ఉక్రెయిన్‌ సంక్షోభం : మాటతప్పే, మడమతిప్పే బాటలో డోనాల్డ్‌ ట్రంప్‌ !

Tags

, , , , ,


ఎం కోటేశ్వరరావు


నాటో కూటమిలో చేరి తమ భద్రతకు ముప్పు తెచ్చేందుకు పూనుకున్న ఉక్రెయిన్‌కు గుణపాఠం చెప్పేందుకు 2022 ఫిబ్రవరి 24న ప్రారంభించిన సైనిక చర్య గురువారం నాటికి 1,057 రోజులో ప్రవేశించింది. ఏ మలుపులు తిరుగుతుందో ఎలా ముగుస్తుందో అంతుబట్టటం లేదు.ఉక్రెయిన్‌కు మద్దతు ఇస్తున్న పశ్చిమ దేశాలకు, బుద్ది చెప్పేందుకు పూనుకున్న రష్యాకు ప్రతిష్టాత్మంగా మారింది. తాను అధికారాన్ని స్వీకరించిన 24 గంటల్లోనే యుద్ధాన్ని ఆపుతానని ఈనెల 20న పదవీ బాధ్యతలు స్వీకరించనున్న అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ చెప్పాడు. అంతేనా వీలైతే అంతకు ముందే ఆపుతానని కూడా చెప్పాడు. ఒక రోజులో కాదు గానీ కనీసం వందరోజులు పడుతుందన్నాడు ఉక్రెయిన్‌ రాయబారిగా ట్రంప్‌ ఎంచుకున్న కెయిత్‌ కెలోగ్‌. అంత తేలిగ్గా ఎలా కుదురుతుంది కొన్ని నెలలు, అంతకంటే ఎక్కువ కాలమే పట్టవచ్చునని ట్రంప్‌ సలహాదారులు చెప్పినట్లు రాయిటర్స్‌ తాజా కథనం.శ్వేత సౌధంలో ప్రవేశించే గడవు దగ్గర పడుతున్నకొద్దీ ట్రంప్‌ నోట దానీ ఊసేలేదు. మరోవైపు దిగిపోతున్న జో బైడెన్‌ యంత్రాంగం రష్యాపై మరిన్ని ఆంక్షలను విధించి సంక్షోభాన్ని ఎలా పరిష్కరిస్తాడో చూస్తాం అన్నట్లుగా ట్రంప్‌కు సవాలు విసిరింది. ఆ పెద్ద మనిషి ఏం చేస్తాడో ఏం జరగనుందో తెలియదు గానీ అగ్రరాజ్య రాజకీయాలు మనవంటి దేశాలకు సంకటాన్ని తెచ్చిపెడుతోంది. అమెరికా రక్షణ శాఖ గతవారంలో తమ దేశ భద్రతకు ముప్పు అంటూ రెండు చైనా చమురు సంస్థలపై కూడా ఆంక్షలు విధించింది. జనం చెల్లించిన పన్నుల నుంచి బిలియన్ల డాలర్లను ఉక్రెయిన్‌లో తగలేయటం ఎందుకనే రీతిలో ట్రంప్‌ మాట్లాడాడు. అయితే అవి నిజాయితీతో కూడినవి కాదు. అమెరికా ప్రయోజనాల వ్యూహంలో భాగంగానే ప్రతి పరిణామం జరుగుతోంది. నిజానికి ఉక్రెయిన్‌ పోరు కూడా దానిలో భాగమే. అది తెలియనంత అమాయకుడు కాదు ట్రంప్‌. రాజకీయనేతలు ఊరికే ఏమాటలూ చెప్పరు. అందుకే ఎన్నికల్లో లబ్దికోసం ట్రంప్‌ మాట్లాడాడా లేక మరొకవిధంగానా అన్న అనుమానాలు ఉండనే ఉన్నాయి. మరోవైపు ఉక్రెయిన్‌ పోరులో పశ్చిమ దేశాల మిలిటరీని వినియోగించే అంశం గురించి ఫ్రెంచి అధ్యక్షుడు మక్రాన్‌తో జెలెనెస్కీ సంప్రదింపులు జరిపాడు. అమెరికా తాజా ఆంక్షలతో రాయితీ ధరలతో ఇప్పటి వరకు రష్యా నుంచి కొనుగోలు చేస్తున్న ముడిచమురు దిగుమతిని మనదేశం నిలిపివేసింది. మరోవైపున అంతర్జాతీయ మార్కెట్లో ధరలు పెరిగాయి.పులి మీద పుట్రలా మన రూపాయి రికార్డు స్థాయిలో పతనం మరింత భారం మోపనుంది.

త్వరలో నాలుగో ఏడాదిలో ప్రవేశించనున్న ఉక్రెయిన్‌ రష్యా సంక్షోభం పరిష్కారం కావాలని అందరూ కోరుకుంటున్నారు. దీనికి మూలం అమెరికా నాయకత్వంలోని నాటో కూటమిలోకి ఉక్రెయిన్‌కు స్థానం కల్పిస్తామని చెప్పటమే. తద్వారా రష్యా ముంగిటికి విస్తరించి ముప్పు తలపెట్టేందుకే అన్నది తెలిసిందే. అమెరికా అనుకున్నది ఒకటి అయింది ఒకటి. రష్యాను ఆర్థికంగా దెబ్బతీయాలన్నది కొంత మేరకు జరిగింది. అయితే ప్రచ్చన్న యుద్ధం ముగిసిన తరువాత తొలిసారిగా పశ్చిమ దేశాలకు వ్యతిరేకంగా రష్యాచైనా సంబంధాలు బలపడతాయని నాటో కూటమి ఊహించలేదనే చెప్పాలి. మూడు సంవత్సరాలుగా రష్యా ఆర్థికంగా నిలదొక్కుకోవటానికి ఇదొక ప్రధాన కారణం. యుద్ధం కొనసాగిన కొద్దీ ప్రజల సొమ్ము ఖర్చు చేయాల్సి వస్తోందనే మనోభావాలను ట్రంప్‌ రెచ్చగొట్టవచ్చు, దాని వలలో కొందరు పడవచ్చు గానీ సంక్షోభం ఎంత దీర్ఘకాలం కొనసాగితే అమెరికాకు అంతలాభం. అక్కడి ఆయుధ పరిశ్రమలకు లాభాలు, కొంత మందికి ఉపాధి, అదే విధంగా ధరల పెరుగుదలతో పాటు రష్యా ఇంథన మార్కెట్‌ను అమెరికా కంపెనీలు ఆక్రమించి లాభాలు పిండుకుంటాయి. అందుకనే ఏదో ఒకసాకు చూపి ట్రంప్‌ కూడా జో బైడెన్‌ బూట్లలో కాళ్లు దూర్చి నడిచేందుకే చూస్తాడు. ఐరోపాలోని అగ్రరాజ్యాలైన ఫ్రాన్సు, జర్మనీ, బాల్టిక్‌ దేశాలు, పోలెండు వంటివి కూడా అదే కోరుకుంటున్నాయి. ఎందుకంటే రష్యా బలహీనం కావటం వాటికి అవసరం. అందుకే ఈ సంక్షోభం ఇప్పట్లో ముగిసేది కాదని భావిస్తున్నారు. నాటో కూటమి దేశాల ఉద్దేశ్యాలను గ్రహించి కావచ్చు, తొలి రోజుల మాదిరి రష్యా ఇప్పుడు దూకుడుగా ముందుకు పోవటం లేదు, నిదానంగా అడుగులు వేస్తున్నది.


కొందరు పరిశీలకులు మరొక కోణాన్ని కూడా చూస్తున్నారు. ప్రపంచానికి శాంతిదూతగా కనిపించేందుకు, నోబెల్‌ బహుమతి పొందాలనే తపనతో ట్రంప్‌ ఉన్నాడు గనుక ఒక శాంతి ప్రతిపాదన చేయవచ్చని ఆశాభావంతో ఉన్నారు. అదేమిటో వెల్లడి కాలేదు గానీ లీకులుఊహాగానాలు వెలువడ్డాయి. వాటి ప్రకారం రెండు దశాబ్దాల పాటు ఉక్రెయిన్‌కు నాటో సభ్యత్వం ఇవ్వరు. దానికి ప్రతిగా రష్యా మిలిటరీ చర్యను ఆపివేయాలి.ప్రస్తుతం రష్యా ఆక్రమణలో ఉన్న ప్రాంతాలను ఉక్రెయిన్‌ వదులుకోవాలి. రెండు దేశాల మధ్య ఉన్న 1,290 కిలోమీటర్ల సరిహద్దులో మిలిటరీ రహిత ప్రాంతాన్ని ఏర్పాటు చేసి దాని పర్యవేక్షణ బాధ్యతను ఐరోపా దేశాలు చూసుకోవాలి. శాంతి చర్చలలో గనుక పాల్గొంటే రష్యా మీద విధించిన కొన్ని ఆంక్షలను వెంటనే తొలగిస్తారు. గతంలో నాటోను తమ వైపు విస్తరించబోము అన్న హామీని ఆ కూటమి దేశాలు విస్మరించినందున రష్యా అంత తేలికగా అంగీకరించకపోవచ్చు లేదా కొంత ఉపశమనం దొరుకుతుంది గనుక తరువాత చూసుకోవచ్చు లెమ్మని అంగీకరించవచ్చు. ఇప్పటికే క్రిమియాను కోల్పోయిన ఉక్రెయిన్‌ మరికొన్ని ప్రాంతాలను కోల్పోయేందుకు అంగీకరిస్తుందా అన్నది పెద్ద ప్రశ్న. తొలుత కుదరదని చెప్పినప్పటికీ తరువాత మెత్తబడినట్లు నిర్ధారణగాని వార్తలు. ట్రంప్‌ ప్రతిపాదనలు తమ దృష్టికి వచ్చినపుడు రష్యా కొట్టిపారవేసింది. దాని అభిప్రాయం ప్రకారం ఉక్రెయిన్‌ శాశ్వతంగా తటస్థ దేశంగా ఉండాలి లేదా రష్యా ప్రభావంలోకి రావాలి, సరిహద్దులో నిస్సైనిక ప్రాంతం ఏర్పాటు, పర్యవేక్షణ బాధ్యతను ఐరోపా యూనియన్‌కు అప్పగించటాన్ని పుతిన్‌ అంగీకరించే అవకాశాలు లేవని వార్తలు వచ్చాయి. తన మిలిటరీ సామర్ధ్యాన్ని రష్యా పెంచుకుంటున్నదని కూడా చెబుతున్నందున ప్రస్తుత దశలో ఏం జరిగేదీ చెప్పలేము. ఇక రష్యాఉక్రెయిన్‌ యుద్ధ రంగాన్ని చూద్దాం.ఇప్పటికే రష్యా నుంచి తమ భూభాగం మీదుగా నడుస్తున్న ఇంథన సరఫరా వ్యవస్థను ఉక్రెయిన్‌ నిలిపివేసింది. రష్యా నుంచి టర్కీ ద్వారా ఐరోపా యూనియన్‌ దేశాలకు ఉన్న గ్యాస్‌ పైప్‌లైన్‌ ఒక్కటే పని చేస్తున్నది. దాన్ని ధ్వంసం చేసేందుకు అమెరికా, ఉక్రెయిన్‌ కుట్రపన్నాయని, దానిలో భాగంగానే ఉక్రెయిన్‌ దాడులు జరిపినట్లు, తొమ్మిది డ్రోన్లను తాము కూల్చివేసినట్లు రష్యా ప్రకటించింది. ఇలాంటి పనులు చేస్తే ఉక్రెయిన్‌కు ఐరోపాయూనియన్‌ మద్దతు ఉండదని స్లోవేకియాహెచ్చరించింది. మంగళవారం నాడు వందలాది డ్రోన్లు, క్షిపణులతో మూడు రష్యా పట్టణాలపై ఉక్రెయిన్‌ దాడులు చేసినట్లు వార్తలు వచ్చాయి. రెండువందల డ్రోన్లు, ఐదు అమెరికా తయారీ ఖండాంతర క్షిపణులను రష్యా కూల్చివేసినట్లు టెలిగ్రామ్‌ ఛానల్‌ షాట్‌ తెలిపింది. తాము కూడా రష్యా వైపు నుంచి వచ్చిన 80డ్రోన్లలో 58ని కూల్చివేసినట్లు ఉక్రెయిన్‌ చెప్పింది. ఈ పరిణామాలను చూస్తుంటే ట్రంప్‌ గద్దెనెక్కే నాటికి పరస్పరదాడులు మరింతగా పెరిగే అవకాశాలు ఉన్నాయి.తాజాగా రష్యా జరిపిన దాడులతో ఉక్రెయిన్‌ గ్యాస్‌, విద్యుత్‌ వ్యవస్థ దెబ్బతిని సరఫరాకు అంతరాయం కలిగింది.


రష్యా ఇంథన రంగం, చైనా సంస్థలపై ఆంక్షలను మరింత తీవ్రతరంగావిస్తూ జోబైడెన్‌ జనవరి పదిన నిర్ణయించాడు.ఒకే దెబ్బకు రెండు పిట్టలు అన్నట్లుగా రష్యాను దెబ్బతీయటంతో పాటు తమ ఎల్‌ఎన్‌జి మార్కెట్‌ను పెంచుకోవటం అమెరికా లక్ష్యంగా ఉంది. రష్యాలోని రెండు అతి పెద్ద చమురు ఉత్పత్తి సంస్థలు, రవాణా చేసే 183 ఓడలు, ఎల్‌ఎన్‌జిని ఎగుమతి చేసే 80 కంపెనీలు,బీమా సంస్థలు, వ్యక్తులపై ఆంక్షలను కొత్తగా ప్రకటించారు. బ్రిటన్‌ కూడా అమెరికాతో జతకలిసి ఉక్రెయిన్‌లో శాంతి కోసం అంటూ ఆంక్షలను ప్రకటించింది. ఈ ప్రకటనతో అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు పెరిగాయి. బుధవారం నాడు ప్రామాణిక బ్రెంట్‌ రకం ధర 80డాలర్లకు అటూ ఇటూగా ఉంది. తాజాగా ఆంక్షలకు గురైన వాటితో సహా ఇప్పటి వరకు 270 టాంకర్లకు చేరాయి. ఈ టాంకర్లతో సముద్ర మార్గాలలో రష్యా ఎగుమతుల్లో 42శాతం జరుగుతున్నది. ఎగుమతి అయ్యే చమురులో 61శాతం చైనాకు,మిగిలింది మనదేశం దిగుమతి చేసుకుంటున్నది. పశ్చిమ దేశాల ఆంక్షలను ముందుగా ఊహించి ప్రత్నామ్నాయ వనరులను చూసుకుంటున్నట్లు వార్తలు. గతేడాది ఈ టాంకర్ల ద్వారా చైనాకు రోజుకు తొమ్మిది లక్షల పీపాలు ఎగుమతి అయ్యాయి.మార్కెట్‌ విషయానికి వస్తే మార్చి నెలలో సరఫరా చేయాల్సిన చమురు ధర బ్రెంట్‌ రకం 81డాలర్లు దాటింది.గతేడాది ఆగస్టు తరువాత ఇంతగా పెరగటం ఇదే మొదటిసారి. ఆంక్షలకు ముందు ఖరారు చేసుకున్న ఒప్పందం ప్రకారం ఆ జాబితాలో ఉన్న టాంకర్లను మార్చి నెలవరకు అనుమతిస్తామని తరువాత వచ్చే వాటిని వెనక్కి తిప్పి పంపుతున్నట్లు భారత్‌ ప్రకటించిందని వార్తలు వచ్చాయి. అంతకు ముందు ఏడాదితో పోలిస్తే 2024 నవంబరు నెలలోనే రష్యా నుంచి 55శాతం దిగుమతులు పడిపోయాయి. గత ఏడాది మొత్తం 430 టాంకర్ల ద్వారా రష్యా చమురు ఎగుమతులు చేసింది.


ట్రంప్‌ పదవీ బాధ్యతలు స్వీకరించే గడువు దగ్గరపడుతున్న కొద్దీ ఐరోపా నేతలు పరిణామాలు, పర్యవసానాల గురించి సంప్రదింపులు జరుపుతున్నారు. ఉక్రెయిన్‌ పోరు నాలుగో ఏడాదిలో ప్రవేశించనుండగా శాంతికోసం పశ్చిమదేశాల మిలిటరీని తమ గడ్డ మీద మోహరించాలని జెలెనెస్కీ కోరుతున్నాడు.వార్సాలో ఫ్రాన్సు, బ్రిటన్‌, జర్మనీ, ఇటలీ, పోలాండ్‌ నేతలు సోమవారం నాడు భేటీ జరిపారు.ఉక్రెయిన్‌ పోరుకు తామెందుకు భారీ మొత్తాలను ఖర్చు చేయాలని ట్రంప్‌ గతంలో ప్రశ్నించిన సంగతి తెలిసిందే. ఈ భారాన్ని ఐరోపా మరింత ఎక్కువగా భరించాలని చెబుతున్నాడు. ఈ నేపధ్యంలో ఐదు ఐరోపా అగ్రరాజ్యాల భేటీ జరిగింది.పశ్చిమ దేశాల మిలిటరీని ఉక్రెయిన్‌లో మోహరించాలని ఏడాది క్రితం తాను సూచన చేసినపుడు తనను ఒంటరిని చేశారని మక్రాన్‌ భావిస్తున్నాడు.అయితే ఈ అంశం గురించి వార్సాలో చర్చించలేదని జర్మనీ రక్షణ మంత్రి బోరిస్‌ పిస్టోరియస్‌ చెప్పాడు. ఒక వేళ నిజంగానే ఆ పనిచేస్తే ఆ చర్య ప్రపంచ గతిని మరో మలుపు తిప్పటం అనివార్యం. ఒకవేళ నాటో దళాలు రంగంలోకి దిగితే తమపై యుద్ధ ప్రకటనగానే పరిగణించి స్పందిస్తామని ఎప్పటి నుంచో రష్యా చెబుతున్నది. అందుకు సన్నాహాలు కూడా చేస్తున్నది, అవసరమైతే అణ్వాయుధాలను రంగంలోకి దింపుతామని హెచ్చరించింది.

మనుస్మృతిపై మద్రాస్‌ హైకోర్టు తీర్పు : హిందూత్వ మనువాదుల మనోభావాలకు చెంపపెట్టు !

Tags

, , , , , ,

ఎం కోటేశ్వరరావు


ఉన్నది ఉన్నట్లు చెప్పినా తమ మనోభావాలను దెబ్బతీశారంటూ దెబ్బలాటలకు దిగుతున్న రోజులివి.తరతరాలుగా జరుగుతున్నదే. భూమి చుట్టూ సూర్యుడు తిరుగుతున్నాడని నాటి క్రైస్తవ మతగ్రంధాలు, జ్యోతిష గ్రంధాలు చెప్పినది వాస్తవం కాదని సూర్యుడి చుట్టూ భూమి తిరుగుతున్నదని నిరూపించిన ఖగోళశాస్త్రజ్ఞుడు నికోలస్‌ కోపర్నికస్‌పై ఐదు వందల సంవత్సరాల క్రితమే నాటి క్రైస్తవ మతవాదులు దాడి చేశారు, మూర్ఖుడని నిందించారు. చరిత్రలో ఏ మతవాదీ నిజాన్ని అంగీకరించిన దాఖలా లేదు. మన దేశంలో హిందూత్వ, ఇస్లామిక్‌, క్రైస్తవ మతవాదులు దానికి అతీతులు కాదు. అలాంటి వారికి 2025జనవరి మొదటి వారంలో మద్రాస్‌ హైకోర్టు చెంపపెట్టులాంటి తీర్పు ఇచ్చింది. తమిళనాడులో విడుతలై చిరుతాయిగల్‌ కచ్చి(విసికె) అనే పార్టీ ఎంపీ తిరుమవలన్‌. అతని మీద 2020లో ఒక ప్రైవేటు కేసు నమోదైంది.అదేమిటంటే పెరియార్‌ అనే యూట్యూబ్‌ ఛానల్‌లో ఫిర్యాదుదారు ఒక కార్యక్రమాన్ని చూశారు. తిరుమవలన్‌ మరొక వ్యక్తితో కలసి హిందూ మహిళల గురించి బహిరంగంగా చెప్పిన మాటలు వారి స్థాయిని దిగజార్చేవిగా ఉన్నాయని, వారి గురించి ఒక తప్పుడు కథనాన్ని చెప్పారని, వాటిని విని ఒక హిందువుగా అవమానకరంగా భావించానని, తన మనోభావాలను దెబ్బతీసేవిగా ఉన్నందున తగిన చర్యలు తీసుకొని శిక్షించాలన్నది కేసు సారం. ఆ కేసులో పసలేదని దాన్ని కొట్టివేయాలంటూ తిరుమవలన్‌ హైకోర్టులో పిటీషన్‌ దాఖలు చేశారు. దాని మీద విచారణ జరిపిన న్యాయమూర్తి పి.వేలుమురుగన్‌ కేసును కొట్టివేస్తూ తీర్పు చెప్పారు. కరోనా సమయంలో పెరియార్‌ మరియు భారత రాజకీయాలు అనే అంశంపై యూరోపియన్‌ పెరియార్‌ అంబేద్కర్‌ కామ్రేడ్స్‌ ఫెడరేషన్‌ నిర్వహించిన అంతర్జాతీయ అంతర్జాల సమావేశంలో తిరుమవలన్‌ ప్రసంగించారు. దానిలో మనుస్మృతిలో ఉన్న కొన్ని అంశాలను ప్రస్తావించారు. అవి తమ మనోభావాలను దెబ్బతీశాయన్నది కేసు. అయితే తిరుమలన్‌ మనుస్మృతిలో ఉన్న అంశాలను ప్రస్తావించి వాటికి అర్ధం చెప్పారు తానుగా కొత్తగా చెప్పిందేమీ లేనందున ఎలాంటి చర్య తీసుకోవనవసరం లేదంటూ న్యాయమూర్తి కేసును కొట్టివేశారు. తిరోగామి భావజాలం గురించి గతంలోనే అనేక మంది చీల్చి చెండాడారు.వాటిని పునశ్చరణ చేయవచ్చు, మరింతగా వివరించవచ్చు. అంతే కాదు ఈ తీర్పుతో ఒకటి స్పష్టమైంది. ఎవరినీ కొట్టావద్దు తిట్టావద్దు, పురాతన సంస్మృత గ్రంధాల్లో ఉన్న వాటి అసలు అర్ధాలను చెబుతూ వాటిని జనంలోకి మరింతగా తీసుకువెళితే చాలు. ముంజేతిని చూసుకొనేందుకు అద్దాలు అవసరం లేదు.


ఇదే అంశంపై మద్రాస్‌ హైకోర్టులో దాఖలైన ఒక ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని 2020 నవంబరులో జస్టిస్‌ ఎం సత్యనారాయణన్‌, జస్టిస్‌ ఆర్‌ హేమలత డివిజన్‌ బెంచి కొట్టివేసింది.ఎస్‌ కాశీరామలింగం దాఖలు చేసిన ఈ వ్యాజ్యంలో బిజెపి నేత, న్యాయవాది ఆర్‌సి పాల్‌ కనకరాజ్‌ వాదించారు.ఉనికిలో లేని మనుస్మృతిని నిషేధించాలని పార్లమెంటు సభ్యుడు కోరుతూ చేసిన ప్రసంగం అశాంతికి, వివిధ తరగతులను రెచ్చగొట్టటానికి దోహదం చేసినందున సభ్యత్వానికి అనర్హుడిగా ప్రకటించాలని కోర్టును కోరారు. ప్రసంగం చేయటమే గాక దాన్ని నిషేధించాలని కూడా డిమాండ్‌ చేశారన్నారు. మనుస్మృతి రాజ్యాంగబద్దమైనదేమీ కాదని, అందువలన దాన్ని ఫలాన విధంగానే చదవాలనే నిబంధనేమీ లేదని, రెండువేల సంవత్సరాల నాటి గ్రంధానికి భాష్యాలు చెప్పవచ్చని అందువలన ఎంపీపై చర్య తీసుకోవాల్సిన అవసరం లేదని కోర్టు తీర్పు చెప్పింది.దానిలో చెప్పిన నైతిక నియమావళి రాజ్యాంగబద్దం కాదని, వాటిని అమలు జరపలేమని న్యాయమూర్తులు పేర్కొన్నారు.వాద ప్రతివాదనల సందర్భంగా తమ పిటీషన్ను ఉపసంహరించుకొని రాజ్యాంగాన్ని ఉల్లంఘించిన అంశాలతో మరొక పిటీషన్‌ దాఖలు చేసేందుకు అనుమతించాలని న్యాయవాది పాల్‌ కనకరాజ్‌ కోర్టును కోరారు.చివరికి పిల్‌ను కోర్టు కొట్టివేసింది. ఈ అంశం మీదే జిల్లా కోర్టులో ఒక ప్రైవేట్‌ కేసును దాఖలు చేశారు.దాన్ని ఈ నెలలో హైకోర్టు కొట్టివేసింది.


బహుశా ఆ తమిళనాడు పిటీషనర్‌ మనుస్మృతిలో ఏమి రాసి ఉందో చదివి, అర్ధం చేసుకొని ఉంటే నిజంగానే సిగ్గుపడి ఆ కేసు దాఖలు చేసి ఉండేవారు. ఆ గ్రంధాన్ని పరమపవిత్రంగా పూజించేవారు ఉన్నారు.మద్రాస్‌ హైకోర్టు తీర్పు మరో ఉదంతాన్ని గుర్తుకు తెచ్చింది. కర్ణాటకలో మైసూరు విశ్వవిద్యాలయ విశ్రాంత ప్రొఫెసర్‌, ప్రముఖ రచయిత, హేతువాది కెఎస్‌. భగవాన్‌. రామాయణం ఉత్తరకాండలో ఉన్న వాటిని గురించి చెప్పినందుకు హిందూత్వవాదులు అంతుచూస్తామని బెదిరించారు. గత కొద్ది సంవత్సరాలుగా ఆయన ఈ అంశాలను చెబుతున్నారు. ఉత్తరకాండలో ఉన్నదాని ప్రకారం రాముడు పదకొండువేల సంవత్సరాలు పాలించలేదని, పదకొండు ఏళ్లు మాత్రమే రాజుగా ఉన్నట్లు, అడవుల్లో తాను మద్యం తాగుతూ సీతాదేవిని కూడా తాగమని కోరినట్లు, కొందరు రామరాజ్యం తెస్తామని చెబుతున్నారని, రాముడు ఆదర్శప్రాయుడేమీ కాదని భగవాన్‌ చెప్పిన అంశాలు తమ మనోభావాలను గాయపరచినట్లు కొందరు ప్రైవేటు కేసును దాఖలు చేశారు. సీతాదేవిని అడవుల పాల్జేసి పట్టించుకోని, శూద్రుడైన శంబుకుణ్ని వధించిన రాముడిని ఎలా సమర్ధిస్తారని భగవాన్‌ ప్రశ్నించారు.‘‘ ప్రొఫెసర్‌ కల్‌బుర్గి, గోవింద్‌ పన్సారే, నరేంద్ర దబోల్కర్‌లను హత్యచేసినవారు ఇప్పుడు నన్ను కూడా చంపుతామని బెదిరిస్తున్నారు, వారికి నేను చెప్పదలచుకున్నది ఒక్కటే, మీరు మా మీద దాడి చేయవచ్చు, ముక్కలుగా నరకవచ్చు కానీ మారచనలు సజీవంగానే ఉంటాయి. వారు నన్ను చంపవచ్చు తప్ప నా వైఖరిని మార్చలేరు ’’ అని భగవాన్‌ స్పష్టం చేశారు. ఈ వివాదం తరువాత కొంత మంది అసలు ఉత్తరకాండను వాల్మీకి రాయలేదని, తరువాత కొందరు దాన్ని చేర్చారని సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. రామాయణాలు అనేకం ఉన్నాయి. దేన్ని సాధికారికంగా తీసుకోవాలో చెప్పినవారెవరూ లేదు. ఎవరికీ అలాంటి సాధికారత లేదు.ఎవరైనా పుచ్చుకుంటే దానితో అంగీకరించాలని కూడా లేదు.


మనుస్మృతిలో రాసినవి, వాటి ఆచరణ చూసి తన మనోభావాలు తీవ్రంగా గాయపడిన కారణంగానే బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ వంద సంవత్సరాల క్రితమే దాన్ని తగులబెట్టి నిరసన వెల్లడిరచారు. సదరు మనువాదాన్ని మరింతగా ముందుకు తీసుకుపోవాలని, అది లేకుండా రచించిన రాజ్యాంగాన్ని విమర్శిస్తూ ఆర్‌ఎస్‌ఎస్‌ పత్రిక సంపాదకీయాలు రాసింది. ఆ చర్య మనోభావాలను దెబ్బతీయటమే కాదు, రాజ్యాంగాన్ని వ్యతిరేకించటం నేరం.నక్సలైట్స్‌గా పరిగణించే వారు రాజ్యాంగాన్ని ఆమోదించం అని చెబుతారు, వారికీ ఆర్‌ఎస్‌ఎస్‌ వారికీ పెద్ద తేడా లేనట్లే కదా ? వారు అడవుల్లో చెబితే కాషాయ దళాలు జనారణ్యంలో ఆపని చేశాయి. రాజ్యాంగ నిర్మాతలు పక్కన పెట్టిన మనుస్మృతిని తమ న్యాయశాస్త్ర విద్యార్ధులకు పాఠ్యాంశంగా పెట్టాలని ఢల్లీి విశ్వవిద్యాలయం నిర్ణయించింది. కోర్టులలో అమలు చేసే శిక్షాస్మృతులను పాఠాలుగా చెప్పాలి, శిక్షణ ఇవ్వాలి తప్ప ఇలాంటి చర్యలతో అధికారికంగా మనువాదులను తయారు చేసే వ్యవహరం తప్ప మరొకటి కాదు. ఇలాంటి బలవంతాలు చేసే శక్తులు ఒక వైపు రెచ్చిపోతుంటే మరోవైపు దాన్ని వ్యతిరేకించేవారు కూడా ఎప్పటికప్పుడు తయారవుతారు. నూతన ఆర్థిక విధానాల పేరుతో కాంగ్రెస్‌ ప్రవేశపెట్టిన సంస్కరణలు దేశంలో ఆర్థిక అసమానతలను మరింతగా పెంచి, కార్పొరేట్‌ జలగలకు జనాలను అప్పచెప్పాయి. వాటిని మరింత వేగంగా అమలు జరుపుతున్న బిజెపి నూతన విద్యావిధానం పేరుతో తన కాషాయ అజెండాను దేశం మీద రుద్దేందుకు పూనుకుంది. దానిలో భాగమే సిలబస్‌లో మనువాదాన్ని చేర్చటం. మరింతగా మనువాదులను న్యాయవ్యవస్థలో చేర్చేందుకు వేసిన పథకమిది. సమాజంలో సగం మందిగా ఉన్న మహిళలకు విద్య, సమానహక్కులు, సాధికారతను పూర్తిగా వ్యతిరేకించే తిరోగమన భావాలను బలవంతంగా అధ్యయనం చేయించేందుకు చూస్తున్నారు. అంతేకాదు, శూద్రులు,దళితులుగా ఉన్న 85శాతం మంది గురించి కూడా దాన్నిండా వ్యతిరేకతలే, మొత్తంగా మన రాజ్యాంగానికి, దానికి స్ఫూర్తికి వ్యతిరేకమైనది.


ఉత్తర ప్రదేశ్‌లోని వారణాసిలో ఉన్న బెనారస్‌ హిందూ విశ్వవిద్యాలయంలో భగత్‌ సింగ్‌ స్టూడెంట్స్‌ మోర్చా(బిఎస్‌ఎం)కు చెందిన వారు డిసెంబరు 25న మనుస్మృతి గ్రంధంపై ఒక చర్చ నిర్వహించారు, తరువాత తగులబెట్టేందుకు నిర్ణయించారు. ఆ సందర్భంగా ముగ్గురు విద్యార్ధినులతో సహా 13 మందిని పోలీసులు అరెస్టు చేసి కేసు పెట్టారు. పదిహేడు రోజుల తరువాత వారు బెయిలు మీద జనవరి 11న విడుదలయ్యారు. ఈ విశ్వవిద్యాలయంలో మనుస్మృతిపై పరిశోధన చేసే వారికి ఫెలోషిప్‌ ఇస్తున్నారు. దాని గురించి చర్చించేవారిని తప్పుడు కేసులు పెట్టి వేధిస్తున్నారు. స్వాతంత్య్ర పోరాటంలో బ్రిటీష్‌ వారికి వ్యతిరేకంగా మన నేతన్నలను దెబ్బతీసిన విదేశీ వస్త్రదహనం ఒక పోరాట రూపంగా ఉన్న సంగతి తెలిసిందే. అదే విధంగా దిష్టిబొమ్మల దహనం కూడా. సమాజంలో స్త్రీలు, మెజారిటీ కులాల వారిపట్ల వివక్ష, దురాచారాలను ప్రోత్సహించే మనుస్మృతికి వ్యతిరేకంగా ఒక నిరనస రూపంగా దాన్ని దహనాన్ని అంబేద్కర్‌ ఎంచుకున్నారు.తొలిసారిగా 1927లో స్వయంగా ఆపని చేశారు. అప్పటి నుంచి ప్రతి ఏటా డిసెంబరు 25ను మనుస్మృతి దహన దినంగా పాటిస్తున్నారు. ఎక్కడో అక్కడ అది కొనసాగుతూనే ఉంది. బెనారస్‌ విశ్వవిద్యాలయ విద్యార్థులు హింసాకాండకు, దాడులకు పాల్పడ్డారంటూ తప్పుడు కేసులు పెట్టారు.కస్టడీలో పోలీసులు వారిని కొట్టారు, దుస్తులు చించివేశారు, బెదిరించారు. ఉగ్రవాద వ్యతిరేక దళ పోలీసులు వారిని విచారించటాన్ని బట్టి ఎలాంటి నేరాలు మోపారో, ఉత్తర ప్రదేశ్‌లో ఎలాంటి రాజ్యం నడుస్తున్నదో అర్ధం చేసుకోవచ్చు.పదేండ్ల వరకు శిక్షలు పడే సెక్షన్లతో నేరాలను మోపారు. తాము భగత్‌ సింగ్‌బాబా సాహెబ్‌ వారసులమని హిందూత్వ శక్తులు తమను అణచేందుకు చూస్తున్నాయని బిఎస్‌ఎం నేతలు చెప్పారు.

ఒక్క మనుస్మృతే కాదు అనేక పురాణాలు, ఇతర గ్రంధాలు, వెంకటేశ్వరసుప్రభాతం వంటి వాటిలో ఉన్న అశ్లీలత, బూతు గురించి అనేక మంది గతంలోనే రాశారు. అందువలన వాటన్నింటినీ నేటి తరాలకు అందుబాటులోకి తేవాల్సిన అవసరం కూడా ఉంది.ఉదాహరణకు సుప్రభాతంలో ఇలా ఉంది.

కమలాకుచ చూచుక కుంకుమతో

నియతారుని తాతుల నీలతనో

కమలాయతలోచన లోకపతే

దీనికి అర్ధం ఏమిటంటే లక్ష్మీదేవి చనుమొనలయందున్న కుంకుమ పూవు రంగువలన అంతటా ఎర్రగా చేయబడిన రంగుగల వాడా అని హేతువాది వెనిగళ్ల సుబ్బారావు వివరణ ఇచ్చారు.దీన్ని చదివి ఎవరైనా మా మనోభావాలను దెబ్బతీసిందని కేసులు వేస్తే కుదరదు. ఫలానాదే నిర్థిష్ట అర్ధం అని నిర్ధారణ ఉంటే దాన్నే ప్రామాణికంగా తీసుకోవచ్చు. ఇంకా ఇలాంటివి మరికొన్ని ఉన్నాయి. ఉత్తర కాండలో సీతా రాముల గురించి ఉన్నది ఉన్నట్లుగా చెప్పినందుకు వివాదం రేపటాన్ని కూడా చూశాము. మనోభావాల పేరుతో ఉన్మాదాన్ని, ఉద్రేకాలను రెచ్చగొట్టటం, దాడులకు పూనుకోవటం తగని పని. మేము చెప్పిందే భాష్యం ఇతరులెవరూ చెప్పటానికి వీల్లేదు అంటే కుదరదు.మద్రాసు హైకోర్టు కేసులో మనోభావం గాయపడిరదని చెప్పుకున్న వ్యక్తి హాజరై మనుస్మృతిలో చెప్పిన దానికి పవిత్రమైన అర్ధం ఇదని చెప్పలేదు, అసలు కోర్టుకే రాలేదని మీడియాలో వార్తలు వచ్చాయి. ఎవరైనా మూడవ పక్షంగా చేరి అసలు అర్ధం చెప్పారా అంటే అది కూడా లేదు. మనుస్మృతిని పాటిస్తున్నామని లేదా పాటించాలని చెప్పేవారి కుటుంబాలలో మహిళలను దానిలో చెప్పినట్లుగానే ఉంచుతున్నారా ? ఉంటున్నారా ? దాని మీద ప్రమాణం చేసి చెప్పమనండి. ఇస్లామిక్‌ షరియాలో కూడా అలాంటివే ఉన్నాయి. వర్తమానానికి వర్తించవు. చిత్రం ఏమిటంటే షరియాను విమర్శించేవారు దానికి ఏమాత్రం తగ్గని, కొన్ని విషయాల్లో అంతకంటే ఎక్కువ తిరోగమన సూత్రాలు ఉన్న మనుస్మృతిని మాత్రం పవిత్రమైనది, మార్పులేని సనాతనమైనదిగా పరిరక్షించాలని కోరటమే కాదు, అమలు జరపాలని డిమాండ్‌ చేస్తున్నారు.అసలు సనాతనం అంటే ఏమిటో చెప్పలేని వారు కూడా వీర సనాతన్‌ అంటూ ముసుగులు వేసుకొని వీరంగం వేస్తున్నారు. అంబేద్కర్‌ కంటే ముందుగా సంఘసంస్కర్త మహాత్మా జ్యోతిరావు ఫూలే(182790) మనుస్మృతిని సవాలు చేశారు. దానిపేరుతో బ్రాహ్మణులు అనుసరిస్తున్న పద్దతులను వ్యతిరేకించారు, దళితులు, ఇతరుల దుస్థితిని వెలుగులోకి తెచ్చారు.నూతన తరాలు భావజాల పోరులో భాగంగా పూలే, అంబేద్కర్‌ చెప్పిన వాటిని మరింతగా జనంలోకి తీసుకుపోవాల్సిన అవసరం ఉంది.

అమెరికా అధ్యక్ష పదవీ స్వీకార ఉత్సవం : నరేంద్రమోడీని విస్మరించిన డోనాల్డ్‌ ట్రంప్‌, ఆహ్వానం కోసం విశ్వగురువు ఆరాటం, రాను పొమ్మన్న చైనా అధినేత షీ జింపింగ్‌ !

Tags

, , , , ,


ఎం కోటేశ్వరరావు

అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డోనాల్డ్‌ ట్రంప్‌ ఎప్పుడేం మాట్లాడతాడో, ఏం చేస్తాడో తెలియదు. ఈనెల 20వ తేదీ ప్రమాణ స్వీకార ఉత్సవానికి ప్రత్యర్థిగా ప్రకటించిన చైనా అధినేత షీ జింపింగ్‌ను ఆహ్వానించి తన జిగినీదోస్తు, అమెరికా సహ భాగస్వామిగా వ్యవహరిస్తున్న మన ప్రధాని నరేంద్రమోడీని విస్మరించటం రెండూ సంచలనాత్మకమే. ఆ ఉత్సవానికి మన విదేశాంగ మంత్రి జై శంకర్‌ హాజరవుతారని విదేశాంగశాఖ ప్రతినిధి రణధీర్‌ జైస్వాల్‌ ఎక్స్‌ద్వారా ఆదివారం నాడు వెల్లడిరచారు.అధ్యక్షుడు ట్రంప్‌, ఉపాధ్యక్షుడు వాన్స్‌ ప్రమాణ స్వీకార ఉత్సవ కమిటీ ఆహ్వానం మేరకు ఈ పర్యటన ఉన్నట్లు జైస్వాల్‌ పేర్కొన్నారు. దీనికి కొద్ది రోజుల ముందు మన విదేశాంగ శాఖ ప్రతినిధి నరేంద్రమోడీకి ఆహ్వానం గురించి మీడియా అడిగిన ప్రశ్నకు ముక్తసరిగా సమాధానమిచ్చారు. ‘‘ ఇటీవల మన విదేశాంగశాఖ మంత్రి మరియు విదేశాంగశాఖ కార్యదర్శి అమెరికాను సందర్శించిన సంగతి మీకు తెలిసే ఉంటుంది. దాని వివరాలను ఇప్పటికే మీడియా ద్వారా మీతో పంచుకున్నాము.రానున్న రోజుల్లో ఈ సంబంధాన్ని మరింత పటిష్టంగా, మరింత సన్నిహితంగా తీసుకుపోవాలని లక్ష్యంగా పెట్టుకున్నాము. మీరు అడిగిన నిర్దిష్ట ప్రశ్నకు ఏవైనా పరిణామాలు ఉంటే తప్పనిసరిగా మీకు తెలియచేస్తాము ’’ అని పేర్కొన్నారు. నరేంద్రమోడీని విస్మరించటం గురించి గోడీ మీడియా కావాలనే విస్మరించింది. ఎందుకంటే విశ్వగురువుగా ఆకాశానికి ఎత్తిన వారు ఇప్పుడు మాట్లాడలేని స్థితిలో పడిపోయారు. కొడదామంటే కడుపుతో ఉంది తిడదామంటే అక్క కూతురు అన్నట్లుగా ఉంది.మోడీకి ఆహ్వానం పలికితే దానికి ప్రతిగా పెద్ద సంఖ్యలో ఎఫ్‌35 ఫైటర్‌ జెట్‌ విమానాలను కొనుగోలు చేస్తామని జై శంకర్‌ చెప్పవచ్చని కూడా పుకార్లు వచ్చాయి. ఏమైనా మోడీకి ఆహ్వానం రాలేదు.

అమెరికా అధ్యక్షుడి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి 1874 సంవత్సరం నుంచి ఇతర దేశాల అధినేతలను ఎవరినీ ఆహ్వానించే సాంప్రదాయం లేదు. అక్కడ పని చేస్తున్న దేశాల రాయబారులు, దౌత్యవేత్తలు మాత్రమే హాజరవుతారు. కానీ ఈ సారి డోనాల్డ్‌ ట్రంప్‌ దాన్ని పక్కన పెట్టి కొన్ని దేశాల వారికి ఆహ్వానాలు పంపాడు. ఆ జాబితాలో మన ప్రధాని నరేంద్రమోడీ పేరు లేదు. వెళ్లేందుకు అన్నీ సర్దుకొని విమానం ఎక్కేందుకు తయారైన మోడీకి పిలుపు లేకపోతే పోయింది, వచ్చేందుకు ఇచ్చగించని చైనా అధినేత షీ జింపింగ్‌ను ఆహ్వానించటాన్ని మోడీ అభిమానులు తట్టుకోలేకపోతున్నారు. కావాలంటే ఒక ప్రతినిధి వర్గాన్ని పంపుతాను తప్ప తాను వచ్చేది లేదని చెప్పినట్లు వార్తలు. షీ జింపింగ్‌కు నటించటం రాదని, ముక్కుసూటిగా వ్యవహరిస్తారని, దానికి అనుగుణంగానే స్పందించినట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. ఎంకి పెళ్లి సుబ్బి చావుకొచ్చిందన్నట్లుగా అమెరికాకు సహజభాగస్వామిగా చెప్పుకోవటమే కాదు, ట్రంప్‌కు ఎంతో సన్నిహితంగా ఉంటారని, దానికి నిదర్శనంగా గతంలో అసాధారణ రీతిలో మన గత ప్రధానులే కాదు, ఏ దేశాధినేతా చేయని విధంగా ట్రంప్‌ రెండవ సారి పోటీ చేసినపుడు అప్‌కి బార్‌ ట్రంప్‌ సర్కార్‌ అని అమెరికా వెళ్లి మరీ భారతీయ సంతతి వారి సభలో నరేంద్రమోడీ ప్రచారం చేసి వచ్చిన సంగతి తెలిసిందే. అలాంటి బంధం ఉన్నప్పటికీ ఆహ్వానం ఎందుకు రాలేదన్నది చర్చగా మారింది. నరేంద్రమోడీకి ఆహ్వానం పంపాలని కోరేందుకు విదేశాంగ మంత్రి జై శంకర్‌ను అమెరికా పంపారని బిజెపి నేత సుబ్రమణ్యస్వామి చేసిన ప్రకటనపై అవునని గానీ కాదని గానీ ప్రభుత్వం లేదా బిజెపి ఇంతవరకు ప్రకటించలేదు. అసలేం జరుగుతోంది, ట్రంప్‌ మోడీని పట్టించుకోవటం మానేశారా లేక మరింతగా వత్తిడి తెచ్చి లొంగదీసుకొనే ఎత్తుగడలో భాగమా !

డోనాల్డ్‌ ట్రంప్‌ రూటే సపరేటు. తన పదవీ స్వీకారోత్సవానికి ఎంత మందిని ఆహ్వానించాడో, ఎవరు వస్తారో ఇది రాసిన జనవరి 12వ తేదీ నాటికి స్పష్టత రాలేదు. అమెరికా మీడియాలో వస్తున్న వార్తల ప్రకారం అనేక మంది నేతలు రానున్నారు.ఆ మేరకు సమచారాన్ని లీకుల రూపంలో వదిలారు. ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ తనకు ఆహ్వానం అందినట్లు ధృవీకరించారు.జనవరి ఐదవ తేదీన అమెరికా వచ్చి ఫ్లోరిడాలోని ట్రంప్‌ విడిది మార్‌ ఏ లాగోలో భేటీ అయ్యారు. ప్రమాణ స్వీకారానికి వచ్చేందుకు ప్రయత్నిస్తానని ఆమె చెప్పారు. హంగరీ ప్రధాని విక్టర్‌ ఓర్బాన్‌కు ట్రంప్‌ తొలి ఆహ్వానం పంపినట్లు, అతగాడు ఇంకా అంగీకరించలేదని వార్తలు వచ్చాయి. ఎన్నికల ఫలితం వెలువడగానే తొలుత ట్రంప్‌కు అభినందనలు తెలిపిన ఎల్‌ సాల్వడార్‌ అధ్యక్షుడు నాయిబ్‌ బుకీలే ఆహ్వానితులలో ఒకరు. గతేడాది అతగాడి ప్రమాణ స్వీకారానికి ట్రంప్‌ కుమారుడు హాజరయ్యాడు. అర్జెంటీనా అధ్యక్షుడు జేవియర్‌ మిలీ కూడా రానున్నాడు. ఇంత చిన్న దేశాలకు ఆహ్వానం పలికి భారత ప్రధానిని ఎందుకు విస్మరించినట్లు ? ప్రధమంగా ట్రంప్‌కు అభినందనలు తెలిపిన తొలి ముగ్గురిలో మోడీ ఒకరని మన విదేశాంగ మంత్రి జై శంకర్‌ చెప్పిన అంశాన్ని ఇక్కడ గుర్తుకు తెచ్చుకోవాలి.‘‘ మనం నిజాయితీగా చెప్పుకోవాలి, ఈ రోజు అమెరికా అంటే ప్రపంచంలో అనేక దేశాలు పిరికిబారి ఉన్నాయి, వాటిలో ఒకటిగా మనదేశం లేదు ’’ అని కూడా చెప్పారు. ట్రంప్‌ అధికార స్వీకరణ ఉత్సవానికి హాజరయ్యేందుకు ఆహ్వానాల కోసం విదేశీ నేతలు వేలం వెర్రిగా ప్రయత్నించారంటూ న్యూయార్క్‌ పోస్టు పత్రిక రాసింది. అనేక మందికి అలాంటి అవకాశం లేదని ఆహ్వానాల కోసం పైరవీలు చేసే ఒక ఏజంట్‌ చెప్పినట్లు పేర్కొన్నది. ‘‘ మీకు ఆహ్వానం అందే అవకాశం లేదని నా ఖాతాదారులకు వాస్తవం చెప్పాను. మీరు కోస్టారికా నుంచి వచ్చారనుకోండి, మీ వలన చేకూరే లబ్ది ఏమిటి ? మీరు మీ దేశం నుంచి వాణిజ్యం లేదా ప్రధాన కంపెనీలను తీసుకురాలేరు’’ అని చెప్పాడు.ట్రంప్‌ అంటే వాణిజ్యం, లాభం, ప్రతిదాన్నీ ఆ కోణం నుంచే చూస్తాడు. వాషింగ్టన్‌ వచ్చేందుకు తీవ్రంగా ప్రయత్నించటమేగాక బహిరంగంగా వాంఛను వెల్లడిరచిన నేత ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెనెస్కీ. అయినా ఆహ్వానం అందలేదు.అయితే అతను రావాలనుకొని వస్తే మాట్లాడి పంపిస్తా అని ట్రంప్‌ అమర్యాదకరంగా మాట్లాడాడు. అనేక మంది ఆహ్వానాలు పొందేందుకు వివిధ మార్గాల ద్వారా ట్రంప్‌ యంత్రాంగం దగ్గరకు వస్తున్నారని ఈ విషయాల గురించి తెలిసిన ట్రంప్‌ అంతరంగికుడు చెప్పినట్లు ఆ పత్రిక రాసింది.

ట్రంప్‌ పంపిన ఆహ్వానాన్ని షీ జింపింగ్‌ తిరస్కరించినట్లు ఫైనాన్సియల్‌ టైమ్స్‌ పత్రిక వెల్లడిరచింది. షీ బదులు ఉపాధ్యక్షుడు హాన్‌ జెంగ్‌ లేదా విదేశాంగ మంత్రి వాంగ్‌ ఇ గానీ హాజరుకావచ్చని,ట్రంప్‌ బృందంతో చర్చలు కూడా జరుపుతారని పేర్కొన్నది.అయితే వారిబదులు కీలకనేత చైనా కమ్యూనిస్టు పార్టీ పొలిట్‌ బ్యూరో సభ్యుడు కాయ్‌ కీ హాజరుకావాలని ట్రంప్‌ సలహాదారులు వాంఛించినట్లు కూడా ఆ పత్రిక రాసింది.ట్రంప్‌తో భారత ప్రధాని నరేంద్రమోడీకి ఎంతో సన్నిహిత సంబంధాలున్నప్పటికీ ఆహ్వానం పంపకుండా చైనా నేత షీ జింపింగ్‌ రాకపోయినా అక్కడి ఇతర ప్రముఖులు రావాలని కోరుకోవటం అమెరికా ప్రాధాన్యతల్లో వచ్చిన మార్పుకు సూచిక అని కొందరి అభిప్రాయం. ఎక్స్‌ సామాజిక మాధ్యమం అధిపతి ఎలన్‌మస్క్‌ ట్రంప్‌ సలహాదారుగా నియామకం అయిన సంగతి తెలిసిందే.ఫేస్‌బుక్‌, ఎక్స్‌ వంటి సామాజిక మాధ్యమాల్లో సొమ్ము తీసుకొని అనుకూల, వ్యతిరేక ప్రచారాలను ప్రోత్సహించటం లేదా నియంత్రించటం బహిరంగ రహస్యం. ఈ పూర్వరంగంలో ఎక్స్‌లో హెచ్‌ 1 బి వీసాలు, ఇతర అంశాల గురించి భారత వ్యతిరేక ప్రచారం పెద్ద ఎత్తున సాగింది, దాన్ని అనుమతించటం అంటే కావాలని చేయటం తప్ప మరొకటి కాదు. వాషింగ్టన్‌ కేంద్రంగా పని చేస్తున్న విద్వేష ప్రచార అధ్యయన సంస్థ సిఎస్‌ఓహెచ్‌ చేసిన విశ్లేషణ ప్రకారం డిసెంబరు 22 నుంచి జనవరి మూడవ తేదీ వరకు ఎక్స్‌లో 128 పోస్టులను 13.854 కోట్ల మంది చూశారు.36 పోస్టులనైతే ఒక్కొక్కదానిని పదిలక్షల మందికి పైగా చదివారు.ఈ పోస్టులన్నీ 86ఖాతాల నుంచి వెలువడ్డాయి.ఎక్స్‌ యాజమాన్యం లాభాల కోసం విద్వేష ప్రసంగాలను ప్రోత్సహించిందని కూడా ఆ విశ్లేషణ వెల్లడిరచింది.

అమెరికా అధ్యక్షుడి నుంచి ఆహ్వానం రావటంతో చైనా పొంగిపోవటం లేదు. సైద్ధాంతికంగా, ఆర్థికంగా తమకు శత్రువు అని అమెరికా అనేక సార్లు ప్రకటించింది. నిత్యం తైవాన్‌ అంశం మీద కాలుదువ్వుతున్నది. ఇదే ట్రంప్‌ 2018లో ప్రారంభించిన వాణిజ్య యుద్దం ఇంకా కొనసాగుతున్నది.మరోపదిశాతం పన్నులు విధిస్తానని బెదిరించాడు. అందువలన ఆహ్వానం వెనుక ఉన్న ఎత్తుగడ ఏమిటన్నది చైనా పరిశీలించటం అనివార్యం. అసలు చైనా స్పందన ఎలా ఉంటుందో పరిశీలించేందుకు వేసిన ఎత్తుగడ లేదా దానితో సంబంధాలను తెంచుకోవటం అంత సులభం కాదని భావించటంగానీ కావచ్చని పరిశీలకులు చెబుతున్నారు. ఎందుకంటే అమెరికా మరుగుదొడ్లలో తుడుచుకొనే పేపర్‌ కూడా చైనా నుంచే దిగుమతి చేసుకుంటున్నారు. అలాంటిది చైనాతో ప్రత్యక్ష పోరుకు తెరదీసే అవకాశాలు లేవని చెప్పవచ్చు. చైనాను శత్రువుగా పరిగణించటం అపత్కరం అయితే స్నేహితుడిగా చూడటం ప్రాణాంతకం అని అమెరికా మాజీ విదేశాంగ మంత్రి హెన్రీకిసింజర్‌ వర్ణించాడు. అందువలన ట్రంప్‌కు కత్తిమీద సామే.

అమెరికా ఎన్నికలకు ముందు అక్కడ జరిగిన క్వాడ్‌ సమావేశానికి నరేంద్రమోడీ హాజరయ్యారు. ఆ సందర్భంగా మోడీ తనను కలుస్తారంటూ ట్రంప్‌ బహిరంగంగా ప్రకటించి భంగపడ్డాడు.మన అధికారులు ఇచ్చిన సలహా లేదా ట్రంప్‌ గెలిచే అవకాశాలు లేవన్న అంచనాల పూర్వరంగంలో కలిస్తే గతంలో మాదిరి తప్పుడు సంకేతాలు వెళతాయన్న జాగ్రత్త కావచ్చుగానీ వారి భేటీ జరగలేదు.దాన్ని మనసులో పెట్టుకొని కూడా మోడీకి ఒక పాఠం చెప్పాలని భావించి ఉండవచ్చు. ట్రంప్‌ కక్షపూరితంగా వ్యవహరించే మనిషి. సిక్కు తీవ్రవాదులకు మద్దతు ఇచ్చే వ్యక్తిగా పేరున్న ఇండోఅమెరికన్‌ లాయర్‌ హర్‌మీత్‌ థిల్లాన్ను పౌరహక్కుల సహాయ అటార్నీ జనరల్‌గా ట్రంప్‌ నియమించాడు. సిఐఏ ఏజంటుగా పేరున్న సిక్కు తీవ్రవాది గురు పత్వంత్‌ సింగ్‌ పన్నుకు అమెరికా మద్దతు ఇస్తున్న సంగతి తెలిసిందే.అతగాడు మహాకుంభమేళా సందర్భంగా దాడులు చేస్తామని బెదిరించాడు. బంగ్లాదేశ్‌లో తిష్టవేసేందుకు పూనుకున్నది అమెరికా. అక్కడ భారత అనుకూల అవామీలీగ్‌ ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరిగిన తిరుగుబాటు వెనుక అమెరికా హస్తం బహిరంగరహస్యం. ఈ పరిణామం మన దేశానికి తలనొప్పులు తెచ్చేదే అని వేరే చెప్పనవసరం లేదు. చైనాతో శతృత్వాన్ని పెంచుకోవాలని మనదేశంపై అమెరికా తెస్తున్న వత్తిడికి మోడీ పూర్తిగా తలొగ్గటం లేదు. పెద్ద ఎత్తున వస్తువుల దిగుమతి, చైనా పెట్టుబడులకు అనుమతి, సరిహద్దులో పూర్తి స్థాయి సాధారణ సంబంధాల పునరుద్దరణకు ఒప్పందం చేసుకోవటాన్ని అమెరికా ఊహించ, సహించలేకపోయింది. దీనికి తోడు దాని ఆంక్షలను ధిక్కరించి రష్యా నుంచి ముడి చమురు కొనుగోలు చేయటం తెలిసిందే. అధ్యక్షుడు పుతిన్ను మనదేశ పర్యటనకు నరేంద్రమోడీ ఆహ్వానించారు. అది జనవరిలో ఉండవచ్చనే వార్తలు వచ్చాయి. పుతిన్‌కు ఆహ్వానం పలికిన మోడీని కలవటాన్ని ట్రంప్‌ సహించడని వేరే చెప్పనవసరం లేదు.అయితే ఉన్న సంబంధాల గురించి అనుమానాలు తలెత్తకుండా ఉండేందుకు విదేశాంగ మంత్రికి ఆహ్వానం పంపారు. వివిధ దేశాల నేతలకు తన పదవీ స్వీకార ఉత్పవ ఆహ్వానం అంతర్జాతీయ ఒప్పందాలు చేసుకోవటంలో కీలకమని అమెరికా మీడియా సంస్థ సిబిఎస్‌ వ్యాఖ్యానించింది. అలాంటి ఆహ్వానితుల్లో మోడీ పేరు లేకపోవటం మనదేశానికి మంచిది కాదని కొందరు చెబుతున్నారు. గతంలో ట్రంప్‌తో సఖ్యంగా ఉన్నపుడు మనదేశానికి ఒరిగిందేమిటన్నది ప్రశ్న !

ఎప్పటికెయ్యది అప్పటికా మాటలాడు ధన్యజీవి ! దేవదూత అన్న నోటితోనే మానవుడిని అని చెప్పుకున్న నరేంద్రమోడీ !!

Tags

, , , , ,

ఎం కోటేశ్వరరావు


ఇంతకీ నరేంద్రమోడీ ఎవరు ? లోక్‌సభ ఎన్నికలకు ముందు చెప్పినట్లు మహత్తర లక్ష్యం కోసం దేవుడు పంపిన దూత అనుకోవాలా ? తాజాగా చెప్పినట్లు మానవుడినే కానీ దేవుడిని కాదు, తప్పులు చేసి ఉంటా అనే మాటలు నమ్మాలా ? మోడీ గురించి తెలిసిన వారు ఎప్పటికెయ్యది అప్పటికా మాటలాడి తప్పించుకు తిరుగు ధన్యుడు అనుకుంటారు. ఇక తేల్చుకోవాల్సింది భక్తులే ! అప్పుడు దేవుడు ఎందుకు పంపాడని చెప్పారో ఇప్పుడు మానవుడినే అని ఎందుకు అన్నారో మోడీ ఎలాగూ నోరు విప్పరు గనుక ఆయన ప్రధమ గణాలు వివరించాలి. ఈ కాలంలో మోడీ నెరవేర్చిన లేదా మిగిలిపోయిన మహత్తర లక్ష్యం ఏమిటో ఎవరికైనా తెలుసా ? జరోధా అనే సంస్థ తరఫున నిఖిల్‌ కామత్‌ 2025 జనవరిలో మోడీతో నిర్వహించిన పాడ్‌కాస్ట్‌ ( ఒక జర్నలిస్టు జరిపే ముఖాముఖీ`ప్రశ్నలు ముందే ఇవ్వాలి, ఇంటర్య్వూ సమయంలో మోడీని ఇబ్బందికరమైన కొత్త ప్రశ్నలు అడగకూడదు అనే షరతులు వర్తిస్తాయి)లో అనేక అంశాలను వివరించారు. తనకు దేశమే ప్రధమ లక్ష్యం అన్నారు. గుజరాత్‌ సిఎంగా పని చేస్తున్నపుడే మరో ఇరవై సంవత్సరాల పాటు పనిచేసే బృందాన్ని తాను తయారు చేశానని, ఇప్పుడు కూడా చేస్తున్నట్లు చెప్పారు. అయితే ఆ బృందంలో ఎవరున్నారో వెల్లడిరచలేదు, వ్యక్తుల పేర్లు చెబితే అనేక మంది ఇతరులకు అన్యాయం చేసినట్లు అవుతుందని చెప్పుకున్నారు. దీన్ని బట్టి ఆ బృందం ఒక బ్రహ్మపదార్ధం అనాల్సి ఉంటుంది.ప్రతివారినీ తన ఖాతాలో వేసుకోవచ్చు. మరికొన్ని సుభాషితాలు, స్వంత గొప్పలు ఇలా ఉన్నాయి. తప్పులు సహజం కానీ దురుద్ధేశ్యాలతో చేయలేదు, నేనూ తప్పులు చేసి ఉంటాను, నేను మనిషిని దేవుడిని కాదు. నేను ఒక విలక్షణమైన రాజకీయవేత్తను కాదు.నేను ఎన్నికల సమయంలో రాజకీయ ప్రసంగాలు చేయాల్సి ఉంటుంది. అది నాకు తప్పనిసరి, నాకది ఇష్టం లేదు గానీ చేయాల్సి ఉంటుంది. పాడ్‌కాస్ట్‌ ఇలా సాగింది. మహాత్మా గాంధీ, సావర్కర్‌ మార్గాలు వేరైనా ఇద్దరూ స్వాతంత్య్రం కోసమే పోరాడారంటూ ఇద్దరూ ఒకటే అన్నట్లుగా చిత్రించారు. జైలు నుంచి విడుదల చేస్తే బ్రిటీష్‌ వారికి సేవ చేసుకుంటానని, స్వాతంత్య్ర ఉద్యమానికి దూరంగా ఉంటానంటూ ప్రేమ లేఖలు రాసిన సావర్కర్‌ను గాంధీతో పోల్చటం చరిత్ర వక్రీకరణ తప్ప మరొకటి కాదు.

ఎనిమిది నెలల క్రితం తన జన్మ జీవ సంబంధమైనది కాదని (2024 లోక్‌సభ ఎన్నికల చివరి దశ) లో నరేంద్రమోడీ చెప్పుకున్నారు, ఇప్పుడు మానవుడిని అని చెప్పుకోవటం నష్ట నివారణ చర్య అని స్పష్టంగా కనిపిస్తోందని కాంగ్రెస్‌ నేత జయరామ్‌ రమేష్‌ వ్యాఖ్యానించారు. భూమ్మీద తన ఉనికి కేవలం జీవ సంబంధమైనది కాదని, తన తల్లి మరణించిన తరువాత తనను దేవుడు భూలోకంలోకి ఒక లక్ష్యాన్ని పూర్తి చేసేందుకు పంపాడని తనకున్న శక్తులను చూసిన తరువాత తానీ మాటలు చెప్పగలుగుతున్నట్లు మోడీ చెప్పిన సంగతి తెలిసిందే. ‘‘ నా తల్లి బతికి ఉన్నంత వరకు నేను కూడా జీవసంబంధంగానే జన్మించానని అనుకున్నాను. కానీ తరువాత అనుభవాలను చూస్తే పరమాత్ముడు ఒక లక్ష్యం కోసం పంపాడని నేను నమ్మాను, ఆ లక్ష్యం నెరవేరిన తరువాత మరోసారి నాతో పని ఉండదు. అందువల్లనే నేను పూర్తిగా దేవుడి కోసం అంకితమయ్యాను, నేను ఒక సాధనాన్ని తప్ప మరొకటి కాదు ’’ అంటూ అదానీ యాజమాన్యంలోని ఎన్‌డిటివితో మోడీ చెప్పారు.( ఆ లక్ష్యం ఏమిటో, ఎంత వరకు వచ్చింది, పూర్తి చేసిందీ లేనిదీ చెప్పలేదు) ఒక సామాన్యుడు ఇలాంటి మాటలు మాట్లాడితే అలాంటి వారిని నేరుగా మానసిక వైద్యుడి వద్దకు తీసుకు వెళతారు అంటూ అప్పుడు రాహుల్‌ గాంధీ అపహాస్యం చేశారు. ఎవరెన్ని విమర్శలు చేసినా మోడీ మారు మాట్లాడలేదు. అంతకు కొద్ది రోజుల ముందు తననెవరూ దెబ్బతీయలేరని, తాను మూడు, ఐదు చివరికి ఏడు ఎన్నికలైనా సరే గెలుస్తూనే ఉంటానని చెప్పుకున్నారు.తనకు ఓటు వేయటం అంటే పుణ్యం చేసుకోవటమే అని కూడా చెప్పారు. మోడీ చుట్టూ ఉన్నవారు కూడా ఆయనను ఆకాశానికి ఎత్తిన తీరు చూశాము. ఎంతగా అంటే పూరీ జగన్నాధుడు కూడా నరేంద్రమోడీ భక్తుడేనని ఒడిషాకు చెందిన బిజెపి నేత సంబిత్‌ పాత్ర వర్ణించి తరువాత నోరు జారినట్లు చెప్పుకున్న సంగతి తెలిసిందే.

చరిత్రలో అవతార పురుషులమని ప్రదర్శించుకున్నవారందరూ ఇలాగే ఒక లక్ష్యం కోసం ఉద్భవించినట్లు చెప్పుకున్నవారే. దైవదూతను అన్న నోటితోనే అదానీ, అంబానీలు రాహుల్‌ గాంధీకి టెంపోల నిండుగా నోట్ల కట్టలు పంపారని తుచ్చ మానవుల మాదిరి మోడీ ఎన్నికల సమయంలో ఆరోపణ చేసిన సంగతిని గుర్తుకు తెచ్చుకోవాలి. అంటే ఆ పారిశ్రామిక, వాణిజ్యవేత్తల వద్ద లెక్కల్లో చూపని నల్లధనం పెద్ద ఎత్తున ఉందని చెప్పటమే. బహుశా ఆ వ్యాఖ్యల తరువాత తన స్నేహితుల గురించి మాట్లాడిరది తప్పని తెలిసిందో లేక వారి నుంచి హెచ్చరికలు వచ్చాయో తెలియదు గానీ తరువాత మరోసారి ప్రస్తావించలేదు. అంతే కాదు ప్రతిపక్షపార్టీల నేతలందరూ ముజ్రా పనులు చేస్తున్నారంటూ దిగువ స్థాయి విమర్శలు కూడా చేశారు.(ఉత్తరాదిన వేశ్యలతో కులీనులు చేసే గానాబజానాలను ముజ్రా అంటారు). తనకు ఇల్లూ, సంసార బంధాలు లేవు, దేశం కోసమే పుట్టినట్లు నరేంద్రమోడీ చెప్పుకుంటారు, భక్తులు కూడా అదే చెబుతారు. గుజరాత్‌ రాజధాని గాంధీ నగర్‌లో ధనికులు నివసించే ప్రాంతంలో తనకు ఒక ఇంటి స్థలం ఉన్నట్లు ఎన్నికల అఫిడవిట్లలో పేర్కొన్న అంశాన్ని కారవాన్‌ పత్రిక వెల్లడిరచింది. ముఖ్యమంత్రిగా ఉండగా తన పేరున తానే మంజూరు చేసుకున్న స్థలమది. దాని మీద వివాదం చెలరేగటం, కోర్టులకు ఎక్కటంతో సదరు స్థలాన్ని పార్టీకి ఇస్తానని మోడీ చెప్పారు. ఏ బంధాలు లేని తాను స్థలం తీసుకోవటం ఎందుకు, తిరిగి ప్రభుత్వానికి స్వాధీనం చేయకుండా పార్టీకి ఇస్తానని చెప్పటం ఏమిటి ? ఈ స్థలం ఉన్న అంశం గురించి మసిబూసి మారేడు కాయ చేసే ప్రయత్నం జరిగిందనే ఆరోపణ ఉంది.

నరేంద్రమోడీ గురించి ఉన్నతంగా చిత్రించేందుకు ప్రశాంత కిషోర్‌ వంటి నిపుణులెందరో పని చేశారన్నది బహిరంగ రహస్యం. దానికి గోడీ మీడియా ఎంతగానో సహకరించిందని అనేక మంది విమర్శలు చేసింది కూడా వాస్తవమే.2019లో ఎన్నికలకు ముందు ప్రధాని నరేంద్రమోడీ పేరుతో ఒక ప్రచార సినిమా కూడా తీశారు. వాస్తవాల ఆధారంగా తీసినట్లు చెప్పిన ఆ సినిమాలో వక్రీకరణలు, అవాస్తవాలెన్నో, అన్నింటినీ త్యజించి దేశం కోసమే మోడీ పాటుపడుతున్నట్లు చిత్రించారు.ఆర్‌ఎస్‌ఎస్‌ ప్రచారక్‌గా పనిచేసిన నరేంద్రమోడీ బాల్యంలో ఒక చేత్తో టీ అమ్ముతూ మరో చేత్తో జాతీయ జండాను పట్టుకున్నట్లు, దానికి వందనం చేసినట్లు చూపారు. వాస్తవం ఏమంటే అదే ఆర్‌ఎస్‌ఎస్‌ స్వాతంత్య్రం వచ్చిన తరువాత 52 సంవత్సరాల పాటు జాతీయ జండాను ఎగురవేయటానికి నిరాకరించింది, బాల్యంలోనే జాతీయ భావాలతో పెరిగినట్లు సినిమాలో చూపిన మోడీ కూడా ఆర్‌ఎస్‌ఎస్‌లో భాగస్వామే.శ్రీనగర్‌ లాల్‌ చౌక్‌లో ఆర్మీ పహారాలో బిజెపి నేత మురళీ మనోహర జోషి జాతీయపతాకాన్ని ఎగురవేశారు. కానీ ఈ చిత్రంలో నరేంద్రమోడీ ఆ పని చేశారని చిత్రించటం కళ్ల ముందే చరిత్రను వక్రీకరించటం తప్ప మరొకటి కాదు. దేశ చరిత్రలో ఏ ప్రధానీ చేయని విధంగా గుళ్లు గోపురాలు తిరిగి, ధ్యానం పేరుతో ఫొటో ప్రదర్శనలు, అయోధ్యలో రామాలయ ప్రారంభం సందర్భంగా అన్నీ తానై చేసిన హడావుడి, బాలరాముడి చిత్రంతో నరేంద్రమోడీ బొమ్మ పెట్టి వేసిన పోస్టర్లు, ఫ్లెక్సీలు, వాటన్నింటికీ పరాకాష్టగా అసలు తనది జీవసంబంధ జన్మ కాదని చెప్పుకొనేంత వరకు వెళ్లింది. ఇప్పుడు తాను మానవుడనే అని, తప్పులు చేయటం సహజం అని చెప్పుకోవటం కూడా తన గురించి తాను గొప్పగా చెప్పుకోవటంలో భాగమే అన్నది స్పష్టం.మాట మార్చి తాను మానవమాత్రుడనని ఎందుకు చెప్పుకోవాల్సి వచ్చింది ? అయోధ్యలో బిజెపి ఓడిపోవటం, వారణాసిలో తన మెజారిటీ భారీగా పడిపోవటం, లోక్‌సభలో ఒక పార్టీగా బిజెపికి సంపూర్ణ మెజారిటీని తీసుకురావటంలో వైఫల్యం, గతంకంటే ఓట్లు కూడా తగ్గటం, దేశంలో ఆర్థిక పరిస్థితి దిగజారుడు, ఎటు చూసినా వైఫల్యాలే కనిపిస్తుండగా తాను దైవాంశ సంభూతుడనని, తన శక్తి గురించి చెప్పుకొనే అవకాశాలు ఆవిరయ్యాయి. వీటి గురించి ఎవరు ఎక్కడ ప్రశ్నిస్తారో అని గ్రహించి తాను కూడా మానవ మాత్రుడనేనని, వైఫల్యాలు సహజమేనని చెప్పుకొనేందుకు చూసినట్లు కనిపిస్తోంది.

విమానాల వీడియోతో అమెరికా కూటమికి దడపుట్టించిన చైనా ! ఫైటర్‌ జెట్స్‌లో మనమెక్కడ !!

Tags

, , , ,

ఎం కోటేశ్వరరావు


2024 డిసెంబరు చివరి వారంలో చైనా ఎగురవేసిన రెండు విమానాల వీడియోను చూసి అమెరికా, దాని అనుంగు దేశాలకు దడమొదలైందా ? మీడియాలో వస్తున్న విశ్లేషణలు, వివరాలను చూస్తుంటే అలాగే అనిపిస్తున్నది. చైనా కమ్యూనిస్టు విప్లవ సారధి మావో జెడాంగ్‌ 131వ జన్మదినం డిసెంబరు 26వ తేదీన రెండు తయారీ కేంద్రాల నుంచి ఆకాశంలో విహరించిన రెండు విమానాల గురించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నది. ప్రతి దేశం స్వంత విమానాలను అవి పౌర లేదా యుద్ధ అవసరాల కోసం తయారు చేసుకోవటం కొత్తేమీ కాదు గానీ చైనా గురించి ఎందుకింత ఆందోళన.స్టెల్త్‌ బాంబర్ల తరగతికి చెందినవి చెబుతున్న ఆధునిక విమానాలు ఏ దేశం దగ్గర ఎన్ని ఉన్నాయన్నది రహస్యమే.ఐదు, ఆరు తరాలకు చెందిన వాటిని స్టెల్త్‌ బాంబర్లు అని పిలుస్తున్నారు. ఇవి ఇతర దేశాలకు రాడార్లకు దొరక్కుండా( రెండో కంటికి తెలియకుండా) ఎగిరి శత్రువును దెబ్బతీసేంత వేగం, సామర్ధ్యం కలిగినవి. ఫోర్బ్స్‌ వెబ్‌సైట్‌ నాలుగు సంవత్సరాల క్రితం వివిధ వనరుల నుంచి సేకరించిన సమాచారం ప్రకారం 2020 డిసెంబరు నాటికి ఏరకం విమానాలు ఏ దేశం దగ్గర ఎన్ని ఉనాయో పేర్కొంటూ ఒక జాబితాను ఇచ్చింది. దాని ప్రకారం అమెరికా 540, చైనా 41,నార్వే 22, ఇజ్రాయెల్‌ 18, ఆస్ట్రేలియా 16, బ్రిటన్‌ 15, జపాన్‌ 12, ఇటలీ 11, దక్షిణ కొరియా 11, రష్యా వద్ద పది చొప్పున ఉన్నాయి.రాడార్లను తప్పించుకొని ప్రయాణించే నాలుగు రకాలను చైనా రూపొందిస్తున్నదని కూడా ఆ వార్త పేర్కొన్నది. ఈ నాలుగేండ్లలో వాటి సంఖ్య కచ్చితంగా పెరిగి ఉంటుంది. మిలిటరీలో అమెరికా ఇప్పటికీ ఎదురులేని శక్తి అన్నది నిస్సందేహం. ఆ బలాన్ని చూపి ప్రపంచాన్ని తన అదుపులో పెట్టుకోవాలని చూస్తున్న మాట కూడా తెలిసిందే. ఇంతకీ చైనాను చూసి ఎందుకు కంగారు పడుతున్నట్లు ? ప్రపంచంలో ఇప్పటి వరకు ఐదవ తరం యుద్ధ విమానాలే ఉన్నాయి. అమెరికా తయారు చేసిన ఆరవ తరం విమానం 2020లో గగనతలంలో ఎగిరినప్పటికీ దాని గురించి వివరాలు ఇంతవరకు వెల్లడి కాలేదు. తాజాగా చైనాలోని చెంగడు, షెన్‌యాంగ్‌ విమాన తయారీ కేంద్రాల నుంచి రెండు కొత్త విమానాలు ఆకాశంలో కనిపించగా వాటికి రక్షణగా ఐదవ తరం జె20 ఫైటర్‌ విమానం తిరిగింది. ఆ దృశ్యాలు తప్ప అంతకు మించి వివరాలేమీ ప్రపంచానికి వెల్లడి కాలేదు. ఆయితే ఆ రంగంలో నిపుణులైన వారు ఆ విమానాలను చూస్తే ఆరవతరానికి చెందిన లక్షణాలను కలిగి ఉన్నాయని చెప్పారు.

2024 చివరిలో ఫ్లైట్‌ గ్లోబల్‌ సంస్థ విడుదల చేసిన నివేదిక ప్రకారం 161 దేశాలకు చెందిన సాయుధ దళాల్లో 52,642 విమానాలు ఉన్నాయి. ఇవి అంతకు ముందు సంవత్సరంతో పోల్చితే 759 తక్కువ. ఆఫ్రికా ఖండంలో 4,230, మధ్య ప్రాచ్యంలో 4,595, రష్యా కామన్‌వెల్త్‌ దేశాల్లో 5,124, ఆసియాపసిఫిక్‌ ప్రాంతంలో 14,583, ఉత్తర అమెరికాలో 13,339,ఐరోపాలో 7,760, లాటిన్‌ అమెరికాలో 2,956 ఉన్నాయి.దేశాల వారీ చూస్తే అమెరికాలో 13,043(ప్రపంచంలో25శాతం), రష్యా 4,292(8శాతం), చైనా 3,309(6),భారత్‌ 2,229(4), దక్షిణ కొరియా 1,592(3), జపాన్‌ 1,443(3),పాకిస్థాన్‌ 1,399(3) కలిగి ఉన్నాయి. అమెరికాతో పోలిస్తే చైనా దగ్గర ఉన్న మిలిటరీ విమానాలు ఎక్కడా సరితూగవు. చిత్రం ఏమిటంటే అమెరికాతో సహా నాటో దేశాలు ఇస్తున్న మద్దతు చూసి కేవలం 324 మిలిటరీ విమానాలు మాత్రమే కలిగి ఉన్న ఉక్రెయిన్‌ నాలుగువేలకు పైగా ఉన్న రష్యాను ఓడిస్తామని ప్రపంచాన్ని నమ్మింప చూస్తున్నది. రష్యాను చూసి నాటోలోని 23దేశాలు తమ రక్షణ బడ్జెట్‌ను జిడిపిలో రెండుశాతం అంతకు మించి ఖర్చు చేసేందుకు పూనుకున్నాయి.


చైనా ప్రదర్శించిన రెండు విమానాలు పరీక్ష కోసం ఉద్దేశించినవిగా చెబుతున్నారు. దానిలో తేలే ఫలితాలను బట్టి ప్రమాణాలను నిర్ధారించిన తరువాత మార్పులు చేర్పులతో రంగంలోకి దించుతారు. ఇది అన్ని దేశాలలో జరిగే ప్రక్రియే. అమెరికా ఐదవతరం ఎఫ్‌22, ఎఫ్‌35 రకాలకు ధీటుగా చైనా ఉన్నదని అందరూ అంగీకరిస్తున్నారు.మనదేశం అడ్వాన్స్‌డ్‌ మీడియం కంబాట్‌ ఎయిర్‌ క్రాఫ్ట్‌(ఎఎంసిఏ) రూపకల్పన దశలో ఉంది.ఎగుమతుల కోసం చైనా తయారు చేసిన జె35 రకం 40 స్టెల్త్‌ బాంబర్లను కొనుగోలు చేసేందుకు పాకిస్తాన్‌ నిర్ణయించింది.చైనాలో ఐదవతరం చెంగుడు జె20 రకం పని చేస్తుండగా షెన్‌యాంగ్‌ ఎఫ్‌సి31 రకం త్వరలో సేనలో చేరనుంది. ఈ సమాచార పూర్వరంగంలోనే ఆరవ తరం విమానాన్ని చైనా పరీక్షించినట్లు భావిస్తున్నారు.దాన్లో మూడు ఇంజన్లు ఉన్నట్లు అనుమానిస్తున్నారు. ఆధునిక విమానాల్లో అలాంటి ఏర్పాటు లేని కారణంగా ప్రత్యేకత సంతరించుకుంది.ఇప్పటికిప్పుడు దాన్ని నిర్ధారించుకొనే అవకాశం లేదు.రెండో విమానం పైలట్లతో పని చేస్తుందా లేక మానవరహితంగా లక్ష్యాన్ని చేరేవిధంగా రూపొందించారా అన్న చర్చ కూడా జరుగుతోంది.

అమెరికా 2020 సెప్టెంబరు 14న తాను ఆరవ తరం యుద్ధ విమానాన్ని రూపొందించినట్లు ప్రకటించటమే గాక ఒక విమానాన్ని ఎగురవేసింది. దాని వివరాలు ఇప్పటికీ రహస్యమే. 2022లో అమెరికా వైమానిక దళ విశ్రాంత జనరల్‌ మార్క్‌ డి కెలీ చైనా ఆరవతరం విమానాల గురించి హెచ్చరించాడు. సాంకేతికపరమైన తేడాను వేగంగా తగ్గిస్తున్నదంటూ ఆందోళన వెల్లడిరచాడు.1997లో అమెరికా ఐదవతరం స్టెల్త్‌ ఫైటర్‌ ఎఫ్‌22 రాప్టర్‌ను తొలిసారిగా ఆవిష్కరించారు. దానికి ధీటైన చైనా జె20 పద్నాలుగు సంవత్సరాల తరువాత 2011లో ఉనికిలోకి వచ్చింది.దీనితో పోల్చుకుంటే అమెరికా 2020లో ఆరవతరాన్ని ఆవిష్కరించిన నాలుగు సంవత్సరాలకే 2024లో చైనా తన విమానాలను ప్రదర్శించింది. దీన్ని బట్టి చైనా సాంకేతిక పరిజ్ఞానం ఇంత వేగంగా ఉందా అని ప్రపంచం ఆశ్చర్యపోతున్నది. గతంలో చైనా సాధించినట్లు ప్రకటించిన అనేక విజయాలను తొలుత అంతా ప్రచారం తప్ప నిజం కాదని కొట్టిపడవేసిన వారు తరువాత వాస్తవమే అని తెలిసి అవాక్కయ్యారు. ఇప్పుడు ఆరవతరం విమానాల గురించి కూడా అదే డోలాయమానంలో ఉన్నారు.దీని గురించి చైనా అధికారికంగా ఎలాంటి ప్రకటనా చేయలేదు. నూతన సంవత్సరాది సందర్భంగా చైనా పీపుల్స్‌ లిబరేషన్‌ ఆర్మీ తూర్పు కమాండ్‌ ఒక సంగీత వీడియోను విడుదల చేసింది. దానిలో నూతన జెట్‌ బొమ్మలను చేర్చి అనధికారికంగా వాస్తవమే అని సంకేతమిచ్చినట్లు పరిశీలకులు భావిస్తున్నారు.వివిధ దేశాలకు చెందిన విశ్లేషకులు భిన్న వ్యాఖ్యానాలు చేస్తున్నారు. దీర్ఘశ్రేణి, అత్యంత వేగంగా ప్రయాణించగల, శత్రు విమానాలను అడ్డుకోగలిగిన రష్యా మిగ్‌31 మాదిరి ఉన్నాయని, దానికంటే 45 టన్నుల బరువును మించి మోయగలవని, 400కిలో మీటర్ల దూరంలో ఉన్న లక్ష్యాలను దెబ్బతీయగలవని, ధ్వని కంటే నాలుగురెట్లు వేగంగా ప్రయాణిస్తాయని ఇలా రకరకాలుగా చెబుతున్నారు. ప్రపంచంలో పరిణామాలు ఇలా ఉంటే మన దేశ పరిస్థితి ఏమిటి ?


పెట్రోలు, డీజిలు మీద విపరీతమైన సెస్సుల భారం మోపి ఏటా లక్షల కోట్ల రూపాయలను వసూలు చేస్తున్న కేంద్ర ప్రభుత్వం ఎందుకు అంటే గతం కంటే మోడీ సర్కార్‌ మిలిటరీ ఖర్చు ఎక్కువగా చేస్తున్నది, దానికి అవసరమైన మొత్తాలు ఎక్కడి నుంచి వస్తాయని ప్రశ్నించిన రోజులను గుర్తుకు తెచ్చుకోవాలి. సెస్‌ అంటే ఏ అవసరాల కోసం విధిస్తే దానికి మాత్రమే ఖర్చు చేయాలి, కానీ మోడీ సర్కార్‌ విధించిన వాటిలో రక్షణ లేదు. కాంగ్రెస్‌ దేశ రక్షణను నిర్లక్ష్యం చేసిందని ఇప్పటికీ ఆరోపిస్తుంటారు. మన వైమానిక దళ అధిపతి ఏపి సింగ్‌ సుబ్రతో ముఖర్జీ 21వ సెమినార్‌లో మాట్లాడుతూ చెప్పిన మాటలు గమనించదగినవి.2010లో తేజ రకం యుద్ధ విమానాల ఒప్పందం ప్రకారం ఇప్పటికీ వాటిని పూర్తిగా సరఫరా చేయలేదని, మరోవైపున చైనా ఆరవతరం జెట్‌ను పరీక్షించిందని, చైనా నుంచి పాకిస్థాన్‌ ఐదవ తరం యుద్ధ విమానాలను రానున్న రెండు సంవత్సరాలలో కొనుగోలు చేయనున్నదని చెప్పారు. తేలిక రకం 40 తేజ విమానాలు కావాలని 200910లో ఆర్డరు పెడితే ఇంతవరకు పూర్తిగా రాలేదన్నారు. 1984లో విమానానికి రూపకల్పన జరిగిందని పదిహేడేండ్ల తరువాత మొదటి తేజా 2001లో ఎగిరిందని పదిహేను సంవత్సరాల తరువాత 2016లో మిలిటరీలో ప్రవేశపెట్టినట్లు, ఇది 2024, ఇంతవరకు తొలి 40 విమానాలను అందచేయలేదని, ఇదీ మన ఉత్పాదక సామర్ధ్యమని సింగ్‌ చెప్పారు. చైనాను గమనిస్తే ఎన్ని విమానాలను అది తయారు చేసిందని కాదు, ఎంతో వేగంగా సాంకేతికంగా ముందుకు పోతున్నదని నూతన తరం యుద్ధ విమానాలను బయటకు తీసుకురావటాన్ని ఇటీవల చూశామని ఎయిర్‌ ఛీఫ్‌ మార్షల్‌ అన్నారు. పాతబడిన మిగ్‌ 21 విమానాల స్థానంలో తేలిక రకం(ఎల్‌సిఏ) విమానాలను స్వంతంగా రూపొందించేందుకు 1980దశకంలో నిర్ణయించారు. ఒక ఇంజను కలిగిన నాలుగవ తరం తేజ విమానాలను స్వంతంగా తయారు చేస్తున్నాము. వాటిని మెరుగుపరచి తేజా ఎంకె1, తేజా ఎంకె1ఏ రకాలను రూపొందించాము. ఈ రంగంలో పురోగతిని వేగవంతం చేసేందుకు పదేండ్లలో మోడీ సర్కార్‌ చేసిందేమిటన్నది ప్రశ్న.

అమెరికా, చైనాలు ఆరవతరంలో ప్రవేశిస్తే మన దేశం వద్ద ఫ్రాన్సు నుంచి దిగుమతి చేసుకున్న దసాల్ట్‌ రాఫెల్‌ విమానమే ఆధునికమైనది, అది 4.5వ తరానికి చెందినదిగా పరిగణిస్తున్నారు. చురుకుగా పనిచేసే వైమానిక యూనిట్లు 42 ఉండాలని నిర్ణయించగా ప్రస్తుతం 31 మాత్రమే ఉన్నాయని పార్లమెంటరీ కమిటీ నివేదికలో వెల్లడిరచారు. ఒక్కొక్క యూనిట్‌లో రెండు అంతకు మించి యుద్ధ విమానాలు ఉంటాయి. ప్రస్తుతం 83 తేలిక రకం తేజా విమానాల కోసం వాయుసేన ఒప్పందాలు చేసుకుంది, మరో 97కొనుగోలుకు ప్రతిపాదనలు సిద్దం చేసింది.వచ్చే దశాబ్దిలో ఐదవ తరం తేజా ఎంకె2 విమానాలు సిద్దం అవుతాయని భావిస్తున్నారు.ప్రస్తుతం ఉన్న మిరేజ్‌ 2000, మిగ్‌29, జాగ్వార్‌ విమానాలున్నాయి, ఐదవతరం తేజా వస్తే మరింత ఆధునికం అవుతుంది. వీటిని అభివృద్ధి చేసేందుకు గత ఏడాది మార్చి నెలలో మాత్రమే కేంద్రం అనుమతించిందనే వార్తలను చూస్తే కబుర్లు చెప్పినంతగా ఆచరణ గడపదాటటం లేదన్నది వాస్తవం.పరస్పరం విశ్వాసం లేమి, మిత్రులుగా పైకి కనిపించే వారే కుట్రలు జరుపుతున్న పూర్వరంగంలో ప్రతిదేశం తన జాగ్రత్తలను తాను తీసుకుంటున్నది. ఈపూర్వరంగంలో మన రక్షణ రంగాన్ని నిర్లక్ష్యం చేయకూడదు,ప్రచారానికే పరిమితం కాకుండా నిర్థిష్ట కార్యాచరణను రూపొందించాలి.

పదేండ్ల క్రితం వెలిగిన ప్రభ మసకబారింది, కెనడా ప్రధాని రాజీనామా !

Tags

, ,

ఎం కోటేశ్వరరావు


అతడు పది సంవత్సరాల క్రితం లిబరల్‌ పార్టీకి అనూహ్య విజయం చేపట్టిన నేతగా నీరాజనాలు అందుకున్నాడు. ఇప్పుడు అతని ఉనికి పార్టీని పాతాళానికి దించుతుందంటూ అదే పార్టీ నేతలు తూర్పారపడుతున్నారు. అతడే కెనడా ప్రధాని, అంతకు ముందు ప్రకటనల మోడల్‌గా పనిచేసిన 53 సంవత్సరాల జస్టిన్‌ ట్రుడేవ్‌. ఇంటా బయటా తలెత్తిన పరిస్థితి కారణంగా ఉక్కిరి బిక్కిరితో పార్టీ, ప్రభుత్వ పదవి నుంచి తప్పుకొంటూ సోమవారం నాడు ఆకస్మికంగా రాజీనామా ప్రకటన చేశాడు.ఈ నెల 27న ప్రారంభం కావాల్సిన పార్లమెంటు సమావేశాలను మార్చి 24వరకు సస్పెండ్‌ చేశారు. వెంటనే పార్లమెంటును రద్దు చేసి ఎన్నికలు జరపాలని ప్రతిపక్షం డిమాండ్‌ చేసింది. పార్లమెంట్‌ ప్రారంభం కాగానే ప్రభుత్వం మీద అవిశ్వాస తీర్మానం పెడతామని మూడు ప్రధాన పార్టీలు ప్రకటించాయి. అదే జరిగితే ప్రభుత్వ పతనం ఖాయం. ట్రుడేవ్‌ ప్రకటన వెలువడిన వెంటనే డోనాల్డ్‌ ట్రంప్‌ స్పందించాడు. అమెరికాలో 51వ రాష్ట్రంగా కెనడా విలీనం కావటం మంచిదని గతంలో చేసిన ప్రకటనను పునరుద్ఘాటించాడు. అది అందరికీ మంచిదన్నాడు, రష్యా, చైనాల నుంచి పోటీని ఎదుర్కోవాల్సిన అవసరం ఉండదన్నాడు. ప్రత్యామ్నాయ నాయకత్వాన్ని ఎన్నుకొనేంత వరకు ట్రుడోవ్‌ పదవుల్లో కానసాగుతాడు. వారం రోజుల్లో కొత్తనేతను ఎంపిక చేస్తామని లిబరల్‌ పార్టీ ప్రకటించింది. పార్టీలో తలెత్తిన కుమ్ములాటల కారణంగా పలుకుబడి పాతాళానికి పడిపోవటం, ఆర్థిక మంత్రి రాజీనామా, ఆర్థికంగా అనిశ్చితి, వాణిజ్య యుద్ధానికి డోనాల్డ్‌ ట్రంప్‌ ప్రకటన తదితర అనేక కారణాలతో ట్రుదేవ్‌ రాజీనామా ప్రకటన చేస్తూనే తాను పోరాటయోధుడనని కొందరి మాదిరి వెనక్కు తగ్గేవాడిని కాదని చెప్పుకుంటూనే దేశానికి నిజమైన నేత అవసరమని, పార్టీలో అంతర్గత పోరు కారణంగా వచ్చే ఎన్నికల్లో పార్టీని విజయపథాన నడిపించటానికి తాను తగిన వాడిని కాదని, ఈ అంశంతో పాటు ప్రభుత్వంలో సంక్షోభం రాజీనామాకు కారణాలని కూడా చెప్పుకున్నాడు. తాను తొలిసారి పదవిలోకి వచ్చినప్పటికంటే రెండోసారి మెరుగైన విజయాలను సాధించానని, ఎన్నికల సంస్కరణలను ప్రవేశపెట్టకపోవటం పట్ల విచారిస్తున్నా అన్నాడు. రాజీనామా చేయటానికి ముందు అనేక మంది స్వంత పార్టీ ఎంపీలు గద్దె దిగాలని డిమాండ్‌ చేశారు.ట్రుడేవ్‌ ఏ మాత్రం కొనసాగినా వచ్చే ఎన్నికల్లో ఓడిపోవటం ఖాయమని అనేక సర్వేలు వెల్లడిరచాయి. గడచిన రెండు ఎన్నికల్లోనూ లిబరల్‌ పార్టీ తక్కువ శాతం ఓట్లతో ఎక్కువ సీట్లు తెచ్చుకొని మైనారిటీ ప్రభుత్వాలను ఏర్పాటు చేసింది.2021లో జరిగిన ఎన్నికల్లో 338 పార్లమెంటు స్థానాలకు గాను 160 సీట్లు తెచ్చుకున్న లిబరల్‌ పార్టీకి 32.62శాతం ఓట్లు రాగా ప్రతిపక్ష కన్సర్వేటివ్‌ పార్టీకి 33.74శాతం ఓట్లు 119 సీట్లు వచ్చాయి. న్యూడెమోక్రటిక్‌ పార్టీ(ఎన్‌డిపి)కి 17.82శాతం ఓట్లు 25 సీట్లు వచ్చాయి. ఈ పార్టీ మద్దతుతో ట్రుడేవ్‌ నెట్టుకువచ్చాడు.


గతేడాది సెప్టెంబరులో న్యూడెమోక్రటిక్‌ పార్టీ మద్దతు ఉపసంహరించుకోవటంతో అస్థిర పరిస్థితి ఏర్పడిరది. 2025 అక్టోబరు వరకు పార్లమెంటు వ్యవధి ఉన్నప్పటికీ ఏ క్షణంలోనైనా పార్లమెంటు రద్దు, మధ్యంతర ఎన్నికలు రావచ్చని భావించారు. అయితే సమస్యను బట్టి తాము మద్దతు లేదా వ్యతిరేకించటం చేస్తామని ఎన్‌డిపి ప్రకటించటంతో ప్రభుత్వం ఊపిరి పీల్చుకుంది. అయితే డిసెంబరు 16న ఉప ప్రధాని, ఆర్థిక మంత్రి క్రిస్టియా ఫ్రీ లాండ్‌ రాజీనామాతో పాలకపార్టీలో లుకలుకలు తీవ్రమయ్యాయని చెప్పవచ్చు. ఆమెతో జరిపిన ‘‘ప్రైవేటు సంభాషణ’’ ల గురించి తాను చెప్పలేనని, ఆమె రాజీనామాయే తన నిర్ణయానికి దారితీసిందని గానీ లేదని తాను చెప్పనని ట్రుడేవ్‌ విలేకర్లతో చెప్పాడు.ఇటీవలి వరకు ట్రుడేవ్‌ మైనారిటీ ప్రభుత్వాన్ని నిలబెట్టిన వామపక్ష న్యూ డెమోక్రటిక్‌ పార్టీ నేత జగ్‌మీత్‌ సింగ్‌ తాజా పరిణామాలపై వ్యాఖ్యానిస్తూ తరువాత లిబరల్‌ పార్టీ నేత ఎవరుంటారన్నది సమస్య కాదు.వారు జనాన్ని మోసం చేశారు, మరోసారి అవకాశానికి అనర్హులు అన్నాడు. 


2015 ఎన్నికల్లో అనూహ్యంగా లిబరల్‌ పార్టీ అంతకు ముందు మూడవ పెద్ద పార్టీగా 36 సీట్ల నుంచి ఏకంగా 184 సంపాదించి తిరుగులేని మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.2019లో 157 సీట్లకు పడిపోయింది, మైనారిటీ ప్రభుత్వానికి నాయకత్వం వహించిన ట్రడేవ్‌ 2021లో పార్లమెంటును రద్దు చేసి సెప్టెంబరులో ఎన్నికలు నిర్వహించారు. ఆ ఎన్నికల్లో ఓట్లు తగ్గినా 160 సీట్లతో మరోసారి మైనారిటీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాడు. ఇప్పుడు లిబరల్‌ పార్టీ ఎన్నుకొనే కొత్త నాయకత్వం పార్లమెంటులో బలనిరూపణ చేసుకుంటుందా, పార్లమెంటును రద్దు చేసి ముందస్తుకు వెళతారా అన్నది తెలియదు. ఎవరు బాధ్యతలు చేపట్టినప్పటికీ ట్రుడెవ్‌ తెచ్చిన అపఖ్యాతిని మోయాల్సి ఉంటుంది.2019 ఎన్నికల్లో ట్రుడేవ్‌పై అనేక విమర్శలు వచ్చాయి. వయస్సు తక్కువగా కనిపించేందుకు ముఖానికి రంగువేసుకొని తీయించుకున్న ఫొటోలతో ప్రచారం చేసుకున్నాడని ప్రతిపక్షాలు విమర్శించాయి.అనేక అవకతవకల విమర్శలు వచ్చాయి. ధనికదేశాల జి7 కూటమిలో అత్యధికంగా తొమ్మిది సంవత్సరాలు అధికారంలో కొనసాగిన రికార్డును ట్రుడేవ్‌ నెలకొల్పాడు.


పెరుగుతున్న ధరలు రోజువారీ జీవనాన్ని ప్రభావితం చేస్తున్నాయని రెండు సంవత్సరాల క్రితం 33శాతం మంది కెనడా పౌరులు చెబితే 2024లో 45శాతానికి పెరిగినట్లు సామాజిక సర్వే వెల్లడిరచింది. ఇండ్ల అద్దెలు భరించలేకుండా ఉన్నామని 38శాతం చెప్పారు.2021 నుంచి ధరల ద్రవ్యోల్బణం పెరుగుదల వలన ప్రతి ఐదుగురిలో ఒకరు సామాజిక సంస్థల నుంచి తక్కువగానో ఎక్కువగానో ఆహారాన్ని పొందినట్లు చెప్పారు. ఆర్థిక సమస్యలతో స్వల్పంగా లేదా తీవ్రంగా మానసిక వత్తిడికి గురైనట్లు 35శాతం చెప్పారు. తక్కువ ఆదాయం వచ్చే వారిలో ఇలాంటి సమస్యలు ఎక్కువగా ఉన్నాయి. అద్దె ఇండ్లలో ఉండేవారిలో జీవన సంతృప్తి చాలా తక్కువగా ఉంది.వయసు మీరిన వారికంటే యువత ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నట్లు తేలింది.2544 సంవత్సరాల వయస్సులో ఉన్నవారిలో 55శాతం మంది ధరల పెరుగుదల గురించి ఆందోళన వెల్లడిరచారు.వృద్ధులలో 28శాతం ఉన్నారు. ఫుడ్‌ బాంకులు, సామాజిక సంస్థల నుంచి ఆహారాన్ని పొందుతున్నవారు యువకులలో 4647శాతం ఉండగా వృద్దులలో 27`28శాతం ఉన్నారు. పిల్లలపై ధరల పెరుగుదల ప్రతికూల ప్రభావం గురించి చెప్పనవసరం లేదు. ఆర్థికంగా కెనడా తీవ్రమైన అనిశ్చితిని ఎదుర్కొంటోంది.


2008లో ధనిక దేశాల్లో తలెత్తిన సంక్షోభం నాటి నుంచి నేటి వరకు కెనడాలో అనిశ్చితి సూచిక తీవ్ర వడిదుడులకు లోనవుతున్నది. రెండువేల సంవత్సరం నుంచి 2008 వరకు 50 నుంచి 200 మధ్య కదలాడగా తరువాత అది వంద నుంచి 400 మధ్య ఊగిసలాడిరది. 2020 కరోనా సమయంలో గరిష్టంగా 690, గతేడాది 650గా ఉంది.ట్రుడేవ్‌ ప్రకటనతో ఈ ఏడాది అది మరింతగా పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. నూతన ప్రభుత్వం ఏర్పడినప్పటికీ అక్టోబరులోగా ఎన్నికలు జరగాల్సి ఉండగా పెట్టుబడిదారులు ఎలాంటి నిర్ణయాలు తీసుకొనే అవకాశం లేదు, తమ ప్రాజెక్టులను తాత్కాలింగా నిలిపివేయటం లేదా వాయిదా వేసుకొనే అవకాశాలు ఉన్నాయి. ఇది ఉపాధి మీద కూడా తీవ్ర ప్రభావం చూపటం అనివార్యం. నూతన నియామకాలు పరిమితం అవుతాయి. కరెన్సీ కెనడా డాలరు విలువ కూడా గత వారంలో పతనమై కొత్త రికార్డు నెలకొల్పింది. ప్రధాని రాజీనామా ప్రకటన తరువాత స్వల్పంగా పెరిగినప్పటికీ అనిశ్చితిలో కొనసాగ వచ్చు. కెనడా అతి పెద్ద వాణిజ్య భాగస్వామి అమెరికా. దిగుమతి చేసుకొనే వస్తువులపై 25శాతం పన్ను విధిస్తానని డోనాల్డ్‌ ట్రంప్‌ చేసిన ప్రకటన గురించి తెలిసిందే.ఆర్థిక రంగంలో అనిశ్చిత పరిస్థితి ఉన్న కారణంగా దీని గురించి బేరమాడే శక్తి కెనడాకు తగ్గుతుంది.ట్రంప్‌ చర్య అమెరికా వినియోగదారుల మీద భారాలు మోపినప్పటికీ కెనడా ఎగుమతుల మీద కూడా ప్రతికూల ప్రభావం చూపనుంది.1985 నుంచి రెండు దేశాల మధ్య వాణిజ్య లావాదేవీలలో కెనడా మిగులులో ఉంది. తమ వస్తువులను మరింతగా దిగుమతి చేసుకోవాలని అమెరికా ఎప్పటి నుంచో డిమాండ్‌ చేస్తోంది.


గత కొద్ది నెలలుగా పార్టీ ఎంపీలు అనేక మంది డిమాండ్‌ చేసినప్పటికీ రాజీనామాకు ససేమిరా అన్న ట్రుడేవ్‌ డిసెంబరు నెలలో జరిగిన పరిణామంతో దిగిరాక తప్పలేదు. ప్రధానితో తన విబేధాల గురించి ఫ్రీలాండ్‌ రాజీనామా లేఖలో వెల్లడిరచారు. రాజకీయ జిమ్మిక్కులు భారీ మూల్యం చెల్లిస్తున్నాయంటూ పరోక్షంగా చేసిన విమర్శల లేఖను బహిర్గతం చేయటంతో వత్తిడి మరింత పెరిగింది. ఈ ఏడాది బడ్జెట్‌లోటు 20 బిలియన్‌ డాలర్లు ఉంటుందని అంచనా వేయగా అది 60బిలియన్‌ డాలర్లకు పెరిగింది.బడ్జెట్‌ లోటు, ఆర్థిక అసమానతలను తగ్గిస్తానంటూ యువకుడిగా రంగంలోకి దిగిన ట్రుడెవ్‌కు యువతరం బ్రహ్మరధం పట్టటంతో 2015లో ఘనవిజయం లభించింది, ఆచరణలో దానికి భిన్నంగా వ్యవహరించాడు. తీవ్రమైన అవినీతి ఆరోపణలను కూడా ఎదుర్కొన్నాడు.ట్రుడెవ్‌ రాజీనామాతో పాలక లిబరల్‌ పార్టీ, ప్రతిపక్ష కన్సర్వేటివ్‌ పార్టీ నుంచి ప్రధాని పదవికి పోటీ పెరిగింది. మంత్రి పదవికి రాజీనామా చేసిన క్రిస్టియా ఫ్రీలాండ్‌, ప్రస్తుతం రవాణాశాఖ మంత్రిగా ఉన్న భారతీయ సంతతికి చెందిన అనిత ఇందిరా ఆనంద్‌, విదేశాంగ మంత్రి మెలీనా జోలీ కూడా ప్రధాన పోటీదారుగా ఉన్నట్లు వార్తలు వచ్చాయి. బాంక్‌ ఆఫ్‌ ఇంగ్లాండ్‌, బాంక్‌ ఆఫ్‌ కెనడా గవర్నర్‌గా పనిచేసి ట్రడేవ్‌కు సలహాదారుగా ఉన్న మార్క్‌ కార్నే కూడా రేసులో ఉన్నాడు.ప్రభుత్వానికి అపకీర్తి తెచ్చిన కార్బన్‌ పన్ను విధింపు ఇతగాడి సలహామేరకే జరిగింది.మూడు సార్లు ఓట్లు అధికంగా తెచ్చుకున్నప్పటికీ అవసరమైన సీట్లు తెచ్చుకోవటంలో విఫలమైన ప్రతిపక్ష నేత పిరే పోయిలివరే ఎన్నికల్లో మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకొనేందుకు సిద్దం అవుతున్నాడు. ఒక టీవీ జరిపిన సర్వేలో పిరేకు 44.2శాతం మంది మద్దతు ప్రకటించగా ట్రుడెవ్‌కు 24శాతం ఉన్నారు.కరోనా తరువాత వివిధ దేశాలలో జరిగిన ఎన్నికల తీరుతెన్నులను చూస్తే అధికారంలో ఉన్నవారందరూ దాదాపు ఓడిపోయారు. కెనడాలో కూడా లిబరల్‌ పార్టీ పరిస్థితి అలాగే ఉంది. రకరకాల ఆకర్షక వాగ్దానాలతో మద్దతు పొందిన వారిని హృదయ సామ్రాట్టులుగా జేజేలు కొట్టిన జనమే తీరు మారితే ఏ విధంగా తరిమి కొట్టారో బంగ్లాదేశ్‌, శ్రీలంక పరిణామాలు స్పష్టం చేశాయి. మన దేశంలో పాలక పార్టీలు వీటి నుంచి గుణపాఠాలు తీసుకుంటాయా ?

చిత్తశుద్దిలేని శివపూజ : నంగనాచి క్షమాపణ చెప్పి ఎదురుదాడికి దిగిన మణిపూర్‌ సిఎం !

Tags

, , , ,


ఎం కోటేశ్వరరావు


మణిపూర్‌లో 2023 మే మూడవ తేదీన రెండు సామాజిక తరగతుల మధ్య పరస్పర అనుమానాలతో ప్రారంభమైన ఘర్షణ 2024లో కొనసాగి మూడో ఏడాదిలో ప్రవేశించింది. ఎప్పుడు ముగుస్తుందో తెలియటం లేదు. పరిస్థితిని చక్కదిద్దటంలో విఫలమైనందుకు విచారంగా ఉందంటూ ముఖ్యమంత్రి బిరేన్‌ సింగ్‌ రాష్ట్ర ప్రజలకు క్షమాపణలు చెప్పారు. అయితే ఒక రోజు కూడా గడవక ముందే విమర్శకులపై ఎదురుదాడికి దిగటాన్ని బట్టి విచార ప్రకటనలో చిత్తశుద్ది లేదని స్వయంగా వెల్లడిరచుకున్నారు. మెయితీకుకీ, జో తెగల మధ్య ప్రారంభమైన ఘర్షణలు, భద్రతా దళాల చర్యల్లో కొందరు మహిళలపై అత్యాచారాలు, నగ్నంగా ఊరేగింపు, 260 మంది ప్రాణాలు కోల్పోయారు, అరవై వేల మంది నెలవులు తప్పారు. బాధితుల్లో ఎక్కువ మంది గిరిజనులైన కుకీలే ఉన్నారు. మెయితీలందరినీ గిరిజనులుగా పరిగణించాలంటూ హైకోర్టు పెట్టిన చిచ్చు అక్కడ జరుగుతున్న దారుణ మారణకాండకు మూలం.రెండిరజన్ల పాలన సాగిస్తున్న బిజెపి ఆదిలోనే దానికి తెరదించి ఉంటే ఇంత జరిగేది కాదు. ఓట్ల రాజకీయంలో మెజారిటీ మెయితీలను ఓటు బాంకుగా మార్చుకొనేందుకు ఆ పార్టీ చూసింది. తాజా లోక్‌సభ ఎన్నికల్లో దానికి వ్రతం చెడ్డా ఫలం దక్కలేదు. రెండు స్థానాల్లోనూ అది మట్టి కరచింది. తిరిగి మద్దతు పొందే ఎత్తుగడలో భాగమే పశ్చాత్తాప ప్రకటన ప్రహసనం అని చెప్పవచ్చు. నిజానికి అక్కడ జరిగిన ఉదంతాలను జరిగిందేదో జరిగింది మరిచిపోదాం అంటే సరే అనేవి కాదు.ఒక రోజు, ఒక ఘటన కాదు కదా ! మహిళల మీద అత్యాచారం చేసి నగ్నంగా ఊరేగించిన ఉదంతాన్ని మూసిపెట్టేందుకు చూసిన తీరు, అది వెల్లడైన తరువాత పార్లమెంటులో ప్రతిస్పందనలను మరచిపోవాలని బిజెపి చూడవచ్చు తప్ప చరిత్ర మరవదు, మణిపూరీయులు అసలు మరవరు ! మే మొదటి వారంలో గిరిజన మహిళలపై అత్యాచారం జరిగితే ఏ ఒక్క పత్రికా బయటపెట్టలేదు, అంతా సజావుగా ఉందని రాష్ట్రప్రభుత్వం నమ్మబలికింది. జూలై నెలలో నగ్నంగా తిప్పిన మహిళ వీడియో బయటకు వచ్చిన తరువాత మాత్రమే లోకానికి వెల్లడైంది. అందుకే ఆత్మశుద్ధి లేని యాచారమదియేల, భాండశుద్ది లేని పాకమేల, చిత్తశుద్ది లేని శివపూజలేల అన్న మహాకవి వేమనను ఈ సందర్భంగా బీరేన్‌ సింగ్‌ క్షమాపణల తీరు గుర్తుకు తెచ్చింది.

రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 356ను పొందుపరచటం దుర్వినియోగానికి కాదు సద్వినియోగానికి మాత్రమే. చాకులు, కత్తుల తయారీకి చట్టం అనుమతిస్తున్నదంటే దాని అర్ధం పీకలు కోసేందుకు వినియోగించాలని కాదు. గతంలో సదరు ఆర్టికల్‌ను కాంగ్రెస్‌ దుర్వినియోగం చేసిన మాట నిజం. తమ పాలనలో దాన్ని ఒక్కసారైనా వినియోగిస్తే చెప్పండి అని బిజెపి ప్రశ్నించుతోంది.దుర్వినియోగం ఎంత తప్పో సద్వినియోగం చేయకపోవటం కూడా అంతకంటే పెద్దది. మణిపూర్‌లో బిజెపి రాష్ట్ర ప్రభుత్వం శాంతి భద్రతలను కాపాడటంలో ఘోరంగా విఫలమైంది. అదే ఏ ప్రతిపక్ష పార్టీనో అధికారంలో ఉంటే అలా ఉపేక్షించేదా ? అది రాజధర్మమేనా ! అల్లకల్లోల పరిస్థితి ఏర్పడిన కారణంగా రాష్ట్రం మొత్తాన్ని మిలిటరీకి అప్పగించారు. అక్కడ బిజెపికి చెందిన ముఖ్యమంత్రి, మంత్రులు రాజభోగాలు అనుభవించటం తప్ప చేసేదేమీ లేదు.వేతనాలు, అలవెన్సులు దండగ. ప్రపంచ మంతటా, మణిపూర్‌ చుట్టూ ప్రధాని నరేంద్రమోడీ విమానాల్లో తిరుగుతారు, సుభాషితాలు చెప్పి వస్తున్నారు తప్ప మణిపూర్‌ వెళ్లి భరోసా ఇచ్చేందుకు ఎలాంటి చొరవ లేదు.

కాంగ్రెస్‌ నేత జయరాం రమేష్‌ ఈ మాట అంటూ ప్రధాని నరేంద్రమోడీ కూడా మణిపూరీయులకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌ చేశారు. దాన్లో తప్పేముంది ? దేశ చరిత్రలో అనేక మంది ప్రధానులు అనేక చట్టాలను చేశారు. కానీ మోడీ తెచ్చిన మూడు సాగు చట్టాలకు తీవ్ర ప్రతిఘటన ఎదురుకావటంతో విధిలేక క్షమాపణలు చెప్పి మరీ వాటిని ఉపసంహరిస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రతిపక్షాలు ముందుకు తెచ్చిన అనేక అంశాల మీద మోడీ మౌనంగా ఉన్నట్లుగానే ఆయన ప్రధమ గణంలోని బీరేన్‌ సింగ్‌ మౌనంగా ఉంటే అదొక తీరు. కానీ ఎదురుదాడికి దిగారు. గతంలో కూడా మణిపూర్‌లో అనేక ఉదంతాలు జరిగాయి కదా వాటన్నింటికీ నాడు ప్రధానులుగా ఉన్న పివి నరసింహారావు, ఐకె గుజ్రాల్‌ క్షమాపణలు చెప్పారా అని ప్రశ్నించారు. ఆ నాడు రాష్ట్ర ముఖ్యమంత్రులుగా ఉన్నవారు కూడా క్షమాపణలు చెప్పిన దాఖలా లేదు, మరి బీరేన్‌ సింగ్‌ ఎందుకు చెప్పినట్లు ? నాడు మణిపూర్‌లో జరిగిన ఉదంతాలను పాలకులు మూసిపెట్టలేదు, మోడీ ఏలుబడిలో ఎందుకు పాచిపోయేట్లు చేసినట్లు ? సామాజిక మాధ్యమంలో నగ్నంగా మహిళను తిప్పిన ఉదంతం వెలువడిన తరువాతనే కదా నోరు విప్పింది. గతంలో కాంగ్రెస్‌ చేసిన పాపాల ఫలితమే నేడు మణిపూర్‌ ఉదంతాలకు మూలం అని బీరేన్‌ సింగ్‌ ఆరోపించారు. ఇది కూడా తర్కానికి నిలిచేది కాదు. ముందే చెప్పుకున్నట్లు మెయితీలకు గిరిజన రిజర్వేషన్‌ కల్పించాలన్న హైకోర్టు సిఫార్సు తాజా పరిణామాలకు మూలం తప్ప మరొకటి కాదు. గతంలో చేసుకున్న ఒప్పందాలను రద్దు చేయాలన్న మెయితీల డిమాండ్‌ను ప్రస్తావించటం ద్వారా బీరేన్‌ సింగ్‌ ఆ సామాజిక తరగతి తెగనేత స్థాయికి దిగజారారు. ఒక వేళ అది సరైనదే అయితే కేంద్రంలో ఉన్న ప్రభుత్వ వైఖరి ఏమిటో ఎందుకు ప్రకటించరు ?కాంగ్రెసే అంతా చేసిందని చెబుతున్న బిరేన్‌ సింగ్‌ గతం ఏమిటి ? డెమోక్రటిక్‌ రివల్యూషనరీ పీపుల్స్‌ పార్టీని ఏర్పాటు చేసి దాని తరుఫున తొలిసారి ఎంఎల్‌ఏగా గెలిచారు. తరువాత దానిని 2004 లేదా 2005లో కాంగ్రెస్‌లో విలీనం చేసి ఆ పార్టీలో కొనసాగారు. తనకు సరైన ప్రాధాన్యత ఇవ్వటం లేదనే అసంతృప్తితో 2016లో బిజెపిలో చేరారు, 2017 ఎన్నికల్లో మైనారిటీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ఫిరాయింపులతో కొనసాగారు, తరువాత 2022లో మెజారిటీ సీట్లతో సిఎం అయ్యారు.

మణిపూర్‌ అంశం ప్రస్తావనకు వచ్చినపుడల్లా బిజెపి నేతలు గతంలో కాంగ్రెస్‌ అనుసరించిన వైఖరి, విదేశీ జోక్యం గురించి చెబుతూ తమ చేతగానితనాన్ని కప్పిపుచ్చుకొనేందుకు చూస్తారు. సరిహద్దుల భద్రత, అక్రమ చొరబాట్లను అరికట్టాల్సింది కేంద్ర ప్రభుత్వం. పదేండ్ల నుంచి ఏ గుడ్డి గుర్రాలకు పండ్లుతోముతున్నట్లు ? 2017 నుంచి ఇదే బీరేన్‌ సింగ్‌ సిఎంగా ఉన్నారు. ఈ పెద్దమనిషి ఏం చేస్తున్నట్లు ? అంతా చేసి నేరం నుంచి తప్పించుకోవటం తప్ప క్షమాపణలో చిత్తశుద్ది లేదని మణిపూర్‌ గిరిజన సంఘాల ఐక్యతా కమిటీ బీరేన్‌ సింగ్‌ ప్రకటన మీద వ్యాఖ్యానించింది. ఒక మైనారిటీ తరగతి మీద జరిపిన మారణకాండ బాధ్యత నుంచి తప్పించుకొనేందుకు సిఎం చూశారని పేర్కొన్నది. కుకీజో గిరిజనుల పట్ల వివక్ష నిలిపివేయాలని మరో గిరిజన సంఘాల కమిటీ డిమాండ్‌ చేసింది.మణిపూర్‌లో సాయుధ బృందాలపై భద్రతా దళాలు జరిపిన దాడులలో స్టార్‌ లింక్‌ ఉపగ్రహ యాంటెన్నా, రౌటర్‌తో పాటు ఆధునిక రైఫిళ్లు దొరికినట్లు ప్రకటించారు. మారుమూల ప్రాంతాలలో ఇంటర్నెట్‌ సేవలను అందించే ఈ ఉపగ్రహం సేవలను పొందటం మనదేశంలో నిషిద్దం, అయినప్పటికీ అవి దొరికాయంటే అనధికారికంగా సమాచారం అందుకున్నట్లు స్పష్టమౌతోంది. వీటిని మెయితీలు అధికంగా నివసించే ప్రాంతాలపై జరిగిన దాడుల సమయంలో సాయుధులు వదలివేసి పారిపోయినట్లు పోలీసులు ప్రకటించారు. అయితే తమ ఉపగ్రహం నుంచి భారత్‌కు సంకేతాలు అందకుండా చేసినట్లు ఎలన్‌మస్క్‌ చెప్పుకున్నాడు. తమ దాడుల సందర్భంగా మయన్మార్‌లో తయారైన ఆయుధాలు, ఇతర పరికరాలను స్వాధీనం చేసుకున్నట్లు కూడా పోలీసు అధికారులు చెప్పారు. వాటిలో మయన్మార్‌ సైనికులు వాడే ఎంఏ4 రైఫిలు,ఎకె47 కూడా ఉంది. గత ఐదారు నెలల నుంచి సాయుధ బృందాలు తలదాచుకున్న ప్రాంతాలలో బుల్లెట్‌ ఫ్రూఫ్‌ జాకెట్‌లు, మిలిటరీ యూనిఫారాలు తదితరాలను కూడా పట్టుకుంటున్నట్లు అధికారులు తెలిపారు. మయన్మార్‌ సరిహద్దులను దాటి ఉగ్రవాదులు రాకపోకలు సాగిస్తున్నా, ఆయుధాలు అక్రమ రవాణా జరుగుతుంటే సరిహద్దు భద్రతలను చూడాల్సిన కేంద్ర ప్రభుత్వం ఏమి చేస్తున్నట్లు ? స్టార్‌ లింక్‌ ఉపగ్రహం నుంచి ఉగ్రవాదులు, సాయుధ మూకలకు సంకేతాలు, సందేశాలు అందుతుంటే అడ్డుకోవాల్సిన బాధ్యత కూడా కేంద్రానిదే. భద్రమైన చేతుల్లో దేశం ఉందని నరేంద్రమోడీ గురించి గొప్పలు చెప్పుకోవటం తప్ప ఉపయోగం ఏముంది ?

తాజా ఘర్షణలు, దాడులకు కారణం 2023 ఏప్రిల్‌ 14న మణిపూర్‌ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలే మూలం. మెయితీ సామాజిక తరగతికి గిరిజన హోదా కల్పించాలని కేంద్రానికి సిఫార్సు చేయాలంటూ తనకు లేని అధికారంతో హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. తరువాత సుప్రీం కోర్టు ఈ చర్యను తప్పు పట్టింది.ఒక పెద్ద కుట్రలో భాగంగా అక్కడ పరిణామాలు జరిగినట్లు భావిస్తున్నారు. హైకోర్టు ఆదేశాన్ని నిరసిస్తూ మే 3వ తేదీన గిరిజన విద్యార్థులు నిరసన తెలిపారు. నాటి నుంచి నేటి వరకు ఏదో ఒక వైపు నుంచి హింసాకాండ జరుగుతూనే ఉంది. మెయితీ`గిరిజనుల మధ్య పరస్పరం అనుమానాలు కొనసాగుతూనే ఉన్నాయి. మయన్మార్‌లో 2021 మిలిటరీ తిరుగుబాటు సమయంలో అక్కడి నుంచి శరణార్ధులుగా వచ్చిన వారి గురించి మెయితీలు అభ్యంతరం తెలిపారు. ఇవన్నీ కూడా బిజెపి రెండిరజన్ల పాలనలోనే జరిగాయి. అందువలన గత కాంగ్రెస్‌ పాలనే కారణం అనటం తప్పించుకోచూడటం తప్ప మరొకటి కాదు. తాజా లోక్‌సభ ఎన్నికల్లో బిజెపి అక్కడ నాగా పీపుల్స్‌ ఫ్రంట్‌ అనే ఒక ప్రాంతీయ పార్టీతో జత కట్టి చెరోసీటులో పోటీ చేసింది. రెండు సీట్లలో కాంగ్రెస్‌ గెలిచింది. రెండు సీట్లలో కాంగ్రెస్‌కు 47.59శాతం ఓట్లు రాగా నాగా పార్టీకి 18.87, బిజెపికి 16.58శాతం( మొత్తం 35.45శాతం) ఓట్లు వచ్చాయి. అరవై అసెంబ్లీ సెగ్మెంట్లలో 36 చోట్ల కాంగ్రెస్‌, 13 నాగా పీపుల్స్‌ ఫ్రంట్‌, బిజెపి తొమ్మిది చోట్ల మెజారిటీ తెచ్చుకున్నాయి. మెయితీలు, గిరిజన సామాజిక తరగతులు రెండూ బిజెపిని ఓడిరచాయన్నది స్పష్టం. అందుకే వచ్చే అసెంబ్లీ ఎన్నికలను గమనంలో ఉంచుకొని క్షమాపణల పర్వానికి తెరతీశారని చెప్పాల్సి వస్తోంది. మెయితీలను గిరిజనులుగా గుర్తించాలా లేదా అన్నది బిజెపి తేల్చటం లేదు. తమకు అన్యాయం చేస్తారని కుకీ, ఇతర గిరిజనులు అనుమానంగా చూస్తుంటే తమకు రిజర్వేషన్ల ఆశచూపి ఓటు బాంకుగా మార్చుకోవాలని చూసి ఎటూ తేల్చటం లేదని మెయితీలు అసంతృప్తితో ఉండటమే బిజెపి ఓటమికి కారణం.

ఎత్తిన ఎర్ర జెండా దించం – అమెరికాకు ఏనాటికీ తల వంచం : అరవై ఆరేండ్ల క్యూబా సోషలిస్టు విప్లవం !

Tags

, , , , , ,

ఎం కోటేశ్వరరావు

క్యూబా సోషలిస్టు విప్లవం 66వ ఏడాదిలో ప్రవేశించింది.1953 జూలై 26న నియంత బాటిస్టా పాలనకు వ్యతిరేకంగా ప్రారంభమైన తిరుగుబాటు 1959 జనవరి ఒకటిన విప్లవోద్యమ నేత ఫిడెల్‌ కాస్ట్రో అధికారానికి రావటంతో ముగిసింది. ఐదు సంవత్సరాల ఐదు నెలల ఐదవ రోజు 1958 డిసెంబరు 31న బాటిస్టా ప్రభుత్వాన్ని కూల్చివేశారు. విప్లవాన్ని మొగ్గలోనే తుంచి వేసేందుకు వెంటనే అమెరికా ఆర్థిక దిగ్బంధనాన్ని ప్రారంభించి, క్రమంగా తీవ్రతరం కావించింది. నాటి నుంచి నేటి వరకు అక్కడ ఎనుగు పార్టీ(రిపబ్లికన్‌)గాడిద పార్టీ(డెమోక్రటిక్‌) ఎవరు అధికారంలో ఉన్నా మానవాళి చరిత్రలోనే అత్యంత సుదీర్ఘ దిగ్బంధనం కొనసాగుతూనే ఉంది. అమెరికాకు క్యూబా కూతవేటు దూరంలో ఉంది. రెండు దేశాల సమీప భూభాగాల మధ్య దూరం కేవలం 90 మైళ్లు లేదా 145 కిలోమీటర్లు మాత్రమే. కరీబియన్‌ సముద్ర మెక్సికో అఖాతం, అట్లాంటిక్‌ మహాసముద్రం కలిసే ప్రాంతంలో ఉన్న కోటీ 12లక్షల జనాభాతో ప్రధాన భూభాగానికి అనుబంధంగా 4,195 చిన్నా, పెద్ద దీవులు ఉన్న దేశం. నవరంధ్రాలు మూసివేసి ప్రాణాలు తీసినట్లుగా అన్ని రకాల దిగ్బంధాలతో అక్కడి జనాన్ని మాడిస్తే వారు తిరుగుబాటు చేసి కమ్యూనిస్టు ప్రభుత్వాన్ని కూల్చివేసి తమ ఒడిలో కూర్చుంటారని 65 ఏండ్లుగా అమెరికా చూస్తున్నది. ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన అగ్రరాజ్యానికి తలొగ్గకుండా ఆత్మగౌరవంతో పితృదేశమా ( కొన్ని దేశాలు పితృసామిక వ్యవస్థను అనుసరించి అలా పిలుచుకుంటాయి.దేశ భక్తిలో ఎలాంటి తేడా ఉండదు) లేక మరణమా అన్న ఆశయంతో ముందుకు సాగుతున్నది.


క్యూబా విప్లవానికి ఒక ప్రత్యేకత ఉంది. కమ్యూనిస్టుల నాయకత్వాన విముక్తి పోరాటాలు జరగటం అధికారానికి రావటం సాధారణంగా జరిగింది. అదే క్యూబాలో అధికారానికి వచ్చిన తరువాత కాస్ట్రో తదితర విప్లవకారులు కమ్యూనిస్టులుగా మారారు.1952లో ఎన్నికల ద్వారా పాలకులను ఎన్నుకోవటాన్ని సహించని మిలిటరీ జనరల్‌ ఫల్లునేసియో బాటిస్టా కుట్రద్వారా అధికారాన్ని స్వాధీనం చేసుకున్నాడు. దాన్ని వ్యతిరేకించిన ప్రజాస్వామికవాదుల్లో కాస్ట్రో ఒకరు. కొంత మంది కోర్టులో సవాలు చేసి బాటిస్టాను గద్దె దింపాలని చూసి విఫలమయ్యారు.తరువాత 1953 జూలై 26న సోదరుడు రావుల్‌తో కలసి కాస్ట్రో తదితరులు మంకాడా మిలిటరీ బారక్స్‌ మీద విఫల దాడి చేశారు. దాంతో వారందరినీ అరెస్టు చేసి జైల్లో పెట్టారు. అక్కడే జూలై 26 ఉద్యమం పేరుతో సంఘటితమయ్యారు. కేసు విచారణ సందర్భంగా కోర్టులో రెండు గంటల పాటు కాస్ట్రో తిరుగుబాటు కారణాలను వివరించి దేశమంతటా ప్రాచుర్యం పొందారు.పౌరుల్లో వచ్చిన సానుభూతిని చూసిన తరువాత తిరుగుబాటు చేసిన వారిని విడుదల చేసి ప్రజామద్దతు పొందాలని బాటిస్టా క్షమాభిక్ష ప్రకటించాడు. విప్లవకారులు మెక్సికో, తదితర దేశాలకు ప్రవాసం వెళ్లి 1956లో తిరిగి గ్రాన్మా అనేక నౌకలో తిరిగి వచ్చారు.(తరువాత కాలంలో ఆ నౌక పేరుతోనే పత్రిక నడుపుతున్నారు) మెక్సికోలో పరిచయమైన చే గువేరా కూడా వారితో వచ్చాడు. బాటిస్టా మిలిటరీ వారిని ఎదుర్కోవటంతో సియెరా మెస్ట్రా అనే ప్రాంతానికి వెళ్లి అక్కడ బాటిస్టాను వ్యతిరేకించే పాపులర్‌ సోషలిస్టు పార్టీ వంటి వారందరినీ కూడా గట్టి దాడులకు దిగారు.చివరికి 1958 డిసెంబరు 31న విజయం సాధించటంతో బాటిస్టా దేశం వదలి పారిపోయాడు.1959జనవరి ఒకటిన కాస్ట్రో అధికారానికి వచ్చాడు.జూలై 26 ఉద్యమం పేరుతో ఉన్న వారు కీలక పాత్ర పోషించారు. తరువాత మార్క్సిజంలెనినిజాన్ని ఆమోదించి 1965 అక్టోబరులో క్యూబా కమ్యూనిస్టు పార్టీని ఏర్పాటు చేశారు.అయితే విప్లవంలో కీలక ఘట్టమైన జూలై 26వ తేదీని విప్లవ దినంగా పరిగణించారు.

మేం వైద్యులను ఎగుమతి చేస్తాం తప్ప బాంబులను కాదని అర్జెంటీనా రాజధాని బ్యూనోస్‌ఎయిర్స్‌ నగరంలో 2003లో క్యూబా అధినేత ఫిడెల్‌ కాస్ట్రో చెప్పాడు.మా దేశం ఇతర దేశాల పౌరుల మీద బాంబులు వేయదు లేదా నగరాల మీద బాంబులు వేసేందుకు వేలాది విమానాలను పంపదు. మాకు అణు, రసాయన లేదా జీవ ఆయుధాలు లేవు. ప్రాణాలను రక్షించేందుకు లక్షలాది మంది వైద్యులను మా దేశంలో తయారు చేశాము. మనుషులను చంపే బాక్టీరియా, వైరస్‌, ఇతర పదార్ధాలను సృష్టించేందుకు శాస్త్రవేత్తలు, వైద్యులను తయారు చేయాలనే అవగాహనకు భిన్నంగా మేము పని చేస్తున్నాము అని కాస్ట్రో ఆ సభలో చెప్పాడు. హవానా నగరంలో నిర్వహిస్తున్న లాటిన్‌ అమెరికా మెడికాలేజీ 25వ వార్షికోత్సవాన్ని నవంబరు నెలలో నిర్వహించారు. ‘‘జీవిత సంరక్షకులుమెరుగైన ప్రపంచ సృష్టికర్తలు ’’ అనే ఇతివృత్తంతో ఒక సదస్సును ఏర్పాటు చేశారు. సామాన్య జనం కోసం వైద్యం చేయాలనే లక్ష్యంతో అనేక దేశాల నుంచి విద్యార్థులు అక్కడ చేరుతున్నారు. కరీబియన్‌ ప్రాంతంలోని దేశాలకు తరచూ వస్తున్న హరికేన్‌ల వలన జరుగుతున్న అపార నష్టాన్ని చూసిన తరువాత అలాంటి సమయాల్లో వైద్యుల అవసరాన్ని గుర్తించి ఈ కాలేజీని ప్రారంభించారు. మొత్తం లాటిన్‌ అమెరికా, కొందరు ఆఫ్రికా, అమెరికా నుంచి కూడా వచ్చి చేరుతున్నారు.


గత పాతికేండ్లలో 120దేశాలకు చెందిన వారు 31,180 మంది వైద్యులుగా తయారు కాగా ప్రస్తుతం 1,800 మంది విద్యార్ధులున్నారు. హవానాకు పశ్చిమంగా ఉన్న నౌకా కేంద్రాన్ని కాలేజీగా మార్చారు. మొదటి రెండు సంవత్సరాలు అక్కడ ఆసుపత్రులతో అవసరం లేని బోధన చేస్తారు. నాలుగు సంవత్సరాల పాటు క్యూబాలోని బోధనా ఆసుపత్రులలో శిక్షణ ఇస్తారు. ఈ కాలేజీ విద్యార్థి, ప్రస్తుతం హొండూరాస్‌లో శాస్త్ర, సాంకేతిక శాఖ మంత్రిగా పని చేస్తున్న లూథర్‌ కాస్టిలో హారీ పాతికేండ్ల వార్షికోత్సవంలో మాట్లాడుతూ అసాధ్యాలకు వ్యతిరేకంగా పోరాడినపుడే సుసాధ్యాలతో లబ్దిపొందుతామని, ప్రతి ఒక్కరూ క్యూబా విప్లవ రాయబారిగా పని చేస్తూ ప్రపంచంలో అతి గొప్ప శాస్త్రీయ సంస్థను ఏర్పాటు చేయాలని ఆకాంక్షించాడు.హరికేన్‌ కారణంగా చేపడుతున్న సహాయ చర్యల కారణంగా ఈ ఉత్సవానికి హాజరు కాలేకపోయిన క్యూబా అధ్యక్షుడు మిగుయెల్‌ డియాజ్‌ కానెల్‌ సందేశాన్ని పంపారు. మీ మీ దేశాలలో జీవితాల, ఆరోగ్య సంరక్షకులుగా తయారైన మిమ్మల్ని చూసి ఫిడెల్‌ కాస్ట్రో బతికి ఉంటే ఎంతో సంతోషించేవారన్నాడు. మూడంచెల ఆరోగ్య సంరక్షణ వ్యవస్థలో భాగంగా 69 వైద్య ప్రత్యేక చికిత్స కేంద్రాలు, 149 ఆసుపత్రులు, 451పాలిక్లినిక్‌లు, 11,315 సామాజిక ఆరోగ్య కేంద్రాలు ఉన్నాయి. వీటిలో నాలుగు లక్షల మంది సిబ్బంది పని చేస్తున్నారు. ప్రతివెయ్యి మందికి మొత్తం 80వేల మందిఒక వైద్యుడు లేదా వైద్యురాలు ఉన్నారు. పదమూడు విశ్వవిద్యాలయాలు ఉన్నాయి, 2,767 వైద్య పరిశోధనా ప్రాజెక్టులు, 82క్లినికల్‌ ప్రయోగాలు నడుస్తున్నాయి. నూటఅరవై దేశాలలో ఆరులక్షల మంది క్యూబన్లు వైద్య సేవలు అందిస్తున్నారు.


క్యూబా సర్కార్‌ జనానికి అందిస్తున్న సబ్సిడీ ఆహార పధకాన్ని అదిగో రద్దు చేస్తున్నారు ఇదిగో రద్దు చేస్తున్నారంటూ గత రెండు దశాబ్దాలుగా అమెరికా, దాని ఉప్పు తింటున్న మీడియా కథనాలు రాస్తూనే ఉంది. కొన్ని సందర్భాలలో దుర్వినియోగం జరిగినపుడు పథకాన్ని సవరించటం గురించి మాట్లాడారు తప్ప ఎత్తివేత గురించి కాదు. ఉదాహరణకు ప్రతినెలా 18 ఏండ్లు దాటిన వారికి ఆహార వస్తువులతో పాటు 80 సిగిరెట్లు కూడా నామమాత్ర ధరలకు సరఫరా చేసే వారు. కొందరు పొగతాగని వారు వాటిని తీసుకొని బహిరంగ మార్కెట్లో విక్రయించి సొమ్ము చేసుకొనే వారు. ఇలాంటి వాటిని అరికట్టాలను కోవటం సబ్సిడీ ఎత్తివేత కిందకు రాదు. సోవియట్‌, ఇతర తూర్పు ఐరోపా సోషలిస్టు రాజ్యాలు కూలిపోయిన తరువాత క్యూబా అనేక తీవ్ర సమస్యలను ఎదుర్కొంటున్నమాట నిజం. అవి ఉనికిలో ఉన్నపుడు కూడా ఉన్నదేదో కలసి తింటాం లేకుంటే కాళ్లు ముడుకు పడుకుంటాం తప్ప అమెరికా ముందు చేయిచాచం అని ఫిడెల్‌ కాస్ట్రో దశాబ్దాల క్రితమే చెప్పారు. దానిలో భాగంగానే ఆహార సబ్సిడీ`పంపిణీ పధకాన్ని ప్రారంభించారు. దాన్నే రేషన్‌ బుక్‌ అని పిలుస్తున్నారు. ప్రతి ఏటా ఒక పుస్తక రూపంలో కూపన్లు ఇస్తే దుకాణాల్లో వాటితో సరకులు తీసుకుంటారు.1962 నుంచి ఈ పథకం అమల్లో ఉంది.ప్రతి ఒక్కరికీ ప్రతినెలా బియ్యం, బీన్స్‌, బంగాళాదుంప, అరటికాయలు, బఠాణీ గింజలు, కాఫీ, వంటనూనె, గుడ్లు, మాంసం, కోడి మాంసం, పిల్లలకు పాలు సరఫరా చేస్తున్నారు.2010వరకు సబ్సిడీ ధరలకు సిగిరెట్లు కూడా సరఫరా చేశారు.ఈ మధ్య పోషకాహార లేమివలన క్యూబాలో మరణాల రేటు 2022 నుంచి 2023కు 74.42శాతానికి పెరిగిందంటూ కొన్ని పత్రికలు పతాక శీర్షికలతో వార్తలను ఇచ్చాయి.అక్కడ సంభవిస్తున్న మరణాలకు కారణాలలో పోషకాహార లేమి 20వదిగా ఉంది. ఇంతకూ పైన పేర్కొన్న సంవత్సరాలలో మరణించిన వారి సంఖ్య 43 నుంచి 75కు పెరిగింది(74.42శాతం). కోటి మంది జనాభా, అష్టకష్టాలు పడుతూ,80శాతం ఆహారాన్ని దిగుమతి చేసుకుంటున్న అక్కడ మరణాలు అవి. ప్రపంచానికి ఆహారాన్ని అందచేసే స్థితిలో ఉన్నామని మన ప్రధాని నరేంద్రమోడీ ప్రకటించిన మన దేశంలో 140 కోట్ల జనాభాలో పోషకాహార లేమి కారణంగా ఎందరు మరణిస్తున్నారో తెలుసా ! హిండ్‌రైజ్‌ డాట్‌ ఓఆర్‌జి సమాచారం ప్రకారం మనదేశంలో రోజుకు ఏడువేల మంది మరణిస్తున్నారు. ఐదేండ్లలోపు వయస్సున్న పిల్లల మరణాలలో 69శాతం పోషకాహార లేమి కారణమని కేంద్ర ప్రభుత్వమే స్వయంగా సుప్రీం కోర్టుకు 2022లో తెలిపింది. ఒక సోషలిస్టు వ్యవస్థకు అంతకంటే మెరుగైనది సర్వేజనా సుఖినో భవంతు సమాజం ఉంది అనుకుంటున్న మన వ్యవస్థకు ఉన్న అంతరం ఏమిటో వేరే చెప్పాలా ?


మన దేశంలో ఆహార భద్రతా చట్టం అమల్లో ఉంది. దానిలో భాగంగా 80 కోట్ల మందికి గతంలో సబ్సిడీ బియ్యం లేదా గోధుమలు ఇవ్వగా ఇప్పుడు ఉచితంగా ఇస్తున్నారు. అయినా మనదేశం 2024 ప్రపంచ ఆకలి సూచిక 127దేశాలలో 105వదిగా ఉంది. పదేండ్ల అచ్చేదిన్‌లో ఆకలి తీవ్రంగా ఉన్న దేశాల సరసన మనదేశాన్ని ఉంచిన ఘనత విశ్వగురువు నరేంద్రమోడీకి దక్కింది. వరల్డ్‌ పాపులేషన్‌ రివ్యూ డాట్‌కామ్‌ సమాచారం ప్రకారం 171దేశాల జాబితాలో మన దేశంలో పోషకాహార లోపం ఉన్నవారు 2011లో 18.35 కోట్ల మంది ఉంటే, 2023లో 19.46 కోట్ల మందికి పెరిగారు. నిజానికి ఈ సంఖ్య ఇంకా ఎక్కువ. పోషకాహార లేమి నామమాత్రంగా ఉన్నప్పటికీ ఆయా దేశాలలో 2.5శాతం మంది ఉన్నట్లు లెక్కిస్తారు. అలాంటి దేశాల జాబితాలో చైనా, క్యూబా ఇంకా అనేక దేశాలు ఉన్నాయి. మనదేశంలో పరిస్థితి దారుణంగా ఉన్నప్పటికీ దాన్ని గుర్తించటానికి మోడీ సర్కార్‌ ససేమిరా అంటున్నది.క్యూబా ఆర్థిక పరిస్థితి ఇబ్బందికరంగా మారటానికి, ఇతర సమస్యలకు కారణం అమెరికా విధించిన ఆర్థిక దిగ్బంధనమే. ఆంక్షలను తొలగించాలని ప్రతి ఏటా ఐరాసలో తీర్మానం పెట్టటం, అమెరికా, దాని తొత్తు ఇజ్రాయెల్‌ వ్యతిరేకించటం మిగిలిన దేశాలన్నీ సమర్థించటం తెలిసిందే. అయితే ఐరాస సాధారణ అసెంబ్లీ తీర్మానాలకు పూచికపుల్ల పాటి విలువ కూడా లేదు. వాటిని దిక్కరించిన దేశాలను చేసేదేమీ లేదు. అమెరికా దిగ్బంధనం వలన ప్రపంచంలో మరోదేశమేదీ క్యూబా మాదిరి నష్టపోవటం లేదు. ఎందుకు ఇలా జరుగుతోంది ? ప్రపంచ మంతటా కమ్యూనిజాన్ని అరికడతానంటూ బయలు దేరిన అమెరికన్లకు తమ పెరటితోట వంటి క్యూబాలో కమ్యూనిస్టులు అధికారంలో ఉండటం అవమానకరంగా మారింది. గతంలో డోనాల్డ్‌ ట్రంప్‌ అమలు జరిపిన కఠిన ఆంక్షలను సడలిస్తానని జో బైడెన్‌ ప్రకటించినప్పటికీ అలాంటదేమీ జరగలేదు, పదవీ కాలం ముగియనుంది, తిరిగి ట్రంప్‌ గద్దె నెక్కనున్నాడు. అమెరికా దిగ్బంధనం కారణంగా ప్రతి నెలా క్యూబా 42 కోట్ల డాలర్లు నష్టపోతున్నదని అంచనా, ఎన్నాళ్లీ దుర్మార్గం !

రూపాయి విలువ 101కి పతనం ! జవాబుదారీతనపు జాడలేదు !! గుడ్లప్పగించి చూస్తున్న నరేంద్రమోడీ !!!

Tags

, , , , , ,


ఎం కోటేశ్వరరావు


రూపాయి పతనంలో రికార్డుల మీద రికార్డులను బద్దలు కొడుతుంటే ప్రధాని నరేంద్రమోడీ సర్కార్‌ మాటా పలుకూ లేకుండా గుడ్లప్పగించి చూస్తున్నది. ఏ గుడ్డి గుర్రాలకు పండ్లు తోముతున్నట్లు ? మోడీ అంటే విశ్వగురువు గనుక ఇలాంటి చిన్న చిన్న విషయాలను పట్టించుకోరని, ప్రపంచ రాజకీయాలను చక్కపెడుతున్నారని అనుకుందాం. ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్‌, ఇతర పెద్దలు ఏమయ్యారు. శుక్రవారం నాడు 85.80వరకు పతనమై 85.48దగ్గర స్థిరపడిరది, అంతకు ముందు రోజు 85.27కు దిగజారింది. నరేంద్రమోడీ గురించి చరిత్రలో ఇప్పటికే అనేక వైఫల్యాలు నమోదయ్యాయి.ఒకసారి చెప్పిన మాట మరోసారి చెప్పరు, వైఫల్యం గురించి వాటి వలన జనానికి కలిగిన ఇబ్బందులకు విచార ప్రకటన లేదు. రూపాయి పతనం గురించి తాను మాట్లాడిన మాటలను జనం మరచిపోయి ఉంటారన్న గట్టి నమ్మకం కారణంగానే మాట్లాడటం లేదు. బిజెపి ప్రచార కమిటీ నేతగా 2014 ఎన్నికలకు ముందు రూపాయి పతనాన్ని కాంగ్రెస్‌పై దాడికి ఒక ఆయుధంగా వాడుకున్నారు. విలువలువలువల గురించి నిత్యం తమ భుజాలను తామే చరుచుకొనే సంఘపరివార్‌కు చెందిన వ్యక్తి నుంచి అనేక మంది జవాబుదారీతనాన్ని ఆశించారు, నమ్మారు.వారందరూ కూడా మౌనంగా ఉంటున్నారు, దేశం ఏమై పోతున్నా పట్టని ఈ బలహీనత ఎందుకు ?

రూపాయి విలువ పతనమౌతుంటే గతంలో గుజరాత్‌ ముఖ్యమంత్రిగా నరేంద్రమోడీ ఏమన్నారో తెలుసా ! ‘‘ ఆర్థికం లేదా రూపాయి విలువ పతనం గురించి ప్రభుత్వానికి ఎలాంటి చింత లేదు, తన కుర్చీని ఎలా కాపాడుకోవాలన్నదే దాని ఏకైక ఆందోళన. ఈ కారణంగా దేశం ఈ రోజు ఆశాభంగం చెందింది. గత మూడు నెలలుగా పతనం అవుతున్న రూపాయిని నిలబెట్టేందుకు ప్రభుత్వం ఏ చర్యా తీసుకోలేదు. ఇలా పతనం అవుతుంటే ఇతర దేశాలు దాన్ని అవకాశంగా తీసుకుంటాయి. గడచిన ఐదు సంవత్సరాలుగా ధరలు తగ్గుతాయని, ద్రవ్యోల్బణం అదుపులోకి వస్తుందని ప్రతి మూడు నెలలకు ఒకసారి చెబుతున్నారు తప్ప జరిగిందేమీ లేదు ’’ (2013 ఆగస్టు 20, బిజినెస్‌ స్టాండర్డ్‌ పత్రికలో పిటిఐ వార్త).మోడీ ఈ ఆరోపణలు చేసిన రోజు డాలరుకు రూపాయి విలువ 64.11గా ఉంది, తరువాత కొంత మేరకు పెరిగినా గత పదేండ్లలో మొత్తం మీద చూసినపుడు 2024 డిసెంబరు 27వ తేదీ 85.80కు దిగజారింది. పార్లమెంటులో బిజెపికి, దానికి వంతపాడుతున్న పార్టీల బలాన్ని బట్టి 2029వరకు మధ్యలో అనూహ్య రాజకీయ సంక్షోభం ఏర్పడితే తప్ప ప్రధానిగా మోడీ పదవికి ఎలాంటి ఢోకా ఉండదు. పదేండ్ల క్రితం రూపాయి విలువ పతనం గురించి గుండెలు బాదుకొన్న నరేంద్రమోడీ పదిహేనేండ్లు అధికార వ్యవధిని పూర్తి చేసుకొనే నాటికి 101కి పతనం అవుతుందని ద్రవ్యవ్యాపార నిపుణులు చెబుతున్నారు. రూపాయి పతన చరిత్రను చూసినపుడు ఇంకా ఎక్కువ మొత్తంలో దిగజారేందుకే అవకాశం ఉంది తప్ప బలపడే లక్షణాలు కనిపించటం లేదు. 2024 డిసెంబరు 27న రూపాయి 85.80కి దిగజారి సరికొత్త రికార్డు సృష్టించింది.

ఈ పతనం కొందరికి మోదం ఎందరికో ఖేదాన్ని తెస్తుంది. ఎగుమతులు చేసే వారికి, విదేశాల నుంచి మనదేశానికి డబ్బు పంపేవారికి సంతోషం కలిగిస్తే, విదేశాల నుంచి దిగుమతి చేసుకొనే వస్తువుల భారంతో కోట్లాది సామాన్యులకు జేబు గుల్ల అవుతుంది.అమెరికా అధ్యక్షుడిగా డోనాల్డ్‌ ట్రంప్‌ ఎన్నికయిన నవంబరు ఐదున రూపాయి విలువ 84.11 ఉంటే డిసెంబరు చివరి వారంలో ముందే చెప్పుకున్నట్లు 85.80ని తాకింది. జనవరి 20న అధికారాన్ని స్వీకరించే సమయానికి, తరువాత ఏమౌతుందో తెలియదు. రూపాయి విలువ పతనాన్ని అరికట్టేందుకు రిజర్వుబాంకు రంగంలోకి దిగి విదేశీ కరెన్సీ విక్రయాలకు పాల్పడి స్థిరంగా ఉండేట్లు చేస్తుంది. ఇప్పుడూ చేసింది, గతంలోనూ చేసింది, అయినప్పటికీ మొత్తం మీద పతనం ఆగటంలేదు. దేశం వెలిగిపోతోంది అని బిజెపి చెప్పుకున్న వాజ్‌పాయి ఏలుబడిలో 2000 సంవత్సరంలో రూపాయి విలువ 43.35 ఉంది. అది మన్మోహన్‌ సింగ్‌ అధికారానికి వచ్చిన 2004లో 45.10, మోడీ పదవీ స్వీకారంచేసిన 2014లో 62.33గా ఉంది. ఇప్పుడు 85.80 దగ్గర ఉంది.1947లో స్వాతంత్య్రం వచ్చినపుడు రూపాయి విలువ డాలరుకు 3.30 ఉంది. మోడీ అధికారానికి వస్తే ఆయనకు ముఖ్యమంత్రిగా ఉన్న అనుభవంతో రూపాయిని 45కు తిరిగి తీసుకువస్తారని అనేక మంది పండితులు జోశ్యాలు చెప్పారు. గల్లా పట్టుకు అడుగుదామంటే వారెక్కడా ఇప్పుడు మనకు కనిపించరు. మోడీ నోరుతెరవరు.

రూపాయి పతనంతో జన జీవితాలు అతలాకుతలం అవుతుంటే ఇతర కొన్నింటితో పోల్చితే మన కరెన్సీ పతనం తక్కువ అని అధికారపార్టీ పెద్దలు గొప్పలు చెప్పుకుంటున్నారు. వీళ్లను ఏమనాలో అర్ధం కాదు. దాని వలన మనకు ఒరిగేదేమిటి ? పెట్రోలు, డీజిలు లేకపోతే క్షణం గడవదు. వర్తమాన ఆర్థిక సంవత్సరం ఏప్రిల్‌ నెలలో మనం దిగుమతి చేసుకున్న ముడి చమురు పీపా ధర రవాణా ఖర్చులను కూడా కలుపుకొని 89.44 డాలర్లు, అది నవంబరు నెలలో 73.02కు తగ్గింది.తొమ్మిది నెలల సగటు చూసినా 79.20 డాలర్లు. ఈ మేరకు పెట్రోలు, డీజిలు ధరలను ఎందుకు తగ్గించలేదు, కారణం జనం పట్టించుకోకపోవటమే. నిలబెట్టి జేబులు కత్తిరిస్తున్నా మౌనంగా భరిస్తున్నారు. అంతర్జాతీయ మార్కెట్లో ధర పెరిగితే పెంచుతాం, తగ్గితే తగ్గిస్తాం అన్న విధానాన్ని ఎందుకు పక్కన పెట్టినట్లు ? రూపాయి విలువ పతనంతో వ్రతం చెడ్డా ఫలం దక్కనట్లు మన ఎగుమతులు ఇబ్బడి ముబ్బడిగా పెరిగి మన విదేశీ వాణిజ్య లోటు తగ్గుతున్నదా అంటే ఆ జాడలేదు. రూపాయి పతనం ఎంత పెరిగితే అంతగా ద్రవ్యోల్బణంధరల పెరుగుదల ఉంటుంది. డాలర్లు, ఇతర కరెన్సీలను రప్పించేందుకు విదేశాల్లో ఉన్న భారతీయుల బ్యాంకు డిపాజిట్లపై వడ్డీ రేపు పెంపుదలకు ఆర్‌బిఐ అనుమతిస్తున్నది. అమెరికాలో వడ్డీ రేటు కోత, రూపాయి విలువ పతనం కారణంగా విదేశీ పెట్టుబడులు వెనక్కు వెళుతున్నాయి. మన స్టాక్‌ మార్కెట్‌ కుప్పకూలటానికి ఇదొక కారణం. ముడిచమురు, ఎలక్ట్రానిక్స్‌, పరిశ్రమల యంత్రాల దిగుమతులకు ఎక్కువ చెల్లించాల్సి ఉంటుంది. వస్తు ఎగుమతిదార్లు, ఐటి రంగ కంపెనీలు ప్రధాన లబ్దిదారులుగా ఉంటున్నాయి.

రూపాయి విలువ పతనం చెందినప్పుడల్లా పండితుల జోశ్యాలు చెబుతారు. అవి కూడా పరిస్థితి ఉన్నది ఉన్నట్లుగా ఉంటే అనే ప్రాతిపదిక మీద చెప్పేవే. లాంగ్‌ ఫోర్‌కాస్ట్‌ డాట్‌ కాం గతంలో చెప్పిన జోశ్యం ప్రకారం 2025 జనవరిలో 79.79తో ప్రారంభమై ఏడాది చివరికి 86.97గా ఉంటుందని పేర్కొన్నది. జనవరిలో రూపాయి విలువ పెరగాలి. ఏఐ పికప్‌ అనే సంస్థ 2027 నాటికి రూపాయి 74.97కు బలపడుతుందని చెప్పింది. అయితే 2024లో రికార్డు పతనం 84.35 తరువాత 2030లో 72.6కు బలపడుతుందట.కృత్రిమ మేథ జోశ్యాలు తప్పు కావచ్చని కూడా కొందరు హెచ్చరించారు. రానున్న సంవత్సరాలలో ఏడాది ప్రారంభం, చివరిలో రూపాయి ముగింపు విలువలు దిగువ విధంగా ఉంటాయి. దిగువ పట్టికలో మొదటి వరుస జోశ్యం లాంగ్‌ ఫోర్‌కాస్ట్‌ డాట్‌ కాంది కాగా, రెండవ వరుసలో ఉన్నది వాలెట్‌ ఇన్వెస్టర్‌ డాట్‌కాం అంకెలుగా గమనించాలి
.ఏడాది–జనవరి– డిసెంబరు
2024– RRRR– 85.06
2025– 85.27– 86.67
2025II 84.62II 88.13
2026II 86.27II 87.16
2026II 87.89II 91.40
2027II 88.60II 96.78
2027II 91.16II 94.66
2028II 96.09II 98.68
2028II 94.47II 97.92
2029II 97.41II RRRRR
2029II 97.77II 101.20
ఇవే గాక అనేక సంస్థలు తమ తమ అంచనాలను చెబుతున్నాయి. ఎవరు చెప్పినా అంకెల తేడాలున్నప్పటికీ పతనం వాస్తవం.రూపాయి పతనాన్ని అరికట్టేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ఆర్‌బిఐ చెబుతున్నప్పటికీ ఎలాంటి ఫలితం కనిపించటం లేదు. వర్తమాన ఆర్థిక సంవత్సరంలో డాలరుకు 84 దాటకుండా చూడాలని లక్ష్యంగా చెప్పుకున్నప్పటికీ ఇప్పటికే 86వరకు రావటాన్ని చూశాము.రోగనిరోధక శక్తి సన్నగిల్లితే అన్ని రకాల జబ్బులు వస్తున్నట్లు కరెన్సీ విలువ పతనం కూడా ఆర్థిక వ్యవస్థకు అలాంటిదే. ప్రస్తుతం ఈ పరిస్థితి తలెత్తటానికి మూడు ప్రధాన కారణాలను చెబుతున్నారు. విదేశీ మదుపుదార్లు(ఎఫ్‌ఐఐ) స్టాక్‌, రుణ మార్కెట్ల నుంచి తమ పెట్టుబడులను వెనక్కు తీసుకొని ఎక్కడ లాభాలు వస్తే అక్కడికి తరలిస్తుండటం. అవి డాలర్ల రూపంలో ఉండటంతో వాటికి డిమాండ్‌ పెరిగి రూపాయి విలువ తగ్గుతున్నది. అమెరికాలో డోనాల్డ్‌ ట్రంప్‌ అధ్యక్షుడిగా ఎన్నిక, అక్కడ వడ్డీ రేట్లను పెంచటంతో మదుపుదార్లందరూ ప్రభుత్వ బాండ్ల కొనుగోలుకు ఎగబడుతున్నారు. వారి చెలగాటం మన వంటి ఆర్థిక వ్యవస్థలకు ప్రాణ సంకటం. మోడీని ఆయన భక్తులు విశ్వగురువుగా కీర్తిస్తున్నప్పటికీ ఉక్రెయిన్‌ సంక్షోభం, మధ్య ప్రాచ్యంపశ్చిమాసియాలో ఉద్రిక్తతలు, తమకు లొంగని దేశాలపై ట్రంప్‌ బెదిరింపులు, వాణిజ్య పోరు వంటి అనేక సమస్యలు కూడా అనేక దేశాల కరెన్సీల విలువ పతనానికి కారణం అవుతున్నాయి. వాటిని పరిష్కరించటంలో ఎవరూ కూడా మోడీ ప్రమేయాన్ని కోరటం లేదు.

రూపాయి పతనం వలన లబ్ది కంటే మనకు నష్టమే ఎక్కువ.ద్రవ్యోల్బణం, దాంతో ధరల పెరుగుదలకు దారితీస్తుంది.దీని వలన కొనుగోలు శక్తి తగ్గుతుంది. చమురు దిగుమతి బిల్లు పెరిగి అందరి మీదా భారం పెరుగుతుంది. విదేశాల నుంచి రుణాలు పొందిన కంపెనీల మీద భారం పెరుగుతుంది, పరోక్షంగా పెట్టుబడుల మీద కూడా ప్రతికూల ప్రభావం పడుతుంది. రూపాయి విలువ పతనం కాకుండా కాపాడేందుకు ఆర్‌బిఐ తన వద్ద ఉన్న విదేశీ మారకద్రవ్యంలో కొన్ని డాలర్లను విక్రయిస్తుంది, దాంతో వాటి సరఫరా పెరిగి రూపాయి విలువ స్థిరంగా ఉంటుందన్నది ఆశ. అయితే తాత్కాలికంగా కొద్ది రోజులు అలా ఉన్నప్పటికీ పతనం సాగుతూనే ఉంది. అదే విధంగా రూపాయల కొనుగోలు, వడ్డీల సవరణ ద్వారా విలువను పెంచేందుకు చూసినా పెద్దగా ఫలితం ఉండటం లేదు. గడచిన ఇరవై సంవత్సరాల్లో సగటున ఏటా 3.2శాతం పతనం అవుతున్నది.ట్రంప్‌ ఏలుబడి నాలుగేండ్ల కాలంలో 810శాతం వరకు రూపాయి పతనం చెందవచ్చని ఎస్‌బిఐ పరిశోధన విశ్లేషణ తెలిపింది. కనీసం ఈ పతనాన్ని అయినా నరేంద్రమోడీ నివారించగలరా ? వంది మాగధుల భజనలతో కాలక్షేపం చేస్తారా ? రోమ్‌ తగులబడుతుంటే ఫిడేలు వాయించిన నీరో చక్రవర్తి మాదిరి ఉంటారా ?

సాకు ఎమెన్‌ హౌతీలు అసలు లక్ష్యం ఇరాన్‌పై దాడి ?

Tags

, , , , , ,

ఎం కోటేశ్వరరావు

ఆదివారం నాడు మధ్య ప్రాచ్యంలోని ఎర్ర సముద్రంలో అమెరికా నౌకాదళ యుద్ధ విమానం ఒకటి కూలిపోయింది. పొరపాటున దాన్ని తమ దళాలే కూల్చివేసినట్లు అమెరికా ప్రకటించగా, తామే కూల్చివేసినట్లు రాజధాని సనా నగరంతో సహా కీలకమైన ప్రాంతాలను అదుపులో ఉంచుకున్న హౌతీ సాయుధ దళం ప్రకటించింది. మరోవైపు హౌతీలు ప్రయోగించిన క్షిపణులను తమ రాడార్లు పసిగట్టలేకపోయాయని, ఫలితంగా కొద్ది మంది తమ పౌరులు గాయపడినట్లు ఇజ్రాయెల్‌ ప్రకటించింది. ఈ రెండు పరిణామాలు అమెరికా, ఇజ్రాయెల్‌ బలహీనతలను వెల్లడిరచాయి. గత కొద్ది రోజులుగా అమెరికా, ఇజ్రాయెల్‌ దళాలు ఎమెన్‌పై వైమానిక దాడులు జరుపుతున్నాయి. సిరియాలో బాత్‌ పార్టీ నేత అసద్‌ సర్కార్‌ కూలిపోయిన తరువాత ఈ పరిణామం చోటు చేసుకుంది.హౌతీలకు బదులు వారి వెనుక ఉన్న ఇరాన్‌ సంగతే చూడాలంటూ ఇజ్రాయెల్‌ గూఢచార సంస్థ మొసాద్‌ అధిపతి డేవిడ్‌ బర్నెయా తమ నేతలకు సూచించాడు. దీన్ని బట్టి ఇరాన్‌పై దాడికి పూనుకున్నట్లు అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. గత ఏడాది కాలంగా ఎమెన్‌ కేంద్రంగా పని చేస్తున్న హౌతీలు జరుపుతున్న దాడుల తీరుతెన్నులను చూస్తే వారిని అణచివేయటం అంతతేలిక కాదని నిపుణలు చెబుతున్నారు.వారు ఇజ్రాయెల్‌ రాజధాని టెల్‌అవీవ్‌ మీద ప్రయోగించిన క్షిపణులు రెండు వేల కిలోమీటర్లు ప్రయాణించి భారీ నష్టం కలిగించాయి. లెబనాన్‌ కేంద్రంగా పని చేస్తున్న హిజబుల్లా కంటే వీరు శక్తివంతులని తేలింది. ఈ పూర్వరంగంలో ఒకేసారి ఇరాన్‌ఎమెన్‌ మీద దాడులకు దిగితే రాగల పరిణామాలు, పర్యవసానాల గురించి అమెరికా కూటమి మల్లగుల్లాలు పడుతున్నట్లు చెప్పవచ్చు. మధ్యప్రాచ్య పరిణామాలు ఏ మలుపు తిరిగేదీ ఇంకా స్పష్టంగా తెలియటం లేదు.

ఎర్ర సముద్ర తీరం ఒకవైపు, మరోవైపు అరేబియా సముద్రం సరిహద్దులుగా కీలక ప్రాంతంలో ఉన్న పశ్చిమాసియాలోని ఎమెన్‌ తొలుత బ్రిటన్‌ తరువాత అమెరికా సామ్రాజ్యవాదుల కుట్రకు బలైంది. అంతర్యుద్ధం తరువాత ఉత్తర, దక్షిణ ఎమెన్‌లు 1990లో విలీనమైన తరువాత తిరిగి అంతర్యుద్ధం ప్రారంభమైంది.ప్రస్తుతం వివిధ దేశాల మద్దతు ఉన్న పక్షాల ఆధీనంలో ఎమెన్‌ ఉంది. ప్రభుత్వ ఆధీనంలో మెజారిటీ ప్రాంతం ఉన్నప్పటికీ దానిలో ఎక్కువ భాగం ఎడారి, తరువాత ఇరాన్‌ మద్దతు ఉన్న హౌతీలు, యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ మద్దతున్న సాయుధులు, పరిమిత ప్రాంతంలో ఆల్‌ఖైదా, మరో రెండు సాయుధ శక్తుల ఆధీనంలో రెండు ప్రాంతాలు ఉన్నాయి. మధ్యధరా సముద్రం నుంచి సూయజ్‌ కాలువ ద్వారా ఎర్ర సముద్రం ఏడెన్‌ సంధి దగ్గర అరేబియా సముద్రం కలుస్తాయి. నౌకా రవాణాకు కీలకమైన ఈ ప్రాంతాన్ని ఆనుకొని ఎమెన్‌ రాజధాని సనాతో సహా కీలకమైన ప్రాంతాలు హౌతీల చేతుల్లో ఉన్నాయి. ఇటీవలి వరకు వీరిని వ్యతిరేకించే ప్రభుత్వ దళాలకు సౌదీ అరేబియా మద్దతు ఇచ్చింది. గతంలో దక్షిణ ఎమెన్‌ ప్రాంతానికి సౌదీ రక్షితదారుగా ఉంది. తరువాత చైనా మధ్యవర్తిత్వంలో ఇరాన్‌సౌదీ అరేబియా ఒక ఒప్పందానికి వచ్చిన తరువాత సౌదీ అరేబియా జోక్యం నిలిచిపోయింది. పాలస్తీనాకు గట్టి మద్దతుదారుగా ఉన్న హౌతీల ఆధీనంలోని ఎమెన్‌ ఇటీవలి కాలంలో ఇజ్రాయెల్‌ దుశ్చర్యలను అడ్డుకుంటున్నది. ఎర్ర సముద్ర ప్రాంతంలో పాలస్తీనాకు వ్యతిరేకంగా ఇజ్రాయెల్‌కు వచ్చే, మద్దతు ఇచ్చే దేశాల నౌకలను అడ్డుకోవటం ద్వారా వత్తిడి తెస్తున్నది. ఈ కారణంగానే సూయజ్‌ కాలువ లేకముందు మన దేశానికి వచ్చే నౌకలు ఆఫ్రికా ఖండంలోని గుడ్‌హోప్‌ ఆగ్రాన్ని చుట్టి వచ్చినట్లుగా ఇప్పుడు కూడా అనేక దేశాల నౌకలు చుట్టుతిరిగి వస్తున్నాయి.ఈ కారణంగానే మధ్య ధరా, ఎర్ర సముద్రాల్లో తిష్టవేసిన అమెరికా మిలిటరీ ఎమెన్‌పై దాడులకు పాల్పడుతున్నది.తమపై జరుపుతున్న క్షిపణి దాడులకు ప్రతిగా ఇజ్రాయెల్‌ కూడా దాడులకు దిగింది.తొలిసారిగా రాజధాని సనా నగరం మీద బాంబులు కురిపించింది.

ఇరాన్‌పై ఎంత బలమైన దాడులు జరిపామో అదే విధంగా ఎమెన్‌పై కూడా చేసి తీరుతామని ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహు ఆదివారం నాడు ప్రకటించాడు.హౌతీలు ప్రయోగించిన క్షిపణులతో ఇజ్రాయెల్‌ పౌరులు వణికిపోయారు. ఎందుకంటే చీమ చిటుక్కుమన్నా తమపైకి వచ్చే ప్రతి క్షిపణిని మధ్యలోనే కూల్చివేసే సామర్ధ్యం తమకుందని చెబుతున్న వారు శనివారం రాత్రి రాజధాని టెల్‌అవీవ్‌పై జరిగిన దాడిని పసిగట్టలేకపోయినట్లు స్వయంగా అంగీకరించారు. కేవలం పదహారు మంది గాయపడ్డారని మాత్రమే చెబుతున్నప్పటికీ అంతకంటే ఎక్కువే నష్టం జరిగినట్లు వార్తలు వచ్చాయి. గురువారం నాడు కూడా క్షిపణి దాడిని సూచిస్తూ దేశంలోని అనేక ప్రాంతాల్లో సైరన్లు మోగించారు. జరిగిన నష్టాన్ని యంత్రాంగం మూసిపెడుతున్నది. టెహరాన్‌ మద్దతుదారులపై ఎందుకు ఏకంగా ఇరాన్‌పైనే దాడులకు దిగాలని ఇజ్రాయెల్‌ యుద్ధ దురహంకారులు రంకెలు వేస్తున్నారు. యుద్ధ కాబినెట్‌ సమావేశం తరువాత నెతన్యాహు మాట్లాడుతూ హౌతీలపై దాడుల్లో తాము ఒంటరి కాదని, గత ఏడాదిగా అమెరికా, బ్రిటన్‌ దళాలు కూడా ఉన్నాయని చెప్పాడు. కాస్త సమయం తీసుకున్నప్పటికీ గాజాలోని హమస్‌, లెబనాన్‌లోని హిజబుల్లా మాదిరి దెబ్బతీస్తామని అన్నాడు. 2023 అక్టోబరు ఏడున గాజాలో మారణకాండ ప్రారంభమైన నాటి నుంచి హౌతీలు దాడులు చేస్తున్నారు. ఇప్పటి వరకు 200 క్షిపణులు, 170డ్రోన్లు ప్రయోగించినట్లు చెబుతున్నారు.ఎర్ర సముద్రంలోకి రాకుండా వంద వాణిజ్య నౌకల మీద కూడా దాడులు చేశారు. ఇదిలా ఉండగా ఇరాన్‌ మీద కొనసాగిస్తున్న తప్పుడు ప్రచారంలో భాగంగా ఆ దేశం అణ్వాయుధాల తయారీకి పూనుకున్నదని మరోసారి అమెరికా ఆరోపించింది. తాము శాంతియుత ప్రయోజనాల కోసం అణుకార్యక్రమాన్ని అమలు చేస్తున్నామని, అయితే గతంలో ట్రంప్‌ అధికారంలో ఉన్నపుడు అంతకు ముందు కుదిరిన ఒప్పందాల నుంచి ఏకపక్షంగా వైదొలగి, తమ మీద విధించిన ఆంక్షల కారణంగా యురేనియం శుద్దికి పూనుకున్నట్లు ఇరాన్‌ అంటోంది.

ఆదివారం నాడు అమెరికాకు చెందిన ఎఫ్‌18 యుద్ధ విమానాన్ని కూల్చివేశామని, ఎమెన్‌పై అమెరికా, బ్రిటన్‌ దాడులను అడ్డుకున్నామని హౌతీ మిలిటరీ ప్రతినిధి యాహ్యా శారీ ప్రకటించాడు. అమెరికా విమానవాహక నౌక హారీ ఎస్‌ ట్రూమన్‌, ఇతర అనేక అనుబంధ నౌకలు శనివారం నుంచి దాడులు ప్రారంభించినట్లు పేర్కొన్నాడు. విమానాన్ని కూల్చివేసేందుకు తాము ఎనిమిది క్షిపణులు, 17 డ్రోన్లను వినియోగించినట్లు వెల్లడిరచాడు. అయితే తమ విమానాన్ని తామే కూల్చివేసినట్లు అమెరికా చెప్పుకుంది. అయితే అది ఎలా జరిగిందన్నది మాత్రం వెల్లడిరచలేదు.శనివారం నాడు ఎమెన్‌లోని క్షిపణి కేంద్రాల మీద దాడులు చేసినట్లు చెప్పుకుంది.తమ, ప్రాంతీయ భాగస్వాముల, అంతర్జాతీయ నౌకల ప్రయోజనాల రక్షణకే దాడులు చేస్తున్నట్లు పేర్కొన్నది. ఎర్ర సముద్ర ప్రాంతంలో హౌతీలు దాడులను ముమ్మరం చేయటంతో అమెరికా తీవ్ర వత్తిడికి లోనైన కారణంగానే తమ స్వంత విమానాన్ని కూడా గుర్తించలేని ఆత్రత కారణంగా స్వయంగా కూల్చివేసినట్లు నిపుణులు చెబుతున్నారు.ఈ పరిస్థితి కారణంగా రానున్న రోజుల్లో దాని దాడుల సామర్ధ్యం తగ్గే అవకాశం ఉందంటున్నారు. ముఖ్యంగా ప్రత్యర్ధుల వైపు నుంచి మానవరహిత ఆయుధాల ప్రయోగ సమయంలో ఇలాంటి తప్పిదాలు మరింత ఎక్కువగా జరిగే అవకాశం ఉంది.అమెరికా సూపర్‌ హార్నెట్‌ విమానాన్ని యుఎస్‌ఎస్‌ హారీ ఎస్‌ ట్రూమన్‌ నౌక నుంచి ప్రయోగించగా ఆ నౌకకు కాపలాగా అనుసరించే గెటీఎస్‌బర్గ్‌ అనే మరో నౌక రాత్రి మూడు గంటల సమయంలో నియంత్రిత క్షిపణి ద్వారా కూల్చివేసింది. అయితే ఇద్దరు పైలట్లు సురక్షితంగా ఉన్నట్లు ప్రకటించింది. ఈ అసాధారణ ఉదంతం హౌతీల నుంచి ప్రయోగించిన క్షిపణులు, డ్రోన్లను ఎదుర్కొనే క్రమంలో జరిగింది.తమవైపు వస్తున్నది శత్రువులదా లేక మిత్రులదా అన్నది గుర్తించటంలో అమెరికా మిలిటరీ విఫలమైంది.హౌతీల దాడులు తగ్గకపోవటంతో గత గురువారం నాడు ఎమెన్‌ రిజర్వుబాంకు, మరికొన్ని కంపెనీల మీద అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ సరికొత్త ఆంక్షలు ప్రకటించాడు.


సిరియాలో తాము మద్దతు ఇస్తున్న అసద్‌ ప్రభుత్వం కూలిపోయినప్పటికీ ప్రతిఘటన కొనసాగించాల్సిందేనని ఇరాన్‌ భావిస్తున్నది. ప్రతిఘటించే దేశాల కూటమి కుప్పకూలిపోయినట్లు ఎవరైనా భావిస్తే పొరపాటని అధినేత అయాతుల్లా అలీ ఖమేనీ చెప్పాడు. లెబనాన్‌లో హిజబుల్లా సాయుధ సంస్థ మీద ఇజ్రాయెల్‌ దాడులు చేస్తున్నప్పటికీ ఇప్పటికీ సజీవంగానే ఉందన్నాడు.ఇజ్రాయెల్‌ను వ్యతిరేకించే సిరియాలో ప్రభుత్వం పతనమై నూతన శక్తులు అధికారానికి వచ్చాయి. వాటి వైఖరి, ఆచరణ ఎలా ఉంటుందో చూడాల్సి ఉంది. ఈ లోగా కొంత మంది పశ్చిమదేశాల వారు చైనాఇరాన్‌ సంబంధాల గురించి మాట్లాడుతున్నారు.ఇరాన్‌ బలహీన పడినందున ఇప్పటి మాదిరి చైనా దానికి మద్దతుగా ఉండకపోవచ్చని, పశ్చిమదేశాల మార్కెట్‌ను వదులు కొనేందుకు సిద్ధపడదంటూ కొందరు, ఇరాన్‌తో సంబంధాలను చూపి పశ్చిమదేశాలతో ఒప్పందాలు చేసుకోవచ్చన్న విపరీత వ్యాఖ్యానాలు కూడా చేశారు. రెండు దేశాలూ అమెరికా, ఇతర పశ్చిమ దేశాల సామ్రాజ్యవాదుల దాడులు, ఆర్థిక ఆంక్షలకు గురవుతున్నాయి, వాణిజ్య పోరును ఎదుర్కొంటున్నాయి. సామ్రాజ్యవాద వ్యతిరేకత అన్న అంశమే వారి మధ్య బంధం పెరగటానికి కారణం. పాతిక సంవత్సరాల సహకార ఒప్పందం రెండు దేశాల మధ్య 2021లో కుదిరింది. ఉప్పు నిప్పుగా ఉన్న ఇరాన్‌సౌదీ మధ్య సయోధ్య కుదిర్చి ప్రపంచాన్ని ఆశ్చర్యపరచింది. తాత్కాలికంగా మధ్య ప్రాచ్యంలో ఇరాన్‌ బలహీనపడినంత మాత్రాన దాన్ని వదలివేసే అవకాశాలు లేవని చైనా తీరుతెన్నులను చూసినపుడు అర్ధం అవుతుంది. మరింత పటిష్టపరుచుకోవటం, ఆ ప్రాంతంలో అమెరికా, దాని తొత్తు దేశాలను ఎదుర్కోవటం ఎలా అన్న అంశం రానున్న రోజుల్లో కచ్చితంగా ప్రాధాన్యత సంతరించుకుంటుంది. దీనిలో భాగంగానే బ్రిక్స్‌, షాంఘై సహకార సంస్థలోకి ఇరాన్‌కు షీ జింపింగ్‌ ఆహ్వానం పలికాడు.


సిరియాలో అసద్‌ ప్రభుత్వం కూలిపోయినంత మాత్రాన అక్కడ అధికారానికి వచ్చిన శక్తులు అమెరికా ఒళ్లో వాలిపోతాయని, ఇజ్రాయెల్‌కు దాసోహమంటాయని చెప్పలేము. తొలుత అక్కడ ఒక స్థిరమైన ప్రభుత్వం ఏర్పడాలి. ఆ తరువాతే దాని బాట ఎటు అన్నది స్పష్టం అవుతుంది. అమెరికా అనుకూల దేశంగా ఉన్న సౌదీ అరేబియా నాటకీయ పరిణామాల మధ్య దాన్ని ధిక్కరించి రష్యాకు దగ్గరైంది.చైనా అధినేత షీ జింపింగ్‌ను ఆహ్వానించి తాము అమెరికాతో అంటకాగేది లేదన్న సందేశమిచ్చింది. చైనా చొరవతో చిరకాల ప్రత్యర్థిగా ఉన్న ఇరాన్‌తో సయోధ్య కుదుర్చుకుంది. ఇది మధ్య ప్రాచ్యంలో చైనా చొరవలో ఒక మైలు రాయి, అమెరికాకు ప్రత్యక్షంగా కనిపిస్తున్న ఎదురుదెబ్బ. అమెరికా ఆర్థిక ఆంక్షలు, రాజకీయ వంటరితనం నుంచి ఇరాన్‌ కొంత మేర బయటపడిరది. చైనాను దెబ్బతీసేందుకు అమెరికా నాయకత్వంలోని పశ్చిమదేశాలు నిరంతరం ప్రయత్నిస్తున్న పూర్వరంగంలో ప్రతి ప్రాంతంలోనూ వాటిని ప్రతిఘటించే శక్తిగా చైనా ముందుకు వస్తోందని ఇటీవలి అనేక పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. డోనాల్డ్‌ ట్రంప్‌ రెచ్చగొట్టే చర్యలతో చైనాఇరాన్‌రష్యా మరింత దగ్గరవుతాయి. ట్రంప్‌ తన యంత్రాంగంలోకి ఎంచుకున్న వ్యక్తుల తీరుతెన్నులను చూసినపుడు అసలే కోతి ఆపైన కల్లుతాగింది అన్నట్లుగా వారి చర్యలుంటాయని వేరే చెప్పనవసరం లేదు.