Tags

, , , , , , , ,


ఎం కోటేశ్వరరావు


మాజీ హీరోయిన్‌ కుష్‌బూ తన పార్టీ బిజెపి నేతలను మెప్పించేందుకు తంటాలు పడ్డారు. గతంలో తాను కాంగ్రెస్‌ ప్రతినిధిగా మాట్లాడిన మాటలు పార్టీ నేతలవే తప్ప తనవి కాదని, అందువలన వాటిని ఇప్పుడు తాను వెనక్కు తీసుకోవాలను కోవటం లేదని చెప్పారు. మోడీలపై రాహుల్‌ గాంధీ చేసిన వ్యాఖ్యలకు సూరత్‌ కోర్టు రెండు సంవత్సరాల శిక్ష విధించటం, వెంటనే లోక్‌సభ సచివాలయం రంగంలోకి దిగి లోక్‌సభ సభ్యత్వాన్ని రద్దు చేయటం తెలిసిందే. ఈ నేపధ్యంలో తాజాగా కాంగ్రెస్‌ నేతలు గతంలో కుష్‌బూ కూడా రాహుల్‌ మాదిరి వ్యాఖ్యలు చేశారని, ఆమె ఇప్పుడు బిజెపిలో ఉన్నారని గుర్తు చేశారు. వాటి మీద కుషఉ్బ మండి పడ్డారు. ఆమె ప్రస్తుతం బిజెపి జాతీయ కార్యవర్గ సభ్యురాలిగా, జాతీయ మహిళా కమిషన్‌ మెంబర్‌గా ఉన్నారు. 2018 ఫిబ్రవరి 15న కాంగ్రెస్‌ ప్రతినిధిగా కుష్‌బూ చేసిన ట్వీట్‌లో ఇలా పేర్కొన్నారు. ” ఇక్కడ మోడీ, అక్కడ మోడీ, ఎక్కడ చూస్తే అక్కడ మోడీ… లేకపోతే ఏమిటి ? మోడీ అనే పదానికి ముందు అవినీతి పరుల పేర్లు ఉంటున్నాయి.దాని అర్ధం తెలియటం లేదు. కనుక మోడీ అంటే అవినీతి పరులని అర్ధం మార్చుదాం. నీరవ్‌, లలిత్‌, నమో అంటే అవినీతి పరులంటే తగినట్లుగా ఉంటుంది.” అని ఉంది.


దీని గురించి కుష్‌బూ పిటిఐ విలేకరితో మాట్లాడుతూ ” నేను కాంగ్రెస్‌లో ఉన్నపుడు ఒక కాంగ్రెస్‌ ప్రతినిధిగా నా బాధ్యత మాత్రమే నిర్వహించాను. అలాంటి భాషలోనే మేము మాట్లాడాల్సి ఉండేది, నేను సరిగ్గా అదే చేశాను. నేను పార్టీ నేతను అనుసరించాను.ఇది అతని భాష. కాంగ్రెస్‌ పార్టీ ఎంత తెంపరితనంతో ఉందో చూపటమే కాదు, ఈ అంశాన్ని లేవనెత్తటం ద్వారా వారి అమాయకత్వం ఏ స్థాయిలో ఉందో కూడా వెల్లడిస్తున్నది. నా ఖాతా నుంచి నేను ఏ ఒక్క ట్వీట్‌ను కూడా తొలగించలేదు. ఇప్పుడు నేనా పని చేయను. నా పేరును ప్రస్తావించటం ద్వారా కాంగ్రెస్‌ నేతలు ఏం చేస్తున్నారు ? నన్ను రాహుల్‌ గాంధీతో సమానంగా చూస్తున్నారా ? మోడీలను దొంగలు అని పిలిచే స్థాయికి రాహుల్‌ గాంధీ దిగజారారు, నేను అవినీతి అనే పిలిచాను. తేడాను చూసే సామర్ధ్యం కాంగ్రెస్‌కు లేదు. కానీ వారికి దమ్ముంటే నా మీద కేసును దాఖలు చేయాలని సవాలు చేస్తున్నాను. చట్టపరంగా దాన్ని ఎదుర్కొంటాను. నేను నా ట్వీట్‌ను తొలగించను.అది అక్కడే ఉంది, ఇంకా అనేకం ఉన్నాయి. కాంగ్రెస్‌కు పని లేదు. మీ సమయాన్ని వెచ్చింది మరిన్ని ట్వీట్లను వెలికి తీయండి. ” అని. పేర్కొన్నారు. రాహుల్‌ గాంధీతో తనను సమంగా చూసినందుకు కాంగ్రెస్‌కు కృతజ్ఞతలు అని కుష్‌బూ ట్వీట్‌ చేశారు.


కుష్‌బూ రాజకీయ ప్రయాణం 2010లో డిఎంకెతో ప్రారంభమైంది. మరుసటి ఏడాది తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో, 2014లోక్‌సభ ఎన్నికల్లో ఆ పార్టీ తరఫున ప్రచారం చేశారు. తనకు పార్టీలో తగినంత గుర్తింపు ఇవ్వలేదంటూ అదే ఏడాది రాజీనామా చేసి కాంగ్రెస్‌లో చేరారు.2020లో కాంగ్రెస్‌కు రాజీనామా చేస్తూ పార్టీలో తనకు తగినంత గుర్తింపు లేదని ఆరోపించారు. తరువాత బిజెపిలో చేరారు.వందకు పైగా సినిమాల్లో నటించిన 52 సంవత్సరాల కుష్‌బూ గత పోకడలను బట్టి ఎప్పుడు ఏ పార్టీలో ఉంటారో చెప్పలేము. కాంగ్రెస్‌లో ఉన్నపుడు ఆ పార్టీ నేత భాషనే మాట్లాడాను తప్ప ఆ విమర్శలు తనవి కాదని చెప్పుకున్న కుష్‌బూ విశ్వసనీయత ఎంత అన్నది ప్రశ్న. బిజెపిలో చేరిన తరువాత ఆమె చెప్పిన మాటలు కూడా ఆ పార్టీ నేతకు అనుగుణంగా మాట్లాడినట్లు భావించాల్సి ఉంటుంది. అలా మాట్లాడాలని (కాంగ్రెస్‌లో ఉన్నపుడు అలా మాట్లాడాల్సి వచ్చేదని ఆమే చెప్పారు గనుక) బిజెపి నిర్దేశించి ఉంటుంది గనుక నరేంద్రమోడీని పొగుడుతూ కుషఉ్బ మాట్లాడారన్నది స్పష్టం. బిజెపిలో చేరటాన్ని ఖరారు చేసుకున్న తరువాత ఆమె ఏం మాట్లాడిందీ చూద్దాం.” పార్టీ నాకేమి చేస్తుంది అన్నదాన్ని గురించి నేనేమీ ఆశించటం లేదు. కానీ దేశ ప్రజలకు పార్టీ ఏమి చేస్తుందీ అని చూస్తాను.నూట ఇరవై ఎనిమిది కోట్ల మంది ఒక మనిషిని అదే మన ప్రధానిని నమ్ముతున్నారు. వారు చేస్తున్నది పూర్తిగా సరైనదే అని భావిస్తున్నాను.” అని ఎఎన్‌ఐ వార్తా సంస్థతో చెప్పారు. అధికార బిజెపిలో చేరే అవసరం కోసం తప్ప ఈ మాటలు నిజాయితీగా చెప్పినట్లు ఆధారం ఏమిటి ?


ప్రముఖ నటుడు ప్రకాష్‌ రాజ్‌ రాహుల్‌ గాంధీ ఉదంతంపై తనదైన శైలిలో స్పందించి ఆదివారం నాడు ఒక ప్రశ్నను సంధించారు.తన ట్వీట్‌కు ఒక ఫొటోను జత చేశారు. దానిలో ఎడమవైపు లలిత్‌ మోడీ, మధ్యలో నరేంద్రమోడీ, కుడివైపున లలిత్‌ మోడీ చిత్రం ఉంది. అటూ ఇటూ ఉన్నవారు అక్రమాలకు పాల్పడి దేశం వదలి పారిపోయిన సంగతి తెలిసిందే. ఆ ఫొటో పైన ” జనరల్‌ నాలెడ్జ్‌- ఇక్కడ మీకు కనిపిస్తున్న ఏకైక అంశం ఏమిటి అని కేవలం అడుగుతున్నా అంతే ” అన్న వ్యాఖ్యను పెట్టారు. ముగ్గురి పేరులోనూ మోడీ ఉండటం అన్నది దాని భావం అని వేరే చెప్పనవసరం లేదు.” దొంగలందరికీ మోడీ అనే ఒకే ఇంటి పేరు ఎలా వచ్చింది ” అంటూ రాహుల్‌ గాంధీ కర్ణాటకలో ఒక ఎన్నికల సభలో అన్న మాటలు మోడీ కులం అంతటికీ పరువు నష్టం కలిగించినట్లు సూరత్‌ కోర్టులో బిజెపి నేత దాఖలు చేసిన కేసులో రాహుల్‌ గాంధీకి రెండేళ్ల జైలు శిక్షపడింది. మోడీ కులంతో సహా ఒబిసి లందరినీ రాహుల్‌ గాంధీ అవమానించారు అని బిజెపి ఒబిసిలను రెచ్చగొడుతూ ప్రచారం చేస్తున్నది. తెలుగు ప్రాంతాల్లో ఒకే ఇంటి పేరు కలిగిన వారు అన్ని కులాల్లో ఉన్నారు. ఒకే కులంలో అనేక ఇంటి పేర్లు గలవారు ఉన్నారు. ఒబిసిల్లో మోడీ అనే కులమే లేదు. నరేంద్రమోడీ తెలీ ఘంచీ లేదా మోధ్‌ ఘంచీ అనే కులానికి చెందిన వారు. కొన్ని చోట్ల ఘంచీ అని కూడా పిలుస్తారు.(ఈ పేరుతో ముస్లింలు కూడా ఉన్నారు) ఈ కులానికి చెందిన వారు నూనె గానుగ ఆడించటం, నూనెను అమ్మటం ప్రధాన వృత్తిగా చేస్తారు. వీరిని వైశ్యుల్లో ఒక ఉపకులంగా కూడా పరిగణిస్తారు. కర్ణాటకలో ఈ పని చేసే వారిని గనిగ అని పిలుస్తారు.ఇక అవినీతికి పాల్పడి దేశం వదలి పారిపోయిన నీరవ్‌ మోడీదీ నరేంద్రమోడీది ఒకే కులం, మతం కూడా కాదు. నీరవ్‌ మోడీ జైన మతంలో పాలంపూరీ జైన్స్‌ కులానికి చెందిన వ్యక్తి.లలిత్‌ మోడీ వెనుకబడిన కులానికి చెందిన వారు కాదు. బీహార్‌కు చెందిన బిజెపి నేత సుశీల్‌ కుమార్‌ మోడీ వైశ్య, బిసి కాదు. గుజరాత్‌లో పార్వతికి మరో పేరు మోదేశ్వరీ దేవి. అందువలన గుజరాతీలు అనేక మంది ఆమె పేరు కలసి వచ్చేట్లుగా మోడీ అని అడా మగా అందరూ పెట్టుకుంటారు.


మోడీ ఇంటి పేరు గలవారిని అవమానపరిచినట్లు రాహుల్‌ గాంధీ మీద ధ్వజమెత్తుతున్న బిజెపి, సంఘపరివార్‌కు చెందిన వారు మొత్తం ముస్లిం సామాజిక తరగతినే ఉగ్రవాదులు అనే అర్ధం వచ్చేట్లు మాట్లాడుతున్న సంగతి తెలిసిందే. ” ముస్లింలందరూ ఉగ్రవాదులు కాదు గానీ ఉగ్రవాదులందరూ ముస్లింలే ” అంటున్నారా లేదా ?కేంద్ర మంత్రి గిరిరాజ్‌ సింగ్‌ ఒక సందర్భంగా మాట్లాడుతూ ” నేను ఒక సామాజిక తరగతిని నిందించటం లేదు గానీ ఉగ్రవాద చర్యలలో పట్టుబడిన వారందరూ ఒక సామాజిక తరగతికే చెందిన వారన్నది నిజం కాదా ? లౌకిక పార్టీలం అని చెప్పుకొనేవి ఎందుకు మౌనం పాటిస్తున్నట్లు ? ” అని ప్రశ్నించారు. బిజెపి అధ్యక్షుడు జెపి నడ్డా 2022 మే ఆరవ తేదీన కోజికోడ్‌లో మాట్లాడుతూ ముస్లిం ఉగ్రవాదుల ఉత్పత్తి కేంద్రంగా కేరళ మారినట్లు మాట్లాడారు. ఇది మొత్తం కేరళనే అవమానించినట్లు కాదా ? దీన్లో పరువు నష్టం అంశం లేదా ? ఎవరైనా కేసు వేసినా లేకున్నా సూరత్‌ కోర్టు తీర్పు స్ఫూర్తితో నడ్డాను రాజ్యసభ సచివాలయం అనర్హుడిగా ప్రకటిస్తుందా ?


బిజెపిలో నోటి తుత్తర మనుషులు ఎక్కడ చూసినా కనిపిస్తారు. కేంద్ర మంత్రిగా ఉన్న గిరిరాజ్‌ కిషోర్‌ ఒక సందర్భంగా మాట్లాడుతూ రాజీవ్‌ గాంధీ గనుక ఒక తెల్లమహిళను కాకుండా ఒక నైజీరియన్‌ మహిళను చేసుకొని ఉండి ఉంటే ఆమె నాయకత్వాన్ని కాంగ్రెస్‌ ఆమోదించి ఉండేదా అని ప్రశ్నించారు.నిజానికి ఇది ఒక్క నైజీరియన్‌ మహిళలనే కాదు, మొత్తం మహిళలను అవమానించినట్లు ? జాత్యహంకార ప్రదర్శన తప్ప మరొకటి కాదు. దీని గురించి తాము నిరసన తెలపటం లేదంటూ, ప్రధాని నరేంద్రమోడీ దీన్ని సరిచేయగలరని భావిస్తున్నట్లు మన దేశంలో నైజీరియన్‌ రాయబారి ఓబి ఓకోంగొర్‌ ఎంతో హుందాగా స్పందించాడు. కానీ నరేంద్రమోడీ సరి చేసినట్లు గానీ, గిరిరాజ్‌ సింగ్‌ తన ప్రకటనను సవరించుకున్నట్లు ఎక్కడా కనిపించలేదు.ఈ పెద్దమనిషి నోటి నుంచి ఇలాంటి సుభాషితాలకు కొదవ లేదు. నరేంద్రమోడీని వ్యతిరేకించే వారందరూ పాకిస్తాన్‌ పోవాల్సిందే అని 2014 ఎన్నికల ప్రచారం సెలవిచ్చారు.కేంద్రంలో అధికారానికి వచ్చిన తరువాత 2014 నవంబరులో నాడు సిఎంగా ఉన్న నితీష్‌ కుమార్‌ను విమర్శిస్తూ నరేంద్రమోడీని చూసి ఓర్చుకోలేక ”పల్లెటూరి ఆడదానిలా” పోట్లాడుతున్నట్లు వర్ణించారు. ఇది గ్రామీణ ప్రాంతాల మహిళలు అందరినీ అవమానించినట్లే కదా ! షహరాన్‌ పూర్‌లోని ముస్లిం మత కేంద్రం దారులు ఉలుం దేవబంద్‌ను ఉగ్రవాద దేవాలయం అని ఇదే మంత్రి వర్ణించారు. బాబరీ మసీదు భూమి కేసులో సుప్రీం కోర్టు తీర్పు వాయిదా వేసినపుడు మంత్రికి కోపం వచ్చింది.” ఈ వంద కోట్ల మంది హిందువులు కూడా మీ సోదరులే అని గుర్తించాలని ముస్లింలను కోరుతున్నాను. మీరు మూడు లక్షల మసీదులను ఏర్పాటు చేస్తే ఎవరూ అడ్డుకోలేదు. ఇప్పుడు హిందువుల సహనాన్ని పరీక్షించవద్దు.రాముడి మీద నాకు విశ్వాసం, ఆయన ఆలయాన్ని ఆయోధ్యలో నిర్మించాలి.హిందువుల విశ్వాసానికి రాముడు మూలం.దీన్ని హిందూ – ముస్లిం సమస్యగా మార్చాలని చూసింది.హిందువుల్లో సహనం నశిస్తున్నది” అని అన్నారు. హిందువేతరులందరూ అక్రమ సంతానమే అంటూ నోరు పారవేసుకున్న సాధ్వి నిరంజన గురించి తెలిసిందే. పాలకులుగా రాముడిని అనుసరించే వారు కావాలో అక్రమ సంతానానికి పుట్టిన వారు కావాలో తేల్చుకోవాలని 2014 ఎన్నికల సభలో మాట్లాడారు. ఆ మాటలను మోడీ తప్పు పట్టటంతో ఆమె క్షమాపణ చెప్పారు గానీ ఆమెకు కేంద్ర మంత్రిపదవి బహుమానంగా దక్కింది.


ఉగ్రవాదానికి సంబంధించి సౌత్‌ ఆసియన్‌ టెర్రరిజం పోర్టల్‌ వెల్లడించిన సమాచారం ప్రకారం ఎవరి చేతుల్లో ఎందరు మరణించింది దిగువ విధంగా ఉంది. కాశ్మీర్‌ మరణాలను మొత్తంగా ఇస్లామిక్‌ ఉగ్రవాదుల ఖాతాలో వేసినా, మావోయిస్టు, ఈశాన్య రాష్ట్రాల ఉగ్రవాదులందరూ హిందువులు, క్రైస్తవులే కదా ? వారిలో ఎక్కువ మంది గిరిజనులు ఉన్నారన్నది తెలిసిందే.
సం××ఈశాన్య ××మావోయిస్టు×× కాశ్మీర్‌
2011 ×× 246 ×× 602 ×× 225
2012 ×× 326 ×× 367 ×× 206
2013 ×× 252 ×× 421 ×× 193
2014 ×× 465 ×× 314 ×× 193
ఈ వివరాలను చూసిన తరువాత ఎవరైనా ఉగ్రవాదులందరూ ఒక సామాజిక తరగతి లేదా ముస్లింలే అని ఎలా చెప్పగలరు ? ఉగ్రవాదానికి ముస్లిం మతానికి ముడి పెట్టి విశ్లేషణలు చేస్తున్నవారి సంగతేమిటి ? అనేక ముస్లిం దేశాల్లో ఉగ్రవాద చర్యలను ఎలా వర్ణిస్తారు ?


విద్వేషపూరిత ప్రసంగాలకు కాషాయదళాలు పెట్టింది పేరు. కొందరి నోళ్ల నుంచి వెలువడిన ఆ మాటలు పరువు తీసేవిగానూ, సమాజంలో కలతలు రేపేవిగానూ ఉన్నాయి. ఎందరి మీద కేసులు నమోదు చేశారు, ఎందరికి శిక్షలు వేసి ఎన్నికల్లో పోటీకి అనర్హులుగా చేశారు ? కోర్టులు కూడా తమంతట తాముగా తీసుకోవచ్చు, ఎన్ని ఉదంతాల్లో తీసుకున్నట్లు ? ఉత్తర ప్రదేశ్‌ ఎన్నికల సందర్భంగా యోగి ఆదిత్యనాధ్‌ 34 సందర్భాలలో ముస్లిం విద్వేష ప్రసంగాలు చేసినట్లు వైర్‌ న్యూస్‌ పోర్టల్‌ నమోదు చేసి ప్రచురించింది. మధ్య ప్రదేశ్‌లో గడ్డం ఉన్న ఒక భవర్‌లాల్‌ జైన్‌ అనే వృద్దుడిని నువ్వు ముస్లిమ్‌వా, ఆధార్‌ కార్డుచూపమంటూ దాడి చేసిన బిజెపి నేత గురించి తెలిసిందే. తరువాత జైన్‌ శవం కనిపించింది. రావణుడ్ని దహనం చేసినట్లు ముస్లింలను కూడా చేయాలని బీహార్‌ బిజెపి ఎంఎల్‌ఏ హరిభూషన్‌ ఠాకూర్‌ బచువల్‌ చెప్పారు. వారికి ఓటింగ్‌ రద్దు చేయాలని రెండో తరగతి పౌరులుగా చూడాలన్నారు. బిజెపి నేత, సుప్రీం కోర్టు లాయర్‌ అశ్వనీ ఉపాధ్యాయ ముస్లిం వ్యతిరేక నినాదాలు చేసినందుకు పోలీసు అరెస్టు చేస్తే తనను అక్రమంగా ఇరికించారని ఆరోపించారు. చేసింది కేంద్ర ప్రభుత్వం కింద పని చేసే ఢిల్లీ పోలీసులు అని గమనించాలి. అతన్ని లాయర్‌గా పనికి రాడని ప్రకటించలేదు. ” ఏ హిందువైనా నాకు ఓటు వేయకపోతే వారి నరాల్లో మియా(ముస్లిం) రక్తం ఉన్నట్లే. అతను ఒక ద్రోహి. విద్రోహి జయ చంద్రుడికి పుట్టిన అక్రమ సంతానం.వాడి తండ్రి పాపపు కొడుకే.ఈ సారి నేను హెచ్చరిస్తున్నాను.హిందూ మత ద్రోహులను నాశనం చేస్తాం” ఈ మాటలన్నది బిజెపి ఉత్తర ప్రదేశ్‌ ఎంఎల్‌ఏ రాఘవేంద్ర ప్రతాప్‌ సింగ్‌. ఎంతో గౌరవ ప్రదమైన మాటలు గనుకనే అతని ఎంఎల్‌ఏ గిరి నిలిచిందనుకోవాలి. అదే రాష్ట్రానికి చెందిన మరొక బిజెపి ఎంఎల్‌ఏ మయంకేశ్వర సింగ్‌ ” హిందువులు గనుక మేలుకుంటే మేము మీ మీగడ్డాలను లాగి గట్టిగా ముడివేస్తాం.మీరు హిందూస్తాన్‌లో ఉండాలంటే రాధే రాధే అనాలి ” అన్నారు. బక్రీద్‌ సందర్భంగా అమాయకపు జంతువులను కాదు మీ పిల్లలను బలి ఇవ్వాలంటూ 2020లో మరో బిజెపి ఎంఎల్‌ఏ నంద కిషోర్‌ గుజార్‌ అన్నారు. ఇలా చెప్పుకోవాలంటే ఎన్నో ఉన్నాయి.వాటి మీద ఎలాంటి కేసులు లేవు, ఉన్నా శిక్షలు పడిన దాఖలాల్లేవు !