Tags

, , , ,

Image result for Issues and Challenges before Narendra Modi

ఎం కోటేశ్వరరావు

రాజకీయనేతలు, ప్రత్యేకించి ఆర్ధిక, రాజకీయ పరిస్ధితులు క్లిషంగా వున్నపుడు తమ అధికారాన్ని పదిల పరచుకొనేందుకు జాతీయవాదాన్ని ఒక సాధనంగా చేసుకుంటారు అని రిచర్డ్‌ ఎన్‌ హాస్‌ అనే అమెరికన్‌ దౌత్యవేత్త చెప్పారు. అమెరికన్ల దృష్టిలో జాతీయ వాదం అంటే ఒక దేశం లేదా ప్రపంచ మీద లేదా మార్కెట్‌ మీద ఆధిపత్యం చెలాయించాలనే వాదం. అమెరికాకు అగ్రస్ధానం అన్నది వారి జాతీయ వాదం. అదే జాతీయ వాదం మరొక దేశం కూడా కలిగి వుంటే జరిగేది ఘర్షణే. అయితే మన దేశంలో జాతీయవాదులుగా చెప్పుకొనే బిజెపి, సంఘపరివార్‌ది అటువంటిది కాదు, హిందూత్వ జాతీయ వాదం. దాని మంచి చెడ్డలను పక్కన పెడితే హాస్‌ చెప్పిన ఆర్ధిక, రాజకీయ క్లిష్ట పరిస్ధితులు ఏ జాతీయవాదులకైనా వర్తిస్తాయి. అధికారం ఒక ముళ్ల కిరీటం, నరేంద్రమోడీ రెండవసారి దాన్ని మరోసారి ధరించబోతున్నారు. ఆయన ఘనతను జాతీయ వాదుల విజయంగా ఆర్‌ఎస్‌ఎస్‌ వర్ణించింది. ప్రస్తుతం నరేంద్రమోడీకి రాజకీయ క్లిష్ట పరిస్ధితులు లేవు. ఎందుకంటే ఆ పార్టీకే సంపూర్ణ మెజారిటికీ మించి లోక్‌సభలో సీట్లు వచ్చాయి. మరికొద్ది నెలల్లో రాజ్యసభలో కూడా మెజారిటీ రానుందనే వార్తలను మనం చూశాము. అందువలన నరేంద్రమోడీ ముందు ఆర్ధిక పరమైన, ఇతర సవాళ్లు ఏమి వున్నాయి, వాటి స్వభావం ఏమిటన్నది చూద్దాం.

ఎన్నికలకు ముందు, ఎన్నికల సమయంలో అధికారంలో వున్న రాజకీయ పార్టీలు లేదా అధికారం కోసం పాకులాడే పార్టీలు గానీ అర్ధసత్యాలను, అసత్యాలనే చెబుతాయి. నిజం చెప్పే వారిని పరిగణనలోకి తీసుకొనే లేదా వారు చెప్పే అంశాలనైనా చర్చించే స్ధితిలో ప్రస్తుతం మన జనం, మీడియా లేదు. ఎన్నికలు ముగిశాయి కనుక వాస్తవ దృక్పధంతో సమస్యలను చూడటం అటు జనానికి, ఇటు నరేంద్రమోడీ పది కాలాలపాటు వుండాలని కోరుకొనే వారికి కూడా అవసరం.

ఆర్ధిక అంకెలే అసలు సమస్య !

తన పాలనా కాలంలో సూట్‌ కేస్‌ కంపెనీలలో చాలా వాటిని మూసివేయించానని నరేంద్రమోడీ చెప్పారు. సంతోషించాల్సిన అంశమే. అయితే ఆ బోగస్‌ కంపెనీలు ఇచ్చిన సమచారాన్ని కూడా కలిపి అభివృద్ధి అంకెలను తయారు చేశారని, అందుకే అభివృద్ధి జరిగినట్లు కనిపించినా ఆచరణలో వుపాధి పెరుగుదల కనిపించలేదన్న ఒక విమర్శ వుంది. ఎన్ని మరుగుదొడ్లు కట్టించిదీ, ఎన్ని గ్యాస్‌ పొయ్యిలు ఇచ్చిందీ, ఎన్ని గ్రామాలకు విద్యుత్‌ సరఫరా చేసిందీ, ఎన్ని కిలోమీటర్ల మేరకు రోడ్లు వేసిందీ ఏ బిజెపి కార్యకర్తను అడిగినా గడగడా చెప్పారు గాని, వాగ్దానం చేసినట్లుగా ఎన్ని వుద్యోగాలు కల్పించారు అంటే తయారు చేసిన అంకెలు సక్రమంగా లేవని, వాస్తవ స్ధితిని ప్రతిబింబించే లెక్కలను తయారు చేస్తున్నామని నరేంద్రమోడీయే స్వయంగా చెప్పారు కనుక వాటిని వెల్లడించాలి. పకోడీల బండి పెట్టుకోవటం కూడా వుపాధి కల్పనలో భాగమే అని చెప్పినందున ఎంత మంది పకోడీలు, బజ్జీలు , టీ అమ్ముతూ వుపాధి పొందుతున్నారు అనే వాటితో సహా అన్ని వివరాలు తెలుసుకోవటం జనానికి సహజంగానే ఆసక్తి కలిగిస్తుంది.

రెండువేల పదమూడో సంవత్సరం జూన్‌ తరువాత మొట్టమొదటిసారిగా 2019 సంవత్సరం మార్చిలో పారిశ్రామిక ఉత్పత్తి సూచిక గతేడాదితో పోల్చినప్పుడు నిరపేక్షంగా 0.1శాతం తగ్గింది. పారిశ్రామిక ఉత్పత్తి వ ద్ధి ఫిబ్రవరిలో కేవలం 0.07మాత్రమే ఉంది. అలాగే జనవరిలో 1.7శాతం, డిసెంబరులో 2.6శాతం, నవంబరులో 0.3శాతంగా నమోదు అయింది. క్లుప్తంగా చెప్పాలంటే కొంతకాలంగా పారిశ్రామిక వ ద్ధి మందగిస్తోంది. ఇది ఆందోళన కలిగించే అంశం. పారిశ్రామిక రంగంలో పాతవైనా, కొత్త పరిశ్రమల్లో అయినా ఆధునిక యంత్రాలను, కంప్యూటర్లు, రోబోట్లను ప్రవేశపెడుతున్నారు. గుమస్తాలు చేయాల్సిన పనులను కంప్యూటర్లు చేస్తున్నాయి. మొత్తం మీద చెప్పాలంటే గత ఐదు సంవత్సరాల కాలంలో కార్పొరేట్ల లాభాల రేటు తగ్గలేదు, నష్టాలు వచ్చి ఫలానా తరహా పరిశ్రమ మూతపడింది అనే సమాచారాన్ని కూడా పాలకులు మనకు చెప్పలేదు కనుక అంతా బాగుందనే అనుకోవాలి. ఇక్కడే సమస్య వస్తోంది.

రైతు లేనిదే రాజ్యం లేదు !

పదిహేను సంవత్సరాల క్రితం దేశ జిడిపిలో వ్యవసాయ రంగ వాటా 21శాతంగా వున్నది కాస్తా ఇప్పుడు 13శాతానికి పడిపోయింది. అయితే ఆ రంగంలో పని చేస్తున్న కార్మికుల సంఖ్య ఆ దామాషాలో తగ్గలేదు. దేశంలో పనిచేసే వారిలో 55శాతం మంది అంటే 26 కోట్ల మంది వ్యవసాయ రంగంలో వున్నారు. అంటే జనాభాలో సగానికి పైగా దాని మీదే ఆధారపడి వున్నట్లు లెక్క. గత ఐదు సంవత్సరాల కాలంలో ఈ రంగంలో తలెత్తిన సమస్యలు అనేక రాష్ట్రాలలో రైతులను రోడ్ల మీదకు తెచ్చాయి. నరేంద్రమోడీ కంటే తెలంగాణాలో చంద్రశేఖరరావు సర్కార్‌ రైతు బంధుపేరుతో ఎక్కువ మొత్తాలు చెల్లించిన నిజామాబాదులో రైతులు తమ పంటలకు గిట్టుబాటు ధరగురించి చేసిన ఆందోళన, ఎన్నికల్లో దాని పర్యవసానాలను ఏ పాలకులైనా గమనంలోకి తీసుకోవాలి. ప్రపంచ మంతటా వ్యవసాయ పంటల ధరలు తగ్గుతున్నాయని ప్రపంచ ఆహార, వ్యవసాయ సంస్ధ గణాంకాలు చెబుతున్నాయి. మద్దతు ధరలు గిట్టుబాటు ధరలు కాదు. ప్రాణం పోకుండా చేసే ప్రాధమిక చికిత్స వంటివే. 2022 నాటికి రైతుల ఆదాయాలను రెట్టింపు చేస్తామని మోడీ ఐదు సంవత్సరాల క్రితం చేసిన వాగ్దానం అరుంధతి నక్షత్రంలా వుంది. వ్యవసాయ రంగంలో రైతాంగానికి గిట్టుబాటు కావాలంటే యాంత్రీకరణ అవసరం అని యంత్రాలకు పెద్ద ఎత్తున రాయితీలు ఇస్తున్నారు. అవి పారిశ్రామికవేత్తల, వాణిజ్యవేత్తల జేబులు నింపుతున్నాయి తప్ప రైతాంగానికి ఏమేరకు వుపయోగపడ్డాయన్నది పెద్ద ప్రశ్న. మరోవైపున యాంత్రీకరణ కారణంగా వ్యవసాయ కార్మికులకు వుపాధిపోయి వారంతా నిరుద్యోగసేనలో చేరుతున్నారు. చేతివృత్తుల వారి పరిస్ధితీ అంతే. అందువలన ఈ పెద్ద సమస్యను పరిష్కరించకుండా ప్రధాని కిసాన్‌ సమ్మాన్‌ పేరుతో ఏటా ఆరువేల రూపాయలు ఇచ్చి చేతులు దులుపుకుంటే నిజామాబాద్‌లో టిఆర్‌ఎస్‌ ఎదుర్కొన్న పరిస్ధితినే నరేంద్రమోడీ కూడా ఎదుర్కోవాల్సి వుంటుంది.

Image result for Narendra Modi, pakoda

నిరుద్యోగ సమస్య తీరు తెన్నులేమి !

నిరుద్యోగ సమస్య తీవ్రతను ప్రజలకు తెలియకుండా దాస్తున్నారనే విమర్శను మోడీ సర్కార్‌ ఎదుర్కొన్నది. ఎందుకంటే గత రెండు సంవత్సరాలుగా ప్రభుత్వం నిరుద్యోగానికి సంబంధిచిన సమాచారాన్ని ప్రచురించటానికి తిరస్కరించటం సహజంగానే అనుమానాలను రేకెత్తిస్తుంది. ఏదైనా మూసి పెడితే పాచిపోతుంది అని తెలిసిందే. ఆ సమస్య మీద సంబంధిత వున్నత అధికారి రాజీనామా కూడా చేశారు. అయితే ప్రభుత్వ గణాంక కార్యాలయం నుంచి లీక్‌ అయిన నివేదిక ప్రకారం నిరుద్యోగం 6.1శాతందాకా ఉంది. ఇది గత 45సంవత్సరాలలో అత్యంత గరిష్టం. ఏప్రిల్‌లో నిరుద్యోగం రేటు 7.6శాతం ఉందని ద సెంటర్‌ ఫర్‌ మానిటరింగ్‌ ద ఇండియన్‌ ఎకానమీ అంచనా వేసింది. నిరుద్యోగం రేటులో చలనాలు నిరుద్యోగం ఏ దిశగా పయనిస్తుందో సూచిస్తాయని తెలుసుకోవాలి. కేవలం రేటుతో సమస్య తీవ్రత తెలియదు. ఎందుకంటే భారతదేశంలో అనేకమందికి పూర్తి కాలం ఉద్యోగం ఉండటం, పూర్తి కాలం ఉద్యోగం లేకపోవటం కాకుండా ఉద్యోగిత కొంతకాలమే ఉంటుంది.

దేశంలో జనాభా 136 కోట్లు, వారిలో పని చేయగలిగిన వారు 15-64 సంవత్సరాల వయసు వారు అనుకుంటే 91 కోట్ల మంది వుంటారు.అయితే వారంతా వుద్యోగాల కోసం చూస్తారని కాదు గాని మన వంటి దేశానికి, ఏ పాలకులకు అయినా అదొక పెద్ద సమస్య అని చెప్పక తప్పదు. దీన్ని పరిష్కరించకుండా, వాగ్దానం చేసిన మాదిరి ఏటా రెండు కోట్ల మందికి వుద్యోగాలు కల్పించకుండా జనానికి ‘మంచి రోజులు ‘ రావు కదా ! నల్లధనాన్ని వెలికి తీసి బాత్‌రూముల్లో, మంచల మీద దాచిన సొమ్మును చలామణిలోకి తెచ్చి వుత్పాదక, వుపాధి అవసరాలకు అందుబాటులోకి తెస్తామంటూ పెద్ద నోట్లను రద్దు చేశారు. అలాగే పన్నుల సంస్కరణల్లో భాగంగా ఎగవేతలను అరికట్టేందుకు అని చెప్పి జిఎస్‌టిని ప్రవేశపెట్టారు. దాని వలన పెద్ద ఎత్తున వుపాధి పోయిందని జనం గగ్గోలు పెడితే ఒక చర్య ఫలితాలు వెంటనే ఎలా కనిపిస్తాయి, కొద్ది రోజులు ఆగాలని చెప్పారు. ఎన్ని ఇబ్బందులు పడినా జనం వాటిని మరచిపోయి నరేంద్రమోడీకి ఓటేశారు. ఇప్పుడు ఆ ఫలితాలు ఏ రూపంలో జనానికి వుపయోగపడుతున్నాయో చూపించాల్సిన బాధ్యత మోడీ సర్కార్‌ ముందు వుంది. సెంటర్‌ ఫర్‌ మానిటరింగ్‌ ఇండియన్‌ ఎకానమీ సంస్ధ మోడీ సర్కార్‌ కంటే ముందే ఏర్పడింది. అనేక అంశాలను అది ఎప్పటికపుడు వెల్లడిస్తోంది. అలాంటి సంస్ధ ఇచ్చిన లెక్కల ఆధారంగానే 2014లో నరేంద్రమోడీ రెండు కోట్ల వుద్యోగ కల్పన వాగ్దానం చేసినట్లు మరచి పోరాదు. 2016లో పెద్ద నోట్ల రద్దు, తరువాత జిఎస్‌టి పర్యవసానాల కారణంగా 2018లో కోటీ పదిలక్షల మందికి వుపాధి పోయిందని ఆ సంస్ధ చెప్పింది. ఆ సంస్ధతో పోల్చితే ప్రభుత్వానికి వున్న పెద్ద యంత్రాంగం అసలు వాస్తవాలను బయట పెట్టాలి. లేకపోతే విశ్వసనీయత సమస్యను సర్కార్‌ ఎదుర్కోవాల్సి వస్తుంది. మీ భవిష్యత్‌ కోసం నాకు ఓటు వేయండని నరేంద్రమోడీ స్వయంగా కోరిన విషయాన్ని మరచిపోరాదు.

ఇండియా స్పెండ్‌ వెబ్‌ సైట్‌ విశ్లేషణ ప్రకారం అనేక నెలలుగా నిరుద్యోగశాతం ఏడుశాతానికి అటూ ఇటూగా వుంది. ప్రతి ఏటా 1.2కోట్ల మంది వుద్యోగార్ధులు అడ్డామీదకు వస్తున్నారు.వారిలో కేవలం 47.5 లక్షల మందికి మాత్రమే పని దొరుకుతోంది.దేశ జనాభాలో 80శాతం హిందువులే వున్నారు, అంటే నిరుద్యోగుల్లో కూడా వారి వాటా అంతకు తగ్గదు. ఈ సమస్య ఏ క్షణంలో అయినా పేలే టైంబాంబు వంటిది, అది పేలకుండా సకాలంలో చర్యలు తీసుకోవాలి లేకపోతే ఏం జరుగుతుందో ఎవరూ వూహించలేరు. కాబట్టి నిరుద్యోగితను తగ్గించటానికి ప్రభుత్వమే ఏదో ఒకటి చెయ్యాలి.ఏం చేస్తారో ఎన్నికల్లో చెప్పలేదు. ఇప్పుడా పని చేసి యువతకు భరోసా కల్పించాలి.

ధనమేరా అన్నిటికీ మూలం !

నరేంద్రమోడీ చేసిన వాగ్దానాలు, రేపిన ఆశలు వేటిని నెరవేర్చాలన్నా కావాల్సింది ధనం.సంపదల సృష్టి లేకుండానే నోట్లను ముద్రిస్తే ప్రయోజనం లేదు. మనం ఇంకా అభివృద్ధి చెందుతున్నదేశంగా ఎంతకాలం చెప్పుకుంటాం అంటూ ఎన్‌డిఏ కొత్త ఎంపీల సమావేశంలో నరేంద్రమోడీ చెప్పారు. అభివృద్ధి చెందిన దేశంగా మారాలంటే మన దగ్గర మంత్రదండాలేమీ లేవు.

పారిశ్రామిక ఉత్పత్తిలో తయారీ రంగం 77.6శాతం ఉంది. గత సంవత్సరంతో పోల్చినప్పుడు మార్చిలో ఇది 0.4శాతం తగ్గింది. క్యాపిటల్‌ గూడ్స్‌ 8.7శాతం, కన్సూమర్‌ డ్యూరబుల్స్‌ 5.1శాతం, ఇంటర్‌మీడియట్‌ గూడ్స్‌ 2.5శాతం క్షీణించటం, కన్సూమర్‌ నాన్‌ డ్యూరబుల్స్‌ 0.3శాతం పెరగటంవల్ల ఈ పరిస్థితి ఏర్పడింది. 2018-19 ఆర్థిక సంవత్సరంలో పారిశ్రామిక ఉత్పత్తి సూచికలో వ ద్ధి కేవలం 3.6శాతంగా నమోదైంది. 2017-18 సంవత్సరంలో నమోదైన 4.4శాతంతో పోల్చినప్పుడు ఇది తక్కువ. అయితే ఆర్థిక సంవత్సరంలోని తరువాతి నెలల్లో మాంద్యం తీవ్రమైంది.

ఎగుమతులు, వినియోగమూ పెరగాలి !

మాంద్య పరిస్ధితులు ఏర్పడినపుడు అభివృద్ది రేటు పెరగకపోగా పతనం అవుతుంది. మనది ఎగుమతి ఆధారిత వ్యవస్ధ కాదు. అనేక దేశాల వ్యవస్ధలతో పోల్చుకుంటే మన ఎగుమతులు పరిమితమే. మేకిన్‌ ఇండియా పేరుతో గత ఐదు సంవత్సరాలలో జరిగిందేమిటో ఎవరూ చెప్పలేని స్ధితి. మన ద్రవ్యోల్బణం అదుపులో, తక్కువగా వుందని మన పాలకులు, అధికారులు తరచూ చెబుతుంటారు. అంటే ధరల పెరుగుదల కూడా తక్కువగా వుందని అర్ధం.అలాంటపుడు వినియోగం పెరగాలి, వినియోగం పెరిగితే పైన పేర్కొన్న విధంగా తయారీ రంగం వెనుక పట్టు పట్టదు. వివిధ రంగాల సమాచారాన్ని విశ్లేషించినపుడు గత నాలుగు నెలల కాలంలో మన వినియోగం తగ్గుతోందన్నది స్పష్టం. అది విదేశీ దిగుమతులైన బంగారం, రాళ్లు, ఆభరణాల వంటివి అయితే మనకే లాభం కాని మనదేశంలో తయారయ్యే వస్తు వినియోగం తగ్గితే అది ప్రమాదకరం. మారుతీ కంపెనీ మిగిలిపోతున్న కార్లను తగ్గించుకొనేందుకు వుదారంగా కార్మికులకు ఒకరోజు సెలవు ఇచ్చిందని వార్త చదివాము. ఒకవైపు మన మధ్యతరగతి మార్కెట్‌ బ్రహ్మాండంగా వుందని చెప్పుకుంటున్నపుడు మారుతీ కార్లెందుకు అమ్ముడుపోవటం లేదు, లేదా మేకిన్‌ ఇండియాలో భాగంగా విదేశాలకు ఎందుకు ఎగుమతి కావటం లేదు అన్న ప్రశ్నలు తలెత్తుతాయి.

Image result for Challenges before Narendra Modi

పర్యవసానాలు ఎలా వుంటాయి !

కేంద్రంలో, రాష్ట్రాలలో ఎవరు అధికారంలో వున్నా 1991 నుంచి అనుసరిస్తున్నది నయా ఉదారవాద విధానాలే. ఆ విధానం మార్గాంతరం లేని స్థితికి చేరుకోగా, దాని స్థానాన్ని ఆక్రమించటానికి దేశీయ మార్కెట్‌ ఆవిర్భవించనప్పుడు ప్రపంచంలోని ఇతర ఆర్థిక వ్యవస్థలవలెనే భారత ఆర్థిక వ్యవస్థ కూడా ఒక అనిశ్చిత స్థితిలో కూరుకుపోయింది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో నెలకొన్న మందగమనం భారత, చైనా ఆర్థిక వ్యవస్థలను ప్రభావితం చేస్తున్నది. ఇది ఎగుమతుల వ ద్ధిరేటు తగ్గటం కారణంగా జరుగుతోంది. అయితే తగ్గిన ఎగుమతుల వ ద్ధిరేటు తగ్గటంవల్ల ఏర్పడిన దుస్థితిని పాక్షికంగానైనా సరిదిద్దటానికి దేశీయ మార్కెట్‌ను విస్త తపరచలేదు. అలా జరగకపోగా అదే సమయంలో గ్రామీణ నైరాశ్యంవల్ల, ఎగుమతుల వ ద్ధి మందగించటం వల్ల ఏర్పడే ద్వితీయ శ్రేణి ప్రభావాల కారణంగా, నిరర్ధక ఆస్తుల పరిమాణం పెరగటంవల్ల, ఇతర విషయాలతోపాటుగా దీనివల్ల పారిశ్రామిక వ ద్ధి మందగించటం వల్ల పెద్ద ఎత్తున అవసరమయ్యే వ్యయాలకు అందుబాటులో వుండే రుణ సౌకర్యం బలహీనపడింది. పర్యవసానంగా దేశీయ మార్కెట్‌ కూడా కుదింపునకు గురయింది. వేరేమాటల్లో చెప్పాలంటే ఎగుమతుల వ ద్ధిలో ఏర్పడిన మందగమనానికి విరుగుడుగా తుల్యాన్ని సాధించనందున దేశీయమార్కెట్‌ కుదింపునకు గురయింది. దానితో ఎగుమతుల వ ద్ధి మరింతగా దెబ్బతింది. కన్‌స్యూమర్‌ డ్యూరబుల్‌ రంగం కుదింపునకు గురికావటం, కన్‌స్యూమర్‌ నాన్‌ డ్యూరబుల్‌ రంగం గత ఏప్రిల్‌తో పోల్చినప్పుడు స్తంభించటమనే వాస్తవాలు దీనిని స్పష్టం చేస్తున్నాయి. ఫిబ్రవరి నాటికే కుదింపునకు గురైన క్యాపిటల్‌ గూడ్స్‌ రంగం ఆర్థిక వ్యవస్థలో పెట్టుబడులు క్షీణిస్తున్నాయని సూచిస్తున్నది. పెద్ద నోట్ల రద్దు ఫలితాలు తరువాత తెలుస్తాయని మూడు సంవత్సరాల క్రితం చెప్పారు. కానీ అంతకు ముందే పెట్టుబడుల కోసమే తరచూ విదేశీ ప్రయాణాలు చేశానని మోడీ చెప్పారు. మరి వాటి ఫలితాలు, పర్యవసానాలను ఇప్పుడు జనానికి చూపాలి, లేకపోతే వేరే విధంగా అర్ధం చేసుకొనే ప్రమాదం వుంది.

బ్యాంకింగ్‌ రంగం ఎందుకు సమస్యల్లో వుంది?

అంతా బాగుంది అని చెప్పుకుంటున్న ఐదు సంవత్సరాల కాలంలో బ్యాంకుల్లో నిరర్ధక ఆస్ధులు ఎందుకు పెరిగాయి అంటే గతంలో కాంగ్రెస్‌ హయాంలో ఇచ్చిన అప్పులే కారణం అని చెప్పారు. అదింకేమాత్రం చెల్లదు. నిబంధనల ప్రకారం గడువు మీరి వాయిదాలు చెల్లంచని వాటిని నిరర్ధక ఆస్తులుగా ప్రకటించటం, వాటి ఆస్ధులను స్వాధీనం చేసుకొని సొమ్మును తిరిగి వసూలు చేస్తున్నట్లు కూడా చెప్పినప్పటికీ ప్రభుత్వరంగ బ్యాంకుల నిరర్ధక ఆస్తులు ఏటేటా పెరుగుతున్నాయి. గత ఐదు సంవత్సరాలుగా లక్షల కోట్ల మేరకు నిరర్ధక ఆస్తులను ప్రభుత్వం రద్దు చేసింది. గత రెండు సంవత్సరాలుగా దాదాపు రెండులక్షల కోట్ల రూపాయలను ప్రభుత్వ బ్యాంకులకు ప్రభుత్వం నిధులు బదలాయించింది. ఎన్నడూ లేని స్ధాయిలో 2018డిసెంబరు నాటికే నిరర్ధక ఆస్తులు ఎనిమిది క్షల కోట్లకు చేరాయి. రుణాలు ఇస్తాం తీసుకోండి అంటూ ఇటీవలి కాలంలో టెలిమార్కెటర్లు జనాన్ని ఫోన్ల మీద చంపుతున్నారు. బ్యాంకులు తమ దగ్గర డబ్బు నిల్వవుంచుకుంటే వాటికి వడ్డీ దండుగ. అందుకే అవి వెంటపడుతున్నాయి. అయినా వాటి ఫలితాలు ఆర్ధిక రంగం మీద పెద్దగా ప్రతిఫలించటం లేదు. ఈ ఎన్నికల కాలంలో రాజకీయ పార్టీలు గ్రామీణ పేదలకు పెద్ద ఎత్తున ఉపశమన పథకాలను ప్రవేశపెడతామని మాట ఇచ్చాయి. దానితో తప్పకుండా దేశీయ మార్కెట్‌ విస్త తమౌతుంది. అది పారిశ్రామిక ఉత్పత్తి పునరుద్ధరింపబడటానికి దారితీస్తుంది. చిన్న రైతు కుటుంబాలకు చెందిన 12కోట్లమందికి వార్షికంగా తలసరి 6000రూపాయలను అందిస్తానని మోడీ ప్రభుత్వం వాగ్దానం చేసింది. కాంగ్రెస్‌ తన ఎన్నికల ప్రణాళికలో మరింత ముందుకుపోయింది. న్యారు పథకం ద్వారా అత్యంత అథమస్థాయిలో గల 5కోట్ల కుటుంబాలకు నెలకు 6000 రూపాయలు అంటే సంవత్సరానికి రూ.72,000 సమకూరుస్తానని మాట ఇచ్చింది. ఈ పథకాలవల్ల దేశీయ మార్కెట్‌ విస్త తమౌతుంది. అయితే ఇక్కడ ఉదయించే ప్రశ్న ఏమంటే ఈ పథకాలకు అవసరమైన వనరులను ఎలా సమకూరుస్తారు అనేదే.

సంపన్నుల నుంచి అధికంగా వసూలు చేయాలి !

సంపన్నులపై పన్ను వేయటం ముఖ్యంగా భారతదేశంలో అస్థిత్వంలో కూడా లేని సంపదపై పన్నును విధించటం ద్వారా గణనీయమైన స్థాయిలో ఆదాయాన్ని సమకూర్చుకోవచ్చు. వనరులను సమకూర్చుకోవటానికి ఇది మనముందున్న స్పష్టమైన మార్గం. అయితే దీనిని అంతర్జాతీయ ద్రవ్య పెట్టుబడి తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. వనరులను సమకూర్చుకోవటం అంత కష్టం కాదని, అయితే నయా ఉదారవాద వ్యవస్థలో వనరులను అన్వేషించటం కష్టతరమౌతుందని కాంగ్రెస్‌ పార్టీ న్యారు పథకాన్ని ప్రకటించినప్పుడు మన్‌మోహన్‌ సింగ్‌ నర్మగర్భంగా అన్నారు. ఆ విధంగా ఒకవేళ ఈ పథకానికి కావలసిన వనరులను విత్తలోటుతో కూడా పాక్షికంగా సమకూర్చుకోవచ్చనుకున్నా అటువంటి విత్తలోటు స్థూల జాతీయోత్పత్తిలో అనుమతించబడిన 3.4శాతం పరిమితిని మించుతుంది. అప్పుడు అది భారతదేశ క్రెడిట్‌ రేటింగ్‌ తగ్గించటానికి దారితీస్తుంది. దానితో విదేశీ మారకపు చెల్లింపుల శేషం(బ్యాలన్స్‌ ఆఫ్‌ పేమెంట్స్‌)కు చెందిన కరెంట్‌ ఖాతా లోటును పూడ్చటం కష్టమవుతుంది. అమెరికా ఆదేశం మేరకు భారతదేశం బహిరంగ మార్కెట్‌ కంటే చౌకగా లభించే ఇరాన్‌ చమురును కొనుగోలు చేయకపోతే ఈ సమస్య మరింతగా తీవ్రమవుతుంది. అమెరికా ఆదేశాన్ని పాటిస్తానని మోడీ ప్రభుత్వం ఇప్పటికే స్పష్టం చేసింది. ఇప్పటికే పెరుగుతున్న చమురు ధరలవల్ల కరెంట్‌ ఖాతా లోటు పెరుగుతుంది. ఒకవేళ ఇరాన్‌పై అమెరికా విధించిన ఆంక్షలను కూడా పరిగణనలోకి తీసుకున్నట్టయితే కరెంటు ఖాతా లోటు మరింతగా పెరుగుతుంది. అంతేకాకుండా ఒకవేళ దీనికి అదనంగా విత్తలోటులో పెరుగుదల పరిమితిని మించితే భారతదేశ క్రెడిట్‌ రేటింగ్‌ పడిపోయి దేశంలోకి వచ్చే ద్రవ్య ప్రవాహాలు ఎండిపోతాయి. ఈ లోటును సాధారణ మార్గాలలో పూడ్చగలుగుతామనే ఆశ నామమాత్రంగానే ఉంటుంది. కాబట్టి మనం ఒక విపరీత స్థితిలో ఉన్నాం. ఒకవేళ ప్రభుత్వం ముంచుకొస్తున్న మాంద్యాన్ని అధిగమించా లంటే కరెంటు ఖాతా లోటును పూడ్చటం దానికి కష్టమౌతుంది. మరోవైపు మాంద్యాన్ని అధిగమించేందుకు ప్రభుత్వం ఏ మాత్రం ప్రయత్నం చేయకపోతే ఇప్పటికే తీవ్రంగావున్న నిరుద్యోగ సమస్య మరింత తీవ్రమవుతుంది.ఈ సమస్యను నరేంద్రమోడీ సర్కార్‌ ఎలా అధిగమిస్తుందన్నది శేష ప్రశ్న !

మైనారిటీలకు భరోసా కల్పించాలి !

ఏ దేశంలో అయినా మైనారిటీలు అభద్రతకు గురౌతారు. ఇది అంతర్జాతీయంగా వున్న పరిస్ధితి. మన దేశంలో అంతకంటే ప్రత్యేక పరిస్ధితులు వున్నాయి. మెజారిటీ జనాన్ని సంతుష్టీకరించేందుకు మైనారిటీల మీద దాడులు చేస్తున్నా పట్టించుకోలేదనే విమర్శ ప్రభుత్వం మీద ఇప్పటికే వుంది. ఎన్నికలు ముగియటంతోనే మైనారిటీలను వేధించే శక్తులు విజృంభిస్తున్నాయని తాజాగా జరిగిన రెండు వుదంతాలు స్పష్టం చేశాయి. బీహార్‌లో పేరు అడిగి మరీ తుపాకితో దాడి చేసిన వుదంతం, దేశ రాజధాని పక్కనే వున్న గురుగ్రామ్‌లో జై శ్రీరాం అనేందుకు తిరస్కరించినందుకు దాడి, మధ్య ప్రదేశ్‌లో ఆవు మాంసం కలిగి వున్నారంటూ జరిగిన దాడులు పరిమితమే అయినా దేశ వ్యాపిత చర్చనీయాంశం అయ్యాయి. అలాంటి శక్తులను తక్షణమే అదుపు చేయలేకపోతే జరిగే నష్టాలకు బాధ్యత వహించాల్సి వుంటుంది. రానున్న ఐదు సంవత్సరాలలో సబ్‌ కా విశ్వాస్‌( అందరి విశ్వాసం) సబ్‌కా సాత్‌, సబ్‌కా వికాస్‌ అంటే అందరి అభివృద్ధికి అందరితో కలసి పనిచేస్తామని చెప్పిన మాటలను ఆచరణలో నిరూపించుకోవాలి.

నోటి తుత్తరను అదుపు చేయాలి !

ఎన్నికల సమయంలో ఓట్ల కోసం రెచ్చగొట్టే విధంగా మాట్లాడినందుకు మిగతా పార్టీల కంటే బిజెపి వారి మీదనే ఎన్నికల సంఘం ఎక్కువగా చర్యలు తీసుకున్నది. తీసుకోవాల్సినన్ని, తీవ్ర చర్యలు లేవనే విమర్శలు సరేసరి. దేశ నాగరికత, విలువలకు ప్రతీక అని వర్ణించిన సాధ్వి ప్రజ్ఞ గాంధీని హత్య చేసిన గాడ్సేను దేశభక్తుడని కీర్తించటం తెలిసిందే. దానిని బిజెపి ఆమోదించకపోవటం కాదు, అసలు అలాంటి శక్తులను భవిష్యత్‌లో ఎలా అదుపు చేస్తారన్నదే సమస్య. ఎన్‌డిఏ ఎంపీల సమావేశంలో అలాంటి వారి గురించి మోడీ చేసిన హెచ్చరికను తు.చ తప్పకుండా అమలు చేయాలి.

Image result for Issues and Challenges before Narendra Modi

ఇరుగు పొరుగుతో సంబంధాలు !

ఇరుగు పొరుగుతో సంబంధాలు సజావుగా వుంటే దేశం అనేక విధాలుగా లబ్ది పొందుతుంది.ముఖ్యంగా ఆయుధాలు, మిలిటరీ ఖర్చును తగ్గించుకోవచ్చు.ఆ సొమ్మును వుపాధి కల్పన, సంక్షేమానికి వినియోగించుకోవచ్చు. వుగ్రవాద సమస్యను ఎన్నికల ప్రచారానికి, ఓట్ల లబ్దికి వినియోగించుకున్నారన్న విమర్శలు దాస్తే దాగేవి కాదు. నిజానికి అవి నరేంద్రమోడీకి వ్యక్తిగతంగా, పార్టీ పరంగా మేలు చేసేవి కాదు. పాక్‌తో సంబంధాలు నిరంతర సమస్యలు తెచ్చిపెడుతున్నవే. అయితే నిరంతరం పాకిస్తాన్‌కు వ్యతిరేకంగా మాట్లాడటం రెచ్చగొట్టటాన్ని జనం కొంత మేరకు అర్ధం చేసుకుంటారు. మితిమీరితే మొదటికే మోసం వస్తుంది. వుగ్రవాది మసూద్‌ అజహర్‌ విషయంలో చైనా అనుసరించిన వైఖరి రాబోయే రోజుల్లో మరిన్ని సమస్యల పట్ల వర్తించే విధంగా వుండాలి. అందుకు సంఘపరివార్‌ నోటి తుత్తర బ్యాచిని అదుపు చేయాల్సి వుంటుంది.

ఇక చివరిగా విదేశాంగ విధానం గురించి చెప్పుకోవాల్సి వస్తే అమెరికాతో మరింతగా కలసి ముందుకు పోతే మనకు సమస్యలే తప్ప రిగే ప్రయోజనం లేదు. మా దేశానికి వస్తూ మాకేమి తెస్తారు, మీ దేశానికి వస్తే మాకేమి ఇస్తారనే వైఖరే దానిది. అమెరికాలో వున్న మన వారి కుటుంబీకులు వుద్యోగాలు చేయకుండా నిరోధించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు వస్తున్న వార్తలు నిజంగా ఆందోళన కలిగించేవి. ఒక మిత్ర దేశంగా చేయాల్సినవి కాదు. ఇప్పటికే వాణిజ్యంపై అమెరికా నియంత్రణలను ప్రవేశపెడుతున్నది. భారతదేశం కూడా అమెరికా కార్యశీలత నీడలో అటువంటి నియంత్రణలను ప్రవేశపెట్టి వుండాల్సింది. అయితే నయా ఉదారవాదం మార్గాంతరంలేని స్థితికి చేరుకున్నదనే వాస్తవాన్ని మోడీ ప్రభుత్వం గ్రహించినట్టు కనపడటం లేదు. వుపాధి రహిత అభివృద్ధి దాని లక్షణం. అంటే సంపన్నులు మరింత సంపన్నులౌతారు, మిగిలినవారు మరింత దిగజారి పోతారు. అటువంటి పరిస్ధితి రానున్న రోజుల్లో మరింత వేగిరం కానున్నది. దీనిని మోడీ ఎలా ఎదుర్కొంటారన్నది నిజంగా పెద్ద సవాలే. ప్రారంభం అమెరికా దౌత్యవేత్త చెప్పిన అంశంతో ప్రారంభమైంది. ముగింపు కూడా దానితోనే చేద్దాం. జాతీయ వాదం ఇతరులను అణచివేసేందుకు ఒక మార్గం అని అమెరికా సామాజికవేత్త చోమ్‌ నోమ్‌స్కీ చెప్పారు. నరేంద్రమోడీ అందుకు తన జాతీయ వాదాన్ని వినియోగించరని ఆశిద్దాం.