Tags
D.Litt to President row, governor arif mohammad khan, Kerala LDF, Pinarai Vijayan, Ramesh Chennithala
ఎం కోటేశ్వరరావు
రాష్ట్రపతికి గౌరవ డాక్టరేట్‌ను ఇమ్మని తాను సిఫార్సు చేసినట్లు చెబుతూ కొందరు బాధ్యతారహిత, తెలివితక్కువ ప్రకటనలు చేస్తున్నారని, అవి జాతీయ వ్యవస్ధల గౌరవ, మర్యాదలను దెబ్బతీస్తున్నాయని, ఆందోళనకరమైన ధోరణులను చూస్తున్నానని కేరళ గవర్నర్ ఆరిఫ్ మహమ్మద్ ఖాన్ ఆదివారం నాడు కోచిలో విలేకర్లతో చెప్పారు.రాష్ట్రపతి, గవర్నర్ జాతీయ వ్యవస్ధలని, రాజ్యాంగంలోని ఆర్టికల్ 51ఏ ప్రకారం వాటిని గౌరవించాలని అన్నారు.వాటి గురించి ఆషామాషీగా చర్చించకూడదన్నారు.ఒక రాష్ట్రపర్యటనకు వచ్చిన రాష్ట్రపతికి గౌరవడాక్టరేట్ పట్టా ఇచ్చి సత్కరించాలా ? అలాంటి ప్రోటోకాల్ ఉంటే దాన్ని అమలు జరపటం రాష్ట్రాల విధి. లేనపుడు విశ్వవిద్యాలయాలు ఇవ్వాలనుకుంటే ఇవ్వవచ్చు. లేనపుడు రచ్చ చేస్తే రాష్ట్రపతికి అవమానం తప్ప మరొకటి కాదు. ఇప్పుడు కేరళలో అదే జరుగుతోంది. రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టాలని చూసే కొంత మంది కాంగ్రెస్ నేతలు, బిజెపికి అందుకు పూనుకున్నారు. డిసెంబరు 21 నుంచి నాలుగు రోజుల పాటు రాష్ట్రపతి రామనాధ్ కోవింద్ కేరళ పర్యటన జరిపారు. ఆ సందర్భంగా గౌరవ పట్టాతో సత్కరించకపోవటం అవమానించటమే అని బిజెపి ఆరోపించింది. కాంగ్రెస్‌లోని ఒక ముఠానేత రమేష్ చెన్నితల, పరోక్షంగా రాష్ట్ర గవర్నర్ ఆరిఫ్ మహమ్మద్ ఖాన్ ఈ అంశాన్ని రచ్చ రచ్చ చేస్తున్నారు.
రాష్ట్రపతికి గౌరవడాక్టరేట్ పట్టా ఇవ్వాలని గవర్నర్ ఆరిఫ్ మహమ్మద్ ఖాన్ కేరళ విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్‌ను కోరినట్లు, దాన్ని రాష్ట్ర ప్రభుత్వం తిరస్కరించినట్లు మీడియాలో కథలు వచ్చాయి. దీని గురించి కాంగ్రెస్ సిఎల్‌పి మాజీ నేత రమేష్ చెన్నితల తన ఫేస్‌బుక్‌లో ప్రకటన చేస్తూ గవర్నర్ సిఫార్సు నిజమేనా, రాష్ట్ర ప్రభుత్వానికి తిరస్కరించే హక్కు ఉందా ? దాని సంగతి తేల్చాలని కోరారు.సిఎల్‌పి నేత విడి సతీషన్ స్పందిస్తూ చెన్నితల చేసిన ప్రకటన గురించి తనకు తెలియదని, ఏదైనా ఒక అంశం మీద పార్టీ వైఖరి నిర్ణయించేది పిసిసి అధ్యక్షుడు, తాను మాత్రమే అన్నారు. పద్దతికి విరుద్దంగా ఎవరికైనా గౌరవడాక్టరేట్‌ను ఇమ్మని గవర్నర్ గనుక సూచించి ఉంటే అది చట్టవిరుద్దమని, గవర్నర్లకు అలాంటి అధికారం లేదని కూడా సతీషన్ చెప్పారు. దాంతో ప్రభుత్వానికి వంతపాడుతున్నారంటూ సతీషన్ మీద బిజెపి నేత, కేంద్ర మంత్రి మురళీధరన్ ధ్వజమెత్తారు, సిఫార్సు చేసేందుకు గవర్నర్‌కు పూర్తి అధికారం ఉందన్నారు.రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రపతిని అగౌరవపరచిందని ఆరోపించారు.
కన్నూరు విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్‌గా పని చేసిన గోపీనాధ్ రవీంద్రన్ పునర్నియాకాన్ని గవర్నర్ తిరస్కరించి వివాదం రేపారు. ఆమోదిస్తూ సంతకం చేసిన తరువాత నిరసన తెలిపారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సరైనదే అని హైకోర్టు తీర్పు ఇచ్చింది. ఈ వివాదంలో ఛాన్సలర్‌గా గవర్నర్‌కు హైకోర్టు ఇచ్చిన నోటీసును తీసుకొనేందుకు తిరస్కరించి తాను ఛాన్సలర్‌గా లేనని, రాష్ట్ర ప్రభుత్వానికే పంపాలని గవర్నర్ కోరారు. డిసెంబరు ఎనిమిది నుంచి ఛాన్సలర్ బాధ్యతల్లో లేనని చెబుతున్నారు.తనకు వచ్చే ఫైళ్లను ప్రభుత్వానికి తిప్పి పంపుతున్నారు. ప్రభుత్వ జోక్యం ఉండదని స్పష్టమైన హామీ ఇస్తేనే తిరిగి బాధ్యతలు స్వీకరిస్తానని చెబుతున్నారు.
రాష్ట్రపతికి గౌరవడాక్టరేట్ ఇవ్వాలని తాను కోరిందీ లేనిదీ, ఎప్పుడు కోరిందీ, అసలేం జరిగిందన్నది గవర్నర్ చెప్పాలి, కానీ కాంగ్రెస్ నేత రమేష్ చెన్నితల సదరు అంశాన్ని ఎందుకు లేవనెత్తారు అన్నది సమస్య. ఒక పౌరుడిగా, ఎంఎల్‌ఏగా తనకు తెలుసుకోవాల్సిన అవకాశం, హక్కు ఉందనుకుంటే గవర్నర్, రాష్ట్రప్రభుత్వానికి రాసి తెలుసుకోవచ్చు, బహిరంగ రచ్చ ద్వారా గవర్నర్ పదవి, రాష్ట్రపతిని కూడా అవమానించటమే అని విమర్శలు వచ్చాయి.చెన్నితల, బిజెపి నేతల ప్రకటనలతో ఇబ్బంది పడిన గవర్నర్ వారిది బాధ్యతా రాహిత్యం, తెలివితక్కువతనమని చెప్పారు. తాను డిసెంబరు ఎనిమిది నుంచే ఛాన్సలర్‌గా తప్పుకున్నట్లు చెబుతున్న గవర్నర్ గౌరడాక్టరేట్ గురించి ఎప్పుడు సిఫార్సు చేశారు అన్నది ఒక సందేహమైతే, ఛాన్సలర్‌కు అలాంటి అధికారం ఉందా అన్నది ప్రశ్న. ఇంత రచ్చ జరిగిన తరువాత వివరణ ఇవ్వాల్సిన బాధ్యత గవర్నరుకు లేదా ? గౌరవ పట్టా గురించి ఏదైనా సమస్య ఉంటే గవర్నర్ తప్ప మూడవ పక్షం ఎందుకు మాట్లాడాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి కొడియరి బాలకృష్ణన్ ప్రశ్నించారు. సిఫార్సు చేసి ఉంటే గవర్నరే స్వయంగా వివరణ ఇవ్వాలి, ఈ సమస్య పార్టీ, ప్రభుత్వం ముందుకు రాలేదు అన్నారు. ఉన్నత విద్యాశాఖ మంత్రి ఆర్ బిందు స్పందిస్తూ గవర్నర్ నుంచి ఈ అంశంలో వచ్చిన సిఫార్సులను తిరస్కరించలేదని స్పష్టం చేశారు.
ఆరిఫ్ మహమ్మద్ ఖాన్ గవర్నర్‌గా కంటే బిజెపి ప్రతినిధిగా పని చేస్తున్నారు. గతంలో అసెంబ్లీ ప్రసంగంలోని కొన్ని భాగాలను చదివేందుకు తిరస్కరించిన అంశం తెలిసిందే. సాగు చట్టాలను వ్యతిరేకిస్తూ తీర్మానం చేసేందుకు అసెంబ్లీని ప్రత్యేకంగా జరిపేందుకు అనుమతి నిరాకరించి వివాదం రేపారు. ఎందుకని కూడా ప్రశ్నించారు. పౌరసత్వ చట్ట సవరణ( సిఎఎ)కు వ్యతిరేకంగా అసెంబ్లీ తీర్మానం చేసినపుడు కూడా గవర్నర్ విమర్శలకు దిగారు. రాజ్యాంగ విరుద్దం, పనికిరాదని అన్నారు. కన్నూరు విసి నియామకాన్ని నిరసిస్తూ డిసెంబరు ఎనిమిదిన ప్రభుత్వానికి లేఖ రాశారు. ఒక ఛాన్సలర్‌గా అనుమతించాల్సింది తానేనని, మంచి చెడులను తానే బాగా నిర్ణయించగలని పేర్కొన్నారు. అంతేకాదు, ఆ లేఖను మీడియాకు విడుదల చేసి ఘర్షణకు దిగారు. ఈ వివాదం గురించి ముఖ్యమంత్రి హుందాగా స్పందించారు. మార్గదర్శక సూత్రాల ప్రకారమే విసి ఎంపిక జరిగిందన్నారు.గవర్నర్ మనస్సాక్షికి విరుద్దంగా పని చేయాలని తాము కోరటం లేదని, గవర్నర్ తన వైఖరిని మార్చుకుంటే అది నియామక ఉత్తరువు మీద సంతకం చేయక ముందు జరగాలని, తరువాత నిరసన వెల్లడించటం తనకు ఆశ్చర్యం కలిగించిందని, ఏదో ” జోక్యం లేదా వత్తిడి ” వచ్చి ఉండాలని అన్నారు.
రాజభవన్‌లను రాజకీయ కేంద్రాలుగా మార్చటంలో బిజెపి ఏలికలు కాంగ్రెస్‌ను తలదన్నారు. బిజెపికి అధికారం వచ్చే అవకాశం ఉంటే సాధనాలుగా మారటం, లేని చోట ఏదో ఒక రచ్చ చేస్తూ గవర్నర్ పదవులకు మచ్చ తెస్తున్నారు. వివాదాస్పద గవర్నర్ల జాబితాలో ఆరిఫ్ మహమ్మద్ ఖాన్ అగ్రభాగాన ఉంటారు. ఒక రాజకీయవేత్తగా ఆయన ప్రస్తానాన్ని చూసినపుడు సంఘపరివార్ నమ్మినబంటుగా మనకు కనిపిస్తారు. కేరళలోని కన్నూరు విశ్వవిద్యాలయంలో 2019 భారత చరిత్ర కారుల(ఇండియన్ హిస్టరీ కాంగ్రెస్) 80వ మహాసభ జరిగింది. దాన్ని ప్రారంభిస్తూ ఆ రాష్ట్ర గవర్నర్ ఆరిఫ్ మహమ్మద్ ఖాన్ ముందుగా తయారు చేసుకు వచ్చిన ప్రసంగాన్ని పక్కన పెట్టి అంతకు ముందు వక్తలు సిఎఎ, కాశ్మీర్ పరిణామాలపై చేసిన ప్రస్తావనలు లేదా విమర్శలకు రాజకీయ సమాధానాలు చెప్పటం ప్రారంభించటంతో అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. తనను ప్రసంగించకుండా చరిత్రకారుడు ఇర్ఫాన్ హబీబ్, శ్రోతల నుంచీ కొందరు అడ్డుకున్నారని, గేలిచేశారని తరువాత గవర్నర్ ఆరోపించారు. రాజ్యాంగాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత ఉన్న ఒక వ్యక్తిగా తాను తనకంటే ముందు మాట్లాడిన వక్తలు పేర్కొన్న కొన్ని అంశాలపై మాత్రమే తాను స్పందించానని పేర్కొన్నారు. కన్నూరు సభలో ఇర్ఫాన్ హబీబ్ గవర్నర్‌ను తోసివేయలేదు, కనీసం తాకను కూడా తాకలేదు. గవర్నర్ మౌలానా అజాద్, గాంధీ ఇతరుల పేర్లను పూర్తి అసందర్భంగా ప్రస్తావించారు, అదే సమయంలో పౌరసత్వ సవరణ చట్టాన్ని కూడా పొగడటం ప్రారంభించారు. ఖాన్ మాట్లాడుతున్న సమయంలో మీరెందుకు అజాద్, గాంధీలను ఉదహరిస్తున్నారు గాడ్సే గురించి చెప్పండి అంటూ హబీబ్ అడ్డుకున్నారు.
షాబానో కేసు తీర్పును వమ్ము చేసేందుకు నిర్ణయించిన రాజీవ్ గాంధీ చర్యను ఆరిఫ్ మహమ్మద్ ఖాన్ వ్యతిరేకించిన మాట వాస్తవం.ఆచర్యను అనేక మంది పురోగామి వాదులు ప్రశంసించారు. అలీఘర్ ముస్లిం విద్యార్ధి సంఘనాయకుడిగా పని చేశారు. తొలుత బికెడి తరఫున పోటీ చేసి ఓడిపోయారు, తరువాత 26 ఏండ్ల వయస్సులోనే ఎంఎల్‌సి అయ్యారు. తరువాత కాంగ్రెస్‌లో చేరి రెండుసార్లు ఎంపీగా గెలిచారు. మంత్రిగా పని చేస్తూ రాజీనామా చేశారు. తరువాత జనతాదళ్ తరఫున లోక్‌సభకు ఎన్నికయ్యారు. మరోసారి మంత్రిగా పని చేశారు. తరువాత ఆ పార్టీ నుంచి బిఎస్‌పిలో చేరి మరోసారి ఎంపీ అయ్యారు. తరువాత 2004లో బిజెపిలో చేరి ఎన్నికలలో ఓడిపోయారు. మూడు సంవత్సరాల తరువాత బిజెపికి రాజీనామా చేసినట్లు ప్రకటించినా ఆ పార్టీతో సంబంధాలను వదులు కోని కారణంగానే నరేంద్రమోడీ సర్కార్ కేరళ గవర్నర్‌గా నియమించింది.