తగ్గేదే లేదని క్షిపణి ప్రయోగంతో జవాబిచ్చిన ఉత్తర కొరియా – వాణిజ్య ఒప్పందాలతో సాగిన ట్రంప్‌ ఆసియా పర్యటన !

Tags

, , , , ,

ఎం కోటేశ్వరరావు

ఉత్తర కొరియా నేత కిమ్‌ జోంగ్‌ అన్‌కు అంగీకారమైతే తాను అతనితో కూడా భేటీ అవుతానని తన ఆసియా పర్యటనలో విలేకర్ల ప్రశ్నకు ట్రంప్‌ బదులిచ్చాడు. ఉత్తర కొరియాను అణ్వస్త్ర రహితం కావిస్తే పెద్ద బహుమతి( ఆంక్షల ఎత్తివేత) పొందుతారంటూ ట్రంప్‌ బిస్కెట్‌ వేసేందుకు చూశాడు. అయితే నా స్పందన ఇది అంటూ మంగళవారం నాడు సముద్రం మీద నుంచి ఉపరితలానికి క్రూయిజ్‌ క్షిపణిని ప్రయోగించి కిమ్‌ బదులిచ్చాడు. శత్రువుతో మాటలు కాదు చేతలే అని చెప్పినట్లయింది. అది జరిగేందుకు ఆస్కారం లేదనే చెప్పవచ్చు ! జపాన్‌ నుంచి బుధవారం నాడు దక్షిణ కొరియాకు వెళ్లే ముందు ఈ ప్రయోగం జరిపారు. తమ వద్ద ఉన్న అణ్వాయుధాల గురించి శత్రువులకు గుర్తు చేయటమే ఇదని ఉత్తర కొరియా అధికారిక మీడియా వర్ణించింది. ఈ ప్రయోగం భద్రతా మండలి విధించిన నిషేధాన్ని ఉల్లంఘించినట్లు కాదని, తమ అణ్వాయుధాల గురించి చర్చించటానికి తాము సిద్దం కాదనే సందేశం ఇచ్చినట్లని బిబిసి వర్ణించింది. దక్షిణ కొరియాలో జరిగే అపెక్‌ సమావేశానికి ఉత్తర కొరియా నేత కిమ్‌ హాజరు కావటం లేదు. వియత్నాంలో 2019లో ట్రంప్‌ ఆహ్వానం మేరకు కిమ్‌తో భేటీ జరిగింది. అయితే ఆ చర్చలు విఫలం కావటంతో తరువాత వారి మధ్య ఎలాంటి సమావేశమూ జరగలేదు. కిమ్‌కు అంగీకారమైతే తాను ఒక రోజు దక్షిణ కొరియాలో అదనంగా ఉంటానని ట్రంప్‌ విలేకర్లతో చెప్పాడు. దానికి కిమ్‌ నుంచి ఇంతవరకు ఎలాంటి జవాబు రాలేదు. అణు పరీక్షలు జరుపుతున్నందున ఉత్తర కొరియా మీద అమెరికా అనేక ఆంక్షలను అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. రష్యా మీద మరిన్ని ఆంక్షలు ప్రకటించిన తరువాత ఉత్తర కొరియా విదేశాంగ మంత్రి చోయి సన్‌ హుయి గత వారంలో మాస్కో వెళ్లి చర్చలు జరిపాడు. ట్రంప్‌ ఆసియా పర్యటన సందర్భంగా క్షిపణి పరీక్షలు నిర్వహించటం విశేషం.

మంగళవారం నాడు అమెరికా, జపాన్‌ మధ్య వాణిజ్య, విలువైన ఖనిజాల ఒప్పందం కుదిరింది.అధ్యక్షుడు ట్రంప్‌, జపాన్‌ ప్రధమ మహిళా ప్రధాని తకాయిచి టోక్యోలో సంతకాలు చేశారు.వివరాలు పూర్తిగా వెల్లడి కాలేదు. అమెరికాలో 550 బిలియన్‌ డాలర్ల మేర పెట్టుబడులు పెట్టేందుకు జపాన్‌ అంగీకరించగా ప్రతిగా దాని వస్తువులపై 15శాతం దిగుమతి పన్ను విధించేందుకు అమెరికా అంగీకరించింది. ట్రంప్‌కు కావాల్సినన్ని పొగడ్తలు తప్ప అమెరికాకు పెద్దగా ఒరిగిందేమీ లేదని డెమోక్రటిక్‌ పార్టీ మద్దతుదారైన న్యూయార్క్‌ టైమ్స్‌ పత్రిక వ్యాఖ్యానించింది. ఈ ఒప్పందాలను రెండు దేశాల మధ్య సంబంధాలలో ” నూతన స్వర్ణయుగం ” అని వర్ణించారు.అదిరింపులు బెదిరింపుల మధ్య జూలై నెలలోనే పెట్టుబడులు, పన్నుల గురించి ఒక అవగాహన కుదిరినట్లు డోనాల్డ్‌ ట్రంప్‌ ప్రకటించాడు. అయితే మంగళవారం నాడు సంతకాలు జరగటానికి ముందు చివరి క్షణం వరకు అనేక అనుమానాలు షికారు చేశాయి. పశ్చిమాసియాలో శాంతి, థారులాండ్‌-కంపూచియా మధ్య వివాదాన్ని పరిష్కరించటంలో ట్రంప్‌ పాత్రను తకాయిచి ఆకాశానికి ఎత్తారు. అసాధారణ చారిత్రక విజయాలుగా ఆమె వర్ణించారు. వారి చర్చల తరువాతే టోక్యోలోని అక్సాకా పాలెస్‌లో జరిగిన స్వాగత కార్యక్రమానికి ట్రంప్‌ హాజరయ్యాడు. ఈ ఒప్పందం గురించి ప్రశంసలు, విమర్శలు గతంలోనే వెల్లడయ్యాయి.

జపాన్‌ నుంచి అమెరికా ఇప్పటివరకు లక్ష కోట్ల డాలర్ల మేర రుణాలుగా తీసుకుంది. అమెరికా డాలర్లకోసం ప్రతిదేశాన్నీ బెదిరిస్తున్నది. అయితే తాజాగా కుదిరిన ఒప్పందం గురించి గతంలోనే ట్రంప్‌ మీద విమర్శలు వచ్చాయి. ఆ ఒప్పందంలో తరువాత ఎలాంటి మార్పులూ చేసినట్లు ఎవరూ ప్రకటించలేదు గనుక గత విమర్శలేమిటో ఒకసారి చూద్దాం. ఐదువందల యాభై బిలియన్‌ డాలర్ల మొత్తాన్ని ప్రభుత్వానికి ఇస్తే తమ ఇష్టం వచ్చినట్లు వినియోగించుకుంటామని, దాని మీద వచ్చే లాభాలలో 90శాతం తమకే అని ట్రంప్‌ వత్తిడి చేశాడు. అయితే ఆ మొత్తంలో కేవలం రెండు శాతం మాత్రమే పెట్టుబడిగా ఉంటుందని, మిగిలిన మొత్తం రుణాలు, రుణ హామీల వంటి ఇతర రూపాల్లో ఉంటుందని జపాన్‌ ప్రతినిధి వర్గనేత రోయెసీ అకజావా టీవీలో బహిరంగంగా చెప్పాడు. కొంత మంది అమెరికన్లకు జపాన్ను విక్రయించారని విమర్శిస్తున్నారని, లాభాల్లో 90శాతానికి అంగీకరించినందున నష్టం పెద్దగా ఉండదని దీనికి ప్రతిగా అమెరికా తగ్గించే పన్నుల వలన 68 బిలియన్‌ డాలర్ల మేర జపాన్‌కు లబ్ది కలుగుతుందని కూడా చెప్పాడు. బహుశా ఈ కారణంతోనే మంగళవారం నాడు ఒప్పందంపై సంతకాల తరువాత న్యూయార్క్‌ టైమ్స్‌ పత్రిక ప్రతికూలంగా వ్యాఖ్యానించిందని చెప్పవచ్చు. తమ దేశంలో పెట్టుబడులకు, పన్నులు విధింపుకు లంకెపెట్టటం ఒక జపాన్‌ విషయంలోనే కాదు. ఇప్పటికే ఐరోపా యూనియన్‌తో 600బిలియన్‌ డాలర్లు పెట్టుబడులు పెడితేనే 15శాతం పన్నులు విధిస్తామని లేకుంటే ఎక్కువ అని ట్రంప్‌ బెదిరించాడు.

వాణిజ్యం చేయటం, లాభాలు పిండుకోవటంలో అమెరికా, జపాన్‌ ఎవరికి ఎవరూ తీసిపోరు గనుక పరస్పర లబ్ది లేకుండా అంగీకరించే అవకాశం ఉండదని చెప్పవచ్చు. ముందే చెప్పుకున్నట్లు ఒక లక్షకోట్ల డాలర్లు అమెరికాకు అప్పు ఇవ్వటమేగాక మరో రెండులక్షల కోట్ల డాలర్ల మేర ఇప్పటికే జపాన్‌ పెట్టుబడులు పెట్టింది. జపాన్‌లో డాలర్లు గుట్టలుగా పడి ఉన్నాయి. ఎవరైనా అక్కడి బాంకుల్లో డబ్బుదాచుకుంటే వారే బ్యాంకులకు ఎదురు ఇవ్వాల్సి ఉంటుంది. తమ దేశంలో ఉన్న వడ్డీ రేట్లతో పోలిస్తే అమెరికాకు అప్పులు ఇవ్వటం జపాన్‌కు ఎంతో లాభం కలుగుతుంది. జపాన్‌లో తక్కువ వడ్డీ చెల్లించి జనాల నుంచి బాంకులు రుణాలు తీసుకుంటాయి, వాటిని ఎక్కువ వడ్డీ రేట్లకు అమెరికా, ఇతర దేశాలలో పెట్టుబడులుగా పెట్టి లాభాలు ఆర్జిస్తాయి, ఈ క్రమంలోనే అమెరికాకు అత్యధికంగా జపాన్‌ లక్ష కోట్ల డాలర్ల మేర రుణబాండ్లలో పెట్టుబడులు పెట్టింది. ఈ విషయంలో బ్రిటన్‌ రెండవ స్థానంలో ఉంటే చైనా మూడవదిగా ఉంది. అమెరికాలో ఉన్న జపాన్‌ కంపెనీలైన సోనీ,టొయోటా వంటి బహుళజాతి కంపెనీలు, ద్రవ్యపెట్టుబడి సంస్థలు అక్కడ పెట్టుబడులు పెట్టి లాభాలు సంపాదిస్తున్నాయి, వచ్చిన లాభాలను తిరిగి అక్కడే పెట్టుబడులుగా పెడుతున్నాయి. తాజా ఒప్పందంలో అమెరికా కార్లకు ద్వారాలు తెరిచేందుకు జపాన్‌ అంగీకరించినట్లు చెబుతున్నారు. గాలికిపోయే పేలపిండి కృష్ణార్పణం అన్నట్లు డీజిలు, పెట్రోలు తాగే అమెరికన్‌ కార్లను జపాన్‌లో కొనుగోలు చేసేదెవరు ? లేదూ అమెరికన్లు అమ్ముకోవాలనుకుంటే జపనీయుల అవసరం, అభిరుచులకు అనుగుణంగా సరసమైన ధరలకు అందచేస్తే ఇబ్బంది ఉండదు. అక్కడ అమెరికా కార్లకు డిమాండ్‌ కూడా తక్కువే గనుక వాటి దిగుమతులకు అనుమతించినా జపాన్‌ కార్ల మార్కెట్‌కు పెద్దనష్టమేమీ ఉండదు. జపాన్‌లో తలెత్తిన ఆర్థిక మాంద్యం కారణంగా జనాలు ప్రజా రవాణా వ్యవస్థ పట్ల మొగ్గుచూపుతున్నారు. నిర్వహణ ఖర్చు ఎక్కువగా ఉండే అమెరికన్‌ కార్లను పట్టించుకుంటారా ? గతంలో కార్లంటే అమెరికా, ఇప్పుడు జపాన్‌ ఆ స్థానాన్ని ఆక్రమించింది, జర్మనీ, దక్షిణ కొరియా వంటి దేశాలూ తక్కువ తినలేదు, విద్యుత్‌ కార్ల రంగంలో చైనా సవాలు విసురుతోంది. అందువలన ట్రంప్‌ విధించే పదిహేనుశాతం దిగుమతి పన్నుతో అమెరికా కంపెనీల యజమానులు కొంత కాలం పాటు ఊరట పొందవచ్చు తప్ప తరువాత పోటీకి అనుగుణంగా తయారుగాకపోతే అంతే సంగతులు.

ట్రంప్‌ ఆసియా పర్యటనలో వివిధ దేశాలతో ఒప్పందాలను కుదుర్చుకొనేందుకు కొన్ని షరతులను రుద్దినట్లుగా కనిపిస్తోంది. చిన్న చిన్న దేశాలలో ఎంత దొరికితే అంత అన్నట్లుగా విలువైన ఖనిజాల గురించి ఒప్పందాలు చేసుకున్నాడు. మలేషియా వస్తువుల మీద 19శాతం పన్నుల విధింపు అమల్లో ఉందని చెబుతూనే కొన్నిమినహాయింపులు ఇచ్చాడు.దీనికి ప్రతిగా అమెరికా వస్తువులు, గ్యాస్‌, వ్యవసాయ ఉత్పత్తులను మలేషియా కొనుగోలు చేయనుంది. అమెరికా కంపెనీ బోయింగ్‌ నుంచి 30 విమానాలను కొనుగోలు చేస్తామని, మరో 30 గురించి ఆలోచిస్తామని చెప్పింది. ఇవిగాక అమెరికాలో 70 బిలియన్‌ డాలర్లు పెట్టుబడులుగా పెట్టేందుకు అంగీకరించింది. అయితే కీలకమైన సెమీ కండక్టర్ల ఉత్పత్తి చేస్తున్న మలేషియా అమెరికా షరతులకు తలొగ్గలేదు. కంపూచియాతో కుదిరిన ఒప్పందం ప్రకారం అమెరికా వస్తువుల దిగుమతిపై ఎలాంటి పన్ను ఉండదు. విలువైన ఖనిజాల శుద్ధి వంటి ప్రక్రియకు అమెరికా పెట్టుబడులను అనుమతిస్తుంది. వియత్నాంపై విధించిన 46శాతం పన్నులను 20శాతానికి తగ్గించేందుకు అమెరికా దిగివచ్చింది. దీనికి ప్రతిగా ఎనిమిది బిలియన్‌ డాలర్లతో 50 బోయింగ్‌ విమానాలను కొనుగోలు చేస్తుంది. వీటితో పాటు అమెరికా వ్యవసాయ ఉత్పత్తులను కూడా దిగుమతి చేసుకుంటుంది.చైనా నుంచి దిగుమతి చేసుకున్న విడిభాగాలతో తయారు చేసి అమెరికాకు ఎగుమతి చేసే వస్తువులపై పన్ను వివాదం కొనసాగుతూనే ఉంది. ఒక నిర్దిష్ట నిర్వచనం లేదు. థారులాండ్‌ వస్తువులపై 19శాతం పన్నుల నుంచి అనేక వస్తువులకు మినహాయింపు ఇస్తారు. ఎనభై విమానాలను థారు కొనుగోలు చేస్తుంది. దక్షిణ కొరియా వస్తువుల మీద పన్ను 15శాతానికి పరిమితం చేయాలంటే తమ దేశంలో 350 బిలియన్‌ డాలర్ల మేర పెట్టుబడులు పెట్టాల్సిందే అని అమెరికా వత్తిడి చేస్తున్నది.అది దక్షిణ కొరియా జిడిపిలో 6.5శాతానికి సమానం. అంత పెట్టుబడి పెడుతుందా అన్నది ప్రశ్న.

డోనాల్డ్‌ ట్రంప్‌ కౌలాలంపూర్‌లో జరుగుతున్న ఆసియన్‌ ప్లస్‌ 3 (ఏపిటి) సమావేశాలకు, తరువాత దక్షిణ కొరియాలో జరిగే మరోసభలో పాల్గ్గొనేందుకు వస్తూ అనేక దేశాలతో విలువైన లోహాలు, ఇతర ఒప్పందాలు కుదుర్చుకొనేందుకు డోనాల్డ్‌ ట్రంప్‌ వచ్చాడు. పది ఆగేయాసియా దేశాలతో కూడిన ఆసియన్‌ కూటమిలో తాజాగా తైమూర్‌-లెస్తే చేరింది. ఇవిగాక చైనా, జపాన్‌, దక్షిణ కొరియా అనుబంధంగా ఉన్న కారణంగా ఆసియన్‌ ప్లస్‌ మూడు అని పిలుస్తున్నారు. ధనిక దేశాలు అనుసరిస్తున్న రక్షణాత్మక విధానాల నుంచి తట్టుకోవాలంటే ఈ కూటమి దేశాల మధ్య సహకారాన్ని విస్తరించుకోవాలని చైనా ప్రధాని లీ క్వియాంగ్‌ కోరాడు. గత కొద్ది సంవత్సరాలుగా తూర్పు ఆసియా వేగంగా వృద్ది చెందుతున్నది. ఇదే సమయంలో కొన్ని సమస్యలను కూడా ఎదుర్కొంటున్నది. ఈ సమావేశాలకు తమ మంత్రిద్వారా ఇండోనేషియా అధ్యక్షుడు ప్రభూ సుబియాంతో ఒక సందేశం పంపాడు. ఆర్‌సిఇపితో సమన్వయం చేసుకొని దాన్నొక వేదికగా ఆసియన్‌ దేశాలు వినియోగించుకోవాలని కోరాడు.ఏకపక్ష వైఖరితో వ్యవహరిస్తున్న దేశాలను ఐక్యంగా ఎదుర్కొవాలని దక్షిణ కొరియా అధ్యక్షుడు లీ జేయి మయుంగ్‌ కోరాడు. రక్షణాత్మక చర్యలతో పాటు సరఫరా గొలుసుల సమస్యలను కూడా ఎదుర్కొంటున్నట్లు చెప్పాడు. పెరుగుతున్న రక్షణాత్మక ధోరణులు, సరఫరా వ్యవస్థల్లో వస్తున్న మార్పులు ఆసియన్‌ దేశాలకు హెచ్చరికలు పంపుతున్నాయని, వాటిని చూసి నిర్ఘాంతపోయి అచేతనంగా ఉండరాదని మలేసియా ప్రధాని అన్వర్‌ చెప్పాడు. ఇప్పుడున్న భాగస్వామ్యాన్ని మరింతగా మెరుగుపరుస్తూ కొత్త భాగస్వామ్యాల కోసం ధైర్యంగా వ్యవహరించాలన్నాడు. వర్తమాన సంవత్సరంలో జనవరి నుంచి సెప్టెంబరు వరకు తొమ్మిది నెలల కాలంలో చైనా మరియు ఆసియన్‌ దేశాల మధ్య వాణిజ్య లావాదేవీలు 782 బిలియన్‌ డాలర్ల మేర జరిగాయి. అంతకు ముందు సంవత్సరంతో పోలిస్తే 9.6శాతం ఎక్కువ. కౌలాలంపూర్‌ సమావేశంలో చైనా-ఆసియన్‌ దేశాల స్వేచ్చావాణిజ్య ప్రాంతం 3.0 ఒప్పందం కుదిరింది. అమెరికా పన్నులకు అందరం బాధితులమే అని దాని రక్షణాత్మక వైఖరిని వ్యతిరేకించాలని ఆసియన్‌ దేశాలన్నింటా ఏకీ భావం కనిపించింది. అయితే వివిధ కారణాలతో అనేక దేశాలు అమెరికాతో నేరుగా ఒప్పందాలు చేసుకుంటున్నప్పటికీ ఒక్కటిగా ఉండకపోతే నష్టమనే భావన ఏర్పడింది.

గత ఏడాది లావోస్‌లో జరిగిన 27వ సమావేశం పెరుగుతున్న ప్రాంతీయ సహకారం గురించి చర్చించింది, దాన్ని మరింతగా ముందుకు తీసుకుపోయేందుకు కౌలాలంపూర్‌ సమావేశం దృష్టి సారించింది, ఇది అనివార్యమైన పరిణామం. అన్ని దేశాల మీద ట్రంప్‌ పన్నుల దాడి మొదలు పెట్టిన పూర్వరంగంలో దానికి గురయ్యే దేశాలకు ఇంతకు మించి మరొక మార్గం లేదు.ఈ కూటమి లేదా వ్యవస్థ 1997లో ఉనికిలోకి వచ్చింది. ఆసియన్‌ కూటమిలో బ్రూనీ, కంపూచియా, ఇండోనేషియా, లావోస్‌, మలేషియా, మయన్మార్‌, ఫిలిప్పీన్స్‌, సింగపూర్‌, థారులాండ్‌, వియత్నాం సభ్యులుగా ఉండగా పదకొండవ దేశంగా తైమూర్‌-లెస్తే చేరింది. ఇప్పుడు ప్రపంచ దృష్టి అంతా దక్షిణ కొరియాలో జరిగే ఆసియా -పసిఫిక్‌ ఆర్థిక సహకార వేదిక (ఎపిఇసి) సమావేశాల మీద ఉంది. అక్కడ 30వ తేదీన చైనా అధినేత షీ జింపింగ్‌తో ట్రంప్‌ భేటీ కానున్నాడు. విలువైన ఖనిజాల ఉత్పత్తులపై చైనా ఆంక్షలు విధించిన తరువాత కొద్ది రోజుల క్రితం ఒక ఒప్పందం జరిగినట్లు వార్తలు వచ్చాయి. తుది ఒప్పందం మీద ఇరు దేశాల నేతలు సంతకాలు చేయవచ్చని చెబుతున్నారు.

సముద్రంలో చైనా డేటా సెంటర్‌ : నిజంగా నరేంద్ర మోడీ, చంద్రబాబు భవిష్యత్‌ దార్శనికులా !

Tags

, , , , , , , , ,

ఎం కోటేశ్వరరావు

సముద్రంలో చైనా నిర్మించిన పదమూడు వందల టన్నుల బరువుగల డేటా సెంటర్‌ ఆదివారం నాడు(2025 అక్టోబరు26న) ప్రారంభమైంది. ఇది గాలి మరలతో ఉత్పత్తి చేసిన విద్యుత్‌ను వినియోగించనుంది. హై క్లౌడ్‌ అనే కంపెనీ మొదటి దశలో భాగంగా 24మెగావాట్ల కేంద్రాన్ని షాంఘై తీరంలో నెలకొల్పింది. న్యూస్‌ అట్లాస్‌ వెల్లడించిన సమాచారం ప్రకారం సముద్రపు ఒడ్డున నిర్మించిన గాలి మరల విద్యుత్‌ కేంద్రం నుంచి 95శాతం విద్యుత్‌ను ఈ కేంద్రానికి సరఫరా చేస్తారు, సముద్రపు నీటిని చల్లబరిచేందుకు వినియోగిస్తారు. మొత్తం 22.6 కోట్ల డాలర్ల ఖర్చుతో నిర్మించిన ఈ కేంద్రంలో సాంప్రదాయపు డేటా సెంటర్ల కంటే 23శాతం విద్యుత్‌ వినియోగం తగ్గుతుంది. సముద్రంలో 114 అడుగుల అడుగున ఏర్పాటు చేసిన ఈ కేంద్రంలోని ఒక్కో గదిలో 4 నుంచి ఐదు వందల సర్వర్లు ఉంటాయి. సముద్రంలో ఏర్పాటు చేసిన టెలికాం కేబుళ్ల ద్వారా ఈస్ట్రన్‌ డేటా, వెస్ట్రన్‌ కంప్యూటింగ్‌ వ్యూహం ప్రకారం ప్రధాన భూభాగంలోని కేంద్రానికి అనుసంధానం చేశారు. రానున్న రోజుల్లో ఇలాంటివే మరో వందగదులను నిర్మించి విస్తరిస్తారు. మైక్రోసాఫ్ట్‌ కంపెనీ చైనాలో 2015లో పైలట్‌ ప్రాజక్టుగా సముద్రంలో ఒక డాటా కేంద్రాన్ని నిర్మించింది. ప్రాజెక్ట్‌ నాటిక్‌ పేరుతో చేసిన ఈ ప్రయోగానికి స్వస్తి పలికి 2024జూన్‌లో దాన్ని సముద్రంలో ముంచివేసింది. ఆదివారం నాడు సముద్రంలో తొలి వాణిజ్య డాటా కేంద్రాన్ని నిర్మించి ప్రారంభించిన తొలి దేశంగా చైనా చరిత్రకెక్కింది. ఇలాంటివే మరో రెండు నిర్మాణంలో ఉన్నాయి. ఈ కేంద్రం చైనాలో అతి పెద్ద తొలి స్వేచ్చా వాణిజ్య కేంద్రం ఉన్న హైనాన్‌ సమీపంలో ఉంది. పూర్తిగా విదేశీ పెట్టుబడులతో నిర్మించారు.

విశాఖలో అదానీ, ఎయిర్‌టెల్‌ కంపెనీలతో కలసి గూగుల్‌ నిర్మించనున్న డేటా కేంద్రం ఎంత మందికి ఉపాధి కల్పిస్తుందన్నది చర్చ. లింక్‌డ్‌ఇన్‌లో వచ్చిన ఒక విశ్లేషణ జర్మనీలోని బిఎఎస్‌ఎఫ్‌ రసాయన కంపెనీతో డేటా సెంటర్ల ఉపాధిని పోల్చింది. సదరు జర్మనీ సంస్థ 684మెగావాట్ల విద్యుత్‌ను వినియోగిస్తుంది, 50వేల మందికి పూర్తి స్థాయి ఉపాధిని కల్పిస్తున్నది. అదే జర్మనీలో డాటా కేంద్రం 2,283మెగా వాట్ల విద్యుత్‌ను వినియోగించే చోట పూర్తి కాలపు ఉపాధి 6,849 నుంచి 13,699 మందికి చూపుతుంది. రసాయన ఫ్యాక్టరీ ఒక మెగావాట్‌కు 73 మందికి ఉద్యోగ కల్పన చేస్తుంటే డేటా సెంటర్‌ ఒక మెగావాట్‌కు 3 నుంచి ఆరు ఉద్యోగాలను ఇస్తున్నది. గూగుల్‌ ఆధునిక సాంకేతిక ప్రక్రియలను వినియోగిస్తుంది గనుక ఇంకా తగ్గవచ్చు. ఆ లెక్కన చూసినా విశాఖలో నిర్మించే ఒక గిగావాట్‌(వెయ్యి మెగావాట్లు) కేంద్రం మూడు నుంచి ఆరువేల మందికి పర్మనెంటు ఉద్యోగాలను కల్పిస్తుంది. కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్‌ చెప్పిన అంకెలు దీనికి దగ్గరగా ఉన్నాయి. దానికి భిన్నంగా రాష్ట్ర మంత్రి లోకేష్‌ చెప్పారు. ఇద్దరికి సమాచార వనరు ఏమిటి ? ఈ విషయాన్ని చెప్పటానికి బిడియపడాల్సిందేముంది. అదే గూగుల్‌ను అడిగితే అందించిన ఇతర విశ్లేషణలు కూడా దీనికి దగ్గరగానే ఉన్నాయి. ప్రైవేటు కంపెనీలన్నీ సాధ్యమైనమేరకు తక్కువ మందితో పని చేయించుకొనేందుకు చూస్తాయి. కన్సిడర్‌ మైక్రోసాఫ్ట్‌ ఏర్పాటు చేసిన సిడ్నీలోని డాటా కేంద్రం 2023లో అకస్మాత్తుగా ఆగిపోయింది. తగినంత మంది సిబ్బంది లేని కారణంగా జరిగిన ఆ అంతరాయం 46 గంటల పాటు సేవల నిలిపివేతకు దారితీసింది. అప్‌టైమ్‌ ఇనిస్టిట్యూట్‌ అనే సంస్థ సిబ్బంది కొరత గురించి పేర్కొన్నది. ప్రపంచ డాటా సెంట్లర్లలో 2019లో ఇరవైలక్షల మంది పూర్తి కాలపు ఉద్యోగులు ఉంటే 2025 నాటికి కేంద్రాలు పెరిగినా 23లక్షల మంది మాత్రమే ఉన్నారు. ప్రత్యక్ష, పరోక్ష ఉద్యోగులా అన్నది వివరణ లేదు. ప్రపంచంలో ఇప్పుడున్న 122 గిగావాట్ల సామర్థ్యంలో సగటు తీసుకుంటే ఒక్కో గిగావాట్‌కు 18,700 ఉన్నట్లు కనిపిస్తున్నది. విశాఖ గూగుల్‌ సెంటర్‌కు అందరూ కలసి 20 నుంచి 30వేల మంది ఉంటారని కూడా పెమ్మసాని చంద్రశేఖర్‌ చెప్పారు. డాటా కంపెనీలు సిబ్బందిని చేర్చుకోవటం, నిలుపుకోవటంలో తీవ్ర సమస్యలను ఎదుర్కొంటున్నాయి. చిన్న కేంద్రాలు(ఒకటి నుంచి ఐదు మెగావాట్లు) 8 నుంచి 15 మంది, ఐదు నుంచి ఇరవై మెగావాట్ల కేంద్రాలు 15 నుంచి 35 మంది, ఇరవై అంతకు మించిన సామర్ధ్యం కలిగినవి 35 మందికి పైగా, 40 మెగావాట్ల సంస్థలు 45 మందిని, వంద మెగావాట్లు అంతకు మించి సామర్ధ్యం కలిగినవి కొద్దిమందితోనే నిర్వహిస్తున్నాయి, ఎందుకంటే యాంత్రీకరణ మరియు నిర్ణీత ప్రమాణాలతో ఉండే వ్యవస్థలు అందుకు దోహదం చేస్తున్నాయి. నియమించుకుంటున్నాయి. డేటా సెంటర్లలో మొత్తం 230 రకాల సిబ్బంది అవసరం అని చెబుతున్నారు. అయితే చిన్న సంస్థలు అంతమందిని నియమించవు, అవి అవసరమైనపుడు పొరుగు సేవలను ఉపయోగించుకుంటాయి. సగం డేటా సెంటర్లు అవసరమైన నిపుణులు దొరక్క ఇబ్బందులు పడుతున్నాయి.

రెండును రెండుతో కలిపినా, హెచ్చవేసినా ఫలితం నాలుగే. ఇది చెప్పటానికి గణితమేథావులతో పనిలేదు. డేటా సెంటర్లతో కలిగే పర్యావరణహాని, విషపూరితమైన వ్యర్ధాల వంటి ఇతర దుష్ఫలితాల గురించి వైఎస్‌ జగన్మోహనరెడ్డి చెప్పినా(అఫ్‌ కోర్స్‌ అధికారంలో ఉన్నపుడు ఈ పెద్దమనిషి వీటి గురించి చెప్పలేదు, ఇప్పుడు చంద్రబాబు నాయుడు కూడా నోరు విప్పరు) ఆ రంగం గురించి అధ్యయనం చేసినవారు చెప్పినా విషయం ఒకటే. ఎవరైనా రాజకీయాలతో నిమిత్తం లేని వారు చెబితే చూశారా రాష్ట్ర అభివృద్దిని వ్యతిరేకించేవారు జగన్‌తో చేతులు కలిపి అవే వాదనలు చేస్తున్నారంటూ ప్రచారదాడికి దిగుతున్నారు. అంటే నోరు మూయించేందుకు ఇదొక రకం నియంతృత్వపోకడతప్ప మరొకటి కాదు. తేమ కారణంగా యంత్రాలు పనికి రాకుండా పోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నందున అమెరికాలోని డేటా కేంద్రాలన్నీ పొడివాతావరణం ఉండే ప్రాంతాల్లోనే ఏర్పాటు చేశారని చెబుతున్నారు.పెట్టుబడిలో నాలుగో వంతు సబ్సిడీలు, సంవత్సరాల తరబడి రాయితీ ధరలకు నీరు, విద్యుత్‌ అందచేస్తున్న తరువాత ఏ పెట్టుబడిదారుడు మాత్రం చంద్రబాబు నాయుడి దరిచేరడు ! డాటా సెంటర్‌ మాప్‌ డాట్‌ కామ్‌ సమాచారం ప్రకారం గూగుల్‌కు ప్రపంచంలో 113 డాటా సెంటర్లు ఉండగా వాటిలో 68 పని చేస్తున్నాయి, మిగిలినవి వివిధ దశల్లో ఉన్నాయి. వీటిలో ఎందరు ఉద్యోగులు పని చేస్తున్నారని అడిగితే సమాచారం లేదని బదులు వచ్చింది. ప్రపంచంలో గూగుల్‌ సంస్థలో లక్షా 83వేల మంది పనిచేస్తున్నారనే సమాచారం ఉంది తప్ప ఏ విభాగంలో ఎందరు అన్నది లభ్యం కావటం లేదు. ఎవరికైనా దొరికితే ఈ విశ్లేషణకు జత చేస్తాను. మానవహక్కుల ఫోరం(హెచ్‌ఆర్‌ఎఫ్‌) సమాచారం ప్రకారం అమెరికాలోని అష్‌బర్న్‌ మరియు లీస్‌బర్గ్‌ డాటా సెంటర్లు రెండిలోనూ కలిపి ప్రత్యక్షంగా 400 మందికి పరోక్షంగా 3,100 మంది ఉపాధి దొరుకుతున్నట్లు పేర్కొన్నది.లోకేష్‌ చెప్పినట్లు లక్షా 88వేల ఉద్యోగాల్లో 88వేలు పర్మనెంటు అనుకుంటే మొత్తం గూగుల్‌ ఉద్యోగులు విశాఖలోనే ఉంటారన్నట్లుగా భావించాలి, అది జరిగేదేనా !

ఇంటర్నెట్‌ వెతుకులాటలో డాటా సెంటర్ల ఉపాధి గురించి ఎవరెటు తిప్పి చెప్పినా పెట్టుబడులు, స్థలాల విస్తీర్ణం ఎక్కువ, ప్రత్యక్ష ఉపాధి తక్కువ, పరోక్ష ఉపాధి గురించి మాత్రమే వెల్లడవుతున్నది. పరోక్షం అంటే భవనాల నిర్మాణ సమయంలో దొరికే ఉపాధి, వాటి చుట్టూ ఉండే నివాసాలతో కలిగే లబ్ది గురించి మాత్రమే ప్రస్తావన ఉంటున్నది. ఆ లెక్కన బడా పరిశ్రమలు అంతకంటే ఎక్కువ కల్పిస్తున్నాయి. వస్తూత్పత్తిలో చైనాను పక్కకు నెట్టే ప్రపంచ ఉత్పాదక కేంద్రంగా దేశాన్ని మారుస్తామన్న మాటలు ఇప్పుడు ఎకువగా వినిపించటం లేదు. డిజిటల్‌ ఆర్థిక వ్యవస్థ గురించి కబుర్లు పెరిగాయి.ఒకదానికి ఒకటి పోటీ కాదు, పరస్పరం సాయం చేసుకొనేవే.పెట్టుబడులు ఎక్కువ ఉపాధి తక్కువ ఉండే టెక్‌ కంపెనీల కోసం మోడీ, చంద్రబాబు వంటి వారు వెంపర్లాడుతున్నారు. ఒకసారి భవనాల నిర్మాణాలు పూర్తయిన తరువాత తాత్కాలిక కార్మికులకు పని ఉండదు. ఆటోమేషన్‌ ప్రధాన ప్రక్రియగా నడిచే ఈ కేంద్రాలలో కీలకమైన సిబ్బంది ఎవరంటే సెంటర్ల మేనేజర్లు, నెట్‌వర్క్‌ మరియు వ్యవస్థల అడ్మినిస్ట్రేటర్లు, సెక్యూరిటీ నిపుణులు, సాంకేతిక నిపుణులు, వారికి సహాయ సిబ్బంది.

ఆర్థిక ప్రయోజనాల విషయానికి వస్తే ఏటా పదివేల కోట్ల మేరకు రాష్ట్ర ప్రభుత్వానికి రాబడి వస్తుందని తెలుగుదేశం పార్టీ నేతలు చెబుతున్నారు. డేటా సెంటర్లు అవసరమే, అయితే అవి కొత్త సమస్యలను సృష్టించకూడదు. మనదేశంలో అనేక చోట్ల ఏర్పాటు చేస్తున్న పరిశ్రమల నుంచి వెలువడుతున్న కాలుష్యం గురించి తెలిసిందే. పాలకులు పరిశ్రమలకు అనుమతులు ఇచ్చారంటే ఉత్పత్తులకు తప్ప కాలుష్యానికి కాదు, దాన్ని నివారించేందుకు పరిశ్రమలే చర్యలు తీసుకోవాలన్న నిబంధనలు ఉంటాయి. వాటిని అమలు చేస్తే తమ లాభాలు తగ్గుతాయని తిలోదకాలు ఇస్తున్నాయి. ప్రభుత్వాలు పట్టించుకోవటం లేదు. ఉదాహరణకు పిఠాపురం నియోజకవర్గం ఉప్పాడ ప్రాంతంలో ఫార్మా, ఇతర సంస్థల నుంచి వెలువడుతున్న కాలుష్యం సమీపంలోని సముద్రంలో కలుస్తున్నది. దాంతో మత్స్యకారుల ఉపాధికి దెబ్బతగులుతున్నది. పరిష్కరించండి మహానుభావా అని ఉపముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ను అడిగితే ఈ మధ్యే మాట్లాడుతూ పరిశ్రమలకు అనుమతి ఇచ్చింది తాము కాదని, వంద రోజుల గడువులో పరిష్కరిస్తానని చెప్పారు. అధికారానికి వచ్చి 15నెలల తరువాత ఈ మాటలు చెప్పిన పెద్ద మనిషి ఇంతకాలం ఏం చేస్తున్నట్లు ?

డేటా అనేక విధాలుగా కీలక పాత్ర పోషిస్తున్న పూర్వరంగంలో మనదేశం కూడా వెనుకపడకూడదు. కానీ నరేంద్రమోడీ లేదా రెండింజన్ల పాలనలో ఉన్న ప్రభుత్వాలు గానీ ఎంతో నిర్లక్ష్యం చేశాయన్నది అంకెలే చెబుతున్నాయి.2019లో 350 మెగావాట్ల సామర్ధ్యం ఉండగా 2025 నాటికి 1,350 మెగావాట్లకు చేరుతుందని చెబుతున్నారు. ఈ రంగంలో మిగిలిన దేశాలు ఎంతో ముందున్నాయి.దీనికి కూడా నెహ్రూయే కారణం అని చెబుతారేమో తెలియదు. ముందు చూపు లేకపోవటం తప్ప మరొకటి కాదు.చైనాలో గూగుల్‌, ఫేస్‌బుక్‌, వాట్సాప్‌లు లేవు, మైక్రోసాఫ్ట్‌ కొన్ని ప్రయివేటు రంగ సంస్థల్లో తప్ప ప్రభుత్వం వినియోగించటం లేదు.కృత్రిమ మేథ, క్వాంటమ్‌ కంప్యూటింగ్‌లో చైనా వెనుకబడిందని శత్రువులు కూడా చెప్పలేరు.తాజా సమాచారం ప్రకారం 2024నాటికి చైనాలో డేటా వాణిజ్య విలువ 47.23 బిలియన్‌ డాలర్లు కాగా 2030 నాటికి అది 97.30బి.డాలర్లకు పెరుగుతుందని రిసర్చ్‌ అండ్‌ మార్కెట్స్‌ సంస్థ పేర్కొన్నది. స్టాటిస్టా సంస్థ విశ్లేషణ మరోవిధంగా ఉంది.అమెరికాలో 2025 నాటికి డాటా సెంటర్ల ఆదాయం 171.9 బిలియన్‌ డాలర్లు, కాగా చైనాలో 103.19 బిలియన్‌ డాలర్లని 2030 నాటికి 142.64 బి.డాలర్లకు పెరుగుతుందని అంచనా. మరో సమాచారం ప్రకారం ప్రపంచ డేటా సెంటర్ల సామర్ధ్యం 2024నాటికి 122.2 గిగావాట్లు. దీనిలో అమెరికా 53.7(44శాతం) కలిగి ఉండగా చైనా 31.9 గిగావాట్లు కలిగి ఉంది. మూడో స్థానంలో ఒక కూటమిగా ఐరోపా యూనియన్‌ 11.9 గిగావాట్లు, మనదేశం 3.6గా ఉంది.చైనాలో ఇటీవల జత చేసిన సామర్ధ్యాన్ని పని చేయించటం లేదని వార్తలు వచ్చాయి. దీన్ని బట్టి అర్ధం అవుతున్నదేమిటి ? దేశం వ్యవసాయ, పారిశ్రామిక, సేవారంగాలన్నింటా వృద్ది చెందితేనే డేటా కేంద్రాలకు చేతినిండా పని ఉంటుంది. గడచిన పదకొండు సంవత్సరాలుగా కబుర్లు తప్ప అభివృద్ధి లేని కారణంగా డేటా సెంటర్ల సామర్ధ్యం కూడా పెరగలేదన్నది స్పష్టం.విశ్లేషణలను కొనుగోలు చేసేవారు లేకపోతే రేపు విశాఖ గూగుల్‌ సెంటర్‌ అయినా ఈగలు తోలుకుంటూ కూర్చోవాల్సిందే.

దేశాన్ని, రాష్ట్రాన్ని వికసిత్‌ భారత్‌లో ఎక్కడికో తీసుకుపోతామని ప్రధాని నరేంద్రమోడీ, ఆయన అడుగుజాడల్లో లేదా అడుగులకు మడుగులద్దుతున్న ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అనేక మంది దృష్టిలో దేశంలో అతి పెద్ద దార్శనికులు, ఇతరులకు తట్టనివి అనేకం వారికి కనిపిస్తాయని చెబుతారు. ఆ ప్రచారం వలన దేశానికి ఎంత లాభమో తెలియదు గానీ నష్టం కలిగిస్తున్నారంటే ఎవరూ నొచ్చుకోవాల్సిన అవసరం లేదు. పరిశోధన మరియు అభివృద్ధి(ఆర్‌ అండ్‌ డి) నేడు ప్రపంచాన్ని ఎలా నడిపిస్తున్నాయో చెప్పనవసరం లేదు.తన పాలనలో జిడిపిని పదకొండవ స్థానం నుంచి నాలుగవ స్థానానికి తెచ్చిన ఘనత నాదే అంటారు మోడీ. కాసేపు అంగీకరిద్దాం, ఆ పురోగతి ఇతర రంగాల్లో ఉందా ? వాటిలో కీలకమైన పరిశోధనకు కేటాయింపుల సంగతేమిటి ? 1995-96 నుంచి 2014-15వరకు రెండు దశాబ్దాల వార్షిక సగటు జిడిపిలో 0.73 శాతం ఉంది. యుపిఏ పాలనలో 2008-09లో జిడిపిలో 0.8శాతం నిధులు కేటాయిస్తే మోడీ ఏలుబడిలో 2017-18లో 0.7, ఇప్పుడు 0.64శాతానికి తగ్గించారు. దీనికైతే జవహర్‌లాల్‌ నెహ్రూ కారణం కచ్చితంగా కాదు. అన్నీ వేదాల్లో ఉన్నాయష అనే భావజాలంతో నడుస్తున్న కేంద్ర ప్రభుత్వ పెద్దల ఈ నిర్వాకాన్ని చంద్రబాబు నాయుడు సమర్ధిస్తారా ? 2013 నాటి సైన్స్‌ మరియు టెక్నాలజీ విధానంలో, 2017-18 ఆర్థిక సర్వేలో కూడా కనీసం రెండు శాతం కేటాయించాలని చెప్పిన అంశం ఎవరికీ తెలియదా ? ఇద్దరు నేతలు దేశ దేశాలు తిరుగుతున్నారు కదా ఎక్కడ ఎంత మొత్తం ఖర్చు చేస్తున్నారో తెలుసుకోరా ? ఎందుకీ నిర్లక్ష్యం ? మన అభివృద్ధి మీద గణనీయమైన ప్రభావం చూపాలంటే 2047నాటి వరకు కనీసం ఒక శాతం, ఆదర్శవంతంగా(ఐడియల్‌) ఉండాలంటే మూడుశాతం చొప్పున ఖర్చు చేయాలని నిపుణులు చెబుతున్నారు. పిండికొద్దీ రొట్టె, పరిశోధనా రంగంలో మనం ప్రపంచ బస్‌ను అందుకోకుండా చేసింది ఎవరంటే ఎవరిని చూపాలి ? పరిశోధనలకు మనం తక్కువ కేటాయిస్తున్నా, పరిశోధనా పత్రాలు గణనీయంగానే మనవారు సమర్పిస్తున్నారుగా అని సమర్ధించుకొనే వారిని చూసి నవ్వాలో ఏడవాలో అర్ధం కావటం లేదు ! ఎలాంటి పాలకులను మోస్తున్నాంరా బాబూ అని తల పట్టుకోవాలి !!

సంబంధిత మరో విశ్లేషణ దిగువ లింక్‌లో చదవవచ్చు ;

మేథోమధనం : డేటా సెంటర్లంటే గోడౌన్లా ! ఉత్పత్తి కేంద్రాలా !! జగన్‌, చంద్రబాబు చెబుతున్నదానిలో నిజానిజాలేమిటి ?
https://vedikaa.com/2025/10/25/are-data-centers-godowns-or-production-houses-what-is-the-truth-about-ycp-and-tdp-claims-on-employment/

మేథోమధనం : డేటా సెంటర్లంటే గోడౌన్లా ! ఉత్పత్తి కేంద్రాలా !! జగన్‌, చంద్రబాబు చెబుతున్నదానిలో నిజానిజాలేమిటి ?

Tags

, , , ,

ఎం కోటేశ్వరరావు

ఆంధ్ర ప్రదేశ్‌లో కొద్ది రోజుల పాటు చర్చ నడిచింది. ఇప్పుడు పాతబడిపోయింది, జనం కూడా మరచిపోయారేమో ! చంద్రబాబు నాయుడు, ఆయన కుమారుడైన మంత్రి లోకేష్‌ ఎడాపెడా దేశదేశాలు తిరిగి పుంఖాను పుంఖాలుగా రాష్ట్రానికి పెట్టుబడులు తెస్తుంటే ఉబ్బితబ్బిబ్బు అవుతున్నవారు ఎన్నని గుర్తు పెట్టుకుంటారు.ఉపముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ ఏం చేస్తున్నారన్నది పట్టించుకోవాల్సిన అంశం కాదు. బాక్సాఫీసు వద్ద తన సినిమాల గురించి ఆలోచిస్తున్నట్లుగా కనిపిస్తోంది. ముందే చెప్పుకున్న చర్చ ఏమిటంటే డేటా సెంటర్‌ అంటే ఏమిటి ? అదో గోడౌన్‌ రెండు వందల మంది కంటే పని చూపదు, కాదు లక్షలాది మందికి ఉద్యోగాలను కల్పిస్తుంది. ఆంధ్రప్రదేశ్‌లో వైసిపి, తెలుగుదేశం, దానికి వంత పాడే జనసేన, బిజెపి నేతల నుంచి వెలువడుతున్న మాటల సారమిది. గూగుల్‌ డేటా సెంటర్‌ వలన 1.88లక్షల ఉద్యోగాలు వస్తాయని మంత్రి లోకేష్‌ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఎవరైనా ఈ వాదనలను వ్యతిరేకిస్తే ఒక ముద్ర, సమర్ధిస్తే మరో ముద్ర. మూడో పక్షం వారు ఎవరైనా ఈ రెండు వాదనలతో ఏకీభవించినా, లేక అదే మాదిరి చెప్పినా వారితో రంకు కట్టి చీల్చి చెండాడుతున్నారు. అందుకనే మేథావులు నోరు విప్పటం లేదా లేక రంగుపడుద్ది అని భయపడుతున్నారా ? పోనీ మీడియా మంచీ-చెడును విశ్లేషించే వారేం చెబుతున్నారో పాఠకులు, వీక్షకులకు అందించేందుకు చూస్తున్నాదా అంటే అదీ లేదు. తాము సమర్ధించే పార్టీలు, వ్యక్తులు, శక్తుల ప్రయోజనాలకు హాని లేవనుకున్నవాటిని మాత్రమే వడగట్టి అందచేస్తున్నది. అందువలన రాసేవారు కూడా అనవసర ఆయాసం ఎందుకని ఊరుకొని ఉండవచ్చు. రెండు రెళ్లు నాలుగు అని చంద్రబాబో, జగనో చెబితే ఎవరైనా అవును అన్నారా వారి ఖర్మ కాలిందే, రంగుపడుద్ది. జనం విచక్షణా రహితంగా తయారయ్యారా అంటే వారిని అలా తయారు చేశారు అని చెప్పక తప్పదు. జగన్‌కు ఓటేసిన వారందరూ ఆయన చెప్పిందే వేదంగానూ, లేదా మూడు పార్టీల కూటమికి మద్దతు ఇచ్చిన వారందరూ ఆ పార్టీల నేతలు చెప్పిందే పరమ సత్యంగా గుడ్డిగా భావిస్తున్నట్లు కనిపిస్తోంది, వేరేది ఏదీ వినిపించుకొనే స్థితిలో లేరన్నది ఒక నిజం. ఇంతకీ విశాఖలో ఏర్పాటు కానున్న గూగుల్‌ డేటా సెంటర్‌ గోడవునా, ఉత్పత్తి కేంద్రమా, ఒక ప్రక్రియ నిర్వహించేదా ? కృత్రిమ మేథకేంద్రం అని కూడా కలుపుతున్నారు. దేశంలో, ప్రపంచంలో ఇప్పటికే గూగుల్‌, ఇతర టెక్నాలజీ కంపెనీలు కృత్రిమ మేథ గురించి ఎంతో ముందుకు పోయాయి, వినియోగంలోకి ఇప్పటికే వచ్చేసింది. విశాఖలో కొత్త పరిశోధనలు చేస్తామంటారా ? అదీ చూద్దాం !

నేను ఒక సామాన్యుడిని గనుక చాట్‌ జిపిటిని ఇదే ప్రశ్న అడిగా, అది ఇచ్చిన సమాధానం గురించి వివరిస్తా.” మంచి ప్రశ్న- దీన్ని గురించి జాగ్రత్తగా వివరించనివ్వండి. చాట్‌ జిపిటి (నా వంటి వారు-నేను కాదు, చాట్‌ జిపిటి తన గురించి చెప్పుకుంది) ఒక కృత్రిమ సేవ, దీన్ని నడిపేది ఓపెన్‌ ఏఐ.మనం డేటా(సమాచారం) రక్షణ లేదా గోప్యత చట్టాల (జిడిపిఆర్‌ వంటి )గురించి మాట్లాడుకున్నపుడు సాధారణంగా వాటి పాత్ర ఉంటుంది.1. డాటా సేకరణ లేదా ఉత్పత్తిదారు : వీరు ఎందుకు, ఎలా వ్యక్తిగత సమాచార ప్రక్రియ(ప్రోసెస్‌)ను చేయాల్సిందీ నిర్ణయిస్తారు. 2.డేటా ప్రోసెసర్‌ : డాటా కంట్రోలర్‌ తరఫున వ్యక్తిగత సమాచారాన్ని ప్రోసెస్‌ చేస్తుంది. 3. డేటా సెంటర్‌ : ఎక్కడ డేటా నిల్వ చేస్తారో మరియు ప్రోసెస్‌ చేస్తారో దానికి అవసరమైన భౌతిక సదుపాయాలు( సర్వర్స్‌, నిల్వ, నెట్‌వర్కింగ్‌)-సాధారణంగా మైక్రోసాఫ్ట్‌ అజుర్‌, గూగుల్‌ క్లౌడ్‌ లేదా ఎడబ్ల్యుఎస్‌ కంపెనీలు వీటిని నిర్వహిస్తాయి. ఒక్క ముక్కలో చెప్పాలంటే చాట్‌జిపిటి అనేది డాటా ప్రోసెసర్‌ లేదా సేవ అందించే సాధనం, ఓపెన్‌ ఎఐ అంటే డాటాను కంట్రోల్‌ చేసేది, అజూర్‌ లేదా అంతకంటే చిన్నవి డాటా సెంటర్లు లేదా మౌలిక సదుపాయాలను అందించేవి. దీన్నిబట్టి ఎవరికి వారు డేటా సెంటర్‌ గురించి స్వంత అవగాహన ఏర్పరుచుకోవచ్చు, ఇంకా కావాలంటే శోధించి మరిన్ని విషయాలు తెలుసుకోవచ్చు.

ఇక చాట్‌ జిపిటి వంటి సాధనాలు ఇప్పటికే కొన్ని ఉన్నాయి,రానున్న రోజుల్లో మరికొన్ని కూడా వస్తాయి.పైన పేర్కొన్న సమాచారాన్ని పొందాలంటే డేటా సెంటర్‌కు అయ్యే విద్యుత్‌, ఇతర నిర్వహణ ఖర్చుల గురించి తెలియదు గానీ ఒక అరలీటరు నీరు ఖర్చు అవుతుందని చదివా.బహుశా పరికరాలు వేడెక్కి దెబ్బతినకుండా చల్లబరిచేందుకు అవసరమైన నీరు కావచ్చు. చాట్‌ జిపిటిని కొద్ది నెలల క్రితం మరో ప్రశ్న అడిగా. అదేమిటంటే చంద్రబాబు నాయుడు 2014 నుంచి 2019వరకు, తరువాత ఐదేండ్లు జగన్‌ అధికారంలో ఉన్నపుడు వివిధ సంస్థలతో కుదుర్చుకున్న అవగాహనా ఒప్పందాలెన్ని, అవి వాస్తవరూపందాల్చినవి, వాటి విలువ ఎంత అని అడిగా. ఒక టీవీ చర్చలో వీక్షకులకు నిజం చెప్పేందుకు తప్ప జగన్‌కు అనుకూలంగానో, చంద్రబాబు నాయుడికి వ్యతిరేకంగానో కాదు.( ఎవరికైనా కావాలంటే నేను సేకరించిన వాటిని అందచేస్తా) వివిధ వనరుల నుంచి సేకరించిన సమాచారాన్ని విశ్లేషించి చెప్పిన అంశాలవి, వాటికి రుజువులు,సాధికారిత గురించి అడిగితే ఏ ప్రభుత్వం కూడా తమ ఘనతల గురించి సామాన్యులకు అర్ధమయ్యే రీతిలో ఎక్కడా సమాచారాన్ని అందుబాటులో ఉంచటం లేదు గనుక నమ్మటమా లేదా అన్నది ఎవరిష్టం వారిది. నేనైతే నమ్మాను గనుకనే చెబుతున్నా.మనోభావాలు గాయపడతాయని భయపడేవారు, ఊరికూరికే గాయపరుచుకొనే వారు వివరాలు చదవకండి అని కూడా చెబుతున్నా.

చాట్‌జిపిటి అందించిన సమాచారం ప్రకారం ” చంద్రబాబు ఏలుబడి 2014 నుంచి 2019 వరకు కుదుర్చుకున్న అవగాహన ఒప్పందాల విలువ రు.18.87లక్షల కోట్లు.2019 ఏప్రిల్‌ నాటికి వాస్తవరూపం దాల్చిన వాటి విలువ రు.60వేల కోట్లు, పురోగతిలో ఉన్నవి రు.67వేల కోట్లు ( పురోగతి అంటే శంకుస్థాపన మొదలు వివిధ దశల్లో ఉన్నవి(తరువాత కొన్ని రద్దు కూడా కావచ్చు, వాస్తవ రూపం దాల్చినవి సగటున ఏడాదికి రు.పన్నెండువేల కోట్లు.) మరో సందర్భంలో చాట్‌జిపిటి చెప్పినదాని ప్రకారం 2016 నుంచి 2018 వరకు సంతకాలు చేసిన అవగాహన ఒప్పందాల విలువ రు.12.32లక్షల కోట్లు కాగా 309 ప్రాజెక్టులతో వాస్తవ రూపం దాల్చినవి రు.1.39లక్షల కోట్లని పేర్కొన్నది. ఇక వైఎస్‌ జగన్మోహనరెడ్డి ఏలుబడి గురించి చాట్‌ జిపిటి ఏం చెప్పిందో చూద్దాం. 2019 నుంచి 2022 వరకు ఆమోదం తెలిపిన పథకాల విలువ రు.1,81,221 కోట్లు కాగా ఏడాదికి సగటున అమల్లోకి వచ్చిన వాటి విలువ రు.15,693. వివరాల్లోకి వెళితే 2019 జూన్‌ నుంచి 2021 మే నెల మధ్య కాలంలో 65 పెద్ద పరిశ్రమల పెట్టుబడి రు. 29,781 కోట్లు, కాగా ప్రభుత్వం నివేదించిన దాని ప్రకారం 2019 నుంచి 2022 మార్చి నెల మధ్య వచ్చినట్లు చెప్పిన పెట్టుబడి రు.43వేల కోట్లు, దీనిలో పెద్ద పరిశ్రమల వాటా రు.36,303 కోట్లు, ఎంఎస్‌ఎంఇల వాటా రు.7,018 కోట్లు. నూతన పెట్టుబడుల గురించి చూస్తే 2018-19 నుంచి 2022-23వరకు ప్రకటించిన పథకాల విలువ రు.9,41,020 కోట్లు కాగా పూర్తయిన వాటి విలువ రు.1.34 లక్షల కోట్లు. పెండింగ్‌లో ఉన్న రు.27,110 కోట్ల ప్రాజెక్టును పునరుద్దరించారు. సంక్షిప్తంగా వివరాలు ఇలా ఉన్నాయి.

కాలం×××××వాస్తవ రూపం దాల్చినవి×××ప్రకటించినవి

2019-22×× రు.1,81లక్షల కోట్లు ప్రభుత్వ ఆమోదం పొందినవి

2019-21×× రు.29,781 కోట్లు ×××—-

2019-22×× రు.43,000 కోట్లు ×××—-

2018-19నుంచి 2022-23×× —××× రు.9.41లక్షల కోట్లు

2024-2025 ××—— ×××రు.9.2- 9.34లక్షల కోట్లు.

గమనిక : జగన్మోహనరెడ్డి ఏలుబడి చివరి సంవత్సరం పదకొండు నెలల్లో ఏకంగా తొమ్మిది లక్షల కోట్లకు పైగా ఒప్పందాలు కుదుర్చుకున్నట్లు చెప్పటం ద్వారా తాము కూడా తక్కువ తినలేదని చెప్పుకొనేందుకు చూసినట్లు కనిపించింది.

చంద్రబాబు నాయుడు జనసేన, బిజెపితో కలసి కూటమిగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన తరువాత సంగతేమిటని అదే చాట్‌ జిపిటిని అడిగితే చెప్పిన వివరాలు ఇలా ఉన్నాయి. పరిశ్రమల శాఖ మంత్రి టిజి భరత్‌ చెప్పినదాని ప్రకారం మొదటి ఏడాదిలో నమోదైన లేదా ఆకర్షించిన పెట్టుబడుల ప్రతిపాదనల విలువ రు.14లక్షల కోట్లు, ఈ మొత్తంలో లాంఛనంగా భూ కేటాయింపులు, ప్రోత్సాహకాలతో ఎస్‌ఐపిబి ఆమోదం తెలిపిన వాటి మొత్తం రు.9.2లక్షల కోట్లు. చంద్రబాబు నాయుడు నిర్ధారించినదాని ప్రకారం కొత్త పెట్టుబడులు 9.62లక్షల కోట్లని, అవి అమల్లోకి వస్తే 8.79లక్షల కొత్త ఉద్యోగాలు వస్తాయి.పరిశ్రమల మంత్రి టిజి భరత్‌ పెట్టుబడులు రు.9.4లక్షల కోట్లని, ఉద్యోగాలు 8.5లక్షలని పేర్కొన్నారు. చంద్రబాబు నాయుడు, లోకేష్‌ ఇద్దరూ ఎడాపెడా తాజాగా కుదుర్చుకుంటున్న ఒప్పందాలతో ఇప్పటి వరకు మొత్తం విలువ ఎంతో అధికారికంగా వెల్లడిస్తే తప్ప తెలియదు, వివరాలు వెల్లడిస్తారని ఆశిద్దాం.

విశాఖ గూగుల్‌ డేటా సెంటర్‌ అని చెబుతున్నప్పటికీ అది గూగుల్‌తో పాటు అదానీ, ఎయిర్‌టెల్‌ కంపెనీల భాగస్వామ్యం కలిగిన కంపెనీ. వాటి పెట్టుబడి రు.1.25లక్షల కోట్లు లేదా 15 బిలియన్‌ డాలర్లు. ఆ కంపెనీకి ఇవ్వదలచిన రాయితీల విలువ రు. 22వేల కోట్లని వార్తలు వచ్చాయి. ఇంతేనా ఇంకా ఎక్కువా చెప్పలేము. ఇంత మొత్తం అప్పనంగా ఇస్తున్న తరువాత ఒప్పందాల వెనుక ముడుపులు లేకుండా ఉంటాయా ? సమస్యే లేదు. బహుళజాతి గుత్త కంపెనీలు, దేశీయ బడాకంపెనీలు ఇచ్చే లంచాలను నిరూపించలేముగానీ అవి ఇవ్వటం, పుచ్చుకోవటం నిజం. రాయితీలు, కంపెనీ ఏర్పాటుతో తలెత్తే పర్యావరణ సమస్యలు, పరిష్కారాలు, వచ్చే ఉపాధి గురించి కంపెనీల విశ్లేషణ నివేదికలను బహిర్గత పరిస్తేనే జనాలకు స్పష్టత వస్తుంది. ప్రజల సొమ్మును ఇలాంటి కార్పొరేట్లకు వేల కోట్ల మేర సబ్సిడీలుగా ఇస్తున్నపుడు తెలుసుకోవటం పౌరుల హక్కు, పారదర్శకతను పాటించటం పాలకుల విధి, ఎందుకంటే అవి వారి జేబుల్లోంచి ఇవ్వటం లేదు మరి. అదానీ కంపెనీ ఆంధ్రప్రదేశ్‌లో ముఖ్యమంత్రిగా పనిచేసిన జగన్‌కు 20 కోట్ల డాలర్లు లేదా 1,750 కోట్ల రూపాయలు ముడుపులుగా ఇచ్చినట్లు అమెరికాలో నమోదైన కేసు గురించి ఆంధ్ర ప్రదేశ్‌ లేదా కేంద్ర ప్రభుత్వం విచారణ జరిపి అలాంటిదేమీ జరగలేదు, జగన్‌, అదానీ మచ్చలేని వారు అని నిర్ధారించటమైనా చేయాలి, ఏదీ లేదు, తోడు దొంగల వ్యవహారం తప్ప ఇది మరొకటి కాదని ఎవరైనా అంటే తప్పేముంది ? విశాఖ డేటా కేంద్రం కల్పించే ఉపాధి గురించి తెలుగుదేశం పార్టీకి చెందిన కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్‌ చెప్పిందేమిటి ? భారత్‌ ఏఐ శక్తి పేరుతో ఢిల్లీలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ ఈ కేంద్రం ద్వారా ఐదు నుంచి ఆరువేల వరకు పర్మనెంటు ఉద్యోగాలు, మొత్తంగా 20 నుంచి 30వేల ఉద్యోగాలు వస్తాయని చెప్పారు.( అక్టోబరు 14వ తేదీ పిఐబి విడుదల చేసిన ప్రకటన) ఒకే పార్టీకి చెందిన రాష్ట్ర మంత్రి లోకేష్‌, కేంద్ర మంత్రి చంద్రశేఖర్‌ చెప్పిన అంకెలకు ఇంత తేడా ఎలా ఉంది ? ఎన్ని ఉద్యోగాలు వస్తాయనేది వైసిపి, తెలుగుదేశం వారు ఏమి చెప్పారన్నది పక్కన పెడితే ఆ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్న గూగుల్‌ కంపెనీ చెప్పిన సంఖ్య ఎంతో ఎక్కడా కనిపించలేదు. ఎందుకీ దాపరికం ? సదరు కంపెనీ వ్యాపార వ్యూహాలతో మనకు పనిలేదు. ఎన్ని సంవత్సరాల వ్యవధిలో ఎంత పెట్టుబడి పెట్టేది,పర్మనెంటు ఉద్యోగాలు ఎన్నివచ్చేది కచ్చితంగా ప్రకటించాల్సిందే. ఎందుకంటే దానికి జనం సొమ్మును రాయితీలుగా ప్రభుత్వం ఇస్తున్నది గనుక తెలుసుకొనే హక్కు ప్రతి పౌరుడికీ ఉంది, ప్రభుత్వమైనా అధికారికంగా ప్రకటించాలి, అది దాని బాధ్యత, జవాబుదారీ తనం, కాదంటారా !సంబంధిత మరో విశ్లేషణ దిగువ లింక్‌లో చదవవచ్చు

సముద్రంలో చైనా డేటా సెంటర్‌ : నిజంగా నరేంద్ర మోడీ, చంద్రబాబు భవిష్యత్‌ దార్శనికులా !
https://vedikaa.com/2025/10/27/china-underwater-data-center-where-socalled-visionaries-narendra-modi-and-chandrababu-failed/

రాజులు, సింహాసనాలు, కిరీటాలు లేవన్న అమెరికా కార్మికవర్గం ! పసలేని కమ్యూనిస్టు వ్యతిరేక ప్రచారం !!

Tags

, , , ,

ఎం కోటేశ్వరరావు

అక్టోబరు పద్దెనిమిది ! అమెరికా చరిత్రలో మరో చారిత్రక ఘట్టం !! డెబ్బయి లక్షల మంది కార్మికులు, ఉద్యోగులు భుజం భుజం కలిపి 50 రాష్ట్రాలలోని 2,700 చోట్ల డోనాల్డ్‌ ట్రంప్‌ విధానాలకు వ్యతిరేకంగా కదం తొక్కిన ఉదంతం.జనవరి 20వ తేదీన రెండోసారి అధికారానికి వచ్చిన తరువాత ఏడాది గడవక ముందే జరిగిన మూడవ సామూహిక నిరసన ఇది. ఒక వైపున అక్టోబరు ఒకటవ తేదీ నుంచి ఎప్పుడు ముగుస్తుందో తెలియని ఫెడరల్‌ ప్రభుత్వ మూసివేత కొనసాగుతున్నది. లక్షల మందికి వేతనాలు లేవు. సేవలకు అంతరాయం కలిగింది. నోబెల్‌ శాంతి బహుమతి పొందటానికి తహతహ, పైరవీల మీద ఉన్న శ్రద్ద ఆ ప్రతిష్ఠంభనను తొలగించేందుకు ట్రంప్‌ వైపు నుంచి ఎలాంటి చొరవ లేదు. రిపబ్లికన్‌, డెమోక్రటిక్‌ పార్టీలు రెండూ తమ వైఖరులకు కట్టుబడి ఉన్నాయి. మధ్యలో ఉద్యోగులు, ప్రభుత్వ సేవలను అందుకొనే లబ్దిదారులు ఇరకాటంలో పడ్డారు. ఈ నేపధ్యంలో అమెరికాకు రాజులు లేరు, సింహాసనాలు లేవు, కిరీటాలు లేవు అనే నినాదంతో జనం కదిలారు. ఏప్రిల్‌లో ప్రభుత్వ సిబ్బంది సామర్ధ్యం పెంపు పేరుతో ట్రంప్‌ మాజీ సహచరుడు ఎలన్‌ మస్క్‌ తీసుకున్న చర్యలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున జనం వీధుల్లోకి వచ్చారు. జూన్‌ 14న తొలిసారి రాజులు లేరు అనే నినాదంతో నిరంకుశ పోకడలకు వ్యతిరేకంగా గళం విప్పారు. అప్పుడు ఆ పిలుపును చూసి కొందరు ఆ జరిగేదేనా అంటూ పెదవి విరిచారు. ఆ రోజు ట్రంప్‌ 79వ పుట్టిన రోజు, అమెరికా పతాక దినోత్సవం, అమెరికా మిలిటరీ 250వ వార్షికోత్సవం. మూడు సందర్భాలను కలిపి చరిత్రలో రాజులు, రంగప్పలు జరుపుకున్న మాదిరి నభూతో నభవిష్యత్‌ అన్నట్లుగా కోట్లాది డాలర్ల జనం సొమ్ముతో అంగరంగవైభవంగా జరుపుకోవాలని ట్రంప్‌ నిర్ణయించాడు.

బహుశా ఆ ఏర్పాట్లను చూసి అమెరికా కార్మికవర్గం అదే రోజున రాజులు లేరు అనే నినాదంతో అమెరికా అంతటా తొలిసారి ప్రదర్శనలు చేసింది.యాభై లక్షల మంది వాటిలో పాల్గొన్నారు.ట్రంప్‌ జన్మదిన ఆర్భాటం బోసిపోయింది. అధ్యక్ష భవనం స్వయంగా ప్రకటించిన మేరకే పాల్గొన్నది రెండున్నర లక్షల మందే, మీడియా అంచనాలు అంతకంటే తక్కువ. కార్మికవర్గ హౌరు జోరు మధ్య ట్రంప్‌ కార్యక్రమం వెలవెల పోయింది.ప్రపంచానికి కార్మికుల నిరసన తప్ప అభినవ రాజు ట్రంప్‌ ఆర్భాటం కనిపించలేదు. పోల్చేందుకు కూడా మీడియా సిగ్గుపడింది. ఇప్పటి వరకు జరిగిన మూడు ట్రంప్‌ వ్యతిరేక ప్రదర్శనల సందర్భంగా కార్మికవర్గాన్ని రెచ్చగొట్టేందుకు అనేక విధాలుగా చూశారు. అశేషంగా జనం పాల్గ్గొన్నప్పటికీ ఒక్కటంటే ఒక్క అవాంఛనీయ ఉదంతం కూడా జరగలేదు. జూన్‌ 14 ప్రదర్శనల తరువాత ట్రంప్‌ యంత్రాంగం అనేక పట్టణాలలో చట్టవిరుద్దంగా మిలిటరీని దించుతామంటూ బెదిరిస్తున్నది. అవినీతి సరేసరి, వలస వచ్చిన కుటుంబాల మీద దాడులు పెరిగాయి, అరెస్టులు సర్వసాధారణంగా మారాయి. ఇలా ఒకటేమిటి చివరికి న్యూయార్క్‌ నగర మేయర్‌ ఎన్నికల్లో డెమోక్రటిక్‌ సోషలిస్టు జోహ్రాన్‌ మమ్దానిని గనుక ఎన్నుకుంటే మిలిటరీని దించటంతో పాటు నగరానికి నిధులు నిలిపివేస్తానని బాహాటంగా బెదిరించాడంటే నిరంకుశపోకడలు ఏవిధంగా ఉన్నాయో అర్ధం చేసుకోవచ్చు.

వీటికి తోడు అమెరికా దిగుమతి చేసుకొనే వస్తువులపై పన్నుల విధింపుతో ధరలు, ద్రవ్యోల్బణంతో జీవన వ్యయం పెరుగుతున్నది. ఎక్కువ మంది పౌరులకు అవసరమైన ఆరోగ్య సంరక్షణ, విద్యా రంగాలతో పాటు పర్యావరణ రక్షణ కేటాయింపులను కూడా ట్రంప్‌ సర్కార్‌ కోత పెడుతున్నది.మరో వైపు భారీ ఎత్తున కార్పొరేట్లకు కట్టబెడుతున్నారు.మిలిటరీ ఖర్చు పెరుగుతున్నది, ఇజ్రాయెల్‌, ఉక్రెయిన్లకు ఆయుధాలు, నిధులు అందచేస్తున్నారు. అపరిమిత అధికారాలు చెలాయించకుండా రాజ్యాంగం ఏర్పాటు చేసిన అడ్డుగోడలను తన అధికారాలతో బద్దలు కొడుతూ ప్రతి రంగంలో ప్రజాస్వామిక వ్యవస్థలను అపహాస్యం పాలు చేస్తూ నిరంకుశ, ఫాసిస్టు తరహా విధానాలవైపు మొగ్గు చూపుతున్నాడు. వీటిన్నింటికీ నిరసనే రాజులు లేరు అనే నినాదంతో జన సమీకరణ. దీనికి డెమోక్రటిక్‌ పార్టీకి చెందిన వారి మద్దతు ఉంది, కమ్యూనిస్టుల భాగస్వామ్యం కూడా ఉన్నప్పటికీ ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక సంఘాలు, వివిధ హక్కుల వేదికలు, స్థానిక ప్రజా సమూహాలదే ప్రధాన భాగస్వామ్యం.

ఈ నిరసనలో కొన్ని అంశాలకు అంటే యుద్ధ వ్యతిరేకతకు ప్రాధాన్యత లేదని, మిలిటరీ బడ్జెట్లకు వ్యతిరేకత తెలపటం లేదని దానికి కారణం ఒక భాగస్వామిగా ఉన్న డెమోక్రటిక్‌ పార్టీ కూడా అధికారంలో ఉన్నపుడు గాజాలో ఇజ్రాయెల్‌ మారణకాండకు, రష్యా మీద పోరులో ఉక్రెయిన్‌కు మద్దతు ఇవ్వటమే అని కొందరు విమర్శలు చేస్తున్నారు. వాటిని పూర్తిగా కొట్టిపారవేయనవసరం లేదు. ఆర్థిక పోరాటాలకే అనకాపల్లి, ఆదిలాబాద్‌, అమెరికా, ఆఫ్రికా అయినా జనం కదలని స్థితి. ఈ నేపధ్యంలో దుర్భరమౌతున్న జీవన సమస్యలతో పాటు ప్రజాస్వామ్యానికి పెరుగుతున్న ముప్పు, నిరంకుశ ధోరణులకు వ్యతిరేకంగా ఎంతమేరకు జనం కదిలితే దాన్ని స్వాగతించాల్సిందే తప్ప ఫలాన అంశం లేదని దూరంగా ఉండటం పెడధోరణి తప్ప మరొకటి కాదని చెప్పవచ్చు.అందుకే రాజులు లేరు అనే పేరుతో వెల్లడైన నిరసనకు ఎంతో ప్రాధాన్యత ఉందని చెపాల్సివస్తోంది. దీని పర్యవసానాల గురించి అమెరికా పాలకవర్గం గుర్తించి భయపడుతున్నట్లు ట్రంప,్‌ ఇతరులలో వెలువడుతున్న స్పందనే నిదర్శనం. రెండవసారి ఓడిపోయినపుడు ఇదే ట్రంప్‌ ఓటమిని అంగీకరించకుండా 2021 జనవరి ఆరున అమెరికా అధికార కేంద్రమైన కాపిటోల్‌ హిల్‌ మీద దాడికి దిగిన అతగాడి అనుచరులు దేశ భక్తులు అన్నట్లుగా అధికారానికి వచ్చిన తరువాత ట్రంప్‌ శిక్షలను రద్దు చేశాడు. తన విధానాలను వ్యతిరేకిస్తూ వీధుల్లో శాంతియుతంగా ప్రదర్శనలు చేస్తున్నవారిని ఉగ్రవాదులని వర్ణిస్తున్నాడు.

కొనసాగుతున్న కేంద్ర ప్రభుత్వ మూతను మరింతగా పొడిగించేందుకు డెమోక్రటిక్‌ పార్టీ చేసిన కుట్రలో భాగమే ఇదంటూ మంత్రులు, రిపబ్లికన్‌ పార్టీల నేతలు ప్రచారం మొదలు పెట్టారు. నిరసన ప్రదర్శనల్లో పాల్గ్గొన్నవారికి డబ్బిచ్చి రప్పించారని రవాణా శాఖ మంత్రి సీన్‌ డఫీ ఆరోపించాడు.సెనెటర్‌ టెడ్‌ క్రజ్‌ ఎక్స్‌లో పెట్టిన పోస్టులో ఈ ప్రదర్శనలను అమెరికా కమ్యూనిస్టు పార్టీ నిర్వహించిందన్నాడు. వారంతా కమ్యూనిస్టులు, మార్క్సిస్టులు అంటూ నిందించాడు. నిర్వాహకులను సంతుష్టీకరించేందుకు డెమోక్రటిక్‌ పార్టీ తొందరపడుతున్నదన్నాడు. అంతకు ముందు మానహటన్‌ సంస్థ మేథావి, విశ్లేషకుడు స్టు స్మిత్‌ మాట్లాడుతూ ఈ ప్రదర్శనల సందర్భంగా ముద్రించిన పోస్టర్లలో పిలుపుకు మద్దతుదార్ల జాబితాలో కమ్యూనిస్టు పార్టీ గుర్తు కూడా ఉందన్నాడు.ఈ కమ్యూనిస్టు వ్యతిరేక ప్రచారాన్ని అమెరికా కమ్యూనిస్టు పార్టీ సహ అధ్యక్షుడు జో సిమ్స్‌ ప్రదర్శనలకు ఒక రోజు ముందు అపహాస్యం చేశాడు. దోనాల్డ్‌ ట్రంప్‌, ఎఫ్‌బిఐ అధిపతి కాష్‌ పటేల్‌ వంటి వారెవరూ రాజులు లేరు ప్రదర్శనలను నిరోధించలేరని స్పష్టం చేశారు. సిమ్స్‌ అన్నట్లుగానే తప్పుడు ప్రచారాలేవీ ప్రదర్శకులను నిరోధించలేకపోయాయి. ఈ ప్రదర్శనలను నిర్వహించేది కమ్యూనిస్టు పార్టీ కాదనేది అందరికీ తెలుసు. ప్రతిదాన్నీ కమ్యూనిస్టులే నియంత్రిస్తున్నారనే ప్రచారం పాతచింతకాయ పచ్చడి,పనికిమాలింది, తప్పుడు ప్రచారం, దీన్ని అమెరికా ప్రజానీకం ప్రతి సందర్భంలోనూ పట్టించుకోలేదని జో సిమ్స్‌ చెప్పాడు. ఈ దేశం చట్టాలమేరకు నడుస్తుంది తప్ప రాజులతో కాదని అమెరికా స్థాపకులకు స్పష్టంగా తెలుసునని టీచర్స్‌ యూనియన్‌ అధ్యక్షురాలు రాండీ వెయిన్‌గార్టెన్‌ అన్నారు. రాజ్యాంగానికి బద్దులమై పని చేస్తామని గద్దెనెక్కిన వారు దాన్ని ఉల్లంఘిస్తున్నారని ఆమె విమర్శించారు. అధ్యక్షుడు ప్రజా సమస్యలను పరిష్కరించాలి తప్ప హక్కులను హరించకూడదన్నారు.

రాజులు లేరు ఆందోళనలో యుద్ధ సంబంధ అంశాలు లేవని చెబుతున్నవారు లేవనెత్తిన వాటితో ఏకీభవించటమా లేదా అన్నదానిని పక్కన పెడితే అవేమిటో చూడాల్సి ఉంది. వివిధ దేశాల్లో జరిగిన పరిణామాలకు రంగుల విప్లవాలని పేర్లు పెట్టిన సంగతి తెలిసిందే. రాజులు లేరు అన్న ప్రదర్శనలకు పిలుపు ఇచ్చిన వారి వెబ్‌సైట్‌ను చూస్తే నిరసన ప్రదర్శనల్లో పసుపు పచ్చ రంగు వాటిని ధరించాలని ప్రోత్సహించినట్లు ఉందని, ఐరోపాలో నాటో అనుకూల శక్తుల పసుపు రిబ్బన్‌ ఆందోళన, హాంకాంగ్‌లో చైనాకు వ్యతిరేకంగా పసుపు గొడుగుల ఆందోళనను గుర్తుకు తెచ్చిందనే వ్యాఖ్యానాలు వెలువడ్డాయి. రాజులు లేరు అనే నినాదం వెనుక సమీకృతులౌతున్నవారు ఏ రంగు ధరించినప్పటికీ దాని వెనుక ఉన్న అంశాలు ముఖ్యమన్నది మరొక వాదన. కార్మికవర్గం మీద భారాలు మోపటం, సంక్షేమ పథకాలకు కోత పెట్టటం ద్వారా పోగుపడే సొమ్మును ప్రభుత్వం దేనికి ఖర్చు పెడుతున్నదంటే వివిధ ప్రాంతాల్లో యుద్ధాలకు మళ్లిస్తున్నది, కార్పొరేట్లకు రాయితీలుగా ఇస్తున్నది. ఈ ఆందోళనలో యుద్ద వ్యతిరేకత లేకపోవటానికి ముందే చెప్పుకున్నట్లుగా డెమోక్రాట్లు అనుసరించే విదేశాంగ విధానంలో యుద్దాలు,ఉద్రికత్తతలను రెచ్చగొట్టటం, ఆ ప్రాంతాల్లో ఆయుధాల అమ్మకం ద్వారా అమెరికాలోని ఆయుధతయారీదార్లు, వ్యాపారులకు లబ్ది చేకూర్చటం దానికి డెమోక్రాట్లు కూడా అనుకూలంగా ఉండటమే అనేది ఒక వాస్తవం. తొలిసారి ట్రంప్‌ అధికారంలో ఉన్నపుడు డెమోక్రటిక్‌ పార్టీ నిరసన తెలిపింది, ఎందుకంటే కార్మికుల హక్కులను హరించినందుకు కాదని, రష్యా, చైనాల పట్ల మెతకగా వ్యవహరించటానికి వ్యతిరేకంగా అని విమర్శకులు గుర్తు చేస్తున్నారు. అలాగే 2019లో ట్రంప్‌ మీద అభిశంసన ఉక్రెయిన్‌కు ఆయుధాలు అందించటంలో ఆలశ్యం చేసినందుకు అన్నది కూడా తెలిసిందే. ట్రంప్‌ విధానాలకు వ్యతిరేకంగా జరిగే ఆందోళనలో యుద్దాన్ని వ్యతిరేకించటాన్ని విడిగా చూడలేమని, అందువలన ఆ అంశాలను కూడా చేర్చాలన్నది కొందరి వాదన.

శనివారం నాటి ప్రదర్శనల్లో భారీ ఎత్తున కార్మికవర్గం పాల్గ్గొనటానికి అనేక అంశాలు దోహదం చేశాయి. దిగజారుతున్న జీవన పరిస్థితులు, మెరుగుపడుతుందనే ఆశలు సన్నగిల్లటం వంటి అనేక అంశాలు ఉన్నాయి. తక్షణ కారణాలలో కొనసాగుతున్న ప్రభుత్వ మూత ఒకటి, 1976 నుంచి అమెరికాలో ఇప్పటి వరకు పదిసార్లు కేంద్ర ప్ర భుత్వం మూత పడింది. ఇదే ట్రంప్‌ ఏలుబడిలో 2018-19లో 35 రోజులు గరిష్టంగా నిలిచిపోయింది. ఆ రికార్డు బద్దలవుతుందని చెబుతున్నారు. ఇలా మూతపడేందుకు రిపబ్లికన్‌ పార్టీ అత్యధిక సందర్భాలలో కారకురాలైంది,కావాలనే మూతపడేట్లు చేసి బిలియనీర్లకు లబ్ది కలిగించేందుకు చూసింది. మూత రాజకీయాలకు తెరలేచిన 1990దశకంలో 66 మంది బిలియనీర్లు 240 బిలియన్‌ డాలర్లను అదుపు చేస్తే ఇప్పుడు 700 మంది ఏడు లక్షల కోట్ల దాలర్లకు చేరారు, ఇరవై ఎనిమిది రెట్ల సంపద పెరిగింది. మూత సమయంలో కార్పొరేట్లు పన్నులు ఎగవేయటం,ఖర్చుల్లో కోత, వేతన మినహాయింపుల వంటి రకరకాల పద్దతుల్లో కార్పొరేట్‌ కంపెనీలకు లబ్ది కలుగుతున్నందున మూసివేతలేవో అనుకోకుండా జరిగినవి కాదని అర్ధం అవుతున్నది. మధ్యతరగతిలో ఆశలు సన్నగిల్లుతున్నట్లు సర్వేలు వెల్లడించాయి.అనుకోకుండా ఏదైనా వైద్య అవసరం ఏర్పడితే ఖర్చు పెట్టుకోలేమని 47శాతం మంది, ఉద్యోగ విరమణ తరువాత తగినంత డబ్బు ఉండదని 52శాతం, కొత్త ఇల్లు కొనుగోలు చేయలేమని 63శాతం మంది భావిస్తున్నారు. మూడు పదుల వయస్సులోపు యువతలో ఇలాంటి అవిశ్వాసం ప్రతి పదిమందిలో ఎనిమిదికి ఉంది.ఒకసారి జగన్నాధ రధం కదలాలే గానీ దాన్ని ఆపలేరు అన్నట్లుగా అమెరికాలో ప్రారంభమైన ప్రభుత్వ వ్యతిరేకత రానున్న రోజుల్లో ఏ మలుపులు తిరగనుందో ఊహించి చెప్పలేము !

ముందు నుయ్యి – వెనుక గొయ్యి : దూరదృష్టిలేమితో దేశాన్ని ఇరకాటంలోకి నెట్టిన ” సమర్ధ ” నరేంద్రమోడీ !

Tags

, , , , , ,

ఎం కోటేశ్వరరావు

అన్నీ వారే చేశారంటూ గాంధీ, నెహ్రూ వంటి నేతలను ఇప్పటికీ ఆడిపోసుకుంటున్నారు. కాంగ్రెస్‌ ఐదు దశాబ్దాలలో చేయలేనిదానిని తమ మోడీ ఐదేండ్లలో చేశారు చూడండని డబ్బాకొట్టుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు చంద్రబాబు నాయుడు వంటి వారు రంగంలోకి దిగి జిఎస్‌టిి సంస్కరణలతో బొందితో కైలాసానికి తీసుకుపోతున్నారన్నట్లుగా ఆకాశానికి ఎత్తుతున్నారు. గతంలో ఏం మాట్లాడారో తెలిసిందే ! నిజానికి ఏం జరుగుతోంది ? తాజాగా సెప్టెంబరు మాసంలో దేశ వాణిజ్యలోటు వివరాలు వెల్లడయ్యాయి. ఎగుమతులు 6.7శాతం పెరిగి 36.38 బిలియన్‌ డాలర్లకు చేరగా దిగుమతులు 16.7శాతం పెరిగి 68.53 బిలియన్‌ డాలర్లకు చేరాయి.కిందపడ్డా గెలిచింది మేమే అన్నట్లుగా దిగుమతులు అంటే మేం వస్తుకొనుగోలు శక్తి పెంచిన కారణంగానే అవసరం అవుతున్నాయని సమర్ధించుకుంటున్నారు. రూపాయి పాపాయిని ఆరోగ్యంతో బలిష్టంగా పెంచుతామని చెప్పారు. మోడీ మూడోసారి పాలన ఐదేండ్లు గడిచే సరికి ఇప్పుడున్న 89 డాలరుకు ముచ్చటగా వంద రూపాయలకు పతనమైనా ఆశ్చర్యం లేదు.

వికసిత భారత్‌ 2047 పేరుతో నరేంద్రమోడీ దేశాన్ని ఎక్కడికో తీసుకుపోతామన్నారు, ఇప్పుడు ఎటు తీసుకుపోతున్నారో తెలియదు. కొన్ని చేదు నిజాలను అంగీకరించకతప్పదు. ప్రపంచబ్యాంకు నివేదిక ప్రకారం మన దేశానికి వచ్చిన విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు మోడీ అధికారానికి వచ్చిన తరువాత జిడిపిలో 2.1శాతం ఉండగా 2023 నాటికి 0.8శాతానికి దిగజారాయి. అంకెల్లో చూస్తే 2014 నుంచి 2024వరకు వచ్చిన మొత్తం 509.69 బిలియన్‌ డాలర్లు(సగటున ఏడాదికి 46.34బి. డాలర్లు) అధికారానికి వచ్చిన కొత్తలో విమానం వేసుకొని దేశదేశాలూ ఎందుకు తిరుగుతున్నారంటే దిగజారిన దేశ ప్రతిష్ట పునరుద్దరణ, పెట్టుబడుల కోసం అని చెప్పారు. గొర్రెతోక బెత్తెడు అన్నట్లుగా 2016లో 46 బిలియన్‌ డాలర్లు వస్తే 2024లో 53 బిలియన్‌ డాలర్లు ఉంది. చైనాకు 2019 నుంచి 21వరకు మూడు సంవత్సరాల్లో వచ్చిన మొత్తం 787 బిలియన్‌ డాలర్లు. తరువాత కాలంలో చైనాకు మనదేశానికి వచ్చిన మొత్తం కూడా రాలేదు.2021లో 344 బిలియన్‌ డాలర్లు వస్తే 2023లో 51.3, 2024లో 18.6బిలియన్‌ డాలర్లు మాత్రమే వచ్చాయి. దానికి ఉన్న కారణాల గురించి మరోసందర్భంలో చెప్పుకోవచ్చు.చైనాలో పెరిగిన ఉత్పాదకత ఖర్చులతో వచ్చే లాభదాయకత కంటే అమెరికాలో వడ్డీ రేటు ఎక్కువగా ఉండటం ఒకటి. ఇక్కడ ముఖ్యాంశమేమంటే చైనాకు పెట్టుబడులు ఆగిపోయాయి, మనదేశానికి అవి రూటుమార్చాయి, కంపెనీలు వరుసలో నిలుచున్నాయి అని చెప్పిన వారు యాపిల్‌ కంపెనీ గురించి పదే పదే చెప్పటం తప్ప చైనాకు తగ్గిన ఎఫ్‌డిఐ మనకు ఎందుకు రాలేదో చెప్పాలి. చైనా కంపెనీలు మనదేశంలో పెట్టుబడులు పెట్టేందుకు సిద్దపడితే గత ఐదు సంవత్సరాలుగా కేంద్ర ప్రభుత్వం అడ్డుకున్న సంగతి తెలిసిందే.ఆశించిన అమెరికా, ఇతర దేశాల కంపెనీల జాడకనిపించకపోవటంతో ఇప్పుడు చైనా పెట్టుబడులకు ద్వారాలు తెరిచేందుకు మోడీ సర్కార్‌ పూనుకుంది.

కుండలో కూడు కదల కూడదు బిడ్డడు దుడ్డులా ఉండాలన్నది మన ఆలోచనా విధానంగా ఉంది. అది మారనంత వరకు అటూ ఇటూ కాని స్థితే. ఇతర అభివృద్ధి చెందిన, చైనా వంటి దేశాలతో పోల్చితే మనదేశంలో కాలం చెల్లిన సాంకేతిక పరిజ్ఞానం, పెట్టుబడుల పరిమితం, బలహీనమైన మౌలిక సదుపాయాలు ఆకర్షణీయంగా లేనపుడు రాజకీయ నేతలు, వారికి భజన చేసే మీడియా ఎన్ని కబుర్లు చెప్పినా ఉపయోగం ఉండదు.” విదేశీ కంపెనీలకు భారత్‌ శ్మశానం వంటిది ” అని ఏకంగా ప్రపంచబ్యాంకే వాణిజ్య నివేదికలో పేర్కొన్నది.ఆ ముద్ర నుంచి ఇంతవరకు బయటపడిందా అన్నది సందేహమే. ఇంతే కాదు 2014 నుంచి 2021 వరకు మన దేశంలో ఉన్న 2,800 విదేశీ కంపెనీలు దుకాణాలు మూసుకొని వేరేచోట్లకు వెళ్లిపోయాయి.మన దేశానికి రావాలనుకొనే వారు ఇలాంటి వాటన్నింటినీ ఒకటికి రెండుసార్లు చూసుకుంటారు. ఇప్పుడు అమెరికా విధించిన పన్నులతో ఇక్కడ పరిశ్రమలే ఎలా మనుగడ సాగించాలా అని ఆలోచిస్తుండగా కొత్తగా వచ్చేవారి సంగతి వేరే చెప్పనవసరం లేదు. మన కార్పొరేట్ల తీరుతెన్నులు చూస్తే మిగతావారి మాదిరే తమ లాభాలు తప్ప వేరే పట్టవు. కేంద్రంలో అధికారంలో ఎవరున్నా తమకు అనుకూలమైన విధానాలను అమలు చేయిస్తారు. ఇప్పుడు అమెరికా, ఇతర దేశాలతో తలెత్తిన పరిస్థితుల్లో ఏం చేయాలో దిక్కుతోచటం లేదని చెప్పవచ్చు.గతంలో ఆసియన్‌ దేశాలతో కూడిన ప్రాంతీయ సమగ్ర ఆర్థిక భాగస్వామ్యం (ఆర్‌సిఇపి) కూటమిలో లేదా పసిఫిక్‌ భాగస్వామ్య కూటమి సిపిటిపిపి(కాంప్రహెన్సివ్‌ అండ్‌ ప్రోగ్రెసివ్‌ ఎగ్రిమెంట్‌ ఫర్‌ ట్రాన్స్‌ పసిఫిక్‌ పార్టనర్‌షిప్‌)లో చేరాలా ? చేరితే వచ్చే లాభాలేమిటి ? నష్టాలేమిటనే గుంజాటనలో పాలకవర్గం దాని ప్రతినిధిగా ప్రస్తుతం ఉన్న నరేంద్రమోడీ సర్కార్‌ ఉంది. ఏదో ఒక కూటమిలో చేరాలనే వత్తిడి ప్రారంభమైంది.చేరితో పౌరుల నుంచి వచ్చే వ్యతిరేకత తమ అధికారానికే ఎసరు తెస్తుందేమో అన్న భయం బిజెపి, దాని మద్దతుదార్లలో కూడా తలెత్తింది. పైకి చెప్పుకోకపోవచ్చు.

ముందుగా ఆర్‌సిఇపి గురించి చూద్దాం. ఈ కూటమి ఒప్పందంపై 2020 నవంబరు 15 సంతకాలు చేసింది. అది 2022 జనవరి నుంచి అమల్లోకి వచ్చింది.దీనిలో ఆస్ట్రేలియా,బ్రూనీ, కంపూచియా, చైనా, ఇండోనేషియా, జపాన్‌, దక్షిణ కొరియా, లావోస్‌, మయన్మార్‌, మలేసియా, న్యూజీలాండ్‌, ఫిలిప్పీన్స్‌, సింగపూర్‌,థారులాండ్‌, వియత్నాం ఉన్నాయి. ఏడు సంవత్సరాలు తర్జన భర్జన పడిన తరువాత 2019 నవంబరులో ఈ కూటమిలో చేరకూడదని నరేంద్రమోడీ సర్కార్‌ నిర్ణయించింది. ముందు ఎట్టిపరిస్థితిలోనూ చేరకూడదని రైతు, వ్యవసాయ కార్మిక, పారిశ్రామిక కార్మికులు, ఇతరులూ స్పష్టం చేశారు. చైనా ఉన్న ఏ వాణిజ్య కూటమిలోనూ చేరకూడదని పారిశ్రామికవేత్తలు గట్టిగా పట్టుబట్టారు. దాంతో ఈ కూటమికి మనదేశం దూరంగా ఉంది. అయితే ఇప్పటికీ ఆర్‌సిఇపి మన దేశానికి ఆహ్వానం పలుకుతూనే ఉంది. గతంలో వ్యతిరేకించిన కార్పొరేట్‌ శక్తులే డోనాల్డ్‌ట్రంప్‌ దెబ్బతో పునరాలోచన చేయాలని కోరుతున్నాయి. వారెందుకు నాడు వ్యతిరేకించారంటే ఒకటి, చైనాతో అప్పటికే ఉన్న వాణిజ్యలోటు మరింత పెరుగుతుంది, రెండు, ఆ కూటమిలోని ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌ తమ పాడి ఉత్పత్తులకు మన మార్కెట్‌ను తెరవాలని డిమాండ్‌ చేస్తున్నాయి, అదే జరిగితే మన పాడి పరిశ్రమలో ఉన్న కోట్లాది మంది రైతులు నష్టపోతారు.రాజకీయంగా, ఆర్థికంగా ఎంతో సున్నితమైన అంశం. మూడవది, సేవారంగానికి ఇతర దేశాలు తమ మార్కెట్లను తెరిచే అంశంపై మన ప్రతిపాదనలకు ప్రత్యేకించి నిపుణుల రాకపోకలకు సంబంధించి తగిన మద్దతు రాకపోవటం.

అయితే ఇప్పుడు కార్పొరేట్లలో పునరాలోచనకు పరిస్థితులేమైనా మారాయా ? ఒక్క మాటలో చెప్పాలంటే లేదు. చైనాతో వాణిజ్య లోటు ఆరేళ్ల క్రితం 48.6 బిలియన్‌ డాలర్లు ఉంటే ఇప్పుడు వంద బిలియన్‌ డాలర్లకు చేరింది. వ్యవసాయం, పాడి పరిశ్రమలపై మన వైఖరిలో అప్పుడూ ఇప్పుడూ ఒకటిగానే ఉంది. అందుకే ఆస్ట్రేలియా, అమెరికాతో వాణిజ్య ఒప్పందం కుదుర్చుకోవటానికి మోడీ సర్కార్‌ భయపడుతోంది. నయా ఉదారవాదం ప్రకారం మనకు లబ్ది కలిగించే సేవారంగ మార్కెట్‌లను తెరవాలన్న మన ప్రతిపాదనలకు ఇతర దేశాలు సుముఖంగా లేవు. దీని అర్ధం ఎవరి రక్షణ చర్యలకు వారు కట్టుబడి ఉన్నారు. ఈ స్థితిలో పునరాలోచన చేయాలని కొందరు ఎందుకు కోరుతున్నారంటే ట్రంప్‌ ఇచ్చిన షాక్‌తో ప్రభావితమైన రంగాలకు ఏం చేయాలో తోచక ఈ ప్రయత్నం ఏమైనా ఉపయోగపడుతుందా అని భావిస్తున్నారని చెప్పవచ్చు.పోనీ చేరితే వెంటనే ఏమైనా ప్రయోజనం ఉంటుందా అంటే ఉండదు. దాని నిబంధనావళి ప్రకారం 2022 నుంచి ఇరవై సంవత్సరాల వ్యవధిలో నాడున్న పన్నులను 92శాతం తగ్గించాల్సి ఉంటుంది. అదే విధంగా ఎగుమతి, దిగుమతుల కోటాలను ఖరారు చేస్తారు. తెల్లవారేసరికి మన సరుకులను ఎగుమతి చేసి లాభాలు సంపాదించాలంటే కుదరదు. మన రైతాంగానికి, పాడి, కోళ్ల పరిశ్రమల రక్షణకు అవసరమైన చర్యలు తీసుకొని మార్కెట్‌ను తెరిస్తే అదొక తీరు. కనీస మద్దతు ధరలకు చట్టబద్దత కల్పించటానికే మొరాయిస్తున్న నరేంద్రమోడీ సర్కార్‌ అలాంటి జాగ్రత్తలు తీసుకుంటుందంటే నమ్మేదెవరు ? రైతాంగమే కాదు కొన్ని పరిశ్రమలు కూడా దెబ్బతింటాయి.

ఇక రెండో ఆర్థిక కూటమి సిపిటిపిపిని చూద్దాం. దీనిలో ఆర్‌సిఇపిలో ఉన్న కొన్నింటితో పాటు ఇతర దేశాలు ఉన్నాయి. ఆస్ట్రేలియా, న్యూజీలాండ్‌, వియత్నాం, సింగపూర్‌, బ్రూనీ,కెనడా, మలేసియా,జపాన్‌, చిలీ, పెరూ, బ్రిటన్‌,మెక్సికో ఉన్నాయి. వీటి మధ్య ఒప్పందం 2018లో ఉనికిలోకి వచ్చింది. దీని ప్రకారం 99శాతం వరకు పన్నులను తగ్గించాల్సి ఉంటుంది.ఆర్‌సిఇపి కంటే నిబంధనలు గట్టిగా ఉన్నాయి. అంతకు ముందు ట్రాన్స్‌ ఫసిఫిక్‌ పార్టనర్‌షిప్‌ (టిపిపి) పేరుతో కుదిరిన ఒప్పందం నుంచి అమెరికా వైదొలగటంతో అది మూలన పడి దాని స్థానంలో కొత్తగా ఉనికిలోకి వచ్చింది.దీనిలో సభ్యత్వం కోసం చైనా దరఖాస్తు చేసినప్పటికీ దానికి ఇచ్చే అవకాశం లేదు. ఎందుకంటే ఆర్ధిక సేవారంగాన్ని తెరవాలన్న నిబంధనతో పాటు సమాచారాన్ని స్వేచ్చగా ఇచ్చిపుచ్చుకోవాలని, ప్రభుత్వ రంగ సంస్థల గుత్తాధిపత్యాన్ని తొలగించాలనే షరతులు ఉన్నాయి. వాటిని చైనా అంగీకరించటం లేదు. అమెరికా, చైనా రెండూ లేవు గనుక మనం చేరితే ఉపయోగం ఉంటుందన్న ఆశతో సిపిటిపిపిలో చేరితే ఎలా ఉంటుందని మన కార్పొరేట్లు ఆలోచన చేస్తున్నారు. ఆర్‌సిఇపి కంటే మరింతగా ఉదారవాద విధానాలను అమలు జరపాల్సి ఉంటుంది.ప్రస్తుతం నరేంద్రమోడీ చేస్తున్నవాటికే ప్రతిఘటన ఎలా ఉంటుందో రైతాంగ ఉద్యమం స్పష్టం చేసింది. ఇప్పుడు కార్మిక చట్టాలలో తెస్తున్న మార్పులకు వ్యతిరేకంగా కార్మికవర్గం కూడా ఆందోళనకు సిద్దం అవుతున్నది. ప్రభుత్వ రంగ సంస్థలను పరిమితం చేసే యత్నాలకు వాటి సిబ్బంది కూడా వ్యతిరేకత వెల్లడిస్తున్న సంగతి తెలిసిందే. అందువలన ఈ కూటమిలో చేరటం కూడా అంత తేలిక కాదు.

ఏ దేశానికైనా ఒక దీర్ఘకాలిక, స్వల్పకాలిక లక్ష్యాలు ఎత్తుగడలు అవసరం. నరేంద్రమోడీ సర్కార్‌కు అలాంటి ఆలోచనగానీ, ఆచరణగానీ లేదు. అందువల్లనే అమెరికా మనమీద పెద్ద ఎత్తున వత్తిడి తెస్తున్నది.దాన్ని తప్పించుకొనేందుకు మాటల్లేవ్‌, మాట్లాడుకోవటాలు లేవు అన్నట్లుగా ఐదేండ్ల క్రితం అన్ని సంబంధాలను తెంచుకున్న చైనాతో తిరిగి చేయి కలపటం, అవసరమైతే రష్యా, చైనా, భారత్‌ ఒక కూటమిగా ఏర్పడతాయనే సందేశాన్ని షాంఘై సహకార సంస్థ సమావేశాల సందర్భంగా ఇచ్చారు. అయితే అమెరికాతో సంబంధాలకు కూడా తహతహలాడుతున్నారు.అందుకే చైనా, రష్యా బహిరంగంగా చెప్పనప్పటికీ ప్రతి అడుగూ అనుమానంతో వేస్తున్నాయంటే అతిశయోక్తి కాదు. అమెరికాతో వాణిజ్య ఒప్పందం, ఐరోపా సమాఖ్యతో స్వేచ్చా వాణిజ్య ఒప్పందాలను కుదుర్చుకోవాలని, స్థానిక గిరాకీని పెంచేందుకు పరిశ్రమలకు మద్దతు ఇవ్వాలని, అదనపు రిస్కులను తీసుకోకుండా అన్ని దేశాలతో ఉన్న స్వేచ్చా వాణిజ్య ఒప్పందాలతో గరిష్టంగా లబ్దిపొందేందుకు చర్యలు తీసుకోవాలని మనకార్పొరేట్లు కోరుతున్నారు. పదేండ్ల మేకిన్‌ ఇండియా, మేడిన్‌ ఇండియా పిలుపులు ఘోరంగా విఫలమయ్యాయి. దీంతో చైనా ప్లస్‌ 1పేరుతో కొత్త పల్లవి అందుకున్నారు.

బహుళజాతి కంపెనీలు ముందుకు తెచ్చిన ఈ వ్యూహం వాణిజ్యపరమైనది. సరఫరా వ్యవస్థ లేదా గొలుసులో చైనాను విస్మరించలేరు.కనుచూపు మేరలో ప్రత్యామ్నాయం కనిపించటం లేదు. చైనాలో కార్మికవేతనాలు పెరుగుతున్నందున, ఇతర నిబంధనలతో ఉత్పాదక ఖర్చులు పెరుగుతున్నాయి. అయితే 140 కోట్ల జనాభా ఉన్న మార్కెట్‌ను వదులుకోలేరు. అందుకే చైనాతో పాటు మరొక దేశంలో తమ కార్యకలాపాలను ప్రారంభించాలన్నదే చైనా ప్లస్‌ 1 అర్ధం. మన దేశంలో యాపిల్‌ కంపెనీ కార్యకలాపాలకు కారణమిదే. దీని భావం అన్ని కంపెనీలు మన దేశానికి బారులు తీరాయని కాదు. వియత్నాం,ఇండోనేషియా,థారులాండ్‌ ఇలా ఏది అనుకూలంగా ఉంటే దాన్ని ఎంచుకోవచ్చు.మన విషయానికి వస్తే సానుకూల, ప్రతికూల అంశాలు ఉన్నాయి. యువజనాభా గణనీయంగా ఉండటం, కార్మికవేతన ఖర్చు తక్కువ(2023 సర్వే ప్రకారం చైనా కంటే వేతనాలు 47శాతం తక్కువ.) ఉత్పాదకతతో ముడిపెట్టిన ప్రోత్సాహకాలు ఉన్నాయి. రోడ్ల వంటి మౌలిక సదుపాయాలను కల్పిస్తున్నారు. ఇవి సానుకూల అంశాలు కాగా సవాళ్లు కూడా ఉన్నాయి. 2013 నుంచి చైనాలో వేతనాలు పెరుగుతున్నందున కంపెనీలు మనదేశానికి వస్తాయని చెప్పినా వాటి జాడలేదు. నియంత్రణలు ఎక్కువ ( అంబానీ, అదానీలకు ఎవరూ పోటీ రాకూడదు, అందుకే అమెజాన్‌ అధిపతి బెజోఫ్‌కు గతంలో మోడీ కనీసం దర్శన భాగ్యం కూడా కల్పించలేదు) మౌలిక సదుపాయాలు అంటే ” తోలు ” వలిచే రోడ్లు మాత్రమే కాదు. వియత్నాం, థారులాండ్‌ వంటి చిన్నదేశాల నుంచి కూడా మనకు పోటీ ఎక్కువగా ఉంది. కబుర్లు ఎక్కువ ఆచరణ తక్కువ.మొత్తంగా చూసినపుడు సమర్ధుడైన నావికుడిగా భావించి మన నావను నరేంద్రమోడీకి అప్పగిస్తే ఇప్పుడది చుక్కాని లేనట్లు ఎటు పోతుందో తెలియకుండా నడి సముద్రంలో ఉంది. చిత్రం ఏమిటంటే దీనికి కూడా నెహ్రూ కారణమని చెప్పగల సమర్ధులుంటే నిజమే అని నమ్మే అమాయకులు పుష్కలంగా ఉండటం అసలైన సమస్య !

గాజా నరమేథం ఆగింది, ప్రజాశత్రువుకు శాంతి బహుమతి ! ఐఎంఎఫ్‌ విధానాలకు లాటిన్‌ అమెరికాలో ప్రతిఘటన !!

Tags

, , , , , , ,

ఎం కోటేశ్వరరావు

అమెరికా ముందుకు తెచ్చిన 20 అంశాల శాంతి ప్రతిపాదన ఒప్పందంపై సోమవారం నాడు కైరో(ఈజిప్టు)లో అనేక మంది దేశాధినేతల సమక్షంలో సంతకాలు జరిగాయి. హమస్‌ వద్ద బందీలుగా ఉన్న 20మంది, ఇజ్రాయెల్‌ జైళ్లలో నిర్బంధంలో ఉన్న రెండువేల మంది పాలస్తీనియన్ల విడుదల జరిగింది. బందీలుగా ఉండి మరణించిన 28 మంది మంది భౌతిక కాయాలను కూడా అప్పగించేందుకు హమస్‌ అంగీకారం తెలిపింది. గాజాలో సాగిస్తున్న మారణకాండకు ప్రస్తుతానికి తెరపడింది.ఇలా ఎందుకు అనాల్సి వచ్చిందంటే మరోసారి ఇజ్రాయెల్‌ అలాంటి దుర్మార్గానికి పాల్పడనే హామీ ఏమీ లేదు. పాలస్తీనియన్లు ఊపిరి పీల్చుకొనేందుకు అవకాశం ఇచ్చే ఏ చర్యనైనా ఆహ్వానించాల్సిందే. అసలైన సమస్య పాలస్తీనా గుర్తింపు, ఐరాస తీర్మానం ప్రకారం దానికి కేటాయించిన ప్రాంతాల నుంచి ఇజ్రాయెల్‌ వైదొలగటం మీద ఆధారపడి ఉంది. గతంలో కుదిరిన ఒప్పందాలేవీ కూడా ఈ అంశంపై ఎలాంటి పరిష్కారాన్ని చూపలేదు. ఏడాదికేడాది ఇజ్రాయెల్‌ ఆక్రమణలు, నివాసాల నిర్మాణాలు కొనసాగుతూనే ఉన్నాయి. జనాభా స్వభావాన్ని మార్చేందుకు యూదులందరినీ తీసుకువచ్చి ఆ ప్రాంతాల్లో ఉంచుతున్నారు. ఒప్పందం మొదటి దశగా పేర్కొన్నదాని ప్రకారం బందీలు-ఖైదీల మార్పిడికి మాత్రమే పరిమితం.

సోమవారం నాడు డోనాల్డ్‌ ట్రంప్‌ కైరో వెళ్లే ముందు జెరూసలెంలో ఉన్న ఇజ్రాయెల్‌ పార్లమెంటును ఉద్దేశించి ప్రసంగించాడు.నూతన మధ్య ప్రాచ్యానికి చారిత్రాత్మక ఉషోదయం అని ఒప్పందాన్ని వర్ణించాడు. ఆ సందర్భంగా ఇద్దరు వామపక్ష వాదులైన ఎంపీలు పాలస్తీనా పట్ల అమెరికా వైఖరికి నిరసన తెలిపారు.అమెన్‌ ఒడే, ఓఫర్‌ కాసిఫ్‌ అనే ఎంపీలను భద్రతా సిబ్బంది బయటకు తీసుకువెళ్లారు. యూదు దురహంకారం, అరబ్బులను రెండోతరగతి పౌరులుగా చూసే వివక్ష వాస్తవం. అయితే మొత్తం యూదు సామాజికతరగతికి దీన్ని ఆపాదించాల్సిన అవసరం లేదు.వారిలో కూడా పురోగామి,ప్రజాతంత్ర వాదులు ఉన్నారు గనుకనే అనేక మంది గాజాలో జరుపుతున్న మారణకాండను వ్యతిరేకించారు.దానికి సారధ్యం వహించిన నెతన్యాహు చర్యలకు నిరసన తెలిపారు.అయితే వాటికి ఉన్న పరిమితులు, మీడియా పూర్తిగా అలాంటి వార్తలను పక్కన పెట్టిన కారణంగా బయటి ప్రపంచానికి వివరాలు పూర్తిగా తెలియవు. ట్రంప్‌కు నిరసన తెలిపిన ఇద్దరు ఎంపీలలో ఒకరైన ఒడే సామాజిక మాధ్యమంలో తరువాత పెట్టిన పోస్టులో తామెందుకు ఆ చర్యకు పాల్పడిందీ తెలిపాడు. పాలస్తీనా రాజ్యాన్ని గుర్తించాలని యావత్‌ ప్రపంచ సమాజం అంగీకరించినందున ఆ పని ఎందుకు చేయరన్నదే తమ ప్రశ్న అని ఆ మాత్రానికే తమను పార్లమెంటునుంచి బయటకు గెంటారని పేర్కొన్నాడు.మరో ఎంపీ కాసిఫ్‌ ఒక ప్రకటన చేస్తూ ట్రంప్‌ చర్యలను విమర్శించాడు, పాలస్తీనా, ఇజ్రాయెల్‌ గుర్తింపు పరిష్కారాన్ని అమలు జరపాలని డిమాండ్‌ చేశాడు. అమెరికా మిత్రదేశాలుగా ఉన్న కెనడా, కొన్ని ఐరోపా దేశాలు ఇప్పటికే పాలస్తీనాను అధికారికంగా గుర్తించినప్పటికీ అమెరికా ముందుకు రావటం లేదు. ఇజ్రాయెల్‌ అసలు ఉనికినే ప్రశ్నిస్తున్నది. ఐరాస అచేతనంగా ఉండిపోయింది. భద్రతామండలిలో ఎవరైనా కార్యాచరణకు తీర్మానం పెడితే వీటో హక్కుతో అమెరికా సైంధవుడిలా అడ్డుపడుతున్నది.మారణకాండనే ఆపేందుకు ముందుకు రాని వాషింగ్టన్‌ తన రాజకీయ, మిలిటరీ, ఆర్థిక అజెండాను పక్కకు పెట్టి పాలస్తీనాను గుర్తిస్తుందా ?

వివిధ రంగాలలో ప్రజ్ఞ కనపరచిన వారికి ఇచ్చే నోబెల్‌ బహుమతుల గురించి ఇంతవరకు ఎలాంటి వివాదమూ లేదుగానీ శాంతి బహుమతికి ఎంపికలు కొన్ని అపహాస్యానికి గురౌతున్నాయి. తాజాగా వెనెజులా ప్రభుత్వాన్ని వ్యతిరేకించే మరియా కోరినా మచోడోకు శాంతి బహుమతి అలాంటిదే. అక్కడి వామపక్ష నికోలస్‌ మదురో ప్రభుత్వాన్ని కూలదోసేందుకు చివరికి అమెరికా మిలిటరీ కూడా జోక్యం చేసుకోవాలని, బాంబులు వేయాలని ఇజ్రాయెల్‌ ప్రధాని నెతన్యాహును కోరిన ఆమెను శాంతిదూతగా పరిగణించటం, తనకు వచ్చిన బహుమతిని తనకు నిర్ణయాత్మక మద్దతు ఇచ్చిన డోనాల్డ్‌ ట్రంప్‌కు అంకితం చేస్తున్నట్లు ఆమె ప్రకటించటాన్ని చూస్తే నోబెల్‌ కమిటీ ఎవరి కనుసన్నలలో పని చేస్తున్నదో అర్ధం చేసుకోవచ్చు. గత రెండున్నర దశాబ్దాలుగా ఆమె తీరుతెన్నులన్నీ వెనెజులాలో అశాంతిని రెచ్చగొట్టేందుకు అమెరికాతో చేతులు కలిపి చేసిన నిర్వాకాలు తప్ప శాంతి చిహ్నాలే లేవు. అసలా బహుమతి తనకే ఇవ్వాలని డోనాల్డ్‌ ట్రంప్‌ డిమాండ్‌ చేసిన సంగతి తెలిసిందే. మదురోను అరెస్టు చేసేందుకు అవసరమైన సమాచారమిచ్చిన వారికి ఐదు కోట్ల డాలర్ల బహుమతి ఇస్తామని ట్రంప్‌ ప్రకటించిన సంగతి తెలిసిందే. వెనెజులాను మాదక ద్రవ్యాల సరఫరా కేంద్రంగా మార్చారంటూ వెనెజులా నుంచి వచ్చిన రెండు బోట్లమీద కాల్పులు జరిపి వాటిలో ఉన్నవారిని హత్య చేసి మాదకద్రవ్య సరఫరాదారులుగా ప్రచారం చేయటమే కాదు, అవసరమైతే సైనిక చర్యకు దిగేందుకు మిలిటరీని మోహరించిన సంగతి తెలిసిందే. మరియా కోరినా నిర్వాకాలను చూస్తే 2002లో హ్యూగో ఛావెజ్‌కు వ్యతిరేకంగా జరిగిన విఫల కుట్రలో ఆమె పాత్రధారి.కేవలం 47 గంటలు మాత్రమే అధికారంలో ఉన్న తిరుగుబాటుదార్లు రాజ్యాంగాన్ని , పతి ప్రజా సంస్థను రద్దు చేశారు. వెనెజులాను విముక్తి చేసేందుకు మిలిటరీ జోక్యం చేసుకోవాలని అమెరికాను కోరింది. కరీబియన్‌ సముద్ర ప్రాంతంలో మాదక ద్రవ్యాల నిరోధం పేరుతో దిగిన అమెరికా నౌకాదళానికి ఆమె జేజేలు పలికింది. వెనెజులా ఎన్నికల ఫలితాన్ని గుర్తించేందుకు నిరాకరించిన వ్యక్తితో తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయించిన ఘనురాలామె. జెరూసలెంలో మూసివేసిన వెనెజులా రాయబార కార్యాలయాన్ని తెరవాలని కోరింది. వెనెజులా చమురు, నీరు, మౌలిక సదుపాయాలవంటి అన్నింటినీ ప్రవేటింకరించాలని కోరుతున్న శక్తుల ప్రతినిధిగా పని చేస్తున్నది.ఆమె శాంతి లేదా పురోగతికి ప్రతీక కాదని, ఫాసిజం, యూదు దురహంకారం మరియు నయాఉదారవాదాల ప్రపంచ కూటమిలో భాగం,ప్రజాస్వామ్య ముసుగులో శాంతిని విచ్చిన్నం చేసే శక్తి అని కొందరు విమర్శించారు. నోబెల్‌ శాంతి బహుమతి ఆశయం, లక్ష్యాలకు వ్యతిరేకంగా పని చేస్తున్నవారికి దాన్ని ప్రదానం చేయటం పక్కా రాజకీయం. వియత్నాంలో దురాక్రమణకు పాల్పడి లక్షలాది మంది ప్రాణాలు తీసింది అమెరికా. దానికి నాయకత్వం వహించినవారిలో ఒకడు హెన్రీ కిసింజర్‌. అక్కడ కాల్పుల విరమణకు కృషి చేశాడనే పేరుతో 1973లో శాంతి బహుమతి ఇచ్చారు. అదే పెద్దమనిషి ఇజ్రాయెల్‌ దుర్మార్గాలకు మద్దతు ఇచ్చాడు.ఈజిప్టును లొంగదీసుకొని ఇజ్రాయెల్‌తో కాంప్‌డేవిడ్‌ ఒప్పందానికి తెరతీసిన జిమ్మీ కార్టర్‌కు 1978లో అదే బహుమతి ఇచ్చారు. ఆ ఒప్పందంలో పాలస్తీనా గుర్తింపును విస్మరించారు. పాలస్తీనా ప్రాంతంలో దురాక్రమణలకు వ్యతిరేకంగా ఇజ్రాయెల్‌పై ఆంక్షల కోసం పెట్టిన తీర్మానాన్ని వీటో చేసిన పెద్దమనిషి బరాక్‌ ఒబామా,మిలిటరీ సాయాన్ని మరింతగా పెంచినందుకా అన్నట్లు 2009లో శాంతి బహుమతి పొందాడు. ఇలాంటి విషయాల్లో నేను మాత్రం తక్కువ తిన్నానా నాకెందుకు ఇవ్వరని ట్రంప్‌ ప్రశ్నించిన సంగతి తెలిసిందే.

బ్రెట్టన్‌ ఉడ్‌ కవలలుగా పేరుమోసిన ప్రపంచబ్యాంకు, ఐఎంఎఫ్‌ ప్రయోగశాల లాటిన్‌ అమెరికా. వాటి ప్రజావ్యతిరేక, ప్రపంచ పెట్టుబడి అనుకూల విధానాల కారణంగా జన జీవితాలు అతలాకుతలం అయ్యాయి. వాటిని బలవంతంగా అమలు జరిపేందుకు మిలిటరీ పాలకులు, నియంతలను రంగంలోకి తెచ్చారు. వారికి వ్యతిరేకంగా అనేక రూపాల్లో జరిగిన పోరాటాలతో వామపక్ష శక్తులు ముందుకు వచ్చాయి, అనేక చోట్ల అధికారాన్ని పొందాయి. అయితే నయావలసవాద పునాదులను పూర్తిగా నాశనం చేయకుండా జనాలకు సంక్షేమ కార్యక్రమాలను అమలు జరిపి కొంత ఉపశమనం కలిగించినప్పటికీ అసలు సమస్యలకు పరిష్కారం దొరకలేదు. అందుకే ఎన్నికలలో వామపక్షాలకూ ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఇదే సమయంలో బ్రెట్టన్‌ ఉడ్‌ కవలలు మరింతగా సంస్కరణల పేరుతో తమ విధానాలను రుద్దుతుఉన్న కారణంగా కార్మికవర్గం, ఇతర తరగతులు వీధులలోకి రావటం అనివార్యంగా కనిపిస్తున్నది.

ఈ పూర్వరంగంలో పెరూలో వామపక్ష అభ్యర్ధిగా ముందుకు వచ్చి విజయం సాధించిన ఒక సామాన్య స్కూలు టీచర్‌ పెడ్రో కాస్టిలో 2021లో అధికారానికి వచ్చిన ఏడాదిలోనే పదవి కోల్పోయాడు. తన మూలాలను మరచి మితవాద,మతవాద శక్తులతో చేతులు కలిపి కార్మికవర్గాన్ని విస్మరించాడు.పార్లమెంటు ఉద్వాసనతో పదవి నుంచి తప్పుకున్నాడు. అప్పుడు ఉపాధ్యక్షరాలిగా ఉన్న దినా బోలార్టే 2022లో గద్దెనెక్కింది. అన్ని విధాలుగా పాలనలో విఫలం కావటంతో పార్లమెంటు గత శుక్రవారం నాడు పదవి నుంచి తొలగించింది.ఆమెకు వ్యతిరేకంగా దేశవ్యాపితంగా పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శనలు జరిగాయి. గురువారం రాత్రి చర్యకు ఉపక్రమించిన పార్లమెంటు మెరుపువేగంతో వ్యవహరించి తెల్లవారేసరికి ఉద్వాసన పలికింది. రాత్రి 11.30కు పార్లమెంటు రావాలని ఇచ్చిన ఆదేశాన్ని ఆమె ఉల్లంఘించింది. ఒకనాడు మద్దతు ఇచ్చిన పార్టీలు కూడా వ్యతిరేకంగా ఓటువేశాయి. విచ్చలవిడి అవినీతి, రెచ్చిపోయిన నేరస్థ ముఠాలను అదుపుచేయటంలో వైఫల్యంతో దినా పదవి నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. వచ్చే ఏడాది ఏప్రిల్‌లో ఎన్నికలు జరిగేవరకు పార్లమెంటు స్పీకరు జోస్‌ జెరీ అధ్యక్ష బాధ్యతలను చేపట్టాడు. గత తొమ్మిది సంవత్సరాలలో ఏడుగురు అధ్యక్షులు మారారు. వారిలో ముగ్గురిని పార్లమెంటు తొలగించింది. అధ్యక్షులుగా ఎన్నికైన పార్టీ పార్లమెంటులో మెజారిటీ సాధించలేకపోవటం అనేక లాటిన్‌ అమెరికా దేశాల్లో జరుగుతున్నది.దామాషా ప్రాతినిధ్యంతో అనేక పార్టీలు పార్లమెంటులో అడుగుపెడుతున్నాయి. పౌరుల ఆగ్రహం తలెత్తినపుడు అధ్యక్షులను పార్లమెంట్లు తొలగిస్తున్నాయి. ప్రైవేట్‌ పెన్షన్‌ నిధులకు కార్మికులు చెల్లించాలనే బిల్లుకు వ్యతిరేకంగా యువతరం నిరసనలకు దిగింది.దీనికి తోడు ఉద్యోగ భద్రత లేదు, యువతలో నిరుద్యోగం విపరీతంగా ప్రబలింది.

మరో లాటిన్‌ అమెరికా దేశం ఈక్వెడార్‌. మితవాది, వాణిజ్యవేత్తలకు అనుకూలమైన అధ్యక్షుడు డేనియల్‌ నోబావోకు వ్యతిరేకంగా యువత పెద్ద ఎత్తున నిరసన తెలుపుతున్నది. చమురు మీద ఇస్తున్న సబ్సిడీలను ఎత్తివేయటంతో ఆగ్రహం భగ్గుమన్నది. ఒక గాలన్‌(3.79 లీటర్లు) డీజిలు ధర 1.8 డాలర్ల నుంచి 2.8డాలర్లకు పెరిగింది. అంతర్జాతీయ ధరలను బట్టి ఎప్పటికప్పుడు ధరలను సవరిస్తామని ప్రకటించారు. స్థానిక తెగలకు ప్రాతినిధ్యం వహించే సంస్థ అనేక రూపాల్లో ఆందోళనకు పిలుపు ఇచ్చినప్పటికీ ప్రభుత్వం ఖాతరు చేయలేదు. ఆదివారం నాడు కొలంబస్‌ దినం రోజున(1492లో కొలంబస్‌ లాటిన్‌ అమెరికా గడ్డపై అడుగు పెట్టాడు) తాజా ప్రదర్శనలపై దేశవ్యాపితంగా పోలీసులు విరుచుకుపడ్డారు. దాంతో నిరసనలు హింసాత్మకంగా మారాయి. పది జిల్లాల్లో అధ్యక్షుడు అత్యవసర పరిస్థితిని ప్రకటించేంతగా ఉద్రిక్తత పెరిగింది.గతవారంలో రోడ్డు మీద అధ్యక్షుడి కారునే అడ్డుకున్నారు. స్థానిక తెగలు ఎక్కువగా పని చేస్తున్న వ్యవసాయం, చేపలు పట్టటం, రవాణా రంగాలపై చమురు సబ్సిడీ ఎత్తివేత ప్రభావం ఎక్కువగా ఉంది. ఏటా ప్రభుత్వం 110 కోట్ల డాలర్ల సబ్సిడీ ఇస్తున్నదని, ఈ కారణంగా ఇరుగుపొరుగున ఉన్న కొలంబియా, పెరూ దేశాలకు పెద్ద ఎత్తున అక్రమరవాణా జరుగుతున్నదని అధ్యక్షుడు వాదిస్తున్నాడు. డేనియల్‌ నోబావో నియంతమాదిరి వ్యవహరిస్తున్నాడని,చమురు సబ్సిడీ ఎత్తివేతకు ముందు ఇతర రాయితీలను కూడా తొలగించారని, చమురు అక్రమరవాణా అన్నది ఒక సాకుమాత్రమే నంటూ ఐదువేల మంది ప్రభుత్వ ఉద్యోగులను కూడా తొలగించారని కార్మిక నేతలు ప్రకటించారు. సమ్మెకు పిలుపు ఇచ్చిన సంస్థతో చర్చలకు ససేమిరా అనటంతో పరిస్థితి మరింతగా దిగజారింది. కొత్తగా రుణం ఇచ్చేందుకు రుద్దిన ఐఎంఎఫ్‌ ఆదేశాల మేరకు పొదుపు పేరుతో నయా ఉదారవాద విధానాలను అమలు చేస్తున్నాడు. ప్రభుత్వ ఆసుపత్రులలో ఔషధాలు కూడా సరిగా ఉండటం లేదు. విదేశీ మిలిటరీ స్థావరాల ఏర్పాటును అనుమతించేందుకు జూన్‌లో పార్లమెంటు తీర్మానించింది. ఇది అమెరికా కోసమే అన్నది తరువాత వెల్లడైంది. ప్రజా వ్యతిరేక విధానాలకు, అమెరికాకు లొంగిపోవటాన్ని లాటిన్‌ అమెరికా కార్మికవర్గం వ్యతిరేకిస్తున్నది.

సిజెఐ బిఆర్‌ గవాయిపై దాడి యత్నం : అసలు కారణాలు ఏమిటి ? కాషాయ దళాల అతి తెలివి !

Tags

, , , , , , , , , ,

ఎం కోటేశ్వరరావు

మనోభావాల మాటున ఎంతకైనా తెగించే శక్తులు రెచ్చిపోతున్న రోజులివి. అక్టోబరు ఆరవ తేదీన సుప్రీం కోర్టు పధ్రాన న్యాయమూర్తి భూషన్‌ రామకృష్ట (బిఆర్‌ ) గవాయిపై రాకేష్‌ కిషోర్‌ అనే 71 ఏండ్ల న్యాయవాది కోర్టు హాలులో బూటువిసిరి దాడి చేసేందుకు ప్రయత్నించాడు. భద్రతా సిబ్బంది అప్రమత్తమై అడ్డుకున్నారు. ఈ సందర్భంగా సనాతన ధర్మాన్ని అవమానిస్తే హిందూస్తాన్‌లో సహించేది లేదంటూ నినాదాలు చేశాడు. అయితే తొణకని బెణకని ప్రధాని న్యాయమూర్తి ఇలాంటి చర్యలు తననేమీ చేయవని, వాదనలు కొనసాగించాలని న్యాయవాదులను కోరారు. రాకేష్‌ కిషోర్‌ను కొద్ది సేపు నిర్బంధంలోకి తీసుకున్న సిబ్బంది తరువాత వదలి పెట్టారు. ఎలాంటి కేసు దాఖలు చేయలేదు. ఈ ఉదంతాన్ని అనేక మంది తీవ్రంగా ఖండించారు. సిపిఐ(ఎం) వంటి క్నొు పార్టీలు, సంస్థలు అనేక చోట్ల నిరసన ప్రదర్శనలు చేశాయి. మా వరకు ఇది మరచిపోయిన ఉదంతం అని తరువాత బిఆర్‌ గవాయి వ్యాఖ్యానించారు. మా సోదర న్యాయమూర్తి, నేను కూడా తీవ్ర దిగ్భ్రాంతికి గురైనప్పటికీ మా వరకు ఇది ముగిసిపోయిన అంశము అన్నారు. సదరు లాయరు సభ్యత్వాన్ని సుప్రీం కోర్టు బార్‌ అసోసియేషన్‌ , భారత బార్‌ కౌన్సిల్‌ వెంటనే రద్దు చేశాయి. గవారు తల్లి కమలాతారు, సోదరి కీర్తి అర్జున్‌ కూడా ఖండించారు.సమస్యలు ఏవైనా ఉంటే రాజ్యాంగబద్దంగా పరిష్కరించుకోవాలి తప్ప చట్టాన్ని చేతుల్లోకి తీసుకొనేందుకు ఎవరికీ హక్కులేదని కమలాతారు పేర్కొన్నారు. ఈ దాడి కేవలం వ్యక్తిగతమైనది కాదు, దేశానికే అవమానకరమైనది, ఒక విషపూరిత భావజాలంలో భాగము, దాన్ని నిరోధించాలని కీర్తి పేర్కొన్నారు.

తనది సాధారణ జన్మ కాదు అన్న ప్రధాని నరేంద్రమోడీని ఆదర్శంగా తీసుకున్నట్లుగా ఈ దాడి తాను చేసింది కాదు,తనకసలు అలాంటి ఉద్దేశమే లేదు, దేవుడే చేయించాడని రాకేష్‌ కిషోర్‌ తరువాత చెప్పాడు. ఎఎన్‌ఐ వార్తా సంస్థతో మాట్లాడుతూ సెప్టెంబరు 16వ తేదీన ప్రధాన న్యాయమూర్తి ఒక ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని విన్నారు, దాన్ని దాఖలు చేసిన న్యాయవాది ఎవరో కూడా తెలియదు అప్పటి నుంచి తన చర్యలతో ఒక సందేశాన్ని ఇాచ్చేందుకు ప్రయత్నించినట్లు, విచారణ సందర్భంగా ప్రధాన న్యాయమూర్తి సనాతన ధర్మాన్ని అవమానించారని రాకేష్‌ ఆరోపించారు. ఖజురహౌలో ఏడు అడుగుల విష్ణుమూర్తి విగ్రహం తలనరికి వేశారు, విదేశీయులు మన దేశం మీద దండయాత్రలు చేసినపుడు అనేక దేవాలయాల మీద దాడులు చేశారు, వాటిలో ాదొకటు, తాను వ్యక్తిగతంగా ఆ విగ్రహ్నాు సందర్శించినపుడు ఏడ్చాను, అలాంటి అందమైన విగ్రహానికి తలలేకపోవటంతో ఎంతో విచారించాను, అది అందరికీ విచారం కలిగించేదే అని రాకేష్‌ కిషోర్‌ చెప్పారు. ఆ విగ్రహానికి మరమ్మతులు చేయాలన్న పిటీషనర్‌ వినతి మీద ప్రధాన న్యాయమూర్తి చేసిన వ్యాఖ్య తనకు విచారం కలిగించింది, మీరు దేవుడికి అంత గొప్ప భక్తులైతే ఏదో ఒకటి చేయాలని ఆ విగ్రహానికే మీరు చెప్పండి అన్నారు, దాని కంటే ఆ పిటీషన్ను కొట్టివేయటం తనకు మరింత విచారం కలిగించిందని చెప్పారు.

న్యాయమూర్తి ఏ పూర్వరంగంలో ఆ వ్యాఖ్య చేశారో గమనించటం అవసరం. ఖజురహౌ ప్రాంతం వారసత్వ సంపదగా ప్రకటించిన జాబితాలో ఉంది, దాని మీద నిర్ణయం తీసుకొనే అవకాశం కోర్టుకు లేదంటూ పిటీషన్‌ కొట్టివేసినట్లు ప్రకటించిన సందర్భంలో పిటీషనర్‌ పదే పదే తాను విష్ణుమూర్తి భక్తుడనని ప్రస్తావించటంతో అయితే ఆ విష్ణుమూర్తికే విన్నవించుకోండి, మీతీరు చూస్తే ప్రజాప్రయోజన వాజ్యంగాక ప్రచార ప్రయోజనం కోసం వేసినట్లుగా ఉందని కూడా గవాయి వ్యాఖ్యానించారు. దాడి యత్నానికి తానేమీ చింతించటం లేదని రాకేష్‌ కుమార్‌ చెప్పారు. సనాతన ధర్మాన్ని ప్రధాన న్యాయమూర్తి అపహాస్యం చేసిన క్రియకు తాను చేసింది కేవలం ప్రతిక్రియ మాత్రమే అన్నారు. తానెలాంటి మైకంలో లేనని, భయపడేవాడిని కూడా కాదన్నారు. ఇతర సామాజిక తరగతుల విషయంలో న్యాయస్థానం పెద్ద చర్యలు తీసుకున్నదంటూ హల్దవానీ రైల్వే భూమిని ఆక్రమించిన ఒక సామాజిక తరగతి నుంచి దాన్ని తొలగించాలనే కేసు సుప్రీం కోర్టు ముందుకు వచ్చినపుడు మూడు సంవత్సరాల క్రితం స్టే విధించారు, అది ఇప్పటికీ కొనసాగుతున్నది, నూపూర్‌ శర్మ కేసు వచ్చినపుడు మీరు వాతావరణ్నాు చెడగొట్టినట్లు కోర్టు వ్యాఖ్యాుంచింది, ఇలా అన్నీ వారే చేస్తారు, అదంతా సక్రమంగా ఉందనుకోవాలి అంటూ ఎద్దేవా చేశారు. రోజూ సామాజక మాధ్యమం, ఇతర మాధ్యమాల్లో కాషాయ దళాలు చేస్తున్న వాదనలన్నింటినీ ఈ సందర్భంగా వల్లించారు. తాను ఒక సాధారణ వ్యక్తిని కాదని ఎంఎస్‌సి, పిడి. గోల్డ్‌మెడలిస్ట్‌ మరియు ఎల్‌ఎల్‌బి చదివినట్లు, తనకే పార్టీ, సంస్థ మద్దతు లేదని చెప్పుకున్నారు. తన సామాజిక తరగతి గురించి అతనేమీ చెప్పలేదు గానీ దళితుడని సామాజిక మాధ్యమాల్లో వచ్చింది. సనాతన ధర్మం, మను ధర్మం పేరుతో వేల సంవత్సరాలుగా అంటరాని వారంటూ దళితులను తీవ్ర వివక్ష, అవమానాలకు గురిచేసిన సంగతి తెలిసిందే. కానీ ఆ సామాజిక తరగతికి చెందిన వ్యక్తై ఉండి ఆ సనాతన ధర్మం కోసం ఈ పని చేశానని చెప్పటం, సామాజిక స్పృహను కోల్పోయిన ఉన్మాద స్థితిలోకి వెళ్లిన అతన్ని చూసి నిజంగా జాలిపడాలి. ఆ విష్ణువునే ప్రార్ధించండి అని అనటం సనాతన ధర్మాన్ని అవమానించటమా ? అదే గనుక అయితే నైజాం నవాబు జైల్లో పెట్టినపుడు ఎవడబ్బ సొమ్మని కులికావు రామచంద్రా అని భక్తరామదాసు నిరసనగా కీర్తన పాడినట్లు ప్రచారంలో ఉన్నదే దానికి మనోభావాలు దెబ్బతిని ఎవరిని చెప్పుదెబ్బలు కొడతారు. వేదవిద్యలెల్ల వేశ్యల వంటివి, భ్రమలు పెట్టి తేటపడగనీవు,అన్న వేమన, కనక మృగము భువినికద్దు లేదనక యే, తరుణి విడిచిపోయె దాశరధియు, తెలివిలేనివాడు దేవుడెట్లాయరా అన్న సంగతి తెలిసిందే. అందువలన మనోభావాలు దెబ్బతిన్నాయనే పేరుతో వేమన మీద దాడులు చేస్తారా ?

మీడియాతో మాట్లాడినదాన్ని బట్టి రాకేష్‌ కుమార్‌ ఒక పథకం ప్రకారమే దాడికి యత్నించినట్లు చెప్పవచ్చు. ఎందుకంటే నిజంగా మనోభావాలు గాయపడిన వారి లక్షణం వెంటనే స్పందించటం, గవారు వ్యాఖ్య చేసిన రోజు లేదా మరుసటి రోజే ఆపని చేసి ఉంటే 71ఏండ్ల వయస్సు వచ్చినా ఉద్రేకం తగ్గలేదు భావించేందుకు ఆస్కారం ఉండేది. కానీ ఇరవై రోజుల తరువాత బూటు విసిరేందుకు పూనుకోవటం అప్పటికప్పుడు కలిగిన స్పందన అంటారా ? ఒక పథకం ప్రకారం చేసింది తప్ప మరొకటి కాదు. నూపూర్‌ శర్మ గురించి న్యాయమూర్తులు చేసిన వ్యాఖ్యలను కూడా ప్రస్తావించారు. మరి ఆ రోజు ఈ పెద్దముషి అలాంటి ప్రతిక్రియకు పాల్పడాలని అనిపించలేదా ? కోర్టు అన్నదాన్ని తప్పు పట్టారు, ఒకే. ఆమె నోటితుత్తరతో విదేశాల్లో కూడా తలెత్తిన నిరసన కారణంగా వారిని సంతుష్టీకరించేందుకు చర్య తీసుకొని బిజెపి అసలు ప్రజాజీవనంలో తిరిగి కనిపించకుండా చేసింది కదా ? ఆలాంటి పార్టీ నేతల మీద బూటు విసిరి ప్రతీకారం తీర్చుకోవాలని ఎందుకు అనిపించలేదు ? చట్టం ముందు అందరూ సమానులే, గవారు వ్యాఖ్య తప్పు లేదా నేరం అనుకుంటే తానే కేసు ఎందుకు దాఖలు చేయలేదు. ఖజురహౌ విగ్రహం గురించి తాను కేంద్ర ప్రభుత్వాుకి అనేక లేఖలు రాసినా స్పందన లేదని కూడా దరఖాస్తుదారు కోర్టులో చెప్పారు. హిందువుల మనోభావాలను పరిగణనలోకి తీసుకోని ప్రధాని నరేంద్రమోడీ, కేంద్ర ప్రభుత్వ పెద్దలు, పురావస్తుశాఖ మంత్రి మీద ప్రతిచర్య తీసుకోవాలని రాకేష్‌ కుమార్‌ను దేవుడు ఆదేశించలేదా ? ఎవరి మీద బూటు విసరాలో లేదో దేవుడు వడపోతద్వారా ఎంచుకొని ఆదేశిస్తాడా ? తన వ్యాఖ్యల మీద సామాజిక మాధ్యమంలో భిన్నంగా చిత్రిస్తూ ప్రచారం చేస్తున్నారని కొందరు తన దృష్టికి తెచ్చారని, తనకు అన్ని మతాల మీద గౌరవం ఉందు గవారు స్పష్టం చేశారు.రాకేష్‌ కుమార్‌ చర్యను హిందూత్వశక్తులు పెద్ద ఎత్తున ప్రచారం చేశాయి. స్వాతంత్య్రం వచ్చిన తరువాత సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి మీద తొలిసారిగా బూటువిసిరినట్లు ఒక సంస్థ వ్యాఖ్యానించింది. రాకేష్‌కు ఉన్న సంబంధాల గురించి చర్చ అవసరం లేదు. దేశంలో విచ్చలవిడిగా వ్యాపిస్తున్న విద్వేష కాషాయ వైరస్‌ సోకిన వ్యక్తి అన్నది స్పష్టం. దానికి నివారణ తప్ప ఎయిడ్స్‌ మాదిరి చికిత్సలేదు. అతగాడి బుర్ర ఎంతగా చెడింది అంటే ” జరిగిందేదో జరిగింది, వడపోత న్యాయం, దుర్మార్గమైన(బ్లడీ) ఈ లౌకికవాదం ప్రమాదకరంగా హిందువుల అనేక ప్రాధమిక హక్కులను తిరస్కరిస్తున్నది.” అనే వ్యాఖ్యలు అతగాడి నోటి వెంట వచ్చాయంటే రాజ్యాంగమౌలిక లక్షణాలకు వ్యతిరేకి అని వేరే చెప్పనవసరం లేదు. రాజ్యాంగంలో ఉన్న లౌకికవాదం, సామ్యవాదం పదాలను తొలగించాలని అర్‌ఎస్‌ఎస్‌ చెప్పిన సంగతి తెలిసిందే. అలాంటి భావజాలం కలిగిన వ్యక్తి ఇరవై రోజుల తరువాత బూటు విసిరాడంటే కుట్రలో భాగంగానే జరిపిందన్నది స్పష్టం.

ఇలా చెప్పటాుకి హేతువు ఏమిటి ? సెప్టెంబరు 16న గవారు వ్యాఖ్యల మీద సామాజిక మాధ్యమంలో కాషాయదళాలు విరుచుకుపడ్డాయి తప్ప పక్కా హిందూత్వ సంస్థలుగా చెప్పుకొనేవేవీ కూడా మనోభావాల పేరుతో విమర్శలకు, దాడులకు దిగలేదు. అక్టోబరు ఐదవ తేదీన అమరావతి పట్టణం(మహారాష్ట్ర)లో జరిగే విజయదశమి కార్యక్రమాలకు అతిధిగా రావాల్సిందిగా గవాయి తల్లి కమలాతారును ఆర్‌ఎస్‌ఎస్‌ ఆహ్వానించింది. ప్రముఖులు లేదా వారి సంబంధీకులను బుట్టలో వేసుకొనే ప్రక్రియ, వారికి కాషాయ రంగు పులమటంలో సంఘమేథావులకు మరొకరు సాటి రారు. దాన్లో కూడా పెద్ద రాజకీయమే నడిచింది. గట్టి అంబేద్కరిస్టు కుటుంబం, అందునా సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి మాతృమూర్తి తమ సభకు వచ్చారంటే తమ భావజాల్నాు ఆమోదించినట్లే అని ప్రచారం చేసుకొనే చౌకబారు ఎత్తుగడ దానిలో ఉంది.తమ ఆహ్వానాన్ని మన్నించి ఆమె హాజరుకానున్నట్లు మీడియాలో ప్రచారం చేయించారు. అయితే ఆర్‌ఎస్‌ఎస్‌ ఆహ్వానాన్ని కమలాతారు నిర్ద్వంద్వంగా తిరస్కరించారు. దాదాసాహెబ్‌ గవాయి ఛారిటబుల్‌ ట్రస్ట్‌ అధ్యక్షురాలిగా ఉన్న తాను అంబేద్కర్‌ భావజాలం, రాజ్యాంగానికి కట్టుబడి ఉన్న వ్యక్తినని, అలాంటి కార్యక్రమాుకి హాజరు కావటం అంటే సామాజిక చైతన్యానికి హాని జరిగినట్లే అంటూ ఆమె ఒక లేఖను కూడా విడుదల చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ కార్యక్రమానికి హాజరుకావటం లేదు, సమర్ధించటం లేదు, రాజ్యాంగ విలువలకు తమ కుటుంబం కట్టుబడి ఉందని పునరుద్ఘాటించారు. బౌద్దులు విజయదశమి రోజును అశోక్‌ విజయదశమి లేదా ధర్మచక్ర పరివర్తన దినంగాగా పాటిస్తారు, ఆ రోజునే చక్రవర్తి అశోకుడు బౌద్దాన్ని స్వీకరించాడు, అంబేద్కరిస్టులకు ఆ విధంగా ఆ రోజు ఎంతో ముఖ్యమైనదని కూడా స్పష్టం చేశారు. తన అంగీకారం, అనుమతి తీసుకోకుండానే రాక గురించి ఆర్‌ఎస్‌ఎస్‌ తప్పుడు ప్రచారం చేసింది, అలాంటి ప్రచారాన్ని ఎవరూ నమ్మవద్దు, ఆహ్వానాన్ని అంగీకరించే ప్రశ్నే లేదని ఆమె తన లేఖలో పేర్కొన్నారు. ఆ లేఖ విడుదల తరువాత రిపబ్లికన్‌ పార్టీ నాయకుడైన ఆమె రెండో కుమారుడు డాక్టర్‌ రాజేంద్ర ఆ కార్యక్రమాుకి తన తల్లితో పాటు తాను కూడా హాజరవుతున్నట్లు గట్టిగా చెప్పారు. ఆర్‌ఎస్‌ఎస్‌ ఆహ్వానాన్ని తాను అంగీకరించినట్లు చెప్పారు. గవారు తల్లి లేఖ కాషాయదళాలకు చెప్పుకోరాని చోట తగిలిన దెబ్బ. ఆ కార్యక్రమ మరుసటి రోజే గవారు మీద బూటుదాడి యత్నం జరిగింది.దానికీ దీనికి ఎలాంటి సంబంధం లేదంటారా ?

ఈ సందర్భంగా గవాయి కుటుంబ నేపధ్యం గురించి చెప్పుకోవటం కూడా అవసరం.గవాయిసోదరుల తండ్రి ఆర్‌ఎస్‌ గవారు రిపబ్లికన్‌ పార్టీ సీనియర్‌ నేత, యువకుడిగా అంబేద్కర్‌తో కలసి పని చేశారు. నాగపూర్‌ దీక్షభూమి సంపర్క సమితి అధ్యక్షుడిగా ఉన్నారు, 1998లో అమరావతి నియోజకవర్గం నుంచి లోక్‌సభకు ఎు్నకయ్యారు. కాంగ్రెస్‌ పాలనా కాలంలో 2006 నుంచి 11వరకు బీహార్‌, సిక్కిం, కేరళ గవర్నర్‌గా పుచేశారు. కాంగ్రెస్‌ మద్దతుదారుగా ఆ పదవుల్లో ఉన్నపుడు కేరళలో నేటి ముఖ్యమంత్రి పినరరు విజయన్‌పై నాటి మంత్రివర్గ సిఫారసును తోసిపుచ్చి ఎస్‌ఎన్‌సి-లావ్లియన్‌ కేసులో సిబిఐ దర్యాప్తు జరపాల్సిందిగా ఆదేశించారు. కాంగ్రెస్‌ మద్దతుతో తన తండ్రి నాలుగుదశాబ్దాల పాటు ఎంఎల్‌ఏ, ఎంపీగా పు చేశారు, తన సోదరుడు ఆర్‌పిఐ నేతగా కాంగ్రెస్‌కు దగ్గరగా ఉంటారు ఒక సందర్భంగా బిఆర్‌ గవారు చెప్పినట్లు వార్తలు వచ్చాయి. చిత్రం ఏమిటంటే హిందువుల మనోభావాలను పరిగణనలోకి తీసుకోవాలని ప్రబోధించే ఆర్‌ఎస్‌ఎస్‌ పెద్దలు మహారాష్ట్రలో హిందూత్వ సంస్థలు, వ్యక్తుల మనోభావాలను తుంగలో తొక్కారు. గవారు కుటుంబం పక్కా ఆంబేద్కరిస్టు , అనేక సందర్భాలలో హిందుత్వ వ్యతిరేక మనోభావాలతో విభజించేందుకు చూసిందంటూ అలాంటి కుటుంబానికి చెందిన మహిళను విజయదశమి కార్యక్రమానికి పిలవటం ఏమిటంటూ వారు అమరావతి కార్యక్రమంలో ఆర్‌ఎస్‌ఎస్‌ నేతల మీద ధ్వజమెత్తారని వార్త. జనాల్లో ఒక పునాదిని ఏర్పాటు చేసుకొనేందుకు దశాబ్దాల తరబడి హిందూత్వశక్తులు విద్వేషాన్ని రెచ్చగొట్టాయి.వచ్చిన అధికారాన్ని నిలుపుకోవాలంటే మద్దతుదార్లను మరింతగా పెంచుకోవాలి, విద్వేష ప్రచారం దానికి అడ్డుపడుతున్నది. అందుకే గోముఖవ్యాఘ్రం మాదిరి చెబుతున్న సుభాషితాలు పూర్తిగా విద్వేషం తలకెక్కిన వారికి మింగుడుపడటం లేదు. దేశంలో ఉన్న హిందువులు, ముస్లింలు, క్రైస్తవులదందరిదీ ఒకే డిఎన్‌ఏ, సామాజిక సామరస్యత కోసం గొడ్డు మాంసం తినటం, ముస్లింలు లేకుండా హిందూరాష్ట్రం ఉండదు, వంటి మాటలను వారు జీర్ణించుకోలేకపోతున్నారు. అయితే అలాంటి వారు తమ మనోభావాలను అణచివేసుకుంటున్నారు తప్ప ఆ కబుర్లు చెప్పిన వారి మీద బూట్లు విసరటం, దాడుల వంటి వాటికి పాల్పడటం లేదు. అలాంటివి చేస్తే ఆర్‌ఎస్‌ఎస్‌ లాఠీలు వారి వీపులు పగలగొడతాయి మరి.

ఆర్‌ఎస్‌ఎస్‌, బిజెపి శక్తులు బూటు ఉదంతాన్ని తప్పు పడుతూనే అతి తెలివితేటల వాదనలను ముందుకు తెస్తున్నాయి. రాకేష్‌ కుమార్‌ మీద కేసు పెట్టి విచారణ జరపాలంటున్నాయి. అలా ఎందుకు చేశారో న్యాయస్థానాల విచారణల్లో నమోదు కావాలి. ఇది ప్రజాస్వామ్యం కనుక ఒక టెర్రరిస్టుకు సైతం తన వాదనలు చెప్పుకొనేందుకు అవకాశం ఇస్తున్నపుడు రాకేష్‌ కుమార్‌కు కోర్టులో చెప్పుకొనే అవకాశం ఇవ్వాలి అంటూ సామాజిక మాధ్యమంలో సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. అంటే సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తిని బోనెక్కించాలని చెప్పటం తప్ప మరొకటి కాదు. జాతిపిత మహాత్మాగాంధీని తానెందుకు చంపిందీ వివరిస్తూ కోర్టులో గాడ్సే చేసిన వాదనలను పుస్తకాలుగా ముద్రించి ప్రచారం చేస్తున్న కాషాయ దళం బూటు ఉదంతాన్ని కూడా అలాంటి హిందూత్వ ప్రచారానికి వినియోగించుకోవాలన్న అతితెలివి తప్ప మరొకటి కాదు. అందుకే ఆ దాడి వెనుక పెద్ద కుట్రదాగి ఉందు చెప్పాల్సి వస్తోంది. ఒక దళితుడైన ప్రముఖుడి మీద మరో దళితుడితో దాడి చేయించటం కుట్రగాక మరేమిటి ? దేశంలో వివిధ మఠాలు, స్వాములు మౌనంగా ఉండి రాకేష్‌ కుమార్‌ను ఉసికొల్పటాన్ని అర్దం చేసుకోలేనంత అమాయకంగా నేడు దళిత సామాజిక తరగతి ఉందా ? సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి బిఆర్‌ గవాయి ఎంతో సముచితంగా, హుందాగా వ్యవహరించారని వేరే చెప్పనవసరం లేదు, బూటువెనుక ఉన్న కుట్రను వెంటనే గ్రహించారేమో !

పశ్చిమ దేశాల తీరు : ఒకవైపు కార్మికవర్గంపై దాడి మరోవైపు రష్యాతో లడాయి !

Tags

, , , , , , ,

ఎం కోటేశ్వరరావు

నాటో కూటమితో చేతులు కలిపి తమ మీద చేస్తున్న కుట్రకు ప్రతిక్రియగా ఉక్రెయిన్‌ మీద రష్యా ప్రారంభించిన సైనిక చర్య బుధవారం నాడు 1,322వ రోజులో ప్రవేశించింది. పరస్పర దాడులు కొనసాగుతున్నాయి. ఐరోపా అంతటా దోపిడీకి గురౌతున్న కార్మికుల సమ్మెలు ఒక వైపు, మరోవైపు రష్యాను దెబ్బతీసేందుకు అమెరికాతో కలసి పాలకవర్గాల కుట్రలు కనిపిస్తున్నాయి. తమ మీద దాడులు చేసేందుకు అమెరికా గనుక తోమహాక్‌ క్షిపణులను ఉక్రెయిన్‌కు ఇస్తే సంబంధాలు నాశనం అవుతాయని రష్యన్‌ అధినేత వ్లదిమిర్‌ పుతిన్‌ అమెరికానుద్దేశించి చెప్పాడు. నిజానికి ఇది ట్రంప్‌కే కాదు, కయ్యానికి ఎగదోస్తున్న యావత్‌ ఐరోపా ధనిక దేశాలకు చేసిన హెచ్చరిక. ఆ ప్రకటన మరుసటి రోజు డోనాల్డ్‌ ట్రంప్‌ విలేకర్లు అడిగిన ప్రశ్నలపై స్పందించాడు.” నేనూ కొన్ని ప్రశ్నలు అడగదలచుకున్నాను, ఆ పోరు మరింతగా పెరగాలని కోరుకోవటం లేదు ” అన్నాడు. పశ్చిమ దేశాలతో మరో ప్రచ్చన్న యుద్ధం చేస్తున్నట్లు తమ మీద చేస్తున్న ఆరోపణను రష్యా తోసిపుచ్చింది. తమ మీద దాడులు చేసేందుకు, మిలటరీ ఖర్చు పెంచేందుకు నెపాన్ని తమ మీద నెట్టాలని ఐరోపా యూనియన్‌, నాటో కూటమి దేశాలు లేని పోని కథలను వ్యాపింప చేస్తున్నాయని గత ప్రచ్చన్న యుద్దంతో పోల్చటాన్ని అంగీకరించటం లేదని రష్యా విదేశాంగ ప్రతినిధి మరియా ఝకరోవా గత వారంలో స్పష్టం చేశారు.క్రెమ్లిన్‌ ప్రతినిధి దిమిత్రి పెష్కోవ్‌ మాట్లాడుతూ ఐరోపా అంతటా ఇటీవల కనిపించిన డ్రోన్లకు రష్యా కారణమని నిందించటానికి ఎలాంటి హేతుబద్దత లేదన్నాడు.డ్రోన్ల వెనుక రష్యా ఉందని భావిస్తున్నట్లు జర్మన్‌ ఛాన్సలర్‌ ఫ్రెడరిక్‌ మెర్జ్‌ ఇటీవల చేసిన వ్యాఖ్య తరువాత ఐరోపాలోని అనేక మంది రాజకీయవేత్తలు అన్నింటికీ రష్యా కారణమని నిందిస్తున్నారన్నాడు.

క్యూబన్‌ క్షిపణుల సంక్షోభం 1962 తరువాత రష్యా మరియు పశ్చిమ దేశాల మధ్య ఉక్రెయిన్‌ సంక్షోభ రూపంలో తలెత్తిన ఘర్షణ రెండవ ప్రపంచ యుద్ధం తరువాత ఐరోపాలో తీవ్రమైనది,అతి పెద్దది. తాము ఇప్పటికే మరో రూపంలో ఉన్న ఘర్షణలో ఉన్నామని, అదేమాత్రం ప్రచ్చన్న యుద్ధం కాదు ఇప్పటికే ఇక్కడ మంటలు ఉన్నాయని మరియ ఝకరోవా చెప్పారు. అలాస్కా భేటీ తరువాత శాంతి అవకాశాలు ఆవిరవుతున్నట్లు జరిగే పరిణామాలు వెల్లడిస్తున్నాయి. తమ అజెండాను అమలు జరిపేందుకు పశ్చిమ దేశాలు సరికొత్త ప్రచారదాడిని మొదలు పెట్టాయి. తమ గగనతలాన్ని అతిక్రమిస్తున్నందంటూ వివిధ దేశాలు ఒక పథకం చేస్తున్న ప్రచారాన్ని రష్యా తిరస్కరించినప్పటికీ గోబెల్స్‌ ప్రచారం సాగుతున్నది. ఉక్రెయిన్‌పై దాడుల తీవ్రతను పెంచిన రష్యా మెల్ల మెల్లగా కొత్త ప్రాంతాలను తన ఆధీనంలోకి తెచ్చుకుంటున్నది.దానికి పోటీగా పశ్చిమ దేశాల గగనతల అతిక్రమణ కతలను ముందుకు తెచ్చాయి. ఆ పేరుతో మిలిటరీ బడ్జెట్‌లను పెంచేందుకు, సంక్షేమ పథకాలకు కోత విధించేందుకు పూనుకున్నారు. తమకు వ్యతిరేకంగా నాటో కూటమి కుట్రపన్నిందని పుతిన్‌ ఉక్రెయిన్‌ సంక్షోభ ప్రారంభానికి ముందు నుంచీ చెబుతున్నాడు.సోవియట్‌ పతనమైన 1991లో నాటో కూటమిని తూర్పు వైపు విస్తరించబోమని చెప్పి దాన్ని పశ్చిమ దేశాలు ఉల్లంఘించాయి. రష్యా సరిహద్దుల్లో ఉన్న ఉక్రెయిన్‌, జార్జియా వ్యవహారాల్లో జోక్యం చేసుకొని మాస్కో వ్యవహారాలను నియంత్రించేందుకు చూశాయని అదే తమ మిలిటరీ చర్యకు కారణమని, అలాంటి కుట్రకు స్వస్థి పలికితే వెంటనే దాడులను నిలిపివేస్తామని పదే పదే చెబుతున్నాడు.

రష్యా చెబుతున్న అంశాలను విననట్లు నటిస్తున్న పశ్చిమ దేశాలు తీవ్రమైన ఆంక్షలను ప్రకటించి దిగ్బంధనం కావించేందుకు చూసినప్పటికీ వాటన్నింటిని మాస్కో ఇప్పటి వరకు అధిగమించింది. మూడు వందల కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను దెబ్బతీసే క్షిపణులను నాటో కూటమి దేశాలు ఉక్రెయిన్‌కు అందించి దాడులు చేయించాయి.ఫలితం లేకపోవటంతో ఇప్పుడు మాస్కోతో సహా రష్యాలోని ఐరోపా ప్రాంతాలన్నింటిపైనా దాడులు చేయగల రెండున్నరవేల కిలోమీటర్ల దూరం ప్రయాణించే తమ తోమహాక్‌ క్షిపణులను అందచేయాలని అమెరికా చూస్తున్నది. అనేక ఐరోపా దేశాలు వాటిని అడుగుతున్నాయని అమెరికా ఉపాధ్యక్షుడు జెడి వాన్స్‌ వారం రోజుల క్రితం ప్రకటించాడు.నేరుగా ఉక్రెయిన్‌కు అందిస్తే విమర్శలపాలు కావాల్సి వస్తుందనే భయంతో ఇతర దేశాలకు విక్రయించి అక్కడి నుంచి మళ్లించాలన్నది ఎత్తుగడ. అయితే జెలెనెస్కీ సేనలకు వాటిని అందచేసినప్పటికీ ఉపయోగించే సామర్ధ్యం లేదు. ఆ విషయాన్ని అతడే స్వయంగా చెప్పాడు. ఆ క్షిపణులు తమ దగ్గర ఉంటే పుతిన్‌పై వత్తిడి పెంచటానికి తోడ్పడతాయని అన్నాడు. అందుకే అదే జరిగితే పశ్చిమ దేశాలతో సంబంధాల విచ్చిన్నానికి దారితీస్తుందని పుతిన్‌ హెచ్చరించాడు. ఇవ్వాలా లేదా అన్నది అమెరికా తేల్చుకోవాల్సి ఉంది. ఇస్తామంటే ఎలాంటి స్పందనలు వస్తాయో తెలుసుకొనేందుకు వాన్స్‌ ద్వారా ట్రంప్‌ మాట్లాడించాడు. రష్యా ఇంథన మౌలిక సదుపాయాలకు సంబంధించిన సమాచారాన్ని ఉక్రెయిన్‌కు అందచేసేందుకు వాషింగ్టన్‌ నిర్ణయించిందని, వాటిని ధ్వంసం చేయాలంటే దీర్ఘశ్రేణి క్షిపణులు అవసరమౌతాయని వాటిని ఇవ్వటమా లేదా అన్న గుంజాటనలో ఉన్నట్లు వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌ పత్రిక రాసింది.

అమెరికన్లు ప్రత్యక్షంగా పాల్గ్గొంటే తప్ప తోమహాక్‌ క్షిపణులను ప్రయోగించటం అసాధ్యమని, అదే జరిగితే ఉద్రిక్తలు నూతన దశకు చేరతాయని పుతిన్‌ గతవారంలో హెచ్చరించాడు. అలాంటి క్షిపణులను ఇచ్చేది లేదని గతంలో ట్రంప్‌ ప్రకటించాడు. అయితే ఉక్రెయిన్‌లో అమెరికా ప్రత్యేక రాయబారి కెయిత్‌ కెల్లాగ్‌ మాట్లాడుతూ ప్రస్తుతం రష్యా మీద దీర్ఘశ్రేణి లక్ష్యాలపై దాడులను చేసే స్థితిలో ఉక్రెయిన్‌ ఉందని ట్రంప్‌ సూచన ప్రాయంగా చెప్పినట్లు తెలిపాడు.తన పాటలకు అనుగుణ్యంగా పుతిన్‌ నృత్యం చేయటం లేదనే ఉక్రోషంతో ఈ విపరీత చర్య గురించి ఆలోచిస్తున్నట్లు చెప్పవచ్చు. పిచ్చివాడి చేతిలో రాయి మాదిరి ఎప్పుడు ఎలాంటి నిర్ణయమైనా తీసుకోవచ్చు. అమెరికా మీడియా క్సియోస్‌తో మాట్లాడిన జెలెనెస్కీ తాము కూడా రష్యా ఏది చేస్తే ప్రతిక్రియగా అదే చేస్తామన్నాడు.తమ ఇంథన వనరులపై పుతిన్‌ సేనలు దాడి చేస్తే తాము కూడా అదే చేస్తామన్నాడు.కెయిత్‌ కెలోగ్‌ ఒక మీడియాతో మాట్లాడుతూ ట్రంప్‌ ఇప్పటికే రష్యాలో ఉన్న కొన్ని ప్రత్యేక లక్ష్యాలపై దాడులకు కీవ్‌ను అనుమతిస్తున్నట్లు చెప్పాడని తెలిపాడు. సురక్షిత ప్రాంతాలనేవి లేవని అన్నాడు. ఉక్రెయిన్‌కు ఆయుధాలు నిలిపివేయాలని కోరుతున్న శక్తులపై ఇటీవల గెలిచిన చెక్‌ అధ్యక్షుడు పీటర్‌ పావెల్‌ మాట్లాడుతూ సరఫరా కొనసాగించాల్సిందే అన్నాడు. తగ్గించినా, నిలిపివేసినా మనకు మనమే హాని చేసుకున్నట్లని వ్యాఖ్యానించాడు. 650 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాల మీద దాడులు చేయగల డ్రోన్‌ క్షిపణి వ్యవస్థలను తాము స్వంతంగా తయారు చేసుకున్నట్లు ఉక్రెయిన్‌ చెప్పింది, అది నిజమో కాదో తెలియదు గానీ నిజమైతే దాని వెనుక నాటో దేశాల హస్తం ఉంటుందని వేరే చెప్పనవసరం లేదు. అంతే ఫ్లెమింగో పేరుతో తాము మూడువేల కిలోమీటర్ల దూరం ప్రయణించే క్షిపణిని తయారు చేసినట్లు కూడా కీవ్‌ చెప్పుకుంది. అంటే పశ్చిమదేశాల ఆయుధాలకు ఉక్రెయిన్‌ ముద్రవేసి రష్యా మీద దాడులకు సన్నాహాలు చేస్తున్నట్లు చెప్పవచ్చు.బహుశా వీటిని గమనించే పుతిన్‌ చేసిన తాజా హెచ్చరిక పరమార్ధం.

మరోవైపున ఐరోపా అంతటా ఇటీవల జరుగుతున్న వివిధ రంగాల సమ్మెలను గమనలోకి తీసుకోవాల్సి ఉంది. ఈ నెలలో అనేక దేశాల్లో విమానాశ్రయాల సిబ్బంది సమ్మెకు పిలుపులు ఇచ్చారు. అందువలన ప్రయాణీకులు ఒకటికి రెండుసార్లు తమ విమానాలు నడిచేదీ లేనిదీ తనిఖీ చేసుకోవాలని ఆ రంగానికి చెందిన సంస్థలు హెచ్చరిస్తున్నాయి. పని పరిస్థితులు, వేతన పెంపుదల వంటి అంశాలు ప్రధానంగా సమ్మెలకు పురికొల్పుతున్నాయి. ఇప్పటికే కొన్ని చోట్ల సమ్మెలు, ఇతర రూపాల్లో ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఆగస్టు 15 నుంచి స్పెయిన్‌లోని అనేక విమానాశ్రయాలలో సిబ్బంది ఆందోళన కారణంగా అనేక విమానాలు నిలిచిపోయాయి. ప్రతి బుధ,శుక్ర, శనివారాల్లో విమానాలు దిగేందుకు పని చేసే సిబ్బంది ఉదయం ఐదు నుంచి తొమ్మిది గంటల వరకు సమ్మెలు చేస్తున్నారు, ఈ ఆందోళన డిసెంబరు 31వరకు కొనసాగుతుందని ప్రకటించారు. ఫ్రాన్సులో తలెత్తిన రాజకీయ సంక్షోభంతో అధ్యక్షుడు ఎమ్మాన్యుయెల్‌ మక్రాన్‌ నియమించిన ఏడవ ప్రధాని లికోర్ను రాజీనామా చేశాడు. సెప్టెంబరు 9న పదవీ బాధ్యతలు స్వీకరించి కేవలం 26 రోజులు మాత్రమే పదవిలో ఉండి అతి తక్కువ కాలం ఏలుబడిలో ఉన్న వ్యక్తిగా చరిత్రకెక్కాడు. అంతకు ముందు బడ్జెట్లో కోతలను ప్రతిపాదించిన ఫ్రాంకోయిస్‌ బేయరు నాటకీయంగా గద్దె దిగాల్సి వచ్చింది.కేవలం రెండు సంవత్సరాల్లోనే ఐదుగురు ప్రధానులను నియమించారు. పోర్చుగల్‌లో వచ్చే జనవరి వరకు ప్రకటించిన 71 రోజుల ఆందోళన పిలుపును కోర్టు ఆదేశాల కారణంగా వెనక్కు తీసుకున్నారు. కనీస సిబ్బంది విధుల్లో ఉండాల్సిందే అని కోర్టు ఆదేశించింది. ఇది సమ్మెహక్కుపై నిజమైన దాడి అని కార్మిక సంఘం విమర్శించింది. ఇటలీ రవాణా రంగంలో అనేక అంశాలపై ఒప్పందాలకు రావటంలో విఫలం కావటంతో కార్మికులు ఆందోళన బాట పట్టారు. దీనికి తోడు గాజాలో ఇజ్రాయెల్‌ జరుపుతున్న మారణకాండను నిరసిస్తూ జరిగిన సాధారణ సమ్మెకు కార్మికులు మద్దతు ప్రకటించి లక్షలాది మంది ప్రదర్శనల్లో పాల్గన్నారు. చాలీ చాలని వేతనాలతో బతుకులీడుస్తున్నామని స్వంత ఇల్లు కొనుగోలు చేసేందుకు అవసరమైన రీతిలో తమవేతనాలను పెంచాలని బ్రిటన్‌లో రైల్‌,మారిటైమ్‌ మరియు ట్రాన్ప్‌పోర్ట్‌ (ఆర్‌ఎంటి) యూనియన్‌ ప్రచార ఆందోళన నిర్వహిస్తున్నది.వేతన పెంపుదలను కోరుతూ రెండు రోజుల పాటు సమ్మె జరపాలని ట్రాన్స్‌పోర్ట్‌ ఫర్‌ లండన్‌ (టిఎఫ్‌ఎల్‌) పిలుపు ఇవ్వగా 4.5శాతం పెంపుదలకు అంగీకరించటంతో ఆందోళన విరమించారు. కార్మికవర్గం జరుపుతున్న సమ్మెలకు వ్యతిరేకంగా మీడియాలో ఉన్న యాజమాన్య అనుకూల వ్యాఖ్యాతలు వక్రీకరణలతో విశ్లేషణలు రాస్తున్నారు. స్వంత ఇల్లు కొనుగోలు బ్రిటన్‌లో ఒక హక్కుగా లేదన్నది వాటిలో ఒకటి. బ్రిటన్‌లో 1947 నుంచి ప్రతి ఏటా రైల్వే కార్మికులు సమ్మెలు చేస్తున్నారంటూ ఒక వ్యాఖ్యాత ఉక్రోషం వెలిబుచ్చాడు.బడ్జెట్‌లోటు ఏర్పడినపుడల్లా ఫ్రాన్సులో ఆ భారాన్ని కార్మికవర్గం మీద నెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. గతంలో జిడిపిలో ఐదుశాతం ఉన్నపుడు 1995లో జరిగిన ఆందోళనల్లో ఇరవై లక్షల మంది రోడ్ల మీదకు వచ్చారు. నాటి ప్రధాని అలైన్‌ జుపే అంతకు ముందు ప్రతిపాదించిన అనేక పొదుపు చర్యలకు స్వస్తి పలకాల్సి వచ్చింది. ఇప్పుడు కూడా అదే జరుగుతోంది. అధ్యక్షుడు మక్రాన్‌ 2023లో ఉద్యోగ విరమణ వయస్సును 62 నుంచి 64 సంవత్సరాలకు పెంచి పెన్షన్‌ బిల్లును తగ్గించేందుకు చూశాడు.ఇప్పుడు మరో మితవాద ప్రధాని లీకొర్ను అదే విధానాలతో ఇంటిదారి పట్టాడు.ఐరోపా పాలకవర్గ సంక్షోభం, దానికి కార్మికవర్గం నుంచి ఎదురవుతున్న ప్రతిఘటనకు ఇది ఒక సాక్ష్యం.

పసిడి ధర ఐదేండ్లలో మూడు రెట్లు పెరుగుదల ? ప్రపంచ అప్పుకు దీనికి సంబంధం ఉందా !

Tags

, , , , , ,

ఎం కోటేశ్వరరావు

ఈ ఏడాది తొలి ఆరునెలల్లో ప్రపంచ రుణం 338 లక్షల కోట్ల డాలర్లకు చేరింది. ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఇంటర్నేషనల్‌ ఫైనాన్స్‌(ఐఐఎఫ్‌) సంస్థ తాజాగా విడుదల చేసిన నివేదికలో ఈ వివరాలు ఉన్నాయి.(ఎవరికైనా ఆసక్తి ఉండి యుఎస్‌ డెబిట్‌ క్లాక్‌ డాట్‌ ఓఆర్‌జి వెబ్‌సైట్‌లోకి వెళితే ప్రతి క్షణం ఏ దేశానికి ఎంత అప్పు పెరుగుతున్నదో చూడవచ్చు.) మన జిడిపి నాలుగు లక్షల కోట్ల డాలర్లు, ప్రపంచ రుణం మాత్రం ప్రతి నెలా సగటున 3.4లక్షల కోట్ల డాలర్లు పెరుగుతున్నది.ఈ లెక్కన ఈ ఏడాది డిసెంబరు నాటికి మరో 20లక్షల కోట్ల డాలర్ల మేర ప్రపంచ రుణం పెరగనుంది. ఇలా పెరుగుతున్న అప్పులతో జనాలకు తిప్పలు కూడా అధికం అవుతున్నాయి. అమెరికా కరెన్సీ డాలరు ఈ ఏడాది జనవరి నుంచి 9.75శాతం పతనమైంది. అందువలన రుణం బాగా పెరిగినట్లు కనిపిస్తోందని కొంత మంది భాష్యం చెబుతున్నారు. కరోనా వచ్చిన 2020లో ఈ మాదిరి భారీ పెరుగుదల ఉంది. ఇప్పుడు అలాంటి పరిస్థితి లేకున్నా పెరగటం ఆందోళన కలిగిస్తున్నది. కుటుంబాలకు అప్పులు పెరిగితే ఏమౌతుంది. దానికి తగిన రాబడి లేకపోతే వాటిని తీర్చేందుకు కొన్ని కుటుంబ అవసరాలను తగ్గించుకొని రుణ చెల్లింపులకు కొంత మొత్తాన్ని మళ్లించాల్సి వస్తుంది. ప్రభుత్వాలు అయినా చేస్తున్నది అదే. ఉదాహరణకు ప్రపంచంలో అత్యధికంగా అమెరికా అప్పు 37.5లక్షల కోట్ల డాలర్లు. దానికి ఏటా చెల్లిస్తున్న వడ్డీ,అసలు మొత్తం 1.157లక్షల కోట్ల డాలర్లు. కొత్తగా తీసుకొనే అప్పులో సగానికి పైగా రుణ చెల్లింపులకే పోతున్నది.

అప్పులు పెరిగే కొద్దీ చేసిన వాగ్దానాలకు, అమలు చేస్తున్న పథకాలకు ఏదో ఒక సాకుతో కోత పెడతున్నారు.నిజానికి సామాన్యులకు ఏం జరుగుతున్నదో కూడా తెలియటం లేదు. నరేంద్రమోడీ సర్కార్‌ తీరుతెన్నులను చూద్దాం. మన దేశ మొత్తం అప్పు 2025 మార్చి నాటికి రు.181,74,284 కోట్లు దీన్ని 2026 మార్చి నాటికి రు.196,78,772 కోట్లకు పెంచుతామని బడ్జెట్‌లో పేర్కొన్నారు. శాశ్వత ఆస్తుల కల్పనకు మూలధన పెట్టుబడిగా పెట్టాలి లేదా సంక్షేమానికి కేటాయించాలి.అప్పు తెస్తామన్న రు.15.69లక్షల కోట్లలో వడ్డీలు, అసలు చెల్లించేందుకు రు. 12.76లక్షల కోట్లు కేటాయించారు.2024-25 బడ్జెట్‌లో సబ్సిడీలకు రు.4.28లక్షల కోట్లు కేటాయించి పదకొండువేల కోట్లు కోత పెట్టారు. తాజా బడ్జెట్‌లో రు.4.26వేల కోట్లు మాత్రమే కేటాయించారు. మొత్తం మీద గతేడాది కేటాయింపులతో పోలిస్తే 0.4శాతం తగ్గించారు. నూతన ఉపాధి కల్పన పధకానికి గతేడాది పదివేల కోట్లు కేటాయించి 6,800 కోట్లు ఖర్చు చేసి వర్తమాన కేటాయింపుల్లో 20వేల కోట్లు చూపి 194శాతం అదనం అని గొప్పలు చెప్పారు.గ్రామీణ ప్రాంతాలకు మంచినీటిని అందచేసే జలజీవన్‌ పథకానికి 70వేల కోట్లు కేటాయించి చేసిన ఖర్చు చేసిన కేవలం 22.693వేల కోట్లు మాత్రమే. ఈ ఏడాది 67వేల కోట్లు కేటాయించి చూశారా 195 శాతం పెంచామంటూ ఊదరగొడుతున్నారు. వీటన్నింటినీ నిజంగా ఖర్చు చేస్తారా అన్నది చూడాలి. ఎరువుల సబ్సిడీగా 2023-24లో రు.1.88 వేల కోట్లు ఖర్చు చేసిన సర్కార్‌ ఈ ఏడాది దాన్ని 1.67లక్షల కోట్లకు కోత పెట్టింది. ఈ కారణంగానే అవసరమైన మేరకు యూరియా ఇతర ఎరువులను దిగుమతి చేసుకోకుండా డబ్బు మిగుల్చుకొని రైతాంగాన్ని ఇక్కట్ల పాలు చేసింది. కార్పొరేట్‌ పన్ను తగ్గించిన కారణంగా గతేడాది లక్ష కోట్ల మేరకు ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయానికి కోత పడింది. ఇవన్నీ చూసినపుడు పాత అప్పులు తీర్చేందుకు కొత్త అప్పులు, కార్పొరేట్లకు రాయితీల కొనసాగింపు, కోట్లాది మంది రైతాంగానికి, ఇతరులకు సబ్సిడీల కోత స్పష్టంగా కనిపిస్తున్నది.

నరేంద్రమోడీ మిత్రుడు డోనాల్డ్‌ ట్రంప్‌ చేస్తున్నది కూడా ఇదే. వివిధ దేశాల వస్తువుల మీద దిగుమతి పన్నులు వేసి రానున్న పది సంవత్సరాల కాలంలో నాలుగు లక్షల కోట్ల డాలర్ల మేర లోటుబడ్జెట్‌ను తగ్గించుకోవాలని చూస్తున్నాడు. దీన్ని మరోవిధంగా చెప్పాలంటే ఆ పన్నుల మొత్తాన్ని చెల్లించాల్సింది సామాన్య పౌరులే గనుక తన అసమర్ధతను జనం మీద రుద్దుతున్నట్లే. నరేంద్రమోడీ చేస్తున్నది కూడా అదే మన అవసరాల్లో 80శాతం ముడిచమురును దిగుమతి చేసుకుంటున్నాం.దాని ఉత్పత్తులైన పెట్రోలు, డీజిలుపై సెస్‌, ఇతర పన్నుల భారాన్ని పెంచారు. మోడీ అధికారానికి వచ్చిన 2014-15 ఆర్థిక సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వ పెట్రోలియం ప్లానింగ్‌ ఎనాలసిస్‌ సెల్‌ సమాచారం ప్రకారం ఎక్సైజ్‌ డ్యూటీ రు.99,068 కోట్లు, దాన్ని 2020-21 నాటికి రు.3,72,930 కోట్లకు పెంచారు. తరువాత ఎన్నికలు, తదితర కారణాలతో 2023-24 నాటికి రు.2,73,684 కోట్లకు తగ్గించారు. ఏటా లక్షా 73వేల కోట్ల మేర జనం నుంచి అదనంగా వసూలు చేస్తున్నారు. 2022 ఏప్రిల్‌ నుంచి ఇప్పటి వరకు ముడి చమురు ధర పీపాకు 20డాలర్లు తగ్గినా ఒక్క పైసా కూడా వినియోగదారులకు ధరలు తగ్గించలేదు. రష్యా నుంచి చౌకధరలకు ముడి చమురు దిగుమతి చేసుకొని లాభాలకు ఐరోపా దేశాలకు ఉత్పత్తులను అమ్మిస్తున్నారు. దేశంలో ముడిచమురు ఉత్పత్తి 2014-15లో ప్రభుత్వ-ప్రైవేటు ఉత్పత్తి 35.9 మిలియన్‌ టన్నులుంటే 2023-24నాటికి 27.2మి.టన్నులకు పడిపోయింది. అందుకే అభివృద్ధి కోసం రుణాలు చేస్తున్నామని రాజకీయ నేతలు చెప్పే మాటలు బూటకం అని చెప్పాల్సి వస్తోంది.

కేంద్ర ప్రభుత్వమే కాదు, రాష్ట్రాలు కూడా నానాటికీ రుణ ఊబిలో కూరుకుపోతున్నాయి. అవి కూడా సంక్షేమ పథకాలకు కోత పెడుతున్నాయి.హిమచల్‌ ప్రదేశ్‌ ప్రభుత్వం పద్నాలుగు రకాల సబ్సిడీలను క్రమబద్దీకరించే పేరుతో కోత పెట్టేందుకు కసరత్తు చేస్తున్నది.మహారాష్ట్రలో రెండింజన్ల పాలన ఉంది. రాష్ట్ర రుణ భారం 9.25లక్షల కోట్లకు పెరగనుంది. ఎన్నికలకు ముందు ముఖ్యమంత్రి లడకీ బహిన్‌ పధకానికి రు.46వేల కోట్లు కేటాయించారు. తాజాగా దాన్ని రు.36వేల కోట్లకు కోత పెట్టారు.వృద్ధులకు యాత్రల సబ్సిడీ కొత్త కేటాయింపులు లేవు. మరో రెండింజన్ల పాలన రాష్ట్రం మధ్య ప్రదేశ్‌. అక్కడ ప్రాధమిక పాఠశాల విద్యకు ఈ ఏడాది రు.15,509 కోట్ల నుంచి రు.11,837 కోట్లకు కుదించారు. మహిళలకు ఉచిత బస్‌ పథకాన్ని ప్రకటించిన కర్ణాటక సర్కార్‌ 15శాతం బస్‌ ఛార్జీలను పెంచింది.

ఒక్క చైనా తప్ప రుణ భారం పెరిగిన ప్రపంచ దేశాలన్నింటా సంక్షేమ పథకాలకు కోత పెడుతున్నారు. అందుకే అనేక చోట్ల వలస వచ్చిన వారు తమ అవకాశాలను తన్నుకుపోతున్నారంటూ మితవాద శక్తులు జనాలను రెచ్చగొడుతున్నాయి.జి 7 దేశాలతో పాటు చైనా రుణభారం గణనీయంగా పెరుగుతున్నట్లు ఐఐఎఫ్‌ నివేదిక పేర్కొన్నది.అమెరికా వెబ్‌సైట్‌ సమాచారం ప్రకారం జపాన్‌ పన్నెండు లక్షల కోట్ల డాలర్ల రుణం కలిగి ఉంది. ఇది జిడిపికి 293శాతం ఎక్కువ. ఇంత రుణం కలిగిన జపాన్‌ అమెరికాకు లక్ష కోట్ల డాలర్ల రుణం ఇచ్చింది. అదే విధంగా జిడిపిలో 86.7శాతం 16లక్షల కోట్ల రుణం ఉన్న చైనా మరోవైపున అమెరికాకు 750 బిలియన్‌డాలర్ల రుణం ఇచ్చింది. ఇతర దేశాలలో సూడాన్‌ రుణం జిడిపికి 252 శాతం ఉంది. నిరంతరం అంతర్యుద్ధాలతో సూడాన్‌ అప్పు పెరిగింది. జపాన్‌లో కార్పొరేట్లకు ఉద్దీపన పథకాలు, వృద్ధుల సంఖ్య పెరగటం కారణాలుగా చెబుతున్నారు. సింగపూర్‌ 175, బహరెయిన్‌ 141, ఇటలీ 137 అమెరికా 123శాతం రుణభారంతో ఉన్నాయి. ధనిక దేశాలు ఇలా ఉండటానికి కారణంగా కార్పొరేట్లకు ఇస్తున్న రాయితీలే ప్రధాన కారణం. ధనిక దేశాలకు సగటున 110, వర్దమాన దేశాలకు 74శాతం రుణభారం ఉంది. ధనిక దేశాల కంటే వర్ధమానదేశాల రుణ భారం వేగంగా పెరగటం ఆందోళన కలిగిస్తోందని ఐఎంఎఫ్‌ హెచ్చరించింది.గతంలో యుద్ధ సమయాల్లోనే దేశాలు పెద్ద మొత్తంలో రుణాలు తీసుకొనేవి. 1980దశకం నుంచి అభివృద్ధి పేరుతో ప్రభుత్వాలు రుణాలు తీసుకోవటం జరుగుతున్నది. చిత్రం ఏమిటంటే అప్పులు పెరుగుతున్నాయి అభివృద్ధి దిగజారుతున్నది, అనేక ధనిక దేశాల అనుభవం ఇదే. అంటే అభివృద్ధికి అప్పులు అనేది పూర్తిగా నిజం కాదు. అనేక దేశాలు రుణాలు తీసుకోవటమే కాదు ఇస్తున్నాయి. ఉదాహరణకు పన్నెండు లక్షల కోట్ల డాలర్ల రుణం ఉన్న జపాన్‌ అమెరికాకు లక్ష కోట్లతో సహా ఇతర దేశాలన్నింటికీ ఇస్తున్న రుణం 2024 నవంబరు నాటికి 4.18 లక్షల కోట్ల డాలర్లకు చేరింది.ఇలాగే ఇతర దేశాలు కూడా ఇస్తున్నాయి. అందువలన ఇలాంటి వాటన్నింటినీ పరిగణనలోకి తీసుకొంటే నిఖరంగా ఎంత అప్పు అన్నది తేలుతుంది. మన జిడిపి చాలా తక్కువే అయినప్పటికీ 216, చైనా 750 బిలియన్‌ డాలర్లు అమెరికాకు అప్పు ఇచ్చాయి. కరీబియన్‌ సముద్రంలో కేమన్‌ దీవుల జనాభా 90వేలకు అటూ ఇటూ, అది అమెరికాకు ఇచ్చిన అప్పు 2024లో 423 బిలియన్‌ డాలర్లు. అదెలా అంటే అదొక పన్నుల స్వర్గం, అక్కడ డబ్బుదాచుకుంటే ఎవరూ లెక్కలు చెప్పాల్సిన అవసరం లేదు. ఇతర దేశాల్లో పన్నులు ఎగవేసిన పెద్దల నల్లధనం మొత్తం ఇలాంటి చోట్లకు చేర్చి అక్కడి నుంచి ఏ దేశానికైనా రుణాలు ఇచ్చి బ్లాక్‌ను వైట్‌గా మార్చుకుంటారు. అమెరికా అప్పు 37.5లక్షల కోట్ల డాలర్లలో అక్కడి ఫెడరల్‌ రిజర్వు ప్రభుత్వం జారీచేసిన రుణబాండ్లను ఆరులక్షల డాలర్లమేర కొనుగోలు చేసింది, అంటే అప్పు ఇచ్చింది. మన కేంద్ర ప్రభుత్వ మొత్తం రుణం 196లక్షల కోట్లలో 190లక్షల కోట్లు అంతర్గత రుణాలే. అంటే మన బాంకులు, ఉద్యోగులు, ద్రవ్య సంస్థలు ఇచ్చిన అప్పులే అవి. వడ్డీ రాబడి కోసం ఇదంతా జరుగుతున్నది. ఇతర దేశాల మాదిరి జిడిపిలో మన రుణం 93శాతం, దానికి మించి పెరిగితే ఇబ్బందులు వస్తాయి.

ఒక వైపు అప్పులు పెరుగుతుంటే మరోవైపు ప్రపంచ మార్కెట్లో బంగారం ధర దూసుకుపోతోంది.ఈ రెండింటికీ సంబంధం ఉంది అంటున్నారు. గత చరిత్ర ఇదే చెబుతోంది.రుణాలు పెరిగే కొద్దీ కరెన్సీ విలువలు కూడా పడిపోతున్నాయి. ఈ నేపధ్యంలోనే దేశాలూ, వ్యక్తులూ కూడా బంగారం కొనుగోళ్లు సురక్షితం అని భావిస్తున్నారు.మొదటి ప్రపంచ యుద్ధంలో అప్పులపాలైన జర్మనీ తీర్చేందుకు 1920దశకంలో విపరీతంగా నోట్లను ముద్రించింది. దాంతో ద్రవ్యోల్బణం పెరిగి నోట్లు దేనికీ పనికిరాకుండా పోయాయి. జనాలు కరెన్సీ నోట్లను గోడలకు కాగితాల మాదిరి అంటించి నిరసన తెలిపారు. సంక్షోభాలకు బీమా వంటిది బంగారం అని చెబుతారు. ఇప్పుడు ప్రపంచంలో రిజర్వు ఆస్తులలో బంగారానిది రెండవ స్థానం.ప్రపంచ ధనిక దేశాల్లో 2008లో తలెత్తిన ద్రవ్య సంక్షోభంతో ఉద్దీపన పథకాలు అమలు జరిపిన కారణంగా ప్రపంచ రుణం 2007 నుంచి 2009 కాలంలో 20శాతం పెరిగి 178లక్షల కోట్ల డాలర్లకు చేరింది. ఇదే సమయంలో బంగారం ఔన్సు(28.35గ్రాములు) ధర 869 డాలర్ల నుంచి 1,224 డాలర్లకు చేరింది. ఇప్పుడు ప్రపంచ రుణం ముందే చెప్పుకున్నట్లు 338లక్షల కోట్లడాలర్లు దాటింది. ప్రస్తుతం ఔన్సు ధర 3,800 డాలర్లుగా ఉన్నది త్వరలో 4,800 డాలర్లకు పెరగవచ్చని జోశ్యం చెబుతున్నారు. ఐరోపాలో 2011-2012లో తలెత్తిన రుణ సంక్షోభ సమయంలో మదుపుదార్లకు యూరో మీద విశ్వాసం తగ్గి బంగారంవైపు మొగ్గు చూపటంతో 2011 సెప్టెంబరులో 1,920 డాలర్లకు పెరిగింది. జపాన్‌లో 2020-21 సంవత్సరాలలో రుణ భారం 266శాతానికి పెరగటంతో మదుపుదార్లు బంగారం కొనుగోలుకు ఎగబడటంతో కరెన్సీ విలువలో ధర 18శాతం పెరిగింది.2024లో అమెరికా ఐపి పెట్టేవరకు వచ్చి బయటపడింది.రుణం 34లక్షల కోట్ల డాలర్లు దాటింది.దాంతో బంగారం ధర 2,100 డాలర్లకు పెరిగింది. ఏడాది కాలంలోనే 3,800 డాలర్లకు చేరిందంటే సంక్షోభం మరింత ముదురుతున్నట్లు మదుపుదార్లు భావిస్తున్నారు.ప్రస్తుతం ప్రపంచ రుణం జిడిపిలో 95శాతం ఉంది, 2030 నాటికి అది వందశాతానికి చేరవచ్చని ఐఎంఎఫ్‌ అంచనా వేసింది. అంటే సామాన్యులకు ముప్పు మూడినట్లే ! మరి బంగారం ధర సంగతి ? జోశ్యాలను చూస్తే సామాన్యులు దానివైపు చూడనవసరం లేదనట్లుగా ఉన్నాయి. అక్టోబరు ఒకటవ తేదీన ఔన్సు ధర 3,875 డాలర్లకు చేరింది.1999లో కనిష్ట ధర 252 డాలర్లు. డిసెంబరు ఆఖరుకు 4,036 డాలర్ల వరకు పెరగవచ్చని ఆ రంగ నిపుణులు చెబుతున్నారు. కొందరైతే 4,289 డాలర్లకు చేరవచ్చన్నారు.వచ్చే ఏడాది(2026) ఆఖరుకు 5,488 డాలర్లు, 2027-30 మధ్య 5,479 నుంచి 7,956 డాలర్ల మధ్య ధర ఉండవచ్చని కొందరు చెబుతుంటే 2030 నాటికి 11,330 డాలర్లకు పెరగవచ్చని మరికొందరు. కొనుగోలు చేయాలా వద్దా ? ఎవరికి వారు నిర్ణయించుకోవాల్సిందే !

ఎముకలు కుళ్లిన, వయస్సు మళ్లిన సోమరులారా చావండి – సోషలిజానికి సై అంటున్న నెత్తురు మండే, శక్తులు నిండే అమెరికా యువత !

Tags

, , , , , , , ,

ఎం కోటేశ్వరరావు

అమెరికాలో ఉన్న మీడియా, కొంత మంది ప్రముఖ వ్యాఖ్యాతలు తెలిసిగానీ తెలియకగానీ, వ్యతిరేక భావంతో, వక్రీకరించి సోషలిజం, కమ్యూనిజాల గురించి తెగ ప్రచారం చేస్తున్నారు. యువత వామపక్ష భావాలవైపు మళ్లకుండా ఉండాలంటే ఇదే దారి అని భావిస్తున్నట్లుగా కనిపిస్తున్నది. ” ట్రంప్‌ సోషలిస్టా ? మీడియా అలా ఆలోచిస్తున్నది ” అనే శీర్షికతో ట్రిల్‌ అనే మాగజైన్‌ సెప్టెంబరు 26న ఒక విశ్లేషణ రాసింది. దాని సారాంశం ఇలా ఉంది. మీడియా, కొంత మంది ప్రముఖులు ట్రంప్‌ చర్యలను కొన్నింటిని వర్ణించేందుకు సోషలిస్టు అనే పదాన్ని వినియోగించినట్లు, ఆ పదం సరైనదేనా అంటూ వర్ణన సాగింది. గతనెలలో అట్లాంటిక్‌ పత్రిక ప్రచురించిన ఒక వ్యాసానికి ” ట్రంప్‌ మితవాద సోషలిజం ” అనే శీర్షిక పెట్టింది. ప్రైవేటు రంగంలో ఉన్న మీడియా, విశ్వవిద్యాలయాలు, న్యాయ కంపెనీల పట్ల ట్రంప్‌ నిరంకుశ పోకడలను ప్రత్యేకంగా ప్రస్తావించి ఆట్లాంటిక్‌ పత్రిక విశ్లేషణ రాసింది. ఈ పూర్వరంగంలో అనేక ప్రసారాల్లో, ప్రముఖులు కూడా ట్రంప్‌ జోక్యాల మీద అలాంటి వర్ణనలు చేస్తున్నారు.వారిలో కాలిఫోర్నియా డెమోక్రటిక్‌ గవర్నర్‌ గావిన్‌ న్యూసమ్‌ ఒకడు. రిపబ్లికన్‌ పార్టీ సెనెటర్‌ రాండ్‌ పాల్‌ కూడా సోషలిజం వైపుగా ఒక అడుగు వేసినట్లు ట్రంప్‌ గురించి వ్యాఖ్యానించాడు. ఫార్యూన్‌ పత్రిక ” మాగా (మేక్‌ అమెరికా గ్రేట్‌ ఎగైన్‌ -అమెరికాను మరోసారి అగ్రస్థానంలో నిలపండి) కార్యక్రమం మార్క్సిస్టుగా ఇంకా చెప్పాలంటే పెరిగి మావోయిస్టుగా ” ఉన్నట్లు పేర్కొన్నది. ఇక న్యూయార్క్‌ టైమ్స్‌ పత్రికైతే పెట్టుబడిదారీ విధానం మీద దాడి అంటూ ట్రంప్‌ చర్యలను వర్ణించింది.అధ్యక్షుడిని కామ్రేడ్‌ అని వర్ణించింది. ఇంటెల్‌ కంపెనీలో పదిశాతం వాటాలను ప్రభుత్వం తీసుకోవటాన్ని సోషలిజంగా వ్యాఖ్యాత పేర్కొన్నాడు.

సోమవారం నాడు డెమోక్రటిక్‌ పార్టీకి చెందిన మాజీ ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌ ” మనం ఒక కమ్యూనిస్టు నియంత ” తో వ్యహరిస్తున్నాం అని చెప్పారు. ” నూట ఏడు రోజుల జ్ఞాపకాలు ” అనే పేరుతో రాసిన సంకలనాన్ని ఆమె విడుదల చేశారు. ట్రంప్‌ రెండవ ఏలుబడి ఎలా ఉంటుందో ఆమె జోశ్యం చెప్పారు. ప్రైవేటు రంగం అణగిమణిగి ఉంటుందని తాను అనుకోవటం లేదని పేర్కొన్నారు. సోమవారం రాత్రి ఒక టీవీలో మాట్లాడుతూ పరిశ్రమలో అగ్రగణ్యులు ప్రజాస్వామ్య పరిరక్షకులుగా ఉంటారని ఆశించానని, వారు మౌనంగా ఉన్నారని చెప్పారు. ప్రజాస్వామ్యం పెట్టుబడిదారీ విధానాన్ని నిలబెడుతుంది, పెట్టుబడిదారీ విధానం ప్రజాస్వామ్యంలో వర్ధిల్లుతుంది అన్నారు. గత ఏడాది తాను ట్రంప్‌ను ఒక క్రూరుడు అని వర్ణించానని ఇప్పుడు అతనితోనే పని చేస్తున్నామని చెప్పారు. మన ప్రజాస్వామ్యాన్ని కమ్యూనిస్టు నియంతలతో పోలిస్తే మనం ఇప్పుడు నియంత ట్రంప్‌తోనే వ్యవహరిస్తున్నామన్నారు.కార్పొరేట్‌ శక్తులు ట్రంప్‌ బెదిరింపులకు భయపడి నోరు విప్పటం లేదని చెప్పారు.

అమెరికాలో కమ్యూనిస్టు వ్యతిరేకతను రెచ్చగొట్టటంలో, వక్రీకరించటంలో రిపబ్లికన్లు, డెమోక్రాట్లు దొందూ దొందే. ఈ రెండు పార్టీలను అనుసరించే మీడియా గురించి ప్రత్యేకంగా చెప్పనవసరంలేదు. రాజును మించిన రాజభక్తిని ప్రదర్శించినట్లుగా వ్యవహరిస్తున్నాయి. వారెంతగా రెచ్చగొట్టినా అక్కడ జరుగుతున్నదానిని చూస్తే ఎముకలు కుళ్లిన వయస్సు మళ్లిన సోమరులారా చావండి, నెత్తురు మండే శక్తులు నిండే సైనికులారా రారండీ అంటూ మహాకవి శ్రీశ్రీ యువతరానికి ఆహ్వానం పలికాడు. ఇటీవలి కాలంలో అమెరికాలో జడ్‌ జనరేషన్‌ సోషలిజం, కమ్యూనిజం పట్ల సానుకూలతను వ్యక్తం చేయటాన్ని చూస్తే సోషలిస్టు జగన్నాధ రధ చక్రాలను అడ్డుకోవటం శత్రువుల వల్లకాదన్నది స్పష్టం.పెట్టుబడిదారీ విధాన కుంభస్థలం వంటి న్యూయార్క్‌ నగరంలో నవంబరులో జరిగే మేయర్‌ ఎన్నికలో డెమోక్రటిక్‌ సోషలిస్టు జోహ్రాన్‌ మమ్దానీ తాజా సర్వేల ప్రకారం 45శాతం ఓట్లతో ముగ్గురు ప్రత్యర్ధులకంటే ఎంతో ముందున్నాడు. సమీప ప్రత్యర్ధి, డెమోక్రటిక్‌ పార్టీ తిరుగుబాటు నేత మాజీ గవర్నర్‌ ఆండ్రూ కుమో 25శాతం దగ్గరే ఉన్నాడు. అదే పార్టీకి చెందిన ప్రస్తుత మేయర్‌ ఎరిక్‌ ఆడమ్స్‌ కూడా తిరుగుబాటు అభ్యర్థిగా పోటీలో ఉన్నాడు.న్యూయార్క్‌ మేయర్‌ ఎన్నికల్లో డెమోక్రటిక్‌ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న డెమోక్రటిక్‌ సోషలిస్టు జోహ్రాన్‌ మమ్దానీకి ఓటు వేయాలని కోరుతూ న్యూయార్క్‌ రాష్ట్ర గవర్నర్‌ కాథీ హౌచుల్‌ ప్రకటన చేయటంతో డోనాల్డ్‌ ట్రంప్‌ చిందులు తొక్కాడు. గత కొద్ది నెలలుగా తాను మేయర్‌ ఎన్నికల్లో జోక్యం చేసుకోనంటూ గవర్నర్‌ దూరంగా ఉండి ఆకస్మికంగా మద్దతు ప్రకటించింది. దాంతో కేంద్రం ఇచ్చే నిధులు నిలివేస్తానని ట్రంప్‌ బెదిరించాడు.కరుడు గట్టిన కమ్యూనిస్టుకు గవర్నర్‌ మద్దతు ప్రకటించాడంటూ వ్యాఖ్యానించాడు.అదెలా జరుగుతుంది, వాషింగ్టన్‌ (ఫెడరల్‌ ప్రభుత్వం) పరిస్థితిని దగ్గరగా పరిశీలిస్తున్నదని పేర్కొన్నాడు.మమ్దానీ ఎన్నికైతే పోలీసు యంత్రాంగానికి నిధుల కోత పెడతాడని, పౌరులకు రక్షణ ఉండదని వ్యతిరేకులు ప్రచారం చేస్తున్నారు.గాజాలో ఇజ్రాయెల్‌ జరుపుతున్న దారుణాలను వ్యతిరేకించటం, పాలస్తీనియన్లకు మద్దతు ప్రకటించటాన్ని ట్రంప్‌ జీర్ణించుకోలేకపోతున్నాడు. ధనికుల మీద పన్నులు పెంచుతానంటూ చేసిన వాగ్దానంతో ధనికులుగా ఉన్నవారు ఎలాగైనా ఓడించాలని పెద్ద ఎత్తున డబ్బు సంచులతో రంగంలోకి దిగారు. ఆ పన్నులతో నగర పౌరులకు ఉచిత బస్‌ ప్రయాణం, పిల్లల సంరక్షణ కేంద్రాలు, కార్పొరేషన్‌ తరఫున చౌకధరలకు సరకులను అందించే దుకాణాలను ప్రారంభిస్తానని, అద్దెలను పెంచకుండా చూస్తానని కూడా మమ్దానీ చెప్పాడు.

గతంలో సోషలిజం విఫమైంది అన్న ప్రచారం పెద్ద ఎత్తున జరగింది. ఇప్పుడు సోషలిజం విఫలమైంది అనే భావన రోజు రోజుకూ పెరుగుతున్నది. ఇటీవల కాటో, యు గవ్‌ సంస్థలు జరిపిన సర్వేలో అమెరికా సమాజంలో మార్పులు కనిపించాయి. విద్యా సంస్థలు, మీడియాలో కమ్యూనిస్టు వ్యతిరేక ప్రచారం యువత మీద పెద్దగా కనిపించటం లేదని చెప్పవచ్చు. మొత్తంగా సోషలిజం పట్ల 43, కమ్యూనిజం పట్ల 14శాతం, 18-29 ఏండ్ల మధ్య వయస్సువారిలో సోషలిజం పట్ల 62శాతం, కమ్యూనిజం పట్ల 34శాతం మంది సానుకూల వైఖరిని వెల్లడించారు. అమెరికా సమాజంలో 18-29 సంవత్సరాల వయస్సు వారు 5.2కోట్ల మంది ఉన్నారు, అంటే 3.2 కోట్ల మంది సోషలిజం పట్ల సానుకూలతను ప్రదర్శించినట్లు అయితే సోషలిజం అంటే ఏమిటో నిర్వచించలేదు గనుక స్పష్టత లేదని కొందరు భాష్యం చెబుతున్నారు. కొంత మంది అలా ఉన్నప్పటికీ సైద్దాంతిక చర్చ జరుగుతున్నది గనుక తెలుసుకోవటం అసాధ్యమేమీ కాదు.డెమోక్రటిక్‌ పార్టీలో 66శాతం మంది సోషలిజం పట్ల సానుకూలంగా ఉన్నారని కూడా సర్వేలు వెల్లడించాయి. అసలు విషయం ఏమంటే ఎవరెన్ని చెప్పినా కమ్యూనిస్టు వ్యతిరేకులకు ఇది పెద్ద దెబ్బ.సోషలిజానికి అనుకూలమా కాదా అనేదాని కంటే పెట్టుబడిదారీ విధానం వైఫల్యం చెందిందని గ్రహించటం కూడా పాలకవర్గాలకు ఆందోళన కలిగించే అంశం. డోనాల్డ్‌ ట్రంప్‌ మరియు సోషలిజం గురించి వ్యంగ్యంగా ఉక్రోషంతో మీడియా ఏమి రాసినప్పటికీ అసలు సోషలిజం అంటే ఏమిటి అని తెలుసుకొనేవైపు యువతను నెడుతుండటం ఒక విధంగా మంచి పరిణామమే.

మొత్తంగా సమాజంలో 14 శాతం, 18-29 ఏండ్ల యువతలో 34శాతం మంది కమ్యూనిజం పట్ల సానుకూలత వ్యక్తం చేయటాన్ని జీర్ణించుకోలేని వారు కమ్యూనిజం పని చేయదని యువతరం తెలుసుకోవాలంటూ విశ్లేషణలు రాస్తున్నారు. పాత చింతకాయ పచ్చడి జాడీల దుమ్ముదులుపుతున్నారు. సోషలిజం పని చేయకపోతే వివిధ రంగాలలో కమ్యూనిస్టు చైనా నేడు అమెరికాను సవాలు చేసే స్థితికి ఎలా ఎదిగిందన్నదానికి సమాధానం చెప్పటం లేదు.ఆస్ట్రేలియాలోని లేబర్‌ పార్టీ నిజానికి ఒక బూర్జువా పార్టీ తప్ప మరొకటి కాదు. ప్రస్తుతం అధికారంలో ఉంది. దాని పోకడ నయా కమ్యూనిజం వైపు ఉన్నదంటూ వ్యతిరేకులు ధ్వజమెత్తుతున్నారు. వారు చూపుతున్న కారణాలేమిటంటే ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాలను అమలు జరుపుతున్నదన్నది ఒకటి. స్వేచ్చ తక్కువగా ఉండే విధానాలను అనుసరిస్తున్నదని, ఆ ప్రాంతంలో చైనా ప్రాబల్యాన్ని అడ్డుకోలేకపోతున్నదని, ప్రధాని ఆల్బనీస్‌ రాజకీయ జీవితం ప్రారంభ దినాల్లో కమ్యూనిస్టు ఉద్యమంతో దగ్గరి సంబంధాలు కలిగి ఉన్నాడని, కమ్యూనిస్టులను పొగిడాడని, కొంత మంది లేబర్‌ పార్టీ నేతలకు చైనా కమ్యూనిస్టు పార్టీతో సంబంధాలు ఉన్నాయని, చైనా బిల్డింగ్‌ అసోసియేషన్‌ సభ్యులతో కలసి భోజనం చేశారని, గతంలో ఆల్బనీస్‌ పొరుగున ఉన్న విక్టోరియా రాష్ట్ర మాజీ ప్రధాని డేనియల్‌ ఆండ్రూస్‌ చైనాను చూసి కరోన సమయంలో కఠిన నిబంధనలను అమలు జరిపాడని, చైనా మిలిటరీ పరేడ్‌కు వెళ్లాడని, రెండవసారి గెలిచిన తరువాత షీ జింపింగ్‌తో భేటీ కోసం ఆల్బనీస్‌ ఆరు రోజుల పాటు జరిపిన చైనా పర్యటన అనుమానాస్పదంగా ఉందంటూ ఒక వ్యాఖ్యాత తన చౌకబారు తనాన్ని వెల్లడించుకున్నాడు.

సోషలిజం, కమ్యూనిజాలకు వ్యతిరేకంగా జరుగుతున్న ప్రచారానికి ఇవి మచ్చుతునకలు మాత్రమే. ఐరోపా, ఇతర అనేక దేశాల్లో ఇలాంటి వక్రీకరణలు నిత్యకృత్యం. అగ్రభాగాన ఉన్న అమెరికాలో న్యూయార్క్‌, మినియపోలిస్‌ పట్టణ మేయర్లకు జరిగే ఎన్నికలలో డెమోక్రటిక్‌ సోషలిస్టులు జోహ్రాన్‌ మమ్దానీ, ఓమా ఫతే పోటీ చేస్తున్నారు. వారు ఓడినా, గెలిచినా అమెరికాలో పెనుమార్పులు ఇప్పటికిప్పుడు జరగవు. అయినప్పటికీ పాలకవర్గం భయపడుతున్నది. అందుకే సోషలిస్టు, కమ్యూనిస్టు సిద్దాంతాలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ప్రచార దాడికి మరోసారి పూనుకున్నారు. కమ్యూనిస్టు వ్యతిరేక ప్రచారానికి పెట్టింది పేరైన జో మెకార్ధీ తిరిగి రావాల్సిన అవసరం ఉందని కొందరు పిలుపు ఇచ్చారంటేనే మితవాదశక్తులు బెంబేలెత్తుతున్నట్లు స్పష్టం అవుతున్నది. అందుకే కమ్యూనిస్టులు, ఇతర పురోగామి శక్తులు నయా మెకార్థిజాన్ని ఎదుర్కోవటంలో గతంలో చేసిన పొరపాట్లను పునరావృతం కానివ్వకూడదని నిర్ణయించాయి.దాన్లో భాగంగా మధనం జరుపుతున్నాయి.ట్రంప్‌ పోకడలు మెకార్థీని పోలి ఉన్నట్లు చెబుతున్నారు.1950 దశకంలో జో మెకార్థీ ఒక రిపబ్లికన్‌ సెనెటర్‌. అబద్దాలు చెప్పటంలో పేరుమోసిన వాడు.ఒక నిచ్చెన మీద నుంచి పడిపోయినపుడు తగిలిన గాయం తాను యుద్ధంలో పాల్గొన్నపుడు అయిందని జనాన్ని నమ్మించాడు. ఒక గొప్ప ప్రజాస్వామ్యం(నిజానికి అదొక భ్రమ) నాశనం అయిందంటే దానికి కారణం అంతర్గత శక్తులు తప్ప వెలుపలి నుంచి వచ్చిన ముప్పు కాదని అనేక మంది ప్రముఖులు చెప్పారు. ఇప్పుడు అమెరికాలో డోనాల్డ్‌ ట్రంప్‌ అండ్‌ కో నుంచే అది జరుగుతున్నది. నాడు మెకార్థి చేసిన ప్రచారం ఏమంటే విద్రోహులైన కమ్యూనిస్టులు విదేశాంగశాఖలో ప్రవేశించారని 205 మంది జాబితా తన దగ్గర ఉందని చెప్పాడు. అయితే దాన్నెపుడూ బహిర్గతపరచలేదు. తరువాత జరిపిన విచారణలో మెకార్థీ చెప్పినవన్నీ అసత్యాలని తేలింది. ఆ సమయంలో హాలీవుడ్‌తో సహా అనేక రంగాలలో పురోగామి భావాలు కలిగిన అనేక మందికి కమ్యూనిస్టు ముద్రవేసి ఎంతో హానికలిగించారు. ఇప్పుడూ అదే జరుగుతోంది, గిట్టని ప్రత్యర్ధులపై ఆ పేరుతో దాడి చేస్తున్నారు.మీడియాలో ట్రంప్‌ను,అతగాడి విధానాలను విమర్శించే వారిని నిర్దాక్షిణ్యంగా తొలగిస్తున్నారు.హత్యకు గురైన ట్రంప్‌ అనుయాయి పచ్చి మితవాది చార్లీ కిర్క్‌ గురించి చేసిన వ్యాఖ్యలు చేసిన జర్నలిస్టును తొలగించారు, లేకపోతే ప్రసార అనుమతులను రద్దు చేస్తామని ట్రంప్‌ యంత్రాంగం బెదిరించింది. పాలస్తీనాకు మద్దతు ప్రకటించటం, ఇజ్రాయెల్‌ దుర్మార్గాన్ని నిరసించటాన్ని సహించలేని యంత్రాంగం కాలిఫోర్నియా విశ్వవిద్యాలయంలో 160 మంది విద్యార్థుల పేర్లను ప్రభుత్వానికి అందచేసింది. అందుకే మెకార్థీ చచ్చినా మెకార్థీయిజం పురుడు పోసుకుంటున్నదని చెబుతున్నారు.అయితే రోజులు మారాయి. జడ్‌ జనరేషన్‌ 66శాతం మంది సోషలిజం పట్ల సానుకూలత వ్యక్తం చేశారన్న అంశాన్ని విస్మరిస్తున్నారు. అరచేతిని అడ్డుపెట్టి సూర్యుడిని మూసిపెట్టటం ఎలా అసాధ్యమో భావజాలాన్ని అణిచిపెట్టటం కూడా అంతే !. శీఎ.aబ06:41