సామ్రాజ్యవాదుల యుద్ధోన్మాదం : మిలిటరీ బడ్జెట్‌ పెంపు – పౌర సంక్షేమానికి కోత !

Tags

, , , , , ,


ఎం కోటేశ్వరరావు


డోనాల్డ్‌ ట్రంప్‌ పిచ్చిపనులే కాదు యుద్ధోన్మాదంతో కూడా రెచ్చిపోతున్నాడు.ఒకవైపు ఉక్రెయిన్‌ యుద్ధాన్ని ఆపుతానంటాడు, మరోవైపు గాజాలో మారణకాండకు మద్దతు, ఎమెన్‌పై ప్రత్యక్షంగా దాడులు జరిపిస్తాడు. ఇలాంటి దుర్మార్గాలకు మరింతగా పాల్పడేందుకు మిలిటరీ బడ్జెట్‌ను భారీగా పెంచేందుకు పూనుకున్నాడు.2026 సంవత్సర బడ్జెట్‌లో మిలిటరీకి 13శాతం పెంచి లక్ష కోట్ల డాలర్లకు చేర్చాలని, అందుకు గాను విద్య, వైద్యం, పర్యావరణం, ప్రజాసాయం, అదనపు పోషకాహార సాయ పధకం(మన ఉచిత బియ్యం వంటిది), బలహీన వర్గాల గృహనిర్మాణం వంటి సంక్షేమ పథకాలకు కోత పెట్టాలని ప్రతిపాదించాడు. ఈ మేరకు అధ్యక్ష భవనం ఈనెల రెండవ తేదీన ఒక ముసాయిదా బడ్జెట్‌ను ఆవిష్కరించింది.ఈ కోతలు ఇంకా పెరగవచ్చు. ప్రపంచ కుబేరుడు ఎలన్‌ మస్క్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రభుత సామర్ద్య శాఖ(డోజె) ఇప్పటికే పెద్ద ఎత్తున ఉద్యోగులను తొలగించి, ఉద్యోగాలకు కోత పెట్టి పొదుపు చర్యలంటూ అనేక సంస్థలకు నిధుల కోతకు పాల్పడిరది. బడ్జెట్‌లో రెండు రకాలు ఉంటాయి.విధిగా కేటాయింపులు జరపాల్సినవి, విచక్షణతో అమలు జరపాల్సినవి. రెండో రకం పథకాల మొత్తం వచ్చే ఏడాది 1.7లక్షల కోట్ల డాలర్లు ఉంటుందని, వర్తమాన బడ్జెట్‌తో పోలిస్తే 7.6శాతం కోత విధించినట్లని చెబుతున్నారు. ఇవి ప్రధానంగా సంక్షేమ పథకాలకు చెందినవే.

అమెరికా రాజ్యాంగం ప్రకారం బడ్జెట్‌ మీద అధికారం పార్లమెంటుదే, అయితే నిబంధనల మేరకు అధ్యక్ష భవనం తన వాంఛలను తెలియచేస్తూ పార్లమెంటుకు ప్రతిపాదనలు పంపాల్సి ఉంటుంది. అయితే వాటిని పార్లమెంటు ఆమోదించవచ్చు, తిరస్కరించవచ్చు, సవరించవచ్చు. అవి అధ్యక్షుడికి నచ్చకపోతే 1974లో సవరించిన చట్ట ప్రకారం తనకున్న అధికారాల ద్వారా ఉత్తరువులు జారీ చేసి అమలు చేయవచ్చు. మిలిటరీ బడ్జెట్‌ పెంచినప్పటికీ అధికారపక్షం నుంచి విమర్శలు వచ్చాయి.అమెరికా బలం పెంచుకోవటం ద్వారా ప్రపంచంలో శాంతి సాధించాలని ఎన్నికల్లో ట్రంప్‌ ప్రచారం చేశాడని, సలహాదారులు దానికి అనుగుణంగా వ్యవహరించటంలేదని ఆరోపించారు. సాయుధ దళ సేవల సెనెట్‌ కమిటీ అధ్యక్షుడు వికర్‌ ఒక ప్రకటన చేస్తూ ఆసియాలో అమెరికాకు వ్యతిరేకంగా యుద్ధం ప్రారంభించకుండా ఉండాలన్నా, రష్యా, ఇరాన్‌ దేశాలకు హమస్‌, హౌతీల వంటి సాయుధులకు మిలిటరీ మద్దతు ఇవ్వకుండా ఉండాలంటే అమెరికా మరింతగా మిలిటరీ రీత్యా బలపడాలని పేర్కొన్నాడు. బడ్జెట్‌ ప్రతిపాదనలు మిలిటరీ సామర్ధ్యాలను దెబ్బతీస్తాయని ఆరోపించాడు. సాయుధ దళ సేవల పార్లమెంటరీ కమిటీ అధ్యక్షుడు మైక్‌ రోజర్స్‌ మరింతగా రెచ్చిపోతూ నాటో దేశాలు జిడిపిలో ఐదుశాతం రక్షణకు ఖర్చు పెట్టాలని ట్రంప్‌ చెబుతుంటే మనం చాలా తక్కువ ఖర్చు చేస్తే సత్తా ఎలా పెంచుతామంటూ రంకెలు వేశాడు.మొత్తానికి లాలూచీ విమర్శలతో నాటకాన్ని రక్తి కట్టిస్తున్నారు.


స్టాక్‌హోమ్‌ ఇంటర్నేషనల్‌ పీస్‌ రిసర్చ్‌ ఇనిస్టిట్యూట్‌ (సిప్రి) తాజాగా విడుదల చేసిన నివేదిక ప్రకారం 2024లో ప్రపంచ మిలిటరీ ఖర్చు 2.7లక్షల కోట్ల డాలర్లని, దీనిలో మూడోవంతు అమెరికా ఖర్చు 997బిలియన్‌ డాలర్లు అని పేర్కొన్నది. హిట్లర్‌ వారసురాలైన జర్మనీ అంతకు ముందు సంవత్సరంతో పోల్చితే 28శాతం పెంచి 88.5బి.డాలర్లు, మరో యుద్దోన్మాది జపాన్‌ 21శాతం పెంచి 55.3 బిలియన్‌ డాలర్లు ఖర్చు చేసింది.మిలిటరీ ఖర్చులో ఏడవ స్థానంలో ఉన్న జర్మనీ నాలుగుకు ఎగబాకింది. ఉక్రెయిన్‌పై యుద్ధం చేస్తున్న రష్యా 149 బి.డాలర్లు ఖర్చు చేస్తే ఎలాంటి దాడుల్లో ప్రత్యక్షంగా పాల్గొనని నాటో దేశాలు పది రెట్లు అదనంగా 1.5లక్షల కోట్ల డాలర్లు ఖర్చు పెట్టాయి.మొత్తం ఖర్చు 2015లో ఉన్న 1.67లక్షల కోట్ల డాలర్లతో పోలిస్తే 2024లో 2.7లక్షల కోట్ల డాలర్లకు పెరిగింది.యుద్దోన్మాదం లేదా మిలిటరీ ఖర్చు పెరుగుదల తీరు ముప్పును సూచిస్తున్నది. ఐరోపా మీద పెత్తనం చెలాయించాలని చూస్తున్న జర్మనీ యుద్ధ సన్నాహాలకు గాను అంటే మిలిటరీ అవసరాలకు సైతం ఉపయోగపడేవిధంగా రోడ్లు, వంతెనలు, ఆసుపత్రుల వంటి మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేసేందుకు 1.13లక్షల కోట్ల డాలర్లు ఖర్చు చేసేందుకు పూనుకుంది, ఇది మొదటి ప్రపంచ యుద్ధం తొలి ఏడాదిలో జర్మనీ చేసిన ఖర్చులో 8.6శాతం కాగా రెండవ ప్రపంచ యుద్ధానికి ముందు సంవత్సరం చేసిన ఖర్చుకు దగ్గరలో ఉందని పోలికలు వెల్లడిస్తున్నాయి. ఈ ప్రయత్నాలన్నీ యుద్ధ పరిశ్రమలు ముఖ్యంగా అమెరికా సంస్థలకు లబ్ది చేకూర్చేందుకు దోహదం చేస్తున్నాయి. సిప్రి అంచనా ప్రకారం 2023లో ఆయుధ తయారీలో అగ్రభాగాన ఉన్న 100 కంపెనీలు 632 బిలియన్‌ డాలర్ల మేర విక్రయించగా ఒక్క అమెరికా ఉత్పత్తిదారులకే 317 బిలియన్‌ డాలర్లు దక్కాయి.


రెండవ ప్రపంచ యుద్ధంలో నాజీలకు ఆయుధాలను విక్రయించిన జర్మన్‌ కంపెనీ రెయిమెటాల్‌ ఆయుధ అమ్మకాల వృద్ధి 2024లో 36శాతం ఉండగా వర్తమాన సంవత్సరంలో 25 నుంచి 30శాతం వరకు ఉండవచ్చని అంచనా. నాటో కూటమి దేశాల మిలిటరీ ఖర్చు జిడిపిలో 3.5శాతానికి పెంచాలన్న లక్ష్యాన్ని జర్మనీ, ఫ్రాన్సు, బ్రిటన్‌ ఆమోదిస్తే 2030 నాటికి 400బిలియన్‌ యూరోల విలువ గల ఆర్డర్లు పెరుగుతాయని రెయిమెటాల్‌ చెప్పింది. వీటి కోసం అమెరికా సంస్థలతో ఐరోపా కంపెనీలు పోటీపడతాయని, ఆక్రమంలో విబేధాలు తలెత్తినా ఆశ్చర్యం ఉండదని చెప్పవచ్చు. ఈ తీరును చూసినపుడు ప్రపంచంలో తమ ఆర్థిక, భౌగోళిక రాజకీయ లక్ష్యాలను సాధించటానికి సామ్రాజ్యవాదులందరూ పూనుకున్నట్లు కనిపిస్తోంది. ఇది ఏ పరిణామాలు, ఏ పర్యవసానాలకు దారి తీస్తుందో చూడాలి.2014లో అమెరికా, జర్మనీ చేసిన కుట్రలో భాగంగా రష్యాకు అనుకూలంగా ఉన్న ఉక్రెయిన్‌ అధ్యక్షుడిని పదవీచ్యుతునిగావించి తమ అనుకూల శక్తులను రంగంలోకి తెచ్చాయి. ఆ కుట్రకు విరుగుడుగా గతంలో తన ప్రాంతంగా ఉన్న క్రిమియాను విలీనం చేసుకోవటమే గాక 2022లో మిలిటరీ చర్య ప్రారంభించి అనేక ప్రాంతాలను తన ఆధీనంలోకి తెచ్చుకుంది. ఆప్రాంతాలను రష్యాకు అప్పగించి లేదా స్వతంత్ర ప్రాంతాలుగా ఉంచి యుద్దాన్ని ముగిస్తామని డోనాల్డ్‌ ట్రంప్‌ చేసిన ప్రకటన, వైఖరి ఐరోపాలో అసంతృప్తికి దారితీసింది, ఎత్తుగడా లేక నిజంగానే అమెరికా వైఖరిలో మార్పు వచ్చిందా అని జర్మనీ పరిస్థితిని గమనిస్తున్నది. ఉక్రెయిన్‌కు చేసిన మిలిటరీ సాయాన్ని తీర్చే స్థితిలో లేదు గనుక అక్కడి విలువైన ఖనిజాలను అమెరికాకు రాసి ఇచ్చి ఒప్పందం చేసుకుంది. ఆర్థికరంగంలో తనకు సవాలు విసురుతున్న చైనాను దెబ్బతీసేందుకు వీలైతే తైవాన్‌ సమస్య ముసుగులో దాడికి తెగబడేందుకు అమెరికా పావులు కదుపుతున్నది. ఈ పూర్వరంగంలో చైనా కూడా తన మిలిటరీ నవీకరణ, ఆయుధాలకు పెద్ద ఎత్తున ఖర్చు చేయాల్సి వస్తున్నది. జో బైడెన్‌ అధికారానికి వచ్చిన రెండు వారాల్లో జాతీయ రక్షణ వ్యూహం పేరుతో అమెరికా ఒక పత్రాన్ని విడుదల చేసింది. దాన్లో మిలిటరీ ఖర్చును భారీ మొత్తంలో పెంచాలని పేర్కొన్నది. ఎందుకటా, రానున్న దశాబ్దం నిర్ణయాత్మకమైనదని అమెరికాకు పెను సవాలుగా మారుతున్న చైనా, రష్యాలను ఓడిరచాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. మధ్య ప్రాచ్యంలో చమురు సంపదలున్న ప్రాంతం మీద తిరుగులేని ఆధిపత్యం సాధించాలన్న ఎత్తుగడ కారణంగానే గాజాలో ఇజ్రాయెల్‌ సాగిస్తున్న మారణకాండకు నిస్సిగ్గుగా అమెరికా మద్దతు ఇస్తున్నది, దాన్ని వ్యతిరేకిస్తున్న ఎమెన్‌పై దాడులు చేస్తున్నది. అమెరికా, జర్మనీ బిలియన్ల డాలర్ల విలువగల ఆయుధాలను ఇజ్రాయెల్‌కు సరఫరా చేస్తున్నాయి. ఇరాన్‌ మీద దాడికి అవకాశం కోసం చూస్తున్నది, దాని దగ్గర ఉన్న అణ్వాయుధాల గురించి తటపటాయిస్తున్నది.


అమెరికా తన ప్రయోజనాలకే ఎప్పుడూ పెద్ద పీటవేస్తుందని ఐరోపాకు తెలిసినప్పటికీ గతంలో తగిలిన ఎదురుదెబ్బల కారణంగా దానితో జూనియర్‌ భాగస్వామిగా కలసి ప్రయాణిస్తున్నది. స్వతంత్ర పాత్ర పోషించేందుకు ఐరోపా సమాఖ్య, ఉమ్మడి కరెన్సీని కూడా ఏర్పాటు చేసుకుంది.రెండూ దాగుడుమూతలాడుతున్నాయి, మొత్తం మీద చూసినపుడు మిత్రవైరుధ్యాలు పెరుగుతున్నాయి తప్ప తగ్గటం లేదు. కాగల కార్యం గంధర్వుడు తీర్చినట్లు తాము చేయలేని పనిని చైనా చేయటాన్ని గమనిస్తున్నాయి. అయితే దానితో చేతులు కలిపే అవకాశం లేదు గనుక దాన్ని చూపి అమెరికాతో బేరమాడుతున్నాయి. అమెరికాకే అగ్రస్థానం పేరుతో డోనాల్డ్‌ ట్రంప్‌ అజెండాను ముందు పెట్టిన తరువాత కొన్ని సందర్భాలలో ప్రతిఘటిస్తామని చెప్పటం తాజా పన్నుల యుద్దంలో చూశాము.ఈ విషయంలో ట్రంప్‌ వెనక్కు తగ్గినా అలాంటి కత్తివేలాడుతూనే ఉంటుంది గనుక ఐరోపా తన రక్షణ తానే చూసుకొనేందుకు పూనుకోవటం ఖాయం. దాన్లో భాగమే జర్మనీ పెద్ద మొత్తంలో మిలిటరీ ఖర్చుకు పూనుకోవటం.ఇరవై ఏడు దేశాల ఐరోపా సమాఖ్య 800బిలియన్‌ యూరోల మిలిటరీ ఖర్చు అదనంగా చేసేందుకు నిర్ణయించింది, ఐరోపా జనాభాలో 24శాతం మంది దారిద్య్ర రేఖకు దిగువున ఉన్నప్పటికీ ఈ ఖర్చు చేయటాన్ని గమనించాలి.ధనిక దేశాల్లోని కులీనులందరూ తమ లాభాలకు ముప్పు లేకుండా భారాలన్నింటినీ కార్మికవర్గం భరించే విధంగా విధానాలను రూపొందిస్తున్నారు. సామాజిక సంక్షేమ కోతలకు ఎలా పూనుకుంటారో ముందే చెప్పినట్లుగా దీనికి ఎదురయ్యే ప్రతిఘటనలను అణచివేసేందుకూ పూనుకుంటారు. ఉక్రెయిన్‌ విషయంలో అమెరికా, ఐరోపాల స్నేహ బండారం త్వరలోనే బయటపడుతుంది.


చైనా మిలిటరీ బడ్జెట్‌ 258 బిలియన్‌ డాలర్లని వార్తలు వచ్చాయి.తైవాన్‌కు ఆయుధాలు విక్రయించటం, దక్షిణ చైనా సముద్రంలో అమెరికా రెచ్చగొట్టుడు చర్యల కారణంగా ఇటీవలి కాలంలో దాని బడ్జెట్‌ గణనీయంగా పెరిగినట్లు విశ్లేషకులు చెబుతున్నారు. ప్రపంచంలో వంద ఆయుధాలు ఎగుమతి అవుతుంటే వాటిలో 42 అమెరికా,ఫ్రాన్సు, రష్యాల నుంచి పదకొండు చొప్పున, చైనా 5.8, జర్మనీ 5.6 ఎగుమతి చేస్తున్నాయి. ఇక దిగుమతుల్లో అగ్రస్థానంలో ఉన్న భారత్‌ 9.8, సౌదీ అరేబియా 8.4,కతార్‌ 7.6, ఉక్రెయిన్‌ 4.9, పాకిస్తాన్‌ 4.3, చైనా 2.9 చొప్పున దిగుమతి చేసుకుంటున్నాయి. సిప్రి సమాచారం ప్రకారం మొత్తం తొమ్మిది దేశాలలో 12,121అణ్వాయుధాలు ఉన్నాయి.దేశాల వారీ మోహరించినవి లేదా సురక్షిత ప్రదేశాల్లో నిల్వ ఉంచినవిగానీ దేశాల వారీ ఇలా ఉన్నాయి.బ్రాకెట్లలోని అంకెలు మోహరించినవి. రష్యా 5,580(1,710), అమెరికా 5,044(1,770), చైనా 500(24), ఫ్రాన్సు 290(280), బ్రిటన్‌ 225(120), భారత్‌ 172, పాకిస్తాన్‌ 170,ఇజ్రాయెల్‌ 90, ఉత్తర కొరియా 50 కలిగి ఉన్నాయి. మన దేశం దగ్గర అణ్వాయుధాలు ఉన్నా వాటిని ప్రయోగించే అవకాశం లేదు గనుక సాంప్రదాయ ఆయుధాలను పెద్ద ఎత్తున దిగుమతి చేసుకోవటంతో ఆయుధ ఎగుమతి దేశాలన్నీ ప్రధాని నరేంద్రమోడీని విశ్వగురువు అంటూ ఆకాశానికి ఎత్తి ఆయుధ ఆర్డర్లు పొందుతున్నాయంటే అతిశయోక్తి కాదు !

ఎర్రపూల వనం : వ్లదిమిర్‌ పుతిన్‌, అల్పజనపాలన – రష్యన్‌ కమ్యూనిస్టుల ముందున్న సవాళ్లు !

Tags

, , , , , ,

ఎం కోటేశ్వరరావు


ప్రకృతి ఉన్నంత వరకు ఎర్ర పూలు పూస్తూనే ఉంటాయి. దోపిడీ కొనసాగినంత కాలం కమ్యూనిస్టులు ఉద్భవిస్తూనే ఉంటారు.వైపరీత్యాలు సంభవించినపుడు ఎర్రపూల చెట్లు దెబ్బతిన్నట్లే కమ్యూనిస్టులూ అంతే. ప్రపంచం నిరంతరం మారుతూ ఉంటుంది.మారిన పరిస్థితులను బట్టి కమ్యూనిస్టులూ మారాలి అంటే దానర్దం మౌలిక లక్షణాన్ని వదులుకోవాలని కాదు, ఎత్తుగడలు, వ్యూహాలను మార్చుకోవాలి.అనేక దేశాల్లో కమ్యూనిస్టులు స్థానికంగా ఉన్న పరిస్థితులను బట్టి సమస్యలను ఎదుర్కొంటున్నమాట నిజం. ఉద్యమాలు నల్లేరు మీద బండిలా సాగటం లేదు. ఉదాహరణకు రష్యన్‌ కమ్యూనిస్టులను చూద్దాం.ఒక వైపు ఉక్రెయిన్‌కు నాటో సభ్యత్వం పేరుతో సామ్రాజ్యవాదులు ముందుకు తెచ్చిన ముప్పు, మరోవైపు దానికి వ్యతిరేకంగా గట్టిగా నిలిచిన బూర్జువావర్గ ప్రతినిధి పుతిన్‌.అతగాడి నాయకత్వంలో కార్మికవర్గాన్ని దోపిడీ చేస్తున్న అల్పజనపాలన. యుద్ధంతో ముందుకు వచ్చిన ఆర్థిక సమస్యలు, జాతీయవాదం. కమ్యూనిస్టులకు ఇది కత్తిమీద సాము.

ఓల్గాగ్రాడ్‌ విమానాశ్రయానికి స్టాలిన్‌ పేరు !
కమ్యూనిస్టులకు గాక ఏ ఎండకా ఆ గొడుగు పట్టే వారికి ఎందుకు వస్తాయి కష్టాలు. హిట్లర్‌ మూకలకు గోరీ కట్టిన ఓలాగ్రాడ్‌కు నాడు సోవియట్‌ను నడిపించిన ఉక్కుమనిషి స్టాలిన్‌ స్మారకంగా స్టాలిన్‌ గ్రాడ్‌ అని పేరు పెట్టారు. సోవియట్‌ను కూల్చివేసిన తరువాత తిరిగి పూర్వనామాన్ని తెచ్చారు.ఫాసిజం, నాజీలపై విజయం సాధించి 2025 మే 9న 80వ వార్షికోత్సవం జరుపుకుంటున్న సందర్భంగా ఆ నగరానికి తిరిగి స్టాలిన్‌ పేరు పెట్టాలని రష్యన్‌ కమ్యూనిస్టు పార్టీ అధ్యక్షుడు అలెగ్జాండర్‌ జెమిలియానిచెంకో, అగ్రనేత గెనడీ జుగనోవ్‌ అధ్యక్షుడు వ్లదిమిర్‌ పుతిన్ను కోరారు. ఉక్రెయిన్‌ మీద యుద్ధం చేస్తున్న సైనికులకు మానవతాపూర్వక సాయంగా డ్రోన్లు, మోటారు సైకిళ్లను పంపిన సందర్భంగా జుగునోవ్‌ స్టాలిన్‌ గ్రాడ్‌లో ఉన్నాడు. తానెప్పుడూ ఆ నగరాన్ని అలాగే పిలుస్తానని, యావత్‌ దేశం అలాగే అంటున్నదని అన్నాడు. రెండవ ప్రపంచ యుద్ధంలో పాల్గొన్న వారి గౌరవార్ధం గతవారం పుతిన్‌ పర్యటన సందర్భంగా ఓల్గాగ్రాడ్‌ విమానాశ్రయానికి స్టాలిన్‌ గ్రాడ్‌ అంతర్జాతీయ విమానాశ్రయం అని పేరును ప్రకటించాడు. అందువలన నగరం మొత్తానికి ఆ పేరు పెట్టాలని జుగనోవ్‌ అన్నాడు. గతంలో కొన్ని సంస్థలు స్టాలిన్‌ గ్రాడ్‌ అని తిరిగి పెట్టాలా లేదా అన్న సర్వే చేస్తే ఓల్గాగ్రాడ్‌ పౌరులు వ్యతిరేకించినట్లు తేలిందని చెప్పారు, నిజంగా అప్పుడు జనం అలా ఉన్నారా లేక పాలకులకు అనుగుణంగా సర్వేను చేశారా అన్నది చెప్పటం కష్టం. ఇప్పుడు పుతినే స్వయంగా విమానాశ్రయపేరు మార్చాడంటే జనాల్లో వ్యతిరేకత లేదన్నది స్పష్టం ఎందుకు అంటే ఫాసిస్టు వ్యతిరేక పోరాటానికి మారు పేరు స్టాలిన్‌, ఆ పేరును ఉచ్చరించకుండా దాని గురించి చెప్పలేరు.

అంతర్జాతీయ ఫాసిస్టు వ్యతిరేక వేదిక రెండవ సమావేశం గత నెలాఖరులో మాస్కోలో జరిగింది. ప్రపంచమంతటా ఫాసిజం తిరిగి తలెత్తుతున్న పూర్వరంగంలో దాన్ని ఎలా ఎదుర్కోవాలా అని 91దేశాల నుంచి హాజరైన 164 మంది ప్రతినిధులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా మాస్కో కమ్యూనిస్టు నాయకురాలు తాతిన్యా దెశియాతోవా మాట్లాడుతూ పాలకులు తమ సంపదలను పెంచుకోవటం తప్ప చేసిందేమీ లేదు. కాబట్టి ఇప్పుడు మేము గత కీర్తి కట్టడాలన్నింటినీ శుభ్రం చేస్తున్నాం, పాత సోవియట్‌ చిహ్నాలను పెడుతున్నాం, పాత పాటలను పాడుతున్నాం, గత విజయాల గురించి చెబుతున్నాం అని చెప్పింది. మూడవ తరానికి చెందిన కమ్యూనిస్టు అయిన ఆమె అమెరికా పత్రిక పీపుల్స్‌ వరల్డ్‌తో మాట్లాడినపుడు ఈ వ్యాఖ్యలు చేసింది. నిజానికి ఫాసిస్టు వ్యతిరేక వారసత్వం రష్యన్‌ పౌరులది తప్ప పుతిన్‌ లేదా అతగాడు ప్రాతినిధ్యం వహిస్తున్న పెట్టుబడిదారీ విధాన పాలకులది కాదు. బోరిస్‌ ఎల్సిన్‌ వినాశకర మరియు ప్రజల సంపద లూటీ పాలనతో పోలిస్తే పుతిన్‌ పాలనలో ఆర్థిక పరిస్థితి కాస్త మెరుగైంది, అది ఎంతో కాలం నిలిచేట్లు కనిపించటం లేదని ఆమె చెప్పింది. యుద్ధం, సంబంధిత అంశాల్లో సోవియట్‌ పాత్ర, దాని గురించి జనంలో ఉన్న జ్ఞాపకాల గురించి పుతిన్‌ గ్రహించాడు గనుకనే గత కొద్ది సంవత్సరాలుగా వాటిలో కొన్నింటిని ఎంచుకొంటున్నాడు. విమానాశ్రయానికి స్టాలిన్‌ పేరు పెట్టటం దానిలో భాగమే. రెండవ ప్రపంచ యుద్ధ విజయం 80వ వార్షికోత్సం సందర్భంగా నాటి బ్యానర్లు, చిహ్నాలతో మాస్కోను అలంకరించారు.

సోవియట్‌ను కూల్చివేసి మూడున్నర దశాబ్దాలు కావస్తున్నది, ఆ సమయంలో తెలిసీ తెలియని వయస్సులో ఉన్నవారికీ, తరువాత పుట్టిన వారికి గతం గురించి తెలియదు. వర్తమానంలో బతుకు ఎలా సాగించాలా అన్నది తప్ప ప్రత్యామ్నాయాల గురించి ఆలోచించే తీరిక కూడా ఉండటం లేదు. పరిస్థితి ఉన్నది ఉన్నట్లుగా ఉంటే చాలన్నట్లుగా కొందరి ఆలోచన ఉంది. అయితే 2022లో ప్రారంభమైన ఉక్రెయిన్‌పై మిలిటరీ చర్య తరువాత పరిస్థితిలో మార్పు ప్రారంభమైంది. సామ్రాజ్యవాదుల కుటిల యత్నాలు,వారికి మద్దతు ఇస్తున్న పాలకులు రష్యా సరిహద్దులోని తూర్పు ఉక్రెయిన్‌ ప్రాంతాలలో రష్యన్‌ జాతి పౌరులను అణచివేస్తున్న తీరుతెన్నులను గ్రహించిన కమ్యూనిస్టు పార్టీ యుద్ధ ప్రయత్నాలకు మద్దతు ఇచ్చింది. మూడు సంవత్సరాలు గడిచింది, వేలాది మంది మరణించారు, ఆర్ధికంగా దేశం సమస్యలను ఎదుర్కొంటున్నది, మిలిటరీ చర్య ఎప్పుడు ముగుస్తుందో తెలియదు. ఇలాంటి తరుణంలో ఏ వైఖరి తీసుకోవాలన్నది కమ్యూనిస్టులకు పెద్ద సమస్య. ఉక్రెయిన్‌ పోరులో రెండు లక్షణాలు ఉన్నాయి, ఒకటి సామ్రాజ్యవాద పోరు, రెండవది జాతీయ అంశం. నాటో కూటమి నాయకత్వంలోని సామ్రాజ్యవాదులు, రష్యాలోని పెట్టుబడిదారులకు ప్రాతినిధ్యం వహించే శక్తుల మధ్య ఈ యుద్ధం నడుస్తున్నది.అయితే ఉక్రెయిన్‌ తూర్పు ప్రాంతంలోని రష్యన్‌ జాతి పౌరులు అక్కడి నాజీల చేతిలో అణచివేతను ఎదుర్కొంటున్నారు. వారికి కమ్యూనిస్టులు, ఇతర వామపక్ష శక్తులు నాయకత్వం వహిస్తున్నాయి. రష్యన్‌ మిలిటరీ ఆప్రాంతంలోకి వెళ్లిన తరువాత పోరాడుతున్న ఆ శక్తులు ఎన్నికలలో పాల్గొనేందుకు పుతిన్‌ అనుమతించటం లేదనే వార్తలు వచ్చాయి.ఈ సమస్య ఉన్నప్పటికీ ఉక్రెయిన్ను నాజీకరణ కావించకుండా చూడటం, నాటో విస్తరణను అడ్డుకోవటం, అణచివేతకు గురవుతున్నవారిని రక్షించటం మౌలిక అంశాలుగా ఉన్నట్లు అనేక మంది భావిస్తున్నారు. అయితే కమ్యూనిస్టులకు పుతిన్‌ మీద, పాలకవర్గం మీద ఎలాంటి భ్రమలు లేవు. పాలకవర్గంలో ఉన్న విబేధాలు, వైరుధ్యాల కారణంగా గతంలో ప్రైవేటీకరించిన 10.8బిలియన్‌ డాలర్ల విలువగల కంపెనీలను గత మూడు సంవత్సరాలలో పుతిన్‌ సర్కార్‌ జాతీయం చేసింది. అయితే వాటిని ప్రజల ఆస్తిగానే ఉంచుతారా లేక తిరిగి తమకు అనుకూలమైన వారికి కట్టబెడతారా అన్న సందేహాలు ఉన్నాయి. ప్రైవేటీకరణను తీవ్రంగావిస్తామని పాలకపార్టీ నేతలు మార్చి నెలలో ప్రకటించారు. దాన్ని అడ్డుకొనేందుకు కమ్యూనిస్టులు సిద్దం అవుతున్నారు.


ప్రపంచ విప్లవ ధృతార వియత్నాం !
అమెరికా సామ్రాజ్యవాదులపై దక్షిణ వియత్నాంలో విజయం సాధించి రెండు ప్రాంతాల ఏకీకరణకు 50వసంతాలు నిండాయి, 1975 ఏప్రిల్‌ 30వ తేదీని విజయదినంగా పరిగణిస్తున్నారు. ఈ పరిణామం యావత్‌ లాటిన్‌ అమెరికా దేశాలకు, యావత్‌ ప్రపంచానికి ఇప్పటికీ ఒక ధృవతారగానే ఉందని అర్జెంటీనా కమ్యూనిస్టు పార్టీ ఈ సందర్భంగా పేర్కొన్నది. అమెరికా సామ్రాజ్యవాదంపై విజయం సాధించిన తరువాత గత ఐదు దశాబ్దాలలో వియత్నాం ఎంతో పురోగతి సాధించిందని ఉరుగ్వే కమ్యూనిస్టు పార్టీ శ్లాఘించింది. గతంలో సోషలిస్టు దేశాలైనప్పటికీ పరస్పర అనుమానాలు, ఇతర కారణాలతో చైనా, వియత్నాం మధ్య సాయుధ దాడులు జరిగాయి. అయితే తరువాత రెండు దేశాల కమ్యూనిస్టు పార్టీలు తమ వైఖరులను సవరించుకొని తిరిగి దగ్గరయ్యాయి, కొన్ని దీవుల గురించి ఇప్పటికీ కొన్ని సమస్యలున్నా .తాజాగా రెండు దేశాల మధ్య బంధం మరింత బలపడిరది. షీ జింపింగ్‌ వియత్నాం సందర్శించారు. ఒక ఏడాది కాలంలోనే గణనీయ ఫలితాలు వచ్చాయని ఏప్రిల్‌ 28న చైనా రాయబారి ప్రకటించారు. తొలిసారిగా విదేశాంగ, జాతీయ రక్షణ, ప్రజాభద్రత మంత్రుల స్థాయిలో ఇరుదేశాలు 3 ప్లస్‌ 3 పేరుతో సంప్రదింపులకు ప్రపంచంలో తొలిసారిగా నిర్ణయించిన దేశాలుగా చైనా, వియత్నాం దౌత్య చరిత్రకు ఎక్కాయి. యువకుల్లో విప్లవ చరిత్ర గురించి అవగాహన కలిగించేందుకు రెడ్‌ కల్చర్‌, రెడ్‌ జర్నీలను ప్రోత్సహించాలని నిర్ణయించారు.రెండు దేశాల వాణిజ్య లావాదేవీలు గతేడాది 260 బిలియన్‌ డాలర్లు దాటాయి.

సోషలిస్టు వ్యవస్థల కూల్చివేతలో పోప్‌ ప్రమేయం !
పోప్‌ ఫ్రాన్సిస్‌ అస్తమయం తరువాత కొత్త పోప్‌ ఎంపిక గురించి విశ్లేషణలు వెలువడుతున్నాయి. ఈ సందర్భంగా గతంలో పనిచేసిన పోప్‌లు, అమెరికా అధ్యక్ష భవనంతో వారి సంబంధాలు, రాజకీయాలు, కుట్రలు ముఖ్యంగా కమ్యూనిజం, సోషలిస్టు సమాజాలకు వ్యతిరేకంగా జరిపిన కుట్రల గురించి కూడా ప్రస్తావనలు వెలువడ్డాయి.1989లో బెర్లిన్‌ గోడ కూల్చివేత,1991లో సోవియట్‌ కూల్చివేతకు ముందు ప్రచ్చన్న యుద్ధ సమయంలో రెండవ పోప్‌ జాన్‌ పాల్‌, అమెరికా అధ్యక్షుడు రోనాల్డ్‌ రీగన్‌ సమావేశం వైట్‌ హౌస్‌లో 1982లో జరిగింది. వారిద్దరి మీద హత్యా ప్రయత్నాలు జరిగిన ఏడాది తరువాత వారి ఏకాంత భేటీ జరిగింది.అక్కడే సోషలిస్టు సమాజాల కూల్చివేతకు కుట్రకు తెరలేపినట్లు గతంలోనే విమర్శలు వచ్చాయి.ఇద్దరూ కమ్యూనిస్టు వ్యతిరేకులే. రెండవ పోప్‌ జాన్‌ పాల్‌ జన్మస్థలమైన పోలాండ్‌లో లెచ్‌వాలేసాను ముందుకు తెచ్చి సాలిడారీ ఉద్యమం పేరుతో కుట్రకు తెరతీశారు.తమ పని గడచిన తరువాత లెచ్‌వాలేసాను చరిత్ర చెత్తబుట్టలోకి నెట్టారు. మనదేశంలో కమ్యూనిస్టులమని చెప్పుకున్న కొందరు ఆ సోషలిస్టు వ్యతిరేక సాలిడారిటీ పేరుతో ఊరేగారు. లెచ్‌వాలేసా సాలిడారిటీతో తమకు ఎలాంటి సంబంధం లేదని పోప్‌, రీగన్‌ ఇద్దరూ అప్పుడు ఠలాయించారు. అయితే వారి ప్రమేయం గురించి 2004లో ఏపి వార్తా సంస్థ వెల్లడిరచింది.1989లో పోలాండ్‌ ఎన్నికల్లో సాలిడారిటీ గెలిచింది, తూర్పు ఐరోపాలో సోషలిస్టు వ్యవస్థల కూల్చివేతకు నాంది పలికింది. సోవియట్‌ కమ్యూనిజాన్ని పతనం గావించేందుకు పోప్‌, రీగన్‌ కలసి పని చేశారని రిపబ్లికన్‌ పార్టీ మాజీ గవర్నర్‌ అయిన స్కాట్‌ వాకర్‌ 2020లో వాషింగ్టన్‌ పోస్టు పత్రికలో రాసినదానిలో పేర్కొన్నాడు. చరిత్రలో ఒక అమెరికా అధ్యక్షుడిగా ఉడ్రో విల్సన్‌ మొదటి ప్రపంచ యుద్ధం ముగిసి, తొలి సోషలిస్టు రాజ్యం ఏర్పడిన తరువాత 1919లో పదిహేనవ పోప్‌ బెనెడిక్ట్‌ను కలసి వాటికన్‌తో సంబంధాలను ఏర్పరచుకున్నాడు.1959లో అమెరికా అధ్యక్షుడు ఐసెన్‌ హోవర్‌ ఇరవై మూడవ పోప్‌ జాన్‌తో భేటీ జరిగినప్పటి నుంచి పోప్‌లు, అమెరికా అధ్యక్షుల కలయికలు క్రమంగా జరుగుతున్నాయి.ఇప్పటి వరకు 32 సమావేశాలు జరిగినట్లు ఫాక్స్‌ న్యూస్‌ పేర్కొన్నది.1979వరకు అధ్యక్షులే వాటికన్‌ వెళ్లేవారు, ఆ తరువాత నుంచి పోప్‌లు అధ్యక్ష భవనానికి వస్తున్నారు.


శ్రీలంక మేడేకు భారత, చైనా కమ్యూనిస్టులు ! తైవాన్‌లో చైనా వ్యతిరేక ప్రదర్శనలు !
శ్రీలంక రాజధాని కొలంబోలో అధికార నేషనల్‌ పీపుల్స్‌ పవర్‌(ఎన్‌పిపి), దానికి ప్రధాన చోదకశక్తిగా ఉన్న జనతా విముక్తి పెరుమన పార్టీ నిర్వహించిన మేడే ప్రదర్శనలకు భారత్‌, చైనా కమ్యూనిస్టు పార్టీల నేతలు హాజరయ్యారు. దేశ అధ్యక్షుడు అనుర కుమార దిశన్నాయకే ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. చైనా తిరుగుబాటు రాష్ట్రమైన తైవాన్‌లో కమ్యూనిస్టు వ్యతిరేకతను మరోసారి రెచ్చగొడుతున్నారు.దానిలో భాగంగా గత నెలలో ఒక యూట్యూబర్‌ పేరుతో కమ్యూనిజాన్ని అడ్డుకోవటం, తైవాన్‌ రక్షణ నినాదాలతో కెటాగలాన్‌ ప్రాంతంలో 50వేల మందితో ప్రదర్శన చేశారు. మాతృదేశంలో విలీనం కావాలని కోరుతున్న ప్రజా ప్రతినిధులను వెనక్కు పిలవాలంటూ దరఖాస్తుల దాఖలుకు పూనుకున్నారు.

కులగణనపై నీ వ్యాఖ్యయే నీరజాక్షా : బీహార్‌ ఓట్ల కోసం అర్బన్‌ నక్సల్‌గా మారిన ప్రధాని నరేంద్రమోడీ !

Tags

, , , , , , , ,


ఎం కోటేశ్వరరావు


ఒక సినిమాలో రాజకీయ నేతలు కుడి జేబులో ఒకటి, ఎడమదానిలో మరో ప్రకటన పెట్టుకు తిరగటం గురించి పరుచూరి బ్రదర్స్‌ చెప్పారు. ఇప్పుడు విశ్వగురువు నరేంద్రమోడీ ఆ కోవలో చేరిపోయారు. చరిత్రలో ఎప్పుడో జరిగినదానికి వక్రీకరణలు తెలిసిందే, మన కళ్ల ముందు జరిగిన వాటిని కూడా బిజెపి నేతలు ఎలా మార్చి వేస్తున్నారో కులగణనకు కేంద్ర ప్రభుత్వం చేసిన నిర్ణయంపై సమర్ధన స్పందన వెల్లడిస్తున్నది.జనం మరీ అంత బుర్రలేని వారిగా కనిపిస్తున్నారా ! కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని వార్తగా ఇచ్చిన తరువాత ఈ అంశంపై ఆకస్మికంగా మాట మార్చింది అంటూ కొన్ని మీడియా సంస్థలు విశ్లేషణలు వెలువరిస్తున్నాయి. వార్తను సంతోష పడే బిజెపి మద్దతుదారులు ఇప్పుడు ఇవెందుకు అని చిరాకు పడుతున్నారు. ఇప్పటికీ కొందరు స్వతంత్రంగా ఆలోచించే జర్నలిస్టులు ఉన్నందుకు మండిపడుతున్నారు,విమర్శనాత్మకంగా చూడకుండా పాకేజ్‌లతో మొత్తం గోడీ మీడియాగా ఎందుకు మారలేదని చిందులు వేస్తున్నారు. అవును మరి హిట్లర్‌ బాటలో నడుస్తున్న కాషాయ దళాల ప్రజాస్వామ్యంలో నందంటే నంది కాదు పందంటే పంది అనాలి కదా ! లేకపోతే వీపులు పగులుతాయి మరి !!


కులగణన చేయాలని కోరే వారు ప్రత్యేకించి కాంగ్రెస్‌ పేదల అనుభూతులతో ఆటలాడుకుంటున్నదని, కులం పేరుతో విడదీస్తున్నదని ప్రధాని నరేంద్రమోడీ ధ్వజమెత్తారు.(2023 అక్టోబరు 2, టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా) గతంలో వారు దేశాన్ని చీల్చారని ఇప్పుడు కూడా అదే చేస్తున్నారన్నారు. మధ్య ప్రదేశ్‌లో ఎన్నికలకు ముందు బీహార్‌ కుల సర్వే వివరాల విడుదల సందర్భంగా మోడీ ఈ వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు బీహార్‌ ఎన్నికల్లో ఓట్లు అవసరం గనుక కులగణనకు అంగీకరిస్తూ కాబినెట్‌లో తీర్మానించారు. ఆకలేస్తే తినేందుకు ఏదీ దొరకనపుడు మొరటు పనిని తెలుగులో మర్యాద పూర్వకంగా దుప్పి భోజనం అనటాన్ని బిజెపి ఓట్ల ఆకలి గుర్తుకు తెచ్చింది.బీహార్‌ సర్వే ఫలితాలు అవాస్తవమని, పేదల కంటినీరు తుడిచే ఎత్తుగడ అని బిజెపి వర్ణించింది. అంతేనా ప్రతిపక్ష పార్టీలు కుల గణన చేయాలని కోరటం అర్బన్‌ నక్సల్స్‌ ఆలోచనలకు ఒక సూచిక అని 2024లోక్‌సభ ఎన్నికలకు ముందు మోడీ వ్యాఖ్యానించారు. ఇప్పుడు అదే అర్బన్‌ నక్సల్‌గా అధికారికంగానే మారినట్లు కాదా ? ఇటీవలి మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల సమయంలో కూడా ఒక్కటిగా ఉంటేనే ఐక్యంగా ఉంటాం అని చెప్పారు, అంటే ఇప్పుడు కులాల వారీ విడతీసేందుకు పూనుకున్నారా ? విశ్వగురువు గనుక రాత్రి ఒక సుభాషితం పగలు ఒకటి వల్లిస్తారా ! మోడీ తరువాత వారసుల్లో ఒకరని భావిస్తున్న ఉత్తర ప్రదేశ్‌ సిఎం యోగి ఆదిత్యనాధ్‌ కులంపేరుతో విడతీస్తే హత్య చేసినట్లే అన్నారు. ఓటు బాంకు రాజకీయాలకు మేం వ్యతిరేకం అని సుద్దులు చెప్పే బిజెపి బుద్ది ఇప్పుడు అదే ఓట్ల కోసం అర్రులు చాస్తున్నదని, విధిలేకనే దిగివచ్చిందని జనం భావిస్తున్నారు. నేషనల్‌ ఫ్రంట్‌ నేతగా ప్రధాని విపి సింగ్‌ వెనుకబడిన తరగతుల రిజర్వేషన్లకు మండల్‌ కమిషన్‌ సిఫార్సు చేస్తే దానికి పోటీ కమండల్‌గా అద్వానీ రామ్‌ రథయాత్ర చేపట్టారనే విమర్శలు అప్పుడే వచ్చాయి. ఓబిసిలో వర్గీకరణకు మోడీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిషన్‌ చేసిన సిఫార్సులను పక్కన పెట్టి రోహిణీ కమిషన్‌ వేశారు, అది సమర్పించిన నివేదికను రెండేండ్లు కావస్తున్నా ఇంతవరకు బయటపెట్టలేదు. అలాంటి పాలకులు ఇప్పుడు బిసిల మీద ఎక్కడలేని ప్రేమ ఉన్నట్లు మాట్లాడుతున్నారు. కుల గణన చేస్తే హిందూ సమాజం విడిపోతుందని చెప్పటమే అసలు హిమాలయమంత అబద్దం, సాకు. ఇప్పుడు ఒక్కటిగా ఉందా ? ఎన్ని రకాలుగా విడిపోయి ఉందో జనాలకు తెలియదా, గ్రామాల్లో గోడలతో విభజిస్తున్నారు, చివరకు చచ్చిన తరువాత శ్మశానాల్లో కూడా మతాలు, కులాలవారీ లేవా ? ఇంకా కులం ఎక్కడ, మతం ఎక్కడా అనిపడక కుర్చీల్లో కూర్చొని వాదించేవారు కనిపిస్తారు. ఇంత అభివృద్ది, విద్య తరువాత కూడా సమాజంలో కులాంతర వివాహాలు కేవలం ఐదుశాతమే అని చెప్పాలంటే సిగ్గుపడాలి. ఏ నియోజకవర్గంలో ఏ కులం, మతం, ప్రాంతం వారు ఎందరున్నారో ఎన్నికలపుడు అందరికీ తెలిసిందే కదా ?


కులగణనను గతంలో కాంగ్రెస్‌ కూడా వ్యతిరేకించిన మాట నిజం. నిజానికి బిజెపి దాని మాతృసంస్థ ఆర్‌ఎస్‌ఎస్‌ పరివారం కూడా వ్యతిరేకమే. రెండిరటికీ కారణాలు వేర్వేరు. బిజెపికి 2014లో సంపూర్ణ అధికారం వచ్చినప్పటికీ ఇప్పటి వరకు ఎందుకు సముఖత చూపలేదు. ఇప్పుడు సామాజిక న్యాయం కోసం చేశామని చెబుతున్నవారు తమ పార్టీ నేత వాజ్‌పాయ్‌ హయాంలోనే 2001 జనగణన జరిగిందని, అప్పుడే ఎందుకు చేయలేదో చెప్పాలి. కుల గణన జరిగితే రిజర్వేషన్లు, వర్గీకరణ డిమాండ్లతో పాటు, బిజెపి నాయకత్వంలో ఉన్న కొన్ని కులాల వారి ఆధిపత్యానికి గండిపడుతుంది గనుకనే ఆ పార్టీ సుముఖంగా లేదు. కొన్ని పదవుల్లో కొందరికి అవకాశం కల్పించినప్పటికీ సంఘపరివార్‌ సంస్థలలో పునాది ఆధిపత్య కులాలదే. కొన్ని సంక్షేమ పధకాలు అమలు జరపవచ్చు, రాజకీయ సాధికారత అప్పగించటానికిసిద్దపడుతుందా అన్నదే సమస్య. మోడీ సామాజిక తరగతి ఓబిసి అయినప్పటికీ గత పదకొండు సంవత్సరాల్లో వారికి ఒరగబెట్టిందేమీ లేదు, ఆర్థికంగా పరిస్థితి మెరుగుపరచిందీ లేదు. బిజెపి మతం కార్డుతో రాజకీయం చేస్తున్నదానికి విరుగుడుగా కాంగ్రెస్‌ ఇప్పుడు కులగణన ముందుకు తెచ్చింది. దానికంటే ముందు బిసి సంఘాలు ఈ డిమాండ్‌ను ముందుకు తెచ్చాయి. దీనికి మూలం అస్థిత్వ భావజాలం విస్తరించిన కారణంగా దేశంలో అత్యధికులుగా ఉన్న వెనుకబడిన తరగతుల వారు మేమెంత మందిమో మాకంత వాటా పేరుతో రాజకీయ ప్రాతినిధ్యం కోసం పెద్ద ఎత్తున ప్రచారం చేయటమే. నిచ్చెన మెట్ల కుల వ్యవస్థలో రాజ్యాంగం అన్ని కులాలను సమంగానే చూస్తున్నప్పటికీ ఆచరణలో మనువాదం ప్రకారం పైనున్న ప్రతివారూ దిగువన ఉన్న వారిని తక్కువగా చూస్తున్నారు. వివాహాలు, కలసి భోజనం చేసేందుకు కూడా అంగీకరించటం లేదు. దాడులు చేసి చంపేస్తున్నారు. అంబేద్కర్‌ కుల నిర్మూలన జరగాలని కోరుకున్న నాటికీ ఇప్పటికీ చివరికి వివక్షకు గురవుతున్న దళితుల్లోనూ కుల ధోరణులు మరింత పెరిగాయి.ఆర్‌ఎస్‌ఎస్‌ అధిపతి తాజాగా అందరికీ ఒకే దేవాలయం, ఒకే బావి, ఒకే స్మశానం ఉండాలని చెప్పారు గానీ కులం, మతం విద్వేషాలు పోవాలని కోరలేదు.


ఇప్పుడు బిజెపి ఎందుకు కులగణనకు అంగీకరించింది ? ఆయారాం గయారాం పాత మాట. నితీష్‌ ఆయా నితీష్‌ గయా అన్నది కొత్త మాట, కూటముల ఫిరాయింపులకు బ్రాండ్‌ అంబాసిడర్‌ బీహార్‌లో ఎదురీదుతున్నట్లు అర్ధమైంది, తన కులగణన సర్వే గురించి చెప్పుకోవాలంటే సిగ్గుపడే స్థితి.అన్నింటికీ మించి మోడీ సర్కార్‌ నిలిచేందుకు రెండు పంగటి కర్రలలో ఒకటి నితీష్‌. అదువలన గతంలో మోడీ కులగణన గురించి ఎంత ఠలాయించినా ఇప్పుడు కుదరదు, నితీష్‌తో పాటు బిజెపి మునగటం ఖాయం. కనుక నితీష్‌ కూడా కులగణనకు అంగీకరిస్తారా లేదా అని పట్టుబట్టినట్లు కనిపిస్తోంది. అందుకే తక్షణ ప్రయోజనంగా బీహార్‌ ఓట్ల కోసం అన్నది స్పష్టం. అయితే ఆ ఎన్నికల నాటికి గణన జరగదు, ఒక ప్రచార అస్త్రంగా మాత్రమే ఉంటుంది. మతం కార్డుతో నూటికి 80శాతంగా ఉన్న హిందువుల ఓట్లు తమకే పడతాయని ఆశించిన వారికి అంత సీన్‌ లేదని, హిందువులు అంత అమాయకంగా బిజెపి వెంటనడవరని, చివరికి అయోధ్యలో ఆ పార్టీని ఓడిరచిన తీరు, మోడీకి గణనీయంగా మెజారిటీ పడిపోవటం, గత ఎన్నికల కంటే ఓట్లు, సీట్లు తగ్గటంతో దిగజారుడు మొదలైనట్లు గ్రహించారు. కులగణన కార్డు ఎంత కాలం పని చేస్తే అంతవరకు ఉపయోగించుకోవాలని నిర్ణయించారని వేరే చెప్పనవసరం లేదు. సంఘపరివార్‌ సంస్థలలో బిసిలు పెద్ద సంఖ్యలో ఉన్నారు,హిందూత్వ భావజాలాన్ని వారిలో గణనీయంగా ఎక్కించామనే విశ్వాసం ఆర్‌ఎస్‌ఎస్‌లో కలిగి ఉండాలి, 2013 నుంచి నరేంద్రమోడీని ఓబిసిగా చూపుతూ తమది బిసిల పార్టీ అని బిజెపి ఊదరగొడుతున్న సంగతి తెలిసిందే. అందువలన గణన జరిగినా తమ ఓట్లు పదిలంగా ఉంటాయనే అంచనాకు వచ్చి ఉండాలి, ఈ నిర్ణయానికి ముందు ప్రధానితో మోహన్‌భగవత్‌ భేటీ కూడా దాని గురించి చర్చించటానికే అన్నది వేరే చెప్పనవసరం లేదు. అయితే వారి అంచనా ప్రకారమే జరుగుతుందా ?


లెక్కతేలినంత మాత్రాన ఒరిగేది, జరిగేది ఏమిటి ? ఎవరెంత అన్న వివాదానికి తెరపడుతుంది. కొత్త డిమాండ్లు ముందుకు వస్తాయి, వాటికి రాజకీయ పార్టీలు ఏ విధంగా స్పందిస్తాయో చూడాల్సి ఉంది. ఇప్పటికే దళితులు, గిరిజనుల సంఖ్య ఎంతో తెలిసిందే.201112 జాతీయ నమూనా సర్వే ప్రకారం, 201516 కుటుంబ ఆరోగ్య సర్వే ప్రకారం చూసినా జనరల్‌ తరగతులతో పోలిస్తే ఎస్‌సి,ఎస్‌టి,ఓబిసిలు చేస్తున్న ఖర్చు చాలా తక్కువ.జనరల్‌ తరగతుల్లో దారిద్య్రం 15.6శాతం ఉంటే గిరిజనుల్లో 50.6, దళితుల్లో 33.3, ఓబిసీల్లో 27.2శాతాల చొప్పున దారిద్య్రంలో ఉన్నట్లు తేలింది. విద్య, ఉద్యోగాలు, చట్టసభలు, స్థానిక సంస్థలలో రిజర్వేషన్లు ఉపశమనం తప్ప అసమానతలు, దారిద్య్రాన్ని తగ్గించే సాధనాలు కాదని తేలిపోయింది. ముస్లింలలో కూడా దారిద్య్రం ఎక్కువగానే ఉంది. కులగణన తరువాత ఈ పరిస్థితిని మార్చేందుకు పథకాలేమైనా ఉంటే ఉపయోగం, లేకుంటే ఎప్పటికాలు ఇట్టిట్టే ! దాని గురించి ఎలాంటి ప్రకటన లేదు. దళితుల వర్గీకరణ న్యాయసమ్మతమే అయినప్పటికీ ఒకే తరగతిగా ఉన్నపుడు లబ్ది పొందిన సామాజిక తరగతులు వర్గీకరణను వ్యతిరేకిస్తున్నాయి. అదే విధంగా ఓబిసి వర్గీకరణ డిమాండ్‌ కూడా ఉంది, దాన్ని చేసేందుకు మోడీ సర్కార్‌కు చెమటలు పడుతున్నాయి. రోహిణీ కమిషన్‌ వేసి అనేకసార్లు గడువు పొడిగించి నివేదిక రాకుండా చూసినప్పటికీ 2023 ఆగస్టులో ఇచ్చిన నివేదికను ఇంతవరకు బహిర్గత పరచలేదు.


బ్రిటీష్‌ పాలనా కాలంలో 1881 నుంచి 1931వరకు కులగణన జరిగింది.అణగారిన తరగతుల ఉద్దరణకు గాక విభజించి పాలించు అనే ఎత్తుగడతో ఆ లెక్కలను తీసిందన్నది స్పష్టం. దాని పర్యవసానాలలో ముస్లింలను వేరుగా సంఘటిత పరచేందుకు ముస్లిం లీగ్‌ ఆవిర్భావం ఒకటి. మద్రాస్‌ ప్రావిన్స్‌లో కులాల వారీ కోటాల నిర్ణయానికి దారితీసింది.దేశంలో దళితుల కోసం ద్విసభ్య నియోజకవర్గాలూ, తరువాత రిజర్వేషన్లూ దాని ఫలితమే. కులగణన జరిగితే సామాజిక విభజనకు దారి తీస్తుందని,అణగారిన తరగతులకు సంక్షేమ పథకాలను అమలు జరిపి ఉద్దరించాలనే వైఖరితో దళితులు, గిరిజనులకు తప్ప 1951 నుంచి నెహ్రూ సర్కార్‌ కులగణన నిలిపివేసింది.అయితే నాటి నుంచి నేటి వరకు చూస్తే అలాంటి ఉద్దరణ జరగకపోగా కొంత మంది దగ్గర సంపద పోగుపడటం, ముఖ్యంగా 1990 దశకం నుంచి ప్రారంభమైన నూతన ఆర్థిక విధానాల అమలు తరువాత కనిపిస్తున్నది. గత పదేండ్లలో దాని తీవ్రత మరింత పెరిగింది. అందుకే తిరిగి కులగణన, రాజకీయ, ఆర్థిక సాధికారత సామాజిక న్యాయ డిమాండ్లు ముందుకు వచ్చాయి.1931 తరువాత జరిగిన మార్పుల్లో వివిధ తరగతుల జనాభా పొందికలో అనేక మార్పులు వచ్చాయి. మొత్తంగా జనాభా పెరుగుదల తగ్గినప్పటికీ ఇతరులతో పోల్చినపుడు భూమి, ఆస్థి కేంద్రీకృతమైన వారిలో సంతానోత్పత్తి గణనీయంగా తగ్గింది. ఇప్పుడు బిసిల జనాభా 52శాతమని చెబుతున్నవన్నీ అంచనా లేదా 1931 లెక్కల ప్రాతిపదికన చెబుతున్నవి మాత్రమే.వచ్చే జనాభా గణనలో లెక్కలు తేలిన తరువాత తలెత్తే కొత్త సమస్యలను ఇప్పుడే ఊహించటం, వ్యాఖ్యానించటం తొందరపాటు అవుతుంది.

పాక్‌ ఉగ్రవాదులపై ప్రతీకారం : మిలిటరీకి పూర్తి స్వేచ్చ అంటే ఏమిటి ? నరేంద్రమోడీ ప్రచార యావ !

Tags

, , , , , ,


ఎం కోటేశ్వరరావు


భారత, పాక్‌ సరిహద్దుల్లో ఎప్పుడేం జరుగుతుందో తెలియదు.కర్తవ్యం నిర్వర్తించాల్సిన బలగాలు ఏం చేస్తున్నాయో, ఎలా ఉన్నాయో తెలియదు గానీ టీవీ ఛానళ్లు ఊగిపోతున్నాయి. కొన్ని యుద్ధాన్ని కూడా ప్రారంభించాయి. ఉగ్రదాడికి పాల్పడిన వారి మీద పగతీర్చుకోవాలని దేశమంతా కోరుతోంది. ఈ పూర్వరంగంలోనే ‘‘పహల్గాం దాడిపై ప్రధాని మోడీ పెద్ద సందేశం: సైనిక బలగాలకు ఎప్పుడు, ఎలా తిరిగి దెబ్బకాట్టాలన్న స్వేచ్చ ’’ ఇది హిందూస్తాన్‌ టైమ్స్‌ పత్రిక 2025 ఏప్రిల్‌ 30న పెట్టిన శీర్షిక. అదే పత్రిక 2019 ఫిబ్రవరి 17న ‘‘ తిరిగి దెబ్బ కొట్టేందుకు సాయుధ బలగాలకు పూర్తి స్వేచ్చ, పుల్వామా ఉగ్రదాడిపై చెప్పిన ప్రధాని మోడీ ’’ పేరుతో వార్త ఇచ్చింది.ఎలా, ఎప్పుడు, ఎక్కడ హంతకులను, వారిని ప్రోత్సహించిన వారి ఎవరు శిక్షించాలో నిర్ణయించేందుకు భద్రతా దళాలకు పూర్తి స్వేచ్చ ఇచ్చామని మహారాష్ట్రలోని పంధకర్‌వాడలో బిజెపి ఎన్నికల బహిరంగ సభలో పుల్వామా దాడి జరిగిన రెండు రోజుల తరువాత మోడీ ప్రకటించారు.ఇప్పుడు వారం రోజులు వ్యవధి తీసుకున్నారు. రెండిరటికీ ఏమిటీ తేడా అంటే నేడు పహల్గాం, నాడు పుల్వామా తప్ప మిలిటరీ బలగాలకు పూర్తి స్వేచ్చ రెండు సందర్భాలలో ఇచ్చారు. ఇప్పుడు కొత్తగా ఇచ్చిందేమిటో ఎవరైనా చెప్పగలరా ? అసలు మిలిటరీకి పూర్తి స్వేచ్చ అంటే ఏమిటి ? దేశమంతా పాకిస్తాన్‌ మీద నరేంద్రమోడీ యుద్దాన్ని ప్రకటించబోతున్నారని భావిస్తున్నది, కాళిదాసు కవిత్వానికి తమ పైత్యం జోడిరచినట్లుగా మీడియా యుద్ధం ప్రారంభమైనట్లే చిత్రిస్తున్నది.నాడు బాలాకోట్‌పై మెరుపుదాడి చేశాయి మన బలగాలు, ఇప్పుడేం చేస్తాయో తెలియదు.మన మిలిటరీ మీద 2016 యురి దగ్గర దాడి జరిగినపుడు, ప్రభుత్వం విమానాలు ఇవ్వకుండా 78 బస్సుల్లో పంపినపుడు సిఆర్‌పిఎఫ్‌ జవాన్లపై పుల్వామా దగ్గర జరిపిన దాడి సందర్భంగా మన మిలిటరీ మెరుపుదాడులు జరిపింది. ఇప్పుడు కూడా అలాంటి దాడులే జరగవచ్చని భావిస్తున్నారు.లేదూ యుద్ధమే చేస్తారా ? తెలియదు.

పైకి ఏమి చెప్పినప్పటికీ మిలిటరీ చెప్పినట్లు పాకిస్తాన్‌లో ప్రభుత్వాలు వినాల్సిందే. లేకపోతే ప్రధానుల ఉద్యోగాలు ఊడతాయి, జైలు పాలవుతారు. కానీ మనదేశంలో అలా కాదు, ప్రభుత్వ ఆదేశాల మేరకు మిలిటరీ వ్యవహరించాల్సి ఉంటుంది తప్ప రాజ్యాంగం ప్రకారం తనంతటతాను నిర్ణయాలు తీసుకోవటానికి లేదు. మిలిటరీకి పూర్తి స్వేచ్చ ఇచ్చినట్లు మోడీ ప్రకటించేశారు, మీడియాలో పతాక శీర్షికలకు ఎక్కారు. సామాజిక మాధ్యమంలో మరుగుజ్జుల గంతులు సరేసరి. మంత్రివర్గం ఆమోదించినట్లు గానీ, దీని గురించి ప్రజాస్వామ్య దేవాలయం అని మోడీ స్వయంగా చెప్పి మొక్కిన పార్లమెంటుకు చెప్పాలని గానీ, అందుకు గాను ప్రత్యేక సమావేశాలు నిర్వహించాలని గానీ ప్రజాస్వామ్య పుట్టినిల్లు గురించి చెప్పుకొనే వారికి గుర్తు లేదు.అసలు అఖిలపక్ష సమావేశానికే హాజరుగాని ప్రధాని నుంచి ఇలాంటి వాటిని ఆశించటం దురూహే.త్రివిధ దళాల ఉన్నతాధికారులు, భద్రతా సలహాదారు అజిత్‌ దోవల్‌, రక్షణ మంత్రి రాజనాధ్‌ సింగ్‌తో సమావేశమైన తరువాత ప్రధాని చేసిన ప్రకటన పార్లమెంటు ఉభయసభల ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి అక్కడే ప్రకటించి ఉంటే మన దేశం ఉగ్రదాడిపట్ల ఎంత సీరియస్‌గా ఉందో లోకానికి తెలిసేది కదా, ఎందుకు ఆ పని చేయలేదు ? ఎవరైనా అంత సమయం ఎక్కడుంది, అసలు అవసరమా అని ప్రశ్నించవచ్చు. నిజమే మరణించిన వారి చితిమంటలు ఆరలేదు, ఆప్తుల కన్నీరు ఆగలేదు, మోడీ బీహార్‌ సభకు హాజరు కావటం అవసరమా ? దాడి జరిగింది ఏప్రిల్‌ 22న, ప్రధాని ప్రకటన చేసింది, 29వ తేదీన, పార్లమెంటును పిలవటానికి వారం రోజులు చాలవా ? సౌదీ నుంచి ప్రధానే కొద్ది గంటల్లో వచ్చినపుడు ఎంపీలు రాలేరా, ప్రతి రాష్ట్ర రాజధానికి విమానాలు, 24గంటల్లో వచ్చే రైళ్లు కూడా ఉన్నాయిగా ! యావత్‌ దేశాన్ని కుదిపివేసిన ఉదంతం గురించి ప్రజాప్రతినిధుల సభలో చర్చించని ప్రజాస్వామ్య దేశం ప్రపంచంలో ఎక్కడైనా ఉందా ? పార్లమెంటులో గానీ, మంత్రివర్గంలో గానీ మిలిటరీ ఎక్కడ,ఎలా దాడిచేయాలో పథకాలను వెల్లడిరచరు, బహిరంగంగా చర్చించరు, ఒక నిర్ణయం మాత్రమే చేస్తారు. దాన్ని అమలు జరిపే మిలిటరీకి పూర్తి స్వేచ్చ ఆ నిర్ణయంలోనే అంతర్భాగంగా ఉంటుంది. ఇన్ని బాంబులే వేయాలి, ఇన్ని రౌండ్లే కాల్చాలి, విమానాలను ఇన్నే వాడాలని, ఇన్ని గంటలు, రోజులు మాత్రమే దాడులు చేయాలని ఏ పార్లమెంటూ, మంత్రివర్గమూ నిర్ణయించదు. కానీ నిర్ణయం కంటే పూర్తి స్వేచ్చ అనే ప్రచార అంశానికి మోడీ ప్రాధాన్యత ఇచ్చారు. పార్లమెంటు నిర్ణయంగా ప్రకటిస్తే మోడీ ప్రత్యేకత ఏముంటుంది ?

గుళ్లలో పూజారులను నియమిస్తారు. వారు రోజూ పూజలు ఎలా చేయాలో దేవస్థానం కమిటీ గానీ, ముఖ్యమంత్రి, ఇప్పుడు సనాతన డిప్యూటీలు కూడా వచ్చారు గనుక వారు గానీ మీకు స్వేచ్చ ఇచ్చామని ప్రకటించటం లేదు కదా. ఏ పూజకు, ఏ దర్శనానికి, లడ్డు, ప్రసాదానికి ఎంత అన్న వ్యాపార ధరల నిర్ణయం(వీటికి మాత్రం పవిత్రత ఉండదు) అమలు మాత్రమే చూస్తారు. అలాగే సరిహద్దు భద్రతా దళాలంటూ మనకు ప్రత్యేక విభాగాలే ఉన్నాయి. సరిహద్దులు దాటి అనుమతి లేకుండా ఇతర దేశాలకు చెందిన సాధారణ పౌరులు, చివరకు ఆవులు, గేదెలు పొరపాటున రావటాన్ని కూడా వారు అనుమతించరు, అలాంటిది ఉగ్రవాదుల మీద చర్యలు తీసుకోవాలని, మీకు ఈ రోజువరకు స్వేచ్చ నిస్తున్నామని ప్రతిరోజూ ఉదయమే నరేంద్రమోడీ కార్యాలయం ఆదేశాలు జారీ చేస్తుందా ? చేయదు కదా, అది ప్రతిక్షణం వారి విధి. ఎలా చేయాలో స్వేచ్చవారికి ఉంటుంది. అలాంటి విధి నిర్వహణలో నిఘా ఒకటి. దానిలో వైఫల్యం, నిర్లక్ష్యం కారణంగానే పహల్గాంలో అమాయకులు బలయ్యారు.ఉగ్రవాదులు సరిహద్దు దాటి రాకుండా లేదా అంతర్గతంగా ఉన్న వారిని నిరోధించాలని వారి మీద అవసరమైతే చర్యలకు స్వేచ్చ ఇచ్చినట్లు, ఉగ్రవాదాన్ని అణచివేయాలని నిర్ణయించినట్లు మాత్రమే మోడీ చెప్పారు. అంతే తప్ప దాని కోసం యుద్ధం చేయాలని చెప్పలేదు. శత్రు సైనికులు సరిహద్దులో దాడులకు తెగబడితే తిప్పికొట్టాలని ప్రత్యేకంగా నిర్ణయించి చెప్పాల్సినపని లేదు. అంతే తప్ప యుద్ధాలకు మిలిటరీకి అనుమతి ఉండదు, అవసరమని మిలిటరీ సిఫార్సు చేస్తే మంత్రివర్గం, పార్లమెంటు నిర్ణయాలు చేయాల్సి ఉంటుంది. మిలిటరీకి అలాంటి విచక్షణ అధికారాలు ఇస్తే ఏం జరుగుతోందో అనేక దేశాల్లో చూస్తున్నాం. హమస్‌ సాయుధులను పట్టుకోవాలని ఇజ్రాయెల్‌ ప్రభుత్వం ఆదేశిస్తే అది చేతగాక గాజాలో పిల్లలు, మహిళలను, నిరాయుధులను చంపుతూ ఆసుపత్రా, స్కూలా అనేదానితో నిమిత్తం లేకుండా కనిపించిన ప్రతిభవనాన్ని కూల్చుతున్నారు.


పహల్గామ్‌ దాడి సందర్భంగా డోనాల్డ్‌ ట్రంప్‌ ఏమన్నాడు ‘‘ నేను భారత్‌కు ఎంతో సన్నిహితుడిని, అలాగే పాకిస్తాన్‌కూ ఎంతో దగ్గర.వారు కాశ్మీరు సమస్య మీద వెయ్యి సంవత్సరాల నుంచి దెబ్బలాడుకుంటున్నారు. అంతకు మించి ఎక్కువ సంవత్సరాల నుంచే ఉండవచ్చు, సరిహద్దుల గురించి 1,500 సంవత్సరాలుగాగా ఉద్రిక్తతలు ఉన్నాయి. ఉగ్రవాదదాడి చెడ్డది, భారత్‌ మరియు పాకిస్తాన్‌ మధ్య ఉద్రిక్తతలు ఎప్పుడూ ఉన్నవే. ఏదో విధంగా వారే పరిష్కరించుకుంటారు.ఇద్దరు నేతలూ నాకు తెలుసు’’ అన్నాడు.అదే పుల్వామా దాడి సమయంలో అదే ట్రంప్‌ జాతీయ భద్రతా సలహాదారు ఏమన్నాడు. మన అజిత్‌ దోవల్‌తో ఫోన్లో మాట్లాడాడు.‘‘ జైషే మహమ్మద్‌కు పాకిస్తాన్‌ సురక్షిత స్వర్గంగా ఉండకుండా చూసేందుకు చూస్తామని ’’ జాన్‌ బోల్టన్‌ చెప్పినట్లు అమెరికా విదేశాంగ శాఖ ప్రకటించింది. ఆత్మ రక్షణ చేసుకొనే హక్కు భారత్‌కు ఉందని కూడా చెప్పాడు. ఇప్పుడు ఇద్దరూ కావాలని, వారే పరిష్కరించుకుంటారని ట్రంప్‌ అన్నాడు.మన భాగస్వామి, మిత్రదేశం, నా స్నేహితుడు అని నరేంద్రమోడీ కీర్తించిన పెద్దమనిషి. అలాంటి దేశం మనకు మద్దతు ఇస్తుందా ? అమెరికా ఇచ్చిన విమానాలనే ఇప్పుడు పాకిస్తాన్‌ మనమీద మోహరిస్తున్నది, వాటికి మరమ్మతులు, నవీకరణ చేస్తున్నది అమెరికా.అరుణాచల్‌లో గ్రామాలను, లడక్‌లో నిర్మాణాలు చేస్తున్నది అంటూ నిరంతరం మనకు సమాచారం అందించే అమెరికా సంస్థలు పహల్గాం దాడి విషయంలో హెచ్చరికలు చేయలేదేం !

కాశ్మీరుకు ఆర్టికల్‌ 370, అదే విధంగా సాయుధ దళాలకు ప్రత్యేక అధికారాల నిచ్చే చట్టాన్ని(ఎఎఫ్‌ఎస్‌పిఏ) సవరిస్తామని వాగ్దానం చేయటం ద్వారా కాంగ్రెస్‌ పార్టీ భద్రతా దళాలకు ముప్పు కుట్ర తలపెట్టిందని, జమ్మూ`కాశ్మీరు ఇతర ఉగ్రవాదులున్న ప్రాంతాలలో భద్రతా దళాల చేతులు కట్టివేసిందని 2019 ఏప్రిల్‌ మూడవ తేదీన పశ్చిమబెంగాల్లోని సిలిగురి ఎన్నికల ప్రచారంలో నరేంద్రమోడీ ధ్వజమెత్తారు. ఆ కాంగ్రెస్‌ అధికారానికి రాలేదు, అదే మోడీ రెండోసారి పదవిని చేపట్టి ఆర్టికల్‌ 370 రద్దుతో పాటు అసలు కాశ్మీరు రాష్ట్రాన్నే రెండుగా చీల్చి కేంద్ర పాలిత ప్రాంతాలుగా మార్చారు, మూడవ సారి వచ్చిన తరువాత కూడా ఇప్పటికీ అలాగే ఉన్నాయి, ఆ ప్రాంతాల్లో శాంతి భద్రతల బాధ్యత కేంద్రానిదే. భద్రతా దళాలకు పూర్తి అధికారాలను ఇచ్చామని చెప్పారు. అయినప్పటికీ గత ఐదు సంవత్సరాలలో ఉగ్రవాదులు పహల్గాంతో సంబంధం లేకుండా అరవైమందికి పైగా పౌరులను చంపారు, వారిలో బిజెపి కార్యకర్తలు కూడా ఉన్నారు. అనేక మంది ఉగ్రవాదులను కూడా చంపివేశారు. ఎందుకు కేంద్రం విఫలమైనట్లు ? తాజా దాడికి బాధ్యత ఎవరిది ? మోడీ చెప్పిన భద్రతా దళాల ప్రత్యేక అధికారాల చట్టం ఇంకా కొనసాగుతూనే ఉంది కదా ! 2019 ఆగస్టు ఎనిమిదవ తేదీన ఆర్టికల్‌ 370 రద్దు గురించి టీవీలో ప్రధాని నరేంద్రమోడీ మాట్లాడారు. కాశ్మీరులో ఒక నూతన యుగం ప్రారంభమైందన్నారు. ఈ ఆర్టికల్‌ను ఒక సాధనంగా చేసుకొని భయాన్ని వ్యాపింపచేశారని కాశ్మీరు అభివృద్ధిని అడ్డుకున్నారని ఆరోపించారు.ఆర్టికల్‌ 370 మరియు 35ఏ వేర్పాటువాదాన్ని ఇచ్చాయన్నారు. అందుకే వాటిని రద్దు చేసినట్లు చెప్పారు. అవేవీ లేవు, ఉగ్రవాదుల ముప్పు తప్పిందా, భయం తొలిగిందా ! తొలిగితే కాశ్మీరుకు రాష్ట్ర హోదాను పునరుద్దరించకుండా భద్రతాపరమైన అధికారాలన్నీ కేంద్రం తన చేతుల్లోనే ఎందుకు పెట్టుకుంది ? ఈ ప్రశ్నలకు బదులుందా ?

ఉక్రెయిన్‌ సంక్షోభం: రష్యా మూడు రోజుల కాల్పుల విరమణ !

Tags

, , , ,


ఎం కోటేశ్వరరావు


తాను అధికారానికి వచ్చిన 24 గంటల్లో ఉక్రెయిన్‌ వివాదాన్ని పరిష్కరిస్తానని డోనాల్డ్‌ ట్రంప్‌ చెప్పాడు.వందరోజులైంది, ఏం జరుగుతోందో తెలియదు. రెండు వారాలు, అంతకు లోపే ఒప్పందం కుదరవచ్చని, ఇంకా ఎక్కువ కాలమే పట్టవచ్చని తాజాగా చెప్పాడు. దానికి అనుగుణంగా కావచ్చు లేదా ఎత్తుగడగా గానీ మే నెల 8 నుంచి 10వ తేదీ వరకు కాల్పుల విరమణ పాటిస్తామని, ఉక్రెయిన్‌ కూడా అదే విధంగా వ్యవహరించాలని రష్యా అధినేత వ్లదిమిర్‌ పుతిన్‌ ప్రకటించాడు.రెండవ ప్రపంచ యుద్ధంలో సోవియట్‌ యూనియన్‌ విజయానికి 80ఏండ్లు నిండుతున్న సందర్భంగా ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు మాస్కో పేర్కొన్నది. కాదు తక్షణమే నెల రోజుల పాటు పోరును ఆపాలని ఉక్రెయిన్‌ స్పందించింది. సంక్షోభం ప్రారంభమై 1,160 రోజులైంది. ఆ మూడు రోజుల్లో జెలెనెస్కీ సేనలు ఉల్లంఘనకు పాల్పడితే పర్యవసానాలు తీవ్రంగా ఉంటాయని కూడా పుతిన్‌ హెచ్చరించాడు.‘‘ కొన్ని కారణాలతో ప్రతిఒక్కరూ మే 8వ తేదీ వరకు వేచి ఉండాలని, మాస్కోలో జరిగే కవాతు సందర్భంగా పుతిన్‌ ప్రశాంతతను కోరుకుంటున్నాడని, ఎలాంటి షరతులు లేకుండా కనీసం నెల రోజులు కాల్పుల విరమణ ఉండాలని, మేం పౌరుల ప్రాణాలకు విలువ ఇస్తాం తప్ప కవాతులకు కాదని, నిజంగా శాంతి కావాలని రష్యా కోరుకుంటే వెంటనే కాల్పుల విరమణకు పూనుకోవాలని ’’ జెలెనెస్కీ అన్నాడు. ప్రపంచ నేతల సమక్షంలో మే 9న జరిగే కవాతులో విభ్రాంతకర పరిస్థితి ఎదురుకాకుండా చూడాలన్నది పుతిన్‌ ప్రతిపాదన అర్ధం అని పరిశీలకులు కూడా వ్యాఖ్యానించారు.మన దేశంలో రిపబ్లిక్‌ దినోత్సవం రోజున జరిగే కవాతులో ఆయుధ ప్రదర్శన చేసినట్లే, గొప్ప దేశభక్త యుద్ధంగా వర్ణించిన రెండవ ప్రపంచ యుద్ధంలో సోవియట్‌ విజయం సాధించిన మే9వ తేదీన ప్రతి ఏటా కవాతులో తన ఆయుధపాటవాన్ని ప్రదర్శిస్తున్నది. ఏం జరగనుందో చూద్దాం !


అమెరికా ఆర్భాటంగా ప్రకటించిన 30రోజుల నల్ల సముద్ర శాంతి ఒప్పందం ఏమైందో తెలియదు. మా నేత శాశ్వత ఒప్పందం కుదరాలని కోరుతున్నాడు, రెండు దేశాల నేతల మీద అసహనం పెరుగుతున్నదని వైట్‌హౌస్‌ ప్రతినిధి వ్యాఖ్య. దాడులను గనుక రష్యా ఆపకపోతే తాము శాంతి చర్చల నుంచి వైదొలుగుతామని అమెరికా ప్రతినిధి వ్యాఖ్యానించాడు. క్రిమియా తమదే అని, అదే విధంగా స్వాతంత్య్రం ప్రకటించుకున్న ఉక్రెయిన్‌లోని మూడు ప్రాంతాలను అంతర్జాతీయ సమాజం గుర్తించాలన్నది తమ షరతులలో ఒకటని రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావరోవ్‌ బ్రెజిలియన్‌ పత్రిక గ్లోబోకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పాడు.శాంతి ఒప్పందం రెండు వారాలు, అంతకు లోపే కుదరవచ్చన్న ట్రంప్‌ ఇంకా ఎక్కువ సమయం కూడా పట్టవచ్చని ఆదివారం నాడు చెప్పాడు.తాను పుతిన్‌తో మాట్లాడిన తరువాత కూడా దాడులు జరగటంతో ఆశాభంగం చెందానన్నాడు. మరిన్ని ఆయుధాలు కావాలని రోమ్‌లో జెలెనెస్కీ తనను కోరినట్లు వెల్లడిరచాడు.పోప్‌ ఫ్రాన్సిస్‌ అంత్యక్రియలకు వెళ్లిన సందర్భంగా వారిద్దరూ అక్కడ మాట్లాడుకున్నారు. క్రిమియాను విలీనం చేసుకొనేందుకు రష్యాను అనుమతించటం ద్వారా మాజీ అధ్యక్షుడు జోబైడెన్‌ సమస్యను మరింత సంక్లిష్టం గావించినట్లు ఆరోపించాడు. జెలెనెస్కీతో ట్రంప్‌ మాట్లాడిన తరువాత రష్యా దాడులను మరింతగా పెంచింది.


రష్యా ఉపయోగిస్తున్న పదజాలాన్ని చూస్తే ఒప్పందం గురించి కఠిన వైఖరి తీసుకొనేట్లు ఉందని పరిశీలకులు చెబుతున్నారు. నాటోలో ఉక్రెయిన్‌ చేరకుండా చూడటం, దాని మిలిటరీ శక్తిని పరిమితంగావించటం,అంతర్గత రాజకీయాల్లో తన పలుకుబడి ఉండేట్లు చూసుకొనేందుకు పుతిన్‌ చూస్తున్నాడన్నది వారి భాష్యం. అమెరికా ముందుకు తెచ్చిన 30రోజుల శాంతి ఒప్పందానికి రష్యా విధించిన షరతులను చూస్తే అది సుముఖంగా లేదన్నది స్పష్టం. తన వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతుల మీద, వాటి లావాదేవీలు జరిపే బ్యాంకుల మీద ఆంక్షలు విధిస్తే ఇంక ఒప్పందం ఏమిటని అది ప్రశ్నించింది. ఈస్టర్‌ సందర్భంగా ప్రకటించిన పరిమిత వ్యవధి కాల్పుల విరమణను ఉల్లంఘించినట్లు రెండు దేశాలూ పరస్పరం ఆరోపణలు చేసుకున్నాయి. రష్యా మూడువేల సార్లు ఉల్లంఘించిందని, దీర్ఘశ్రేణి క్షిపణులను తప్ప డ్రోన్లు, ఇతర దాడులు చేసిందని ఉక్రెయిన్‌ విశ్లేషకులు ఆరోపించారు. ఆ సమయంలో మిలిటరీ వాహనాలు, ఆయుధాల మరమ్మతులు చేసుకోవటం, మందుపాతరలను వెలికి తీసేందుకు ఉపయోగించుకుందన్నారు. మే తొమ్మిది విజయోత్సవ కవాతు తరువాత రష్యా పెద్ద ఎత్తున దాడులకు దిగనుందని ఆరోపించారు. శుక్రవారం నాడు రోమ్‌లో ట్రంప్‌, జెలెనెస్కీ భేఠీ తరువాత పుతిన్‌ ప్రకటన వెలువడిరదంటే బంతిని అమెరికా కోర్టులో నెట్టినట్లుగా భావిస్తున్నారు.


శాంతి ఒప్పందం కుదరాలంటే రష్యా ఆధీనంలోకి వెళ్లిన ప్రాంతాలను ఉక్రెయిన్‌ వదులుకోవాల్సిందే అని మాట్లాడుతున్న ట్రంప్‌ వైఖరితో ఐరోపా దేశాలు ఆందోళన చెందుతున్నాయి. అమెరికా ప్రతిపాదనలు చైనా నేత షీ జింపింగ్‌తో సహా పుతిన్‌, ఇతర ప్రపంచ నేతలకు ప్రమాదకర సంకేతాలను పంపుతున్నట్లే అని భావిస్తున్నాయి. అక్రమ ఆక్రమణలను బహుమతిగా ఇచ్చినట్లే అంటున్నారు. ఐరోపాలోని ఒక దేశాన్ని స్వంత భూభాగాన్ని వదులుకోవాలని చెబితే, దాన్ని బలవంతం చేస్తే ఐరోపాలో లేదా ఎక్కడా ఏ దేశమూ భద్రంగా ఉన్నట్లు భావించలేవని, అది నాటో లేదా ఇతర దేశం ఏదైనా కావచ్చని ఒక దౌత్యవేత్త చెప్పినట్లు సిఎన్‌ఎన్‌ పేర్కొన్నది. అమెరికా అంగీకరించిన ప్రతిదానికీ తాము తలూపలేమన్నాడు. ఆసియాలోని అమెరికా మిత్రదేశాల్లో కూడా ఇదే ఆందోళన తలెత్తింది. ఉక్రెయిన్‌ సంక్షోభంలో తదుపరి తీసుకోవాల్సిన చర్యల గురించి తాము ఒక ఉమ్మడి వైఖరికి వచ్చేందుకు గణనీయంగా ముందుకు పోయినట్లు జర్మనీ, ఫ్రాన్సు, బ్రిటన్‌ ఒక సంయుక్త ప్రకటనలో పేర్కొన్నాయి.అమెరికా ప్రతిపాదన ప్రకారం గణనీయమైన ప్రాంతాన్ని తాము వదులుకోవాల్సి వస్తే అది ఆత్మహత్య అవుతుందని, జెలెనెస్కీ ఒప్పుకున్నా తమ పార్లమెంటు అంగీకరించదని ఒక ఎంపీ చెప్పాడు.


యుద్ధ రంగంలో రోజు రోజుకూ ఎదురుదెబ్బలు తింటున్న ఉక్రెయిన్‌ ఆర్థికంగా దివాలా తీసింది. జిడిపితో లంకె ఉన్న రుణాల రీషెడ్యూలు గురించి ఒప్పందం కుదుర్చుకోవటంలో విఫలమైంది.అప్పులిచ్చిన వారి షరతులకు అంగీకరించటం లేదని పేర్కొన్నది.తదుపరి కిస్తీ మే నెలాఖరులో చెల్లించాల్సి ఉంది. ఒక వైపు అప్పుల వాళ్ల సతాయింపు మరోవైపు రష్యాతో ఒప్పందాన్ని అంగీకరించాలని, తమకు చెల్లించాల్సినదానికి ప్రతిగా విలువైన ఖనిజాలున్న ప్రాంతాన్ని తమకు అప్పగించాలని ట్రంప్‌ చేస్తున్న వత్తిడితో జెలెనెస్కీ యంత్రాంగం ఉక్కిరిబిక్కిరి అవుతున్నది. రష్యా దాడి కారణంగా తాము ఆర్థికంగా తాము 30శాతం దెబ్బతిన్నామని, తిరిగి కోలుకుంటే తప్ప షరతులను నెరవేర్చలేమని చెబుతున్నది.260 కోట్ల డాలర్ల రుణ రీషెడ్యూలుపై ఒప్పందం కుదుర్చుకోవటంలో విఫలమైనట్లు ఉక్రెయిన్‌ ప్రకటించింది, మేనెలాఖరులోగా 60 కోట్ల డాలర్ల కిస్తీపై ఏదో ఒకటి జరగకపోతే దివాలా తీసినట్లు పరిగణించాల్సి ఉంటుంది.2022కు ముందు విదేశీ, స్వదేశీ అప్పు వందబిలియన్‌ డాలర్లు ఉండగా 2024నవంబరు నాటికి అది 160బిలియన్లకు పెరిగింది. ఐరోపా సమాఖ్య, ప్రపంచబ్యాంక్‌, ఐఎంఎఫ్‌ ఇచ్చిన రుణాల వల్లనే ఇలా పెరిగింది. దీన్లో ఐరోపా సమాఖ్య రుణం ఐదు నుంచి ఏకంగా 43బి.డాలర్లకు, ప్రపంచబాంకు, ఐఎంఎఫ్‌ రుణం 47బిలియన్‌ డాలర్లకు పెరిగింది. తమ అప్పు తీర్చకపోయినా ఫరవాలేదు గానీ ప్రైవేటు రంగానికి అనుకూలంగా ఉన్న సమాఖ్య ఒప్పందాలను అంగీకరించాలని పట్టుబడుతున్నది. అదే జరిగితే పునర్‌నిర్మాణ కాంట్రాక్టులన్నీ ఆ సంస్థలకు దక్కుతాయి, వాటితో అంతకంటే ఎక్కువ మొత్తాలను ఆర్జించవచ్చన్నది వాటి ఎత్తుగడ. యుద్దంతో తమకు సంబంధం లేదని గడువు, ఒప్పందం మేరకు అప్పు తీర్చాల్సిందేనని బ్రెట్టన్‌ ఉడ్‌ కవలలు డిమాండ్‌ చేస్తున్నాయి. రష్యాకు చెల్లించాల్సిన 60 కోట్ల డాలర్లను 2015 నుంచి చెల్లించటం నిలిపివేసింది. ఉక్రెయిన్‌ బాండ్లు 70శాతం విలువను కోల్పోయాయి, సెకండరీ మార్కెట్లో 30శాతం మొత్తాలకు విక్రయిస్తున్నారు. పాత బాండ్లు ఉన్నవారు వాటి బదులు వడ్డీ ఎక్కువగా ఉన్న కొత్త బాండ్లు తీసుకొనేందుకు అంగీకరిస్తున్నారు. విదేశీ రుణ భారం మూడు సంవత్సరాల్లో 56 నుంచి 115 బిలియన్‌ డాలర్లకు పెరిగింది. వీటి కోసం ఉక్రెయిన్‌ నయా ఉదారవాద విధానాలతో కూడిన 325 షరతులను అంగీకరించింది.దానిలో భాగంగా 531 చర్యలను అమలు చేపడతామని పేర్కొన్నది.

దాడి ప్రారంభమైన తరువాత ఐరోపాలో ఉన్న 300 బిలియన్‌ డాలర్ల రష్యా ఆస్తులను స్థంభింప చేశారు. వాటిని విక్రయిచేందుకు ధైర్యం చేయలేదు.ఐరోపా యూనియన్‌ వీటి మీద రుణాలు తీసుకొని ఉక్రెయిన్‌కు అప్పుగా ఇస్తున్నది. స్థంభింపచేసిన రష్యా అస్తులను పెట్టుబడులుగా పెట్టి ప్రతి ఏటా ఐదు బిలియన్‌ యూరోల మేరకు ఐరోపా సమాఖ్య లబ్ది పొందుతున్నది. రష్యా మీద ఆంక్షలు విధించినప్పటికీ సమాఖ్యలోని ప్రైవేటు బాంకులు రష్యాలో మామూలుగానే పని చేస్తున్నాయి, అవి రష్యాకు భారీ మొత్తాలలో పన్నులు కడుతూ లావాదేవీలలో పెద్ద ఎత్తున లాభాలు సంపాదిస్తున్నాయి, వాటి మీద ప్రభుత్వాలు ఎలాంటి చర్యలూ తీసుకోవటం లేదు. తమ ఆంక్షలను ఉల్లంఘించిన వారి మీద చర్యలు తీసుకుంటామని ప్రకటించిన అమెరికా, ఐరోపా దేశాలు ఈ బాంకులను చూసీ చూడనట్లు వదలివేశాయి. పశ్చిమ దేశాల పావుగా మారిన జెలెనెస్కీ ఎడాపెడా అప్పులు చేస్తూ వాటిని యుద్ద అవసరాలకు వినియోగిస్తున్నాడు.దేశంలో అధిక ఆదాయం గలవారిని వదలివేసి అంతర్గతంగా 16.5శాతం వడ్డీ రేటుతో వారి నుంచే రుణాలు తీసుకుంటున్నాడు. లక్షలాది మంది జనం శరణార్దులుగా ఇరుగు పొరుగు దేశాలకు వెళ్లినా జెలెనెస్కీకి పట్టలేదు.మిలిటరీలో విధిగా చేరాలన్న నిబంధనల నుంచి సమాజంలో కులీనులకు ఏదో ఒకసాకుతో మినహాయింపు ఇచ్చాడు, కష్టజీవులను బలిపశువులుగా చేస్తున్నాడు. తీసుకున్న రుణాలను విదేశాలు, స్వదేశంలోని ధనికుల జేబుల్లోకి చేరే విధంగా చూస్తున్నాడు. అమెరికా అందించిన మిలిటరీ సాయాన్ని నగదు రూపంలో తీర్చలేక బదులుగా విలువైన ఖనిజాలున్న ప్రాంతాన్ని అప్పగించేందుకు సిద్దపడ్డాడు. ఇలాంటి వారు దేశం మొత్తాన్ని తాకట్టు పెట్టటానికి కూడా సిద్దపడతారు !

సరిహద్దుల్లో ఉద్రిక్తత : పాకిస్తాన్‌ వైపు చైనా మొగ్గిందా, భారత జలదాడి ఎవరి మీద !

Tags

, , , , , , , , , , ,


ఎం కోటేశ్వరరావు


పహల్గామ్‌ ఉగ్రదాడి ఉదంతంలో పాకిస్తాన్‌ వైపు చైనా మొగ్గిందనే అర్ధం వచ్చే రీతిలో మీడియాలో వార్తలు వచ్చాయి.ఉగ్రవాదులకు చైనా తయారీ సమాచార పరికరాలు అందినట్లు చిత్రించారు. కమ్యూనిజం, చైనాపై వ్యతిరేకతను రెచ్చగొడుతున్నవారు ఇలాంటి అభిప్రాయం కలిగించటం ఆశ్చర్యం కలిగించటం లేదు. అసలు ఎవరేమి చెప్పారో ముందు చూడాలి. మన భాగస్వామ్య దేశం, నరేంద్రమోడీ జిగినీ దోస్తుగా వర్ణించిన అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ ఏం మాట్లాడాడు.రోమ్‌లో పోప్‌ ఫ్రాన్సిస్‌ అంత్యక్రియలకు హాజరయ్యేందుకు విమానంలో వెళుతూ విలేకర్ల ప్రశ్నకు సమాధానమిచ్చాడు. ఎఎన్‌ఐ ఇచ్చిన వార్తలో ఇలా ఉంది. .‘‘ నేను భారత్‌కు ఎంతో సన్నిహితుడిని, అలాగే పాకిస్తాన్‌కూ ఎంతో దగ్గర.వారు కాశ్మీరు సమస్య మీద వెయ్యి సంవత్సరాల నుంచి దెబ్బలాడుకుంటున్నారు. అంతకు మించి ఎక్కువ సంవత్సరాల నుంచే ఉండవచ్చు, సరిహద్దుల గురించి 1,500 సంవత్సరాలుగాగా ఉద్రిక్తతలు ఉన్నాయి. ఉగ్రవాదదాడి చెడ్డది, భారత్‌ మరియు పాకిస్తాన్‌ మధ్య ఉద్రిక్తతలు ఎప్పుడూ ఉన్నవే. ఏదో విధంగా వారే పరిష్కరించుకుంటారు.ఇద్దరు నేతలూ నాకు తెలుసు’’ అన్నాడు.


చైనా పత్రిక గ్లోబల్‌ టైమ్స్‌ వార్తలో ఇలా ఉంది.‘‘ పాకిస్తాన్‌ మరియు భారత్‌ మధ్య తలెత్తుతున్న పరిస్థితిని సన్నిహితంగా చైనా పరిశీలిస్తున్నది. నిష్పాక్షిక దర్యాప్తు జరపాలన్న చొరవకు మద్దతు ఇస్తున్నది. ఉభయపక్షాలూ ఉద్రిక్తతలను తగ్గించేందుకు పూనుకోవాలని, సంయమనం పాటిస్తాయని ఆశాభావం వెలిబుచ్చుతున్నాం.’’ పాకిస్తాన్‌ ఉప ప్రధాని మరియు విదేశాంగ మంత్రి మహమ్మద్‌ ఇషాక్‌ దార్‌ ఆదివారం నాడు ఫోన్‌ చేసిన సందర్భంగా చైనా కమ్యూనిస్టు పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు, విదేశాంగ మంత్రి వాంగ్‌ ఇ చెప్పిన మాటలివి. తాము చైనాతో సహా అంతర్జాతీయ సమాజంతో ఎప్పటికప్పుడు పరిస్థితిని వివరిస్తున్నామని దార్‌ చెప్పాడు. అన్ని దేశాలూ ఉమ్మడిగా ఉగ్రవాదాన్ని ఎదుర్కోవాల్సి ఉంది, ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పాకిస్థాన్‌ తీసుకుంటున్న చర్యలను నిరంతంర చైనా సమర్ధిస్తూనే ఉందని వాంగ్‌ చెప్పాడు. ఎల్లవేళలా వ్యూహాత్మక భాగస్వామిగా, గట్టి స్నేహితుడిగా ఉన్న పాకిస్తాన్‌ భద్రతాపరమైన ఆందోళనలను చైనా పూర్తిగా అర్ధం చేసుకుంటున్నదని, సార్వభౌమత్వం,భద్రతా ప్రయోజనాలకు పూర్తి మద్దతు ఇస్తామని వాంగ్‌ ఇ చెప్పాడు.రెండు దేశాల మధ్య వివాదం ప్రాంతీయ శాంతి, స్థిరత్వాలకు మంచిది కాదని కూడా అన్నాడు. పాక్‌ మంత్రి ఫోన్‌ చేశాడు తప్ప చైనా మంత్రి చేయలేదని గ్రహించాలి.తటస్థ మరియు పారదర్శక పద్దతిలో పహల్గాం ఉదంతంపై దర్యాప్తు జరపాలని పాక్‌ ప్రధాని షెహబాజ్‌ షరీఫ్‌ కోరాడు. రెండు దేశాల మధ్య మధ్యవర్తిత్వం వహించేందుకు తాము సిద్దంగా ఉన్నట్లు ఇరాన్‌, సౌదీ అరేబియా ముందుకు వచ్చినట్లు వార్తలు.


ఒక మిత్రదేశ విదేశాంగ మంత్రి ఫోన్‌ చేసినపుడు ఎవరైనా స్పందించటం సహజం.పాకిస్తాన్‌ మాదిరి భాగస్వాములు లేదా మిత్రదేశాలతో మనదేశం మాట్లాడినట్లు ఎలాంటి వార్తలు లేవు.చైనాతో మాట్లాడతారని ఎవరూ అనుకోరు. అఫ్‌కోర్స్‌ మాట్లాడాలా లేదా అన్నది కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన అంశం. ఈ సందర్భంగా మీడియాలో మరోసారి చైనా వ్యతిరేక ప్రచారం మొదలైంది. చైనా తయారీ ఆధునిక ఆల్ట్రాసెట్‌ వాకీటాకీలతో ఉగ్రవాదులు తమ నేతలతో మాట్లాడారని, వారికి అవి ఎలా వచ్చాయంటూ చైనా అంతర్గతంగా దాడికి సహకరించిందా అని కొందరు ప్రశ్నిస్తున్నారు. చైనా దగ్గర చౌకరకం వస్తువుల తయారీ తప్ప ఆధునిక పరిజ్ఞానం లేదని గతంలో, ఇప్పటికీ ప్రచారం చేస్తున్నవారి నుంచే ఇప్పుడు ఇలాంటి మాటలు వస్తున్నాయి. ఇలాంటి పరికరాలు గతంలోనే ఉగ్రవాదుల దగ్గర దొరికినట్లు వార్తలు వచ్చాయి. ఆల్ట్రాసెట్‌ వాకీటాకీలను అంతర్జాతీయంగా నిషేధించలేదు. అలాంటివి ఒక్క చైనా మాత్రమే తయారు చేయటం లేదు,ప్రతి అగ్రదేశం వద్దా ఉన్నాయి.చైనా దగ్గర వాటిని ఎవరైనా కొనుగోలు చేయవచ్చు, ఆ క్రమంలో పాకిస్తాన్‌ కొనుగోలు చేసి ఉగ్రవాదులకు ఇచ్చి ఉండవచ్చు, దానికి చైనాను ముడిపెట్టటం సమస్య. మనదేశంలో నక్సలైట్ల దగ్గర రష్యన్‌ ఏకె రకం తుపాకులు ఉన్నాయి, అవి ప్రపంచంలో అనేక చోట్ల, మనదేశంలో కూడా తయారవుతున్నాయి. అంటే నగ్జల్స్‌కు మనదేశమే విక్రయిస్తోందని అర్ధమా !


సామాజిక మాధ్యమంలో వెలువడుతున్న పోస్టులు,వ్యాఖ్యలను చూస్తే ఉన్మాదం ఎంతగా తలకెక్కిందో అర్ధం అవుతున్నది. జీలం నది భారత్‌లో పుట్టి పాకిస్తాన్‌లో సింధునదిలో కలసి అరేబియా సముద్రంలోకి ప్రవహిస్తుంది. సింధు జలాల ఒప్పందాన్ని పక్కన పెట్టినట్లు మన ప్రభుత్వం ప్రకటించిన తరువాత ఎలాంటి ముందస్తు హెచ్చరికలేకుండా జీలం నది నీటిని విడుదల చేయటంతో మన కాశ్మీరులోని అనంతనాగ్‌ జిల్లా నుంచి పాక్‌ ఆక్రమిత కాశ్మీరులో ప్రవేశించి ముజఫరాబాద్‌ పరిసరాలకు వరద ముప్పు తెచ్చినట్లు, అనేక మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు పాకిస్తాన్‌ ప్రకటించింది. దీని గురించి అవునని గానీ కాదని గానీ ఇది రాసిన సమయానికి మన ప్రభుత్వం ఎలాంటి ప్రకటన చేయలేదు.భారత్‌ దెబ్బ అంటే ఇట్లుంటది అన్నట్లుగా కొందరు సంబరపడుతున్నారు. ఎవరి మీద ఈ వరద దాడి జరిగిందో, దాని పరిణామాలు, పర్యవసానాలను గమనించే స్థితిలో ఇలాంటి బాపతు లేకపోవటం విషాదం, గర్హనీయం. మన కాశ్మీరు నుంచి విడదీసిన ముక్కలో ముజఫరాబాద్‌ ఉంది. దాన్నే మనం ఆక్రమిత కాశ్మీరు అంటున్నాం, పాకిస్తాన్‌ విముక్త కాశ్మీరు అని పిలుస్తున్నది. మనదేశంలో అంతర్భాగంగా ఉన్న ముక్కను కూడా విముక్తి చేసి స్వతంత్ర కాశ్మీరు దేశాన్ని ఏర్పాటు చేస్తామని పాక్‌ చెబుతున్నది. అందుకే దాన్ని తనలో విలీనం చేసుకోలేదు, పార్లమెంటులో ప్రాతినిధ్యం కల్పించలేదు, తన స్వంత రాష్ట్రంగా కూడా పరిగణించటంలేదు తప్ప మిగతా అన్ని విషయాల్లో తన అంతర్భాగంగానే చూస్తున్నది.


ఎప్పటికైనా ఆక్రమిత కాశ్మీరును మనం తిరిగి తెచ్చుకోవాల్సిందే. అందుకే అసెంబ్లీలో ఆ ప్రాంతానికి కొన్ని సీట్లను కేటాయించి, అవి మినహా మిగిలిన వాటికే ఎన్నికలు జరుపుతున్నాం.మొత్తం 114 సీట్లకు గాను 24 పాక్‌ ఆక్రమిత కాశ్మీరుకు కేటాయించాం, 90స్థానాలకు ఎన్నికలు జరిగాయి.అప్పుడప్పుడు ముజఫరాబాద్‌లో తాము భారత్‌లో విలీనం అవుతామంటూ ప్రదర్శనలు జరుగుతుంటాయి, వాటిని మన మీడియా కూడా చూపుతుంది. ఇప్పుడు మనదేశం ఆ పట్టణం, పరిసరాలను పహల్గాం దాడికి ప్రతీకారంగా వరద నీటితో ముంచెత్తితే వారు మనకు అనుకూలంగా ఉంటారా ప్రతికూలంగా మారతారా ? కొంత మంది ఉగ్రవాదులు చేసిన దానికి సామాన్యుల మీద ప్రతీకారం తీర్చుకుంటే ఉగ్రవాదులకు ఆశ్రయం మరింత పెరుగుతుందా తగ్గుతుందా ? మానవహక్కులకు, అంతర్జాతీయ ఒప్పందాలకు ఇది పూర్తి విరుద్దం. అంతర్జాతీయ సమాజం ముందు తలదించుకోవాల్సిందే. ఉగ్రవాదులను పట్టుకోవాల్సిందే, నిర్దాక్షిణ్యంగా కాల్చి పారేయాల్సిందే.మన దేశంలో నక్సల్స్‌ను పట్టుకొనే పేరుతో ఆదివాసీల మీద పోలీసులు, భద్రతా దళాలు దాడులు చేస్తే జరిగిందేమిటి ? దాన్ని అవకాశంగా తీసుకొని భయంతో లేదా పోలీసుల మీద కసితో మరింతగా నగ్సల్స్‌కు వారు ఆశ్రయమిచ్చారా లేదా !


మన దగ్గర ఉన్న రాఫేల్‌ యుద్ధ విమానాలను ఎదుర్కొనేందుకు వీలుగా నిర్ధారణ కాని వార్తలంటూ చైనా తన ఆధునిక పిఎల్‌15 క్షిపణులను అత్యవసరంగా పాకిస్తాన్‌కు తరలించినట్లు క్లాష్‌ రిపోర్టు అనే మీడియాలో రాశారు. ఇవి రాడార్ల నియంత్రణలో గగన తలం నుంచే గగనతలంలో ప్రయోగించే కంటికి కనిపించని దీర్ఘశ్రేణి క్షిపణులు. వీటిని ఒకసారి వదిలిన తరువాత మధ్యలో కూడా దిశను మార్చి లక్ష్యాలవైపు ప్రయోగించవచ్చు. పాక్‌ యుద్ధ విమానాలకు అమర్చిన పిఎల్‌10, పిఎల్‌15 క్షిపణులంటూ ఎక్స్‌లో బొమ్మలను పెట్టారు. అధికారిక వర్గాలేవీ నిర్ధారించలేదని కూడా వార్తలో పేర్కొన్నారు.వీటిని తొలిసారిగా చైనా 2024 నవంబరులో ఒక ప్రదర్శనలో చూపిందట. ఇంత అత్యాధునిక క్షిపణులను ఏ దేశమూ కొన్ని నెలల్లోనే ఇతర దేశాలకు విక్రయించదు.ఈ క్షిపణులను అమెరికా ఏఐఎం120డి అనే వాటికి ధీటుగా చైనా తయారు చేసింది. ఇవి ఐరోపా ఎంబిడిఏ మెటోయర్‌కు సమానమైనవని కూడా చెబుతున్నారు.ఫ్రాన్సు నుంచి మనం కొనుగోలు చేసిన రాఫెల్‌ విమానాలు వీటిని ప్రయోగించేందుకు వీలు కలిగినవి. ఇవి చైనా ఇతర దేశాలకు ఎగుమతి చేస్తున్న పిఎల్‌15ఇ రకంతో సమానమని నిపుణులు చెబుతున్నారు, అవి 145 కిలోమీటర్ల లక్ష్యాలను దెబ్బతీస్తాయని వార్తలు వచ్చాయి.2019లో బాలకోట్‌పై మన దేశం సర్జికల్‌ దాడులు జరిపినపుడు పాకిస్తాన్‌ మన మిగ్‌21 బైసన్‌ అనే విమానాన్ని కూల్చివేసింది. దానికి గాను అమెరికా అందచేసిన ఎఫ్‌16విమానానికి అమెరికా నుంచే తెచ్చుకున్న మధ్యశ్రేణి క్షిపణి అమ్‌రామ్‌ అమర్చి కూల్చివేసింది. నాటికి మన దగ్గర అలాంటివి లేవు.ఉక్రెయిన్‌ యుద్ధంలో అమెరికా ఎఫ్‌16 విమానాలు, వాటికి అమర్చిన క్షిపణులను కూడా ధ్వంసం చేసే, దాడులు చేసే క్షిపణులను రష్యా ఇప్పుడు వినియోగిస్తున్నది.

ఇప్పుడు పాకిస్తాన్‌ సేకరిస్తున్న ఆయుధాల గురించి చెబుతుంటే కొంత మందికి రుచించదు. విపరీత అర్ధాలు తీసే ప్రబుద్ధులు కూడా ఉంటారు. ప్రతిదేశం తన భద్రతకు ప్రాధాన్యత ఇస్తుంది.ఇప్పుడు పహల్గామ్‌ దాడికి ప్రతీకారం తీర్చుకొనేందుకు మన దేశం ఉన్న సమయంలో పాకిస్తాన్‌ ఆర్మీ చైనా నుంచి ఆధునిక క్షిపణులు సేకరిస్తున్నదని నిర్ధారణగాని వార్తలు వచ్చాయి. సాధారణ పరిస్థితి ఉన్నపుడే మనదేశం అమెరికా ఆంక్షలు, బెదిరింపులను కూడా ఖాతరు చేయకుండా రష్యా నుంచి ఆధునిక ఎస్‌`400 శామ్‌ వ్యవస్థలను కొనుగోలు చేసింది. ఎందుకు అంటే చైనా, పాకిస్తాన్ల నుంచి వచ్చే ముప్పును ఎదుర్కొనేందుకు అని చెప్పారు. మూడిరటిని ఇప్పటికే మోహరించాము. ఇంకా రెండు వ్యవస్థలు రష్యా నుంచి రావాల్సి ఉంది. వాటిని ఉపరితలం నుంచి ఆకాశంలోకి ప్రయోగించేందుకు, ఎక్కడికి కావాలంటే అక్కడికి తరలించవచ్చు. ఇవి అన్ని రకాల యుద్ధ విమానాలు, డ్రోన్లు, క్షిపణులను గుర్తిస్తాయి, క్షిపణులతో వాటి మీద దాడులు చేస్తాయి.ఎనభై లక్ష్యాలను 380 కిలోమీటర్ల పరిధిలో ఛేదిస్తాయి. అందువలన పాకిస్తాన్‌ వైపు నుంచి వచ్చే ముప్పును ఎదుర్కోగల స్థితిలో మనదేశం ఉంది !

నోరు తెరిస్తే అబద్దం, మీడియాపై దాడి, ట్రంప్‌ అసత్యాలపై రోజువారీ లెక్కలు !

Tags

, , , , ,

ఎం కోటేశ్వరరావు


నీ స్నేహితులను చూస్తే నువ్వెలాంటి వాడివో తెలుస్తుందన్నది ఒక లోకోక్తి.అనేక దేశాల నేతలు డోనాల్డ్‌ ట్రంప్‌ తమ జిగినీ దోస్తు అని చెప్పుకోవటం, చెట్టపట్టాల్‌ వేసుకొని తిరగటం తెలిసిందే.ట్రంప్‌ దాదాపు ప్రతి రోజూ ఎక్కడో అక్కడ మీడియాతో మాట్లాడితే, నోరు విప్పేది లేదని మోడీ భీషణ ప్రతిజ్ఞ చేశారు. ట్రంప్‌ పచ్చి అబద్దాల కోరు అని చైనా తాజాగా చెబుతోంది, ఒక్క చైనాయే కాదు, అమెరికా మీడియా సైతం గతంలో, ఇప్పుడూ అదే చెబుతోంది.రోజూ ఎన్ని అసత్యాలు, తప్పుడు సమాచారం చెబుతున్నదీ లెక్కలు తీయటం ఒక పనిగా మారింది. తాజా అబద్దం ఏమిటంటే చైనా అధ్యక్షుడు తనతో మాట్లాడినట్లు ట్రంప్‌ చెప్పాడు.ఎప్పుడు అంటే అవన్నీ మీకెందుకు మూడు నాలుగు వారాల్లో పన్నుల మీద అమెరికా ఒప్పందం చేసుకుంటుంది అన్నాడు. పన్నుల నుంచి వెనక్కు తగ్గుతున్నట్లు చైనా సంకేతం పంపింది, పూర్తి విజయం నాదే అని కూడా చెప్పుకున్నాడు. టైమ్‌ పత్రికకు తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ‘‘ అతను ఫోన్‌ చేశాడు,అది అతనివైపు నుంచి ఉన్న బలహీనతగా నేను భావించటం లేదు ’’ అన్నాడు.మరోవైపు చైనా ఎలాంటి ఆర్భాట ప్రకటనలు లేకుండా వాణిజ్య యుద్ధాన్ని ఎలా ఎదుర్కోవాలి, ఆర్థిక వ్యవస్థను ఎలా ముందుకు తీసుకుపోవాలో రోజువారీ సమీక్షలు చేస్తున్నది. స్వయంగా అధ్యక్షుడు షీ జింపింగ్‌ రంగంలోకి దిగాడు. ఆర్థిక వ్యవస్థలో సానుకూల అంశాలున్నప్పటికీ విదేశీ కుదుపుల ప్రభావం పెరుగుతున్నదని పొలిట్‌బ్యూరో సమావేశం తరువాత చైనా వార్తా సంస్థ సిన్హువా పేర్కొన్నది. అంతర్గతత ఆర్థిక వ్యవస్థకు శక్తినిచ్చేందుకు సమస్యలను ఎదుర్కొంటున్న వాణిజ్యాలకు ఊతమిచ్చేందుకు, గృహనిర్మాణాలు, పట్టణ పునరుద్దరణ పధకాలు వేగంగా పూర్తి, నిరుద్యోగులకు చెల్లించే భృతి పెంపుదల,తక్కువ, మధ్య తరగతి ఆదాయాన్ని పెంచటం,సేవారంగ విస్తరణ, వినిమయ ఖర్చు పెంపుదలను ప్రోత్సహించటం వంటి చర్యలు తీసుకుంటున్నది.
పన్నుల గురించి అమెరికాతో ఎలాంటి సంప్రదింపులు, చర్చలు జరగటం లేదని చైనా విదేశాంగ, వాణిజ్యమంత్రిత్వశాఖలు స్పష్టం చేశాయి. అమెరికా జనాలను తప్పుదారి పట్టిస్తున్నదని విమర్శించాయి. ఇక ట్రంప్‌ అసత్యాలు, వక్రీకరణల విషయానికి వస్తే రెండోసారి పదవీ స్వీకారం చేసిన రోజే 20 అబద్దాలు చెప్పినట్లు మీడియా విశ్లేషించింది. తొలి నాలుగేండ్ల పదవీ కాలంలో 30,573 అబద్దాలు చెప్పినట్లు వాషింగ్టన్‌ పోస్టు పత్రిక వెల్లడిరచింది. తొలి వందరోజుల్లోనే 492, 2020లో ఓటింగ్‌కు ముందు నవంబరు రెండవ తేదీన ఒక్క రోజే 503 అవాస్తవాలు చెప్పి ఓటర్లను ఆకట్టుకొనేందుకు చూసినట్లు ఆ పత్రిక పేర్కొన్నది. నిజంగా ఒక రాజకీయనేత అలా మాట్లాడతారా అన్న అనుమానం ఉంటే ట్రంప్‌, అతగాడి స్నేహితులను చూడాల్సిందే. ట్రంప్‌ నోటి నుంచి సగటున రోజుకు 21తప్పుడు సమాచారం లేదా అబద్దాలు వెలువడినట్లు తేలింది. తొలి ఏడాదిలో రోజుకు సగటున ఆరు,రెండో ఏడాది 14, మూడో ఏడు 22, నాలుగో సంవత్సరం 39 చొప్పున, అంటే పదవీ కాలం ముగిసే వ్యవధి దగ్గరపడిన కొద్దీ అబద్దాలు పెరిగాయి. న్యూయార్క్‌ విశ్వవిద్యాలయంలోని జర్నలిజం సంస్థ ఏకంగా ట్రంప్‌ అబద్దాల సమాచార కేంద్రాన్నే ఏర్పాటు చేసింది. రెండోసారి తొలి రోజే రెండు ప్రసంగాలలో 20 అబద్దాలతో ప్రారంభం అయిన తీరు చూస్తే నాలుగేండ్లలో గత రికార్డును బద్దలు కొట్టేందుకు ఎంతో కాలం పట్టదనిపిస్తోంది. ఒక ప్రధానిగా నరేంద్రమోడీ అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన ఎవరికైనా అభినందనలు తెలపటం ఒక సంప్రదాయం, కానీ అబద్దాల కోరు ట్రంప్‌ను నా స్నేహితుడు అంటూ మోడీ సందేశాలు పంపారు, వివిధ సందర్భాలలో వర్ణించారు. రాజకీయాల పుట్టుకతోనే అబద్దాలు కూడా వెంటవచ్చాయి గానీ ఇటీవలి కాలంలో కొత్త పుంతలు తొక్కుతున్నాయి. ఎవరు అవునన్నా కాదన్నా వాటికి డోనాల్డ్‌ ట్రంప్‌, అతగాడి బాటలో నడిచే వారు నిష్ణాతులుగా మారారు, అతగాడిని చూసి ఉత్తేజం, ఉత్సాహం పొంది ప్రపంచంలో అనేక దేశాల అధ్యక్షులు లేదా ప్రధానులు కూడా సిగ్గూ ఎగ్గూ లేకుండా అవాస్తవాలు, అసత్యాలు, వక్రీకరణలకు పాల్పడుతున్నట్లు కనిపిస్తోంది. రాజకీయ నాయకుడంటే ఒపీనియన్స్‌(అభిప్రాయాలు) మారుస్తూ ఉండాలని మహాకవి గురజాడ చురక అంటించారు, ఆయనే ఇప్పుడు బతికి ఉంటే అబద్దాలు చెప్పని వాడు రాజకీయ నేత కానేకాడని గిరీశం చేత చెప్పించి ఉండేవారు. జర్నలిస్టులు వార్తలను సేకరించే పనిలో భాగంగా నేతల మాటల్లో అబద్దాలు ఎన్ని ఉన్నాయో ఎత్తి చూపే పని భారం వారి మీద పడిరదంటే అతిశయోక్తి కాదు. ఫాక్ట్‌చెక్‌ పేరుతో కొన్ని సంస్థలు ప్రత్యేకంగా సిబ్బందినే నియమించాయి.


ట్రంప్‌ రెండవ సారి జనవరి 20న పదవిని చేపట్టి వందవ రోజు పూర్తి చేసుకొనేందుకు ముందుకు పోతున్నాడు.ఈ లోగానే మీడియాను అణచివేసేందుకు కూడా పూనుకున్నాడు. సరిహద్దులు లేని రిపోర్టర్లు అనే సంస్థ పత్రికా స్వేచ్చ మీద రాజ్యాంగేతర దాడి ఎలా జరుగుతున్నదో వివరించింది.ఆరోగ్యం, నేరాల వంటి సమాచారం తెలుసుకొనేందుకు వీలు కల్పించే ప్రభుత్వ సంస్థల వెబ్‌సైట్ల నుంచి ఎనిమిదివేల పేజీలను ప్రభుత్వం తొలగించింది. జనాలు, మీడియాకు సమాచారం అందకుండా చేయటం తప్ప ఇది మరొకటి కాదు. ప్రభుత్వం నిర్వహించే 180 రేడియో స్టేషన్లను మూసివేసేందుకు గాను వాటికి అందచేస్తున్న 110 కోట్ల డాలర్ల నిధులు నిలిపివేయాలని పార్లమెంట్‌ను కోరాడు.దీని వలన గ్రామీణ, సుదూర ప్రాంతాల వారికి వాటి సేవలు నిలిచిపోతాయి. ప్రభుత్వ రంగంలోని మీడియాకు ప్రతి ఏటా సగటున ఒక పౌరుడు చెల్లిస్తున్న మొత్తం కేవలం 1.6 డాలర్లు మాత్రమే. ఫిబ్రవరి 11వ తేదీ నుంచి అధ్యక్ష భవన వార్తలను సేకరించకుండా అసోసియేటెడ్‌ ప్రెస్‌(ఏపి) సంస్థ విలేకర్లను నిషేధించారు. మెక్సికో గల్ఫ్‌ పేరును అమెరికా గల్ఫ్‌ అని మార్చినప్పటికీ ఆ సంస్థ తన వార్తలో పాత పేరునే వినియోగిస్తుండటమే దీనికి కారణం.ఏప్రిల్‌ 9న ఒక కోర్టు ఈ నిషేధం ఎత్తివేయాలని ఆదేశించినప్పటికీ ఖాతరు చేయటం లేదు.తన స్వంత సామాజిక మాధ్యమం ట్రూత్‌ ద్వారా 64సార్లు మీడియా మీద అవమానకరమైన వ్యాఖ్యలు చేశాడు.2021 జనవరి ఆరున కాపిటోల్‌ వద్ద జర్నలిస్టులపై దాడి చేసిన కేసులో శిక్షలు పడిన తన అనుచరులైన 13 మంది గూండాలను క్షమాభిక్ష పేరుతో విడుదల చేశాడు.మీడియా సంస్థలను వేధించేందుకు ఆరు కంపెనీలపై విచారణకు ఆదేశించాడు. ప్రాజెక్టు 2025 పేరుతో ట్రంప్‌ అజెండాకు రూపకల్పన చేసిన బ్రెండన్‌ కార్‌, మీడియా నియంత్రణ కమిషన్‌ చైర్మన్ను చేసిన తరువాత ట్రంప్‌ గురించి విమర్శనాత్మక వార్తలను అందించే సిబిఎస్‌, ఎబిసి, ఎన్‌బిసి, ఎన్‌పిఆర్‌, పిబిఎస్‌, కాలిఫోర్నియా టెలివిజన్‌లపై విచారణ పేరుతో వేధింపులకు పూనుకున్నాడు. నాలుగు సంస్థలపై ట్రంఫ్‌ వ్యక్తిగతంగా పరువు నష్టం కేసులు వేశాడు.


ఇక కమ్యూనిజానికి, తమను వ్యతిరేకించే దేశాల గురించి తప్పుడు ప్రచారం చేసేందుకు అమెరికా ప్రభుత్వం యుఎస్‌ ఏజన్సీ ఫర్‌ గ్లోబల్‌ మీడియా అనే సంస్థను దశాబ్దాల క్రితమే ఏర్పాటు చేసింది. తరువాత మీడియా పెద్ద ఎత్తున విస్తరించి అలాంటి ప్రచారం చేసేందుకు వాటితో పెద్దగా అవసరం లేకపోయింది. అందుకే అది నిర్వహించే రేడియో, టీవీ సేవలను నిలిపివేయాలని ప్రభుత్వం నిధులను నిలిపివేసింది, విలేకర్లను సెలవుపై వెళ్లాలని కోరారు. ఈ సంస్థద్వారా నిర్వహించే వాయిస్‌ ఆఫ్‌ అమెరికా, రేడియో ఫ్రీ ఆసియా, యూరోప్‌, లిబర్టీ వంటి వాటిలో కమ్యూనిస్టు, ప్రజాస్వామ్య వ్యతిరేక వార్తలను ప్రచారం చేస్తున్నారు. అవి ఎంతగా రెచ్చగొట్టినా అమెరికా పాలకవర్గానికి వచ్చిన మేలేమీ లేకపోవటంతో ట్రంప్‌ వాటిని అజాగళస్థనాలుగా భావించి నిధులు నిలిపివేశాడు.ఈ చర్య వలన మూడున్నరవేల మందికి పైగా జర్నలిస్టులు, ఇతర సిబ్బంది ఉపాధి కోల్పోనున్నారు. ఈ సంస్థలలో పని చేస్తూ తప్పుడు వార్తలను ప్రచారం చేసిన జర్నలిస్టులలో విదేశాలకు చెందిన 84 మందిని స్వదేశాలకు పంపాలని నిర్ణయించింది, అయితే వారిలో అనేక మందిని ఆయా దేశాలు కేసులు పెట్టి జైలు పాలు చేసే అవకాశం ఉందట. కమ్యూనిస్టు వ్యతిరేక ప్రచారం చేసేందుకు వివిధ దేశాలలో ప్రయివేటు టీవీలు, పత్రికలకు, కొందరు జర్నలిస్టులకు సిఐఏ, ఇతర సంస్థల ద్వారా పెద్ద ఎత్తున నిధులు అందచేస్తున్న సంగతి తెలిసిందే.

రాహుల్‌ గాంధీవి పిల్ల చేష్టలైతే….నరేంద్రమోడీ పెద్దరికం ఎక్కడ ?

Tags

, , , ,


ఎం కోటేశ్వరరావు


రామాయణంలో రాముడికి పేరు ఎలా వచ్చిందంటే ప్రధాన కారకుడు రావణ పాత్రధారి అని కొందరు అంగీకరించకపోవచ్చు. సీత గీత దాటకపోతే రామకథే లేదు అన్నవారు కూడా ఉన్నారు. అలాగే రాహుల్‌ గాంధీకి ప్రాచుర్యం కల్పించటంలో బిజెపి నేతలు, వారి కనుసన్నలలో నడిచే మీడియా పెద్ద ఎత్తున ప్రచారం కల్పిస్తున్నదంటే అతిశయోక్తి కాదు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నాటికి అంతకు ముందు లోక్‌సభ ఎన్నికలతో పోల్చితే పెద్ద సంఖ్యలో ఓట్లు పెరగటం, సాయంత్రం 5.30 నుంచి 7.30 మధ్యలో 65లక్షల ఓట్లు పోల్‌ కావటం గురించి గతంలో చేసిన విమర్శలు లేదా ఆరోపణలనే రాహుల్‌ గాంధీ మరోసారి చేశారు. అది అమెరికాలోని బోస్టన్‌ నగరంలో పునశ్చరణ చేయటాన్ని బిజెపి తప్పు పడుతూ దేశద్రోహం అన్నట్లుగా దాడికి దిగింది. మన గడ్డమీద ఎన్నయినా అనుకోవచ్చుగానీ విదేశాల్లో మన రాజ్యాంగ సంస్థలను విమర్శించటం ఏమిటి అంటూ మనోభావాలను ముందుకు తెచ్చింది. దేవుడు నైవేద్యం తినడని పూజారికి తెలిసినంతగా మరొకరికి తెలియదు. అలాగే రాజ్యాంగ వ్యవస్థల నిర్వీర్యం, వాటి మీద దాడి చేయటంలో బిజెపి తీరు అనితర సాధ్యం. ఎన్నికల కమిషనర్లు, ప్రధాన కమిషనర్‌ నియామక కమిటీలో ప్రధాని, ప్రతిపక్ష నేత, సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఉన్న పద్దతిని మార్చి సిజె స్థానంలో కేంద్ర మంత్రిని పెట్టారు. అంటే ముగ్గురిలో రెండు ఓట్లు అధికారంలో ఉన్నవారికి ఉంటాయి గనుక ఇష్టం వచ్చిన వారిని నియమించుకోవచ్చు, అలాంటి వారు ఎలా పని చేస్తారో వేరే చెప్పనవసరం లేదు. రాహుల్‌ గాంధీ చెప్పినట్లు అలా నియామకం పొందిన వారు రాజీపడక ఏం చేస్తారు, నియమించిన వారికి వ్యతిరేకంగా వ్యవహరించగలరా ? వారేమైనా టిఎన్‌ శేషన్‌ వంటి వారా ?

ఈ పూర్వరంగంలోనే ఎన్నికల కమిషన్‌ రాజీపడుతున్నదని, వ్యవస్థలోనే లోపం ఉన్నదని రాహుల్‌ గాంధీ బోస్టన్‌లో చేసిన వ్యాఖ్యలను బిజెపి వివాదం కావించింది.ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ, పోలింగ్‌ గురించి ఎన్నికల కమిషన్‌ గతంలోనే తన చర్యను సమర్ధించుకున్నది. మొత్తం 9.7కోట్ల మంది ఓటర్ల గురించి కేవలం 90 అప్పీళ్లు మాత్రమే వచ్చినందున జాబితా సరైనదే అని ఎన్నికల కమిషన్‌ సమర్ధించుకుంది, 30లక్షల మంది కొత్త ఓటర్లు నమోదైతే ఆ స్థాయిలో ఫిర్యాదులు రాలేదెందుకని ఎదురు ప్రశ్నించింది.రెండు గంటల సమయంలో 65లక్షల ఓట్లు వేయటం ఎలా సాధ్యమని రాహుల్‌ గాంధీ ప్రశ్న, వీడియో చిత్రాలను కూడా అడిగేందుకు వీల్లేకుండా చట్టాలను సవరించారని పేర్కొన్నారు. వీటికి సమాధానం లేదు. రిగ్గింపు ఎప్పుడు ఎలా చేస్తారో మనకు తెలియదా ! రాహుల్‌ గాంధీవి పిల్లచేష్టలని,విదేశీ గడ్డ మీద ఆధారం లేని ఆరోపణలు చేస్తున్నట్లు బిజెపి ధ్వజమెత్తింది. విదేశీ పర్యటనల్లో విమర్శలు చేయటం కొత్త కాదు, గతంలో కూడా చేశారు. ఆ మాటకు వస్తే వయసులో పెద్దమనిషి, ఒక ప్రధానిగా నరేంద్రమోడీ చేసిందేమిటి ? పెద్దలు నడిచిన బాటనే పిల్లలూ అనుసరిస్తారు. ఒక రాజకీయ నేత తన ప్రత్యర్ధి పార్టీ లేదా ప్రభుత్వం, వ్యవస్థల గురించి స్వదేశంలో విమర్శించి విదేశాల్లో పొగడాలా, ఆ పని చేస్తే సమావేశాలకు వచ్చిన వారు గడ్డి పెట్టరా లేదా నేను మాట్లాడను అని నోరుమూసుకోవాలా ? నరేంద్రమోడీ అదే చేశారా ? కాంగ్రెస్‌ను స్వదేశంలో విమర్శించినట్లే విదేశాల్లోనూ ధ్వజమెత్తారు. ఆ పార్టీనే కాదు, అవినీతిదేశం అంటూ జాతి పరువునే తీశారు.


2015లో జర్మనీ వెళ్లినపుడు కాంగ్రెస్‌ పార్టీ వదలివెళ్లిన చెత్తనంతా శుద్ధి చేయాల్సి ఉందని మోడీ చెప్పారు, భారత్‌ అంటే కుంభకోణాల దృశ్యమని, దాన్ని తాను నైపుణ్య దేశంగా మార్చనున్నట్లు కెనడాలో చెప్పారు. ఓమన్‌లో కూడా అదే చెప్పారు. కాంగ్రెస్‌ పాలనా కాలమంతా కుంభకోణాల మయమని, తప్పుడు పాలనా పద్దతులను సరిదిద్దేందుకు తాను ఎంతో కష్టపడుతున్నట్లు చెప్పుకున్నారు. గత జన్మల్లో ఏ పాపం చేశామో భారత్‌లో పుడుతున్నామని జనాలు చెప్పుకుంటున్నారని దక్షిణ కొరియా సియోల్‌లో మోడీ సెలవిచ్చారు.ఇలాంటి పరిస్థితిలో వదిలేసి వేరే చోటకు పోదామని అనుకున్నారు అలాగే వెళ్లారు.ఇప్పుడు నేను గట్టి విశ్వాసంతో చెప్పగలను, అన్ని జీవన రంగాలకు చెందిన ఆ తెలివైన వారు, ప్రముఖ శాస్త్రవేత్తలు కూడా వారు విదేశాల్లో పెద్ద మొత్తాలను సంపాదిస్తున్నప్పటికీ వారంతా తిరిగి రావటానికి, తక్కువ ఆదాయాలకు కూడా సిద్దపడి భారత్‌లో స్థిరపడటానికి రావాలని చూస్తున్నారని మోడీ చెప్పారు. చైనాలోని షాంఘై నగరంలో భారత సంతతి సమావేశంలో మాట్లాడుతూ గతంలో మీరు భారత్‌ గురించి సిగ్గుపడేవారు, ఇప్పుడు (తాను ప్రధాని అయిన తరువాత) దేశం గురించి గర్వపడుతున్నారన్నారు. ప్రతిపక్షం మీద ధ్వజం, స్వంతడబ్బా ప్రతిచోటా కనిపిస్తుంది. 2014లో ఎన్నిక తరువాత న్యూయార్క్‌ పర్యటనలో మీరు ఓట్లు వేసి ఉండకపోవచ్చుగానీ ఫలితాలు వచ్చినపుడు మీరంతా పండగ చేసుకున్నారని ప్రవాస భారతీయులతో చెప్పారు. ప్రధానిగా 70దేశాలు తిరిగారని 50చోట్ల తన ప్రత్యర్ధుల మీద రాజకీయ దాడి చేశారని పరిశీలకులు చెబుతున్నారు. అప్పుడు అది విదేశీ గడ్డా స్వదేశీ అడ్డా అన్నది గుర్తుకు రాలేదా ? కంటికి కన్ను, పంటికి పన్ను, కుక్కకాటుకు చెప్పుదెబ్బ మాదిరి రాహుల్‌ గాంధీ కూడా అదే బాటలో నడుస్తూ విమర్శలు చేస్తున్నారు. తేడా ఏమిటంటే మోడీ మాట్లాడిన వాటిని గోడీ మీడియా పెద్దగా ప్రచారంలో పెట్టలేదు, చర్చల రచ్చ చేయలేదు, అంతే ! మీరు ఎక్కడికి వెళితే అక్కడికి మా నెట్‌వర్క్‌ వస్తుందనే హచ్‌ కుక్క ప్రకటన మాదిరి నరేంద్రమోడీ ఏ విదేశ పర్యటన చేస్తే తాము కూడా ఒక సీనియర్‌ నేతను అక్కడకు పంపుతామని, అక్కడేమైనా తప్పుడు ప్రచారం, ఆరోపణలు చేస్తే అదే స్థాయిలో సమాధానం చెబుతామని, దేశాన్ని కించపరుస్తూ,ప్రతిపక్షం మీద ఆరోపణలతో మాట్లాడుతున్న ఏకైక ప్రధాని నరేంద్రమోడీ అని 2015లోనే కాంగ్రెస్‌ నేత ఆనందశర్మ విమర్శించారు.మోడీ ప్రధానిగా దేశాలు తిరుగుతున్నారు తప్ప ఆర్‌ఎస్‌ఎస్‌ ప్రచారక్‌ లేదా బిజెపి ప్రతినిధిగా కాదన్నారు.
రాజ్యాంగ వ్యవస్థలను కించపరుస్తున్నారంటూ రాహుల్‌ గాంధీ మీద ధ్వజమెత్తుతున్న బిజెపి నేతలు ఏం చేస్తున్నారో దేశంతో పాటు ప్రపంచమంతా చూస్తోంది. అత్యున్నత న్యాయస్థానం తీర్పులనే వారు సవాలు చేస్తున్నారు. పార్లమెంటు సుప్రీం అంటూ ఉపరాష్ట్రపతి జగదీప్‌ థంకర్‌ మరోసారి వ్యాఖ్యానించారు. రాష్ట్రపతి, గవర్నర్లు తమ దగ్గరకు వచ్చిన బిల్లుల మీద మూడు నెలల వ్యవధిలో నిర్ణయం తీసుకోవాలని లేకుంటే వాటిని ఆమోదించినట్లు పరిగణించాలని ఇటీవల సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును ఉపరాష్ట్రపతి విమర్శించారు. అది ప్రజాస్వామిక శక్తులపై అణుక్షిపణి వంటిదని వర్ణించారు. సుప్రీం కోర్టుకు అలాంటి అధికారం లేదన్నారు. రాజ్యాంగం ప్రకారం చట్టసభలు ఆమోదించిన బిల్లులను తిప్పి పంపే అధికారం రాష్ట్రపతి, గవర్నర్లకు ఉంది. అయితే వాటిని తిరిగి చట్టసభలు మరోసారి ఆమోదించి పంపితే చట్టాలుగా ఆమోద ముద్రవేయటం తప్ప తిరస్కరించే అధికారం లేదు. అయితే రాష్ట్రపతి, ప్రతిపక్ష పాలిత రాష్ట్రాల గవర్నర్లు నెలల తరబడి తిప్పి పంపకుండా ప్రభుత్వాలను ఇబ్బందులు పెడుతున్న పూర్వరంగంలో తమిళనాడు కేసులో సుప్రీం కోర్టు ఆ తీర్పు ఇచ్చింది. న్యాయవ్యవస్థ సూపర్‌ పార్లమెంటుగా వ్యవహరించజాలదని జగదీప్‌ తప్పుపట్టారు. రాజ్యాంగ పరిరక్షణ బాధ్యత రాష్ట్రపతి, గవర్నర్లదైతే, రాజ్యాంగం ప్రకారం పాలన సాగుతున్నదా లేదా అన్న భాష్యం చెప్పేందుకు సుప్రీం కోర్టుకు అధికారం ఉంది.చట్టసభలు చేసిన నిర్ణయాలను కాదనే హక్కు లేదు గానీ, అవి నిబంధనల మేరకు జరుగుతున్నాయా లేదా అన్నది నిర్ణయించవచ్చు. ఇప్పుడు వక్ఫ్‌ సవరణ చట్టం గురించి సుప్రీం కోర్టు విచారిస్తున్నది. సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు దాని పరిధికి మించినా లేక ప్రభుత్వానికి ఇష్టం లేకపోయినా షాబానో తీర్పు మాదిరి పార్లమెంటులో బిల్లు పెట్టి దాన్ని రద్దు చేసే దమ్ము బిజెపి కేంద్ర ప్రభుత్వానికి ఉందా అన్నది సమస్య. ఉపరాష్ట్రపతి చెప్పినట్లుగా దేశానికి పార్లమెంటు, రాష్ట్రాలకు అసెంబ్లీలు ఉన్నతం, అవి ఆమోదించిన బిల్లులను నెలల తరబడి గవర్నర్లు తొక్కిపట్టటాన్ని ఏమనాలి, తానే స్వయంగా అలాంటి పనికి పాల్పడిరది గుర్తులేదా, అప్పుడు అసెంబ్లీ సుప్రీం అన్న జ్ఞానం లేదా ?

ఉపరాష్ట్రపతి సుప్రీం కోర్టు మీద ధ్వజమెత్తటంతో కాబోయే సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి బిఆర్‌ గవాయ్‌ సున్నితంగా బిజెపి నేతలకు చురకలు అంటించారు. పశ్చిమ బెంగాల్‌ ముర్షిదాబాద్‌లో హింస కారణంగా అక్కడకు పారామిలిటరీని పంపాలంటూ రాష్ట్రపతికి ప్రవర్తకాది లేఖ జారీ చేయాలన్న పిటీషన్‌పై స్పందించారు. ఇప్పటికే మేము కార్యనిర్వహణ పరిధిని ఆక్రమిస్తున్నామన్న ఆరోపణలను ఎదుర్కొంటున్నాం అందువలన ఈ వినతిని తిరస్కరిస్తున్నామని ప్రకటించారు.కోర్టు పేరుతో పశ్చిమబెంగాల్లో కేంద్ర బలగాలను దించాలన్న ఎత్తుగడ పిటీషనర్‌ వినతిలో ఉంది.మమతా బెనర్జీని సమర్ధించనవసరం లేదుగానీ విష్టు శంకర్‌ జైన్‌ అనే న్యాయవాది ఈ పిటీషన్‌కు ముందు రాష్ట్రపతి పాలన విధించాలని 2021లో కూడా కేసు వేశారు. పార్లమెంటూ కాదు, కార్యనిర్వాహక వ్యవస్థా కాదు రాజ్యాంగమే ఉన్నతమైనదని జగదీప్‌ థంకర్‌ వ్యాఖ్యల మీద రాజ్యసభ సభ్యుడు, ప్రముఖ న్యాయవాది కపిల్‌ సిబల్‌ స్పందించారు. సిబల్‌ ప్రస్తుతం సుప్రీం కోర్టు బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు, గతంలో కేంద్ర మంత్రిగా పనిచేశారు. నోటి తుత్తర బిజెపి నేతల్లో నిషికాంత్‌ దూబే ఒకరు. వక్ప్‌ చట్ట సవరణ చెల్లుతుందా లేదా అన్నదాని గురించి విచారణ జరుపుతున్న సుప్రీం కోర్టు దేశంలో మత యుద్ధాలను రెచ్చగొడుతున్నదని, తన హద్దులను దాటుతున్నదని నోరుపారవేసుకున్నాడు. తరువాత ఎన్నికల కమిషన్‌ మాజీ ప్రధాన అధికారి ఎస్‌వై ఖురేషీ ముస్లిం కమిషనర్‌ తప్ప ఎన్నికల కమిషనర్‌ కాదని వదరుబోతుతనంతో మాట్లాడారు.దూబే వ్యాఖ్యలతో తమకు సంబంధం లేదని బిజెపి ప్రకటించటం ఒక నాటకం తప్ప మరొకటి కాదు. అలా ప్రకటించిన తరువాతే ఖురేషీ గురించి మాట్లాడాడు. ఎందుకంటే వక్ఫ్‌ చట్టాన్ని ఖురేషీ విమర్శించారు.తానుగా అధికారికంగా చేయలేని వ్యాఖ్యలను దూబే వంటి వారితో బిజెపి చేయించటం దానికి వెన్నతో పెట్టిన విద్య. దూబే అంతటితో ఊరుకోలేదు, దేశం హిందువులదని, గిరిజనులు, జైనులు, బౌద్దులు వారితో కలసి ఉన్నారని కూడా సెలవిచ్చారు. రెచ్చగొట్టే మాటలు మాట్లానికి దూబె పెట్టింది పేరు, అగ్రనేతల మనసులో ఉన్నదాన్ని వెల్లడిరచిన దూబే మీద ఎలాంటి చర్య ఉండదని, తప్పనిసరైతే ఏదో మమఅనిపిస్తారని ఒక ఎంపీ వ్యాఖ్యానించినట్లు వార్తలు వచ్చాయి. సుప్రీం కోర్టు గురించి అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు గాను కోర్టు ధిక్కరణ నేరం కింద దూబేపై చర్యలు తీసుకోవాలని వక్ప్‌ చట్ట సవరణను వ్యతిరేకిస్తున్న వారి తరఫు లాయర్‌ అనాస్‌ తన్వీర్‌ అటార్నీ జనరల్‌ ఆర్‌ వెంకటరమణికి లేఖ రాశారు, బిజెపి చర్యతీసుకుంటుందా ?

డోనాల్డ్‌ ట్రంప్‌రుద్దిన వాణిజ్య పోరు : చైనా గెలిస్తే అమెరికా పరిస్థితి ఏమిటి ?

Tags

, , , , ,

ఎం కోటేశ్వరరావు

ప్రపంచం మీద తాను రుద్దిన వాణిజ్య పోరు డోనాల్డ్‌ ట్రంప్‌ పదవికి గండం తేనుందా ? దాన్ని వ్యతిరేకిస్తున్న అమెరికన్లు సహిస్తారా ? ఈ పోరులో చైనా గెలిస్తే అమెరికా పరిస్థితి ఏమిటి ? ఇలా పరిపరి ఆలోచనలు ప్రారంభమయ్యాయి. రెండు దిగ్గజాల మధ్య కేంద్రీకృతమైన వివాదాన్ని ఆసరా చేసుకొని లబ్దిపొందాలని కొన్ని దేశాలు చూస్తున్నాయి. తమ ప్రయోజనాలను ఫణంగా పెట్టి ఒప్పందాలు కుదుర్చుకుంటే అలాంటి దేశాలపై తాము గట్టి ప్రతి చర్యలు తీసుకుంటామని సోమవారం నాడు చైనా హెచ్చరించింది. వాణిజ్య పోరులో విజేతలు ఉండరన్నది సాధారణ అభిప్రాయం, అది నిజమేనా ? ఇప్పుడున్న పరిస్థితి ఏమిటి ? మన దేశం బ్రిటీష్‌ వలస పాలనలోకి వెళ్లక ముందు చేనేత వస్త్రాలకు ఎంతో ప్రసిద్ధి. బ్రిటన్‌తో సహా అనేక దేశాలకు అవి ఎగుమతి అయ్యేవి. అలాంటి వాటిని బ్రిటన్‌ పారిశ్రామిక విప్లవం మింగేసింది. ఇప్పుడు ట్రంప్‌ దిగుమతి పన్ను విధించినట్లుగా మన చేనేత వస్త్రాల మీద నాటి బ్రిటన్‌ కూడా పన్ను విధించి అడ్డుకుంది, చౌకగా తయారయ్యే తన మిల్లు వస్త్రాలను మనదేశంలో కుమ్మరించింది. మన మార్కెట్‌ను ఆక్రమించింది. పత్తి ఎగుమతి దేశంగా మార్చింది. నాడు భారత్‌ పరాధీన దేశం, వ్యతిరేకించిన వారు లేరు. ఇప్పుడు అమెరికా పన్నులతో చైనా వస్తువులను అడ్డుకోవాలని చూస్తోంది. చైనా సర్వసత్తాక స్వతంత్ర దేశం, అమెరికాను ఢీ అంటే ఢీ అనే స్థితిలో ఉంది, ఆట కట్టించాలని చూస్తోంది.చిత్రం ఏమిటంటే అసలైన దేశభక్తులం అని చెప్పుకుంటున్న మన పాలకులు మా ఆయుధాలు, వస్తువులు కొంటారా లేదా అని అమెరికా కొరడా రaళిపిస్తే కంటి చూపులేదు, నోట మాట లేదు.ఏం జరుగుతోంది మహాత్మా ఓ మహాత్మా !


డోనాల్డ్‌ ట్రంప్‌ను సంతుష్టీకరించేందుకు తమ ప్రయోజనాలను ఫణంగా పెట్టి ఒప్పందాలు చేసుకొనే దేశాల మీద చర్యలు తప్పవని చైనా తీవ్ర హెచ్చరిక చేసింది.తమతో వాణిజ్యం చేసే దేశాలు చైనా మీద ఆంక్షలు విధించాలని, దానికి ప్రతిగా అలాంటి వాటికి పన్నులను మినహాయిస్తామని అమెరికా చెబుతున్నదని, సంతుష్టీకరణ శాంతిని, రాజీ గౌరవాన్ని తీసుకురాదని చైనా పేర్కొన్నది.అమెరికా చర్యలు చర్మం ఇమ్మని పులిని కోరటంగా వర్ణించింది. ప్రస్తుతం జపాన్‌, దక్షిణ కొరియా, భారత్‌ మరికొన్ని దేశాలు ట్రంప్‌ యంత్రాంగంతో చర్చలు జరుపుతున్నాయి. ఉపాధ్యక్షుడు జెడి వాన్స్‌ ప్రస్తుతం ఢల్లీి పర్యటనలో ఉన్నాడు. చైనా వస్తువులపై 145శాతంగా విధించిన పన్ను, కొన్ని వస్తువులపై 245శాతం వరకు పెంచుతామని అమెరికా బెదిరించింది. తమ మీద విధించిన పన్నుల కారణంగా తీసుకోలేమంటూ అమెరికా కంపెనీ బోయింగ్‌ జెట్‌ను చైనా తిప్పి పంపింది. అమెరికాతో కలసి చైనాను దెబ్బతీయాలని మనదేశంలో కొందరు యాంకీల ఏజంట్లు నూరిపోస్తున్నారు.చైనా సరఫరా గొలుసులో మనం చేరి దాని స్థానాన్ని ఆక్రమించాలని కొందరు చెబుతున్నారు. నిజానికి స్వంత సత్తాతో ఆస్థాయికి చేరాలని ఎవరైనా కోరుకోవటం తప్పు కాదు. కుక్కతోక పట్టుకొని గోదావరిని ఈదలేరు, అలాగే అమెరికా వెంట నడచిన ఏ దేశమూ చరిత్రలో బాగుపడిన దాఖలా లేదు. కాసేపు దీని గురించి పక్కన పెట్టి వాణిజ్య పోరు గురించి జరుగుతున్న మధనం ఎలా ఉందో చూద్దాం. అమెరికా తాను చేస్తున్న ప్రతిదీ సరైనదే అనుకుటుంది కానీ సమస్య ఏమిటంటే ట్రంప్‌ ప్రతినిర్ణయం తప్పుగా తేలుతోంది.ఏప్రిల్‌ ఐదున జనం 20లక్షల మంది వీధుల్లోకి రాగా 19వ తేదీన మరోసారి పెద్ద ఎత్తున రాజరికం లేదు, రాజులేడు అంటూ నినదించారు. రెండువందల యాభై సంవత్సరాల క్రితం 1775 ఏప్రిల్‌ 19న బ్రిటన్‌ రాజరికానికి వ్యతిరేకంగా అమెరికన్లు పోరు ప్రారంభించిన రోజది. చైనా కమ్యూనిస్టులను అణచివేయాలని చూసింది అమెరికా. అయితే లాభాల కోసం అదే చైనా మార్కెట్‌ను ఉపయోగించుకోవాలనే ఎత్తుగడతో కమ్యూనిస్టు చైనాను భద్రతా మండలిలో శాశ్వత దేశంగా ఆమోదించింది.తరువాత కూడా ఒక వైపు లాభాలు పొందుతూనే మరోవైపు చైనా ఎదగకుండా కేవలం తనమీదే ఆధారపడే ఒక ఎగుమతిదేశంగా పరిమితం కావాలని చూసింది. తియన్మెస్‌ మైదానంలో విద్యార్ధుల ప్రదర్శనలు, హాంకాంగ్‌లో స్వాంత్య్రం పేరుతో జరిగిన ప్రదర్శనలు, తైవాన్‌ వేర్పాటు వాదం వెనుక దాని హస్తం గురించి తెలిసిందే. మొత్తంగా చెప్పాలంటే గత ఐదు దశాబ్దాలలో అమెరికా అనుసరించిన ప్రతిప్రతికూల విధానమూ చైనాను మరింతగా పటిష్టపరిచాయి తప్ప బలహీనపరచలేదు, దీని అర్ధం కొన్ని తాత్కాలిక సమస్యలూ, ఎదురుదెబ్బలూ లేవని కాదు. డోనాల్డ్‌ ట్రంప్‌ చర్యలతో భౌగోళిక రాజనీతిలో చైనా స్థాయి మరింత బలపడుతుందని అమెరికాను ఆర్థికంగానూ, రాజకీయంగా దాటిపోతుందని కమ్యూనిస్టు వ్యతిరేకులు వాపోతున్నారంటే అతిశయోక్తి కాదు.


చిత్రం ఏమిటంటే అమెరికన్లు, వారి చెప్పుల్లో కాళ్లు పెట్టి నడవాలని చూసే కాషాయ తాలిబాన్ల ఆలోచన ఒకే విధంగా ఉంది. గాల్వన్‌ ఉదంతం జరిగినపుడు మనం గనుక చైనా నుంచి దిగుమతులను నిలిపివేస్తే డ్రాగన్‌ మన కాళ్ల దగ్గరకు వస్తుందని చెప్పినట్లే ఇప్పుడు ట్రంప్‌ గాంగ్‌ అంటోంది. చైనా మనకు చేసే ఎగుమతులతో పోల్చితే మనం చైనాకు ఐదోవంతు మాత్రమే ఎగుమతి చేస్తున్నాం, అందువలన మన దిగుమతులు ఆగిపోతే నష్టం వారికే అని అమెరికా విత్తమంత్రి స్కాట్‌ బెసెంట్‌ చెప్పాడు. అమెరికా దిగుమతులు దాని పెద్ద బలహీనత తప్ప బలం కాదు.2018లో ఇదే ట్రంప్‌ చైనా మీద వాణిజ్య యుద్ధం ప్రారంభించాడు.వారి వస్తువుల మీద ఆధారపడటం నిలిపివేయాలన్నాడు. జరిగిందేమిటి ? గత ఏడు సంవత్సరాల్లో అమెరికాకు చైనా ఎగుమతులు 19.2 నుంచి 14.7శాతానికి మాత్రమే తగ్గాయి.పూర్తిగా నిలిపివేయాలంటే ఎన్ని సంవత్సరాలు పడుతుందో తెలియదు.జి 7 దేశాలకు చైనా ఎగుమతులు 2000 సంవత్సరంలో 48శాతం జరగ్గా 2024లో 30శాతానికి తగ్గాయి. ఇంత జరిగినా గత పదేండ్లలో ప్రపంచ ఎగుమతుల్లో చైనా వాటా 13 నుంచి 14శాతానికి పెరిగింది. దీని అర్ధం ఏమిటి ? చైనా తన సరకులకు ఎప్పటి నుంచో ప్రత్నామ్నాయ మార్కెట్లను వెతుక్కుంటోంది.చైనా అనే చెరువు మీద అమెరికా అలిగితే ఎండిపోయేది అమెరికన్లకే.ఎందుకంటే ప్రస్తుతం అది దిగుమతి చేసుకుంటున్న వస్తువులను తయారు చేసుకోవాలంటే దశాబ్దాలుగాకపోయినా సంవత్సరాలు పడుతుందని చెబుతున్నారు. అప్పటిదాకా చైనా నుంచి దిగుమతి చేసుకుంటున్న టాయిలెట్‌ పేపర్‌ వంటి వాటి దిగుమతి ఆపివేస్తారా ? ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకోవాలంటే సరఫరా చేసే స్థితిలో ఎన్ని ఉన్నాయి ? అమెరికా బోయింగ్‌ జెట్‌ విమానాలు గాకపోతే చైనా ఐరోపా ఎయిర్‌బస్‌లను దిగుమతి చేసుకుంటుంది, లేదూ స్వయంగా తానే పూర్తిగా సమకూర్చుకొనేందుకు ఇప్పటికే ప్రారంభించిన కార్యక్రమాన్ని మరింతవేగవంతం చేస్తుంది. ఇతర వస్తువులను వేరే దేశాల నుంచి తెచ్చుకుంటుంది. మిషిగాన్‌ స్టేట్‌ యూనివర్సిటీ ప్రొఫెసర్‌ జాసన్‌ మిలెర్‌ పోగుచేసిన సమాచారం ప్రకారం ప్రపంచంలో ఉత్పత్తి అయ్యే లిథియమ్‌ బ్యాటరీలు, ఎయిర్‌ కండీషనర్లు, వంటపాత్రల్లో 70, స్మార్ట్‌ ఫోన్లు, వంటగది పరికరాలు, బొమ్మల్లో 80, సూర్యరశ్మి పలకల్లో 90శాతాల చొప్పున చైనా తయారు చేస్తున్నది. కార్లు, ఫోన్లు, అనేక మిలిటరీ పరికరాలకు కీలకంగా అవసరమైన అపురూప ఖనిజాలు, లోహాలు కూడా చైనా దగ్గర గణనీయంగా ఉన్నాయి.

సకల దేశాలూ తన వస్తువులనే కొనాలని చైనా ఎవరినీ దేబిరించే స్థితిలో లేదు. విదేశాలకు అవసరమైన వాటిని కావాలనుకున్నవారికి ఉత్పత్తి చేస్తున్నది, మార్కెట్‌లేకపోతే నిలిపివేస్తుంది, నూటనలభై కోట్ల తనజనాభాకు అవసరమైన వాటి మీద కేంద్రీకరిస్తుంది.ఇప్పటికే ఆప్రక్రియ ప్రారంభమైంది. ఏండ్ల తరబడి సంపాదించిన వాణిజ్య మిగులులో కొంత భాగం సబ్సీడీగా ఇస్తే అంతర్గత మార్కెట్‌ ఇబ్బడి ముబ్బడిగా పెరుగుతుంది. అమెరికా నుంచి దిగుమతి చేసుకొనే సోయా,జొన్నలు, మొక్క జొన్నలను ఎక్కడి నుంచైనా దిగుమతి చేసుకోవచ్చు.పశ్చిమ దేశాల మీద ఆధారపడే రంగాలను గుర్తించి స్వయం పోషకత్వం సాధించేందుకు బీజింగ్‌ పూనుకుంది. దాన్లో భాగంగానే హరిత ఇంథనం, వ్యవసాయం, సాంకేతిక పరిజ్ఞానం, సెమీకండక్టర్ల రంగాలలో భారీ మొత్తాలను ఖర్చు చేస్తున్నది. విపరీత పరిస్థితులలో కూడా జాతీయ ఆర్థిక రంగం సాధారణ కార్యకలాపాలను సాగించే విధంగా చూడాలని అధ్యక్షుడు షీ జింపింగ్‌ విధాన నిర్ణేతలను కోరాడు. యుద్ధం అన్న తరువాత ఓడిన వారికే కాదు విజేతలకూ దెబ్బలు తగులుతాయి, నష్టాలు సంభవిస్తాయి, వాణిజ్య యుద్ధమూ అంతే.


ఎదురుదాడిలో భాగంగా అమెరికాకు ఎగుమతి అవుతున్న అపురూప ఖనిజాల ఎగుమతులను చైనా నిషేధించింది. అవి జలాంతర్గాములు, ఫైటర్‌ జెట్ల తయారీలో కీలకంగా ఉంటాయి.తన అంబుల పొదిలో ఉన్న అస్త్రాలను అవసరాన్ని బట్టి బయటకు తీస్తున్నది.ఇప్పటికే బోయింగ్‌ విమానాల కొనుగోలు నిలిపివేసింది, కొన్ని కంపెనీలను నిషేధిత జాబితాలో చేర్చింది.యాపిల్‌,గూగుల్‌, డ్యూపాంట్‌్‌, టెస్లా వంటి కంపెనీలు తరువాత వరుసలో ఉన్నాయి.జపాన్‌ తరువాత భారీ మొత్తంలో డాలర్ల నిల్వలున్న దేశం చైనా. వాటి నుంచి అమెరికాకు 760 బిలియన్‌ డాలర్ల మేర అప్పులిచ్చింది. ట్రంప్‌ పిచ్చిపనులు కొనసాగిస్తే ఆ బాండ్లను ఒక్కసారిగా విక్రయిస్తే అమెరికాలో వడ్డీ రేట్ల పెరుగుదల, ద్రవ్య సంక్షోభానికి దారి తీస్తుందని ఆర్థికవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఇంకా ఇలాంటి ఆర్థిక పరమైన దెబ్బతీసే పద్దతులను చైనా పరిశీలిస్తున్నది.అమెరికా దగ్గర కూడా కొన్ని ఆయుధాలు లేకపోలేదు. ఐరోపా, ఆసియాలో తన మిత్రదేశాలను చైనాపైకి ఉసిగొల్పేందుకు పూనుకుంది. అయితే ప్రతికూల పన్నుల విధింపులో ఏ దేశాన్నీ వదలని కారణంగా అవన్నీ జతకట్టటం సందేహమే. తమ కోసం అన్ని దేశాలూ కాస్త నొప్పి భరించాల్సిందే అంటున్నాడు ట్రంప్‌. ఎవరి సంగతి వారు చూసుకోవాలనే రక్షణాత్మక వైఖరులు పెరుగుతున్న తరుణంలో ఎంత మేరకు ఇతర దేశాలు అంగీకరిస్తాయో తెలియదు. అయినప్పటికీ ముందే చెప్పుకున్నట్లు ఇతర దేశాలను చైనా సోమవారం నాడు ముందస్తుగా హెచ్చరించింది. మారిన పరిస్థితులను ట్రంప్‌ గమనిస్తున్నట్లు లేదు. ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిపిన సర్వేల్లో మెక్సికో, కెనడా, ఐరోపా దేశాల మీద పన్నులు విధించటాన్ని వ్యతిరేకించినప్పటికీ చైనా మీద దాడిని 56శాతం మంది సమర్ధించినట్లు సిబిఎస్‌ తెలిపింది.కమ్యూనిస్టు వ్యతిరేకతను ఎక్కించుకున్న వారు సహజంగానే చైనా మీద దాడిని అంగీకరిస్తారు. కానీ అదే ట్రంప్‌ ఎన్నికల్లో చేసిన వాగ్దానాలేమిటి ?ద్రవ్యోల్బణం, ధరలను, పన్నుల భారం తగ్గిస్తానని చెప్పాడు. గద్దె నెక్కగానే విముక్తి పేరుతో ఎడాపెడా పన్నులు విధింపు ప్రకటన చేయగానే అమల్లోకి రాక ముందే ధరలు పెరిగి జనం కొనుగోళ్లకు ఎగబడ్డారా లేదా ? కొత్తగా అన్న వస్త్రాలు వస్తాయనుకుంటే ఉన్న వస్త్రాలను ఊడగొట్టినట్లుగా భరించలేని భారాలను మోపితే జనం సహిస్తారా ? ఇప్పటికే రెండుసార్లు లక్షలాది మంది వీధుల్లో ప్రదర్శనలు చేశారు. అందుకే తేడా వచ్చేట్లు ఉందని ఆలోచించుకోవటానికి మూడు నెలల పాటు పన్నుల పెంపుదల పదిశాతానికే పరిమితం చేసి మిగతా వాటిని వాయిదా వేయాల్సి వచ్చింది. గతంలో మాదిరి ధరలు, నిరుద్యోగం పెరుగుదల సంభవించవచ్చనే హెచ్చరికలు వెలువడ్డాయి.ట్రంప్‌ మొరటుగా ముందుకు పోతాడా తెలివి తెచ్చుకొని వెనక్కు తగ్గుతాడా అన్నది చూద్దాం !

జగన్‌ పోయే…బాబు వచ్చే…విద్యుత్‌ బిల్లు మోత ఢాం ఢాం ? 2029లో పొంచి ఉన్న గండం ! మద్యం గురించి విజయసాయి రెడ్డి ఏం చెప్పారు !!

Tags

, , , , ,

ఎం కోటేశ్వరరావు


కొద్ది రోజుల క్రితం వైఎస్‌ జగన్‌ కుటుంబానికి చెందిన సాక్షి పత్రిక విద్యుత్‌ బిల్లుల పెరుగుదల గురించి ఒక వార్త ఇచ్చింది. దాన్లో ఉన్న వ్యాఖ్యలను పక్కన పెడితే అంకెల సమాచారం పక్కా వాస్తవం. తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇస్తాయని చెబుతున్న మీడియా వాటి మీద చర్చలు పెట్టింది, తెలుగుదేశం ప్రతినిధులు విద్యుత్‌ బిల్లుల పెరుగుదలకు తమకు ఎలాంటి సంబంధం లేదని, అది గత ప్రభుత్వ పాపమే అంటూ నానా యాగీ చేస్తున్నారు.ఇక్కడ మహాకవి శ్రీశ్రీ కవితను ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోక తప్పటం లేదు.
జెంఘిజ్‌ ఖాన్‌, తామర్లేన్‌
నాదిర్షా, ఘజనీ, ఘోరీ
సికిందరో ఎవడైతేనేం
ఒక్కొక్కడూ మహాహంతకుడు
అన్నట్లుగా సిఎంగా వైఎస్‌ జగన్‌, చంద్రబాబు నాయుడు ఎవరైతేనేం ? జనానికి వాచిపోతోంది. జగన్‌ వైసిపి కార్యకర్తలకు, ఓటర్లకు మినహాయింపు ఇచ్చింది లేదు, చంద్రబాబు మూడు పార్టీల వారికీ ఒరగబెడుతున్నదీ లేదు. పవన్‌ కల్యాణ్‌ చెప్పినట్లు సేమ్‌ టు సేమ్‌ (అంతా ఒకటే ) జగన్‌ పాలన ఐదు సంవత్సరాల్లో విద్యుత్‌ బిల్లులు మోతమోగించారు, బాదుడే బాదుడు అని ఊరూవాడా ప్రచారం చేసిన చంద్రబాబు నాయుడు అండ్‌ కో అధికారానికి వచ్చిన ఏడాది కాలంలోనే రు.15,485 కోట్ల మేర విద్యుత్‌ భారాన్ని 2026 ఆఖరు వరకు వినియోగదారుల నుంచి వసూలు చేయాలని నిర్ణయించి బాదుడే బాదుడు ప్రారంభించింది.
వైకింగులు, శ్వేతహూణులు
సిథియన్లు, పారశీకులు
పిండారీలు, థగ్గులు కట్టిరి
కాలానికి కత్తుల వంతెన
అన్నాడు శ్రీశ్రీ. అదే మాదిరి కొందరి వ్యవహారం ఉంది. గతం, వర్తమాన భారాలకు కారకుల గురించి వారి మద్దతుదారులైన మీడియా సంస్థలు, జర్నలిస్టులు గతంలో చేసిందీ, ఇప్పుడు చేస్తున్నదీ అదే. వారికి బిల్లులు ఎంత పెరిగినా మౌనంగా కట్టేయటం తప్ప చెప్పుకోలేని దుస్థితి. జనంతో ఆడుకుంటున్నారు.


మేం విద్యుత్‌ ఛార్జీలు పెంచలేదు కదా అంటున్నారు మూడు పార్టీల చెట్టుకింది ప్లీడర్లు. పెంచారని ఎవరన్నారు, చార్జీల బదులు మా జేబులను గుల్లచేసే బిల్లులు పెంచారుగా అని కదా ప్రజానీకం మొత్తుకుంటున్నది. పళ్లూడగొట్టటానికి ఇనుప సుత్తి అయితేనే బంగారుదైతేనేం. ఆ పాపం మాదికాదు జగన్‌మోహనరెడ్డిదే అంటున్నారు, అది నిజం. 20142019 కాలంలో చంద్రబాబు నాయుడు చేసింది కూడా అదే. విద్యుత్‌ గురించి మాట్లాడుకుంటున్నాం గనుక ఆ రంగంలో జగన్‌ ముగ్గురు పిల్లల్ని కన్నారు. ఒక పిల్ల వినియోగదారులకు స్మార్టు మీటర్లు, రెండవది చంద్రబాబే చెప్పినట్లు రానున్న పాతిక సంవత్సరాల్లో లక్షకోట్ల రూపాయల భారం మోపే సెకీ ఒప్పందం. మూడవది కొరత సమయాల్లో విద్యుత్‌ కొనుగోలు(ఇప్పుడు వస్తున్న అదనపు బిల్లులు). వీటిలో మొదటి ఇద్దరు పిల్లలు ఓకే, మూడోదానితో మాకు సంబంధం లేదని తెలుగుదేశం అంటే కుదురుతుందా ! మూడూ అక్రమ సంతానమనే కదా గతంలో చెప్పింది. ఇప్పుడు మూడోదాని భారం మీరే మోయాలంటూ జనం మీదకు వెంటనే వదిలారు. నిజానికి మిగతా ఇద్దరి భారాన్ని కూడా మోసేది జనమే. తేడా ఏమిటి అంటే వాటిని తరువాత వదులుతారు, తక్షణం భారం పడదు అంతే ! స్మార్ట్‌ మీటర్లను పగలగొట్టమని పిలుపు ఇచ్చిన వారు ఇప్పుడెందుకు వాటిని పెడుతున్నారు అంటే కరెంటు ఎంత కాలింది లెక్కలు తేలాలి కదా అని తెలుగుదేశం వారు టీకా తాత్పర్యం చెబుతున్నారు. నరేంద్రమోడీ, ఆ పెద్ద మనిషి రుద్దిన స్మార్ట్‌ మీటర్లను పెట్టేందుకు అంగీకరించిన జగన్మోహన్‌రెడ్డి కూడా చెప్పింది అదే కదా. మరి తెలుగుదేశం చెప్పేదానికి తేడా ఏమిటి అంటే అది చిల్లి కాదు తూటు అంటున్నారు. సెకీ ఒప్పందాన్ని రద్దు చేయండి అంటే, దాన్ని రద్దు చేస్తే పెట్టుబడులు పెట్టేవారికి విశ్వాసం దెబ్బతింటుంది అందుకే కొనసాగిస్తాం అన్నారు. ఎవరో పెట్టుబడి పెడతారంటూ రాష్ట్ర జనం మీద లక్షకోట్లు భారం మోపటానికి ఏం నాటకం ఆడుతున్నారు ! నిజానికి సెకీ వప్పందంతో రాష్ట్రానికి కొత్తగా ఒక్క రూపాయి పెట్టుబడి కూడా రాదు.గతంలోనే కుదిరాయి. అదానీ వంటి వారి నుంచి కొనుగోలు చేసే సెకీ ఆ విద్యుత్‌ను రాష్ట్రాలతో ఒప్పందం చేసుకొని సరఫరా చేస్తుంది. దానికి డబ్బు చెల్లించాలి, అంతకు మించి వచ్చే పెట్టుబడులేమిటో 40 సంవత్సరాల అనుభవం ఉన్న సిఎంచంద్రబాబు నాయుడిని, వేల పుస్తకాలు చదివిన డిప్యూటీ సిఎం పవన్‌ కల్యాణ్‌లను చెప్పమనండి. మూడు పార్టీల కార్యకర్తలు, అభిమానులు మేం నందంటే నంది పందంటే పంది అంటారని ఆ పార్టీల నేతలు అనుకోవచ్చు, కొంత మంది రచ్బబండల దగ్గర అదే వాదించి ఇంటికి వెళ్లిన తరువాత బిల్లులను చూసినపుడు గొల్లుమంటారు తప్ప బయటకు చెప్పుకోలేరు. కానీ మిగతావారు అంత అమాయకంగా లేరు.

విద్యుత్‌ రెగ్యులేటరీ కమిషన్‌ చైర్మన్‌గా పని చేసిన వ్యక్తి జగన్మోహన్‌రెడ్డి వీరాభిమాని, జగన్‌ హయాలో చేసిన కొనుగోళ్లకు సంబంధించి ఎంత వసూలు చేయాలో అప్పుడు నిర్ణయించకుండా తమనేత చంద్రబాబు అధికారానికి వచ్చిన తరువాత కావాలనే ఖరారు చేశారన్నది మరొక తర్కం. అదనపు విద్యుత్‌ కొనుగోలు విధిగా కమిషన్‌ అనుమతి తీసుకోవాలి. అలా కొన్నదాని ఖర్చు గురించి కమిషన్‌ విచారణ జరిపిన తరువాతే కదా నిర్ణయించేది, ఎప్పుడైనా తెలుగుదేశం,జనసేన, బిజెపి నేతలు వాటికి వ్యతిరేకంగా కమిషన్‌ ముందు వ్యతిరేకించారా ? ప్రకటనలు చేశారేమో తప్ప కమిషన్‌ ముందు వామపక్షాల వారి మాదిరి వ్యతిరేకంగా వాదించినట్లు కనపడదు, లేదూ మేం కూడా వ్యతిరేకించాం,వాదించాం అంటే కాసేపు అంగీకరిద్దాం, కమిషన్‌ చేసిన నిర్ణయాన్ని కోర్టులో సవాలు చేయకుండా ఎందుకు అమలు చేస్తున్నట్లు ?అవసరం లేకపోయినా విద్యుత్‌ కొనుగోలు చేశారు అన్నది మరొక వాదన. విద్యుత్‌ గురించి కనీస పరిజ్ఞానం ఉన్నవారు అలా మాట్లాడరు. కరెంటు నిల్వ ఉండదు, ఎంత ఉత్పత్తి అయితే అంతా వినియోగం కావాల్సిందే, తగ్గితే ఉత్పత్తిని తగ్గిస్తారు, సరఫరా తగ్గిస్తారు తప్ప అదనంగా కొని రోడ్లపక్కనో చెరువుల్లోనే పోయరు. అదనంగా బిల్లులు వసూలు చేయాలని కమిషనే చెప్పింది అన్నది మరొక వాదన. ఉత్పత్తి, చాలకపోతే అదనంగా కొనుగోలు చేసేది విద్యుత్‌ ఉత్పత్తి సంస్థలు, జనాలకు అందించేది పంపిణీ సంస్థలు. ఈ రెండూ ప్రభుత్వ అజమాయిషీలోనే ఉంటాయి. పెట్టుబడి, రాబడి మధ్యవచ్చే తేడాను తేల్చి ఆ మొత్తాన్ని ఆయా సంస్థలకు చెల్లించాలని యజమాని అయిన ప్రభుత్వానికి విద్యుత్‌ కమిషన్‌ చెబుతుంది తప్ప ఎలా వసూలు చేయాలో చెప్పదు, ఒకవేళ చెప్పినా వసూలు చేయాలా లేదా అన్నది ప్రభుత్వం నిర్ణయించాలి. వ్యవసాయానికి, మరికొందరికి సబ్సిడీ లేదా ఉచితంగా విద్యుత్‌ ఇస్తామని ప్రభుత్వాలు చెబుతాయి. అందుకయ్యే ఖర్చును బడ్జెట్‌ నుంచి చెల్లిస్తున్నారు. ఇప్పుడు సర్దుబాటు, మరొక పేరుతో వడ్డిస్తున్న మొత్తాలను తేల్చిన తరువాత ప్రభుత్వమే సబ్సిడీగా చెల్లించవచ్చు లేదా వినియోగదారులనుంచి వసూలు చేయవచ్చు. చంద్రబాబుపవన్‌ కల్యాణ్‌ రెండో పద్దతినే ఎంచుకుని బాదుడే బాదుడు ప్రారంభించారు.ఎందుకంటే స్వంత పార్టీల వారు అడగరు, ప్రతిపక్షం అడిగితే ఎదురుదాడికి దిగుతారు. ఇప్పుడు వసూలు చేస్తున్నదిగాక 202425ఆర్థిక సంవత్సరంలో జగన్‌మోహనరెడ్డి, చంద్రబాబు నాయుడు ఇద్దరి పాలనా కాలంలో కొనుగోలు చేసిన కరంట్‌కు ఎన్నివేల కోట్ల రూపాయలు జనం మీద మోపుతారో ఇంకా ఖరారు కాలేదు. రెగ్యులేటరీ కమిషన్‌ గత చైర్మన్‌ కావాలనే ఆలశ్యం చేసి జగన్మోహరెడ్డి పాలనా కాలంలో ఖరారు చేయలేదని చెబుతున్న తెలుగు తమ్ముళ్లు ఇప్పుడు కొత్త చైర్మన్‌తో ఎంత త్వరగా ఖరారు చేయిస్తారో తెలియదు, చేస్తే మాత్రం వెంటనే బాదుడు మొదలు పెడతారు.

ఇదిగాక కనిపించని మరొక భారం మోపేందుకు కూటమి ప్రభుత్వం పూనుకుంది. అదానీ కంపెనీ ద్వారా బిగించే 59,21,344 స్మార్ట్‌ మీటర్ల బిగింపు పూర్తి అయిన తరువాత రెండు రకాల చార్జీలు ఉంటాయి. వేసవి కాలంలో కూరగాయలు తక్కువగా పండుతాయి గనుక రేట్లు ఎక్కువగా ఉంటాయి. అలాగే వేసవిలో ఉక్క పోతకు తట్టుకోలేక ఫాన్లు, ఎసిలు వేసుకున్నపుడు కాలే కరంటు ధర ఎక్కువగా, మిగతా సమయాల్లో మామూలుగా ఉంటుంది. ఈ మీటర్లు బిగించిన తరువాత సెల్‌ఫోన్లకు ముందుగానే డబ్బు చెల్లించినట్లుగా విద్యుత్‌ను కూడా ముందుగానే డబ్బు చెల్లించాలి. ఉదాహరణకు ఇప్పుడు నెలకు రెండు వందల రూపాయల బిల్లు ఇప్పుడు వస్తుందనుకోండి. దాన్ని వాడుకున్న తరువాత ఒకేసారి చెల్లించాలి, లేకుంటే ఫీజులు పీకి వేస్తారు. స్మార్ట్‌ మీటర్లు వచ్చిన తరువాత ఫీజులు పీకేవారు ఉండరు.వారు లేకపోతే పక్కింటి వారి ముందు మన పరువూ పోదు. ముందే కరెంటును కొనుక్కోవాలి. మన దగ్గర సమయానికి ఎంత డబ్బు ఉంటే అంత మేరకు కరంటు కొనుక్కోవచ్చు, అది అయిపోగానే సరఫరా ఆగిపోతుంది, తిరిగి కావాలంటే డబ్బు చెల్లించాలి. ఇక రెండు రకాల చార్జీలు ఎలా ఉంటాయంటే. చలికాలంలో వంద రూపాయలు చెల్లిస్తే నెల రోజుల పాటు కరంటు ఉంటుంది. అదే వేసవిలో పగలు ఫాన్లు,ఎసిలు వేసుకుంటే ఒక రేటు, పొలాలు, ఉద్యోగాలకు వెళ్లినపుడు వేసుకుంటే ఒక రేటుతో పదిహేను లేదా ఇరవై రోజులకే వస్తుంది. భవిష్యత్‌లో చంద్రబాబుపవన్‌ కల్యాణ్‌ ఇచ్చే మహత్తర కానుక ఇది.దీనికే టైమ్‌ ఆఫ్‌ డే (రోజులో కరంటు కాల్చే సమయ) అనే స్మార్ట్‌ (ముద్దు ) పేరు పెట్టారు. చీకటి పడగానే ఇంట్లో లైట్లన్నీ వేసుకోవటం ఉండదు,ఎక్కడ కూర్చుంటే అక్కడే వేసుకోవాలి.ఎవరన్నా రాత్రిపూట వస్తే లైట్లు వేయాల్సి వస్తే ఇప్పుడెందుకు వచ్చార్రాబాబూ అనుకుంటాం. ఇంకా ఇలాంటివే రానున్న నాలుగేండ్లలో ఎన్ని స్మార్టు విధానాలను ముందుకు తెస్తారో చూద్దాం ! 2000 సంవత్సరంలో విద్యుత్‌ భారాలకు వ్యతిరేకంగా చంద్రబాబు సర్కార్‌ మీద జనం పెద్ద ఎత్తున ఉద్యమించటం, బషీర్‌బాగ్‌ కాల్పుల ఉదంతం, అది కూడా 2004లో తెలుగుదేశం ఓటమికి ఒక ప్రధాన కారణం కావటం తెలిసిందే. ఇప్పుడు మళ్లీ చంద్రబాబు తీసుకుంటున్న చర్యలు 2029 ఎన్నికల నాటికి ఒక గండంగా మారటం ఖాయం, జనం స్మార్ట్‌గా పాఠం చెబుతారు !


జగన్‌మోహనరెడ్డి పాలనా కాలంలో మద్యం కుంభకోణం జరిగిందని, దాని మీద కూటమి ప్రభుత్వం విచారణ జరుపుతోంది. మాజీ ఎంపీ విజయసాయి రెడ్డిని విచారణకు పిలిపించగా కొండను తవ్వి ఎలుకను పట్టినట్లు ఎంత సేపు ప్రశ్నించినా తనకేమీ తెలియదని కసిరెడ్డి రాజశేఖరరెడ్డికే అంతా తెలుసని అతన్ని విచారించాలని సిట్‌కు ఉచిత సలహా ఇచ్చారు. ఒకవేళ అతను ఏదైనా చెబితే దానికి సాక్ష్యాలు ఉండాలి కదా అని వైసిపి అంటోంది. ఇక అసలైన సూత్రధారిగా చెబుతున్న రాజ్‌శేఖర రెడ్డి అజ్ఞాతం నుంచి ఒక ఆడియో పంపి ఆ కుంభకోణం గురించి తనకేమీ తెలియదని, తనపై ఆరోపణలు చేసిన విజయసాయి రెడ్డి సంగతి బయటపెడతానంటూ దానిలో పేర్కొన్నారు. మొత్తం మీద దీన్లో తేల్చేదేమిటో తెలియదు గానీ సిట్‌ దర్యాప్తు పూర్తి చేసి కేసు నమోదు చేసిన తరువాత మనీలాండరింగ్‌ గురించి ఇడి రంగంలోకి దిగుతుందని చెబుతున్నారు. మొత్తం మీద జనం సూపర్‌ సిక్స్‌ గురించి ఆలోచించకుండా ఇలాంటి విచారణ కబుర్లతో కాలక్షేపం చేసేందుకు బాగా పనికి వస్తుందని చెప్పవచ్చు ! పంచపాండవులంటే మంచం కోళ్ల మాదిరి కుంభకోణ మొత్తం ఇప్పటికే తగ్గిపోయింది, చివరికి సున్నాగా తేలుతుందా, కూటమి ప్రభుత్వానికి చివరికి ఆయాసమే మిగులుతుందా ? డబ్బు కొట్టేయలేదని ఎవరూ చెప్పటం లేదు, ఎందుకంటే ప్రతి కుంభకోణం స్మార్డ్‌గా జరిగే రోజులివి !