Tags
Diplomacy Matters, Joe Biden, Narendra Modi, Narendra Modi Failures, Ukraine-Russia crisis, Xi Jinping
ఎం కోటేశ్వరరావు
ప్రపంచ రాజకీయాల్లో భారత్ కీలక పాత్ర పోషించాలి. విశ్వగురువుగా నరేంద్రమోడీ, ప్రపంచమంతా మోడీవైపే చూస్తోంది. అమెరికాకు మన అవసరం ఉంది తప్ప మనకు అది లేకున్నా నడుస్తుంది. చైనా నుంచి మనం దిగుమతులను నిలిపివేస్తే డ్రాగన్ మనతో కాళ్ల బేరానికి వస్తుంది. నరేంద్రమోడీ మాత్రమే ఉక్రెయిన్లో యుద్ధాన్ని ఆపగలరు. ఇలాంటి కబుర్లన్నీ వాట్సాప్ విశ్వవిద్యాలయ పండితుల మొదలు వివిధ మాధ్యమాల ద్వారా మన చెవుల తుప్పు వదిలించారు, మెదళ్లను ఖరాబు చేశారు. ఇంకా కొనసాగిస్తూనే ఉన్నారు. వీటిని నిజమే అని నిజంగానే నమ్మిన వారు ఇప్పుడు పునరాలోచనలో పడ్డారు. ఉక్రెయిన్ వివాదంలో మనలను ప్రతివారూ బెదిరించేవారే తప్ప ఇతరత్రా పట్టించుకొనే వారే లేరు. అనేక చిన్న దేశాలనేతలు గళం విప్పినా మన ప్రధానికి నోరు పెగలటం లేదు. చైనా నుంచి దిగుమతులను నిలివేస్తారా అనుకున్నవారికి రికార్డులను బద్దలు కొడుతూ కొనసాగించటం మింగుడుపడటం లేదు.
ఉక్రెయిన్‌పై రష్యా సైనిక చర్య ప్రారంభమైన ఫిబ్రవరి 24కు ముందు మన నేతలు, అధికారులు మొద్దు నిద్రలో ఉన్నారు. మన జేమ్స్‌బాండ్‌గా ప్రచారంలో ఉన్న అజిత్ దోవల్ ఉక్రెయిన్ పరిణామాలను పసిగట్టలేకపోయారు. తరువాత ఆపరేషన్ గంగ పేరుతో అక్కడ చిక్కుకు పోయిన మన విద్యార్ధులను వెనక్కు తీసుకువచ్చేందుకు చేసిన ప్రయత్నాలంటూ నష్ట నివారణ చర్యగా నరేంద్రమోడీ సమీక్షల గురించి మన మీడియా చేసిన హడావుడి కూడా ముగిసింది. కేంద్ర మంత్రులను పంపటం, ఇతరత్రా చేసిన ప్రయత్నాల కంటే అసలు నరేంద్రమోడీ గారే వెళ్లి కూర్చుని ఉంటే ఇంకా తొందరగా పూర్తయి ఉండేది, తలిదంద్రుల ఆవేదన పరిమితంగా ఉండేది. ముందే ఆనందం వెల్లివిరిసేది. ఎందుకంటే ఏదేశంలో ఏది ఎక్కడుందో, ఎక్కడకు ఎలా చేరాలో మోడీగారికి తెలిసినంతంగా ఎవరికీ తెలియదు. సీజన్ టికెట్ తీసుకున్నట్లుగా స్వల్పకాలంలో ఏ ప్రధాని కూడా చేయనన్ని విదేశీ పర్యటనలు చేశారు, అందుకే ప్రతిదేశం కొట్టినపిండి మరి. సరే అది జరగలేదు, ఎందుకంటే ఉత్తర ప్రదేశ్ ఎన్నికలు ముఖ్యగనుక ! ఇంటగెలిచి రచ్చ గెలవమన్నారు కదా !
ఎన్నికలు ముగిశాయి, మొత్తం మీద సామ,దాన,బేధ,దండోపాయాలను ప్రయోగించి అనుకున్నది సాధించారు.యుద్ధం, ప్రేమలో గెలిచేందుకు సాధారణ సూత్రాలు, నీతినియమాలు వర్తించవు అంటారు గనుక ఉత్తర ప్రదేశ్‌లోనూ అదే జరిగిందని అనుకుందాం. ఇప్పుడేమిటి ? ఆపరేషన్ గంగ సమయంలో ప్రధాని జరిపిన సమీక్షల గురించి వార్తలేని రోజు లేదు. ఇప్పుడు పెరుగుతున్న ద్రవ్యోల్బణం, ధరల పెరుగుదల, ఆర్ధిక రంగంలో ఆందోళనకర పరిస్ధితి, చమురు ధరల పిడుగు ఎప్పుడు ఎలా పడుతుందో అని బిక్కుబిక్కు మంటున్న జనం గురించి కూడా రోజూ వార్తలు వస్తూనే ఉన్నాయి. అయినా జనాన్ని ఎలా రక్షించాలి అన్న ఆతృత, కార్యాచరణ ఎక్కడా కనిపించటం లేదు. ఎందుకని ?
ఉక్రెయిన్ వివాదంలో మన దేశం తటస్ధ వైఖరి తీసుకుంటుందని అమెరికా కలలో కూడా ఊహించి ఉండదు.అందుకే బైడెన్‌కు మన మీద కోపం వచ్చింది. మాట్లాడటం మాని బెదిరింపులు-బుజ్జగింపులకు తెరతీశాడు. మార్చి 18వ తేదీన అమెరికా-చైనా అధిపతులు జో బైడెన్- షీ జింపింగ్ వీడియో కాన్ఫరెన్సుద్వారా చర్చలు జరిపారు. ఉక్రెయిన్‌పై రష్యా జరుపుతున్న సైనిక చర్య మీద మనమూ, చైనా భద్రతా మండలిలో తటస్ధవైఖరినే ప్రకటించాయి. అమెరికా మన సహజ భాగస్వామి, ఒకటే మాట, ఒకటే బాట లేదా ఒకటే మంచం ఒకటే కంచం అన్నట్లుగా రోజురోజుకూ మరింత సన్నిహితం అవుతున్నట్లు చెబుతున్నారు. అలాంటపుడు అమెరికా నేత బైడెన్ మన ప్రధాని మోడీతో మాట్లాడకుండా షీ జింపింగ్‌తో చర్చించటం ఏమిటి ? విశ్వగురువుగా విశ్వరూపం ప్రదర్శించే అవకాశాన్ని మోడీ చేజేతులా పోగొట్టుకున్నారా ? లేక మనకు అంతసీన్ లేదా ? మన బలం గురించి అతిగా అంచనా వేసుకున్నామా ? ఇవన్నీ కాస్త ఆలోచించేవారిలో ఎవరికైనా తలెత్తే ప్రశ్నలు. కాదంటారా ?
ఉక్రెయిన్ వివాదంలో జో బైడెన్‌కు చైనా నేత జింపింగ్ స్పష్టం చేసిందేమిటి ? మీ బెదిరింపులకు ఎవరూ భయపడరు. వివాద పరిష్కారానికి అమెరికా, నాటో కూటమి రష్యాతో చర్చలు జరపాలి. రష్యా సైనిక చర్యపేరుతో దానిపై విచక్షణా రహితంగా ఆంక్షలను ప్రకటించటాన్ని చైనా వ్యతిరేకిస్తుంది. ఈవివాదాన్ని మేం కోరుకోవటం లేదు.యుద్ద రంగలో చేతులు కలుపుకోవటాన్ని చూడకూడదనుకున్నాం. వివాదం, ఘర్షణ ఎవరికీ ప్రయోజనకరం కాదు అని కుండబద్దలు కొట్టారు.మరి మన దేశం అలాంటి స్పష్టమైన వైఖరిని ఎందుకు తీసుకోవటం లేదు అన్నది ప్రశ్న. మన, చైనా తటస్ధ వైఖరుల్లో ఉన్న తేదా ఇదే. ఆంక్షలను వ్యతిరేకించి రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్న చైనా మీద, అదే రష్యానుంచి కొనుగోలు చేస్తున్న మన మీద అమెరికా వైఖరిలో కూడా తేడా ఉంది. చైనా మీద ప్రతీకార చర్యలుంటాయని బహిరంగంగానే అమెరికా బెదిరించింది.దానిపై దాడికి అనేక దేశాలను సమీకరిస్తున్న అమెరికాకు మన అవసరం గనుక రష్యానుంచి చమురు కొనుగోలు చేసినా, ఎస్-400 క్షిపణులను కొనుగోలు చేసినా మింగా కక్కలేకుండా ఉంది. తెరవెనుక బెదిరింపులకు దిగుతోంది.
ఉక్రెయిన్ వివాదంలో మన దేశం తటస్ధ వైఖరి తీసుకుంటుందని అమెరికా కలలో కూడా ఊహించి ఉండదు. తన పట్టునుంచి ఎటూ కదలకుండా మన దేశాన్ని ఒక్కొక్కటిగా బిగిస్తున్నది. అమెరికాతో బంధం కారణంగా అనేక దేశాలకు మనం దూరమయ్యాం. అందువలన తనకు తాన తందాన అనకుండా ఎలా ఉంటుందనే భరోసాతో ఉంది. చైనాకు వ్యతిరేకంగా చతుష్టయ(క్వాడ్) కూటమిలోకి మనలను లాగి రెండు దేశాలను గతంలో ఎన్నడూ లేని విధంగా పరస్పర అనుమానాలు తలెత్తేట్లు అమెరికా చేసింది. మన సరిహద్దుల్లో కదలికలను కూడా అది ఇచ్చిన సమాచారం మీద ఆధారపడేట్లు చేసుకుంది. ఇంత చేస్తే మమ్మల్ని అనుసరించరా అంటూ బైడెన్‌కు మన మీద కోపం వచ్చింది. మాట్లాడటం మాని బెదిరింపులు-బుజ్జగింపులకు తెరతీశాడు. చమురు కొనుగోలు గురించి బైడెన్ మీడియా కార్యదర్శి జెన్ సాకీ చెప్పిందేమిటి? చమురు కొనుగోలు మా ఆంక్షలను ఉల్లంఘించినట్లు భావించటం లేదు గానీ వర్తమాన పరిణామాల గురించి చరిత్రను లిఖించినపుడు మీరెక్కడ ఉంటారో కూడా ఆలోచించుకోవాలి.రష్యన్ నాయకత్వానికి మద్దతు ఇవ్వటం అంటే( చమురు, ఇతర కొనుగోళ్ల ద్వారా అని అర్ధం) దురాక్రమణకు మద్దతు ఇచ్చినట్లే, అది సహజంగానే వినాశకర ప్రభావాన్ని కలిగిస్తుందని సాకీ హెచ్చరించారు.
ఒక స్వతంత్ర, సర్వసత్తాక దేశానికి ఇటువంటి బెదిరింపులు వచ్చినపుడు కూడా మోడీ నోరు విప్పకపోతే ఏమనాలి. దేశాన్ని సురక్షితంగా ఉంచుతారని మోడీ చేతుల్లో పెట్టిన జనానికి విశ్వాసం ఎలా ఉంటుంది.యుద్దం చేయమని అడగటం లేదుగా ఇలాంటి బెదిరింపులు తగవని మోడీగాక పోతే ఎవరు చెప్పాలి ? ఇలాంటి బలహీనత లేదా పిరికిబారిన వారు విశ్వగురువులు, ప్రపంచ నేతలు ఎలా అవుతారు ? ఇక బుజ్జగింపుల గురించి చెప్పాల్సి వస్తే మార్చి 19వ తేదీన ఢిల్లీ పర్యటనను జపాన్ ప్రధాని కిషిదా 15వ తేదీన ఖరారు చేసుకొని రావటం వెనుక అమెరికా హస్తం లేదా ? ఇరు దేశాల వార్షిక సమావేశాలు ఉన్నప్పటికీ వాటికి కిషిదా వస్తాడని ముందుగా ఎలాంటి ప్రకటనలు లేవు. సహజంగా ఇలాంటి రాకపోకలు ఎంతో ముందుగానే ఖరారవుతాయి. మన దేశంలో 42బిలియన్ డాలర్ల మేర పెట్టుబడులు పెడతామంటూ మనకు కిషిదా ఒక బిస్కెట్ వేశాడు.
ఐరాసలో తటస్ధంగా ఉన్న మన దేశం దానికి కట్టుబడి ఉందా అంటే లేదు. ప్రపంచ కోర్టులో రష్యాకు వ్యతిరేకంగా మన దేశం నుంచి ఎన్నికైన జడ్జి దల్వీర్ బండారి అమెరికా కూటమి దేశాల వారితో కలసి ఓటు వేశారు. ఇది అమెరికాను సంతుష్టీకరించేదిగా లేదా ? 2017లో రెండవ సారి దల్వీర్ ఎన్నిక నరేంద్రమోడీ సర్కార్ దౌత్యవిజయానికి ప్రతీక అని అప్పుడు చెప్పారు. మరి ఇప్పుడు ఇదేమిటి అంటే దల్వీర్ వ్యక్తిగత హౌదాలో తన వాంఛను బట్టి ఓటు వేశారని విదేశాంగ శాఖ ఇచ్చిన వివరణ రష్యాను సంతృప్తి పరుస్తుందా ? దేశ విధానాన్ని బట్టి నడుచుకోవాలా వ్యక్తిగత ఇష్టాఅయిష్టాల ప్రకారమా ? దీని ద్వారా మన దేశం ఏమి సందేశం పంపినట్లు ?
తైవాన్ సమస్య మీద కూడా జింపింగ్ అమెరికాకు గట్టి హెచ్చరిక చేశాడు. తైవాన్ అంశం మీద నిప్పుతో చెలగాటాన్ని కొనసాగించినా, చైనా ముఖ్య ప్రయోజనాలను ఉల్లంఘించినా రెండు దేశాల మధ్య స్నేహ లేదా సానుకూల మాటలు ఉండవని కూడా స్పష్టం చేశాడు.
మనకు అమెరికాతో అలాంటి పరిస్ధితి లేదు కనుక రష్యా అంశంలో మా ప్రయోజనాలను గమనంలో ఉంచుకొని తెగేదాకా లాగవద్దని ఎందుకు చెప్పకూడదు ? బైడెన్-జింపింగ్ భేటీ తరువాత కొందరు మీడియా వ్యాఖ్యాతలు అమెరికా దిక్కుతోచని స్ధితిలో ఉందని రాశారు.” పుతిన్ వ్యవహారంలో చైనా సాయం కొరకు చూస్తున్న బైడెన్ ” అన్న శీర్షికతో బ్లూమ్‌బెర్గ్ రాసింది. రష్యా చేసినదానికి అమెరికా, దాని ఐరోపా మిత్రులు పెను ముప్పును ఎదుర్కోవలసి రావచ్చని దానిలో పేర్కొన్నారు. చైనా తిరుగుబాటు రాష్ట్రమైన తైవాన్ వేర్పాటును అమెరికా కోరుతున్న సంగతి పదే పదే చెప్పనవసరం లేదు. అలాంటిది షీ జింపింగ్‌తో భేటీలో బైడెన్ చెప్పిందేమిటి? ” చైనాలోని వ్యవస్ధను మార్చేందుకు లేదా చైనాకు వ్యతిరేకంగా కూటమికి తిరిగి ప్రాణ ప్రతిష్ట చేసేందుకు,చైనాతో కొత్త ప్రచ్చన్న యుద్దాన్ని కోరుకోవటం లేదు. తైవాన్ స్వాతంత్య్రాన్ని సమర్ధించటం లేదు, చైనాతో ఘర్షణను కోరుకోవటం లేదు” అని బైడెన్ చెప్పిన అంశాన్ని షీ జింపింగ్ ముఖ్యఅంశంగా పరిగణించినట్లు చెప్పారు. ప్రాణ,విత్త,మాన భంగములందు ఆడితప్ప వచ్చని పెద్దలు సెలవిచ్చారు కదా ! అందుకే అమెరికా దానికి కట్టుబడి ఉంటుందా అన్నది ప్రశ్న.
ఉక్రెయిన్ వివాద నేపధ్యంలో రష్యా నుంచి చమురు కొనుగోలు చేయటాన్ని సమర్ధించేందుకు మన అధికార యంత్రాంగాన్ని రంగంలోకి దింపాం తప్ప రాజకీయనాయకత్వం ఎందుకు నోరు మెదపటం లేదు. పాకిస్తాన్, చైనాల విషయంలో అలా లేరే, సూటిగా కాకున్నా బహిరంగంగా, పరోక్షంగా నైనా హెచ్చరికలు చేశారు కదా ? అమెరికా, నాటో కూటమి పట్ల అంత అణకువ ఎందుకు ? అమ్మా నీకు తోటకూరను దొంగతనంగా తెచ్చి ఇచ్చినపుడే తప్పని చెప్పి ఉంటే ఇప్పుడు నాకీ దుస్ధితి తప్పేది కదా అని జైలు పాలైన కొడుకు అన్న కథ తెలిసిందే. ఇక్కడ దొంగతనం కాదు గానీ అమెరికా, పశ్చిమదేశాల వత్తిడికి గతంలో లొంగిపోకుండా గట్టిగా ఉండి ఉంటే ఇప్పుడు చివరికి జో బైడెన్ మీడియా అధికారికి అంత సాహసం ఉండేదా ?
గతంలో ఇరాన్‌పై ఆంక్షలు విధించింది అమెరికా. ఇప్పుడు రష్యా నుంచి కొనుగోలులో తగ్గేదేలే అని ఆ నాడు నరేంద్రమోడీ సర్కార్ ఎందుకు చెప్పలేకపోయింది ? ఇరాన్ ఎవరి మీదా దాడులకు దిగలేదే ! మన మాదిరే తన రక్షణ కోసం అణుకార్యమం చేపట్టింది తప్ప మరొకటి కాదు. ఆంక్షలతో నిమిత్తం లేకుండానే ఎంతో కాలంగా మనతో ఉన్న సంబంధాల కారణంగా మన రూపాయలు తీసుకొనేందుకు, చెల్లింపు గడువు ఎక్కువ ఇచ్చేందుకు కూడా వెసులుబాటు కల్పించినా మన సర్కార్ ఇరాన్నుంచి చమురు కొనుగోలును ఎందుకు నిలిపివేసింది ? మనసుంటే మార్గం దొరికేది కాదా ? ఇదే మాదిరి వెనెజులా నుంచి కూడా నిలిపివేశాము. గతంలో ఎన్నడూ లేనిది అమెరికా నుంచి కొనుగోళ్లకు మరలాం. ఒకసారి మనబలహీనత తెలిసింతరువాత ప్రతివారూ బెదిరిస్తారు. తమ వ్యూహాత్మక ఉద్ధేశ్యాల మీద తప్పుడు అంచనాలకు వచ్చారని షీ జింపింగ్ చెప్పినట్లుగా రష్యాతో తమ సంబంధాలను తక్కువ అంచనా వేశారని అమెరికన్లకు మోడీ ఎందుకు చెప్పలేకపోతున్నారు ? అమెరికాను నమ్ముకుంటే ఐరోపాలో ఉక్రెయిన్‌కు ఏమైందో చూస్తున్నాము. తన లబ్దికోసం ఎవరినైనా బలిపెట్టేందుకు అది సిద్దం.ఇప్పటికైనా మించి పోయింది లేదు, మన స్వతంత్ర విదేశాంగ విధానాన్ని రూపొందించుకోవటం అవసరం.దీనిలో రాజకీయాలు కాదు,దేశ గౌరవ, ప్రతిష్ట, ప్రయోజనాలు ముఖ్యం. ఎవరు అంగీకరించినా లేకున్నా, విమర్శించినా అభిమానించినా ప్రధానిగా నరేంద్రమోడీ వాటికోసం తగిన విధంగా వ్యవహరించకపోతే చరిత్రలో విమర్శలకు గురవుతారు.