Tags
BJP, Boycott of goods made in China, India Trade with China, Make In India, Narendra Modi Failures, Niti Aayog, Ten years Narendra Modi rule
ఎం కోటేశ్వరరావు
2018 ఏప్రిల్ నెలలో మన ప్రధాని నరేంద్రమోడీ చైనాలోని ఊహాన్ నగరంలో చైనా నేత షీ జింపింగ్‌తో కలసి ఊయల ఊగేందుకు వెళ్లారు. అప్పుడు నీతి ఆయోగ్ ఒక పత్రాన్ని ప్రధాని బృందానికి సమర్పించింది. దానిలో ఏం చెప్పిందంటే గడచిన దశాబ్దకాలంలో చైనాతో వాణిజ్యలోటు పదమూడు రెట్లు పెరిగిందనీ, పాత స్వేచ్చావాణిజ్య ఒప్పందాలను సమీక్షించాలని, నూతన ఒప్పందాల్లో ఏదైనా ఉపేక్ష ఉంటే అది మన మార్కెట్లను దెబ్బతీస్తుందని, భారత్ పట్ల చైనా ఔదార్యాన్ని ప్రదర్శించాల్సిన సమయం వచ్చిందని, చైనాతో మనదేశం జాగ్రత్తగా ఉండాలని సలహా ఇచ్చింది. మంచిదే, అంతకంటే కావాల్సిందేముంది ! ఇప్పటికి ఐదున్నర సంవత్సరాలు గడిచాయి. జరిగిందేమిటి ? రెండు దేశాల మధ్య కొత్త ఒప్పందాలేమీ కుదరలేదు. ఉన్నవి రద్దు కాలేదు. 2004-05నుంచి 2013-14 మధ్య కాలంలో 148 కోట్ల డాలర్లుగా ఉన్న చైనా-భారత వాణిజ్య లోటు 3,621కోట్లకు చేరిందని, అది 2,346శాతం పెరుగుదల అని అప్పటి నుంచి తమ ఏలుబడిలో 2021-22 నాటికి 7,331 కోట్లకు అంటే కేవలం వందశాతమే పెరిగిందని రాజ్యసభకు వెల్లడించిన సమాచారంలో కేంద్ర మంత్రి పియూష్ గోయల్ సమర్ధించుకున్నారు. మరుసటి ఏడాది అంది పదివేల కోట్ల డాలర్లకు చేరింది.ఈ ఏడాది తొలి ఆరునెలల్లో 5,653 కోట్ల డాలర్లు ఉంది.చైనాతో వాణిజ్య లోటును తగ్గించేందుకు అవసరమైన సూచనలు చేసేందుకు నవంబరు ఏడవ తేదీలోపు దరఖాస్తులు చేసుకోవచ్చని నీతి ఆయోగ్ సంస్థ తాజాగా కన్సల్టెన్సీ సంస్థలను కోరింది. రెండు రకాల అధ్యయనాలు చేస్తారట.సిఫార్సులు చేయటం, నివేదికలను రూపొందించటం తప్ప అధికారాలు లేని ఈ కేంద్ర ప్రభుత్వ సంస్థను నరేంద్రమోడీ ప్రణాళిక సంఘాన్ని రద్దుచేసి నెలకొల్పారు.
వాస్తవానికి చైనా నుంచి విధిగా దిగుమతులు చేసుకోవాలనే ప్రత్యేక ఒప్పందమేమీ మనదేశానికి లేదు. మనకు అవసరం ఎక్కువగా ఉంది గనుక అక్కడి నుంచి తెచ్చుకుంటున్నాం, వారికి మన నుంచి పెద్దగా దిగుమతులు అవసరం లేదు గనుక లోటు పెరుగుతోంది. అందువలన వాణిజ్య లోటు తగ్గించాలన్నా పూర్తిగా లేకుండా చేయాలన్నా చైనా నుంచి దిగుమతులను నిలిపివేస్తే సరిపోతుంది. లేదా మన ఎగుమతులు పెంచాలి. గత పదేండ్లుగా ఈ రెండూ చేతగాని స్థితిలో మోడీ దేశాన్ని ఉంచారా ? ఏం చేయాలో నీతి అయోగ్ సంస్థకు తెలియదా ? కొన్ని కోట్లు సమర్పించుకొని సలహలను కొనుక్కోవాలా ? లడక్ సరిహద్దులో జరిగిన ఘర్షణ ఉదంతాల తరువాత మన దేశంలో అనేక మంది మనం చైనా నుంచి దిగుమతులను నిలిపివేస్తే అది మన కాళ్ల దగ్గరకు వస్తుందని చెప్పారు. ఇంతకాలం రికార్డు స్థాయిలో తన రికార్డులను తానే బద్దలు కొట్టుకొని నరేంద్రమోడీ సర్కార్ దిగుమతులకు అనుమతులు ఇచ్చింది. స్టాటిస్టా సంస్థ వివరాల ప్రకారం 2022లో మన దేశం చేస్తున్న ఎగుమతుల్లో 18.5శాతం అమెరికాకు, 6.65శాతం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌కు, మూడవ స్థానంలో ఉన్న చైనాకు 5.04శాతం ఉన్నాయి. ఇదే కాలంలో చైనా ఎగుమతుల్లో 16.2శాతం అమెరికాకు ఆరవ స్థానంలో ఉన్న మన దేశానికి 3.29శాతమే ఉన్నాయి. అందువలన మనం దిగుమతులు, ఎగుమతులు నిలిపివేస్తే అరిటాకు మీద ముల్లు సామెత అవుతుంది. పదేండ్లుగా చెబుతున్న మేకిన్ ఇండియా(భారత ఉత్పత్తి), మేడిన్ ఇండియా(భారత తయారీ), ఆత్మనిర్భరత పిలుపుల వలన జరిగిందేమీ లేదు. 2022-23లో మన జిడిపిలో ఉత్పాదకరంగం వాటా 14.7శాతం, మోడీ ఏలుబడి పది సంవత్సరాల్లో దీనికి అటూ ఇటూగానే ఉంది తప్ప 25శాతానికి పెంచాలన్న లక్ష్యం ఎండమావిగానే ఉంది. పన్నెండు రంగాలలో దేశాన్ని ఉత్పత్తి కేంద్రంగా మార్చేందుకు సలహాలు ఇవ్వాలని నీతి అయోగ్ కోరుతున్నది. చైనా నుంచి దిగుమతులను తగ్గించాలని 2018లోనే నీతి అయోగ్ చెప్పింది కదా ! పోనీ అప్పుడే ఎందుకు అడగలేదు ? తగ్గించకపోగా ఎందుకు పెంచినట్లు ? ఇప్పుడు జనాన్ని మభ్య పెట్టేందుకు తన వైఫల్యాలను దాచిపెట్టేందుకు నీతి అయోగ్ పేరుతో కేంద్ర ప్రభుత్వం ఆడుతున్న ఒక నాటకం తప్ప ఇది మరొకటి కాదు. అమెరికా, జర్మనీ వంటి దేశాలు మేము చైనా మీద ఆధారపడకుండా ఉండలేంగానీ మీరు ప్రత్యామ్నాయంగా ఎదిగేందుకు ప్రోత్సహిస్తామని మనలను మునగచెట్టు ఎక్కిస్తున్నాయి.
వాటికే సాధ్యం కానిది మనకెలా కుదురుతుంది ! చైనా నుంచి దిగుమతి చేసుకొనే వస్తువులు ఎక్కడైనా దొరుకుతాయి. మరి ఎందుకు ఇతర దేశాల నుంచి తెచ్చుకోవటం లేదంటే చైనా మాదిరి తక్కువ ధరలకు మరొకదేశమేదీ ఇవ్వదు. అధిక ధరలకు ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకుంటే మన చేతి చమురు మరింత వదులుతుంది.ద్రవ్యోల్బణం, ధరలు పెరుగుతాయి. మన జనం కొనాలంటే జిఎస్‌టి పెంచుతారు, విదేశాలకు పద్నాలుగు రకాల వస్తువులను చౌకగా ఎగుమతి చేసేందుకు జనం సొమ్ము రెండు లక్షల కోట్ల రూపాయల మేర సబ్సిడీ ఇస్తున్నా ఎదుగూబొదుగూ లేదు. చైనాను పక్కకు నెట్టి ఆ స్థానాన్ని మనదేశం ఆక్రమిస్తుందని చెప్పటం పరిణితిలేనితనమని ఆర్‌బిఐ మాజీ గవర్నర్ రఘురామ రాజన్ గతంలో చెప్పాడు. ఐఎంఎఫ్ తాజా అంచనా ప్రకారం 2028నాటికి మన జిడిపి 5.94లక్షల కోట్ల డాలర్లకు చేరుతుందని, అదే చైనాలో 23.61లక్షల కోట్ల డాలర్లు ఉంటుంది. కానీ కొందరు అప్పటికి మన దేశం చైనాను అధిగమిస్తుందని చెబుతుంటే మరి కొందరు నిజమే కామోసనుకుంటున్నారు. ఎవరి నమ్మకం వారిది ? వినేవారుంటే చెప్పేవారికి కొదవ ఉండదు. చైనా వ్యతిరేక కళ్లద్దాలను పెట్టుకొని చూస్తే అలాగే కనిపిస్తుంది మరి ! గోల్డ్‌మాన్ శాచస్ సంస్థ అంచనా ప్రకారం 2075 నాటికి చైనా 57లక్షల కోట్ల డాలర్లతో ప్రధమ స్థానంలో 52.5లక్షల కోట్ల డాలర్లతో మనదేశం రెండవదిగా 51.5లక్షల కోట్ల డాలర్లతో అమెరికా మూడవ స్థానంలో ఉంటుందని చెప్పింది. ఇవన్నీ అంచనాలు తప్ప యాభై ఏండ్ల తరువాత రాజెవరో రెడ్డెవరో !
ప్రపంచం రక్షణాత్మక చర్యలు తీసుకుంటోందని, చైనా మీద ఇప్పటికే అమెరికా వాణిజ్యపోరు ప్రారంభించిందని, చైనా మీద అన్ని వైపుల నుంచి వత్తిడి పెరుగుతున్నందున దాన్ని అవకాశంగా మలుచుకోవాలని, మనదేశం చైనా వస్తువులకు మార్కెట్‌ను తెరవకూడదని నీతి అయోగ్ 2018 పత్రంలో స్పష్టంగా పేర్కొన్నది. చైనా వస్తువులను మన దేశంలో కుమ్మరించటం గాకుండా చైనా తమ దేశంలో తయారు చేస్తున్నవాటిని మన దేశంలో కూడా పెట్టుబడులు పెట్టి, మన కంపెనీలతో కలసి తయారు చేయించాలని నరేంద్రమోడీకి సలహా ఇచ్చింది. అలా చేస్తే దానికి బదులు ప్రపంచంలో ఇతర దేశాల రక్షణాత్మక చర్యలకు వ్యతిరేకంగా మనదేశ సహాయాన్ని చైనా కోరే అవకాశం ఉందని కూడా చెప్పింది. తెలివితేటలకు తక్కువేం లేదు. అదైనా చేశారా ? లడక్ సరిహద్దు ఉదంతం తరువాత చైనాను ఒక శత్రుదేశంగా పరిగణిస్తున్న సంగతి తెలిసిందే.పోనీ మనలను ఎగదోస్తున్న అమెరికా, ఇతర ఐరోపా దేశాలు మనకేమైనా సాయం చేస్తున్నాయా ? తమ దేశంలో ఒక సిక్కు ఉగ్రవాదిని భారత్ దేశమే హత్య చేయించిందన్న కెనడా ఆరోపణకు అమెరికా, ఐరోపా దేశాలు మద్దతు ప్రకటించిన సంగతి తెలిసిందే.
ప్రతి దేశం తన ప్రయోజనాలను తాను చూసుకుంటున్నది, తన పరిస్థితిని బట్టి అభివృద్ధి వ్యూహాన్ని రూపొందించుకోవాలి తప్ప చైనా దెబ్బతింటే మనకు అవకాశం వస్తుందని చెప్పేవారి మాటలు వింటే జరిగేదేమీ ఉండదని ఇప్పటికే తేలిపోయింది. ఇతర దేశాల వైఫల్యాల కారణంగా చైనా నేడు ఈ స్థితికి రాలేదు. తన స్వంత విధానాలను రూపొందించుకుంది. కరోనా నిరోధానికి అక్కడ అమలు జరిపిన కఠిన ఆంక్షలు కొంత మేరకు వృద్ధిని దెబ్బతీశాయి తప్ప అనేక మంది ఆశించినట్లు కుప్పకూలలేదు, ఇప్పుడు అలాంటి మాటలు చెప్పేవారి నోళ్లు మూతపడ్డాయి. నాలుగు సంవత్సరాల నాడు ప్రాంతీయ సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పంద(ఆర్‌సిఇపి) చర్చల నుంచి మనదేశం వైదొలిగిన తరువాత మనం సాధించిందేమీ లేదు. 2022 జనవరి నుంచి ఆ ఒప్పందం అమల్లోకి వచ్చింది. దానిలో చేరాలని తాజాగా బంగ్లాదేశ్, శ్రీలంక దరఖాస్తు చేసుకున్నాయి. దానిలో మనం చేరితే దిగుమతి వ్యాపారం చేసే శక్తులు లాభపడతామని భావిస్తుండగా నష్టపోతామని పారిశ్రామిక రంగం వ్యతిరేకిస్తోంది. మన దేశానికి తలుపులు తెరిచే ఉంచామని ఆ కూటమి పదే పదే చెబుతోంది.
అసలు చైనాతో మనదేశం పూర్తిగా తెగతెంపులు చేసుకోగలదా ? చైనా సంస్థలను నిరోధించగలదా ? చైనా నుంచి వస్తు దిగుమతులను నిలిపివేయవచ్చు. అదే జరిగితే ఆ దిగుమతులతో లబ్ది పొందుతున్న ఫార్మా, ఇతర రంగాల కార్పొరేట్ల నుంచి ప్రతిఘటన ఎదురవుతుంది. చైనా సభ్యురాలిగా ఉన్న ఆసియన్ డెవలప్‌మెంట్ బాంక్(ఎడిబి), ఏఐఐబి, ప్రపంచబాంకు వంటి ఆర్థిక సంస్థలలో మనదేశం కూడా భాగస్వామి. వాటి నుంచి రుణాలు తీసుకొని మనదేశంలో అమలు జరిపే ప్రాజెక్టులలో కాంట్రాక్టులను దక్కించుకొనేందుకు చైనా సంస్థలకు హక్కు ఉంటుంది. వాటికవి దూరంగా ఉంటే లేదా నిబంధనలను ఉల్లంఘిస్తే తప్ప నిరాకరించటానికి కుదరదు. గాల్వన్ ఉదంతాల తరువాత ఢిల్లీ-మీరట్ రాపిడ్ రైల్ మార్గంలో చైనా కంపెనీల కాంటాక్టులను రద్దు చేయాలని ఆర్‌ఎస్‌ఎస్ అనుబంధ స్వదేశీ జాగరణ మంచ్ తదితర సంస్థలు ఆందోళన చేసినప్పటికీ కుదరలేదు.ఎందుకంటే అవసరమైన నిధులను ఏడిబి నుంచి రుణాలుగా తీసుకున్నారు. చైనా కంపెనీలు పూర్తి చేసిన మార్గాన్నే ఇటీవల ప్రధాని నరేంద్రమోడీ ప్రారంభించారు. మన దేశంలో దాదాపు ఎనిమిది వందల చైనా కంపెనీలు పెట్టుబడులు పెట్టాయి. స్నాప్‌డీల్, ఫ్లిప్‌కార్ట్, బైజూస్,స్విగ్గీ, జొమాటో,ఉడాన్, ఓలా,పేటియం, పేటియం మాల్, బిగ్‌బాస్కెట్,పోలసీబజార్,ఓయో వంటి కంపెనీలలో చైనా పెట్టుబడులు ఉన్నాయి. వాటన్నింటిని తెల్లవారేసరికి వెళ్లిపొమ్మని నరేంద్రమోడీ చెప్పవచ్చు, వాటికవి వెళ్లిపోతే సరే, లేకుంటే నష్టపరిహారం చెల్లించాల్సి ఉంటుంది. దాన్ని ప్రభుత్వం భరిస్తుందా ? ఇష్టం లేదని ఈ రోజు చైనా కంపెనీలను వెళ్లగొడితే మనదేశాన్ని నమ్మి పెట్టుబడులు పెట్టేందుకు ఇతర దేశాల కంపెనీలు ముందుకు వస్తాయా ? పాలకులకు ఇష్టం లేకపోతే రేపు మనకూ అదే గతి అని ఆలోచించవా ? సరిహద్దు వివాదం తరువాత మనం చైనా వైపు తలుపులు మూసుకున్నాం తప్ప ఇతర దేశాల నుంచి సాధించిందీ లేదు, ఏ ఒక్క చైనా కంపెనీ కూడా వెనక్కు వెళ్లిపోలేదు.
చైనా టెక్ కంపెనీల ఉత్పత్తులను దిగుమతి చేసుకుంటే తమ సమాచారాన్ని తస్కరించే అవకాశం ఉందని, రక్షణకు ముప్పని అమెరికా, ఐరోపా దేశాలు చెబుతున్నాయి.ఇప్పుడు మన దేశమూ అదే చెబుతోంది. నిజమే అనుకుందాం. ఇంటెల్ వంటి అమెరికా, ఐరోపా కంపెనీల ఉత్పత్తులను దశాబ్దాల తరబడి చైనా దిగుమతి చేసుకుంది.వాటితో చైనాకూ భద్రతా ముప్పు ఉన్నట్లే కదా ! పోనీ మన దేశం చైనా బదులు ఇతర దేశాల నుంచి కొనుగోలు చేస్తే వాటి నుంచి మనకు ముప్పు ఉండదా ? మన సమాచారాన్ని అవి తస్కరించవా ? జపాన్ నాగసాకీ నగరంలో 2023 మే నెలలో జరిగిన జి7 దేశాల సమావేశం చైనాతో ఉన్న సరఫరా గొలుసు నుంచి విడగొట్టుకుంటామని చెబుతూ మన దేశాన్ని చైనా స్థానంలోకి నెడతామని చెప్పాయి.వాటిని నమ్ముకుంటే కుక్కతోక పట్టుకొని గోదావరిని దాటేందుకు చూసినట్లే ! దశాబ్దాల తరబడి చైనా నుంచి వస్తువులను దిగుమతి చేసుకున్న పశ్చిమ దేశాలకు ఇప్పుడెందుకు జ్ఞానోదయం కలిగినట్లు ? వాటి మాటలు నమ్మి చైనా అనే కొండను ఢ కొడతామని మనం అనుకోవటం సరైందేనా ? చైనాతో తెగతెంపులు చేసుకుంటే తమ ఆర్ధిక వ్యవస్థలు మెరుగుపడతాయని పశ్చిమ దేశాలు అనుకుంటున్నాయి. అలాంటివి తమ దేశాల్లోనే పరిశ్రమలు, పెట్టుబడులు పెట్టుకుంటాయి తప్ప మనదేశం ఎందుకు వస్తాయి ? చైనా మీద ఆధారపడి చేతులు కాల్చుకున్నామని భావిస్తున్నవారు మన మీద ఆధారపడి మరోసారి అదే తప్పు చేస్తారా ? సొల్లు మాటలను కట్టిపెట్టి ముందు చైనాతో విడగొట్టుకోమనండి !





