పన్ను తగ్గింపు ఒప్పుకోలేము – చెప్పుకోలేము : ‘‘ అసలు సిసలు భారతీయుడు ’’ నరేంద్ర మోడీకి పక్కా అమెరికన్‌ డోనాల్డ్‌ ట్రంప్‌ అగ్నిపరీక్ష !

Tags

, , , , , , , , , , , ,

ఎం కోటేశ్వరరావు

ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరూహించెదరూ అని యావత్‌ ప్రపంచం అమెరికా అధినేత డోనాల్డ్‌ ట్రంప్‌ గురించి పాడుకుంటోందంటే అతిశయోక్తి కాదు. ఆ పెద్దమనిషి తీరు చూస్తుంటే అసలు సిసలు భారతీయులం అని చెప్పుకుంటున్న సంఘపరివార్‌కు, అది ముందుకు తెచ్చిన ప్రధాని నరేంద్రమోడీకి అగ్నిపరీక్ష పెట్టినట్లు కనిపిస్తోంది. పదే పదే ప్రతి సుంకాలు, ఆంక్షల గురించి మాట్లాడుతున్నాడు. అమెరికా వస్తువులపై దిగుమతి పన్నులు తగ్గించేందుకు భారత్‌ అంగీకరించిందని శుక్రవారం నాడు చెప్పాడు.వారు చేస్తున్నదానిని చివరకు ఎవరో ఒకరు బహిర్గత పరిచారు అని తన గురించి తానే చెప్పుకుంటూ మనదేశం గురించి మాట్లాడాడు. అయితే సుంకాల తగ్గింపు గురించి ఒప్పుకోలేరుచెప్పుకోలేరు అన్నట్లుగా మన పాలకుల స్థితి ఉంది. అంగీకరించినట్లు మన విదేశాంగశాఖ నిర్ధారించలేదు గానీ వాటి గురించి సంప్రదింపులు జరుగుతున్నట్లు చెప్పినట్లు వార్తా సంస్థ ఒకటి పేర్కొన్నది.ట్రంప్‌ చెప్పిన దాని గురించి నేను మాట్లాడను గానీ, ఇవన్నీ సంప్రదింపులలో ఉన్న అంశాలు గనుక వాటి గురించి చెప్పకూడదని విదేశాంగశాఖ కార్యదర్శి విక్రమ్‌ మిస్రీ వ్యాఖ్యానించారు.ఇటీవల జరిగిన అనేక వాణిజ్య ఒప్పందాలలో సుంకాల సరళీకరణ మౌలిక అంశంగా ఉన్న సంగతి తెలిసిందే అని కూడా చెప్పారు. ట్రంప్‌కు లేని మర్యాద మనకు అవసరమా ? ముందుగా నిర్ణయించుకున్న కార్యక్రమాలన్నింటీని రద్దు చేసుకొని ఆదరాబాదరా మన వాణిజ్యశాఖ మంత్రి పియూష్‌ గోయల్‌ వాషింగ్టన్‌ వెళ్లారు. అక్కడ చర్చలు జరుపుతుండగానే ఏప్రిల్‌ రెండు నుంచి పన్నులు విధిస్తామని ట్రంప్‌ చెప్పాడు. మంత్రి ఇంకా అక్కడ ఉండగానే సుంకాలు తగ్గించేందుకు అంగీకరించినట్లు కూడా అదే నోటితో ప్రకటించటం గమనించాల్సిన అంశం. దీనిలో రెండు కోణాలు ఉన్నాయి. ఇలా ప్రకటించి మనదేశాన్ని ఇరికించేందుకు చూడటం ఒకటి. లేదా మనమంత్రి ఒక స్పష్టమైన హామీ ఇచ్చి ఉండాలి. మన నిర్వాకం గురించి ముందుగా ఇతరుల ద్వారానే మనం తెలుసుకోవాలి మరి. ఇది కూడా మోడీ విదేశాల్లో పెంచినట్లు చెప్పిన దేశ ప్రతిష్టలో భాగమేనా ! అసలు మనమంత్రి అలా వెళ్లాల్సిన అవసరం ఏమిటి ? ట్రంప్‌ బ్లాక్‌మెయిల్‌ చేస్తున్నాడా ? మోడీ విధానాల గురించి రాహుల్‌ గాంధీ విదేశాల్లో విమర్శలు చేయటం ఏమిటని ప్రశ్నించేవారు, ట్రంప్‌ చేసిన ప్రకటన మీద నోటికి తాళం వేసుకోవటం ఏమిటి ?


అబద్దాలు చెప్పటం ట్రంప్‌కు, నిజాలు చెప్పకపోవటం మన కేంద్ర పాలకులకు వెన్నతో పెట్టిన విద్య. గాజాలోని పాలస్తీనియన్లకు శాశ్వత ఆశ్రయం కల్పించేందుకు జోర్డాన్‌ అంగీకరించిందని, ఆ దేశ రాజు అబ్దుల్లాతో కలసి నిర్వహించిన విలేకర్ల సమావేశంలో చెప్పాడు. అది వాస్తవం కాదని, తాము అంగీకరించేది లేదని తరువాత అదే అబ్దుల్లా ప్రకటించాడు. ఉక్రెయిన్‌ భద్రతకు ఎలాంటి హామీ ఇవ్వకుండా విలువైన ఖనిజాల ఒప్పందం మీద సంతకాలు చేయించి కొట్టేసేందుకు ట్రంప్‌ ఇదే ఎత్తుగడ అనుసరించాడు. అయితే జెలెనెస్కీ అడ్డం తిరగటంతో ఓవల్‌ ఆఫీసు పత్రికా గోష్టిలో పదినిమిషాల రచ్చ, జెలెనెస్కీ వెళ్లిపోయిన సంగతి తెలిసిందే. ట్రంప్‌ టీవీ ప్రసంగంలో చేసిన ప్రకటన గురించి ఆదివారం నాడు ఇది రాసిన సమయానికి మనదేశం నుంచి ఎలాంటి స్పందన, వివరణ వెలువడలేదు. ఎలన్‌ మస్క్‌ ఇండియాలో వ్యాపారం చేయాలని అనుకుంటున్నట్లు నేను భావిస్తున్నాను అని నరేంద్రమోడీతో భేటీ అయినపుడు ట్రంప్‌ నిర్మొహమాటంగా చెప్పినట్లు మీడియాలో వచ్చిన వార్తలు నిజమేనా ? యాభై ఆరు అంగుళాల ఛాతీ ఉన్నా భయమా ? తెరవెనుక ఏదో జరిగింది అనుకోవాలా ….? పార్లమెంటు సమావేశాల్లో ఉండగా అక్కడ చెప్పకుండా ఒక నిర్ణయం తీసుకొని నిజంగానే ట్రంప్‌కు చెబితే మనల్ని మనమే అవమానించుకున్నట్లు, ప్రజాస్వామ్యం, ప్రజాప్రతినిధులను కించపరిచినట్లు, రాజ్యాంగ వ్యవస్థలను దిగజార్జినట్లు కాదా ?

మన విశ్వగురువు నరేంద్రమోడీ తీరేవేరు, మరొకరు సాటి రారు. ట్రంప్‌ చేస్తున్న ప్రకటనల గురించి కెనడా,మెక్సికో,చైనా స్పందన, ప్రతిస్పందన చూశాము. మన మోడీ ఎందుకు మాట్లాడటం లేదని 140 కోట్ల మంది జనం మల్లగుల్లాలు పడుతున్నారు.అలాంటి చిన్న విషయాలు అసలు పట్టించుకోనవసరం లేదన్నట్లు కనిపిస్తోంది.వాటి బదులు దేశంలో 2050 నాటికి 44 కోట్ల మందికి ఊబకాయం వస్తుందని జాతిని హెచ్చరిస్తున్నారు. టెలికాం శాఖా మంత్రి జ్యోతిరాదిత్య సింధియా రిపబ్లిక్‌ టీవీ సభలో మాట్లాడుతూ విదేశీ టెలికాం కంపెనీలకు ఎలాంటి ఆంక్షలను విధించేది లేదని తేల్చి చెప్పేశారు. దీంతో ప్రపంచ కుబేరుడు ఎలన్‌ మస్క్‌ స్టార్‌లింక్‌ ఇంటర్నెట్‌ ప్రసారాలకు తలుపులు బార్లా తెరిచినట్లు స్పష్టమైంది.మనదేశ టెలికాం రంగం ఎంతో నిబ్బరంతో ఉందని, ప్రపంచ సంస్థలను ఆహ్వానించేందుకు సిద్దంగా ఉందని , భారత్‌ ఎవరినీ చూసీ భయపడటం లేదని చెప్పారు.తనకు దేశ పౌరులు అత్యంత ముఖ్యమని, ప్రపంచంలో అందుబాటులో ఉన్నవాటిలో వారు దేన్ని కోరుకుంటే దాన్ని తెచ్చి ఇవ్వటం మంత్రిగా తన విధి, వసుధైక కుటుంబంలో తనకు విశ్వాసం ఉందన్నారు.


జరుగుతున్న పరిణామాలను చూస్తుంటే ఎలన్‌ మస్క్‌ మనదేశ ఇంటర్నెట్‌, విద్యుత్‌ వాహనాల రంగంలోకి పెద్ద అడుగువేయనున్నట్లు కనిపిస్తోంది. యుపిఏ హయాంలో స్పెక్ట్రమ్‌ను అనుకూలురకు కేటాయించి అక్రమాలకు పాల్పడ్డారని విమర్శించిన నరేంద్రమోడీ తాను వేలం పద్దతిలో కేటాయించనున్నట్లు చెబితే, నిజంగానే అనేక మంది అభినందించారు. ఇప్పుడు ఎలన్‌ మస్క్‌ విషయానికి వస్తే ఉపగ్రహ స్పెక్ట్రమ్‌ వేలానికి బదులు అధికార కేటాయింపులకు ఎందుకు పాల్పడుతున్నట్లు ? ఇది మరో స్పెక్ట్రం కుంభకోణం కాదా ! అడిగితే దేశద్రోహులు అంటారేమో, అడిగితే ఏమిటి ముకేష్‌ అంబానీగారు ఇప్పటికే అడిగేశారు. అదేదో సినిమాలో వినపడలా అన్న చెవిటి పాత్ర డైలాగ్‌ను గుర్తుకు తెచ్చుకుందాం. నిజానికి వినపడకపోవటం కాదు, కావాలని చేసిందే. రెండు రకాల కేటాయింపు విధానాలెందుకు ? 2023 డిసెంబరులో చేసిన టెలికాం చట్ట ప్రకారం భూ సంబంధ స్పెక్ట్రమ్‌ వేలం ద్వారా, ఉపగ్రహ స్పెక్ట్రమ్‌ను అధికారయంత్రాంగం ద్వారా ఒక ఫీజు నిర్ణయించి కేటాయించేట్లు నిర్ణయించారు. ఎలన్‌ మస్క్‌ మన మార్కెట్‌ మీద ఎప్పటి నుంచో కన్నేసి ఉన్నకారణంగా అందుకు అనుగుణంగా మోడీ సర్కార్‌ పావులు కదిపిందని వేరే చెప్పనవసరం లేదు. మస్క్‌ కంపెనీ స్టార్‌లింక్‌ దరఖాస్తు కేంద్రం ముందు ఉంది. న్యాయమైన పోటీ విధానాన్ని ఎందుకు అనుసరించరని దిగ్గజ కంపెనీలైన అంబానీ రిలయన్స్‌ జియో, ఎయిర్‌టెల్‌ కేంద్రాన్ని అడిగాయి. ప్రభుత్వ విధానం మార్కెట్‌లో అసమాన పోటీకి దారి తీస్తుందని స్పష్టం చేశాయి. రక్షణ, సముద్రయానం,ప్రకృతి విపత్తుల అవసరాల వంటి వ్యవస్థలకు ప్రభుత్వాలు కేటాయింపులు జరపవచ్చని, వాణిజ్య అవసరాలకు వేలం వేయాల్సిందేనని అవి పేర్కొన్నాయి. ఎలన్‌ మస్క్‌ దరఖాస్తు మీద ఇంకా అంతిమ నిర్ణయం తీసుకోలేదు. తీసుకుంటే మాత్రం నరేంద్రమోడీతో జియో,ఎయిర్‌టెల్‌,ఇతర కంపెనీలు లడాయికి దిగటం ఖాయం. భూ సంబంధ స్ప్రెక్ట్రమ్‌ను ఒకరికి కేటాయించినదానిని మరొకరు వినియోగించలేరని, కానీ ఉపగ్రహస్రెక్ట్రమ్‌ను ఎవరైనా పంచుకోవచ్చని మంత్రి జ్యోతిరాదిత్య సింధియా వాదించారు. మంత్రికి తెలిసిన మాత్రం జియో, ఎయిర్‌టెల్‌ యాజమాన్యాలకు తెలియకుండానే వేలం గురించి మాట్లాడాయనుకోవాలా ?

అమెరికాలో స్టార్‌లింక్‌ కనెక్షన్‌ తీసుకోవాలంటే 120 డాలర్లు చెల్లించాల్సి ఉండగా ఆఫ్రికాలో మార్కెట్‌ను స్వంతం చేసుకొనేందుకు కేవలం పదిడాలర్లకు అందచేస్తున్నది. మనదేశంలో కూడా అదే విధంగా పోటీ పడితే ప్రపంచ ధనికుడు ఎలన్‌మస్క్‌తో ఆసియా ధనికుడు ముకేష్‌ అంబానీ తట్టుకోగలరా ? ఇలా అంటున్నానంటే అంబానీ పట్ల సానుభూతి ఉండి కాదు, ఎందుకంటే మన బిఎస్‌ఎన్‌ఎల్‌ను దెబ్బతీసిన వారిలో ఆ పెద్దమనిషి కూడా ఉన్నందున అనుభవించాల్సిందే కదా ! ముకేష్‌ అంబానీ రిటైల్‌ స్టోర్ల నిర్వహణలో తనకు పోటీగా వచ్చిన అమెజాన్‌ కంపెనీని నరేంద్రమోడీ సహకారంతో తాత్కాలికంగా వెనక్కు నెట్టారు, కానీ మరోసారి పెద్ద ఎత్తున అమెజాన్‌ రంగంలో దిగేందుకు చూస్తున్నది. ట్రంప్‌ మద్దతు దానికి ఉంటుంది. రెండు కంపెనీలు పోటీ పడనున్నాయి. ఏఏ రంగాలలో తలపడేదీ ముందు ముందు తెలుస్తుంది.అమెజాన్‌ ఉపగ్రహ ఇంటర్నెట్‌ కుయిపర్‌ కూడా అనుమతి కోసం చూస్తున్నది.ముకేష్‌ అంబానీ జియో కంపెనీ స్టార్‌ ఇండియా, డిస్నీతో చేతులు కలిపేందుకు నిర్ణయించారు. రానున్న రోజుల్లో అమెజాన్‌, నెట్‌ఫ్లిక్స్‌, సోనీలతో పోటీకి సిద్దపడుతున్నాయి.


ఇక ఎలన్‌ మస్క్‌, అతగాడిని భుజాల మీద మోస్తున్న డోనాల్డ్‌ ట్రంప్‌ మన దేశంలో టెస్లా విద్యుత్‌ కార్లను విక్రయించటానికి 110శాతం దిగుమతి పన్ను ఆటంకంగా ఉంది. స్టార్‌లింక్‌ మనదేశంలో కార్యకలాపాలు ప్రారంభిస్తే లైసన్సు ఫీజు నామమాత్రం గనుక తక్కువ ధరలకే కనెక్షన్లు ఇస్తుందని వేరే చెప్పనవసరం లేదు. నీవు నేర్పిన విద్యయే నీరజాక్షా అన్నట్లుగా ఇతర కంపెనీలను దెబ్బతీసేందుకు జియో చూసినట్లుగానే మస్క్‌ వస్తే దానితో పాటు, ఇతర కంపెనీల ఖాతాదారులందరూ మారిపోయే అవకాశం ఉంది.అలాగే కార్ల రంగంలో రారాజుగా ఉన్న టాటా, చిన్న కంపెనీలైన ఎంజి, కోటక్‌లకు ఎసరు వస్తుందని భావిస్తున్నారు. విదేశీ కార్ల మీద పన్ను తగ్గిస్తే సదరు అవకాశాన్ని ఒక్క టెస్లా మాత్రమే కాదు, చైనా, ఇతర దేశాల కంపెనీలు కూడా వినియోగించుకుంటాయి. వినియోగదారులు లబ్ది పొందుతారు. మన పరిశ్రమలు, ఉపాధి సంగతేమిటన్నదే ప్రశ్న. ప్రభుత్వ రంగ సంస్థ బిఎస్‌ఎన్‌ఎల్‌ను దెబ్బతీస్తుంటే కొంత మేరకు అడ్డుకొనేందుకు పోరాడిన ఉద్యోగులు ఓడిపోయారు. కానీ తమను దెబ్బతీసే చర్యలకు అనుమతిస్తే మన బడాకార్పొరేట్లు చూస్తూ ఊరుకుంటాయా ? పదేండ్లుగా ఇస్తున్న మాదిరే బిజెపికి నిధులు ఇస్తాయా ? వాటి ఆధీనంలో ఉన్న మీడియా సంస్థలు సానుకూల భజన కొనసాగిస్తాయా ? తమకు అనుకూలమైన పార్టీ, శక్తులను రంగంలోకి తెచ్చేందుకు చూడకుండా ఉంటాయా ? ఇలా ఎన్నో ప్రశ్నలు.


కార్లు లేదా సెల్‌ఫోన్లు, ఎలక్ట్రానిక్‌ వస్తువులుగానీ ఎక్కడెక్కడో తయారు చేసిన విడి భాగాలను తీసుకు వచ్చి వాటికి ఒక రూపు(అసెంబ్లింగ్‌) ఇచ్చి తమ బ్రాండ్లు వేసుకొని అమ్ముతున్నారు. అలాంటి కార్ల ఫ్యాక్టరీకి మూడు సంవత్సరాల్లో 50 కోట్ల డాలర్లు పెట్టుబడి పెడితే ఎనిమిదివేల వాహనాలను దిగుమతి చేసుకొనేందుకు అనుమతి, వాటికి కేవలం 15శాతమే పన్ను విధిస్తామని కేంద్ర ప్రభుత్వం ఒక విధానాన్ని ప్రకటించింది. అది ఒక్క టెస్లాకే కాదు, చైనాతో సహా ఎవరికైనా వర్తిస్తుంది.ఇలాగాక నేరుగా దిగుమతి చేసుకొంటే వాటి మీద 110శాతం పన్ను విధిస్తున్నారు. ఇప్పటికే చైనాలో ఫ్యాక్టరీ పెట్టిన టెస్లా అక్కడ తీవ్ర పోటీని ఎదుర్కొంటోంది. పోటీదార్లను దెబ్బతీసేందుకు ధరలను తగ్గించి మార్కెట్‌ను సొంతం చేసుకోవటం కంపెనీల ఎత్తుగడ. ఆ పోటీలో చైనా ప్రభుత్వ రంగ సంస్థలతో పాటు స్థానిక ప్రైవేటు కంపెనీ అయిన బివైడి వంటి వాటికి కూడా పెద్ద ఎత్తున సబ్సిడీలు ఇచ్చి నిలుపుతున్నది. అక్కడి సంస్థలు ఇంజన్లతో సహా కార్లకు అవసరమైన అన్ని భాగాలను తయారు చేస్తాయి, అటు వంటి పరిస్థితి టెస్లాకు గానీ మనదేశంలో ఉన్న సంస్థలకు గానీ లేవు. అందువలన చైనా కంపెనీలు కూడా మనదేశం వస్తే పరిస్థితి ఏమిటన్నది సమస్య.అయితే విద్యుత్‌ కార్ల ధరల విషయానికి వస్తే ప్రారంభ రకాల ధర టెస్లాతో పోల్చితే మన దేశంలో తయారవుతున్నవి తక్కువ వెలకే లభ్యమౌతున్నాయి. అందువలన అంతకంటే తక్కువ అయితేనే విదేశీ కంపెనీలు నిలదొక్కుకుంటాయి. 1990దశకం వరకు మన ప్రైవేటు రంగానికి ఎంతో రక్షణ ఉంది. తరువాత సరళీకరణలో భాగంగా విదేశీ కంపెనీలకు ద్వారాలు తెరవటంతో వాటితో చేతులు కలిపారు. ఇండోసుజుకీ, స్వరాజ్‌మజ్డా ఇంకా అలాంటివే ఎన్నో. తరువాత కూడా రక్షణలు కొనసాగుతున్నాయి. ఇప్పుడు మరింతగా మార్కెట్‌ను తెరవటంతో తెగబలిసిన స్వదేశీ కార్పొరేట్లకు పెద్ద సవాలు ఎదురుకానుంది. వాటికి ప్రాతినిధ్యం వహించే బాంబే క్లబ్‌ ఎలా స్పందిస్తుందో చూడాలి. ఆర్థిక రంగంలో జరుగుతున్న పరిణామాలు రాజకీయ రంగంలో పర్యవసానాలకు దారి తీస్తాయన్నది ప్రపంచ అనుభవం. దానికి మనదేశం అతీతంగా ఉంటుందా ! నరేంద్రమోడీ పీఠం కదలకుండా ఉంటుందా !! కరవమంటే కప్పకు`విడవ మంటే పాముకు కోపం, ఏం జరుగుతుందో చూద్దాం !!!

వాణిజ్య యుద్ధం : డోనాల్డ్‌ ట్రంప్‌కు చైనా హెచ్చరిక ! మనదేశ వైఖరేంటి !!

Tags

, , , , , , ,


ఎం కోటేశ్వరరావు


అమెరికా వాంఛిస్తున్న మాదిరి యుద్ధమే కోరుకుంటే అది సుంకాల పోరు, వాణిజ్య పోరు లేదా మరేదైనా యుద్ధాన్ని కోరుకుంటే కడవరకు పోరాడేందుకు తాము సిద్దం అని చైనా ప్రకటించింది. ఈ మేరకు అమెరికాలోని చైనా రాయబార కార్యాలయం ఎక్స్‌ పోస్టులో సవాలు విసిరింది. రెండవసారి అధికారానికి వచ్చిన తరువాత తొలిసారి అమెరికా పార్లమెంటు ఉభయ సభలను ఉద్దేశించి మంగళవారం నాడు ప్రసంగించిన ట్రంప్‌ ఏప్రిల్‌ రెండవ తేదీ నుంచి చైనా, భారత్‌లపై ప్రతి సుంకాలు అమల్లోకి వస్తాయని చెప్పాడు. తాను విధించే సుంకాలు మరోసారి అమెరికాను ధనవంతురాలిగా, గొప్పదానిగా చేస్తాయని చెప్పుకున్నాడు. మోటారు వాహనాలపై భారత్‌ వందశాతానికి మించి పన్నులు విధిస్తున్నదని, అమెరికా వేస్తున్నదాని కంటే రెట్టింపు చైనా పన్నులున్నాయని, తాము మిలిటరీ సాయం చేస్తున్నప్పటికీ దక్షిణ కొరియా నాలుగు రెట్లు ఎక్కువగా సుంకాలు విధిస్తున్నదని ట్రంప్‌ ఆరోపించాడు. దశాబ్దాల తరబడి ఇతర దేశాలు తమ మీద పన్నులు విధిస్తున్నాయని ఇప్పుడు తమ వంతు వచ్చిందన్నాడు. లేడిపిల్ల కన్నీళ్లను చూసి వేటగాడి మనసు మారుతుందా ? మారదు గనుకనే అమీతుమీ తేల్చుకొనేందుకు చైనా నిర్ణయించింది.


మరి మనదేశం. ట్రంప్‌ ప్రకటించిన మేరకు నిజంగానే సుంకాలు అమల్లోకి వస్తే ఏటా మనదేశానికి 700 బిలియన్‌ డాలర్లు నష్టమని సిటీ పరిశోధన సంస్థ విశ్లేషకులు ప్రకటించారు.2030 నాటికి ఉభయ దేశాల వాణిజ్య లావాదేవీలను 500 బిలియన్‌ డాలర్లకు పెంచాలని ఇటీవల ప్రధాని నరేంద్రమోడీ అమెరికా పర్యటనకు వెళ్లినపుడు ఒక అవగాహనకు వచ్చారు. ఆ మేరకు అక్టోబరులో ఒప్పందం కుదరవచ్చని వార్తలు వచ్చాయి. కానీ దాన్ని దెబ్బతీసే విధంగా ట్రంప్‌ సుంకాల ప్రకటన వెలువడ నుందని ఉప్పందిందేమో మార్చి ఎనిమిదవ తేదీవరకు ఉన్న కార్యక్రమాలన్నింటినీ రద్దు చేసుకొని మనవాణిజ్య మంత్రి పియూష్‌ గోయల్‌ ఆకస్మికంగా వాషింగ్టన్‌ బయలుదేరి వెళ్లారు. అక్కడి వాణిజ్య మంత్రితో మాట్లాడారు. అయినప్పటికీ ఆ తరువాతే ట్రంప్‌ ప్రకటన వెలువడిరది. వెళ్లటం తప్పని కాదు, ఉన్న కార్యక్రమాలన్నీ రద్దుచేసుకొని అంత ఆకస్మికంగా పరుగు పెట్టాల్సిన అవసరం ఏమిటన్నదే ప్రశ్న. అమెరికాలో సూపర్‌ అధ్యక్షుడిగా పేరుతెచ్చుకున్న ఎలన్‌మస్క్‌ మనదేశంలో తన కార్లను అమ్ముకోవాలంటే దిగుమతి పన్ను తగ్గించాల్సిందే అని వత్తిడి తెస్తున్నాడు. అతగాడి కోసమే ట్రంప్‌ పన్నుల ప్రకటన అన్నది స్పష్టం. తగ్గిస్తే మనదేశంలోని టాటా, ఎంజి, మహింద్రలకు కోపం, లేకపోతే ట్రంప్‌కు ఆగ్రహం. ఎవరిని వదులుకోవాలన్నది ఇప్పుడు నరేంద్రమోడీ ముందున్న ప్రశ్న. ఒకవేళ వత్తిడికి లొంగి కార్లమీద పన్ను తగ్గించిన తరువాత మిగతావాటి సంగతేమిటని మెడపట్టుకు కూర్చుంటే …..!


తమపై వాణిజ్య యుద్ధం ప్రారంభించిన అమెరికా అధినేత డోనాల్డ్‌ ట్రంప్‌ మీద తగ్గేదేలే అంటున్నాయి దేశాలు. కెనడా, మెక్సికోలపై పన్ను విధింపులో ట్రంప్‌ పునరాలోచన చేయవచ్చన్న సూచనలు అమెరికా వాణిజ్య మంత్రి నుంచి వెలువడినప్పటికీ అది జరగలేదు. పన్ను పోరు ఎటువైపు దారితీస్తుందో, దాని పర్యవసానాలు ఏమిటో చర్చగా మారాయి. చైనా, కెనడా ప్రతి పన్ను ప్రకటన చేయగా మెక్సికో ఏక్షణంలోనైనా పోరులో పాల్గొనవచ్చని వార్త. చైనా మీద రెండుసార్లుగా పదిశాతం చొప్పున పన్ను విధించగా మిగతా రెండు దేశాల మీద 25శాతం ముందుగానే ప్రకటించిన సంగతి తెలిసిందే. సంవత్సరాల తరబడి మేమంటే నవ్వులాటగా మారింది, మా తడాఖా చూపుతాం అన్నాడు ట్రంప్‌. అక్రమంగా వలస వచ్చే వారిని కెనడా, మెక్సికో నిలువరించాయని, ఫెంటానిల్‌ రవాణాను నిలిపేందుకు మరింతగా చేయాల్సి ఉందని అంతకు ముందు అమెరికా వాణిజ్య మంత్రి హోవార్డ్‌ లుట్‌నిక్‌ అన్నాడు.
ట్రంప్‌ ప్రకటన వెలువడగానే ఈనెల పది నుంచి అమల్లోకి వచ్చే విధంగా మంగళవారం నాడు పలు వస్తువులపై పది నుంచి 15శాతం మేరకు చైనా అదనంగా ప్రతి పన్ను ప్రకటించింది.వాటిలో కోడి,పంది, గొడ్డు మాంసం, పలు వ్యవసాయ ఉత్పత్తులు ఉన్నాయి. తైవాన్‌కు ఆయుధాలను విక్రయించే 15సంస్థలపై ఆంక్షలను విధించింది.మరో పదింటిని నమ్మకూడని వాటి జాబితాలో చేర్చింది.కెనడా ప్రధాని జస్టిన్‌ ట్రుడేవ్‌ కూడా ట్రంప్‌ ప్రకటన వెలువడగానే అదే రోజు అర్ధరాత్రి నుంచి 155 బిలియన్‌ డాలర్ల విలువగల అమెరికా వస్తువులపై 25శాతం ప్రతి పన్ను విధించినట్లు ప్రకటించాడు. అమెరికా వెనక్కు తగ్గేంతవరకు అవి కొనసాగుతాయన్నాడు. అమెరికాలోని 30 రాష్ట్రాలకు సరఫరా చేస్తున్న విద్యుత్‌, చమురు సరఫరాలపై కూడా ఆంక్షలు విధించే అవకాశం ఉంది. దశలవారీగా ఇతర వస్తువులు, పదికోట్ల డాలర్ల ఎలన్‌ మస్క్‌ స్టార్‌లింక్‌ ఇంటర్నెట్‌ ఒప్పందంపై ఆంక్షలు ప్రకటించే దిశగా కెనడా ఉంది.మెక్సికో అధ్యక్షురాలు క్లాడియా షెయిన్‌బామ్‌ విలేకర్లతో మాట్లాడుతూ ట్రంప్‌ పన్నులను ఎదుర్కొనేందుకు తమ దగ్గర నాలుగు పథకాలు ఉన్నాయని, సహనం పాటిస్తున్నట్లు, ఆదివారం నాడు మెక్సికో సిటీలో జరిపే ఒక బహిరంగసభలో వెల్లడిస్తామని చెప్పారు. అమెరికాతో ఎంతో అనుభవం ఉందని, వారి చర్య కొంత మేరకు యుద్ధం తప్ప మరొకటి కాదని పెట్టుబడిదారు వారెన్‌ బఫెట్‌ అన్నాడు.


తొలిసారి అధికారానికి వచ్చినపుడు ట్రంప్‌ ప్రారంభించిన వాణిజ్య యుద్ధంతో 2018 నుంచి అమెరికా దిగుమతులపై ఆధారపడటాన్ని చైనా క్రమంగా తగ్గిస్తున్నది. స్వంతంగా ఉత్పత్తి లేదా ఇతర దేశాల నుంచి తెచ్చుకుంటున్నది. అంతకు ముందుతో పోలిస్తే 2023లో 20శాతం తగ్గితే 2024లో 14శాతం తగ్గించి 29.25 బిలియన్‌ డాలర్ల మేర వ్యవసాయ ఉత్పత్తులను దిగుమతి చేసుకుంది. అయినప్పటికీ అమెరికా రైతాంగానికి చైనా అతి పెద్ద మార్కెట్‌గా ఇప్పటికీ కొనసాగుతున్నది. అక్కడ పండే సోయాలో 2016లో 40శాతం చైనాకు ఎగుమతి చేయగా గతేడాది 21శాతానికి తగ్గాయి.మొక్కజొన్నల దిగుమతి 260 కోట్ల డాలర్ల నుంచి 2024లో 56 కోట్ల డాలర్లకు పడిపోయింది. కోళ్లదానాకు ఉపయోగించే వీటిని దేశీయంగా ఉత్పత్తి పెంచటం, కొంత మేరకు బ్రెజిల్‌ నుంచి దిగుమతి చేసుకుంటున్నది. అమెరికాలో కోడి కాళ్లు, పంది చెవులు, పందితలను తినరు, వాటిని 2021లో 411 కోట్ల డాలర్ల మేర దిగుమతి చేసుకోగా గతేడాది 254 కోట్లకు తగ్గించింది.జొన్నల దిగుమతి పెరిగింది. అమెరికా 2023లో మొత్తం 3.1లక్షల కోట్ల డాలర్ల విలువగల వస్తువులు,వ్యవసాయ పంటలు ఆహారాన్ని దిగుమతి చేసుకోగా, ఇప్పుడు కూడా అంతే మొత్తం దిగుమతి చేసుకుంటే ట్రంప్‌ విధించిన పన్నుల భారం 43శాతం మీద పడనుందని అంచనా. ఆ మేరకు అమెరికా వినియోగదారులపై దాదాపు ప్రతి రోజువారీ వస్తువుపై అదనపు భారం మోపినట్లే. అమెరికాలోని ఆటో పరిశ్రమ తీవ్ర సమస్యలను ఎదుర్కొనే అవకాశం కనిపిస్తోంది. సగానికిపైగా ఇంజన్లు, విడిభాగాలు కెనడా, మెక్సికోల నుంచి దిగుమతి చేసుకుంటున్నారు.వాటి మీద 25శాతం పన్నులు అంటే ఒక్కో కారు ధర పన్నెండువేల డాలర్లు పెరిగే అవకాశం ఉందని అంచనా. కాస్త బాధ ఉన్నప్పటికీ అమెరికాను అగ్రభాగాన నిలిపేందుకు ఆ మాత్రం మూల్యం చెల్లించాల్సిందే అని ట్రంప్‌ అన్నాడు.


గతేడాది ఏప్రిల్‌ నుంచి ఈ ఏడాది జనవరి వరకు చూస్తే మన ఉక్కు దిగుమతులు రికార్డులను బద్దలు కొడితే ఎగుమతులు ఏడేండ్ల కనిష్టానికి పడిపోయాయి. ప్రపంచంలో ముడి ఇనుము ఉత్పత్తిలో రెండవ స్థానంలో ఉన్న మనదేశం అంతిమంగా తయారైన ఉక్కు ఉత్పత్తులను దిగుమతి చేసుకొనే దేశంగా నరేంద్రమోడీ ఏలుబడిలో మారింది. దక్షిణ కొరియా, చైనా, జపాన్‌ నుంచి దిగుమతులు గణనీయంగా పెరిగాయి.మన మొత్తం దిగుమతుల్లో 78శాతం ఈ దేశాల నుంచే జరుగుతున్నాయి. దిగుమతులు పెరగటంతో 15 నుంచి 25 శాతం వరకు దిగుమతి పన్ను విధింపు గురించి ఆలోచిస్తున్నట్లు ఉక్కుశాఖా మంత్రి కుమారస్వామి గతనెలలో చెప్పారు. మన దేశంలో తయారైన ఉక్కు ఎగుమతులు ఎక్కువగా ఇటలీ, బెల్జియం, నేపాల్‌, స్పెయిన్లకు జరుగుతుండగా గణనీయంగా పడిపోయాయి.


అమెరికా పన్ను విధింపునకు కట్టుబడి ఉంటే పీఠమెక్కి రెండు నెలలు కూడా గడవక ముందే తాను రాజునని ప్రకటించుకున్న డోనాల్డ్‌ ట్రంప్‌ తనకు లొంగరు అనుకున్నవారి మీద ఎడాపెడా కొరడా రaళిపిస్తున్నాడు. సుంకాలు, ప్రతి సుంకాలు విధిస్తూ బస్తీమే సవాల్‌ అంటున్నాడు. తలవంచేట్లు చేసేందుకు బెదిరింపులా, బేరమాడేందుకు వేస్తున్న పాచికలా చివరకు ఏం జరుగుతుంది, ఎలా ముగుస్తుందన్నది ఎవరూ చెప్పలేరు. ప్రతి దేశానికి బలం`బలహీనతలు ఉన్నాయి, దానికి అమెరికా మినహాయింపు కాదు గనుక ట్రంపు కూడా వెనక్కు తగ్గినా ఆశ్చర్యం లేదు. జి 7 కూటమిలో ఉండటమే గాక అమెరికా అడుగుజాడల్లో నడుస్తున్న కెనడాను 51వ రాష్ట్రంగా విలీనం చేసుకోవాలన్న సంకల్పాన్ని ట్రంప్‌ వెలిబుచ్చాడు. ప్రతి సుంకాలు విధిస్తే మరింతగా పెంచుతామంటూ సామాజిక మాధ్యమంలో పోస్టు పెట్టాడు. తోటి దేశాధినేత అని కూడా చూడకుండా సుంకాల విషయాన్ని ‘‘ కెనడా గవర్నర్‌ జస్టిన్‌ ట్రుడేవ్‌కు ’’ వివరించండని కూడా దానిలో సలహా ఇచ్చాడు. అమెరికాలో రాష్ట్రపాలకులను గవర్నర్‌ అంటారు గనుక కెనడా తమ మరొక రాష్ట్రమని చెప్పటమే అది. ట్రంప్‌ టిప్‌టాప్‌గా ఉన్నప్పటికీ అతగాడి చర్యలు పిచ్చివాడి పనిగా ఉన్నాయంటూ ఒక పత్రిక చేసిన వ్యాఖ్యను ట్రుడేవ్‌ ఉటంకించాడు. అత్యంత సన్నిహితం,భాగస్వామిగా ఉన్న కెనడా మీద వాణిజ్య యుద్దం ప్రకటించి అదే సమయంలో హంతక నియంత పుతిన్ను సంతుష్టీకరించేందుకు పూనుకోవటం మతి ఉండి చేస్తున్న పనులేనా అన్నట్లుగా విరుచుకుపడ్డాడు. నిజంగా వాణిజ్యపోరు జరిగితే చివరి వరకు కెనడా నిలుస్తుందా లేదా అన్నది వేరే అంశం.


చివరికి కెనడాలో అత్యధిక జనాభా గల ఒంటారియో రాష్ట్ర ప్రధాని డగ్‌ ఫోర్డ్‌ కూడా ట్రంప్‌ను దుయ్యబట్టాడు. మేమిచ్చే విద్యుత్‌, ఇంథనం మీద ఆధారపడుతూ మమ్మల్ని బాధిస్తారా మేం తలుచుకుంటే న్యూయార్క్‌ నగరంలో పదిహేను లక్షల మందికి విద్యుత్‌ నిలిచిపోతుంది జాగ్రత్త అన్నాడు. కమ్యూనిస్టు చైనీయుల సంగతి వదిలేద్దాం, కెనడియన్లే అలా స్పందిస్తే మన సంగతేమిటి ? తాను ప్రపంచమంతా తిరిగి పోయిన భారత ప్రతిష్టను తిరిగి తెచ్చానని ఆత్మగౌరవాన్ని నిలిపానని చెప్పిన ప్రధాని నరేంద్రమోడీ నోటి నుంచి ట్రంప్‌ సుంకాల ప్రకటన మీద ఎలాంటి స్పందన లేదు.ఆత్మగౌరవమా, లొంగుబాటా ఏమనుకోవాలి ? ఫిబ్రవరి రెండవ వారంలో మోడీ అమెరికా పర్యటన జరపటానికి ముందే నమస్కార బాణం వేసినట్లుగా కొన్ని రకాల మోటారు సైకిళ్ల మీద 50శాతం పన్నును 30కి, విస్కీ మీద 150 నుంచి 100శాతానికి, అలాగే మరికొన్నింటి మీద పన్నులు తగ్గించి ట్రంప్‌ను ప్రసన్నం చేసుకొనేందుకు చూశారు. వ్రతం చెడ్డా ఫలం దక్కలేదనుకోవాలా ? ఏదైనా నూటనలభై కోట్ల మంది జనానికి ఏదో ఒకటి చెప్పాలా వద్దా ! మౌనానికి అర్ధం ఏమిటి ?

ప్రపంచాన్ని కుదిపేసిన పది నిమిషాల రచ్చ – ఉక్రెయిన్‌కు మిలిటరీ సాయం నిలిపిన ట్రంప్‌ !

Tags

, , , , , , , ,

ఎం కోటేశ్వరరావు

‘‘ ప్రపంచాన్ని కుదిపివేసిన పది రోజులు ’’ అనే మహత్తర గ్రంధంలో 1917లో రష్యాలో జరిగిన బోల్షివిక్‌ విప్లవం ఎలా జరిగిందో వివరించారు. ప్రపంచంలో తొలిసారిగా కమ్యూనిస్టులు అధికారానికి వచ్చిన ఉదంతాల ప్రత్యక్ష సాక్షిగా ఉన్న అమెరికన్‌ రచయిత జాన్‌రీడ్‌ రాశాడు. ఫిబ్రవరి 28 శుక్రవారం నాడు అమెరికా అధినేత డోనాల్డ్‌ ట్రంప్‌ఉక్రెయిన్‌ అధ్యక్షుడు వ్లదిమిర్‌ జెలెనెస్కీ మధ్య పదినిమిషాల పాటు వైట్‌హౌస్‌లోని అధ్యక్షుడి కార్యాలయం ఓవల్‌ హౌస్‌లో సాగిన తీవ్ర వాగ్వివాదం యావత్‌ ప్రపంచాన్ని కుదిపివేసింది. రష్యన్‌ విప్లవం అనేక పరిణామాలు, పర్యవసానాలకు దారితీసింది. ఈ పదినిమిషాల వాగ్వివాదం దేనికి దారితీస్తుంది ? రష్యన్‌ విప్లవానికి దీనికి పోలిక లేదు గానీ అనేక పర్యవసానాలకు నాంది అన్నది స్పష్టం. రెండవసారి అధికారానికి వచ్చిన వందరోజులు కూడా గడవక ముందే అనేక వివాదాస్పద నిర్ణయాలు, తనకు లొంగని దేశాల వస్తు దిగుమతులపై సుంకాలు విధింపు ప్రకటనలు తెలిసిందే. పదవిని స్వీకరించిన 24 గంటల్లోనే ఉక్రెయిన్‌ సంక్షోభాన్ని పరిష్కరిస్తానని ప్రకటించాడు.సుంకాల సమస్య వెంటనే అందరికీ కనిపించే ప్రభావం చూపలేదు గానీ జోశ్యం చెప్పేబల్లి కుడితి తొట్టిలో పడినట్లు పరిష్కరిస్తానన్న పెద్ద మనిషి తానే ఒక పెద్ద వివాదంలో ఇరుక్కుపోవటం నిజంగా అనూహ్యపరిణామమే. ఆ ఉక్రోషంతో ఉక్రెయిన్‌కు తాత్కాలికంగా మిలిటరీ సాయాన్ని నిలిపివేస్తున్నట్లు సోమవారం నాడు ప్రకటించాడు. ఇది వంద కోట్ల డాలర్ల వరకు ఉంటుందని, జెలెనెస్కీ ఒప్పందానికి వచ్చేంత వరకు నిలిపివేస్తున్నట్లు అధికారులు వెల్లడిరచారు. అంతకు ముందు ఆదివారం నాడు లండన్‌లో సమావేశం జరిపిన ఐరోపా పెద్దలు నాలుగు అంశాల శాంతి ప్రతిపాదన గురించి చర్చించారు. తరువాత బ్రిటన్‌, ఫ్రాన్సునేతలు నెల రోజుల కాల్పుల విరమణకు రష్యా ముందు ఒక ప్రతిపాదన పెట్టారు. మొత్తం మీద జెలెనెస్కీ బుర్రలో ఏముందో సిఐఏ పసిగట్టలేకపోయిందా ? అమెరికా బలవంతంగా ఖనిజాల ఒప్పందాలను రుద్దాలనుకుందా, అహంకారంతో తానే ఊబిలో దిగిందా ? అసలేం జరిగింది ?


ఓవల్‌ ఆఫీసులో అధ్యక్షుడు ట్రంప్‌, ఉపాధ్యక్షుడు జెడి వాన్స్‌, జెలెనెస్కీ ఆసీనులయ్యారు.‘‘ శాంతికి దారి మరియు సంపద్వంతం కావటానికి మార్గం బహుశా దౌత్యంలో పాల్గ్గొనటంద్వారా సాధ్యం కావచ్చు, దాన్నే అధ్యక్షుడు ట్రంప్‌ చేస్తున్నారు ’’ అని జెడి వాన్స్‌ అన్నాడు. దాంతో జెలెనెస్కీ అందుకొని ‘‘ ఎలాంటి దౌత్యం, జెడీ మీరు దేని గురించి మాట్లాడుతున్నారు, దాని భావమేమిటి ’’ అన్నాడు. దీంతో మాటా మాటా పెరిగింది. మంచీ మర్యాదా లేకుండా అమెరికా మీడియా ముందు వివాదాన్ని సృష్టిస్తున్నారని వాన్స్‌ అన్నాడు. మిలిటరీతో సమస్యలను ఎదుర్కొంటున్నారని కూడా అన్నాడు. యుద్ద సమయంలో ప్రతి ఒక్కరికీ సమస్యలుంటాయి, మీకంటే చాలా ఉంది, ఇప్పుడు మీకు అవగతం కాదు, కానీ భవిష్యత్‌లో తెలుస్తుందని జెలెనెస్కీ అనటంతో ట్రంప్‌కు మండిపోయింది. మాకేం జరుగుతుందో నువ్వు మాకు చెప్పవద్దంటూ రంకెలు వేశాడు. జూదం ఆడటానికి నీ దగ్గర తురుపు ముక్కలేమీ లేవని, లక్షలాది మంది ప్రాణాలతో చెలగాటమాడుతున్నావని అన్నాడు. ఇలాంటి సందర్భాలలో మంచి కోటు వేసుకొని రావాలని తెలీదా, అసలు కోటు ఉందా అని అమెరికన్లు అవమానించారు. అమెరికన్‌ విలేకరి జెలెనెస్కీని కోటు గురించి అడగ్గానే జెడి వాన్స్‌ నవ్వాడు.యుద్దం ముగియగానే నేను ధరిస్తాను, బహుశా అది మీరు వేసుకున్నటువంటిది లేదా అంతకంటే మెరుగైంది వేసుకుంటాను అని జెలెనెస్కీ సమాధానమిచ్చాడు. వాగ్వాదం తరువాత చివరికి జెలెనెస్కీ లేచి వెళ్లిపోయాడు. ముగ్గురిలో పెద్ద వాడు ట్రంప్‌. జెలెనెస్కీజెడివాన్స్‌ మధ్య గొడవ ప్రారంభం కాగానే ఉపశమింపచేయాల్సింది పోయి తానే తగాదాకు ఉపక్రమించటం గమనించాల్సిన అంశం. ఉక్రెయిన్‌ విఫలమైందంటే దాని అర్ధం పుతిన్‌ విజయం సాధించినట్లు కాదు, అది ఐరోపాకు , అమెరికాకూ వైఫల్యమే అని తరువాత జెలెనెస్కీ అన్నాడు.మొత్తం మీద అమెరికన్లు అతి తెలివి ప్రదర్శించినట్లు స్పష్టంగా కనిపిస్తోంది. రచ్చకు కొద్ది గంటల ముందే ఎక్కువగా మాట్లాడవద్దని అమెరికా జెలెనెస్కీకి స్పష్టం చేసిందా అంటే అవుననే వెల్లడైంది. బహుశా అదే జెలెనెస్కీని ప్రేరేపించి ఉన్నట్లు కనిపిస్తోంది. ఓవల్‌ ఆఫీసుకు రాగానే రిపబ్లికన్‌ పార్టీ దక్షిణ కరోలినా రాష్ట్ర రిపబ్లికన్‌ పార్టీ సెనెటర్‌ లిండ్సే గ్రాహమ్‌ జెలెనెస్కీతో మాట్లాడుతూ రక్షణ ఒప్పందాల గురించి వాదోపవాదాలకు దిగవద్దని హెచ్చరించినట్లు న్యూయార్క్‌టైమ్స్‌ పత్రిక పేర్కొన్నది. గ్రాహమ్‌ స్వయంగా ఆ పత్రికతో ఈ విషయాన్ని చెప్పాడు.

జోర్డాన్‌ రాజు అబ్దుల్లా ఇటీవల అమెరికా పర్యటన జరిపి ట్రంపుతో భేటీ అయ్యాడు.ఇద్దరూ కలసి పత్రికా గోష్టి నిర్వహించారు. గాజాలోని పాలస్తీనియన్లకు జోర్డాన్‌లో నివాసం కల్పించేందుకు రాజు అబ్దుల్లా అంగీకరించాడంటూ డోనాల్డ్‌ ట్రంప్‌ ప్రకటించేశాడు. అక్కడే అది అవాస్తవం అంటే పరువు పోతుందని అనుకన్నాడేమో తమాయించుకొని ట్రంప్‌ పరువు కాపాడేందుకు అబ్దులా మౌనంగా ఉన్నాడు. తరువాత అలాంటిదేం లేదని, తమకు అంగీకారం కాదని కూడా ప్రకటించాడు. అలాగే జెలెనెస్కీని ఇరికించాలన్న దుష్టాలోచనతో ట్రంప్‌ అదే మాదిరి పత్రికా గోష్టి ఏర్పాటు చేశాడు. అయితే అనుకున్నదొకటి అయ్యింది ఒకటి. జెలెనెస్కీ ప్రశ్నించకపోతే తాను ఇబ్బందుల్లో పడతాడు. తమ దేశ రక్షణ హామీ సంగతి ఏమిటని ప్రశ్నిస్తాడని అమెరికన్లు ఊహించలేకపోయారు. దౌత్య మర్యాదలు, సంస్కారాన్ని పక్కనపెట్టి అవమానించటంతో జెలెనెస్కీ ఖనిజాల ఒప్పందంపై సంతకాలు చేయకుండానే లేచివెళ్లిపోయాడు. శాంతి ఒప్పందానికి అంగీకరిస్తేనే తిరిగి రా అని ట్రంప్‌ ప్రకటిస్తే, మీరు పిలిస్తేనే వస్తా, భద్రతకు హామీ ఇస్తే ఖనిజాల ఒప్పందమీద సంతకం చేస్తానంటూ బంతిని జలెనెస్కీ అవతలివైపు నెట్టాడు. సోమవారం నాడు లండన్లో కెనడాతో సహా పద్దెనిమిది ఐరోపా దేశాల నేతలు సమావేశమై పరిస్థితిని సమీక్షించి పాము చావకుండా కర్ర విరగకుండా అన్నట్లు అమెరికాకు మరింత ఆగ్రహం కలగకుండా, నట్టేటవదిలేదని ఉక్రెయిన్‌కు ఊరట పలుకుతూ ఒక ప్రకటన చేశారు. అవ్వా, బువ్వా రెండూ కావాలంటే కుదరదు అన్నట్లుగా పరిస్థితి ఉంది, ఏం జరగనుందన్నది యావత్‌ ప్రపంచంలో తలెత్తిన ఆసక్తి. ఎందుకిలా జరిగింది, పరిణామాలు, పర్యవసానాలేమిటి ?

ఉక్రెయిన్‌ శాంతికి హామీ ఇచ్చేందుకు సుముఖంగా ఉన్న కూటమి నాలుగు అంశాలతో ప్రతిపాదన రూపొందించినట్లు బ్రిటన్‌ ప్రధాని కెయిర్‌ స్టార్మర్‌ లండన్‌ సమావేశం తరువాత ప్రకటించాడు. ఈ క్రమంలో అమెరికా భాగస్వామి కావాలని కోరుతున్నట్లు, ఈ మేరకు ప్రయత్నాలను ముమ్మరం చేస్తామని కూడా చెప్పాడు.‘‘ఈ రోజు మేమ చరిత్ర కూడలిలో ఉన్నాము.దీర్ఘకాలం తరువాత ఐరోపా ఐక్యత ఇంత ఉన్నత స్థాయిలో ఉండటం చూడలేదు ’’అన్నాడు. నిజమైన శాంతి, హామీతో కూడిన భద్రతకు అమెరికా సహకారం కోసం ఐరోపాలో మేమంతా ఒక ప్రాతిపదికను కనుగొనేందుకు పని చేస్తున్నామని జెలెనెస్కీ చెప్పాడు. నాలుగు అంశాలు ఏవంటే, ఉక్రెయిన్‌కు సహాయం కొనసాగింపురష్యా మీద ఆర్థికవత్తిడి పెంపు, శాంతి ఒప్పందం కుదిరితే అది ఉక్రెయిన్‌ భద్రత, సార్వభౌమత్వాన్ని కాపాడేదిగా ఉండేట్లు చూడాలిశాంతి చర్చల్లో ఉక్రెయిన్‌కు భాగస్వామ్యం విధిగా ఉండాలి.శాంతి ఒప్పందం కుదిరితే అది భవిష్యత్‌లో ఏదైనా దురాక్రమణను ఎదుర్కొనే విధంగా రక్షణ సామర్ద్యాలను పెంచాలి. ఉక్రెయిన్‌ ఒప్పందాన్ని బలపరిచేందుకు, తరువాత శాంతికి హామీగా ఉండేందుకు కలసి వచ్చే వారితో ఒక కూటమిని అభివృద్ధి చేయాలి. స్థంభింప చేసిన రష్యా ఆస్తుల నుంచి వచ్చే వడ్డీ మొత్తం నుంచి 2.4 బిలియన్‌ డాలర్లను ఉక్రెయిన్‌ మిలిటరీ అవసరాల కోసం ఇవ్వాలని, ఇది గాక తాము మరో రెండు బిలియన్‌ డాలర్ల మొత్తాన్ని ఐదువేల గగనతల రక్షణ క్షిపణుల కొనుగోలు రుణం ఇవ్వాలని నిర్ణయించినట్లు బ్రిటన్‌ ప్రధాని చెప్పాడు. గతం నుంచి తాము పాఠాలు నేర్చుకున్నామని, రష్యా సులభంగా ఉల్లంఘించేందుకు అవకాశమిచ్చే బలహీన ఒప్పందాన్ని తాము అంగీకరించబోమన్నాడు. ప్రతిపాదిత ఐరోపా కూటమిలో ఏఏ దేశాలు ఉన్నదీ చెప్పలేదు. ఒప్పందం కుదరాలన్న ట్రంప్‌తో ఏకీభవిస్తున్నామని, దాన్ని అందరం కలసి చేయాలన్నాడు. గత శుక్రవారం నాడు జరిగిందాన్ని చూడాలని ఎవరూ కోరుకోలేదని, అమెరికా నమ్మదగిన దేశం కాదంటే తాను అంగీకరించనని కెయిర్‌ చెప్పాడు. ఐరోపాను తిరిగి సాయుధం కావించటం తక్షణ అవసరమని ఐరోపా కమిషన్‌ అధ్యక్షురాలు ఉర్సులా వాండెర్‌ లియాన్‌ చెప్పగా, ఉక్రెయిన్‌ ఎంత కాలం ప్రతిఘటిస్తే అంతకాలం మద్దతు ఇవ్వాలని భావించినట్లు నాటో ప్రధాన కార్యదర్శి మార్క్‌ రూటే చెప్పాడు. సముద్ర, గగనతల దాడులు, మౌలిక సదుపాయాల ధ్వంస దాడులు నెల రోజులు ఆపాలని బ్రిటన్‌,ఫ్రాన్సు ప్రతిపాదించాయి. అయితే భూతల దాడుల విరమణ అంశం లేదు.

ఈ పూర్వరంగంలో పరిణామాలు, పర్యవసానాల గురించి రకరకాల చర్చలు మొదలయ్యాయి. జెలెనెస్కీ దిగి వచ్చేంత వరకు మిలిటరీ సాయాన్ని నిలిపివేసినట్లు ప్రకటించిన పూర్వరంగంలో ఐరోపా ఆ మేరకు భర్తీ చేస్తుందా ? పరిమితంగానే అయినప్పటికీ ట్రంప్‌ వైఖరిని నిరసిస్తూ అమెరికాలో కొన్ని చోట్ల ప్రదర్శనలు జరిగాయి.అధికార రిపబ్లికన్‌, ప్రతిపక్ష డెమోక్రటిక్‌ పార్టీలోనూ భిన్నాభిప్రాయాలు వెల్లడయ్యాయి. ట్రంప్‌ గద్దె దిగేంత వరకు అమెరికా మిలిటరీ నౌకలకు ఒక్క లీటరు కూడా విక్రయించేది లేదని నార్వే చమురు కంపెనీ హాల్ట్‌బాక్‌ బంకర్స్‌ యజమాని ప్రకటించాడు.2024లో ఈ కంపెనీ మూడు మిలియన్‌ లీటర్లు విక్రయించింది.అయితే అమెరికాతో తమ సంబంధాలకు ఎలాంటి ఇబ్బంది లేదని నార్వే ప్రభుత్వం ప్రకటించింది. లండన్‌లో సమావేశమైన దేశాలు ఉక్రెయిన్‌కు మద్దతు ఇవ్వాలని సంకల్పం చెప్పుకున్నప్పటికీ అమెరికాతో ఘర్షణకు సిద్దంగా లేవు. కొందరి విశ్లేషణ ప్రకారం అమెరికాఐరోపా మధ్య విబేధం పెరిగిందని, ట్రంప్‌ వైఖరి యూరోపియన్లను చైనా వైపు మొగ్గుచూపేందుకు దోహదం చేసేదిగా ఉందని గాభరాపడుతున్నారు. కమ్యూనిస్టు సోవియట్‌ యూనియన్‌కు వ్యతిరేకంగా అమెరికాతో చేతులు కలిపిన ఐరోపా ఇప్పుడు అంతకంటే బలమైన కమ్యూనిస్టు చైనాతో చేతులు కలుపుతుందా ! గాజాలో శాంతి ఒప్పందాన్ని ఏ క్షణంలోనైనా ఉల్లంఘించేందుకు చూస్తున్న ఇజ్రాయెల్‌కు అన్ని రకాలుగా ట్రంప్‌ మద్దతు తెలుపుతున్నాడు. మధ్య ప్రాచ్యం, పశ్చిమాసియాలో తిష్టవేయటం అమెరికా లక్ష్యం. దానికి పావుగా ఇజ్రాయెల్‌ ఉంది. ఐరోపాలో పరిస్థితి వేరు. మిత్ర వైరుధ్యం ఉన్నప్పటికీ యావత్‌ ఐరోపా అమెరికా ప్రభావంలో ఉంది, కొత్తగా అమెరికా కాలూనాల్సిన అవసరం లేదు. నాటో విస్తరణ పేరుతో రష్యా ముంగిట ఆయుధాలతో తిష్టవేయాలని చూసిన అమెరికాకు అనూహ్యంగా ఎదురుదెబ్బతగిలింది. ఎన్ని ఆయుధాలు, ఎంత డబ్బు అందించినా పుతిన్‌ సేనలపై ఉక్రెయిన్‌ గెలిచే అవకాశాలు లేవని స్పష్టమైంది. రష్యా కమ్యూనిస్టు లేదా వామపక్ష శక్తుల పాలనలో లేదు.కమ్యూనిస్టుల పరిభాషలో చెప్పాలంటే అది ఒక బూర్జువాదేశం. అందువలన చైనాకు వ్యతిరేకంగా దాన్ని దగ్గరకు తీసుకోవాలని, చైనాతో ప్రచ్చన్న యుద్దం కొనసాగించాలన్నది అమెరికన్ల తాజా ఎత్తుగడగా కనిపిస్తున్నది. అమెరికా, ఐరోపాల నుంచి ముప్పు ఉంది గనుకనే రష్యా ఒక ప్రత్యర్ధిగా ఉంది, అది తొలిగితే వాటితో చేతులు కలపటానికి ఎలాంటి అభ్యంతరమూ ఉండదు. గతంలో జి7 కూటమిని విస్తరించి జి8గా మార్చేందుకు అవకాశమిచ్చినపుడు చేరిన సంగతి, 2006 సెయింట్‌ పీటర్స్‌బర్గ్‌లో కూటమి సమావేశాలను కూడా నిర్వహించిన సంగతి తెలిసిందే. తిరిగి అంతలోనే కుట్రల కారణంగా రష్యా ఆ కూటమికి ప్రత్యర్ధిగా మారింది. చేతులు కలపాలంటే తేలాల్సిన లెక్కలు చాలా ఉన్నందున, చైనాకు వ్యతిరేకంగా వెంటనే మారుతుందని చెప్పలేము. అయితే ప్రతిదేశం తన ప్రయోజనాలకు పెద్ద పీటవేస్తున్నపుడు అనూహ్యపరిణామాలు జరిగితే, ఏం జరుగుతుందో ఎలా చెప్పగలం !

కుంభమేళా లాభ నష్టాలు : అమెరికా చాట్‌ జిపిటి, చైనా డీప్‌సీక్‌, మనం గంగలో మునిగి తేలుతున్నాం !

Tags

, , , , , , , ,

ఎం కోటేశ్వరరావు


జనవరి 13 నుంచి ఫిబ్రవరి 26 వరకు ప్రయాగ్‌ రాజ్‌ పాతపేరు అలహాబాద్‌లో మహాకుంభమేళా, ఫిబ్రవరి 28వ తేదీ జాతీయ సైన్సు దినోత్సం జరిగింది. మీడియా దేనికి ఎంత ప్రచారమిచ్చింది ? కుంభమేళాకు ఇచ్చిన ప్రచారంలో వెయ్యోవంతైనా శాస్త్రవిజ్ఞానం, మూఢవిశ్వాసాలు సంబంధిత లాభనష్టాల గురించి పాఠకులు, వీక్షకులకు చెప్పిందా ? కుంభమేళా స్నానాలకుసైన్సును జోడిరచిన ప్రవచనాలకు ఎక్కడలేని ప్రాధాన్యత ఇచ్చారు. ఎవరి నమ్మకాలు వారివి. ప్రభుత్వం చెబుతున్నదాని ప్రకారం 66 కోట్ల మంది గంగ, యమున, అంతర్వాహిని అని చెబుతున్న సరస్వతి నది త్రివేణీ సంగమంలో మునకలేసి స్నానాలు చేశారు. దీని వెనుక అనేక నమ్మకాలు ఉన్నాయి. కొందరు పుణ్యం కోసం అంటే మరికొందరు చేసిన తప్పులకు ప్రాయశ్చిత్తంగా, పాపాలను కడిగి వేసుకొనేందుకని రకరకాల కారణాలు చెప్పారు. ఎవరికి ఏమి లభించిందో తెలియదు. ఎవరి గోల, ఎవరి లెక్కలు వారివి. వెళ్లినవారు తమ యాత్ర, స్నానం జరిగిన తీరు గురించి చెప్పుకుంటుంటే ఈ కార్యక్రమం వలన రెండున్నరలక్షల కోట్ల రూపాయల మేర లావాదేవీలు జరిగినట్లు కొందరు అంచనా వేశారు. జాతీయ స్థూల ఉత్పత్తికి నాలుగు లక్షల కోట్ల రూపాయల మేర లబ్ది కలిగిందని దీన్ని ‘‘ శాస్త్రీయం ’’ గా లెక్కలు కట్టి రాష్ట్రంలోని సంఘటిత, అసంఘటిత రంగానికి కలిగిన లబ్ది, ఉపాధి గురించి నిర్ధారించాలని ఉత్తర ప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ ఆదేశించినట్లు వార్తలు(దైనిక జాగరణ్‌,2025 ఫిబ్రవరి 27) వచ్చాయి. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఒక ప్రచార అస్త్రంగా దీన్ని మార్చుకుంటారు గనుక అలాంటి లెక్కలను తేల్చాలని కోరటం అర్ధం చేసుకోదగిందే. ఒక అశాస్త్రీయ అంశాన్ని ప్రోత్సహించి దాని ద్వారా కలిగిన ఆర్థిక లబ్దిని శాస్త్రీయంగా తేల్చాలనటం కొందరికే సాధ్యం. భక్తి శివుడి మీద చిత్తం చెప్పుల మీద అన్న లోకోక్తి ఊరికే రాలేదు.

సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి మార్కండేయ కట్జు 2012 ఏప్రిల్‌ నాలుగవ తేదీన జనాన్ని వెర్రివెంగళప్పలు చేసేందుకు పది మార్గాలంటూ ఒక వ్యాసం రాశారు. మన దేశంలోని 90శాతం మంది జనాలకు శాస్త్రీయ దృక్పధం లేదని పేర్కొన్నారు. ఈ శాతాన్ని మీరు ఎలా చెప్పారంటూ అమెరికా పత్రిక వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌ ఢల్లీి విలేకరి కట్జును ప్రశ్నించారట. ఇది గణాంకం కాదు, ఒక అంచనా మాత్రమే అంటూ అది 85శాతం లేదా 95శాతం కూడా కావచ్చని చెప్పానని, తాను రాసిన దానికి అర్ధం భారతీయులు అత్యధికులు వెర్రి వెంగళప్పలు అని చెప్పినట్లు తరువాత ఆయనే మరో వ్యాసంలో రాశారు. కుంభమేళా గురించి మీడియా కల్పించిన ప్రచారం, దానికి ప్రభావితులైన వారిని చూస్తే కట్జూ చెప్పినట్లు ఆ సంఖ్య ఇంకా పెరిగిందా, తగ్గిందా అన్నది ఎవరికి వారే అంచనావేసుకోవచ్చు. ఈ పదమూడు సంవత్సరాలలో దేశాంలో శాస్త్రీయ దృక్పధం పెరిగిందని, కట్జూ చెప్పింది తప్పని, శాస్త్రీయంగానే 66 కోట్ల మంది గంగలో మునిగారని ఎవరైనా శాస్త్రీయంగా నిరూపిస్తే అంగీకరించటానికి ఇబ్బంది లేదు. ముస్లిం, క్రైస్తవం, ఇతర మతాల్లో కూడా ఇలాంటివి గాకపోయినా పెద్ద సంఖ్యలో గుమికూడే వారికి ఇదే వర్తిస్తుంది. మతం, అది వ్యాపింపచేసే నమ్మకాలు మత్తు మందు.

అంతరిక్షంలోకి ఉపగ్రహాలను పంపే శాస్త్రవేత్తలు అవి కూలిపోకుండా ఎగరాలంటూ దేవుళ్లు, దేవతలను ప్రార్ధించటం తెలిసిందే. బిజెపి వాగ్దానాలలో సైన్సు అభివృద్ధి ఒకటి. చూడండి మా మోడీ కారణంగానే డిజిటల్‌ ఇండియా ఉనికిలోకి వచ్చింది, బిచ్చగాండ్లు కూడా బాంకు ఖాతా ఓపెన్‌ చేసి స్కానర్‌ పెట్టి అడుక్కుంటున్నారు అని తమ భుజాలను తామే చరుచుకొనేవారు ఉన్నారు. నిజమే, ఎలా వచ్చిందనేది అందరికీ తెలుసు గనుక ఆ ఖ్యాతిని మొత్తం నరేంద్రమోడీ తన ఖాతాలో వేసుకున్నా దేశానికి నష్టం లేదు, గతంలో ఒక సిఎం హైదరాబాదును తానే నిర్మించానన్నట్లుగా చెప్పుకున్నారు. కానీ బిచ్చగాండ్ల సంగతేమిటి ? అందుకే సైన్స్‌, సాంకేతిక పరిజ్ఞానం అంటే ఒక్క డిజిటల్‌ ఇండియా మాత్రమే కాదు. ఆ పరిజ్ఞానం ద్వారా అమెరికా కంటే ఎక్కువ లావాదేవీలు జరుగుతున్నాయి, కానీ ఆర్థికంగా దానికి మనం ఎంతదూరంలో ఉన్నాం ? పని చేసే ప్రభుత్వ నేతగా మోడీ గురించి చెబుతారు. పరిశోధన మరియు అభివృద్ధి రంగం(ఆర్‌ అండ్‌ డి) గురించి ఒక విధాన నిర్ణయానికే తొమ్మిదేండ్లు పట్టింది. జాతీయ పరిశోధనా ఫౌండేషన్‌ 2023లో ఉనికిలోకి వచ్చింది. ఐదేండ్లలో ఆరువందల కోట్ల డాలర్లు ఖర్చు చేయాలని నిర్ణయించారు. అంటే అన్నారని గింజుకుంటారు గానీ ఇష్టంలేని పెండ్లికి తలంబ్రాలు పోసినట్లుగా దీని వ్యవహారం ఉంది. గత కాంగ్రెస్‌ పాలకులు, నరేంద్రమోడీకి పెద్ద తేడా ఏమీలేదు.

అమెరికా చాట్‌ జిపిటి, చైనా డీప్‌ సీక్‌లో మునిగితేలుతుంటే మనం గంగలో మునకలేస్తున్నాం. మన వారు డీప్‌ సీక్‌ రూపొందించలేకపోవటానికి మనదేశాన్ని విదేశీ పాలకులు ఆక్రమించుకోవటమే అంటూ ఆర్‌ఎస్‌ఎస్‌ పత్రిక ఆర్గనైజర్‌లో మత కోణాన్ని జోడిరచి విశ్లేషణ చేశారు.వేదాల్లోనే అన్నీ ఉన్నాయష అని లొట్టలు వేసుకుంటూ చెబుతారు. ఆ ఒక్కటీ అడక్కు అనే సినిమాలో జ్యోతిష్కుడు చెప్పినదాన్ని నమ్మి పనిపాటాలేకుండా గడిపిన పాత్ర మాదిరి కాలక్షేపం చేస్తున్నారు. గత పది సంవత్సరాల్లో పురాణాల్లో చెప్పిన పుక్కిటి కబుర్లను వల్లెవేస్తూ మనదేశంలో ఎప్పుడో అవయవ మార్పిడి జరిగిందనటానికి వినాయకుడికి ఏనుగు తొండం అమర్చటం, కృత్రిమ గర్భం ద్వారా పిల్లలకు ఉదాహరణకు కౌరవులని, ఎంత మంది ఎక్కినా ఒకరికి చోటుండే పుష్పక విమానాలను రూపొందించారని సొల్లు కబుర్లు చెబుతున్నారు తప్ప వేదాల్లో ఉన్నవాటిని వెలికి తీసింది లేదు. శాస్త్రీయ దృక్పధాన్ని పెంపొందించాలని మన రాజ్యాంగం నిర్దేశించగా దానికి విరుద్దంగా సిలబస్‌ నుంచి డార్విన్‌ జీవ పరిణామ సిద్దాంతాన్ని తొలగించారు.మనుషులు బ్రహ్మ ముఖం కాళ్లు చేతులు ఇతర భాగాల నుంచి పుట్టారని టీచర్లు చెప్పాలన్నమాట. ఎలాంటి వారి చేతులో చిక్కుకున్నాం ! రాజ్యాంగాన్ని దెబ్బతీయటం అంటే ఇదే. ఇలాంటి పాలకులు సైన్సు గురించి జనానికి ఎందుకు బోధిస్తారు.పరిశోధనలకు నిధులు ఎందుకు కేటాయిస్తారు.

నేషనల్‌ సైన్స్‌ అండ్‌ ఇంజనీరింగ్‌ రిసర్చ్‌ ఫౌండేషన్‌ ఏర్పాటు చేయాలని 2005లో నాటి ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు జాతీయ సైన్సు సలహా మండలి సిఫార్సు చేసింది, 2008లో ఆమోదం తెలిపారు.ఆ మేరకు ఒక చట్టాన్ని చేశారు. తరువాత మోడీ సర్కార్‌ అనుసంధాన్‌ నేషనల్‌ రిసర్చ్‌ ఫౌండేషన్‌(ఎన్‌ఆర్‌ఎఫ్‌) పేరుతో 2023లో ఒక చట్టాన్ని తెచ్చింది. అంతకు ముందు ఎన్ని కబుర్లు చెప్పినా ఇక చూడండి అంటూ 2023 నుంచి 2028 కాలంలో 50వేల కోట్ల రూపాయలతో పరిశోధనలు చేపడతామని చెప్పారు. ఈ మొత్తాన్ని సమీకరించేందుకు ప్రైవేటు, ప్రభుత్వ రంగ సంస్థలను ప్రోత్సహిస్తామన్నారు, 70శాతం నిధులు ప్రెవేట్‌ రంగం నుంచి సేకరిస్తామన్నారు. దీనికి ప్రధాన మంత్రే అధ్యక్షత వహిస్తారు. త్వరలో దేశాన్ని అమెరికా, చైనాల సరసన నిలబెడతామంటున్నారు. మహానుభావులు ఊరికే కబుర్లు చెప్పకూడదు కదా ! ఆ స్థాయికి చేరటానికి ఒక మార్గం పరిశోధనా రంగానికి పెద్ద మొత్తంలో కేటాయించాలి. ప్రపంచంలో ఈ కేటాయింపు జిడిపిలో సగటున రెండుశాతం ఉంది. మన దేశంలో 200910లో గరిష్టంగా 0.82శాతం ఉండగా అది మోడీ అధికారానికి వచ్చేనాటికి 0.7శాతానికి తరువాత 202425 ఆర్థిక సర్వే పేర్కొన్నదాని ప్రకారం 0.64శాతానికి దిగజారింది. ఎన్‌ఆర్‌ఎఫ్‌ ద్వారా ఐదేండ్లలో ఏడాదికి పదివేల కోట్ల రూపాయలు కేటాయించాల్సి ఉండగా 202324లో రు.2,000 కోట్లు కేటాయించి తరువాత దాన్ని కేవలం రు.258.6 కోట్లకు సవరించారు. వీరు దేశాన్ని ఉద్ధరిస్తారు, యువ పరిశోధకులను ప్రోత్సహిస్తారని ఆశించి భజన చేయాలి.

చైనాను త్వరలో అధిగమిస్తామని, ప్రపంచ వస్తుఉత్పత్తిదారుగా మారతామని కొంత మంది చెబుతుంటారు. మంచిదే, నరేంద్రమోడీ, ఆయనను గద్దె మీద కూర్చోపెట్టేందుకు ఊతమిస్తున్న చంద్రబాబు వంటి వారి 2047 రంగుల కలను కూడా నిజమే అనుకుందాం. కానీ ఆచరణ ఏమిటన్నది ప్రశ్న.1990దశకంలో భారత్‌చైనా రెండూ కూడా పరిశోధనలకు జిడిపిలో కేటాయించిన మొత్తం 0.7శాతమే. కానీ నేడు చైనా 2024లో 2.68శాతం ఖర్చు చేసింది. 202526 మన కేంద్ర బడ్జెట్‌ డాలర్లలో 584 బిలియన్లు కాగా 2024లో చైనా ఒక్క పరిశోధనకు ఖర్చు చేసిన మొత్తమే 496 బిలియన్‌ డాలర్లు.అర్ధం అవుతోందా ! కేంద్ర ప్రభుత్వం 2024నవంబరు 29న పార్లమెంటులో వెల్లడిరచిన సమాచారం ప్రకారం పది సంవత్సరాలలో మన పరిశోధన ఖర్చు జిడిపిలో 0.60.7శాతం మధ్య ఉండగా ఇజ్రాయెల్‌ 5.4, అమెరికా 3.5 శాతాల చొప్పున ఖర్చు చేస్తున్నాయి.మా తాతలు నేతులు తాగారు కావాలంటే మా మూతులు వాసన చూడండి అన్నట్లు కబుర్లు చెబితే దేశం ముందుకు పోదు. అన్నీ నెహ్రూయే చేశారు అని చెప్పే పెద్దలు పరిశోధనకు నిధులు పెంచకుండా ఎవరు అడ్డుకున్నారు? కుండలో కూడు అలాగే ఉండాలి పిల్లాడు భీముడిలా తయారు కావాలంటే కుదురుతుందా ?

పోనీ మన దేశం పరిశోధనలకు దూరంగా ఉందా అంటే లేదు.గోమూత్రంలో బంగారం ఎంతుంది, పేడలో ఏముంది అంటూ శోధిస్తున్నారు. సంఘపరివార్‌ భావజాలానికి అనుగుణంగా ప్రోత్సహిస్తున్నారు. ఉదాహరణకు జన్యు పరిశోధనలు చేసి దేశంలో ఉన్న జనాభా ‘‘ శుద్ధమైన జాతి ’’ జాతి ఏదో తేల్చేందుకు 2022లో కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వశాఖ నిధులు ఇస్తున్నదనే వార్తలు వచ్చాయి. ఇది ప్రమాదకరమని, విరమించాలని జన్యుశాస్త్రంలో నిపుణులు, చరిత్రకారులు, సామాజిక శాస్త్రవేత్తలు 120 మంది నాడు కేంద్రానికి లేఖ రాశారు. జన్యు చరిత్రను తెలుసుకోవటం అనే కారణాన్ని ప్రభుత్వం చెప్పింది.వివిధ ప్రజా సమూహాల నుంచి గతంలో డిఎన్‌ఏలను సేకరించి చేసిన విశ్లేషణ ప్రకారం అనేకవాటి సమ్మిళితం అని తేలింది. ఫలానా జన్యువులు ఉన్నవారు పరిశుద్దులు అంటే మిగతావారిని అవమానించే తీర్పు తప్ప సైన్సు కాదు. ఇలాంటి పనులన్నింటికీ స్ఫూర్తి జర్మన్‌ హిట్లర్‌. ఆర్‌ఎస్‌ఎస్‌ సిద్దాంతవేత్త , గురువుగా పరిగణించే ఎంఎస్‌ గోల్వాల్కర్‌ 1960 డిసెంబరులో గుజరాత్‌ విశ్వవిద్యాలయ విద్యార్దులను ఉద్దేశించి ప్రసంగించారు. దానిలో చెప్పిన అంశాల గురించి రచయిత, గతంలో ఆర్థికశాఖ సలహాదారుగా పనిచేసిన మోహన్‌ గురుస్వామి ప్రాంటియర్‌ పత్రిక 2018వ సంవత్సరం40వ సంచికలో ఒక వ్యాసం రాశారు. ‘‘ఉత్తమ జాతి సృష్టిక్రియేటింగ్‌ ఏ మాస్టర్‌ రేస్‌ ’’ శీర్షిక పెట్టారు. దాని ప్రకారం గోల్వాల్కర్‌ చెప్పిన అంశాలు ఇలా ఉన్నాయి.‘‘ మనం కేవలం జంతువులలో మాత్రమే సంకర జాతిని సృష్టించేందుకు ప్రయోగాలు చేశాం. మానవ సంకరం ద్వారా మెరుగైన మనుషు సృష్టించేందుకు మన పూర్వీకులు ధైర్యవంతమైన ప్రయోగాలు చేశారు.ఉత్తరాదికి చెందిన నంబూద్రీ బ్రాహ్మణులు కేరళలో స్దిరపడ్డారు. ఒక సాహసోపేతమైన నిబంధన తెచ్చారు. దాని ప్రకారం ఏ తరగతికి చెందిన వారైనా వివాహిత మహిళ ముందుగా ఒక నంబూద్రీ బ్రాహ్మణుడిని కూడి ఒక బిడ్డను కనాలి, తరువాతే ఆమె భర్తతో పిల్లలను కనాలి.( ఆర్‌ఎస్‌ఎస్‌ వాణి ఆర్గనైజర్‌ పత్రిక 1961 జనవరి రెండు సంచికలో ఉపన్యాస పూర్తి పాఠం ఉంది) ’’.

ఇలాంటి గురువుల శిష్యులు చేస్తున్నదేమిటి ? సంఘపరివార్‌ ఏర్పాటు చేసిన అనేక సంస్థలలో ఆరోగ్యభారతి ఒకటి. అది గర్భ విజ్ఞాన సంస్కార్‌ పేరుతో ఒక ప్రాజెక్టు నడుపుతున్నది. ఆజానుబాహులు, మంచి రంగు, రూపుతో ఉండే పిల్లలను పుట్టించటానికి పూనుకుంది. గుజరాత్‌లో మొదలెట్టి దేశమంతటా దీన్ని విస్తరించేందుకు తలపెట్టారు. అనేక చోట్ల ఈ మేరకు సభలు, సమావేశాలు కూడా నిర్వహిస్తుంటారు. జర్మన్‌ హిట్లర్‌ ఆర్యజాతి ఉత్తమమైనదని చెప్పినట్లుగానే ఉత్తమ హిందూజాతిని, హిందూ దేశభక్తులను రూపొందించేందుకు ఈ ప్రయత్నాలని జనాలను నమ్మిస్తున్నారు. జర్మన్‌ కాని సైన్సు పుస్తకాలను 1933లో నాజీలు తగులబెట్టారు. వాటిలో నాజీల భావజాలానికి వ్యతిరేకంగా ఉన్నవాటితో పాటు యూదు రచయితలు రాసినవి ఉన్నాయి. బెర్లిన్‌లో ఉన్న లైంగిక విజ్ఞాన సంస్థను లూటీ చేసి విధ్వంసకాండ సృష్టించారు. అంతే కాదు దేశంలో వివిధ సంస్థలలో శాస్త్రవేత్తలైనా, విద్యావేత్తలు, మేథావులు ఆర్యనేతరులు ఉంటే వారి స్థానాల నుంచి తొలగించారు. ఆర్య జాతి పవిత్రతను పరిశోధించి తేల్చే పేరుతో, తమ భావజాల లక్ష్యాలకు అనుగుణంగా జైళ్లలోని వేలాది మంది ఖైదీలపై అమానుషంగా పరీక్షలు, ప్రయోగాలు చేశారు.


మన దేశంలో అలాంటి ఉదంతాలు చోటు చేసుకుంటున్నాయి. 2025 ఫిబ్రవరి ఎనిమిదిన తిరుపతి పుస్తక మహోత్సవంలో కాషాయ మూకలు దాడులకు పాల్పడ్డాయి.ఖురాన్‌ గ్రంధంలోని అంశాలను ఉటంకిస్తూ ఇస్లామిక్‌`హిందూ విలువల గురించి పోల్చిన ఖురాన్‌ అనాలసిస్‌ అనే పుస్తకాన్ని విక్రయించినందుకు ఒక స్టాల్‌మీద దాడి జరిగింది. దాన్ని రాసింది శర్మ అనే హిందువే. అలాగే పెరియార్‌ రచనలతో పాటు రంగనాయకమ్మ రచన రామాయణ విషవృక్షం అనే గ్రంధాలను ఎందుకు విక్రయిస్తున్నారంటూ విశాలాంధ్ర స్టాల్‌ మీద దాడి చేశారు. అంతకు ముందు హైదరాబాద్‌ బుక్‌ఫెయిర్‌లో తిరుపతి బాలాజీ విగ్రహం గురించిన ఒక పుస్తకాన్ని ఉంచినందుకు వీక్షణం స్టాల్‌ మీద అదే చేశారు. చాలా సంవత్సరాల క్రితం హైదరాబాద్‌ బాగ్‌లింగంపల్లిలో ఉన్న సుందరయ్య విజ్ఞాన కేంద్రం మీద దాడి చేశారు. చరిత్రలో యంత్ర విధ్వంసకుల గురించి చదివాము.కొన్నింటిని నాశనం చేస్తే తరువాత వేలాది యంత్రాలు వచ్చాయి, వస్తాయి. అలాగే పుస్తకాలను అడ్డుకుంటే భావజాల వ్యాప్తి ఆగుతుందా ? పురాతన తక్షశిల విద్యాకేంద్రాన్ని ధ్వంసచేసినంత మాత్రాన మనదేశంలో భావజాల వ్యాప్తి ఆగిందా ! అరచేతిని అడ్డుపెట్టి సూర్యకాంతిని ఆపాలని చూసే బాపతు గురించి వేరే చెప్పాలా ? ఇలాంటి వారు అజ్ఞానాన్ని తప్ప విజ్ఞాన శాస్త్రాలను ప్రోత్సహిస్తారా ? వేదాల్లోనే అన్నీ ఉన్నాయష అని నమ్మేవారు పరిశోధన మరియు అభివృద్ధికి నిధులు కేటాయిస్తారా ? దేశాన్ని మధ్యయుగాల నాటికి తప్ప ముందుకు తీసుకుపోతారా ?

ఐరాసలో ఉక్రెయిన్‌ తీర్మానాలు : జెలెనెస్కీ వాషింగ్టన్‌ పర్యటన- ` డోనాల్డ్‌ ట్రంప్‌ మడమ తిప్పుతాడా !

Tags

, , , , ,

ఎం కోటేశ్వరరావు

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ తన రెండవ పదవీ కాలం తొలి నెల రోజుల్లో చేసిన ప్రకటనలు, తీసుకున్న నిర్ణయాల పరిణామాలు, పర్యవసానాల గురించి పరిపరి కథనాలు వెలువడుతున్నాయి. నిజంగా ఏం జరిగేది ఎవరూ చెప్పలేని స్థితి. రష్యాను దగ్గరకు తీసుకొని చైనాకు వ్యతిరేకంగా నిలపాలనే ఎత్తుగడతో అమెరికా ఉందని చెబుతున్నారు.సోమవారం నాడు ఐరాసలో జరిగిన పరిణామాలు ఆసక్తి కలిగిస్తున్నాయి.తమపై నాలుగో ఏడాదిలో ప్రవేశించిన రష్యా సైనిక చర్యలను ఖండిస్తూ దాడులు నిలిపివేయాలని ఐరాస సాధారణ అసెంబ్లీలో ఉక్రెయిన్‌ సోమవారం నాడు ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టింది. దానికి అనుకూలంగా 93, వ్యతిరేకంగా 18 దేశాలు ఓటు చేయగా, భారత్‌, చైనాతో సహా 65 దేశాలు తటస్థంగా ఉన్నాయి. గతంలో 140దేశాలు రష్యా చర్యను ఖండిరచే తీర్మానానికి మద్దతు ఇవ్వగా ఈసారి 93కు తగ్గాయి. ఉక్రెయిన్‌ తన తీర్మానాన్ని వెనక్కు తీసుకొని ‘‘ త్వరగా సంక్షోభాన్ని ముగించాలని ’’ తాను ప్రతిపాదించిన దానికి మద్దతు ఇవ్వాలని అమెరికా వత్తిడి చేసింది. మరోవైపున రష్యా మీద ఎలాంటి విమర్శ చేయకుండా సంక్షోభాన్ని ముగించాలని కోరుతూ భద్రతా మండలిలో అమెరికా ప్రవేశపెట్టిన తీర్మానానికి మద్దతుగా పది ఓట్లు రాగా ఐదుదేశాలు ఓటింగ్‌కు దూరంగా ఉన్నాయి. వాటిలో వీటో హక్కు కలిగిన బ్రిటన్‌, ఫ్రాన్సు కూడా ఉండటం విశేషం.ఈ పరిణామాల తరువాత శుక్రవారం నాడు జెలెనెస్కీ వాషింగ్టన్‌ వెళుతున్నాడని, విలువైన ఖనిజాల మీద ట్రంప్‌తో ఒక ఒప్పందం కుదుర్చుకోవచ్చని బుధవారం నాడు వార్తలు వచ్చాయి. ఇదే జరిగితే ట్రంప్‌ ఇప్పటి వరకు చెప్పినదానికి పూర్తి విరుద్దంగా వ్యవహించినా ఆశ్చర్యం లేదు. విలువైన ఖనిజాల కోసం ఉక్రెయిన్ను ట్రంప్‌ బెదిరిస్తున్నాడని గతంలో కొన్ని వార్తలు వచ్చాయి.

తమకు నాటో సభ్యత్వమిస్తే పదవి నుంచి వైదొలగటానికి కూడా సిద్దమే అని, తమ ప్రాంతాలను ఆక్రమించిన పుతిన్‌ అక్కడే తిష్టవేయటాన్ని అంగీకరించేది లేదని జెలెనెస్కీ అంతకు ముందు చెప్పాడు. తాము చేసిన ప్రతి డాలరు మిలిటరీ సాయానికి రెండు డాలర్లు చెల్లించాలని అమెరికా డిమాండ్‌ చేస్తోందన్నాడు. ఐదువందల బిలియన్‌ డాలర్ల ఖనిజాలను అప్పగించాలన్న వాషింగ్టన్‌ వత్తిడికి లొంగేది లేదని కూడా చెప్పాడు, అవసరమైతే వచ్చే పదితరాల వారు తమ రుణాలను తీర్చుకుంటారని అన్నాడు. విలువైన ఉక్రెయిన్‌ ఖనిజాల్లో 350 బిలియన్‌ డాలర్ల విలువ గలవి రష్యా అధీన ప్రాంతాల్లోనే ఉన్నాయని ఉపప్రధాని యులియా చెప్పాడు. ఉక్రెయిన్‌కు మద్దతు తెలిపేందుకు సోమవారం నాడు అనేక మంది ఐరోపా నేతలు కీవ్‌ చేరుకున్నారు. ఉక్రెయిన్‌పై ఒక నిర్ణయం తీసుకొనేందుకు, ఐరోపా రక్షణ గురించి చర్చించేందుకు మార్చినెల ఆరవ తేదీన సమావేశం కానున్నారు. రానున్న రెండు వారాల్లో రెండవ సారి సమావేశమయ్యేందుకు అమెరికా, రష్యా ప్రతినిధులు సన్నద్దమవుతున్నారు. తప్పుడు సమాచార బుడగలో ట్రంప్‌ ఇరుక్కు పోయాడని అన్న జెలెనెస్కీని నియంత అని ట్రంప్‌ వర్ణించటాన్ని అర్ధం చేసుకోదగినదే అని రష్యా సమర్ధించింది.

రష్యాను దగ్గరకు తీసుకొని చైనాకు వ్యతిరేకంగా నిలపాలని నిజంగా ట్రంప్‌ భావిస్తే అది ఇప్పటికైతే ఊహాజనితమే. ఒకవేళ అదే జరిగితే ఇప్పటికే మరోవైపు ఉన్న భారత్‌, మూడో వైపు ఉన్న జపాన్‌తో కథ నడిపించి చైనాను దెబ్బతీయాలన్న వ్యూహం ఉందన్నది ఒక దృశ్యం. ఇది కార్యరూపం దాలిస్తే ఐరోపాలో అమెరికా ప్రాబల్యం తగ్గి చైనా పలుకుబడి పెరుగుతుందని మరికొందరి హెచ్చరిక. ఉక్రెయిన్ను ఫణంగా పెట్టి రష్యాతో ఒప్పందం కుదుర్చుకుంటే ప్రపంచంలో అమెరికాను నమ్మే పరిస్థితి ఉంటుందా ? ట్రంప్‌ను నమ్మి రష్యా ముందుకు పోతుందా అన్నది ప్రశ్న. గతంలో ఇదే అమెరికన్లు జి7 కూటమిని జి8గా మార్చి రష్యాను చేర్చుకొనేందుకు చూశారు. అది బెడిసికొట్టటంతో రష్యాను వ్యతిరేకించటమే గాదు, దానికి ముప్పు తెచ్చేందుకు చూశారు. ఉక్రెయిన్‌ సంక్షోభానికి కారణం అదే కదా ! గడచిన మూడు సంవత్సరాలుగా ఆంక్షలతో ఆర్థికంగా దెబ్బతీసేందుకు చూసిన తీరు, ఉక్రెయిన్‌ పోరులో సంభవించినట్లు చెబుతున్న ప్రాణ, ఆర్థిక నష్టాలను మరచి రష్యన్లు కొత్త బాటలో నడుస్తారా ? కష్ట సమయంలో ఆదుకున్న చైనాకు వ్యతిరేకంగా జట్టుకడుతుందా ? పుతిన్‌ లేదా పాలకవర్గం లొంగిపోయినా జనం సమ్మతిస్తారా ? అమెరికాయే చేతగాక బేరసారాలకు దిగుతుంటే రష్యన్లు చైనాను కట్టడి చేయగలరా ? ఇలాంటి అనేక ఊహాజనిత దృశ్యాలను కొందరు ఆవిష్కరిస్తున్నారు.

చరిత్రను చూస్తే నాటి సోవియట్‌చైనా కమ్యూనిస్టు పార్టీల మధ్య తలెత్తిన సైద్దాంతిక వివాదాలు, దేశాల మధ్య విబేధాలకు దారి తీశాయి.1969లో ఆరు నెలలకు పైగా సరిహద్దులో ఇరు సైన్యాలను మోహరించటమే గాదు, స్వల్ప ఘర్షణలు కూడా చోటుచేసుకున్నాయి. దాన్ని వినియోగించుకొని సోవియట్‌ను దెబ్బతీసేందుకు అమెరికన్లు ప్రజా చైనాను గుర్తించి భద్రతా మండలిలో ప్రాతినిధ్యానికి అంగీకరించారన్నది ఒక అభిప్రాయం. తమ సమస్యల నుంచి బయటపడేందుకు విదేశాలకు మార్కెట్‌ను తెరిచే సంస్కరణలు అవసరమని చైనా కమ్యూనిస్టు పార్టీ నిర్ణయించింది. ఈ అవకాశాన్ని అక్కడ ఉన్న విస్తారమైన శ్రమశక్తిని కారుచౌకగా పొందేందుకు, మార్కెట్లో ప్రవేశించేందుకు అమెరికా వినియోగించుకుందన్నది మరొక సూత్రీకరణ. అంతిమంగా నాలుగు దశాబ్దాల అనుభవంలో ఎవరు ఎవరిని వినియోగించుకున్నారని బేరీజు వేస్తే ఎగుమతులతో చైనా దిగుమతులతో అమెరికా, ఐరోపా లబ్దిపొందాయి. కొన్ని లాటిన్‌ అమెరికా దేశాలు ఎగుమతి ఆధారిత వ్యవస్థలతో కొనసాగిన మాదిరి చైనా కూడా అలాగే ఉంటుందని భావించిన అమెరికా ఘోరంగా దెబ్బతిన్నది. అన్ని రంగాలలో తననే సవాలు చేసే విధంగా మారుతుందని అది అంచనా వేయలేకపోయింది, గుర్తించేసరికే తమ చేతులు దాటిపోయినట్లు గమనించింది. దాని పర్యవసానమే డోనాల్డ్‌ ట్రంప్‌ తొలి పాలనా కాలంలో ప్రారంభించిన వాణిజ్య యుద్ధం. ఇప్పుడు దాని కొనసాగింపుతో మరోసారి ముందుకు పోనున్నట్లు సూచనలు.


చైనా గురించి మరోసారి అమెరికా అంచనాలు తప్పనున్నాయా ? అట్లాంటిక్‌ పత్రిక వ్యాఖ్యాత కథనం చైనాకు ప్రపంచాన్ని అప్పగించనున్న ట్రంప్‌ అంటూ సాగింది. ఇది సామ్రాజ్యవాదుల కోణంలో ఆలోచిస్తున్నవారి బుర్రలో పుట్టిన బుద్ది అని చెప్పవచ్చు.‘‘ అమెరికా ప్రపంచ నాయకత్వం ముగుస్తున్నది. ఇది అమెరికా దిగజారి లేదా బహుధృవ ప్రపంచం ఉనికిలోకి వచ్చి కాదు లేదా అమెరికా ప్రత్యర్ధుల చర్యలతో జరుగుతున్నది కాదు. నాయకత్వ ముగింపు ఎందుకంటే అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ దానికి ముగింపు పలకాలని కోరుకుంటున్నాడు గనుక. ఇంటా బయటా ట్రంప్‌ విధానాలు అత్యంత వేగంగా అమెరికా అధికార పునాదులను నాశనం చేస్తున్నాయి. ప్రపంచ అగ్రశక్తిగా ప్రస్తుతం అమెరికాను పక్కకు నెట్టి దాని స్థానాన్ని ఆక్రమించాలని చూస్తున్న చైనా నేత షీ జంపింగ్‌ ప్రధాన లబ్దిదారు అవుతాడు. ప్రపంచాన్ని హ్రస్వదృష్టితో చూస్తున్న ట్రంప్‌కు తానేం చేస్తున్నదీ తెలియటం లేదు, అతడి చర్యలు అంతర్జాతీయ భద్రతకు ముప్పు తెస్తున్నాయని, అమెరికా భవిష్యత్‌ కూడా దానితోనే ముడిపడి ఉందని తెలుసుకోలేకపోతున్నాడు, అమెరికా వదలిన ఖాళీలో చైనా ప్రవేశాన్ని ఇతర ధనిక దేశాలు అడ్డుకోవలేవంటూ ఆ పత్రిక విశ్లేషణ కొనసాగింది.


వాణిజ్య యుద్దం గురించి అమెరికా గతంలో వేసుకున్న అంచనాలు తప్పాయి. 2024లో అమెరికా వాణిజ్య లోటు లక్ష కోట్ల డాలర్లుగా ఉంటే చైనా వాణిజ్య మిగులు కూడా అంతే ఉంది. అమెరికా, ఐరోపాలో కోల్పోయిన మార్కెట్లను మరోచోట పొందేందుకు చైనా ముందుకు పోతున్నది.ట్రంప్‌ ప్రకటించినట్లుగా ప్రపంచ ఆరోగ్య సంస్థ వంటి వాటి నుంచి అమెరికా వైదొలిగినా, యూఎస్‌ఎయిడ్‌ ఆకస్మికంగా నిలిపివేసినా ఆ స్థానాన్ని చైనా ఆక్రమిస్తుందని కొందరు ఇప్పటికే హెచ్చరించారు. ఇప్పటి వరకు ఉద్దరించే పేరుతో సాయం బిస్కెట్లతో పలు దేశాల్లో పాగా వేయాలని చూసిన అగ్రదేశపు అమెరికా ఎత్తుగడ ఫలించలేదు. అలాంటిది అంతశక్తిలేని చైనా వల్ల అవుతుందా ? నిజానికి చైనా నేరుగా అప్పులిస్తున్నది తప్ప అమెరికా, జపాన్‌, మరొక ధనిక దేశం మాదిరి సాయం పేరుతో షరతులతో కూడిన నిధులు ఇవ్వటం లేదు, అలాంటి ఏర్పాట్లు కూడా లేవు. అమెరికా సాయం పొంది బాగుపడిన దేశాలేమిటంటే ఎవరూ చెప్పలేరు, కానీ అనేక దేశాలలో మౌలిక సదుపాయాలలో చైనా పెట్టుబడుల ఫలితాలు కనిపిస్తున్నాయి. చరిత్రలో మార్కెట్ల కోసం ఏకంగా దేశాలనే ఆక్రమించుకోవటం తెలిసిందే. తొలి వాణిజ్య యుద్దం చైనా`బ్రిటన్‌ మధ్య నల్లమందు దిగుమతుల మీద జరిగింది.రెండవది కూడా అదే సమస్య మీద బ్రిటన్‌, ఫ్రాన్స్‌ కలసి చేశాయి. తొలి యుద్దంలో నల్లమందును ధ్వంసం చేసినందుకు చైనా నష్టపరిహారం చెల్లించటంతో పాటు హాంకాంగ్‌ దీవులను బ్రిటన్‌కు 99 సంవత్సరాల పాటు కౌలుకు ఇచ్చేందుకు ఒప్పందం జరిగింది. రెండవ యుద్దంలో నల్లమందు విక్రయాలను చట్టపరంచేసేందుకు ఒప్పందాన్ని రుద్దారు. వర్తమాన వాణిజ్య యుద్దాన్ని చైనా మీద అమెరికా 2018లో ప్రారంభించింది.ట్రంప్‌ దిగిపోయినా బైడెన్‌ కొనసాగించాడు, తిరిగి ట్రంప్‌ వచ్చాడు. అప్పటికీ ఇప్పటికీ తేడా ఏమిటంటే అప్పుడూ చైనా కుంగిపోలేదు, ఇప్పుడు మరింత సమర్ధవంతంగా ఎదుర్కొనే బలాన్ని కలిగి ఉంది.వాణిజ్యపోరు కరెన్సీ పోరుకు విస్తరించింది.

కెనడా, మెక్సికోల మీద 25శాతం పన్ను విధిస్తానన్న ట్రంప్‌ చైనా దగ్గరకు వచ్చేసరికి పదిశాతమే అన్నాడు.నిజానికి 2024లో జో బైడెన్‌ చైనా నుంచి దిగుమతి చేసుకొనే విద్యుత్‌ వాహనాలపై 100, సోలార్‌ సెల్స్‌, సెమీ కండక్టర్ల మీద 50, లిథియం అయాన్‌ బాటరీలపై 25శాతం చొప్పున దిగుమతి సుంకాలు విధించాడు. తాజాగా ట్రంప్‌ చేసిన ప్రకటనను అసలు చైనా పట్టించుకోలేదనే చెప్పాలి. కొన్ని నామమాత్ర చర్యలు తీసుకుంది. అవి అమెరికా నుంచి దిగుమతయ్యే వాటిలో పదో వంతు వస్తువుల మీదనే అని వార్తలు.పెద్ద మొత్తంలో సుంకాలు విధిస్తే ఎక్కువగా నష్టపోయేది అమెరికాయే గనుక ఎంతవరకు ముందుకు పోతుందో చూద్దాం అన్నట్లుగా చైనా ఉంది. ఎనిమిదేండ్ల నాటితో పోలిస్తే తాజా బెదిరింపు లెక్కలోది కాదని భావిస్తోంది. అందుకే ట్రంప్‌ ప్రకటనలను అది ఖాతరు చేయటం లేదు.దీని అర్ధం అసలేమీ ప్రతికూల ప్రభావాలు ఉండవని కాదు.


ట్రంప్‌ తీసుకుంటున్న నిర్ణయాలు వివాదాస్పదం అవుతున్న పూర్వరంగంలో అమెరికా పాలకవర్గం చూస్తూ ఊరుకుంటుందా ? శత్రువుగా పరిగణించే చైనాతో పాటు తన కనుసన్నలలో నడిచే కెనడా, మెక్సికో, ఐరోపా దేశాలు, చేతులు కలిపేందుకు తహతహలాడుతున్న భారత్‌ మీద కూడా బస్తీమే సవాల్‌ అన్నట్లుగా మాట్లాడుతున్నాడు. ఆయా దేశాలతో బేరమాడేందుకు అయితే సరే, మొదటికే మోసం వస్తే పాలకవర్గం సహించే సమస్యే లేదు. దాని డిఎన్‌ఏలో ఎలాంటి మార్పులు ఉండవు. ఎన్నికల్లో ఓటర్లు ఎక్కువగా పాల్గ్గొనేందుకు ప్రోత్సహించటానికి మనమెందుకు డబ్బు ఇవ్వాలంటూ ట్రంప్‌ చేసిన ప్రకటన అమెరికా సామాన్యులను ఆకట్టుకుంటుందనటంలో ఎలాంటి సందేహం లేదు. కానీ సాయం పేరుతో జరుపుతున్న కార్యకలాపాలు వేరు. ఇప్పటి వరకు జరిపిన వాటితో ఫలితం లేకపోతే సమీక్షల తరువాత కొత్త రూపాలతో అమెరికా రంగంలోకి దిగుతుంది తప్ప వెనక్కు తగ్గే అవకాశం లేదు !ఉక్రెయిన్‌ విషయంలో ట్రంప్‌ ఎన్ని మాటలు చెప్పినప్పటికీ వైఖరిని మార్చుకోవటానికి ఇప్పటికీ సమయం మించిపోలేదని, రష్యన్ల ఊబిలో చిక్కుకోవద్దని అమెరికా మేథోమధనంలో నిమగ్నమైన వారు సూచిస్తున్నారు.అమెరికాను ప్రధమ శత్రువుగా పరిగణిస్తున్న రష్యాను దగ్గరకు తీసుకోవాలను కోవటం జరిగేది కాదని, కనిపిస్తున్నదానికి భిన్నంగా ఉక్రెయిన్‌ ఇంకా ఓడిపోలేదని లేదా అమెరికాతో సంబంధాలు తెగలేదని, తన చర్యలు స్వయం ఓటమికి దారితీస్తాయని గ్రహిస్తే ట్రంప్‌ యంత్రాంగం ప్రకటించినదానికి పూర్తి విరుద్దమైన వైఖరిని తీసుకోవటానికి విముఖత చూపకపోవచ్చని ఛాతమ్‌ హౌస్‌ విశ్లేషణలో పేర్కొనటం గమనించదగిన అంశం. సామ్రాజ్యవాదులు ఏది లబ్ది అనుకుంటే దానికి మొగ్గుచూపుతారనటంలో ఎలాంటి సందేహం లేదు. అయితే వారు కూడా పప్పులో కాలేసిన చరిత్రను కూడా మరచిపోరాదు. ఎవరి మీదా భ్రమలు పెట్టుకోనవసరం లేదు. ఏం జరుగుతుందో చూద్దాం !

అమెరికా సాయం అసలు కథేంటి ? మోడీ సర్కార్‌ ఎందుకు మౌనంగా ఉన్నట్లు ?

Tags

, , , , , , ,

ఎం కోటేశ్వరరావు


మన ఎన్నికలలో ఓటర్లు ఎక్కువగా పాల్గొనేందుకు ప్రోత్సాహ చర్యలు తీసుకొనేందుకు అమెరికా ప్రభుత్వ ఆధ్వర్యాన నడిచే ఏజన్సీ ఫర్‌ ఇంటర్నేషనల్‌ డెవలప్‌మెంట్‌ (యూఎస్‌ఎయిడ్‌) సంస్థ 21 మిలియన్‌ డాలర్లు (రు.182 కోట్లు) మంజూరు చేసింది. దీన్ని జో బైడెన్‌ సర్కార్‌ కేటాయిస్తే డోనాల్డ్‌ ట్రంప్‌ సర్కార్‌ ఆ నిర్ణయాన్ని 90 రోజుల పాటు స్థంభింపచేస్తూ జనవరి 20న ట్రంప్‌ ఆదేశాలు జారీ చేశాడు. నిజానికి ఈ మొత్తాన్నే కాదు, ప్రపంచమంతటా వివిధ దేశాలకు ఇస్తున్న మొత్తాలపై ఈ నిర్ణయం జరిగింది. భారత్‌ దగ్గర చాలా డబ్బుంది, అక్కడ ఓటర్లను ప్రోత్సహించేందుకు మనమెందుకు డబ్బివ్వాలంటూ ట్రంప్‌ ఇటీవల వ్యాఖ్యానించాడు. ఈ సొమ్మును గతంలో ఇచ్చారా, రాబోయే రోజుల్లో ఖర్చుచేసేందుకు మంజూరు చేశారా, విడుదల చేశారా లేదా అన్నది స్పష్టం కావాల్సి ఉంది. బిజెపి నేతలు అమిత్‌ మాలవీయ, రాజీవ్‌ చంద్రశేఖర్‌ల స్పందన చూస్తే ఈ మొత్తం ఖర్చు చేసినట్లుగా అర్ధం అవుతున్నది. ‘‘ ఓటర్లు బారులు తీరేందుకు 21 మిలియన్‌ డాలర్లా ? ఇది కచ్చితంగా భారత్‌ ఎన్నికల ప్రక్రియలో విదేశీ జోక్యమే. దీన్నుంచి ఎవరు లబ్ది పొందారు ? అధికారపక్షమైతే కచ్చితంగా కాదు ’’ అని అమిత్‌ మాలవీయ చెప్పారు. రాజుగారి చిన్న భార్య అందగత్తె అంటే పెద్ద భార్య అనాకారి అనేకదా అన్నట్లుగా అధికారంలో ఉన్న బిజెపి గాకపోతే కాంగ్రెస్‌ లబ్దిపొందినట్లు ఆరోపించటమే కదా ? ఈ మాత్రం అర్ధం చేసుకోలేనంత అమాయకంగా మన జనాలు ఉన్నారా ?ప్రజాస్వామ్యాలను బలహీనపరచటం, జోక్యం చేసుకోవాటానికి ఇది నిదర్శనం అని మాజీ కేంద్ర మంత్రి రాజీవ్‌ చంద్రశేఖర్‌ ప్రకటించారు.ఒక వైపు ప్రజాస్వామిక విలువల గురించి చర్చ చేస్తూ మరోవైపు నిర్లజ్జగా ప్రజాస్వామిక దేశాలను బలహీనపరిచేందుకు పూనుకోవటం దిగ్భ్రాంతి కలిగిస్తున్నదన్నారు. దీని మీద కేంద్ర ప్రభుత్వం అధికారికంగా ఎలాంటి వివరణ ఇవ్వలేదు. శుక్రవారం నాడు విదేశాంగశాఖ ప్రతినిధి మాట్లాడుతూ తామీ సమాచారాన్ని చూశామని, సహజంగానే ఇది ఎంతో ఆందోళన కలిగిస్తుంది, భారత అంతర్గత వ్యవహారాల్లో విదేశీ జోక్యం గురించి ఆందోళనకు దారి తీసింది. సంబంధిత శాఖలు, ఏజన్సీలు దీని గురించి చూస్తున్నాయి, ఈ దశలో బహిరంగంగా ప్రకటించటం తొందరపాటు అవుతుంది,తరువాత చెబుతాము అన్నారు.

నిజానికి ఇంత స్వల్ప మొత్తంతో ప్రభావితమై ఒక రాష్ట్రం లేదా దేశంలో ఓటర్లు కుప్పలు తెప్పలుగా పోలింగ్‌ కేంద్రాలకు వచ్చి ఓట్లు వేస్తారా ? ఒక్కో ఎంపీ అభ్యర్థి వంద కోట్లు, ఎంఎల్‌ఏ పాతిక కోట్ల వరకు ఖర్చు పెడుతుంటేనే మాకు ఇవ్వాల్సింది ఇవ్వలేదు, వేరేవారికి ఎక్కువ ఇచ్చారంటూ నిరసనలతో అందరూ రావటం లేదు. ఏ మూలన చీమ చిటుక్కుమన్నా పసిగట్టే అమెరికన్లకు ఇంత చిన్న విషయం తెలియదా ? తామిచ్చే 182 కోట్లతో ఓటర్లు బారులు తీరతారా ? సాక్షాత్తూ అమెరికా ప్రభుత్వం వెల్లడిరచిన ఈ అంశం మీడియాలో చర్చకు దారితీసింది. వాస్తవాలను వెల్లడిరచేవరకు ఇది చర్చలో ఉంటుంది. సూది కోసం సోదికి పోతే పాత బాగోతాలన్నీ బయటపడినట్లు ఈ వ్యవహారంలో ఎంత పాత్ర ఉందో తెలియదు గానీ అమెరికాలో స్థిరపడిన ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వీణా రెడ్డి అనే ఆమె 2021 ఆగస్టు నుంచి 2024 జూలై వరకు అమెరికా సాయ ఏజన్సీ భారత డైరెక్టర్‌గా ఉన్నట్లు వార్తలు వచ్చాయి. ఎవరినో గెలిపించేందుకు ప్రయత్నించారని తాను ఊహిస్తున్నట్లు ట్రంప్‌ ఒక సాధారణ వ్యాఖ్య చేశాడు. 2014కు ముందు పెద్ద మొత్తంలో అమెరికా సాయం వచ్చిందని, తాము అధికారంలోకి వచ్చాక నామమాత్రమని బిజెపి పెద్దలు చెబుతున్నారు. అదే నిజమైతే ఆ సొమ్మును మోడీ గెలుపుకోసం వినియోగించినట్లు ఎందుకు భావించకూడదు ? ఒక వేళ కాంగ్రెస్‌ కోసం ఖర్చు చేసి ఉంటే పదేండ్ల నుంచి బిజెపి పాలకులు నిజాల నిగ్గుతేల్చకుండా ఏ గుడ్డి గుర్రాలకు పండ్లుతోముతున్నట్లు ? బిజెపి మాజీ ఎంపీ మహేష్‌ జత్మలానీ వీణా రెడ్డి గురించి ఒక ట్వీట్‌ చేశారు. ఎన్నికలు ముగిసిన తరువాత ఆమె అమెరికా వెళ్లారని ఇక్కడ ఉంటే దర్యాప్తు సంస్థలు ఈ సొమ్ము గురించి ప్రశ్నించి ఉండేవారన్నారు. తప్పించుకుపోయారన్న అర్ధం దీని వెనుక ఉంది. అమెరికాలో ఉంటే మాత్రం మన కేంద్ర ప్రభుత్వానికి అడిగే అవకాశం లేదా ? యూఎస్‌ఎయిడ్‌ ప్రభుత్వ సంస్థ, అందువలన నేరుగా మన ప్రభుత్వమే వివరాలు ఇవ్వాలని ఈ పాటికే ఎందుకు అడగలేదు ? జనానికి చెవుల్లో కమలంపూలు పెడుతున్నట్లుగా ఉంది. అమెరికా ప్రభుత్వ సమాచారాన్ని ఉటంకించిన ఇండియా టుడే వార్త ప్రకారం వీణా రెడ్డి హయాంలో మన దేశానికి అమెరికా సాయం రు.720 కోట్ల నుంచి 2022లో రు.2,500 కోట్లకు పెరిగినట్లు, 2023లో రు.1,515 కోట్లు, 2024లో రు.1,304 కోట్లు వచ్చాయి. ఈ సొమ్మును దేనికి ఖర్చు చేశారో నిగ్గుతేల్చాల్సింది పోయి, కాంగ్రెస్‌ మీద మరొక పార్టీ మీద నిందలు వేస్తే కుదరుతుందా ? ఓటర్లను పెద్ద ఎత్తున రప్పించేందుకు ఇచ్చినట్లు చెబుతున్న 21మిలియన్‌ డాలర్లు(రు.182 కోట్లు) అమెరికా కేంద్రంగా పని చేస్తున్న కన్సార్టియం ఫర్‌ ఎలక్షన్స్‌ అండ్‌ పొలిటికల్‌ ప్రోసెస్‌ స్ట్రెంతనింగ్‌`సిఇపిపిఎస్‌( ఎన్నికలు, రాజకీయ క్రమాన్ని పటిష్ట పరిచేందుకు ఏర్పడిన సహవ్యవస్థ)కు కేటాయించారు. ఇది అమెరికాలో ఉన్న ఇంటర్నేషనల్‌ ఫౌండేషన్‌ ఫర్‌ ఎలక్ట్రొరల్‌ సిస్టమ్స్‌, ఇంటర్నేషనల్‌ రిపబ్లికన్‌ ఇనిస్టిట్యూట్‌, నేషనల్‌ డెమోక్రటిక్‌ ఇనిస్టిట్యూట్‌ అనే సంస్థలతో కూడిన కూటమి. ఎలన్‌ మస్క్‌ నిర్వహిస్తున్న ప్రభుత్వ సామర్ధ్య శాఖ(డోజె) వెల్లడిరచిన సమాచారమే ఇది.

సాయం పేరుతో ఎంత ఖర్చు చేస్తే అంతగా ఆర్థికంగా, రాజకీయంగా అమెరికా లబ్ది పొందింది తప్ప ఊరికే ఒక్క డాలరు కూడా వెచ్చించలేదు.అమెరికా సాయ సంస్థ 1949లో అధ్యక్షుడు ట్రూమన్‌ హయాం నుంచి తరువాత కాలంలో అనేక మార్పులు, చేర్పులతో సహా అనేక దేశాలకు నిధులు కేటాయిస్తున్నది. వాటిని కమ్యూనిస్టు వ్యతిరేక, తనను వ్యతిరేకించే దేశాలకు వ్యతిరేకంగా ప్రచారం, కుట్రలు, పాలకులు, ప్రభుత్వాలను కూలదోయటం, అధికారంలో ఉన్న ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులను ఆకట్టుకొనేందుకు, ఉగ్రవాదులతో సహా ఎన్‌జిఓలు, మరొక పేరుతో ప్రపంచ మంతటా తన తొత్తులను, విద్రోహులను సమకూర్చుకోవటం దానిపని. అందుకోసం ప్రపంచమంతటా పదివేల మంది సిబ్బంది, ఏటా వందబిలియన్‌ డాలర్ల వరకు బడ్జెట్‌తో నడుస్తున్నది. గూఢచార సంస్థ సిఐఏతో అనుసంధానించుకొని ప్రజాస్వామిక సంస్కరణలు, అభివృద్ధి పేరుతో కథనడిపిస్తున్నది. మన దేశం, చైనాకు వ్యతిరేకంగా కుట్రలు చేసేందుకు 2004లో మిలీనియం ఛాలెంజ్‌ కార్పొరేషన్‌ (ఎంసిసి) ఏర్పాటు చేసి శ్రీలంక, నేపాల్‌ దేశాలను దానిలో చేరాలని వత్తిడి చేసింది. మొత్తం 29 దేశాలతో 2019 నాటికి 37 ఒప్పందాలు చేసుకుంది. 1990కి ముందు సోవియట్‌ యూనియన్‌తో ప్రచ్చన్న యుద్ధం సాగించిన కాలంలో దాని పనితీరు ఒక విధంగా ఉంటే తరువాత కొన్ని మార్పులు చేసుకుంది. అవి ఏవైనప్పటికీ ప్రపంచంలో మార్కెట్‌ సంస్కరణలతో సహా అమెరికా ప్రయోజనాలకు అనుగుణమైనవి, రాజకీయంగా వ్యతిరేకించేవారిని లక్ష్యంగా చేసుకున్నవే. తమ మిలిటరీ, రాజకీయ ఎత్తుగడలో భాగంగా ముందుకు తెచ్చిన క్వాడ్‌ కూటమిలో చేరాలని బంగ్లాదేశ్‌పై అమెరికా వత్తిడి తెచ్చింది. చిట్టగాంగ్‌ ప్రాంతంలోని సెయింట్‌ మార్టిన్‌ దీవిని తమకు కౌలుకు ఇవ్వాలని, అక్కడ మిలిటరీ కేంద్రం ఏర్పాటు చేస్తామని చేసిన ప్రతిపాదనను షేక్‌ హసీనా వ్యతిరేకించారు. ఆ కారణంగానే ప్రభుత్వాన్ని కూల్చివేసి, ఆమెను దేశం నుంచి తరిమివేసిన శక్తుల వెనుక ‘‘ అమెరికా సాయం ’’ ఉందని వార్తలు వచ్చాయి. నిజానికి ఆ కేంద్రాన్ని చైనాను దెబ్బతీయాలని చెప్పినప్పటికీ అది మన దేశానికీ ముప్పు తలపెట్టేదే.


ప్రజాస్వామ్యం, స్వేచ్చా మార్కెట్‌ ఆర్థిక వ్యవస్థ పేరుతో రెండు దశాబ్దాల పాటు ఆఫ్ఘనిస్తాన్‌ దురాక్రమణకు అమెరికా దాదాపు రెండులక్షల కోట్ల డాలర్లు ఖర్చు చేసింది. దీనిలో అభివృద్ధి కోసం చేసిన ఖర్చు కేవలం 3,240 కోట్ల డాలర్లు మాత్రమే ఉంది. చివరకు తాలిబాన్లకు సలాం గొట్టి అన్నింటినీ వదలివేసి 2021 అమెరికా సేనలు అక్కడి నుంచి పారిపోయాయి. తమ సాయం ఆకలి, దారిద్య్ర నిర్మూలన, విద్య, వైద్యం వంటి వాటికి ఖర్చు చేస్తున్నట్లు అమెరికా చెబుతుంది. ఇరవై ఏండ్ల దురాక్రమణ తరువాత అక్కడ చూస్తే సర్వనాశనం. ముఫ్పైవేల మంది పౌరులతో సహా 1.74లక్షల మంది ఆప్ఘన్‌లు మరణించారు, 30లక్షల మంది పిల్లలు బడికి దూరం, 1.89 కోట్ల మంది తీవ్రమైన ఆహార కొరతను ఎదుర్కొన్నారు.తాలిబాన్లతో సాగించిన పోరులో భయానక చర్యలెన్నో. 950 కోట్ల డాలర్ల మేర ఆఫ్ఘన్‌ జాతీయ సంపదలను దోచుకున్నారు. ఇలాంటి ఉదాహరణలను ఎన్నో చెప్పవచ్చు. మన దేశంలో కాశ్మీరు, పంజాబ్‌, ఈశాన్య రాష్ట్రాల వేర్పాటు వాదులు, ఉగ్రవాదుల వెనుక అమెరికా సాయ హస్తం గురించి చెప్పుకోనవసరం లేదు. హాంకాంగ్‌ స్వాతంత్య్రం పేరుతో గతంలో విద్యార్థులను రెచ్చగొట్టి రోడ్లెక్కించటం వెనుక, చైనాలో అంతర్భాగంగా ఐరాస గుర్తించిన తైవాన్‌ స్వాతంత్య్ర నినాదం, టిబెట్‌ వేర్పాటు వాదుల వెనుక అమెరికా హస్తం, సాయం బహిరంగ రహస్యమే.


అమెరికా మేథో సంస్థ కౌన్సిల్‌ ఆన్‌ ఫారిన్‌ రిలేషన్స్‌(సిఎఫ్‌ఆర్‌) ఫిబ్రవరి ఏడవ తేదీన రాసిన విశ్లేషణలో ప్రతి ఏటా అమెరికా సాయం ఎలా ఉంటుందో వెల్లడిరచింది. 2023 సంవత్సరంలో ప్రపంచవ్యాపితంగా 7,200 కోట్ల డాలర్లను అందించగా దానిలో 61శాతం యుఎస్‌ఎయిడ్‌ ద్వారా పంపిణీ జరిగింది. దీని ద్వారా జరుగుతున్నట్లు చెబుతున్న సాయంలో ఒక డాలరులోని వంద సెంట్లకు గాను 10 నుంచి 30 మాత్రమే అవసరమైన వారికి అందుతున్నదని ఇటీవల సిబిఎస్‌ మీడియాతో అమెరికా ఎంపీ బ్రియాన్‌ మాస్ట్‌ చెప్పాడు. చైనా తప్పుడు ప్రభావాన్ని ఎదుర్కొనే పేరుతో 2024 సెప్టెంబరులో 32.5 కోట్ల డాలర్లను అమెరికా పార్లమెంటు మంజూరు చేసింది.2023 నుంచి 2027వరకు ఇదే కార్యక్రమాలకు మొత్తం 162.5 కోట్ల డాలర్లను ఖర్చు చేసేందుకు నిర్ణయించారు. ఇంత మొత్తాన్ని ఎవరి పర్యవేక్షణలో ఎలా ఖర్చు చేస్తారో వెల్లడిరచలేదు గానీ యుఎస్‌ఎయిడ్‌ ప్రతినిధే ఉంటాడు. ఎందుకు ? ఎలా అంటే 2021లో జింబాబ్వే బడా పత్రిక హెరాల్డ్‌ అసలు విషయాన్ని వెల్లడిరచింది. ఆఫ్రికా ఖండంలో చైనా పెట్టుబడుల గురించి తప్పుడు వార్తలను ఎలా వండాలో స్థానిక విలేకర్లకు శిక్షణ ఇచ్చేందుకు అమెరికా నిధులు అందచేసిందట. మన దేశంలో కొన్ని పత్రికలు, టీవీలలో వస్తున్న కథనాలు, విశ్లేషణల వెనుక అమెరికా సాయం ఉందంటే తప్పు పట్టాలా ?

అమెరికా సాయాన్ని తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించగానే కొంత మంది సరికొత్త పల్లవి అందుకున్నారు. ఇప్పటికే బిఆర్‌ఐ పథకాలతో అనేక దేశాలలో చైనా పాగా వేస్తున్నదని, ఇప్పుడు అమెరికా సాయం ఆగిపోతే అది మరింతగా విస్తరించి అనేక దేశాలను అదుపులోకి తీసుకుంటుందనే పాటపాడుతున్నారు. ఇది రెండు అంశాలను తేటతెల్లం చేస్తున్నది. ఒకటి ఇన్ని దశాబ్దాలుగా సాయం పేరుతో అమెరికా తన ఆధిపత్యం కోసం ప్రయత్నించిందని నిర్ధారించటం, మరొకటి చైనా ఆధిపత్యం పెరుగుతుందనే భయాన్ని రెచ్చగొట్టటం. ఇంతకు ముందే చెప్పుకున్నట్లుగా ఆఫ్ఘనిస్తాన్‌లో సోవియట్‌ జోక్యాన్ని నివారించే పేరుతో తాలిబాన్లను తయారు చేయటం, తరువాత ఏకుమేకైన వారి మీదే పోరు సాగించిన అమెరికా మాదిరి ఇంతవరకు ప్రపంచంలో ఎక్కడైనా చైనా వ్యవహరించిందా ? రెండవ ప్రపంచ యుద్ధం ముగిసిన తరువాత రెండు కొరియాలు ఐక్యం కావాల్సి ఉండగా దాన్ని పడనీయకుండా దక్షిణ కొరియాలో అమెరికా మిలిటరీ తిష్టవేసి కొనసాగిస్తున్నది. ఆ మాదిరి చైనా ఎక్కడైనా కేంద్రాలను ఏర్పాటు చేసిందా ? అమెరికా సాయం పేరుతో మన దేశంలో సాగించిన తప్పుడు పనులను బహిర్గతం చేసేందుకు మోడీ సర్కార్‌ ముందుకు వస్తుందా ? వాటిలో సంఘపరివార్‌ సంస్థలేమైనా ఉంటే అసలు రంగు బయటపడుతుందని భయపడి మూసి పెడుతుందా ?

అసలేం జరుగుతోంది ! ఉక్రెయిన్‌పై క్షణక్షణానికి మారుతున్న మాటలు !

Tags

, , ,

ఎం కోటేశ్వరరావు


అమెరికా అధినేత డోనాల్డ్‌ ట్రంప్‌ రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో ఫిబ్రవరి 12న జరిపిన ఫోన్‌ సంభాషణ ప్రపంచంలో ఎంతో ఆసక్తి రేపింది. ఉక్రెయిన్‌ సమస్య పరిష్కారానికి చర్చలు జరపనున్నట్లు ప్రకటించాడు. పరస్పర విరుద్ద వార్తలు, వ్యాఖ్యానాలు, విశ్లేషణలు, ఉక్రెయిన్‌ సంక్షోభం ముగింపు గురించి నేతలు చేస్తున్న ప్రకటనలు చూస్తుంటే అసలేం జరుగుతోంది అని సామాన్యుడు ఎటూ తేల్చుకోలేని స్థితి. ఒక ప్రకటన, పరిణామం వాస్తవం అనుకుంటే తలెత్తే సందేహాలు ఎన్నో. మంగళవారం నాడు సౌదీ అరేబియా రాజధాని రియాద్‌లో అమెరికారష్యా ఉన్నత ప్రతినిధి వర్గాలు భేటీ అయ్యాయి. చర్చలను కొనసాగించాలని నిర్ణయించారు. డోనాల్డ్‌ ట్రంప్‌వ్లదిమిర్‌ పుతిన్‌ కూడా అక్కడి చేరుకోవచ్చని వార్తలు వాస్తవం కాదని, ఇంకా ఎలాంటి నిర్ణయం జరగలేదని ప్రకటించారు. ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెనెస్కీ బుధవారం నాడు అక్కడికి చేరుకోనున్నట్లు వార్త. ఐరోపాకు చర్చల్లో ఎలాంటి ప్రమేయం ఉండదనే ఊహాగానాల పూర్వరంగంలో సోమవారం నాడు పారిస్‌లో కొన్ని దేశాల నేతలు సమావేశం జరిపి పరిస్థితిని సమీక్షించారు. ఉక్రెయిన్‌పై 2022 ఫిబ్రవరి 24న రష్యా సైనిక చర్య ప్రారంభమైంది. వేగంగా మారుతున్న పరిణామాలను చూస్తే నాలుగో ఏడాదిలో ప్రవేశించక ముందే దానికి ముగింపు పలుకుతారా ? ఈ సమస్యను ఇంత సులభంగా పరిష్కరించే అవకాశం ఉంటే మూడు సంవత్సరాలు ఎందుకు కొనసాగించినట్లు ? కోట్లాది మంది జనాలను, అనేక దేశాలను ఎందుకు ఇబ్బందులు పెట్టినట్లు ? దీనికి ఎవరిది బాధ్యత ? ఎంతో సంక్లిష్టమైన ఈ వివాదం ఒక్క భేటీతో నాటకీయంగా ముగుస్తుందా ? చర్చల పేరుతో కొత్త ఎత్తుగడలకు ప్రాతిపదిక వేస్తున్నారా?


జెలెనెస్కీ, ఐరోపా సమాఖ్యతో నిమిత్తం లేకుండానే చర్చలు జరిపి ఒక ముగింపు పలుకుతామని అమెరికన్లు చెప్పారు. తమతో నిమిత్తం లేకుండా జరిగే చర్చలను అంగీకరించేది లేదని జెలెనెస్కీ ప్రకటించాడు. పుతిన్‌ అబద్దాల కోరు, అసలు తమకు చర్చల గురించి సమాచారమే లేదన్నాడు. ముసాయిదా ప్రతిపాదనల్లో తమ భద్రతకు ఎలాంటి హామీ లేదన్నాడు. తమకూ అంగీకారం కాదని ఐరోపా దేశాలు స్పష్టం చేశాయి. మరి జెలెనెస్కీ సతీసమేతంగా రియాద్‌ ఎందుకు వస్తున్నారంటే ‘‘ అది ఎప్పుడో నిర్ణయించిన పర్యటన ’’ అని అతగాడి ప్రతినిధి వివరణ ఇచ్చాడు. రష్యాఉక్రెయిన్‌ ఖైదీల మార్పిడి గురించి చర్చలు జరిపేందుకు జెలెనెస్కీ ఆదివారం నాడు యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ చేరుకున్నాడు. సౌదీ పర్యటన గురించి గతంలో ఎలాంటి వార్తా లేదు. ఎవరి ప్రమేయం లేకుండా చర్చలు జరుగుతాయని ట్రంప్‌ సలహాదారులు స్పష్టంగా చెప్పారు. దానికి పూర్తి విరుద్దంగా శాంతి చర్చల్లో జెలెనెస్కీ పాల్గొంటారని ఆదివారం నాడు డోనాల్డ్‌ ట్రంప్‌ చెప్పినట్లు రాయిటర్స్‌ వార్త పేర్కొన్నది. ఐరోపా నుంచి వ్యతిరేక స్పందన వెలువడటంతో అమెరికా మాట మార్చింది.సౌదీలో చర్చలకు అమెరికా ప్రతినిధివర్గ నేత మార్క్‌ రూబియో సిబిఎస్‌ టీవీతో మాట్లాడుతూ అసలు పుతిన్‌ నిజంగా చిత్తశుద్దితో ఉన్నాడా లేదా అన్నది పరీక్షించేందుకు చర్చలను ముందుకు తెచ్చామని, నిజమైన సంప్రదింపుల్లో ఉక్రెయిన్‌, ఐరోపాకు భాగస్వామ్యం ఉంటుందని చెప్పాడు. ఎందుకంటే రష్యాపై ఆంక్షల్లో ఐరోపా కూడా ఉందన్నాడు. పైకి ఏమి చెప్పినప్పటికీ అమెరికా అధికారులు ప్రయివేటు సంభాషణల్లో ఐరోపా వారితో మీ అంగీకారం లేకుండా ఏదీ జరగదని చెబుతున్నట్లు మీడియా పేర్కొన్నది. ఏ రోటి దగ్గర ఆ పాట పాడినట్లు వ్యవహరిస్తున్నారా ? దీన్ని చూస్తుంటే పరిణామాలు ఏ మలుపు తిరిగేదీ ఊహించలేము.

ట్రంప్‌ ఫోన్‌ సంభాషణకు ముందు జరిగిన పరిణామాలను సింహావలోకనం చేసుకోవాల్సి ఉంది. ఉక్రెయిన్‌ పోరులో తాము చేసిన సాయం లేదా చేసిన ఖర్చును తిరిగి చెల్లించే స్థితిలో లేనందున ప్రతిగా టిటానియం,యురేనియం, లిథియం వంటి 500 బిలియన్ల విలువగల ఖనిజ సంపదలున్న ప్రాంతాల్లో సగం తమకు అప్పగించాలని అమెరికా బేరం పెట్టింది. దాని కోసం తన ఆర్థిక మంత్రి స్కాట్‌ బిసెంట్‌ను కీవ్‌ పంపిన సంగతి తెలిసిందే ప్రస్తుతం రష్యా, దాని అనుకూల శక్తుల ఆధీనంలో ఉన్న నాలుగో వంతు భూ భాగంలో ఈ ఖనిజాలు ఉన్నాయి. సంక్షోభానికి ముందు ఉన్న ప్రాంతాలు తిరిగి కావాలని కోరుకోవద్దని కూడా ట్రంప్‌ యంత్రాంగం జెలెనెస్కీకి సూచించింది. అలాంటపుడు ఖనిజాల గురించి ఎందుకు బేరం పెట్టినట్లు? రష్యాను అడ్డుకొనేందుకు ఐరోపా దేశాలు కూడా పెద్ద మొత్తంలో ఖర్చు చేశాయి. ఖనిజాలతో అమెరికా తన ఖర్చుతాను రాబట్టుకుంటే తమ సంగతేమిటని అవి ప్రశ్నిస్తాయి. అయితే సంక్షోభం ప్రారంభమైన తరువాత ఐరోపా దేశాలు 300 బిలియన్‌ డాలర్ల విలువగల రష్యన్‌ ఆస్తులను స్థంభింప చేశాయి. వాటిని స్వాధీనం చేసుకోవటం గురించి కొందరు ఆలోచనలు చేస్తున్నారు. దీనికి రష్యా అంగీకరించే సమస్యే ఉత్పన్నం కాదు.2014లో రష్యా స్వాధీనం చేసుకున్న క్రిమియా ద్వీపకల్పంతో సహా ఆక్రమిత ప్రాంతాలన్నింటినీ తమకు అప్పగించాలని జెలెనెస్కీ డిమాండ్‌ చేశాడు. ఒక వైపు చర్చల గురించి సిద్దం అవుతూనే రష్యా తన దాడులను కొనసాగిస్తూనే ఉంది. ఉక్రెయిన్‌ ప్రతిఘటన కూడా సాగుతోంది.

నువ్కొకందుకు పోస్తే నేనొకందుకు తాగాను అన్నట్లుగా పుతిన్‌ చాలా జాగ్రత్తగా స్పందిస్తున్నాడు. ఎవరూ ఎవరిని నమ్మే స్థితిలో లేరు. అమెరికాఐరోపా యూనియన్‌ మధ్య ఉన్న మిత్ర వైరుధ్యం ప్రస్తుతానికి శత్రు వైరుధ్యంగా మారుతుందని చెప్పలేము గానీ ట్రంప్‌ పుతిన్‌ ఫోన్‌ చర్చల తరువాత తేడా మరింత పెరిగింది. అలా అయితే ఏం చేయాలి ఇలాజరిగితే ఏం చేద్దామనే సంప్రదింపులు ఐరోపాలో ప్రాధమికంగా ప్రారంభమయ్యాయి. ఇప్పుడు ఐరోపా దేశాలన్నింటికీ కలిపి ఎంత మిలిటరీ ఉందో అంతకంటే ఎక్కువగా రష్యా కలిగి ఉంది. అందువలన ఆచితూచి అడుగేస్తున్నాయి. అది వాటి బలహీనత అయితే దాన్ని సొమ్ముచేసుకోవాలని చూడటం అమెరికా బలం. అమెరికాకు అగ్రపీఠం అనే తన అవగాహనను ట్రంప్‌ మరింత ముందుకు తీసుకుపోయేట్లయితే ఐరోపాకు దానితో ఘర్షణ పడటం లేదా లొంగిపోవటం తప్ప మరొక మార్గం లేదు. అమెరికా బలహీనతలు కూడా తెలిసినందున ఐరోపా ధనిక దేశాలు అంత తేలికగా సాగిలపడతాయని చెప్పలేము. ప్రపంచ బలాబలాల్లో కొత్త సమీకరణకు తెరలేచే అవకాశాలు కూడా ఉన్నాయి. అదే జరిగితే అమెరికా ఏకాకి అవుతుంది, దానికి సిద్దపడుతుందా ? అలాంటి అవకాశమే లేదని చెప్పవచ్చు.

ఐరోపా మీద డోనాల్డ్‌ ట్రంప్‌ దాడి అంటూ ఎకనమిస్టు పత్రిక ఒక వ్యాఖ్యా విశ్లేషణ చేసింది. ఉక్రెయిన్‌ మీద ఒక ఒప్పందం చేసుకొనేందుకు పుతిన్‌కు ట్రంప్‌ పంపిన ఆహ్వానం నాటో కూటమిని గందరగోళంలోకి నెట్టిందని పేర్కొన్నది. ఐరోపా భద్రతకు తామింకే మాత్రం ప్రాధమిక హామీదారుగా ఉండేది లేదంటూ ముందుగా అమెరికా రక్షణ మంత్రి పేట్‌ హెగ్‌సేత్‌ చేసిన ప్రకటన షాకిచ్చింది. కొద్ది గంటల తరువాత పుతిన్‌తో సంప్రదింపుల గురించి ట్రంప్‌ ప్రకటించాడు. ఆ తరువాత వార్షిక మ్యూనిచ్‌ భద్రతా సమావేశంలో ఉపాధ్యక్షుడు జెడి వాన్స్‌ నొప్పించే రీతిలో ఐరోపా మీద దాడి చేశాడు.ఉక్రెయిన్‌ గురించి మాట్లాడాల్సిన వాన్స్‌ తన ప్రసంగమంతా ఐరోపా మీద కేంద్రీకరించాడు.ఐరోపాకు ఉందని చెబుతున్న ముప్పు రష్యా నుంచి కాదు, అంతర్గతంగానే ఉందన్నాడు. దాని అర్ధం వలసల సమస్య. పుండు మీద కారం చల్లినట్లుగా ఉక్రెయిన్‌లో అమెరికా రాయబారి కెయిత్‌ కెలోగ్‌ కుండబద్దలు కొట్టినట్లు మాట్లాడాడు. సంప్రదింపుల్లో ఐరోపాకు స్థానం ఉంటుందా అన్న ప్రశ్నకు అది జరుగుతుందని అనుకోవటం లేదన్నాడు. దీంతో ఐరోపా భద్రత తమ కళ్ల ముందే కుప్పకూలుతుందా అన్నట్లుగా అనేక మంది నేతలు, అధికారులు భావించినట్లు ఎకనమిస్టు వర్ణించింది. ట్రంప్‌ ప్రతిపాదించిన చర్చలు ఎవరి అజెండా మేరకు జరుగుతాయన్నది మిలియన్‌ డాలర్ల ప్రశ్న. వస్తున్న వార్తలన్నీ పుతిన్‌ డిమాండ్లకే అమెరికా అంగీకరించవచ్చని సూచిస్తున్నాయి.ఒక వేళ నిజంగా అదే జరిగితే రానున్న రోజుల్లో ఏ ఒక్కదేశం కూడా అమెరికా మాటలు, హామీల మీద ఆధారపడి వ్యవహరించే అవకాశాలు మరింతగా కుచించుకుపోతాయి. ఇంతవరకు దాన్ని నమ్మిబాగుపడిన దేశం లేదనే అభిప్రాయాన్ని మరింతగా బలపరిచినట్లు అవుతుంది. ప్రపంచాన్ని తమ గుప్పెట్లో పెట్టుకోవాలని చూస్తున్న అమెరికా సామ్రాజ్యవాదులు ఆత్మహత్యకు పాల్పడతారా ? సోమవారం నాడు ఫ్రెంచి అధ్యక్షుడు మక్రాన్‌ ఎంపిక చేసిన కొన్ని దేశాలతో పారిస్‌లో సంప్రదింపులు జరిపాడు. వాటి వివరాలు వెల్లడి కావాల్సి ఉంది.

మూడు సంవత్సరాలుగా ఉక్రెయిన్‌ శాంతి చర్చలను సాగనివ్వని అమెరికన్లు ఆకస్మికంగా ఎందుకు రష్యాతో సంప్రదింపులకు సిద్దపడుతున్నారు ? ఒకటి ఐరోపాలోని నాటో కూటమి దేశాలు అవసరమైతే రంగంలోకి దిగుతామని కబుర్లు చెబుతున్నప్పటికీ నేరుగా ఉక్రెయిన్‌ తరఫున యుద్దంలో పాల్గొనే అవకాశాలు లేవు. వేల కిలోమీటర్ల దూరం నుంచి అమెరికా సేనలు వచ్చి రష్యాతో తలపడేందుకు సిద్దం కాదు. ఆఫ్ఘనిస్తాన్‌ తాలిబాన్లకే సలాంగొట్టి కాళ్లు గడ్డాలు పట్టుకొని ప్రాణాలు అరచేత పట్టుకొని వెళ్లిన వారు అణుశక్తి రష్యాతో తలపడగలరా ? రష్యా తొలి నుంచీ కోరుతున్నదేమిటి ? గతంలో తమకు హామీ ఇచ్చినట్లుగా ఉక్రెయిన్‌కు సభ్యత్వమిచ్చి నాటో కూటమి ఆయుధాలను తమ ముంగిట్లో ఉంచకూడదు. సంక్షోభానికి ముందు ఉన్న సరిహద్దులు, ప్రాంతాల గురించి ఉక్రెయిన్‌ మరచిపోవాలి.శాంతి పరిరక్షణ, మరొక పేరుతో నాటో కూటమి దళాలు తమ సరిహద్దులో తిష్టవేయకూడదు. ఉక్రెయిన్‌ మిలిటరీపై పరిమితులు పెట్టాలి.స్వాతంత్య్రం ప్రకటించుకున్న ఉక్రెయిన్‌లోని ప్రాంతాలకు అంతర్జాతీయ గుర్తింపు ఇవ్వాలి. ఏ విషయంలోనూ రాజీ పడేందుకు పుతిన్‌ సిద్దంగా లేడని ఐరోపా గూఢచారులు నివేదించినట్లు వార్తలు. పుతిన్‌ షరతుల మేర ఒప్పందం కుదుర్చుకుంటే అమెరికాకు వచ్చేదేముంది ? వారు మరీ అంత అమాయకులా ?

కొద్ది నెలలు, వారాల క్రితం వరకు కూడా రష్యాను నిలువరించేందుకు ఏం చేయాలి ? ఎలాంటి ఆయుధాలను ఉక్రెయిన్‌కు అందించాలి అని తర్జన భర్జనలు పడిన ఐరోపా నేతలు, వ్యూహకర్తలు ఇప్పుడు ట్రంప్‌ తెచ్చిపెట్టిన పరిస్థితిని ఎలా ఎదుర్కోవాలా అని మల్లగుల్లాలు పడుతున్నారు. తాము విధించిన ఆంక్షలతో బలహీనపడిన పుతిన్‌ నాయకత్వాన్ని మరింతగా ఎలా వంటరిపాటు చేయాలా అని చూశారు.ట్రంప్‌ చర్యతో పుతిన్‌ ఆ స్థితి నుంచి తాత్కాలికంగా అయినా బయటపడ్డారు. దీని అర్ధం ఎవరిదారి వారు చూసుకోవటం అని కాదు.ఇప్పుడున్న పరిస్థితిలో అమెరికాఐరోపాలకు పరస్పర సహకారం అవసరం. మమ్మల్ని, మా భద్రతను అర్దంతరంగా ఎలా వదలి వెళతారని అడిగితే ఐరోపా మరింత చులకన అవుతుంది. అమెరికా పట్టుమరింతగా దాని మీద బిగుస్తుంది. రెండవ ప్రపంచ యుద్ధం ముగిసిన సమయంలో మాదిరి పశ్చిమ ఐరోపా ఆర్థికంగా బలహీనంగా లేదు. గడచిన ఏడు దశాబ్దాల్లో మొత్తంగా పెట్టుబడిదారీ వ్యవస్థలన్నీ సమస్యలను ఎదుర్కొంటున్నప్పటికీ పశ్చిమ ఐరోపా పరిస్థితి మెరుగుపడిరది. అందుకే ఫ్రాన్సు, జర్మనీ పాలకవర్గాలు స్వంతంగానే భద్రతను చూసుకోగలమనే సంకేతాలను పంపుతున్నప్పటికీ మొత్తంగా ఐరోపాను ఆదుకొనేంత ఆర్థిక శక్తి వాటికి లేదు.. మొత్తం మీద ప్రపంచ రాజకీయాల గురించి మీడియాలో గతంలో ఎన్నడూ లేని చర్చ జరుగుతోంది. సౌదీలో ఏం జరగనుంది ? తురుపు ముక్కలను ఎవరు ఎలా ప్రయోగిస్తారు. చూద్దాం !

మరణశయ్య మీద ఉన్న కన్నతల్లిని కూడా చూడనివ్వని ‘‘హిందూత్వ కర్కశత్వం ’’ క్షమా సావంత్‌కు వీసా నిరాకరించిన మోడీ సర్కార్‌ !

Tags

, , , , , , ,

ఎం కోటేశ్వరరావు

తాను అందరి మాదిరి జీవ సంబంధంగా పుట్టలేని ప్రధాని నరేంద్రమోడీ చెప్పారు. రాగద్వేషాలు లేని కర్మయోగి, విశ్వగురువు అని అభిమానులు గర్వంగా చెప్పుకుంటారు. ఆయన కన్నతల్లి వృద్ధాప్యంలో ఉన్నపుడు, చివరి రోజు వరకు చూసేందుకు అనేక సార్లు వెళ్లారు, సేవ చేశారని వార్తలు చదివాం, చిత్రాలను చూశాం. కానీ అలాంటి మరో తల్లిని చూసేందుకు ఆమె కుమార్తెకు వీసా నిరాకరించిన అదే పెద్దమనిషి తీరును ఎలా చూడాలి. ఎందుకు అలా చేశారు ? భారతీయ సంప్రదాయం, నైతికత అయితే కాదు, మరి రాజకీయ కక్షా ? అది అంత అమానవీయంగా ఉంటుందా ? అనేక వ్యాధులతో దినదిన గండగా నేడో రేపో అన్నట్లుగా గడుపుతున్న 82 ఏండ్ల కన్నతల్లిని చూసేందుకు ఒక కుమార్తెకు వీసా ఇచ్చేందుకు మోడీ ప్రభుత్వం నిరాకరించింది. ఆమె వీసా సమస్య గురించి విదేశాంగ మంత్రి జై శంకర్‌కు పూర్తిగా తెలుసు.జూన్‌ 26 నుంచి జూలై 15 మధ్య బెంగలూరు వచ్చేందుకు తనను అనుమతించాలని ఆమె జై శంకర్‌కు 2024 జూన్‌ 13న ఒక లేఖ రాశారు. రెండు సంవత్సరాల నుంచి తన తల్లి చికిత్స పొందుతున్నదని, దానికి సంబంధించిన వైద్యుల వివరణను కూడా జత చేసినా కనీసం లేఖ అందినట్లుగానీ, అనుమతి గురించి గానీ ఎలాంటి సమాధానం మంత్రి నుంచి రాలేదని ఆమె పేర్కొన్నారు. తాను కేవలం తల్లిని చూడటానికి మాత్రమే వస్తున్నట్లు, ఇతర కారణాలేమీ లేవని కూడా స్పష్టం చేసినప్పటికీ పట్టించుకోలేదు. విశ్వగురువు, అపరమానవతావాదిగా ప్రశంసలు పొందిన నరేంద్రమోడీ నాయకత్వంలోని అధికారులు ఒకసారి కాదు ఏడాదిలో ఏకంగా మూడు సార్లు తిరస్కరించారు. దీని గురించి అమెరికా మీడియాలో వార్తలు వచ్చిన తరువాత కూడా స్పందించలేదంటే కచ్చితంగా కావాలనే నిరాకరిస్తున్నట్లు భావించాల్సి వస్తోంది.

ఈ ఏడాది జనవరి తొమ్మిదిన ఆన్‌లైన్‌ ద్వారా క్షమ, ఆమె భర్త వీసా దరఖాస్తులను సమర్పించగా దాదాపు నెల రోజుల పాటు దరఖాస్తును తొక్కి పట్టి ఏ కారణం చెప్పకుండా మానసిక ఆందోళనకు గురిచేశారు. చివరికి భర్త కాల్విన్‌ ప్రీస్ట్‌కు మంజూరు చేసి క్షమకు తిరస్కరించారు. బెంగలూరులో ఉంటున్న తల్లి వసుంధరా రామానుజమ్‌ను పరామర్శించే నిమిత్తం ఇండియన్‌అమెరికన్‌ మహిళ క్షమా సావంత్‌(51) గతేడాది మే నెల నుంచి మూడు సార్లు దరఖాస్తు చేశారు. అమెరికాలోని మన దౌత్య కార్యాలయాలు అత్యవసర వీసా నిరాకరించాయి.తీవ్ర నేరారారోపణలతో జైళ్లలో ఉన్న నిందితులకు, శిక్షలు పడిన వారికి కూడా ఇలాంటి కారణాలతో పరిమిత బెయిలు మంజూరు చేసిన ఉదంతాలు మనకు తెలిసిందే. క్షమ సావంత్‌ నేరస్థురాలు కాదు, మన దేశ ఉగ్రవాద లేదా మరొక నిషేధిత జాబితాలో ఆమె పేరు లేదు. ఎలాంటి కేసులు లేవు. కానీ కారణాలు చూపకుండానే మీరు తిరస్కరణ జాబితాలో ఉన్నారంటూ అమెరికా వాషింగ్టన్‌ రాష్ట్రంలోని సియాటిల్‌ నగరంలో భారత కాన్సులేట్‌ దౌత్య కార్యాలయం 2025 ఫిబ్రవరి మొదటి వారంలో వీసా నిరాకరించింది. కారణం ఏమిటో చెప్పాలంటూ గట్టిగా అడిగినందుకు, చెప్పాల్సిన పని లేదని, కార్యాలయంలో అక్రమంగా ప్రవేశించారంటూ పోలీసులను పిలిపించింది. భర్త కాల్విన్‌ ప్రీస్ట్‌కు వీసా మంజూరు చేసి తనకు నిరాకరించటానికి నరేంద్రమోడీ విధానాలను వ్యతిరేకించే రాజకీయ కారణాలు తప్ప మరొకటి కాదని ఆమె ఎక్స్‌లో పేర్కొన్నారు.

మోడీ సర్కార్‌ తెచ్చిన పౌరసత్వ సవరణ చట్టం(సిఏఏ), జాతీయ పౌరనమోదు (ఎన్‌ఆర్‌సి)లను ఖండిస్తూ ఆమె ప్రాతినిధ్యం వహించిన సియాటిల్‌ నగరపాలక సంస్థలో తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. కులవివక్షకు వ్యతిరేకంగా 2023లో అదే సంస్థలో ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టి ఆమోదం పొందారు. కొన్ని కులాల వారి పట్ల వివక్ష చూపకూడదంటూ అమెరికా చరిత్రలో అధికారికంగా ఒక నగరంలో తీర్మానించటం ఇదే ప్రధమం.ఈ పరిణామం అంతర్జాతీయ దృష్టిని ఆకర్షించటమే గాక భారత్‌లో ఉన్న వివక్ష గురించి చర్చకు దారితీసింది. ఆమె సోషలిస్టు ప్రత్నామ్నాయం అనే సంస్థలో సభ్యురాలు. వీసా నిరాకరించిన కారణం చెప్పనందుకు తాను, తన భర్త , మద్దతుదారులతో కలిసి శాంతియుత పద్దతిలో ధర్నా చేశామని, వివరణ ఇచ్చేందుకు వారు తిరస్కరించారు, తెలుసుకోకుండా కదిలేది లేదని మేము తిరస్కరించటంతో వారు పోలీసులను పిలుస్తామని బెదిరించారంటూ ఆమె ఎక్స్‌లో పేర్కొన్నారు. ఈ సందర్భంగా తన మీద, మద్దతుదారులపై కూడా చేయి చేసుకున్నట్లు ఆ తెలిపారు. తనకు వీసా ఇవ్వకపోవటానికి నరేంద్రమోడీ ప్రభుత్వ తిరస్కరణ జాబితాలో పేరుండటమే అని ఒక అధికారి తనతో చెప్పినట్లు కూడా ఆమె మరో పోస్టులో పేర్కొన్నారు. వారాల తరబడి ఎలాంటి స్పందన లేకపోగా ఫోన్‌ ద్వారా సంప్రదించినా సమాధానం లేదన్నారు. వాషింగ్టన్‌ రాష్ట్రంలోని అతి పెద్ద నగరమైన సియాటిల్‌ సిటీ కౌన్సిల్లో సిఏఏ, ఎన్‌ఆర్‌సిలకు వ్యతిరేకంగా తాను తీర్మానాలు ప్రవేశ పెట్టటమే దీనికి కారణమని కూడా క్షమ పేర్కొన్నారు. నరేంద్రమోడీ ప్రభుత్వ విధానాల పట్ల విమర్శనాత్మక వైఖరిని వెల్లడిరచిన స్వీడన్‌లో ఉన్న భారతీయ ప్రొఫెసర్‌ అశోక్‌ సవాయిన్‌, బ్రిటన్‌లో ఉన్న రచయిత నితాషా కౌల్‌కు సైతం ఇలాంటి అనుభవాలే ఎదురయ్యాయి. విదేశాల్లో ఉంటూ తమ ప్రభుత్వాన్ని విమర్శించటం ఏమిటన్న దురహంకారం, కక్ష తప్ప దీనిలో మరోటి కనిపించటం లేదు.

క్షమ సావంత్‌ మహారాష్ట్రలోని పూనాలో ఒక తమిళ కుటుంబంలో జన్మించారు. తల్లి స్కూల్‌ పిన్సిపల్‌గా పని చేశారు. క్షమ 13 ఏండ్ల వయస్సులో ఇంజనీరైన తండ్రి ఒక ప్రమాదంలో మరణించారు. ముంబైలో ఆమె చదువుకొని సాఫ్ట్‌వేర్‌ ఇంజనీరయ్యారు.1996లో అమెరికా వెళ్లిన తరువాత అర్థశాస్త్రంలో పిహెచ్‌డి చేసి కొంతకాలం ప్రొఫెసర్‌గా పని చేశారు. అక్కడే ఆమె 2006లో వామపక్ష రాజకీయాల్లో అడుగుపెట్టారు.అంతకు ముందు ఆమెకు రాజకీయాలతో సంబంధం లేదు. 2012లో వాషింగ్టన్‌ ప్రజాప్రతినిధుల సభకు పోటీచేసి ఓడిపోయారు. తరువాత సియాటిల్‌ నగరపాలక సంస్థ ఎన్నికల్లో గెలిచి 2014 నుంచి 2024వరకు ప్రాతినిధ్యం వహించారు. ఆ సమయంలో కులవివక్ష వ్యతిరేక తీర్మానాన్ని ఆమోదింప చేయించటంతో పాటు కనీసం వేతనం గంటకు 15 డాలర్ల చట్టాన్ని అమలు జరిపించటంలో కూడా ఆమె పట్టుబట్టారు. కుల వివక్షకు వ్యతిరేకంగా తీర్మానాన్ని ఆమోదింప చేసేందుకు ఆమె కృషి చేయటాన్ని, సిఎఎ, ఎన్‌ఆర్‌సి చట్టాలను ఖండిస్తూ తీర్మానాలను చేయించటాన్ని అమెరికాలోని హిందూత్వశక్తులు జీర్ణించుకోలేకపోయాయి.


కుల వివక్ష వ్యతిరేక తీర్మానం చేయించటంలో కీలక పాత్ర పోషించటాన్ని హిందూ సంస్థలు తీవ్రంగా వ్యతిరేకించాయి. వీసా తిరస్కరణ వెనుక ఈ అంశం ఉందా అన్న ప్రశ్నకు ఇంతకు మించి బిజెపి ప్రభుత్వ రాజకీయ నిర్ణయం వెనుక మరొక కారణం కనిపించటం లేదు అన్నారు. నేను ఒక సోషలిస్టును, పదేండ్ల పాటు కార్మికవర్గ ప్రతినిధిగా సియాటిల్‌ కౌన్సిల్లో ఉన్నాను, ఆ సమయంలో నేను ప్రజా ఉద్యమ నిర్మాణానికి, కనీసవేతనం గంటకు 15డాలర్లకు పెంచాలని కోరుతూ నా పదవిని వినియోగించాను. ఇప్పుడది 20.76 డాలర్లకు పెరిగింది. అమెరికాలో ఇది గరిష్టం. పేదల గృహ నిర్మాణాలకు కార్పొరేట్‌ సంస్థలు వాటా చెల్లించాలని కూడా నేను పని చేశాను.2020 ఫిబ్రవరిలో సిఏఏ, ఎన్‌ఆర్‌సి చట్టాలను ఖండిస్తూ సియాటిల్‌ కౌన్సిల్లో పెట్టిన తీర్మానాన్ని వ్యతిరేకిస్తూ శాన్‌ ఫ్రాన్సిస్కోలోని భారత కాన్సులేట్‌ కార్యాలయం నాకు ఒక లేఖ పంపింది. అమెరికాలోని హిందూత్వ శక్తులు, మోడీ మద్దతుదార్లనుంచి వ్యతిరేకత ఎదుర్కొన్నాం.2023 ఫిబ్రవరిలో కులవివక్షపై చారిత్రాత్మక నిషేధాన్ని ప్రకటించటంలో విజయం సాధించాం. మాకు విశ్వహిందూ పరిషత్‌ నుంచి తీవ్ర వ్యతిరేకత వెల్లడైంది. మితవాద హిందూ అమెరికన్‌ ఫౌండేషన్‌, ఉత్తర అమెరికా హిందువుల సంఘటన మాకు వ్యతిరేకంగా పని చేశాయి. అందువలన మోడీ ప్రభుత్వం, అమెరికాలోని దాని మద్దతుదార్లు మాకు వ్యతిరేకంగా ఉన్నారనటంలో ఎలాంటి సందేహం లేదు. వారందరికీ నా రాజకీయ అభిప్రాయాలు ఏమిటో తెలుసు. అనారోగ్యంతో ఉన్న తల్లిని చూసేందుకు అనుమతించకపోవటం అమానుషం, ఏ రకమైన ప్రభుత్వమిది. నా వీసా తిరస్కరణ వెనుక రాజకీయ కారణాలు లేవని మోడీ సర్కార్‌ చెప్పుకోవాలంటే వీసా మంజూరు చేసి నిరూపించుకోవచ్చని క్షమ పేర్కొన్నారు.

అమెరికాకు వెళ్లిన వారు అందరూ అని కాదు గానీ ఎక్కువ మంది తమతో పాటు కులతత్వాన్ని, కులవివక్షను కూడా తీసుకుపోయారు. ఈ మధ్య దానికి మతాన్ని కూడా తోడు చేశారు. మన దేశంలో మత ప్రాతిక మీద పని చేసే సంస్థలన్నింటికీ అమెరికా శాఖలు ఉన్నాయి. దక్షిణాసియా నుంచి వచ్చిన దళితులు, ఇతర అణచివేతకు గురైన కులాల వారు అమెరికాలో కూడా దాన్ని తప్పించుకోలేకపోతున్నారు.కార్నెగీ ఎండోమెంట్‌ ఫర్‌ ఇంటర్నేషనల్‌ పీస్‌ అనే సంస్థ జరిపిన అధ్యయనం ప్రకారం విద్యాపరంగా మూడిరట ఒక వంతు, పని స్థలాల్లో , మూడిరట రెండువంతుల మంది వివక్షను ఎదుర్కొన్నట్లు తేలింది. తక్కువగా చూడటం, సూటిపోటి మాటలు, లైంగిక వేధింపుల గురించి 30 మంది దళిత మహిళా సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్లు తమ అనుభవాలను బహిరంగ లేఖ రూపంలో వెల్లడిరచారు. సిస్కో సిస్టమ్స్‌ కంపెనీలో అగ్రవర్ణాలుగా భావించబడుతున్నవారు తనకు రావాల్సిన ఉద్యోగోన్నతి, వేతన పెంపుదలను ఎలా అడ్డుకుంటున్నారో వెల్లడిస్తూ దాఖలు చేసిన కేసును ఒక దళత సామాజిక తరగతికి చెందిన ఇంజనీరు గెలిచారు. ఆ తరువాత వందలాది మంది తాము ఎదుర్కొన్న వివక్ష గురించి గళం విప్పారు. ఈ పూర్వరంగంలోనే క్షమ సావంత్‌ సియాటిల్‌ సిటీ కౌన్సిలర్‌గా వివక్షకు వ్యతిరేకంగా ఒక తీర్మానాన్ని ప్రతిపాదించి ఆమోదింప చేయించారు. లేని సమస్య ఉన్నట్లు, అతిగా చేసి పరువు తీస్తున్నారంటూ హిందూత్వ సంస్థలు, అగ్రకుల నాయకత్వంలోని సంస్థలు ఆమె మీద ధ్వజమెత్తాయి. సియాటిల్‌ కౌన్సిల్లో డెమోక్రటిక్‌ పార్టీకి చెందిన వారు ఎక్కువ మంది కౌన్సిలర్లు ఉన్నారు. వారు తొలుత తీర్మానానికి మద్దతు ఇవ్వలేదు. మితవాదులు ముందుకు తెచ్చిన వాదనలనే వారు వల్లించారు. చివరి వరకు ఏదో విధంగా అడ్డుకోవాలని చూశారు. అయితే వారి మీద వచ్చిన వత్తిడి కారణంగా ఒకరు తప్ప మిగతావారందరూ ఓటు వేయటంతో తీర్మానం నెగ్గింది.

క్షమా సావంత్‌ అలుపెరగని పోరాట యోధురాలిగా ఉన్నారు.కార్మికవర్గాన్ని దోచుకుంటున్న ధనికులు, వారికి మద్దతు ఇస్తున్న అధికార రిపబ్లిక్‌, ప్రతిపక్ష డెమోక్రటిక్‌ పార్టీల వైఖరిని నిరసిస్తూ ఫిబ్రవరి 22న సియాటిల్‌ నగరంలో ఒక సభను ఆమె నాయకత్వంలో పని చేస్తున్న వర్కర్స్‌ స్ట్రైక్‌ బాక్‌ సంస్థ నిర్వహిస్తున్నది. డెమోక్రటిక్‌ సోషలిస్టుగా ఉన్న బెర్నీ శాండర్స్‌ కూడా అందరికీ అందుబాటులో వైద్యం వంటి అంశాలలో జో బైడెన్‌ ప్రభుత్వ నిర్ణయాన్ని ఆమోదించారని కూడా ఆమె విమర్శించారు. ఆ రెండు పార్టీలకు ప్రత్నామ్నాయంగా మరొక పార్టీ నిర్మాణం జరగాల్సిన అవసరం ఉందని గతంలో ప్రకటించారు. దళితుల సమస్యల మీద ఆ సామాజిక తరగతికి చెందిన వారు మాత్రమే సక్రమంగా స్పందించగలరని వారు మాత్రమే పోరాటాలకు నాయకత్వం వహించాలని చెబుతున్న వారు క్షమ పోరాటం, ఆమె ఎదుర్కొంటున్న వేధింపులను చూసిన తరువాత తమ సంకుచిత వైఖరిని మార్చుకోవాలని సూచించటం తప్పుకాదేమో !

మోడీ అమెరికా వెళ్లారు, వచ్చారు – వారికి సమర్పించుకున్నదేమిటి ? మన దేశానికి తెచ్చిందేమిటి ?

Tags

, , , ,

ఎం కోటేశ్వరరావు

హమ్మయ్య ఒక పనైపోయింది. తెలుగువారి కళారూపాల్లో ఒకటైన ఏక పాత్రాభినయం గురించి తెలిసిందే. డోనాల్డ్‌ ట్రంప్‌ తన పట్టాభిషేకానికి నన్నెందుకు ఆహ్వానించలేదు, నన్ను పక్కన పెడితే పెట్టారు, చైనా నేత షీ జింపింగ్‌కు పెద్ద పీటవేయనేల, అతగాడు రాడని తెలిసి కూడా ఆహ్వానమేల, పోనీ వచ్చేందుకు తిరస్కరించిన తరువాత కూడా నన్ను పిలవాలని తట్టలేదా ? గత ఆలింగనాలు, చెట్టపట్టాలు గుర్తుకు రాలేదా ? అంతలా మర్చిపోతారా ? విదేశాంగ మంత్రి జై శంకర్‌ వెళ్లి చేసిన నిర్వాకం ఏమిటి ? పరిపరి విధాల ఇలాంటి స్థితిలో ఎట్టకేలకు ప్రధాని నరేంద్రమోడీకి ట్రంప్‌ నుంచి ఆహ్వానం వచ్చింది. ఫిబ్రవరి 13,14 తేదీలలో వెళ్లారు. ట్రంప్‌తో కరచాలనాలు, ఆలింగనాల తరువాత భేటీ జరిగింది. పరస్పరం పొగడ్తలకు ఎలాంటి లోటు జరగలేదు. అసలే 56 అంగుళాల ఛాతీ అంటారు, ట్రంప్‌ మర్యాదలతో అది మరింతగా పొంగిన స్థితిలో మోడీ స్వదేశానికి తిరిగి వచ్చారు. ఇంటి పెద్ద ఏదైనా ప్రయాణం చేసి వచ్చినపుడు కుటుంబంలోని వారు తమకేమి తెచ్చారా అని ఎదురు చూడటం సహజం. ఇప్పుడు మన మోడీ ఏం తెచ్చారని మన జనం ఆసక్తి కనపరుస్తున్నారు. మోడీ తిరిగి రాకముందే వచ్చిన వార్త ఏమింటే సుంకాల విధింపులో తగ్గేదేలేదు, భారత్‌ అయినా మరొకరైనా మా మీద విధిస్తే మేమూ అంతే చేస్తాం అన్న ప్రకటన పతాక శీర్షికల్లో వచ్చింది.పరస్పర వడ్డింపులు అందరికీ వర్తిస్తాయి, ఎవ్వరికీ మినహాయింపులేదు.వాణిజ్యం విషయంలో మా శత్రుదేశాల కంటే మిత్ర దేశాలు అధ్వాన్నంగా ఉన్నాయి. భారత్‌ పెద్ద మొత్తంలో పన్నులు విధిస్తున్నది. ఆ కారణంగా హార్లే డేవిడ్స్‌న్‌ తమ మోటారు సైకిళ్లను అమ్ముకోలేకపోయిందని నాకు గుర్తువస్తున్నది. తమ జరిమానాలను తప్పించుకోవాలంటే ఇతర దేశాలు తమ పన్నులు ఎత్తివేయాలి లేదా తగ్గించాల్సిందే అని ట్రంప్‌ చెప్పాడు. తాను తీసుకొనే చర్యలు అంతిమంగా అమెరికా కంపెనీలకు మేలు చేస్తాయన్నాడు. 2030 నాటికి రెండు దేశాల మధ్య వాణిజ్యాన్ని 500 బిలియన్‌ డాలర్లకు పెంచుతామని, రక్షణ రంగంలో సహకారం, పౌర అణుఒప్పందంలో అమెరికా కంపెనీలకు అనుకూలమైన నిర్ణయాలు, ఇతర అనేక అంశాల గురించి మరో సందర్భంలో చర్చించుకోవచ్చు, పరిమితంగా కొన్ని అంశాలను చూద్దాం.

మోడీ పర్యటన గురించి ఒక్క ముక్కలో చెప్పాలంటే డోనాల్డ్‌ ట్రంప్‌కు భారీగా సమర్పించుకొని వచ్చారు తప్ప అక్కడి నుంచి తెచ్చిందేమీ లేదంటే కొందరు నొచ్చుకోవచ్చుగానీ అది మింగలేని నిజం. అంత తొందరగా నిర్ణయానికి రావటమెందుకు తరువాత ఫలితాలు వస్తాయోమో అనే వాళ్లను నిరుత్సాహపరచటం లేదు. ట్రంప్‌ ఏం చెప్పాడు ? భారత్‌అమెరికా వాణిజ్యంలో మేం లోటులో ఉన్నాం, ఆ మేరకు మా దగ్గర నుంచి సరకులు కొనుగోలు చేయాలి. ప్రపంచంలో ఏ దేశంలోనూ లేనంత ముడి చమురు మా దగ్గర ఉంది, భారత్‌కు అది అవసరం, మా నుంచి కొనుగోలు చేయాలి. మా వస్తువుల మీద దిగుమతి పన్ను తగ్గించాలి, వాటిని దిగుమతి చేసుకోవాలి అని నిర్మొహమాటంగా చెబితే, సరే ఇంకేం చేస్తాం అంటూ మోడీ తలూపి వచ్చారు. ఇతర దేశాల కంటే ఎక్కువగా అమెరికా నుంచి ముడిచమురు, గ్యాస్‌ కొనుగోలు చేస్తామని అంగీకరించి వచ్చారు.మన దేశానికి అమెరికా ఐదవతరం ఎఫ్‌35 యుద్ధ విమానాలు విక్రయిస్తామని ట్రంప్‌ చెప్పాడు. ఇంకేముంది చైనాను నిలువరించేందుకు వచ్చేసినట్లే అన్నట్లుగా మీడియాలో కొందరు చిత్రించారు. నిజానికి ఆలూలేదూ చూలూ లేదు. అసలు ఒప్పందమే లేదు. ఎప్పుడో చేసుకున్న ఒప్పందాల ప్రకారం మనకు అవసరమైన పాతతరం ఇంజన్లు సరఫరా చేసేందుకే అమెరికా జాప్యం చేస్తున్నది.

మన దేశం తేలిక రకం తేజాస్‌ యుద్ధ విమానాలను తయారు చేసే క్రమంలో ఉంది.వాటిని సాంకేతికంగా ఉన్నతీకరిస్తున్నారు. ఎంకె1ఏ రకం విమానానికి అవసరమైన ఇంజన్ల కోసం సందేహాలున్నప్పటికీ అమెరికా జిఇ కంపెనీతో మన హిందూస్తాన్‌ ఏరోనాటిక్స్‌ 2021లో ఎఫ్‌404రకం 99 ఇంజన్ల సరఫరా, నిర్వహణ ఒప్పందం చేసుకుంది. సరఫరా గడువు దాటింది, ఒప్పందం ప్రకారం అపరాధ రుసుం వేసినప్పటికీ ఇంతవరకు ఒక్కటంటే ఒక్క ఇంజన్‌ కూడా మనకు రాలేదు. అవే రాలేదనుకుంటే నరేంద్రమోడీ 2023లో అమెరికా వెళ్లినపుడు ఎల్‌సిఏ ఎంకె2కు అవసరమైన జిఇ 414 ఇంజన్ల సరఫరా ఒప్పందం కూడా చేసుకున్నారు. మొదటిదానికే దిక్కులేదు. ఎందుకు సరఫరా చేయటం లేదు అంటే దానికి అవసరమైన విడిభాగాలను సరఫరా చేసే దక్షిణ కొరియా కంపెనీ ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉందని సాకు చెబుతున్నారు. అలాంటిది ఆధునిక ఎఫ్‌35 యుద్ద విమానాలను మనకు విక్రయిస్తుందా ? అంతే కాదు అమెరికా తయారు చేసిన ఎఫ్‌16 యుద్ద విమానం ఇప్పుడు పాతబడిపోయింది.దానికి రంగులు మార్చి లేదా పరిమితమైన మార్పులు చేసి ఎఫ్‌21పేరుతో మనకు విక్రయించేందుకు లాక్‌హీడ్‌ మార్టిన్‌ కంపెనీ చూస్తున్నదని వార్తలు. అది ఐదవతరం ఎఫ్‌22 రాప్టర్‌కు ఒక అడుగు మాత్రమే వెనుక ఉన్నట్లు కూడా చెప్పారు. ట్రంప్‌మోడీ ఏమోయ్‌ అంటే ఏమోయ్‌ అనుకునేట్లుగా ఉన్న సమయంలోనే పాకిస్తాన్‌కు అమెరికా ఎఫ్‌16 విమానాలను అందచేసిందని, 2019 ఫిబ్రవరి 27న మన వైమానిక దళం వాటిలో ఒకదాన్ని కూల్చి వేసిందని గుర్తుకు తెచ్చుకోవాలి.


మేక్‌ అమెరికా గ్రేట్‌ ఎగైన్‌ – మాగా (అమెరికాను మరోసారి గొప్పదానిగా చేయాలి) అన్నది ట్రంప్‌ నినాదం. దానికి అడ్డువచ్చే వారిని ఎవరినీ సహించడు అని వేరే చెప్పాల్సిన పనిలేదు. అన్ని రంగాల్లో సవాలు విసురుతున్న చైనా ఒక వైపు ఉంటే భారత్‌ కూడా అలాగే తయారవుతానంటే అంగీకరిస్తాడా ? కానీ నరేంద్రమోడీ గారు మాగాకు పోటీగా మిగా అని ఎక్స్‌ చేశారు. వికసిత భారత్‌ లక్ష్యాన్ని మేక్‌ ఇండియా గ్రేట్‌ ఎగైన్‌ అని మేం కూడా అనొచ్చు అన్నారు. అమెరికా అంటే గతంలో అన్ని రంగాల్లో ముందున్నది, ప్రాసకోసం తప్ప వస్తు తయారీలో మనం ఎప్పుడు ముందున్నాం ? పదేండ్ల క్రితం ఉన్న జిడిపిలో ఉన్న స్థాయిలో కూడా నేడు మన తయారీ రంగం లేదన్నది దాస్తే దాగుతుందా ? గత చరిత్ర మొత్తం అమెరికా మనలను అడ్డుకున్నదే.తొలిసారిగా 1962లో మన దేశం చైనాతో యుద్ధానికి దిగినపుడు ఫైటర్‌ జెట్లు కావాలని నాటి ప్రభుత్వం కోరితే వాటికి బదులు రవాణా విమానాలు, రాడార్లను ఇచ్చిందట. తరువాత పాకిస్తాన్‌కు 12 సూపర్‌ సోనిక్‌ ఫైటర్‌జెట్లను ఇస్తే వాటిని 1965లో మన మీద ప్రయోగించారు. ఆ తరువాతే మనం సోవియట్‌ యూనియన్‌ నుంచి మిగ్‌ 21 విమానాలను కొనుగోలు చేశాము.1998లో మన దేశం అణుపరీక్షలు జరిపితే అమెరికా మనలను ఆర్థికంగా దెబ్బతీసేందుకు అనేక ఆంక్షలను విధించింది. అక్రమచొరబాటుదార్లను గుర్తించేందుకు ఉపగ్రహ ఆధారిత వ్యవస్థలు కావాలని కోరితే అమెరికా నిరాకరించింది. తరువాత మనమే సొంతంగా రూపొందించుకున్నాం. గాల్వన్‌లోయలో జరిగిన ఉదంతాల వెనుక అమెరికా ఇచ్చిన తప్పుడు సమాచారం ఉందని కూడా చెబుతారు. తరువాత అరుణాచల్‌ ప్రదేశ్‌లో చైనా అక్రమంగా గ్రామాల నిర్మాణం చేస్తోందంటూ కూడా ఇచ్చిన తప్పుడు సమాచారాన్ని మన మిలిటరీ తోసిపుచ్చిన సంగతి తెలిసిందే. వారి ప్రాంతంలో ఎప్పుడో నిర్మించి పాతబడిన వాటిని తిరిగి నిర్మిస్తున్నది తప్ప కొత్తవి కాదని ప్రకటించారు.

ఇల్లలక గానే పండగ కాదన్నట్లుగా నరేంద్రమోడీ డోనాల్డ్‌ ట్రంప్‌ మధ్య కుదిరిన అవగాహనలేమిటో, వాటి పరిణామాలు, పర్యవసానాలను చూడాల్సి ఉంది. నమస్కార బాణం వేసినట్లు ముందుగానే మన వైపు నుంచి అమెరికా వస్తువులకు కొన్ని రాయితీలు ఇవ్వటానికి సిద్దం అనే సంకేతాలు ఇచ్చాము.అయితే ట్రంప్‌కు అవి సంతృప్తి కలగలేదు గనుకనే భారత్‌ ఎంత సుంకం విధిస్తుందో మేమూ అంతే వేస్తాం అంటూ కరాఖండితంగా ముందే చెప్పాడు. తమ వస్తువులను మనదేశంలో కుమ్మరించేందుకు తొలిసారి అధికారానికి వచ్చినపుడే ట్రంప్‌ ఎత్తుగడ వేశాడు.ఇస్తినమ్మా వాయనం పుచ్చుకుంటినమ్మా వాయనం అన్నట్లు తాము చేసినదానికి ప్రతిగా భారత్‌ రాయితీలు ఇవ్వలేదంటూ 2019లో ప్రత్యేక వాణిజ్య భాగస్వామిగా మన దేశం నుంచి దిగుమతి చేసుకుంటున్న వస్తువుల మీద ఇస్తున్న ప్రాధాన్యత (జిఎస్‌పిాజనరలైజ్‌డ్‌ సిస్టమ్‌ ఆఫ్‌ ఫ్రిఫరెన్సు)ను రద్దు చేసి సుంకాలు విధించాడు. దానికి ప్రతిగా మన దేశం కూడా పన్నులు విధించింది. ఎక్కడైనా బావేగాని వంగతోట దగ్గర కాదన్నట్లుగా మోడీ పర్యటన సందర్భంగా ట్రంప్‌ ఎన్ని మెచ్చుకోలు మాటలు చెప్పినా తాను తీసుకున్న చర్యను వెనక్కు తీసుకోవటం గురించి ఒక్క మాటా లేదు. మీ ఇంటి కొస్తే మాకేం పెడతావ్‌ మా యింటికొస్తే మాకేం తెస్తావ్‌ అన్నట్లుగానే ఉంది.

ఇప్పుడున్న పరిస్థితిని చూస్తే అమెరికా వస్తువులపై మనం విధించే పన్నుల గురించి ట్రంప్‌ గుర్రుగా ఉన్నాడు. పన్నుల రారాజు అంటూ మన దేశాన్ని గతంలో వర్ణించాడు. నరేంద్రమోడీ పర్యటన సందర్భంగా కూడా తన అంతరంగాన్ని దాచుకోలేదు. అమెరికన్‌ కార్ల వంటి వాటి మీద 70శాతం పన్ను విధిస్తున్నారని, ఇది పెద్ద సమస్య అన్నాడు. అనేక వస్తువుల మీద 30,40,60 చివరికి 70శాతం పన్ను కూడా భారత్‌ విధిస్తున్నది, వాటిని తగ్గిస్తామని మోడీ చెప్పారు. 70శాతం పన్ను ఉంటే అమెరికా కార్లను ఆమ్ముకోలేం, భారత్‌తో దాదాపు వంద బిలియన్‌ డాలర్ల మేర తమకు లోటు ఉంది అన్నాడు. మా దగ్గర ఏ దేశంలోనూ లేనంతగా ఉన్న చమురు, గ్యాస్‌ను విక్రయించి ఆలోటును పూడ్చాలనుకుంటున్నాం అని కుండబద్దలు కొట్టినట్లు చెప్పాడు. ఇటీవలి అంతర్జాతీయ పరిణామాల కారణంగా రష్యా నుంచి అత్యధికంగా ముడి చమురు కొనుగోలు చేస్తున్నాం.2024 ఏప్రిల్‌ నుంచి నవంబరు వరకు ఎనిమిది మాసాలలో మన దేశం దిగుమతి చేసుకున్న ముడిచమురులో రష్యా వాటా 37.6, ఇరాక్‌ 19.9, సౌదీ అరేబియా 13.3,యుఏయి 9.1 అమెరికా 4.3, ఇతర దేశాల నుంచి 16.4శాతం వాటా ఉంది. ఆ తరువాత రష్యా నుంచి చమురు రవాణా చేసే నౌకల మీద కూడా అమెరికా ఆంక్షలు విధించటంతో ఈ ఏడాది, ఫిబ్రవరి, మార్చి నుంచి పెద్ద మొత్తంలో తగ్గే అవకాశం ఉంది. ఇప్పుడు రష్యా స్థానాన్ని అమెరికా ఆక్రమిస్తుందా అన్నది చూడాల్సి ఉంది.

అమెరికా నుంచి దిగుమతి చేసుకొనే చమురు ధరలో ఎలాంటి రాయితీ ఉండదు, దూరం గనుక రవాణా ఖర్చులు పెరుగుతాయి, సమయమూ ఎక్కువ పడుతుంది. ఆ భారం మొత్తం వినియోగదారులే భరించాల్సి ఉంటుంది. దీనికి తోడు అమెరికా రకం ముడి చమురును శుద్ది చేయాలంటే మన రిఫైనరీలలో మార్పులు చేర్పులు చేయాల్సి ఉంటుందని, అది కంపెనీల మీద అదనపు భారం మోపుతుందని చెబుతున్నారు. అమెరికా బెదిరింపులకు లొంగి ఇప్పటికే ఇరాన్‌ నుంచి చమురు కొనుగోలు నిలిపివేశాము. ఇప్పుడు రష్యా, ఇతర దేశాల నుంచి కూడా నిలిపివేసి ఒక్క అమెరికా మీదనే ఆధారపడితే మన జుట్టును దాని చేతికి ఇచ్చినట్లే అవుతుంది. అదే జరిగితే మన ఇంథన భద్రతకే ముప్పు వస్తుంది. వ్యూహాత్మకంగా కావచ్చు లేదా మరొక కారణంతో గానీ ట్రంప్‌`మోడీ భేటీలో చైనా ప్రస్తావన పెద్దగా రాలేదు. గతంలో ట్రంపు అధికారంలో ఉండగానే చైనాతో సరిహద్దులోని గాల్వన్‌లోయలో ఘర్షణ జరిగిన సంగతి తెలిసిందే. ఇరుదేశాలు ఆ ఉదంత పూర్వపు స్థాయికి సంబంధాలను నెలకొల్పుకొనేందుకు ఇటీవలనే ఒప్పందం చేసుకొని ముందుకు పోతున్నాయి. కావాలంటే సరిహద్దు సమస్యలో సాయం చేసేందుకు నేను సిద్దం అని మోడీతో ట్రంప్‌ అన్నట్లు వార్తలు వచ్చాయి. సాయం సంగతి దేవుడెరుగు తంపులు పెట్టకుండా ఉంటే చాలు. ఇరుగు పొరుగు దేశాలతో సమస్యలను పరిష్కరించుకోలేనంత అసమర్ధంగా మనదేశం లేదు.

మన్మోహన్‌ సింగ్‌ పదేండ్లలో రు.38లక్షల కోట్లు, నరేంద్రమోడీ అప్పు రు.129లక్షల కోట్లు ఎవరి కోసం చేసినట్లు !

Tags

, , , ,

ఎం కోటేశ్వరరావు


ఉచిత పథకాలు, నగదు బదిలీల వంటి రాజకీయ పార్టీల వాగ్దానాల కారణంగా జనాలు సోమరులుగా మారుతున్నారని, పరాన్నజీవులవుతున్నారంటూ సుప్రీం కోర్టు న్యాయమూర్తులు బుధవారం(ఫిబ్రవరి 12,2024) వ్యాఖ్యానించినట్లు వార్తలు వచ్చాయి. చిత్రం ఏమిటంటే ఇలాంటి వాటి గురించి కేసులు వేసేవారు ఉంటారు తప్ప ప్రోత్సాహకాల పేరుతో వేళ్లమీద లెక్కించదగిన కార్పొరేట్‌ సంస్థలకు లక్షల కోట్ల రాయితీలు, బాంకు అప్పుల మాఫీలు,రికార్డు స్థాయిలో ప్రభుత్వాలు చేస్తున్న అప్పుల గురించి ఎవరైనా సుప్రీం కోర్టులో కేసు దాఖలు చేశారా ? పోనీ న్యాయమూర్తులు మీడియాలో వస్తున్న వార్తలపై స్పందించారా అంటే అదీ కనపడదు. అప్పులు తెచ్చేది ఎందుకు అంటే అభివృద్ధి కోసం అని అధికార పార్టీ నుంచి తడుముకోకుండా చెప్పే సమాధానం. ఆ మేరకు దాని ఆనవాళ్లు లేవేమి అంటే ఫలితాలు వెంటనే ఎలా కనిపిస్తాయి, రానున్న రోజుల్లో చూడండి అంటారు. స్వాతంత్య్రం తరువాత దేశాన్ని పాలించిన ప్రధానులందరూ కలసి 2004 నాటికి కేంద్ర ప్రభుత్వానికి మిగిల్చిన అప్పు రు.17,79,763 కోట్లు. పదేండ్ల మన్మోహన్‌ సింగ్‌ పాలనలో 2014మార్చి నెల నాటికి బడ్జెట్‌ పత్రాల సమాచారం ప్రకారం కేంద్ర ప్రభుత్వానికి మిగిల్చిపోయిన అంతర్గత, విదేశీ అప్పుల మొత్తం రు.55,87,149 కోట్లు, అది 2025 మార్చి నాటికి రు.185.11లక్షల కోట్లని, 2026 మార్చి నెలాఖరుకు రు.200.16లక్షల కోట్లకు చేరుతుందని అంచనా వేశారు. పదేండ్ల క్రితం ఇప్పుడు కూడా చర్చ అభివృద్ధి మీదే. పదేండ్లలో యుపిఏ పాలనలో అదనంగా 38లక్షల కోట్ల అప్పు చేస్తే దేశాన్ని అప్పుల పాలు చేశారు, అభివృద్దీ చేయలేదు అంటూ నరేంద్రమోడీ నాడు ధ్వజమెత్తారు. తన ఏలుబడిలో 2025మార్చినెలతో ముగిసే ఆర్థిక సంవత్సరం నాటికి అదనంగా చేసిన అప్పు 129లక్షల కోట్లు. ఇది చాలక ఈ ఏడాది మరో 15.68లక్షల కోట్లు కొత్తగా అప్పులు తీసుకొనేందుకు నిర్ణయించారు. తీరా ఇంత చేసినా 80కోట్ల జనాభా ఉచితంగా నెలనెలా ఐదు కిలోల ఆహారధాన్యాలు ఉచితంగా తీసుకుంటే తప్ప గడవని స్థితికి దేశాన్ని దిగజార్చారు. మరో 22 సంవత్సరాల్లో (2047నాటికి) దేశాన్ని ఎక్కడికో తీసుకుపోతామని కబుర్లు చెబుతున్నారు. నమ్మే మాటలేనా ?

అంతకు ముందు కాంగ్రెస్‌ పాలనకు పదకొండు సంవత్సరాల నరేంద్రమోడీ పాలనకు పెద్ద తేడా ఏమిటి ? మన్మోహన్‌ సింగ్‌ మాకు పెద్ద మొత్తంలో అప్పులు మిగిల్చిపోయారు, వాటిని తీర్చటానికే సరిపోతోందని వాదించవచ్చు. అప్పుల్లో మోడీ సరికొత్త రికార్డు సృష్టించారు గనుక అది తర్కానికి నిలిచేది కాదు.201415లో మోడీ సర్కార్‌ అసలు, వడ్డీ మొత్తాలను తీర్చేందుకు ఖర్చు చేసిన మొత్తం రు.3,13,169 కోట్లు కాగా 2026 మార్చి నాటికి తీర్చాల్సిన మొత్తం రు.12,76,338 కోట్లుగా నిర్మలమ్మ తాజా బడ్జెట్‌లో ప్రతిపాదించారు.ఈ ఏడాది బడ్జెట్‌ మొత్తం రు.50.65లక్షల కోట్లకు గాను రు.15.68లక్షల కోట్లు అప్పుల ద్వారా సేకరిస్తామని చెప్పారు. మూడు సంవత్సరాల తీరుతెన్నులను చూస్తే వడ్డీ, అసలు చెల్లింపుల మొత్తం ఏడాదికి లక్ష కోట్ల వంతున పెరుగుతోంది. ఈ లెక్కన మోడీ మూడోవిడత పాలన ముగిసే నాటికి ఎంత అప్పు తెస్తే అంతమొత్తం పాత అప్పులకే సరిపోతుందని వేరే చెప్పనవసరం లేదు.ఒక వైపు అప్పుల కుప్ప పెరుగుతోంది,జనం మీద జిఎస్‌టి, చమురు మీద సెస్‌ల భారం కొనసాగుతూనే ఉంది. అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు తగ్గినా ఒక్క పైసా కూడా వినియోగదారులకు తగ్గించకుండా 2022 ఏప్రిల్‌ మొదటి వారం నుంచి ఒకే ధర కొనసాగిస్తూ జేబులను కొల్లగొడుతూనే ఉన్నారు. తెచ్చిన అప్పుల మేరకైనా సంపదలను పెంచే మూలధన పెట్టుబడులుగా పెడుతున్నారా అంటే అదీ లేదు.202324లో రు.16.54లక్షల కోట్ల మేర అప్పులు తెస్తే మూలధన పెట్టుబడులకు రు.7.88 లక్షల కోట్లు మాత్రమే కేటాయించారు, మరుసటి ఏడాది రు.15.69లక్షల కోట్ల అప్పులో రు.8.47లక్షల కోట్లు సవరించిన బడ్జెట్‌ కాగా 202526లో మూలధన పెట్టుబడిగా రు.8.95లక్షల కోట్లుగా ప్రతిపాదించారు. అంతకు ముందు 9.18లక్షల కోట్లు కేటాయించి దాన్ని కుదించినట్లే వచ్చే ఏడాది కూడా అంత మొత్తం ఖర్చు చేస్తారన్న హామీ లేదు. వడ్డీ చెల్లింపుల మాదిరి శాశ్వత ఆస్థుల కల్పన లేదు. అందుకే నరేంద్రమోడీ ఏలుబడి గొప్పతనం ఏమిటి అని ప్రశ్నించాల్సి వస్తోంది.

తమ పాలనలో విదేశీ అప్పులు పెద్దగా తీసుకోలేదని బిజెపి నేతలు గొప్పలు చెప్పుకుంటారు. అంకెలేమి చెబుతున్నాయి. 2014 మార్చి నాటికి విదేశీ అప్పుల మొత్తం మన కరెన్సీలో రు.1.82లక్షల కోట్లు, ఈ మొత్తం 2026 మార్చి నాటికి 6.63లక్షల కోట్లకు పెరుగుతుందని నిర్మలమ్మ బడ్జెట్‌లో చెప్పారు.గత పది సంవత్సరాలలో ఇంత మొత్తం అప్పులు తెచ్చిందెవరు ? మోడీ ఏలుబడిలో రూపాయి విలువ 62 నుంచి 86కు పతనమైంది. దీని వలన జరిగిందేమిటి ? పదేండ్ల క్రితం మోడీ ఒక డాలరు విదేశీ అప్పు తీసుకుంటే దాన్ని మరుసటి ఏడాది చెల్లించాలంటే నాడున్న మారకపు విలువ ప్రకారం రు.62, దానికి నామమాత్రంగా వడ్డీ చెల్లిస్తే సరిపోయేది. అదే డాలరును ఎలాంటి వడ్డీ లేకుండా పదేండ్ల తరువాత ఇచ్చే ఒప్పందం మీద ఎవరైనా ఉదారంగా అప్పు ఇస్తే ఇప్పుడు 86 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది.మోడీ దిగిపోయే 2029 నాటికి వందకు పతనమైనా ఆశ్చర్యం లేదు.అధికారానికి వచ్చిన వెంటనే అప్పు తీర్చి ఉంటే ఇంత ఆముదం జనానికి అంటేది కాదు కదా ! ఇదీ మోడీ ఘనత.

ఇప్పుడు కార్పొరేట్లు తమకు మరిన్ని రాయితీలతో పాటు తాము తయారు చేసే వస్తువులు, అందించే సేవలను కొనుగోలు చేసేందుకు మధ్యతరగతికి ఆదాయపన్ను రాయితీలు ఇవ్వాలని, కొందరైతే కార్మికులకు వేతనాలు పెంచాలని కూడా సూచించారు. పన్నెండు లక్షల వరకు ఆదాయానికి పన్ను మినహాయింపు ఇచ్చారు. దీని వలన ఏటా లక్ష రూపాయలవరకు ఆలోపు రాబడి ఉన్నవారికి మిగులుతుందని అంచనా.ఈ మొత్తంతోనే దేశంలో పడిపోయిన వినియోగం పెరుగుతుందా ? ఈ స్వల్ప మిగులుతో గతంలో చేసిన అప్పులు కూడా తీర్చుకోవచ్చు, వస్తువులే కొనాలని లేదు. లేదా పెరిగిన ఖర్చులకు సరిపెట్టుకోవచ్చు. విదేశీ పెట్టుబడులను ఆకర్షించటం, స్వదేశీ పెట్టుబడిదారులకు మరింత ఊతం ఇచ్చే పేరుతో కార్పొరేట్‌ పన్ను 30 నుంచి 22 శాతానికి తగ్గించారు. కొత్తగా పెట్టే సంస్థలకు 15శాతమే అన్నారు. ఈ రాయితీలతో పరిశ్రమలు, వాణిజ్య సంస్థల లాభాలు విపరీతంగా పెరిగాయి, వాటాదార్లకు డివిడెండ్లు వచ్చాయి తప్ప ఆ మొత్తం పెట్టుబడుల రూపంలో తిరిగి రాలేదు, ఆ మేరకు ఉపాధి కూడా పెరగలేదు. అదే జరిగి ఉంటే వస్తువినియోగం పెరిగి ఉండేది, రూపాయి రూపాయి లెక్కించుకోవాల్సి వచ్చేది కాదు. సంపదలు కొద్ది మంది దగ్గర పోగుపడుతున్న తీరు స్పష్టంగా కనిపిస్తోంది. 201314లో ఏడాదికి 50లక్షల రూపాయల రాబడిని చూపి పన్ను చెల్లించిన వారు 1.85లక్షలుంటే 2023`24లో వారి సంఖ్య 9.34లక్షలకు పెరిగింది. అయితే ఇంకా పన్ను ఎగవేసేవారు, రాబడిని చూపని వారు పెద్ద సంఖ్యలోనే ఉన్నారు.


దేశంలో 2011జనాభా లెక్కల ప్రకారం రైతులుగా నమోదైన వారు 11.88 కోట్లు, వ్యవసాయ కార్మికులు 14.43 కోట్లు. కార్పొరేట్‌ పన్ను చెల్లించే సంస్థలు 2021లో 9,67,054. నిర్మలా సీతారామన్‌ స్వయంగా వెల్లడిరచినదాని ప్రకారం పైన పేర్కొన్న కార్పొరేట్‌ పన్ను తగ్గింపు కారణంగా ప్రభుత్వం ఏటా రు.1.45 లక్షల కోట్ల రాబడి కోల్పోతున్నది. పిఎం కిసాన్‌ సమ్మాన్‌ నిధి పేరుతో పెట్టుబడి ఖర్చులకు గాను ఏటా 10.32 కోట్ల మంది రైతులకు 63వేల కోట్ల రూపాయలను మాత్రమే కేంద్రం ఇస్తున్నది. అయిన వారికి ఆకుల్లో కాని వారికి కంచాల్లో అంటే ఇదే. రైతులు ఎక్కువ మందికి ఉపాధి కల్పిస్తున్నారా, కార్పొరేట్‌ సంస్థలు ఎక్కువ మందికి పని చూపుతున్నాయా ? ఎందుకీ వివక్ష ? రైతులకు ఇచ్చే ఆ మొత్తంతో కార్పిరేట్లు విక్రయించే విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు, వ్యవసాయ పరికరాల వంటి వాటిని కొనుగోలు చేసేందుకు ఖర్చు చేస్తారు. దానిలో కూడా కార్పొరేట్లకు లాభాలు, ప్రభుత్వాలకు పన్నుల రూపంలో రాబడి వస్తుంది.కానీ కార్పొరేట్లకు ఇస్తున్న రాయితీలతో వారేమైనా వస్తువులు, సేవల ధరలు తగ్గించిన దాఖలా ఉందా ? ఆదాయపన్ను రాయితీలు ఒకటైతే ఎగమతి ప్రోత్సాహకాలు, వెనుకబడిన ప్రాంతాల్లో పరిశ్రమలు పెట్టినందుకు ప్రోత్సాహకాల రూపంలో ఇచ్చే రాయితీలను కూడా పరిగణనలోకి తీసుకుంటే వారికి కట్టబెడుతున్న మొత్తాలు ఇంకా ఎక్కువే ఉంటాయి.


ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు కల్పిస్తానన్న వాగ్దానాన్ని పాక్షికంగా నెరవేర్చినా జిడిపి వృద్ది రేటు, కొనుగోలు శక్తి దిగజారి ఉండేది కాదు.పని చేసేందుకు ఏ దేశంలోనూ లేనంత మంది యువత ఉన్నదని గొప్పలు చెప్పుకోవటం తప్ప వారికి ఉపాధి సంగతి తరువాత గత పదేండ్లలో పనిచేసేందుకు ముందుకు వచ్చేవారికి కనీసం నైపుణ్యం అయినా కల్పించారా అంటే అదీ లేదు. నైపుణ్యశిక్షణ పేరుతో తగలేసిన వేల కోట్ల రూపాయలు ఒక పెద్ద కుంభకోణంగా చెప్పవచ్చు. దరిద్రం ఏమిటంటే అసలు ఎంత మంది నిపుణులున్నారో కూడా తెలియదు. అందుకే ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఆ లెక్కలు సేకరిస్తానని ఇప్పుడు చెబుతోంది.నైపుణ్య భారత్‌ కార్యక్రమం కింద కోటీ 40లక్షల మందికి నైపుణ్య శిక్షణ ఇచ్చామని, మరో 54లక్షల మందికి నైపుణ్యాలను పెంచటం లేదా తిరిగి శిక్షణ ఇచ్చామని 2024 కేంద్ర ప్రభుత్వం చెప్పుకుంది. జాతీయ నైపుణ్య అభివృద్ధి కార్పొరేషన్‌(ఎన్‌ఎస్‌డిసి) 2024లో వెల్లడిరచిన అధ్యయన వివరాల ప్రకారం దేశంలో 10.3కోట్ల మంది నైపుణ్య కార్మికులు అవసరం కాగా 7.4కోట్ల మందే ఉన్నారు. మారుతున్న అవసరాలకనుగుణ్యంగా నిన్న నేర్చుకున్న నైపుణ్యం రేపటికి పనికి రావటం లేదు. అందువలన వీరిలో ఎందరు పనికి వస్తారన్నది కూడా ప్రశ్న.చైనాలో 40 కోట్ల మంది కార్మికులు ఉంటే వారిలో 20 కోట్ల మంది నిపుణులైన వారు కాగా ఆరు కోట్ల మంది అత్యంత నైపుణ్యం కలిగిన వారని, ఇతర దేశాలతో పోటీ పడేందుకు తమకు ‘‘ నూతన ఉత్పాదక శక్తులు ’’ ఇంకా ఎంతో మంది కావాలని చైనా చెబుతోంది.మహాకుంభ మేళాలో రికార్డు స్థాయిలో జనాలను గంగలో ముంచి స్నానాలు చేయించేందుకు ఇచ్చిన ప్రాధాన్యత పరిశోధన మరియు అభివృద్ధికి నిధుల కేటాయింపు, నైపుణ్య శిక్షణలో ఎక్కడా కనిపించటం లేదు. ఇలాంటి వారు దేశాన్ని, దేశమంటే మట్టి కాదోయ్‌ మనుషులోయ్‌ అన్న గురజాడ చెప్పిన స్పూర్తితో ముందుకు తీసుకుపోతారా !