Tags

, , , , ,


ఎం కోటేశ్వరరావు


ఆయుధ ఉత్పత్తిదారులు, వారికి మద్దతు ఇచ్చే అంతర్జాతీయ మీడియా ఉన్మాదులు తప్ప యుద్దాలు జరగాలని ఏ ఒక్కదేశమూ కోరుకోదు, ఎవరూ సిద్దంగా కూడా లేరు. ఉక్రెయిన్‌ యుద్ధం వస్తుందా రాదా, రేటింగులు పెరుగుతాయా లేదా అని కొందరు ఉగ్గపట్టుకొని చూస్తున్నారు. అమెరికా నాయకత్వంలోని నాటో కూటమి, రష్యా గత కొద్ది వారాలుగా ఉక్రెయిన్‌-రష్యా సరిహద్దులకు తమ మిలిటరీలను తరలిస్తున్నాయి. వాస్తవంగా అక్కడేం జరుగుతోందో చెప్పలేము గాని ఏ క్షణంలోనైనా రష్యాదాడులకు దిగవచ్చని పశ్చిమ దేశాల, ముఖ్యంగా అమెరికన్‌ వార్తా సంస్దలు రెచ్చిపోయాయి.


తాజాగా వస్తున్న ఊహాగానాలు, వార్తల స్వభావం ఏమంటే రష్యా సంగతేమోగానీ దాని మద్దతు ఉన్న ఉక్రెయిన్‌ తిరుగుబాటు ప్రాంతాలలో ఒకటైన డాన్‌బాస్‌పై అమెరికా ప్రోద్బలంతో ఉక్రెయిన్‌ దళాలే దాడులకు దిగి రష్యాను కవ్వించవచ్చని చెబుతున్నారు. ఏం జరిగినా ఆశ్చర్యం లేదు. రోజులు గడిచే కొద్దీ నాటో కూటమిలోని విబేధాలు మరింతగా వెల్లడి అవుతున్నాయి. వీటికి తోడు ముడి చమురు ధర ఇప్పటికే 93డాలర్లు దాటింది. వంద దిశగా వెళతున్నట్లు విశ్లేషణలు వెలువడుతున్నాయి. అమెరికా-ఐరోపా దేశాలలో ద్రవ్యోల్బణం, ధరల పెరుగుదల భయపెడుతున్నాయి.యుద్దం వస్తుందో లేదో, ఎవరు గెలుస్తారో, వస్తే ఎంతకాలం జరుగుతుందో తెలియదు గానీ రష్యానుంచి చమురు, గాస్‌ ఆగిపోతే ఏమి చేయాలా అని పశ్చిమ దేశాలు మల్లగుల్లాలు పడుతున్నాయి.నలభైశాతం గాస్‌ అక్కడి నుంచే వస్తున్నది.


ప్రస్తుతం ఐరోపా యునియన్‌ అధ్యక్ష స్ధానంలో ఉన్న ఫ్రెంచి అధ్యక్షుడు మక్రాన్‌ మాస్కోలో పుతిన్‌తో భేటీ జరిపారు.సంప్రదింపుల ద్వారా ఉద్రిక్తతలను నివారించవచ్చనే అభిప్రాయాన్ని వెలిబుచ్చారు. ఉక్రెయిన్‌కు నాటోలో సభ్యత్వాన్ని అంగీకరించే సమస్యే లేదని పుతిన్‌ మరోసారి తెగేసి చెప్పారు.పూర్వం తనలో భాగమై తరువాత పాలనా పరంగా ఉక్రెయిన్‌కు అప్పగించిన క్రిమియా ప్రాంతాన్ని అక్కడి ప్రజాభిప్రాయ సేకరణ తీర్పు ప్రకారం 2014లో రష్యా తనలో విలీనం చేసుకున్న అంశం తెలిసిందే. అప్పటి నుంచి అమెరికా, ఇతర ఐరోపా దేశాలు ఆంక్షలు అమలు జరుపుతున్నాయి. ఆ తరువాత రష్యా సరిహద్దులోని ఉక్రెయిన్‌ స్వయపాలిత ప్రాంతాలు కొన్నింటిలో జరిగిన ప్రజాభిప్రాయ సేకరణలో అవి కూడా రష్యాతో విలీనానానికి మొగ్గుచూపాయి. ఉక్రెయిన్‌ పాలకులు అంగీకరించకపోవటంతో అక్కడ అంతర్యుద్ధం సాగుతోంది. వాటిలో ఒకటే డాన్‌బాస్‌. అది భౌతికంగా ఉక్రెయిన్లో ఉన్నా తిరుగుబాటుదార్లదే పెత్తనం, వారికి రష్యామద్దతు బహిరంగ రహస్యం.


తనది గాకపోతే తాటిమట్టతో అన్నట్లుగా అమెరికా, ఇతర దేశాలను చూసి చేతులు కాల్చుకొనేందుకు ఉక్రెయిన్‌ సిద్దంగా ఉందా అన్నది సందేహమే. 2015లో తిరుగుబాటుదార్ల చేతిలో జరిగిన పరాభవాన్ని అక్కడి పాలకులు మరచిపోలేదు. ఇతరులు ఇచ్చిన ఆయుధాలతో ఈసారి దెబ్బతీయవచ్చని కొందరు రెచ్చగొడుతున్నారు. ఇదే సమయంలో తిరుగుబాటుదార్లకూ మెరుగైన ఆయుధాలు అందుబాటులోకి వచ్చాయి,వాటికి రష్యా అండ కూడా ఉంది. అమెరికాకు యుద్దం ఎందుకు ?


2008 ఆర్దిక సంక్షోభం నుంచి అమెరికా, ఇతర ఐరోపాధనిక దేశాల పెట్టుబడిదారీ వ్యవస్ద ఇంకా కోలుకోలేదు.కరోనాకు ముందే మరో మాంద్యంలోకి కూరుకుపోనుందనే విశ్లేషణలు వెలువడ్డాయి. కరోనాతో ప్రపంచ పెట్టుబడిదారులు పెద్ద ఎత్తున లబ్దిపొందారు. అది ఎక్కువ కాలం కొనసాగే అవకాశం లేదు గనుక కొత్తగా లాభాల కోసం దారులు వెతుకుతున్నారు.2008 సంక్షోభం తరువాత అమెరికా కేంద్రీకరించిన దేశాల్లో చమురు ఎగుమతి చేసే ఇరాన్‌, వెనెజులా,రష్యా, ఇరాక్‌, సిరియా వంటివి ఉన్నాయి. వాటిపై ఆంక్షలు విధించిన అమెరికా ఈ కాలంలో మనవంటి దేశాలకు చమురు ఎగుమతిదేశంగా ముందుకు వచ్చి సొమ్ము చేసుకున్న అంశం తెలిసిందే. రష్యానుంచి ఐరోపాకు గాస్‌ను సరఫరా చేసే రెండవ పైప్‌ లైన్‌ నోర్డ్‌ స్ట్రీమ్‌ దాదాపు పూర్తి కావచ్చంది. దాన్ని అడ్డుకొనేందుకు ఉక్రెయిన్‌ పేరుతో అమెరికా రాజకీయాలు చేస్తోంది.


యుద్దం లేదా యుద్దవాతావరణం నాటోలోని ప్రధాన దేశాలకు లాభాల పండిస్తోంది.1991-2014 మధ్య ఉక్రెయిన్‌కు అమెరికా నాలుగుబిలియన్‌ డాలర్లు కేటాయించగా, గత ఎనిమిది సంవత్సరాల్లో 2.5బిడాలర్లు ఇచ్చింది. అదిగాక ఇతర దేశాలు కూడా 10బి.డాలర్ల మేరకు పెట్టుబడులు పెట్టాయి. ఉక్రెయిన్‌ నౌకాదళాన్ని నవీకరించే పేరుతో బ్రిటన్‌ 1.7బి.పౌండ్లను పెట్టుబడిగా పెట్టింది. ఇవన్నీ బ్రిటన్‌, ఇతర కంపెనీలకు లబ్ది చేకూర్చేవే. నాటో దేశాల ఆయుధ కంపెనీలను మేపేందుకు 2014-22 మధ్య ఉక్రెయిన్‌ జిడిపిలో మూడు నుంచి ఆరుశాతానికి మిలిటరీ ఖర్చు 11బి.డాలర్లకు పెంచింది. అనేక ఐరోపా దేశాలు అమెరికా మీద ఆధారపడటం కూడా మరోవైపు అవి ఇష్టం లేకున్నా రష్యామీద పోరుకు సిద్దం అనాల్సి వస్తోంది.బ్రిటన్‌ ప్రపంచాధిపత్యంలో జూనియర్‌ వాటాదారుగా అమెరికాతో చేతులు కలుపుతోంది. రష్యామీద ఆంక్షలను వ్యతిరేకించే దేశాల్లో ఇటలీ ఒకటి. దాని పెట్టుబడులు అక్కడ ఉండటమే కారణం.


ఐరోపా దేశాలు ముఖ్యంగా జర్మనీ ఇప్పుడు యుద్దాన్ని కోరుకోవటం లేదు.దానికి రష్యా హీటింగ్‌ చమురు, గాస్‌ అవసరం. ఒకవేళ పోరు జరిగితే అమెరికా నుంచి అధిక ధరలకు వాటిని కొనుగోలు చేయాల్సి వస్తుందన్నది వారి భయం. ఇదే పరిస్ధితి మిగతా దేశాలకూ దాపురిస్తుంది. తమ కంపెనీల లాభం కోసం అమెరికా సృష్టించిన ఈ సంక్షోభానికి పావులుగా మారటమా లేదా అన్నది వాటి ముందున్న సమస్య. ఘర్షణలో ఉన్న పక్షాలకు ఆయుధాలు అందించ కూడదన్న తమ రెండవ ప్రపంచ యుద్ద అనంతర విధానానికి అనుగుణంగా బ్రిటన్‌ నుంచి ఉక్రెయిన్‌కు సరఫరా చేస్తున్న ఆయుధాల రవాణాను తమ గగన తలం మీద నుంచి అనుమతించటం లేదని జర్మనీ ప్రకటించింది. దాంతో బ్రిటన్‌ విమానాలు అనేక గంటల పాటు అదనంగా వేరే మార్గంలో వెళ్లాల్సివచ్చింది. అంతే కాదు తాను సరఫరా చేసిన హొవిట్జర్లను ఉక్రెయిన్‌కు దారి మళ్లించరాదని ఎస్తోనియాకు జర్మనీ స్పష్టం చేసింది.ప్రపంచవ్యాపిత బాంకుల ఆర్ధిక సమాచార వ్యవస్ధ (స్విఫ్ట్‌) నుంచి రష్యాను దూరంగా పెట్టాలన్న అమెరికాకు ఐరోపా దేశాల నుంచే ఎదురుదెబ్బతగిలింది. ఇప్పుడున్న స్ధితిలో అమెరికా ఎన్నికబుర్లు చెప్పినా తన శత్రుదేశాల నుంచి చమురు, గాస్‌ దిగుమతులను నిరోధించేశక్తి దానికి లేదు. స్లోవేకియా, హంగరీ, చెక్‌ రిపబ్లిక్‌ వంటి దేశాల్లోని చమురుశుద్ది కర్మాగారాలకు, జర్మనీకి రష్యాగొట్టపు మార్గాల ద్వారానే చమురు సరఫరా జరగాలి. అందువలన చెల్లింపులు జరపాలంటే స్విఫ్ట్‌నుంచి రష్యాను పక్కన పెడితే కుదరదు.


గత కొద్ది సంవత్సరాలుగా నయా నాజీ కిరాయి ముఠాలకు దేశభక్తి ముద్రవేసి అమెరికా పెద్ద ఎత్తున పెంచి పోషిస్తోంది. సిఐఏకు కిరాయి మూకలను సరఫరా చేసే బ్లాక్‌ వాటర్‌ వంటి కంపెనీలు ఎన్నో ఉన్నాయి. వారిని, ఉక్రెయిన్‌ మిలిటరీని జతచేసి డాన్‌బాస్‌ వంటి ప్రాంతాల మీద దాడులు చేయించాలని చూస్తున్నారు. రెండవ ప్రపంచ యుద్దంలో హిట్లర్‌తో చేతులు కలిపిన స్టెఫాన్‌ బందేరాను ఇప్పుడు ఉక్రెయిన్‌ ప్రభుత్వం జాతీయ యోధుడిగా గుర్తించి నీరాజనాలు పడుతోంది. ఎనిమిది సంవత్సరాల నాడు క్రిమియా విలీనాన్ని అడ్డుకోలేని నాటో కూటమి ఇప్పుడు దాన్ని విముక్తి చేస్తామని దాడులకు దిగితే యుద్దాన్ని ప్రారంభించిన నేరం దానిదే అవుతుంది. నెపం రష్యామీద నెట్టాలి గనుక పశ్చిమ దేశాలు సాకుకోసం చూస్తున్నాయి.


ఒకవైపు రష్యాను బూచిగా చూపుతున్న పశ్చిమ దేశాలు మరోవైపు మరోకారణంతో నిజంగానే భయపడుతున్నట్లు కనిపిస్తోంది.చమురు ధరల పెరుగుదలతో రష్యా ఆర్ధికంగా బలపడటమే దానికి కారణం. అది పశ్చిమ దేశాల ఆంక్షలను తట్టుకొనేశక్తి ఇస్తుంది. చమురు ధరల పెరుగుదల కారణంగా దాని విదేశీమారక ద్రవ్య నిల్వలు 640బి.డాలర్లకు పెరిగాయి. ప్రభుత్వ రుణం జిడిపిలో 12శాతానికి తగ్గింది. ముడి చమురు ధర కనీసం వందడాలర్లకు చేరుతుందని అమెరికా వాల్‌స్ట్రీట్‌ భావిస్తున్నది.వివిధ కారణాలతో ఈఏడాది చివరికి 125 డాలర్లవుతుందని జెపి మోర్గాన్‌ అంచనా. నిత్యం రష్యామీద ఆంక్షల గురించి చెప్పే అమెరికన్లు అదే రష్యానుంచి మూడేండ్ల గరిష్ట స్ధాయిలో ప్రస్తుతం డీజిల్‌ దిగుమతి చేసుకుంటున్నారు. ప్రస్తుతం 1.55 మిలియన్‌ పీపాల డీజిలు ఈనెలాఖరుకు అమెరికా చేరనుంది. అమెరికా తూర్పు కోస్తాలోని చమురుశుద్ధి కర్మాగారాలకు లాభాలు తక్కువగా ఉండటంతో శుద్దిని పరిమితం చేశాయని, ఒక కర్మాగారంలో పేలుడు జరిగినట్లు బ్లూమ్‌బెర్గ్‌ పేర్కొన్నది. కెనడా ఒక కర్మాగారాన్ని మూసివేయటం, ఐరోపా దేశాలే ప్రత్నామ్నాయం కోసం వెతుకున్నందున రష్యామీద ఆధారపడక తప్పటం లేదని తెలిపింది. దీనికి తోడు టెక్సస్‌లో చలి కారణంగా ఉత్పత్తికూడా తగ్గనుంది.


అమెరికా మీడియా అంతటా ప్రజాస్వామ్యం, ఐరోపాకు ముప్పు తక్షణం ఉక్రెయిన్‌ మీద దాడి జరగబోతున్నదంటూ పెద్ద ఎత్తున ఊదరగొడుతున్నారు. మరోవైపున దానికి ప్రతిగా మరో ప్రచారం జరుగుతోంది. ఉక్రెయిన్లో రష్యన్లు మెజారిటీగా ఉన్న డాన్‌బాస్‌ ఇతర స్వయం పాలిత ప్రాంతాలపై ఉక్రెయిన్‌, నాటో, కిరాయి మూకలు దాడులు చేయనున్నట్లు రష్యా మీడియాలో రాస్తున్నారు.2014లో ఉక్రెయిన్‌ మిలిటరీ దాడులను డాన్‌బాస్‌ తిరుగుబాటుదార్లు తిప్పికొట్టారు.రష్యా సైనిక సమీకరణ చేస్తోందని చెబుతున్నవారు దశాబ్దాల తరబడి దానికి వ్యతిరేకంగా ఐరోపాలో 64వేల మందిని అమెరికా నిలిపివుంచిందని, మరో ఎనిమిదిన్నరవేల మందిని దింపుతోందని, అవసరమైతే మరో 50వేల మందిని దించేందుకు నిర్ణయించిందనే అంశాలను చెప్పటం లేదు. రష్యా లక్ష మందిని సరిహద్దులకు తరలించినట్లు గుండెలుబాదుకుంటున్నారు. నిజమే, రెండోవైపు ఉక్రెయిన్‌ తన మిలిటరీలో సగం అంటే లక్షా 25వేల మందిని రష్యా ముంగిట్లోకి తరలించింది.డాన్‌బాస్‌తో పాటు తిరుగుబాటు ప్రాంతాలైన డాన్‌టెస్క్‌, లుగాన్‌స్క్‌ ప్రాంతాలలోనే వారిని మోహరించింది. అక్కడి తిరుగుబాటుదార్లపై మిలిటరీ చర్యకు దిగి రష్యాను రెచ్చగొట్టి రంగంలోకి దింపాలన్నది అమెరికా ఎత్తుగడ. అదే జరిగితే ఆ పేరుతో మరిన్ని కఠినమైన ఆంక్షలు,నాటో విస్తరణ, మరిన్ని ఆయుధాలు అమ్ముకోవచ్చని, యుద్దంలోకి దిగవచ్చన్నది వ్యూహం. దాని దురూహలు ఫలిస్తాయా ?