో గాడ్సే మీద భక్తి, అభిమానమే వుంది. జనంలో జరగాల్సిన ప్రచారం ఎలాగూ జరిగిపోయింది, గాడ్సేకు రావాల్సిన ప్రచారం వచ్చింది, మరి కొంత కాలం గాడ్సే గురించి చర్చ జరుగుతుంది తప్ప గాంధీ గురించి కాదు. గాడ్సే మీద జరిగే చర్చ తమ ముసుగును మరింత తొలగిస్తుంది అనుకుంటే బిజెపి మరో ముసుగు వేసుకుంటుంది. అయితే ఒక్కటి మాత్రం స్పష్టం. మతోన్మాదం, వుగ్రవాదం, తీవ్రవాదం పులి స్వారీ వంటివి. ఒకసారి వాటిని ఎక్కిన వారు లేదా ఎక్కించుకున్నవారు వాటిని అదుపు చేయాలి లేదా వాటికే బలికావాలి. చరిత్రలో అలాంటి పులులను ఎక్కిన వారు ఎవరూ అదుపు చేయలేక వాటికే బలయ్యారన్నది తెలిసిందే.ప్రజ్ఞ మీద వెల్లడైన వ్యతిరేకతను పక్కదారి పట్టించటానికి ఆడిన నాటకం క్షమాపణ, దాన్ని ముందే చెప్పుకున్నట్లు బయటి వారే కాదు, పెద్ద చౌకీదారు మోడీ చేసిన ప్రకటనను పిల్ల చౌకీదార్లు గౌరవించటం లేదు. గాడ్సేను కీర్తిస్తూనే వున్నారు. అలాంటి వారు అవసరమైతే మోడీని కూడా పక్కన పెడతారు. వున్మాద లక్షణం అది.