ఎం కోటేశ్వరరావు
జాతిపిత మహాత్మాగాంధీని హతమార్చిన గాడ్సే మాతృ సంస్ధ ఆర్‌ఎస్‌ఎస్‌ను ఒక గౌరవ ప్రదమైనదిగా జనం చేత ఆమోదింపచేసేందుకు, జాతీయ వాదం పేరుతో సమాజంలో చీలికలు తెచ్చేందుకు నరేంద్రమోడీ, ఇతర పాలకపెద్దలు కేంద్రీకరించిన తీరును ఎనిమిదేండ్లలో చూశాం. దీనిలో వందో వంతైనా సరైన ఆర్ధిక విధానాలపట్ల చూపితే ఎనిమిదేండ్ల తరువాత నరేంద్రమోడీ సర్కార్ వైఫల్యాల గురించి జనం చర్చించుకోవాల్సిన అవసరం ఉండేది కాదన్నది ఒక అభిప్రాయం. ఎనిమిదేండ్ల నరేంద్రమోడీ పాలన ఆర్ధికలక్ష్యాల సాధనలో వైఫల్యం చెందినట్లు బిజెపి నేత సుబ్రమణ్య స్వామి స్వయంగా చెప్పారు.2016 నుంచి వృద్ధి రేటు దిగజారిందన్నారు. మీరెందుకు నరేంద్రమోడీకి సలహా ఇవ్వటం లేదన్న ప్రశ్నకు స్వామి చెప్పిన సమాధానం మోడీని అభిశంచించటమే.” పూర్వకాలపు రుషుల ఉద్బోధనల ప్రకారం వినే శ్రద్ద ఉన్నవారితో మాత్రమే విజ్ఞానాన్ని పంచుకోవాలి” అన్నారు. నరేంద్రమోడీకి సరైన ప్రత్నామ్నాయం లేదని అభిమానులు చెబుతున్నారు కదా అన్నపుడు ” తాము దేశం వదలిపెట్టిన తరువాత భారత్ పతనం అవుతుందని బ్రిటీష్ సామ్రాజ్యవాదులు కూడా చెప్పారు, జరిగిందా అని స్వామి ఎదురు ప్రశ్నించారు. మరోసారి రాజ్యసభకు పంపే అవకాశం లేదని తెలుసుకొని స్వామి ఇలా మాట్లాడుతున్నారని కొందరు చిత్రించవచ్చు గాని వాస్తవం ఏమిటో వారు నోరు విప్పలేరు. ఈ సందర్భంగా దేశ ఆర్ధిక రంగానికి సంబంధించి కొన్ని ముఖ్య అంశాలను చూద్దాం.
2022 నాటికి దేశ జిడిపిలో పారిశ్రామిక ఉత్పత్తి రంగం వాటాను 25శాతానికి పెంచే విధంగా మేక్ ఇన్ ఇండియా పధకాన్ని 2014లో ప్రధాని నరేంద్రమోడీ ప్రకటించారు. దీనికి గాను ఏటా 12-14శాతం చొప్పున ఈ రంగంలో వృద్ధి రేటు సాధిస్తామని చెప్పారు. ఎనిమిదేండ్ల తరువాత చూస్తే ఇరవై ఐదుశాతానికి పెంచే లక్ష్యం 2025కు చేరనున్నట్లు కేంద్రం ప్రకటించింది. దీనికోసం నడిపించిన ప్రహసనాలు ఎన్నో. తొలి రోజుల్లో నరేంద్రమోడీ ఎడతెరిపిలేకుండా విదేశాలు చుట్టి రావటం గురించి విమర్శ వస్తే దేశంలో పెట్టుబడులు సాధించేందుకు, విదేశాల్లో అడుగంటిన ప్రతిష్టను తిరిగి నెలకొల్పేందుకే పర్యటనలని అధికారపక్షం బుకాయించింది. ప్రపంచ బాంకు సులభతర వాణిజ్య సూచికలో మన స్ధానం 2014లో 134 ఉండగా 2019 నాటికి 63వ స్ధానానికి నరేంద్రమోడీ తీసుకుపోయారు. అంతిమంగా సాధించిందేమిటి అంటే డబ్బాకొట్టుకొనేందుకు రాంకు పనికి వచ్చింది తప్ప జరిగిందేమీ లేదు. జిడిపిలో పారిశ్రామిక ఉత్పత్తి వాటా 25శాతానికి చేరే సంగతి అటుంచి మోడీ ఏలుబడిలోకి వచ్చేనాటికి ఉన్న 16.3శాతం కాస్తా 2020-21నాటికి 14.3శాతానికి దిగజారింది. కరోనా కారణంగా దిగజారింది అని ఎవరైనా బుకాయించవచ్చు, అసలు అంతకు ముందు పెరిగిందేమైనా ఉంటే కదా ? అందువలన 2025 నాటికి కనీసం 2014నాటి స్థితికైనా చేరతామా అన్నది ప్రశ్న.
ఈ దుస్థితికి కారణమెవరు? రెండు ఇంజన్ల పేరుతో కేంద్రంలో సుస్థిరమైన ప్రభుత్వం, మెజారిటీ రాష్ట్రాల్లో బిజెపి, దాని మిత్రపక్షాలే అధికారంలో ఉన్నందున దిగజారుతున్న ఆర్ధిక దుస్థితికి వారే బాధ్యులు. ప్రతిదానికీ చైనాతో పోల్చుకుంటున్న మనం కరోనా వచ్చిన కారణంగా చైనాలో వృద్ధి రేటు తగ్గింది తప్ప మన మాదిరి తిరోగమనంలో లేదు.చిన్న పామునైనా పెద్ద కర్రతో కొట్టాలన్నట్లు ప్రాణాంతకం కాకున్నా పరిమితంగా కేసులు నమోదైనప్పటికీ తాజాగా షాంఘై వంటి పట్టణాల్లో లాక్‌డౌన్ అమలు జరిపింది చైనా. మన దేశంలో అలాంటి పరిస్థితి లేకున్నా కరోనాకు ముందున్న ఆర్దిక వృద్ధి స్థాయికి ఇంకా చేరుకోలేదు. ఎప్పటికి చేరుకుంటుందో కూడా చెప్పలేము.
దేశంలో పారిశ్రామిక రంగం దిగజారటం లేదా స్థిరంగా ఉంటున్న ధోరణి తప్ప పెరుగుదల కనిపించటం లేదు.2006 నుంచి 2012వరకు పారిశ్రామిక కార్మికులు ఏటా 9.5శాతం పెరిగితే తరువాత ఆరు సంవత్సరాల్లో అది 7.4శాతానికి దిగజారింది. నిజవేతనాల పతనం కారణంగా కరోనాకు ముందే వినియోగం కూడా తగ్గింది.2019లో వార్షిక ప్రాతిపదికన నిజవేతనాలు 2.8శాతం తగ్గగా 2020 జనవరి-మార్చి నెలల్లో తగ్గుదల 5.3శాతం ఉంది.సిఇడిఏ-సిఎంఐఇ సమాచారం ప్రకారం 2017-2021 మధ్య ఉత్పాదక రంగంలో కార్మికుల సంఖ్య ఐదు నుంచి 2.9కోట్లకు తగ్గింది. స్టాక్‌మార్కెట్లో నమోదైన కంపెనీల వేతన బిల్లు 2018 సెప్టెంబరులో రు.53వేల కోట్లుండగా 2020జూన్ నాటికి రు.48,500 కోట్లకు తగ్గింది.2021 సెప్టెంబరులో రు.60వేల కోట్లుగా ఉంది.ద్రవ్యోల్బణాన్ని పరిగణనలోకి తీసుకుంటే నిజవేతనాలు తగ్గినట్లు స్పష్టంగా కనిపిస్తుంది. పారిశ్రామిక రంగంలో ఉపాధి తగ్గటంతో పాటు నిజవేతనాల పతనం కారణంగా గత దశాబ్దిలో గృహస్తుల రుణాలు రెట్టింపైనట్లు ఎస్‌బిఐ నివేదిక వెల్లడించింది.2018 భారత రుణ-పెట్టుబడి నివేదిక ప్రకారం గ్రామీణ ప్రాంతాల్లో 84శాతం రుణభారం పెరగ్గా పట్టణాల్లో 42శాతం ఉంది.
మేకిన్ ఇండియా పధకాన్ని ఉపాధి పెంపుదల, విదేశాలకు వస్తు ఎగుమతులు, మన దిగుమతులు తగ్గించే లక్ష్యంతో ప్రకటించారు. మన దిగుమతుల బిల్లు తగ్గిన దాఖలాలుగానీ, ఎగుమతులు పెరిగిన ఆనవాలు గానీ కనిపించటం లేదు.2021-22 బడ్జెట్‌లో ఆత్మనిర్భర పేరుతో ఉత్పాదకతతో ముడిపడిన ప్రోత్సహకాల కోసం కేంద్ర ప్రభుత్వం రు.1.97లక్షల కోట్లు కేటాయించింది. చిత్రం ఏమిటంటే ఈ పధకం కింద లబ్ది పొందేందుకు పరుగులు పెట్టాల్సిన కంపెనీలు మన దేశం నుంచి వెళ్లిపోతున్నాయి. ఎగుమతుల కోసం విద్యుత్ వాహనాలను తయారు చేసేది లేదని, మీ ప్రోత్సాహం అవసరం లేదని ఫోర్డ్ కంపెనీ 2022 మే 12న ప్రకటించింది. ఇక్కడున్న ఉత్పాదక సౌకర్యాలను వేరే దేశాలకు తరలించనున్నట్లుగా తెలిపింది. దిగుమతి పన్నులు ఎక్కువగా ఉన్న కారణంగా అమెరికా, చైనాల్లో తయారైన విద్యుత్ వాహనాలను మన దేశంలో విక్రయించరాదని మరుసటి రోజే టెస్లా నిర్ణయించింది. ఫోర్డ్ కంపెనీ మూత కారణంగా నాలుగువేల ఉద్యోగాలు ప్రత్యక్షంగానూ, దేశమంతటా దాని డీలర్లు పరోక్షంగా సృష్టించిన మరికొన్నివేల ఉద్యోగాలు పరోక్షంగా హరీమంటున్నాయి.2017తరువాత జనరల్ మోటార్స్, మాన్ ట్రక్స్, హార్లేడేవిడ్సన్,యునైటెడ్ మోటార్స్ మూతపడిన కారణంగా తమ పెట్టుబడి రు.2,485 కోట్లు హరీ మన్నదని, 64వేల మందికి ఉపాధి నష్టం జరిగిందని డీలర్స్ సంఘం పేర్కొన్నది.
విదేశాల్లో మన ప్రతిష్ట పెంచామని, పెట్టుబడులను ఆకర్షించినట్లు, సులభతర వాణిజ్య పరిస్థితిని కల్పించినట్లు నరేంద్రమోడీ అండ్ కో చెబుతున్నదానిలో ఆర్భాటం-వాస్తవమెంతో ప్రభుత్వ గణాంకాలే చెబుతున్నాయి. రాష్ట్రాల్లో వివిధ రకాల పన్నులు విదేశీ, స్వదేశీ కార్పొరేట్లకు చికాకు తెప్పిస్తున్నట్లు, వాటి బదులు ఏక రూప పన్నును అమలు చేస్తే ఉత్సాహంగా పెట్టుబడులు పెడతారంటూ జిఎస్‌టిని తెచ్చారు. అది కొన్ని రంగాలను దెబ్బతీసింది తప్ప పరిస్ధితిని చక్కదిద్దలేదన్నది తెలిసిందే. కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వశాఖ వార్షిక నివేదికల ప్రకారం 2014-2021 కాలంలో నమోదైన విదేశీ కంపెనీల పెరుగుదల 2016లో 3.9శాతం ఉండగా 2021లో అది 1.5శాతానికి తగ్గింది.(216 నుంచి 63కు తగ్గాయి) ఇక చురుకుగా ఉండే కంపెనీలు ఇదే కాలంలో 80 నుంచి 66శాతానికి తగ్గాయి. ప్రపంచ ఉత్పాదక కేంద్రంగా చైనాను పక్కకు నెట్టేసి మన దేశం ఆవిర్భంచనుందని ఎనిమిదేండ్ల క్రితం ఊదరగొట్టారు. గతేడాది చైనా నుంచి పెద్ద సంఖ్యలో కంపెనీలు మన దేశానికి రానున్నాయని స్వయంగా ప్రధాని నరేంద్రమోడీ సిఎంల సమావేశంలో చెప్పారు. పత్రికలు అవి1000 అని రాశాయి. నిజమే అనుకొని కొందరు సిఎంలు సదరు కంపెనీలకు ఎర్రతివాచీలు పరిచేందుకు సిద్దం అన్నారు. దీని ప్రహసనం 2021పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ నివేదికలో వెల్లడైంది.”కరోనా అనంతర ఆర్ధిక రంగంలో పెట్టుబడుల ఆకర్షణ:భారత్‌కు సవాళ్లు,అవకాశాలు ” అనే శీర్షిక కింద చైనా నుంచి వస్తున్నట్లు చెప్పిన కంపెనీల గురించి ఏం చెప్పారో చూడండి.”’ మీడియాల వార్తల ద్వారా తెలుసుకున్నదేమంటే ఈ కంపెనీల్లో అత్యధికం తమ సంస్థలను వియత్నాం, థాయిలాండ్, తైవాన్ తదితర దేశాలకు తరలించాయి తప్ప భారత్‌కు వచ్చింది కొన్ని మాత్రమే.” అసలు పార్లమెంటరీ కమిటీ పత్రికా వార్తల మీద ఆధారపడటం ఏమిటి ? ప్రభుత్వం తగ్గర సమాచారం లేదా ? ఉంటే అలా రాసి ఉండేవారు కాదు. చైనా నుంచి కంపెనీలు వెలుపలికి రావటం, విదేశాల నుంచి వెళ్లి అక్కడ కంపెనీలు పెట్టటం కొత్త కాదు. జపాన్ నొమురా బాంకు 2018 ఏప్రిల్ నుంచి 2019 ఆగస్టు వరకు చైనా నుంచి 56 కంపెనీలు వెలుపలికి తరలితే భారత్‌కు వచ్చింది కేవలం మూడే అని తెలిపింది. దేశంలో పారిశ్రామిక ఉత్పత్తి సూచిక(ఐఐపి) 2013 నుంచి 2022 వరకు వార్షిక పెరుగుదల సగటు 2.9శాతం, కాగా ఇదే కాలంలో జిడిపి సగటు 5.5శాతం ఉంది. అంతకు ముందు 2006 నుంచి 2012వరకు సగటు ఐఐపి 9శాతం ఉంది. సామర్ధ్య వినియోగం 2015 నుంచి 2022 వరకు 70.9శాతం ఉంది, అది పదేండ్ల క్రితం 80శాతం. అంటే ఉన్నదాన్ని కూడా వినియోగించుకోలేకపోతున్నాము. ఇదంతా మేకిన్ ఇండి పిలుపు తరువాత జరిగిందే సుమా !
తాను వస్తే జనాలకు మంచి రోజులు తెస్తానని మోడీ చెప్పారు. వాటికి వేతనాలు కీలకం. దేశంలో నిజవేతనాల రేటు పెరుగుదల ఎలా ఉందో చూద్దాం. (అంకెలు శాతాలని గమనించాలి.) మొత్తంగా చూసినపుడు 2011-12కు ముందు ఉన్న పెరుగుదలతో పోల్చితే తరువాత కాలంలో గణనీయంగా తగ్గింది. రెగ్యులర్ సిబ్బందికి పెరగకపోగా తగ్గిపోవటాన్ని చూడవచ్చు.(ఆధారం ఇనిస్టిట్యూట్ ఫర్ హ్యూమన్ డెవలప్‌మెంట్, వర్కింగ్ పేపర్ 01-2020)
2004-05 నుంచి 2011-12 ×××××××× 2011-12 నుంచి 2017-18
తరగతి×××మొత్తం×× కాజువల్××రెగ్యులర్ ×××మొత్తం×× కాజువల్××రెగ్యులర్
గ్రామీణ×××6.10 ×× 8.04 ×× 3.02 ××× 2.91 ×× 2.34 ×× -0.22
పట్టణ ×××4.55 ×× 6.42 ×× 4.10 ××× -1.49 ×× 1.10 ×× -2.05
పురుష ×××4.77 ×× 7.08 ×× 3.78 ××× 0.75 ×× 2.23 ×× -1.75
మహిళ×××7.92 ×× 8.24 ×× 4.87 ××× 2.31 ×× 1.34 ×× -1.38
మొత్తం ×××5.52 ×× 7.75 ×× 3.91 ××× 1.05 ×× 2.26 ×× -1.76
రైతాంగానికి 2022 నాటికి వారి ఆదాయాలను రెట్టింపు చేస్తామన్నది ప్రధాని నరేంద్రమోడీ చేసిన వాగ్దానాలలో ఒకటి. అది నెరవేర్చకపోగా వారికి మొత్తంగా ఎసరు పెట్టి కార్పొరేట్లకు అప్పగించేందుకు మూడు సాగు చట్టాలను రుద్దేందుకు పూనుకున్న అంశం తెలిసిందే. ఏడాది పాటు చారిత్రాత్మకంగా జరిపిన పోరు నేపధ్యంలో క్షమాపణలు చెప్పి మరీ వాటిని రద్దు చేశారు. కనీస మద్దతు ధరకు చట్టబద్దత కల్పించే అంశం గురించి ఒక కమిటీని వేస్తామని ప్రకటించి ఆరునెలలు దాటినా దాని ఊసే లేదు.
2015-16ను ప్రాతిపదికగా చేసుకొని 2022 నాటికి రైతుల ఆదాయాలను రెట్టింపు చేస్తామని చెప్పారు. దీనికి గాను ఏటా 10.4శాతం వార్షిక వృద్ది రేటు అవసరమని అంచనా. దీనికి సంబంధించి ప్రభుత్వం వద్ద ఇంతవరకు సమగ్ర సమాచారమే లేదు.వ్యవసాయ కుటుంబాలకు సంబంధించి అందుబాటులో ఉన్న తాజా సమాచారంగా 2019 జనవరి-డిసెంబరు మధ్య సేకరించిన 77వ దఫా ఎన్‌ఎస్‌ఎస్‌ఓ వివరాలే ఉన్నాయి. దాని ప్రకారం 2012-13లో రైతు కుటుంబ నెలవారీ ఆదాయం సగటున రు.6,426 ఉండగా 2019నాటికి రు.10,218కి పెరిగింది. అంటే నరేంద్రమోడీ ప్రకటనతో నిమిత్తం లేకుండానే ఇది జరిగిందని గమనించాలి. అందువలన ఎలాగూ ఎంతో కొంత పెరుగుతుంది గనుక దాన్ని తన ఖాతాలో వేసుకోవచ్చన్న ఆలోచన బిజెపికి వచ్చిందా అన్న ప్రశ్న తలెత్తుతున్నది.2019నాటి పెరుగుదల వివరాలను గమనిస్తే అసలు కథ తెలుస్తుంది. రైతులు తమ పొలంలో సాగుతో పాటు వేతన కూలీలుగా, కోళ్లు, పాడిపశువుల పెంపకం వంటి ఉప వృత్తుల ద్వారా కూడా ఆదాయాన్ని పొందుతారు.రైతుల ఆదాయవనరులు, వాటి తీరు తెన్నులు ఇలా ఉన్నాయి.నెలవారీ ఆదాయం రూపాయల్లో ఉంది.
వనరు×××××2012-13×××× 2018-19
వేతనం××××× 2,071 ×××× 4,043
పంటలు××××× 3,081 ×××× 3,798
పశుపాలన×××× 763 ×××× 1,582
ఇతరం ××××× 511 ×××× 795
మొత్తం××××× 6,426 ×××× 10,218
పై వివరాలను గమనించినపుడు వేతన, పశుపాలన ఆదాయం పెరుగుదల దాదాపు రెట్టింపు ఉంది.పంటల ఆదాయం ఆమేరకు లేదు. ఇతరంగా వచ్చే ఆదాయం అంటే కౌలు ద్వారా ఇతర అవసరాలకు భూమిని ఇవ్వటం ద్వారా పొందేది.2020-21 ఆర్ధిక సర్వేలో వెల్లడించిన వివరాల ప్రకారం 2014-2021 సంవత్సరాల్లో పరిస్ధితి అంచనా సర్వే(ఎస్‌ఏఎస్) ప్రకారం రైతులకు వచ్చే ఆదాయంలో పంటల నుంచి వచ్చే మొత్తం 48 నుంచి 37శాతానికి తగ్గింది.వేతనం ద్వారా వచ్చే మొత్తం 32 నుంచి 40శాతానికి, పశుపాలన ద్వారా వచ్చేది 12 నుంచి 16శాతానికి పెరిగింది. దీన్ని బట్టి పంటలకు తగినంతగా మద్దతు ధర కల్పించకపోవటం, లేదా మార్కెట్ శక్తుల దోపిడీ కారణంగా రావాల్సినంత రాకపోవటంగానీ జరుగుతున్నది. ఈ కారణంగానే కనీస మద్దతు ధరల విధానాన్ని ఎత్తివేసేందుకు దారి తీసే మూడు సాగు చట్టాల రద్దుకు రైతాంగం తీవ్రంగా పోరాడిందని, దానికి చట్టబద్దత కల్పించాలని డిమాండ్ చేసినట్లు భావించవచ్చు.ఆదాయంలో వేతనం ద్వారా పెరిగింది ఎక్కువగా ఉండటాన్ని బట్టి రైతులు కూలి మీద ఎక్కువ ఆధారపడుతున్నట్లుగా చెప్పవచ్చు.
రైతాంగ ఆదాయం రు.10,218 అన్నది దేశ సగటు. రాష్ట్రాల వారీ ఎగుడుదిగుడులు ఉన్నాయి.పద్దెనిమిది వేలు అంతకు మించి పొందున్నవారు మేఘాలయ, పంజాబ్, హర్యానా, అరుణాచల్ ప్రదేశ్, జమ్ము-కాశ్మీరుల్లో ఉండగా ఎనిమిదివేలకు తక్కువ వచ్చే వారు ఉత్తర ప్రదేశ్, బీహార్, పశ్చిమబెంగాల్, ఒడిషా, ఝార్కండ్‌లో ఉన్నారు. సాగు చట్టాలపై దేశమంతటా రైతులు ఒకే విధంగా స్పందించకపోవటానికి ఇది కూడా కారణం కావచ్చు, ఎక్కువ ఆదాయం పొందుతున్నవారిలో ఉన్న ఆందోళన తక్కువ పొందే వారిలో ఉండకపోవటం సహజం.
పంటల దిగుబడి పెంచటం ద్వారా రైతాంగ ఆదాయం పెంచవచ్చని కొందరు చెబుతారు. అది అనేక పరిస్థితుల మీద ఆధారపడి ఉంటుంది. సాగు ఖర్చులు స్థిరంగా ఉంటే దిగుబడి పెరిగితే రాబడి పెరుగుతుంది. కానీ దేశంలో ఆ పరిస్థితి ఉందా ? పెరుగుతున్న ఎరువులు, పురుగుమందులు ధరలు, వేతన, యంత్రాల వినియోగ ఖర్చు పెరుగుదల వంటి అంశాలను పరిగణనలోకి తీసుకున్నపుడు ఖర్చులు ఎక్కువగా పెరుగుతున్నాయి. అందుకే సాగు గిట్టుబాటు కావటం లేదన్న అభిప్రాయంతో అనేక మంది సాగుమాని కౌలుకు ఇవ్వటం వంటి వాటికి మరలుతున్నారు. ఎనిమిది సంవత్సరాల క్రితంతో పోల్చితే 2013-14లో ఉన్న ఆహార ధాన్యాల ఉత్పత్తి 265.05మిలియన్ టన్నుల నుంచి 2021-22లో 305.43మి.టన్నులకు పెరిగిందని అంచనా. ఇదే కాలంలో వరి,గోధుమల కనీస మద్దతు ధరలు రెట్టింపు కాలేదు. వరి ధర రు.1,310 నుంచి 1,940, గోధుమలకు రు.1,400 నుంచి 2,015కు పెరిగింది. కేవలం 14శాతం మంది రైతులు మాత్రమే కనీస మద్దతు ధరల వలన లబ్దిపొందుతున్నట్లు అంచనా.కనీస మద్దతు, గిట్టుబాటు ధరలను కల్పించే బాధ్యతను తీసుకొనేందుకు మొరాయిస్తున్న పాలకులు రైతాంగానికి గిట్టుబాటు కల్పించే పేరుతో యాంత్రీకరణను ప్రోత్సహిస్తున్నారు. దీని వలన వ్యవసాయకార్మికుల ఉపాధికి ముప్పు ఏర్పడుతున్నది. మేకిన్ ఇండియా మాదిరిగానే రైతుల ఆదాయాల రెట్టింపు అన్నది ఒక కలగానే ఉంది.
ఈ విశ్లేషణ డివివిఎస్ వర్మ సంపాదకత్వంలో వెలువడిన మోడీ ”భార” తం ప్రత్యేక సంచికలో తొలుత ప్రచురితమైనది.
మోడీ ఎనిమిదేండ్ల పాలన ( రెండవ భాగం ) : ఐదు లక్షల డాలర్ల జిడిపితో జనానికి ఒరిగేదేమిటి !
Pingback: మోడీ ఎనిమిదేండ్ల పాలన ( రెండవ భాగం ) : ఐదు లక్షల డాలర్ల జిడిపితో జనానికి ఒరిగేదేమిటి ! | vedika