కమ్యూనిస్టు వ్యతిరేక ప్రచారం : నాడు తెలుగునాట – నేడు న్యూయార్క్‌ !

Tags

, , , , , ,

ఎం కోటేశ్వరరావు


ఎన్నికల్లో కమ్యూనిస్టులను ఓడిరచేందుకు 1950 దశకంలో నాటి కాంగ్రెస్‌ పార్టీ, కమ్యూనిస్టు వ్యతిరేకులు సాగించిన విష ప్రచారంలో పత్రికలు తమ వంతు పాత్రను పోషించాయి. కమ్యూనిస్టులు అధికారానికి వస్తే మహిళల మెడల మీద కాడి మోపి పొలాలను దున్నిస్తారని, జాతీయం చేస్తారని, సమానత్వం సాధించేందుకు గాను పొట్టిగా ఉన్న వేళ్లతో సమానం చేసేందుకు పొడుగువేళ్లను నరికివేస్తారని, తల మీద సుత్తితో కొట్టి కొడవలితో మెడనరికేస్తారని, ఇంకా ఏవేవో పచ్చి అబద్దాలను పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. ఇప్పుడు అమెరికాలోని న్యూయార్క్‌ నగరంలో నవంబరులో జరిగే ఎన్నికల్లో అదే జరుగుతోంది. డెమోక్రటిక్‌ పార్టీ తరఫున వామపక్ష భావజాలం కలిగిన జోహ్రాన్‌ మమ్‌దానీ అభ్యర్థిత్వాన్ని అడ్డుకొనేందుకు తొలుత ఆ పార్టీలోని మితవాదులు చేయని యత్నం లేదు. దాన్ని అధిగమించాడు. ఓటమికి పార్టీలతో నిమిత్తం లేకుండా అందరూ పని చేయాలని వ్యతిరేకులు పిలుపునిచ్చారు. వాటన్నింటినీ అధిగమిస్తూ జోహ్రాన్‌ 44శాతం, అదే పార్టీకి చెందిన న్యూయార్క్‌ రాష్ట్ర మాజీ గవర్నర్‌ ఆండ్రూ కుమో స్వతంత్ర అభ్యర్థిగా 25,, అదే పార్టీకి చెందిన ప్రస్తుత మేయర్‌, తిరుగుబాటు అభ్యర్థి ఎరిక్‌ ఆడమ్స్‌ ఏడు, రిపబ్లికన్‌ పార్టీ అభ్యర్థి కర్టిస్‌ స్లివా 12శాతం ఓటర్ల మద్దతు కలిగి ఉన్నట్లు సియేనా సర్వే సంస్థ ప్రకటించింది.(ఎగువ చిత్రంలో ఒక పురోగామి భావజాల వాదిగా పెంచిన తలిదండ్రులు మీరా నాయర్‌, మహమూద్‌ మమ్దానీతో జోహ్రానీ మమ్దానీ)

ఈ నేపధ్యంలో జోహ్రాన్‌పై కొన్ని పత్రికలు ప్రత్యక్షదాడులకు దిగుతుంటే కొన్ని మరోవిధంగా చేస్తున్నాయి.ఫాక్స్‌ న్యూస్‌ టీవీ యాంకర్‌ ఊగిపోతూ జోహ్రాన్‌ మమ్‌దానీ, అతని అనుచరులు కమ్యూనిస్టులు, తీవ్రవాదులు వారిని దెబ్బతీసేందుకు కమ్యూనిస్టులపై విషం చిమ్మటంలో నోటిదురుసుకు పేరు మోసిన జో మెకార్ధీని తిరిగి తీసుకురావాల్సిన అవసరం ఉందన్నాడు.ప్రజాస్వామ్యం అంటే ఆత్మహత్య బంధకం కాదని గుర్తించాల్సిన దశ వచ్చిందని, తీవ్రవాదులను న్యూయార్క్‌ వంటి గొప్పనగరంలో ఎన్నిక కావటానికి అనుమతించకూడదని, నగరాన్ని నాశనం కానివ్వకూడదంటూ విరుచుకుపడ్డాడు.కమ్యూనిస్టును కాదని ప్రజాస్వామిక సోషలిస్టును అని అతను చెప్పుకుంటున్నాడు, అది ఏ తరహా ప్రజాస్వామ్యం అతను ఎన్నిక కావటాన్ని సహించకూడదని, ఏదో విధంగా అడ్డుకోవాలన్నాడు.జోహ్రాన్‌ గడ్డం ఉన్న కమలాహారిస్‌ అని నోరుపారవేసుకున్నాడు. ప్రచ్చన్న యుద్ధంలో అమెరికా గెలిచినప్పటికీ మార్క్సిజం బతికిందని దాంతో విశ్వవిద్యాలయాల్లోని టీచర్లకు ధైర్యం వచ్చిందన్నాడు. అందువలన వలస వచ్చేవారిని, సిద్దాంతాలను ఎక్కించటాన్ని అడ్డుకోవాలి, కమ్యూనిస్టుకు ఓటువేయాలని, నగరనాశనాన్ని కోరుకొనే వారిని బయటకు నెట్టాలి. అందరం కూర్చుని కమ్యూనిస్టు ఎన్నికకాకుండా చూడాలి, అధికారికంగా నమోదు కాని, పౌరులు కాని వారు కూడా ఓట్లు వేస్తున్నారని ఆరోపించాడు.పురోగామివాదుల పట్ల మీడియాలో తిష్టవేసిన మితవాదులు ఎలా ఉన్నారో చెప్పేందుకు ఇదొక ఉదాహరణ మాత్రమే.


చిన్న చిన్న నేరాలు చేసినవారి మీద మోపిన ఆరోపణలను ఉపసంహరించాలని నేరాలు చేసిన వారిని సమర్ధిస్తున్నట్లు జోహ్రాన్‌ మీద తప్పుడు ప్రచారం చేస్తున్నారు. తీవ్ర సమస్యలు కాని వాటి మీద కేంద్రీకరించి వేధింపులకు పాల్పడవద్దని, చిన్న తప్పిదాలను పెద్ద నేరాలుగా చూడవద్దంటూ ఎన్నికల ప్రచారంలో పోలీసుల గురించి చెప్పిన మాటలను వక్రీకరించారు. చిన్న చిన్న తప్పిదాలకు సైతం కనీసం ఏడాది శిక్ష విధిస్తున్నప్పటికీ తగ్గటం లేదు. కనుక అలాంటి వాటి నివారణకు తీసుకోవాల్సిన చర్యలను ప్రభుత్వాలు, పౌరసమాజం కూడా పరిశీలించాల్సి ఉంది. అమెరికాలో ఎవరు ఏ మూలన ఎప్పుడు తుపాకీ తీసుకొని టపటపా మంటూ జనాలను ఎందుకు కాల్చిచంపుతారో తెలియని స్థితి.పౌర భద్రతలో పోలీసులు కీలక పాత్ర పోషించాల్సి ఉందని కానీ వారు చేయాల్సినదానిని చేయకుండా అడ్డుకుంటున్నారని జోహ్రాన్‌ పేర్కొన్నాడు. దాన్లో భాగంగానే బతుకుతెరవు కోసం శరీరాలను అమ్ముకుంటున్నవారిని వేధించవద్దని, దాన్నొకనేరపూరిత చర్యగా చూడవద్దని 2020లో న్యూయార్క్‌ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసినపుడు చేసిన ఒక వ్యాఖ్యను పట్టుకొని ఇంకేముంది న్యూయార్క్‌ నగరాన్ని వేశ్యలతో ముంచెత్తేందుకు పూనుకున్నాడు అంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారు.ఇప్పుడు మేయర్‌ ఎన్నికల్లో ఆ ప్రస్తావన ఎక్కడా చేయలేదు. పడుపు వృత్తి న్యూయార్క్‌ నగరంలో లేదా అమెరికా ఒక్క ఆదేశం ఏమిటి ప్రపంచమంతటా జోహ్రాన్‌ పుట్టక ముందే ఉంది. ప్రతి నగరంలో అలాంటి కార్యకలాపాలకు పేరుమోసిన ప్రాంతాల ఉండటం అందరికీ తెలిసిన పచ్చినిజం, న్యూయార్క్‌ నగరం దానికి మినహాయింపు కాదు. కొన్ని ప్రాంతాలలో పట్టపగలు బహిరంగంగానే అలాంటి వారు సంచరించటం బహిరంగరహస్యం. అలాంటి వృత్తి కొనసాగాలని ఎవరూ కోరుకోరు. కొన్ని దేశాల్లో చట్టబద్దం చేసి అనుమతిస్తున్నారు. పోలీసుల వేధింపులు, మాఫియా ముఠాల బారిన పడకుండా అభాగ్యులైన యువతులకు లైసన్సులు ఇవ్వాలని అనేక మంది తమ అభిప్రాయాలను వెల్లడిస్తున్నట్లే, వ్యతిరేకిస్తున్నవారూ ఉన్నారు. యావత్‌ ప్రపంచానికి తెలిసిన బ్యాంకాక్‌లో టూరిజం పేరుతో ఏం జరుగుతున్నదో అందరికీ తెలిసిందే. అక్కడ అధికారంలో ఉన్నది కమ్యూనిస్టులు కాదు, జూదకేంద్రాలు మూడుపువ్వులు ఆరుకాయలుగా వర్ధిల్లుతున్నాయి, అక్కడ కమ్యూనిస్టులు ఉన్నారా ? అంతెందుకు అమెరికాలోని నెవడా రాష్ట్రంలో పడుపు వృత్తి చట్టపరంగానే చేయవచ్చు. అక్కడ అధికారంలో ఉన్నది రిపబ్లికన్‌ పార్టీ, దాని గురించి ఎక్కడా మీడియా చర్చించదేం ? నెవడాలో మాదిరి చట్టబద్దంగా వేశ్యావృత్తి జరుగుతున్నచోట సంఘటిత నేరాలు, అమ్మాయిల క్రయ విక్రయాలు కూడా ఎక్కువగానే ఉన్నట్లు సమాచారం వెల్లడిస్తున్నది.న్యూయార్క్‌లో అదే రిపబ్లికన్‌ పార్టీ అభ్యర్థిగా పోటీలో ఉన్న కర్టిస్‌ స్లివా దొరికిందే సందన్నట్లు జోహ్రాన్‌ ఎన్నికైతే న్యూయార్క్‌ నగరం ఒక వేశ్యావాడగా మారుతుందని కబుర్లు చెబుతున్నాడు. గురివిందగింజ తన కింది నలుపు చూసుకోదని పెద్దలు ఊరికే అనలేదు.

జోహ్రాన్‌ గెలిస్తే కుటుంబాలు నాశనం అవుతాయంటూ చేస్తున్న ప్రచారం కూడా దాడిలో భాగమే. అమెరికాలో వివాహాలు, విడిపోవటాలు, అసలా బంధంతో నిమిత్తం లేకుండా పిల్లల్ని కనటం, పెంచటం ఇవన్నీ తెలిసిన వారికి జోహ్రాన్‌ మీద చేస్తున్న ప్రచారానికి కారణం మరింతగా అర్ధం అవుతుంది.మన దేశంలో ఉమ్మడి కుటుంబాలు ఎంతో వేగంగా అంతరించిపోయాయి, దీనికి కారణం కమ్యూనిస్టులు, పురోగామి వాదులా, పెళ్లయిన మరుసటి రోజే పెటాకులవుతున్న వివాహాలకు వారు కారకులా ? కానే కాదు.మనకంటే పెట్టుబడిదారీ వ్యవస్థ మరింతగా ఎదిగిన అమెరికా సమాజంలో జరుగుతున్న పరిణామాలకు కమ్యూనిస్టులు ఎలా కారణం అవుతారు. మనదేశంలో తలిదండ్రులు చేస్తున్న బలవంతపు వివాహాల వలన ఒకరినొకరు ఎలా చంపుతున్నారో ఈ రోజు ఏ టీవీ చూసినా పత్రికను చదివినా ఎక్కడో ఒక దగ్గర జరిగిన ఉదంతాల గురించి తెలియదా ! సమాజపోకడలను గమనించిన వారు కమ్యూనిస్టులైనా మరొకరైనా కుటుంబవ్యవస్థ అంతరించే అవకాశం ఉందని చెప్పి ఉండవచ్చు.అంతమాత్రాన అలా చెప్పారు గనుక వారు మేయర్‌గా గెలిస్తే లేదా అధికారానికి వస్తే కుటుంబాలను సాగనివ్వరని చెప్పటం విపరీతం తప్ప మరొకటి కాదు. అది సమాజం నిర్ణయించుకుంటుంది. వివాహంతో నిమిత్తం లేకుండా వయస్సు వచ్చిన స్త్రీ, పురుషుల సహజీవనాన్ని న్యాయవ్యవస్థ అంగీకరిస్తున్న విషయం తెలియదా !


జోహ్రాన్‌ మమ్దానీ ముందుకు తెస్తున్న నగర, వలస కార్మికులు, కుటుంబాలు, మొత్తంగా కార్మికులు ఎదుర్కొంటున్న గృహ, ఇతర సమస్యల గురించి ప్రత్యర్థులు, మీడియా కావాలనే మౌనం వహిస్తున్నది. ఇప్పటి వరకు న్యూయార్క్‌ రాష్ట్ర గవర్నర్‌, నగర మేయర్‌గా ఉన్నది డెమోక్రటిక్‌ పార్టీ వారే, ఆ నేతలే ఇప్పుడు పోటీలో ఉన్నారు.పౌర సమస్యల గురించి మాట్లాడితే మీరు చేసిందేమిటనే ప్రశ్నవారికి ఎదురువుతుందిగనుక తేలుకుట్టిన దొంగల్లా వ్యవహరిస్తున్నారు.అమెరికాలో ఎన్నికలు ఏవైనా డబ్బుతో కూడుకున్నవే. అభ్యర్థులకు సానుభూతి పరులు ఇస్తున్న విరాళాలు కూడా అభిమానానికి కొలబద్దగా ఓటర్లు చూస్తారు.ఆగస్టు రెండవ వారానికి జోహ్రాన్‌ 10.51లక్షల డాలర్లు వసూలు(సగటున ఒక్కో విరాళ మొత్తం 121 డాలర్లు) కాగా, ప్రత్యర్థులుగా ఉన్న మాజీ గవర్నర్‌ కుమో 5.41లక్షల డాలర్లు (సగటు 646), ఎరిక్‌ ఆడమ్స్‌ 4.25లక్షలు(770 ), రిపబ్లికన్‌ అభ్యర్థి 4.07లక్షల డాలర్లు పొందారు. సగటు విరాళం తక్కువగా ఉండటాన్ని బట్టి జోహ్రాన్‌కు పేద, మధ్య తరగతి మద్దతు ఎక్కువగా ఉన్నట్లు స్పష్టంగా కనిపిస్తున్నది.నగరంలో ఇళ్ల అద్దెల పెంపుదలను స్థంభింపచేయాలని, ఉచిత బస్‌ ప్రయాణం, శిశు సంరక్షణ, నగరపాలక సంస్థ ఆధ్వర్యాన లాభనష్టాలు లేని ప్రాతిపదికన నిత్యావసర వస్తు దుకాణాల నిర్వహణ, స్కూళ్లు, కాలేజీలకు సబ్సిడీ వంటి వాగ్దానాలను అమలు చేస్తానని జోహ్రాన్‌ తన ప్రణాళికలో పేర్కొన్నాడు.

ఎలాగైనా సరే వామపక్ష అభ్యర్థి గెలవకుండా చూడాలనే ప్రయత్నాలు జరుగుతున్నాయి.మమ్దానీ ఓడిపోవాలంటే రిపబ్లికన్‌ పార్టీ అభ్యర్థి స్లివా రంగం నుంచి తప్పుకొని తనకు మద్దతు ఇచ్చే అవకాశం ఉన్నట్లు తన మద్దతుదార్లతో ఆండ్రూ కుమో చెబుతున్నట్లు పొలిటికో పత్రిక రాసింది.మమ్దానీ నూటికి నూరుశాతం కమ్యూనిస్టు పిచ్చోడని స్వయంగా వర్ణించినందున డోనాల్డ్‌ ట్రంప్‌కు నిదరపట్టటం లేదని కుమో చెబుతున్నాడు. ఇప్పటి నుంచి నవంబరులో ఎన్నికలు జరిగేలోగా అనేక పరిణామాలు జరగవచ్చని గతవారంలో చెప్పాడు. ‘‘ అసెంబ్లీ సభ్యుడు(జోహ్రాన్‌ మమ్దానీ) ఎవరో, అతను దేనికి ప్రాతినిధ్యం వహిస్తున్నాడో, వివిధ అంశాలపై అతని వైఖరి ఏమిటో తెలియనంతగా జనం ఉన్నారని నేను అనుకోవటం లేదు.కనుక అతని గురించి మరింతగా తెలుసుకుంటారు, అతన్ని అభిమానించటం తగ్గిస్తారు… అతని ఆకర్షణ నాటకీయంగా పడిపోనుంది ’’ అని చెప్పినట్లు పొలిటికో రాసింది. మమ్దానీ విజయాన్ని అడ్డుకోవాలంటే పార్టీ అభ్యర్థి కర్టిస్‌ స్లివాకు బదులు కుమోకు మద్దతు ఇవ్వాలని ట్రంప్‌, ఇతర నేతలు తమకు విశ్వాసపాత్రులుగా ఉన్న రిపబ్లికన్‌ పార్టీ వారికి చెబుతారని ఆండ్రూ కుమో లెక్కలు వేసుకుంటున్నట్లు వేరే మీడియా పేర్కొన్నది. ఆ విషయాలను స్వయంగా కుమో చెప్పినట్లు ఆడియో ఆధారం లభించినట్లు వెల్లడిరచింది.


తాను డోనాల్డ్‌ ట్రంప్‌ నుంచి ఎలాంటి సహాయం పొందటం లేదని అలాంటి ఆలోచన కూడా లేదని ఆండ్రూ కుమో చెప్పాడు. పోటీ గురించి ట్రంప్‌తో మాట్లాడినట్లు న్యూయార్క్‌ టైమ్స్‌లో వచ్చిన వార్తలను తోసిపుచ్చాడు. గవర్నర్‌గా ఉండగా ట్రంప్‌ను వ్యతిరేకించిన కుమో ఇప్పుడు అతగాడి సాయం కోరుతున్నాడని, ట్రంప్‌తో ఉన్న సంబంధాల గురించి అవాస్తవాలు చెబుతున్నాడని జోహ్రాన్‌ విమర్శించాడు. ప్రముఖ మీడియా యజమాని జిమీ ఫింక్లెస్టయిన్‌ ఇంట్లో సమావేశమైన ట్రంప్‌ మద్దతుదార్లు పరిస్థితిని సమీక్షించి కుమో ఎలా పోటీ ఇవ్వగలడో ట్రంప్‌కు నివేదించినట్లు కూడా న్యూయార్క్‌టైమ్స్‌ రాసింది. ట్రంప్‌తో నేరుగా మాట్లాడితే ఫలితం ఉంటుందేమో అని ఒక మద్దతుదారు కుమోను అడగ్గా ట్రంప్‌కు అన్నీ తెలుసు తనకు మద్దతు ఇచ్చే అవకాశాలు ఉన్నాయని అన్నాడు. అయితే అతని మద్దతుదార్లు ఓటర్లను తప్పుదారి పట్టించేందుకు తాము ఎవరినీ మద్దతు అడిగేది లేదని మమ్దానీని ఓడిరచేందుకు తమనేతే సరైన వ్యక్తి అని ప్రకటనలు చేస్తున్నారు. మమ్దానీ వ్యతిరేక ఓట్లు చీలకుండా ఉండాలంటే తనకు మద్దతు ఇవ్వాలని మరోపోటీదారు, ప్రస్తుత డెమోక్రటిక్‌ పార్టీ మేయర్‌ ఎరిక్‌ ఆడమ్స్‌ను కుమో కోరినట్లు వార్తలు. కుమోను ట్రంప్‌ బలపరుస్తున్నాడని, ఎన్నికల్లో రిగ్గింగ్‌ జరిపేందుకు కుట్ర చేస్తున్నారని మమ్దానీ ప్రతినిధి డోరా పెకీ ఒక ప్రకటనలో హెచ్చరించారు. చివరికి ఏం జరుగుతుందో ఇప్పుడే ఊహించి చెప్పలేము గానీ ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్న మమ్దానీ గురించి సర్వేలన్నీ ఇప్పటి వరకు ముందంజలో ఉన్నట్లు వెల్లడిస్తున్నాయి. ఈ ఎన్నిక ఫలితం ఎలా ఉన్నప్పటికీ అది ఒక్క అమెరికాలోనే కాదు యావత్‌ ప్రపంచ దృష్టిని ఆకర్షించనున్నదంటే అతిశయోక్తి కాదు !

పాడు జీవితమూ…పదకొండేళ్ల మోడీ ముచ్చటా : హత ఆత్మనిర్భరతా ! చివరికి ఎరువుల కొరతను కూడా చైనా చుట్టూ తిప్పాలా !!

Tags

, , , , ,

ఎం కోటేశ్వరరావు


ఎరువుల కొరత ! దీనికి ఎవరిని తప్పు పట్టాలి ? దేశంలో ఏం జరిగినా చివరికి సూర్యుడు తూర్పున ఉదయించి పడమర అస్తమించినా నరేంద్రమోడీ కారణంగానే జరుగుతోందని చెబుతున్నారు కదా ! మరి ఎరువుల కొరతకు నెహ్రూ బాధ్యుడని అని అందామా, కుదరదే !! సుత్తిలేకుండా సూటిగా చెప్పుకుందాం. కేంద్ర వ్యవసాయ మంత్రిత్వశాఖ సమాచారం ప్రకారం 2025 ఆగస్టు ఒకటవ తేదీ నాటికి యూరియా నిల్వ 37.19 లక్షల టన్నులు ఉంది. అంతకు ముందు ఏడాది అదే తేదీతో పోలిస్తే 49.24లక్షల టన్నులు తక్కువ. తెలంగాణా కాంగ్రెస్‌ ప్రభుత్వం తగినంతగా నిల్వచేయని కారణంగా యూరియా కొరత ఏర్పడిరది తప్ప కేంద్రానిది తప్పేమీ లేదని చెప్పే బిజెపి నేతల ధైర్యానికి మెచ్చుకోవాలి. ఆంధ్రప్రదేశ్‌ కొత్తగా రెండిరజన్ల పాలనలోకి వెళ్లింది. అక్కడ కూడా యూరియా రావాల్సినంత రాలేదని తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ నేత లావు శ్రీకృష్ణదేవరాయలు కేంద్రానికి మొరపెట్టుకున్నారు. బిజెపి పాలిత రాష్ట్రాల్లో కూడా యూరియా కోసం రైతులు బారులు తీరుతున్నారని ఎంతగా దాచిపెట్టినా వార్తలు వెలువడుతూనే ఉన్నాయి. గల్లీ నుంచి ఢల్లీి వరకు బుకాయిస్తున్న బిజెపి నేతలవి నోళ్లా మరొకటా అని రైతులు అనుకుంటున్నారు. కొందరు బిజెపి పెద్దలు నానో యూరియా గురించి రైతులు పట్టించుకోవటం లేదని నెపం వారి మీద నెడుతున్నారు. దీన్ని పుండు మీద కారం చల్లటం అంటారు.


కావాల్సింది ఎలుకను పడుతుందా లేదా అని తప్ప పిల్లి నల్లదా తెల్లదా అని కాదు. జనాల మెదళ్లలో మతోన్మాదాన్ని ఎక్కించేందుకు చూపిన శ్రద్ధ నిజంగా నానో యూరియా గురించి చూపారా ? అదే పరిష్కారమే అయితే రైతాంగాన్ని చైతన్య పరిచేందుకు తీసుకున్న శ్రద్ద ఏమిటి ? తమకు లబ్ది చేకూర్చే ప్రతి నవ ఆవిష్కరణను ఆహ్వానించి ఆమోదించిన మన రైతన్న నానో పట్ల ఎందుకు విముఖత చూపుతున్నట్లు ? పంజాబ్‌ వ్యవసాయ విశ్వవిద్యాలయం సంప్రదాయ మరియు నానో యూరియా వాడక ఫలితాల గురించి రెండు సంవత్సరాల పాటు అధ్యయనం చేసింది. గుళికల రూపంలో వాడిన పొలాల కంటే నానో ప్రయోగ క్షేత్రాల్లో గోధుమల దిగుబడి 21.6,వరిలో 13శాతం చొప్పున తగ్గినట్లు తేలింది.2020 నుంచి 2022వరకు పరిశీలన జరిగింది. అయినప్పటికీ 45 కిలోల యూరియా స్థానంలో 500 మిల్లీ లీటర్ల ద్రవరూప నానో యూరియా అదే ఫలితాలను ఇస్తుందంటూ మార్కెటింగ్‌ ప్రారంభించిన ఇఫ్‌కో, కేంద్ర ప్రభుత్వం కూడా ఊదరగొడుతున్నాయి. అంతే కాదు, ఇది వాడిన పొలాల్లో పండిన గింజల్లో ప్రొటీన్‌ కూడా తక్కువగా ఉంటుందని తేలింది. ప్రొటీన్లకు గింజల్లో నైట్రోజన్‌ అవసరం. వరుసగా వాడితే దిగుబడుల తగ్గుదల ఇంకా ఎక్కువగా ఉంటుందని శాస్త్రవేత్తలు చెప్పారు. ఇఫ్‌కో చెప్పినట్లుగా వాడిన పొలాల్లో పండిన వరిలో 17, గోధుమల్లో 11.5శాతం నైట్రోజన్‌ తక్కువగా ఉన్నట్లు తేలింది. దీనికి తోడు సాధారణ యూరియా కంటే దీని తయారీ ఖర్చు పదిరెట్లు ఎక్కువ. అంటే ఒక 45కిలోల యూరియా బస్తా రు.242 కాగా దానికి ఎన్నో రెట్ల ధరతో కొనుగోలు చేస్తే గోడదెబ్బ చెంపదెబ్బ మాదిరి వ్యవసాయ ఖర్చు పెరిగి, దిగుబడి తగ్గి రైతులకు గిట్టుబాటుగాక, వినియోగదారులకు ప్రొటీన్లు అందకపోతే నానో యూరియా తయారీ పారిశ్రామికవేత్తల లాభాల కోసం తప్ప దేనికి ప్రోత్సహిస్తున్నట్లు ?


దేశంలో యూరియా నిల్వలు అంతగా పడిపోవటానికి కారకులు ఎవరు ? మోడీ సర్కార్‌ కాసుల కక్కుర్తే. పిసినారి వాళ్లకు కూడా ముందు చూపు ఉంటుంది. కేంద్ర ప్రభుత్వానికి అది కూడా ఉన్నట్లు లేదు. మే నెలలో టన్ను యూరియా దిగుమతి ధర నాలుగువందల డాలర్లకు అటూ ఇటూ ఉండగా ఇప్పుడు 530 ఉన్నట్లు వార్త. ఎవడబ్బ సొమ్మని రామచంద్రా అని భద్రాచల రామదాసు అన్నట్లుగా ఎవరూ అడిగేవారు లేరనేగా ఇప్పుడు దిగుమతులకు హడావుడి పడటం, దీనిలో కూడా ఏమైనా అమ్యామ్యాలు ఉన్నాయా ? ఈ ఏడాది వర్షాలు పుష్కలంగా పడతాయని వాతావరణ శాఖ చెప్పింది, అదే జరిగితే పంటల సాగు పెరుగుతుందని గ్రహించటానికి కేంద్రంలో వ్యవసాయం గురించి తెలిసిన వారు ఉంటేగా, అదానీ ‘‘ వ్యవసాయం ’’ కూడా చేసినా కాస్త బాగుండేమో ! ఇప్పుడు చైనా నుంచి అధిక ధరలకు దిగుమతి చేసుకొనేందుకు నిర్ణయించినట్లు చెబుతున్నారు, అది రావాలన్నా కనీసం నెలన్నర పడుతుందని వార్తలు.చేతి చమురు వదులుతున్నది, రైతాంగం నుంచి విమర్శలు సరేసరి. ప్రభుత్వాల నుంచి అనేక రాయితీలు పొందిన ప్రైవేటు రంగ కాకినాడ నాగార్జున ఎరువుల కంపెనీ మామూలు యూరియా బదులు గ్రీన్‌ అమోనియా తయారు చేసి విదేశాలకు ఎగుమతి చేసి లాభాలు పొందుతున్నదని వార్త.ప్రభుత్వమే పట్టనట్లు ఉంటే ప్రైవేటు కంపెనీల గురించి చెప్పేదేముంది.

ఒక్క యూరియా విషయంలోనే కాదు అన్ని ఎరువుల పరిస్థితి కాస్త అటూ ఇటూగా అంతే. డిఏపి నిల్వలు గతేడాది 15.82లక్షల టన్నులుండగా ఆగస్టు ఒకటి నాటికి ఈ ఏడాది 13.9లక్షల టన్నులు, కాంప్లెక్స్‌ ఎరువులు 46.99లక్షల టన్నులకు గాను 34.97ల.టన్నులు, ఎంఓపి 8లక్షలకు గాను 6.27లక్షల టన్నులు ఉండగా సూపర్‌గా రైతులు పిలిచే ఎస్‌ఎస్‌పి మాత్రం గతేడాది కంటే స్వల్పంగా ఎక్కువగా నిల్వలు ఉన్నాయి.పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో పలువురు ఎంపీలు ఎరువుల గురించి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.తమ ప్రాంతాల్లో ఎదుర్కొంటున్న సమస్యల గురించి వివరించారు.యూరియా తరువాత ఎక్కువగా వినియోగించేది డిఏపి.చైనా నుంచి 2023`24లో 22.28లక్షల టన్నులు దిగుమతి చేసుకోగా మరుసటి ఏడాది 8.47ల.టన్నులు, ఈ ఏడాది జూలైలో కేవలం 97వేల టన్నులు మాత్రమే దిగుమతి చేసుకున్నట్లు ఎరువులు, రసాయనాల సహాయ మంత్రి అనుప్రియ పటేల్‌ లోక్‌సభకు రాతపూర్వక సమాధానంలో చెప్పారు.చైనా ప్రభుత్వ తనిఖీ నిబంధనలే దీనికి కారణమన్నారు. పోనీ ఇతర దేశాల నుంచి ఆమేరకు దిగుమతి చేసుకున్నారా అంటే అదీ లేదు. అసలు కారణం ఏమంటే అంతర్జాతీయ మార్కెట్‌లో భారీగా ధర పెరగటమే, ఆ మొత్తాన్ని సబ్సిడీ రూపంలో ప్రభుత్వం భరించాలి గనుక అసలు దిగుమతులే నిలిపివేశారు.ఇదీ రైతుల పట్ల నరేంద్రమోడీ సర్కార్‌ శ్రద్ధ.కేంద్ర మంత్రి సమాచారం ప్రకారమే 2024 ఏప్రిల్‌లో టన్ను డిఏపి దిగుమతి ధర 542 డాలర్లు కాగా 2025 జూలైలో అది 800 డాలర్లకు చేరింది.మరోసారి 2022 నాటి పరిస్థితి తలెత్తే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నట్లు మీడియాలో వార్తలు వచ్చాయి. నాడు డిఏపి ధర టన్ను 900 నుంచి వెయ్యి డాలర్లు ఉండగా ఈ ఏడాది దాని తయారీలో కీలకమైన ఫాస్పరిక్‌ యాసిడ్‌ ధర 2025 జనవరి నుంచి మార్చి నెలలో 1,055 డాలర్లకు పెరగ్గా, జూలై మరియు సెప్టెంబరు మాసాలకు 1,258 డాలర్లకు చేరిందట. పులిమీద పుట్ర మాదిరి ధరలు పెరగటమే కాదు మన రూపాయి విలువ పతనం కావటంతో అది కూడా అదనపు భారాన్ని మోపుతున్నది.

ఫాస్పేట్‌, పొటాష్‌, డిఏపి వంటి ఎరువుల దిగుమతి మీద ఎలాంటి ఆంక్షలు లేవు.వాటిని ప్రైవేటు వారు తయారు చేయవచ్చు లేదా దిగుమతి చేయవచ్చు.ఎరువుల శాఖ మంత్రి జెపి నడ్డా లోక్‌సభకు రాతపూర్వకంగా తెలిపిన సమాచారం ప్రకారం గత ఐదు సంవత్సరాలలో చూస్తే మూడు సంవత్సరాలు డిఏపి ఉత్పత్తి తగ్గింది. 2022లో 43.47, 2023లో 42.93, 2024లో 37.69లక్షల టన్నుల(ఐదేండ్ల నాటి స్థితి) చొప్పున ఉత్పత్తి జరిగింది. 2023 జూన్‌ ఒకటి నాటికి 33.2, 2024లో 21.6, 2025 జూన్‌ నాటికి నిల్వలు 12.4లక్షల టన్నులకు తగ్గాయి. దీంతో అనేక ప్రాంతాల్లో బ్లాక్‌ మార్కెట్‌ లేదా అధిక ధరలకు కొనాల్సి వస్తోంది. నరేంద్రమోడీ ఎంతో ముందు చూపుగల నేత, 2014లో నిజమైన స్వాతంత్య్రాన్ని సాధించిన గొప్ప యోధుడని పొగుడుతున్నారు కదా ! అన్నీ కాంగ్రెసే చేసిందనే బొమ్మరిల్లు డైలాగులు వల్లించటం తప్ప పదకొండేండ్లలో చేసిందేమిటి ! ఎరువుల కొరత, అనిశ్చితికి పునాది కాంగ్రెస్‌ హయాంలో నూతన ఆర్థిక విధానాలలోనే పడిరది.వాటిని మరింత సమర్ధవంతంగా, వేగంగా అమలు జరుపుతున్నట్లు మోడీ చెప్పుకుంటున్నారు. చైనా నుంచి వినిమయ వస్తువులను చౌకగా దిగుమతి చేసుకొని తన పరిశ్రమలను అమెరికా మూసివేసింది లేదా పక్కన పెట్టింది. మన పాలకులు వారు కాంగ్రెస్‌ అయినా బిజెపి అయినా అదే విధంగా ప్రభుత్వ రంగ ఎరువుల పరిశ్రమలను పక్కన పెట్టారు(మూసివేసిన రామగుండ ఫ్యాక్టరీని తెరవటం తప్ప మోడీ ప్రభుత్వం కొత్తగా పెట్టింది లేదు). కోళ్లను పెంచటం ఎందుకు గుడ్లు, మాంసం దిగుమతి చేసుకుంటే పోలా అన్నట్లుగా పెట్టుబడి, కార్మికులు, వేతనాలు, ఒప్పందాలు ఇవన్నీ ఎందుకు దిగుమతి చేసుకుంటే పోలా అని మన పాలకులు అటువైపు చూశారు. ప్రపంచంలో పరిస్థితులన్నీ ఒకే విధంగా ఉండవనే లోకజ్ఞానాన్ని కోల్పోయారు.


2020 నవంబరు నుంచి 2021నవంబరు కాలంలో అంతర్జాతీయ మార్కెట్లో యూరియా టన్ను 280 డాలర్ల నుంచి 923, డిఏపి 366 నుంచి 804, ఎంఓపి 230 నుంచి 280, అమ్మోనియా 255 నుంచి 825 డాలర్లకు పెరిగింది.యుపిఏ 2010 నుంచి ఎన్‌డిఏ 2019వరకు పది సంవత్సరాల కాలంలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఎరువుల సబ్సిడీ కనిష్టంగా రు.65,836 కోట్లు, గరిష్టంగా రు.83,466 కోట్లు ఉండగా పదేండ్ల సగటు రు.73వేల కోట్లు. పైన చెప్పుకున్నట్లుగా అంతర్జాతీయ మార్కెట్లో ధరలు విపరీతంగా పెరగటంతో దిగుమతుల మీద ఆధారపడటం, ఏడాది పాటు సాగిన ఢల్లీి శివార్లలో రైతు ఉద్యమం కారణంగా సబ్సిడీ కూడా అనివార్యంగా పెంచాల్సి వచ్చిందని అంకెలే వెల్లడిస్తున్నాయి. 2020 నుంచి 2023వరకు కనిష్టంగా రు.1,31,229 కోట్లు, గరిష్టంగా రు.2,54,798 కోట్లు కాగా నాలుగేండ్ల సగటు రు.1,84,772 కోట్లు ఉంది. 2024లో ఈ మొత్తం లక్షా 90వేల కోట్ల రూపాయలు దాటింది. ఇంత మొత్తంలో సబ్సిడీలు ఇవ్వటానికి సిద్దపడుతున్నారు తప్ప ఆ మొత్తాలను పెట్టుబడులుగా పెట్టి ఉంటే ఎరువుల స్వయం సమృద్ధితో పాటు వేలాది మందికి మెరుగైన ఉపాధి దొరికి ఉండేది, ఎరువుల కోసం చైనా లేదా మరొక దేశాన్నో దేబిరించాల్సిన అవసరం ఉండేది కాదు కదా ! జనాభా అవసరాలకు అనుగుణంగా ఆహార ఉత్పత్తి కోసం అనేక దేశాల్లో ఎరువుల వినియోగం మనదేశంతో పోల్చితే ఎక్కువగా ఉంది. మన పక్కనే ఉన్న చైనాలో 2022లో హెక్టారుకు 397కిలోలు ఉండగా మనదేశంలో 193 కిలోలు మాత్రమే ఉంది. ముందుచూపు ఉన్న నేతలు, విధాన నిర్ణేతలు మన అవసరాలకు అనుగుణంగా ఉత్పత్తిని ఎందుకు పెంచలేకపోయారు !

నేడు ప్రతిదీ రాజకీయాలతో ముడిపెడుతున్న తీరు ప్రపంచమంతటా ఉంది. ఎవరూ తక్కువ తినటం లేదు. అందుకే ఎవరి మీదా ఆధారపడకుండా స్వయం సమృద్ధి సాధించాల్సిన అవసరం మరింత పెరిగింది. చైనాతో సాధారణ సంబంధాల పునరుద్దరణకు పూనుకున్న తరువాత అక్కడి నుంచి ఎరువుల దిగుమతికి అవకాశం దొరికిందనే వార్తలు వచ్చాయి. గాల్వన్‌లోయ ఉదంతాల తరువాత మనదేశం చైనా యాప్‌ల నిషేధం, పెట్టుబడుల మీద ఆంక్షలను విధించిన సంగతి తెలిసిందే. దీనికి తోడు అమెరికా, జపాన్‌, ఆస్ట్రేలియాలతో కలసి క్వాడ్‌గా చైనా వ్యతిరేకతకు పూనుకున్నట్లు మనమీద విమర్శలు వచ్చిన సంగతి కూడా తెలిసిందే.దానికి ప్రతిగా చైనా మనం దిగుమతి చేసుకుంటున్న ఎరువులు, విలువైన ఖనిజాలు, విద్యుత్‌ వాహనాలకు అవసరమైన మాగ్నెట్లు, ఇతర విడి భాగాల మీద ఆంక్షలు విధించటం బహిరంగరహస్యం. ఇరుగుపొరుగుదేశాలతో మన జాగ్రత్తలో మనముండటం తప్పు కాదు గానీ మన స్వతంత్ర విదేశాంగ విధానంలో భాగంగా ఎవరితోనూ శతృత్వం పెంచుకోవాల్సిన అవసరం లేదు. అమెరికా రాజకీయంలో పావుగా మారకూడదు. మన మీద దాని వస్తువులను రుద్దటానికి పన్నుల ఖడ్గాన్ని మన మీద రaళిపించటాన్ని చూస్తున్నాం. అనువుగాని చోట అధికులమనరాదని మన పెద్దలు చెప్పిన సూక్తిని సదా గుర్తుంచుకోవాలి. అదే సమయంలో తలెత్తే ఇబ్బందుల గురించి మూడు చేపల కథలో మాదిరి దీర్ఘదర్శిగా ఉండాలి. మనం చర్చించుకున్నది ఎరువుల గురించి గనుక గతంలో మోడీ ఏలుబడి పదకొండు సంవత్సరాల్లో ఈ రంగంలో ముందుచూపులేక కోట్లాది మంది రైతాంగాన్ని కేంద్ర ప్రభుత్వం ఇబ్బందుల్లోకి నెట్టింది.మన ఆహార పంటల దిగుబడులు, భద్రతకూ ఈ వైఖరి నష్టదాయకమే, జనం ఆలోచించాలి మరి !

చరిత్ర గమనాన్ని మార్చివేస్తున్న కమ్యూనిస్టులు : ప్రతిభావంతులను ఆకర్షిస్తున్న చైనా, బెంబేలెత్తుతున్న అమెరికా !

Tags

, , , , , ,


ఎం కోటేశ్వరరావు


అవును ఎవరు అవునన్నా కాదన్నా, మరొకటన్నా ఇది నిజం. సూర్యుడు తూర్పున ఉదయించి పశ్చిమాన అస్తమిస్తున్నట్లుగా మేథావులందరూ పశ్చిమదేశాలలోనే పుట్టారు, మిగతా దేశాల వారు అక్కడికే వెళతారు అన్నట్లుగా కొందరు చాలాకాలంగా జనాల మెదళ్లకు ఎక్కించారు. ఇప్పుడు చైనా కమ్యూనిస్టులు దాన్ని తలకిందులు చేస్తున్నారు. గత శతాబ్దిలో ప్రపంచాన్ని ఏలిన చమురుకు ప్రాధాన్యత కొనసాగుతూనే ఉంది. అయితే అదే సర్వస్వం కాదని తేలిపోయింది. దాన్ని పక్కన పెట్టే ‘‘ ప్రతిభ ’’ ప్రత్యామ్నాయ హరిత ఇంథనం, క్వాంటమ్‌, కృత్రిమ మేథ వంటి రూపాల్లో ముందుకు వస్తున్నది. చమురుతో పని లేకుండా నడిచే విద్యుత్‌ వాహనాలు రోడ్లను ముంచెత్తటం తెలిసిందే. ఈ పూర్వరంగంలో శాస్త్ర, సాంకేతిక రంగాల్లో 2035 నాటికి అమెరికాను అధిగమించేందుకు చైనా నడుంకట్టటం గురించి కొద్ది నెలలుగా మీడియాలో విశ్లేషణలు వెలువడుతున్నాయి, అవేవీ కమ్యూనిస్టులు నడిపేవి కాదు, చివరికి కరడుగట్టిన ఆర్‌ఎస్‌ఎస్‌ వాదుల పచ్చి కమ్యూనిస్టు వ్యతిరేక పత్రిక ‘‘స్వరాజ్య ’’లో 2025 జూన్‌ 27న అమిత్‌ మిశ్రా అనే విశ్లేషకుడు కూడా రాశారు.దాన్ని నవీకరించి ఆగస్టు మూడున తిరిగి ప్రచురించారు. ‘‘ మేథోవంతుల ఆకర్షణ : వేయి ప్రతిభల చైనా వ్యూహం దాని ఔన్నత్యాన్ని ఎలా ముందుకు నెడుతున్నది ’’ అనే శీర్షిక( కోర్టింగ్‌ జీనియసెస్‌ : హౌ చైనా స్‌ థౌసెండ్‌ టాలంట్స్‌ స్ట్రాటజీ ఈస్‌ ఫ్యూయలింగ్‌ ఇట్స్‌ ఎసెంట్‌)తో ఒక విశ్లేషణ వెలుండిరది. ఇక్కడ దీన్ని ప్రస్తావించటం అంటే చైనాకు మిత,మతవాదుల సర్టిఫికెట్‌ లేదా ప్రశంసల గురించి కాదు. చైనా ఎలా దూసుకుపోతున్నదో చూడండి అనే ఉక్రోషం, అసూయ ప్రదర్శన దాని వెనుక ఉందని చెప్పేందుకే.


ఇక సందర్భానికి వస్తే ఈ ఏడాది అక్టోబరు ఒకటి నుంచి అంటే విప్లవదినోత్సం రోజు నుంచి చైనా ప్రభుత్వం ప్రపంచంలోని యువ ప్రతిభావంతులను ఆకర్షించేందుకు కె రకం వీసాలను జారీ చేయాలని నిర్ణయించింది. ఎందుకు అంటే 2035నాటికి శాస్త్ర, సాంకేతిక రంగాలలో అగ్రగామి దేశంగా మారేందుకు అక్కడి కమ్యూనిస్టు పార్టీ నిర్ణయించింది. కొత్తగా పట్టా పుచ్చుకున్న స్వదేశీయులు లేదా విదేశీ విశ్వవిద్యాలయాల నుంచి వచ్చిన వారు, ఇతర దేశాల్లో ఇప్పటికే ఆయా రంగాలలో పని చేస్తున్న వారిని ఆకర్షించేందుకు పూనుకుంది. ఇటీవలి కాలంలో చైనా విధాన నిర్ణయాలలో ఇది పెద్దదని భావిస్తున్నారు. తనకు ఎదురులేనంతవరకు చైనాను ఎదగనిచ్చిన అమెరికా ఎప్పుడైతే తన ఆధిపత్యానికి అన్ని రంగాలలో ప్రతిఘటన ఎదురవుతున్నదని గ్రహించిందో అప్పటి నుంచి అడ్డుకోవటం ప్రారంభించింది. వైట్‌హౌస్‌లో ఏ పార్టీ వారున్నా అదే చేస్తున్న పూర్వరంగంలో దానికి ధీటుగా చైనా కమ్యూనిస్టు పార్టీ చేసిన కసరత్తు నుంచి వెలువడిరదే తాజా నిర్ణయం. ప్రధాని లీ క్వియాంగ్‌ సంతకంతో అది చట్టంగా మారింది. స్టెమ్‌(సైన్సు, టెక్నాలజీ, ఇంజనీరింగ్‌, గణితం) రంగాలలో ప్రతిభావంతులైన విదేశీ యువతను ఆకర్షించేందుకు సరికొత్త ‘‘ యువ ప్రతిభ ’’ కె వీసా ప్రత్యేకత ఏమంటే చైనాలో ఉన్న కంపెనీల యజమానులు లేదా సంస్థల నుంచి సిఫార్సులు అవసరం లేదు.నేరుగా దరఖాస్తు చేసుకోవచ్చు. ఇప్పటికే అమల్లో ఉన్న ప్రతిభావంతులైన యువశాస్త్రవేత్తల కార్యక్రమంలో వయస్సు గరిష్ట పరిమితి 45 సంవత్సరాలు, మరో పధకానికి 40 ఏండ్లు. దీనికి ఎలాంటి పరిమితి నిబంధన లేదు. ఇతర దేశాలతో పోటీ పడుతూ వేతనాలు, వసతి, బోనస్‌, పిల్లలకు విద్య వంటి ఇతర సౌకర్యాలను కల్పిస్తారు.దేశ విధానానికి లోబడి పరిశోధనలో స్వేచ్చ ఉంటుంది. ఇప్పటి వరకు విదేశీ పెట్టుబడులకు ఎలాంటి రాయితీలు ఇచ్చి ప్రోత్సహించారో ఇప్పుడు ప్రతిభావంతులైన వారిని ఆకర్షించేందుకు అలాంటి విధానాన్నే ముందుకు తెచ్చారని చెప్పవచ్చు. ఇలాంటి ప్రత్యేక వీసాలు అమెరికా, కెనడా, బ్రిటన్‌, ఆస్ట్రేలియా వంటి దేశాల్లో ఎప్పటి నుంచో ఉన్నాయి.

అమెరికాలో చైనా సంతతికి చెందిన వారి మీద పెరుగుతున్న జాత్యహంకార వివక్ష, ఆంక్షలు, పరిశోధనలకు కేటాయింపుల కోత, గూఢచర్య ఆరోపణలతో వేధింపులు, రెండు దేశాల మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతల పూర్వరంగంలో అనేక మంది అక్కడి నుంచి బయటపడేందుకు చూస్తున్నారు. మంచి పండ్లను ఏరి దిగుమతి చేసుకున్నట్లుగా దశాబ్దాల తరబడి, అమెరికా, ఇతర పశ్చిమ దేశాలు మేథోవలసతో ఎంతగానో లబ్దిపొందాయి. ఇప్పుడు అటునుంచి వలసలకు చైనాతో నాంది పడిరదంటే అతిశయోక్తి కాదు. అయితే ఇది ఒక్క రోజులో జరిగింది కాదు.చైనా కమ్యూనిస్టు పార్టీ నేత లి యువాన్‌చావో 2008లో ‘‘వేయి ప్రతిభావంతుల పథకాని(టిటిపి)కి రూపకల్పన చేశారు .విదేశాల్లో ఉన్న చైనా సంతతికి చెందిన వారిలో కనీసం రెండువేల మందిని స్వదేశానికి ఆహ్వానించి ఒక నవకల్పన సమాజంగా దేశాన్ని మార్చాలని తలపెట్టారు. 2011ఈ పథకాన్ని అమల్లోకి తెచ్చినపుడు ఏటా 50 నుంచి వందమందిని పదేండ్ల పాటు ఆకర్షించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అయితే దానికి మించి ఇప్పటి వరకు ఏడువేల మంది శాస్త్రవేత్తలు, ఆర్థికవేత్తలు,వాణిజ్య,పారిశ్రామికవేత్తలు వచ్చారని అంచనా, వారిలో ఇతర దేశాలకు చెందినవారు కూడా ఉన్నారు. మరొక సమాచారం ప్రకారం 2010 నుంచి 2021 మధ్య కాలలో కనీసం 20వేల మంది చైనా జాతీయులు అమెరికా నుంచి స్వదేశానికి వెళ్లారు. ఇలాంటి వారు చూపుతున్న ప్రతిభను బట్టి మిలియన్ల యువాన్లను బోనస్‌, ఇతర రాయితీలను ప్రతిఫలంగా చెల్లించుతున్నారు. అమెరికా నుంచి వచ్చే వారు విద్రోహచర్యల నిమిత్తం వస్తున్నారా నిజంగానే పని చేసేందుకే అని నిర్ధారించుకొనేందుకు సునిశిత పరిశీలనలు కూడా చేశారని వార్తలు. ఈ పధకానికి చైనా పెద్ద ప్రచారం ఇవ్వలేదు గాని దాని తీరుతెన్నులు గమనించిన అమెరికా జాతీయ గూఢచార సంస్థ, ఎఫ్‌బిఐ గుండెలు బాదుకుంటూ నివేదికలు రూపొందించాయి. చైనా ఆర్థిక, మిలిటరీ రంగాలలో పురోగమించటానికి చట్టబద్దంగా, అక్రమ పద్దతుల్లో అమెరికా మేథో సంపదను చైనా కొల్లగొడుతున్నదని ఆరోపించారు. ఈ ప్రచారం పెరగటంతో చైనా కొత్త పద్దతుల్లో క్విమింగ్‌ పేరుతో ప్రతిభావంతులను ఆకర్షించేందుకు పూనుకుంది.2019 నుంచి 2023వరకు ఐదు వందలకు పైగా ప్రభుత్వ పత్రాలను పరిశీలించిన రాయిటర్స్‌ వార్తా సంస్థ చైనా ఇస్తున్న నగదు, ఇతర మొత్తాల గురించి పేర్కొన్నది.

దశాబ్దాలుగా భారత్‌, చైనా వంటి దేశాల నుంచి ఎందరో ప్రతిభావంతులు ఎక్కువగా అమెరికా, ఇతర పశ్చిమదేశాలకు వలస వెళ్లారు.వ్యక్తిగతంగా వారితో పాటు ఆయా దేశాల పురోభివృద్ధికి ఎంతగానో తోడ్పడ్డారు. ఆర్థికంగా నిలదొక్కుకొని ఎదగటం ప్రారంభమైన తరువాత మరింత ముందుకు పోవాలంటే అలాంటి అవసరం ఎంతో ఉందని చైనా కమ్యూనిస్టు పార్టీ గుర్తించింది.కమ్యూనిస్టులు ప్రతిభావంతుల మీద కూడా తమ సిద్దాంతాలను రుద్దుతారని, వారికి స్వేచ్చ ఇవ్వరని పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు.చైనా కమ్యూనిస్టులు దాన్ని కూడా గమనంలో ఉంచుకున్నారు. నూటనలభై కోట్ల జనాభా జీవితాలను ఉన్నత స్థితికి తీసుకువెళ్లాలంటే ఇంకా చేయాల్సింది చాలా ఉంది. దాన్లో భాగంగానే తమ దగ్గరలేని పెట్టుబడులను, సాంకేతిక పరిజ్ఞానాన్ని ఆహ్వానించారు. అవి తమ నుంచి లబ్దిపొందుతాయని తెలిసినప్పటికీ దాని కంటే తాము ఎక్కువ ప్రయోజనం పొందుతామనే ముందు చూపు, ధైర్యంతో ఎన్ని విమర్శలు వచ్చినా సంస్కరణలకు తెరతీశారు, విజయం సాధించారు. ఇంకా చేయాల్సింది ఎంతో ఉంది గనుక అవసరమైన ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం కోసం ప్రతిభావంతులను అక్కున చేర్చుకుంటున్నారు.దాని ఫలితాలు కనిపించాయి. సెమికండక్టర్లు, వైమానిక రంగం, 5జి, క్వాంటమ్‌ వంటి అనేక రంగాల్లో మరొకదాని వెనుక వెళ్లే పరిస్థితి నుంచి పోటీదారుగా మారింది. జీవశాస్త్రంలో అమెరికాను అధిగమించి 2017లోనే ఎక్కువగా పరిశోధక పత్రాలను చైనీయులు ప్రచురించారు.

గత నాలుగున్నర దశాబ్దాల సంస్కరణల ఫలితాలు, విధానాల గురించి కొంత మంది విమర్శలు చేయవచ్చు.ఇప్పుడు చైనా మరొకదశలో ప్రవేశించింది. అధికారాన్ని కార్మికవర్గం చేతిలో పెట్టటం ద్వారా విప్లవం చేయాల్సినపని చేసింది. సాధించిన అధికారం ఒక్కటే జన జీవితాలను మెరుగుపరచదని గుర్తించిన తరువాత తీసుకున్న చర్యలకు తగిన ఫలితాలు వచ్చాయి. వాటికి ఉన్న పరిమితులను గమనించి మరొక అడుగు ముందుకు వేస్తున్నది. విదేశీ పెట్టుబడులకు కొంత ప్రతిఫలాన్ని చెల్లించినట్లుగా, స్వదేశంలోనే సంస్థల పెరుగుదలకు వ్యక్తులను ప్రోత్షహించిన తీరు చూశాము. అలాగే ప్రతిభావంతులకు మిగతావారితో పోలిస్తే అధికమొత్తాలను ఇవ్వాల్సి ఉంటుందని గ్రహించింది. మరిన్ని పరిశోధనల ద్వారా జనకల్యాణానికి వినియోగించేందుకు పూనుకున్నది. ప్రపంచంలో ఉన్న ప్రతిభావంతులను చైనా ఆకర్షించటం అమెరికా మాదిరి కార్పొరేట్ల లాభాలకు కాదు, జనాల కోసం.ఈ ప్రయత్నం వెనుక వ్యూహాత్మక, రాజకీయ ప్రయోజనాలు కూడా ఉంటాయి. నిజానికి ఇది చైనా కమ్యూనిస్టు పార్టీకి కత్తిమీద సామువంటిదే.వచ్చేవారు ఆకాంక్షలకు అనుగుణంగా పని చేయాలి, శాస్త్ర రంగ నాయకత్వంతో పాటు రాజకీయ నాయకత్వంలో ఇమిడి పోయే విధంగా ఉండాలి. కమ్యూనిస్టుల గురించి అనేక తప్పుడు ప్రచారాలు జరిగిన నేపధ్యం,అన్యవర్గ ప్రభావంతో అలాంటి వారు ప్రతి చర్యనూ అనుమానంతో చూసే అవకాశం ఉంటుంది, సహజం. వీటన్నింటినీ గమనంలో ఉంచుకొనే చైనా కమ్యూనిస్టులు ఒక ప్రయోగం చేస్తున్నారని చెప్పవచ్చు. ఇప్పటివరకు అది చేసిన వన్నీ మొత్తం మీద ఫలించాయి.

చైనాలో ప్రస్తుతం ప్రయోగశాలలు, పరిశోధనా కేంద్రాలు, విశ్వవిద్యాలయాల పర్యావరణం నానాటికీ పెరుగుతున్నది.ప్రపంచ స్థాయి సంస్థలలో చైనా వాటికి చోటుదక్కుతున్నది. క్వాంటమ్‌ కంప్యూటింగ్‌, బయోమెడిసిన్‌, కృత్రిమ మేథ, ప్రత్యామ్నాయ ఇంథన రంగాలలో సాధించే పురోగతితో అగ్రగామిగా ఉన్న అమెరికాను అధిగమించాలన్నది కమ్యూనిస్టు పార్టీ నిర్దేశించిన లక్ష్యం. ఇది ప్రారంభం మాత్రమే. ఈ క్రమంలో తలెత్తే మిత్రవైరుధ్యాలు ఎలా ఉంటాయి, వాటిని పార్టీ ఎలా పరిష్కరిస్తుందన్నది ఆసక్తి కలిగించే అంశం.మరోవైపున చూస్తే అమెరికా, ఇతర పెట్టుబడిదారీ ధనిక దేశాలు పరిశోధకులను, వారితో కలిగే లాభాలను కోల్పోతే చూస్తూ ఊరుకోవు. ప్రమాణాలకు గీటురాళ్లుగా ఇప్పటి వరకు కొనసాగిన అమెరికా విశ్వవిద్యాలయాలు ఆ స్థానాన్ని నిలబెట్టుకుంటాయా ? ప్రతిభావంతులను ఆకర్షించేందుకు పోటీ పడటంలో కెనడా, ఆస్ట్రేలియా, సింగపూర్‌, జర్మనీ, అరబ్‌ ఎమిరేట్స్‌ వంటివి కూడా ఉన్నాయన్నది మరచిపోరాదు. గుత్తాధిపత్యాన్ని దెబ్బకొట్టే విధంగా రానున్న రోజుల్లో పోటీ మరింత పెరగటం మంచిదే. వ్యక్తుల ప్రతిభకు ఎప్పుడూ గుర్తింపు ఉంటుంది, అయితే అది పూర్తిగా వారి స్వంతం కాదు, సమాజం నేర్పినదానికి తమ సృజనాత్మకతను జోడిరపు మాత్రమే. ఉదాహరణకు విద్యుత్‌ బల్బ్‌ను చూస్తే, 1,799 సంవత్సరం నుంచి బల్బులు, బ్యాటరీల తయారీకి పరిశోధనలు ప్రారంభమయ్యాయి. అనేక మంది చేసిన కృషి 1870, 80 దశకాల్లో పోటీ మరింత పెరిగింది.బ్రిటన్‌లో జోసెఫ్‌ స్వాన్‌, అమెరికాలో థామస్‌ ఎడిసన్‌ ఒకేసారి బల్బులను కనుగొన్నారు.స్వాన్‌ బల్బులు విలియమ్‌ స్టెయిట్‌ రూపొందించన నమూనాల ప్రకారం ఉన్నాయి. వాటి ఫిలమెంటు చాలా మందంగా ఉంది. ఎడిసన్‌ బల్బులో పలుచగా ఉండటంతో వాణిజ్య పరంగా అది విజయవంతమైంది. స్వాన్‌, ఎడిసన్‌ మధ్య పోటీ చివరకు వారిద్దరినీ ఒక దగ్గరకు చేర్చి ఎడిసన్‌ మరియు స్వాన్‌ ఎలక్ట్రిక్‌ లైట్‌ కంపెనీగా ఏర్పడి స్వాన్‌ రూపొందించిన ఫిలమెంట్‌తో మార్కెట్‌ చేశారు. కానీ పేరు ఎడిసన్‌కు వచ్చింది, దాని వెనుక ఎందరో ఉన్నారు. ఆ తరువాత బల్బుల్లో ఎన్ని మార్పులు, చేర్పులు జరిగాయో మనకు తెలిసిందే. అందువలన ప్రతి నవకల్పన సమాజానికి ఉపయోగపడుతుందా, కార్పొరేట్ల లాభాలకా అన్నదాన్ని బట్టి శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞానాల వర్గదృకృధం గురించి చెప్పుకోవాల్సి ఉంటుంది. చైనా కార్మికవర్గ వైఖరితో ప్రతిభకు పట్టం కడుతున్నదని చెప్పవచ్చు.

ఉక్రెయిన్‌ సంక్షోభం : అలాస్కా సమావేశ ఆంతర్యం ఏమిటి ? జెలెనెస్కీతో చర్చలకు తొందరేం లేదన్న రష్యా !

Tags

, , , , ,


ఎం కోటేశ్వరరావు


అధికారానికి వచ్చిన 24 గంటల్లోనే ఉక్రెయిన్‌ సంక్షోభాన్ని పరిష్కరిస్తానని చెప్పిన డోనాల్డ్‌ ట్రంప్‌ గద్దె నెక్కి రెండు వందల రోజులు దాటింది. అడుగు ముందుకు పడకున్నా తాజాగా ఇదిగో పరిష్కారం అంటూ యావత్‌ ప్రపంచ దృష్టిని అటువైపు తిప్పాడు. తాజాగా అమెరికాలోని అలాస్కాలో గత శుక్రవారం నాడు జరిగిన ట్రంప్‌ మరియు పుతిన్‌ భేటీ వార్త సేకరణకు భారీ సంఖ్యలో వచ్చిన మీడియా సిబ్బందే దానికి నిదర్శనం. అంతకు ముందు వరకు కాల్పుల విరమణ, శాంతి ఒప్పందం ముందు జరగాలంటూ చెప్పిన పెద్దమనిషి అలస్కా సమావేశం తరువాత అలాంటివేమీ లేవు. ఏకంగా పరిష్కారానికి మరోసారి మాస్కోలో సమావేశమని ప్రకటించాడు. చిత్రం ఏమిటంటే సోమవారం నాడు ట్రంప్‌తో భేటీ అయిన ఉక్రెయిన్‌ నేత జెలెనెస్కీ మర్యాదల ప్రకారం గతానికి భిన్నంగా కోటు ధరించి వచ్చాడు. గతంలో ట్రంప్‌తో సమావేశానికి ఒక సాధారణ పౌరుడి మాదిరి దుస్తులు రావటంతో అవమానాలు ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. జెలెనెస్కీని ట్రంప్‌ ఎక్కడ బుట్టలో వేస్తాడో తమతో నిమిత్తం లేకుండా ఒప్పందం కుదుర్చుకుంటారేమో అన్న భయం లేదా ముందు చూపుతో అనేక మంది ఐరోపా నేతలు కూడా కట్టగట్టుకు వచ్చి ట్రంప్‌తో చర్చలు జరిపారు.వారితో మాట్లాడుతూనే కాసేపు ఉండండి అన్నట్లు అంతరాయమిచ్చి పుతిన్‌తో ఫోన్లో మాట్లాడి తన ప్రాధాన్యత ఏమిటో వారికి అవగతమయ్యేట్లు చేశాడు.దానికి అనుగుణంగానే ఐరోపా నేతలు కూడా తమ మర్యాదను కాపాడుకుంటూ ట్రంప్‌ యత్నాలను హర్షిస్తూనే నర్మగర్భంగా తమ భిన్నాభిప్రాయాలను వెల్లడిరచారు. భద్రత అన్న తరువాత మేం లేకుండా పుతిన్‌, జెలెనెస్కీ, ట్రంప్‌ ముగ్గురూ మాట్లాడుకుంటే సరిపోతుందా, నాలుగు పక్షాల సమావేశం జరగాలనే సందేశాన్ని వారు కూడా ఇచ్చారు.ఈ నెలాఖరులో సమావేశం ఎక్కడ జరగాలనే అంశంపై కసరత్తు ప్రారంభమైంది. అది కూడా గత సమావేశాల మాదిరే విఫలయత్నం అవుతుందా నిజంగానే రాజీ కుదిరేందుకు వేదిక అవుతుందా అన్నది పెద్ద ప్రశ్న. సోమవారం నాటి ట్రంప్‌ ఫోన్లో మాట్లాడినపుడు నేరుగా ఉక్రెయిన్‌తో చర్చలు జరిపేందుకు తాను సుముఖంగానే ఉన్నట్లు పుతిన్‌ చెప్పినట్లు వార్తలు వచ్చాయి. అయితే మంగళవారం నాడు రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లోవరోవ్‌ మాట్లాడిన తీరు చూస్తే చర్చలు వెంటనే జరిగే అవకాశం లేదని తేలిపోయింది. క్రమంగా నిపుణుల స్థాయిలో మొదలై తరువాత దశలవారిగా చర్చలు జరగాలని లోవరోవ్‌ చెప్పాడు.ఐరాసలో రష్యా ప్రతినిధి దిమిత్రి పోలియానిస్కీ మాట్లాడుతూ చర్చల కోసం చర్చలు జరగకూడదని వ్యాఖ్యానించాడు.


అలాస్కా సమావేశం తరువాత కొన్ని సరికొత్త కోణాలు వెలుగులోకి వచ్చాయి.చైనా మరియు రష్యాల మధ్య ఉన్న బంధాన్ని తెంచేందుకు అమెరికా పూనుకుందన్నది వాటిలో ఒకటి.ఎక్కడో స్విచ్‌ వేస్తే మరెక్కడో లైటు వెలుగుతుందన్నట్లుగా దీనికి ఉక్రెయిన్‌ సంక్షోభ పరిష్కారం నాంది పలుకుతుందా ! దీనర్ధం వెంటనే ఏదో జరుగుతుందని కాదు గానీ మాజీ కమ్యూనిస్టు మహాప్రమాదకారి అన్నట్లుగా పుతిన్‌ తీరుతెన్నులను ఒక కంట కనిపెడుతూ ఉండాల్సిందే. వర్తమాన అంశానికి వస్తే మీడియాలో వస్తున్న లీకు వార్తలు, విశ్లేషణలను చూస్తుంటే మొదటి నుంచి రష్యా చెబుతున్నట్లుగానే దాని షరతులు, వైఖరికి అనుగుణంగానే ఒక పరిష్కారం కుదరవచ్చు అనే భావం కొందరిలో కలుగుతోంది. నిజంగా అలా జరిగితే ఐరోపాలో, ప్రపంచంలోనే సరికొత్త సమీకరణలు, పరిణామాలకు, మరింత పెద్ద సంక్షోభాలకు అది నాంది అవుతుంది. తాజా పరిణామాలు, విశ్లేషణలను చూసినపుడు మొత్తం మీద వ్లదిమిర్‌ పుతిన్‌ కూడా ఆశాభావంతోనే ఉన్నట్లు కనిపిస్తున్నదని పరిశీలకుల వ్యాఖ్య. ఇప్పటికే ఆర్థికంగా అనేక సమస్యలను ఎదుర్కొంటున్న పుతిన్‌కు యుద్ధం దీర్ఘకాలం కొనసాగితే రాజకీయ సమస్యలను ఎదుర్కొనే అవకాశాలు ఉంటాయి.అందువల్లనే అతనికీ పరిష్కారం అవసరం.


ట్రంప్‌ యంత్రాంగం రూపొందించినట్లు చెబుతున్న పరిష్కార పద్దతి ప్రకారం ప్రస్తుతం రష్యా స్వాధీనంలో లేని కొన్ని ప్రాంతాలతో సహా డాన్‌బాస్‌ ప్రాంతంలో 6,600 చదరపు కిలోమీటర్లు లేదా 12శాతం భూభాగాన్ని ఉక్రెయిన్‌ వదులుకోవాల్సి ఉంటుంది. దానికి ప్రతిగా సుమీ, ఖార్కివ్‌ ప్రాంతాలలో 440 చదరపు కిలోమీటర్లను రష్యా ఖాళీ చేసి ఉక్రెయిన్‌కు ఇస్తుంది. ఇదే జరిగితే రష్యాదే పైచేయి అవుతుంది, దాని షరతుల ప్రాతిపదికగానే ఒప్పందం ఉంటుంది. ఇంతవరకు ఏ ఒక్క అంశం మీద కూడా పుతిన్‌ దిగిరాలేదు.ఈ పూర్వరంగంలో అమెరికా ప్రతిపాదనలకు ఉక్రెయిన్‌ అంగీకరిస్తుందా, ఒకవేళ అమెరికా జెలెనెస్కీ మెడలు వంచి ఒప్పించినా ఐరోపా అగ్రదేశాలు తలూపుతాయా, చెప్పలేము. తెల్లవారే సరికి వైఖరులు, పరిణామాలు మారిపోతున్న ఈ రోజుల్లో రష్యా గడ్డమీద తలపెట్టిన తదుపరి భేటీలోపల ఏమైనా జరగవచ్చు.మిలిటరీ దళాల రంగ ప్రవేశంతో సహా ఉక్రెయిన్‌కు ఐరోపా భద్రత కల్పించేందుకు పుతిన్‌ అంగీకరించవచ్చని ట్రంప్‌ యంత్రాంగం చెబుతోంది. దీని మీద పుతిన్‌ వైపు నుంచి ఇది రాస్తున్న సమయానికి ఎలాంటి ప్రతికూల లేదా అనుకూల స్పందనలు లేవు. ఒక వారంలోపే ఒప్పందం జరగాలని ట్రంప్‌ పట్టుబడుతుండగా అదెలా కుదురుతుంది, మంచి చెడ్డలు ఆలోచించటానికి కొన్ని వారాల వ్యవధి కావాలని ఐరోపా నేతలు చెబుతున్నారు.


పరిష్కారం కుదరాలంటే ముందుగా డాంటెస్క్‌, లుహానస్క్‌ ప్రాంతాల నుంచి ఉక్రెయిన్‌ మిలిటరీ వెనక్కు పోవటం తనకు ముఖ్యమని, అది చేస్తే మిలిటరీ చర్య నిలిపివేస్తానని శుక్రవారం నాటి చర్చలలో పుతిన్‌ స్పష్టం చేశాడట.జూన్‌ రెండవ తేదీన ఇస్తాంబుల్‌ సమావేశంలోనే దీన్ని రష్యా ప్రతినిధులు చెప్పారు.దీనితో పాటు క్రిమియా ద్వీపకల్పాన్ని రష్యా అంతర్భాంగా గుర్తించటం, ఉక్రెయిన్‌ మిలిటరీ సంఖ్య తగ్గింపు, ఇతర ప్రాంతాల గురించి కూడా దానిలో పేర్కొన్నారు. రష్యన్లు మరీ ఎక్కువగా అడుగుతున్నారని, దాన్లో వారి స్వాధీనంలో లేని ప్రాంతాలు కూడా ఉన్నాయిని అమెరికా ఉపాధ్యక్షుడు జెడి వాన్స్‌ వ్యాఖ్యానించటమే కాదు, ఉక్రెయిన్‌ కూడా అంగీకరించలేదు. గతంలో పేర్కొన్న నాలుగు ప్రాంతాల నుంచి ఉక్రెయిన్‌ మిలిటరీ ఉపసంహరణ బదులు రెండు ప్రాంతాల గురించి పుతిన్‌ పట్టుబట్టినట్లు వార్తలు. ఉక్రెయిన్‌ భద్రతకు హామీకి తాను అంగీకరిస్తానని అయితే వివిధ దేశాలతో కూడిన అలాంటి వ్యవస్థలో తనకు వీటో అధికారం ఉండాలని రష్యా కోరింది.


శుక్రవారం నాటి చర్చలలో భద్రత గురించి చర్చ వచ్చింది తప్ప అది ఎలా అన్నది తేలలేదు. దీని అర్ధం ఏమిటి ? ఒక ఆలోచన ప్రకారం ఒక వేళ ఉక్రెయిన్‌ మీద తిరిగి రష్యా దాడి చేస్తే భద్రతకు హామీ ఇచ్చిన వారు ఐరోపా వారైతే అమెరికా మద్దతు లేకుండా రష్యా మీద ప్రతిదాడులు జరపవచ్చు. అలాంటి ఒప్పందం కుదిరితే అది అమెరికా మరియు ఐరోపా మధ్య అంతరాన్ని పెంచేందుకు, నాటో కూటమిని పూర్తిగా దెబ్బతీసేందుకు రష్యా వినియోగించుకోవచ్చని యూరోపియన్లు ఆందోళన వ్యక్తం చేశారు. మరొక దృశ్యం ప్రకారం ఉక్రెయిన్‌ భద్రతకు హామీదారుగా ఉన్న ఐరోపా దేశాలపై రష్యా దాడికి పూనుకుంటే ఐరోపాకు మద్దతుగా అమెరికా రంగంలోకి దిగుతుంది. మూడవ దృశ్యం ప్రకారం భద్రతగా ఉండే ఐరోపా దేశాల మిలిటరీ ఉక్రెయిన్‌లో ఉన్నప్పటికీ రష్యా మీద దాడికి దిగదు, ఉక్రెయిన్‌ మిలిటరీకి అవసరమైన శిక్షణ మాత్రమే ఇస్తుంది. ఇప్పుడు పరిమితంగా అదే చేస్తున్నారు. ఒకవేళ మరోసారి రష్యా దాడికి దిగితే ఇతర దేశాల మిలిటరీ సురక్షితంగా వెనక్కు పోయేందుకు అమెరికా రంగంలోకి దిగుతుంది. ఇవన్నీ పరిపరి విధాల ఊహాగానాలు మాత్రమే.


తమతో భాగస్వామిగా చేసుకొని ప్రపంచ మార్కెట్లపై పెత్తనం చేయాలని జి7 కూటమి ఎనిమిదవ దేశంగా రష్యాను చేర్చుకున్న సంగతి తెలిసిందే. అయితే విబేధాలు తలెత్తి రష్యాను పక్కన పెట్టటం, ఉక్రెయిన్‌కు నాటో సభ్యత్వమిచ్చి మాస్కో ముంగిట ఆయుధ మోహరింపుకు పశ్చిమదేశాలు కుట్రపన్నిన తరువాతే గతంలో తన ప్రాంతంగా ఉన్న క్రిమియా ద్వీపకల్పాన్ని రష్యా 2014లో విలీనం చేసుకుంది. సోవియట్‌ ఉనికిలో ఉన్న సమయంలో పాలనా సౌలభ్యం కోసం రష్యన్‌ రిపబ్లిక్‌ ప్రాంతమైన క్రిమియాను ఉక్రెయిన్‌లో కలిపారు. సోవియట్‌ పతనమైన తరువాత రెండూ స్వతంత్ర దేశాలుగా మారినప్పటికీ 24 సంవత్సరాలు రష్యా వైపు నుంచి విలీనానికి ఎలాంటి ప్రయత్నాలు లేవన్నది గమనించాల్సిన అంశం. తమకు విశ్వసనీయమైన భద్రతా హామీ ఇవ్వాలని జెలెనెస్కీ పట్టుబడుతున్నాడు. ఇటీవలి కాలంలో అమెరికా వైఖరిలో వచ్చిన మార్పు ప్రకారం ఆయుధాలు ఎన్నికావాలంటే అన్ని ఇస్తుంది, అవసరమైతే వైమానిక దాడులు జరుపుతుంది తప్ప తన మిలిటరీని కొత్తగా మరేదేశంలోనూ దించేందుకు సిద్దం కావటం లేదు. అందువలన ఐరోపా దేశాలతో కలసి రక్షణ కల్పించేందుకు ట్రంప్‌ అంగీకరించే అంశాలు దాదాపు లేవనే చెప్పవచ్చు.తనకు వ్యతిరేకంగా పశ్చిమదేశాల కుట్రకు ఉక్రెయిన్‌ దూరంగా ఉంటే అన్ని రకాల భద్రత కల్పించేందుకు అసలు రష్యానే సిద్ధంగా ఉంటుందన్నది వేరే చెప్పనవసరం లేదు. రష్యాకు కొన్ని ప్రాంతాలను అప్పగిస్తే యుద్ధం ఆగిపోవచ్చుగానీ జెలెనెస్కీ పదవీ గండం పొంచి ఉంటుంది. జరిగే ఎన్నికలలో ఎవరు గెలుస్తారన్నది ఇప్పుడు చెప్పలేము గానీ అతగాడు గెలిచే సమస్యే లేదు. మంత్రులు, ఉన్నతాధికారులు యుద్ధాన్ని అడ్డంపెట్టుకొని అడ్డగోలుగా సంపాదించారనే విమర్శలు వెల్లువెతుతున్నాయి. భవిష్యత్‌లో రష్యాకు ముప్పు తలెత్తకుండా చూసేందుకు ఇప్పటి వరకు ముందుకు తెచ్చిన ప్రతిపాదనలను సాధించకుండా ఒప్పందం చేసుకుంటే పుతిన్‌కూ అదే పునరావృతం అవుతుంది. ఇన్ని ప్రాణాలను బలి ఇచ్చి ఆర్థికంగా నష్టం కలిగించటం ఎందుకన్న ప్రశ్నకు సమాధానం ఉండదు. రష్యాది పైచేయిగా మారితే ట్రంప్‌ కూడా ఇబ్బందుల్లో పడతాడు, వెంటనే ఎన్నికలు లేవు, వచ్చేసారి పోటీ చేస్తాడో లేదో తెలియదు గనుక వ్యక్తిగతంగా కలిగే నష్టం ఉండదు గానీ, ఐరోపాలో ఉన్న పలుకుబడిని అమెరికా కోల్పోవటం ఖాయం, దాని ప్రభావం మొత్తం ప్రపంచం మీదనే పడుతుంది.


విడివిడిగా అమెరికా ఆధిపత్యాన్ని ఎదుర్కోలేమన్న వాస్తవాన్ని గ్రహించిన ఐరోపా దేశాలు సమాఖ్య (ఇయు)గా ఏర్పడి, ఐక్యత మరియు పోరాటాన్ని కొనసాగిస్తున్నాయి. ఇతర దేశాల మీద పన్నుల దాడిని ప్రకటించినట్లే ట్రంప్‌ ఈ కూటమితో కూడా వ్యవహరించి వత్తిడి చేసి ఒక ఒప్పందానికి వచ్చాడు.మరోవైపున జర్మనీ వంటి దేశాలు భారీ ఎత్తున సైనికీకరణకు పూనుకున్నాయి. గతంలో సోవియట్‌ను, గతమూడున్నరదశాబ్దాలుగా రష్యాను చూపి బెదిరించిన అమెరికా ఇప్పుడు ఆ రష్యాతోనే చేతులు కలిపి మరో రూపంలో ఐరోపాను అదుపులో ఉంచుకోవాలని చూస్తోందా అనే కోణాన్ని కూడా పరిశీలించాల్సి ఉంది.గతంలో సోవియట్‌ మరియు చైనా కమ్యూనిస్టు పార్టీల మధ్య తలెత్తిన సైద్దాంతిక విబేధాలను ఉపయోగించుకొని లబ్దిపొందేందుకు చూసింది. ఒకటి రాజకీయ, రెండవది చైనా మార్కెట్లో ప్రవేశించి ఆర్థిక లబ్ది.తైవాన్‌ బదులు కమ్యూనిస్టు చైనాకు భద్రతామండలిలో శాశ్వత సభ్వత్యం కల్పించటాన్ని సైద్దాంతిక విబేధాలున్నా నాటి సోవియట్‌ వ్యతిరేకించలేదు. అప్పటికీ ఇప్పటికీ తేడా ఏమిటంటే రష్యా మరియు చైనా నేడు మిత్రదేశాలుగా ఉన్నాయి. ఇదే సమయంలో పుతిన్‌ కమ్యూనిస్టు కాదు, రష్యా సోషలిస్టు దేశం కాదు.ఈ రెండో అంశాన్ని ఉపయోగించుకొని మిత్రబేధంతో రష్యాను దగ్గరకు తీసుకోవాలని, దాని వనరులు, మార్కెట్‌లో లబ్ది పొందాలని కొందరు అమెరికన్లు కోరుతున్నారు. ఇందుకు ఉక్రెయిన్‌ సంక్షోభం ఆటంకంగా ఉంది గనుక దాన్ని పరిష్కరించాలని వారు చెబుతున్నారు. ఈ పూర్వరంగంలోనే ఎరగా ఉక్రెయిన్‌ ప్రాంతాన్ని రష్యాకు అప్పగించాలన్నది ట్రంప్‌ ఎత్తుగడ అంటున్నారు. అయితే అదే జరిగితే ఐరోపాలోని ధనికదేశాలు చైనాతో జట్టుకట్టే అవకాశాన్ని కూడా తోసిపుచ్చలేము. పెట్టుబడిదారులకు లాభాలు తప్ప శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరు. పుతిన్‌ తక్షణ ఆలోచన యుద్ధం నుంచి బయటపడి తద్వారా ఆర్థిక ఆంక్షల బంధాలను బద్దలు కొట్టటం గనుక ఆ కోణంలో దాని మీద కేంద్రీకరించవచ్చు.అమెరికా మద్దతు లేకపోయినా ఐరోపా దేశాలు ఇచ్చే ధైర్యం, ఆయుధ సాయంతో నిలవగలమని ఉక్రెయిన్‌ భావిస్తే వెంటనే ఒప్పందానికి అంగీకరించకపోవచ్చు. లేకపోతే ముందే చెప్పుకున్నట్లు రష్యా షరతుల మీద రాజీకి రావచ్చు కూడా !

బిసి రిజర్వేషన్ల అమలు తీరుతెన్నులు : కాంగ్రెస్‌ బాటలో బిజెపి ! మండల్‌ కంటే రోహిణీ కమిషన్‌ మరింత జాప్యం !!

Tags

, , , , , ,


ఎం కోటేశ్వరరావు


తెలంగాణా ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలలో వెనుకబడిన తరగతుల రిజర్వేషన్లను 42శాతానికి చట్టబద్దంగా పెంచకుండానే ఎన్నికలు జరుపుతుందా ? పెంచేందుకు రాష్ట్రపతికి పంపిన బిల్లుకు ఆమోదం లేదా తిరస్కారం చేస్తున్నట్లు చెప్పలేదు. ఆర్డినెన్స్‌ ద్వారా అమలు చేద్దామని చూస్తే గవర్నర్‌ దాన్ని కేంద్రానికి సలహా కోసం పంపటంతో దాని పరిస్థితీ అంతే. దీని వెనుక బిజెపి రాజకీయం పక్కాగా కనిపిస్తున్నది. ముస్లింలకు రిజర్వేషన్లు ఉన్నందున అంగీకరించే సమస్యే లేదని కేంద్ర మంత్రి బండి సంజయ్‌ చెబుతారు. రాజ్యాంగబద్ధంగా అలాంటి అవకాశం ఉంటే కేంద్ర ప్రభుత్వం లేదా రాష్ట్రపతి కూడా తిరస్కరించవచ్చు. రాష్ట్రాన్ని వివరణ అడగవచ్చు. అదేమీ చేయకుండా తొక్కి పెట్టారు. తెలంగాణా స్థానిక సంస్థల అంశాన్ని పక్కన పెడితే అసలు నరేంద్రమోడీ, బిజెపికి బిసి రిజర్వేషన్ల మీద ఉన్న చిత్తశుద్ధి ఎంత అన్నది ప్రశ్న. పద్నాలుగుసార్లు గడువు పొడిగించిన తరువాత 2023 జూలై 31న ఒబిసి రిజర్వేషన్ల వర్గీకరణ అంశంపై జస్టిస్‌ రోహిణీ కమిషన్‌ నివేదికను రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు అందచేశారు. రెండు సంవత్సరాలు దాటింది. అసలు ఆ నివేదిక వెలుగు చూస్తుందా అన్న సందేహాలు తలెత్తుతున్నాయి. 2017 అక్టోబరు రెండవ తేదీన ఢల్లీి హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జి రోహిణీ ఆధ్వర్యంలో కమిషన్‌ ఏర్పడిరది.


రామనాధ్‌ కోవింద్‌ హయాంలో ఏర్పాటు చేసిన ఈ కమిషన్‌ కేవలం మూడు మాసాల్లో నివేదిక ఇవ్వాలని నిర్దేశించగా ఆరేండ్లు పట్టించారు. ఈ నివేదిక ఇంకా తమకు ఇంకా అందలేదని కేంద్ర ప్రభుత్వ సామాజిక న్యాయశాఖ 2025 మార్చి 26న లోక్‌సభకు తెలియచేసింది. ఈ ఏడాది ఆగస్టు ఐదవ తేదీన అడిగిన ప్రశ్నకు అదే సమాధానాన్ని పార్లమెంటుకు తెలిపింది. అనేక రాష్ట్రాలలో బిసి కుల సర్వేలు జరిగిన పూర్వరంగంలో నివేదికలోని అంశాలతో దేశ సామాజిక, రాజకీయ రంగాలపై భూకంప ప్రభావం పడుతుందని భావిస్తున్నారు. పార్లమెంటు ఉభయ సభలకు సమర్పించకుండా నివేదికను వెల్లడిరచటానికి కుదరదని 2024 మే మొదటి వారంలో అలహాబాద్‌ హైకోర్టు ప్రజాప్రయోజనవాజ్యం మీద తీర్పునిచ్చింది. అందువలన కోర్టుల ద్వారా కూడా అది వెలుగు చూసే అవకాశం లేదన్నది తేలిపోయింది. దీనికి ముందు జాతీయ వెనుకబడిన తరగతుల కమిషన్‌ 2015లోనే అత్యంత వెనుకబడిన, బాగా వెనుకబడిన, వెనుకబడిన తరగతులుగా మూడుగా విభజించి రిజర్వేషన్లు అమలు జరపాలని చేసిన సిఫార్సును మోడీ సర్కార్‌ పట్టించుకోలేదు. జాప్యం చేసే ఎత్తుగడతో రెండు సంవత్సరాల తరువాత రోహిణీ కమిషన్‌ ఏర్పాటు చేశారు. మండల్‌ కమిషన్‌ 1979లో ఏర్పాటు కాగా 1980లో నివేదిక ఇచ్చింది. పదేండ్లకు అది అమల్లోకి వచ్చింది. రోహిణీ కమిషన్‌ 2017లో ప్రారంభం కాగా 2023లో నివేదిక సమర్పించింది.2019లోనే ముసాయిదా నివేదిక సిద్దంగా ఉన్నట్లు కమిషన్‌ కేంద్ర ప్రభుత్వానికి రాసినా గడువు పొడిగించటం గమనించాలి.2015 నుంచి తీరుతెన్నులను చూస్తే ఇప్పటికే పదేండ్లు దాటింది, ఓబిసి వర్గీకరణ మొత్తంగా 15 సంవత్సరాల తరువాతైనా జరుగుతుందా అన్నది అనుమానమే.


వెయ్యి పేజీలకు పైగా ఉన్న రోహిణీ కమిషన్‌ నివేదిక రెండు భాగాలుగా ఉంది. మొదటి భాగంలో వర్గీకరణ ఎలా జరపాలి అని పేర్కొనగా, రెండవ భాగంలో దేశమంతటా గుర్తించిన 2,633 కులాల జాబితా ఉన్నట్లు మీడియాలో వార్తలు వచ్చాయి. 2015 నుంచి 2018 వరకు కేంద్ర ప్రభుత్వ విద్యా సంస్థలలో లక్ష ప్రవేశాలు, లక్షా 30వేల ఉద్యోగాలను ఎలా ఇచ్చారన్నది కమిషన్‌ పరిశీలించినట్లు చెబుతున్నారు. నాలుగో వంతు వాటాను కేవలం పది ఓబిసి కులాల వారే దక్కించుకున్నారని, మరో నాలుగోవంతును 38 కులాల వారు, మరో నాలుగోవంతు 102కులాలు దక్కించుకున్నాయని, మరో 22.3శాతం 506 కులాలు పొందినట్లు, 994 కులాలకు కేవలం 2.68శాతం దక్కగా 983 కులాలకు అసలు ఎలాంటి లబ్ది దక్కలేదని తేలినట్లు వెల్లడైంది. విద్యా, ఉద్యోగ రంగాల వనరుల పంపిణీలో రిజర్వేషన్లు ఉన్నప్పటికీ కొందరు మాత్రమే ఏ విధంగా వాటిని దక్కించుకుంటున్నారో ఈ వివరాలు వెల్లడిస్తున్నాయి. దళితుల వర్గీకరణతో కొంత మేరకు పరిష్కారం కుదిరినా ఇంకా అమల్లోకి రాలేదు. బిసి, గిరిజనుల్లో ఇంకా అలాంటి అంతరాలు ఎక్కువగా ఉన్నాయి. రోహిణీ కమిషన్‌ బిసిలను నాలుగు తరగతులుగా వర్గీకరించాలని సిఫార్సు చేసినట్లు వార్తలు వచ్చాయి.


దేశవ్యాపితంగా బిసి జనాభా సంఖ్య అంచనాకు సర్వేచేసేందుకు కేంద్ర ప్రభుత్వం నిధులు కేటాయించాలని రోహిణీ కమిషన్‌ కేంద్రానికి రాసినా పట్టించుకోలేదు.2018లో నాటి హోమ్‌ మంత్రి రాజనాధ్‌ సింగ్‌ 2021 జనగణనలో ఓబిసి వివరాలు ఉంటాయని చెప్పారు తప్ప కులగణన చేస్తామని నిర్దిష్టంగా ప్రకటించలేదు. వెనుకబడిన తరగతుల కులగణన జరగాలన్న డిమాండ్‌కు ఇటీవలి సంవత్సరాలలో మద్దతు పెరుగుతున్నది. రాష్ట్రాలకు గణన చేసే అధికారం లేదు గనుక సర్వేల పేరుతో వారెంత మంది ఉన్నారో సుమారుగా లెక్కించేందుకు కొన్ని రాష్ట్రాలు చర్యలు తీసుకున్నాయి. వాయిదాపడిన 2021జనగణనలో కులగణన చేయాలన్న డిమాండ్‌ను బిజెపి, కేంద్ర ప్రభుత్వం మొండిగా తిరస్కరించాయి. రాష్ట్రాల మీద నెట్టాలని చూశాయి. మెజారిటీ రాష్ట్రాలలో తామే ఉన్నామని చెప్పుకొనే బిజెపి తమ పాలిత రాష్ట్రం ఒక్కదానిలో అయినా సర్వే చేసిందా అంటే లేదు. హిందువుల్లో చీలిక వస్తుందని మతాన్ని ముందుకు తెచ్చింది. లోక్‌సభ ఎన్నికలో ఇండియా కూటమి కులగణన అంశాన్ని, రిజర్వేషన్లపై 50శాత పరిమితి ఎత్తివేయాలన్న నినాదాన్ని ముందుకు తెచ్చింది. జనాల నుంచి వస్తున్న వత్తిడి, బీహార్‌ ఎన్నికల కారణంతో 2027లో చేపట్టే జనగణనలో కులగణన చేస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించాల్సి వచ్చింది. అప్పటి నుంచి బిజెపి నేతలు కొత్త పల్లవి అందుకున్నారు. ఎలాగూ జనగణనలో కులాల వివరాలు వస్తాయి గనుక ఆ తరువాతే చర్యలు తీసుకోవచ్చు కదా అని చెబుతున్నారు. 2011 ఫిబ్రవరిలో గణన జరిగితే 2013 ఏప్రిల్‌లో అంతిమంగా దాన్ని ఖరారు చేశారు. ఇప్పుడు డిజిటల్‌ అంటున్నారు గనుక ఆ లెక్కన చూసినా 2028 వరకు ప్రతిపాదిత జనాభా గణన ఖరాయ్యే అవకాశం లేదు. అప్పటి వరకు రోహిణీ కమిషన్‌ నివేదిక వెలువడదా లేక వత్తిడికి తట్టుకోలేక వెల్లడిరచినా దాని మేరకు చర్యలు తీసుకొనే అవకాశం లేదా అన్నది ప్రశ్న.ఈ లోగా 2029 పార్లమెంటు ఎన్నికలు వస్తాయి. ఇప్పుడు తొమ్మిది దశాబ్దాల నాటి (1931) కులగణన ఆధారంగా బిసిలు ఇంత మంది ఉండవచ్చని అంచనాగా చెబుతున్నారు. తరువాత జరిగిన సామాజిక మార్పులలో అనేక తరగతుల్లో జనాభావృద్ధిలో వచ్చిన హెచ్చు తగ్గులను పరిగణనలోకి తీసుకొనేందుకు సమాచారం లేదు.


2027 జనాభా లెక్కల్లో ఎవరెంత శాతం అన్నది తేలుతుంది తప్ప కులాల సంఖ్య, వాటిలో ఉన్న జనాభా స్థితిగతులు మారే అవకాశమే లేదు. అందువలన సదరు నివేదికను విడుదల చేసి పార్లమెంటు, అసెంబ్లీలు, ప్రజావేదికల మీద చర్చ చేస్తే తదుపరి తీసుకోవాల్సిన చర్యల గురించి ఎవరేమనుకుంటున్నదీ వెల్లడి అవుతుంది. స్వాతంత్య్రం వచ్చిన తరువాత 1953లో నాటి నెహ్రూ ప్రభుత్వం తొలిసారిగా కాకా కలేల్‌కర్‌ (దత్తాత్రేయ బాలకృష్ణ కలేల్‌కర్‌) వెనుకబడిన తరగతుల కమిషన్‌ ఏర్పాటు చేసింది. అది 2,399 కులాలను ఓబిసిలుగా గుర్తించింది, 70శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని, 1961లో కులగణన చేయాలని సిఫార్సు చేసింది. ఆ నివేదికను గోడవున్లో భద్ర పరిచారు. తరువాత జనతా పార్టీ హయాంలో బిపి మండల్‌ ఆధ్వర్యాన 1979లో రెండవ కమిషన్‌ ఏర్పాటు చేశారు. 1980లో ఆ నివేదిక వచ్చే సరికి ఇందిరా గాంధీ తిరిగి అధికారానికి వచ్చారు. దాన్ని కూడా గోడవున్‌కు పంపారు. నేషనల్‌ ఫ్రంట్‌ నాయకత్వాన ఏర్పాడిన ప్రభుత్వం 1990 ఆగస్టులో నాటి ప్రధాని విపి సింగ్‌ ఆ నివేదికను వెలికి తీయించి అమల్లో భాగంగా 27 శాతం రిజర్వేషన్లను ప్రకటించారు. బిల్లు ఆమోదం పొందినప్పటికీ అది కోర్టు వివాదాలకు దారితీసింది. న్యాయవాది ఇంద్రా సహానే ప్రభుత్వ ఉత్తరువులను సవాలు చేశారు. దాని మీద విచారణ జరిపిన సుప్రీం కోర్టు 1992 నవంబరు 16న ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు చెప్పింది. తొమ్మిది మంది సభ్యులున్న ధర్మాసనంలో ఆరుగురు అనుకూలంగా, ముగ్గురు వ్యతిరేకంగా మెజారిటీ తీర్పు వచ్చింది. సరిగ్గా ఈ సమయంలోనే దేశంలో నూతన ఆర్థిక విధానాల పేరుతో నయా ఉదారవాద విధానాలకు తెరలేచింది.ఈ నేపధ్యంలోనే ఉద్యోగాల రిజర్వేషన్లు 50శాతానికి మించకూడదని అవి కూడా ప్రభుత్వరంగంలో మాత్రమేనని, ప్రయివేటు రంగానికి వర్తించవని పేర్కొన్నది. ఆ తీర్పు ఇప్పటికీ అమల్లో ఉంది. తరువాత 2007లో రిజర్వేషన్లను విద్యా సంస్థలకూ వర్తింప చేశారు. లోక్‌సభ ఎన్నికలకు ముందు 2019లో నరేంద్రమోడీ సర్కార్‌ ఆర్థికంగా వెనుకబడిన తరగతుల వారికి పదిశాతం రిజర్వేషన్లు కల్పిస్తూ 103వ రాజ్యాంగ సవరణ చేసింది. దాన్ని కోర్టులో సవాలు చేయగా 2022 నవంబరు ఏడున 3:2 మెజారిటీతో సుప్రీం కోర్టు ఆమోదం తెలిపింది.


రిజర్వేషన్లు ఉన్నప్పటికీ ఉన్నత పోస్టులలో తగిన సామాజిక న్యాయం జరుగుతున్నదా, ఆ మేరకు ఆయా తరగతుల వారు లబ్ది పొందుతున్నారా అన్నది ప్రశ్నార్ధకంగా మారిన పూర్వరంగంలో 2017లో రోహిణీ కమిషన్ను ఏర్పాటు చేశారు. గత కాంగ్రెస్‌ ప్రభుత్వాల మాదిరిగానే మోడీ సర్కార్‌ ఇప్పటి వ్యవహరించింది తప్ప భిన్నంగా లేదు. పద్నాలుగుసార్లు నివేదిక పొడిగింపుతో వ్యవధి పెంచటం, నివేదిక సమర్పించి రెండు సంవత్సరాలు గడుస్తున్నా ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవటం దాన్నే సూచిస్తున్నది. అది అమల్లోకి వస్తే తాను ఎంతో కాలంగా సాగిస్తున్న సోషల్‌ ఇంజనీరింగ్‌ పేకమేడలా కూలిపోతుందని బిజెపికి తెలుసు కనుక జాగు చేస్తున్నది. ఆర్థికంగా వెనుకబడిన వారి (ఇడబ్ల్యుఎస్‌) రిజర్వేషన్లను ఎన్నికల కోసం ఎంతో వేగంగా తీసుకువచ్చిన పెద్దలు ఓబిసి వర్గీకరణ విషయంలో ఎందుకు జాగుచేస్తున్నట్లు ? బిసి కులగణన చేస్తే హిందూ సమాజంలో చీలికలు వస్తాయని గతంలో చెప్పిన మాటలను ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోవాలి. మొత్తంగా చూసినపుడు ఓబిసి, షెడ్యూలు కులాలు, తరగతులు దేశంలో అణచివేత, దోపిడీకి గురవుతున్న సామాజిక తరగతులే. అయితే ఇతర కులాల్లో పేదలు ఉన్నట్లే ఈ సామాజిక తరగతుల్లో కూడా ధనికులు, ముందున్న తరగతులు లేకపోలేదు. అందుకే రిజర్వేషన్ల ఫలాలను కొందరే ఎక్కువగా అనుభవిస్తున్నారు. రోహిణీ కమిషన్‌ నివేదిక దాన్నే నిర్ధారించినట్లు తెలుస్తున్నది. కమిషన్‌ అడిగిన కీలక సమాచారాన్ని ప్రభుత్వ శాఖలు ఇవ్వలేదనే ఒక విమర్శ మీడియాలో వచ్చింది.ఐఐటి, ఐఐఎం, ఐఐఎస్‌ వంటి అగ్రశ్రేణి విద్యా సంస్థలలో ఓబిసి రిజర్వేషన్లు సక్రమంగా అమలు జరగటం లేదనే విమర్శలు ఉన్నాయి.అదే గనుక నిజమైతే ఆ నివేదిక వెల్లడైన తరువాత దాన్ని వివాదాస్పదంగా మార్చే అవకాశం లేకపోలేదు. కోర్టుల్లో సవాలు చేయటం సరేసరి.


బిజెపిని వ్యతిరేకించే పార్టీలు సామాజిక న్యాయ నినాదాన్ని తీసుకున్నాయి. దాన్ని ఎదుర్కొనేందుకు నరేంద్రమోడీ తన మంత్రివర్గంలో, వివిధ రాష్ట్రాల బిజెపి మంత్రివర్గాల్లో ఓబిసిలకు గణనీయ ప్రాతినిధ్యం కల్పించి దాన్ని ఒక ఆయుధంగా వాడుతున్నారు. ఇది మిశ్రమ ఫలితాలను ఇచ్చినట్లు చెప్పవచ్చు. వెనుకబడిన తరగతుల్లో వర్గీకరణ ఇప్పటికే కొన్ని రాష్ట్రాల్లో అమలు జరుగుతున్నది. రోహిణీ కమిషన్‌ నివేదికలో లోపాల గురించి చెప్పాల్సి వస్తే 2018 తరువాత జరిగిన నియామకాలకు సంబంధించి ఎలాంటి పరిశీలన కమిషన్‌ చేయలేదు. వెల్లడి తరువాత కొన్ని సవాళ్లు కూడా ఎదురుకానున్నాయి.ఉత్తర ప్రదేశ్‌లో చేనేత, దూదేకటం వంటి కొన్ని వృత్తులు చేసే ముస్లింలు, బీహార్‌లో దర్జీలు ఓబిసి జాబితాలో ఉండగా హిందువులు లేరని రోహిణీ కమిషన్‌ గుర్తించినట్లు నిర్దారణగాని వార్త. వివిధ రాష్ట్రాలలో ఇలాంటి సమస్యలు, బిజెపి మత అజెండాకు దీనికి ఘర్షణ తలెత్తవచ్చు. అందుకే వెల్లడిరచటానికి జాగు చేస్తున్నట్లా ? నాడు అధికారంలో లేదు గనుక మండల్‌కు వ్యతిరేకంగా కమండలాన్ని ముందుకు తెచ్చిందని విమర్శలు ఎదుర్కొన్న బిజెపి ఇప్పుడు తానే అధికారంలో ఉందిగనుక ఏం చేస్తుందో చూద్దాం !

ప్రపంచమా గాజాను మరచిపోవద్దు : ఇజ్రాయెల్‌ దాడిలో ప్రాణాలు వదలిన ఓ జర్నలిస్టు ఆఖరి కోరిక !!

Tags

, , , , , ,


ఎం కోటేశ్వరరావు


2023 అక్టోబరు ఏడున గాజాలో ఇజ్రాయెల్‌ ప్రారంభించిన మారణకాండ మరోదశలో ప్రవేశించే సూచనలు కనిపిస్తున్నాయి. హమస్‌ను అంతమొందించేందుకు గాజా స్వాధీనం తప్పదని ఇజ్రాయెల్‌ ప్రధాని నెతన్యాహు ప్రకటించాడు. ఇప్పటి వరకు 75వేల మంది వరకు నిరాయుధులైన పాలస్తీనియన్లను ఇజ్రాయెల్‌ మిలిటరీ చంపివేసింది. వీరిలో సగానికి పైగా పిల్లలు, మహిళలు ఉన్నారు. దాదాపు రెండు లక్షల మందిని గాయపరిచారు, లక్షలాది ఇండ్లు, ఆసుపత్రులు, విద్యాసంస్థలను నేలమట్టం గావించారు. అయినప్పటికీ హమస్‌, ఇతర సాయుధ బృందాలను పట్టుకోవటంలో విఫలమైంది. వారిని పట్టుకోవాలంటే గాజాను పూర్తిగా తన స్వాధీనంలో తెచ్చుకోవాలని ఇజ్రాయెల్‌ చెబుతోంది. నిజానికి ఒక విధంగా గాజా ప్రస్తుతం ఇజ్రాయెల్‌ ఆక్రమణలోనే ఉంది. ఆకలితో మాడుతున్న పసిపిల్లలకు అవసరమైన ఆహారసాయాన్ని కూడా రాకుండా మిలిటరీ అడ్డుకుంటున్నది, సహాయ శిబిరాల వద్దకు వచ్చిన వారిని కూడా చంపివేస్తున్నది. ప్రపంచంలో అనేక యుద్ధాలు, ఉద్రిక్తతల సమయంలో వార్తలను సేకరించే జర్నలిస్టులకు రక్షణ ఉంటుంది, ప్రమాదవశాత్తూ గాయపడటం, మరణించటం వేరు. కానీ గాజాలో ఇప్పటి వరకు 242 మంది జర్నలిస్టులను ఇజ్రాయెల్‌ బలగాలు చంపివేశాయి. తాజాగా అల్‌ జజీరా టీవీ, పత్రికలకు వార్తలు సేకరిస్తున్న జర్నలిస్టులను హతమార్చారు, ఏమిటంటే వారంతా హమస్‌ సాయుధులతో కలసి ఉన్నారంటూ పచ్చి అబద్దాలను ప్రచారం చేస్తున్నారు. అనాస్‌ అల్‌ షరీఫ్‌ అనే ఆల్‌ జజీరా విలేకరి తన కుటుంబం, ప్రపంచానికి ఎక్స్‌ ద్వారా ఒక చివరి సందేశం పంపాడు.‘‘ ఇది చివరి వర్తమానం, మీకు అందే సమయానికి ఇజ్రాయెల్‌ నన్ను చంపివేస్తుంది, నా గళాన్ని అణచివేస్తుంది, ప్రపంచం గాజాను మరచిపోవద్దు ’’ అని దానిలో ఉంది. ఆదివారం రాత్రి అది నిజమైంది. గాజాలోని ఆల్‌ షిఫా ఆసుపత్రి సమీపంలో జర్నలిస్టులు ఉన్నారనే చిహ్నాలు ఉన్న గుడారాన్ని లక్ష్యంగా చేసుకొని జరిపిన వైమానిక దాడిలో అల్‌ షరీఫ్‌తో పాటు తమ జర్నలిస్టులు మరో నలుగురితో సహా ఏడుగురిని చంపినట్లు అల్‌ జజీరా తెలిపింది.


ఓ జర్నలిస్టు చివరి సందేశం
అనాస్‌ అల్‌ షరీఫ్‌ చివరి సారిగా ఎక్స్‌లో పంపిన వర్తమానం ఇలా ఉంది.‘‘ ఇది నా వాంఛ మరియు చివరి వర్తమానం. ఇది మీకు చేరేలోపు ఇజ్రాయెల్‌ నన్ను చంపటంలో జయప్రదం అవుతుంది, నా గళం మూగపోయేట్లు చేస్తుంది. మొదటిది మీకు శాంతి చేకూరాలి, అల్లా దయ మరియు దీవెనలు మీకు కలగాలి. జబాలియా శరణార్ధి శిబిరంలో నేను జన్మించి కళ్లు తెరిచినప్పటి నుంచి అక్కడి వీధులు, సందుల్లో తిరుగాడుతూ నా జనం కోసం గళం విప్పి మద్దతు ఇచ్చిన ప్రతి అంశం గురించి అల్లాకు తెలుసు. మా స్వంత పట్టణమైన ఆక్రమిత అస్కలాన్‌( అల్‌ మజదాల్‌)కు తిరిగి వచ్చేందుకు అల్లా నా జీవితాన్ని పొడిగిస్తాడని ఆశిస్తున్నాను, అందువలన నేను నాకుటుంబం, ప్రేమించేవారిని కలుసుకొనేందుకు తిరిగివస్తాను. అయితే అల్లా వాంఛ ముందు మరియు ఆయన ఆదేశమే అంతిమం.
నేను బాధల మధ్యనే జీవించాను, అనేక నష్టాలు, ఇబ్బందులను చవిచూశాను. అయినప్పటికీ ఎలాంటి వక్రీకరణలు, తప్పుడు సమాచారం లేకుండా ఉన్నది ఉన్నట్లుగా నిజాన్ని చేరవేసేందుకు ఒక్కసారి కూడా నేను వెనుకాడలేదు.ఏడాదిన్నరకు పైగా మన జనాలు ఎదుర్కొంటున్న ఊచకోతను ఆపేందుకు ఏమీ చేయని వారిని, మన పిల్లలు, మహిళల శరీరాలు ఛిద్రమైనా చలించని హృదయాలు కలవారిని, మౌనంగా దూరంగా ఉన్నవారిని, మన హత్యలను ఆమోదించిన వారిని, మన శ్వాసను ఆడనివ్వని వారిని అందరినీ అల్లా చూస్తున్నాడు.
ముస్లిం సమాజ కిరీటంలో మణి, ఈ ప్రపంచంలోని ప్రతి స్వేచ్చా జీవి గుండె చప్పుడు వంటి పాలస్తీనాను మీకు అప్పగిస్తున్నాను. దాని జనాన్ని, తప్పు చేసిన వారినీ, రక్షణ, శాంతిలేకుండా జీవించేందుకు లేదా కలలు కనేందుకు కూడా ఎన్నడూ సమయంలేని అమాయకులైన పిల్లలతో పాటు మీకు అప్పగిస్తున్నాను. వేలాది టన్నుల ఇజ్రాయెలీ బాంబులు, క్షిపణులతో నిర్మలమైన వారి శరీరాలు నలిగిపోయాయి, ఛిద్రమైన వారి భాగాలు అంతటా పడ్డాయి. బంధనాలు మిమ్మల్ని మౌనంగా ఉంచలేవు, సరిహద్దులు ఏమీ చేయలేవు. అపహరించిన మన మాతృభూమిలో స్వేచ్చ, హుందాతనపు సూర్యుడు ఉదయించే వరకు మన భూమి, పౌరుల విముక్తి కోసం మీరు వారధులుగా మారండి.
నా కుటుంబ మంచిచెడ్డలను మీకు అప్పగిస్తున్నాను. నేను కలలు కన్నవిధంగా నా కుమార్తె షామ్‌ ఎదగటాన్ని చూసే అవకాశం నాకు రాలేదు. నాకళ్ల వెలుగైన ఆమెను మీకు అప్పగిస్తున్నాను. నా భారం మోసేంతవరకు మరియు నా లక్ష్యాన్ని సాధించేవరకు అతని పెరుగుదలకు నా ప్రియమైన కుమారుడు సాలాప్‌ాను కూడా మీకు అప్పగిస్తున్నాను. నేను ప్రేమించే నా మాతృామూర్తిని కూడా మీకు అప్పగిస్తున్నాను.నేను ఇలా ఉండటానికి ఆమె చేసిన ప్రార్ధనలే కారణం. అవేనాకు పెట్టని కోట, ఆమె ఇచ్చిన వెలుగు బాట నాది. ఆమెకు శక్తిని ప్రసాదించాలని, శుభం కలగాలని నా తరఫున అల్లాను ప్రార్ధిస్తున్నాను.
నా జీవితకాల సహచరి, భార్య ఉమ్‌ సాలాప్‌ా(బయాన్‌) బాధ్యతను కూడా మీకు అప్పగిస్తున్నాను. యుద్ధం మమ్మల్ని రోజులు, నెలల తరబడి విడదీసింది. వంగని ఆలివ్‌ చెట్టు కొమ్మలా ధీటుగా ఆమె నిలిచింది, బంధానికి కట్టుబడి ఉంది, సహనంతో ఆల్లా మీద విశ్వాసంతో ఉంది. నా పరోక్షంలో ఆమె బాధ్యతలను నిర్వహించేందుకు ఆమె తన యావత్‌ శక్తి, విశ్వాసాన్ని వినియోగిస్తున్నది. వారందరికీ మీరు అండగా నిలవాలని కోరుతున్నాను, అల్లా తరువాత మీరే వారికి మద్దతు ఇవ్వాలి.
నేను గనుక మరణిస్తే, నా సిద్దాంతాలకు గట్టిగా నిలిచి నేను మరణించేందుకు సిద్దం. నేను అల్లా ఆదేశాలకు అనుగుణంగా నడుస్తానని ప్రమాణం చేశాను, నేను ఆయన్ను తప్పకుండా కలుసుకుంటాను. ఆయనతో ఎప్పటికీ నిలిచి ఉంటానని హామీ ఇస్తున్నాను. ఓ అల్లా అమరజీవుల్లో నన్ను ఒకరిగా స్వీకరించు, నా గత, భవిష్యత్‌ పాపాలను క్షమించు. నాజనం, నా కుటుంబం స్వేచ్చా బాటలో నడిచేందుకు అవసరమైన వెలుగునిచ్చేందుకు నా రక్తం తోడ్పడేట్లు చేయి. ఆకాంక్షలకు అనుగుణంగా నేను లేనట్లయితే నన్ను క్షమించు.
నా వాగ్దానాన్ని నిలుపుకొనేందుకు దాన్ని ఎన్నడూ మార్చుకోకుండా, ద్రోహం చేయకుండా ఉండేందుకు దయతో నాకోసం ప్రార్ధించండి. గాజాను మరచిపోవద్దు. క్షమ మరియు మీలో ఒకడిగా అంగీకరించేందుకు మీరు చిత్తశుద్దితో చేసే ప్రార్ధనల్లో నన్ను మరవకండి.’’


హృదయాలను కదలించే చివరి సందేశం పంపిన అనాస్‌ అల్‌ షరీఫ్‌ 28 సంవత్సరాల యువకుడు, జర్నలిస్టు, వీడియో గ్రాఫర్‌. అతని స్వస్థలం ప్రస్తుతం ఇజ్రాయెల్‌ ఆక్రమణలో ఉంది.పాలస్తీనా విముక్తి పోరులో ప్రాణాలకు తెగించి వార్తలను అందిస్తున్నవారిలో ఒకడు. అతనికి హమస్‌ తీవ్రవాది ముద్రవేసిన ఇజ్రాయెల్‌ మిలిటరీ గత రెండు సంవత్సరాలుగా చంపివేస్తామని అనేక సార్లు బెదిరించింది. అది చంపదలుకున్నవారందరికీ ఏదో ఒక ముద్రవేస్తున్నది. ఇజ్రాయెల్‌ ఆరోపణను ఐరాస తిరస్కరించింది. గాజా మారణకాండకు సంబంధించి అతను తీసిన ఫొటోకు 2024లో పులిట్జర్‌ బహుమతి ఇచ్చారు. రెండు సంవత్సరాలుగా అల్‌ జజీరాలో పనిచేస్తున్నాడు. గత నెలలో ఆకలితో చంపుతున్న ఇజ్రాయెల్‌ దుశ్చర్యను వెలుగులోకి తెచ్చాడు. అప్పటి నుంచి అతని కోసం ఇజ్రాయెల్‌ మిలిటరీ వేట ప్రారంభించి చివరకు ఆగస్టు పది రాత్రి విమానాలతో దాడి చేసి హతమార్చింది.


అల్‌ షరీఫ్‌ వంటి ఎందరో పాలస్తీనియన్లు శరణార్ధి శిబిరాల్లోనే పుట్టి అక్కడే పెరిగి చివరికి అదే ఇజ్రాయెల్‌ దుర్మార్గాలకు అక్కడే మరణిస్తున్నారు. గత ఎనిమిది దశాబ్దాలుగా సాగుతున్న మారణకాండ, పోరు అలాంటి ఎందరినో మాతృభూమి కోసం ప్రాణాలు అర్పించేందుకు సిద్దం చేస్తున్నది తప్ప పిరికిబారేట్లు చేయటం లేదు. 2023 అక్టోబరు ఏడు నుంచి ఇప్పటి వరకు 242 మంది జర్నలిస్టులను చంపినట్లు ఐరాస పేర్కొన్నది. రెండు ప్రపంచ యుద్దాలు, వియత్నాం, ఇరాక్‌, ఆఫ్ఘనిస్తాన్‌ దురాక్రమణ వంటి అనేక యుద్ధాలన్నింటిలో కూడా ఇంత మంది ప్రాణాలు కోల్పోలేదని విశ్లేషకులు పేర్కొన్నారు.ఇటీవలి సంవత్సరాలలో జర్నలిస్టులకు ప్రాణాంతక, అత్యంత ప్రమాదకరంగా ఉన్న ఉదంతం ఈ మారణకాండ. తనకు అనుకూలంగా వార్తలు ఇచ్చే వారిని తప్ప అంతర్జాతీయ జర్నలిస్టులను గాజాలో ప్రవేశించకుండా ఇజ్రాయెల్‌ అడ్డుకుంటున్నది. ఈ నేపధ్యంలో స్థానిక పాలస్తీనియన్లే విలేకర్లుగా మారి ఆల్‌ జజీరా వంటి మీడియా సంస్థలకు వార్తలను అందిస్తున్నారు. అది కూడా లేనట్లయితే అసలు గాజాలో ఏం జరుగుతున్నదో బయటి ప్రపంచానికి తెలిసే అవకాశమే ఉండేది కాదంటే అతిశయోక్తి కాదు.


గాజాలో తాజా పరిణామాల విషయానికి వస్తే హమస్‌ ఆయుధాలు విసర్జింతవరకు దాడులు చేయటం తప్ప మరొకమార్గం లేదని ఇజ్రాయెల్‌ ప్రధాని నెతన్యాహు ప్రకటించాడు. ప్రస్తుతం 70నుంచి75శాతం వరకు తమ ఆధీనంలో ఉందని చెప్పాడు.హమస్‌కు రెండు గట్టి స్థావరాలు ఉన్నాయని పూర్తిగా తుదముట్టించాలంటే గాజా స్వాధీనం చేసుకోవాల్సిందే అన్నాడు. ఈ వైఖరిని అనివార్యమై కొన్ని పశ్చిమదేశాలు బహిరంగంగా వ్యతిరేకిస్తున్నప్పటికీ అమెరికా అండతో ఈ దుర్మార్గానికి పూనుకున్నాడు. గాజాలో దాడులకు ఉపయోగించే ఆయుధాలను ఇజ్రాయెల్‌కు నిరవధికంగా నిలిపివేస్తున్నట్లు జర్మనీ ప్రకటించింది. అయితే నిజంగా అమలు చేస్తుందా లేక వేరే మార్గాల ద్వారా సరఫరా చేస్తుందా అన్నది చెప్పలేము.హమస్‌కు వ్యతిరేకంగా ఆత్మరక్షణ చేసుకొనే హక్కు ఇజ్రాయెల్‌కు ఉన్నదని జర్మనీ ఇదే సందర్భంగా పేర్కొన్నది. పాలస్తీనా ప్రాంతాలను ఆక్రమించిన ఇజ్రాయెల్‌ గత ఏడు దశాబ్దాల నుంచి చెబుతున్న ఆత్మరక్షణ కతలను పశ్చిమదేశాలు సమర్ధిస్తున్న సంగతి తెలిసిందే. ఆ పేరుతో పాలస్తీనాను అడ్డుకోవటం అడ్డగోలు వ్యవహారం తప్ప మరొకటి కాదు.జర్మనీ గతంలో సరఫరా చేసిన ఫ్రైగేట్స్‌తోనే గాజాపై ఇజ్రాయెల్‌ నౌకాదళం తొలి దాడులు జరిపింది.


గాజా ఆక్రమణను అడ్డుకొనేందుకు ముస్లిం దేశాలన్నీ ఐక్యం కావాలని టర్కీ, ఈజిప్టు పిలుపునిచ్చాయి. ఈజిప్టుతో చర్చలు జరిపిన తరువాత విదేశాంగశాఖ మంత్రి బదర్‌ అబ్దెలెటీతో కలసి టర్కీ విదేశాంగ మంత్రి హకన్‌ ఫిదాన్‌ శనివారం నాడు విలేకర్ల సమావేశంలో ఈ పిలుపునిచ్చారు. రెండు దేశాలూ ఇజ్రాయెల్‌ చర్యను ఖండిరచాయి.తక్షణమే ఇస్లామిక్‌ దేశాల సంస్ధ సమావేశం జరపాలని కోరారు. ఇజ్రాయెల్‌ చర్య ఒక్క పాలస్తీనాకే గాక ఇరుగుపొరుగు దేశాలన్నింటికీ ప్రమాదమే అని పేర్కొన్నారు. ఇస్లామిక్‌ దేశాల సంస్థ విదేశాంగ మంత్రుల కమిటీ కూడా ఖండిరచింది. భద్రతా మండలి, ప్రపంచ అగ్రరాజ్యాలు జోక్యం చేసుకోవాలని కోరింది. లక్షలాది మంది ఇజ్రాయెల్‌ పౌరులు రాజధాని టెల్‌ అవీవ్‌, ఇతర నగరాల్లో గాజా దురాక్రమణ ప్రతిపాదనను ఖండిస్తూ పెద్ద ఎత్తున ప్రదర్శనలు చేశారు. ప్రభుత్వ చర్యకు సైనికులు మద్దతు ఇవ్వరాదని నినదించారు. హమస్‌ వద్ద బందీలుగా ఉన్నవారిని విడిపించేందుకు అవసరమైతే నెతన్యాహు ప్రభుత్వ వైఖరిని నిరసనగా సాధారణ సమ్మె జరపాలని బందీల కుటుంబ సభ్యులు పిలుపునిచ్చారు. స్వజనంతో పాటు ప్రపంచ వ్యాప్తంగా ఇజ్రాయెల్‌ చర్యలకు నానాటికీ వ్యతిరేకత వెల్లడవుతున్నప్పటికీ డోనాల్డ్‌ ట్రంప్‌ వైఖరిలో ఎలాంటి మార్పు లేదు, నిస్సిగ్గుగా మద్దతు ప్రకటిస్తున్నాడు. మరింత పెద్ద ఎత్తున నిరసనోద్యమం జరిగితే తప్ప ఇజ్రాయెల్‌ వెనుకడుగువేసే అవకాశం లేదు.

బాంబే హైకోర్టు సుభాషితాల ప్రకారం ‘‘దుమ్ము రేపుతున్న’’ నరేంద్రమోడీ దేశభక్తుడా, కాదా !

Tags

, , , , ,

ఎం కోటేశ్వరరావు


‘‘ దేశభక్తులుగా ఉండండి, దేశంలో ఉన్న సమస్యలను చేపట్టండి :బాంబే హైకోర్టు ’’ మీడియా వార్తల్లో వచ్చిన ఒక శీర్షిక ఇది. గాజాలో ఇజ్రాయెల్‌ మారణకాండకు నిరసనగా అజాద్‌ మైదానంలో తలపెట్టిన ప్రదర్శనకు ముంబై పోలీసులు అనుమతి నిరాకరించారు. ఆ చర్యకు వ్యతిరేకంగా సిపిఐ(ఎం) దాఖలు చేసిన పిటీషన్ను కొట్టివేస్తూ బాంబే హైకోర్టు డివిజన్‌ బెంచ్‌ తీర్పు ఇచ్చింది.సిపిఎం తరఫున మానవ, పౌరహక్కుల సీనియర్‌ న్యాయవాది మిహిర్‌ దేశాయ్‌ వాదించారు. కోర్టు నిర్ణయం సరైనదా కాదా అన్నది ఒక అంశమైతే ఈ సందర్భంగా డివిజన్‌ బెంచ్‌లోని న్యాయమూర్తులు రవీంద్ర ఘాగే, గౌతమ్‌ అఖద్‌ చేసిన వ్యాఖ్యలు ఆలోచింపచేసేవిగా, ఆందోళన కలిగించేవిగా ఉన్నాయి. అవి రాజ్యాంగ వ్యతిరేకమైనవని సిపిఐ(ఎం) పొలిట్‌బ్యూరో ఒక ప్రకటనలో విమర్శించింది. ఎస్‌ఎం గోరవాద్‌కర్‌ అనే సీనియర్‌ న్యాయవాది సిపిఎం ప్రకటన నేరపూరితంగా ఉందని, న్యాయమూర్తులకు దురుద్దేశ్యాలను ఆపాదించేదిగా ఉన్నందున కోర్టే స్వయంగా చర్య తీసుకోవాలని ఆగస్టు నాలుగవ తేదీన ఒక పిటీషన్‌ దాఖలు చేశారు. ఎలాంటి చర్యలు అవసరం లేదంటూ కోర్టు దాన్ని కొట్టివేసింది.


ఇటీవలి కాలంలో కోర్టులు ఇస్తున్న తీర్పులు, ఆదేశాలు అనేకం వివాదాస్పదం అవుతున్నాయి. విచారణల సందర్భంగా న్యాయమూర్తులు చేసే వ్యాఖ్యలు కూడా విమర్శలకు దారితీస్తున్నాయి. తాజా ఉదంతానికి వస్తే అలహాబాద్‌ హైకోర్టు న్యాయమూర్తి ప్రశాంతకుమార్‌ క్రిమినల్‌ కేసులను విచారించకూడదంటూ సుప్రీం కోర్టు డివిజన్‌ బెంచి ఇచ్చిన ఆదేశం వివాదాస్పదమైంది. ఈ ఆదేశాన్ని అమలు జరపకుండా చూసేందుకు కోర్టు మొత్తాన్ని సమావేశపరచాలని పదమూడు మంది అలహాబాద్‌ హైకోర్టు న్యాయమూర్తులు హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌ అరుణ్‌ భన్సాలీకి లేఖ రాశారు. దీంతో సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి బి ఆర్‌ గవాయ్‌ జోక్యం చేసుకోవటంతో గతంలో ఇచ్చిన ఉత్తరువును కోర్టు వెనక్కు తీసుకుంది. అసలు అలాంటి పరిస్థితి ఎందుకు తలెత్తిందన్నది కీలకమైన అంశం.మణిపూర్‌ హైకోర్టు తన పరిధిలో లేని గిరిజనేతరులను గిరిజనులుగా మార్చే రిజర్వేషన్ల అంశంపై జారీ చేసిన ఆదేశాలతో ఆ రాష్ట్రంలో వ్యతిరేకులు, అనుకూల సామాజిక తరగతుల మధ్య తలెత్తిన ఘర్షణలు, దాడులతో 2023 మే మూడవ తేదీ నుంచి రాష్ట్రంలో అల్లకల్లోలం తలెత్తింది, ప్రస్తుతం రాష్ట్రపతి పాలనలో ఉంది, ఎప్పుడు సాధారణ పరిస్థితి నెలకొంటుందో తెలియని స్థితి. దీనికి మూలం కోర్టు ఆదేశాలే. న్యాయమూర్తులందరూ పత్తిత్తులు కాదని గతంలో కొందరు, తాజాగా హైకోర్టు జస్టిస్‌ యశ్వంతవర్మ ఉదంతం వెల్లడిరచింది. జ్యుడిషియల్‌ యాక్టివిజమ్‌(న్యాయమూర్తుల ఆచరణతత్వం) రెండంచుల పదనుగల కత్తి వంటిది. చట్టంలో దీనికి అవకాశం ఉందా లేదా పరిధి ఏమిటి అన్నది ఒక చర్చ. ఈ యాక్టివిజమ్‌లో భాగంగా చేస్తున్న వ్యాఖ్యలు కొన్ని విమర్శలకు, మరికొన్ని ప్రశంసలకు అర్హమైనవి. బాంబే హైకోర్టు న్యాయమూర్తుల వ్యాఖ్యలు మొదటి కోవకు చెందినవని చెప్పవచ్చు. తీర్పులను విమర్శించే స్వేచ్చ మనకు రాజ్యాంగం కల్పిస్తున్నది గానీ న్యాయమూర్తులకు దురుద్దేశ్యాలను ఆపాదించకూడదు. ఇంతకూ సిపిఎం తన ప్రకటనలో చేసిన వ్యాఖ్యలేమిటి ? దాని పూర్తి పాఠం దిగువ విధంగా ఉంది.


‘‘ రాజ్యాంగ వ్యతిరేకమైన బాంబే హైకోర్టు వ్యాఖ్యలకు ఖండన
గాజాలో కొనసాగుతున్న ఇజ్రాయెల్‌ మారణకాండకు వ్యతిరేకంగా నిరసన తెలిపేందుకు ు అనుమతించని ముంబై పోలీసు చర్యను సవాలు చేస్తూ పార్టీ దాఖలు చేసిన దరఖాస్తును తిరస్కరించిన సందర్భంగా బాంబే హైకోర్టు చేసిన వ్యాఖ్యలను సిపిఐ(ఎం) పొలిట్‌ బ్యూరో తీవ్రంగా ఖండిస్తున్నది. ఈ సందర్భంగా పార్టీ దేశభక్తిని ప్రశ్నించేవరకూ కోర్టు వెళ్లింది. ఒక రాజకీయ పార్టీకి రాజ్యాంగం ప్రసాదించిన అంశాల గురించి లేదా పాలస్తీనియన్లు మరియు వారి న్యాయబద్దమైన మాతృభూమి హక్కుకు మన దేశం మరియు మన పౌరులు ప్రదర్శించిన సంఫీుభావ చరిత్ర గురించి గానీ హైకోర్టుకు తెలియనట్లుగా కనిపించటం హాస్యాస్పదంగా ఉంది. కోర్టు వ్యాఖ్యలు కేంద్ర ప్రభుత్వ వైఖరికి అనుగుణంగా స్పష్టమైన రాజకీయ వివక్షతో కూడినవిగా ఉన్నాయి. కోర్టు బెంచ్‌ వ్యాఖ్యలు ఇలా ఉన్నాయి, ‘‘ పాలస్తీనా లేదా ఇజ్రాయెల్‌ పక్షానికి అనుకూలంగా గానీ ఇచ్చే మద్దతు రేపే దుమ్ము(వివాదం) గురించి మీకు తెలియదు. మీరెందుకు ఇలా చేయాలని కోరుకుంటున్నారు. మీరు ప్రాతినిధ్యం వహించే పార్టీ చర్య దేశ విదేశీ వ్యవహారాలకు చేసేదేమిటో మీకు అర్ధం కావటం లేదని స్పష్టంగా కనిపిస్తున్నది. మీ సంస్థ భారత్‌లో నమోదైన వాటిలో ఒకటి. చెత్త కుమ్మరింపు, కాలుష్యం, మురుగు, వరదల వంటి అంశాలను మీరు తీసుకోవచ్చు. మేం కొన్ని ఉదాహరణలు మాత్రమే చెబుతున్నాం. మీరు వాటి మీద నిరసనలు తెలపటం లేదు కానీ దేశానికి కొన్నివేల మైళ్ల దూరంలో జరుగుతున్నదాని మీద చేస్తున్నారు.’’
గత శతాబ్ది 40వ దశకంలో మహాత్మాగాంధీ, జాతీయోద్యమం, తరువాత స్వతంత్ర భారత్‌ విదేశాంగ విధానం గానీ పాలస్తీనియన్ల స్వేచ్చాహక్కు మరియు మాతృభూమికి మద్దతు ఇవ్వటానికి సంకోచించలేదు. ఐరాస సంస్థలు మరియు అంతర్జాతీయ న్యాయస్థానం వెల్లడిరచిన వైఖరులు మరియు ఇజ్రాయెల్‌ చర్యలకు వ్యతిరేకంగా ప్రపంచ వ్యాపితంగా అసందిగ్దంగా తెలుపుతున్న మద్దతు వాస్తవాన్ని గానీ కోర్టు గుర్తించినట్లు లేదు. స్వేచ్చ, ప్రజాస్వామ్యాలను ప్రేమించే దేశ పౌరులు ఇలాంటి గర్హÛనీయమైన వైఖరిని ఎలాంటి శషభిషలు లేకుండా తిరస్కరించేందుకు మాతో కలవాలని విజ్ఞప్తి చేస్తున్నాం ’’ అని పేర్కొన్నది.


బాంబే హైకోర్టు న్యాయమూర్తులు చేసిన వ్యాఖ్యలను పూర్తిగా సిపిఐ(ఎం) తన ప్రకటనలో ప్రస్తావించలేదు. మీడియాలో వచ్చిన వార్తల్లోని అంశాలు కొన్ని దిగువ విధంగా ఉన్నాయి. ‘‘ మన దేశానికి చాలా సమస్యలున్నాయి. ఇలాంటి వాటిని మేము కోరుకోవటం లేదు. మీరు సంకుచిత దృష్టితో ఉన్నారని చెప్పాల్సి వచ్చి నందుకు నేను విచారిస్తున్నాను. మీరు గాజా మరియు పాలస్తీనా సమస్యలను చూస్తున్నారు మీ స్వంత దేశం గురించి చూడండి.దేశ భక్తులుగా ఉండండి, ఇది దేశభక్తి కాదు.(డెక్కన్‌ హెరాల్డ్‌)’’ సిపిఐ(ఎం) చేసిన ప్రకటన కోర్టులను ధిక్కరించేదిగా, న్యాయవ్యవస్థ మీద విశ్వాసాన్ని పోగొట్టేదిగా ఉన్నందున స్వయంగా హైకోర్టు చర్య తీసుకోవాలని కోరుతూ సీనియర్‌ న్యాయవాది ఎస్‌ఎం గోరవాద్‌కర్‌ దాఖలు చేసిన దరఖాస్తును హైకోర్టు కొట్టి వేసింది. ఎలాంటి చర్యలూ అవసరం లేదని పేర్కొన్నది, తమ వ్యాఖ్యల మీద ఆ పార్టీ తన అభిప్రాయాన్ని వెల్లడిరచిందని మాత్రమే చెప్పింది. హైకోర్టు న్యాయమూర్తులు వెల్లడిరచిన అభిప్రాయాలను ఆసరా చేసుకొని ఆర్‌ఎస్‌ఎస్‌ పత్రిక ఆర్గనైజర్‌ కమ్యూనిస్టుల మీద మరోసారి విషం కక్కింది.ఆధారం లేని ఆరోపణలు చేసింది. వారెప్పుడూ రష్యా, చైనాలకు విధేయులుగా ఉంటారని వ్యాసకర్త సెలవిచ్చారు. దశాబ్దాల నాటి మైండ్‌ సెట్‌ నుంచి ఇంకా బయటపడినట్లు లేదు, రష్యాను కూడా కమ్యూనిస్టు దేశంగా ఇప్పుడు కూడా పేర్కొన్నారు. పాడిరదే పాడరా అన్నట్లుగా అరిగిపోయిన రికార్డును మళ్లీ వినిపించారు.


‘‘ పాలస్తీనా పక్షం లేదా ఇజ్రాయెల్‌ పక్షానికి అనుకూలంగా గానీ ఇచ్చే మద్దతు రేపే దుమ్ము(వివాదం) గురించి మీకు తెలియదు ’’ అంటూ సిపిఎంకు చెప్పిన సుభాషితం ప్రధాని నరేంద్రమోడీకి వర్తిస్తుందా ? ఆయన దేశభక్తుడా కాదా ? హమస్‌ సాయుధులు 2023 అక్టోబరు ఏడవ తేదీన గాజా నుంచి ఇజ్రాయెల్‌లో ప్రవేశించి 1,195 మందిని చంపి 251 మందిని బందీలుగా పట్టుకున్నారు. ఆ మరుసటి రోజు నుంచి హమస్‌ సాయుధులను పట్టుకొనే పేరుతో ఇజ్రాయెల్‌ మిలిటరీ జరుపుతున్నదాడుల్లో ఇప్పటి వరకు 61వేల మందిని చంపారు, వారిలో సగానికి పైగా పిల్లలు, మహిళలు. మరో లక్షా 52వేల మందిని గాయపరిచారు. లక్షలాది ఇండ్లు, ఆసుపత్రులు, విద్యా సంస్థలను నేలమట్టం గావించారు. గాజా ప్రాంతాన్ని పూర్తిగా ఆక్రమించేందుకు పూనుకున్నారు. హమస్‌ చర్యను మనదేశంలో ఏ ఒక్క పార్టీ కూడా సమర్ధించలేదు. పాలస్తీనియన్ల మీద, వారికి ప్రాతినిధ్యం వహించే సాయుధ సంస్థలతో ఇజ్రాయెల్‌ మిలిటరీ, దాని మద్దతు ఉన్న సాయుధ బృందాల మధ్య దాడులు, ప్రతిదాడులు ఈ నాటివి కాదు. వాటి కొనసాగింపుగా హమస్‌ దాడులు చేసింది, నిరాయుధులుగా ఉన్న పాలస్తీనా పౌరులు లేదా ఇజ్రాయెల్‌ పౌరులను చంపటం ఎవరు చేసినా తప్పే. హమస్‌ దాడుల గురించి గుండెలు బాదుకుంటున్నవారు, గడచిన ఎనిమిది దశాబ్దాలుగా పాలస్తీనా ఆక్రమణకు పూనుకోవటం, ఇజ్రాయెల్‌ చేస్తున్న మారణకాండ గురించి పల్లెత్తు మాట్లాడటం లేదు.హమస్‌ దాడి తరువాత మన ప్రధాని నరేంద్రమోడీ ఇజ్రాయెల్‌కు మద్దతుగా మాట్లాడారు, దానికి మద్దతుగా ఉంటామని చెప్పారు. పాలస్తీనియన్లను హత్య కావించటం తప్పు అంటారే తప్ప దానికి బాధ్యురాలైన ఇజ్రాయెల్‌ను ఇంతవరకు ఖండిరచలేదు. మనదేశంలో ఎన్నో సమస్యలుండగా ఎక్కడో జరిగిన వాటి మీద నరేంద్రమోడీ, కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిని దేశంలో ప్రతిపక్షాలన్నీ తప్పు పట్టాయి. హైకోర్టు న్యాయమూర్తుల సుభాషితాల ప్రకారం మోడీ నోరు మూసుకొని ఉండాలి కదా, ఎందుకు ఇజ్రాయెల్‌కు మద్దతుగా మాట్లాడినట్లు ? రాజ్యాంగం ప్రకారం ప్రధాని ఒక రాజకీయ పార్టీ నాయకుడు, ఇజ్రాయెల్‌ పట్ల గత ప్రభుత్వాలు తీసుకున్న వైఖరికి భిన్నంగా వ్యవహరించి ‘‘ దుమ్ము(వివాదం)’’ రేపారు. తమ మీద తిరుగుబాటు చేసి భారత్‌లో ప్రవాస ప్రభుత్వం ఏర్పాటు చేసిన దలైలామా 90వ జన్మదినోత్సం, అంతకు ముందు అరుణాచల్‌ ప్రదేశ్‌ సందర్శన సందర్భంగా చైనా అభ్యంతరాలు తెలిపినా మన ప్రభుత్వం, ప్రధాని కూడా ఖాతరు చేయలేదు, అది రెండు దేశాల మధ్య ‘‘దుమ్ము ’’ రేపింది. చైనా తిరుగుబాటు రాష్ట్రమైన తైవాన్‌లో అధికారానికి వచ్చిన చైనా వ్యతిరేక ప్రభుత్వ ప్రమాణ స్వీకారానికి తన ప్రతినిధిని పంపి బిజెపి ‘‘ దుమ్ము ’’ రేపింది. ప్రధానిగా ఉంటూ అమెరికా పర్యటనకు వెళ్లి అక్కడ ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమంలో సత్కారాలు పొంది తిరిగి రావాల్సిన నరేంద్రమోడీ అబ్‌కీబార్‌ ట్రంప్‌ సర్కార్‌ అని పిలుపిచ్చి ‘‘ దుమ్ము ’’ రేపారు. ఈ చర్య అమెరికా అంతర్గత వ్యవహారాల్లో జోక్యం, మన విదేశాంగ విధానానికి వ్యతిరేకం.


ఒక పార్టీ నేతగా ప్రధాని మోడీకి ఇజ్రాయెల్‌ను సమర్ధించే హక్కు ఉన్నపుడు మరో పార్టీకి విమర్శించే, నిరసించే హక్కు ఉంటుందని న్యాయమూర్తులకు తెలియదా ? అధికారంలో ఉన్న పార్టీ అడుగుజాడల్లోనే నడవాలా ? అమెరికా మొదలు ఆస్ట్రేలియా, ఐరోపా నుంచి ఆఫ్రికా వరకు అన్ని ఖండాలు, దేశాలలో లక్షలాది మంది పాలస్తీనియన్ల మీద సాగిస్తున్న మారణకాండకు పలు రూపాల్లో నిరసన తెలుపుతున్న అంశాన్ని న్యాయమూర్తులు పరిగణనలోకి తీసుకోరా ? ఆ దేశాల్లో వారికి స్థానిక సమస్యలు లేక లేదా పనిపాటలు లేక అంతర్జాతీయ అంశం మీద స్పందిస్తున్నారా ? వియత్నాం మీద యుద్ధానికి వ్యతిరేకంగా స్వంత ప్రభుత్వ తీరునే తప్పు పడుతూ అమెరికాలో పెద్ద ఉద్యమమే నడిచిన చరిత్రను మరువగలమా ? మానవత్వం, మానవహక్కులను పరిరక్షించాలన్న వాంఛ ఈ నిరసనల్లో ఉందని న్యాయమూర్తులు గ్రహించలేని స్థితిలో ఉన్నట్లు కనిపిస్తున్నది. స్వాతంత్య్రం వచ్చిన తరువాత పుట్టిన తరాలలో గత చరిత్ర, ప్రజా ఉద్యమాలకు అంతర్జాతీయ సంఫీుభావం వంటి అంశాల పట్ల ఆసక్తి లేదు. నయా ఉదారవాద విధానాలు అమల్లోకి వచ్చిన తరువాత సంకుచిత ధోరణలు మరింతగా పెరుగుతున్నాయి. దీనికి సమాజంలో ఎవరూ మినహాయింపుగా కనపడటం లేదు. మణిపూర్‌లో 2023 మే 3వ తేదీ నుంచి ప్రారంభమైన హింసాకాండలో ఒక మహిళను వివస్త్రను గావించి ఊరేగించిన దుర్మార్గం జరిగినప్పటికీ తెలిసి కూడా ప్రధాని నరేంద్రమోడీ పట్టించుకోలేదు. ఆ ఉదంతం సామాజిక మాధ్యమంలో వైరల్‌ అయిన తరువాత జూలై మూడున మరోమార్గం లేక నోరు విప్పాల్సి వచ్చింది. రెండు సంవత్సరాలు దాటిన తరువాత కూడా ఆ రాష్ట్రాన్ని సందర్శించేందుకు తీరికలేని ప్రధాని ఈ కాలంలో అనేక దేశాలను సందర్శించి ప్రసంగాలు చేసి వచ్చారు. ఈ తీరు న్యాయమూర్తులకు పట్టదా ? స్వదేశీ సమస్యలను పట్టించుకోండి, దేశభక్తుడిగా ఉండండి అని మోడీకి సలహా ఇవ్వగలరా !

జలాంతర్గాముల మోహరింపు : రష్యాను కవ్విస్తున్న డోనాల్డ్‌ ట్రంప్‌ !

Tags

, , ,

ఎం కోటేశ్వరరావు


ఉక్రెయిన్‌పై రష్యా మిలిటరీ చర్య 1,259వ రోజులో ప్రవేశించింది. ఆగస్టు ఎనిమిదిలోగా శాంతి ఒప్పందానికి రానట్లయితే ఆంక్షలను మరింత తీవ్రం గావిస్తామని డోనాల్డ్‌ ట్రంప్‌ బెదిరించాడు. ఈ పూర్వరంగంలో రెండు దేశాలూ పరస్పరం అణ్వాయుధాలున్న జలాంతర్గాములను మోహరించేందుకు నిర్ణయించాయి. రష్యా చమురు కొనుగోలు వ్యవహారంలో చైనాతో భారత్‌ చేతులు కలిపిందని, ఈ లావాదేవీలతో రష్యాకు ఆర్థికంగా తోడ్పడుతున్నట్లు వైట్‌హౌస్‌ సిబ్బంది ఉప అధికారి స్టెఫాన్‌ మిలర్‌ ఆరోపించాడు. ఈతీరు అధ్యక్షుడు ట్రంప్‌కు ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని ఈ లావాదేవీల వ్యవహారాన్ని చూస్తే జనాలు దిగ్భ్రాంతి చెందుతారని ఆదివారంనాడు ఫాక్స్‌ న్యూస్‌తో చెప్పాడు.తన ప్రత్యేక దూత స్టీవ్‌ విట్‌కోఫ్‌ బుధ లేదా గురువారాల్లో మాస్కో సందర్శించనున్నట్లు ట్రంప్‌ ఆదివారం నాడు చెప్పాడు. వారంతా జిత్తుల మారి మనుషులు, వారికి ఆంక్షలను తప్పించుకోవటం తెలుసు, ఏం జరుగుతుందో చూద్దాం అన్నాడు. చైనా, రష్యా నౌకాదళాలు జపాన్‌ సముద్రంలో నిర్ణీత కార్యక్రమం మేరకు విన్యాసాలు జరుపుతున్నాయి. అవసరమైన చోట రెండు అణుజలాంతర్గాములను మోహరించనున్నట్లు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ ప్రకటించిన తరువాత రెండు రోజుల పాటు ఇవి జరుగుతున్నాయి. ఎంతో ముందుగానే ఈ విన్యాసాల తేదీలను ప్రకటించినందున తాము అవసరమైతే సన్నద్దగా ఉన్నట్లు బెదిరించేందుకు ట్రంప్‌ ఈ ప్రకటన చేసినట్లు కనిపిస్తోంది.


తాము అణ్వస్త్ర వ్యాప్తి నిరోధక ఒప్పందానికి(ఎన్‌పిటి) పూర్తిగా కట్టుబడి ఉన్నామని, వాటి గురించి మాట్లాడే ముందు అమెరికా సంయమనం పాటించాలని రష్యా ప్రతినిధి దిమిత్రి పెష్కోవ్‌ సోమవారం నాడు హితవు పలికాడు. తమ నాయకత్వం మొత్తాన్ని అంతం చేసినప్పటికీ సోవియట్‌ కాలం నుంచి కొనసాగుతున్న విధానం ప్రకారం చివరి యత్నంగా అణ్వస్త్రాలను ప్రయోగించకతప్పదని రష్యా మాజీ అధ్యక్షుడు మెద్వెదేవ్‌ గురువారం నాడు హెచ్చరించాడు. దాన్ని అవకాశంగా తీసుకున్న ట్రంప్‌ రెండు జలాంతర్గాములను మోహరించాలని ఆదేశాలు జారీ చేసినట్లు శుక్రవారం నాడు చెప్పాడు. అవి ‘‘ తగిన ప్రాంతాలలోనే ’’ ఉన్నాయని ఆదివారం నాడు మరో ప్రకటన చేశాడు. అయితే ఇదేమీ కొత్త కాదని, నిర్ణీత కార్యకలాపాల్లో భాగంగా అవి ఎప్పుడూ మోహరించే ఉంటాయని పెష్కోవ్‌ చెప్పాడు. తాజా పరిణామాలపై అధ్యక్షుడు వ్లదిమిర్‌ పుతిన్‌ బహిరంగంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. అణు యుద్ధంలో విజేతలంటూ ఉండరని, అయితే సమరమే తలెత్తితే తాము పూర్తి సన్నద్దంగా ఉన్నామని పెష్కోవ్‌ చెప్పాడు.


అమెరికా దగ్గర మూడు రకాల జలాంతర్గాములున్నాయి.వాటిలో 14 ఓహియో తరగతికి చెందిన ఖండాంతర క్షిపణులను ప్రయోగించేవి, అణ్వాయుధాలను నియంత్రిత మార్గంలో వేగంగా ప్రయోగిస్తాయి.ప్రతి జలాంతర్గామి అనేక అణుబాంబులను మోసుకుపోయే 20 ట్రైడెంట్‌ క్షిపణులను కలిగి ఉంటుంది. అవి ఏడున్నరవేల కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను దెబ్బతీస్తాయి. అందువలన వాటిని రష్యా సమీపంలోనే మోహరించనవసరం లేదు. ఈ జలాంతర్గామి పొడవు 170 మీటర్లు, బరువు 19వేల టన్నులు,159 మంది సిబ్బంది, గంటకు 36 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది.1990దశకం తరువాత కొత్త జలాంతర్గాములు అవసరం లేదని, ఉన్నవాటిలో కొన్నింటిలో మార్పులు చేసి నియంత్రిత ప్రయోగవాహకాలుగా మార్చారు, అలా తయారు చేసిన నాలుగు జలాంతర్గాములు 154 తోమహాక్‌ క్షిపణులను, వెయ్యి పౌండ్ల బరువుగల పేలుడు పదార్దంతో 1,600కిలోమీటర్ల దూరంలో భూమి మీద ఉన్న లక్ష్యాలను ధ్వంసం చేయగలవు. సముద్రగర్భంలో ఇతర దేశాల జలాంతర్గాములు, నౌకల మీద కూడా దాడి చేయగలిగినవి ఉన్నాయి. 2025 జూలై ఒకటవ తేదీ నాటికి వేగంగా దాడులు చేసేందుకుగాను 23అధునాతన వర్జీనియా రకం జలాంతార్గాములను వినియోగంలోకి తెచ్చారు, అవి 377 నుంచి 461 అడుగుల పొడవు, 10,200టన్నుల బరువు ఉంటాయి, ఒక్కోదానిలో 145 మంది సిబ్బంది పని చేస్తారు.పాతవాటిలో లాస్‌ ఏంజల్స్‌రకరం మరో 23 పని చేస్తున్నాయి.ఒక్కొక్కదాని ధర మూడు వందల కోట్ల డాలర్లు.


రష్యా భద్రత, సార్వభౌమత్వాన్ని కాపాడుకొనేందుకు అణు జలాంతర్గాములను విస్తరించాలని పుతిన్‌ పిలుపునిచ్చినట్లు గతనెలాఖరులోనే వార్తలు వచ్చాయి.ఆధునిక తరంతో నౌకాదళాన్ని మరింత పటిష్టం కావిస్తామని చెప్పినట్లు టాస్‌ వార్తా సంస్థ పేర్కొన్నది.ప్రస్తుతం 192 క్షిపణులను ప్రయోగించే పన్నెండు వినియోగంలో ఉన్నాయి. అమెరికాకు చెందిన లాస్‌ ఏంజల్స్‌ రకం జలాంతర్గామి జూలై తొమ్మిదిన నిర్వహణ పనుల పేరుతో తొలిసారిగా ఐస్‌లాండ్‌ రేవులో లంగరువేసింది.తామున్నామని తన మిత్రదేశాలకు అమెరికా పంపిన సందేశం కూడా దీనిలో ఇమిడి ఉంది. 2023 నుంచి ఇప్పటి వరకు ఎనిమిది వాహనాలు ఈ జలాల్లో సంచరించాయి.గ్రీన్‌లాండ్‌, ఐస్‌లాండ్‌, బ్రిటన్‌ కారిడార్‌(జిఐయుకె)లో ఈ ప్రాంతం ఉంది.2019 నుంచి అమెరికా తన బి2 బాంబర్లకోసం ఈ ప్రాంతాన్ని వినియోగిస్తున్నది. ఈ పూర్వరంగంలో రష్యా ఉత్తర నౌకాదళానికి చెందిన అధునాతన యాసెన్‌ తరగతి జలాంతర్గాములు ఈ ప్రాంతంలో ప్రయాణించాయి.అమెరికా, రష్యా, చైనా జలాంతర్గాములు ప్రత్యర్ధుల కదలికలను పసిగట్టటం, పర్యవేక్షించే పనిలో నిరంతరం ఉంటాయి, ఏ దేశం కూడా ఈ వివరాలను బహిరంగంగా వెల్లడిరచదు. ఖనిజ సంపద ఎంతో ఉన్న ఈ ప్రాంతం ఆర్థికంగానే గాక, మిలిటరీ పరంగా కూడా ఇటీవల ప్రాధాన్యత సంతరించుకుంది. ఆర్కిటిక్‌ ప్రాంతంలో ఐదోవంతు రష్యా భూభాగం, సముద్రతీరం సగం ఉన్నదున అది దానికి ఎంతో కీలకం. అమెరికా రాడార్లకు అందకుండా ప్రయాణించే హైపర్‌సోనిక్‌ క్షిపణులను రష్యా పరీక్షిస్తున్నది. రెండు సంవత్సరాల క్రితం చైనాతో కలసి అలాస్కా వద్ద తనిఖీ నిర్వహించింది. పోలార్‌ సిల్క్‌ మార్గం పేరుతో 2018లో చైనా ఆర్కిటిక్‌ వ్యూహాన్ని ప్రకటించింది. నాటో కూటమిలో ఫిన్లండ్‌, స్వీడన్‌ చేరిన తరువాత రష్యా తన మిలిటరీని ఈ ప్రాంతంలో నవీకరిస్తున్నది. సోవియట్‌ కాలం నాటి వైమానిక కేంద్రాల ఉన్నతీకరణ, కార్యకలాపాల పునరుద్దరణ చేపట్టింది. ఆర్కిటిక్‌ ప్రాంతంలో రష్యాకు ఎక్కువ మిలిటరీ కేంద్రాలు ఉండటం అమెరికాను కలవర పెడుతున్నది. రష్యా కంటే మిలిటరీ రీత్యా పశ్చిమ దేశాలు పదేండ్లు వెనుకబడి ఉన్నట్లు నిపుణులు చెబుతున్నారు.అంతర్జాతీయ ఒప్పందం ప్రకారం నాటో దేశమైన నార్వేలో రష్యన్‌ పౌరులు వీసాతో నిమిత్తం లేకుండా నివసించవచ్చు. గ్రీన్‌లాండ్‌ను తమకు ఇవ్వాలని అమెరికా డిమాండ్‌ చేయటం వెనుక ఈ అంశం కూడా ఉంది. యుద్ధమంటూ వస్తే ఈ ప్రాంతంలో అమెరికా నౌకలను అడ్డుకొనేందుకు రష్యాకు అనేక అవకాశాలు ఉన్నాయి.


దౌత్యం, వాణిజ్యాలను ఆయుధాలు మార్చుకోవటం రోజు రోజుకూ పెరుగుతున్నది. తన మిత్రదేశమైన పాకిస్తాన్‌ మీద భారత్‌ నిర్వహించిన ఆపరేషన్‌ సిందూర్‌ను నిలిపివేయించేందుకు వాణిజ్యాన్ని చూపి బెదిరించిట్లు స్వయంగా ట్రంప్‌ చెప్పిన సంగతి తెలిసిందే. పరువు పోతుందని భావించి నరేంద్రమోడీ ఈ విషయాన్ని బహిరంగంగా అంగీకరించేందుకు సిద్దం కావటం లేదన్నది వేరే సంగతి.మిలిటరీ ఖర్చును భారీగా పెంచేందుకు నాటో కూటమి నిర్ణయించింది. ఉక్రెయిన్‌ పోరును సంప్రదింపుల ద్వారా ముగించేందుకు అది సిద్దంగా లేదు. పోరును దీర్ఘకాలం పొడిగించి రష్యాను కొన్ని సంవత్సరాల్లో దివాలా తీయించాలన్నట్లుగా వ్యవహరిస్తున్నది. ఐరోపా సమాఖ్య జనాభా 49 కోట్లు, జిడిపి 20లక్షల కోట్లు ఉండగా కేవలం 15కోట్ల జనాభా, రెండు లక్షల కోట్ల డాలర్ల జిడిపి మాత్రమే ఉన్న రష్యాను ఓడిరచలేమా అనే ప్రమాదకర ధోరణి కనిపిస్తున్నది. రష్యా తన వద్ద ఉన్న అణ్వస్త్రాలను చూపి భయపెడుతున్నది. అమెరికా కూడా భయపడుతున్నది ఈ కారణంగానే అన్నది తెలిసిందే. ఐరోపాలో బలమైన జర్మనీ మరోసారి పదాతిదళాలను పెంచుతున్నది. మూడువేల బాక్సర్‌ సాయుధ శకటాలు, మూడున్నరవేల పాట్రియా ఇన్‌ఫాంట్రీ యుద్ధ వాహనాలను కొనుగోలు చేస్తున్నది, ఇవిగా యూరోజెట్‌ ఫైటర్లను సమీకరిస్తున్నది. ఐరోపాలో బలమైన సాంప్రదాయ మిలిటరీని సాయుధంకావించేందుకు తాను లక్ష కోట్ల యూరోలను ఖర్చు చేయనున్నట్లు జర్మన్‌ ఛాన్సలర్‌ ఫెడరిక్‌ మెర్జ్‌ ఇటీవల ప్రకటించిన అంశాన్ని గుర్తుకు తెచ్చుకోవాలి. ఇతర ధనిక ఐరోపా దేశాలేమీ తక్కువ తినటం లేదు.ఫ్రాన్సు, ఇటలీ, పోలాండ్‌ పెద్ద సంఖ్యలో టాంక్‌లు, సాయుధశకటాలను కొనుగోలు చేసేందుకు నిర్ణయించాయి. అవసరమైతే ఫ్రెంచ్‌ లేదా ఐరోపా యూనియన్‌ దేశాలు ఉక్రెయిన్‌లో పోరాడేందుకు కాల్బలాలను కూడా పంపేందుకు సిద్దం కావాలని ఫ్రెంచి అధ్యక్షుడు మక్రాన్‌ గతేడాది చేసిన ప్రతిపాదనను అందరూ వ్యతిరేకించారు.పశ్చిమ ఐరోపాలో 89శాతం మంది వ్యతిరేకించినట్లు సర్వేలు వెల్లడిరచాయి.


రష్యా మాజీ అధ్యక్షుడు మెద్వెదేవ్‌ చేసిన వ్యాఖ్యలను ఆసరా చేసుకొని డోనాల్డ్‌ ట్రంప్‌ తన అక్కసును జలాంతర్గాముల మోహరింపు రూపంలో వ్యక్తం చేశాడని స్పష్టంగా కనిపిస్తోంది.రెచ్చగొట్టటంలో ఎవరూ తక్కువ తినలేదు. ట్రంప్‌ పన్నుల విధింపు పేరుతో బెదిరింపు ఆటకు దిగాడని మెద్వెదేవ్‌ వర్ణించాడు ‘‘ రష్యా అంటే ఇజ్రాయెల్‌ లేదా కనీసం ఇరాన్‌ కూడా కాదు, ప్రతి కొత్త బెదిరింపు యుద్ధంవైపు మరోఅడుగువేసినట్లే, అయితే ఉక్రెయిన్‌ మరియు రష్యా మధ్య కాదు, అతగాడి స్వంతదేశంతోనే, అది ఎలా ఉంటుందో ఒక టీవీలో వస్తున్న ది వాకింగ్‌ డెడ్‌ అనే సీరియల్‌ చూడవచ్చు ’’ అన్నాడు. తీవ్రంగా రెచ్చగొట్టిన మెద్వెదేవ్‌ కారణంగానే తాను రెండు అణుజలాంతర్గాములను మోహరించాలని ఆదేశించినట్లు ట్రంప్‌ చెప్పుకున్నాడు. వీటన్నింటిని చూస్తుంటే ప్రధాన దేశాల మధ్య వాణిజ్య , మిలిటరీ విబేధాలు అదుపుతప్పి దిగజారుతున్నట్లు కనిపిస్తున్నది.అన్ని దేశాలను అదుపులోకి తెస్తానని చెప్పిన ట్రంప్‌ స్వజనంలో పలుచనయ్యాడు, పుతిన్నుదారికి తెచ్చి ఉక్రెయిన్‌ పోరును 24 గంటలలో ఆపివేస్తానని ప్రగల్భాలు పలికి ఐరోపాలో పరువు పోగొట్టుకున్నాడు.గత కొద్ది రోజులుగా ట్రంప్‌తో పాటు అతగాడి యంత్రాంగంలో ముఖ్యులు నిరాశాపూరితంగా మాట్లాడుతున్నారు. ఆంక్షలు రష్యాను నిలువరించేట్లు కనిపించటం లేదన్నట్లుగా వ్యాఖ్యానిస్తున్నారు. ట్రంప్‌ బెదిరింపులను ఖాతరు చేయకుండా రష్యా నుంచి భారత్‌, చైనా చమురుకొనుగోళ్లను నిలిపివేసే సూచనలు కనిపించటం లేదు. భారత్‌ నిలిపివేస్తే నరేంద్రమోడీకి, కొనుగోలు కొనసాగిస్తే ట్రంప్‌కు ఇరకాటం తప్పదు. అమెరికా ఆధిపత్యాన్ని సవాలు చేయటంలో అత్యంత కీలక భాగస్వామి పుతిన్ను చైనా నేత షి జింపింగ్‌ మధ్యలో వదలివేస్తారని ఊహించటం కష్టమని న్యూయార్క్‌టైమ్స్‌ పత్రిక గురువారం నాడు వ్యాఖ్యానించింది. ఐరోపా యూనియన్‌ కూడా ఆంక్షలను ప్రకటించినప్పటికీ వాటిని ఖాతరు చేయకుండా టర్కీ, ఫ్రాన్సు,హంగరీ, బెల్జియం,స్లోవేకియా, ఇటలీ జెకియా గ్యాస్‌, చమురు కొనుగోలు చేస్తున్నాయి. భారత్‌ చౌకగా రష్యా నుంచి చమురు దిగుమతి చేసుకొని బహిరంగ మార్కెట్‌లో అధికధరలకు అమ్ముకుంటున్నదని, అందువలన తాను భారీగా పన్నులు వేస్తానని సోమవారం నాడు ట్రంప్‌ పునరుద్ఘాటించాడు. ఒక్క ఈ అంశమే కాదు, పెట్టుబడిదారీ వర్గం తన లాభాలకు దెబ్బ తగలకుండా మరోవైపున కార్మికవర్గం మీద కూడా దాడులను ప్రారంభించింది. అనేక దేశాల్లో రకరకాల సాకులతో సంక్షేమ, సామాజిక భద్రతా పథకాలకు కోత పెడుతున్నారు. ఇలాంటి పోకడలను ఎదిరించి అడ్డుకట్టవేయాలంటే అమెరికా, ఐరోపాల్లోని కార్మికవర్గం వీధుల్లోకి వస్తే తప్ప పాలకవర్గాలు వెనకడుగువేసేట్లు కనిపించటం లేదు.

సోవియట్‌ నాటి చరిత్ర పునరావృతం అవుతుందా : బులబాటం తీర్చిన డోనాల్డ్‌ ట్రంప్‌ – నరేంద్రమోడీ ఆరాటానికి ముందున్నది అసలు పరీక్ష !

Tags

, , , , , , ,

ఎం కోటేశ్వరరావు

నాటకీయ పరిణామాలు జరగకపోతే అమెరికాతో వాణిజ్య ఒప్పందాల కోసం వెంపర్లాడిన నరేంద్రమోడీ బృందానికి ప్రస్తుతానికి డోనాల్డ్‌ ట్రంప్‌ తగిన పాఠమే చెప్పాడు. మనదేశం నుంచి తాము దిగుమతి చేసుకొనే వస్తువులపై 25శాతం పన్నులు, రష్యా నుంచి మనం ముడిచమురు, ఆయుధాలు, ఇతర వస్తువులను దిగుమతి చేసుకొంటున్న కారణంగా అదనంగా జరిమానా విధిస్తున్నట్లు బుధవారం నాడు ప్రకటించాడు. మనసార్వభౌమత్వాన్నే కించపరిచాడు. పుండు మీద కారం చల్లినట్లుగా పాకిస్తాన్‌తో ఒప్పందం కుదుర్చుకొని అక్కడ నిల్వచేసే చమురును భారత్‌కు అమ్మిస్తానని కూడా చెప్పాడు. ఇది మరీ అవమానం. రష్యా, భారత్‌ రెండూ మృత ఆర్థిక వ్యవస్థలు, కలసి ఏం చేస్తాయో చేసుకోండి అంటూ ఎద్దేవా చేశాడు.ట్రంప్‌ ప్రకటించిన మేరకు ఆగస్టు ఒకటి నుంచి మన దేశం నుంచి ఎగుమతి అవుతున్న వివిధ సరకులపై కనిష్టంగా 25 గరిష్టంగా 193శాతం పన్నులు విధిస్తారు. వీటికి జరిమానా అదనం. ఇవి ఇలానే ఉండేట్లయితే ఏ రంగం ఎలా ప్రభావితం అవుతుందో ఆచరణలో తెలుస్తుంది.ఔషధాలు, సెల్‌ఫోన్లు వంటి వాటిని ప్రస్తుతానికి మినహాయించారు. అవి పేకాటలో తురుపు ముక్కల వంటివి, మనదేశాన్ని బ్లాక్‌మెయిల్‌ చేసే ఎత్తుగడలో భాగం తప్ప మరొకటి కాదు. జాతీయ ప్రయోజనాలను పరిరక్షించేందుకు తగిన చర్యలు తీసుకుంటామంటూ కేంద్ర ప్రభుత్వం ఒక సాదాసీదా ప్రకటన విడుదల చేసింది. మహా వ్యూహవేత్త అంటున్నారు గనుక మామూలుగానే ప్రధాని నరేంద్రమోడీ, ఇతర మంత్రులు నోరు విప్పలేదు, సమాచార శాఖ(పిఐబి) ద్వారా మొక్కుబడిగా ఒక ప్రకటన విడుదల చేశారు.పరిస్థితిని అన్ని విధాలుగా మదింపు చేయనున్నట్లు పేర్కొన్నారు.

అమెరికా చర్యలకు ప్రతిగా చైనా మాదిరి మన ప్రభుత్వం కూడా ప్రతి సుంకాలు విధిస్తుందా లేదా అన్నది ఇంకా స్పష్టం కాలేదు. అమెరికాతో ఇప్పుడున్న 130 బిలియన్‌ డాలర్ల లావాదేవీలను మరో ఐదు సంవత్సరాల్లో 500 బిలియన్‌ డాలర్ల స్థాయికి పెంచుతామని రంగుల కలను జనం ముందించిన నేతలు ఇప్పుడేం చేస్తారో చూడాల్సి ఉంది. ఈ నెల 25వరకు భారత్‌తో వాణిజ్య ఒప్పందంపై చర్చలు సాగుతాయని, తమ ప్రతినిధి వర్గం ఢల్లీి సందర్శించనున్నదని అమెరికా అధికారులు చెప్పినదాన్ని బట్టి ఇప్పటికీ మన మీద వత్తిడి తెచ్చే యత్నాలను ట్రంప్‌ మానుకోలేదని, సుంకాల ప్రకటన బెదిరింపుల్లో భాగమే అని చెప్పవచ్చు. మోడీ లొంగుతారా లేదా అన్నది చూడాల్సి ఉంది. ఇప్పటి వరకు జరిగింది ఒక ఎత్తయితే అసలు అగ్ని పరీక్ష ముందుంది. ఫిబ్రవరి నుంచి జరుగుతున్న చర్చల గురించి రకరకాల లీకుల కథనాలు, ట్రంప్‌ ప్రకటనల నేపధ్యంలో ఎలక్ట్రానిక్‌ రంగంలో పెద్ద మొత్తంలో చైనా పెట్టుబడులను ఆకర్షించేందుకు మనదేశం సానుకూల సంకేతాలను పంపిందంటూ తాజాగా ఒక వార్త. ఇలాంటి పరోక్ష సందేశాలతో చైనాను చూపి అమెరికా నుంచి రాయితీలు రాబట్టుకొనే ఎత్తుగడగా కూడా దీన్ని చెప్పవచ్చు. గతంలో అమెరికాను చూపి సోవియట్‌, దాన్ని చూపి వాషింగ్టన్‌తో బేరసారాలాడిన మన పాలకవర్గం ఇలాంటి వాటిలో ఆరితేరింది. ఇప్పటి వరకు ఈ ఎత్తుగడ ఫలించినట్లు లేదు. నిజంగానే మనదేశం చైనా ఎలక్ట్రానిక్‌ కంపెనీలు, వాటి పెట్టుబడులను అనుమతిస్తే అమెరికా మరింత శత్రుపూరితంగా వ్యవహరించే అవకాశాలు ఉన్నాయి. జిగినీ దోస్తుతో సంబంధాలను నరేంద్రమోడీ అంత తేలికగా వదులు కుంటారా అన్నది చూడాల్సి ఉంది.

మన జిడిపి పదిలక్షల కోట్ల డాలర్లకు చేరాలంటే చైనాతో సయోధ్య తప్పనిసరని కొందరి సూచన, డ్రాగన్‌తో పెట్టుకుంటే మృత్యుఘంటికలే అని కొందరి హెచ్చరిక. ఏది సత్యం ! ఏదసత్యం ఓ మహాత్మా, ఓ మహర్షీ !! గాల్వన్‌ లోయ ఘర్షణ సందర్భంగా ఇంక చైనాతో మాటల్లేవ్‌, మాట్లాడుకోవటం లేదు, పోరేశరణ్యం అంటూ ఊగిపోయిన దృశ్యాలు మన కళ్ల ముందే ఉన్నాయి.చైనా కమ్యూనిస్టు పార్టీతో ఒప్పందం, రాయబారి నుంచి పాఠాలు నేర్చుకున్నట్లు రాహుల్‌ గాంధీని ఎద్దేవా చేసిన వారు తమ కింది నలుపు చూసుకుంటున్నలేదు. రాహుల్‌ ఒప్పందానికి ముందే 2001లోనే జాన కృష్ణమూర్తి అధ్యక్షుడిగా ఉన్న సమయంలో బిజెపి చైనా కమ్యూనిస్టు పార్టీతో సంబంధాలు పెట్టుకుంది. గాల్వన్‌ ఉదంతాలు జరిగి ఐదేండ్లు గడచిన తరువాత చూస్తే మూసిన తలుపులను మనమే తెరుస్తున్నాం. చైనా తలపులతో మునిగిపోతున్నాం. ఆశ్చర్యంగా ఉంది కదూ ! అప్పుడెందుకు మూశారు, ఇప్పుడెందుకు తెరిచారు, ఇన్నేండ్లు ఎందుకు ఆలశ్యం చేశారు అని ఎవరైనా అడిగారో దేశద్రోహ ముద్రవేస్తారు జాగ్రత్త. బిజెపి నందంటే నంది పందంటే పంది అంతే ! త్వరలో షాంఘై సహకార సంస్థ సమావేశాలకు గాను ప్రధాని నరేంద్రమోడీ బీజింగ్‌ సందర్శనకు వెళతారని అంటున్నారు.అన్నీ సక్రమంగా ఉంటే షీ జింపింగ్‌ కూడా ఢల్లీి రావచ్చు. ఏదీ అసాధ్యం కాదు, షీ జింపింగ్‌ రమ్మనాలే గానీ వెళ్లటానికి అన్నీ సర్దుకొని ఉన్నా అన్నట్లుగా ట్రంప్‌ ఉన్నాడు.ఎవరి ఎత్తుగడలు వారివి, ఎవరి ప్రయోజనాలు వారికి ముఖ్యం.

త్వరలో చైనాను అధిగమించేందుకు ముందుకు పోతున్నామని కొందరు చెబుతుంటారు. ఆ చైనీయులేమో అమెరికాను దాటేస్తాం చూడండి అన్నట్లుగా సందడి లేకుండా తమపని తాము చేసుకుపోతున్నారు.మన సంకల్పం మంచిదే, ఆరోగ్యకరమైన పోటీ ప్రతిదేశంతోనూ ఉండాల్సిందే. మధ్యలో చైనా ఎందుకు ఏకంగా అమెరికాతోనే పోటీ పడాలి.ఆశ, ఆకాంక్షల్లో కూడా పిసిరానితనం అవసరమా ! అయితే పేచీ ఎక్కడ అంటే ఎవరికి వారు మేమే ముందుండాలి, అగ్రస్థానం మాకే దక్కాలి అనుకుంటే ఫలితం, పర్యవసానాలు ప్రతికూలంగానే ఉంటాయి.ఎవరి సంగతివారే చూసుకోవాలి అనుకున్నపుడు మన అభివృద్ధిని మరొకరు ఓర్వలేకుండా ఉన్నారని ఏడిస్తే ప్రయోజనం లేదు.1970 దశకం వరకు కమ్యూనిస్టు చైనాకు ఐరాసలో, 2001వరకు ప్రపంచ వాణిజ్యసంస్థలో సభ్యత్వమే లేదు.అడ్డుకున్నది ఎవరంటే అమెరికా, దాని కనుసన్నలలో నడిచే దేశాలే అన్నది తెలిసిందే. చిత్రం ఏమిటంటే అదే అమెరికా తరువాత కాలంలో తన కంపెనీల పెట్టుబడులను చైనాలో అనుమతించింది, తన అవసరం కోసం పరిమితంగా, ఫరవాలేదు పాతబడిరదే కదా అనుకున్న సాంకేతిక పరిజ్ఞాన బదిలీని అనుమతించింది. లాటిన్‌ అమెరికా దేశాల మాదిరి వస్తు ఎగుమతి ఆధారిత దేశంగా ఉంటూ తనకు లాభాలను అందిస్తుంది అనుకున్న ఆశలను చైనా వమ్ము చేసింది. లాటిన్‌ అమెరికా దేశాలు పెట్టుబడిదారీ, చైనా కమ్యూనిస్టుల నాయకత్వంలో ఉందనే వాస్తవాన్ని పశ్చిమదేశాల వారు అర్ధం చేసుకోలేకపోయారు. చేయి అందిస్తే ఏకంగా అల్లుకు పోతుందని అమెరికా కార్పొరేట్‌ మేథావులు నాలుగుదశాబ్దాల క్రితం గుర్తించలేకపోయారు. చైనా నేడు అనేక రంగాలలో సవాలు చేస్తున్నది. అడ్డుకొనేందుకు అడుగడుగునా అమెరికా కూటమి చూస్తున్నది.ఆధునిక చిప్స్‌ అందుబాటులో లేకుండా చేయాలని ఆంక్షలు పెట్టిన సంగతి తెలిసిందే.తన కోడి కూయకపోతే చైనాలో తెల్లవారదని అది భావిస్తున్నది.

ఇలాంటి ఆటంకాలు మనకు లేవు. నిజంగానే ‘‘ కమ్యూనిస్టు నియంతృత్వ’’ చైనా మనకు అడ్డుపడుతున్నది అనుకుంటే మనవారు కీర్తించే ‘‘ ప్రజాస్వామ్య ’’ అమెరికా, ఇతర పశ్చిమదేశాలు మిత్రులు, భాగస్వాములే, అయినా సాయం చేసేందుకు ఎందుకు ముందుకు రావటం లేదు. బీజింగ్‌కు పోటీగా మనలను ఎందుకు నిలపటం లేదు ? మనదేశంలోని కొందరు మేథావులు చైనా మాత్రమే మనలను అడ్డుకుంటున్నదని తమ దాడిని ఎందుకు ఎక్కుపెడుతున్నట్లు ? జనం ఆలోచించాలి ! అమెరికాతో మనదేశ వాణిజ్య ఒప్పంద గడువు జూలై తొమ్మిది, ఆగస్టు ఒకటి రెండూ మురిగిపోయాయి. చైనాతో వాణిజ్యం మీద లేని ఒప్పందం అమెరికాతో ఎందుకు అన్నది సామాన్యులకు అర్ధం కావటం లేదు. చైనాతో1954లో కుదిరిన ఒక సాధారణ ఒప్పందం మాత్రమే అమల్లో ఉంది.పరిస్థితులకు అనుగుణ్యంగా దాన్ని నవీకరించటం లేదా నూతన ఒప్పందాన్ని కుదుర్చుకోవటానికి ఎలాంటి చొరవా రెండువైపుల నుంచి లేదు. కానీ భారీ మొత్తంలో వాణిజ్య లావాదేవీలు జరుగుతున్నాయి.

అసలు వాణిజ్య ఒప్పందాలు ఎందుకు ? వివాదాలు లేకుండా ఒక పద్దతిగా నడుద్దామని రెండవ ప్రపంచ యుద్ధం తరువాత 23దేశాల మధ్య (భారత్‌, చైనాలతో సహా) వాణిజ్యం, పన్నులపై సాధారణ ఒప్పందం( జనరల్‌ అగ్రిమెంట్‌ ఆన్‌ ట్రేడ్‌ అండ్‌ టారిఫ్‌గాట్‌) 1947లో కుదిరింది, దీన్నే జెనీవా ఒప్పందం అని కూడా అంటారు.తరువాత అది 1995 జనవరి ఒకటి నుంచి ప్రపంచ వాణిజ్య సంస్థ(డబ్ల్యుటిఓ)గా మారింది. గాట్‌ దేశాల్లో చైనా ఉన్నప్పటికీ అది కమ్యూనిస్టుల ఏలుబడిలోకి వచ్చిన తరువాత తిరుగుబాటు రాష్ట్రమైన తైవాన్‌ పేరుతో ఉన్న చైనానే గుర్తించారు తప్ప మిగతా దేశాల మాదిరి సభ్యత్వం ఇవ్వలేదు. అనివార్యమైన స్థితిలో 2001లో చైనాను చేర్చుకున్నారు. ప్రపంచీకరణను ముందుకు తెచ్చిన దేశాలే నేడు దానికి భిన్నంగా డబ్ల్యుటివోను పక్కన పెట్టి విడివిడిగా ఒప్పందాలు చేసుకోవటం తెలిసిందే.


మన ప్రధాన వాణిజ్య భాగస్వామిగా ఉన్న దేశాలలో అమెరికా, చైనా ఒకటి రెండు స్థానాలలో ఉంటున్నాయి. ప్రతిదేశం తన దగ్గర మిగులుగా ఉన్న సరకులను అమ్ముకొనేందుకు గతంలో ఏకంగా బలహీన దేశాలను ఆక్రమించుకోవటం, అందుకోసం యుద్ధాలకు దిగటం తెలిసిందే. ఆ రోజులు గతించాయి గనుక వాటి స్థానంలో మార్కెట్ల ఆక్రమణకు ఒప్పందాలు వచ్చాయి. పన్నులు ఎలా వేయాలో, ఎగుమతి, దిగుమతులు ఎలా జరగాలో ప్రపంచ వాణిజ్య సంస్థ ఒక విధానాన్ని రూపొందించింది. అది ఉండగా విడివిడిగా ఒప్పందాల కోసం ప్రయత్నించటం చూస్తున్నాం. ఐక్యరాజ్య సమితి(ఐరాస) మాదిరి డబ్ల్యుటిఓ కూడా విఫలమైందా ? అలాగే కనిపిస్తున్నది, దాని నిబంధనలను పక్కన పెట్టి కొన్ని దేశాలు కొన్ని వస్తువుల మీద ఎక్కువ పన్నులు విధిస్తున్నాయి. ప్రతి చర్యలతో వివాదాలు. వాటిని పరిష్కరించే ట్రిబ్యునల్‌కు న్యాయమూర్తుల నియామకం జరగకుండా అమెరికా అడ్డుకుంటున్నది, పోటీ పడలేక వాణిజ్య దందాకు దిగి చైనా మీద కత్తి గట్టింది. దాని వైఖరిని మిగతా దేశాలు అప్పుడే ప్రతిఘటించి ఉంటే ఇప్పుడు అన్నిదేశాల మీద దాడికి దిగేది కాదు.నష్టపోయేది చైనాయే గదా అని భావించిన దేశాలకు ఇప్పుడు తెలిసి వస్తోంది.

వాణిజ్య మిగులు ఉన్న దేశాలతో లోటు ఉన్నవి సమానం చేసేందుకు చూస్తాయి. మనదేశ లావాదేవీలను చూసినపుడు 151దేశాలతో వాణిజ్య మిగులుతో ఉన్నాం, 75దేశాలతో లోటులో ఉన్నాం. మన ఎగుమతుల గురించి ఎన్ని కబుర్లు చెప్పినప్పటికీ మొత్తం మీద ఏటేటా లోటు పెరగటం తప్ప తగ్గటం లేదు. పదేండ్ల మన్మోహన్‌ సింగ్‌ ఏలుబడిలో మనదేశ మొత్తం వాణిజ్య లోటు (వికీపీడియా సమాచారం) 942.23 బిలియన్‌ డాలర్లు. ఇదే 2014 నుంచి 2024వరకు నరేంద్రమోడీ పాలనలో 1,506.22 బిలియన్‌ డాలర్లకు చేరింది. ఈ కాలంలో మన ఎగుమతులు 201314లో 466.22 బిలియన్‌ డాలర్లు కాగా 20232024లో 778.21 బి.డాలర్లకు పెరిగాయి. మేకిన్‌, మేడిన్‌ ఇండియా పథకాలు జయప్రదమై ఉంటే మనకీ దుస్థితి ఉండేది కాదు. పదేండ్లలో మోడీ సర్కార్‌ నిర్వాకం కారణంగా మన విలువైన విదేశీమారకద్రవ్యం 614 బిలియన్‌ డాలర్లను చైనాకు పువ్వుల్లో పెట్టి ఇచ్చాం.అయినప్పటికీ మనం దిగుమతులు నిలిపివేసి డ్రాగన్‌కు చుక్కలు చూపించాలని కాషాయ దళాలు నిత్యం చెబుతూనే ఉంటాయి. నిజమే కామోసని గుడ్డిగా నమ్మేవారు ఉన్నారు. ఇంత తేడా ఉన్నప్పటికీ ప్రస్తుతం అమెరికాతో వాణిజ్య ఒప్పందం కోసం పడుతున్న ఆరాటం చైనాతో జరగటం లేదన్నది తెలిసిందే. ఇదే సమయంలో అమెరికాతో ఉన్న వాణిజ్య మిగులును తగ్గించి తమ వస్తువులను మనమీద రుద్దేందుకు పూనుకున్న ట్రంప్‌తో మాత్రం ఒప్పందం కోసం ఇప్పటికీ అర్రులు చాస్తున్నది.


ప్రపంచ ఎలక్ట్రానిక్స్‌ ఉత్పత్తిలో 60శాతం చైనాలోనే జరుగుతోంది. మనదేశంలో కూడా ఉత్పత్తిని పెంచాలంటే చైనా పెట్టుబడులు, సాంకేతిక పరిజ్ఞానం అవసరం అని ఈ పూర్వరంగంలో చైనాను విస్మరించలేమని మన విధాన నిర్ణేతలకు అవగతమైనట్లు కనిపిస్తోంది.జిడిపిలో పదిలక్షల కోట్ల మైలురాయిని దాటాలంటే చైనాతో ఎంతో అవసరం ఉందని అబ్జర్వర్‌ రీసర్చ్‌ ఫౌండేషన్‌(ఓఆర్‌ఎఫ్‌) అధ్యక్షుడు సమీర్‌ శరణ్‌ అభిప్రాయపడ్డారు. చాలా సంవత్సరాల తరువాత చైనాతో ఆర్థిక సంబంధాల పునరుద్దరణకు ఎంతో అవకాశం ఉందని, అయితే తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ఇటీవలనే చెప్పారు. చైనా తనసరకులను అమ్ముకొనేందుకు మనదేశాన్ని పెద్ద మార్కెట్‌గా చూస్తోందని, అందునా శత్రుదేశంగా ఉందంటూ కొందరు వ్యతిరేకిస్తున్నారు. చైనా పర్యాటకులకు వీసాలు ఇవ్వాలని మనదేశం ఇటీవల నిర్ణయించిన సంగతి తెలిసిందే. భద్రతాపరమైన తనిఖీలతో నిమిత్తం లేకుండా చైనా కంపెనీలను 24శాతం వాటాలతో భారత కంపెనీల్లో పెట్టుబడులను అనుమతించవచ్చని నీతి ఆయోగ్‌ ఇటీవల ప్రతిపాదించింది. కేంద్ర ప్రభుత్వం, అధికార బిజెపిలో ఒక వర్గం చైనా పెట్టుబడులను వ్యతిరేకిస్తుండగా మరొకటి సానుకూలంగా ఉంది. నీతి ఆయోగ్‌ చెప్పటం అంటే మన బడాకొర్పొరేట్ల ప్రయోజనాలు, వాటి పరిరక్షణకు మోడీ మనసెరిగి నివేదించటం తప్ప మరొకటి కాదు. నిజంగా అదే జరిగితే ముందే చెప్పుకున్నట్లు డోనాల్డ్‌ ట్రంప్‌ మరింత రెచ్చిపోతాడు, వియోగమే అనివార్యమైతే మన నరేంద్రమోడీ, కాషాయ దళాలు తట్టుకుంటాయా ! దేశ రాజకీయాల్లో పెను మార్పులకు నాంది పలుకుతుందా ? గతంలో అంటే సోవియట్‌ యూనియన్‌తో ఉన్న మిత్ర సంబంధాలు వేరు, ఇప్పుడు చైనాతో అవసరమైతప్ప సంబంధాల్లో మిత్రత్వం ఎంత అన్నది అనుమానమే, అటువంటి చైనా కోసం అమెరికాను దూరంగా పెడతారా, ఏమో భారత పాలకవర్గం తనకు ఏది లాభం అనుకుంటే దానికే పెద్ద పీటవేస్తుందని సోవియట్‌ నాటి చరిత్ర చెబుతోంది ! పిల్లి నల్లదా తెల్లదా అని కాదు అది ఎలుకలను పడుతుందా లేదా అన్నది ముఖ్యం అన్నట్లుగా కమ్యూనిస్టు చైనా లేదా పెట్టుబడిదారీ అమెరికా అన్నది ముఖ్యం కాదు, తమకు లాభాలు దేనితో ఉంటాయన్నదే మన కార్పొరేట్లకు గీటురాయి !

న్యూయార్క్‌ మేయర్‌ ఎన్నిక : విజయబాటలో దూసుకుపోతున్న సోషలిస్టు అభిమన్యుడు జోహ్రాన్‌ మమ్దాని !

Tags

, , , ,


ఎం కోటేశ్వరరావు

మీడియా తీరుతెన్నులను చూస్తుంటే అధ్యక్ష ఎన్నికల కంటే న్యూయార్క్‌ నగర మేయర్‌ ఎన్నికల్లో 33 ఏండ్ల సోషలిస్టు జోహ్రాన్‌ మమ్దానీ ఓటమే ఏకైక లక్ష్యంగా పెట్టుకున్నట్లు కనిపిస్తోంది. ఒక నగర మేయర్‌ పదవికి నిజంగా అంతగా కేంద్రీకరిస్తున్నారా అన్న సందేహం ఎవరికైనా కలగవచ్చు గానీ అది పచ్చినిజం. మహా భారతంలో కౌరవులు పన్నిన పద్మవ్యూహంలో అభిమన్యుడు వీరోచితంగా పోరాడి అశువులు బాశాడు. న్యూయార్క్‌ మేయర్‌ ఎన్నికల్లో శత్రువులు, ఏకంగా అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంపే రంగంలోకి దిగి జోహ్రాన్‌ ఓటమికి సర్వశక్తులూ ఒడ్డుతున్నాడంటే అతిశయోక్తి కాదు.నవంబరు నాలుగవ తేదీన జరిగే ఎన్నికల్లో పోటీలో ఉన్న ప్రముఖుల్లో జోహ్రాన్‌ ముందున్నట్లు తాజా సర్వేలు సూచిస్తున్నాయి. అయితే ఇంకా చాలా వ్యవధి ఉన్నందున ఏమైనా జరగవచ్చు అంటూ ఓటర్లను ప్రభావితం చేసేందుకు ప్రతి సర్వే సంస్థ బుద్దిశుద్ధికి పూనుకుంది.ఇద్దరు డెమోక్రటిక్‌ పార్టీ తిరుగుబాటుదార్లు, రిపబ్లికన్‌ పార్టీ అభ్యర్ధి జోహ్రాన్‌కు వ్యతిరేకంగా రంగంలో ఉన్నారు.

జెఫ్రీ ఎపస్టెయిన్‌ ఫైల్స్‌ గురించి అమెరికా మీడియాకు పెద్దగా పట్టలేదు.ఎపస్టెయిన్‌ ఖాతాదార్లలో డోనాల్డ్‌ ట్రంప్‌ ఒకడు అన్నది ఎప్పటి నుంచో వినిపిస్తున్నమాట. ఎలన్‌మస్క్‌ కూడా దాని సంగతేమిటని ప్రశ్నించిన సంగతి తెలిసిందే. ఇక్కడా ఖాతాదార్లంటే ఎపస్టెయిన్‌ అనేవాడు కల్లుదుకాణం నడుపుతుంటే రోజూ తాగేందుకు వెళ్లేవారు కాదు.మైనర్లయిన బాలికలకు వలవేసి ట్రంప్‌ వంటి తాతయ్యలు, డబ్బున్న విచ్చలవిడిగాండ్లకు తార్చేవాడు.వాడెంత పెద్దవాడంటే స్వంత విమానం కూడా నడిపేంత పేరుమోసిన వాడు. ఒక కేసుల్లో జైల్లో చచ్చాడు. ఎలా జరిగిందన్నది అనేక అనుమానాలు, పెద్దలందరూ కలసి తమపేర్లు బయటకు రాకుండా పనికానిచ్చేశారని చెబుతారు. అలాంటి ఖాతాదార్ల జాబితాను బయటపెట్టాలన్నది ఒక పెద్ద సమస్యగా మారింది.ట్రంప్‌ ఆ వివాదంలో మాట్లాడిన మాటలు అనుమానాలకు మరింత ఆజ్యం పోశాయి.గజం మిధ్య పలాయనం మిధ్య అన్నట్లుగా అసలు అలాంటి ఖాతాదార్ల జాబితా లేదని న్యాయశాఖ చెప్పింది. వడ్డించేవాడు మనవాడైతే బంతిలో ఎక్కడ కూర్చుంటే ఏమిటి ? ఆ జాబితాలో తన పేరు ఉన్నదని తానెప్పుడూ చెప్పలేదని, తన మీద కుట్ర జరుగుతోందని ట్రంప్‌ అంటున్నాడు. అయితే కచ్చితంగా ఏదో ఉండే ఉంటుందని ట్రంప్‌ గురించి తెలిసిన వారందరూ నమ్ముతున్నారు. గొర్రెల గోత్రాల కాపరులకే ఎరుక అని ఊరికే చెప్పలేదు పెద్దలు. ట్రంప్‌ గురించి పెద్దగా పట్టించుకోని మీడియా, సామాజిక మాధ్యమం జోహ్రాన్‌ మమ్దానీ గురించి గోరంతను కొండంతలుగా చేస్తోంది. అసలు జరిగింది ఏమిటట ?

సోషలిస్టు జోహ్రాన్‌ మమ్దానీ 27 ఏండ్ల రమా దువాజీ అనే యువతిని లేపుకుపోయాడని మీడియా వర్ణించింది. ఇది పచ్చి అబద్దం, అమెరికా సమాజంలో కొంతకాలం సహజీవనం, వివాహంతో నిమిత్తం లేకుండానే పిల్లల్ని కనటం, కావాలనుకుంటే వివాహం చేసుకోవటం సర్వసాధారణం. డేటింగ్‌ యాప్‌ ద్వారా కలిగిన పరిచయం ప్రేమగా మారి ఫిబ్రవరిలో వారు వివాహం చేసుకున్నారు. ఆ విషయాన్నీ జోహ్రాన్‌ స్వయంగా చెప్పాడు. నా రాజకీయ అభిప్రాయాలను విమర్శించండి గానీ కుటుంబ వ్యవహరాల్లోకి తొంగి చూడవద్దని హుందాగా ఎక్స్‌ద్వారా స్పందించాడు. వివాహం జరిగినపుడు ఎలాంటి వివాదం లేదు, ఆ తరువాత డెమోక్రటిక్‌ పార్టీ మేయర్‌ అభ్యర్థిగా పోటీ చేసినపుడు ఎలాంటి రచ్చ లేదు. ఇప్పుడు జూలై మూడవ వారంలో సన్నిహితులను పిలిచి వివాహ విందు ఇవ్వటాన్ని అమెరికా మీడియా రచ్చ చేసింది. ఉగాండాలో జన్మించిన జోహ్రాన్‌ మమ్దానీ ఏడు సంవత్సరాల వయస్సులో అమెరికా వచ్చాడు, 2018లో పౌరసత్వం వచ్చింది, తరువాత జరిగిన ఎన్నికల్లో న్యూయార్క్‌ రాష్ట్ర అసెంబ్లీ సభ్యుడిగా ఎన్నికై కొనసాగుతున్నాడు.


ఒక సోషలిస్టు అయి ఉండి వివాహ విందును మూడు రోజుల పాటు అంత భారీగా ఇవ్వటమా అంటూ మీడియా విశ్లేషకులు గుండెలు బాదుకుంటున్నారు.ఉగాండా రాజధాని కంపాలా శివార్లలో ధనికులు ఉండే ప్రాంతంలోని రెండెకరాల్లో ఉన్న వారి కుటుంబ ఫాంహౌస్‌లో విందు జరిగింది. అక్కడ తండ్రి మహమ్మద్‌ మమ్దానీ, తల్లి మీరా నాయర్‌ ఉంటారు. వారు న్యూయార్క్‌, న్యూఢల్లీిలను తరచూ సందర్శించి కొంత కాలం అక్కడా ఉంటారు. దాని చుట్టూ ఉద్యానవనాలు(వారివి కాదు), విక్టోరియా సరస్సు,ఎంతో అందమైన ప్రాంతంలో దానికి మూడు గేట్లు ఉన్నాయట, వివాహ సమయంలో ముసుగులు ధరించిన భద్రతా సిబ్బంది 20 మంది కాపలా ఉన్నారట,సెల్‌ఫోన్లు పనిచేయకుండా జామర్లను అమర్చారు, చెట్లకు విద్యుత్‌ దీపాలను అమర్చారు, ఆహ్వానించిన అతిధులను మాత్రమే అనుమతించారు.వారు ఖరీదైన కార్లలో వచ్చారు.అర్ధరాత్రి వరకు డిజెలతో కాలక్షేపం చేశారు. భారతీయ పద్దతిలో అతిధులకు పండ్ల రసాలు ఇచ్చారు. ఇలా కాళిదాసు కవిత్వానికి తమ పైత్యాన్ని జోడిరచినట్లుగా చిలవలు పలవలతో వర్ణించారు. ఆ సమయంలో ఉగాండా సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి ఒకరు మరణించారట. సంతాపం తెలపాల్సిన ఆ సమయంలో విందు, విలాసాలేమిటి అని మనోభావాలను ముందుకు తెచ్చే అంశాన్ని కూడా జోడిరచారు. ప్రభుత్వం సంతాపదినాలుగా ప్రకటించిందో లేదో తెలియదు, ఒకవేళ ప్రకటించినా అది అధికారిక కార్యకలాపాలకు తప్ప ప్రయివేటు, అదీ కూడా ఎంతో ముందుగా నిర్ణయించుకున్న కార్యక్రమాలకు వర్తించదు, బహిరంగ ఊరేగింపులు, అలాంటివేమీ లేవు. జోహ్రాన్‌ వివాహ విందు గురించి స్థానికులను ప్రశ్నిస్తే తమకు పెద్దగా తెలియదని, ఏదో పెద్దలు వచ్చినట్లు, భారీగా విందుజరిగినట్లు తాము కూడా గమనించామని చెబుతూనే తమ దగ్గర జన్మించిన బుడ్డడు న్యూయార్క్‌ నగరమేయర్‌గా పోటీ చేసేంత గొప్పవాడయ్యాడా అని సంబర పడిన వారు కూడా ఉన్నారట. బురద చల్లదలచుకొంటే ఇలానే మీడియా వ్యవహరిస్తుంది.ఎందుకంత కంటగింపు ?

జోహ్రాన్‌ మమ్దానీ ఎన్నికైతే అది భీతిగొలిపే పరిణామం అవుతుదని జూనియర్‌ డోనాల్డ్‌ ట్రంప్‌ కూడా తండ్రితో గొంతుకలిపాడు.ప్రపంచంలో సమాధి అయిన భావజాలాన్ని ముందుకు తీసుకువస్తున్నారన్నాడు.జోహ్రాన్‌ గనుక ఎన్నికైతే న్యూయార్క్‌ వాసులందరూ ఫ్లోరిడాకు వలసపోతారని చెప్పాడు. న్యూయార్క్‌ నగర రాబడిలో 80శాతం కేవలం 18వేల మంది మాత్రమే చెల్లిస్తున్నారని, వారంతా ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్లగలరని ఈ కొత్త మేయర్‌ అపని చేస్తారన్నాడు. ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగిన తనకు భయమేస్తున్నదని చెప్పుకున్నాడు. జోహ్రాన్‌కు వ్యతిరేకంగా జరుగుతున్న ప్రచారానికి జూనియర్‌ ట్రంప్‌ చెప్పిన మాటలు ప్రతిబింబం.నగరంలోని యావత్‌ ధనికులను రెచ్చగొట్టి పెద్ద మొత్తంలో డబ్బును రంగంలోకి దించి తమకు అనుకూలమైన వారిని గెలిపించుకోవాలన్న యావ కనిపిస్తున్నది. తాను ఎన్నికలలో భాగస్వామి కావటం లేదని, అయితే అమెరికా ఎన్నడూ సోషలిస్టు దేశం కాజాలదని జూనియర్‌ ట్రంప్‌ చెప్పాడు.


జోహ్రాన్‌ మమ్దానీని ఓడిరచేందుకు డెమోక్రటిక్‌ పార్టీలోని మితవాదులు, రిపబ్లికన్‌ పార్టీ, ఇతరులందరూ ఒక్కటి కావాలని చూస్తున్నప్పటికీ వారి మధ్య ఇప్పటివరకు ఏకాభిప్రాయం లేదు.వైరుధ్యాలు కూడా బహిర్గతమయ్యాయి. స్వతంత్ర అభ్యర్థిగా రంగంలో ఉన్నట్లు ప్రకటించుకున్న డెమోక్రటిక్‌ పార్టీకి చెందిన న్యూయార్క్‌ రాష్ట్ర మాజీ గవర్నర్‌ ఆండ్రూ కుమోకు తాను మద్దతు ఇస్తున్నట్లు డోనాల్డ్‌ట్రంప్‌ సంచలనాత్మక ప్రకటన చేశాడు. పార్లమెంటును తప్పుదారి పట్టించినందుకు అతని మీద విచారణకు తానే ఆదేశించినప్పటికీ అతను ఒక కమ్యూనిస్టుకు వ్యతిరేకంగా ఉన్నాడని, కనుక రంగంలో ఉండాలని అన్నాడు.డెమోక్రటిక్‌ పార్టీకే చెందిన ప్రస్తుత మేయర్‌ ఎరిక్‌ ఆడమ్స్‌ కూడా స్వతంత్రుడిగా పోటీచేయనున్నట్లు ప్రకటించాడు. అయితే అతన్ని బలపరుస్తారా అన్న ప్రశ్నకు తానేమీ చెప్పదలచుకోలేదంటూ వ్యతిరేకతను వెల్లడిరచాడు. ఎవరికి వారే మమ్దానికి వ్యతిరేకంగా ఏకైక అభ్యర్థిగా తానే ఉండాలని ప్రచారం చేసుకుంటున్నారు.ఒక వైపు అందరినీ కూడగట్టేందుకు చూస్తూనే మరోవైపు అసలు పోటీకి దూరం చేసేందుకు జోహ్రాన్‌పై ట్రంప్‌ సర్కార్‌ కుట్రలకు పూనుకుంది. జాతీయ భద్రతకు ముప్పు తెచ్చే వ్యక్తిగా చిత్రించి ఆ పేరుతో పోటీకి అనర్హుడిగా చేసేందుకు అలాంటి వారి జాబితాను రూపొందించాలని న్యాయశాఖ అధికారులను ఆదేశించింది. ఆ పేరుతో రూపొందించిన జాబితాలను కోర్టులు కూడా సమీక్షించే అవకాశం లేదని వార్తలు. ఇంతకు ముందు ఎవరినీ ఈ సాకుతో పోటీకి దూరం చేయలేదు. జోహ్రాన్‌ మమ్దానీ అమెరికాలో చట్టవిరుద్దంగా ఉంటున్నట్లు అనేక మంది చెబుతున్నారని, ప్రతిదాన్నీ తాను పరిశీలిస్తానని, న్యూయార్క్‌ను నాశనం చేసే ఈ పిచ్చి, నూటికి నూరుశాతం కమ్యూనిస్టును తాను వదిలేది లేదని ట్రంప్‌ కొద్ది రోజుల క్రితం ప్రకటించాడు. అంతర్గత భద్రత సలహా కమిటీ సమావేశంలో ట్రంప్‌ బూట్లు నాకే రూడీ గియులియానీ కమిటీ కార్యదర్శి క్రిస్టీ నియోమ్‌తో మాట్లాడుతూ మమ్దానీ బదులు ఒక దొంగ అయిన ఎరిక్‌ ఆడమ్స్‌ అయినా ఫరవాలేదని ఎందుకంటే అతను కమ్యూనిస్టు కాదని అన్నాడు. మమ్దానీలో ఇస్లామిక్‌ ఉగ్రవాది, కమ్యూనిస్టు కలిసి ఉన్నట్లు నోరుపారవేసుకున్నాడు. ఇది అధికారిక సమావేశంలో జరిగిన ఉదంతం గనుక ఏకంగా ప్రభుత్వమే కమ్యూనిస్టు వ్యతిరేక ప్రచారానికి తెరతీసిందన్నది స్పష్టం. అందుకే ఏదో ఒకసాకుతో జోహ్రాన్‌ అభ్యర్ధిత్వాన్ని దెబ్బతీసేందుకు పూనుకున్నట్లు కనిపిస్తోంది.


అభ్యర్థిత్వం కోసం పోటీ ప్రారంభమైన సమయంలో ఎవరు నెగ్గినప్పటికీ అందరూ ఐక్యంగా బలపరచాలని చెప్పిన డెమోక్రటిక్‌ పార్టీ పెద్దలు తీరా జోహ్రాన్‌ ఎన్నికైన తరువాత మాట మార్చారు.మితవాదులు ఎన్నికైతే ఎక్కడ పురోగామివాదులు వ్యతిరేకిస్తారో అని ముందరి కాళ్లకు బంధం వేసినట్లుగా వ్యవహరించిన వారి అసలు రంగు ఇప్పుడు కనిపిస్తోంది.జోహ్రాన్‌ మమ్దానీ గెలిస్తే అమెరికా చరిత్రలో స్వయంగా డోనాల్డ్‌ ట్రంప్‌ వర్ణించినట్లు(జోహ్రాన్‌ చెప్పుకోలేదు) ఒక కమ్యూనిస్టు ప్రపంచ పెట్టుబడిదారీ కేంద్ర కుంభస్థలమైన న్యూయార్క్‌ మేయర్‌ పీఠంపై కూర్చోవటం నిజంగా ఒక చరిత్రే అవుతుంది.ప్రపంచమంతటా సోషలిస్టులు, కమ్యూనిస్టుల పెరుగుదలను అరికట్టాలంటూ దశాబ్దాల తరబడి అమెరికా పాలకవర్గం చేసిన ప్రచారం, దానికి గాను ఖర్చు చేసిన వందలాది బిలియన్‌ డాలర్ల సొమ్ము స్వంత గడ్డమీదనే గాలికి కొట్టుకు పోతుంది. అమెరికాలో కూడా సోషలిస్టు ప్రత్యామ్నాయం సాధ్యమే అనే అభిప్రాయం బలపడుతుంది. అనేక మందిలో ఉన్న సోషలిస్టు, కమ్యూనిస్టు వ్యతిరేకత కరిగిపోతుంది. ఏ విధంగా చూసినా పురోగామి శక్తులకు యావత్‌ ప్రపంచంలోనే ఎంతో ఊపువస్తుంది. ఒకవేళ ఓడితే అమెరికాలో డెమోక్రటిక్‌, రిపబ్లికన్‌ పార్టీల నిజస్వరూపం మరింత బట్టబయలు అవుతుంది.ప్రత్నామాయ శక్తులు ఎదగకుండా చేసేందుకు ఆ పార్టీలు ఎంతకైనా తెగిస్తాయని మరింతగా కార్మికవర్గానికి అర్ధం అవుతుంది. ఏవిధంగా చూసినప్పటికీ పురోగామి ఉద్యమాలు ముందుకు పోవటానికి, ఆశక్తులు బలపడటానికే న్యూయార్క్‌ మేయర్‌ ఎన్నిక దోహదం చేయటం ఖాయం !


మహాభారతంలో అభిమన్యుడు అశువులుబాశాడు, నేడు అమెరికా కార్పొరేట్లు, మితవాదుల పద్మవ్యూహంలో జోహ్రాన్‌ మమ్దానీ దూసుకుపోతున్నట్లు, ప్రత్యర్ధులందరూ ఒక్కటైనా వారెవరూ గెలిచే అవకాశం లేదని దిగ్భ్రాంతి గొలిపే తాజా సర్వే వెల్లడిరచినట్లు పచ్చి కమ్యూనిస్టు వ్యతిరేక పత్రిక న్యూయార్క్‌ పోస్టు జూలై 29 సంచికలో వాపోయింది. కుంభకోణాల్లో చిక్కుకున్న ప్రత్యర్ధులందరూ ఒక్కటైనా 50శాతం ఓట్లతో ముందున్నట్లు పేర్కొన్నది.జెనిత్‌ రీసర్చ్‌ లేదా పబ్లిక్‌ ప్రోగ్రెస్‌ సొల్యూషన్‌ సర్వే ప్రకారం డెమోక్రటిక్‌ పార్టీ తిరుగుబాటుదార్లు కుమో, ఎరిక్‌ ఆడమ్స్‌లో ఒకరు తప్పుకొని కుమో ఉంటే 55శాతం, ఎరిక్‌ ఉంటే 59శాతం ఓట్లతో గెలిచే అవకాశం ఉందని, రిపబ్లికన్‌ అభ్యర్ధి స్లివా సుదూరంగా ఉన్నట్లు పేర్కొన్నది. కొంత మంది చెబుతున్నట్లు ఇంకా చాలా సమయం ఉంది, తాజా సర్వే తీరు చూసిన తరువాత ఇంకా కుట్ర తీవ్రమయ్యే అవకాశం లేకపోలేదు, చూద్దాం ఏం జరుగుతుందో !