Tags
Amit Shah, BJP, CM Yogi Adityanath, Modi vs Yogi, Narendra Modi Failures, RSS, Rumblings in Uttar Pradesh BJP, UP BJP poll fate
ఎం కోటేశ్వరరావు
లోక్‌సభ ఎన్నికల్లో బిజెపికి దిమ్మతిరిగింది. గుండెకాయ వంటి ఉత్తర ప్రదేశ్‌లో చెప్పుకోలేని చోట దెబ్బ తగిలింది. దీంతో పార్టీలో చదరంగం, వైకుంఠపాళీ క్రీడలు ప్రారంభమయ్యాయి. దీన్ని అవకాశంగా తీసుకొని సమాజవాది పార్టీ తన తురుపు ముక్కను ప్రయోగించింది. ఎవరైనా వంద మంది ఎంఎల్‌ఏలతో బిజెపి నుంచి వెలుపలికి వస్తే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఇస్తామని, ఇది వర్షాకాల ధమాకా అని ప్రతిపక్ష నేత అఖిలేష్ యాదవ్ బంపర్ ఆఫర్ ఇచ్చారు. ఆ రాష్ట్రంలోని 80లోక్‌సభ స్థానాలకు గాను బిజెపికి 2014లో 72, గత ఎన్నికల్లో 62రాగా ఇప్పుడు 33కు పడిపోయాయి. సమాజవాది పార్టీకి 37,దాని మిత్రపక్షమైన కాంగ్రెస్‌కు ఆరు స్థానాలు వచ్చాయి. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, ఉపముఖ్యమంత్రి కేశవ ప్రసాద్ మౌర్య ఎడముఖం పెడముఖంగా ఉన్నారు. యోగిని తప్పించి తిరిగి గోరఖ్‌పూర్ మఠానికి పంపేందుకు నరేంద్రమోడీ, అమిత్ షా పూనుకున్నారనే వార్తలు గుప్పుమన్నాయి. రకరకాల కథనాలను ప్రచారంలో పెట్టారు. మరోవైపు పార్టీ, ప్రభుత్వం మొత్తం తన వెనుకే ఉందని చూపేందుకు యోగి వరుసగా సమావేశాలు జరుపుతూ బల ప్రదర్శనకు పూనుకున్నారు.బిజెపి స్వయం ప్రకటిత నిబంధనల ప్రకారం 75 సంవత్సరాలు దాటిన వారు ముఖ్యమైన పదవుల్లో ఉండకూడదు.ఆ సాకుతో అద్వానీని ప్రధాని పదవికి దూరంగా పెట్టారు. ఇప్పుడు నరేంద్రమోడీ వంతు వచ్చింది. ఆ స్థానంలో తదుపరి యోగి ఆదిత్యనాధ్ ఉంటారని ఒక ప్రచారం కాగా నితిన్ గడ్కరీ పేరు మరోవైపు నుంచి వినిపిస్తున్నది. అమిత్ షా ప్రయత్నం సరేసరి. తన పుట్టుక మామూలుగా జరగలేదని, దైవాంశతో జన్మించిన కారణంగానే తనకు శక్తి వస్తున్నదంటూ వయస్సు వచ్చినా గద్దె దిగేది లేదన్నట్లు మోడీ తెగేసి చెప్పారు. ఇదిలా ఉంటే ఉత్తర ప్రదేశ్ ఓటమికి యోగిని బాధ్యుడిగా చేసి ఒకవేళ ప్రధానిగా అమిత్ షాకు అవకాశం వస్తే అడ్డుతొలిగించుకొనేందుకు వచ్చిన అవకాశాన్ని వదులుకోకూడదని చూస్తున్నట్లుకూడా చెబుతున్నారు. దేన్నీ కాదనలేని స్థితి. మొత్తం మీద మిగతా పార్టీలకూ బిజెపికీ పెద్ద తేడాలేదని జనాల కళ్లు తెరిపిస్తున్నారు.
ఇతర పార్టీల వ్యవహారాల్లో వేలుపెట్టి కెలుకుతున్న బిజెపి నేతలు ఇప్పుడు స్వంత పార్టీలోనే చేస్తున్నారని అఖిలేష్ యాదవ్ ఊరికే అనలేదు. ఉత్తర ప్రదేశ్‌లో అయోధ్య రామాలయం ఉన్న ఫైజాబాద్‌తో సహా అనేక కీలక నియోజకవర్గాలలో బిజెపి మట్టికరచింది. నరేంద్రమోడీ పోటీ చేసిన వారణాసి నియోజకవర్గంలో గతంలో వచ్చిన మెజారిటీ 4.79లక్షల నుంచి 1.52లక్షలకు దిగజారింది. తమను ఓట్ల రొంపిలోకి లాగటం ఏమిటని అటు రాముడు, ఇటు కాశీ విశ్వనాధుడు కన్నెర్ర చేసినట్లు స్పష్టమైంది. అంతా మీరే చేశారు, అన్నింటికీ మీరే కారణం అన్నట్లుగా ఓటమి కారణాలను యోగి మీదకు నెట్టేందుకు పావులు కదుపుతున్నారు. అభ్యర్థుల ఎంపికలో తన ప్రమేయం లేదని యోగి చెబుతున్నారు. నిజానికి యోగి పేరుకు సర్వసంగ పరిత్యాగి తప్ప అతగాడి వెనుక బలమైన రాజపుత్ర ఠాకూర్ సామాజిక తరగతి ఉంది. ఓసిలలో బ్రాహ్మణులు, యాదవుల తరువాత ఎనిమిది శాతంతో వీరిదే పెద్ద సంఖ్య. ఆర్థికంగా బలమైన తరగతి. బ్రాహ్మణులు-ఠాకూర్ల మధ్య వైరం ఎప్పటి నుంచో ఉంది. నరేంద్రమోడీ ఈ సామాజిక తరగతులను పక్కన పెట్టి వెనుకబడిన తరగతులను ముందుకు తెచ్చి తనదైన ఓటు బాంకు ఏర్పాటుకు పూనుకున్నారు. నిజానికి ఈ రాష్ట్ర బిజెపిలో ఎప్పటి నుంచో కుమ్ములాటలు ఉన్నాయి.లోక్‌సభ ఎన్నికల తరువాత యోగిని ఇంటికి పంపుతారన్న ప్రచారం ముందే ఉంది. మూడోసారి మోడీ గెలిస్తే యోగికి మూడినట్లే అనే విశ్లేషణలు వెలువడ్డాయి. ఎన్నికలలో చావు దెబ్బతినటంతో యోగి వ్యతిరేకులకు, అనుకూలురకు కూడా మంచి ఊపు వచ్చింది. బిజెపిలో కించపరిచే పదజాలం ఒక్క ముస్లింలకే పరిమితం కాదు.
గుజరాత్‌లోని రాజ్‌కోట్ నియోజకవర్గ అభ్యర్థి, కాబినెట్ మంత్రి పురుషోత్తం రూపాలా రాజపుత్రుల మీద విరుచుకుపడ్డారు. రోటీ బేటీ కా సాత్ – రాజపుత్రులు బ్రిటీష్ వారికి వారి కుమార్తెలనిచ్చి వివాహాలు చేశారని, బ్రిటీష్ వారితో చేతులు కలిపారని ధ్వజమెత్తారు. ఇది గుజరాత్‌తో పాటు ఉత్తర భారతంలో రాజపుత్రులున్న చోటల్లా వారికి కాలింది. మధ్య ప్రదేశ్‌లో ఠాకూర్లను పక్కన పెట్టినట్లుగానే ఉత్తర ప్రదేశ్‌లో వికె సింగ్, నరేంద్ర సింగ్ తోమర్ వంటి కీలక నేతలను ఇంటికి పంపారు. రక్షణ మంత్రిగా ఉన్నప్పటికీ రాజనాధ్ సింగ్‌ను కూడా పక్కన పెట్టినట్లుగానే భావిస్తున్నారు. ఆ కారణంగానే ఎక్కడా పెద్దగా మాట్లాడరు. ఆగ్రహంతో ఉన్న ఠాకూర్లను బుజ్జగించేందుకు అధిష్టానం ఇప్పుడు రాజనాధ్‌ను ఎంచుకుందని వార్తలు వచ్చాయి. వారిని సంతుష్టీకరించే ప్రక్రియలో భాగంగా అమిత్ షా ఇప్పటికే కొందరు నేతలతో రహస్యమంతనాలు జరిపారు. ఠాకూర్లలో పలుకుబడి కలిగిన రాజా భయ్యాను చేరదీసి వారిలో చీలిక తెచ్చి ఠాకూర్లను విస్మరించలేదనే సందేశంతో యోగికి పోటీ నేతగా ముందుకు తెచ్చే ఎత్తుగడ దీనిలో ఉంది. ఈ పరిణామం మీద ఆ సామాజిక తరగతి ఎలా స్పందించేదీ చూడాల్సి ఉంది. దీంతో యోగిని సాగనంపటం ఎలా అన్నది ఆసక్తికరంగా మారింది.
శాసనసభలో పది స్థానాలకు త్వరలో ఉప ఎన్నికలు జరగాల్సి ఉంది.వాటిలో మిత్రపక్షాలకు ఒక్కటి కూడా ఇవ్వకుండా బిజెపి ఒక్కటే బరిలో ఉండాలనే ప్రతిపాదనను ముందుకు తెచ్చారు. వీటిలో ఐదు స్థానాలు సమాజవాది పార్టీ, నాలుగు బిజెపి, ఒకటి ఆర్‌ఎల్‌డి గతంలో గెలిచినవే.వీటిలో బిజెపి దెబ్బతింటే దానికి బాధ్యత యోగీదే అని చెప్పేందుకు ప్రత్యర్ధులు సిద్దం అవుతున్నారు. ఇటీవల ఏడు రాష్ట్రాల్లో జరిగిన 13 అసెంబ్లీ ఉప ఎన్నికల్లో పది చోట్ల ఇండియా కూటమి గెలిచింది. ఉత్తర ప్రదేశ్‌లో ఓటమికి యోగి కంటే ప్రధానిగా నరేంద్రమోడీ ఎక్కువగా ఎక్కువగా బాధ్యత వహించాలి.చివరకు తన మెజారిటీ తగ్గటానికి కూడా వేరే వారిని నిందిస్తే కుదరదు. యోగి ఒక్కరే సర్వస్వం కాదు అన్న సందేశం ఇచ్చేందుకు ఇద్దరు ఉప ముఖ్యమంత్రులను అధిష్టానం నియమించింది. ప్రతి చిన్న విషయాన్ని ప్రధాని కార్యాలయం నియంత్రిస్తోందనే విమర్శలూ ఉన్నాయి. రాష్ట్ర డిజిపి నియామకంలో తనకు ఇష్టమైన వారిని ఎంచుకొనేందుకు యోగికి అవకాశం ఇవ్వటం లేదు.తొలిసారి అధికారానికి వచ్చినపుడు ఎంతో వత్తిడితో ఒకరిని నియమించినా తరువాత నలుగురు తాత్కాలిక డిజిపిలు తప్ప శాశ్వత నియామకాలు లేవు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విషయంలో కూడా అదే జరిగింది.మంత్రివర్గం నుంచి యోగి అనుకూల సూర్య ప్రతాప షాహిని తొలగించి వ్యతిరేకిగా ఉన్న శివ ప్రతాప శుక్లాకు కట్టబెట్టారు. ఒక విధంగా యోగిని పొమ్మనకుండా పొగబెట్టారు.రెండవసారి గెలిచిన తరువాత కూడా అదే జరిగింది. తీవ్రంగా వ్యతిరేకించినా ఇద్దరిని మంత్రులుగా చేర్చారు. వారిలో ఒకరు ఉప ఎన్నికలో ఓడిన తరువాత సమాజవాది పార్టీలో చేరారు. ప్రస్తుతం ఇద్దరిలో ఒకరైన ఉపముఖ్యమంత్రి కేశవ ప్రసాద్ మౌర్యకు మోడీ, షా మద్దతు ఉందని, అందువల్లనే ప్రభుత్వం కంటే పార్టీ గొప్పదని తాజాగా ధ్వజమెత్తినట్లు చెబుతున్నారు.పార్టీ కార్యకర్తల బాధ తనకు తెలుసునని మౌర్య అనటాన్ని యోగి మద్దతుదార్లు తప్పుపడుతున్నారు. అతను ఉపముఖ్యమంత్రి కాదా ? కార్యకర్తలను పట్టించుకోవాల్సిన అవసరం లేదా ?అది చేయకుండా ప్రతికూల ప్రచారం ఏమిటంటూ ప్రశ్నిస్తున్నారు.
తన పదవికి ఎసరు పెడుతున్నారని గ్రహించిన యోగి జాగ్రత్తగా పావులు కదుపుతున్నారు.ఇంతవరకు ఎక్కడా బహిరంగంగా ప్రతికూల వ్యాఖ్యలు చేయలేదు.తన అనుచరులను రంగంలోకి దించారు. ప్రభుత్వం కంటే పార్టీ గొప్పదన్న కేశవ ప్రసాద్ మౌర్య వ్యాఖ్యపై వెంటనే పశ్చిమ ఉత్తర ప్రదేశ్‌కు చెందిన పార్టీ నేత సునీల్ భరాలా స్పందించారు.” ఎన్నికలలో ఎదురుదెబ్బలు, ఓటమికి పార్టీయే కారణమని గౌరవనీయ ఉపముఖ్యమంత్రి కెపి మౌర్య వ్యాఖ్యలు సూచిస్తున్నాయి.కనుక పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు భూపేంద్ర చౌదరి నష్టాలకు నైతిక బాధ్యత వహిస్తూ పదవికి రాజీనామా చేయాలి ” అని ఎక్స్ ద్వారా డిమాండ్ చేశారు. ఈ పోస్టును తొలగించేందుకు బిజెపి కేంద్ర పెద్దలు తెచ్చిన వత్తిడికి ఇప్పటివరకైతే భరాలా లొంగలేదు. గతంలో పార్టీ ఓడినపుడు కల్‌రాజ్ మిశ్రా, వినరుకతియార్ రాజీనామా చేశారని కూడా గుర్తుచేశారు. బిజెపి మురికివాడల విభాగపు జాతీయ కన్వీనర్‌గా భరాలా ఉన్నారు.ఇలాంటి వారు అనేక మంది యోగి కనుసైగల కోసం ఎదురు చూస్తున్నారు. తన అనుచరులకు సీట్లు ఇవ్వకపోతే ఏం చేస్తానో చూడండి అన్నట్లుగా యోగి చూపారు. ఆయన కనుసన్నలలో నడిచే హిందూ యువ వాహిని స్వతంత్ర అభ్యర్థులకు మద్దతు ప్రకటించింది. ఉప ఎన్నికలలో ప్రతికూల ఫలితాలు వస్తే తనపై వేటు పడుతుందని గ్రహించిన యోగి ఆ నియోజకవర్గాలకు 16 మంది మంత్రులను కేటాయించారు. ఎన్నికలు ముగిసేవరకు వారంలో రెండు రోజులు మంత్రులు అక్కడే మకాం వేయాలని ఆదేశించారు. గెలిస్తే తన ప్రతిభ లేకపోతే మంత్రులు సరిగా పనిచేయలేదని చెబుతారు.
ఆకస్మికంగా ప్రభుత్వం మీద జనాలకు ఆగ్రహం కలిగేందుకు దారితీసిన పరిస్థితులు ఏమిటంటూ బిజెపి ఎంఎల్‌సి దేవేంద్ర ప్రతాప్ సింగ్ సిఎంకు లేఖ రాశారు.రాష్ట్రంలో పరిస్థితి దారుణంగా ఉన్నందున కేంద్ర నాయకత్వం జోక్యం చేసుకోవాలన్న ఎంఎల్‌ఏ రమేష్ మిశ్రా వీడియో వైరల్ అవుతోంది.బిజెపి మిత్ర పక్షం నిషాద్ నేత సంజరు నిషాద్ కూడా యోగిపై ధ్వజమెత్తారు.బుల్డోజర్లను మాఫియాలు, భూ కబ్జాదారులపై ప్రయోగించాలి తప్ప తగిన పత్రాలు లేని పేదల ఇండ్లు కూల్చివేతకు ఉపయోగించరాదని, అలా చేస్తే ఎన్నికల్లో మనలను ఓడించేందుకు వారు సంఘటితం అవుతారని, అనేక ఉదంతాలలో అధికారులు అలాంటి కూల్చివేతలకు పాల్పడ్డారని అన్నారు. అతి విశ్వాసం, ఓట్ల బదిలీ మన అంచనాలను దెబ్బతీశాయి. గతంలో ప్రతిపక్షం వెంటిలేటర్ మీద ఉంది, ఇప్పుడు కొంత ప్రాణవాయువు తీసుకుంటున్నదని ఆదిత్యనాథ్ చెప్పారు.ఫైజాబాద్(ఆయోధ్య ఉన్న నియోజకవర్గం) వంటి గట్టి ప్రాంతాల్లో ఓడిపోవటానికి కొన్ని కులాలు దూరం కావటమే కారణం, ఓబిసి కులాల,దళితుల మద్దతు తిరిగి పొందాలంటే ఓబిసి నేత, ఉపముఖ్యమంత్రి, ఆర్‌ఎస్‌ఎస్ మద్దతు ఉన్న మౌర్యకు పెద్ద పదవి ఇవ్వాల్సి ఉంటుందని యోగి వ్యతిరేకులు ప్రచారం చేస్తున్నారు.ప్రధాని నరేంద్రమోడీ కొన్ని రౌండ్లలో వెనుకబడిన తీరు చూస్తే నూరు గొడ్లను తిన్న రాబందు ఒక్క గాలివానకు కొట్టుకుపోయినట్లు ఎంతవారైనా ఓడిపోకతప్పదు. మహారాష్ట్ర, హర్యానా అసెంబ్లీ ఎన్నికలతో పాటు రాష్ట్రంలో పది స్థానాలకు ఉప ఎన్నికలు జరుగుతాయని, తరువాత యోగికి ఉద్వాసన ఖాయమని చెబుతున్నారు.అధికారం అందరినీ కలిపి ఉంచుతుంది. దానికి ముప్పు సూచనలు కనిపిస్తే అసలు రంగు తెలుస్తుంది. ఇప్పుడు ఉత్తర ప్రదేశ్ బిజెపిలో జరుగుతున్న పరిణామాలు దీన్నే వెల్లడిస్తున్నాయి.
