ఎం కోటేశ్వరరావు
తాను అధికారానికి వచ్చిన 24 గంటల్లో ఉక్రెయిన్ వివాదాన్ని పరిష్కరిస్తానని డోనాల్డ్ ట్రంప్ చెప్పాడు.వందరోజులైంది, ఏం జరుగుతోందో తెలియదు. రెండు వారాలు, అంతకు లోపే ఒప్పందం కుదరవచ్చని, ఇంకా ఎక్కువ కాలమే పట్టవచ్చని తాజాగా చెప్పాడు. దానికి అనుగుణంగా కావచ్చు లేదా ఎత్తుగడగా గానీ మే నెల 8 నుంచి 10వ తేదీ వరకు కాల్పుల విరమణ పాటిస్తామని, ఉక్రెయిన్ కూడా అదే విధంగా వ్యవహరించాలని రష్యా అధినేత వ్లదిమిర్ పుతిన్ ప్రకటించాడు.రెండవ ప్రపంచ యుద్ధంలో సోవియట్ యూనియన్ విజయానికి 80ఏండ్లు నిండుతున్న సందర్భంగా ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు మాస్కో పేర్కొన్నది. కాదు తక్షణమే నెల రోజుల పాటు పోరును ఆపాలని ఉక్రెయిన్ స్పందించింది. సంక్షోభం ప్రారంభమై 1,160 రోజులైంది. ఆ మూడు రోజుల్లో జెలెనెస్కీ సేనలు ఉల్లంఘనకు పాల్పడితే పర్యవసానాలు తీవ్రంగా ఉంటాయని కూడా పుతిన్ హెచ్చరించాడు.‘‘ కొన్ని కారణాలతో ప్రతిఒక్కరూ మే 8వ తేదీ వరకు వేచి ఉండాలని, మాస్కోలో జరిగే కవాతు సందర్భంగా పుతిన్ ప్రశాంతతను కోరుకుంటున్నాడని, ఎలాంటి షరతులు లేకుండా కనీసం నెల రోజులు కాల్పుల విరమణ ఉండాలని, మేం పౌరుల ప్రాణాలకు విలువ ఇస్తాం తప్ప కవాతులకు కాదని, నిజంగా శాంతి కావాలని రష్యా కోరుకుంటే వెంటనే కాల్పుల విరమణకు పూనుకోవాలని ’’ జెలెనెస్కీ అన్నాడు. ప్రపంచ నేతల సమక్షంలో మే 9న జరిగే కవాతులో విభ్రాంతకర పరిస్థితి ఎదురుకాకుండా చూడాలన్నది పుతిన్ ప్రతిపాదన అర్ధం అని పరిశీలకులు కూడా వ్యాఖ్యానించారు.మన దేశంలో రిపబ్లిక్ దినోత్సవం రోజున జరిగే కవాతులో ఆయుధ ప్రదర్శన చేసినట్లే, గొప్ప దేశభక్త యుద్ధంగా వర్ణించిన రెండవ ప్రపంచ యుద్ధంలో సోవియట్ విజయం సాధించిన మే9వ తేదీన ప్రతి ఏటా కవాతులో తన ఆయుధపాటవాన్ని ప్రదర్శిస్తున్నది. ఏం జరగనుందో చూద్దాం !
అమెరికా ఆర్భాటంగా ప్రకటించిన 30రోజుల నల్ల సముద్ర శాంతి ఒప్పందం ఏమైందో తెలియదు. మా నేత శాశ్వత ఒప్పందం కుదరాలని కోరుతున్నాడు, రెండు దేశాల నేతల మీద అసహనం పెరుగుతున్నదని వైట్‌హౌస్ ప్రతినిధి వ్యాఖ్య. దాడులను గనుక రష్యా ఆపకపోతే తాము శాంతి చర్చల నుంచి వైదొలుగుతామని అమెరికా ప్రతినిధి వ్యాఖ్యానించాడు. క్రిమియా తమదే అని, అదే విధంగా స్వాతంత్య్రం ప్రకటించుకున్న ఉక్రెయిన్‌లోని మూడు ప్రాంతాలను అంతర్జాతీయ సమాజం గుర్తించాలన్నది తమ షరతులలో ఒకటని రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావరోవ్ బ్రెజిలియన్ పత్రిక గ్లోబోకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పాడు.శాంతి ఒప్పందం రెండు వారాలు, అంతకు లోపే కుదరవచ్చన్న ట్రంప్ ఇంకా ఎక్కువ సమయం కూడా పట్టవచ్చని ఆదివారం నాడు చెప్పాడు.తాను పుతిన్‌తో మాట్లాడిన తరువాత కూడా దాడులు జరగటంతో ఆశాభంగం చెందానన్నాడు. మరిన్ని ఆయుధాలు కావాలని రోమ్‌లో జెలెనెస్కీ తనను కోరినట్లు వెల్లడిరచాడు.పోప్ ఫ్రాన్సిస్ అంత్యక్రియలకు వెళ్లిన సందర్భంగా వారిద్దరూ అక్కడ మాట్లాడుకున్నారు. క్రిమియాను విలీనం చేసుకొనేందుకు రష్యాను అనుమతించటం ద్వారా మాజీ అధ్యక్షుడు జోబైడెన్ సమస్యను మరింత సంక్లిష్టం గావించినట్లు ఆరోపించాడు. జెలెనెస్కీతో ట్రంప్ మాట్లాడిన తరువాత రష్యా దాడులను మరింతగా పెంచింది.
రష్యా ఉపయోగిస్తున్న పదజాలాన్ని చూస్తే ఒప్పందం గురించి కఠిన వైఖరి తీసుకొనేట్లు ఉందని పరిశీలకులు చెబుతున్నారు. నాటోలో ఉక్రెయిన్ చేరకుండా చూడటం, దాని మిలిటరీ శక్తిని పరిమితంగావించటం,అంతర్గత రాజకీయాల్లో తన పలుకుబడి ఉండేట్లు చూసుకొనేందుకు పుతిన్ చూస్తున్నాడన్నది వారి భాష్యం. అమెరికా ముందుకు తెచ్చిన 30రోజుల శాంతి ఒప్పందానికి రష్యా విధించిన షరతులను చూస్తే అది సుముఖంగా లేదన్నది స్పష్టం. తన వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతుల మీద, వాటి లావాదేవీలు జరిపే బ్యాంకుల మీద ఆంక్షలు విధిస్తే ఇంక ఒప్పందం ఏమిటని అది ప్రశ్నించింది. ఈస్టర్ సందర్భంగా ప్రకటించిన పరిమిత వ్యవధి కాల్పుల విరమణను ఉల్లంఘించినట్లు రెండు దేశాలూ పరస్పరం ఆరోపణలు చేసుకున్నాయి. రష్యా మూడువేల సార్లు ఉల్లంఘించిందని, దీర్ఘశ్రేణి క్షిపణులను తప్ప డ్రోన్లు, ఇతర దాడులు చేసిందని ఉక్రెయిన్ విశ్లేషకులు ఆరోపించారు. ఆ సమయంలో మిలిటరీ వాహనాలు, ఆయుధాల మరమ్మతులు చేసుకోవటం, మందుపాతరలను వెలికి తీసేందుకు ఉపయోగించుకుందన్నారు. మే తొమ్మిది విజయోత్సవ కవాతు తరువాత రష్యా పెద్ద ఎత్తున దాడులకు దిగనుందని ఆరోపించారు. శుక్రవారం నాడు రోమ్‌లో ట్రంప్, జెలెనెస్కీ భేఠీ తరువాత పుతిన్ ప్రకటన వెలువడిరదంటే బంతిని అమెరికా కోర్టులో నెట్టినట్లుగా భావిస్తున్నారు.
శాంతి ఒప్పందం కుదరాలంటే రష్యా ఆధీనంలోకి వెళ్లిన ప్రాంతాలను ఉక్రెయిన్ వదులుకోవాల్సిందే అని మాట్లాడుతున్న ట్రంప్ వైఖరితో ఐరోపా దేశాలు ఆందోళన చెందుతున్నాయి. అమెరికా ప్రతిపాదనలు చైనా నేత షీ జింపింగ్‌తో సహా పుతిన్, ఇతర ప్రపంచ నేతలకు ప్రమాదకర సంకేతాలను పంపుతున్నట్లే అని భావిస్తున్నాయి. అక్రమ ఆక్రమణలను బహుమతిగా ఇచ్చినట్లే అంటున్నారు. ఐరోపాలోని ఒక దేశాన్ని స్వంత భూభాగాన్ని వదులుకోవాలని చెబితే, దాన్ని బలవంతం చేస్తే ఐరోపాలో లేదా ఎక్కడా ఏ దేశమూ భద్రంగా ఉన్నట్లు భావించలేవని, అది నాటో లేదా ఇతర దేశం ఏదైనా కావచ్చని ఒక దౌత్యవేత్త చెప్పినట్లు సిఎన్‌ఎన్ పేర్కొన్నది. అమెరికా అంగీకరించిన ప్రతిదానికీ తాము తలూపలేమన్నాడు. ఆసియాలోని అమెరికా మిత్రదేశాల్లో కూడా ఇదే ఆందోళన తలెత్తింది. ఉక్రెయిన్ సంక్షోభంలో తదుపరి తీసుకోవాల్సిన చర్యల గురించి తాము ఒక ఉమ్మడి వైఖరికి వచ్చేందుకు గణనీయంగా ముందుకు పోయినట్లు జర్మనీ, ఫ్రాన్సు, బ్రిటన్ ఒక సంయుక్త ప్రకటనలో పేర్కొన్నాయి.అమెరికా ప్రతిపాదన ప్రకారం గణనీయమైన ప్రాంతాన్ని తాము వదులుకోవాల్సి వస్తే అది ఆత్మహత్య అవుతుందని, జెలెనెస్కీ ఒప్పుకున్నా తమ పార్లమెంటు అంగీకరించదని ఒక ఎంపీ చెప్పాడు.
యుద్ధ రంగంలో రోజు రోజుకూ ఎదురుదెబ్బలు తింటున్న ఉక్రెయిన్ ఆర్థికంగా దివాలా తీసింది. జిడిపితో లంకె ఉన్న రుణాల రీషెడ్యూలు గురించి ఒప్పందం కుదుర్చుకోవటంలో విఫలమైంది.అప్పులిచ్చిన వారి షరతులకు అంగీకరించటం లేదని పేర్కొన్నది.తదుపరి కిస్తీ మే నెలాఖరులో చెల్లించాల్సి ఉంది. ఒక వైపు అప్పుల వాళ్ల సతాయింపు మరోవైపు రష్యాతో ఒప్పందాన్ని అంగీకరించాలని, తమకు చెల్లించాల్సినదానికి ప్రతిగా విలువైన ఖనిజాలున్న ప్రాంతాన్ని తమకు అప్పగించాలని ట్రంప్ చేస్తున్న వత్తిడితో జెలెనెస్కీ యంత్రాంగం ఉక్కిరిబిక్కిరి అవుతున్నది. రష్యా దాడి కారణంగా తాము ఆర్థికంగా తాము 30శాతం దెబ్బతిన్నామని, తిరిగి కోలుకుంటే తప్ప షరతులను నెరవేర్చలేమని చెబుతున్నది.260 కోట్ల డాలర్ల రుణ రీషెడ్యూలుపై ఒప్పందం కుదుర్చుకోవటంలో విఫలమైనట్లు ఉక్రెయిన్ ప్రకటించింది, మేనెలాఖరులోగా 60 కోట్ల డాలర్ల కిస్తీపై ఏదో ఒకటి జరగకపోతే దివాలా తీసినట్లు పరిగణించాల్సి ఉంటుంది.2022కు ముందు విదేశీ, స్వదేశీ అప్పు వందబిలియన్ డాలర్లు ఉండగా 2024నవంబరు నాటికి అది 160బిలియన్లకు పెరిగింది. ఐరోపా సమాఖ్య, ప్రపంచబ్యాంక్, ఐఎంఎఫ్ ఇచ్చిన రుణాల వల్లనే ఇలా పెరిగింది. దీన్లో ఐరోపా సమాఖ్య రుణం ఐదు నుంచి ఏకంగా 43బి.డాలర్లకు, ప్రపంచబాంకు, ఐఎంఎఫ్ రుణం 47బిలియన్ డాలర్లకు పెరిగింది. తమ అప్పు తీర్చకపోయినా ఫరవాలేదు గానీ ప్రైవేటు రంగానికి అనుకూలంగా ఉన్న సమాఖ్య ఒప్పందాలను అంగీకరించాలని పట్టుబడుతున్నది. అదే జరిగితే పునర్‌నిర్మాణ కాంట్రాక్టులన్నీ ఆ సంస్థలకు దక్కుతాయి, వాటితో అంతకంటే ఎక్కువ మొత్తాలను ఆర్జించవచ్చన్నది వాటి ఎత్తుగడ. యుద్దంతో తమకు సంబంధం లేదని గడువు, ఒప్పందం మేరకు అప్పు తీర్చాల్సిందేనని బ్రెట్టన్ ఉడ్ కవలలు డిమాండ్ చేస్తున్నాయి. రష్యాకు చెల్లించాల్సిన 60 కోట్ల డాలర్లను 2015 నుంచి చెల్లించటం నిలిపివేసింది. ఉక్రెయిన్ బాండ్లు 70శాతం విలువను కోల్పోయాయి, సెకండరీ మార్కెట్లో 30శాతం మొత్తాలకు విక్రయిస్తున్నారు. పాత బాండ్లు ఉన్నవారు వాటి బదులు వడ్డీ ఎక్కువగా ఉన్న కొత్త బాండ్లు తీసుకొనేందుకు అంగీకరిస్తున్నారు. విదేశీ రుణ భారం మూడు సంవత్సరాల్లో 56 నుంచి 115 బిలియన్ డాలర్లకు పెరిగింది. వీటి కోసం ఉక్రెయిన్ నయా ఉదారవాద విధానాలతో కూడిన 325 షరతులను అంగీకరించింది.దానిలో భాగంగా 531 చర్యలను అమలు చేపడతామని పేర్కొన్నది.
దాడి ప్రారంభమైన తరువాత ఐరోపాలో ఉన్న 300 బిలియన్ డాలర్ల రష్యా ఆస్తులను స్థంభింప చేశారు. వాటిని విక్రయిచేందుకు ధైర్యం చేయలేదు.ఐరోపా యూనియన్ వీటి మీద రుణాలు తీసుకొని ఉక్రెయిన్‌కు అప్పుగా ఇస్తున్నది. స్థంభింపచేసిన రష్యా అస్తులను పెట్టుబడులుగా పెట్టి ప్రతి ఏటా ఐదు బిలియన్ యూరోల మేరకు ఐరోపా సమాఖ్య లబ్ది పొందుతున్నది. రష్యా మీద ఆంక్షలు విధించినప్పటికీ సమాఖ్యలోని ప్రైవేటు బాంకులు రష్యాలో మామూలుగానే పని చేస్తున్నాయి, అవి రష్యాకు భారీ మొత్తాలలో పన్నులు కడుతూ లావాదేవీలలో పెద్ద ఎత్తున లాభాలు సంపాదిస్తున్నాయి, వాటి మీద ప్రభుత్వాలు ఎలాంటి చర్యలూ తీసుకోవటం లేదు. తమ ఆంక్షలను ఉల్లంఘించిన వారి మీద చర్యలు తీసుకుంటామని ప్రకటించిన అమెరికా, ఐరోపా దేశాలు ఈ బాంకులను చూసీ చూడనట్లు వదలివేశాయి. పశ్చిమ దేశాల పావుగా మారిన జెలెనెస్కీ ఎడాపెడా అప్పులు చేస్తూ వాటిని యుద్ద అవసరాలకు వినియోగిస్తున్నాడు.దేశంలో అధిక ఆదాయం గలవారిని వదలివేసి అంతర్గతంగా 16.5శాతం వడ్డీ రేటుతో వారి నుంచే రుణాలు తీసుకుంటున్నాడు. లక్షలాది మంది జనం శరణార్దులుగా ఇరుగు పొరుగు దేశాలకు వెళ్లినా జెలెనెస్కీకి పట్టలేదు.మిలిటరీలో విధిగా చేరాలన్న నిబంధనల నుంచి సమాజంలో కులీనులకు ఏదో ఒకసాకుతో మినహాయింపు ఇచ్చాడు, కష్టజీవులను బలిపశువులుగా చేస్తున్నాడు. తీసుకున్న రుణాలను విదేశాలు, స్వదేశంలోని ధనికుల జేబుల్లోకి చేరే విధంగా చూస్తున్నాడు. అమెరికా అందించిన మిలిటరీ సాయాన్ని నగదు రూపంలో తీర్చలేక బదులుగా విలువైన ఖనిజాలున్న ప్రాంతాన్ని అప్పగించేందుకు సిద్దపడ్డాడు. ఇలాంటి వారు దేశం మొత్తాన్ని తాకట్టు పెట్టటానికి కూడా సిద్దపడతారు !
