Tags
Aandhra Pradesh Politics, Andhra Pradesh Elections 2024, Andhrapradesh, AP CM YS Jagan, CHANDRABABU
ఎం కోటేశ్వరరావు
గడిచిన ఐదు సంవత్సరాల వైసిపి పాలనలో ఆంధ్ర ప్రదేశ్ సర్వనాశనమైందని తెలుగుదేశం-జనసేన-బిజెపి కూటమి చెబుతోంది. అంతే కాదు, తమ పాలనలో వచ్చిన అనేక పరిశ్రమలు రాష్ట్రం వదలివెళ్లినట్లు కూడా ఆరోపిస్తున్నారు. దానికి పోటీగా వైసిపి తనదైన శైలిలో జనాన్ని తప్పుదారి పట్టించేందుకు చూస్తున్నది. అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తున్నట్లు ఊదరగొడుతున్నది. ఉదాహరణకు జిఎస్‌డిపిలో దేశంలో రాష్ట్రాన్ని ఒకటవ స్థానంలో నిలబెట్టినట్లు ప్రచారం చేస్తున్నారు. చెప్పేవారికి లేకున్నా వినేవారికి వివేకం ఉండాలంటారు.వర్తమాన ఆర్థిక సంవత్సరం 2023-24 మార్చినెల 31తో ముగుస్తుంది. వెంటనే గణాంకాలు ఖరారు కావు. వివిధ రాష్ట్రాలు ప్రవేశపెట్టిన బడ్జెట్లలో పేర్కొన్న అంచనాల ప్రకారం కొన్ని సూచికలను వెలువరించారు. ఆ ప్రకారం ఆంధ్రప్రదేశ్ జిఎస్‌డిపి 14.49లక్షల కోట్లతో ఎనిమిదవ స్థానంలో ఉంది. తరువాత తెలంగాణా. మొదటి ఏడింటిలో మహారాష్ట్ర 38.79,తమిళనాడు 28.3, గుజరాత్ 25.62, కర్ణాటక 25, ఉత్తర ప్రదేశ్ 24.39,పశ్చిమ బెంగాల్ 17.19, రాజస్థాన్ 15.7లక్షల కోట్లతో ఉన్నాయి. ఇక తలసరి జిడిపిలో 2022-23 సంవత్సరంలో అగ్రస్థానంలో 5.19లక్షలతో సిక్కిం, 4.72లక్షలతో గోవా రెండవదిగా ఉంది. పెద్ద రాష్ట్రాలలో 3.08లక్షలతో తెలంగాణా ప్రధమ, 3.01తో కర్ణాటక,2.96తో హర్యానా, 2.73తో తమిళనాడు, 2.72తో ఢిల్లీ, 2.41తో గుజరాత్, 2.33తో ఉత్తరాఖండ్, కేరళ, 2.24తో మహారాష్ట్ర,2.22తో హిమచల్ ప్రదేశ్, 2.19తో ఆంధ్రప్రదేశ్ పదకొండవ స్థానంలో ఉంది. ఇక వైసిపి చెప్పుకుంటున్న ఒకటవ స్థానం సంగతేమిటి అంటే ప్రతి ఏటా జిఎస్‌డిపి వృద్ది రేటు ప్రతి రాష్ట్రంలోనూ మారుతూ ఉంటుంది.2021-22లో వృద్ధి రేటులో స్థిర ధరల్లో 11.43శాతంతో మొదటి స్థానంలో ఉంది అని తేల్చారు గనుక, దాన్నే మొత్తం జిడిపిలో మొదటి స్థానంగా చెబుతూ జనాన్ని తప్పుదారి పట్టిస్తున్నారు. జిడిపి అంటే అంబానీ,అదానీ సంపదలతో పాటు అట్టడుగు బడుగు జీవులకు వచ్చే ఆదాయాన్ని కూడా లెక్కలోకి తీసుకొని వేసే మొత్తం, తలసరి అంటే దాన్ని జనాభాతో భాగించగా వచ్చేది. అందుకే తెలంగాణా జిడిపిలో మనకంటే తక్కువగా ఉన్నప్పటికీ జనాభా తక్కువ గనుక దేశంలో పెద్ద రాష్ట్రాలలో మొదటి స్థానంలో ఉంది. జిడిపిలో మహారాష్ట్ర ప్రధమ స్థానంలో ఉన్నప్పటికిటీ తలసరిలో తొమ్మిదవదిగా ఉంది.ఈ సూచికలతో జనానికి ఒరిగేదేమీ ఉండదు.తెలుగుదేశం పార్టీ కూడా తన ఐదు సంవత్సరాల పాలనలో వృద్ధి గురించి గొప్పలు చెప్పుకుంది.2013-14లో రాష్ట్ర జిడిపి వృద్ది రేటు ఏడుశాతంగా ఉన్నదానిని 2017-18 నాటికి 11.2శాతానికి పెంచినట్లు అంకెల్లో చూపింది.
తెలుగుదేశం వారు తమ ఏలుబడిలో విశాఖను ఐటి హబ్‌గా మార్చినట్లు కూడా చెప్పుకుంటున్నారు. ఇదొక అతిశయోక్తి. హైదరాబాద్‌లో ఐటి పరిశ్రమల ఏర్పాటుకు చంద్రబాబు నాయుడే కారణమనే ప్రచారం గురించి తెలిసిందే. అలాంటి నేత ఉమ్మడి రాష్ట్రాన్ని చీల్చిన తరువాత ఆంధ్రప్రదేశ్‌లో ఎందుకు ఐటి పరిశ్రమలను ఆకర్షించలేకపోయారో ఎవరూ చెప్పరు. పెట్టుబడుల ఆకర్షణల పేరుతో సమావేశాల ఆర్భాటాలు చేయటం వేరు, ఆచరణలో పెట్టుబడులు రావటం వేరు. ఐటి రంగాన్ని చూస్తే తెలుగుదేశం పార్టీ అభివృద్ధి బండారం బయటపడుతుంది. దీని అర్ధం వైసిపి అభివృద్ధి చేసిందని కాదు. దొందూ దొందే.ఐటి అంటే మారుపేరు చంద్రబాబు అని ఇప్పటికీ నమ్మేవారు ఉన్నారు గనుక ప్రత్యేకంగా చెప్పుకోవాల్సి వస్తోంది.కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటి సాంకేతిక మంత్రిత్వశాఖ సమాచారం ఆధారంగా 2021-22 సంవత్సర వివరాలతో రూపొందించిన ఎగువ మాప్ ఐటి ఎగుమతుల్లో ఏ రాష్ట్రం ఎక్కడుందో వెల్లడిస్తున్నది. ఎవరైనా అది వాస్తవం కాదని అంటే వాస్తవం ఏమిటో వెల్లడించాలి. పొరుగున ఉన్న ఒడిషా ఐదువేల కోట్ల రూపాయల మేర ఎగుమతి చేస్తే ఆంధ్రప్రదేశ్ వెయ్యి కోట్లుగా ఉంది. తరువాతి సంవత్సరాల్లో మొత్తంగా ఎగుమతులు పెరిగినందున ఆమేరకు అంకెలు మారవచ్చు తప్ప ధోరణిలో పెద్ద తేడా ఉండదు. ఆ ఏడాది రు.11.59లక్షల కోట్ల మేర ఎగుమతి చేస్తే కర్ణాటక, మహారాష్ట్ర, తెలంగాణా, తమిళనాడు రాష్ట్రాల నుంచే రు.9.72లక్షల కోట్లు ఉంది. ఉపాధి కూడా దీనికి అనుగుణంగానే ఉంటుంది. ఐటి ఉద్యోగాలంటే బెంగలూరు,పూనే,హైదరాబాద్, చెన్నయిని చూస్తున్నారు తప్ప విశాఖ, విజయవాడ అని ఎవరైనా అంటారా ? 2023 మార్చి నాటికి దేశంలో 54లక్షల మంది ఐటి, ఐటి అనుబంధ సేవారంగంలో పని చేస్తున్నారు. పరోక్షంగా మరో కోటి మంది ఉపాధి పొందుతున్నారని అంచనా. వీరిలో ఆంధ్రప్రదేశ్‌లో పనిచేస్తున్నవారు ఎందరు ? ఎన్నికలు వస్తున్నాయి గనుక అంకెలతో ఆడుకుంటూ జనాన్ని మభ్యపెడుతున్నారు తస్మాత్ జాగ్రత్త అని చెప్పాల్సి వస్తోంది. రెండు పార్టీలూ పోలీసు యంత్రాంగాన్ని తమకు అనుకూలంగా మలచుకొని ప్రతిపక్షాలను, ప్రజా సంఘాలు, న్యాయమైన డిమాండ్లపై ఆందోళనలను అణచేందుకే చూశాయి. మాట తప్పి మడమ తిప్పిన వారే. ఎవరూ తక్కువ తినలేదు.
ఏ దేశ చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం అన్నట్లుగా తెలుగుదేశం, వైసిపి పాలన ఉంది. కొన్ని వివరాలను చూద్దాం. ఉదాహరణకు అప్పుల గురించి ఆరోపణలు-ప్రత్యారోపణలు చోటుచేసుకుంటున్నారు.కాపిటల్ అంటే కాపిటల్ పెట్టుబడి,రుణాలు, వడ్డీ చెల్లింలులు రు.కోట్లలో.రెండు పార్టీల పాలనలో మచ్చుకు రెండేసి సంవత్సరాల వివరాలు.ఈ అంకెలకు పిఆర్‌ఎస్ సంస్థ విశ్లేషణలు ఆధారం.
ఏడాది××× రుణాలు ×× వడ్డీ చెల్లింపు××రుణ చెల్లింపు×× కాపిటల్
2016-17×59,923 ×× 11,697 ×× 34,776 ×× 50,520
2017-18×30,500 ×× 14,783 ×× 8,009 ×× 40,792(బడ్జెట్)
2021-22×53,524 ×× 22,165 ×× 15,503 ×× 16,373
2022-23× 64,978 ×× 25,288 ×× 16,291 ×× 16,847
రాష్ట్రంలో శాశ్వత సంపదలు, వాటి ద్వారా సేవలు, ఉపాధి సృష్టికి చేసే ఖర్చును మూలధన లేదా కాపిటల్ అంటారు. రెండు పార్టీల పాలనలోనూ ఇది దిగజారింది తప్ప ప్రాధాన్యత లేదు. పిఆర్‌ఎస్ సంస్థ చేసిన విశ్లేషణ ప్రకారం రెండు పార్టీలూ బడ్జెట్లలో భారీ మొత్తాలను ప్రకటించి ఏడాది చివరికి కోత పెట్టటంలో దొందూ దొందే. తెలుగుదేశం పార్టీ చివరి రెండు సంవత్సరాలలో ప్రతిపాదిత మొత్తాలలో 39,30శాతాల చొప్పున, వైసిపి మొదటి నాలుగు సంవత్సరాలలో 82,37,48,45శాతాల చొప్పున కోతలు పెట్టింది.
తెలుగుదేశం పార్టీ చివరి మూడు సంవత్సరాలలో రాష్ట్ర రుణ భారం జిఎస్‌డిపిలో సగటున ఏటా 28.6శాతం ఉంటే, వైసిపి ఐదు సంవత్సరాల పాలనలో 32.74శాతం ఉంది. వీటికి ప్రభుత్వం హామీగా ఉండి కార్పొరేషన్లు, ఇతర సంస్థల ద్వారా చేసిన అప్పులు, ప్రభుత్వ సంస్థలు తీసుకున్న అప్పులు అదనం.ఉదాహరణకు 2022 మార్చి 31నాటికి ప్రభుత్వ రంగ సంస్థల అప్పులు రు.1,38,875 కోట్లు వీటిలో విద్యుత్ సంస్థల వాటా రు.38,473 కోట్లు. జిఎస్‌డిపిలో ఇలాంటి మొత్తాలు 2021-22లో పన్నెండు శాతం ఉంది. అంటే ఎఫ్‌ఆర్‌బిఎం చట్ట నిబంధనలకు లోబడి రాష్ట్ర ప్రభుత్వం నేరుగా తీసుకొనే అప్పులకు ఇది అదనం. తెలుగుదేశం పాలనలో చివరి నాలుగు సంవత్సరాలలో ఇతర రాష్ట్రాల కేటాయింపులతో పోల్చితే విద్యారంగంలో తక్కువ, వైద్య రంగంలో సమంగా, గ్రామీణాభివృద్ధి రంగంలో ఎక్కువగా ఉంది.వైసిపి పాలనలో రోడ్లు అధ్వాన్నంగా ఉన్నాయనే విమర్శ పెద్ద ఎత్తున వచ్చిన సంగతి తెలిసిందే.2022-23లో అన్ని రాష్ట్రాలలో సగటున రోడ్లు, భవనాలకు 4.5శాతం కేటాయిస్తే ఆంధ్రప్రదేశ్‌లో జగన్‌మోహనరెడ్డి సర్కార్ 2021-22లో 0.9, మరుసటి ఏడాది 0.8శాతం మాత్రమే కేటాయించింది.తీవ్ర విమర్శల తరువాత 2023-24లో 1.8శాతంగా ప్రతిపాదించింది, ఆచరణలో ఎంత ఖర్చు చేసిందీ వెల్లడి కావాల్సి ఉంది. వైసిపి ప్రభుత్వం అనేక కీలక రంగాలను అలక్ష్యం చేసింది. ఆర్థిక మంత్రి భారీ మొత్తాలు కేటాయించినట్లు చూపటం తప్ప కోతల సంగతి తరువాత చెప్పలేదు. ఉదాహరణకు 2021-22 బడ్జెట్‌లో ప్రతిపాదించిన మొత్తాలలో అమలులో వివిధ శాఖలకు పెట్టిన కోతలను చూస్తే అభివృద్ది బండారం బయటపడుతుంది.రోడ్లు, భవనాలకు 55,గృహనిర్మాణం 54,నీటిసరఫరా, పారిశుధ్యం 46,సాగు నీరు 45,పట్టణాభివృద్ధి 42,వ్యవసాయం 40, సాంఘిక సంక్షేమం 39, గ్రామీణాభివృద్ది 34,ఆరోగ్యం, ఎస్‌సి,ఎస్‌టి,బిసి సంక్షేమశాఖలలో 20శాతాల చొప్పున కోత పెట్టారు. సంక్షేమ పథకాలు అమలు జరిపినంత మాత్రాన సరిపోదు.వాటినెవరూ వ్యతిరేకించటం లేదు. వివిధ శాఖలకు ప్రతిపాదించిన కేటాయింపులను కోత ఎందుకు పెట్టారో, తెచ్చిన అప్పులను దేనికి వెచ్చించారన్నది జనం అడుగుతున్న ప్రశ్న.
మోయలేని అప్పుల భారం గురించి ఒకవైపు చెబుతున్న తెలుగుదేశం కూటమి తాము అధికారానికి వస్తే ఇప్పుడున్న సంక్షేమ పథకాలను మరింతగా పెంచి అమలు చేస్తామని ఆశచూపుతున్నాయి. ఇప్పటికే ఉన్న అప్పులతో కొత్త అప్పులు చేసే అవకాశాలు లేవు. కేంద్రం రుద్దిన విద్యుత్ సంస్కరణలు అమలు జరుపుతున్నందుకు అన్ని రాష్ట్రాలకు అనుమతించి జిఎస్‌డిపిలో 3.5శాతం పరిమితిని మించి మరో అరశాతం వైసిపి సర్కార్ ఉపయోగించుకుంది. వ్యవసాయానికి విద్యుత్ మీటర్లు బిగించే షరతును ఇందుకోసం అంగీకరించింది.పక్కనే ఉన్న తెలంగాణాలో అక్కడి ప్రభుత్వం ప్రకటించిన శ్వేత పత్రాలతో అప్పుల భారం ఎంత పెరిగిందో స్పష్టమైంది. కొత్త ప్రభుత్వం గత మూడునెలలుగా కొత్త అప్పులు తీసుకుంటే తప్ప గడవని స్థితి.ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పడిన పరిస్థితి మీద శ్వేత పత్రం ప్రకటిస్తే తప్ప వాస్తవాలు వెల్లడికావు. ఎవరు అధికారానికి వచ్చినా కొత్త ప్రభుత్వం ముందున్న సవాళ్లేమిటి అన్నది ప్రశ్న.జనం మీద పన్నుల భారాన్ని విపరీతంగా మోపటం ఒకటి లేదా అమలు జరుపుతున్న సంక్షేమ పథకాలకు ఏదో ఒకసాకుతో కోత పెట్టటం మినహా మరో మార్గం కనిపించటం లేదు. అందుకే పోటీ చేస్తున్న పార్టీలు నిర్ధిష్ట ప్రతిపాదనలతో ప్రణాళికలను ప్రకటిస్తే వాటి బండారం బయట పడుతుంది. ముందు మాకు తెలియలేదు, ఖజానాలో పైసా లేదని తెలంగాణాలో కాంగ్రెస్ చెప్పిన మాదిరి నాలుక మడతవేస్తే పరిస్థితి ఏమిటి ?
