చిన్న దేశం-పెద్ద సందేశం : ఉరుగ్వేలో మరోసారి వామపక్ష జయకేతనం !

Tags

, , , , , ,

ఎం కోటేశ్వరరావు

లాటిన్‌ అమెరికాలోని ఉరుగ్వే అధ్యక్ష, పార్లమెంటు ఎన్నికల్లో అక్కడి వామపక్ష కూటమి ‘‘విశాల వేదిక ’’ (బ్రాడ్‌ ఫ్రంట్‌) మరోసారి విజయం సాధించింది.గతంలో 2005 నుంచి 2020వరకు అధికారంలో ఉన్న ఈ కూటమి ఐదు సంవత్సరాల క్రితం మితవాద శక్తుల చేతిలో ఓటమి పాలైంది.ఈ సారి తిరిగి అధికారానికి వచ్చింది. అక్టోబరు 27న జరిగిన ఎన్నికల్లో నిబంధనల ప్రకారం 50శాతంపైగా ఓట్లు ఏ అభ్యర్థికి రాకపోవటంతో తొలి రెండు స్థానాల్లో ఉన్న వారి మధ్య నవంబరు 24న తుది ఎన్నిక జరిగింది. విశాల వేదిక కూటమి అభ్యర్ధి, గతంలో చరిత్ర అధ్యాపకుడిగా, మేయర్‌గా పనిచేసిన యమండు ఆర్సి(57) 52.08శాతం ఓట్లతో గెలిచారు. తొలి రౌండులో 46.12శాతం తెచ్చుకున్నారు. పార్లమెంటు ఉభయ సభల్లో దిగువ సభ ఛాంబర్‌లో 99 డిప్యూటీల స్థానాలకు గాను ఆర్సి నాయకత్వంలోని కూటమికి 48, ఎగువ సభ సెనెట్‌లోని 30 సీట్లకు గాను 16 వచ్చాయి. తొలి రౌండులో ప్రత్యర్థులుగా ఉన్న రెండు మితవాద పార్టీల అభ్యర్థులు ఇద్దరికి కలిపినా 45.09శాతమే రావటంతో తుదిపోరులో వామపక్ష అభ్యర్థి విజయం ఖాయంగా కనిపించినప్పటికీ పోటీ తీవ్రంగా మారింది. మీడియా, ఇతర శక్తులు వామపక్ష వ్యతిరేకతను ఎంతగా రెచ్చగొట్టినప్పటికీ విశాల వేదిక విజయాన్ని అడ్డుకోలేకపోయాయి. నూతన ప్రభుత్వం 2025 మార్చి ఒకటవ తేదీన కొలువుతీరనుంది.స్వేచ్చా, సమానత్వం, సౌభ్రాత్వత్వం మరోసారి విజయం సాధించింది, ఈ మార్గాన్నే పయనిద్దాం అంటూ తన విజయం ఖరారు కాగానే వేలాది మంది మద్దతుదార్లతో యమండు అర్సీ తన ఆనందాన్ని పంచుకున్నాడు.గత ఐదు సంవత్సరాలలో తాము వామపక్ష సంఘటన కంటే ఎక్కువే చేశామని అధికారపక్ష రిపబ్లికన్‌ కూటమి చేసిన ప్రచారాన్ని ఓటర్లు ఆమోదించలేదు. తమ ఏలుబడిని చూసి ఐదేండ్ల కాలంలో జరిగిన కుంభకోణాలను జనం మరచిపోతారని అది భావించింది.తమను మరోసారి ఎందుకు ఎన్నుకోవాలో ఓటర్లకు చెప్పలేకపోయింది.

ఉరుగ్వే నిబంధనల ప్రకారం ప్రతి ఒక్కరూ విధిగా ఓటు హక్కును వినియోగించుకోవాలి. సరైన కారణాలు చూపకుండా ఓటు వేయని వారికి జరిమానా, ఇతర అనర్హతలకు గురౌతారు. దేశంలో 35లక్షల మంది జనాభా ఉండగా పద్దెనిమిదేండ్లు దాటిన ఓటర్లు 27లక్షలకుపైగా ఉండగా 24లక్షలకు పైగా ఓటు వేశారు. ఏ అభ్యర్థి నచ్చకపోతే ఖాళీ బ్యాలట్‌ పత్రాలను పెట్టెల్లో వేయవచ్చు. ఒకేసారి అధ్యక్ష, పార్లమెంటు ఉభయ సభలకు ఎన్నికలు జరుగుతాయి గనుక ప్రతి ఒక్కరూ తొలి రౌండులో మూడు ఓట్లు వేయాల్సి ఉంటుంది.పార్లమెంటు ఎన్నికలు దామాషా ప్రాతినిధ్య పద్దతిలో జరుగుతాయి.పార్లమెంటు ఎన్నికల్లో విశాల వేదిక కూటమికి 43.94శాతం ఓట్లు వచ్చాయి. రద్దయిన సభలో ఉన్న సీట్లతో పోల్చితే దిగువ సభలో 42 నుంచి 48కి, ఎగువ సభలో 13 నుంచి 16కు పెరిగాయి. అధ్యక్ష పదవికి వేసిన ఓటునే ఉపాధ్య పదవి అభ్యర్థికి కూడా వర్తింప చేస్తారు. ఆ విధంగా కరోలినా కోసె ఎన్నికయ్యారు. ఎలక్ట్రికల్‌ ఇంజనీరైన ఆమె విద్యార్థిగా ఉన్నపుడు యువ కమ్యూనిస్టు లీగ్‌లో పనిచేశారు. తాజా ఎన్నికలలో విశాల వేదిక తరఫున ఎవరిని అభ్యర్థిగా నిలపాలన్న చర్చ వచ్చినపుడు యమందు ఆర్సికరోలినా పేర్లను పరిగణనలోకి తీసుకున్నారు. ఆమెను అభ్యర్థిగా నిలిపితే గ్రామీణ ప్రాంతాలలో ఓటర్లు మొగ్గుచూపకపోవచ్చని, గత ఎన్నికల్లో ఆ కారణంగానే ఫ్రంట్‌ ఓడిరదని, ఈ సారి ఆర్సితో ఆ లోపాన్ని సరి చేయాలని మాజీ అధ్యక్షుడు ముజికా సూచించటంతో ఆమెను ఉపాధ్యక్షురాలిగా నిలిపారు. గతంలో ఆమె మంత్రిగా పనిచేశారు. పార్లమెంటు దిగువ సభలో ఫ్రంట్‌కు వచ్చిన 48 సీట్లలో కమ్యూనిస్టు పార్టీకి ఐదు, సెనెట్‌లోని 16 సీట్లలో రెండు వచ్చాయి.ఉరుగ్వే మిలిటరీ నియంతలకు వ్యతిరేకంగా జరిగిన పోరుకు వామపక్ష నేత జోస్‌ ముజికా (88) నాయకత్వం వహించాడు. తరువాత 2010 నుంచి 15వరకు అధ్యక్షుడిగా పనిచేశాడు. పద్నాలుగు సంవత్సరాల పాటు వివిధ జైళ్ల చిత్రహింసలు, ఏకాంతవాస శిక్ష అనుభవించాడు. అధ్యక్ష పదవిని స్వీకరించిన తరువాత 90 శాతం వేతనాన్ని దేశానికే విరాళంగా ఇచ్చాడు. అంతేకాదు అధ్యక్ష భవనం నివాసం తనకు అక్కర లేదని ప్రకటించాడు. ముజికా వారసుడిగా యమండు అర్సీని పరిగణిస్తున్నారు. ఒక ద్రాక్ష తోట రైతు కుటుంబంలో జన్మించిన అర్సీ తాను కూడా ముజికా బాటలోనే పయనిస్తానని ప్రకటించాడు.

చిన్న దేశమైనప్పటికీ ఉరుగ్వే ప్రపంచానికి పెద్ద సందేశమిచ్చిందనే చెప్పవచ్చు. ఈ ఏడాది ప్రపంచంలో జరిగిన అనేక ఎన్నికలలో అధికారంలో ఉన్న పార్టీలు ఎక్కువ చోట్ల ఓడిపోయాయి. మితవాద ఫాసిస్టు శక్తులు ముందుకు వచ్చాయి. ఇక్కడ మితవాదులను ఓడిరచి జనం వామపక్షానికి పట్టం కట్టారు. గత పాతిక సంవత్సరాలలో ఏ రాజకీయ పక్షం కూడా పది లక్షల ఓట్ల మార్కును దాటలేదు. తొలిసారిగా వామపక్షం ఆ ఘనతను సాధించింది. ఈ కూటమి ఇప్పటికి ఆరుసార్లు ఎన్నికల్లో పోటీ చేసింది.నాలుగు సార్లు అధికారానికి వచ్చింది. గతంలో గెలవని ప్రాంతాలు, నియోజకవర్గాలలో ఈసారి తన పలుకుబడిని పెంచుకుంది.పందొమ్మిది ప్రాంతాలలో(మన జిల్లాల వంటివి) పన్నెండు చోట్ల ప్రధమ స్థానంలో ఉంది. అన్ని చోట్లా దిగువ సభలో ప్రాతినిధ్యం పొందింది. ఈ ఎన్నికల సందర్భంగానే రెండు రాజ్యాంగబద్దమైన ప్రజాభిప్రాయ సేకరణకు కూడా ఓటింగ్‌ జరిగింది. లాటిన్‌ అమెరికాలో అధికారానికి వచ్చిన చోట్ల అధ్యక్ష పదవులు పొందినప్పటికీ పార్లమెంటులో మెజారిటీ లేని కారణంగా అనేక ఆటంకాలను ఎదుర్కొంటున్నాయి. అయితే ఉరుగ్వేలో ఎగువ సభలో మెజారిటీ ఉంది. దిగువ సభలో 99కి గాను 48 ఉన్నాయి.
మొత్తం లాటిన్‌ అమెరికా వామపక్షాలు ఎదుర్కొంటున్న సమస్యలనే ఉరుగ్వేలోని విశాల వేదిక కూడా ఎదుర్కొంటున్నది. గతంలో మూడు సార్లు అధికారానికి వచ్చినప్పటికీ అమల్లో ఉన్న పెట్టుబడిదారీ వ్యవస్థ పునాదులను కొనసాగిస్తూనే కార్మికులు, ఇతర తరగతులకు కొన్ని ఉపశమన, సంక్షేమ చర్యలను అమలు జరిపింది. దాంతో సహజంగానే అసంతృప్తి తలెత్తి గత ఎన్నికల్లో మితవాదులను గెలిపించారు. గత పాలకుల వైఫల్యం తిరిగి వామపక్షాలకు అవకాశమిచ్చింది. అధ్యక్షుడిగా ఎన్నికైన అర్సి ఒక పెద్ద జిల్లా గవర్నర్‌గా పనిచేశాడు. రెండవ దఫా ఎన్నికలలో ఓట్ల లెక్కింపు ఇంకా మిగిలి ఉండగానే 49.8 శాతం ఓట్లు పొందిన అర్సి విజయం ఖాయంగా తేలటంతో ప్రత్యర్థి అల్వారో డెల్‌గాడో తన ఓటమిని అంగీకరిస్తూ ప్రకటన చేశాడు.దేశంలో వామపక్ష శక్తులు విజయోత్సవాలను ప్రారంభించాయి. విశాల వేదికలో కమ్యూనిస్టు, సోషలిస్టు, క్రిస్టియన్‌ డెమోక్రాట్లు భాగస్వాములు కాగా ప్రతిపక్ష రిపబ్లికన్‌ కూటమిలో నాలుగు పార్టీలు ఉన్నాయి. అవన్నీ కూడా మితవాద భావజాలానికి చెందినవే. విశాల వేదికలో కమ్యూనిస్టులు ఉన్నప్పటికీ తమ అజెండాను పూర్తిగా ముందుకు నెట్టే అవకాశం లేదు.

లాటిన్‌ అమెరికాలో ఉన్నంతలో ఉరుగ్వే మెరుగైన స్థితిలో ఉన్నవాటిలో ఒకటి. అయితే పెట్టుబడిదారీ విధానం అనుసరిస్తున్నందున దానికి ఉండే జబ్బులకు కార్మికవర్గం గురవుతున్నది. వామపక్షాల పదిహేనేండ్ల పాలనలో మెరుగ్గా ఉన్నప్పటికీ కరోనా సమయంలో లాక్‌డౌన్‌లు, ఇతర ఆర్థిక సమస్యలను ఆసరా చేసుకొని ప్రతిపక్షం గత ఎన్నికల్లో లబ్ది పొందింది. జవాబుదారీతనంతో కూడిన స్వేచ్చను ఇస్తామని, జనాన్ని తాళం వేసి ఉంచేది లేదని ఓటర్ల ముందుకు వెళ్లింది. గత ఐదు సంవత్సరాలలో ఇరుగుపొరుగుదేశాలలో తలెత్తిన సమస్యల కారణంగా విదేశీ పెట్టుబడులు ఉరుగ్వేకు వచ్చినప్పటికీ అక్కడి ప్రమాణాల ప్రకారం చూస్తే నేరాలు, మాదక ద్రవ్యాల జాఢ్యం సవాలుగా మారింది.భద్రతలేదని జనం భావించారు. నేరగాండ్లను రాత్రిపూట అరెస్టుచేసేందుకు అనుమతించాలంటూ తాజా ఎన్నికల్లో ఓడిపోయిన పార్టీల కూటమి ప్రజాభిప్రాయ సేకరణకు ప్రతిపాదించిందంటే పరిస్థితి ఎలా ఉందో ఊహించుకోవచ్చు. లాటిన్‌ అమెరికాలో సురక్షితమైనదిగా ఒకప్పుడు పరిగణించిన ఉరుగ్వేలో ఇప్పుడు సంఘటిత నేరగాండ్ల ముఠాలు రెచ్చిపోతున్నాయి. అందుకే ఎన్నికలకు ముందు జరిగిన సర్వేలలో 47శాతం మంది అభద్రత ప్రధాన సమస్యగా ఉందని చెప్పగా 18శాతం ఉపాధి, 12శాతం ద్రవ్యోల్బణం గురించి చెప్పారు. జీవన వ్యయం, ఆర్థిక అసమానతల పెరుగుదల వంటి సమస్యలను ఉరుగ్వే ఎదుర్కొంటున్నది. మితవాద ప్రభుత్వం 2030 నుంచి ఉద్యోగ విరమణ వయస్సును 65 సంవత్సరాలకు పెంచుతామని చెప్పగా విశాల వేదిక 60 ఏండ్లుగా ప్రతిపాదించింది.పిల్లల్లో దారిద్య్రరేటు 25శాతం ఉంది.ఆర్థిక అసమానతలు బాగా పెరిగాయి. తమకు అధికారమిస్తే వామపక్ష నూతన మార్గంలో అంటే మార్కెట్‌ అనుకూల, జనానికి సంక్షేమ విధానాలను, వ్యవసాయానికి పన్ను రాయితీలు ఇస్తామని అర్సీ వాగ్దానం చేశాడు. గత వామపక్ష ప్రభుత్వాల పాలనలో అబార్షన్లను చట్టబద్దం కావించారు, స్వలింగ వివాహాలను అనుమతించారు. గత పది సంవత్సరాలుగా ఆర్థిక వ్యవస్థ పురోగతిలో పెద్ద మార్పు లేకపోగా ఈడికగా సాగుతున్నది. ధనికుల గురించి గాక తమ గురించి విశాల వేదిక శ్రద్ద చూపుతుందనే ఆశాభావాన్ని కార్మికవర్గం వ్యక్తం చేసిందనటానికి ఈ విజయం ఒక సూచిక అని చెప్పవచ్చు. దాన్ని ఏ విధంగా నిలబెట్టుకుంటారనేది కొత్త ప్రభుత్వం ముందున్న ప్రధాన సవాలు. దేశ ఆర్థిక లోటును తగ్గించేందుకు నూతన ప్రభుత్వం ఏం చేయనుందనే ప్రశ్నలను పరిశీలకులు సంధిస్తున్నారు. బలమైన ప్రభుత్వ పాత్ర ఉండాలని వామపక్ష వేదిక చెబుతున్నది.ధనికులపై పన్ను మొత్తాన్ని పెంచకుండా ఇది ఎలా సాధ్యమన్నది ప్రశ్న. అయితే ఈ అంశం గురించి ఎన్నికల ప్రచారంలో అర్సీ స్పష్టత ఇవ్వలేదు.ఆర్థిక వృద్ధి ద్వారా అదనపు రాబడిని సాధిస్తామని చెప్పాడు.వామపక్ష ప్రభుత్వాల పట్ల అమెరికా వ్యతిరేకత వ్యక్తం చేస్తున్న పూర్వరంగంలో ఉరుగ్వే`చైనా సంబంధాలు ఎలా ప్రభావితం అయ్యేది చూడాల్సి ఉంది.చైనాకు ఎగుమతులపై ఉరుగ్వే ఎక్కువగా ఆధారపడి ఉంది.

జనం చెవిలో బిజెపి పూలు : మోడీ వెనుకే అదానీ – అలా విదేశీ పర్యటనలు ఇలా ఒప్పందాలు ఎలా !

Tags

, , , , , , ,

ఎం కోటేశ్వరరావు

జనం కళ్లుమూసుకొని ఉన్నంత వరకు ఎవరేమనుకుంటే నాకేం అనుకొనే వాళ్లు రెచ్చిపోతూనే ఉంటారు. వివాదాస్పద కార్పొరేట్‌ అధిపతి అదానీ కంపెనీల అవకతవకల గురించి ఏ సంస్థ లేదా ఎవరైనా వెల్లడిస్తే వెంటనే బిజెపి, దాని అనుచరగణం, అమ్ముడు పోయిన మీడియా పెద్దలు కొందరు దేశ సార్వభౌమత్వం మీద జరుగుతున్న కుట్ర అంటూ గోలగోల చేస్తున్నారు. గట్టిగా నిలదీస్తే మాకు అధికారం రాకముందే అదానీ పెరిగాడు, అతనికీ మాకు సంబంధం ఏమిటి అని అడ్డంగా బిజెపి మాట్లాడుతుంది. అదానీ కంపెనీలు ఎప్పటి నుంచో ఉన్నమాట నిజం, గత పదేండ్లలో అతని కంపెనీల విస్తరణను చూస్తే ‘‘మోదానీ’’ ని విడదీసి చూడలేము. తాజాగా అమెరికా న్యాయశాఖ, సెక్యూరిటీలు మరియు ఎక్సేంజ్‌ కమిషన్‌(సెక్‌) దాఖలు చేసిన కేసుల వెనుక కుట్ర ఉందని బిజెపి అంటోంది. అమెరికాలో కేసులు ఏమౌతాయి ? రాజు తలచుకుంటే దెబ్బలకూ నజరానాలకూ కొదవ ఉండదు. నరేంద్రమోడీ మధ్య ఉన్న స్నేహంతో డోనాల్డ్‌ ట్రంప్‌ అక్కడి న్యాయవ్యవస్థను ప్రభావితం చేస్తారా ? ఏం జరుగుతుందో తెలియదు గానీ అలా చేస్తే అమెరికా పరువు గోవిందా ? కేసులు ఏమైనా అక్కడి మదుపుదార్లు మనదేశంలో పెట్టుబడులు పెట్టేందుకు ఒకటికి పదిసార్లు ఆలోచిస్తారు. అదానీ కంపెనీ ఇచ్చిన లేదా వాగ్దానం చేసిన 26.5కోట్ల డాలర్లు లేదా 2,200 కోట్ల రూపాయల ముడుపుల గురించి విచారణ జరిపేందుకు సుముఖత కేంద్ర ప్రభుత్వం నుంచి వెలువడలేదు.కొన్ని దేశాలు వెంటనే స్పందించిన తీరు చూస్తే మోడీ సర్కార్‌ మౌనం ఎందుకో వేరే చెప్పనవసరం లేదు.

నరేంద్రమోడీ విదేశాలలో మనదేశ ప్రతిష్ట పెంచేందుకు పర్యటనలు చేసినట్లు చెప్పినప్పటికీ అవి అదానీ కోసం చేసిన యాత్రల్లా ఉన్నాయి, ఎక్కడికి మోడీ వెళితే అక్కడ అదానీ ప్రత్యక్షం.ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్‌,గ్రీస్‌, మయన్మార్‌, ఇండోనేషియా, ఇజ్రాయెల్‌, కెన్యా, టాంజానియా, నేపాల్‌,శ్రీలంక ఇలా అనేక ఉదంతాలు బహిరంగంగా తెలిసినవే ఉన్నాయి. అమెరికా కేసుల గురించి తెలియగానే అదానీతో కుదుర్చుకున్న ఒప్పందాల గురించి దర్యాప్తు జరపాలని ఆస్ట్రేలియాకు చెందిన బాబ్‌ బ్రౌన్‌ ఫౌండేషన్‌ తరఫున అదానీ(పై నిఘా) వాచ్‌ నిర్వహిస్తున్న సమన్వయకర్త జెఫ్‌ లా ఆ దేశ ప్రధాని అల్బనీస్‌కు విజ్ఞప్తి చేశాడు. ఆస్ట్రేలియాలో వాణిజ్య లావాదేవీలు నిర్వహిస్తూ పన్నులు ఎగవేసేందుకు లేదా నామమాత్రంగా చెల్లించేందుకు వీలుగా బ్రిటీష్‌ వర్జిన్‌ ఐలాండ్స్‌ వంటి ‘‘పన్నుల స్వర్గాల’’లో కంపెనీలు ఏర్పాటు చేశారని, ఈ విషయాల్లో గౌతమ్‌ అదానీ సోదరుడు వినోద్‌ అదానీ ప్రముఖుడని హిండెన్‌బర్గ్‌ నివేదిక వెల్లడిరచిందని , అంతకు ముందు 2017లోనే ఆస్ట్రేలియా మీడియా సంస్థ ఏబిసి సందిగ్దమైన అదానీ కంపెనీల గురించి బయటపెట్టిందని అన్నాడు.గత ప్రభుత్వాలు 2009 నుంచి 2024వరకు కుదుర్చుకున్న వివిధ ఒప్పందాలు, వాటి మీద వచ్చిన ఆవినీతి ఆరోపణల గురించి సమీక్ష, దర్యాప్తు చేసేందుకు బంగ్లాదేశ్‌ ప్రభుత్వం విశ్రాంత హైకోర్టు జడ్జితో ఒక కమిటీని ఏర్పాటు చేసింది.వీటిలో అదానీ కంపెనీతో కుదుర్చుకున్న విద్యుత్‌ ఒప్పందాలు కూడా ఉన్నాయి. వీటిలో మనదేశంలో 1,234 మెగావాట్ల గొడ్డా బొగ్గు ఆధారిత విద్యుత్‌ ప్రాజెక్టు కూడా ఉంది. దీని నుంచి బంగ్లాదేశ్‌కు విద్యుత్‌ సరఫరా చేసేందుకు ఒప్పందం కుదిరింది. ఇటీవల కేంద్ర ప్రభుత్వం సవరించిన చట్టం ప్రకారం ఎగుమతికి ఉద్దేశించి ఏర్పాటు చేసిన గొడ్డా విద్యుత్‌ను మన మార్కెట్లో కూడా విక్రయించుకొనేందుకు వీలు కల్పించింది. దీంతో బంగ్లాదేశ్‌ ఆందోళన వెల్లడిరచింది.ఇలాంటి విద్యుత్‌ ప్రాజెక్టు ప్రపంచంలో ఎక్కడా లేదు. బొగ్గు నిల్వలు పుష్కలంగా ఉన్న రaార్కండ్‌లో దీన్ని ఏర్పాటు చేశారు. అక్కడ ఉత్పత్తి మొత్తాన్ని బంగ్లాదేశ్‌కు ఎగుమతి చేస్తారు. చిత్రం ఏమిటంటే దీనికి అవసరమయ్యే బొగ్గును తొమ్మిదివేల కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆస్ట్రేలియాలోని అదానీ గనుల నుంచి రవాణా చేసి ఒడిషాలోని అదానీ పోర్టుకు చేర్చి ఇక్కడ వినియోగిస్తారు. ఆ కేంద్రాన్ని బంగ్లాదేశ్‌లోనే నిర్మించవచ్చు. మనకు కాలుష్యాన్ని పంచి అదానీకి లాభాలు తెచ్చే ఈ ప్రాజెక్టును మోడీ సర్కార్‌ ఆమోదించింది. దీని కోసం ప్రత్యేకంగా రైలు మార్గాన్ని విస్తరించి అదానీకి అప్పగించింది. బంగ్లాదేశ్‌తో ఒప్పందం కుదిరిన తరువాత పన్నురాయితీలు ఇచ్చేందుకు ప్రత్యేక ఆర్థిక జోన్‌గా గుర్తింపు ఇచ్చింది. అదానీ కంపెనీకే ఎక్కువ లాభం కలిగే ఆ ప్రాజక్టు వద్దని స్వదేశంలో వ్యతిరేకత వెల్లడైనా నాటి ప్రధాని హసీనా ఒప్పందం చేసుకున్నారు.బంగ్లాలో తయారయ్యే విద్యుత్‌ ధర కంటే ఐదు రెట్లు ఎక్కువ చెల్లించటంతో పాటు, విద్యుత్‌ ఉత్పత్తి చేయకపోయినా పాతికేండ్లలో 45కోట్ల డాలర్లను అదానీకి చెల్లించాల్సి ఉంటుంది.కొత్త ప్రభుత్వం దీన్ని సమీక్షిస్తామని ప్రకటించింది.

అదానీ కంపెనీలతో కుదుర్చుకున్న 250 కోట్ల డాలర్ల విలువ గల ఒప్పందాలను రద్దు చేస్తూ కెన్యా అధ్యక్షుడు విలియం రూటో ప్రకటించాడు. అమెరికా కేసుల వార్త తెలియగానే ఈ నిర్ణయం తీసుకున్నారు. వీటిలో జోమో కెన్యాట్టా అంతర్జాతీయ విమానాశ్రయంలో రెండవ రన్‌వే, విద్యుత్‌ సరఫరా లైన్ల నిర్మాణం వంటివి ఉన్నాయి. ఈ లావాదేవీల గురించి తనకు దర్యాప్తు సంస్థలు, భాగస్వామ్య దేశాల నుంచి వచ్చిన కొత్త సమాచారం మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు రూటో చెప్పాడు. ఈ ఒప్పందాలలో పారదర్శకత లేదని, జనం సొమ్ము దుర్వినియోగం చేస్తున్నట్లు ప్రతిపక్షాలు, మీడియా ధ్వజమెత్తాయి. కెన్యా ఒప్పందాలు ఎలా జరిగాయో చూస్తే అదానీ కోసం నరేంద్రమోడీ తన అధికారాన్ని ఎలా వినియోగించారో అర్ధం చేసుకోవచ్చు. అదానీ కంపెనీల అక్రమాల గురించి హిండెన్‌బర్గ్‌ పరిశోధనా సంస్థ నివేదిక వెల్లడి తరువాత కూడా అధ్యక్షుడు రూటో ఒప్పందాలను గట్టిగా సమర్థించాడు.చిత్రం ఏమిటంటే అదానీతో ఒప్పందాలను రద్దు చేయనున్నట్లు ప్రకటించటానికి కొద్ది గంటల ముందు కెన్యా విద్యుత్‌ శాఖ మంత్రి ఓపియో వాండాయ్‌ పార్లమెంటు సభ్యులతో మాట్లాడుతూ ఒప్పందంలో ఎలాంటి అవినీతి లేదు గనుక విద్యుత్‌ లైన్ల నిర్మాణం ముందుకు సాగుతుందని ప్రకటించాడు. కెన్యా అధ్యక్షుడు రూటో 2023 డిసెంబరు ఐదున ఢల్లీిలో ప్రధాని నరేంద్రమోడీని కలుసుకున్నారు.హైదరాబాద్‌ హౌస్‌లో వారి భేటీ సందర్భంగా అక్కడ గౌతమ్‌ అదానీ ప్రత్యక్షం. మోడీఅదానీ మధ్య ఎంత సాన్నిహిత్యం లేకపోతే ఇద్దరు దేశాధినేతల మధ్య దూరగలరు ?

డిసెంబరులో మోడీరూటో భేటీ, మూడునెలలు తిరక్కుండానే ఈ ఏడాది మార్చినెలలో నైరోబీ విమానాశ్రయ రెండవ రన్‌వే ఏర్పాటుకు అదానీ కంపెనీ డిపిఆర్‌ సమర్పించటం వెంటనే ఆమోదం చకచకా జరిగిపోయాయి. అంతిమ ఒప్పందం మినహా ముఫ్సై సంవత్సరాల కౌలు అవగాహన, ఇతర నిబంధనల మీద ఏకీభావం కుదిరింది. దీని మీద దేశంలో గగ్గోలుతో రూటో పరువు పోయింది. దాని వివరాలు బయటకు పొక్కనీయలేదు. జూలైనెలలో ఒక వ్యక్తి సామాజిక మాధ్యమంలో దీని గురించి పోస్టు పెట్టటంతో మరింత రచ్చయింది.సెప్టెంబరు పదకొండున విమానాశ్రయ సిబ్బంది ఈ ఒప్పందానికి వ్యతిరేకంగా సమ్మె చేశారు. ఒప్పందం ప్రకారం ఉద్యోగాలు పోవటంతో పాటు కెన్యా పౌరులకు బదులు ఇతర దేశాల వారిని విమానాశ్రయ సిబ్బందిగా నియమించుకొనేందుకు అవకాశం ఉంది.లాభాలను దేశం వెలుపలకు తరలించవచ్చు. అనేక రాయితీలు ఇచ్చేందుకు ప్రభుత్వం అంగీకరించింది. ఇక్కడి నుంచి 54దేశాలకు విమాన రాకపోకలు జరుగుతాయని, ఈ ఒప్పందంతో దేశానికి ఆర్థికంగా నష్టదాయకమని కార్మిక సంఘం పేర్కొన్నది. కౌలు గడువు ముగిసిన తరువాత 18శాతం వాటాను అదానీ కంపెనీకి ఇవ్వాల్సి ఉంటుంది. ఇలాంటివి ఆరు రాయితీలు ఉన్నాయని, ఇతర విమానాశ్రయాల కాంట్రాక్టులు కూడా వచ్చేందుకు వీలు కల్పించే విధంగా ఒప్పందం ఉన్నట్లు బయటపడిరది. విమానాశ్రయ విస్తరణ గురించి ఎలాంటి బహిరంగ ప్రకటన లేదు, అంతా గుట్టుగా జరిగింది. ఈ వ్యవహారం కోర్టుకు ఎక్కటంతో ఇంకా ఎలాంటి ఒప్పందం జరగలేదని ప్రభుత్వం చెప్పుకోవాల్సి వచ్చింది. అక్కడి సుప్రీం కోర్టు ఆ ఒప్పందాలను పక్కనబెట్టటంతో విధిలేక అధ్యక్షుడు రూటో రద్దు చేస్తున్నట్లు ప్రకటించక తప్పలేదు.

తూర్పు ఆఫ్రికాలోని టాంజానియాలో బాగామోయో రేవు అభివృద్దికి చైనా కంపెనీతో కుదిరిన అవగాహనను అక్కడి ప్రభుత్వం 2019లో రద్దు చేసుకుంది. ఆ రేవుతో పాటు మరో రెండు రేవులను అభివృద్ధి చేసేందుకు సుముఖంగా ఉన్నట్లు అదానీ కంపెనీఅబుదాబీ కంపెనీ సంయుక్తంగా ఒక అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. 2023 అక్టోబరులో అధ్యక్షురాలు సమియా సులు హసన్‌ భారత సందర్శనకు వచ్చినపుడు మనదేశంతో అనేక ఒప్పందాలు కుదిరాయి. ఈ ఏడాది మే నెలలో అదానీ కంపెనీ టాంజానియా దారుసలామ్‌ రేవులో కంటెయినర్‌ జెట్టీని అభివృద్ది చేసేందుకు 30 ఏండ్ల రాయితీ ఒప్పందం చేసుకుంది. విద్యుత్‌ లైన్‌ నిర్మాణం గురించి కూడా అదానీ కంపెనీ అమెరికా కంపెనీతో కలసి చేపట్టేందుకు టాంజానియా సంప్రదింపులు జరుపుతోంది. మయన్మార్‌లోని యంగూన్‌ రేవులో ఒక జెట్టీని అభివృద్ధి చేసేందుకు 2019లో కాంట్రాక్టు పొందినట్లు అదానీ కంపెనీ ప్రకటించింది. అంతకు ముందు మయన్మార్‌ మిలిటరీ జనరల్‌ మిన్‌ అంగ్‌ లైయింగ్‌తో గౌతమ్‌ అదానీ కుమారుడు కరన్‌ అదానీ భేటీ అయ్యాడు.సదరు అధికారి గుజరాత్‌లోని ముంద్రా రేవును సందర్శించాడు.ఆ సందర్భంగా మిలిటరీ జనరల్‌, అతనితో పాటు వచ్చిన అధికారులకు ‘‘బహుమతులు’’ ముట్టచెప్పారని వార్తలు వచ్చాయి. ఆ తరువాత అంగ్‌సాన్‌ సూకీ ప్రభుత్వాన్ని కూలదోసి లైయింగ్‌ అధికారాన్ని హస్తగతం చేసుకున్నాడు. నియంతలతో కూడా అదానీ తన కంపెనీల కోసం చేతులు కలిపారన్నది ఇక్కడ గమనించాల్సిన అంశం. మిలిటరీ పాలకులపై అమెరికా ఆంక్షలు విధించినా అదానీ లావాదేవీలకు ఎలాంటి ఆటంకం కలగలేదు.మిలిటరీ అధికారుల కనుసన్నలలో నడిచే మయన్మార్‌ ఎకనమిక్‌ కార్పొరేషన్‌కు అదానీ మూడు కోట్ల డాలర్లు చెల్లించిందని, అవి ముడుపులని ఆరోపణలు వచ్చాయి. తరువాత కాలంలో పశ్చిమ దేశాల ఆంక్షలు తీవ్రం కావటంతో ఆ రేవు ప్రాజెక్టు నుంచి వైదొలుగుతామని, పెట్టిన పెట్టుబడి 19.5 కోట్ల డాలర్లు ఇస్తే ఎవరికైనా విక్రయిస్తామని ప్రకటించింది. ఎవరూ ముందుకు రాకపోవటంతో 2023లో మూడు కోట్ల డాలర్లకే విక్రయించింది.తమకు 15.2కోట్ల డాలర్ల నష్టం వచ్చినట్లు పేర్కొన్నది.


శ్రీలంక ప్రభుత్వంతో గతంలో అదానీ కంపెనీ కుదుర్చుకున్న ఒప్పందాలను సమీక్షించనున్నట్లు ఇటీవల ఎన్నికైన అధ్యక్షుడు అనుర కుమార దిశన్నాయకే ప్రకటించాడు.ఈ మేరకు 44 కోట్ల డాలర్లతో తలపెట్టిన గాలిమరల విద్యుత్‌ ప్రాజెక్టు గురించి పునరాలోచించనున్నట్లు సుప్రీం కోర్టుకు ప్రభుత్వం నివేదించింది. ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన లంకకు మనదేశం సాయం చేసింది. దానికి ప్రతిగా మోడీ మనదేశానికి ఉపయోగపడే పని చేయాల్సిందిపోయి తాము చెప్పిన అదానీకి ప్రాజెక్టులను అప్పగించాలని కోరటం అధికార దుర్వినియోగం తప్ప మరొకటి కాదు. భారత వత్తిడి కారణంగా గాలి మరల విద్యుత్‌ ప్రాజెక్టును కట్టబెట్టినట్లు అక్కడి అధికారే స్వయంగా పార్లమెంటరీ కమిటీ ముందు వెల్లడిరచాడు, అతని ప్రాణానికి ముప్పురావటంతో ఆ ప్రకటనను వెనక్కు తీసుకున్నట్లు చెబుతున్నారు. అదానీకి కట్టబెట్టేందుకు పోటీ లేకుండా అక్కడి చట్టాన్నే మార్పించారు. మోడీ సర్కార్‌ దన్నుతో కొలంబో రేవులో సగం వాటాతో తూర్పు కంటెయినర్‌ జట్టీ అభివృద్ధి, నిర్వహణకు అదానీ రంగంలోకి దిగాడు. కీలకమైన ఆ ప్రాజెక్టు ప్రభుత్వ ఆధీనంలోనే ఉండాలని రేవు కార్మికులు, ప్రతిపక్ష పార్టీలు పెద్ద ఎత్తున ఆందోళన చేశాయి.దాంతో దాని బదులు పశ్చిమ కంటెయినర్‌ జెట్టిని అప్పగిస్తామని, సగం బదులు 85శాతం వాటాతో గత ప్రభుత్వంతో అదానీ ఒప్పందం కుదుర్చుకున్నారు. ఇప్పుడు కొత్త ప్రభుత్వం వీటన్నింటినీ సమీక్షిస్తున్నందున ఏమవుతుందో చూడాలి.


నలభై సంవత్సరాల తరువాత తొలిసారిగా భారత ప్రధానిగా నరేంద్రమోడీ 2023 ఆగస్టులో గ్రీస్‌ పర్యటనకు వెళ్లారు.పైకి ఏమి చెప్పినా అదానీకి అక్కడి ప్రాజెక్టుల కోసమే అని వార్తలు వచ్చాయి.ఎందుకంటే ఇరుదేశాల నేతల మధ్య రేవుల గురించి చర్చ జరిగింది. ఇండోనేషియాలోని అదానీ గనుల నుంచి దిగుమతి చేసుకున్న బొగ్గు ధరను మూడు రెట్లకు పైగా ఎక్కువగా నిర్ణయించారు. నాసిరకాన్ని నాణ్యత కలదిగా పేర్కొన్నారు.ఇది యుపిఏ హయాంలో జరిగినప్పటికీ మోడీ సర్కార్‌ ఎలాంటి విచారణ జరపలేదు.2023 సెప్టెంబరు ఏడున మోడీ ఇండోనేషియా పర్యటన జరిపారు.నెల రోజులు కూడా తిరగక ముందే అదానీ ప్రత్యక్షమై సబాంగ్‌ రేవు గురించి అక్కడి ప్రభుత్వంతో చర్చలు జరిపారు. ఇలా గత పదేండ్లలో అదానీ కంపెనీలు విదేశాల్లో విస్తరణకు మోడీ సహకరించారన్నది స్పష్టం. విచారణ జరిపితే వాస్తవాలన్నీ బయటపడతాయి. అలాంటి చిత్తశుద్ది కేంద్ర ప్రభుత్వానికి ఉందా ?

అదానీ-జగన్‌ రెడ్డి ముడుపుల చెలగాటం : ఇరకాటంలో నరేంద్రమోడీ-చంద్రబాబు !

Tags

, , , , , , ,

ఎం కోటేశ్వరరావు


వివాదాస్పద పారిశ్రామిక, వాణిజ్యవేత్త గౌతమ్‌ అదానీ పరివారపు లంచాల బాగోతం బట్టబయలైంది. హరిత ఇంథన కొనుగోళ్ల వ్యవహారంలో రాష్ట్రాలలో అధికారంలో ఉన్నవారికి 26.5 కోట్ల డాలర్ల మేరకు ముడుపులు చెల్లించిందని రెండు కేసులు దాఖలయ్యాయి. అమెరికాలోని న్యూయార్క్‌ కోర్టులో నవంబరు 20న ఒక కేసును న్యాయశాఖ, మరో కేసును సెక్యూరిటీలు మరియు ఎక్సేంజ్‌ల నియంత్రణ సంస్థ వేసింది. ముడుపుల మొత్తంలో సింహభాగం ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో వైఎస్‌ జగన్మోహనరెడ్డికి ముట్టిందని చెబుతున్నారు. అసలు తమ నేత అదానీ కంపెనీలతో ఎలాంటి ఒప్పందమూ కుదుర్చుకోలేదని కేంద్ర ప్రభుత్వ సంస్థ సోలార్‌ ఎనర్జీ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా(సెకి)తో డిస్కామ్‌ల ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకుందని, ఒక ప్రభుత్వరంగ సంస్థ ఎక్కడైనా లంచాలు ఇస్తుందా అని వైసిపి ఒక ప్రకటనలో అమాయకత్వాన్ని ప్రదర్శించింది. అమెరికా కోర్టులో దాఖలు చేసిన కేసుల పత్రాలలో పేర్కొన్నదాని మేరకు సంక్షిప్తంగా వివరాలు ఇలా ఉన్నాయి.తాను స్వంతంగా లేదా ప్రయివేటు సంస్థలు ఉత్పత్తి చేసిన హరిత విద్యుత్‌ను సెకి కొని అవసరమైన వారికి విక్రయిస్తుంది. ఆ మేరకు 2019 డిసెంబరు, 2020 జూలై మధ్య కాలంలో కేంద్ర పునరుత్పాదక ఇంథన మంత్రిత్వశాఖ కంపెనీ సెకి ద్వారా అదానీ కంపెనీ, మరో అమెరికా కంపెనీ అజూర్‌ పవర్‌ నుంచి పన్నెండు గిగావాట్ల విద్యుత్‌ కొనుగోలుకు అంగీకరించింది.దానిలో అదానీ ఎనిమిది, అమెరికా కంపెనీ నాలుగు గిగావాట్లు సరఫరా చేయాల్సి ఉంది. విద్యుత్‌ను నిలువ చేయటానికి వీలుండదు గనుక తమ దగ్గర నుంచి కొనుగోలు చేసే వారి కోసం సెకి ప్రయత్నించింది. ఒప్పందాలు చేసుకుంటేనే సదరు కంపెనీలు విద్యుత్‌ను ఉత్పత్తి చేయాల్సి ఉంటుంది.


అసలు కథ ఇక్కడి నుంచి ప్రారంభమైంది.అమెరికా న్యాయశాఖ ఆరోపించిన మేరకు గౌతమ్‌ అదానీ, అతగాడి మేనల్లుడు సాగర్‌ అదానీ, వినీత్‌ జైన్‌ మరో ఐదుగురు రాష్ట్రాలలో ఉన్న పాలకులు, అధికారులకు ముడుపుల బాగోతానికి తెరతీశారు. అమెరికా, ఇతర దేశాల నుంచి అదానీ కంపెనీలో పెట్టుబడులు పెట్టే వారికి తెలియకుండా ఈ అక్రమాన్ని దాచి అమెరికా చట్టాల ప్రకారం మోసం చేశారు. సెకి నుంచి ఎవరైనా విద్యుత్‌ను కొనుగోలు చేస్తేనే అదానీ, అమెరికా కంపెనీలు ముందుకు పోవాల్సి ఉంటుంది. అయితే సెకి ధర ఎక్కువగా ఉండటంతో భారీ మొత్తంలో విద్యుత్‌ను కొనుగోలు చేసేందుకు రాష్ట్రాలేవీ ముందుకు రాలేదు.అదానీ, అమెరికా కంపెనీల పెద్దలు కూర్చుని రాష్ట్రాలు విద్యుత్‌ కొనుగోలు ఒప్పందాలు చేసుకోవాలంటే ఆయా రాష్ట్రాల నేతలు, అధికారులకు తామే ముడుపులు చెల్లించి సెకితో ఒప్పందాలు చేయించాలని పథకం వేశారు. దాని ప్రకారమే అంతా జరిగింది. అమెరికా కేసులో దాఖలు చేసిన వివరాల ప్రకారం ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డిని, గౌతమ్‌ అదానీ అందుకోసమే కలిశారన్నది ఆరోపణ. ఆ తరువాతే 2021 డిసెంబరులో ఆంధ్రప్రదేశ్‌ విద్యుత్‌ పంపిణీ సంస్థలు సెకీతో ఒప్పందాలు చేసుకున్నాయని చెబుతున్నారు. అంటే ముడుపుల బేరసారాలకే వారి కలయిక అన్నది స్పష్టం.

ఇక ఈ ఒప్పందం గురించి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు తాజాగా అధికారంలోకి వచ్చిన తరువాత విడుదల చేసిన శ్వేత పత్రాల సందర్భంగా చెప్పిందేమిటి ? సెకి నుంచి యూనిట్‌కు రు.2.49 చొప్పున ఏడువేల మెగావాట్లు ఆంధ్రప్రదేశ్‌ కొనుగోలు చేసింది. మూడువేల మెగావాట్లు 2024సెప్టెంబరు నుంచి, మరో మూడువేల మెగావాట్లు 2025 సెప్టెంబరు, మిగిలిన వెయ్యి 2026 సెప్టెంబరు నుంచి సరఫరా చేయాలి. అయితే ఒప్పంద సమయంలో మార్కెట్లో యూనిట్‌ ధర రు.1.99 మాత్రమే ఉందని, సెకితో ఒప్పందం వలన ఏటా వినియోగదారులపై రు.850 కోట్ల మేర అదనపు భారం పడుతుందని, సోలార్‌ విద్యుత్‌ ప్లాంట్లకు విద్యుత్‌ నెట్‌వర్క్‌తో అనుసంధానం చేసేందుకు చెల్లించాల్సిన సరఫరా ఛార్జీల భారాన్ని ఏటా మూడు నుంచి మూడున్నరవేల కోట్ల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం భరించాల్సి ఉంటుందని, ఇవన్నీ కలుపుకుంటే ఒప్పంద గడువు పాతిక సంవత్సరాలలో 62వేల కోట్ల రూపాయల భారం పడుతుందని చంద్రబాబు నాయుడు చెప్పారు. దీని మీద మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి (పార్టీ ద్వారా విడుదల చేసిన ప్రకటన) ఏమంటున్నారు ?


గతంలో చంద్రబాబు నాయుడి ప్రభుత్వం చేసుకున్న ఒప్పందాల ప్రకారం యూనిట్‌ ధర రు.5.10కి చేరింది. ఈ భారాన్ని తగ్గించేందుకు పదివేల మెగావాట్ల సౌరవిద్యుత్‌ తయారీకి జగన్‌ సర్కార్‌ నిర్ణయించింది.దాన్లో భాగంగా 2020 నవంబరులో 6,400 మెగావాట్లకోసం ఏపి గ్రీన్‌ ఎనర్జీ కార్పొరేషన్‌ ద్వారా టెండర్లు పిలిచింది.యూనిట్‌ రు.2.49, 2.58 చొప్పున సరఫరా చేసేందుకు 24 టెండర్లు వచ్చాయి. అయితే న్యాయపరమైన సమస్యలతో వాటిని రద్దు చేసింది. ఆ తరువాత యూనిట్‌ ధర రు.2.49కి సరఫరా చేసేందుకు సెకి ముందుకు వచ్చింది.అది 2019 జూన్‌లో ఒప్పందాలను కుదుర్చుకున్న సంస్థల నుంచి సరఫరా చేస్తుంది. విద్యుత్‌ సరఫరా చార్జీలను మినహాయించేందుకు సెకి అంగీకరించింది. దీని వలన ఏటా రాష్ట్రానికి రు.3,700 కోట్ల మేర ఆదా అవుతుంది. చంద్రబాబు నాయుడు విద్యుత్‌ సరఫరా ఛార్జీల భారం రాష్ట్రం మీద పడుతుందని అంటే జగన్మోహనరెడ్డి లేదని చెబుతున్నారు. ఏది వాస్తవమో రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటించాలి, ఒప్పంద పత్రాలను జనాల పరిశీలనకు అందుబాటులో ఉంచాలి. అప్పుడే నిజం తెలుస్తుంది.


అమెరికాలో దాఖలైన కేసు జగన్‌మోహనరెడ్డి లేదా ఇతర రాష్ట్రాలలో ఒప్పందం చేసుకున్నవారి మీద కాదు. అమెరికా, అంతర్జాతీయ మదుపుదార్లను ముడుపుల గురించి మభ్యపెట్టి అదానీ కంపెనీ మోసం చేసినదాని గురించి మాత్రమే. సూదికోసం సోదికి పోతే పాత గుట్టంతా రట్టయినట్లుగా ఈ క్రమంలో ముడుపుల బాగోతం బయటపడిరది. అదానీ అండ్‌ కో మొత్తం 26.5 కోట్ల డాలర్లు(మన కరెన్సీలో రు.2,209 కోట్లు) ముడుపులుగా ఇచ్చారని, ఈ మొత్తంలో రు.1,750 కోట్లు ఆంధ్రప్రదేశ్‌ విద్యుత్‌ పంపిణీ సంస్థలను ఒప్పించటానికి ఇచ్చినట్లు అమెరికా ప్రభుత్వం ఫిర్యాదు చేసింది. ఆ మేరకు ముడుపులకు ఒప్పించిన తరువాత ఒడిషా, జమ్ము అండ్‌ కాశ్మీరు, తమిళనాడు, చత్తీస్‌ఘర్‌, ఆంధ్రప్రదేశ్‌ విద్యుత్‌ పంపిణీ సంస్థలు ఒప్పందాలు చేసుకున్నాయి. సెకి ఒప్పందాల ప్రకారం ఆంధ్రప్రదేశ్‌కు అదానీ సంస్థ ఏడువేల మెగావాట్లు, అమెరికా సంస్థ 650 మెగావాట్లను మిగిలిన నాలుగు రాష్ట్రాలకు సరఫరా చేయాల్సి ఉంది. ముడుపుల గురించి దర్యాప్తు చేసేందుకు పూనుకున్న ప్రభుత్వానికి ఆటంకాలు కల్పించినట్లు అమెరికన్‌ ఎఫ్‌బిఐ(మన సిబిఐ వంటిది) అధికారి ఫిర్యాదు చేశాడు.ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వంతో సెకి ఒప్పందం కుదుర్చుకోక ముందు 2021 ఆగస్టులో సిఎం జగన్‌మోహన రెడ్డితో గౌతమ్‌ అదానీ వ్యక్తిగతంగా కలిసినట్లు కేసులో పేర్కొన్నారు. ఈ సమావేశంలో ముడుపులు చెల్లించటం లేదా ఇచ్చేందుకు అదానీ వాగ్దానం చేసినట్లు, ఆ కారణంగానే ఒప్పందం చేసుకున్నట్లు అమెరికా సెక్యూరిటీస్‌ సంస్థ దాఖలు చేసిన కేసు 80, 81పేరాలలో పేర్కొన్నది. అదానీ గ్రీన్‌ మరియు అజూర్‌ పవర్‌ అంతర్గత వర్తమానాలలో సెకీ నుంచి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం విద్యుత్‌ కొనుగోలుకు అంగీకరించింది అనే సమాచారం ఉన్నట్లు మరోమాటలో చెప్పాలంటే ముడుపులు చెల్లించటం లేదా వాగ్దానం పనిచేసినట్లు కూడా పేర్కొన్నది. ఒక మెగావాట్‌కు రు.25లక్షలు చెల్లించేట్లు ఆ మొత్తం రు.1,750 కోట్లని, అదానీ కంపెనీ అంతర్గత రికార్డుల్లో ఉన్న అంశం దీనికి దగ్గరగా ఉందని కూడా చెప్పింది. ఇవన్నీ తమ మీద చేసిన నిరాధార ఆరోపణలు మాత్రమేనని, నేరం రుజువయ్యేవరకు నిందితులుగానే పరిగణించాలని అదానీ కంపెనీ వివరణ ఇచ్చింది.


అమెరికా కోర్టులో దాఖలైన కేసుల్లో ఏమి తేలుతుందో తెలియదు, అదానీ కంపెనీల మీద 2023లో హిండెన్‌బర్గ్‌ సంస్థ వెల్లడిరచిన నివేదిక, కొన్ని దేశాల్లో అదానీ కంపెనీల బాగోతాలు చూసిన తరువాత విదేశాల్లో మన గురించి ఒక చెడు అభిప్రాయం ఏర్పడిరదన్నది వాస్తవం. ఈ ఉదంతాల గురించి అంతర్జాతీయ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వచ్చినందున ప్రతి వారి నోళ్లలో మనదేశం నానుతున్నది. ప్రభుత్వరంగ సంస్థ సెకి విద్యుత్‌ను అమ్మే స్థితిలో లేదన్న సందేశం, అందుకోసమే ప్రయివేటు సంస్థలు రాష్ట్ర ప్రభుత్వ నేతలకు ముడుపులు ఇచ్చినట్లు తాజా ఉదంతంతో వెల్లడైంది. విదేశాలు తిరిగి ప్రతిష్టను పెంచానని చెప్పుకున్న నరేంద్రమోడీ అదానీ కంపెనీల మీద వచ్చిన ఆరోపణల గురించి పార్లమెంటరీ కమిటీ దర్యాప్తు జరిపేందుకు నిరాకరించిన సంగతి తెలిసిందే. శ్రీలంక ప్రభుత్వాన్ని ప్రభావితం చేసి అక్కడ విద్యుత్‌ ప్రాజెక్టును అదానీకి ఇప్పించారని వచ్చిన వార్తల గురించి చెప్పనవసరం లేదు. గతంలో హిండెన్‌బర్గ్‌ సంస్థ ముందుకు తెచ్చిన ఆరోపణల నిగ్గుతేల్చేందుకు పార్లమెంటరీ కమిటీ వేయాలన్న డిమాండ్‌ను కేంద్ర ప్రభుత్వం తిరస్కరించింది. ఎందుకంటే అది తన లబ్దికోసం పనిచేసే ప్రైవేటు సంస్థ అంటూ కొట్టివేశారు. సెబిపేరుతో విచారణను నీరుగార్చారు. ఇప్పుడు అమెరికా అధికారిక సంస్థలే కేసులు దాఖలు చేసినందున మోడీ సర్కార్‌ గతంలో మాదిరి తప్పించుకుంటుందా ?


ఈ ఉదంతం గురించి పూర్తి వివరాలు తెలియవని, విచారణ జరిపించాలని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పారు. వివిధ రాష్ట్రాల నేతలకు ముడుపులు ఇచ్చినట్లు ఆరోపణలు వచ్చినందున కేంద్రమే దర్యాప్తు జరపాల్సి ఉంటుంది. ఈ ఉదంతంలో నరేంద్రమోడీచంద్రబాబు నాయుడు ఇరకాటంలో పడినట్లు చెప్పవచ్చు. తన రాజకీయ ప్రత్యర్థి జగన్‌మోహనరెడ్డి పట్ల ఎలాంటి సానుభూతి లేకున్నా, ముడుపులు ఇచ్చినట్లు చెబుతున్నది అదానీ గనుక విచారణ గురించి చంద్రబాబు పట్టుబడతారా అన్నది సందేహమే. ఎవరు అవునన్నా కాదన్నా మోడీఅదానీ బంధం గురించి తెలిసిందే. గతంలో తాను చెట్టాపట్టాలు వేసుకు తిరిగిన డోనాల్డ్‌ ట్రంప్‌ అధికారానికి వచ్చినందున ఆ సంబంధాలతో అదానీ అండ్‌కోను బయటపడవేయిస్తే ఇక్కడ జగన్మోహనరెడ్డిని రక్షించినట్లే గాక సచ్చీలుడని అంగీకరించాల్సి ఉంటుంది. అదానీ కంపెనీల నుంచి రాష్ట్రానికి పెట్టుబడులను ఆశిస్తున్న చంద్రబాబు మాట మాత్రంగా విచారణ జరపాలన్నారు తప్ప అంతకు మించి మాట్లాడకపోవచ్చన్నది ఒక అభిప్రాయం. గతంలో వైసిపి ప్రభుత్వం అదానీ కంపెనీతో చేసుకున్న విద్యుత్‌ మీటర్ల ఒప్పందాన్ని వ్యతిరేకించిన తెలుగుదేశం దాన్ని కొనసాగించేందుకే నిర్ణయించుకుంది. సెకి ఒప్పందాన్ని రద్దు చేసుకుంటే విద్యుత్‌ సమస్య తలెత్తవచ్చనే సాకు చూపి కొనసాగించవచ్చు. కేంద్రం తీసుకొనే నిర్ణయం, ప్రతిపక్షాలు ఈ సమస్యను ముందుకు తీసుకుపోయే తీరు తెన్నులను చూసిన తరువాత చంద్రబాబు వైఖరి నిర్ణయం కావచ్చు. అవినీతి అక్రమాలను నిలదీస్తా, తాట వలుస్తా అని గతంలో బీరాలు పలికిన జనసేన నేత పవన్‌ కల్యాణ్‌కూ ఇది పరీక్షే. అమెరికాకూ ఇది ప్రతిష్టాత్మకంగా మారిందనే చెప్పాలి.అక్కడి న్యాయశాఖ, ఆర్థికలావాదేవీల నియంత్రణ సంస్థ దాఖలు చేసిన కేసులు వీగిపోతే అవినీతిని సహించదనే దాని ప్రతిష్టకు భంగం కలుగుతుంది. మొత్తం మీద ఈ కేసు ఏ మలుపు తిరుగుతుందో అన్న ఆసక్తిని రేకెత్తిస్తున్నది.

శ్రీలంక పార్లమెంటు ఎన్నికల్లో రికార్డులను తిరగరాసిన వామపక్షం !

Tags

, ,


ఎం కోటేశ్వరరావు

సెప్టెంబరు 21న జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో తొలిసారిగా వామపక్ష నేత అనుర కుమార దిశనాయకే విజయం ఒక పెద్ద మలుపు.నవంబరు 14న జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో గత అనేక రికార్డులను బద్దలు కొట్టి నేషనల్‌ పీపుల్స్‌ పవర్‌(ఎన్‌పిపి) మూడిరట రెండువంతుల మెజారిటీతో 225కు గాను 159 సాధించి లంక చరిత్రలో సరికొత్త రికార్డు నమోదు చేసింది.ఈ పార్టీకి గరిష్టంగా 130 స్థానాలు వస్తాయని ఎన్నికల పండితులు అంచనాలు వేశారు. జనతా విముక్తి పెరుమన(సంఘటన), దానితో పాటు మరో 27 వామపక్ష పార్టీలు, సంస్థలు, ప్రజాసంఘాలు కలసి నేషనల్‌ పీపుల్స్‌ పవర్‌(ఎన్‌పిపి) పేరుతో ఒక కూటమిగా పోటీ చేశాయి. అన్నింటికంటే ముఖ్య అంశం తమిళ, ముస్లిం మైనారిటీలు అధికంగా ఉన్న ప్రాంతాల్లో ఆ పార్టీ చొచ్చుకుపోవటం ఎవరూ ఊహించని పరిణామం. సోమవారం నాడు కొత్త మంత్రివర్గం కొలువు తీరింది. లంక ఎదుర్కొంటున్న ఆర్థిక సంక్షోభాన్ని నూతన ప్రభుత్వం ఎలా పరిష్కరిస్తుందో అన్న అనుమానాలను పరిశీలకులు వ్యక్తం చేస్తుండగా వామపక్ష ప్రభుత్వంపై పెద్ద ఎత్తున ఆశలు, విశ్వాసం ప్రజల్లో వ్యక్తమైంది. గత ప్రభుత్వం ఐఎంఎఫ్‌తో కుదుర్చుకున్న ఒప్పందాల అమలు ప్రజలలో వ్యతిరేకతను పెంచటం కూడా ఎన్‌పిపి విజయానికి దోహదం చేసిందని చెప్పవచ్చు.


అధ్యక్ష ఎన్నికల్లో అనుర కుమారకు 42.3శాతం ఓట్లు రాగా పార్లమెంటు ఎన్నికల్లో 61.68శాతం వచ్చాయి. 2010 ఎన్నికల్లో మహింద రాజపక్సే పార్టీకి 60.33శాతమే ఇప్పటి వరకు రికార్డు. అదే విధంగా పార్లమెంటులో 2020ఎన్నికల్లో అదే పార్టీకి 145 సీట్ల రికార్డును 159తో ఎన్‌పిపి బద్దలు కొట్టింది.ఇరవై రెండు జిల్లాలకు గాను 2010రాజపక్స 19చోట్ల ఎక్కువ సీట్లు సంపాదించగా ఈసారి ఎన్‌పిపి 21 జిల్లాల్లో మెజారిటీ సాధించింది. తమిళులు మెజారిటీగా ఉన్న బట్టికలోవాలో మాత్రమే రెండవ స్థానంలో ఉంది. వీటన్నింటిని చూసినపుడు కేవలం మెజారిటీ సింహళీయుల, మైనారిటీ వ్యతిరేకుల పార్టీ అన్న ముద్రను ఎన్‌పిపి పోగొట్టుకుంది. ఇది ఎలా జరిగింది, కారణాలేమిటి అన్న విశ్లేషణలు జరుగుతున్నాయి. జాతుల పరంగా మెజారిటీ, మైనారీటీ సామాజిక తరగతుల ఛాంపియన్లుగా తరతరాలుగా ముద్ర పడిన పార్టీల మీద జనం విశ్వాసం కోల్పోవటమే దీనికి ప్రధాన కారణం. కరోనాకు ముందు దీర్ఘకాలం ఉన్న ఉగ్రవాద సమస్య, తరువాత తలెత్తిన ఆర్థిక సంక్షోభాలతో అందరూ దెబ్బతిన్నారు. దుర్భరపరిస్థితుల నుంచి సాంప్రదాయ పార్టీలేవీ గట్టెంకించలేవన్న భావన ఓటర్లలో బలంగా తలెత్తింది. అధ్యక్ష ఎన్నికల తరువాత ఎస్‌జెపి అనురకుమారను వ్యతిరేకించేశక్తులు చేతులు కలిపితే పార్లమెంటులో మెజారిటీ సాధిస్తారని వేసిన అంచనాలన్నీ తప్పాయి. లంక రాజ్యాంగం ప్రకారం 225 స్థానాలలో 196 మందిని నియోజకవర్గాల ప్రాతిపదికన ఎన్నుకుంటారు.మరో 29 స్థానాలను పార్టీలకు వచ్చిన ఓట్ల దామాషా ప్రకారం వాటికి సీట్లు కేటాయిస్తారు. ఎన్‌పిపి 141నియోజవర్గాల్లో గెలవగా దామాషా ఓట్లతో 18 స్వంతం చేసుకుంది. 2020 ఎన్నికలలో ఎన్‌పిపికి కేవలం మూడు స్థానాలు మాత్రమే వచ్చాయి.


ఐదు సంవత్సరాల క్రితం కేవలం 3.16శాతం ఓట్లు తెచ్చుకున్న వామపక్ష నేత 42.3శాతం ఓట్లతో ప్రధమ స్థానంలో నిలవటం, రెండవ ప్రాధాన్యతా ఓట్లలెక్కింపులో 55.89శాతం ఓట్లతో విజయం సాధించటం తెలిసిందే.ఆ ఎన్నికలలో ప్రతిపక్ష పార్టీ ఎస్‌జెపి అభ్యర్థి సాజిత్‌ ప్రేమదాస 32.76శాతం, అధ్యక్షుడు రానిల్‌ విక్రమ సింఘే(ఎన్‌డిఎఫ్‌) స్వతంత్ర అభ్యర్ధిగా 17.27శాతం ఓట్లతో మూడవ స్థానంలో ఉన్నారు. మిగిలిన ఓట్లను 35 మంది ఇతర అభ్యర్థులు తెచ్చుకున్నారు. అక్కడి విధానం ప్రకారం అధ్యక్షపదవికి ఎందరైనా పోటీ పడవచ్చు. ప్రతి ఓటరూ ముగ్గురికి ప్రాధాన్యతా క్రమంలో ఓటు వేయవచ్చు.నిబంధన ప్రకారం 50శాతం పైగా ఓట్లు తెచ్చుకున్నవారినే విజేతగా ప్రకటిస్తారు. అలా రాని పక్షంలో మొదటి ఇద్దరిని మినహాయించి మిగిలిన వారిని పోటీ నుంచి తొలగిస్తారు. వారికి వచ్చిన ఓట్లలో రెండవ ప్రాధాన్యతా ఓట్లు ఎవరికి ఉంటాయో వారికి కలిపి 50శాతంపైగా తెచ్చుకున్నవారిని విజేతగా నిర్ధారిస్తారు. ఆ ప్రకారం వామపక్ష నేతకు 55.89 శాతం వచ్చాయి. శ్రీలంక నూతన రాజ్యాంగం ప్రకారం 1982 తరువాత జరిగిన ఎన్నికలన్నింటిలో గెలిచిన వారందరూ మొదటి రౌండులోనే 50శాతంపైగా సంపాదించుకొని గెలిచారు. తొలిసారిగా రెండవ ప్రాధాన్యత ఓటును పరిగణనలోకి తీసుకొని విజేతను నిర్ణయించారు. ముందే చెప్పుకున్నట్లు పార్లమెంటు ఎన్నికల్లో కూడా కొత్త రికార్డులు నమోదయ్యాయి. వామపక్ష ఎన్‌పిపికి వ్యతిరేకంగా సాజిత్‌ ప్రేమదాస, రానిల్‌ విక్రమసింఘే తమ విబేధాలను పక్కన పెట్టి ఒకే అభ్యర్థిని నిలిపారు. అయినప్పటికీ ఫలితం లేకపోయింది.


అధ్యక్ష ఎన్నికలలో ఆ రెండు పార్టీలకు కలిపి 50శాతంపైగా ఓట్లు వచ్చాయి. అదే పార్లమెంటు ఎన్నికలలో ఎస్‌జెపికి 17.66. ఎన్‌డిఎఫ్‌కు 4.49శాతం చొప్పున ఓట్లు వచ్చాయి. ఎస్‌జెపికి అంతకు ముందు 54 సీట్లు ఉండగా ఈ సారి 40కి తగ్గాయి. ఎన్‌డిఎఫ్‌కు కొత్తగా ఐదు సీట్లు వచ్చాయి. తిరుగులేని సోదరులుగా పేరుతెచ్చుకొని, అత్యంత హీన చరిత్రను మూటగట్టుకున్న శ్రీలంక పొడుజన పెరుమన(ఎస్‌ఎల్‌పిపి)కి గత ఎన్నికల్లో 59శాతం ఓట్లు తెచ్చుకోగా తాజా ఎన్నికల్లో 2.57శాతం మాత్రమే తెచ్చుకొని పోటీ నుంచి వైదొలగాల్సి వచ్చింది. అదే పార్లమెంటు ఎన్నికల్లో 3.14శాతం ఓట్లతో 145లో 142 పోగొట్టుకొని కేవలం మూడు సీట్లు మాత్రమే తెచ్చుకుంది. శ్రీలంక 74 సంవత్సరాల స్వాతంత్య్ర చరిత్రలో 38 ఏండ్ల పాటు అధికారంలో ఉండి చరిత్ర సృష్టించిన యుఎన్‌పి 0.59శాతం ఓట్లు తెచ్చుకొని ఒక్క సీటుకు పరిమితమైంది.అనూహ్యమైన అనుర కుమార విజయం తరువాత ఎన్‌పిపిలో ప్రధాన భాగస్వామిగా ఉన్న జనతా విముక్తి పెరుమన(జెవిపి) వైఖరిలో వచ్చిన మార్పు లేదా ఎత్తుగడల్లో భాగంగా అన్ని సామాజిక తరగుతులకు అది దగ్గరైంది. వారి విశ్వాసాన్ని చూరగొంది. అధ్యక్ష`పార్లమెంటు ఎన్నికల మధ్య ఉన్న రెండునెలల వ్యవధిని అది ఉపయోగించుకుంది.తమిళులు, ముస్లింలు గణనీయంగా ఉన్న ఉత్తర, తూర్పు ప్రాంతాలలో ఆ సామాజిక తరగతులకు చెందిన వారినే అభ్యర్థులుగా నిలిపారు. ఆ స్థానాల్లో అంతకు ముందు పాతుకుపోయిన నేతలందరినీ చిత్తుచిత్తుగా ఓడిరచారు. తమిళులు ఎక్కువగా ఉన్న ప్రాంతాలలో ఇలంకాయ్‌ తమిళ అరసు కచ్చి(ఐటిఎకె) పార్టీ 1949 నుంచి పని చేస్తున్నది. తమిళులు ఎక్కువగా ఉన్న జాఫ్నా జిల్లాలోని నాలుగు సీట్లలో దీనికి ఒక సీటు రాగా ఎన్‌పిపి మూడు తెచ్చుకుంది. ఇలాంటిదే మరో జిల్లా బట్టికలోవాలో ఎన్‌పిపికి ఒకటి, ఐటిఏకి మూడు వచ్చాయి. ఇక్కడ మాత్రమే ఎన్‌పిపి వెనుకబడిరది. పార్లమెంటు ఎన్నికల్లో 2.31శాతం ఓట్లు, ఎనిమిది సీట్లతో మూడవ స్థానంలో ఉంది. అధ్యక్ష ఎన్నికల్లో తమిళులు ఉండే ప్రాంతాలలో కేవలం పదిశాతం అంతకంటే తక్కువ ఓట్లు తెచ్చుకున్న ఎన్‌పిపి పార్లమెంటు ఎన్నికలకు వచ్చేసరికి 25 నుంచి 42శాతం వరకు పెంచుకుంది.


ఎన్‌పిపికి తిరుగులేని మెజారిటీ వచ్చిన కారణంగా అనేక పార్టీల మాదిరి అది కూడా నిరంకుశంగా వ్యవహరిస్తుందా అన్న చర్చను కూడా కొందరు లేవనెత్తుతున్నారు. లంక అధ్యక్షుడికి కార్యనిర్వాహక అధికారాలు ఉన్న కారణంగా గత పాలకులు అడ్డగోలుగా వ్యవహరించారు. దానికి పార్లమెంటులో మెజారిటీ కూడా తోడైంది. ఈ కారణంగానే అధ్యక్షుడు గొటబయ రాజపక్స ప్రజావ్యతిరేక నిర్ణయాలు తీసుకోవటంతో తలెత్తిన నిరసనకారణంగా అధ్యక్ష భవనంపై దాడితో మిలిటరీ రక్షణతో దేశం వదలి పారిపోవాల్సి వచ్చింది. నూతన రాజ్యాంగాన్ని తీసుకువచ్చి అధ్యక్షుడికి ఉన్న అపరిమిత అధికారాలను తొలగిస్తామని గతంలో వాగ్దానం చేసిన పార్టీలేవీ నిలబెట్టుకోలేదు. ఇప్పుడు ఎన్‌పిపి కూడా అదే వాగ్దానం చేసింది.ఇది కూడా కొత్త రాజ్యాంగాన్ని తెస్తుందా , ఇతర పార్టీల బాటలోనే ఉన్నదాన్నే కొనసాగిస్తుందా అన్న అనుమానాలు ఉన్నాయి.లాటిన్‌ అమెరికాలో వామపక్షాలు అధ్యక్ష, ప్రధాని పదవులు పొందుతున్నప్పటికీ పార్లమెంట్లలో మెజారిటీ తెచ్చుకోలేని కారణంగా అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయి. ఇప్పుడు లంకలో అలాంటి పరిస్థితి ఏర్పడకుండా స్పష్టమైన తీర్పు వచ్చింది. అందువలన ఎన్‌పిపి తన అజెండాను అమలు జరిపేందుకు ఎలాంటి చట్టపరమైన ఇబ్బందులు ఉండవు. లాటిన్‌ అమెరికా వామపక్షాల మాదిరే ఉన్న వ్యవస్థపునాదుల మీదనే సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తుందా లేక వ్యవస్థను మార్చేందుకు ప్రయత్నిస్తుందా అన్నది చూడాల్సి ఉంది.2022లో అధికారానికి వచ్చిన ప్రభుత్వం ఐఎంఎఫ్‌, ఇతర అంతర్జాతీయ సంస్థల షరతులన్నింటికీ తలవూపి రుణాలు తీసుకుంది. దాని వలన పౌర సంక్షేమానికి నిధుల కోత ఒకటైతే భారాలు మరొకటి. ఐఎంఎఫ్‌ ఒప్పందాల నుంచి తక్షణమే వైదొలిగితే మరోసారి లంక చెల్లింపులతో పాటు ఇతర ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటుంది. దాని షరతుల నుంచి ఉపశమనం కలిగించకపోతే జనంలో అసంతృప్త్తి తలెత్తటం అనివార్యం.


ప్రపంచబ్యాంకు, ఐఎంఎఫ్‌ షరతులను ఒకవైపు అమలు జరుపుతూ మరోవైపు సంక్షేమ చర్యలను కొనసాగించిన దేశాలు దాదాపు లేవు. ఐఎంఎఫ్‌ షరతుల నుంచి పేదలను రక్షిస్తానని అధ్యక్షుడు దిశనాయకే ప్రకటించినప్పటికీ నిలబెట్టుకుంటారా అన్నది ప్రశ్న. గత ప్రభుత్వం అంగీకరించిన మేరకు నాలుగు వందల ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరించటం లేదా పునర్‌వ్యవస్తీకరించాలి.ఏది జరిగినా లక్షల ఉద్యోగాలు పోతాయి.పౌరుల మీద పన్నులు పెంచాలి, ఉచిత విద్య, వైద్యం వంటి సేవల నుంచి ప్రభుత్వం వైదొలగాలి లేదా గణనీయంగా వాటి ఖర్చుకోత పెట్టాలి. మరోవైపు విదేశాంగ విధానం ఒక సవాలుగా మారనుంది. ఇప్పటి వరకు చైనా అనుకూల దేశంగా లంకకు ముద్రపడిరది. దాన్నుంచి తన ప్రభావంలోకి తెచ్చుకొనేందుకు భారత్‌ ప్రయత్నిస్తోందన్నది ఒక అభిప్రాయం. గత ప్రభుత్వం ప్రధాని నరేంద్రమోడీ పలుకుబడితో అదానీ కంపెనీకి ఇచ్చిన విద్యుత్‌ ప్రాజెక్టును రద్దు చేస్తామని కూడా దిశనాయకే ఎన్నికల ప్రచారంలో చెప్పాడు. అదే జరిగితే మనదేశ పెట్టుబడిదారులు అక్కడ పెట్టుబడులకు ముందుకు వెళ్లరు. మరోవైపు హిందూమహా సముద్రం మీద పట్టుకోసం అమెరికా అన్ని ప్రయత్నాలూ చేస్తున్నది.

సహజ వనరులపై రాష్ట్రాలు పన్నులు విధించవచ్చు

Tags

,

డాక్టర్ కొల్లా రాజమోహన్,
 
      మన రాష్ట్రంలో  ఇనుప ఖనిజం, బొగ్గు, సున్నపురాయి, సిలికా, మైకా,బాక్సైట్, గ్రానైట్, వజ్రాలు, బంగారం,వెండి, మాంగనీస్, రాగి, అల్యూమినియం, మాంగనీస్, బాక్సైట్, యురేనియం, ధోరియం లాంటివే కాకుండా భూమిలో లభించేటటువంటి శిలాజ ఇంధనాలు అంటే చమురు, సహజవాయువులను మైనింగ్ ద్వారా వెలికి  తీస్తున్నారు.  ఇంతకాలం వీటిపై పన్ను వేసే అధికారం, హక్కులు కేంద్ర ప్రభుత్వానికే ఉన్నాయి. వీటిపై హక్కులు ఆయా రాష్ట్రాలకే ఉండాలని చాలా సంవత్సరాలుగా ఆయా రాష్ట్రాలు న్యాయ పోరాటాన్ని కొనసాగిస్తున్నాయి. చిట్ట చివరికి వారి న్యాయపోరాటం ఫలించి సుప్రీం కోర్టు చారిత్రాత్మక తీర్పునిచ్చింది. ప్రధాన న్యాయమూర్తి  జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలోని తొమ్మిది మంది  న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం, గనులు, ఖనిజాలపై  పన్ను విధించే అధికారం రాష్ట్రాలకే ఉందని, కేంద్రానికి ఆ హక్కు లేదని, 2024, జూలై 25న 8-1 మెజార్టీతో  తీర్పు ఇచ్చింది.
      తీర్పు  రాష్ట్రాల అధికారాన్ని, ఫెడరలిజం స్ఫూర్తిని నిలబెట్టేదిగా ఉన్నది.  ఖనిజాలు, నిక్షేపాలు గల భూమిపై రాయల్టీ విధించే అధికారం కేంద్ర ప్రభుత్వానికి మాత్రమే ఉందని1989 లో కోర్టు ఇచ్చిన తీర్పును వ్యతిరేకిస్తూ కొన్ని రాష్ట్రాలు  సర్వోన్నత న్యాయస్థానానికి  వెళ్లాయి. ఈ తీర్పు ఫలితంగా అప్పులలో ఉన్న ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్రాలను సంపద్వంతమైన రాష్ట్రాలుగా అభివృద్ధి పరచవచ్చు.  ఒరిస్సా, ఆంధ్రప్రదేశ్, జార్ఖండ్,ఛత్తీస్ గడ్  లాంటి రాష్ట్రాలు ఆర్థికంగా బలోపేతం అవుతాయి. ఆత్మాభిమానాన్ని తాకట్టు పెట్టి కేంద్రం వైపు ఆర్థిక సహాయం కోసం చూడవలసినటువంటి అవసరం ఉండకపోవచ్చు.    


ఖనిజ హక్కులపై పన్ను  విధించే అధికారం ఎవరిది?
 
    ఇండియా సిమెంట్స్ Vs తమిళనాడు(1990) , కేశోరామ్ సిమెంట్స్ Vs వెస్ట్ బెంగాల్ రాష్ట్రం(2004), మధ్య నడిచిన కేసులలో పరస్పర విరుద్ధ మైన తీర్పులు వచ్చాయి. రాయల్టీ పన్ను ఔనా ? కాదా? రాష్ట్రాలకు పన్ను విధించే అధికారం వుందా లేదా ? ఖనిజాలు, ఖనిజ హక్కులపై పన్ను  విధించే అధికారం ఎవరిది? రాష్ట్ర ప్రభుత్వానిదా  లేక   కేంద్ర ప్రభుత్వానిదా? అనే విషయంపై కొన్ని దశాబ్దాల నుండి వాదోపవాదాలు నడుస్తున్నాయి. వందల కేసులు ఉన్నత న్యాయస్థానంలో పెండింగ్ లోఉన్నాయి. కోర్టుల్లో నడిచిన ముఖ్యమైన కేసులు- 1)రాజ్యాంగం లోని 246 ఆర్టికల్ ద్వారా సంక్రమించిన అధికారాలను ఉపయోగించి 1957 లో మైన్స్ అండ్ మినరల్స్ డెవలప్మెంట్ MMDR చట్టాన్ని పార్లమెంటు తెచ్చింది. ఆ చట్టం కింద సెక్షన్ 9 ద్వారా ఖనిజాలను తీస్తున్నవారు రాయల్టీని యూనియన్ ప్రభుత్వానికి చెల్లించాలన్నారు. 2) తమిళనాడు ప్రభుత్వం లైమ్ స్టోన్ ఖనిజాన్ని వెలికితీస్తున్న ఇండియా సిమెంట్స్ పై 7వ షెడ్యూల్ లోని రాష్ట్ర జాబితాలోని 49, 50 ఎంట్రీ ల ప్రకారం భూమిపన్నును విధించింది. ఇండియా సిమెంట్స్ Vs తమిళనాడు కేసులో 7 గురు సభ్యులున్న సుప్రీంకోర్టు బెంచ్, మైన్స్ అండ్ మినరల్స్ డెవలప్మెంట్ MMDR చట్టం ప్రకారం, రాయల్టీపై సెస్స్, పన్ను విథించే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదన్నారు. రాయల్టీ అంటే పన్ను అన్నారు. 3) కేశోరామ్ ఇండస్ట్రీస్ Vs వెస్ట్ బెంగాల్ రాష్ట్రం మధ్య నడిచిన కేసులో, రాజ్యాంగ బెంచ్ తద్విరుద్ధ మైన తీర్పు ఇచ్చింది. పన్ను విథించే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉందన్నారు. రాయల్టీ అంటే పన్ను కాదన్నారు. అంతకుముందు  ఇండియా సిమెంట్స్ Vs తమిళనాడు కేసులో ఇచ్చిన తీర్పు నిర్ణయం అనుకోకుండా తప్పిదం నుండి ఉద్భవించిందన్నారు. రాయల్టీ పన్ను కాదన్నారు.
     
పన్ను విధించే శాసనాధికారం రాష్ట్రాలకే వున్నది!
   సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం 8-1 మెజార్టీతో ఇచ్చిన తీర్పులో—ముఖ్యమైన అంశాలు. ఎ) ఖనిజ హక్కులపై పన్ను విధించే శాసనాధికారం రాష్ట్ర శాసనసభలకు ఉంటుంది. యూనియన్ జాబితాలోని ఎంట్రీ 54 కింద ఖనిజ హక్కులపై పన్ను విధించే శాసనపరమైన సామర్థ్యం పార్లమెంటుకు లేదు, ఇది జనరల్ ఎంట్రీ . మినరల్ హక్కులపై పన్ను విధించే అధికారం రాష్ట్ర జాబితా IIలోని ఎంట్రీ 50లో పేర్కొనబడినందున, ఆ విషయానికి సంబంధించి పార్లమెంటు తన విశేష అధికారాలను ఉపయోగించలేదు.
బి) గనులు మరియు క్వారీలతో కూడిన భూములపై ​​పన్ను విధించేందుకు రాష్ట్ర జాబితా IIలోని ఎంట్రీ 49తో పాటు ఆర్టికల్ 246 ప్రకారం రాష్ట్ర శాసనసభలు శాసన సామర్థ్యాలను కలిగి ఉంటాయి. లిస్ట్ IIలోని ఎంట్రీ 50కి సంబంధించి ఖనిజాభివృద్ధికి సంబంధించిన చట్టంలో పార్లమెంటు విధించిన “పరిమితులు” లిస్ట్ లోని ఎంట్రీ 49పై పనిచేయవు, ఎందుకంటే రాజ్యాంగం ప్రకారం ఆ ప్రభావానికి ఎటువంటి నిర్దిష్ట నిబంధన లేదు.
 
వసూలు చేసిన సొమ్ము తిరిగి ఇవ్వండి!
 
   సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పు తర్వాత కొన్ని రాష్ట్రాలు గనులు, ఖనిజాలపై  1989 నుంచి విధించిన రాయల్టీ సొమ్మును  వాపసు ఇవ్వాలని డిమాండ్ చేశాయి. ఈ డిమాండ్ ను కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో బుధవారం వ్యతిరేకించింది. ఒక్క ప్రభుత్వరంగ కంపెనీలే 70 వేల కోట్లను తిరిగి చెల్లించాల్సి వస్తుందని, దానివల్ల వాటి ఖజానా ఖాళీ  అయి పౌరుల నుంచి ఆ సొమ్మును అధిక ధరల రూపంలో వసూలు చేసుకోవాల్సి వస్తుందని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా సుప్రీంకోర్టులో తన వాదనలు వినిపించారు. కేంద్ర ప్రభుత్వ వాదనలను తిరస్కరించి 2005 ఏప్రిల్ ఒకటి నుంచి  కేంద్రం, గనుల కంపెనీలు వసూలు చేసిన రాయల్టీని తిరిగి రాష్ట్రాలకు  ఇవ్వాలని కూడా సుప్రీంకోర్టు  ఆగస్టు 14వ తేదీన స్పష్టం చేసింది. రాయల్టీ బకాయిలు రెండు లక్షల కోట్ల రూపాయలకు మించి ఉండొచ్చని అంచనా. వచ్చే 12 ఏళ్లలో దశలవారీగా  కేంద్రం,గనుల కంపెనీలు  రాష్ట్రాలకు బకాయిలు చెల్లించవచ్చని  ధర్మాసనం పేర్కొంది. బకాయిలు చెల్లింపు పై ఎటువంటి అపరాధ రుసుమును విధించరాదని రాష్ట్రాలకు సుప్రీంకోర్టు ఆదేశించింది.   సుప్రీంకోర్టు తీర్పు అమలులోకి వస్తే , ఆర్థిక వనరులు లేక, అప్పులు దొరకక, పన్నులు వేయలేక దిక్కు తోచని  స్థితి ఉన్నటువంటి  రాష్ట్రాలకు కొంత ఉపశమనం కలుగుతుంది.
 
అయితే కోర్టు విచారణలో పెట్రోల్ , గ్యాస్ గురించి లేకపోవడం విచారకరం!
 
    అయితే కోర్టు విచారణలో   ఆయిల్ ఫీల్డ్స్, మినరల్ ఆయిల్ రిసోర్సెస్, పెట్రోల్ , మరియు పెట్రోలియం ప్రొడక్ట్స్  గురించి లేకపోవడం విచారకరం. 438 మంది పిటిషన్ దారులు గాని, ప్రభుత్వం గానీ పెట్రోలియం ప్రొడక్ట్స్ గురించి అడగనందువలన సుప్రీం కోర్ట్ విచారణలో  లేవని సుప్రీంకోర్టు తన తీర్పులో 6 వ పేరాలో తెలియజేసింది. ఇనుప ఖనిజం, బొగ్గు, మైకా,బాక్సైట్, గ్రానైట్, వజ్రాలు, బంగారం, వెండి , మాంగనీస్, బాక్సైట్ , యురేనియం, ధోరియం లాంటివే కాకుండా భూమిలో లభించేటటువంటి శిలాజ ఇంధనాలు అంటే చమురు, సహజవాయువులను అన్ని దేశాలలో ఖనిజ సంపదగా పరిగణిస్తారు.  ఖనిజ సంపదను ఆర్గానిక్, ఇనార్గానిక్ గా విభజించారు. ఆయిల్ ఫీల్డ్స్, మినరల్ ఆయిల్ రిసోర్సెస్,  పెట్రోల్ , గ్యాస్ లను ఆర్గానిక్ సంపద గా పేర్కొన్నారు.
   పెట్రోలియం ఉత్పత్తులు గనులు  లాంటి నిక్షేపాలు గల రాష్ట్రాలు  ఆర్ధికంగా వెనుకబడిన రాష్ట్రాలుగా తక్కువ ఆదాయంతో  ఉన్నాయి. సహజ వనరులు బాగా ఎక్కువగా ఉన్నటువంటి రాష్ట్రాలు చాలా పేద రాష్ట్రాలుగా ఉన్నాయి. ఆయిల్, గ్యాస్ నిక్షేపాలు అపారంగా ఉన్న రష్యా, అమెరికా,ఇరాన్, సౌదీ దేశాలు సంపద్వంతంగావున్నాయి. మనకు గ్యాస్, ఆయిల్ దండిగావున్నా మన రాష్ట్ర సంపద పెరగలేదు. అంబానీ సంపద ఇబ్బడి ముబ్బడిగా పెరుగుతుంది. రాష్ట్రంలో లభించే ఖనిజ సంపదలన్నిటిపైనా ఆశ్రిత పెట్టుబడిదారీ వర్గమైన అంబానీ లాంటి వారి ఆదిపత్యం కొనసాగుతున్నది.
 
ఒకవైపు బంగారపు సింహాసనాలు మరోవైపు  రైతుల ఆత్మహత్యలు!
 
     సహజ వనరులు ఏ రాష్ట్రంలో ఉంటే ఆ రాష్ట్రానికి ఉత్పత్తిలో50 శాతం కేటాయించాలని 12వ ఫైనాన్స్ కమిషన్ కూడా చెప్పింది. కేంద్ర ప్రభుత్వం  రాష్ట్ర ప్రభుత్వాల వాదనలను పెడచెవిన పెట్టింది. 50 శాతం వాటా ఇవ్వలేదు. పన్ను విధించే హక్కు లేదన్నారు. కష్టాలు మనకి సంపద కార్పోరేట్ కంపెనీలకు వెళుతుంది.  భూమి లోపల కొన్ని లక్షల సంవత్సరాల పరిణామాల ఫలితంగా ఖనిజాలు,సహజవాయువు, చమురు ఏర్పడుతుంది. అటువంటి విలువైన ఖనిజ సంపదను కొద్దిమంది ఆశ్రిత పెట్టుబడిదారీ వర్గానికి  కట్టపెట్తున్నారు. ప్రజల సొత్తైన ఖనిజ సంపదను కొట్టేసి, బంగారపు సింహాసనాలపై కూర్చొని ప్రజలపై అధికారాలను చెలాయిస్తూ, దేవతా విగ్రహానికి బంగారు కిరీటాలు సమర్పిస్తూ కులుకుతున్నారు.  ప్రపంచ ధనవంతుల లిస్టులో ప్రధమ స్థానం కోసం పోటీ పడుతున్నారు. వేలకోట్లు ఖర్చు పెట్టి పెళ్ళిళ్ళు చేస్తున్నారు. మరోవైపు తాళిబొట్టు తాకట్టు పెట్టి వ్యవసాయం చేస్తున్న రైతుల ఆత్మహత్యల నివారణకు సహజ వనరులను ఉపయోగించాలనే కనీస బాధ్యత పాలకులకు లేనందున ప్రజలు కష్టాలను ఎదుర్కొంటూ జీవిస్తున్నారు.  ఖనిజాలు భూమి నుండి వెలికి తీసిన ఫలితంగా భూమిలో, పర్యావరణంలో ఎన్నో మార్పులు సంభవిస్తున్నాయి. భూగర్భ జలాలు, చెరువులు, బావులు, గాలి కలుషితమయి, వాతావరణ దుష్పరిణామాలవలన కిడ్నీ, శ్వాసకోశ వ్యాధులు, గుండెజబ్బులు,కేన్సర్ బారిన పడ్డ ప్రజలు కనీస వైద్య సదుపాయాలు లేక నరకాన్ని అనుభవిస్తున్నారు. అపారమైన సహజ సంపదను బడా కార్పోరేట్ కంపెనీలకు అప్పచెప్పి ఆదివాసీలను గాలికి వదిలేశారు. సహజ సంపదను కాపాడుతున్న ఆదివాసీలకు కనీస జీవన సౌకర్యాలను కలగచేయటంలో విఫలం చెందారు .ఆదివాసీల అభ్యున్నతికి చట్టాలు ఎన్నో వున్నాయి. ఆచరణలో ఈ చట్టాలు కార్పొరేట్ కంపెనీలకే ఉపయోగపడుతున్నాయి.

కోర్టు తీర్పుల అమలు ప్రజా ఉద్యమ శక్తి పై ఆధారపడి వుంటుంది

అయితే చట్టాలు వేరు, కోర్టులు తీర్పులు వేరు. వాటి అమలు చేయటం ప్రజల పైన ప్రజా ఉద్యమాల తీవ్రత, బలాబలాల పొందిక పైన ఆధారపడి ఉంటుందనే విషయం అందరికీ అనుభవమే. తెలంగాణ సాయుధ పోరాట కాలంలో ప్రజలే భూసంస్కరణల ను అమలు పరచుకొని భూమిని పంచుకున్నారు. ప్రజా ఉద్యమాలకు భయపడి కౌలు దారి చట్టం, భూసంస్కరణల చట్టాలను తెచ్చారు. ప్రజా ఉద్యమాల తీవ్రత తగ్గుతూ వస్తున్న కాలంలో చట్టాలను అమలు పరచలేదు. శ్రీకాకుళం రైతాంగ పోరాటం తరువాత మరోసారి భూసమస్య ముందుకు వచ్చింది. భూసంస్కరణల చట్టాలను అమలు పరచమని కొల్లావెంకయ్యగారి పిటీషన్ పై మిగులు భూములను పేదప్రజల కు పంచమని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. అయితే ఈ భూస్వామ్యవర్గ ప్రభుత్వాలు ఆ తీర్పును ఇప్పటివరకు అమలు పరిచ లేదు. భూసమస్య ఇంతవరకూ పరిష్కరింపబడలేదు. స్వామినాథన్ వ్యవసాయ కమిషన్ 2006 లో విస్పష్టంగా భూసమస్యను పరిష్కరించమని మొదటి రికమండేషన్ గా చెప్పినా అమలు పరచలేదు. భూసేకరణ చట్టం 2013 ను ఆచరణలో నిర్వీర్యంచేసి కార్పోరేట్ కంపెనీలకు భూమిని అప్పచెప్తున్నారు. అభివృద్ధి పేరున భూములను గుంజు కుంటున్నారు. భూసంస్కరణల చట్టాలను అమలు పరచమనే ఉద్యమాలకు శక్తి చాలటం లేదు. భూసంస్కరణల కోసం పోరాడే పరిస్థితి ఈనాడు లేదు. కార్మిక చట్టాలను రద్దు చేస్తున్నారు. ఈ రాజ్య వ్యవస్థ లో ప్రజానుకూల మైన చట్టాలు తీర్పులు రావటమే అరుదు. ఒక చిన్న అవకాశం దొరికినా ప్రజా ఉద్యమాల పురోగతికి ఉపయోగపెట్టుకోవటం అవసరం. వ్యవస్థ మార్పు తోనే ముఖ్య సమస్యలు పరిష్కారం సాధ్యమనే అవగాహనతో చట్టాలను అమలు పరచమని ఆందోళనలు జరుగుతున్నాయి. నామమాత్రపు తీర్పులైనా విశాల ప్రజానీకానికి ఉపయోగమనుకుంటే ప్రజలలో ప్రచారం చేయాలి. అమలు చేయమని నిలదీయాలి. సానుకూల మైన అంశాలను ప్రజలకు తెలియ చేయాలి. ఎపుడో నూటికి కోటికి వచ్చే ప్రజానుకూల మైన తీర్పులను గమనంలోకి తీసుకుంటూనే ప్రభుత్వాధినేతల స్వార్ధాన్ని బహిరంగపరచాలి. క్రోనీ కేపటలిజం అమలును అంబానీ, అదానీల వైపు ప్రభుత్వం పక్షపాతాన్ని , అధికార కేంద్రీకరణ ను ఇటువంటి తీర్పుల ఉదాహరణలతో ప్రజలను చైతన్య పరచాలి. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రలపై పెత్తనాన్ని మరింత తీవ్రతరం చేస్తున్నది. రాష్ట్ర ప్రభుత్వాలు తరతమ బేధం తో తమ అసంతృప్తిని తెలియచేస్తున్నాయి. ఒకే దేశం, ఒకే మతం, ఒకే భాష, ఒకే ఎన్నిక, డబల్ ఇంజన్ సర్కార్, అంటూ కేంద్ర ప్రభుత్వం ప్రజల పై భారం పెంచుతుంది. మరొకపక్క క్రోనీ కేపిటలిజానికి ప్రతినిధులుగా వున్న అంబానీ, అదానీలకు సంపదను కట్టపెట్తున్నారు. వారిని ఎదుర్కొనటానికి లభించిన ప్రతి అవకాశాన్నీ వినియోగించుకోవాలి.ఈ తీర్పును రాష్ట్ర ప్రభుత్వాలు సరిగ్గా అమలు పరుస్తాయా? కార్పోరేట్ కంపెనీల కు అనుకూలంగా వ్యవహరిస్తాయా? అనేది ప్రజా ఉద్యమాల తీవ్రత పై ఆధారపడి ఉంటుంది.
 ఈ సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం రాష్ట్రాలు సహజవనరుల పై పన్ను విధించితే రాష్ట్రాల ఆదాయం గణనీయంగా పెరుగుతుంది . రాష్ట్ర ప్రజల అభివృద్ధికోసం కేంద్ర ప్రభుత్వం దయాదాక్షిణ్యాలపై ఆధారపడాల్సిన అవసరం వుండదు.  కేజీ బేసిన్ లో లభ్యమయ్యే గ్యాస్, ఆయిల్ తో సహా,  సహజ వనరులన్పనిటిపైనా పన్ను విధించే రాజ్యాంగ పరమయిన హక్కు మనకున్నదని చెప్పాలి. అందుకు జులై 25 సుప్రీంకోర్టు తీర్పును ఉదహరించాలి. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులో ఇతర ఖనిజాలతో పాటు గ్యాస్, చమురును చేర్చాలని సుప్రీంకోర్టులో లీగల్ పోరాటం చేయాలి.  ఖనిజ వనరులపై రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పన్ను విధించాలి. న్యాయమైన డిమాండ్ల సాధన కోసం పార్టీలకు అతీతంగా అన్ని వామపక్ష విప్లవ పార్టీలు, వివిధ రంగాల ప్రజా సంఘాలు, పౌర హక్కుల సంఘాలు, ప్రజాస్వామ్యవాదులు సమైక్యంగా ముందుకు కదలాల్సిన తరుణం ఆసన్నమయింది. ప్రజలకు దక్కాల్సిన సహజ వనరులపై హక్కులపై ఆదిపత్యం చలాయిస్తున్న అంబానీ,  అదానీలాంటి ఆశ్రిత పెట్టుబడిదారీవర్గంపై ప్రజాఉద్యమాన్ని నిర్మించడానికి ముందుకు సాగుదాం!  చారిత్రాత్మక సుప్రీంకోర్టు తీర్పు వెలుగులో సమైక్య ఉద్యమాన్ని నిర్మించాలి! 

డాక్టర్ కొల్లా రాజమోహన్, కన్వీనర్, కే జి బేసిన్ గ్యాస్ & ఆయిల్ సాధన సమితి. గుంటూరు. 9000657799.,

ఏం కొనేటట్టు లేదు ఏం తినేటట్టు లేదు : అడ్డగోలు వాదనలు తప్ప అచ్చేదిన్‌ జాడ ఎక్కడ మోడీ జీ !

Tags

, , , , , ,

ఎం కోటేశ్వరరావు


చిల్లర ద్రవ్యోల్బణం పద్నాలుగు నెలల గరిష్టం 2024 అక్టోబరు నెలలో 6.21శాతానికి చేరింది. ఆహార ద్రవ్యోల్బణం అంతకు మించి 15నెలల గరిష్టం 10.87శాతానికి చేరింది.ఏడాది క్రితం అక్టోబరు నెలలో 6.61శాతమే ఉంది. ఈ అంకెలను మోడీని వ్యతిరేకులు చెప్పలేదు, కేంద్ర ప్రభుత్వ జాతీయ గణాంక సంస్థ(ఎన్‌ఎస్‌ఓ) వెల్లడిరచినవే. ప్రతినెల 12వ తేదీన ధరలు, ద్రవ్యోల్బణం సంబంధిత అంశాలను ఎన్‌ఎస్‌ఓ విడుదల చేస్తుంది. గతంలో మోడీ మంత్రదండపు విజయగాధలను గానం చేసిన వారు ఇప్పుడు మాట్లాడటం లేదు. దేవునిబిడ్డ అతీంద్రియ శక్తులు ఏమైనాయో తెలియటం లేదు. వాటిని జనం నమ్మటం లేదని తాజా లోక్‌సభ ఎన్నికల ఫలితాలు వెల్లడిరచాయి. సావిత్రీ నీ పతిప్రాణంబు తప్ప వేరే కోరికలు కోరుకొమ్మని యమధర్మరాజు చెప్పాడన్న కథ మాదిరి నరేంద్రమోడీ గతంలో చెప్పిన వాటిని తప్ప కొత్త్త అంశాలను మాత్రమే చెబుతున్నారు. మాటల మాంత్రికుడు మరి. పదేండ్ల క్రితం ధరల పెరుగుదలతో జనాలకు చచ్చే రోజులు దాపురించటాన్ని నరేంద్రమోడీ చక్కగా వినియోగించుకున్నారు. తనకు అధికారమిస్తే అచ్చేదిన్‌ తెస్తానని చెప్పారు. ఇప్పుడా మాట కలలో కూడా ప్రస్తావించటం లేదు.


తమ మోడీ హయాంలో ద్రవ్యోల్బణం లేదా ధరల పెరుగుదల రేటు తగ్గిందని, అది ఆయన గొప్పతనమే అని భక్తులు పారవశ్యంతో ఊగిపోతారు.2014 మార్చి నెలలో వినియోగదారుల(వస్తువుల) సాధారణ సూచిక 138.1 ఉంటే 2024 అక్టోబరు నెల అంచనా 196.8గా ఉంది. దీన్ని సులభంగా చెప్పుకోవాలంటే నిత్యావస వస్తువుల ఒక కిట్‌ ధర పదేండ్లలో రు.138.10 నుంచి రు 196.80కి పెరిగింది.విడివిడిగా అంటే కేవలం ఆహార వస్తువులనే తీసుకుంటే రు.140.70 నుంచి రు.209.40కి చేరింది. అచ్చేదిన్‌ అని నరేంద్రమోడీ చెప్పినపుడు అంతకు ముందున్న ధరలను తగ్గిస్తారని జనం అనుకున్నారు. అబ్బే తగ్గింపు అంటే ధరలు కాదు పెరుగుదల రేటు అని ఇప్పుడు టీకా తాత్పర్యాలను చెబుతున్నారు. గతంలో పది పెరిగితే ఇప్పుడు ఏడు మాత్రమే పెంచుతున్నాం అంటున్నారు. ఇది వాస్తవమా ? మోడీ తొలిసారి అధికారానికి వచ్చిన సమయంలో మనం దిగుమతి చేసుకొనే ముడి చమురుధరలు ఆకాశాన్ని అంటాయి. వెంటనే అంతర్జాతీయ మార్కెట్లో పతనంతో దిగుమతి బిల్లు తగ్గి ద్రవ్యోల్బణం గణనీయంగా తగ్గింది. దీన్ని తన విజయంగా చెప్పుకున్నారు. 2014 జనవరి నుంచి 2019 జనవరి వరకు చూస్తే 22 నిత్యావసర వస్తువుల్లో పదింటి ధరలు పదిశాతం పెరిగాయి. పెసరపప్పు, బంగాళాదుంపలు, ఉల్లి ధరలు అంతకు ముందు ఉన్నవాటి కంటే కాస్త తగ్గాయి. తొమ్మిది వస్తువుల ధరలు పది నుంచి 40శాతం వరకు పెరిగాయి. సెనగపప్పు, పాల ధరలు 33,21శాతం చొప్పున పెరిగాయి. అదే 2019 జనవరి నుంచి 2024 జనవరి వరకు అన్ని వస్తువుల ధరలు 15శాతం పైగా పెరిగాయి తప్ప తగ్గలేదు. పన్నెండు సరకుల ధర 40శాతంపైన, ఏడిరటి ధర 50శాతం పైగా పెరిగింది.కందిపప్పు 110, ఉల్లి 107శాతం పెరిగింది. పప్పుధాన్యాల ధరల సూచిక 2014 మార్చి నెలలో 120.1 ఉంటే ఈ ఏడాది అక్టోబరులో 216.8గా ఉంది. జనం పప్పు తినటం మరచిపోయారు. ఇదంతా అచ్చేదిన్‌ కాలపు నిర్వాకం. ధరల పెరుగుదల యూపిఏ పాలన చివరి సంవత్సరాల నాటి స్థాయికి చేరే బాటలో ఉంది.గ్రామీణ ప్రాంతాలలో సాధారణ ద్రవ్యోల్బణం రేటు ఎక్కువగా ఉంది. అక్టోబరులో ఆహార వస్తువుల ధరల సూచిక ప్రకారం పట్టణాల్లో 10.69శాతం ఉంటే పట్టణాల్లో 11.09శాతం ఉంది.ఆహార ధరల పెరుగుదల ఇలా ఉన్న కారణంగానే జనం అవసరమైన మేరకు పోషకాహారం తీసుకోలేకపోతున్నారు.అలాంటి జనాలు రోగాల పాలు కావటం దాని మీద ఖర్చు మరొక భారం.మొత్తంగా ధరల పెరుగుదల కారణంగా వస్తువుల మీద విధిస్తున్న జిఎస్‌టి ఏడాది కేడాది పెరుగుతున్నది. తమ ప్రభుత్వం సాధించిన అభివృద్దే దీనికి నిదర్శనం అంటూ పాలకులు తప్పుదారి పట్టిస్తున్నారు.


మనదేశంలో అత్యధికులు తమ ఆదాయాల్లో సగం మొత్తాన్ని ఆహారం కోసమే ఖర్చు చేయాల్సి వస్తోంది. ఆహార వస్తువుల ధరల పెరుగుదల పతనంలో ప్రకృతిలో వచ్చే మార్పుల ప్రభావం ఒక వాస్తవం. కానీ పెరిగినపుడల్లా తమకేం సంబంధం లేదు అంతా ప్రకృతి, దేవుడే చేశాడన్నట్లుగా చెప్పటం, తగ్గినపుడు అదంతా తమ ఘనతే అని జబ్బలు చరుచుకోవటం తెలిసిందే. ప్రభుత్వాలు, అవి రూపొందించే విధానాల వైఫల్యాల గురించి కావాలని దాచివేస్తున్నారు. నూనె గింజల ఉత్పత్తికి అవసరమైన అధికదిగుబడి వంగడాలను రూపొందించటంలో అధికారంలో ఎవరున్నా అన్ని పార్టీలు విఫలమయ్యాయి. ఇటీవలనే కేంద్ర ప్రభుత్వం దిగుమతి చేసుకొనే వంటనూనెలపై గరిష్టంగా 30శాతం వరకు దిగుమతి పన్ను విధించింది. ఆ మేరకు దిగుమతి చేసుకొనేవాటితో పాటు స్థానికంగా తయారయ్యే వాటి ధరలు కూడా పెరిగాయి. కొన్ని ఔషధాల ధరలను కేంద్ర ప్రభుత్వం 50శాతం పెంచింది, ఎందుకు అంటే జనానికి అవసరమైన వాటిని ఉత్పత్తి చేయాలంటే కంపెనీలకు గిట్టుబాటు కావటం లేదు, పెంచకపోతే ఉత్పత్తి మానివేస్తే జనానికే నష్టం అని చెబుతున్నారు. ఆహార ధాన్యాలు కూడా జనానికి అవసరమే. వ్యవసాయ ఉత్పత్తి పట్ల కూడా అదే విధంగా వ్యవహరిస్తున్నదా ? 2014లో క్వింటాలు సాధారణ రకం ధాన్య కనీస మద్దతు ధర రు.1,310 కాగా ఇప్పుడు రు.2,183కు పెంచారు. మరోవైపు ధాన్య ఉత్పత్తి ఖర్చు ఇదే కాలంలో రు.644 నుంచి రు.1,911కు పెరిగిందని వ్యవసాయ పంటల ధరల,ఖర్చుల కమిషన్‌ చెప్పింది. ఈ ఖర్చుతో పోల్చుకుంటే మద్దతు ధరల పెరుగుదల ఎంత తక్కువో చెప్పనవసరం లేదు. ఆహారం లేకుండా ఔషధాలతోనే జన జీవితాలు గడుస్తాయా ? నరేంద్రమోడీ తన అద్భుత శక్తులతో అలాంటి మందు గోలీలను తయారు చేస్తే మంచిదే మరి !


యుపిఏ పాలనా కాలంలో ధరల పెరుగుదలను బిజెపి రాజకీయంగా సొమ్ము చేసుకుంది. తమకు అధికారమిస్తే ధరలను తగ్గిస్తామని నమ్మబలికింది.గుజరాత్‌ ముఖ్యమంత్రిగా నరేంద్రమోడీ 2012 మే 23,24 తేదీలలో మూడు ట్వీట్లు చేశారు. పార్లమెంటు సమావేశాలు ముగిసిన తరువాత పెట్రోలు ధరల పెంపు ప్రకటన పార్లమెంటు గౌరవాన్ని భంగపరచటమే అన్నారు.(తన ఏలుబడిలో పార్లమెంటుతో నిమిత్తం లేకుండానే పెట్రోలు ధరలు, పన్ను మొత్తాలను నిర్ణయిస్తున్న అపర ప్రజాస్వామికవాది) పెద్ద మొత్తంలో ధరల పెంపుదల యుపిఏ ప్రభుత్వ వైఫల్యం, గుజరాత్‌ మీద వందల కోట్ల భారం పడుతుందన్నారు. కాంగ్రెస్‌, దాని మిత్ర పక్షాలు పాలిస్తున్న రాష్ట్రాలలో కంటే గుజరాత్‌లో పెట్రోలియం ఉత్పత్తుల మీద విధిస్తున్న వ్యాట్‌ తక్కువ అన్నారు. యుపిఏ పాలనలో గ్యాస్‌ ధర పెరగ్గానే సిలిండర్‌ పట్టుకొని మీడియా ముందుకు పరుగుపరుగున వచ్చిన బిజెపి నాయకురాలు స్మృతి ఇరానీ గురించి చెప్పనవసరం లేదు. ‘‘ గ్యాస్‌ ధర యాభై రూపాయలు పెంచి కూడా తమది పేదల సర్కార్‌ అని చెప్పుకుంటున్నారు సిగ్గులేదు,యుపిఏ పాలనలో జిడిపి అంటే గ్రాస్‌ డొమెస్టిక్‌ ప్రోడక్ట్‌ కాదు గ్యాస్‌, డీజిల్‌, పెట్రోలు ధరలు, ఆరోసారి పెట్రోలు ధరలు పెంచారు, ఇదేమాత్రం సమర్ధనీయం కాదు, దీని వలన ద్రవ్యోల్బణం పెరుగుతుంది. యుపిఏ ప్రభుత్వ తప్పుడు విధానాల ఫలితంగానే పెట్రోలు ధరలు, గృహరుణాల వడ్డీ పెరుగుతున్నదని, కంపెనీల కోసమే పెట్రోలు ధరలు పెంచుతున్నారని , చైనా చొరబాట్లు, పెట్రోలు ధరలు పెరుగుతున్నాయని, రూపాయి విలువ పడిపోయిందని, 60శాతం దేశపౌరులు ఆహారం కోసం ఇబ్బందులు పడుతుంటే లౌకిక వాదం గురించి మాట్లాడుతున్నారంటూ ’’ 2010`13 సంవత్సరాలలో ట్వీట్లు చేశారు.


అదే బిజెపి పెద్దలు ఇప్పుడు గద్దె మీద ఉన్నారు. స్మృతి ఇరానీ లేదా ఆమె చేతిలో సిలిండర్‌గానీ ఎక్కడా కనిపించటం లేదు. గ్యాస్‌ ధర ఎంతో అందరికీ తెలిసిందే. ప్రతిపక్షంలో ఉండగా చెప్పిందేమిటి ఇప్పుడు చేస్తున్నదేమిటి ?ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ చమురు ధరల పెరుగుదలను సమర్ధించుకొనేందుకు జవహర్‌లాల్‌ నెహ్రూ పేరును ఉపయోగించుకున్నారు.కొరియా యుద్ధం భారత ద్రవ్యోల్బణం మీద ప్రభావం చూపుతుందని 1951లోనే పండిట్‌ జవహర్‌లాల్‌ నెహ్రూ చెప్పారు. ప్రపంచమంతా ఒకటిగా ఉన్న ఇప్పుడు ఉక్రెయిన్‌ యుద్దం ప్రభావితం చేస్తున్నదని మేం చెబుతున్నాం, దాన్ని అంగీకరించరా ? చమురు కంపెనీలు అధిక ధరలకు చమురు దిగుమతి చేసుకుంటే దాన్ని మనం భరించాల్సిందే అని లోక్‌సభలో సమర్దించుకున్నారు. పోనీ ఈ తర్కానికైనా కట్టుబడి ఉన్నారా ? జనం పట్ల, ద్రవ్యోల్బణం తగ్గింపు పట్ల ప్రభుత్వానికి చిత్తశుద్ది ఉందా అన్నదే ప్రశ్న. అంతర్జాతీయ మార్కెట్లను బట్టి చమురు ధరలు నిర్ణయిస్తామని ప్రకటించి అమలు జరిపిన పెద్దలు రెండున్నర సంవత్సరాలుగా ఎందుకు నిలిపివేసిందీ నరేంద్రమోడీ ఎప్పుడైనా చెప్పారా ? 2022 ఏప్రిల్‌ నుంచి ఒకే ధరలను వసూలు చేస్తున్నారు. ఈ ఏడాది ఏప్రిల్‌ నుంచి ఇప్పటి వరకు ముడి చమురు ధర 20శాతం తగ్గింది. ఆ మేరకు చూసుకుంటే పెట్రోలు, డీజిలు ధరలు కనీసం దానిలో సగం కూడా ఎందుకు తగ్గించలేదు. జనం జేబులు కొల్లగొట్టి ప్రభుత్వం కార్పొరేట్లకు రాయితీల రూపంలో కట్టబెడుతున్నది.చమురుపై పెంచిన సెస్సుల పేరుతో మోడీ సర్కార్‌ ఇప్పటి వరకు రు.26.74లక్షల కోట్ల రూపాయలను వినియోగదారుల నుంచి వసూలు చేసింది. ఈ భారం రవాణా రంగం, ఇతర వాటి మీద పడి అనేక వస్తువుల ధరలు పెరగటానికి దారి తీసింది. అందువలన ధరల పెరుగుదలకు ప్రకృతి మీదో మరొకదాని మీదో నెపం మోపితే కుదరదు.ద్రవ్యోల్బణాన్ని నాలుగుశాతానికి పరిమితం చేస్తామని ఆర్‌బిఐ పదే పదే చెప్పటం తప్ప ఆచరణలో అమలు జరగలేదు. జనం ఇబ్బందులు పడుతుంటే లౌకికవాదం గురించి కబుర్లు చెప్పారని విమర్శించిన బిజెపి పెద్దలు రోజూ మాట్లాడుతున్నదేమిటి ? హిందూమతానికి ప్రమాదం వచ్చింది, హిందూత్వను, సనాతన ధర్మాన్ని పరిరక్షించుకోవాలంటూ ఊదరగొడుతున్నారు ! కనీసం హిందువులు, సనాతన వాదులమని ప్రకటించుకున్న బిజెపి, జనసేన వారికైనా హిందూమతం ధరలను తగ్గిస్తుందా ? జనాల కడుపు నింపుతుందా ?
చమురు మీద పెంచిన పన్నులను అడ్డగోలుగా సమర్ధించుకున్నారు. ఎప్పటికెయ్యది అప్పటికా మాటలాడి తప్పించుకు తిరుగుతున్నారు. నరేంద్రమోడీ అధికారానికి వచ్చిన 2014 మే నెలలో ముడిచమురు పీపా ధర 113 డాలర్లు ఉంది, తరువాత 2015 జనవరిలో 50, 2016 జనవరిలో 29 డాలర్లకు పడిపోయినపుడు ధరలు తగ్గించకపోగా పెద్ద మొత్తాలలో సెస్‌ విధించారు. తరువాత ధరలు పెరిగినప్పటికీ సెస్‌ రద్దు చేయలేదు. ఇప్పుడు 70 డాలర్లకు అటూ ఇటూగా ఉంటోంది.సెస్‌ ఎందుకు విధించారయ్యా అంటే కరోనా వాక్సిన్‌ ఉచితంగా కావాలంటారు దానికి డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది అని పెట్రోలియం శాఖా మంత్రిగా పనిచేసిన రామేశ్వర్‌ తేలీ వాదించారు. తరువాత ఎత్తివేశారా అంటే లేదు, దేశ రక్షణకు అయ్యే ఖర్చుకు డబ్బు ఎక్కడి నుంచి తేవాలని మరొకవాదన చేశారు. సెస్‌ ఎత్తివేత సంగతి తరువాత గత ఆరునెలల్లో తగ్గిన మేరకైనా ధర ఎందుకు తగ్గించటం లేదంటే నోరు విప్పటం లేదు. దీని సంగతేమిటో ప్రశ్నించాలా వద్దా ! లేక జేబులను కొల్లగొడుతుంటే గుడ్లప్పగించి చూస్తూ ఉండిపోవాలా ?

అమెరికా అధ్యక్ష ఎన్నికలు-డోనాల్డ్‌ ట్రంప్‌ ముందు పెను సవాళ్లు !

Tags

, , , ,

ఎం కోటేశ్వరరావు

అమెరికా అధ్యక్ష, పార్లమెంటు ఉభయ సభల మధ్యంతర ఎన్నికలు నవంబరు ఐదున జరిగాయి.అధ్యక్షుడిని ఎన్నుకొనే ఎలక్టరల్‌ కాలేజీలో డోనాల్డ్‌ ట్రంప్‌ 312, కమలా హారిస్‌ 226 స్థానాలు తెచ్చుకున్నారు. ప్రజాప్రతినిధుల సభ సభ్యుల సంఖ్య 435కాగా మెజారిటీ 218, రిపబ్లికన్లు 217, డెమోక్రాట్లు 209స్థానాల్లో ముందంజ లేదా గెలిచారు. ఎన్నికలకు ముందు రిపబ్లికన్లు 222,డెమోక్రాట్లు 213 స్థానాలు కలిగి ఉన్నారు. ఎగువ సభ సెనేట్‌లో మెజారిటీకి 51స్థానాలు అవసరం కాగా రిపబ్లికన్లకు 53, డెమోక్రాట్లకు 45, ఇతరులు రెండు సీట్లు గెలుచుకున్నారు. గతంలో డెమోక్రాట్లకు మద్దతు ఇచ్చిన ఇద్దరు స్వతంత్ర సెనెటర్లు ఈ సారి ఎన్నికల్లో పాల్గొనలేదు. ఆ స్థానాలను రిపబ్లికన్లు గెలుచుకున్నారు. ఇక రాష్ట్రాల వారీగా డెమోక్రాట్లు 23, రిపబ్లికన్లు 27 చోట్ల ఆధిక్యంలో ఉన్నారు. ఈ ఎన్నికల్లో ముందుకు వచ్చిన కొన్ని అంశాలను చూద్దాం.ఎన్నికల పండితులు చెప్పిన జోశ్యాలు నిజం కాలేదు.కృత్రిమ మేథను ఉపయోగించి కొందరు రూపొందించిన అంచనాలు కూడా తప్పాయి.ఈ పండితులంతా గతంతో పోల్చితే మా అంచనాలు దగ్గరగా ఉన్నాయనే కొత్త వాదనను ముందుకు తీసుకువచ్చారు.

సర్వేల అంచనాలకు భిన్నంగా ట్రంప్‌ గెలవటం గురించి మధనం జరుగుతున్నది. అతగాడు గెలిచినప్పటికీ ఓటింగ్‌ సరళిని చూసినపుడు కార్మికుల హక్కులు, అబార్షన్లకు వ్యతిరేకంగా, ఇతర పురోగామి విధానాలకు వ్యతిరేకంగా ఇచ్చిన తీర్పుగా పరిగణించాల్సిన అవసరం లేదన్నది ఒక అభిప్రాయం.గత ఎన్నికల్లో జోబైడెన్‌కు 8.128కోట్ల ఓట్లు (51.3శాతం) రాగా ట్రంప్‌కు 7.422 కోట్లు(46.8శాతం) వచ్చాయి.ఈసారి 95శాతం లెక్కింపు పూర్తయ్యే సమయానికి ట్రంప్‌కు 7.54కోట్లు(50.2శాతం), కమలకు 7.23కోట్ల ఓట్లు(48.2శాతం) వచ్చాయి. గతంలో వచ్చిన వాటిలో కోటి ఓట్లను డెమోక్రటిక్‌ పార్టీ కోల్పోయింది. కార్మికులకు ప్రాధాన్యత, జాతి, లింగవివక్షకు వ్యతిరేకమైన విధానాలకు ఓటర్లు స్పష్టమైన ధోరణి, మద్దతు కనపరిచారని వివిధ రాష్ట్రాల ఓటింగ్‌ తీరుతెన్నులను విశ్లేషించిన ఎకనమిక్‌ పాలసీ ఇనిస్టిట్యూట్‌ విశ్లేషణ పేర్కొన్నది. రాష్ట్రాలు, స్థానిక సంస్థలు విధానాలను రూపొందించే క్రమంలో ఈ ధోరణి ముఖ్యపాత్ర వహిస్తుందని చెప్పింది. ఐదు రాష్ట్రాలు వేతన సంబంధిత సమస్యల మీద ఓట్లు వేశాయి. 2009 నుంచి జాతీయ స్థాయిలో కనీసవేతనాలు పెంచకపోయినా 30 రాష్ట్రాలు, 63 స్థానిక సంస్థలు తమ ప్రాంతాల్లో కనీసవేతనాలను పెంచాయి. తాజా ఎన్నికల్లో కొన్ని రాష్ట్రాలలో కనీసవేతనం గంటకు 15డాలర్లు ఉండాలన్న వైఖరికి మద్దతు తెలిపారు. మహిళల్లో ఉన్న వాంఛలను ప్రతిబింబిస్తూ ఏడు రాష్ట్రాలు తమ రాజ్యాంగాల్లో అబార్షన్‌ హక్కును పొందుపరిచాయి. ప్రభుత్వ రంగంలోనే విద్య కొనసాగాలని, తలిదండ్రులకు ఓచర్ల రూపంలో డబ్బులిచ్చి బాధ్యతను వదిలించుకోవాలని చూస్తున్న ధోరణులను మూడు రాష్ట్రాలలో తిరస్కరించారు. కార్మిక సంఘాల ఏర్పాటులో కంపెనీల జోక్యం ఉండకూడదని కోరేవారు విజయాలు సాధించటం కార్మికుల వైఖరిని వెల్లడిరచింది.

కొన్ని వైరుధ్యాలు కూడా ఈ ఎన్నికల్లో వెల్లడయ్యాయి.అబార్షన్‌ హక్కు లేదని సుప్రీం కోర్టు చెప్పినదానిని ట్రంప్‌ తలకెత్తుకున్నప్పటికీ మహిళలు ఓటు వేయటం, గంటకు కనీస వేతనంగా ఉన్న 7.5డాలర్లను స్వల్పంగా అయినా పెంచుతారా అన్న ప్రశ్నకు సమాధానం చెప్పేందుకు ట్రంప్‌ నిరాకరించినా కార్మికులు కొంత మంది మద్దతు ఇవ్వటం వంటి అంశాలు ఉన్నాయి. గతంలో పురోగామి విధానాలకు ఓటు వేసిన చోట కూడా ఈ సారి డెమోక్రాట్లను కాదని ట్రంప్‌కు వేశారని తేలింది. ఎలక్టరల్‌ కాలేజీ వ్యవస్థ కారణంగా స్వింగ్‌ స్టేట్స్‌ను తమవైపు తిప్పుకొనేందుకే డెమోక్రాట్లు కేంద్రీకరించటం, రిపబ్లికన్లు మెజారిటీగా ఉన్న రాష్ట్రాలను పెద్దగా పట్టించుకోలేదని తేలింది. అదే సమయంలో ట్రంప్‌ తనకు వ్యతిరేకంగా డెమోక్రాట్లు బలంగా ఉన్న రాష్ట్రాలను 2022లో, తాజాగా కూడా వదల్లేదు, దాంతో ప్రజాప్రతినిధుల సభలో కొన్ని స్థానాలను అక్కడ గెలిచినట్లు ఫలితాలు వెల్లడిరచాయి.ఈ రాష్ట్రాలలో గెలిచిన స్థానాలతో దిగువ సభలో మెజారిటీ సాధిస్తే అది డెమోక్రాట్ల లోపంగానే చెప్పాల్సి ఉంటుంది. ఈసారి కార్పొరేట్లు భారీ ఎత్తున ట్రంప్‌కు మద్దతుగా డబ్బు సంచులను దింపాయి. రాష్ట్రాల కార్మిక చట్టాల నుంచి తమ డ్రైవర్లను మినహాయించాలంటూ ఉబెర్‌,లిప్ట్‌ కంపెనీలు కాలిఫోర్నియాలో కోట్లాది డాలర్లను ఖర్చు చేశాయి. డబ్బు, సోషల్‌ మీడియా, టీవీలు, పత్రికలు పెద్ద ఎత్తున చేసిన ప్రచారానికి కూడా డెమాక్రాటిక్‌ పార్టీ మద్దతుదార్లుగా ఉన్న ఓటర్లు ప్రభావితమై కొందరైనా ట్రంప్‌కు ఓట్లు వేశారు. మరొక అభిప్రాయం ప్రకారం తమను విస్మరించిన డెమోక్రాట్లకు గుణపాఠం చెప్పేందుకు కసితో ట్రంప్‌కు మద్దతు ఇచ్చినట్లు చెబుతున్నారు.ఈ వ్యతిరేకతను గుర్తించటంలో ఆ పార్టీ నాయకత్వం విఫలమైంది. రిపబ్లికన్‌ పార్టీ నాయకత్వం పచ్చిమితవాదంతో, కార్మిక వ్యతిరేక వైఖరితో ఉంటుంది. ఎలాగైనా గెలవాలని అనుకున్న ట్రంప్‌ తన ఎత్తుగడలను మార్చాడు. ఒకవైపు అబార్షన్ల హక్కును సుప్రీం కోర్టు తిరస్కరించటాన్ని సమర్ధిస్తూనే మరో వైపు తాను అధికారానికి వస్తే ఫెడరల్‌ ప్రభుత్వం తరఫున అబార్షన్లపై నిషేధం విధించనని ప్రకటించి కొందరు మహిళలను ఆకట్టుకున్నాడు. అయితే అధికారానికి వచ్చిన తరువాత అతగాడి నిజస్వరూపం వెల్లడి అవుతుంది.మరోసారి పోటీ చేసే అవకాశం లేదు గనుక నిర్దాక్షిణ్యంగా వ్యవహరించే అవకాశం ఉంది. ఎంతగా అణచివేస్తే అంతగా కార్మికవర్గం ప్రతిఘటిస్తుంది. డెమోక్రాట్లు కాడిపడవేసినంత మాత్రాన కార్మికవర్గం నీరుగారిపోతుందని అనుకుంటే పొరపాటు. అవసరమైతే కొత్త నాయకత్వాన్ని ఎన్నుకుంటారు, కార్మికుల తరఫున రాజీలేకుండా పోరాడేశక్తులను ముందుకు తెస్తారు. అంతర్గత విధానాలు, విదేశీ విధానాలను జనవరిలో పదవీ బాధ్యతలు స్వీకరించిన తరువాతే ట్రంప్‌ ప్రకటిస్తాడు. అప్పటి వరకు వివిధ దృశ్యాలను ఊహించుకుంటూ సాగించే విశ్లేషణలే వెలువడతాయి.

అమెరికా ఎన్నికల గురించి సర్వేలు ఎందుకు విఫలమయ్యాయి అనే చర్చ కూడా ప్రారంభమైంది.పోటీ నువ్వా నేనా అన్నట్లుగా ఉంటుందని, ఓడిపోతే కేసులు దాఖలు చేసేందుకు ట్రంప్‌ మద్దతుదారులు అన్నీ సిద్దం చేసుకున్నారని చెప్పారు, తీరా చూస్తే ట్రంప్‌ తిరుగులేని మెజారిటీతో నెగ్గాడు. సర్వేలు, పండితులు అతగాడిని ఎందుకు తక్కువ అంచనా వేశారంటూ ఇప్పుడు మరో చర్చ మొదలైంది. ఎందుకు తప్పుడు ఫలితాలు వచ్చాయంటే సర్వేల్లో డెమోక్రాట్లు ఎక్కువగా పాల్గొన్నందున అని ఒక సాకు చెబుతున్నారు. సర్వేలన్నీ పోటాపోటీ ఉందని, స్వల్ప మెజారిటీతో కమలాహారిస్‌ గెలుస్తారని, పోటీ తీవ్రంగా ఉన్న స్వింగ్‌ స్టేట్స్‌లో కూడా నాలుగింట ఆమెకే మెజారిటీ ఉందని కొద్ది గంటల్లో ఓటింగ్‌ ప్రారంభానికి ముందు కూడా చెప్పాయి. ఈ సారే కాదు, 2016, 2020,2022 ఎన్నికల్లో కూడా అంచనాలు తప్పాయి.కోల్పోయిన తమ విశ్వసనీయతను పునరుద్దరించుకొనేందుకు ఈ సారి తమ పద్దతులను సవరించుకొని కచ్చితంగా ఉండేట్లు చూస్తామని సర్వే సంస్థలు ప్రకటించాయి. ఆచరణలో అదేమీ కనిపించలేదు. అన్ని స్వింగ్‌ స్టేట్స్‌లో ట్రంప్‌ ఆధిక్యతలో ఉన్నాడు.ఒక విశ్వవిద్యాలయంలో చరిత్రకారుడిగా పనిచేస్తున్న అలాన్‌ లిచ్‌మన్‌ తాను 13అంశాలను పరిగణనలోకి తీసుకొని గత పన్నెండు అధ్యక్ష ఎన్నికల గురించి చెప్పిన జోశ్యాల్లో 11సార్లు నిజమైందని ఈ సారి కమలాహారిస్‌ గెలుస్తారని తాను చెప్పింది తిరగబడిరదని అంగీకరించాడు. తన పద్దతి గురించి మరోసారి సరిచూసుకుంటానని చెప్పాడు. రెండు వారాల క్రితం ట్రంప్‌ గెలుస్తాడని చెప్పిన 538 సంస్థ అధిపతి సిల్వర్‌ అనే మరో ఎన్నికల పండితుడు ఎన్నికలకు కొద్ది గంటల ముందు స్వల్పతేడాతో కమల గెలుస్తారని చెప్పాడు. అమెరికా ఎన్నికల్లో బెట్టింగ్‌ బంగార్రాజులు కాసిన పందేల విలువ 360కోట్ల డాలర్లని ఒక అంచనా. ఇవి బహిరంగంగా ప్రకటించిన మేరకు వచ్చిన వివరాలు మాత్రమే, ఇంకా ఇంతకంటే భారీ మొత్తాల్లోనే పందాలు ఉన్నాయి. వెల్లడైన సమాచారం మేరకు ఎక్కువ మంది ట్రంప్‌ గెలుపు మీదనే పందాలు కాశారు. అంటే ఎన్నికల పండితుల కంటే జూదగాండ్లే జనం నాడిని బాగా పసిగట్టినట్లు తేలింది. ఎన్నికల రోజున ఐదు జూద కంపెనీలు ట్రంప్‌ విజయావకాశాలు ఎక్కువగా ఉన్నట్లు తేల్చాయి. ఓటింగ్‌ ముగిసిన తరువాత ట్రంప్‌ మీద పందాలు విపరీతంగా పెరిగాయి.

ఎన్నికల పండితులు, కృత్రిమ మేథకంటే ఒక పిల్ల హిప్పోపోటోమస్‌ ఎన్నికల ఫలితాన్ని కచ్చితంగా చూపిందని సామాజిక మాధ్యమంలో సందేశాలు వెల్లువెత్తాయి. థాయ్‌లాండ్‌లోని ఒక జంతు ప్రదర్శనశాలలో ఉన్న మూ డెంగ్‌ అనే పిల్ల హిప్పోపోటోమస్‌కు భవిష్యత్‌ను చెప్పే అద్భుతశక్తులు ఉన్నట్లు ప్రచారం జరిగింది. అమెరికా ఎన్నికల్లో గెలిచేది ఎవరో తేల్చాలంటూ దాని ముందు రెండు పళ్లాలలో కేకుతోపాటు పుచ్చకాయలు పెట్టి ఒకదాని మీద కమల హారిస్‌, మరొకదానికి మీద డోనాల్డ్‌ ట్రంప్‌పేరు రాసి పెట్టారట.ఏ పళ్లంలోని కేకును తింటే ఆ పేరుగల అభ్యర్థిగెలుస్తారన్న నమ్మకం దాని వెనుక ఉంది. పెద్దగా ఆలోచించకుండా ట్రంప్‌ పేరు రాసిన పుచ్చకాయ కేకును మూ డెంగ్‌ తినటంతో ట్రంప్‌ గెలుస్తాడంటూ సామాజిక మాధ్యమంలో పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. పిల్ల హిప్పోపోటోమస్‌ తల్లి మాత్రం కమల పేరున్న పుచ్చకాయ తిన్నదట. పిచ్చి ఎంత పతాకస్థాయికి చేరిందంటే ఆ పిల్ల జంతువును చూసేందుకు ఒక అమెరికన్‌ మహిళ 20గంటలు ప్రయాణించి ఆ జంతు ప్రదర్శనశాలకు వచ్చి పులకించిపోయిందట. దరిద్రం ఏమిటంటే తమ నాయకురాలి పేరున్న ప్లేట్‌వైపు చూడనందుకు మూ డెంగ్‌ గురించి డెమోక్రటిక్‌ పార్టీ మద్దతుదార్లు పెద్ద ఎత్తున ప్రతికూల ప్రచారం చేశారట. మరొక పిచ్చి చర్య ఏమంటే కృత్రిమ మేథతో పనిచేసే చాట్‌ జిపిటిని ఎవరు గెలుస్తారని అడిగితే ట్రంప్‌ లేదా కమల ఇద్దరూ అధ్యక్ష భవనంలోకి అడుగుపెట్టరని చెప్పిందట. మూడవ పక్షం కింగ్‌ మేకర్‌ అవుతుందని కూడా సెలవిచ్చింది. ఆన్‌లైన్‌ ఒరాకిల్‌ అయితే పట్టణాల్లో హింసాకాండ చెలరేగుతుందని జోశ్యం చెప్పింది.

అమెరికాలో ఎన్నికల జోశ్యాలు 1880దశకం నుంచి ప్రారంభమయ్యాయి.ఎక్కువ భాగం వాస్తవానికి దగ్గరగా ఉన్నప్పటికీ ఇటీవలి కాలంలో బోల్తాపడ్డాయి.2016లో హిల్లరీ క్లింటన్‌కు ఓట్లు ఎక్కువగా వస్తాయని, ఆమేరకు ఎలక్టరల్‌ కాలేజీలో కూడా మెజారిటీ తెచ్చుకుంటారని సర్వే సంస్థలన్నీ చెప్పాయి. మొదటిది మాత్రమే నిజమైంది, రెండవదానిలో అంచనాలు తప్పాయి. డోనాల్డ్‌ ట్రంప్‌కు ఓట్లు తక్కువ, ఎలక్టరల్‌ కాలేజీలో గెలుపుకు అవసరమైన ఓట్లు ఎక్కువ వచ్చాయి. 2020 ఎన్నికల్లో జో బైడెన్‌ గెలుస్తాడని చెప్పినప్పటికీ అసాధారణ మెజారిటీ తెచ్చుకుంటారని చెప్పిన జోశ్యాలు తప్పాయి.2022లో జరిగిన పార్లమెంటు మధ్యంతర ఎన్నికల్లో ఉభయ సభల్లోనూ రిపబ్లికన్లు బ్రహ్మాండమైన మెజారిటీతో గెలుస్తారని చెప్పినప్పటికీ అలా జరగలేదు.సాధారణ మెజారిటీ 2018 కాగా రిపబ్లికన్లకు 222 మాత్రమే వచ్చాయి. ఇద్దరు స్వతంత్రుల మద్దతుతో డెమోక్రాట్లు సెనెట్‌ను 5149 మెజారిటీతో గెలుచుకున్నారు. మరింత శాస్త్రీయ పద్దతిలో సర్వేలు నిర్వహించాలని అనేక మంది చెప్పారు, రానున్న రోజుల్లో ఏ పద్దతిని అనుసరిస్తారో చూడాల్సి ఉంది.

బిజెపి శ్రీరంగ నీతులు-వంచన : ఆర్టికల్‌ 370 తీర్మానంపై కాశ్మీరు అసెంబ్లీలో అరాచకం !

Tags

, , ,

ఎం కోటేశ్వరరావు

చట్టసభల్లో ప్రతిపక్ష పార్టీల సభ్యులు ఎలా ప్రవర్తించాలో బోధలు చేసే బిజెపి తనదాకా వచ్చే సరికి ఎదుటి వారికే చెప్పేటందుకే నీతులు ఉన్నాయి అన్నట్లు వ్యవహరిస్తున్నది.తాజాగా జమ్మూకాశ్మీరు కేంద్ర పాలిత ప్రాంత అసెంబ్లీలో, అంతకు ముందు అది ప్రతిపక్షంగా ఉన్నచోట్ల తన సుభాషితాలను తానే తుంగలో తొక్కి వ్యవహరించింది. పార్లమెంటు రద్దు చేసిన ఆర్టికల్‌ 370, ఆర్టికల్‌ 35ఏ లను పునరుద్దరించాలని కోరుతూ తాజాగా 2024 నవంబరు ఆరవ తేదీన కాశ్మీరు అసెంబ్లీ ఒక తీర్మానాన్ని ఆమోదించింది. అప్పటి నుంచి బిజెపి సభ్యులు దాన్ని వ్యతిరేకిస్తూ సభలో అరాచకానికి దిగటంతో మార్షల్స్‌ను దించి గెంటివేయించాల్సి వచ్చింది. ఆ తీర్మానం చట్టవిరుద్దం,దేశానికే వ్యతిరేకం, కాశ్మీరుకు వ్యతిరేకంగా కుట్ర అంటూ బిజెపి గుండెలు బాదుకుంటున్నది. దీనిలో ప్రధాని నరేంద్రమోడీ కూడా భాగస్వామి అయ్యారు. కాశ్మీరులో అంబేద్కర్‌ రాజ్యాంగాన్ని పక్కన పెట్టారంటూ రెచ్చగొట్టారు. భారత రాజ్యాంగం తప్ప అంబేద్కర్‌ పేరుతో ఎలాంటి రాజ్యాంగం లేదు. ఈ సందర్భంగా ముందుకు వచ్చిన కొన్ని వాదనలు, వాటి బండారాన్ని చూద్దాం.


‘‘ ఆర్టికల్‌ 370ని పునరుద్దరించాలని అసెంబ్లీ ఒక తీర్మానాన్ని ఆమోదించటం చట్టవిరుద్దం ’’ అయితే పార్లమెంటులో దాన్ని రద్దు చేయటం కూడా అంతే కదా ! ఒక రాష్ట్రానికి ఉన్న ప్రత్యేక హోదాను రద్దు చేసే ముందు ఆ రాష్ట్ర అసెంబ్లీని సంప్రదించాల్సి ఉంది. ఆ రాజ్యాంగ ప్రక్రియను తుంగలో తొక్కి ఏకపక్షంగా పార్లమెంటులో రద్దు చేసినపుడు బిజెపి పెద్దలకు అంబేద్కర్‌ గుర్తుకు రాలేదు. సదరు ఆర్టికల్‌ రద్దును వ్యతిరేకిస్తూ దాఖలైన 23 పిటీషన్లను విచారించిన సుప్రీం కోర్టు రద్దు చట్టబద్దమే అని చెప్పింది కదా అని ఎవరైనా అనవచ్చు. పార్లమెంటుకు ఉన్న అధికారాల మేరకు అది తీసుకున్న నిర్ణయం రాజ్యాంగబద్దమే అని కోర్టు చెప్పింది. పార్లమెంటు మాదిరే కాశ్మీరు అసెంబ్లీకి కూడా అధికారాలు ఉన్నాయా లేవా ? ఉన్నవి గనుకనే ఆ మేరకు మెజారిటీగా ఉన్న సభ్యులు రద్దు చేసిన దాన్ని పునరుద్దరించాలని ఒక తీర్మానాన్ని ఆమోదించారు. పునరుద్దరణ అంశాన్ని పరిశీలించాలని కేంద్రాన్ని కోరారు తప్ప అదేమీ అమల్లోకి రాలేదు, రద్దు చేసిన పార్లమెంటే దాన్ని పునరుద్దరించాల్సి ఉంటుంది. అసలు తీర్మానం చేయటమే చట్టవిరుద్ధం అని బిజెపి చెబితే సరిపోతుందా ? ఆ పార్టీ నందంటే నందంటే నంది పందంటే పంది అవుతుందా ? కావాలంటే ఆ తీర్మానాన్ని సవాలు చేస్తూ ఆ పార్టీ కూడా కోర్టును ఆశ్రయించవచ్చు. అప్పుడు కోర్టేమి చెబుతుందో దేశానికి కూడా తెలుస్తుంది. ఆ పని చేయకుండా అసెంబ్లీలో అరాచకానికి పాల్పడటం ఏమిటి ? ప్రజాస్వామిక వ్యవస్థలో ఉన్నామా మూకస్వామ్యంలోనా ?


తమకు అధికారమిస్తే ఆర్టికల్‌ 370 రద్దు చేస్తామని బిజెపి తన ఎన్నికల ప్రణాళికలో పెట్టింది. అలాగే తమకు అధికారమిస్తే రద్దు చేసిన సదరు ఆర్టికల్‌ పునరుద్ధరణకు కృషి చేస్తామని కాశ్మీరులో నేషనల్‌ కాన్ఫరెన్స్‌, కాంగ్రెస్‌, సిపిఎం భాగస్వాములుగా ఉన్న కూటమి కూడా ఎన్నికల్లో వాగ్దానం చేసింది. ఆ మేరకు అధికారానికి వచ్చిన తరువాత దాన్ని తీర్మానరూపంలో నెరవేర్చింది. అధికారం రాకపోయినా రాష్ట్రంలో తమదే పెద్ద పార్టీ అని రాష్ట్ర బిజెపి నేతలు చెట్టుకింద ప్లీడర్లలా వాదిస్తున్నారు. పెద్ద పార్టీ తప్ప దానికి వచ్చింది నాలుగోవంతు ఓట్లే అన్నది గమనించాలి. లోక్‌సభ ఎన్నికలలో బిజెపి, దాని మిత్రపక్షాలకు సీట్లు ఎక్కువ వచ్చాయి తప్ప ఓట్లు రాలేదు. దాన్ని వ్యతిరేకించే పార్టీలకే ఎక్కువ ఓట్లు వచ్చాయి. అలాంటపుడు ఆర్టికల్‌ 370ని రద్దు చేయకూడదు కదా, ఎందుకు చేసినట్లు ? 2019లోక్‌సభ ఎన్నికలలో ఎన్‌డిఏ కూటమికి వచ్చిన ఓట్లు 45.3శాతం కాగా, 2024 ఎన్నికల్లో 42.53శాతానికి పడిపోయాయి. ఇదే సమయంలో యుపిఏ లేదా ఇండియా కూటమి ఓట్లు 27.5 నుంచి 40.56శాతానికి పెరిగాయి. అన్నింటికంటే కాశ్మీరులో బిజెపి ఆర్టికల్‌ 370 రద్దును సమర్ధిస్తూ ఓటర్ల ముందుకు వెళితే ఇండియా కూటమి మద్దతు కోరాయి. బిజెపికి వచ్చిన ఓట్లు కేవలం 25.63శాతమే, ఆర్టికల్‌ 370 రద్దును వ్యతిరేకించే పార్టీలకే మిగిలిన ఓట్లన్నీ వచ్చాయి.బిజెపి చెప్పే అధిక ఓట్లు నేషనల్‌ కాన్ఫరెన్సుకు వచ్చిన ఓట్లతో పోల్చుకొని మాత్రమే. ఇండియా కూటమికి 36శాతం ఓట్లు వచ్చాయి.


ఆర్టికల్‌ 370ని పునరుద్దరించాలన్న తీర్మానం పెద్ద కుట్ర అంటున్నారు. ఆ తీర్మానం బహిరంగం, టీవీ చిత్రీకరణ మధ్య అసెంబ్లీ ఆమోదించింది, కుట్ర ఎలా అవుతుంది ? మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో నరేంద్రమోడీ చెప్పినట్లు కాశ్మీరు మీద కుట్ర అయితే అది బహిరంగ కుట్ర. కావాలంటే కేంద్ర ప్రభుత్వం ఆ రాష్ట్ర ప్రభుత్వం మీద నిరభ్యంతరంగా చర్య తీసుకోవచ్చు, ఒట్టి మాటలెందుకు ? తాను అధికారంలో ఉన్నంత వరకు కాశ్మీరులో కాంగ్రెస్‌ ఏమీ చేయలేదని, బిఆర్‌ అంబేద్కర్‌ రాజ్యాంగమే నడుస్తుందని, ఏ శక్తీ ఆర్టికల్‌ 370ని తిరిగి తీసుకురాలేదని మోడీ చెప్పారు. చరిత్రను చూసినపుడు ఈ ఆర్టికల్‌ను అంబేద్కర్‌ వంటి వారు వ్యతిరేకిస్తే సమర్ధించిన వారు అత్యధికులు ఉన్నారు. ఎవరికైనా తమ అభిప్రాయం వెల్లడిరచే హక్కు ఉంది. రాజ్యాంగ రచన కమిటీ అధ్యక్షుడిగా అంబేద్కర్‌కు గౌరవం దక్కింది. అది రాజ్యాంగసభ ఉమ్మడి నిర్ణయం తప్ప వ్యక్తిగతం కాదు. ఆ మాటకు వస్తే అంబేద్కర్‌ వ్యతిరేకించిన అంశాలు అనేకం ఉన్నాయి. మనుస్మృతిని బహిరంగంగా తగులపెట్టారు. ఆయన జీవిత కాలంలోనే అమల్లోకి వచ్చిన రాజ్యాంగాన్ని, ఆర్టికల్‌ 370ని తగులబెట్టలేదే ! అంబేద్కర్‌ను పదే పదే ఉటంకించే బిజెపి ఆయన మాదిరి మనుస్మృతిని తగులబెట్టటం సంగతి అలా ఉంచి కనీసం దాన్ని వ్యతిరేకిస్తున్నట్లు బహిరంగంగా ప్రకటించగలదా ? అంబేద్కర్‌ బాటలో ఎందుకు నడవటం లేదు ? ఆయన నిరసించిన మనుస్మృతిని రాజ్యాంగంలో చేర్చలేదంటూ నిరసించిన ఆర్‌ఎస్‌ఎస్‌ గుంపులోని వారే బిజెపి నేతలు. నరేంద్రమోడీ నిక్కర్లు వేసుకొని ఆర్‌ఎస్‌ఎస్‌ శాఖలకు హాజరైన సంగతి తెలిసిందే. సదరు సంస్థ మోడీ చెప్పిన అంబేద్కర్‌ రాజ్యాంగాన్ని వ్యతిరేకించింది. జాతీయ పతాకాన్ని కూడా అది గుర్తించలేదు, గౌరవించలేదు. రాజ్యాంగ సభ 1949 నవంబరు 26న రాజ్యాంగాన్ని ఖరారు చేసింది. తరువాత నాలుగు రోజులకు నవంబరు 30న ఆర్‌ఎస్‌ఎస్‌ పత్రిక ఆర్గనైజర్‌ సంపాదకీయంలో ఏమి రాసిందో తెలుసా ! ‘‘ కానీ మన రాజ్యాంగంలో పురాతన భారత్‌లో అద్వితీయమైన రాజ్యాంగ పరిణామం గురించిన ప్రస్తావన లేదు.మను చట్టాలు స్పార్టా లికర్‌గుస్‌( గ్రీసు లాయర్‌, క్రీస్తు పూర్వం 730లో మరణించాడు) లేదా పర్షియా సోలోన్‌( క్రీస్తు పూర్వం 630560 మధ్య జీవించిన రాజనీతిజ్ఞుడు) కంటే ఎంతో ముందుగానే రాసినవి. మనుస్మృతిలో రాసిన చట్టాలు నేటికీ ప్రపంచ ప్రశంసలు పొందటం ఉద్వేగాన్ని కలిగిస్తున్నవి.కానీ మన రాజ్యాంగ పండితులకు మాత్రం వాటిలో ఏమీ కనిపించలేదు.’’ అని రాసింది. అంతేనా గురు ఎంఎస్‌ గోల్వాల్కర్‌ రాసిన బంచ్‌ ఆఫ్‌ థాట్స్‌ అనే గ్రంధం ఆర్‌ఎస్‌ఎస్‌ వారికి ఒక పవిత్ర గ్రంధం. దానిలో రాజ్యాంగం హిందూ వ్యతిరేకమైనదని రాశారు. వివిధ దేశాల నుంచి అంశాలను తీసుకొని రాజ్యాంగాన్ని రూపొందించారు తప్ప దానిలో మనది అని చెప్పుకొనేందుకు ఏమీ లేదు అంటూ అంబేద్కర్‌ను అవమానించేవిధంగా పేర్కొన్నారు.అలాంటి గోల్వాల్కర్‌ వారసులు ఇప్పుడు అంబేద్కర్‌ గురించి పొగడటం నిజంగా వంచన తప్ప మరొకటి కాదు. వారికి చిత్తశుద్ది ఉంటే గోల్వాల్కర్‌ రచనలు తప్పని బహిరంగంగా ప్రకటించాలి.

కాశ్మీరు అసెంబ్లీలో ఆర్టికల్‌ 370 పునరుద్దరణ తీర్మానాన్ని వ్యతిరేకించి సభలో అరాచకాన్ని సృష్టించిన బిజెపి మరోమారు ఆ అంశాన్ని చర్చకు తెచ్చింది. దాన్ని రద్దు చేసిన ఐదు సంవత్సరాల తరువాత ఎన్నికలు జరిపిన కేంద్ర ప్రభుత్వం(బిజెపి) ఊహించినదానికి భిన్నంగా అక్కడ తీర్పు వచ్చింది. దాన్ని మింగాకక్కలేక బిజెపి సభ్యులు ఐదు రోజుల పాటు సభా కార్యక్రమాలను అడ్డుకున్నారు. వాట్సాప్‌ యూనివర్సిటీ సమాచారం మీద ఆధారపడి వ్యవహరించకూడదని రాష్ట్ర ముఖ్యమంత్రి ఓమర్‌ అబ్దుల్లా బిజెపి సభ్యులను తూర్పారబట్టారు. తమ అజెండాను నిర్ణయించేది రాష్ట్ర పౌరులు తప్ప వాట్సాప్‌ యూనివర్సిటీ, ఫేస్‌బుక్‌ లేదా ఎక్స్‌ కాదన్నారు. భారత సమగ్రత, సార్వభౌమత్వాన్ని సవాలు చేసే విధంగా స్పీకర్‌ సమావేశాలను నిర్వహిస్తే తాము సమాంతరంగా సభ, ప్రభుత్వాన్ని కూడా నిర్వహిస్తామని బిజెపి నేత సునీల్‌ శర్మ చెప్పారు. తమ సభ్యులను మార్షల్స్‌తో గెంటివేయించినందున వెలుపల సమాంతరంగా సమావేశం జరిపినట్లు చెప్పుకున్నారు. దీన్ని తేలికగా తీసుకోరాదన్నారు. అదంతా మీడియాలో ప్రచారం కోసం తప్ప మరొకటి కాదు. పార్లమెంటు కార్యకలాపాలను అడ్డుకొనే ఎంపీలు ఆత్మశోధన చేసుకోవాలని ప్రధాని నరేంద్రమోడీ హితవు చెప్పారు.2024 జనవరిలో తాత్కాలిక బడ్జెట్‌ సమావేశాల సందర్భంగా గత పది సంవత్సరాల్లో ప్రతిపక్షాలు అడ్డుకొనే ప్రవర్తనతో వ్యవహరించాయని,అదొక అలవాటుగా మారిందని ఆరోపించారు. ఇంకా చాలా సుభాషితాలు చెప్పారు.

అధికారంలో ఉన్నపుడు ఒక మాట ప్రతిపక్షంలో ఉన్నపుడు మరొక మాట మాట్లాడటంలో బిజెపి ఏ పార్టీకీ తీసిపోలేదు. దివంగత బిజెపి నేత అరుణ్‌ జెట్లీ రాజ్యసభలో ప్రతిపక్ష నేతగా ఉన్నపుడు 2011 జనవరిలో మాట్లాడుతూ ‘‘ పార్లమెంటు పని చర్చలు నిర్వహించటం.అయితే అనేక సందర్భాలలో ప్రభుత్వం సమస్యలను పట్టించుకోదు అలాంటి సందర్భాలలో పార్లమెంటును అడ్డుకోవటం ప్రజాస్వామ్యానికి అనుకూలంగానే, కనుక పార్లమెంటులో అడ్డుకోవటం అప్రజాస్వామికం కాదు ’’ అని సెలవిచ్చారు. ఇప్పుడు అదే బిజెపి దానికి విరుద్ధంగా వ్యవహరిస్తోంది. ప్రధాని సభకు రావాలని, కీలక అంశాలపై నోరు విప్పాలని కూడా పార్లమెంటులో ప్రతిపక్షాలు డిమాండ్‌ చేయాల్సి వస్తోంది. కాంగ్రెస్‌ నేత ఆనందశర్మ మాట్లాడుతూ ప్రతిపక్షంగా తమ విధి నిర్వహిస్తున్నాం తప్ప పార్లమెంటును అడ్డుకోవటం లేదని, ప్రధాని నరేంద్రమోడీ అప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. పార్లమెంటు పరిశోధనా సంస్థ పిఆర్‌ఎస్‌ విశ్లేషించినదాని ప్రకారం 2009 నుంచి 2014వరకు యుపిఏ పాలనా కాలంలో నిర్దేశిత సమయంలో లోక్‌సభలో 61శాతం, రాజ్యసభలో 66శాతం సమయం ప్రతిపక్షం ఆటంకాలతో వృధా అయింది. ఆ సమయంలో బిజెపి ప్రతిపక్షంగా ఉన్న సంగతి తెలిసిందే. తరువాత మోడీ తొలి ఏలుబడి 201419లో 16శాతం సమయం మాత్రమే ఆటంకాలతో వృధా అయింది.ఎవరు అడ్డగోలుగా వ్యవహరించారో, ఇతరులకు నీతులు ఎలా చెబుతున్నారో వంచనకు పాల్పడుతున్నారో ఈ అంకెలు వెల్లడిస్తున్నాయి.

పశ్చిమదేశాలు వద్దు – మాతృదేశమే ముద్దు అంటున్న చైనా విద్యాధికులు !

Tags

, , , , , , ,

ఎం కోటేశ్వరరావు

అంతరిక్ష రంగంలో అమెరికాకు ధీటుగా 2050నాటికి అగ్రదేశంగా మారేందుకు చైనా మూడు దశల ప్రణాళికలు రూపొందించింది.వివిధ గ్రహాల గురించి పరిశోధన, ఒక అంతర్జాతీయ లూనార్‌ పరిశోధనా కేంద్ర నిర్మాణం వంటివి దీనిలో ఉన్నాయి.చంద్రుడి మీదకు 2030నాటికి వ్యోమగాములను పంపే లక్ష్యం కూడా ఉంది. ఆర్థికంగా చైనా ఇబ్బందుల్లో ఉందని చెబుతున్నవారే ఈ పరిశోధనలకు భారీ మొత్తాలను ఎలా ఖర్చు పెడుతున్నదంటూ ఆశ్చర్యపోతున్నారు. దేశ చరిత్రను చూసినపుడు లక్ష్యాలను ప్రకటించిన నిర్ణీత కాలంలో పూర్తిచేసిన చరిత్ర ఉందని కూడా అంటున్నారు. తొలిసారిగా చంద్రుడికి ఆవలి వైపున రోవర్‌ను దించిన చైనా ఘనత తెలిసిందే.అంతరిక్ష లక్ష్యాల రోడ్‌ మాప్‌ను కేంద్ర కాబినెట్‌ స్థాయి కార్యాలయం పర్యవేక్షించనుంది.2028 నుంచి 2035వరకు మానవులను పంపే కార్యక్రమాలతో పాటు చంద్రుడిపై పరిశోధనా కేంద్రాన్ని ఏర్పాటు చేస్తారు.మూడవ దశలో 30మిషన్‌లను ప్రయోగిస్తారు.ఐరోపా స్పేస్‌ ఏజన్సీతో భాగస్వామ్యాన్ని ఏర్పాటు చేస్తారు.తమ అంతరిక్ష పరిశోధన ఇప్పటికీ ప్రారంభదశలోనే ఉందని, ప్రపంచ స్థాయికి తీసుకువెళ్లే లక్ష్యంతో ముందుకు పోతున్నట్లు చైనా అధికారులు చెప్పారు.

పశ్చిమ దేశాల్లో పరిశోధనలు చేయటం, చేతి నిండా సంపాదించటం ఎంతో మంది కనేకల. అది తప్పేం కాదు. స్వదేశంలో తమ మేథకు పదును పెట్టే అవకాశాలు, దానికి తగిన ప్రతిఫలం పొందే పరిస్థితి లేనపుడు ఎవరైనా ఇదే విధంగా ఆలోచిస్తారు. గతంలో విదేశాలకు వెళ్లి అక్కడే స్థిరపడి సంపాదించిన వారిని చూస్తే మరింత ఆకర్షణీయంగా ఉంటుంది. ప్రపంచమంతటా ఇలాంటి ‘‘ డాలరు కలలు ’’ కనేవారు ఉన్నారు. దీన్నే మరో విధంగా మేథోవలస అనేవారు. ధనికదేశాలన్నీ ఇలాంటి వలసలను ప్రోత్సహించి సొమ్ము చేసుకున్నాయి. చైనా తాజాగా వెల్లడిరచిన సర్వే సమాచారం ప్రకారం ‘‘స్టెమ్‌’’ (సైన్సు,టెక్నాలజీ,ఇంజనీరింగ్‌,గణిత శాస్త్రాలకు పెట్టిన పొట్టి పేరు) పరిశోధనకు(పిహెచ్‌డి) విదేశాలకు వెళ్లిన చైనీయులలో 80శాతం మంది తిరిగి వస్తున్నారట. 1987లో కేవలం ఐదుశాతమే ఉండగా 2007లో 30.6శాతం నుంచి ఇప్పుడు 80శాతానికి చేరారు. ధనికదేశాల్లో అకడమిక్‌ అవకాశాల కోసం ఇప్పటికీ పెద్ద ఎత్తున పోటీ ఉంది.ఎందుకు చైనీయుల్లో ఇలాంటి మార్పు అని చూస్తే ప్రపంచ భూ భౌతికఆర్థిక శక్తిగా చైనా ఎదగటం తప్ప మరొక కారణం లేదు. స్టెమ్‌ గ్రాడ్యుయేట్లకు చైనాలో అవకాశాలు, ఆర్థిక ప్రతిఫలాలు కూడా ఏటేటా పెరుగుతున్నాయి.అయితే విదేశాల్లో ఇంకా ఆకర్షణ కొనసాగుతూ ఉంటే వలసలు మరోసారి కొనసాగవని చెప్పలేము.చైనాలో పెరుగుతున్న ఆర్థిక లబ్దితో పాటు, ఒకే బిడ్డ అన్న విధానం అమల్లోకి వచ్చిన తరువాత పుట్టిన తరానికి చెందిన వారు వృద్ద తలిదండ్రులను చూసుకోవాల్సిన కుటుంబ సంబంధాలు కూడా పరిశోధకులు తిరిగి రావటం వెనుక కారణాలుగా తేలాయి.పశ్చిమదేశాల్లో సంపాదించిన దానికి దగ్గరగా చైనాలో కూడా ఉండటంతో తిరిగి వచ్చేవారి వేగం పెరుగుతున్నది.


చైనాలో విద్య, పరిశోధనలకు పెద్ద పీటవేస్తున్న కారణంగా అక్కడి నుంచి పెద్ద సంఖ్యలో జనరేటివ్‌ ఆర్టిఫిషియల్‌ ఇంటిలిజెన్స్‌(జన్‌ఏఐ) పేటెంట్లకు దరఖాస్తున్నట్లు ప్రపంచ పేటెంట్‌ సంస్థ(డబ్ల్యుఐపిఓ) తాజా సమాచారం వెల్లడిస్తున్నది. ఈ రంగంలో అగ్రశ్రేణిలో ఉన్న అమెరికా, దక్షిణ కొరియా,జపాన్‌, భారత్‌ను చైనా అధిగమించింది. 2023తో ముగిసిన దశాబ్దిలో దాఖలైన 54వేల దరఖాస్తుల్లో నాలుగోవంతు గతేడాదిలోనే ఉన్నాయి.చైనా నుంచి 201423 సంవత్సరాలలో 38వేల దరఖాస్తులు వచ్చాయి.వేగంగా దూసుకువస్తున్న కృత్రిమ మేథ సాంకేతిక పరిజ్ఞానం ఆటతీరునే మార్చివేయనుంది. ఇదే కాలంలో 54వేల పేటెంట్‌ దరఖాస్తులతో పాటు 75వేల శాస్త్రీయ పత్రాల ప్రచురణ కూడా చోటుచేసుకుంది. ఇప్పటి వరకు ప్రపంచంలో జారీచేసిన అన్ని రకాల పేటెంట్లలో ఏఐ వాటా కేవలం ఆరుశాతమే. పది అగ్రశ్రేణి సంస్థలలో టెన్‌సెంట్‌(2,074, పింగ్‌ యాన్‌ ఇన్సూరెన్స్‌(1,564), బైడు(1,234), చైనీస్‌ సైన్స్‌ అకాడమీ(607), అలీబాబా (571) శాంసంగ్‌ ఎలక్ట్రానిక్స్‌ (468),ఆల్ఫాబెట్‌(443), బైట్‌డాన్స్‌(418), మైక్రోసాఫ్ట్‌ 377 ఉన్నాయి. మొత్తం దేశాల వారీ చూస్తే చైనా 38,210, అమెరికా 6,276, దక్షిణ కొరియా 4,155, జపాన్‌ 3,409, భారత్‌ 1,350 ఉన్నాయి. రంగాల వారీగా ఇమేజ్‌, వీడియో డేటా, 17,996,టెక్స్ట్‌ 13,494, మాటలు లేదా సంగీతం 13,480 ఉన్నాయి.విదేశాల్లో చదివి భారత్‌కు తిరిగి వచ్చే విద్యార్థులకు తగిన ఉపాధి అవకాశాలు ఉండటం లేదని కెనడా విద్యాసంస్థ ఎం స్క్వేర్‌ మీడియా (ఎంఎస్‌ఎం) తన సర్వేలో తేలినట్లు 2023 ఫిబ్రవరిలో ప్రకటించింది. విదేశీ డిగ్రీల గుర్తింపుతో సహా అనేక సవాళ్లు ఎదుర్కొంటున్నారని తెలిపింది. 2022లో 7.7లక్షల మంది భారతీయ విద్యార్థులు విదేశాల్లో చదువుకున్నారు.201519 మధ్య విదేశాల్లో చదువుకొని స్వదేశం తిరిగి వచ్చిన వారిలో 22శాతం మాత్రమే ఉపాధి పొందినట్లు తేలింది. విదేశీ డిగ్రీలు, డిప్లొమాలకు భారత్‌లో గుర్తింపు లేకపోవటం ఒక ప్రధాన సమస్య.


ప్రపంచ ఫ్యాక్టరీగా పేరు తెచ్చుకున్న చైనా తన సత్తాను ఇతర రంగాలకూ విస్తరిస్తున్నది.2035 నాటికి అగ్రశ్రేణి విద్యాశక్తిగా మారేందుకు పథకాలను రూపొందించింది. ప్రపంచాన్ని ప్రభావితం చేసే ముఖ్యమైన విద్యాకేంద్రంగా మారేందుకు చూస్తున్నట్లు చైనా విద్యామంత్రి హువెయ్‌ జిన్‌పెంగ్‌ ఇటీవల ప్రకటించాడు.సైన్సు, ఇంజనీరింగ్‌ రంగాలలో అంతర్జాతీయ విశ్వవిద్యాలయాలతో సంయుక్త డిగ్రీకోర్సులతో సహా వివిధ కార్యక్రమాలను చేపట్టనున్నట్లు చెప్పాడు. అనేక ఇబ్బందులు, సవాళ్లు ఉన్నప్పటికీ అధ్యక్షుడు షీ జింపింగ్‌ మార్గదర్శకత్వంలో రూపొందించిన ప్రణాళికను అమలు జరపనున్నట్లు వెల్లడిరచాడు. పెద్ద విద్యాశక్తిగా ఉన్న స్థితి నుంచి బలమైన శక్తిగా మారేందుకు 2010లో నిర్ణయించామని, తాజా లక్ష్యాన్ని 2020లోనే ప్రకటించినప్పటికీ ప్రస్తుతం ఆచరణలో పెట్టినట్లు జిన్‌ పెంగ్‌ చెప్పాడు.ఆర్థికంగా కొన్ని సమస్యలున్నప్పటికీ విద్యారంగ పథకాలను కొనసాగించాల్సిందేనని షీ జింపింగ్‌ నిర్దేశించాడు. వరల్డ్‌ పాపులేషన్‌ రివ్యూ సమాచారం 2024 ప్రకారం 207 దేశాల విద్యారంగ సమాచారాన్ని విశ్లేషించగా చైనా 13వ రాంక్‌లో ఉండగా భారత్‌ 101. మనకంటే ఎగువన శ్రీలంక 61,నేపాల్‌ 56, దిగువన మయన్మార్‌ 109, బంగ్లాదేశ్‌ 122,పాకిస్తాన్‌ 136 స్థానాలలో ఉన్నాయి. విద్యార్థుల్లో 1823 సంవత్సరాల వయస్సు వారిలో ఉన్నత విద్యకు వెళ్లే వారు ప్రస్తుతం చైనాలో(జిఇఆర్‌) 60శాతం దాటారు, ఇది ఉన్నత మధ్యతరగతి ఆదాయ దేశాలకు సమానం. 2012లో ఇది 30శాతం మాత్రమే ఉండేది. అందరికీ ఉన్నత విద్యలో చైనా ప్రపంచ స్థాయికి ఎదిగింది. రానున్న ఐదు సంవత్సరాల్లో అమెరికా నుంచి 50వేలు, ఫ్రాన్సునుంచి మూడు సంవత్సరాలల్లో పదివేల మంది విద్యార్థులను మార్పిడి కార్యక్రమం కింద ఆహ్వానించాలని చైనా లక్ష్యంగా పెట్టుకుంది. విశ్వవిద్యాలయాలు పరిశోధనా కేంద్రాలుగా మారేట్లు చైనా చూస్తున్నది. అక్కడ జరిగే పరిశోధన ఫలితాలను ఉత్పత్తి, సేవారంగాలలో వినియోగించే విధంగా వాణిజ్య స్థాయిలో విక్రయించేందుకు కూడా ప్రోత్సహిస్తున్నది తద్వారా ప్రభుత్వం కేటాయించే నిధులతో పాటు అదనంగా వచ్చే ఆదాయంతో మరింతగా పరిశోధకులను ప్రోత్సహించేందుకు వీలుకలుగుతుంది.ఇప్పటికే అమల్లో ఉన్న పథకాలు, సాంకేతిక పరిజ్ఞానం అమల్లో వచ్చే ఆచరణాత్మక సమస్యలను పరిష్కరించటం, నవీకరించే పరిశోధలను ప్రభుత్వం ప్రోత్సహిస్తున్నది.ఫలితంగా ఈ పరిశోధనల విలువ 201923కాలంలో 150 నుంచి 290 కోట్ల డాలర్లకు పెరిగింది.దీనికి అనుగుణంగానే వార్షిక నివేదికలను విడుదల చేసే విశ్వవిద్యాలయాలు, పరిశోధనా సంస్థల సంఖ్య 3,447 నుంచి 4,028కి పెరిగింది. మార్కెట్లో తమ పరిశోధన ఫలితాలను అందచేసేందుకు చేసుకున్న ఒప్పందాలు కూడా 3,34 నుంచి 6.4లక్షలకు పెరిగాయి. వీటిలో 60శాతం స్థానిక సంస్థలవే కావటంతో ప్రాంతీయ అభివృద్ధికి ఎక్కువగా దోహదం చేస్తున్నాయన్నది స్పష్టం.


చైనా విద్యను కూడా ఎగుమతి చేయాలని చూస్తున్నది.దీనిలో భాగంగా అనేక దేశాలలో ఇంటర్నేషనల్‌ స్కూళ్ల స్థాపనకు పూనుకుంది. చైనీయులు అనేక దేశాల్లో పెద్ద సంఖ్యలో పనిచేస్తున్నారు.వారి కుటుంబాలు తిరిగి రావాలంటే చైనా విద్య అవసరం ఎంతో ఉంది.చైనా స్కూళ్లలో ఏ పాఠ్యాంశాలనైతే బోధిస్తున్నారో వాటి నకలుతో దుబాయ్‌లో 500 చైనా కుటుంబాల విద్యార్థులతో స్కూలు నడుస్తున్నది. రానున్న రోజుల్లో అనేక దేశాల్లో ఇలాంటి వాటిని ఏర్పాటు చేసేందుకు పూనుకుంది. దుబాయ్‌లో ప్రయోగాత్మకంగా 2020 నుంచి నడుస్తున్నది. అమెరికా,బ్రిటన్‌తో సహా 45 దేశాలలో వీటిని ఏర్పాటు చేసేందుకు అవకాశాలను చూడాలని చైనా కమ్యూనిస్టు పార్టీ తన దౌత్యవేత్తలను కోరింది. ప్రపంచంలో కోటి మంది చైనీయులు ఆ దేశానికి చెందిన కంపెనీలలో పనిచేస్తున్నారు. స్వదేశానికి తిరిగి వచ్చిన తరువాత స్థానికులతో అలాంటి వారి పిల్లలు పోటీపడలేకపోతున్నారు. అందువలన చైనా భాష, సిలబస్‌తో ఆ లోపాన్ని అధిగమించేందుకు స్కూళ్లను ఏర్పాటు చేస్తున్నారు. ఇతర దేశాల వారిని కూడా ఈ స్కూళ్లకు ఆకర్షించేలక్ష్యం కూడా దీని వెనుక ఉంది. ఉదాహరణకు విదేశాల్లో నడిపే ఫ్రెంచి స్కూళ్లలో కేవలం నలభైశాతం మందే ఆ దేశానికి చెందిన వారుంటుండగా మిగతావారందరూ ఇతర దేశీయులే. అమెరికన్‌ స్కూళ్లలో పరిస్థితి కూడా ఇదే. చైనాలో కొన్ని ప్రైవేటు సంస్థలు స్కూళ్లను నడుపుతున్నాయి. ఇవి విదేశాల్లో కూడా చైనా స్కూళ్లను ప్రారంభిస్తే ప్రభుత్వం మద్దతు ఇచ్చే అవకాశాలు ఉన్నాయి.
.

.

సరిహద్దు ప్రాంతాన్ని చైనా మనదేశానికి అప్పగించిందా ? నరేంద్రమోడీ పరువు తీస్తున్న సోషల్‌ మీడియా భక్తులు !

Tags

, , , , , , ,

ఎం కోటేశ్వరరావు


ఫేక్‌ న్యూస్‌, కృత్రిమ మేథతో నకిలీ ఫొటోలతో సామాజిక మాధ్యమంలో జరిపే ప్రచారంలో మనదేశం ఎంతో ముందుంది. నకిలీ వార్తల ముప్పు ఎక్కువగా ఉన్న దేశాలలో మనం ప్రధమ స్థానంలో ఉన్నట్లు గతంలో ప్రపంచ ఆర్థికవేదిక నివేదిక హెచ్చరించింది. గడచిన పది సంవత్సరాలలో ఈ ప్రచారదాడికి గురికాని వాట్సాప్‌ ఉన్న ఫోన్‌ బాధితులు లేరంటే అతిశయోక్తి కాదు.అది నరేంద్రమోడీ, జవహర్‌ లాల్‌ నెహ్రూ, మహాత్మాగాంధీ, మతం, విద్వేషం, తప్పుడు సమాచారం, వక్రీకరణ ఇలా పలు రూపాల్లో ఉంటుంది. కొన్ని సంవత్సరాల క్రితం ఫలానా కంపెనీ లేదా వ్యక్తి దివాలా తీసిన కారణంగా తమ దగ్గర మిగిలిపోయిన వస్త్రాలను కారుచౌకగా విక్రయించి సొమ్ముచేసుకోవాలనుకుంటున్నారు అంటూ పత్రికల్లో ప్రకటనలు వచ్చేవి, నాసిరకం సరుకు అంటగట్టి దుకాణం ఎత్తివేసేవారు. ఈ వార్త ఏ ప్రధాన పత్రికల్లో, టీవీల్లో రాదు అంటూ తప్పుడు సమాచారాన్ని వాట్సాప్‌లో ఉచితంగా అందించే సామాజికసేవకులను మనం చూస్తున్నాం. అలాంటిదే ఇప్పుడు ఒక ఫొటో, దాని కింద సమాచారం ఒకటి తిరుగుతోంది.

ఎక్కడైతే ఘర్షణ జరిగిందో అక్కడే నాలుగు సంవత్సరాల తరువాత తొలిసారిగా దీపావళి రోజు భారత్‌చైనా సైనికులు పరస్పరం మిఠాయిలు పంచుకున్నారు. ఇలాంటి దృశ్యం మరోసారి చూడాలని కోరుకుంటున్నవారికి సంతోషం, ఘర్షణ కొనసాగాలని చూసిన వారికి విషాదం కలిగించింది. సంవత్సరాల పాటు సాగిన చర్చల అనంతరం అక్టోబరు మూడవ వారంలో ఉభయ దేశాల ప్రతినిధులు సరిహద్దుల్లో ఉద్రిక్తతలను సడలించి సాధారణ పరిస్థితులు నెలకొల్పేందుకు ఒక ఒప్పందానికి వచ్చారు. దాన్ని రష్యాలోని కజాన్‌ నగరంలో జరిగిన బ్రిక్స్‌ సమావేశాల సందర్భంగా అక్టోబరు 23న మన ప్రధాని నరేంద్రమోడీచైనా అధ్యక్షుడు షీ జింపింగ్‌ నేతృత్వంలో ఉభయదేశాల ప్రతినిధి బృందాలు సమావేశమై తుదిరూపమిచ్చాయి. ఒక క్రమ పద్దతిలో గాల్వన్‌ లోయ ఉదంతాలకు ముందున్న పరిస్థితిని పునరుద్దరించేందుకు అంగీకరించారు, ఆ మేరకు అక్టోబరు చివరివారంలో సైనిక దళాల ఉపసంహరణ కూడా జరిగింది.ఈ తరుణంలో చైనా వ్యతిరేక మోడీ అనుకూల సోషల్‌ మీడియా మరుగుజ్జులు రంగంలోకి దిగారు. చైనా దేశ మాప్‌ నేపధ్యంలో నరేంద్రమోడీ ఒక సింహాసనం లాంటి కుర్చీలో ఠీవీగా కూర్చొని ఉంటే షి జింపింగ్‌ మోకాళ్ల మీద కూర్చుని భూమిని అప్పగిస్తున్నదానికి చిహ్నంగా చెట్లు ఉన్న ఒక పచ్చని పళ్లెంలాంటి దాన్ని సమర్పించుకుంటున్నట్లు తయారు చేసిన నకిలీ కృత్రిమ చిత్రాన్ని సోషల్‌ మీడియాలో వదిలారు. దాన్ని చైనా సోషల్‌ మీడియాలో వైరల్‌ చేశారని, అడ్డుకునేందుకు అక్కడి ప్రభుత్వం సెన్సార్‌ చేసిందని, షేర్‌ చేస్తున్న వారి మీద కఠిన చర్యలకు దిగుతున్నట్లు సమాచారం వచ్చిందని రాశారు. తప్పుడు సమాచార వ్యాప్తిలో ఇదొక కొత్త టెక్నిక్‌, అబ్బే మనకేం సంబంధం లేదు చైనాలోనే అలాంటిది జరిగినట్లు నమ్మించే అతి తెలివి తప్ప మరొకటి కాదు. తప్పుడు చిత్రాలు, సమాచారాన్ని ప్రచారం చేసే వారు ఎక్కడో ఒక దగ్గర దొరికి పోతారు.

చైనా ఆక్రమించుకున్న 90వేల చదరపు మీటర్ల ప్రాంతాన్ని (22.23ఎకరాలు) తిరిగి మనదేశానికి అందచేసినట్లు రాశారు. నిజానికి రెండు దేశాల మధ్య వివాదం ఉన్న స్థల విస్తీర్ణం 90వేల చదరపు మీటర్లు కాదు కిలోమీటర్లు. ఆ ప్రాంతాన్ని నిజంగా చైనా అప్పగిస్తే అది ప్రపంచ వార్తగా మారి ఉండేది.సరిహద్దుల్లో గతంలో మాదిరి ఎవరి ప్రాంతాల్లో వారు ఉండటం గురించి, గస్తీమీద ఒక ఒప్పందానికి వచ్చారు తప్ప ఒక్క గజం స్థలం కూడా మార్పిడి జరగలేదు, అసలు దాని మీద చర్చలే జరగలేదు. అది మాది అంటే మాది అని మన ప్రభుత్వం, చైనా సర్కార్‌ ఎప్పటి నుంచో పరస్పరం వాదించుకుంటున్నాయి. మన ఆధీనంలో 84వేల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న అరుణాచల్‌ ప్రదేశ్‌ తమదని, టిబెట్‌ దక్షిణ ప్రాంతమని చైనా చెబుతుంటే వారి ఆధీనంలో ఉన్న ఆక్సాయ్‌ చిన్‌ ప్రాంతం 90వేల చదరపు కిలోమీటర్లు మనదని అంటున్న అంశం తెలిసిందే. రెండు దేశాల మధ్య వివాదం అదే కద. అసలేమీ జరగనిదాన్ని చైనా సోషల్‌ మీడియాలో ఎలా ప్రచారం చేస్తారు. అక్కడ మన మాదిరి దేన్నిబడితే దాన్ని జనం మీదకు వదలటానికి గూగుల్‌, యూట్యూబ్‌, వాట్సాప్‌, ఫేస్‌బుక్‌, ఎక్స్‌లు లేవు. వాటి మీద నిషేధం ఉంది. అవెక్కడా కనిపించవు. చైనా సర్కార్‌ అధికారికంగా నిర్వహించే బైడు వంటి సామాజిక మాధ్యమవేదికలు ఉన్నాయి.నిజంగా ఎవరైనా అలాంటి పిచ్చి పోస్టు వాటిలో పెడితే వెంటనే తొలగించే సాంకేతిక నైపుణ్యం చైనా దగ్గర ఉంది. అందువలన అలాంటి వాటిని వైరల్‌ చేసే అవకాశం అక్కడ లేదు. అలాంటి చిత్రాల గురించి నిజానిజాలు తేల్చేందుకు చూసిన వారికి మన సోషల్‌ మీడియాలో తిరుగుతున్న ఒక కృత్రిమ చిత్రంగా తేలింది తప్ప చైనాలో తయారైందిగా కనిపించలేదు. ఒకవేళ ఎవరికైనా అలాంటి సమాచారం ఉంటే ఆధారాలతో వెల్లడిరచవచ్చు. ఆ చిత్రం తీరుతెన్నులను చూస్తే నరేంద్రమోడీ గొప్పతనాన్ని కృత్రిమంగా పెంచేందుకు చూస్తున్న కిరాయిబాపతు సృష్టి తప్ప మరొకటి కాదు అన్నది స్పష్టం. వారికి అదొక తుత్తి(తృప్తి),చౌకబారుతనం తప్ప మరొకటి కాదు. నిజంగా అలాంటి వాటిని పదే పదే ప్రచారం చేస్తే నిజం చెప్పినా ఒకనాటికి మోడీ భక్తులు కూడా నమ్మని స్థితి ఏర్పడుతుంది.పరాయి దేశాల్లో అపహాస్యం పాలౌతారు.


2020లో గాల్వన్‌లోయ సరిహద్దులో రెండు దేశాల మధ్య జరిగిన ఘర్షణ ఆసియా రాజకీయాల్లో భూకంపం అని కొందరు వర్ణించారు. ముఖ్యంగా అమెరికా మీడియా మాటలను చూస్తే భారత్‌చైనాల మధ్య మరో యుద్ధమే తరువాయి అన్నట్లుగా భ్రమపడిన వారున్నారు. ఇంకే ముంది మన చేతికి మట్టి అంటకుండా చైనాను నిరోధించే బాధ్యత నరేంద్రమోడీ నెత్తిన పెట్టవచ్చనుకున్నారు అమెరికన్లు. సరిహద్దులో లక్షల సైన్యం కొనసాగితే మరింతగా సొమ్ము చేసుకోవచ్చని అమెరికా, ఇతర ఐరోపా దేశాల ఆయుధ కంపెనీలు మన గురించి ఎన్నో ఆశలు పెట్టుకున్నాయి.మన మార్కెట్లో తమ సరకులను కుమ్మరించి లాభాలు పిండుకోవచ్చని కలలు కన్నాయి. ఇప్పుడవి కల్లలయ్యాయి. చైనా నుంచి గత నాలుగేండ్లుగా రికార్డు స్థాయిలో దిగుమతులు చేసుకోవటమే కాదు, నిషేధించిన పెట్టుబడులను కూడా పొందేందుకు మోడీ సర్కార్‌ నిర్ణయించింది. దీంతో ఇప్పుడు కుదిరిన సయోధ్య చైనా వ్యతిరేకులకు పిడుగుపాటుగా ఉంది. తమ ఎన్నికలకు పక్షం రోజుల ముందు కుదిరిన ఈ అవగాహనను అమెరికన్లు ఊహించినప్పటికీ పరిస్థితి తమ చేతుల్లో లేదన్న ఉక్రోషంతో ఉన్నారు. మనదేశంలోని కొన్ని శక్తులకు మింగుడు పడకపోయినా కార్పొరేట్ల వత్తిడి కారణంగా లోలోపల ఉడుక్కుంటున్నారు.

చైనా అధ్యక్షుడు షీ జింపింగ్‌పై పోస్టు పెట్టినందుకు, దాన్ని వైరల్‌చేసిన వారి మీద ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోందంటూ సంఘపరివార్‌ మరుగుజ్జులు గుండెలు బాదుకుంటున్నారు.లోక్‌సభ ఎన్నికలకు ముందు కేంద్ర మంత్రి అమిత్‌ షా ఉపన్యాసమంటూ ఫేక్‌ వీడియోలు తయారు చేసిన వారి మీద పెట్టిన కేసులు, అరెస్టుల సంగతి వారికి తెలిసినా చైనాలో సామాజిక మాధ్యమాలలో స్వేచ్చ లేదనట్లుగా ఫోజుపెడుతున్నారు. మరి అపర ప్రజాస్వామికవాది అమిత్‌ షా తరఫున ఎందుకు కేసులు పెట్టినట్లు ? నిజానికి చైనాలో సదరు పోస్టు మీద కేసులు పెట్టారో అసలు అది అక్కడ వైరల్‌ అయిందో లేదో కూడా తెలియదు. అయిందని చెప్పేవారి దగ్గర ఎలాంటి నిర్ధారిత సమాచారమూ లేదు. ఒక్క అధ్యక్షుడి మీద వక్రీకరణ వార్తల మీదే కాదు, గంగానదిలో మునిగితే కరోనా రాదు, దీపాలు వెలిగిస్తే, చప్పట్లు కొడితే పారిపోతుంది అని బాధ్యతా రహితంగా ప్రచారం చేసి జనాలను తప్పుదారి పట్టించేవారి మీద కూడా అక్కడ కేసులు పెడతారు, స్వేచ్చగా వదలి జనాల బుర్రలను ఖరాబు కానివ్వరు. ఐదు సంవత్సరాల క్రితం షీ జింపింగ్‌ మహాబలిపురాన్ని సందర్శించినపుడు అక్కడ నరేంద్రమోడీ షీ ముందు వంగి నమస్కారం చేసినట్లు ఆ రోజుల్లో ఒక ఫొటో వైరల్‌ అయింది. తీరా అది ఫేక్‌ అని తేలింది. ఎప్పుడో 2014లో కర్ణాటకలోని తుముకూర్‌ మహిళా మేయర్‌ స్వాగతం పలికినపుడు నరేంద్రమోడీ వంగి అభివాదం చేసినప్పటి చిత్రాన్ని షీ జింపింగ్‌కు కలిపి వైరల్‌ చేశారు. ఇలా మోడీకి వ్యతిరేకంగా, అనుకూలంగా పెద్ద ఎత్తున అనేక ఫేక్‌ చిత్రాలు, వార్తలను ప్రచారంలో పెట్టారు. ఇటీవల ఐరాస సమావేశాలకు మోడీ న్యూయార్క్‌ వెళ్లినపుడు చైనాను భద్రతా మండలి శాశ్వత సభ్యరాజ్యంగా తొలగించారని, భారత్‌కు చోటు కల్పించారంటూ మోడీ ప్రతిష్టను పెంచేందుకు ఒక తప్పుడు వీడియో, సమాచారాన్ని వైరల్‌ చేశారు. అది ఇప్పటికీ సామాజిక మాధ్యమాల్లో ఉంది. 1970దశకం వరకు కమ్యూనిస్టు చైనాను ఐరాసలో అసలు గుర్తించలేదు, దానికి అడ్డుపడిరది అమెరికా అన్నది జగమెరిగిన సత్యం. ఇప్పటికీ నెహ్రూ కమ్యూనిస్టు చైనాకు భద్రతా మండలిలో సభ్యత్వానికి మద్దతుపలికారంటూ కాషాయదళాలు పచ్చి అబద్ద ప్రచారం చేస్తుంటాయి. మన దేశానికి స్వాతంత్య్రం రాకముందే ఐరాస స్థాపక దేశంగా 1945 నుంచీ రిపబ్లిక్‌ ఆఫ్‌ చైనా పేరుతో శాశ్వత సభ్యత్వ హోదా ఉంది. ఆ తరువాత నాలుగేండ్లకు 1949లో కమ్యూనిస్టులు చైనాలో అధికారానికి వచ్చారు. ఆ తరువాత కూడా 1971వరకు తైవాన్‌లో ఉన్న తిరుగుబాటు ప్రభుత్వాన్నే అసలైన చైనా పాలకులుగా గుర్తించి అదే హోదాను కొనసాగించారు.1971లో తైవాన్‌ పాలకులకు ఉన్న గుర్తింపును రద్దు చేసి కమ్యూనిస్టుల నాయకత్వంలోని పీపుల్స్‌ రిపబ్లిక్‌ చైనా పాలకులను గుర్తించారు. తైవాన్‌ ప్రాంతం చైనాలో అంతర్భాగం అని ఐరాస గుర్తించింది. నెహ్రూ 1964లో మరణించారని తెలిసిందే. 1971 నుంచి ఇప్పటి వరకు మనకు అత్యంత ఆప్తులు, భాగస్వాములు అంటున్న అమెరికా, బ్రిటన్‌, ఫ్రాన్సు గానీ మనకు శాశ్వత సభ్యత్వ హోదా ఇవ్వాలని ఒక్కసారంటే ఒక్కసారి కూడా ఐరాసలో తీర్మానం పెట్టలేదు. ఇదంతా తెలిసినప్పటికీ మోడీ శాశ్వత సభ్యత్వాన్ని సాధించారంటూ తప్పుడు వీడియోలు తయారు చేసి జనంలోకి వదిలారు. ఫేక్‌ న్యూస్‌ చూసేవారికి బుర్ర ఉండదని వారికి ఎంత నమ్మకమో ! షీ జింపింగ్‌మోడీ గురించి పెటిన చిత్రం కూడా అంతే !