Tags
2019 NATO Summit, Donald trump, EU, JD Vance, Joe Biden, NATO, The 10 minutes, Ukraine crisis, Zelensky
ఎం కోటేశ్వరరావు
‘‘ ప్రపంచాన్ని కుదిపివేసిన పది రోజులు ’’ అనే మహత్తర గ్రంధంలో 1917లో రష్యాలో జరిగిన బోల్షివిక్ విప్లవం ఎలా జరిగిందో వివరించారు. ప్రపంచంలో తొలిసారిగా కమ్యూనిస్టులు అధికారానికి వచ్చిన ఉదంతాల ప్రత్యక్ష సాక్షిగా ఉన్న అమెరికన్ రచయిత జాన్‌రీడ్ రాశాడు. ఫిబ్రవరి 28 శుక్రవారం నాడు అమెరికా అధినేత డోనాల్డ్ ట్రంప్‌ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లదిమిర్ జెలెనెస్కీ మధ్య పదినిమిషాల పాటు వైట్‌హౌస్‌లోని అధ్యక్షుడి కార్యాలయం ఓవల్ హౌస్‌లో సాగిన తీవ్ర వాగ్వివాదం యావత్ ప్రపంచాన్ని కుదిపివేసింది. రష్యన్ విప్లవం అనేక పరిణామాలు, పర్యవసానాలకు దారితీసింది. ఈ పదినిమిషాల వాగ్వివాదం దేనికి దారితీస్తుంది ? రష్యన్ విప్లవానికి దీనికి పోలిక లేదు గానీ అనేక పర్యవసానాలకు నాంది అన్నది స్పష్టం. రెండవసారి అధికారానికి వచ్చిన వందరోజులు కూడా గడవక ముందే అనేక వివాదాస్పద నిర్ణయాలు, తనకు లొంగని దేశాల వస్తు దిగుమతులపై సుంకాలు విధింపు ప్రకటనలు తెలిసిందే. పదవిని స్వీకరించిన 24 గంటల్లోనే ఉక్రెయిన్ సంక్షోభాన్ని పరిష్కరిస్తానని ప్రకటించాడు.సుంకాల సమస్య వెంటనే అందరికీ కనిపించే ప్రభావం చూపలేదు గానీ జోశ్యం చెప్పేబల్లి కుడితి తొట్టిలో పడినట్లు పరిష్కరిస్తానన్న పెద్ద మనిషి తానే ఒక పెద్ద వివాదంలో ఇరుక్కుపోవటం నిజంగా అనూహ్యపరిణామమే. ఆ ఉక్రోషంతో ఉక్రెయిన్‌కు తాత్కాలికంగా మిలిటరీ సాయాన్ని నిలిపివేస్తున్నట్లు సోమవారం నాడు ప్రకటించాడు. ఇది వంద కోట్ల డాలర్ల వరకు ఉంటుందని, జెలెనెస్కీ ఒప్పందానికి వచ్చేంత వరకు నిలిపివేస్తున్నట్లు అధికారులు వెల్లడిరచారు. అంతకు ముందు ఆదివారం నాడు లండన్‌లో సమావేశం జరిపిన ఐరోపా పెద్దలు నాలుగు అంశాల శాంతి ప్రతిపాదన గురించి చర్చించారు. తరువాత బ్రిటన్, ఫ్రాన్సునేతలు నెల రోజుల కాల్పుల విరమణకు రష్యా ముందు ఒక ప్రతిపాదన పెట్టారు. మొత్తం మీద జెలెనెస్కీ బుర్రలో ఏముందో సిఐఏ పసిగట్టలేకపోయిందా ? అమెరికా బలవంతంగా ఖనిజాల ఒప్పందాలను రుద్దాలనుకుందా, అహంకారంతో తానే ఊబిలో దిగిందా ? అసలేం జరిగింది ?
ఓవల్ ఆఫీసులో అధ్యక్షుడు ట్రంప్, ఉపాధ్యక్షుడు జెడి వాన్స్, జెలెనెస్కీ ఆసీనులయ్యారు.‘‘ శాంతికి దారి మరియు సంపద్వంతం కావటానికి మార్గం బహుశా దౌత్యంలో పాల్గ్గొనటంద్వారా సాధ్యం కావచ్చు, దాన్నే అధ్యక్షుడు ట్రంప్ చేస్తున్నారు ’’ అని జెడి వాన్స్ అన్నాడు. దాంతో జెలెనెస్కీ అందుకొని ‘‘ ఎలాంటి దౌత్యం, జెడీ మీరు దేని గురించి మాట్లాడుతున్నారు, దాని భావమేమిటి ’’ అన్నాడు. దీంతో మాటా మాటా పెరిగింది. మంచీ మర్యాదా లేకుండా అమెరికా మీడియా ముందు వివాదాన్ని సృష్టిస్తున్నారని వాన్స్ అన్నాడు. మిలిటరీతో సమస్యలను ఎదుర్కొంటున్నారని కూడా అన్నాడు. యుద్ద సమయంలో ప్రతి ఒక్కరికీ సమస్యలుంటాయి, మీకంటే చాలా ఉంది, ఇప్పుడు మీకు అవగతం కాదు, కానీ భవిష్యత్‌లో తెలుస్తుందని జెలెనెస్కీ అనటంతో ట్రంప్‌కు మండిపోయింది. మాకేం జరుగుతుందో నువ్వు మాకు చెప్పవద్దంటూ రంకెలు వేశాడు. జూదం ఆడటానికి నీ దగ్గర తురుపు ముక్కలేమీ లేవని, లక్షలాది మంది ప్రాణాలతో చెలగాటమాడుతున్నావని అన్నాడు. ఇలాంటి సందర్భాలలో మంచి కోటు వేసుకొని రావాలని తెలీదా, అసలు కోటు ఉందా అని అమెరికన్లు అవమానించారు. అమెరికన్ విలేకరి జెలెనెస్కీని కోటు గురించి అడగ్గానే జెడి వాన్స్ నవ్వాడు.యుద్దం ముగియగానే నేను ధరిస్తాను, బహుశా అది మీరు వేసుకున్నటువంటిది లేదా అంతకంటే మెరుగైంది వేసుకుంటాను అని జెలెనెస్కీ సమాధానమిచ్చాడు. వాగ్వాదం తరువాత చివరికి జెలెనెస్కీ లేచి వెళ్లిపోయాడు. ముగ్గురిలో పెద్ద వాడు ట్రంప్. జెలెనెస్కీజెడివాన్స్ మధ్య గొడవ ప్రారంభం కాగానే ఉపశమింపచేయాల్సింది పోయి తానే తగాదాకు ఉపక్రమించటం గమనించాల్సిన అంశం. ఉక్రెయిన్ విఫలమైందంటే దాని అర్ధం పుతిన్ విజయం సాధించినట్లు కాదు, అది ఐరోపాకు , అమెరికాకూ వైఫల్యమే అని తరువాత జెలెనెస్కీ అన్నాడు.మొత్తం మీద అమెరికన్లు అతి తెలివి ప్రదర్శించినట్లు స్పష్టంగా కనిపిస్తోంది. రచ్చకు కొద్ది గంటల ముందే ఎక్కువగా మాట్లాడవద్దని అమెరికా జెలెనెస్కీకి స్పష్టం చేసిందా అంటే అవుననే వెల్లడైంది. బహుశా అదే జెలెనెస్కీని ప్రేరేపించి ఉన్నట్లు కనిపిస్తోంది. ఓవల్ ఆఫీసుకు రాగానే రిపబ్లికన్ పార్టీ దక్షిణ కరోలినా రాష్ట్ర రిపబ్లికన్ పార్టీ సెనెటర్ లిండ్సే గ్రాహమ్ జెలెనెస్కీతో మాట్లాడుతూ రక్షణ ఒప్పందాల గురించి వాదోపవాదాలకు దిగవద్దని హెచ్చరించినట్లు న్యూయార్క్‌టైమ్స్ పత్రిక పేర్కొన్నది. గ్రాహమ్ స్వయంగా ఆ పత్రికతో ఈ విషయాన్ని చెప్పాడు.
జోర్డాన్ రాజు అబ్దుల్లా ఇటీవల అమెరికా పర్యటన జరిపి ట్రంపుతో భేటీ అయ్యాడు.ఇద్దరూ కలసి పత్రికా గోష్టి నిర్వహించారు. గాజాలోని పాలస్తీనియన్లకు జోర్డాన్‌లో నివాసం కల్పించేందుకు రాజు అబ్దుల్లా అంగీకరించాడంటూ డోనాల్డ్ ట్రంప్ ప్రకటించేశాడు. అక్కడే అది అవాస్తవం అంటే పరువు పోతుందని అనుకన్నాడేమో తమాయించుకొని ట్రంప్ పరువు కాపాడేందుకు అబ్దులా మౌనంగా ఉన్నాడు. తరువాత అలాంటిదేం లేదని, తమకు అంగీకారం కాదని కూడా ప్రకటించాడు. అలాగే జెలెనెస్కీని ఇరికించాలన్న దుష్టాలోచనతో ట్రంప్ అదే మాదిరి పత్రికా గోష్టి ఏర్పాటు చేశాడు. అయితే అనుకున్నదొకటి అయ్యింది ఒకటి. జెలెనెస్కీ ప్రశ్నించకపోతే తాను ఇబ్బందుల్లో పడతాడు. తమ దేశ రక్షణ హామీ సంగతి ఏమిటని ప్రశ్నిస్తాడని అమెరికన్లు ఊహించలేకపోయారు. దౌత్య మర్యాదలు, సంస్కారాన్ని పక్కనపెట్టి అవమానించటంతో జెలెనెస్కీ ఖనిజాల ఒప్పందంపై సంతకాలు చేయకుండానే లేచివెళ్లిపోయాడు. శాంతి ఒప్పందానికి అంగీకరిస్తేనే తిరిగి రా అని ట్రంప్ ప్రకటిస్తే, మీరు పిలిస్తేనే వస్తా, భద్రతకు హామీ ఇస్తే ఖనిజాల ఒప్పందమీద సంతకం చేస్తానంటూ బంతిని జలెనెస్కీ అవతలివైపు నెట్టాడు. సోమవారం నాడు లండన్లో కెనడాతో సహా పద్దెనిమిది ఐరోపా దేశాల నేతలు సమావేశమై పరిస్థితిని సమీక్షించి పాము చావకుండా కర్ర విరగకుండా అన్నట్లు అమెరికాకు మరింత ఆగ్రహం కలగకుండా, నట్టేటవదిలేదని ఉక్రెయిన్‌కు ఊరట పలుకుతూ ఒక ప్రకటన చేశారు. అవ్వా, బువ్వా రెండూ కావాలంటే కుదరదు అన్నట్లుగా పరిస్థితి ఉంది, ఏం జరగనుందన్నది యావత్ ప్రపంచంలో తలెత్తిన ఆసక్తి. ఎందుకిలా జరిగింది, పరిణామాలు, పర్యవసానాలేమిటి ?
ఉక్రెయిన్ శాంతికి హామీ ఇచ్చేందుకు సుముఖంగా ఉన్న కూటమి నాలుగు అంశాలతో ప్రతిపాదన రూపొందించినట్లు బ్రిటన్ ప్రధాని కెయిర్ స్టార్మర్ లండన్ సమావేశం తరువాత ప్రకటించాడు. ఈ క్రమంలో అమెరికా భాగస్వామి కావాలని కోరుతున్నట్లు, ఈ మేరకు ప్రయత్నాలను ముమ్మరం చేస్తామని కూడా చెప్పాడు.‘‘ఈ రోజు మేమ చరిత్ర కూడలిలో ఉన్నాము.దీర్ఘకాలం తరువాత ఐరోపా ఐక్యత ఇంత ఉన్నత స్థాయిలో ఉండటం చూడలేదు ’’అన్నాడు. నిజమైన శాంతి, హామీతో కూడిన భద్రతకు అమెరికా సహకారం కోసం ఐరోపాలో మేమంతా ఒక ప్రాతిపదికను కనుగొనేందుకు పని చేస్తున్నామని జెలెనెస్కీ చెప్పాడు. నాలుగు అంశాలు ఏవంటే, ఉక్రెయిన్‌కు సహాయం కొనసాగింపురష్యా మీద ఆర్థికవత్తిడి పెంపు, శాంతి ఒప్పందం కుదిరితే అది ఉక్రెయిన్ భద్రత, సార్వభౌమత్వాన్ని కాపాడేదిగా ఉండేట్లు చూడాలిశాంతి చర్చల్లో ఉక్రెయిన్‌కు భాగస్వామ్యం విధిగా ఉండాలి.శాంతి ఒప్పందం కుదిరితే అది భవిష్యత్‌లో ఏదైనా దురాక్రమణను ఎదుర్కొనే విధంగా రక్షణ సామర్ద్యాలను పెంచాలి. ఉక్రెయిన్ ఒప్పందాన్ని బలపరిచేందుకు, తరువాత శాంతికి హామీగా ఉండేందుకు కలసి వచ్చే వారితో ఒక కూటమిని అభివృద్ధి చేయాలి. స్థంభింప చేసిన రష్యా ఆస్తుల నుంచి వచ్చే వడ్డీ మొత్తం నుంచి 2.4 బిలియన్ డాలర్లను ఉక్రెయిన్ మిలిటరీ అవసరాల కోసం ఇవ్వాలని, ఇది గాక తాము మరో రెండు బిలియన్ డాలర్ల మొత్తాన్ని ఐదువేల గగనతల రక్షణ క్షిపణుల కొనుగోలు రుణం ఇవ్వాలని నిర్ణయించినట్లు బ్రిటన్ ప్రధాని చెప్పాడు. గతం నుంచి తాము పాఠాలు నేర్చుకున్నామని, రష్యా సులభంగా ఉల్లంఘించేందుకు అవకాశమిచ్చే బలహీన ఒప్పందాన్ని తాము అంగీకరించబోమన్నాడు. ప్రతిపాదిత ఐరోపా కూటమిలో ఏఏ దేశాలు ఉన్నదీ చెప్పలేదు. ఒప్పందం కుదరాలన్న ట్రంప్‌తో ఏకీభవిస్తున్నామని, దాన్ని అందరం కలసి చేయాలన్నాడు. గత శుక్రవారం నాడు జరిగిందాన్ని చూడాలని ఎవరూ కోరుకోలేదని, అమెరికా నమ్మదగిన దేశం కాదంటే తాను అంగీకరించనని కెయిర్ చెప్పాడు. ఐరోపాను తిరిగి సాయుధం కావించటం తక్షణ అవసరమని ఐరోపా కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాండెర్ లియాన్ చెప్పగా, ఉక్రెయిన్ ఎంత కాలం ప్రతిఘటిస్తే అంతకాలం మద్దతు ఇవ్వాలని భావించినట్లు నాటో ప్రధాన కార్యదర్శి మార్క్ రూటే చెప్పాడు. సముద్ర, గగనతల దాడులు, మౌలిక సదుపాయాల ధ్వంస దాడులు నెల రోజులు ఆపాలని బ్రిటన్,ఫ్రాన్సు ప్రతిపాదించాయి. అయితే భూతల దాడుల విరమణ అంశం లేదు.
ఈ పూర్వరంగంలో పరిణామాలు, పర్యవసానాల గురించి రకరకాల చర్చలు మొదలయ్యాయి. జెలెనెస్కీ దిగి వచ్చేంత వరకు మిలిటరీ సాయాన్ని నిలిపివేసినట్లు ప్రకటించిన పూర్వరంగంలో ఐరోపా ఆ మేరకు భర్తీ చేస్తుందా ? పరిమితంగానే అయినప్పటికీ ట్రంప్ వైఖరిని నిరసిస్తూ అమెరికాలో కొన్ని చోట్ల ప్రదర్శనలు జరిగాయి.అధికార రిపబ్లికన్, ప్రతిపక్ష డెమోక్రటిక్ పార్టీలోనూ భిన్నాభిప్రాయాలు వెల్లడయ్యాయి. ట్రంప్ గద్దె దిగేంత వరకు అమెరికా మిలిటరీ నౌకలకు ఒక్క లీటరు కూడా విక్రయించేది లేదని నార్వే చమురు కంపెనీ హాల్ట్‌బాక్ బంకర్స్ యజమాని ప్రకటించాడు.2024లో ఈ కంపెనీ మూడు మిలియన్ లీటర్లు విక్రయించింది.అయితే అమెరికాతో తమ సంబంధాలకు ఎలాంటి ఇబ్బంది లేదని నార్వే ప్రభుత్వం ప్రకటించింది. లండన్‌లో సమావేశమైన దేశాలు ఉక్రెయిన్‌కు మద్దతు ఇవ్వాలని సంకల్పం చెప్పుకున్నప్పటికీ అమెరికాతో ఘర్షణకు సిద్దంగా లేవు. కొందరి విశ్లేషణ ప్రకారం అమెరికాఐరోపా మధ్య విబేధం పెరిగిందని, ట్రంప్ వైఖరి యూరోపియన్లను చైనా వైపు మొగ్గుచూపేందుకు దోహదం చేసేదిగా ఉందని గాభరాపడుతున్నారు. కమ్యూనిస్టు సోవియట్ యూనియన్‌కు వ్యతిరేకంగా అమెరికాతో చేతులు కలిపిన ఐరోపా ఇప్పుడు అంతకంటే బలమైన కమ్యూనిస్టు చైనాతో చేతులు కలుపుతుందా ! గాజాలో శాంతి ఒప్పందాన్ని ఏ క్షణంలోనైనా ఉల్లంఘించేందుకు చూస్తున్న ఇజ్రాయెల్‌కు అన్ని రకాలుగా ట్రంప్ మద్దతు తెలుపుతున్నాడు. మధ్య ప్రాచ్యం, పశ్చిమాసియాలో తిష్టవేయటం అమెరికా లక్ష్యం. దానికి పావుగా ఇజ్రాయెల్ ఉంది. ఐరోపాలో పరిస్థితి వేరు. మిత్ర వైరుధ్యం ఉన్నప్పటికీ యావత్ ఐరోపా అమెరికా ప్రభావంలో ఉంది, కొత్తగా అమెరికా కాలూనాల్సిన అవసరం లేదు. నాటో విస్తరణ పేరుతో రష్యా ముంగిట ఆయుధాలతో తిష్టవేయాలని చూసిన అమెరికాకు అనూహ్యంగా ఎదురుదెబ్బతగిలింది. ఎన్ని ఆయుధాలు, ఎంత డబ్బు అందించినా పుతిన్ సేనలపై ఉక్రెయిన్ గెలిచే అవకాశాలు లేవని స్పష్టమైంది. రష్యా కమ్యూనిస్టు లేదా వామపక్ష శక్తుల పాలనలో లేదు.కమ్యూనిస్టుల పరిభాషలో చెప్పాలంటే అది ఒక బూర్జువాదేశం. అందువలన చైనాకు వ్యతిరేకంగా దాన్ని దగ్గరకు తీసుకోవాలని, చైనాతో ప్రచ్చన్న యుద్దం కొనసాగించాలన్నది అమెరికన్ల తాజా ఎత్తుగడగా కనిపిస్తున్నది. అమెరికా, ఐరోపాల నుంచి ముప్పు ఉంది గనుకనే రష్యా ఒక ప్రత్యర్ధిగా ఉంది, అది తొలిగితే వాటితో చేతులు కలపటానికి ఎలాంటి అభ్యంతరమూ ఉండదు. గతంలో జి7 కూటమిని విస్తరించి జి8గా మార్చేందుకు అవకాశమిచ్చినపుడు చేరిన సంగతి, 2006 సెయింట్ పీటర్స్‌బర్గ్‌లో కూటమి సమావేశాలను కూడా నిర్వహించిన సంగతి తెలిసిందే. తిరిగి అంతలోనే కుట్రల కారణంగా రష్యా ఆ కూటమికి ప్రత్యర్ధిగా మారింది. చేతులు కలపాలంటే తేలాల్సిన లెక్కలు చాలా ఉన్నందున, చైనాకు వ్యతిరేకంగా వెంటనే మారుతుందని చెప్పలేము. అయితే ప్రతిదేశం తన ప్రయోజనాలకు పెద్ద పీటవేస్తున్నపుడు అనూహ్యపరిణామాలు జరిగితే, ఏం జరుగుతుందో ఎలా చెప్పగలం !
