Tags
BJP, CHANDRABABU, lateral entry notification, Narendra Modi Failures, Pawan kalyan, RSS, Rule of reservations, UPSC
ఎం కోటేశ్వరరావు
ప్రైవేటు అధికారుల నియామకానికి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఇచ్చిన ప్రకటనను వెనక్కు తీసుకోవాల్సిందిగా 2024 ఆగస్టు 20న కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. ఈ నియామకాలపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. వ్యతిరేకించిన వారిని ఖండిస్తూ, ప్రభుత్వాన్ని సమర్ధిస్తూ మాట్లాడిన పెద్దలు తలలు ఎక్కడ పెట్టుకోవాలో వారికే వదలి వేద్దాం. ప్రధాని నరేంద్రమోడీ మార్గదర్శకాల మేరకే రద్దు నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌కు లేఖ రాశారు. నష్టనివారణ చర్యగా , అందులోనూ మోడీకి తెలియకుండా ఇదంతా జరిగిందనే భావనను చొప్పించేందుకు, మోడీ సామాజిక న్యాయానికి ఎల్లవేళలా కట్టుబడి ఉన్నారని చెప్పుకున్నారు. ఏ నిర్ణయమైనా ప్రధాని లేదా కార్యాలయానికి తెలియకుండా ఉండవు. అలాంటపుడు యుపిఎస్‌సి ప్రకటన సందర్భంగా ఏ గుడ్డి గుర్రానికి పండ్లుతోముతున్నట్లు అనే ప్రశ్న సహజంగానే వస్తుంది. అఫ్ కోర్సు అక్కడ జవాబు చెప్పేవారు గానీ జవాబుదారీతనం ఉన్న వారు గానీ కనపడరు. ఈ సందర్భంగా వచ్చిన కొన్ని వాదనలు, అసంబద్దతలను చూద్దాం. మరోవైపు తమ చర్యను సమర్ధించుకుంటూ ప్రైవేటు వ్యక్తులను అధికారులుగా తీసుకోవటాన్ని 2004-09 మధ్య కాంగ్రెస్ నాయకత్వంలోని యూపిఏ ప్రభుత్వమే ప్రారంభించిందని, 2005లో ఆ పార్టీకి చెందిన వీరప్ప మొయిలీ ఆధ్యర్యంలోని రెండవ అధికార యంత్రాంగ సంస్కరణల కమిషన్(ఏఆర్‌సి) గట్టిగా సిఫార్సు చేసిందని, తరువాత 2017లో నీతి ఆయోగ్ కూడా సిఫార్సు చేసిందని బిజెపి, ఇతర పెద్దలు చెబుతున్నారు. అనేక కమిటీలు అనేక సిఫార్సులు చేశాయి.వాటన్నింటినీ అమలు జరుపుతున్నారా ? రాజ్యాంగంలోని ఆదేశిక సూత్రాల అమలుకే దిక్కులేదు. పంటల మద్దతు ధరల నిర్ణయానికి స్వామినాధన్ కమిషన్ ఒక సూత్రాన్ని చెప్పింది. దాన్ని ఎందుకు అమలు చేయటం లేదు ? కనీస మద్దతు ధరలకు చట్టబద్దత కల్పించాలని నరేంద్రమోడీ నాయకత్వంలోని ముఖ్యమంత్రుల కమిటీ స్వయంగా సిఫార్సు చేసింది. తానే ఆ పదవిలో ఉండి దాన్ని అమలు జరిపేందుకు ఎందుకు తిరస్కరిస్తున్నట్లు ? ఇలా చాలా ఉన్నాయి.
నైపుణ్యం కావాలి అంటున్నారు. ప్రభుత్వ యంత్రాంగంలో ఇప్పుడు లేదా ? లేనపుడు ఎప్పటికపుడు తగిన శిక్షణ ఇవ్వాలి, ఇప్పించండి.ప్రతి ఏటా అనేక మందిని విదేశాలకు పంపి అధ్యయనాలు చేయిస్తున్నారు కదా ! వేల మంది అధికారులున్న వ్యవస్థలో నలభై అయిదు మంది బయటి వారిని తీసుకు వచ్చి మూడు లేదా ఐదు సంవత్సరాల వ్యవధిలో దేశం మొత్తానికి నైపుణ్యాన్ని తీసుకుస్తామని చెబితే నమ్మేందుకు జనం చెవుల్లో పూలు పెట్టుకున్నారని భావిస్తున్నారా ? ప్రయివేటు రంగంలోని వారు నిజంగా అంతటి నిపుణులైతే అనేక పరిశ్రములు, వ్యాపారాలెందుకు మూతపడుతున్నాయి. అనిల్ అంబానీ కంపెనీలను అలాంటి నిపుణులు ఎందుకు కాపాడలేకపోయారు ? ప్రైవేటు రంగ సంస్థలు చైనాలో మాదిరి వస్తు ఉత్పత్తులు, ఎగుమతులు ఎందుకు చేయలేకపోతున్నాయి ? నిజంగా అంతనిపుణులైతే ప్రభుత్వ రంగ సంస్థల మూసివేత, అమ్మివేసేబదులు వాటిని ఉద్దరించేందుకు కావాలంటే కొందరిని నియమించి బాగు చేయవచ్చు. గతంలోనే అమలు జరిపారు, అప్పుడెందుకు అభ్యంతరం చెప్పలేదు, ఇప్పుడెందుకు వ్యతిరేకిస్తున్నారు అంటూ అడ్డుసవాళ్లు ! ఉదాహరణకు ఆర్‌బిఐ గవర్నర్‌గా బయటివారిని నియమించటం ఎప్పటి నుంచో ఉంది. కానీ రోజువారీ నిర్వహణకు ప్రైవేటు అధికారులను నియమిస్తున్నారా ? పాలన తీరు మెరుగుపరచటానికి, కొత్త ఆలోచనలను, నైపుణ్యాలను ప్రవేశపెట్టటానికి ఎవరి సలహాలనైనా తీసుకోవచ్చు. వాటిని అమలు జరపాల్సింది అధికారయంత్రాంగం తప్ప నిపుణులు కాదు. మూడేండ్ల కాలం మాత్రమే ఉండేవారు, పాలనా పద్దతులను నేర్చుకొనేదెన్నడు ? అమలు చేసేదెప్పుడు ? గతంలో ప్రైవేటు వారిని ఎంత మందిని తీసుకున్నారు, వారి సేవల కారణంగా ఒనగూడిన పాలనా ప్రయోజనమెంత, ఎప్పుడైనా మదింపు చేశారా ? గతంలో ఎందుకు మాట్లాడలేదంటున్నారు. మాకు నాలుగు వందల సీట్లు వస్తే రాజ్యాంగాన్ని మారుస్తామని పదేండ్ల తరువాత బిజెపి ఎంపీలు ఇద్దరు చెప్పారు. 2014లోక్‌సభ ఎన్నికలకు ముందు ఎందుకు చెప్పలేదు ? అందువలన అలాంటి అడ్డుసవాళ్లకు అర్ధం లేదు. ఆ విధాన అసలు లక్ష్యాన్ని వెంటనే గ్రహించకపోవచ్చు, ఒక్కసారే కదా చూద్దాంలే అనుకొని ఉండవచ్చు, దాన్ని నిరంతర ప్రక్రియగా మారిస్తే దాని ప్రమాదాన్ని గ్రహించి ఇప్పుడు గట్టిగా ప్రతిఘటించాలని భావించవచ్చు. ఆ మాటకొస్తే నరేంద్రమోడీ దేశమంతటా గుజరాత్ విధానాన్ని అమలు చేస్తామన్నారు ? ఆదర్శం అన్నారుగా, ఎందుకు అమలు జరపటం లేదు, ఇప్పుడసలు ప్రస్తావించటమే లేదు ? అమెరికా, ఐరోపా దేశాల్లో ఇలాంటి విధానం ఉంది. నిజమే, నిరుద్యోగ భృతి, కార్మికుడి ఉద్యోగం పోతే ఎంతోకొంత ఆదుకోవటం ఉంది. మరి వాటి సంగతేమిటి ? వాటిని కూడా ప్రవేశపెట్టండి. పోనీ అక్కడ పాలన అంత నైపుణ్యంతో ఉందా ? ఆర్థికంగా ఆ దేశాల జిడిపి వృద్ధి రేటు ఎంత ? నిపుణులేం చేస్తున్నారు ? మన కళ్ల ముందే వచ్చిన 2008 ఆర్థిక సంక్షోభానికి కారకులు ఎవరు ? బాంకింగ్ వ్యవస్థలన్నీ ఎందుకు కూలిపోయాయి? మన ప్రభుత్వ రంగబాంకులెందుకు తట్టుకొని నిలిచాయి ? అమెరికా, ఐరోపాల్లో అలాంటి నిపుణులు ఇచ్చిన తప్పుడు సలహాల వలన అనేక ప్రాంతాల్లో యుద్ధాలు, సంక్షోభాలు రాలేదా ?మనకు అవసరమైన వాటినే కాదు, మిగతా వాటిని కూడా పోల్చుకోవాలి.
దీని వెనుక ఉన్న అసలు కథేమిటి ?
ప్రపంచబ్యాంకు, ఐఎంఎఫ్ తన ఖాతాదారులైన దేశాల మీద రుద్దే అనేక షరతుల్లో అధికార యంత్రాంగంలో మార్పులు ఒకటి. కేంద్ర ప్రభుత్వంలోని వివిధ శాఖల్లో సంయుక్త కార్యదర్శులు, డైరెక్టర్లు, ఉపకార్యదర్శులుగా మూడు నుంచి గరిష్టంగా ఐదేండ్ల వరకు పని చేసేందుకు 45 మందిని స్పెషలిస్టుల పేరుతో ఆలిండియా సర్వీసు పరీక్షలతో నిమిత్తం లేకుండా తీసుకోవాలని పబ్లిక్ సర్వీసు కమిషన్ ఒక నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ నియామకంలో రిజర్వేషన్లు ఉండవు.ప్రతిపక్షాలు, చివరికి ఎన్‌డిఏ పక్షాలు ఎల్‌జెపి, జెడియు ,వివిధ సంస్థలు దీన్ని వ్యతిరేకించాయి. ప్రభుత్వం వెలుపల ఉన్న వారిలో ప్రత్యేక నైపుణ్యం, నవ దృక్పధం కలవారిని తీసుకొని పాలన స్థాయిని పెంచటమే లక్ష్యంగా చెప్పారు. చేదు మాత్ర మింగించటానికి పంచదార పూత పూయటం వంటిదే ఇది.ఈ పేరుతో ప్రైవేటీకరణకు పూనుకోవటమే.సంస్కరణల పేరుతో నూతన విధానాలను ముందుకు తెచ్చినపుడు నష్టాలు వచ్చే ప్రభుత్వ రంగ సంస్థలను మూసివేస్తామన్నారు, తరువాత వాటిని విక్రయించి సొమ్ము చేస్తామన్నారు, చివరికి ఇప్పుడు చెబుతున్నదేమిటి ? నష్టాలు లాభాలతో నిమిత్తం లేకుండా ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మివేయటమే విధానం అంటున్న సంగతి తెలిసిందే. ఎల్‌ఐసి వంటి లాభాలు వస్తున్న సంస్థల నుంచి కొంత శాతం వాటాలను విక్రయిస్తున్నారు. తరువాత పూర్తిగా అమ్మివేయవచ్చు. ప్రభుత్వ యంత్రాంగాన్ని తగ్గించేందుకు, రిజర్వేషన్లతో నిమిత్తం లేకుండా ప్రైవేటు వారితో నింపేదురాలోచన దీని వెనుక ఉంది. సేవారంగాలు, ఉత్పత్తి రంగాలలో ప్రభుత్వ ప్రమేయం లేకుండా మొత్తం ప్రైవేటుకే అప్పగించాలన్నది ప్రపంచ బాంకు ఆదేశం. దానిలో భాగంగానే గత మూడు దశాబ్దాలుగా కేంద్రం లేదా రాష్ట్రాలు పెట్టుబడులు పెట్టటం నిలిపివేసి ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలను అయిన వారికి కారుచౌకగా కట్టబెట్టేందుకు చూస్తున్నాయి.ఎందరో నిపుణులు ఉన్నారని చెబుతున్న ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీలు కేవలం సర్టిఫికెట్‌లు ఇచ్చే ఫ్యాక్టరీలుగా ఎందుకు మారినట్లు ? ప్రైవేటు మెడికాలేజీల్లో వేషాలు కొంత మందికి వైద్యుల వేషాలు వేసి తనిఖీల తతంగాన్ని ఎందుకు నడిపిస్తున్నట్లు ?
ప్రైవేటు నియామకాల్లో రిజర్వేషన్లు లేకుండా చేసేందుకు ” అద్భుత ” తెలివి తేటలను చూపారు. మొత్తం 45నియామకాలను కలిపి గాక విడివిడి పోస్టులుగా చేశారు. ఒకే పోస్టు ఉన్నపుడు రిజర్వేషన్ నిబంధన వర్తించదు గనుక ఈ చావు తెలివిని ప్రదర్శించారు.2018లో కూడా ఇదే చేసి 63 మందిని నియమించారు. వారిలో ఇప్పుడు 57 మంది పని చేస్తున్నారు. రిజర్వేషన్లు ఉంటేనే ఇప్పుడు ఉన్నతాధికారుల్లో ఎస్‌సిలు 4,ఎస్‌టిలు 4.9శాతం మాత్రమే ఉన్నారు. ఇలా ప్రైవేటు వారిని తీసుకుంటే ఈ తరగతులతో పాటు మొత్తంగా అందరికీ ప్రమోషన్లు తగ్గిపోతాయి.దేశవ్యాపితంగా 1,500 మంది ఐఏఎస్‌ల కొరత ఉందని చెబుతున్నారు. అలాంటపుడు తీసుకొనే వారి సంఖ్యను పెంచుకోవచ్చు. సాంకేతిక,ఆర్థికం, విద్య, వైద్యం వంటి రంగాల్లో నిపుణులుగా ఉన్న వారిని ఈ పోస్టులలో నియమిస్తే అందునా మూడు నుంచి ఐదేండ్లలో వారు తమ నైపుణ్యాన్ని ప్రదర్శించటం మీద కేంద్రీకరిస్తారా లేక పాలన మీద దృష్టిపెడతారా ? ప్రభుత్వ ఉద్యోగిగా ఉన్నవారికి కొన్ని నిబంధనలు, జవాబుదారీతనం ఉంటాయి. మూడు లేక ఐదేండ్లు కాంట్రాక్టు ఉద్యోగిగా ఉండే వారికి అలాంటి బాధ్యత ఉంటుందా ? అక్రమాలకు పాల్పడి బయటకు వెళితే చేయగలిందేమిటి ?
కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని తాము సమర్ధిస్తున్నట్లు తెలుగుదేశం ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తమతో చెప్పినట్లు ఇండియన్ ఎక్స్‌ప్రెస్ పత్రిక రాసింది. బీహార్‌కు చెందిన లోక్ జనశక్తి పార్టీ(ఎల్‌జెపి),జెడియు రెండూ బిజెపి మిత్రపక్షాలే కేంద్రంలో అధికారాన్ని పంచుకుంటున్నాయి. అవి రెండూ ప్రైవేటు అధికారుల నియామకాన్ని బహిరంగంగానే వ్యతిరేకించాయి. మరి సామాజిక న్యాయం కోసం నిలబడతామని చెప్పి అపర రాజకీయ చాణుక్యుడిగా పేరున్న చంద్రబాబు, అవసరమైతే ఎవరినైనా తాటతీస్తా, తోలు వలుస్తా అని చెప్పిన జనసేనాని పవన్ కల్యాణ్ ఎందుకు మౌనంగా ఉన్నట్లు ? నియామకాల రద్దు నిర్ణయం తరువాత వారు నేర్చుకున్న పాఠం ఏమిటి ? నరేంద్రమోడీ సర్కార్ తీసుకొనే నిర్ణయాల్లో తప్పుంటే తప్పని చెప్పాలి. నల్లధనం రద్దు, ఉగ్రవాదులకు నిధులు అందకూడనే పేరుతో నోట్ల రద్దు అనే పిచ్చిపని చేసినపుడు ఆ చర్యను సమర్దించటమే దేశభక్తిగా అనేక మంది భావించారు. అదెంత బూటకమో నల్లధనం మన కళ్ల ముందే ఎలా డిజెలతో నాట్యం చేస్తున్నదో చూస్తున్నాము. ఆ చర్యను చారిత్రాత్మకమైనదిగా నాడు చంద్రబాబు నాయుడు వర్ణించారు, అలాంటి పని చేయాలని తామే కోరినట్లు కూడా చెప్పుకున్న పెద్ద మనిషి ఎన్‌డిఏ నుంచి బయటకు వచ్చాక దానికి విరుద్దమైన మాటలు మాట్లాడారు.
మూడు సాగు చట్టాలను తీసుకువచ్చినపుడు రైతాంగం ఏడాది పాటు ఢిల్లీ శివార్లలో భైటాయించిన తరువాత గానీ మోడీ క్షమాపణలు చెప్పి వెనక్కు తీసుకోలేదు. కానీ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కేవలం 45 మందిని ప్రైవేటుగా కాంట్రాక్టు పద్దతిలో తీసుకొనేందుకు తీసుకున్న నిర్ణయం మీద ప్రతిపక్షాల నిరసన ప్రకటనలు తప్ప ఎక్కడా ఆందోళనలు ప్రారంభం కాలేదు. అయినా మోడీ సర్కార్ వెంటనే ఎందుకు వెనక్కు తగ్గాల్సి వచ్చింది ? ప్రతిపక్షాలు, సామాజిక న్యాయంకోరే సంస్థలు, వ్యక్తులు రిజర్వేషన్ల సమస్యను ప్రస్తావించారు. మొండిగా దాన్ని అమలు జరిపేందుకు ముందుకు పోతే రానున్న హర్యానా, కాశ్మీరు, మహారాష్ట్ర, ఝార్కండ్, ఢిల్లీ రాష్ట్రాల ఎన్నికల్లో దెబ్బతింటామని బిజెపి భయపడింది.వెనుకబడిన తరగతుల జనాభా వివరాలను సేకరించాలన్న డిమాండ్‌ను ఇంతకాలం కేంద్ర ప్రభుత్వం తిరస్కరించింది. కావాలంటే రాష్ట్రాలు చేసుకోవచ్చని చెప్పారు. కానీ రానున్న జనాభా లెక్కల సేకరణలో కులం వివరాలు నమోదు చేసే అంశాన్ని చేర్చటం గురించి ఆలోచిస్తున్నట్లు అధికార వర్గాలు చెప్పినట్లు తాజాగా వార్త వచ్చింది.(2024 ఆగస్టు 22వ తేదీ హిందూ పత్రిక పతాక శీర్షిక) ఎందుకంటే ఇప్పటికే బిజెపికి ఆ సెగ తగిలింది. వ్యక్తిగా నరేంద్రమోడీ, కేంద్ర బిజెపి సర్కార్ నానాటికీ విశ్వసనీయత కోల్పోతున్నది.చెప్పేది ఒకటి చేసేది ఒకటని జనం భావించటం ప్రారంభమైంది. ఒకరిద్దరు బిజెపి ఎంపీలు తమకు లోక్‌సభలో నాలుగు వందల సీట్లు వస్తే రాజ్యాంగాన్ని మారుస్తామని చేసిన ప్రకటనను విశ్వసించారు తప్ప అలాంటిదేమీ లేదన్న మోడీ మాటను జనం నమ్మలేదు. ఆ పార్టీకి సంపూర్ణ మెజారిటీ లేకుండా చేశారు. ఎన్నికలు ముగిసి వందరోజులు కూడా గడవక ముందే రిజర్వేషన్లతో నిమిత్తం లేని కేంద్ర ఉన్నతాధికారుల నియామక ప్రక్రియను చేపట్టటంతో రిజర్వేషన్లకు తిలోదకాలిస్తారన్న ప్రచారం నిజమే అని జనం నిర్ధారణకు వస్తున్న కారణంగానే వెంటనే ఆ నిర్ణయాన్ని వెనక్కు తీసుకున్నారు.చివరికి ఇప్పుడు నరేంద్రమోడీ నిజం చెప్పినా జనం అనుమానంతో చూసే పరిస్థితి వచ్చింది. అందుకే మోడీని గుడ్డిగా సమర్ధిస్తే అంతే సంగతులు !

