Tags

, , , , , ,


ఎం కోటేశ్వరరావు


ప్రకటిత విధానాలను తుంగలో తొక్కటంలో కమ్యూనిస్టులు తప్ప మిగతా పార్టీల వారి గురించి ఎవరికీ తేడా లేదు. మాది మిగతా పార్టీలకు భిన్నం అని చెప్పుకున్న బిజెపిని ఏర్పాటు చేసింది ఆర్‌ఎస్‌ఎస్‌, కనుక అనేక మంది అది నిజమే అనుకున్నారు. క్రమంగా మా మీద అలాంటి భ్రమలేవీ పెట్టుకోవద్దని బిజెపి తన చర్యల ద్వారా పదే పదే జనాలకు చెబుతోంది. దానికి తాజా ఉదాహరణే చమురు ధరల స్ధంభన.


నవంబరు నాలుగవ తేదీ నుంచి జనవరి 20వ తేదీ వరకు దేశంలో చమురు ధరలు స్ధిరంగా కొనసాగుతున్నాయి. తరువాత కూడా మార్చి ఏడవ తేదీ ఐదు రాష్ట్రాల్లో ఎన్నికల పోలింగ్‌ చివరి దశ ముగిసేవరకు ఇదే స్ధితి కొనసాగుతుంది. ఇలా చెబుతున్నామంటే జోశ్యం కాదు. ఆచరణ ప్రాతిపదిక ఉంది. ఒక్కసారి గతాన్ని గుర్తు చేసుకోండి. 2021 ఫిబ్రవరి 27 నుంచి మార్చి 23 వరకు రు.91.17, మరుసటి రోజు రు.90.99, 25 నుంచి 29వరకు పెట్రోలు రేటు రు.90.78, మరుసటి రోజు నుంచి ఏప్రిల్‌ 14వరకు రు.90.56, ఆ మరుసటి రోజు నుంచి మే మూడవ తేదీ వరకు రు.90.40. ఇదంతా ఐదు రాష్ట్రాల ఎన్నికల అచ్చేదిన్‌లో జరిగింది. ఈ కాలంలో అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు ఎలా ఉన్నాయి?


ఫిబ్రవరినెల 28 రోజుల్లో చమురు ధరలను 17 సార్లు సవరించారు. ఆ నెలలో ముడి చమురు మనం కొనుగోలు చేస్తున్నది పీపా ధర నెల సగటున 61.22 డాలర్లుంది. మార్చి నెలలో 64.73 డాలర్లకు పెరిగినా ధర ఫిబ్రవరి 27 నుంచి మార్చి 23వరకు ఒకే ధర(రు.91.17) ఆ తరువాత ఇంకా తగ్గింది. ఏప్రిల్‌ నెలలో ముడిచమురు సగటు ధర 63.40 డాలర్లు. మార్చి నెల కంటే ఏప్రిల్‌లో తగ్గింది 1.33 డాలర్లు, దాన్ని వినియోగదారులకు బదలాయించారు గనుక లీటరుకు 38 పైసలు తగ్గించారనుకుందాం ? మరి ఫిబ్రవరి-మార్చినెలల మధ్య పీపా ధరలో 3.51 డాలర్ల పెరుగుదల ఉంటే ధరలను స్ధిరంగా ఉంచటం ఎలా సాధ్యమైనట్లు ? ఇవి ఐదు రాష్ట్రాల ఎన్నికల అచ్చేదినాలు అన్నది స్పష్టం.


ఇప్పుడు జరగనున్న మరో ఐదు రాష్ట్రాల అచ్చేదిన్‌ సంగతి చూద్దాం. ఉప ఎన్నికల్లో తగిలిన ఎదురుదెబ్బలతో కేంద్ర ప్రభుత్వం పెట్రోలు మీద ఐదు, డీజిలు మీద పది చొప్పున పన్నులు తగ్గించినట్లు ప్రకటించింది. సంతోషం. బిజెపి పాలిత రాష్ట్రాలు నరేంద్రమోడీగారిని ఆదర్శంగా తీసుకొని వాట్‌ను తగ్గించాయి. ఇంకా సంతోషం. జరుగుతున్నదేమిటి ? అక్టోబరు ఒకటి నుంచి నవంబరు 3వరకు 34రోజుల్లో 28 సార్లు సవరించారు. కేంద్ర ప్రభుత్వ పెట్రోలియం ప్లానింగ్‌ అండ్‌ ఎనాలసిస్‌( పిపిఎసి) సమాచారం ప్రకారం సెప్టెంబరు 29 నుంచి అక్టోబరు 27వరకు సగటున పీపా ముడి చమురు దిగుమతి ధర 81.54 డాలర్లు, అక్టోబరు 28 నుంచి నవంబరు 26వరకు 81.51 కాగా నవంబరు 27 నుంచి డిసెంబరు 29వరకు 72.93 డాలర్లకు తగ్గింది. దీపావళి ధమాకా పేరుతో కేంద్రం, రాష్ట్రాలు తగ్గించిన పన్నుల మేరకు తప్ప చమురు కంపెనీలు నవంబరు నాలుగవ తేదీ నుంచి ఇది రాసిన జనవరి 20వరకు 75 రోజులుగా తమ ధరలను ఎందుకు సవరించలేదు ? వాటికి పన్నులతో సంబంధం లేదు కదా ? ముడిచమురు ధరలు పెరిగితే పెంచుతాం తగ్గితే దించుతాం అని చెప్పిన విధానం ఏమైంది ? పాలకులు కంపెనీలను ఎందుకు ప్రశ్నించటం లేదు ? సమాధానం చెప్పే జవాబుదారీ తనం ఉందా ? అసలు కథేమిటి ?


అక్టోబరు 25న గరిష్టంగా మన ముడి చమురు కొనుగోలు ధర పీపా 84.77 డాలర్లను తాకింది.తరువాత క్రమంగా పడిపోతూ డిసెంబరు నాలుగున 69.52 డాలర్లకు తగ్గింది.పదిహేను డాలర్లు తగ్గినా చమురు ధరలు పైసా తగ్గించలేదు. డిసెంబరు సగటు ధర ముందే చెప్పుకున్నట్లు 72.93 డాలర్లు. చంబల్‌ బందిపోట్లు ధనికులను మాత్రమే దోచుకొనే వారు. ప్రభుత్వం ఎవరినీ వదలటం లేదు, అంతకంటే పెద్ద దోపిడీ సాగుతోందా లేదా ? ప్రభుత్వరంగ సంస్థలదే మార్కెట్‌లో ప్రధాన వాటా అయినా నరేంద్రమోడీ అధికారానికి వచ్చిన తరువాత రిలయన్స్‌ బంకులు కొన్ని తిరిగి తెరుచుకున్నాయి.ప్రభుత్వ ధరలనే అవీ వసూలు చేస్తున్నాయి. ముడి చమురు ధర తగ్గిన మేరకు అదేమీ తగ్గించలేదు. ప్రభుత్వ విధానం దానికి లాభాల పంట పండిస్తున్నపుడు వాటిలో కొంత మొత్తాన్ని ఎన్నికల బాండ్లు, ఇతర రూపాల్లో బిజెపికి అప్పగిస్తుంది గానీ జనాలకు ఎందుకు తగ్గిస్తుంది. ఓకే రిలయన్స్‌ ప్రైవేటు కంపెనీ కనుక అలా చేస్తోంది అనుకుందాం, మరి ప్రభుత్వ కంపెనీలు ?


ఐదు రాష్ట్రాల ఎన్నికల తరుణంలో నెలల తరబడి ధరలను సవరించకుండా బిజెపికి సానుకూలతను సృష్టించేందుకు తమ వంతు చేస్తున్నాయి. దీని వలన ఇతర సరకుల ధరలు కూడా తాత్కాలికంగా కొంత మేరకు అదుపులో ఉంటాయి. కేంద్ర ప్రభుత్వం ఐదు, పది రూపాయల మేరకు భారం తగ్గించిన తరువాత ముడి చమురు ధరలు తగ్గాయి. ఆమేరకు జనానికి తగ్గించలేదు. డిసెంబరు ఐదు నుంచి ముడి చమురు ధరలు మనం దిగుమతి చేసుకొనేది జనవరి 18వరకు 69.52 డాలర్ల నుంచి 87.03పెరిగింది. నరేంద్రమోడీ ఏలుబడిలో ఇది సరికొత్త రికార్డు. జనవరి 20వ తేదీన బ్రెంట్‌ రకం ముడిచమురు ధర 88.68 డాలర్లకు చేరింది, త్వరలో వంద డాలర్లకు చేరవచ్చని అంచనా.


అక్టోబరు 25న మన దిగుమతి రకం 84.77 డాలర్లు ఒక రికార్డు. ఇప్పుడు ఆ రికార్డును బద్దలు కొట్టింది. ఐనా ధరలు పెంచలేదు.మార్చి ఏడవ తేదీన ఎన్నికల చివరి దశ ముగుస్తుంది. అంటే ఆ రోజు వరకు అంతర్జాతీయ మార్కెట్లో ధరలు ఎలా ఉన్నా అప్పటి వరకు ఇప్పుడున్న ధరలే కొనసాగుతాయి. ఆ తరువాతే అసలు కథ మొదలౌతుంది. నవంబరు 4- మార్చి ఏడవ తేదీ మధ్య జరిగిన లావాదేవీల లెక్కలు చూసుకున్నపుడు వచ్చిన లాభం హరించుకుపోయి నష్టం ఉందనుకోండి, ఆమేరకు ధరలు పెంచి లోటు మొత్తాన్ని కంపెనీలు పూడ్చుకుంటాయి. ఈ లోగా బిజెపి తన ప్రచారం తాను చేసుకుంటుంది. కంపెనీలకు వచ్చే ఆర్ధిక నష్టం ఏమీ ఉండదు. అధికార పార్టీలపై వ్యతిరేకత పెరగటానికి ధరల పెరుగుదల ఒక కారణం మాత్రమే. అది ఒక్క చమురు ధరల మీదనే ఆధారపడి ఉండదు. అందువలన వాటిని నియంత్రించి జనాలను మాయ చేయ చూసినా వ్రతం చెడ్డా ఫలం దక్కనట్లు బిజెపికి ఎదురు దెబ్బలు తగలవచ్చు.


తమ పాలిత రాష్ట్రాల మాదిరి ఇతర పార్టీల ఏలుబడిలోని రాష్ట్రాలు కూడా పన్నులు తగ్గించాల్సిందే అని బిజెపి డిమాండ్‌ చేసింది. రాష్ట్రాలను దెబ్బతీసే కేంద్ర ప్రభుత్వ ఎత్తుగడ కారణంగా ఇప్పటికే రాష్ట్రాలు ఎక్సయిజు పన్ను వాటాను గణనీయంగా కోల్పోయాయి, వాటిలో మెజారిటీ బిజెపి పాలనలో ఉన్నవే. కేంద్రంలో అధికారం ఉంది కనుక ఆ మేరకు వేరే రూపంలో ఆ నష్టాన్ని పూడ్చుకోవచ్చు. ప్రతిపక్ష పాలిత రాష్ట్రాలకు అలాంటి అవకాశం లేదు.2017లో పెట్రోలు మీద ఎక్సయిజు పన్ను లీటరుకు రు.9.48, డీజిలు మీద రు.11.33 ఉండగా 2021 ఫిబ్రవరిలో ఆ మొత్తాలను కేంద్రం రు.1.40-1.80కి తగ్గించింది. ఆ మేరకు, తరువాత అదనంగా సెస్‌లను విధించింది. వినియోగదారులకు ఎలాంటి మార్పు లేనందున వారికి ఈ మతలబు అర్దం కాలేదు. దీపావళి పేరుతో తగ్గించిన మేరకు రాష్ట్రాలకు వాట్‌ శాతం తగ్గి రాబడి తగ్గింది. పరోక్షంగా అవీ తగ్గించినట్లే. బిజెపి పాలిత రాష్ట్రాలకు ఏదో ఒక రూపంలో కేంద్రం సొమ్ము ముట్టచెబుతుంది.


ఢిల్లీ చుట్టూ హర్యానా, ఉత్తర ప్రదేశ్‌ ప్రాంతాలు ఉన్నాయి. అక్కడి బంకుల్లో ధరలు తక్కువగా ఉన్నపుడు ఢిల్లీ వాహనదారులందరూ కొద్ది కిలోమీటర్లు వెళ్లి అక్కడే కొనుగోలు చేస్తారు. అది బంకుల వారికి, ఢిల్లీ ప్రభుత్వానికి నష్టమే కనుక కొద్ది రోజు తరువాత ఆమ్‌ ఆద్మీ ప్రభుత్వం పెట్రోలుపై వాట్‌ను 30నుంచి 19.4శాతానికి తగ్గించటంతో డిసెంబరు ఒకటిన రు.104.01గా ఉన్న రేటు నాలుగవ తేదీన రు.95.41కి తగ్గింది. డీజిలు మీద అంతకు ముందే వాట్‌ 16.75శాతం ఉన్నందున డీజిలు ధరల్లో ఎలాంటి మార్పు లేదు. ఢిల్లీలో ఇప్పుడు డీజిలుపై కేంద్ర పన్నులు, సెస్‌ల మొత్తం రు.21.80కాగా రాష్ట్ర పన్ను రు.12.69 మాత్రమే. పెట్రోలు మీద కేంద్ర పన్ను రు.27.90 కాగా ఢిల్లీ రాష్ట్రపన్ను రు.15.60 మాత్రమే. కేంద్ర పన్నులు అన్ని చోట్లా ఒకే విధంగా ఉంటాయి. రాష్ట్రాలలో వాట్‌ రేట్లు భిన్నంగా ఉన్నందున వాటికి అనుగుణంగా మొత్తాలు మారతాయి.


బిజెపి నేతలు, వారికి వంతపాడే నోళ్లు చేసే వాదనల గురించి తెలిసిందే. కేంద్రం విధించే పన్నుల్లో 41శాతం వాటా రాష్ట్రాలకు వస్తుంది. కేంద్రం చేసే ఖర్చు కూడా రాష్ట్రాలలోనే కనుక రాష్ట్రాలకే ఎక్కువ దక్కుతోందని, అందువలన రాష్ట్రాలే పన్ను తగ్గించాలనే కుతర్కాన్ని ముందుకు తెచ్చారు. ఇది జనాలను మోసం చేసే ప్రక్రియ. పిఆర్‌ఎస్‌ లెజిస్లేటివ్‌ రీసర్చ్‌ సంస్ద వెల్లడించిన వివరాల మేరకు 2017 ఏప్రిల్‌లో పెట్రోలు మీద కేంద్రం విధించిన ఎక్సయిజు పన్ను (రాష్ట్రాలకు వాటా ఇచ్చేది) రు.9.48, సెస్‌,సర్‌ఛార్జీలు రు.12. కేంద్ర పన్నుల్లో వీటి శాతాలు 44-56, కాగా 2021ఫిబ్రవరి నాటికి ఇవి రు.1.40 – 31.50గా ఉన్నాయి, శాతాలు 4-96 మారాయి. ఇదే డీజిలు సంగతి చూస్తే ఎక్సయిజు – సెస్‌,సర్‌ఛార్జీలు 2017 ఏప్రిల్‌లో రు.11.33- రు.6 శాతాల వారీ 65-35గా ఉన్నాయి. 2021 ఫిబ్రవరి నాటికి ఇవి రు.1.80- రు.30 కాగా శాతాలు 6-94కు మారాయి. రాష్ట్రాలకు హక్కుగా రావాల్సిన వాటాకు మోడీ సర్కార్‌ ఎలా కోత పెట్టిందో స్పష్టం. కేంద్రం పన్నుల పేరుతో వసూలు చేసిన మొత్తాలు 2014 తరువాత గణనీయంగా పెరిగాయి.2019-20లో ఆ మొత్తాలు రు.2.38లక్షల కోట్లుండగా 2020-21కి అవి 3.84లక్షల కోట్లకు పెరిగాయి.2020 మేనెలలో పెట్రోలు మీద పది, డీజిలు మీద రు. 13 చొప్పున భారం మోపటమే దీనికి కారణం. ఇదే కాలంలో సెస్‌ను సవరించిన కారణంగా రాష్ట్రాలకు వచ్చే వాటా మొత్తం తగ్గింది. కేంద్రం తగ్గించిన ఐదు, పది వలన కేంద్రానికి ఆదాయం ఎంత తగ్గిందన్నది చూడాల్సి ఉంది.