Tags

, , , , , , , ,

ఎం కోటేశ్వరరావు

నరేంద్రమోడీ మూడు సంవత్సరాల విజయాల గురించి జాతీయ, అంతర్జాతీయ మీడియాలో విజయగాధలు ప్రారంభమయ్యాయి. విమర్శనాత్మకంగా విశ్లేషించే వారి రాతలు, వ్యాఖ్యలు కనిపించకుండా, వినిపించకుండా సాధ్యమైన మేరకు అన్ని జాగ్రత్తలూ తీసుకుంటున్నారు. ఎలాగైతేనేం విజయం సాధించారా లేదా అనేది ముఖ్యం అన్నట్లుగా పరిస్థితి వుంది. ఈ నేపధ్యంలోనే కొందరైనా మీడియాలో ఏదో విధంగా నిజాలు చెప్పేందుకు తపన పడుతున్నారు. ప్రధానికి నొప్పి తగల కుండా పొగడుతూనే కొన్ని నగ్న సత్యాలను వెల్లడిస్తూ అమెరికా పత్రిక అఫింగ్టన్‌ పోస్టులో ఒక విశ్లేషణ మొదటి భాగం ఇలా సాగింది.’ మోడీ ప్రభుత్వం అధికారంలో మూడు సంవత్సరాలు పూర్తి చేసుకుంది, ఓటర్లలో దాని పలుకుబడి ఆశ్చర్యంగా వుంది. అత్యధిక ప్రభుత్వాల విషయంలో మూడో సంవత్సరంలో విసుగు పుట్టటం ప్రారంభమౌతుంది. దాన్నే ప్రభుత్వ వ్యతిరేకత ప్రారంభం కావటం అంటారు. మోడీ ప్రభుత్వ విషయంలో కూడా అదే జరుగుతుంది. మావోయిస్టులు సిఆర్‌పిఎఫ్‌ జవాన్లను చంపివేస్తూనే వున్నారు, గతంలో ఎన్నడూ లేని విధంగా కాశ్మీర్‌ పరిస్థితి దిగజారుతోంది, నిరుద్యోగ అంకెలు భయ పెడుతున్నాయి. దళితులు, ముస్లింలు, మహిళలపై హింసాకాండ ఇప్పటికే మామూలుగానే వుంది.మరో విధంగా చెప్పాలంటే కొద్దిగా కూడా మార్పు లేదు. మోడీ నూతన భారతంలో కొత్తదేమీ లేదు. సర్జికల్‌ దాడులు జరిగినప్పటికీ సైనికులను వధించటం పాకిస్థాన్‌ కానసాగిస్తూనే వుంది. వాస్తవాధీన రేఖ ఇప్పటికీ మండుతూనే వుంది.ఒక భారతీయుడిని వురి తీస్తామని పాకిస్థాన్‌ బెదిరిస్తోంది. దౌత్యపరంగా పాకిస్థాన్‌ను ఒంటరిపాటు చేయటం ప్రభుత్వ వ్యూహంగా వుంది. అయినప్పటికీ భారతే వేరుపడుతున్నట్లు కనిపిస్తోంది. తరువాత కళ్లెం లేని మోడీ రాజకీయ విజయం ఏమి వివరిస్తున్నది? చివరికి మున్సిపల్‌ ఎన్నికలలో కూడా మోడీ పేరుతో ఎదుర్కొంటున్నారు. 2014 కంటే నేడు మోడీ మరింత ప్రజాదరణ పొందారని అది తెలియ చేస్తున్నది.’ తరువాత వ్యాసమంతా విజయపరంపరకు మోడీ రహస్యమేమిటో వివరించారనుకోండి. ఇక్కడ సమస్య ఏమంటే మూడేండ్లలో ఎలాంటి మార్పు లేదని చెప్పిన తరువాత మోడీ విజయం సాధిస్తున్నారని చెప్పటంలోనే అసలు మర్మం దాగుంది. ఓట్ల చీలిక కారణంగా నరేంద్రమోడీ నాయకత్వంలోని బిజెపికి వచ్చిన ఓట్ల శాతం కంటే ఎక్కువగా సీట్లు రావటానికి కారణాలేమిటో ప్రాధమిక గణితం చెబుతుంది. కానీ దానికి రాజకీయ వ్యూహం, ఎత్తుగడలంటూ లేని వాటిని ఆపాదించటమే విశేషం. నిజంగా అవి వుంటే గోవా, పంజాబ్‌లో ఎందుకు ఓడిపోయినట్లు ?

నరేంద్రమోడీ వైఫల్యాల గురించి చెప్పేంత నిజాయితీ ప్రస్తుతం మన ప్రధాన స్రవంతి మీడియాకు లేదు.ఎందుకంటే అవన్నీ వాణిజ్యం కోసం పని చేస్తున్నవి కనుక ఆదాయాన్ని కోల్పోయేంత త్యాగం చేయవు.http://www.tradingeconomics.com/india/balance-of-trade ఈ వెబ్‌సైట్‌ సమాచారం ప్రకారం గత మూడు సంవత్సరాలలో నరేంద్రమోడీ ప్రభుత్వ నిర్వాకం వలన మన దేశ వాణిజ్య లోటు పెరిగింది. గతేడాది ఏప్రిల్‌తో పోల్చితే ఈ ఏడాది ఏప్రిల్‌లో 173.5లోటు పెరిగింది. దాని తీవ్రత ఎలా వుందంటే మార్కెట్‌ అంచనా 12.79 బిలియన్‌ డాలర్లయితే వాస్తవంగా 13.25 బిలియన్లు వుంది. ఇది 2014 నవంబరు తరువాత అత్యధికంగా ఒక రికార్డు నమోదు చేసింది. సర్కారు ఏ గుడ్డి గుర్రానికి పళ్లు తోముతున్నట్లు . ఎగుమతుల కంటే దిగుమతులు ఎక్కువగా వున్న కారణంగా మనకు విదేశీ మారక ద్రవ్యం ఎంతో విలువైనది. చమురు వినియోగాన్ని కూడా పరిమితం చేయవచ్చు పోనీ సాధ్యం కాదనుకుంటే దిగుమతులు తప్పవు. బంగారం లేకపోతే మనకు రోజు గడవదా ? గతేడాది మొత్తంచమురు దిగుమతులు 49.1 శాతం పెరిగితే వాటిలో చమురు వాటా 30.1 కాగా బంగారం 211.4 శాతం పెరిగాయి. విలువైన రంగురాళ్లతో సహా మన దిగుమతుల్లో చమురు తరువాత 13శాతం అవే ఆక్రమిస్తున్నాయి. ధనికులు మాత్రమే తినే పండ్లు, కూరగాయల దిగుమతులకు కూడా దేశం మొత్తానికి చెందిన విదేశీమారక ద్రవ్యాన్ని వినియోగిస్తున్నారు. ఇలా చెప్పుకోవాల్సినవి ఇంకా వున్నాయి.

ఇదెక్కడి చోద్యం ! రైల్వే స్టేషన్లో టీ అమ్మానని చెప్పుకున్న మోడీకి ఈ దేశంలోని సామాన్యులకు ఏమి అవసరమో తెలియదా ? రంగురాళ్లు, బంగారం దిగుమతి చేయాలని ఏ చాయ్‌ వాలా అడిగాడు. గతంలో రాజులు రంగప్పలు తమ గొప్పను చూపించుకొనేందుకు, రాజకుటుంబాల ఆడంబరాన్ని ప్రదర్శించుకొనేందుకు ఇలాంటి పనులు చేశారు తప్ప సామాన్యుల గురించి ఆలోచించేవారెవరైనా చేస్తారా ? గుజరాత్‌ నమూనా పాలన ఇదేనా ? ప్రపంచ మార్కెట్లో చమురు ధరలు తగ్గితే ఆ అనందాన్ని కూడా అనుభవించనివ్వకుండా అదే మోడీ సర్కార్‌ పన్నులు పెంచి మన జేబుల నుంచి డబ్బు కొల్లగొడుతోంది. మన ఆర్ధిక రంగంలోని ఒక ముఖ్యమైన ఎగుమతులు, దిగుమతుల తీరు ఇలా వుంది.

మోడీ, ఆయన అనుయాయులు చేసిన అనేక వాగ్దానాలలో వుపాధి కల్పన ముఖ్యమైనది. నైపుణ్య శిక్షణ అనో మరొకదాని గురించో ఎన్ని కబుర్లు చెప్పినప్పటికీ వుపాధి కల్పనలో ఘోరవైఫల్యం చెందింది. ఇదే సమయంలో చైనా కంటే అభివృద్ధి రేటు ఎక్కువగా వుందన్న ప్రచారం సాగుతోంది. ఒక వేళ అది నిజమనుకున్నా ఆ మేరకు వుపాధి ఎక్కడ పెరిగిందో వారే చెప్పాలి. యాభయ్యవ పడిలో వున్నవారికి నేను పెద్దగా చేయలేను గాని కొత్తగా వుపాధి కోరుకొనే రెండు పదుల ప్రాయంలో వున్నవారి జీవితాల రూపు రేఖలను మార్చివేయాలనుకుంటున్నాను అని నరేంద్రమోడీ అనేక సందర్బాలలో ఓట్లడుక్కుంటున్న సమయంలో చెప్పారు. ప్రభుత్వ గణాంకాలు, విశ్లేషణల ప్రకారం 2009-11 మధ్య 8.5శాతం అభివృద్ధి రేటు వుండగా ఏటా 9.5లక్షల నూతన వుద్యోగాలు వచ్చినప్పటికీ దానిని కూడా వుపాధి రహిత అభివృద్దిగా పేర్కొన్నారు.మోడీ హయాంలో 2015,16లో అంతకు ముందుతో పోల్చితే రెండు లక్షల వుద్యోగాలు తగ్గిపోయాయి. అంటే నాలుగో వంతు పడిపోయాయి. అయితే ప్రభుత్వం అసలు విషయాల జోలికి పోకుండా లెక్కలు వేయటంలో ఏదో తప్పుంది, లెక్కల పద్దతిని మార్చాలని నిర్ణయించింది. జిడిపి వృద్ధి రేటు లెక్కింపు విధానాన్ని కూడా మార్చిన విషయం తెలిసిందే. సంఘటిత రంగానికి, సేవా రంగాన్ని కూడా జోడించటంతో 2015తో పోల్చితే 2016లో కొద్దిగా వుద్యోగాలు పెరిగినట్లు కనిపించినా, అంతకు ముందుతో పోల్చితే తక్కువే. నోట్ల రద్దు కారణంగా వుపాధికి ఎలాంటి నష్టం జరగలేదని ప్రభుత్వం ఒకటే మాట మీద వుంది. కానీ ఆ మూడునెలల కాలంలో ఎంత మందికి వుపాధి పోయిందో అందరికీ తెలిసిందే. మన దేశంలో కచ్చితంగా లెక్కలు తీసే యంత్రాంగం లేని కారణంగా ప్రభుత్వం అడ్డంగా వాదిస్తోంది.

పోలిక కాస్త కటువుగానే వుండవచ్చు. వయసు మీద పడిన తరువాత పురాతన వృత్తిలోకి నెట్టబడిన అభాగినుల పరిస్ధితి ఎంత దయనీయంగా వుంటుంతో నేడు ఐటి పరిశ్రమలో వయస్సు పైబడిన వారి పరిస్ధితి కూడా అగమ్యగోచరంగా వుండబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఐటి, దాని అనుబంధ సంస్ధలలో ప్రస్తుతం వున్న 40లక్షల మంది వుద్యోగులలో 60శాతం మంది ప్రస్తుతం వున్న వారి నైపుణ్య స్ధాయిని బట్టి వుద్యోగాలకు పనికి రారని, వారికి శిక్షణ ఇచ్చినా ఏ మేరకు పనికి వస్తారన్నది ప్రశ్నార్ధకమని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. అంటే ఇప్పటికే వుపాధి తగ్గిపోయిన స్ధితిలో ఈ విద్యావంతులైన వారు కూడా నిరుద్యోగ సైన్యంలో చేరితే పరిస్థితి ఎలా వుంటుందో వూహించుకోవచ్చు.

కేంద్ర ప్రభుత్వ లేబరు బ్యూరో సమాచారం ప్రకారం ఇటీవలి సంవత్సరాలలో వుపాధి కల్పన ఇలా వుంది

డిసెంబరు నుంచి 2009 – డిసెంబరు 10 వరకు 8.70 లక్షలు

డిసెంబరు నుంచి 2010 – డిసెంబరు 11 వరకు 9.29

డిసెంబరు నుంచి 2011 – డిసెంబరు 12 వరకు 3.21

డిసెంబరు నుంచి 2012 – డిసెంబరు 13 వరకు 4.19

డిసెంబరు నుంచి 2013 – డిసెంబరు 14 వరకు 4.21

డిసెంబరు నుంచి 2014 – డిసెంబరు 15 వరకు 1.35

డిసెంబరు నుంచి 2015 – డిసెంబరు 16 వరకు 1.35

అన్నం వుడికిందో లేదో చూడటానికి ఒక మెతుకును చూస్తే చాలు అన్నట్లుగా నరేంద్రమోడీ సాధించిన విజయాల తీరు తెన్ను గురించి ఈ రెండు ముఖ్యమైన అంశాలు వెల్లడిస్తున్నాయి.