దేవుని బిడ్డ నరేంద్రమోడీకి ఏమిటీ పరిస్థితి : అయోధ్య రాముడు ఓడిరచాడు, కాశీ విశ్వనాధుడు పరువు, ఆర్‌ఎస్‌ఎస్‌ గాలి తీసింది !

Tags

, , , , , , ,


ఎం కోటేశ్వరరావు


‘‘ నా మాతృమూర్తి జీవించి ఉన్నంత వరకు నేను జన్యు నిర్ణాయకంగా(బయలాజికల్లీ) జన్మించినట్లు నమ్ముతుండేవాడిని. ఆమె మరణించిన తరువాత నా అనుభవాలన్నింటి మీద ప్రతిఫలించుతున్నవాటిని చూస్తుంటే దేవుడే నన్ను పంపాడని నిర్ధారణకు వచ్చాను. నా జీవ సంబంధ శరీరం నుంచి అయితే ఈ శక్తి వెలువడి ఉండేది కాదు.నా శక్తి సామర్ద్యాలు, ఉత్తేజం, సదుద్దేశ్యాలను దేవుడు ఒక లక్ష్యం కోసం ఇచ్చాడని నేను నమ్ముతున్నాను. నేను ఒక సాధనాన్ని తప్ప మరొకటి కాదు.అందుకే నేను ఎప్పుడు ఏది చేసినా దేవుడు నన్ను నడిపిస్తున్నాడని నమ్ముతాను ’’ అని ప్రధాని నరేంద్రమోడీ చెప్పారు. వారణాసి నియోజకవర్గంలో 2024 ఎన్నికలలో నామినేషన్‌ వేసే సందర్భంగా న్యూస్‌ 18 టీవీ ఛానల్‌ విలేకరి అడిగిన ప్రశ్నకు చెప్పిన సమాధానం అది. చిత్రం ఏమిటంటే అదే విలేకరి 2019 ఎన్నికల సందర్భంగా ‘‘ మీకు అలసట రాదా ’’ అని ప్రశ్నించినపుడు దేవుడు అలా రాసి పెట్టాడు అని బదులిచ్చారట. అయితే అప్పుడు అంతగా దీని గురించి ఎవరూ పట్టించుకోలేదు.నిజం చెప్పాలంటే మనకే(జనానికే) అర్ధం కాలేదు గానీ మొదటి నుంచి నరేంద్రమోడీ తన గురించి స్పష్టతతో ఉన్నారు.మహిళా రిజర్వేషన్‌ బిల్లును ప్రవేశపెట్టిన సందర్భంగా నూతన పార్లమెంటు భవనంలో చేసిన తొలి ప్రసంగంలో మోడీ చెప్పిన అంశాలను ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోవాలి. ‘‘ అతల్‌ బిహారీ వాజ్‌పాయి హయాంలో మహిళా రిజర్వేషన్‌ బిల్లును పలుసార్లు ప్రవేశ పెట్టారు, కానీ దాన్ని ఆమోదించటానికి తగినంత మెజారిటీ లేక ఆమోదం పొందలేదు. ఆ కల అసంపూర్తిగా ఉంది, దాన్ని పూర్తి చేయటానికే బహుశా దేవుడు నన్ను పంపినట్లున్నాడు ’’ అన్నారు.2024 మేనెల 22న ఉత్తర ప్రదేశ్‌లోని బస్తీ నియోజకవర్గంలో జరిగిన ప్రచార సభల్లో మరోసారి తన దైవత్వం గురించి ప్రస్తావించారు. ఎవరైతే తనకు ఓటు వేస్తారో వారు పుణ్యం చేసుకున్న మంచి పనులను పందుతారని, తాను చేస్తానని చెప్పుకున్నారు. కోరుకున్న రూపంలో భగవంతుడు దర్శనమిస్తాడని భక్తులు నమ్ముతారు.నరేంద్రమోడీ ఏ రాష్ట్రానికి వెళితే అక్కడ ఆ రూపంలో సాక్షాత్కరించటం బహుశా దానిలో భాగమేనేమో ! తాము అపర భగవత్‌స్వరూపులమని భావించే నలుగురు శంకరాచార్యలు ‘‘ తమ పోటీ భగవంతుడి ’’ ముందు అయోధ్యలో రామ విగ్రహప్రతిష్టలో ఉత్సవిగ్రహాలుగా కనిపించటం ఇష్టంలేక ఆ కార్యక్రమాన్ని బహిష్కరించిన సంగతి తెలిసిందే. మోడీ నిజంగా దైవాంశ సంభూతుడే అయితే కరోనా సమయంలో శవాలు గంగాతీరానికి కుప్పలుగా వస్తుంటే దీపాలు వెలిగించమని, చపట్లు కొట్టాలని, పళ్లాలను మోగించమని ఎందుకు చెప్పినట్లని అనేక మంది ఎద్దేవాచేశారు.దైవాంశ సంభూతులు అలాంటి వాటిని పట్టించుకోరు.


కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో జై భజరంగ భళీ అంటూ ఓటింగ్‌ యంత్రాల మీట నొక్కమని ఓటర్లకు ఉపదేశించిన సంగతి తెలిసిందే. మోడీ మనసులో ఉన్న భావాన్ని గ్రహించి ఒడిషాలో బిజెపి నేత సంబిత్‌ పాత్ర పూరీ జగన్నాధుడు స్వయంగా మోడీ భక్తుడని సెలవిచ్చిన సంగతి తెలిసిందే. అయితే తరువాత నోరు జారానని చెప్పుకున్నప్పటికీ దానిలో చిత్తశుద్ది లేదని జనం భావించారు. మహారాష్ట్రలో శివాజీ విగ్రహం కూలిపోయినందుకు మోడీ క్షమాపణలు చెప్పారు. పూరీ జగన్నాధుడే మోడీ భక్తుడంటూ బిజెపి నేత చేసిన వ్యాఖ్యలకు నరేంద్రమోడీ నుంచి క్షమాపణలు కాదు కదా కనీసం విచారం కూడా వెల్లడి కాలేదు, తనకేమీ తెలియనట్లు ఉన్నారు. మోహన్‌ భగవత్‌ పరోక్షంగా మాట్లాడటం రెండోసారి. అంతకు ముందు జూలై నెలలో రaార్కండ్‌లో జరిగిన ఒక సభలో మాట్లాడుతూ ‘‘ అభివృద్దికి అంతం లేదు… జనాలు అతీంద్రియశక్తులు (సూపర్‌మాన్‌లు) కావాలని కోరుకుంటారు, కానీ వారు అక్కడితో ఆగరు. తరువాత దేవతగా మారాలని తరువాత దేవుడిగా మారాలని కోరకుంటారు. కానీ తాను విశ్వరూపుడనని భగవంతుడు చెప్పారు. అంతకంటే పెద్దవారు ఎవరైనా ఉన్నది ఎవరికీ తెలియదు.’’ అన్నారు. ఈ మాటలు నాగపూర్‌ నుంచి పేల్చిన అగ్నిక్షిపణి వంటివని నాడు కాంగ్రెస్‌ నేత జైరామ్‌ రమేష్‌ వర్ణించారు. కానీ ఆ క్షిపణి తుస్సుమన్నది. ఆ తరువాత మోడీ నుంచి కనీసం అలికిడి కూడా లేదు.నాగపూర్‌ పెద్దలకు మోడీ మాటలు నచ్చలేదన్నది స్పష్టం.


తాజాగా 2024 సెప్టెంబరు ఆరవ తేదీన పూనాలో జరిగిన ఒక కార్యక్రమంలో ఆర్‌ఎస్‌ఎస్‌ అధిపతి మోహన్‌ భగవత్‌ మాట్లాడుతూ ‘‘ మనం దేవుడిగా మారతామా లేదా అన్నది జనం నిర్ణయిస్తారు. దేవుడిగా మారామని మనం ప్రకటించుకోకూడదు. మౌనంగా ఉండటానికి బదులు కొంత మంది తాము మెరుపులా మెరవాలని కోరుకుంటారు.కానీ మెరుపుల తరువాత అంతకు ముందు ఉన్నదాని కంటే అంధకారం ఏర్పడుతుంది.అవసరమైనపుడు కార్యకర్తలు కొవ్వొత్తిలా కరగాలి, వెలుగునివ్వాలి ’’ అన్నారు. ఈ మాటలు నరేంద్రమోడీ గాలితీస్తూ అన్నవేతప్ప వేరు కాదు. ఒకనాడు మెరిసిన మోడీ మూడోసారి సంపూర్ణ మెజారిటీ తెచ్చుకోవటంలో విఫలం కావటాన్ని అంధకారం అని వర్ణించినట్లుగా చెప్పవచ్చు. తన పేరుతో ఓట్లు దండుకోచూడటం, తాను పూర్తిగా బిజెపి పక్షాన ఉన్నట్లు చిత్రించటం, వీధుల్లోకి లాగటం పట్ల రాముడికి ఆగ్రహం కలిగి ఉండవచ్చు, అందుకే అయోధ్య(ఫైజాబాద్‌ లోక్‌సభ నియోజకవర్గం)లో ఓడిరచినట్లు అనేక మంది నిజమైన భక్తులు భావిస్తున్నారు. చివరికి కాశీ విశ్వనాధుడికి కూడా మనోభావాలు దెబ్బతిన్నట్లు కనిపిస్తోంది. అందుకే మూడవ సారి రికార్డు స్థాయిలో మెజారిటీ సాధించాలని చూసిన నరేంద్రమోడీకి గతం కంటే ఓట్లు, మెజారిటీని కూడా తగ్గించి పరువు తీసినట్లు భావిస్తున్నారు. 2019లోక్‌సభ ఎన్నికల్లో వారణాసి నియోజకవర్గంలో 63.62శాతం(6,74,664) ఓట్లు రాగా సమాజవాదీ పార్టీ అభ్యర్ధిపై 4,79,505 మెజారిటీ తెచ్చుకున్నారు. 2024ఎన్నికల్లో 54.24శాతం(6,12,970) ఒట్లు తెచ్చుకోగా కాంగ్రెస్‌ అభ్యర్ధి మీద కేవలం 1,52,513 మెజారిటీ మాత్రమే తెచ్చుకున్నారు.


తాను దైవాంశ సంభూతుడనని లోక్‌సభ ఎన్నికలకు ముందు నరేంద్రమోడీ ప్రకటించుకున్నదానికి పెద్ద ఎత్తున మీడియాలో ప్రచారం వచ్చింది. ఆ విషయం మోహన్‌ భగవత్‌కు అప్పుడు తెలియదని అనుకోలేము. ఫలితాలు వెలువడే వరకు మౌనవ్రతం పాటించారు. తరువాత కూడా పరోక్షంగా విమర్శలు చేయటం తప్ప నేరుగా తప్పని చెప్పే సాహసం చేయలేకపోయారు. అది కూడా లోక్‌సభలో సంపూర్ణ మెజారిటీ సాధించటంలో విఫలమై మిత్ర పక్షాల మీద ఆధారపడాల్సిన స్థితి ఏర్పడి మోడీ బలహీనత లోకానికి వెల్లడైన తరువాతనే చెప్పారు.మణిపూర్‌లో నెలకొన్న పరిస్థితి గురించి కూడా మోహనభగవత్‌ మరోసారి పూనా సభలో ప్రస్తావించారు(జూన్‌లో తొలిసారి నాగపూర్‌లో నోరు విప్పారు). దీన్లో కూడా చిత్తశుద్ది కనిపించదు. 2023 మే మూడు నుంచి మణిపూర్‌ మండుతున్నది. రాష్ట్రంలో విఫలమైన బిజెపి రాష్ట్ర ప్రభుత్వాన్ని కొనసాగిస్తూ శాంతిభద్రతలను కాపాడేందుకు రాష్ట్రం మొత్తాన్ని మిలిటరీకి అప్పగించారు. అయినా గానీ అక్కడ ఎంతో కష్టతరమైన, సవాలు విసురుతున్న పరిస్థితి ఉందని, స్థానికులకు తమ భద్రత మీద విశ్వాసం లేదని, సామాజిక సేవచేయాలని అక్కడకు వెళ్లిన వారికి కూడా పరిస్థితి మరింత సవాలుగా ఉందని మోహన్‌ భగవత్‌ చెప్పారు. ఇన్ని చెప్పిన పెద్దమనిషి తన ఆధీనంలో పనిచేసే ఒక స్వయం సేవకుడిగా మణిపూర్‌ వెళ్లాలని నరేంద్రమోడీని ఆదేశించలేకపోయారు. కనీసం రాజధర్మంగా ప్రధాని మోడీ ఆ రాష్ట్ర పర్యటన జరిపి జనానికి భరోసా కల్పించాలన్న ఉద్బోధ చేయలేకపోయారు. మోడీతో సహా మొత్తం కేంద్రం, బిజెపి పాలిత రాష్ట్రాలన్నీ ఆర్‌ఎస్‌ఎస్‌ మార్గదర్శనంలో నడుస్తాయన్న బహిరంగ రహస్యం అందరికీ తెలిసిందే.


దేవుళ్లు,దేవతల పట్ల విశ్వాసం, కనిపించిన ప్రతి పుట్టా చెట్టుకు మొక్కే జనాలు పుష్కలంగా ఉన్న మన సమాజంలో చరిత్రలో అనేక మంది తాము దైవాంశ సంభూతులం,కలియుగ దేవతలమని చెప్పుకొన్నారు.ఎంతగా మూఢభక్తి ఉన్నా ఇలాంటి బాపతు చరిత్ర చెత్తబుట్టలో కలిశారు. ఈ విషయం తెలిసినప్పటికీ ఎంతమేరకు వీలైతే అంతమేరకు సొమ్ము చేసుకోదలచిన వారు ఎప్పటికప్పుడు పుట్టుకు వస్తూనే ఉన్నారు. తనను దేవుడే పంపాడని నరేంద్రమోడీ పదేండ్ల తరువాత అంత బాహాటంగా ఎందుకు చెప్పుకున్నట్లు ? జనం ఎందుకు నమ్మలేదు ? మోడీ ప్రతిష్టను పెంచటానికి 2014కు ముందు, తరువాత కూడా కొన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. ప్రశాంత కిషోర్‌ వంటి ‘‘కృత్రిమ గొప్పల తయారీ నిపుణులను’’ కూడా వినియోగించుకున్నారు.ఎక్కడ పర్యటించినా కాషాయ దుస్తులతో గుళ్లు గోపురాలను సందర్శించి మతపరమైన పూజలు పునస్కారాలు, ధ్యానాలు చేశారు. వాటన్నింటినీ టీవీలు పెద్ద ఎత్తున చూపాయి. జనాలను హిందూ ముస్లిం వర్గాలుగా సమీకరించేందుకు చేయాల్సిందంతా చేశారు. తీరా ఇంత చేసినా పదేండ్ల పాలన ఎలాంటి ఫలితాలు ఇవ్వటం లేదని గ్రహించి తానే రంగంలోకి దిగి రామబాణంలాగా దైవాంశసంభూతుడనని చెప్పుకున్నారని చెప్పవచ్చు. రామాయణంలో చివరి అస్త్రంగా పరిగణించే రామబాణం గురించి చదువుకోవటం, సినిమాల్లో చూశాము, కానీ నరేంద్రుడి బాణం ఎదురు తిరగకపోయినా పనిచేయలేదు.

ఐదేండ్లలో ఎంత మార్పు ! సోషలిజం పట్ల ఆస్ట్రేలియా యువత సానుకూలత !!

Tags

, , , , , ,


ఎం కోటేశ్వరరావు


అక్కడేమీ ప్రభావితం చేసే విధంగా కమ్యూనిస్టు పార్టీ లేదు, పురోగామి ఉద్యమాలూ లేవు. వాటి పట్ల వ్యతిరేకత ఉన్న పాలకవర్గం, మీడియాదే ఆధిపత్యం. కమ్యూనిస్టులు కూడా కొన్ని పత్రికలు, వెబ్‌సైట్లు నడుపుతున్నప్పటికీ వాటి ప్రభావం పరిమితమే. అయినా ఆస్ట్రేలియాలో యువత సోషలిజం పట్ల సానుకూలత చూపుతున్నట్లు తాజా సర్వే వెల్లడిరచింది.అభివృద్ధి చెందినట్లు చెబుతున్న దేశాలన్నింటా జనం ప్రత్యేకించి యువత పెట్టుబడిదారీ వ్యవస్థపట్ల విముఖత చూపుతున్నారు. 2024 జూన్‌ 24న యు గవ్‌ అనే సంస్థ ఆస్ట్రేలియాలో జరిపిన సర్వేలో 1824 ఏండ్ల మధ్య యువతలో 53శాతం మంది సోషలిజం పట్ల సానుకూలత చూపగా తటస్థంగా 25శాతం, పెట్టుబడిదారీ వ్యవస్థకు అనుకూలత వెల్లడిరచిన వారు 22శాతం ఉన్నట్లు తేలింది. అదే మొత్తం అన్ని వయసుల వారిలో అలాంటి అభిప్రాయాలు వెల్లడిరచిన వారు 274231శాతాల చొప్పున ఉన్నారు. 2019 అక్టోబరులో యుగవ్‌ ప్రశ్నలకు 28శాతం మంది ఆస్ట్రేలియన్లు తమకు సోషలిజం అంటే ఏమిటో తెలియదని చెప్పగా 13శాతం మంది ఆ వ్యవస్థ కలుపుగోలుతనంతో ఉంటుందని చెప్పారు.సోషలిజాన్ని నిర్వచించమని అడిగిన ప్రశ్నకు అమెరికా యువత 60శాతం మంది సరైన సమాధానం చెప్పగా ఆస్ట్రేలియన్లు 30శాతమే ఉన్నారు. అలాంటి యువత 2024లో 53శాతం మంది సానుకూలత చూపటాన్ని గమనించాలి. దీని అర్ధం వారందరికీ సోషలిజం అంటే పూర్తిగా తెలిసిందని కాదు. సోషలిజం అంటేనే అణచివేత అని భావించిన స్థితి నుంచి బయటపడి ‘‘ సోషలిజం ’’ తాము జీవిస్తున్న పెట్టుబడిదారీ వ్యవస్థ కంటే మెరుగ్గా ఉంటుందనే అభిప్రాయం ఏర్పరుచుకోవటాన్ని ఇక్కడ గమనించాల్సిన, ఆహ్వానించాల్సిన అంశంగా చూడాలి. వీరి శాతం ఏటేటా పెరుగుతున్నది. యుగవ్‌ 2019 అక్టోబరులో ‘‘ కమ్యూనిజం బాధితులు ’’ పేరుతో ఏర్పడిన ఒక సంస్థ తరఫున అమెరికా, ఆస్ట్రేలియాల్లో సర్వే చేసింది.యువతలో సోషలిజం అంటే సమ్మతి లేదా ఆదరణ పెరుగుతున్నదని ఆ సర్వేలో తేలినట్లు ప్రకటించింది. ఇదంతా ఎప్పుడు ? సోషలిజంలో అణచివేస్తారు,భావ ప్రకటన స్వేచ్చ ఉండదు, భవిష్యత్‌ లేదు, అది విఫలమైంది అని ప్రచారం పెద్ద ఎత్తున జరుపుతున్న తరుణంలోనే అన్నది గమనించాలి.ప్రచ్చన్న యుద్ధం పేరుతో కమ్యూనిస్టు వ్యతిరేకతను పెద్ద ఎత్తున రెచ్చగొట్టిన పరిణామాలను చూసిన పాత తరం వారిలో ఉన్న వ్యతిరేక భావం యువతరంలో లేదని ఆ సర్వేలో తేలింది.ఇప్పుడు కమ్యూనిజానికి వ్యతిరేకంగా తక్కువ ప్రచారం జరుగుతోందా ? కానే కాదు, ఏ మాత్రం తగ్గలేదు. తాజా సర్వే జరిగిన నేపధ్యాన్ని చూస్తే అనేక దేశాల్లో యువత సోషలిజం గురించి అధ్యయనం చేయటంతో పాటు నయా ఫాసిస్టు, మితవాద శక్తులు తమ సమస్యలకు పరిష్కారం చూపగలవేమో అన్న భ్రమలతో అటువైపు కూడా మొగ్గుతున్నారు. ఫ్రాన్సులో, తాజాగా జర్మనీలోని తూర్పు ప్రాంతంలో జరిగిన ఒక రాష్ట్ర ఎన్నికల్లో పచ్చిమితవాదులు పెద్దపార్టీగా అవతరించారు. జీవన ఖర్చు పెరగటం, గృహ సంక్షోభం ఆస్ట్రేలియన్‌ యువతను సోషలిజం గురించి ఆలోచింప చేస్తున్నదని తేలింది.జనాభాలో 1834 ఏండ్ల వయస్సువారిలో 41శాతం మంది సోషలిజాన్ని సమర్ధించగా, 35కు పైబడిన వారిలో 21శాతం మంది ఉన్నారు,అదే వయసులో ఉన్నవారు పెట్టుబడిదారీ విధానాన్ని 34శాతమే సమర్ధించినట్లు విశ్లేషణలో తేలింది. యువత సోషలిజం వైపు ఎందుకు మొగ్గుతున్నారన్న ప్రశ్నకు యుగవ్‌ డైరెక్టర్‌ పాల్‌ స్మిత్‌ మాట్లాడుతూ యువతరం ఎంతో భిన్నమైన ఆర్థిక పరిస్థితిని చవిచూస్తున్నారని, 2008 ద్రవ్య సంక్షోభం తరువాత శ్రామికశక్తిలో చేరిన యువత అసంతృప్తికి లోనై సోషలిజం వైపు మొగ్గుతున్నట్లు చెప్పాడు. పెద్ద తరాలు మంచివేతనాలతో కూడిన జీవితాలను గడపగా యువతకు అలాంటి హామీ లేదని, విద్య, గృహాలకు ఎక్కువగా చెల్లిస్తున్నారని అన్నాడు. ఒక స్థిరమైన ఉపాధి లేకపోవటం, తాత్కాలిక పనివారిని తీసుకొనే వాతావరణం ఎక్కువగా ఉండటంతో వారసత్వంగా వచ్చినవి ఉంటే తప్ప అద్దె ఇండ్లలో నివసించలేని స్థితి ఏర్పడిరది. ఆర్థిక అసమానతలు పెరుగుతున్నాయి. గాజా వంటి చోట్ల జరుగుతున్న దారుణాలను సామాజిక మాధ్యమాల్లో చూస్తున్నవారు పెట్టుబడిదారీ విధానం యుద్ధాలను ప్రోత్సహించటం ఎందుకని ప్రశ్నలు సంధించటం పెరిగింది.ఆస్ట్రేలియాలో పర్యావరణాన్ని పరిరక్షించాలని కోరుకొనే వారు 64శాతం మంది సోషలిజాన్ని అభిమానించగా, లేబర్‌ పార్టీ 31, సంకీర్ణ కూటమి మద్దతుదార్లలో కేవలం 12శాతమే ఉన్నారు. కార్పొరేట్ల లాభాల కంటే జనం ప్రయోజనాలు,భూగోళాన్ని పరిరక్షించాలని కోరుకొనే వారు పెరుగుతున్నారు.


యువతలో ఎందుకీ మార్పు ? కమ్యూనిజం విఫలమైందని ప్రచారం జరిగిన చోటే పెట్టుబడిదారీ విఫలమైందని ఆ విధాన గట్టి సమర్ధకుడైన థామస్‌ పికెట్టి వంటి వారు సాధికారికంగా స్పష్టం చేసిన తరువాత యువత ఆలోచించకుండా ఎలా ఉంటుంది ? సోషలిస్టు చైనా, వియత్నాం నుంచి దిగుమతి చేసుకున్న వస్తువులనే నిత్యం వాడుతున్నపుడు ఆ వస్తువులను మన దేశంలో ఎందుకు తయారు చేసుకోలేకపోతున్నాం అని ఎక్కడికక్కడ యువత అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పేవారు లేరు. 19952010 మధ్య జన్మించిన వారిని జడ్‌ తరం అని పిలుస్తున్నారు. వీరిని సోషలిజం(ఆకర్షిస్తున్నదని) కవ్విస్తున్నదని కొందరు వర్ణించారు.ముఖ్యంగా అమెరికాలో ఈ ధోరణి కనిపిస్తోంది.అనేక మంది మేం సోషలిస్టులం అంటూ గర్వంగా చెప్పుకుంటున్నారు. ఒకవైపు అమెరికాలో కమ్యూనిస్టు వ్యతిరేక ప్రచారం ఇప్పటికీ పెద్ద ఎత్తున కొనసాగుతూనే ఉంది. అయితే అక్కడ దిగజారుతున్న ఆర్థిక పరిస్థితులు యువతను ఆలోచింపచేస్తున్నాయి. కమ్యూనిజం, సోషలిజం గురించి వక్రీకరణలు కొనసాగుతున్నప్పటికీ టీచర్లు బోధిస్తున్న అంశాలలో డెన్మార్క్‌, నార్వే వంటి చోట్ల స్కాండినేవియన్‌ సోషలిజం గురించి చెబుతున్న అంశాలు వారిని ఆకర్షిస్తున్నట్లు కొందరు చెబుతున్నారు. అమెరికా కంటే అక్కడి పరిస్థితి మెరుగ్గా ఉన్నందున అలాంటి సోషలిజాన్ని ఎందుకు అమలు చేయకూడదనే ప్రశ్నకు సరైన సమాధానం వారికి దొరకటం లేదు. అయితే ఆ దేశాల్లో ఉన్న జనాభా మొత్తం కూడా అమెరికాలో ఒక రాష్ట్రంలో ఉన్నవారికి సమానమని 30 కోట్ల మందికి సోషలిజాన్ని అమలు చేయటం, దీర్ఘకాలం కొనసాగించటం సాధ్యం కాదని మాత్రమే చెప్పటం వారికి సంతృప్తిని కలిగించటం లేదు. ఆయా దేశాల జిడిపితో పోలిస్తే అమెరికా జిడిపి ఎక్కువగా ఉన్నపుడు ఎందుకు సాధ్యం కాదు ? చైనాలో సంస్కరణల పేరుతో అమలు చేస్తున్నది అమెరికాలో మాదిరి పెట్టుబడిదారీ విధానమే అని అని నమ్మించేందుకు అక్కడి మేథావులు ప్రయత్నించారు. అదేగనుక వాస్తవమైతే మిగతా జర్మనీ,బ్రిటన్‌, జపాన్‌ వంటి దేశాలతో మిత్ర సంబంధాలను కొనసాగిస్తూ చైనాను వ్యవస్థాపరమైన శత్రువుగా మరోవైపు పాలకవర్గం చూడటాన్ని యువతరం గమనిస్తున్నది.మొత్తం మీద చెప్పాలంటే సోషలిజం గురించి ఆసక్తి కనపరుస్తున్న యువతను దారి మళ్లించేందుకు అక్కడి కమ్యూనిస్టు వ్యతిరేకులు నానా పాట్లు పడుతున్నారు.వారి జీవితానుభవం నుంచే అలాంటి ఆసక్తి కలుగుతున్నదని సామాజిక మాధ్యమం, మీడియా తప్పుదారి పట్టిస్తున్నదని, వ్యక్తిగత స్వార్ధం యువతలో పెరిగిందని, దేశం ఏమైనా ఫర్వాలేదన్నట్లుగా తయారవుతున్నారని పెడబబ్బలు పెడుతున్నారు. దీనికి తమను తామే నిందించుకోవాలంటున్నారు. అందరికీ ఆరోగ్య రక్షణ కావాలన్న డిమాండ్‌కు యువత మద్దతు ఇవ్వటానికి మేథావుల సైద్దాంతిక బోధన కారణం కాదని, పెరుగుతున్న ఖర్చు, బీమా సౌకర్యం లేకపోవటమే అంటున్నారు. అరచేతిని అడ్డుపెట్టి సూర్యకాంతిని ఆపలేనట్లుగానే వాస్తవాలు, జీవిత అనుభవాల నుంచి పక్కదారి పట్టించాలంటే కుదరదు. అనేక దేశాల్లో ఇప్పుడు సోషలిజాన్ని యువత కోరుకోవటానికి పెట్టుబడిదారీ వ్యవస్థలలో వారి కలలు కల్లలు కావటమే కారణం. కమ్యూనిస్టు వ్యతిరేక ప్రచారంతో జనాల బుర్రలు నిండటం తప్ప కడుపు నిండదని తేలిపోయింది. అమెరికా, ఐరోపా దేశాలలో సోషలిజం పట్ల పెరుగుతున్న ఆదరణను అడ్డుకొనేందుకు ప్రత్నామ్నాయంగా స్కాండినేవియన్‌ దేశాలలో అమలు జరుపుతున్న సంక్షేమ పథకాలనే సోషలిజంగా చిత్రించి కమ్యూనిస్టులు చెప్పే వర్గరహిత సోషలిజం, కమ్యూనిజాలవైపు మళ్లకుండా చూశారు. ఇప్పుడు అమెరికాలో, ఇతర చోట్ల పెట్టుబడిదారీ వ్యవస్థలో తమ బతుకులు మెరుగుపడవు అని అర్ధం చేసుకున్నవారు కమ్యూనిస్టు సోషలిజం లేకపోతే పోనివ్వండి కనీసం ‘‘ స్కాండినేవియన్‌ సోషలిజం’’ ‘‘ ప్రజాస్వామిక సోషలిజం ’’ కావాలని, అమలు జరపాలని యువత కోరుతున్నది. సోషలిస్టు భావన కమ్యూనిస్టులతోనే ప్రారంభమైందని ఎవరైనా అనుకుంటే పొరపాటు.సమాజంలో దోపిడీ, అణచివేతలను సహించని అనేక మంది వాటిని వ్యతిరేకించారు, అవిలేని సమాజం కావాలని కోరుకున్నారు. ఉదాహరణకు ఎంతో ఘనమైనదిగా ఉందని చెప్పే మన సమాజంలో గతంలో అందరూ సుఖసంతోషాలతో ఉండి ఉంటే సర్వేజనా సుఖినోభవంతు అనే భావనే వచ్చి ఉండేది కాదు. అదీ సోషలిస్టు భావనే ! కారల్‌ మార్క్స్‌ఫెడరిక్‌ ఎంగెల్స్‌ ముందుకు తెచ్చిన శాస్త్రీయ సోషలిజం, కమ్యూనిజం సిద్దాంతాలకు ముందు ఊహాజనిత సోషలిస్టులు ఉన్నారు.అఫ్‌కోర్సు ఇప్పటికీ అలాంటి వారు లేకపోలేదు.కారల్‌ మార్క్స్‌`ఫెడరిక్‌ ఎంగెల్స్‌ చెప్పిన సోషలిజం ఊహ తప్ప ఎక్కడా అమలు జరగలేదని, ఆచరణ సాధ్యం కాదని చెప్పేవారు ఉన్నారు. అయినా యువత సోషలిజాన్ని ఎందుకు కోరకుంటున్నది ?


మిగతా ఐరోపా, అమెరికాలతో పోలిస్తే స్కాండినేవియన్‌ దేశాలలో సంక్షేమ పథకాలు, సామాజిక భద్రత మెరుగ్గా ఉంది. అందువలన కమ్యూనిస్టులు చెప్పే సోషలిజాన్ని కాసేపు పక్కన పెడితే ఆ విధానాలనైనా ఎందుకు అమలు జరపరనే డిమాండ్‌ అమెరికాలో ముందుకు వస్తున్నది.కరోనాకు ముందు స్కాండినేవియన్‌ దేశాలలోని డెన్మార్క్‌ జిడిపిలో ప్రభుత్వ ఖర్చు 49.7శాతం ఉండగా, స్వీడన్‌లో 49.1శాతం కాగా అమెరికాలో 38.5శాతమే ఉంది.ట్రేడిరగ్‌ ఎకనమిక్స్‌ తాజా సమాచారం 2023 డిసెంబరు ప్రకారం యూరో ప్రాంతంలో ఖర్చు 49.9శాతం కాగా అమెరికాలో 34.38శాతం, మనదేశంలో 14.92శాతం ఉంది.అందరికీ సమాన అవకాశాలు అని చెప్పే పెట్టుబడిదారీ వ్యవస్థలో ఆర్థిక అంతరాలు రోజు రోజుకూ పెరుగుతున్నాయి. పెట్టుబడిదారీ మేథావులు చెప్పిన ఊటసిద్దాంతం ప్రకారం సంపదలు ఎగువ నుంచి దిగువకు ప్రవహించలేదు. ధనికులు మరింత ధనికులు, పేదలు మరింత పేదలుగా మారుతున్నారు. అందువలన ఒకశాతం ఎగువ ధనికుల మీద అధిక పన్నులు విధించి పేదల సంక్షేమానికి ఖర్చు చేయాలనే ప్రశ్నకు 66శాతం మంది అమెరికన్లు మద్దతు ఇచ్చారు.ఎగువ పదిశాతం మంది మీద పెంచాలనే వారు 54శాతం ఉండగా అందరి మీద పన్ను పెంచాలనే ప్రశ్నకు 37శాతమే మద్దతు ఇచ్చారు. దోపిడీ ప్రారంభమైపుడే దానికి గురైనవారు సోషలిజం కావాలంటూ ముందుకు వచ్చి ఉద్యమించలేదు. అనేక ఉద్యమాలు, వాటితో వచ్చిన సంస్కరణలు కూడా దోపిడీని నిర్మూలించని కారణంగానే శాస్త్రీయ సోషలిస్టు సిద్దాంత ప్రతిపాదన ఆచరణ సాధ్యంగా ఉంటుందని జనం నమ్మారు,దానికోసం ఉద్యమించారు.ఆచరణలో దానికి తగిలింది ఎదురుదెబ్బలే తప్ప మరొకటి కాదు. అందువలన కమ్యూనిస్టులు చెప్పే సోషలిజానికి బదులు ఇతర సోషలిజం కోసం ముందుకు వచ్చేవారిని ఆహ్వానిద్దాం. మితవాదం, మతవాదం వైపు వెళ్లేదానితో పోల్చితే ఇదెంతో ఆరోగ్యకర పరిణామమే కదా ! దానికి ఉండే పరిమితులను అర్ధం చేసుకున్న తరువాత వారు కూడా అంతిమంగా శాస్త్రీయ సోషలిస్టు సమాజ నిర్మాణానికే మద్దతు ఇస్తారు. దోపిడీ రహిత సమాజానికి ఎవరైనా వేరే పేరు పెడదాం అంటారా పెట్టనివ్వండి. పిల్లి నల్లదా తెల్లదా అని కాదు అది ఎలుకలను పడుతుందా లేదా అన్నదే గీటురాయి.పేరులో ఏముంది పెన్నిది !

రెచ్చిపోతున్న ఇజ్రాయెల్‌ : వెస్ట్‌బాంక్‌కు విస్తరించిన దాడులు !

Tags

, , , , ,


ఎం కోటేశ్వరరావు


గతేడాది అక్టోబరు ఏడు నుంచి పాలస్తీనాలోని గాజా ప్రాంతంపై మారణకాండ సాగిస్తున్న ఇజ్రాయెల్‌ గత ఏడు రోజులుగా ఉగ్రవాదులను ఏరివేసే పేరుతో వెస్ట్‌ బాంక్‌ ప్రాంతమంతటా దాడులు చేస్తోంది.అనేక మంది ప్రాణాలు తీసింది. విచక్షణా రహితంగా అరెస్టులు చేస్తోంది.అక్కడేమీ హమస్‌ పార్టీ లేదా దాని మద్దతుదారులెవరూ లేరు.ఒక వైపు గాజాలో పసిపిల్లలకు పోలియో చుక్కలు వేసేందుకు అవకాశం కల్పిస్తున్నట్లు చెబుతూనే మరోవైపు మిలిటరీదాడులు చేస్తోంది.గాజాలోని ఒక సొరంగంలో శనివారం నాడు ఆరుగురు బందీల మృతదేహాలు దొరకటంతో ఇజ్రాయెల్‌ పౌరులు దేశమంతటా లక్షలాది మంది నిరసన ప్రదర్శనలు జరపటంతో పాటు సాధారణ సమ్మె పాటించారు. ప్రధాని నెతన్యాహు దీనికి బాధ్యత వహించాలని రాజీనామా చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు.తాము బందీల వద్దకు వెళ్లటానికి కొద్దిసేపటి ముందే హమస్‌ వారిని చంపిందని ఇజ్రాయెల్‌ ఆరోపించింది.ఇజ్రాయెల్‌ దాడుల్లోనే వారు మరణించారని హమస్‌ చెబుతోంది.సోమవారం నాటికి ఇజ్రాయెల్‌ దాడులలో గాజాలో 40,786 మంది మరణించగా 94,224 మంది గాయపడ్డారు. మరణాలతో పాటు గాజాలో ఇప్పటి వరకు 60శాతం నివాస గృహాలు, 80శాతం వాణిజ్య సముదాయాలు,65శాతం సాగు భూమి, 65శాతం రోడ్లు పనికి రాకుండా చేశారు.ఆసుపత్రులు 36 ఉండగా వాటిలో 17మాత్రమే పాక్షికంగా పని చేస్తున్నాయి. అదే మాదిరి 85శాతం పాఠశాల భవనాలను నేలమట్టం చేశారు. హమస్‌ సాయుధులు వీటిని కేంద్రాలుగా చేసుకొని దాడులు చేస్తున్నట్లు ఇజ్రాయెల్‌ ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే.గాజాలోని ఒక పాఠశాలలో నిర్వహిస్తున్న హమస్‌ కమాండ్‌ కేంద్రాన్ని తమ వైమానిక దళం నాశనం చేసిందని ఇజ్రాయెల్‌ చెప్పుకుంది. పాలస్తీనాలో జోర్డాన్‌ నది పశ్చిమంగా ఉన్న ప్రాంతానే ్న వెస్ట్‌బాంక్‌ లేదా పశ్చిమ గట్టు అంటున్నారు. అది 5,650చదరపు కిలోమీటర్లలో ఉంది.జనాభా 30లక్షలు.దానికి ఒకవైపు జోర్డాన్‌, మరోవైపు ఇజ్రాయెల్‌,మూడోవైపు మృత సముద్రం(డెడ్‌ సీ) ఉంది.గాజాకు వెళ్లాలంటే ఇజ్రాయెల్‌ ప్రాంతాల నుంచే దారి ఉంది.అది పూర్తిగా పాలస్తీనాకు చెందినప్పటికీ అనేక ప్రాంతాలను ఇజ్రాయెల్‌ ఆక్రమించింది.దాంతో 8లక్షల 71వేల మంది పాలస్తీనియన్లు తమ స్వంతగడ్డమీదే శరణార్ధులుగా శిబిరాలలో ఉన్నారు. ఇప్పుడు ఇజ్రాయెల్‌ వాటి మీద కూడా దాడులు చేస్తున్నది.తక్షణమే హమస్‌తో రాజీకి వచ్చి వారి వద్ద ఉన్న వందకు పైగా ఉన్న బందీలను విడిపించాలని కోరుతున్నట్లు అనేక సర్వేలు వెల్లడిరచినప్పటికీ నెతన్యాహు ఖాతరు చేయటం లేదు.మరోవైపు ఇటీవల ఇరాన్‌ జరిపిన క్షిపణుల దాడి తరువాత సామాన్య జనంలో భయాందోళనలు పెరుగుతున్నాయి.ఆపరేషన్‌ ట్రూ ప్రామిస్‌ పేరుతో సెకనుకు ఒకటి చొప్పున 100 క్షిపణులను ప్రయోగించి ఉక్కిరిబిక్కిరి చేసింది.దీన్ని అమెరికా, ఇజ్రాయెల్‌ ఊహించలేదు.మా తడాఖా ఇది అని ఇరాన్‌ ప్రదర్శించిన తరువాత దాడి నిలిపివేసింది. అందువలన ఎప్పుడేం జరుగుతుందో తెలియటం లేదు.


గాజాతో పాటు వెస్ట్‌బాంక్‌ ప్రాంతం మీద కూడా జరుపుతున్న దాడులను చూస్తే పశ్చిమాసియాలో మరో ప్రాంతీయ యుద్ధానికి రెచ్చగొడుతున్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది. ఇదంతా అమెరికా కనుసన్నల్లోనే అని వేరే చెప్పనవసరం లేదు.అయితే ఈ దాడులతో ఇజ్రాయెల్‌ మరింతగా సంక్షోభంలో కూరుకుపోతున్నదని చెప్పవచ్చు.పాలస్తీనియన్ల రెండవ తిరుగుబాటు 2000 నుంచి 2005వరకు జరిగింది. ఆ సందర్భంగా ఇజ్రాయెల్‌ జరిపిన దాడుల్లో మూడువేల మందికిపైగా మరణించారు. తరువాత మరోసారి ఇప్పుడు తెగబడుతోంది.ఇరాన్‌ మద్దతు ఉన్న ఉగ్రవాదులను అణచే సాకుతో ఇప్పుడు దాడులకు దిగుతోంది.ఈ పరిణామాన్ని గాజా 2.0గా వర్ణిస్తున్నారు. గాజా మారణకాండ ప్రారంభమైన నాటి నుంచి ఇప్పటి వరకు వెస్ట్‌బాంక్‌లో అడపాదడపా జరుపుతున్న దాడుల్లో 150 మంది పిల్లలతో సహా 650 మంది మరణించారు.ఇప్పటి వరకు 10,300 దాడులు జరిగాయి, ఆ ప్రాంతంలోని యూదు ఆక్రమణదార్లకు వేలాది ఆయుధాలను అందించి అరబ్బులపై దాడులకు రెచ్చగొడుతున్నది. గతవారం రోజులుగా అనేక పట్టణాల్లో ఉన్న నిర్వాసితుల శిబిరాలపై మిలిటరీ దాడులు చేస్తున్నది. ఓస్లో ఒప్పందాల ప్రకారం వెస్ట్‌ బాంక్‌లో పాలస్తీనా ఫతా ప్రభుత్వం ఉన్నప్పటికీ అక్కడ అది చేసేదేమీ లేదు. అడుగడుగునా ఇజ్రాయెల్‌ మిలిటరీ, సాయుధ దళాలు ఉన్నాయి.పాలస్తీనియన్‌ ప్రాంతాల ఆక్రమణ, వాటిలో యూదుల నివాసాల ఏర్పాటు, జనాభా నిష్పత్తిని మార్చివేసే కుట్ర కొనసాగుతూనే ఉంది.వాటిని ప్రతిఘటించేవారిని అణచివేసేందుకు యూదుల రక్షణ పేరుతో ఇజ్రాయల్‌ మిలిటరీ తిష్టవేసింది. విదేశాంగ మంత్రి ఇజ్రాయెల్‌ కాట్జ్‌ మాట్లాడుతూ ‘‘ గాజాలో ఉగ్రవాదుల వ్యవస్థను దెబ్బతీస్తున్నట్లుగానే ఇక్కడ కూడా అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని, విజయం సాధించాలని ’’ ప్రకటించాడు. వెస్ట్‌బాంక్‌పై దాడికి ఇజ్రాయెల్‌ చెబుతున్న సాకులన్నీ అబద్దాలేనని జోర్డాన్‌ విదేశాంగ మంత్రి అయమాన్‌ సఫాదీ వర్ణించాడు.పాలస్తీనియన్లను తమ ప్రాంతాల నుంచి తరిమివేసే ఏ చర్యనైనా తాము వ్యతిరేకిస్తామన్నాడు.


తాజా పరిణామాలో వెస్ట్‌బాంక్‌లో కూడా ప్రతిఘటించటం మినహా పాలస్తీనియన్లకు మరోదారి లేదు.ఇజ్రాయెల్‌ కోరుకుంటున్నది కూడా అదే కావటంతో కావాలని రెచ్చగొడుతున్నది. ఇటీవల చైనా మధ్యవర్తిత్వంలో పాలస్తీనా విముక్తి సంస్థలన్నీ ఒక అవగాహనకు వచ్చిన సంగతి తెలిసిందే.ఇప్పటి వరకు హమస్‌ను వ్యతిరేకిస్తున్న పరిమిత అధికారాలున్న పాలస్తీనా అధ్యక్షుడు మహమ్మద్‌ అబ్బాస్‌ కూడా పిఎల్‌ఓలో హమస్‌ భాగస్వామ్యాన్ని అంగీకరించాడు. గత కొద్ది సంవత్సరాలుగా ఇజ్రాయెల్‌ దిగ్బంధనంతో వెస్ట్‌బాంక్‌లో పరిస్థితి రోజురోజుకూ దిగజారుతున్నది. సహజంగానే అబ్బాస్‌ మీద వ్యతిరేకతను పెంచుతుంది. నేడు గాజాలో జరుగుతున్నది రేపు తమ మీద కూడా జరగవచ్చనే ఆందోళన వెస్ట్‌బాంక్‌లో తలెత్తింది.దీన్ని గమనించే అబ్బాస్‌ కూడా గత వైఖరిని మార్చుకోవాల్సి వచ్చింది.హమస్‌ కూడా ఒక అడుగు వెనక్కు తగ్గింది. ఈ కారణంగానే వెస్ట్‌బాంక్‌లో రాజకీయ విబేధాలతో నిమిత్తం లేకుండా పాలస్తీనియన్లు ప్రతిఘటిస్తున్నారు.ఇది అమెరికా, ఇజ్రాయెల్‌ మీద వత్తిడిని పెంచుతుంది, మరో మాటలో చెప్పాలంటే ఊహించని పరిణామం. తాజా దాడులకు ఇది ఒక కారణం. దీన్ని చూపి దిగజారుతున్న తన ప్రతిష్టను నిలుపుకొనేందుకు నెతన్యాహు చూస్తున్నాడు. రెండుదశాబ్దాల నాటి పరిస్థితికీ ఇప్పటికీ వచ్చిన తేడాను యూదు దురహంకారులు గుర్తించటం లేదు.గాజా పరిణామాలు పక్కనే ఉన్న జోర్డాన్‌ రాజు అబ్దుల్లాకు ఎసరుతెచ్చేవిగా ఉన్నాయి.వెస్ట్‌బాంక్‌లో దాడుల కారణంగా పాలస్తీనియన్లు నిర్వాసితులైతే జోర్డాన్‌ వారికి ఆశ్రయం కల్పించే స్థితిలో లేదు. తిరస్కరించే పరిస్థితి కూడా రాజుకు లేదు. పాలస్తీనియన్ల మీద దాడులు పెరిగితే జోర్డానియన్లు సహించరు.ఈజిప్టు,యుఏయి,మొరాకో, బహరెయిన్‌ దేశాల పాలకులు ఇజ్రాయెల్‌తో మిత్ర సంబంధాలు కలిగి ఉన్నారు.వారి మీద కూడా జనం నుంచి వత్తిడి పెరుగుతుంది.ఒక్క గాజా, వెస్ట్‌బాంక్‌ ప్రాంతాల నుంచే కాదు, గోలన్‌ గుట్టలు,లెబనాన్‌లోని ఆక్రమిత ప్రాంతాల నుంచి కూడా ఇజ్రాయెల్‌ వైదొలగాలనే డిమాండ్‌ పెరుగుతుంది.వెస్ట్‌ బాంక్‌ ప్రాంతంలో రెండవ తిరుగుబాటు జరిగినపుడు 2002లో 70వేల యూదుల నివాసాలు ఉంటే వాటిని ఇజ్రాయెల్‌ 2024నాటికి ఎనిమిది లక్షలకు పెంచింది. వాటన్నింటినీ ఖాళీ చేసి అక్రమంగా ప్రవేశపెట్టిన యూదులందరినీ అక్కడి నుంచి తరలించాల్సి ఉంది.తూర్పు జెరూసలెం రాజధానిగా గణతంత్ర పాలస్తీనా ఏర్పడాలన్న ఐరాస తీర్మానం అమలు తప్ప మరొక పరిష్కారం లేదు.
ఇజ్రాయెల్‌ జరుపుతున్న మారణకాండకు అమెరికా, ఇతర పశ్చిమ దేశాలు నిస్సిగ్గుగా మద్దతు ఇస్తున్నాయి.గాజా మారణకాండకు నిరసనగా ఇరాన్‌ ఒకవేళ దాడులకు దిగితే అడ్డుకొనేందుకు అమెరికా తన నౌక,వైమానిక దళాలను పెద్ద ఎత్తున ఎర్ర సముద్ర ప్రాంతానికి తరలించింది.

ఒకేసారి పలు రంగాలలో దాడులకు నెతన్యాహు ఎందుకు పాల్పడుతున్నాడనే ప్రశ్న సహజంగానే తలెత్తుతుంది.లెబనాన్‌,ఇరాన్‌లలో హమస్‌ నేతలను హత్య చేయటం,హిజబుల్లాను రెచ్చగొట్టటం,గాజాతో పాటు ఇప్పుడు వెస్ట్‌బాంక్‌పై దాడులకు దిగటం చూస్తున్నాము.నెతన్యాహు అమెరికా పర్యటన జరిపి చర్చలు జరిపి వచ్చిన తరువాత వెస్ట్‌బాంక్‌ మీద దాడులకు దిగింది.ఎవరెన్ని వివరణలు, భాష్యాలు చెప్పినప్పటికీ పొసగటం లేదు. అమెరికా ఎన్నికలు ముగిసేవరకు వర్తమాన పరిణామాలు ఇలాగే కొనసాగవచ్చు.ఉద్రిక్తతలను మరింత పెంచటం ద్వారా బైడెన్‌ మీద వత్తిడి పెరుగుతుందని అది తన విజయానికి బాట వేస్తుందనే అంచనాతో ట్రంప్‌ ఉన్నట్లు, అతగాడి నుంచి వచ్చిన సూచన మేరకు నెతన్యాహు రెచ్చిపోతున్నట్లు ఒక భాష్యం.బైడెన్‌ అమెరికాలో పలుకుబడి కలిగిన యూదుల మద్దతు పొందటానికి వారిని సంతుష్టీకరించేందుకు దాడులకు మద్దతు ఇస్తున్నాడని, దానికి అనుగుణ్యంగానే ఇజ్రాయెల్‌ వ్యవహరిస్తున్నదనే కథనాలు కూడా ఉన్నాయి. ప్రాంతీయ యుద్ధం తలెత్తితే అది ఎన్నికల్లో తమకు లాభిస్తుందని డెమోక్రాట్లు భావిస్తున్నారని కూడా చెబుతున్నారు. అయితే ఇప్పటికే ఉక్రెయిన్లో తగులుతున్న ఎదురుదెబ్బలు, భారీ ఖర్చును చూసిన తరువాత అమెరికా మరో రంగంలో చేతులు కాల్చుకుంటుందా, పరువు పోగొట్టుకొని పలుచన అవుతుందా ? కారణాలేమైనప్పటికీ అమెరికా పన్నిన వలలో చిక్కుకొనేందుకు ఇరాన్‌ తదితర దేశాలు సిద్దంగా లేవు.అయితే ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు అది సిద్దమౌతోంది.సౌదీతో ఉన్న విబేధాలను పరిష్కరించుకోవటంలో అదే కనిపిస్తున్నది. హమస్‌తో రాజీకి వచ్చినా తనదే పైచేయి అని చెప్పుకొనేట్లుగా నెతన్యాహు చూస్తున్నాడు, లేనట్లయితే ప్రతిపక్షం వెంటనే దాడి ప్రారంభిస్తుంది. అందుకే అసాధ్యమైన షరతులను విధిస్తున్నట్లు చెబుతున్నారు.గాజా`ఈజిప్టు సరిహద్దులో ఫిలడెల్ఫీ,నెట్‌జారిమ్‌ కారిడార్లలో తమ మిలిటరీని అనుమతించాలన్నది వాటిలో ఒకటి. దానికి హమస్‌ ససేమిరా అంటున్నది.అక్కడ తీవ్రమైన ప్రతిఘటన ఉన్నప్పటికీ మిలిటరీ కొనసాగాల్సిందేనని ఇజ్రాయెల్‌ యుద్ధ కాబినెట్‌ తీర్మానించింది. అమెరికాలో నవంబరులో ఎన్నికలు జరిగి జనవరిలో కొత్త ప్రభుత్వం ఏర్పడే వరకు పాలస్తీనాలో మారణకాండ సాగేట్లు కనిపిస్తున్నది.

చివరికి గొడుగులు కూడా చైనా నుంచి దిగుమతా ! హతవిధీ పదేండ్లలో నరేంద్ర మోడీ ప్రగతి ఇదా !!

Tags

, , , , , , , ,


ఎం కోటేశ్వరరావు


మన దేశంలో అగ్రశ్రేణి ఆటోమొబైల్‌ కంపెనీ టాటా మోటార్స్‌ తన విద్యుత్‌ కార్లకు చైనా బ్యాటరీలను కొనాలని నిర్ణయించింది. మేకిన్‌ ఇండియా పథకం కింద విద్యుత్‌ బాటరీలను తయారు చేస్తున్నారని పెద్ద ఎత్తున ప్రచారం జరిగిన తరువాత ఈ పరిణామం చోటు చేసుకుంది. ఇదే సమయంలో గతంలో విధించిన నిషేధాలను తొలగించి ఇబ్బందిలేని ఎలక్ట్రానిక్స్‌ వంటి రంగాలలో చైనా పెట్టుబడులను అనుమతించాలని కూడా నిర్ణయించారు. 2030నాటికి దేశంలో 30శాతం వాహనాలు విద్యుత్‌ బాటరీలో నడిచే అవకాశం ఉన్నందున వాటి ఉత్పత్తిని ఇబ్బడి ముబ్బడిగా పెంచాల్సి ఉంది. ఈ క్రమంలో చైనా పెట్టుబడుల అవసరం మనదేశానికి ఉందా లేదా అని మోడీ గారి బిజెపిలో ‘‘ అంతర్గత పోరు ’’ ఉన్నట్లు 2024 ఆగస్టు ఒకటవ తేదీన అమెరికాభారత సంయుక్త యాజమాన్యంతో నడుపుతున్న సిఎన్‌బిసి టీవీ ఛానల్‌ ఒక వార్తను ప్రసారం చేసింది. ఇటీవల కొద్ది నెలలుగా జరుగుతున్న పరిణామాలను చూసినపుడు చైనా లేదా అమెరికా,రష్యా దేశం ఏదైతేనేం వాటి నుంచి వచ్చే పెట్టుబడులు లేదా సంబంధాలను నిర్ణయించేది, నడిపేది మన పాలకులా కార్పొరేట్లా అన్న సందేహం కలుగుతున్నది. గతంలో సరిహద్దు వివాదం ఉన్నప్పటికీ చైనాతో సంబంధాలు సజావుగా ఉన్నాయి. గాల్వన్‌ ఉదంతాల సందర్భంగా చైనా మన భూభాగాన్ని ఆక్రమించలేదని స్వయంగా ప్రధాని నరేంద్ర మోడీ చెప్పిన సంగతి తెలిసిందే. సంఘపరివార్‌ చైనా, కమ్యూనిస్టు వ్యతిరేకత గురించి తెలిసినప్పటికీ గత పదేండ్లలో వాణిజ్య,పారిశ్రామికవేత్తలు ఇబ్బడి ముబ్బడిగా చైనా నుంచి దిగుమతులు చేసుకుంటుండగా లేనిది దాని పెట్టుబడుల అంశంలో ఎందుకు మడిగట్టుకోవాలనే ధోరణి ఇటీవలి కాలంలో పెరిగింది.

గాల్వన్‌ లోయలో జరిగిన ఉదంతాల తరువాత దేశంలో పెద్ద ఎత్తున చైనా వ్యతిరేకతను రెచ్చగొట్టారు. ఆ దేశ యాప్‌లను నిషేధించారు.పెట్టుబడులు రాకుండా ఆంక్షలు పెట్టారు.కాషాయ దళాలు, మీడియాలో కొంత భాగం చైనా వస్తు దిగుమతులను నిలిపివేస్తే అది మన కాళ్ల దగ్గరకు వస్తుందనే ప్రచారం చేశారు.తీరా చూస్తే మన ఉక్కు మంత్రిత్వశాఖ తాజా నివేదిక ప్రకారం మన దేశం దిగుమతి చేసుకుంటున్న ప్రతి నాలుగు ఉక్కు వస్తువులలో మూడు చైనా నుంచే ఉన్నట్లు ఆగస్టు 29వ తేదీ హిందూ బిజినెస్‌లైన్‌ పత్రిక వార్త పేర్కొన్నది.గతేడాది ఏప్రిల్‌జూలై నెలలతో పోల్చితే మన దిగుతులు అక్కడి నుంచి 30శాతం పెరిగాయి.ఏడాది క్రితం మన ఎగుమతులు ఎక్కువగా ఉండేవి కాస్తా ఇపుడు పరిస్థితి తారుమారైంది.ఇతర దేశాలకూ మన ఎగుమతులు పడిపోయాయి.విచారకరమైన అంశం ఏమంటే చివరికి గొడుగులు, బొమ్మలను కూడా చైనా నుంచి దిగుమతి పెరగటం వలన మన ఎంఎస్‌ఎంఇ సంస్థలు దెబ్బతింటున్నాయని గ్లోబల్‌ ట్రేడ్‌ రిసర్చ్‌ ఇనీషియేటివ్‌(జిటిఆర్‌ఐ) స్థాపకుడు అజయ్‌ శ్రీవాత్సవ చెప్పారు(2024సెప్టెంబరు ఒకటవ తేదీ పిటిఐ వార్త).ఈ ఏడాది జనవరి నుంచి జూన్‌ వరకు మనం చైనాకు 850కోట్ల డాలర్ల విలువగల వస్తువులను ఎగుమతి చేయగా అక్కడి నుంచి 5,040 కోట్ల డాలర్ల మేర దిగుమతి చేసుకున్నామని జిటిఆర్‌ఐ నివేదిక వెల్లడిరచింది.చైనాతో పోటీ పడి గొడుగులను కూడా ఉత్పత్తి చేయలేని దుస్థితికి గత పదేండ్లలో మన దేశాన్ని నరేంద్రమోడీ నెట్టారా ? చిన్నప్పటి పాఠాల్లో భార్య ఎండకు తాళలేక ఆపసోపాలు పడుతుంటే ఒక రుషి ఆగ్రహ శాపానికి భయపడి సూర్యుడు దిగివచ్చి చెప్పులు, గొడుగు ఇచ్చినట్లు చదువుకున్నాం. ఇప్పుడు చైనా వారు ఇస్తున్నారు. ఆ రుషులేమయ్యారు, ఆ సూర్యుడు ఎందుకు కరుణించటం లేదు ! చైనాతో పోటీ పడి నాణ్యంగా, చౌకగా గొడుగులు తయారు చేసేందుకు మన వేదాల్లో నిగూఢమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని వెలికితీసే నిపుణులు, దేశం కోసంధర్మం కోసం పని చేసే వారే లేరా ?

ఇటీవలన మన దేశ వార్షిక ఆర్థిక సర్వే విడుదల చేశారు. దాని వివరాల ప్రకారం చైనా నుంచి ఎఫ్‌డిఐని ఆహ్వానించాలని ప్రధాన ఆర్థిక సలహాదారు వి.అనంత నాగేశ్వరన్‌ చెప్పారు.రెండు దేశాల మధ్య వాణిజ్య లావాదేవీలను పెంచుకోవటం కంటే చైనా నుంచి పెట్టుబడులను ఆహ్వానించటం మెరుగని ఆర్థిక మంత్రికి నివేదించారు. గాల్వన్‌ ఉదంతాల తరువాత వైఖరిలో వచ్చిన మార్పుకు సూచిక ఇది.అమెరికా, ఐరోపాలు చైనా నుంచి సేకరణకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నందున మనం చైనా నుంచి దిగుమతులు చేసుకోవటం, వాటికి కొంత విలువను జోడిరచి తిరిగి ఎగుమతి చేయటం కంటే చైనా కంపెనీల పెట్టుబడులతో మనదేశంలో వస్తువులను ఉత్పత్తి చేసి విదేశీ మార్కెట్లకు ఎగుమతి చేయటం మరింత ప్రభావం చూపుతుందని ఆ నివేదికలో పేర్కొన్నారు. దీనికి నిర్మలా సీతారామన్‌ కూడా విలేకర్ల సమావేశంలో మద్దతు తెలిపారు. అయితే ప్రస్తుతానికి అలాంటి పునరాలోచన లేదని వాణిజ్య మంత్రి పియూష్‌ గోయల్‌ చెప్పినట్లు రాయిటర్స్‌ పేర్కొన్నది.‘‘ బిజెపి ప్రతిష్టను దెబ్బతీసే పర్యవసానాలకు దారితీసే దీన్ని ఎవరూ కోరుకోవటం లేదు. ఈ విధానాన్ని భారతీయులు మెచ్చరు, కానీ అది అవసరమని మోడీ ఆయన ఆర్థిక మంత్రిత్వశాఖ గుర్తించింది ’’ అని నాటిక్సిస్‌లోని ఆసియా పసిఫిక్‌ ఎకానమిస్ట్‌ అల్సియా గార్సియా హెరారో చెప్పినట్లు సిఎన్‌బిసి వార్త పేర్కొన్నది. రానున్న ఐదు సంవత్సరాల్లో ఏటా వంద బిలియన్‌ డాలర్ల మేర ఎఫ్‌డిఐలను ఆకర్షించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.గత ఆర్థిక సంవత్సరంలో 71బిలియన్‌ డాలర్లు వచ్చాయి. సోలార్‌ పలకలు,విద్యుత్‌ బాటరీల తయారీ రంగాలలో చైనా పెట్టుబడులను అనుమతించేందుకు నిబంధనలను సులభతరం చేయనున్నారు.‘‘ భారత ఉత్పత్తి రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు అమెరికా,ఐరోపా వారు విముఖంగా ఉన్నారు. అత్యధిక విదేశీ పెట్టుబడులు ఐసిటి(ఇన్ఫర్మేషన్‌, కమ్యూనికేషన్‌ టెక్నాలజీస్‌) డిజిటల్‌ సర్వీసెస్‌ వంటి రంగంలోకి వెళ్లాయి’’ అని హెరారో చెప్పాడు. ఆసియా ఉత్పత్తి కేంద్రంగా మారాలని భారత్‌ కోరుకుంటే చైనా సరఫరా గొలుసులతో సంబంధాలు పెట్టుకోవాలని ఢల్లీి కేంద్రంగా పని చేస్తున్న అబ్జర్వర్‌ రిసర్చ్‌ ఫౌండేషన్‌లోని విదేశీ విధాన అధ్యయన విభాగ ఉపాధ్యక్షుడు హర్ష వి పంత్‌ చెప్పారు.

ముందే చెప్పుకున్నట్లుగా చైనా వ్యతిరేకతను పెద్ద ఎత్తున రెచ్చగొట్టిన కారణంగా వ్యతిరేకులను సంతుష్టీకరించేందుకు , రాజకీయంగా పరువు నిలుపుకొనేందుకు గత కొద్ది నెలలుగా చైనా పెట్టుబడులను అందరితో అంగీకరింపచేయించేందుకు ఢల్లీి పెద్దలు కసరత్తుచేస్తున్నారు.‘‘ ఆర్థిక కోణంలో చూస్తే కొన్ని రంగాలలో చైనా పెట్టుబడులు మనకు అవసరమే అని చక్కటి తర్కంతో చెప్పవచ్చు. కానీ ఆక్రమంలో దేశ భద్రత,అంతర్జాతీయ రాజకీయ కోణాలను కూడా పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది, ప్రస్తుతం చైనాతో సంబంధాలు అంత మంచిగా,సాధారణంగా లేవు ’’ అని విదేశాంగ మంత్రి జై శంకర్‌ ఇటీవల చెప్పారు. 2070నాటికి పూర్తి కాలుష్య రహిత లక్ష్యాన్ని చేరుకోవాలని మనదేశం లక్ష్యంగా పెట్టుకుంది.దానిలో భాగంగా 2030 నాటికి 50శాతం విద్యుత్‌ను పునరుత్పత్తి ఇంథన వనరుల నుంచి తయారు చేయాల్సి ఉంది.చైనా ఆ రంగంలో ఎంతో ముందుంది,తక్కువ ఖర్చుతో, సమర్ధవంతంగా ఉత్పత్తి చేస్తున్నది. ప్రస్తుతం అది 584 టెరావాట్‌ అవర్స్‌ సామర్ధ్యం కలిగి ఉండగా మనది కేవలం 113టెరావాట్‌ అవర్స్‌ మాత్రమే.చైనా కమ్యూనిస్టుదేశం, మనది ప్రజాస్వామ్యం అక్కడి నుంచి పెట్టుబడులు ఎలా తీసుకుంటాం అని మడిగట్టుకు కూర్చొనేందుకు మనదేశంలోని కార్పొరేట్‌ కంపెనీలు సిద్దంగా లేవు.అక్కడి నుంచి దిగుమతులు చేసుకొనే బదులు పెట్టుబడులు తీసుకొని మనదేశంలోనే సంస్థలను ఏర్పాటు చేస్తే ఇక్కడ ఉపాధిని కూడా కల్పించవచ్చు. ప్రస్తుతం మన దేశం తప్ప ప్రపంచంలో మరేదేశమూ చైనా పెట్టుబడులపై పూర్తి నిషేధం విధించలేదు.దాన్నుంచి పూర్తిగా విడగొట్టుకునేందుకు ఏ దేశమూ సిద్దంగా లేదు.తోటి సోషలిస్టు దేశమైనా చైనావియత్నాం మధ్య కొన్ని సరిహద్దు విబేధాలున్నాయి, అయినా చైనా నుంచి పెట్టుబడులను తీసుకుంటున్నది.


టాటా కంపెనీ అనేక దేశాల అనుభవాలను చూసిన తరువాతనే చైనా నుంచి బ్యాటరీలను కొనాలని నిర్ణయించింది.సరఫరా, సాంకేతిక పరిజ్ఞానాన్ని పరిగణనలోకి తీసుకుంది.మన దేశ విద్యుత్‌ వాహన మార్కెట్‌లో దాని వాటా 60శాతం. ఇంతకు ముందుదాని ఉత్తత్తుల్లో బాటరీల నుంచి ఎదురైన సమస్యలతో పాటు మార్కెట్లో పోటీని కూడా అది గమనంలోకి తీసుకుంది.చైనాతో ఉన్న సరిహద్దు, రాజకీయ విధానాలను అది పక్కన పెట్టింది. ఇప్పటికే చైనా బివైడి కంపెనీ మన దేశంలోని సంస్థలతో భాగస్వామిగా లేదా విడి భాగాలను ఎగుమతి చేసేదిగా ఉంది. విద్యుత్‌ వాహనాలలో బ్యాటరీ ధర, సామర్ధ్యమే కీలకం.చైనాతో అమెరికా ప్రభుత్వానికి ఉన్న రాజకీయ విబేధాల కారణంగా అమెరికా దిగ్జజ కంపెనీ ఫోర్డ్‌ చైనా కంపెనీతో కలసి అమెరికాలో ఒక ఫ్యాక్టరీని ఏర్పాటు చేసేందుకు ఒప్పందం చేసుకొని కూడా అనేక ఆటంకాలను ఎదుర్కొని విరమించుకుంది. అది చేసిన తప్పిదాన్ని టాటా చేయదలచలేదని పరిశీలకులు పేర్కొన్నారు.తొలుత కొన్ని రంగాలలో ఆటంకాలను తొలగిస్తే క్రమంగా ఇతర రంగాలకు విస్తరిస్తారు. మన దేశంలో ఇప్పటి వరకు కేంద్రంలో ఎవరు అధికారంలో ఏ పార్టీ లేదా కూటమిఉన్నప్పటికీ కార్పొరేట్లకు అనుకూలమైన విధానాలనే అనుసరించింది. ఇప్పుడు కూడా అదే జరుగుతున్నది.వాటి అడుగులకు మడుగులొత్తితేనే ఎవరైనా అధికారంలో ఉంటారు !

తిట్టే నోరు తిరిగే కాళ్లు ఊరికే ఉండవు :‘‘ఎమర్జన్సీ’’ ఇరకాటంలో బిజెపి, రైతులు, కులగణన మీద కంగన నోటి దురుసు !

Tags

, , , , , ,


ఎం కోటేశ్వరరావు


కాలం కలసిరాకపోతే తాడే పామై కరుస్తుందంటారు ! లోక్‌సభ ఎన్నికలు, అనంతర పరిణామాలను చూస్తున్నపుడు బిజెపి, దాన్ని నమ్ముకున్న వారు ఇప్పుడు అదే స్థితిలో ఉన్నారా ? అంటే, అవును అని చెప్పాల్సి వస్తోంది. నోటి దురుసు సెలబ్రిటీగా పేరు మోసిన నటి కంగనా రనౌత్‌ ఇందిరా గాంధీ పాత్రలో నటించి, దర్శకురాలిగా ఉన్న ‘‘ ఎమర్జన్సీ’’ సినిమా బిజెపికి తలనొప్పిగా మారింది. చరిత్రను వక్రీకరించటమే గాక తమను దేశద్రోహులు, ఉగ్రవాదులుగా చిత్రీకరించారని, అది తమపై విద్వేషాన్ని రెచ్చగొట్టే అవకాశం ఉన్నందున ఆ చిత్రంపై నిషేధం విధించాలంటూ దేశవ్యాపితంగా సిక్కులు డిమాండ్‌ చేస్తున్నారు. ఖలిస్తాన్‌ మద్దతుదార్లు కంగనను చంపివేస్తామంటూ బెదిరింపులకు దిగారని వార్తలు.దీంతో 2024సెప్టెంబరు ఆరున విడుదల తేదీని ప్రకటించిన కంగన ఇప్పుడు దానికి సెన్సార్‌ బోర్డు ఆమోదం తెలిపినా కొందరి వత్తిడి కారణంగా ధృవీకరణ పత్రం నిలిపివేశారని చెబుతున్నారు. మాజీ ప్రధాని ఇందిరా గాంధీ జీవితం, ఆమె ప్రధానిగా ఉన్నపుడు 21నెలల అత్యవసరపరిస్థితి విధింపు తదితర అంశాల ఆధారంగా ఈ సినిమా తీసినట్లు గతంలో ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆగస్టు 14వ తేదీన 2.43నిమిషాల నిడివిగల ట్రైలర్‌ను విడుదల చేయగా 50లక్షల మంది చూశారని, కేవలం 461 మంది మాత్రమే ఇష్టపడినట్లు నమోదైనట్లు ఇండియా టుడే పేర్కొన్నది.ప్రతి ఒక్క ఓటునూ లెక్కించుకుంటున్న బిజెపికి ఇప్పటికే దేశంలో ఉన్న మూడు కోట్ల మంది సిక్కులు వ్యతిరేకంగా ఉన్నారు.ఈ సినిమాతో వారు మరింత దూరమౌతారని, పక్కా వ్యతిరేకులుగా మారతారని ఆ పార్టీ భయపడుతోంది.అక్టోబరులో జరిగే హర్యానా, కాశ్మీరు ఎన్నికలపై ప్రతికూల ప్రభావం పడుతుందని భావిస్తున్నారు.గతంలో బిజెపి మిత్రపక్షంగా ఉన్న అకాలీదళ్‌ కూడా అదే డిమాండ్‌ చేసింది.ఆ సినిమా ప్రదర్శనను అనుమతించకూడదని తెలంగాణా సిక్కు సామాజిక తరగతి ప్రతినిధులు ముఖ్యమంత్రి ఏ రేవంతరెడ్డిని కలసి విజ్ఞప్తి చేశారు.


బిజెపి ఎంపీ కంగన రనౌత్‌ వివాదాస్పద వ్యాఖ్యలకు పేరుమోసిన సంగతి తెలిసిందే.రైతుల గురించి నోరుపారవేసుకున్న ఉదంతం సమసి పోక మందే కులగణన గురించి చేసిన వ్యాఖ్యలతో తమకు సంబంధం లేదని బిజెపి చెప్పుకుంది. ఆ పార్టీలో ఇలాంటి వారికి కొదవలేదు. అవి పార్టీ కొంపముంచుతున్నాయి.తమకు నాలుగు వందల సీట్లు వస్తే రాజ్యాంగాన్ని మారుస్తామని కర్ణాటక బిజెపి ఎంపి అనంతకుమార్‌ హెగ్డే, ఫైజాబాద్‌(అయోధ్య) ఎంపీ లాలూ సింగ్‌, మరి కొందరు కూడా ఇటీవలి లోక్‌సభ ఎన్నికలకు ముందు చెప్పారు. అంతకు ముందు ఆర్‌ఎస్‌ఎస్‌ నేతలు మోహన్‌ భగవత్‌, మన్మోహన్‌ వైద్య కూడా రిజర్వేషన్లకు వ్యతిరేకంగా మాట్లాడిన పూర్వరంగం, తాము 50సంవత్సరాల పాటు ఏకధాటిగా అధికారంలో ఉంటామని అమిత్‌ షా చెప్పటం, ఇవన్నీ చూసిన తరువాత రాజ్యాంగాన్ని మార్చివేస్తారన్న అనుమానాలు బలపడ్డాయి. అందుకే బిజెపికి సంపూర్ణమెజారిటీ రాకుండా జనం తీర్పు చెప్పారు. అనంతకుమార్‌కు సీటు ఇవ్వలేదు, లాలూ సింగ్‌ ఓడిపోయారు. తీరా అధికారానికి వచ్చిన రెండు నెలల్లోనే ఎలాంటి రిజర్వేషన్లు లేకుండా కేంద్రంలో ఐఎఎస్‌ కాడర్‌కు సమానమైన 45 పోస్టులను ప్రయివేటు వారితో భర్తీ చేసేందుకు పూనుకోవటంతో రిజర్వేషన్లకు ఎసరు పెడతారనే ప్రతిపక్షాల మాట నిజమే అని జనం నమ్మటం, అది రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీని దెబ్బతీస్తుందనే భయంతో వెంటనే నోటిఫికేషన్‌ వెనక్కు తీసుకోవటం తెలిసిందే.వీటన్నింటినీ చూసిన తరువాత బిజెపి నేతలు తమ మనసులోని మాటలను దాచుకోలేకపోతున్నారని కంగన వంటి వారు రుజువు చేస్తున్నారు.


ఆగస్టు చివరి వారంలో దైనిక్‌ భాస్కర్‌ అనే పత్రికతో మాట్లాడిన కంగన 2020`21లో జరిగిన రైతు ఉద్యమం గురించి నోరుపారవేసుకున్నారు. ఆ సందర్భంగా మృతదేహాలు వేలాడాయని,మానభంగాలు జరిగాయని ఆరోపించారు.రైతు ఉద్యమం జరిగిన హర్యానాలో లోక్‌సభ ఎన్నికల్లో పదికి గాను ఐదు సీట్లు పోగొట్టుకున్న బిజెపి అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం దూరం కానుందనే భయంతో ఉంది. సరిగ్గా ఈ తరుణంలో ఆమె చేసిన వ్యాఖ్యలు హర్యానా రైతాంగాన్ని మరింతగా రెచ్చగొట్టేవే. పార్టీకి నష్టం కలిగిస్తాయని హర్యానా పార్టీ నేతలు గగ్గోలు పెట్టారు. దాంతో కేంద్ర బిజెపి వెంటనే కంగన మాటలతో పార్టీకి సంబంధం లేదని చెప్పుకుంది తప్ప కనీసంగా ఆమెను మందలించలేదు. బంగ్లాదేశ్‌లో మాదిరి పరిస్థితిని భారత్‌లో సృష్టించే పథకం ఉందని, రైతుల నిరసనల వెనుక చైనా, అమెరికా హస్తం ఉందని కూడా అంతకు ముందు ఆరోపించారు. పార్టీ విధానాల గురించి ప్రకటనలు చేసేందుకు కంగన రనౌత్‌కు అధికారం లేదా అనుమతి ఇవ్వలేదని, భవిష్యత్‌లో అలాంటి ప్రకటనలు చేయకూడదని కోరినట్లు బిజెపి ప్రకటించింది. తాను నటించిన ఎమర్జన్సీ సినిమా గురించి ప్రచారం చేసుకొనేందుకు దైనిక భాస్కర్‌ పత్రికతో మాట్లాడినపుడు ఈ వ్యాఖ్యలు చేశారు. అందరూ వాటిని ఎక్కడ చదవరో అని లేదా మరింత ప్రచారం కోసం సదరు పత్రిక వార్తను తన ఎక్స్‌ ఖాతాలో ఆగస్టు 25న పోస్టు కూడా చేశారు. ‘‘ బంగ్లాదేశ్‌లో జరిగిందే భారత్‌లో కూడా జరిగే అవకాశం ఉంది.మన అగ్రనాయకత్వం బలంగా లేనపుడు ఇక్కడ(ఢల్లీి శివార్లలో) నిరసనలు తెలిపారు.శవాలు వేలాడాయి, మానభంగాలు జరిగాయి. రైతులకు అనుకూలమైన చట్టాలను వెనక్కు తీసుకున్నపుడు దేశం మొత్తం దిగ్భ్రాంతికి గురైంది.కానీ ఆ రైతులు ఆ తరువాత కూడా ధర్నాలో కూర్చున్నారు….ప్రభుత్వం చట్టాలను వెనక్కు తీసుకుంటుందని వారెన్నడూ ఊహించలేదు.బంగ్లాదేశ్‌లో జరిగిన మాదిరి పెద్ద పథకంతో వారు వచ్చారు. ఈ పధకాలు రైతులవని మీరు అనుకుంటున్నారా ? కాదు, చైనా, అమెరికా వంటి మనదేశంలో పని చేస్తున్న విదేశీ శక్తులది ’’ అన్నారు.లోక్‌సభ ఎన్నికలపుడు హర్యానా మాజీ ముఖ్యమంత్రి మనోహర్‌లాల్‌ ఖట్టర్‌ను బిజెపి తరఫున గ్రామాల్లో ప్రచారానికి అక్కడి రైతులు రానివ్వని ఉదంతాలను చూసిన బిజెపి నేతలు కంగన మాటలతో తమపని అయిపోయినట్లే అని భావించారు. నష్ట నివారణ చర్య తీసుకున్నప్పటికీ కంగన మాటలు రానున్న ఎన్నికల్లో ప్రతిపక్షాలకు ఒక అస్త్రంగా మారటం అనివార్యం.ఆమె వ్యాఖ్యలను ఖండిస్తూ హిమచల్‌ ప్రదేశ్‌ అసెంబ్లీ ఒక తీర్మానం కూడా చేసింది.రెండవ సారి శంభు సరిహద్దులో ఆందోళన ప్రారంభించి రెండవందల రోజుల సందర్భం జరిగే నిరసనకు రెజ్లర్‌ వినేష్‌ ఫోగట్‌ రానున్నట్లు వార్తలు.


తిట్టే నోరు తిరిగే కాళ్లు ఊరికే ఉండవు అంటారు కదా ! రైతులపై నోరుపారవేసుకున్న కంగన మాటలు ఇంకా చెవుల్లో గింగురు మంటుండగా తగ్గేదేలే అంటూ కుల గణన జరగదు అని మరొక ప్రకటన వదిలారు. వెంటనే అది మా వైఖరి కాదు అంటూ దానికి కూడా బిజెపి జనానికి సంజాయిషీ చెప్పుకోవాల్సి వచ్చింది.న్యూస్‌ 24 అనే టీవీతో మాట్లాడుతూ కుల గణన తప్పకుండా చేయాలా అన్న ప్రశ్నకు అవసరమే లేదు అంటూ కంగన చెప్పేశారు. కుల గణన మీద యోగి ఆదిత్యనాథ్‌ వైఖరే తనదని, అందరం కలసి ఉంటేనే మంచిదని, విడిపోతే నాశనం అవుతామన్నారు.‘‘ కులగణన జరపకూడదు.నటుల కులమేమిటో మనకు తెలియదు.ఎవరికీ ఏమీ తెలియదు.నా చుట్టూ ఉన్నవారు కులం గురించి పట్టించుకోరు. దాన్ని ఎందుకు ఇప్పుడు తేల్చాలి.గతంలో మనం చేయలేదు, ఇప్పుడూ అవసరం లేదు.కేవలం పేదలు, రైతులు, మహిళలు అనే మూడు కులాలు మాత్రమే ఉన్నాయి, నాలుగో కులం ఉండకూడదు’’ అన్నారు.లోక్‌సభ ఎన్నికలకు ముందు కావాలంటే రాష్ట్రాలు కుల గణన చేసుకోవచ్చు తప్ప కేంద్ర ప్రభుత్వం చేపట్టదని, ప్రతిపక్షాలు రాజకీయం చేస్తున్నాయని బిజెపి నేతలు పదే పదే చెప్పిన సంగతి తెలిసిందే. సరిగ్గా ఎన్నికలకు ముందు మరోసారి ఎన్‌డిఏ కూటమిలో చేరిన జెడియు నితీష్‌ కుమార్‌ బీహార్‌లో కులగణన చేశారు.అనేక రాష్ట్రాలలో అలాంటి డిమాండ్‌ ముందుకు వచ్చింది.కేంద్రమే జనాభా లెక్కలతో పాటు జరపాలని ప్రతిపక్ష పార్టీలు కోరాయి. ఎన్నికలో బిజెపికి సంపూర్ణ మెజారిటీ రాలేదు, మిత్రపక్షాల మీద ఆధారపడాల్సి వచ్చింది.దాంతో వాటి వత్తిడికి లొంగిపోయింది.కంగన ప్రకటన మరోసారి బిజెపిని ఇరుకున పెట్టింది.‘‘ అవసరం తలెత్తితే తాము కులగణన చేస్తామని హోంమంత్రి చెప్పారని,కనుక కంగన చెప్పిన మాటలు పార్టీ వైఖరిని ప్రతిబింబించవు’’ అని బిజెపి జాతీయ ప్రతినిధి గురు ప్రకాష్‌ పాశ్వాన్‌ ప్రకటించాల్సి వచ్చింది.అయితే ఇంతవరకు కులగణన చేస్తామని కేంద్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రకటన వెలువడలేదు.


తోటకూర నాడే మందలించి ఉంటే అనే సామెత తెలిసిందే.గతంలో కంగన రనౌత్‌ చేసిన అనేక వివాదాస్పద ప్రకటనలు, ప్రత్యర్థులపై ఎదురుదాడికి దిగినపుడు బిజెపి నోరు మెదపలేదు.దాడి జరపటాన్ని ఆస్వాదించింది.పరిస్థితి మారిన తరువాత ఇప్పుడు ప్రతి మాటా పార్టీకి ఎదురు తిరుగుతోంది.ఆమె ఎక్కడా తగ్గటం లేదు. తన సినిమా గురించి ప్రచారం చేసుకుంటూ చౌకబారు,తెలివి తక్కువ ప్రకటనలు, వివాదాస్పద వ్యాఖ్యలతో ఉచిత ప్రచారం పొందాలని చూస్తున్నట్లు కనిపిస్తున్నది. నరేంద్రమోడీ అధికారానికి వచ్చిన 2014లోనే దేశానికి నిజమైన స్వాతంత్య్రం వచ్చిందని 2021లో చెప్పారు.స్వీయ అనుభవంతో తానీ మాటలు చెబుతున్నట్లు, తన అతి మంచితనం కారణంగా వ్యవస్థ తనను దేశం విడిచి అమెరికా వెళ్లేట్లు చేసిందని, మోడీ అధికారానికి వచ్చాక తాను తిరిగి వచ్చానని అందుకే అసలైన స్వాతంత్య్రం వచ్చినట్లు భావిస్తున్నట్లు చెప్పుకున్నారు. అదే విధంగా కత్రినా కైఫ్‌ వంటి విదేశీ హీరోయిన్లు ఎంతో రాణించారని కానీ 2014తరువాత స్వదేశీ నటీనటులు, కథలకు ప్రాధాన్యత ఇస్తున్నారని, విదేశీయుల నృత్యాలు ఆపాలని జనం చెప్పారని, ఇటాలియన్‌ ప్రభుత్వాన్ని తొలగించి ఒక చాయ్‌వాలాను ప్రధానిని చేశారని కూడా సెలవిచ్చారు. సుభాస్‌ చంద్రబోస్‌ను భారత ప్రధమ ప్రధాని అని చెప్పటమే కాదు, ఆయన అజాద్‌ హింద్‌ ప్రభుత్వాన్ని ఏర్పరచిన కారణంగా బోసే ప్రధమ ప్రధాని అని సమర్ధించుకున్నారు.తనను విమర్శించిన వారికి రెండు రకాల మెదడు కణాలు ఉంటాయని వారికి ఇది అర్ధం కాదని కూడా ఎదురుదాడి చేశారు.రామనాధ్‌ కోవింద్‌ను కోవిడ్‌గా పలకటమేగాక, ప్రధమ దళిత రాష్ట్రపతిగా వర్ణించి తరువాత నాలుక కరుచుకున్నారు. అలాంటి కంగన సినిమా ఎమర్జన్సీ గురించి సెన్సార్‌బోర్డు ఏం చేస్తుందో, బిజెపి ఏం చెబుతుందో వాటి మీద స్పందనలు ఎలా ఉంటాయో చూద్దాం !

నరేంద్రమోడీ ఉక్రెయిన్‌ పర్యటన, కాషాయ దళ అతిశయోక్తులు,గాలి తీసిన జెలెనెస్కీ !

Tags

, , , , , , , , ,


ఎం కోటేశ్వరరావు


‘‘ నిజం…మోడీ ది ఉక్కు దౌత్యం…ఉక్రెయిన్‌ వ్యూహాత్మక పరిశ్రమల మంత్రి క్యమిషిన్‌…మోడీ ముప్ఫై గంటల అసాధారణ దౌత్య ప్రక్రియ…పోలాండ్‌ సరిహద్దు పట్టణం జెమిసిల్‌ నుంచి ఉక్రెయిన్‌ కివీవ్‌ కు 700 కిలోమీటర్లు ప్రయాణం…మొత్తం యుద్ధ ప్రమాద ప్రాంతమే….పది గంటలు రానూ… పది గంటలు పోనూ… అక్కడో పది గంటలు…యూరోప్‌..అమెరికా…మరో ప్రక్క రష్యా అసాధారణ ఉత్కంఠ మధ్య..చూపులన్నీ ఈ ఉక్కు మనిషి పైనే…రైల్‌ ఫోర్స్‌ వన్‌…మహా గట్టి రైలు…కదులుతున్న దుర్భేద్యమైన రైలు…దాన్ని అనుసరిస్తూ… రాడార్లు…సైనిక విమానాలు…అంటే ఒక రకంగా మూడు రోజుల పా టు…యుద్ధం ఆగిపోయినట్టే…అక్కడ మాదే విజయం..ఇక్కడ మాదే పై చేయి అంటూ ప్రస్తుతం రష్యా ఉక్రైన్లు ఉత్తుత్తి ప్రకటనలు…పోలాండ్‌..ఒకప్పటి వార్సా సంధికి ప్రసిద్ధి…ఏదో చెప్పాల్సినవి అన్నీ మోడీకి చెప్పేసుకున్నామన్న సంతృప్తి నాటోకి…ప్రపంచానికి తమ బాధ ఆగ్రహం మోడీయే అర్థం చేయించగలుగుతారన్న ఆశ ఉక్రెయిన్దీ….ఒక్కసారిగా పెరిగిపోయిన భారత్‌ ప్రసిద్ధి చూసి…అసూయా ద్వేషాలతో రగిలిపోతున్న ఆయుధ వ్యాపార లాబీలు…భారత్‌ ఆంతరంగిక వైఫల్యాలను ఎత్తి చూపడానికి మనకి ఇక్కడొక రాహువును వదిలిపెట్టారు…ఆటలో ఆటం బాంబు…సరే ఏదేమైనా రష్యా ఆయిల్‌ ఇస్తూనే ఉంటుంది…మన ద్వారా యూరోప్‌ కొంటూనే ఉంటుంది…మన డబ్బులు…మన ఆయిల్‌ రిజర్వులు పెరుగుతూనే ఉంటాయి…ఇది ఒక రకంగా యుద్ధ ఆర్థిక దౌత్యం…శ్రావణ్‌ శుక్రవారం మహాలక్ష్మి అనుగ్రహం…ఇలాంటి విన్యాసాలు కేవలం శక్తిమంతమైన దేశాలు మాత్రమే…తెలివైన దేశాలు మాత్రమే చెయ్యగలుగుతాయి…ఇప్పుడు భారత్‌ అంటే….భారత్‌ అంతే…మీ ఏడుపులే మన ఎదుగుదల…ఈ సమయంలో ఎవరెవరు ఏడుస్తారో చూస్తే చాలు…మనకు అర్థం అయిపోతుంది…రైలు ప్రయాణ సమయంలోనే …శత్రువును గమనించు…! అక్కడా…ఇక్కడా కూడా! జైహింద్‌ ’’
ఆగస్టు నెలాఖరులో నరేంద్రమోడీ ఉక్రెయిన్‌ పర్యటన గురించి ఆకాశానికి ఎత్తుతూ వాట్సాప్‌ విశ్వవిద్యాలయంలో పేరు లేకుండా ఎప్పటి మాదిరే కాషాయ మరుగుజ్జులు పెట్టిన పోస్టు పూర్తి పాఠమది. అలాగే జరిగిందా ? ఎవరేమంటున్నారు, నిజం ఏమిటి ? ఉక్రెయిన్‌ వివాదంలో భారత్‌ తటస్థంగా ఉంది. జూలై నెలలో మోడీ మాస్కో వెళ్లి వ్లదిమిర్‌ పుతిన్ను ఆలింగనం చేసుకున్నారు. దాన్ని తప్పుపట్టిన ఉక్రెయిన్‌ అధినేత జెలెనెస్కీ ఆగస్టు 23న మోడీ తమదేశాన్ని సందర్శించినపుడు అదే చేశారు. అతి పెద్ద ప్రజాస్వామ్యం ప్రపంచంలో పేరు మోసిన రక్త పిపాసి నేరగాడిని మాస్కోలో కౌగలించుకుంది అని నాడు జెలెనెస్కీ ఎక్స్‌ చేశాడు. అదే వ్యక్తిని తాను కూడా కౌగలించుకోవటం ఏమిటి ? అదే నోటితో మోడీ జరిపిన తమ దేశ పర్యటన చరిత్రను సృష్టించిందని కూడా చెప్పాడు. ఆలింగనాల దౌత్యంలో ఎవరూ తక్కువ తినలేదు. మాస్కో వెళ్లినపుడు పశ్చిమదేశాలన్నీ మోడీని దుమ్మెత్తిపోశాయి. అది ఊహించిందే, వాటి ఆగ్రహాున్ని చల్లార్చి సంతుష్టీకరించేందుకు ఉక్రెయిన్‌ వెళ్లారు. కానీ వ్రతం చెడ్డా ఫలం దక్కలేదు. అనుమానాలు, సందేహాలు వెల్లడిస్తూ వ్యాఖ్యానాలు వెలువడ్డాయి. ఉక్రెయినుకు సౌహార్ద్రత ప్రకటించటం కంటేతన ప్రయోజనాలకే పెద్ద పీటవేసిందని ఆరోపించిన వారు కూడా ఉన్నారు.
తొలిరోజుల్లో టర్కీ ఒక ప్రయత్నం చేసింది తప్ప భారత్‌ లేదా మోడీని వివాదంలో మధ్యవర్తిగా ఎన్నడూ రష్యా పరిగణించలేదు. మనదేశం ఎన్నడూ అలా ప్రకటించుకోలేదు. తమ అతిధిగా వచ్చిన మోడీని జెలెనెస్కీ అవమానించటమే కాదు, ఇరకాటంలో పెట్టాడు. మోడీ స్వదేశానికి తిరుగు ప్రయాణమైన తరువాత కనీస దౌత్య మర్యాదలను కూడా పాటించకుండా వ్యవహరించాడు. జూన్‌ నెలలో స్విడ్జర్లాండ్‌లో ఒక శాంతి సమావేశం జరిగింది. దానికి రష్యాను అసలు ఆహ్వానించలేదు, చైనా వెళ్లలేదు, భారత్‌తో సహా పదమూడు దేశాలు హాజరైనప్పటికీ ఆ సమావేశం విడుదల చేసిన ప్రకటన మీద సంతకం చేయలేదు. భారత్‌ మరో శాంతి సమావేశం జరిపితే ఆహ్వానిస్తాం గానీ అది జరగటానికి ముందు భారత్‌ స్విస్‌ ప్రకటన మీద సంతకం చేయాలని జెలెనెస్కీ షరతు పెట్టాడు. మనదేశ వైఖరి తెలిసి కూడా విలేకర్లతో అలా మాట్లాడటం చౌకబారు తనం తప్ప మరొకటి . కాదు, పైగా జెలెనెస్కీ ఆహ్వానం మీదనే మోడీ వెళ్లారు. స్వాగతం చాలా మోటుగా లేదా వికారంగా పలికినట్లు బిబిసి వర్ణించింది. ‘‘విశ్వగురువు’’ కు ఇది అవమానమా ? ఘనతా ?
‘‘ పేద దేశాలు రెండవ శాంతి సమావేశం జరిపితే మంచిదని నేను నిజంగా నమ్ముతున్నాను. సౌదీ అరేబియా,కతార్‌,టర్కీ వంటి దేశాలు ఉన్నాయి. భారత్‌లో మనం అలాంటి సమావేశం నిర్వహించవచ్చని నేను నరేంద్రమోడీతో చెప్పాను. అది పెద్ద దేశం, అతిపెద్ద ప్రజాస్వామికదేశం. స్విస్‌ శాంతి సభ ప్రకటనపై సంతకం చేసిన దేశంలోనే సభ జరగాలి.అయితే నేను నిర్మొహమాటంగా చెప్పదలచుకున్నాను. ఈ షరతు కేవలం భారత్‌కు మాత్రమే కాదు. రెండవ సభ జరపాలని సానుకూలంగా కోరుకుంటున్న ఏ దేశానికైనా ఇదే వర్తిస్తుంది. శాంతి (స్విడ్జర్లాండ్‌) సమావేశ ప్రకటనపై ఇప్పటికీ సంతకం చేయని ఏ దేశంలో కూడా జరపటానికి మాకు కుదరదు ’’ అని మోడీ భారత్‌కు తిరుగు ప్రయాణమైన తరువాత భారతీయ విలేకర్ల సమావేశంలో జెలెనెస్కీ చెప్పినట్లు కీవ్‌ ఇండిపెండెంట్‌ అనే పత్రిక రాసింది.రష్యా నుంచి ముడి చమురు కొనుగోలు చేస్తూ దాని యుద్ధ ఆర్థికానికి భారత్‌ సాయపడుతున్నదని జెలెనెస్కీ చెప్పాడు. మోడీ రష్యా పర్యటన జరిపిన రోజే తమ అతిపెద్దదైన పిల్లల ఆసుపత్రి మీద దాడి జరిపిన పుతిన్‌కు నరేంద్రమోడీ అంటే గౌరవం లేదని వెల్లడి కాలేదా అంటూ రెచ్చగొట్టేందుకు ప్రయత్నించాడు. మీరు గనుక చమురు దిగుమతులు నిలిపివేస్తే పుతిన్‌కు పెద్ద సవాలు ఎదురౌతుంది.మోడీ శాంతిని కోరుకుంటున్నారు తప్ప పుతిన్‌ కాదన్నాడు. జెలెనెస్కీ విలేకర్ల సమావేశంలో మొరటుగా మాట్లాడాడు. అంతర్గతంగా మాట్లాడాల్సిన వాటిని విలేకర్ల ముందు చెప్పాడు.
మోడీ రష్యా పర్యటనపై విమర్శలకు దిగిన ఉక్రెయిన్‌, అమెరికాల ఆగ్రహాన్ని తగ్గించే నష్ట నివారణ చర్యగా ఉక్రెయిన్‌ పర్యటన జరిగిందని, శాంతికి కట్టుబడి ఉన్న భారత్‌కు, దానితో రష్యా సంబంధాలకు ఒక సవాలుగా ఈ పర్యటన మారిందన్న ఒక విశ్లేషకుడి వ్యాఖ్యను చైనా పత్రిక గ్లోబల్‌ టైమ్స్‌ ఉటంకించింది. స్విస్‌ ప్రకటనపై మనదేశం సంతకం చేయకపోతే అమెరికాకు, చేస్తే రష్యాకు ఆగ్రహం కలుగుతుంది.ముందు నుయ్యి వెనుక గొయ్యి మాదిరి పరిస్థితి ఉంది. రష్యా కురుస్కు ప్రాంతంపై ఉక్రెయిన్‌ దాడి చేసినందున చర్చలకు అవకాశం లేదని పుతిన్‌ ప్రకటించిన తరువాత మోడీ జరిపి కీవ్‌ పర్యటన శాంతికి దోహదం చేస్తుందా ? అసలు ఎవరైనా వినిపించుకుంటారా ? తాము మధ్యవర్తి పాత్రను పోషించాలని కోరుకోవటం లేదని, ఉక్రెయిన్‌`రష్యా కోరితే వర్తమానాలను పరస్పరం తెలియ చేస్తామని భారత అధికారులు చెప్పినట్లు న్యూయార్క్‌ టైమ్స్‌ పత్రిక రాసింది. పశ్చిమ దేశాలలో రష్యా ఒంటరిపాటైతే ఆసియాలో భారత ప్రత్యర్ధిగా ఉన్న చైనాకు మరింత దగ్గర అవుతుందని, అలా కాకుండా ఉండాలంటే యుద్ధానికి ఒక పరిష్కారం అవసరమని భారత్‌ భావిస్తోందని కూడా ఆ పత్రిక పేర్కొన్నది. ఉక్రెయిన్‌ వివాదంలో తటస్థంగా ఉన్న చైనా శాంతి ప్రతిపాదన చేసింది. జెలెనెస్కీ నుంచి దాని మీద ఎలాంటి స్పందన లేదు.మన వైపు నుంచి ఎలాంటి ప్రతిపాదనా లేదు.
తన పర్యటన తరువాత నరేంద్రమోడీ అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌, మరుసటి రోజు వ్లదిమిర్‌ పుతిన్‌కు ఉక్రెయిన్‌తో జరిపిన చర్చల గురించి వివరించినట్లు ఒక ఎక్స్‌ ద్వారా తెలిపారు. వివాదానికి శాంతియుత ముగింపు పలకాలంటే చర్చలు, దౌత్య పద్దతుల్లో చిత్తశుద్దితో నిమగ్నం కావాలని మోడీ చెప్పినట్లు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. తమ కురుస్కు ప్రాంతం మీద ఉక్రెయిన్‌ దాడి చేసిన తరువాత పుతిన్‌ సేనలు ఉక్రెయిన్‌పై విరుచుకుపడుతున్నాయి. రెండు దేశాల మధ్య పరిస్థితి విషమించటం తప్ప మెరుగుపడే అవకాశాలు లేవు.పరిస్థితి ఇలా ఉండగా అతిశయోక్తులతో కూడిన ఊరూ పేరూ లేని ప్రకటనలు, ప్రచారాలను నమ్మేంత అమాయకంగా వాట్సాప్‌ జనాలు ఉన్నారని భావించటం తప్ప మరొకటి కాదు ! పోలాండ్‌, ఉక్రెయిన్‌ పర్యటన జరిగింది రెండు రోజులైతే మూడు రోజులు యుద్ధం ఆగిపోయిందని చెప్పటాన్ని బట్టి మా ఊరి మిరియాలు తాటికాయలంత ఉంటాయి దొరా అన్నట్లు ఉంది.

లెబనాన్‌పై ఇజ్రాయెల్‌ దాడి-పెరిగిన ఉద్రిక్తతలు !

Tags

, , , , ,


ఎం కోటేశ్వర రావు


మధ్య ప్రాచ్యుంలో ఏం జరుగుతోంది ? ఏ క్షణంలోనైనా ప్రాంతీయ యుద్ధం జరగనుందా ? ఇప్పటికే సూయజ్‌ కాలువ గుండా జరుగుతున్న రవాణాకు ఆటంకం కలుగుతూ పడుతున్న ఇబ్బందులు మరింతగా పెరుగుతాయా ? గత కొద్ది రోజులుగా జరుగుతున్న పరిణామాలను చూసినపుడు సామాన్యులకు తలెత్తుతున్న సందేహాలివి. హమస్‌ సాయుధులను అణచివేస్తామంటూ ప్రగల్భాలు పలికిన ఇజ్రాయెల్‌ అక్టోబరు ఏడు నుంచి ఇంతవరకు ఆ పనిచేయలేకపోయింది. కుట్రలు, దొంగదెబ్బలతో విదేశాల్లో హమస్‌ నేతలను హతమారుస్తున్నది. దానికి ప్రతీకారంగానే తాజాగా జరుగుతున్న పరిణామాలు. ఒక సరిహద్దులో ఉన్న లెబనాన్‌లో కేంద్రీకరించిన హిజబుల్లా సాయుధులు తమ మీద దాడి చేసే అవకాశాన్ని పసిగట్టి వంద విమానాలతో వారి 40 స్థావరాల మీద తామే ముందుగా ఆదివారం నాడు దాడి చేసినట్లు ఇజ్రాయెల్‌ చెప్పుకుంది.ఆదివారం నాడు 30 గ్రామాలు, పట్టణాల మీద ఇజ్రాయెల్‌ వంద విమానాలతో దాడి చేసింది.దానికి ప్రతిగా తాము ఇజ్రాయెల్‌లోని 11 మిలిటరీ స్థావరాల మీద 340 రాకెట్లను ప్రయోగించామని హిజబుల్‌ ప్రకటించింది. ఆ సంస్థ ప్రతినిధి నసరల్లా మాట్లాడుతూ ఈ ప్రాంతంలో తాము బలమైన మిలటరీ అని, తొలి దశను విజయవంతంగా పూర్తి చేశామన్నాడు. దీని అర్ధం రానున్న రోజుల్లో దాడులు జరగవని కాదని విశ్లేషకులు చెబుతున్నారు.మరోవైపు గాజాలో ఇజ్రాయెల్‌ దాడులను మరింత తీవ్రం కావించింది. అల్‌ అక్సా ఆసుపత్రిలో ఉన్న రోగులను నిర్దాక్షిణ్యంగా బయటకు నెట్టి, దాని మీద దాడి చేసింది. సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్న ఐరాస సిబ్బంది పని చేసే అవకాశాలు లేకుడా దాడులు జరుపుతున్నది. ఈ దుర్మార్గాన్ని వ్యతిరేకిస్తున్న ఎమెన్‌లోని హౌతీ సాయుధులు కూడా దాడులకు దిగటంతో ఇజ్రాయెల్‌ మరింతగా మారణకాండ సాగిస్తున్నది.హిజబుల్లా దాడిలో జరిగిన నష్టాన్ని ఇజ్రాయెల్‌ వెల్లడి కాకుండా చూస్తున్నది. ఇరాన్‌ నేరుగా పోరుకు దిగకుండా తన మద్దతుదార్లకు అవసరమైన ఆయుధాలను సరఫరా చేస్తున్నది. తాము పూర్తి స్థాయి దాడులకు దిగటం లేదని ఇజాయెల్‌ విదేశాంగ మంత్రి కట్జ్‌ ప్రకటించాడు. తమ పౌరులను రక్షించుకోవటానికే ప్రాధాన్యత ఇస్తున్నట్లు చెప్పుకున్నాడు. ఇదే సమయంలో హిజబుల్లా కూడా దాడులను కానసాగించటం లేదు. రెండు వైపులా లక్షా 60వేల మందిని అటూ ఇటూ వేరే ప్రాంతాలకు తరలించినట్లు ప్రధాని నెతన్యాహు ప్రకటించాడు.


ఒక వైపు గాజాలో దాడుల విరమణ గురించి కైరోలో చర్చలు జరుగుతుండగా తమ మీద దాడులు జరపాలని హిజబుల్లా తలపెట్టిందనే సాకుతో ఇజ్రాయెల్‌ దాడులు జరపటం చర్చలను దెబ్బతీయటం తప్ప మరొకటి కాదు. శాంతి చర్చల కారణంగా చాలా రోజులుగా తాము ప్రతీకార దాడికి దిగలేదని అయితే, ఇజ్రాయెల్‌ తెగబడినందున తాము స్పందించామని,ప్రతి దాడి ముగిసిందని హిజబుల్లా ప్రకటించగా ఇజ్రాయెల్‌ సోమవారం నాడు కూడా లెబనాన్‌ మీద దాడులు చేసింది. తమ గడ్డ మీద హమస్‌ నేత హత్యకు ప్రతికారం తీర్చుకుంటామని ఇరాన్‌ మరోసారి హెచ్చరించింది. ప్రస్తుతానికి పూర్తి స్థాయి యుద్దం లేకున్నప్పటికీ ఎప్పుడేం జరుగుతుందో తెలియని స్థితి ఉంది. హిజబుల్లా దాడిలో తాము పెద్దగా నష్టపోలేదని, తమ మిలిటరీ స్థావరాలకు ఎలాంటి హాని జరగలేదని ఇజ్రాయెల్‌ చెప్పుకుంది. గతేడాది అక్టోబరు 8 నుంచి ఇప్పటి వరకు లెబనాన్‌పై అది జరిపిన దాడుల్లో వంద మంది 566 మంది మరణించగా వారిలో సాధారణ పౌరులు 133 మంది, మిగిలిన వారు సాయుధులు మరణించినట్లు అంచనా. హిజబుల్లా దాడుల్లో 23 మంది యూదు సైనికులు, 26 మంది పౌరులు మరణించినట్లు వార్తలు వచ్చాయి. రెండువైపులా లక్షలాది మంది జనం నివాసాలను వీడాల్సి వచ్చింది. ఇజ్రాయెల్‌ వద్ద అపార ఆయుధ సంపద ఉంది, ఎప్పటికప్పుడు అమెరికా, ఇతర దేశాలు కొత్తగా అందిస్తున్నాయి. అయితే హిజబుల్లా వద్ద అంత పెద్ద మొత్తంలో లేకున్నా ఇజ్రాయెల్‌లోని అన్ని ప్రాంతాల మీద దాడులు చేసేందుకు అవసరమైన రాకెట్లు ఉన్నట్లు అంచనా. లక్షా 20వేల నుంచి రెండు లక్షల వరకు ఉంటాయని, అక్టోబరు ఎనిమిది నుంచి ఇప్పటి వరకు ఎనిమిది వేలు ప్రయోగించినట్లు అంచనా. ఆధునిక డ్రోన్లతో పాటు నిర్ణీత లక్ష్యాలను తాకే క్షిపణులు కూడా ఉన్నాయి. ఒక వేళ యుద్ధమే ప్రబలితే రెండు వైపులా నష్టాలు తీవ్రంగా ఉంటాయి.2006లో జరిగిన నెల రోజుల పోరులో దక్షిణ లెబనాన్‌, రాజధాని దక్షిణ ప్రాంతాలు దెబ్బ తిన్నాయి. రెండు వైపులా ప్రాణ నష్టం జరిగింది. లెబనాన్‌ నాశనం కాగా ఇజ్రాయెల్‌ ఆర్ధికంగా ఎంతో నష్టపోయింది. అప్పటి నుంచి హిజబుల్లాను తుడిచిపెట్టాలని చూస్తున్నా సాధ్యం కావటం లేదు.


గత పది నెలలుగా ఇజ్రాయెల్‌, అమెరికా లక్ష్యాలుగా సిరియా, ఇరాక్‌, ఎమెన్‌లలో ఉన్న సాయుధ గ్రూపులు దాడులు చేస్తున్నాయి. వాటికి ఇరాన్‌ మద్దతు బహిరంగ రహస్యమే.ఒక వేళ ఇరానే ప్రత్యక్షంగా దాడులకు దిగవచ్చనే అంచనాతో ఇటీవల పెద్ద ఎత్తున తమ నౌకా, వైమానిక దళాలను మధ్య ప్రాచ్యానికి అమెరికా తరలించింది. విమానవాహక యుద్ద నౌకలు కూడా వాటిలో ఉన్నాయి. ఇజ్రాయెల్‌ మీద ప్రయోగిస్తున్న డ్రోన్లు, క్షిపణులను మధ్యలోనే కూల్చివేసే రక్షణ వ్యవస్థలను అమెరికా అందచేసింది.దాన్నే ఇనుప కప్పుగా పిలుస్తున్నారు. లెబనాన్‌తో ఉన్న సరిహద్దులో పరిస్థితి ఇలాగే ఉంటుందనే నమ్మకం లేదని ఇజ్రాjెల్‌ అంటున్నది. ఆ ప్రాంతం నుంచి ఖాళీ చేయించిన తమ పౌరులు డిసెంబరు 31వరకు తిరిగి రావద్దని కోరటాన్ని బట్టి అది ఎంతగా భయపడుతున్నదో అర్ధం అవుతోంది.వచ్చే నెలలో పా ఠశాలలు ప్రారంభం కావాల్సి ఉన్నప్పటికీ ఈ ప్రకటన చేసింది. గాజాపై తాను జరుపుతున్న దాడులను అప్పటి వరకు విరమించేది లేదన్న సంకేతం కూడా దీనిలో ఉంది. అందువలన రానున్న రోజుల్లో మరిన్ని దాడులకు తెగబడే అవకాశం ఉంది.
గాజాలో హమస్‌ ఉనికి లేకుండా చేయాలని, తిరిగి అది తలెత్తకుండా ఉండాలంటే సాధారణ పరిస్థితి ఏర్పడిన తరువాత కూడా తమ మిలిటరీని అక్కడ అనుమతించాలని ఇజ్రాయెల్‌ డిమాండ్‌ చేస్తున్నది, దీని అర్ధం హమస్‌ ఆత్మహత్య చేసుకోవాలని అనటమే అని దానికి ఏ మాత్రం అంగీకరించే అవకాశం లేదని పరిశీలకులు చెబుతున్నారు. గాజాలో పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే అక్కడ ఉన్న ఆరున్నరలక్షల మంది పిల్లలకు పోలియో వాక్సిన్‌ వచ్చినప్పటికీ దాన్ని వేసేందుకు ఇజ్రాయెల్‌ అనుమతించటం లేదు.ఐరాస సిబ్బందిని కూడా వదల కుండా దాడులు చేస్తున్నది. కాల్పుల విరమణ జరగకుండా వాక్సిన్లు వేసే అవకాశాలు లేవు. గాజాలో తొలిసారిగా పాతిక సంవత్సరాల తరువాత తొలి పోలియో కేసు నమోదైంది.మురుగునీటిని పరీక్షించినపుడు వైరస్‌ ఉన్నట్లు నిర్థారణ అయింది.పిల్లల్లో 95శాతం మందికి వాక్సిన్‌ అవసరమని యూనిసెఫ్‌ ప్రకటించింది.దాడులు ఆగకపోతే వాక్సిన్‌ వేయటం కష్టమని స్పష్టం చేసింది.పారిశుధ్య పరిస్థితి దిగజారటంతో పాటు మంచినీటి సరఫరాకూ ఆటంకం కలుగుతోంది. దీంతో ఇతర వ్యాధులు కూడా ప్రబలుతున్నాయి. ఆకలి మంటలు, అనాధలుగా రోడ్ల పాలుకావటం సరేసరి.


ఇప్పటి వరకు జరిగిన పరిణామాలను చూస్తే దౌత్య ఎత్తుగడల పేరుతో అమెరికా ఆడిన నాటకాన్ని యావత్‌ ప్రపంచ ప్రజానీకం గ్రహిస్తున్నది. తాను మధ్యవర్తిని అని చెప్పుకుంటూనే 1990దశకపు ఓస్లో ఒప్పందాల నుంచి నేటి వరకు అనుసరించిన వైఖరి ఎలాంటి ఫలితాలను ఇవ్వలేదు. ప్రధాన కారణం ఒక వైపు ఇజ్రాయెల్‌కు మద్దతు ఇస్తూ భద్రతా మండలిలో దానికి వ్యతిరేకంగా వచ్చిన అన్ని తీరానాలను అడ్డుకోవటమే. పది నెలలుగా గాజా మారణంకాండ సాగుతున్నప్పటికీ దాన్ని ఆపలేకపోయింది. ఇరాన్‌, లెబనాన్లలో హమస్‌ అగ్రనేతల హత్య అమెరికాకు తెలియకుండా జరిగే అవకాశమే లేదు. నవంబరు ఐదున జరిగే ఎన్నికల్లో ప్రతి అంశాన్ని ఉపయోగించుకొని లబ్ది పొందాలని అటు డెమోక్రాట్లు, ఇటు రిపబ్లికన్లు ప్రయత్నిస్తున్నారు. ఏ పరిష్కారం జరిగినా అది తమకు అనుకూలంగా ఉండాలని జోబైడెన్‌ భావిస్తున్నాడు. ఇజ్రాయెల్‌ ఓడిపోయినట్లు లేదా వెనక్కు తగ్గిందనే భావనకు వీలులేకుంలేకుా చూడాలని చూస్తే కుదరటం లేదు. అదే సమయంలో ఎన్నికల రోజు దగ్గపడేలోగా ఏదో ఒక పరిష్కారం కుదిరితే తమ విజయంగా చెప్పుకోవాలని కూడా బైడెన్‌ చూస్తున్నాడు. మధ్య ప్రాచ్య యుద్ధం జరగాలని కోరుకుంటున్న అమెరికా వలలో పడేందుకు ఇరాన్‌ సిద్దంగా లేదు.ఎంతగా రెచ్చగొడుతున్నప్పటికీ ఆచితూచి వ్యవహరిస్తున్నది. ఉప్పునిప్పు మాదిరి సంబంధాలున్న స్థితిలో చైనా మధ్యవర్తిత్వంలో సౌదీతో అది సయోధ్య కుదుర్చుకోవటాన్ని అమెరికా ఊహించలేదనే చెప్పాలి. ఒక వైపు తమ మద్దతుతో గాజాలో మారణకాండ సాగుతుండగా మానవత్వం గురించి కబుర్లు చెబుతున్న అమెరికా బండారం మరింతగా బయటపడుతున్నది.


అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోని బ్లింకెన్‌ కొద్ది రోజుల క్రితం తమ ప్రతిపాదనను ఇజ్రాయెల్‌ అంగీకరించిందని ప్రకటించాడు. అయితే కొద్ది గంటల్లోనే అలాంటిదేమీ లేదని ప్రధాని నెతన్యాహు ప్రకటించి గాలి తీశాడు. ఒప్పందానికి ప్రధాని సుముఖంగా లేనందున శాంతి చర్చల్లో తమ ప్రతినిధి పాల్గొనే అవకాశం లేదని కూడా ఇజ్రాయెల్‌ స్పష్టం చేసింది. దీంతో ఒప్పందాన్ని నెతన్యాహు అడ్డుకుంటున్నట్లు రెండుదేశాల అధికారులు లీకులు వదిలారు.గడచిన పదినెలల్లో ఏడు సార్లు ఆంటోని బ్లింకెన్‌ ఇజ్రాయెల్‌ పర్యటన జరిపాడు.శాంతి చర్చలకు ఎప్పటి కప్పుడు నెతన్యాహు కొత్త షరతులను జోడిస్తున్నాడు. అమెరికా అతగాడికి వంతపాడుతూ వివాదాన్ని కొనసాగిస్తున్నదని కొందరు విమర్శి స్తున్నారు. మధ్యవర్తిగా ఉంటూ ఇలాంటి పని చేయటం ఏమిటని ప్రశ్నిస్తున్నారు.మరోవైపు తాము పోరాటం కొనసాగిస్తూనే శాంతి చర్చలకు కూడా సిద్దమని హమస్‌ ప్రకటించింది.చైనా మధ్యవర్తిత్వంలో పాలస్తీనాలోని అన్ని విముక్తి సంస్థలతో చేతులు కలుపుతామని, పిఎల్‌ఓ ఆధిపత్యాన్ని అంగీకరించి భాగస్వాములమౌతామని ప్రకటించిన సంగతి కూడా తెలిసిందే.

ఎగుమతులు డీలా,దిగుమతులు భళా -రైౖతులను గాలికొదిలేసిన నరేంద్రమోడీ !

Tags

, , , , ,


ఎం కోటేశ్వరరావు


బాస్మతి బియ్యం ధర 28శాతం పతనం, టమాటా ధర 70 శాతం దిగజారుడు, పదేండ్ల కనిష్టానికి సోయా ధర. బియ్యం ఎగుమతుల పతనం. గత వారంలో వచ్చిన కొన్ని వార్తల సారాంశమిది. కొన్ని చోట్ల తగినన్ని వర్షాలు పడలేదని, మరికొన్ని చోట్ల అధికంగా ఉన్నట్లు కూడా చెబుతున్నారు.సెప్టెంబరు ఆఖరు వరకు ఖరీఫ్‌ పంటల సాగు చేయవచ్చు, ఇప్పటి వరకు అందిన వార్తల మేరకు గతేడాది కంటే సాగు పెరిగింది. పంటలు పెరిగి రైతాంగానికి తగిన ధరలు వస్తే అంతకంటే కావాల్సిందేముంది ! ఆగస్టు మూడవ వారానికి అందిన వివరాల మేరకు దేశం మొత్తంగా 2024-25 ఖరీఫ్‌ సాధారణ సాగులో 94.13శాతం అంటే 10.316 కోట్ల హెక్టార్లలో పంటలు వేశారు. దీనికి మంచి వర్షాలే కారణమని వ్యవసాయశాఖ పేర్కొన్నది. కీలకమైన ధాన్యం, పప్పుధాన్యాలు,నూనె గింజలు, చెరకు, పత్తి సాధారణం కంటే 2.08శాతం పెరిగితే, ఒక్క వరి సాగే గతేడాదితో పోల్చితే 19.57శాతం పెరిగి 3.69 కోట్ల హెక్టార్లకు(ఒక హెక్టారు రెండున్నర ఎకరాలకు సమానం) చేరింది.చిరుధాన్యాల సాగు పెరిగింది. నూనె గింజల సాగు సాధారణం కంటే తగ్గింది. ఇటీవలి కాలంలో ఆహార ధరల ద్రవ్యోల్బణం పెరుగుదల నరేంద్రమోడీ సర్కార్‌కు చెమటలు పట్టించింది.ఖరీఫ్‌ సాగు పెరుగుదల కారణంగా వినియోగదారులకు ధరలు తగ్గవచ్చనే ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇది మంచిదే కానీ రైతుల గిట్టుబాటు మాటేమిటి ? ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను మొత్తంగా చూసినపుడు ఒక్క కార్పొరేట్‌ వాణిజ్య సంస్థలకు తప్ప ఎవరికీ అలాంటి మేలు చేసిన దాఖలా లేదు. రానున్న రోజుల్లో మేలు చేస్తాయా, కీడు కలిగిస్తాయా అన్నదే అనూహ్యం. ఒక విధంగా చెప్పాలంటే పిచ్చోడి చేతిలో రాయిలా పరిస్థితి ఉంది.
ఉత్తరాది రాష్ట్రాలైన పంజాబ్‌, హర్యానా, ఉత్తర ప్రదేశ్‌, ఉత్తరా ఖండ్‌ మరికొన్ని ప్రాంతాల్లో కోటీ 50లక్షల హెక్టార్లలో సాగు చేసే బాస్మతి రకం బియ్యం కొత్త పంట ఇంకా మార్కెట్‌కు రాక ముందే గతేడాది కంటే మూడోవంతు ధర పతనమైంది. క్వింటాలు గతేడాది ఇదే రోజుల్లో రు.3,200 నుంచి 3,500 వరకు ఉంటే ఇప్పుడు రెండున్నర వేలకు తగ్గింది. దీంతో స్వయంగా బిర్యానీ వండుకు తినేవారికి కాస్త కలసి వచ్చిందిగానీ, ఏ హౌటల్లోనూ ధరలు తగ్గించకపోగా పెంచారు. గతేడాది అక్టోబరు, నవంబరు నెలల్లో నాలుగు వేల నుంచి 4,800వరకు పెరిగాయి. ధరల పతనానికిి ప్రధాన కారణం ప్రభుత్వ ఎగుమతి విధానమే అంటున్నారు. ఒక టన్ను బియ్యం కనీస ఎగుమతి ధర(ఎంఇపి) 950 డాలర్లకు తగ్గకూడదని కేంద్రం నిర్ణయించింది. గతేడాది ఉత్పత్తి నాలుగో వంతు పెరిగింది, ఈ ఏడాది వర్షాలు బాగున్న కారణంగా మరో 15శాతం పెరిగవచ్చని వ్యాపార వర్గాలు అంచనా వేస్తున్నాయి. గతేడాది ఉత్పత్తి నిల్వలు గణనీయంగా ఉన్నాయి. ఇలా పలు కారణాలు ధరల పతనానికి దారితీసింది. ప్రస్తుత సీజన్‌లో ఏ గ్రేడ్‌ రకం వరి మద్దతు ధర రు.2,320గా నిర్ణయించారు. బాస్మతి ధరలు కూడా దానికి దగ్గరగా ఉన్నాయి. కనీస ఎగుమతి ధర 950డాలర్లుగా ఉండటమే ధరల పతనానికి ప్రధాన కారణమని బియ్యం ఎగుమతిదార్ల అసోసియేషన్‌ మాజీ అధ్యక్షుడు విజరు సేటియా చెప్పారు. ఇంత ధరతో అంతర్జాతీయ మార్కెట్‌లో ఎగుమతికి పోటీ పడలేమని అన్నారు. అది రైతాంగానికి చెల్లించే ధర తగ్గటానికి కూడా దోహదం చేస్తున్నదన్నారు. పాకిస్తాన్‌ ప్రభుత్వం ఎగుమతి ధర 700 డాలర్లుగా మాత్రమే ఉందని, అందువలన వారికి ఎక్కువ అవకాశాలుంటాయిని హర్యానా బియ్యం ఎగుమతిదార్ల అధ్యక్షుడు సుశీల్‌ జైన్‌ చెప్పారు.
బాస్మతేతర బియ్యం ఎగుమతుల మీద నిషేధం ఉంది, కొన్ని మినహాయింపులతో ఎగుమతులు చేయాలన్నా థారులాండ్‌, వియత్నాం ధరలతో పోటీపడలేక ఎగుమతులు పతనమయ్యాయి. గతంలో ఈ రెండు దేశాల ధరల కంటే మన బియ్యం ధర తక్కువ ఉంది. ఉదాహరణకు ఐదుశాతం ముక్కలైన పార్‌బాయిల్డ్‌ బియ్యం థారులాండ్‌ టన్ను 565 డాలర్లకు ఇస్తే మనదేశం ఇచ్చే ధర 540 నుంచి 545కు పెరిగింది. దీనికి పన్ను అదనం. ఇలా తేడా తగ్గుతున్న కారణంగా మన ఎగుమతుల మీద ప్రతికూల ప్రభావం పడుతున్నది. మనకంటే ధర ఎక్కువగా ఉన్నప్పటికీ వియత్నాం ఎగుమతులు ఇటీవలి కాలంలో పెరిగాయి. బాస్మతేతర రకాల బియ్యం, గోధుమ ఎగుమతులపై కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించింది. ఎన్నికలకు ముందు ధరలు పెరిగితే తమ విజయావకాశాల మీద ప్రతికూల ప్రభావం పడుతుందనే ముందు చూపుతోనే ఈ పని చేశారన్నది స్పష్టం.దాన్లో భాగంగానే భారత బియ్యం, గోధుమల పేరుతో కొన్ని అమ్మకాలను ప్రారంభించారు.ఎగుమతులపై నిషేధం వలన జరిగిందేమిటి ? మనం రంగంలో లేకపోవటంతో ప్రపంచ మార్కెట్‌లో ధరలు పెరిగాయి.థారు బియ్యం ధర 20శాతం పెరిగింది, ఆ మేరకు రైతాంగానికి కొంత మేలు జరిగింది. మన నుంచి కొనుగోలు చేసే ఖాతాదారులు ఇతర దేశాల వారితో ఖాతాలు కుదుర్చుకున్నారు. ఎన్నికలు ముగిసిన తరువాత కూడా ఎగుమతి ఆంక్షలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. అందువలన ఒక నిర్ణయం తీసుకొనే వరకు అనిశ్చితి కొనసాగుతూనే ఉంటుంది. రైతుల పంట చేతికి రాక ముందే ఏదో ఒకటి తేల్చాలి. తీరా అయినకాడికి తెగనమ్ముకున్న తరువాత ఎగుమతి ఆంక్షలు ఎత్తివేస్తే అది బడా వ్యాపారులకే లాభం. వర్తమాన ఆర్థిక సంవత్సరం తొలి మూడు మాసాల్లో గతంతో పోల్చితే మామూలు బియ్యం ఎగుమతులు 34శాతం తగ్గాయి.
రెండింజన్ల పాలనతో నేరుగా స్వర్గానికి తీసుకుపోతామని బిజెపి చెబుతోంది. అలాంటి స్వర్గదారిలో ఉన్న మధ్య ప్రదేశ్‌లో సోయా గింజల ధరలు క్వింటాలు ధర రు.3,500 నుంచి రు.4,000 పడిపోయిందని ఇది కనీస మద్దతు ధర రు.4,850 కంటే తక్కువే కాదు, పదేండ్ల కనిష్టం అని వార్త. కొత్త పంట చేతికి రాక ముందే ఇలా ఉంటే వచ్చిన తరువాత పరిస్థితి ఏమిటని రైతాంగం ఆందోళన చెందుతోంది. అక్కడ బిజెపి అధికారంలో ఉంది.కేంద్ర సిఏసిపి చెప్పినదాని ప్రకారం ఒక క్వింటాలు ఉత్పత్తి ఖర్చు రు.3,261గా ఉంది. సోయాబీన్‌ ప్రోసెసర్స్‌ అసోసియేషన్‌ సమాచారం ప్రకారం 2013-14లో సగటు మార్కెట్‌ ధర రు.3,823 ఉంది. గతేడాది ఐదువేల వరకు రైతులు పొందారు.దేశంలో మధ్యప్రదేశ్‌లో ఎక్కువగా సోయా సాగు చేస్తారు.ధరల పతనానికి కారణం ఏమిటి ? వంట నూనెల ధరలు విపరీతంగా పెరిగిన పూర్వరంగంలో ఓటర్ల నుంచి వ్యతిరేకత రాకుండా చూసుకొనేందుకు దిగుమతి చేసుకొనే సోయా నూనె మీద ఉన్న 32శాతం దిగుమతి పన్నును నరేంద్రమోడీ సర్కార్‌ 12.5శాతానికి తగ్గించింది. దీంతో చౌకగా అర్జెంటీనా, బ్రెజిల్‌, అమెరికా నుంచి దిగుమతులు పెరిగాయి.ప్రపంచ ఉత్పత్తిలో ఈ మూడింటి వాటా 95శాతం ఉంది. మన వాటా 2.5 నుంచి మూడుశాతం మధ్య ఉంటోంది. గతేడాది ఆ దేశాల్లో ఉత్పత్తి తగ్గటంతో ధరలు స్థిరంగా ఉన్నాయి. ఈ ఏడాది మంచి పంట ఉంటుందనే అంచనాలు వెలువడటంతో మనదగ్గర ధరలు పతనమయ్యాయి.కొద్ది వారాల క్రితం 25కిలోల టమాటాల ధర రు.900 నుంచి వెయ్యి రూపాయల వరకు ఉన్నది కాస్తా ఇప్పుడు దేశంలో అనేక చోట్ల రు.300కు పడిపోయింది.పప్పు ధాన్యాల ఉత్పత్తి పెంచాలని చెప్పటమే తప్ప రైతాంగానికి తగిన ప్రోత్సాహం, ఇబ్బందులు లేని పరిస్థితిని కల్పించటం లేదు. మధ్య ప్రదేశ్‌లో పెసర రైతులు పంటను అమ్ముకొనేందుకు నిరసన తెలపాల్సి వచ్చింది, అమ్ముకున్న తరువాత రాష్ట్ర ప్రభుత్వం సకాలంలో డబ్బు చెల్లించని స్థితి. కొనుగోలు తరువాత ఏడు రోజుల్లో ఇస్తామన్నది ఆరువారాలు గడచినా ఖాతాలలో పడటం లేదని వార్తలు. అంతకు ముందు ప్రతి రైతు నుంచి ఎకరానికి ఇన్ని క్వింటాళ్లే అనే నిర్ణీత పరిమాణానికి మించి కొనుగోలు చేసేది లేదని, అది కూడా నిర్ణీత సమయానికి తెస్తేనే అని నిబంధనలు పెట్టటంతో రైతులు ఆందోళన చేయాల్సి వచ్చింది.
ఎన్నికల కోసం తప్ప రైతాంగ ప్రయోజనాలను కాపాడేందుకు ఒక జవాబుదారీతనంతో కూడిన విధానం కేంద్రం వద్ద లేదు. ఉదాహరణకు గతంతో పోల్చితే ఎరువుల సబ్సిడీని ఈ ఏడాది తగ్గించింది.మరోవైపు ధరల పెరుగుదల నియంత్రణలో భాగంగా దిగుమతులు చేసుకొనే ముడి పామ్‌, సోయా,పొద్దుతిరుగుడు నూనెల మీద ఉన్న డ్యూటీని పూర్తిగా రద్దు చేసింది.వీటి మీద ఉన్న సెస్‌ను 20 నుంచి ఐదు శాతానికి తగ్గించింది.శుద్ధి చేసిన సోయా, పామ్‌,పొద్దుతిరుగుడు ఆయిల్‌ మీద దిగుమతి పన్ను గణనీయంగా తగ్గించింది. పప్పు ధాన్యాల దిగుమతుల మీద పన్ను పూర్తిగా రద్దుచేసింది. వీటి ప్రభావం రైతుల మీద ప్రతికూలంగా పడే అంశాన్ని విస్మరించింది.దేశంలో పప్పు, చమురు గింజల దిగుబడిని పెంచితేనే రైతు వాటి సాగు పట్ల ఆసక్తి చూపుతాడు. అందుకు ప్రభుత్వాలే అవసరమైన పరిశోధనలు, నూతన వంగడాలను రూపొందించాల్సి ఉంటుంది.అదేమీ పెద్దగా కనిపించదు. ధరల స్థిరీకరణ నిధి(పిఎస్‌ఎఫ్‌) గురించి పెద్ద పెద్ద మాటలు చెప్పటం తప్ప బడ్జెట్‌ కేటాయింపులు – ఖర్చు చేసిందీ నామమాత్రమే.2023లో 1500 కోట్లు కేటాయించి అసలు ఖర్చేమీ చేయలదని, మరుసటి సంవత్సరం బడ్జెట్‌లో ఖాతా మూతపడకుండా కేవలం ఒక లక్ష రూపాయలు మాత్రమే కేటాయించినట్లు వార్తలు వచ్చాయి.
వర్తమాన ఆర్థిక సంవత్సరంలో తొమ్మిది ప్రాధాన్యతలతో బడ్జెట్‌ ప్రవేశపెట్టినట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ చెప్పారు. ప్రతి బడ్జెట్‌లో ఇలాంటి కబుర్లనే చెబుతున్నారు. పాతవాటిని మరచిపోతున్నారు. అన్నింటికంటే కేటాయింపులు ప్రకటిత లక్ష్యాల సాధనకు పనికి వస్తాయా ? గత అనుభవం ఏమిటన్న సమీక్ష ఎప్పుడైనా చేశారా అన్న అనుమానం కలుగుతోంది. ద్రవ్యోల్బణ పెరుగుదల రేటులోనైనా నిధులు కేటాయిస్తే అదొకదారి లేకపోతే నిజనిధులు తగ్గినట్లే.లాబ్‌ టు లాండ్‌ అంటే పరిశోధన నుంచి పంటపొలాలకు అనే మాటలు ఎప్పటి నుంచో వింటున్నాము.ఉత్పాదకత పెంపుదల, వాతావరణానికి అనుగుణమైన విత్తనాలు, ఖర్చుల తగ్గింపు, చీడపీడల నివారణ తదితర రంగాల్లో పరిశోధనలు జరిపి వాటిని అభివృద్ధి చేయకుండా రైతాంగానికి ఎలాంటి మేలు చేయలేము. మొత్తం వ్యవసాయ పరిశోధనను సమీక్షిస్తామని నిర్మలమ్మ చెప్పారు. గతేడాది వ్యవసాయ విద్య, పరిశోధనలకు కేటాయించిన మొత్తం రు.9,876 కోట్లు, దీనిలో ఖర్చు పెట్టినదెంతో కోత పెట్టిందెంతో తెలియదు గానీ ఈ ఏడాది కేటాయింపు రు.9,941 కోట్లు కేవలం 65 కోట్ల పెంపుదలతో మొత్తం కార్యకలాపాలను ఎలా పెంచుతారు ? సేంద్రీయ సాగు గురించి ఎన్నో కబుర్లు చెబుతారు.దీనికి గాను గతేడాది రు.459 కోట్లు కేటాయించి ఖర్చు చేసింది కేవలం వంద కోట్లు మాత్రమే. రానున్న రెండు సంవత్సరాల్లో రెండు కోట్ల మంది రైతులతో ఈ సాగు చేయిస్తామని కేటాయించిన మొత్తం 365 కోట్లు మాత్రమే. ప్రతి బడ్జెట్‌లో ఇలాంటి కబుర్లే చెబుతున్నారు. ఇలా కాలక్షేప సాగుతో నరేంద్రమోడీ పదేండ్లుగా గడుపుతున్నారు. అందుకే వ్యవసాయ రంగంలో పరిస్థితి దిగజారుతోంది. ఇటీవలి లోక్‌సభ ఎన్నికల్లో రైతాంగం ఇచ్చిన ప్రతికూల తీర్పును చూసైనా నేర్చుకుంటారా అంటే కనిపించటం లేదు. పోగాలము దాపురించినపుడు ఎవరూ ఏమి చేయలేరు !

నరేంద్రమోడీని గుడ్డిగా సమర్థిస్తే అంతే సంగతులు : ప్రైవేటు అధికారుల నియామకం నిలిపివేత ! అపర చాణుక్యుడు చంద్రబాబు, తాటతీసే పవన్‌ కల్యాణ్‌ మౌనం ఎందుకు ?

Tags

, , , , , , ,


ఎం కోటేశ్వరరావు


ప్రైవేటు అధికారుల నియామకానికి యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ ఇచ్చిన ప్రకటనను వెనక్కు తీసుకోవాల్సిందిగా 2024 ఆగస్టు 20న కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. ఈ నియామకాలపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. వ్యతిరేకించిన వారిని ఖండిస్తూ, ప్రభుత్వాన్ని సమర్ధిస్తూ మాట్లాడిన పెద్దలు తలలు ఎక్కడ పెట్టుకోవాలో వారికే వదలి వేద్దాం. ప్రధాని నరేంద్రమోడీ మార్గదర్శకాల మేరకే రద్దు నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌కు లేఖ రాశారు. నష్టనివారణ చర్యగా , అందులోనూ మోడీకి తెలియకుండా ఇదంతా జరిగిందనే భావనను చొప్పించేందుకు, మోడీ సామాజిక న్యాయానికి ఎల్లవేళలా కట్టుబడి ఉన్నారని చెప్పుకున్నారు. ఏ నిర్ణయమైనా ప్రధాని లేదా కార్యాలయానికి తెలియకుండా ఉండవు. అలాంటపుడు యుపిఎస్‌సి ప్రకటన సందర్భంగా ఏ గుడ్డి గుర్రానికి పండ్లుతోముతున్నట్లు అనే ప్రశ్న సహజంగానే వస్తుంది. అఫ్‌ కోర్సు అక్కడ జవాబు చెప్పేవారు గానీ జవాబుదారీతనం ఉన్న వారు గానీ కనపడరు. ఈ సందర్భంగా వచ్చిన కొన్ని వాదనలు, అసంబద్దతలను చూద్దాం. మరోవైపు తమ చర్యను సమర్ధించుకుంటూ ప్రైవేటు వ్యక్తులను అధికారులుగా తీసుకోవటాన్ని 2004-09 మధ్య కాంగ్రెస్‌ నాయకత్వంలోని యూపిఏ ప్రభుత్వమే ప్రారంభించిందని, 2005లో ఆ పార్టీకి చెందిన వీరప్ప మొయిలీ ఆధ్యర్యంలోని రెండవ అధికార యంత్రాంగ సంస్కరణల కమిషన్‌(ఏఆర్‌సి) గట్టిగా సిఫార్సు చేసిందని, తరువాత 2017లో నీతి ఆయోగ్‌ కూడా సిఫార్సు చేసిందని బిజెపి, ఇతర పెద్దలు చెబుతున్నారు. అనేక కమిటీలు అనేక సిఫార్సులు చేశాయి.వాటన్నింటినీ అమలు జరుపుతున్నారా ? రాజ్యాంగంలోని ఆదేశిక సూత్రాల అమలుకే దిక్కులేదు. పంటల మద్దతు ధరల నిర్ణయానికి స్వామినాధన్‌ కమిషన్‌ ఒక సూత్రాన్ని చెప్పింది. దాన్ని ఎందుకు అమలు చేయటం లేదు ? కనీస మద్దతు ధరలకు చట్టబద్దత కల్పించాలని నరేంద్రమోడీ నాయకత్వంలోని ముఖ్యమంత్రుల కమిటీ స్వయంగా సిఫార్సు చేసింది. తానే ఆ పదవిలో ఉండి దాన్ని అమలు జరిపేందుకు ఎందుకు తిరస్కరిస్తున్నట్లు ? ఇలా చాలా ఉన్నాయి.


నైపుణ్యం కావాలి అంటున్నారు. ప్రభుత్వ యంత్రాంగంలో ఇప్పుడు లేదా ? లేనపుడు ఎప్పటికపుడు తగిన శిక్షణ ఇవ్వాలి, ఇప్పించండి.ప్రతి ఏటా అనేక మందిని విదేశాలకు పంపి అధ్యయనాలు చేయిస్తున్నారు కదా ! వేల మంది అధికారులున్న వ్యవస్థలో నలభై అయిదు మంది బయటి వారిని తీసుకు వచ్చి మూడు లేదా ఐదు సంవత్సరాల వ్యవధిలో దేశం మొత్తానికి నైపుణ్యాన్ని తీసుకుస్తామని చెబితే నమ్మేందుకు జనం చెవుల్లో పూలు పెట్టుకున్నారని భావిస్తున్నారా ? ప్రయివేటు రంగంలోని వారు నిజంగా అంతటి నిపుణులైతే అనేక పరిశ్రములు, వ్యాపారాలెందుకు మూతపడుతున్నాయి. అనిల్‌ అంబానీ కంపెనీలను అలాంటి నిపుణులు ఎందుకు కాపాడలేకపోయారు ? ప్రైవేటు రంగ సంస్థలు చైనాలో మాదిరి వస్తు ఉత్పత్తులు, ఎగుమతులు ఎందుకు చేయలేకపోతున్నాయి ? నిజంగా అంతనిపుణులైతే ప్రభుత్వ రంగ సంస్థల మూసివేత, అమ్మివేసేబదులు వాటిని ఉద్దరించేందుకు కావాలంటే కొందరిని నియమించి బాగు చేయవచ్చు. గతంలోనే అమలు జరిపారు, అప్పుడెందుకు అభ్యంతరం చెప్పలేదు, ఇప్పుడెందుకు వ్యతిరేకిస్తున్నారు అంటూ అడ్డుసవాళ్లు ! ఉదాహరణకు ఆర్‌బిఐ గవర్నర్‌గా బయటివారిని నియమించటం ఎప్పటి నుంచో ఉంది. కానీ రోజువారీ నిర్వహణకు ప్రైవేటు అధికారులను నియమిస్తున్నారా ? పాలన తీరు మెరుగుపరచటానికి, కొత్త ఆలోచనలను, నైపుణ్యాలను ప్రవేశపెట్టటానికి ఎవరి సలహాలనైనా తీసుకోవచ్చు. వాటిని అమలు జరపాల్సింది అధికారయంత్రాంగం తప్ప నిపుణులు కాదు. మూడేండ్ల కాలం మాత్రమే ఉండేవారు, పాలనా పద్దతులను నేర్చుకొనేదెన్నడు ? అమలు చేసేదెప్పుడు ? గతంలో ప్రైవేటు వారిని ఎంత మందిని తీసుకున్నారు, వారి సేవల కారణంగా ఒనగూడిన పాలనా ప్రయోజనమెంత, ఎప్పుడైనా మదింపు చేశారా ? గతంలో ఎందుకు మాట్లాడలేదంటున్నారు. మాకు నాలుగు వందల సీట్లు వస్తే రాజ్యాంగాన్ని మారుస్తామని పదేండ్ల తరువాత బిజెపి ఎంపీలు ఇద్దరు చెప్పారు. 2014లోక్‌సభ ఎన్నికలకు ముందు ఎందుకు చెప్పలేదు ? అందువలన అలాంటి అడ్డుసవాళ్లకు అర్ధం లేదు. ఆ విధాన అసలు లక్ష్యాన్ని వెంటనే గ్రహించకపోవచ్చు, ఒక్కసారే కదా చూద్దాంలే అనుకొని ఉండవచ్చు, దాన్ని నిరంతర ప్రక్రియగా మారిస్తే దాని ప్రమాదాన్ని గ్రహించి ఇప్పుడు గట్టిగా ప్రతిఘటించాలని భావించవచ్చు. ఆ మాటకొస్తే నరేంద్రమోడీ దేశమంతటా గుజరాత్‌ విధానాన్ని అమలు చేస్తామన్నారు ? ఆదర్శం అన్నారుగా, ఎందుకు అమలు జరపటం లేదు, ఇప్పుడసలు ప్రస్తావించటమే లేదు ? అమెరికా, ఐరోపా దేశాల్లో ఇలాంటి విధానం ఉంది. నిజమే, నిరుద్యోగ భృతి, కార్మికుడి ఉద్యోగం పోతే ఎంతోకొంత ఆదుకోవటం ఉంది. మరి వాటి సంగతేమిటి ? వాటిని కూడా ప్రవేశపెట్టండి. పోనీ అక్కడ పాలన అంత నైపుణ్యంతో ఉందా ? ఆర్థికంగా ఆ దేశాల జిడిపి వృద్ధి రేటు ఎంత ? నిపుణులేం చేస్తున్నారు ? మన కళ్ల ముందే వచ్చిన 2008 ఆర్థిక సంక్షోభానికి కారకులు ఎవరు ? బాంకింగ్‌ వ్యవస్థలన్నీ ఎందుకు కూలిపోయాయి? మన ప్రభుత్వ రంగబాంకులెందుకు తట్టుకొని నిలిచాయి ? అమెరికా, ఐరోపాల్లో అలాంటి నిపుణులు ఇచ్చిన తప్పుడు సలహాల వలన అనేక ప్రాంతాల్లో యుద్ధాలు, సంక్షోభాలు రాలేదా ?మనకు అవసరమైన వాటినే కాదు, మిగతా వాటిని కూడా పోల్చుకోవాలి.


దీని వెనుక ఉన్న అసలు కథేమిటి ?
ప్రపంచబ్యాంకు, ఐఎంఎఫ్‌ తన ఖాతాదారులైన దేశాల మీద రుద్దే అనేక షరతుల్లో అధికార యంత్రాంగంలో మార్పులు ఒకటి. కేంద్ర ప్రభుత్వంలోని వివిధ శాఖల్లో సంయుక్త కార్యదర్శులు, డైరెక్టర్లు, ఉపకార్యదర్శులుగా మూడు నుంచి గరిష్టంగా ఐదేండ్ల వరకు పని చేసేందుకు 45 మందిని స్పెషలిస్టుల పేరుతో ఆలిండియా సర్వీసు పరీక్షలతో నిమిత్తం లేకుండా తీసుకోవాలని పబ్లిక్‌ సర్వీసు కమిషన్‌ ఒక నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఈ నియామకంలో రిజర్వేషన్లు ఉండవు.ప్రతిపక్షాలు, చివరికి ఎన్‌డిఏ పక్షాలు ఎల్‌జెపి, జెడియు ,వివిధ సంస్థలు దీన్ని వ్యతిరేకించాయి. ప్రభుత్వం వెలుపల ఉన్న వారిలో ప్రత్యేక నైపుణ్యం, నవ దృక్పధం కలవారిని తీసుకొని పాలన స్థాయిని పెంచటమే లక్ష్యంగా చెప్పారు. చేదు మాత్ర మింగించటానికి పంచదార పూత పూయటం వంటిదే ఇది.ఈ పేరుతో ప్రైవేటీకరణకు పూనుకోవటమే.సంస్కరణల పేరుతో నూతన విధానాలను ముందుకు తెచ్చినపుడు నష్టాలు వచ్చే ప్రభుత్వ రంగ సంస్థలను మూసివేస్తామన్నారు, తరువాత వాటిని విక్రయించి సొమ్ము చేస్తామన్నారు, చివరికి ఇప్పుడు చెబుతున్నదేమిటి ? నష్టాలు లాభాలతో నిమిత్తం లేకుండా ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మివేయటమే విధానం అంటున్న సంగతి తెలిసిందే. ఎల్‌ఐసి వంటి లాభాలు వస్తున్న సంస్థల నుంచి కొంత శాతం వాటాలను విక్రయిస్తున్నారు. తరువాత పూర్తిగా అమ్మివేయవచ్చు. ప్రభుత్వ యంత్రాంగాన్ని తగ్గించేందుకు, రిజర్వేషన్లతో నిమిత్తం లేకుండా ప్రైవేటు వారితో నింపేదురాలోచన దీని వెనుక ఉంది. సేవారంగాలు, ఉత్పత్తి రంగాలలో ప్రభుత్వ ప్రమేయం లేకుండా మొత్తం ప్రైవేటుకే అప్పగించాలన్నది ప్రపంచ బాంకు ఆదేశం. దానిలో భాగంగానే గత మూడు దశాబ్దాలుగా కేంద్రం లేదా రాష్ట్రాలు పెట్టుబడులు పెట్టటం నిలిపివేసి ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలను అయిన వారికి కారుచౌకగా కట్టబెట్టేందుకు చూస్తున్నాయి.ఎందరో నిపుణులు ఉన్నారని చెబుతున్న ప్రైవేటు ఇంజనీరింగ్‌ కాలేజీలు కేవలం సర్టిఫికెట్‌లు ఇచ్చే ఫ్యాక్టరీలుగా ఎందుకు మారినట్లు ? ప్రైవేటు మెడికాలేజీల్లో వేషాలు కొంత మందికి వైద్యుల వేషాలు వేసి తనిఖీల తతంగాన్ని ఎందుకు నడిపిస్తున్నట్లు ?


ప్రైవేటు నియామకాల్లో రిజర్వేషన్లు లేకుండా చేసేందుకు ” అద్భుత ” తెలివి తేటలను చూపారు. మొత్తం 45నియామకాలను కలిపి గాక విడివిడి పోస్టులుగా చేశారు. ఒకే పోస్టు ఉన్నపుడు రిజర్వేషన్‌ నిబంధన వర్తించదు గనుక ఈ చావు తెలివిని ప్రదర్శించారు.2018లో కూడా ఇదే చేసి 63 మందిని నియమించారు. వారిలో ఇప్పుడు 57 మంది పని చేస్తున్నారు. రిజర్వేషన్లు ఉంటేనే ఇప్పుడు ఉన్నతాధికారుల్లో ఎస్‌సిలు 4,ఎస్‌టిలు 4.9శాతం మాత్రమే ఉన్నారు. ఇలా ప్రైవేటు వారిని తీసుకుంటే ఈ తరగతులతో పాటు మొత్తంగా అందరికీ ప్రమోషన్లు తగ్గిపోతాయి.దేశవ్యాపితంగా 1,500 మంది ఐఏఎస్‌ల కొరత ఉందని చెబుతున్నారు. అలాంటపుడు తీసుకొనే వారి సంఖ్యను పెంచుకోవచ్చు. సాంకేతిక,ఆర్థికం, విద్య, వైద్యం వంటి రంగాల్లో నిపుణులుగా ఉన్న వారిని ఈ పోస్టులలో నియమిస్తే అందునా మూడు నుంచి ఐదేండ్లలో వారు తమ నైపుణ్యాన్ని ప్రదర్శించటం మీద కేంద్రీకరిస్తారా లేక పాలన మీద దృష్టిపెడతారా ? ప్రభుత్వ ఉద్యోగిగా ఉన్నవారికి కొన్ని నిబంధనలు, జవాబుదారీతనం ఉంటాయి. మూడు లేక ఐదేండ్లు కాంట్రాక్టు ఉద్యోగిగా ఉండే వారికి అలాంటి బాధ్యత ఉంటుందా ? అక్రమాలకు పాల్పడి బయటకు వెళితే చేయగలిందేమిటి ?


కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని తాము సమర్ధిస్తున్నట్లు తెలుగుదేశం ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ తమతో చెప్పినట్లు ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌ పత్రిక రాసింది. బీహార్‌కు చెందిన లోక్‌ జనశక్తి పార్టీ(ఎల్‌జెపి),జెడియు రెండూ బిజెపి మిత్రపక్షాలే కేంద్రంలో అధికారాన్ని పంచుకుంటున్నాయి. అవి రెండూ ప్రైవేటు అధికారుల నియామకాన్ని బహిరంగంగానే వ్యతిరేకించాయి. మరి సామాజిక న్యాయం కోసం నిలబడతామని చెప్పి అపర రాజకీయ చాణుక్యుడిగా పేరున్న చంద్రబాబు, అవసరమైతే ఎవరినైనా తాటతీస్తా, తోలు వలుస్తా అని చెప్పిన జనసేనాని పవన్‌ కల్యాణ్‌ ఎందుకు మౌనంగా ఉన్నట్లు ? నియామకాల రద్దు నిర్ణయం తరువాత వారు నేర్చుకున్న పాఠం ఏమిటి ? నరేంద్రమోడీ సర్కార్‌ తీసుకొనే నిర్ణయాల్లో తప్పుంటే తప్పని చెప్పాలి. నల్లధనం రద్దు, ఉగ్రవాదులకు నిధులు అందకూడనే పేరుతో నోట్ల రద్దు అనే పిచ్చిపని చేసినపుడు ఆ చర్యను సమర్దించటమే దేశభక్తిగా అనేక మంది భావించారు. అదెంత బూటకమో నల్లధనం మన కళ్ల ముందే ఎలా డిజెలతో నాట్యం చేస్తున్నదో చూస్తున్నాము. ఆ చర్యను చారిత్రాత్మకమైనదిగా నాడు చంద్రబాబు నాయుడు వర్ణించారు, అలాంటి పని చేయాలని తామే కోరినట్లు కూడా చెప్పుకున్న పెద్ద మనిషి ఎన్‌డిఏ నుంచి బయటకు వచ్చాక దానికి విరుద్దమైన మాటలు మాట్లాడారు.


మూడు సాగు చట్టాలను తీసుకువచ్చినపుడు రైతాంగం ఏడాది పాటు ఢిల్లీ శివార్లలో భైటాయించిన తరువాత గానీ మోడీ క్షమాపణలు చెప్పి వెనక్కు తీసుకోలేదు. కానీ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ కేవలం 45 మందిని ప్రైవేటుగా కాంట్రాక్టు పద్దతిలో తీసుకొనేందుకు తీసుకున్న నిర్ణయం మీద ప్రతిపక్షాల నిరసన ప్రకటనలు తప్ప ఎక్కడా ఆందోళనలు ప్రారంభం కాలేదు. అయినా మోడీ సర్కార్‌ వెంటనే ఎందుకు వెనక్కు తగ్గాల్సి వచ్చింది ? ప్రతిపక్షాలు, సామాజిక న్యాయంకోరే సంస్థలు, వ్యక్తులు రిజర్వేషన్ల సమస్యను ప్రస్తావించారు. మొండిగా దాన్ని అమలు జరిపేందుకు ముందుకు పోతే రానున్న హర్యానా, కాశ్మీరు, మహారాష్ట్ర, ఝార్కండ్‌, ఢిల్లీ రాష్ట్రాల ఎన్నికల్లో దెబ్బతింటామని బిజెపి భయపడింది.వెనుకబడిన తరగతుల జనాభా వివరాలను సేకరించాలన్న డిమాండ్‌ను ఇంతకాలం కేంద్ర ప్రభుత్వం తిరస్కరించింది. కావాలంటే రాష్ట్రాలు చేసుకోవచ్చని చెప్పారు. కానీ రానున్న జనాభా లెక్కల సేకరణలో కులం వివరాలు నమోదు చేసే అంశాన్ని చేర్చటం గురించి ఆలోచిస్తున్నట్లు అధికార వర్గాలు చెప్పినట్లు తాజాగా వార్త వచ్చింది.(2024 ఆగస్టు 22వ తేదీ హిందూ పత్రిక పతాక శీర్షిక) ఎందుకంటే ఇప్పటికే బిజెపికి ఆ సెగ తగిలింది. వ్యక్తిగా నరేంద్రమోడీ, కేంద్ర బిజెపి సర్కార్‌ నానాటికీ విశ్వసనీయత కోల్పోతున్నది.చెప్పేది ఒకటి చేసేది ఒకటని జనం భావించటం ప్రారంభమైంది. ఒకరిద్దరు బిజెపి ఎంపీలు తమకు లోక్‌సభలో నాలుగు వందల సీట్లు వస్తే రాజ్యాంగాన్ని మారుస్తామని చేసిన ప్రకటనను విశ్వసించారు తప్ప అలాంటిదేమీ లేదన్న మోడీ మాటను జనం నమ్మలేదు. ఆ పార్టీకి సంపూర్ణ మెజారిటీ లేకుండా చేశారు. ఎన్నికలు ముగిసి వందరోజులు కూడా గడవక ముందే రిజర్వేషన్లతో నిమిత్తం లేని కేంద్ర ఉన్నతాధికారుల నియామక ప్రక్రియను చేపట్టటంతో రిజర్వేషన్లకు తిలోదకాలిస్తారన్న ప్రచారం నిజమే అని జనం నిర్ధారణకు వస్తున్న కారణంగానే వెంటనే ఆ నిర్ణయాన్ని వెనక్కు తీసుకున్నారు.చివరికి ఇప్పుడు నరేంద్రమోడీ నిజం చెప్పినా జనం అనుమానంతో చూసే పరిస్థితి వచ్చింది. అందుకే మోడీని గుడ్డిగా సమర్ధిస్తే అంతే సంగతులు !

అమెరికా అధ్యక్ష ఎన్నికలు : నోటి దురుసు డోనాల్డ్‌ ట్రంప్‌కు చుక్కలు చూపుతున్న కమలా హారిస్‌ !

Tags

, , , , ,


ఎం కోటేశ్వరరావు


చికాగో నగరంలో జరిగిన డెమోక్రటిక్‌ పార్టీ సమావేశం తన అధ్యక్ష అభ్యర్థిగా కమలా దేవి హారిస్‌ను ప్రకటించింది. తనకు ఎదురులేదని విర్రవీగుతున్న రిపబ్లికన్‌ పార్టీ అభ్యర్థి డోనాల్డ్‌ ట్రంప్‌కు ఆమె చుక్కలు చూపిస్తున్నది.దీంతో ముదిమది తప్పినట్లుగా 79 ఏండ్ల ట్రంప్‌ 59 సంవత్సరాల కమలతో పోల్చితే తానే అందంగా ఉంటానంటూ దిగజారుడు ప్రచారానికి పూనుకున్నాడు. పిరికి వారే అలాంటి ప్రచారం చేస్తారంటూ ఆమె తిప్పికొట్టింది. ప్రచారంలో తొలుత అభ్యర్థిగా ఉన్న జో బైడెన్‌ తడబడటం, పొంతన లేకుండా మాట్లాడటం వంటి పరిణామాల పూర్వరంగంలో కమల రంగంలోకి వచ్చింది. నవంబరు ఐదవ తేదీన జరిగే ఎన్నికలకు ముందు సెప్టెంబరు పదవ తేదీన, తరువాత జరిగే చర్చల్లో ఆమెను ఎదుర్కొనేందుకు మాజీ ఎంపీ తులసీ గబ్బార్డ్‌ సాయం తీసుకోవాలని ట్రంప్‌ నిర్ణయించాడు. పార్టీలకు వేసే ఓట్లను బట్టిగాక ఎలక్టరల్‌ కాలేజీలో తెచ్చుకొనే ఓట్లే అధ్యక్ష పదవిలో కూర్చునే వారిని నిర్ణయిస్తాయి. అలాంటి ఓట్లు 538 కాగా, గెలవాలంటే 270 కావాలి. ఆగస్టు నెల 18వ తేదీన ఉన్న పరిస్థితిని బట్టి కమలా హారిస్‌ 225, డోనాల్డ్‌ ట్రంప్‌ 219 ఓట్లతో పోటీ పడుతున్నట్లు ఒక సర్వే వెల్లడించింది. మరికొన్ని కూడా అదే విధమైన వివరాలను ఇస్తున్నాయి.ఎన్నికల నాటికి ఈ అంకెలన్నీ మారిపోతుంటాయి. రెండు పార్టీలకు సాంప్రదాయంగా బలమైన కొన్ని రాష్ట్రాలు ఉన్నాయి. ఎటూ మొగ్గని చోట పలుకుబడి పెంచుకొనేందుకు అభ్యర్థులు పోటీ పడతారు. ఈ క్రమంలో ప్రచారంలో ఎన్నో అవాస్తవాలు, దిగజారుడు పదవిన్యాసాలు, వినిపిస్తాయి, కనిపిస్తాయి. అమెరికాలో ట్రంపు నోరు ఎంతో కంపును వెదజల్లుతోంది. ఏం మాట్లాడతాడో తెలియదు.గతంలో బైడెన్‌ ఒక దొంగ,మోసగాడు, అబద్దాల కోరు, చరిత్రలో చెత్త అధ్యక్షుడు అంటూ నోరుపారవేసుకున్న పెద్ద మనిషి ఇప్పుడు కమలా హారిస్‌ మీద కూడా అదే మాదిరి దాడి చేస్తున్నాడు. ఆమె కూడా దొంగ, అబద్దాల కోరు, ఆమె నిజంగా నల్లజాతీయురాలు కాదు కానీ ఇప్పుడు అలా చెప్పుకుంటున్నది.ఆమె తన పేరును కూడా సరిగా ఉచ్చరించలేదు, ఆమె అసమర్దురాలు, చిత్తకార్తె కుక్క అని మాట్లాడాడు.ఆమె సభలకు జనం రావటం లేదు, కృత్రిమ మేథ ద్వారా పెద్ద ఎత్తున జనం ఉన్నట్లు చిత్రిస్తున్నారు అన్నాడు. అమెరికా ఎన్నికల్లో పోటీ పడుతున్న రెండు ప్రధాన పార్టీలూ వర్గరీత్యా బహుళజాతి గుత్త సంస్థలు, ఆయుధతయారీదార్లకు అనుకూలమైనవే. ఎవరి హయాంలో ఎక్కడ చిచ్చుపెట్టినా అధికార మార్పిడితో నిమిత్తం లేకుండా ఎవరు గెలిచినా దాన్ని ఆరకుండా చూడటంలో దొందూ దొందే. అమెరికా ఎదుర్కొంటున్న ఆర్థిక సమస్యలను పరిష్కరించటంలో రెండు పార్టీలూ విఫలమయ్యాయి. ఈ కారణంగానే పెట్టుబడిదారీ విధానం విఫలమైందనే భావన అక్కడ రోజు రోజుకూ పెరుగుతోంది. కొన్ని సామాజిక సమస్యల్లోనే రెండు పార్టీల మధ్య తేడాలు ఉన్నాయి. అక్కడి వామపక్ష శక్తులు, ఉదారవాదులు ఏ రాక్షసుడితో తక్కువ ముప్పు అని చూసి చిన్న రాక్షసుడిగా ఉండే డెమోక్రటిక్‌ పార్టీకి మద్దతు ఇస్తుంటారు.


కీలకమైన రాష్ట్రాలలో కమలాహారిస్‌ది పైచేయిగా కనిపించటంతో ట్రంప్‌ రెచ్చిపోతున్నాడు.పెన్సిల్వేనియా రాష్ట్రంలో జరిగిన సభల్లో మాట్లాడుతూ సలహాదారులు రాసి ఇచ్చిన ప్రసంగాన్ని పక్కన పెట్టి కమలాహారిస్‌ కమ్యూనిస్టు, ఫాసిస్టు అజెండాలను పాటిస్తున్నారని ఆరోపించాడు.ట్రంప్‌ ప్రసంగం విసుగు పుట్టించి సభికులు మధ్యలోనే లేచిపోతుండటంతో కమలా హారిస్‌ మీద వ్యక్తిగత దూషణలతో ఆకర్షించేందుకు చూశాడు.జో బైడెన్‌ పాలనలో ధరలు పెరిగాయని, కుటుంబాల మీద పెరిగిన భారాన్ని ” కమలా హారిస్‌ ద్రవ్యోల్బణ పన్ను ” అని, కామ్రేడ్‌ కమల ముందు రోజు చేసిన ప్రసంగంలో ఒక కమ్యూనిస్టు మాదిరి మాట్లాడారని, సోషలిస్టు వ్యవస్థలో మాదిరి ధరల నియంత్రణ కోరుతున్నారని, అంటే సరకుల కొరత, ఆకలి, ధరల పెరుగుదల అని ఆరోపించాడు.ఆమెను బైడెన్‌ ద్వేషిస్తాడు, అతగాడి మీద కుట్ర చేసి ఆమె అభ్యర్థిగా నిలిచారన్నాడు. మీరు ఎప్పుడైనా ఆమె నవ్వటాన్ని చూశారా ? ఒక పిచ్చిదానిలా నవ్వుతుంది అంటూ నోరుపారవేసుకున్నాడు. ఇంకా అనేక అవాస్తవాలను ప్రస్తావించాడు.పెన్సిల్వేనియా గవర్నర్‌గా ఉన్న జోష్‌ షాపిరోను ఉపాధ్యక్ష పదవికి ఎందుకు అభ్యర్థిగా ఎంచుకోలేదో తెలుసా అని ప్రశ్నిస్తూ అతను ఒక యూదుడు గనుక, యూదులెవరైనా కమల లేదా డెమోక్రాట్లకు ఓటు వేస్తే వారి బుర్రలను ఆసుపత్రిలో పరీక్ష చేయించాలని రెచ్చగొట్టాడు.పోటీ నుంచి తప్పుకున్న జో బైడెన్‌ గురించి ఎక్కువగా మాట్లాడవద్దని వారిస్తున్నా ట్రంప్‌ ఆగలేదు.నేను అతన్ని దెబ్బతీశాను గనుక, ఇప్పుడు ఆమెను కూడా అదే చేయకపోవటం అన్యాయం అంటూ కేకలతో వీరంగం వేశాడు.కమల వయసులో ఉండగా ఆమెతో సహజీవనం చేసిన కాలిఫోర్నియా అసెంబ్లీ మాజీ స్పీకర్‌ విలీ బ్రౌన్‌ ఆమె గురించి భయంకరమైన అంశాలు చెప్పాడంటూ వ్యక్తిగత అంశాలను ప్రస్తావించాడు. ముగ్గుర్ని వివాహాలు చేసుకొన్న డోనాల్డ్‌ ట్రంప్‌ ఎలాంటి తిరుగుబోతో కేేసులను ఎలా ఎదుర్కొన్నాడో అందరికీ తెలిసిందే. 2023లో న్యూయార్క్‌ కోర్టు ఒక రచయిత్రిని లైంగికంగా దూషించినందుకు నష్టపరిహారంగా ఐదుమిలియన్‌ డాలర్లు చెల్లించాలని తీర్పు నిచ్చింది. ఆ తీర్పు మీద మరోసారి నోరు పారవేసుకోవటంతో ఇ జీన్‌ కరోల్‌ అనే రచయిత్రి మరో పది మిలియన్‌ డాలర్ల నష్టపరిహార కేసు దాఖలు చేసింది. ట్రంప్‌ ఆస్తుల విలువ 767 కోట్ల డాలర్లు (మన రూపాయల్లో 64వేల కోట్లు ) ఇంత డబ్బున్న వాడికి ఆ జరిమానా ఒక లెక్కలోనిది కాదు. ఆ డబ్బు,దురహంకారం నోటి దురుసుకు కారణం. మహిళల గురించి ట్రంప్‌ అనుచితంగా మాట్లాడిన 74 ఉదంతాలను పేర్కొంటూ ది వీక్‌ అనే పత్రిక వివరాలను ఇచ్చింది.అలాంటి వ్యక్తి ప్రత్యర్థుల మీద దాడి చేస్తున్నాడు. ప్రతికూల ప్రచారం చేసేందుకు పూనుకున్న ట్రంప్‌ చివరికి బ్రిటన్‌ చరిత్రలో తనను తాను గొప్పగా ఊహించుకొని పరిపాలనకే అర్హత లేని పిచ్చి రాజుగా ప్రఖ్యాతి గాంచిన మూడవ జార్జి మాదిరి ఉన్నాడని కొందరు వ్యాఖ్యాతలు పేర్కొన్నారు. ఆ రాజు రెచ్చిపోకుండా పక్కనున్నవారు అదుపుచేయటంలో జయప్రదమయ్యారని, కానీ ట్రంప్‌ అనుచరులు ప్రయత్నించి విఫలమైనట్లు వ్యాఖ్యానించారు. ప్రత్యర్ధులను ఇరుకున పెట్టబోయి తానే ఇరుక్కునట్లు పేర్కొంటున్నారు.


ఎన్నికల్లో ఒకవేళ ఓడిపోతే ఓటమిని అంగీకరించకుండా ఉండేందుకు ఇప్పటినుంచే పూర్వరంగాన్ని సిద్దం చేసుకుంటున్నాడని డెమోక్రటిక్‌ సోషలిస్టు నేత బెర్నీ శాండర్స్‌ తాజాగా ట్రంప్‌ గురించి ఓటర్లను హెచ్చరించాడు.మిచిగన్‌ విమానాశ్రయంలో పెద్ద ఎత్తున కమలా హారిస్‌ ఆమె ఉపాధ్యక్ష అభ్యర్థి,మినెసోటా గవర్నర్‌ వాల్జ్‌కు వేలాది మంది స్వాగతం పలికారు. మీడియా దాన్ని ప్రత్యక్ష ప్రసారం చేసింది. అదంతా కృత్రిమ సృష్టి అని వర్ణించిన ట్రంప్‌ వెర్రి వాడిలా కనిపించవచ్చు గాని బుద్ధి హీనుడు కాదని, తెలివిగా ఓటమిని తిరస్కరించేందుకు పధకం వేస్తున్నాడని శాండర్స్‌ అన్నాడు.ప్రజాస్వామ్యాన్ని తక్కువచేయటం ఫాసిజం తప్ప మరొకటి కాదని అందుకే ట్రంప్‌ను ఓడించేందుకు చేయాల్సిందంతా చేయాలని శాండర్స్‌ అన్నాడు. గత ఎన్నికలలో ఓడిన తరువాత ఓటమిని అంగీకరించని ట్రంప్‌ 2021జనవరి ఆరవ తేదీన అమెరికా అధికార కేంద్రంపైకి తన అనుచరులను ఉసిగొల్పిన సంగతి తెలిసిందే.ఇప్పటికీ ఆ కేసుల విచారణ కొనసాగుతున్నది.కమల-వాల్జ్‌ రంగంలోకి దిగటంతో అంతకు ముందు బైడెన్‌ మీద ఉన్న వ్యతిరేకత, హత్యాప్రయత్నంతో వచ్చిన ఆధిక్యత ఆవిరైపోతుండటంతో గతాన్ని పునరావృతం కావించేందుకు పూనుకున్నాడని అనేక మంది భావిస్తున్నారు.గత ఎన్నికను వమ్ము చేసేందుకు చూసిన దేశమంతటా ఉన్న గాంగులో 35 మంది ఇప్పటికీ ప్రభుత్వంలో వివిధ బాధ్యతల్లో ఉన్నారు, వారు తిరిగి రెచ్చిపోవచ్చు.అయితే గత అనుభవాలను గమనంలో ఉంచుకొని సరికొత్త పద్దతుల్లో వారు ప్రవర్తించవచ్చని కూడా హెచ్చరికలు వెలువడ్డాయి.


జో బైడెన్‌తో జరిపిన తొలి సంవాదం సందర్భంగా ట్రంప్‌ ఇతరుల సాయం తీసుకున్నాడు. మారిన పరిస్థితుల్లో కమలా హారిస్‌తో ఎన్నికల సంవాదానికి డోనాల్డ్‌ ట్రంప్‌కు మాజీ మిలిటరీ అధికారిణి, డెమోక్రటిక్‌ పార్టీ మాజీ పార్లమెంటు సభ్యురాలు, తరువాత రిపబ్లికన్‌ పార్టీకి ఫిరాయించిన తులసీ గబ్బార్డ్‌ సాయం కావాల్సి వచ్చింది. డెమోక్రటిక్‌ పార్టీలో ఉండగా కమలా హారిస్‌ మంచి చెడ్డలు, ఆమె రాజకీయ, ఇతర అంశాల పట్ల అవగాహన ఉన్న వ్యక్తి తులసి. 2020లో అధ్యక్ష పదవి అభ్యర్థిత్వం కోసం కమలాహారిస్‌తో పాటు పార్టీలో పోటీ పడింది. 2022లో ఆమె రిపబ్లికన్‌ పార్టీలో చేరింది. అందుకే ట్రంప్‌ ఆమెను ఎంచుకున్నాడు. తులసి తిరోగమన భావాలు ట్రంప్‌కు ప్రతిరూపంగా ఉంటాయి. అమెరికా ఎన్నికల్లో పోటీకి దిగిన వారు ఎంత సీనియర్లు అయినా ఓటర్లను ఆకర్షించేందుకు అనుసరించాల్సిన అంశాలు, చర్చ సందర్భంగా ప్రదర్శించాల్సి హావభావాలు తదితర అంశాలన్నింటి మీద ఆయా రంగాలలో నిపుణులుగా పేరుపొందిన వ్యక్తులు, సంస్థల ప్రతినిధుల వద్ద శిక్షణ తీసుకుంటారు. కమలా హారిస్‌ కూడా నాలుగుదశాబ్దాల క్రితం తాను చదివిన వాషింగ్టన్‌లోని హౌవార్డ్‌ విశ్వవిద్యాలయంలో శిక్షణా తరగతులకు హాజరైంది.డోనాల్డ్‌ ట్రంప్‌ గతం, అతను ఎలాంటి వాడు, బలం, బలహీనతలు తదితర అంశాలపై అవగాహన పెంచుకొనేందుకే ఈ కసరత్తు.


తులసీ గబ్బార్డ్‌ను ఎంచుకోవటంలో తనకూ కమలతో సమానమైన మహిళ తులసి మద్దతు ఉందని చెప్పుకొనేందుకు, అమెరికాలో స్థిరపడిన హిందువుల ఓట్ల వేట కూడా ఇమిడి ఉంది..కమలా హారిస్‌ భారతీయ మూలాలు ఉన్న ఆఫ్రికన్‌. ఆమె తల్లి శ్యామలా గోపాలన్‌, భారతీయురాలు. తండ్రి డోనాల్డ్‌ జె హారిస్‌ జమైకా నుంచి అమెరికా వచ్చాడు. వారి సంతానమే కమలా హారిస్‌.సోదరి పేరు మాయా హారిస్‌. తలిదండ్రులు విడిపోవటంతో తల్లిదగ్గరే పెరిగారు, ఆఫ్రికన్లే వారిని ఆదరించారు.అదే వాతావరణంలో ఎదిగారు.తులసీ గబ్బార్డ్‌ తల్లి కరోల్‌ అమెరికా ఇండియానా రాష్ట్ర పౌరురాలు కాగా తండ్రి మైక్‌ గబ్బార్డ్‌ ఐరోపా మూలాలున్న వలస కుటుంబానికి చెందిన వ్యక్తి. అమెరికాకు చెందినప్పటికీ దానిలో విలీనం కాని దక్షిణ పసిఫిక్‌ సముద్రంలోని సమోవా దీవుల్లో జన్మించాడు. వారు హవాయి చేరిన తరువాత కరోల్‌ హిందూమతం పట్ల ఆకర్షితురాలు కావటమే గాన తన ఐదుగురు బిడ్డలకు హిందువుల పేర్లు పెట్టింది. వారిలో తులసి ఒకరు.ఆమె తాను చైతన్య వైష్ణవ సంప్రదాయాన్ని అనుసరిస్తున్నట్లు చెప్పుకుంటుంది.డెమోక్రటిక్‌ పార్టీలో ఉన్నపుడు 2020 ఎన్నికల్లో పార్టీలో కమలతో పోటీపడి ఒకరి మీద ఒకరు దుమ్మెత్తి పోసుకున్నారు. అయితే కమల కంటే తులసికి తక్కువ ఓట్లు వచ్చాయి. తరువాత ఇద్దరూ పోటీ నుంచి తప్పుకొన్నారు. జో బైడెన్‌ తన ఉపాధ్యక్ష అభ్యర్ధిగా కమలను ఎంచుకోవటంతో సహించలేక తరువాత తులసీ పార్టీ ఫిరాయించారు.మన దేశంలో ఉన్నట్లే అమెరికాలో కూడా జ్యోతిష్కులకు కొదవ లేదు.ఈ ఎన్నికల్లో ఎవరు గెలిచేదీ, ఓడేదీ జోశ్యాలు మొదలయ్యాయి. డోనాల్డ్‌ ట్రంప్‌కు పరిస్థితి నల్లేరు మీద బండిలా లేకపోయినప్పటికీ వచ్చే ఎన్నికల్లో గెలుస్తాడని ఆమీ ట్రిప్‌ అనే జ్యోతిష్కురాలు ఇండియా టుడేతో చెప్పింది.జో బైడెన్‌ బరినుంచి తప్పుకుంటాడని తాను సరిగానే చెప్పానని ఆమె చెప్పుకుంది. మీడియా సర్వేలు ఇప్పటి వరకు ఇచ్చిన విశ్లేషణల ప్రకారం కమలా హారిస్‌ ముందంజలో ఉన్నారు.