Tags

, , , , ,


ఎం కోటేశ్వరరావు


ఎంతో ఆసక్తి కలిగించిన ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వచ్చాయి. తమకు ఇంక 2024లో కూడా తిరుగులేదని బిజెపి ఢంకా బజాయిస్తోంది. కాంగ్రెస్‌, ఇతర పార్టీలు ఆత్మశోధనలో పడ్డాయి. ఎవరి సూత్రీకరణలు వారు చేసుకుంటున్నారు. ఇంకా కొత్త ప్రభుత్వాలు కొలువు తీరలేదు. పలు కోణాల్లో విశ్లేషణలు వెలువడుతున్నాయి. ఇవన్నీ సహజం.వినదగునెవ్వరు చెప్పిన వినినంతనే వేగపడక అన్నట్లుగా రాజకీయ పార్టీలు చెప్పిన వాటికి ప్రతిదానికీ తలూపాల్సిన అవసరంలేదు. జనం ఇచ్చిన తీర్పును గౌరవించటం వేరు. చరిత్రలో ఇచ్చిన తీర్పులన్నీ సరైనవే అని ఆమోదించాల్సిన అవసరం లేదు. హిట్లర్‌ వంటి నియంతలకు కూడా జనమే ఓట్లు వేసి గెలిపించారు. అంతమాత్రాన వారి తీర్పు సరైనదే అంటామా ? ఉత్తర ప్రదేశ్‌కు సంబంధించి కొన్ని అంశాల తీరు తెన్నులను చూద్దాం.


యోగి ఆదిత్యనాధ్‌ అభివృద్దిని చూసి తిరిగి గెలిపించి చరిత్ర సృష్టించారు. ఇటీవలి సంవత్సరాల్లో వరుసగా రెండవసారి పార్టీ అధికారానికి రాని చరిత్రను బిజెపి తిరగరాసింది.రెండవది నిజమే. ఇక మొదటి అంశం, అభివృద్ధి అంటే ఏమిటి ? అందునా యోగి చిన్న ఇంజనైతే పెద్ద ఇంజను నరేంద్రమోడీ కూడా తోడయ్యారు అన్నారు. జరిగిందేమిటి ? 2016-21 కాలంలో ఉత్తర ప్రదేశ్‌లో ఉపాధి రేటు 38.5 నుంచి 32.79(2021 సెప్టెంబరు-డిసెంబరు)శాతానికి పడిపోయింది.కార్మికశక్తి భాగస్వామ్యం కూడా ఇదే కాలంలో 46.32 నుంచి 34.45 శాతానికి తగ్గింది. నీతిఆయోగ్‌ సంస్ధ వెల్లడించిన వివరాల ప్రకారం దారిద్య్రంలో బీహార్‌, ఝార్ఖండ్‌ తరువాత ఉత్తర ప్రదేశ్‌ మూడవ స్ధానంలో ఉంది. అందుకే బిజెపి చెప్పే అభివృద్ధి అంటే ఏమిటి అన్న ప్రశ్న వస్తోంది. అయినా జనం ఎందుకు ఓట్లు వేశారనే ప్రశ్న తలెత్తుతుంది. గతంలో కాంగ్రెస్‌ అధికారంలో ఉన్నపుడు మరొక ప్రత్నామ్నాయం లేక జనం పదే పదే ఓట్లు వేశారు, దానినేమందాం ?ఉత్తర ప్రదేశ్‌లో ప్రతిపక్ష సమాజవాది మీద తగినంత విశ్వాసం లేకపోవటం ఒకటిగా కనిపిస్తోంది. రెండవది బిజెపి బి టీమ్‌లుగా పేరు తెచ్చుకున్న బిఎస్‌పి, మజ్లిస్‌ పార్టీలు చీల్చిన ఓట్లు బిజెపికి తోడ్పడ్డాయి. పోటీ 80-20శాతాల(హిందూ-ముస్లిం) మధ్య అనే బిజెపి మత సమీకరణల నినాదం కూడా పని చేసింది.


2019లోక్‌సభ ఎన్నికల్లో బిజెపికి 49.98, దాని మిత్రపక్షానికి 1.21శాతం కలుపుకుంటే ఉత్తర ప్రదేశ్‌లో రెండు ఇంజన్లకు కలిపి వచ్చిన ఓట్లు 51.19 శాతం. 2022 అసెంబ్లీ ఎన్నికల్లో ఈ కూటమిలోని మూడు పార్టీలకు వచ్చిన ఓట్లు 43.82శాతమే, మోడీ మంత్రం పని చేయనట్లేనా ? 2019లో సమాజవాది పార్టీ-బిఎస్‌పి-ఆర్‌ఎల్‌డి ఒక కూటమిగా పోటీ చేస్తే 39.23శాతం వచ్చాయి. 2022 అసెంబ్లీ ఎన్నికల్లో సమాజవాదీ కూటమికి 36.32శాతం వచ్చాయి. విడిగా పోటీచేసిన బిఎస్‌పి 12.88శాతం తెచ్చుకుంది.దీని అర్ధం ఏమిటి గతంలో బిజెపి, బిఎస్‌పి, కాంగ్రెస్‌కు పడిన ఓట్లలో కొన్ని సమాజవాది కూటమికి రాబట్టే ఓట్లశాతం పెరిగింది. బిజెపి సర్కార్‌ మీద ఉన్న వ్యతిరేకతే తమను గద్దె నెక్కిస్తుందని సమాజవాది అతి అంచనా వేసుకొని చేయాల్సిన కృషి లేకపోవటం ఓటమికి ఒక ప్రధాన కారణంగా కనిపిస్తోంది. ఎన్నికల సర్వేలు చేసిన వాటిలో ఒకటైన ఏబిపి-సి ఓటర్‌ సంస్ధ 2021 మార్చి నెల నుంచి 2022 జనవరి వరకు చేసిన ఆరు సర్వేల్లో బిజెపి కూటమి సగటు ఓట్ల శాతం 41.11శాతం కాగా చివరి సర్వేలో 41.5శాతంగా పేర్కొన్నది. ఇదే సంస్ద సమాజవాది కూటమి సగటు ఓట్లశాతాన్ని 30.8గానూ, తొలి సర్వేలో 24.4శాతంగానూ చివరి సర్వేలో 33.3శాతంగా పేర్కొన్నది.


యోగి సర్కార్‌ గూండాయిజాన్ని, నేరగాండ్లను బుల్‌డోజర్లతో అణచివేసింది, రెండవ సారి గద్దె నెక్కితే మిగతావారిని కూడా తొక్కివేస్తుంది. మంచిదే. వాస్తవ అలా ఉందా ? ఇదే ఉత్తర ప్రదేశ్‌ను గతంలో బిజెపి, బిఎస్‌పి, ఎస్‌పి పార్టీలు ఏలాయి, గూండాయిజం, మాఫియా ముఠాల పెరుగుదలకు ఎవరివంతు తోడ్పాటు వారు ఇచ్చారన్నది తిరుగులేని నిజం.ఇక 2022 ఎన్నికల్లో గెలిచిన నేరచరిత గలిగిన వారి మీద బుల్డోజర్లను ఎలా నడిపిస్తారో తరువాత చూద్దాం.


2022లో అసెంబ్లీకి ఎన్నికైన 403 మందిలో 205 మంది మీద క్రిమినల్‌ కేసులు ఉన్నాయి. గత అసెంబ్లీలో అలాంటి వారు 143 మంది మాత్రమే ఉన్నారు. ప్రజాస్వామిక సంస్కరణల సంస్ధ(ఏడిఆర్‌) వెల్లడించిన నివేదిక ప్రకారం తీవ్రమైన క్రిమినల్‌ కేసులు ఉన్నవారు అంటే హత్య, హత్యాయత్నం, కిడ్నాప్‌, మహిళల మీద నేరాలకు పాల్పడినట్లు అభియోగాలున్నవారు 158 మంది, వీరిలో ఒకరి మీద అత్యాచారయత్నం కేసు కూడా ఉంది. గతంలో ఇలాంటి ఘనులు 117 మాత్రమే. పార్టీల వారీగా చూస్తే తమ పార్టీ ప్రత్యేకం అని చెప్పుకొనే బిజెపి అగ్రస్దానంలో అంటే 255కు గాను 111 మందిని కలిగి ఉంది. సమాజవాది పార్టీలో 111 మందికిగాను 71 మంది ఉన్నారు. ఐదేండ్ల తరువాత అభివృద్ధిని చూపి ఓట్లడిగామని చెప్పుకొనే వారు మరింత మంది నేర చరితులను ఎందుకు రంగంలోకి దింపినట్లు ? ఎన్నికైన ఎంఎల్‌ఏల్లో గతంలో 322 మంది కోటీశ్వరులుంటే ఇప్పుడు వారి వృద్ది 366కు పెరిగింది. బిజెపి తరఫున గెలిచిన 255 మంది సగటు 8.14 కోట్లు, అదే సమాజవాది సగటు రు.7.39 కోట్లు ? ఎవరిది డబ్బు, కండబలం ఉన్న పార్టీ ? గెలిచిన ఇద్దరు కాంగ్రెస్‌ వారి ఆస్తి రు.19.71 కోట్లు.


ఉత్తర ప్రదేశ్‌ చట్టసభలో మెజారిటీ 205 మంది నేర చరితులు ఉన్న తరువాత వారి అనుచరులు, అభిమానులు వేరే దారిలో నడుస్తారా ? చట్టాలను అమలు జరిపే యంత్రాంగాన్ని సక్రమంగా నడవనిస్తారా ? చరిత్రలో ఎక్కడా అలాంటి ఉదంతాలు లేవు. హత్రాస్‌ దుర్మార్గం జరిగింది, లఖింపూర్‌ ఖేరీ దారుణం తెలిసిందే. ఇప్పుడు బిజెపి ఎన్నికల్లో గెలిచినంత మాత్రాన అవసలు జరగలేదు, ప్రతిపక్షాల కుట్ర లేదా ప్రచారమని చెబుతారా ? చెప్పండి ! మహిళలు పెద్ద ఎత్తున ఓట్లు వేసినట్లు చెబుతున్నారు.నిజం కూడా కావచ్చు, దీని అర్ధం ఉత్తర ప్రదేశ్‌ మహిళలకు స్వర్గంగా ఉన్నట్లా ? 2015-19(రెండు సంవత్సరాలు అఖిలేష్‌, రెండు సంవత్సరాలు యోగి ఏలుబడి) సంవత్సరాలలో అక్కడ మహిళలపై నేరాలు 66.7శాతం పెరిగాయి. దేశ సగటు 23శాతం మాత్రమే.2019లో దేశంలో నమోదైన కేసుల్లో 15శాతం యోగి ఖాతాలో పడ్డాయి. సామూహిక మానభంగాలలో 2019లో రాజస్తాన్‌ 902 కేసులతో ముందుంటే ఉత్తర ప్రదేశ్‌ 301, మధ్యప్రదేశ్‌ 162తో రెండు, మూడు స్ధానాల్లో ఉన్నాయి. ఉన్నత విలువలు నేర్పుతామని చెప్పే ఆర్‌ఎస్‌ఎస్‌, హిందూత్వ సంస్ధలకు ఈ మూడు రాష్ట్రాల్లో ఎంతో పట్టు ఉందన్నది తెలిసిందే. వారు తెచ్చిన సామాజిక మార్పు ఏమిటి ?


పైన చెప్పుకున్న నాలుగు సంవత్సరాల్లో దళితులపై జరిగిన దారుణాల కేసుల్లోనూ ఉత్తర ప్రదేశ్‌ అగ్రస్ధానంలో ఉంది. తరువాత స్ధానాల్లో సంఘపరివారం బలంగా ఉన్న రాజస్తాన్‌, బీహార్‌, మధ్య ప్రదేశ్‌ ఉన్నాయి. ఉత్తర ప్రదేశ్‌లో 2015లో 8,357 నమోదు కాగా 2019లో 11,829కి చేరాయి.2018 – 2020 (పూర్తిగా యోగి స్వర్ణయుగంలో) మూడు సంవత్సరాల్లో 36,467 కేసులు నమోదయ్యాయి, అంటే సగటున ఏడాదికి 12,155, వేద గణితం ప్రకారం లెక్కలు వేసినా యోగి ఏలుబడిలో తగ్గినట్లు ఎవరైనా చెప్పగలరా ? 2019లో దేశంలో పదిహేను శాతం కేసులు ఉత్తరప్రదేశ్‌లో ఉంటే అవి 2020నాటికి 26శాతానికి పెరిగాయి.
సబ్‌కాసాత్‌, సబ్‌కా వికాస్‌, సబ్‌కా విశ్వాస్‌ అంటే అందరినీ కలుపుకుపోతాం, అందరి వృద్ధి, అందరి విశ్వాసం అన్నది బిజెపి నినాదం. బిజెపికి మింగుడుపడినా పడకున్నా ఉత్తర ప్రదేశ్‌ జనాభాలో 20శాతం ముస్లింలు ఉన్నారు. ఆ సామాజిక తరగతికి చెందిన వారికి ఒక్కటంటే ఒక్క సీటూ ఇవ్వలేదు. అంటే బిజెపి ఇచ్చే నినాదం మోసపూరితం కాదా ?మత ప్రాతిపదికన ఓటర్లను సమీకరించేందుకు వేసిన ఎత్తుగడకాదా ? హిందూ పత్రిక-సిఎస్‌డిఎస్‌-లోక్‌నీతి సంస్ధలు సంయుక్తంగా ఎన్నికల అనంతర సర్వే వివరాల ప్రకారం బిజెపి ముందుకు తెచ్చిన మతపరమైన రెచ్చగొట్టుడు పని చేసింది.2017 బిజెపికి హిందువులు 47శాతం ఓటు వేస్తే 2022లో 54శాతానికి పెరిగింది. అదే సమాజవాది పార్టీకి 19 నుంచి 26శాతానికి పెరిగింది. బిఎస్‌పికి 23 నుంచి 14శాతానికి, కాంగ్రెస్‌కు నాలుగు నుంచి రెండుశాతానికి తగ్గింది. ఈ ఓట్లు బిజెపి-సమాజవాది పార్టీలకు వెళ్లాయి. ఇక సమాజవాది పార్టీ కూటమి సీట్ల సంఖ్యపెరగటానికి బిజెపి చేసిన విద్వేష ప్రచారంతో ముస్లింలు ఆ వైపు మొగ్గటమే అన్నది స్పష్టం.గత ఎన్నికల్లో 46శాతంగా ఉన్నవి ఈసారి 79శాతం మంది ఎస్‌పి కూటమివైపు మొగ్గారు. బిఎస్‌పి ఓట్లు 19 నుంచి ఆరు, కాంగ్రెస్‌ ఓట్లు 23 నుంచి మూడు, ఇతరుల ఓట్లు పది నుంచి నాలుగుశాతానికి తగ్గాయి. ఇదే సమయంలో ముస్లిం ఓట్లు బిజెపికి ఐదు నుంచి ఎనిమిదిశాతానికి పెరిగాయి.


యోగి సర్కార్‌ అభివృద్దే గెలిపిస్తుందని చెప్పుకుంటూనే బిజెపి173 మంది కొత్త ముఖాలను రంగంలోకి దించి పాత వారి మీద జనంలో ఉన్న అసంతృప్తిని చల్లార్చేందుకు చూసింది. వారిలో 99 మాత్రమే గెలిచారు.గత ఎన్నికల్లో బిజెపి కూటమి ఓడిన 85 స్దానాల్లో ఈసారి 69 మంది కొత్తవారిని రంగంలోకి దించినా గెలిచింది 19 మాత్రమే. పాతవారిలో 104 మంది సిట్టింగులకు సీట్లు ఇవ్వలేదు. అక్కడ కొత్తవారిని పెట్టగా 80 మంది గెలిచారు. గత ఎన్నికల్లో ఓడిన 16 మందిని ఈ సారి కూడా పోటీకి నిలిపితే కేవలం నలుగురు మాత్రమే గెలిచారు.


మజ్లిస్‌ పార్టీ ఓట్లు చీల్చిన కారణంగా సమాజవాది ఓడింది అన్నది ఒక అభిప్రాయం.ఆ పార్టీ బిజెపికి బిటీమ్‌ అన్నది, దాని అధినేత మీద జరిగిన దాడి బూటకం అన్నది నిజం. కానీ ఇక్కడ ఆ పార్టీ పోటీచేసిన 94 స్ధానాల్లో వచ్చిన ఓట్లు 4,50,929(0.49శాతం) మాత్రమే అయినా అనేక చోట్ల బిజెపికి తోడ్పడింది. మొత్తంగా చూసినపుడు మూడవ స్దానంలో ఉన్న బిఎస్‌పి పోటీ బిజెపికి తోడ్పడిందన్నది గమనించాలి. తిరుగులేదు అని చెప్పుకున్న బిజెపికి ఉత్తర ప్రదేశ్‌లో మూడు చోట్ల డిపాజిట్లు రాలేదు.399 చోట్ల పోటీ పడిన కాంగ్రెస్‌ 387 చోట్ల డిపాజిట్లు కోల్పోయింది. రెండు చోట్ల గెలవగా నాలుగు చోట్ల రెండవ స్ధానంలో ఉంది. తనబలాన్ని అతిగా అంచనా వేసుకొని పోటీ చేసిన కాంగ్రెస్‌ సగటున ఒక్కో చోట 5,391 ఓట్లు తెచ్చుకొంది, ఆ విధంగా కూడా బిజెపికి తోడ్పడినట్లే. బిఎస్‌పి పోటీ చేసిన 403 స్ధానాల్లో 290 చోట్ల డిపాజిట్లు పోగొట్టుకుంది.ఒక చోట గెలవగా 14చోట్ల రెండవ స్దానంలో ఉంది.


నువ్వానేనా అన్నట్లుగా అధికారం కోసం పోటీపడిన సమాజవాది పార్టీ 376 చోట్ల పోటీ చేసింది, ఆరు చోట్ల డిపాజిట్లు కోల్పోయింది. నూటపదకొండు సీట్లు గెలిచి 231 చోట్ల రెండవ స్దానంలో ఉంది. ఆ పార్టీతో జట్టు కట్టిన ఆర్‌ఎల్‌డి 33 చోట్ల పోటీ చేసి మూడు డిపాజిట్లు కోల్పోయి ఎనిమిది చోట్ల గెలిచింది.చెల్లిన ఓట్లలో 16.66శాతం తెచ్చుకుంటే డిపాజిట్‌ దక్కుతుంది. పురుషుల్లో కేవలం నాలుగుశాతం మాత్రమే సమాజవాది కంటే బిజెపికి ఎక్కువగా ఓట్లు వేయగా మహిళల్లో బిజెపికి 16శాతం మంది అధికంగా ఓటు వేసినట్లు సర్వేలు పేర్కొన్నాయి. ఇది కూడా బిజెపికి తోడ్పడిన అంశంగా భావిస్తున్నారు. కొన్ని సంక్షేమ పధకాలు వీరిని ఆకర్షించినట్లు చెబుతున్నారు. ఇక రైతులు కూడా బిజెపికి గణనీయంగా ఓటు చేశారు. ఏడాదికి ఆరువేల చొప్పున కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న కిసాన్‌ సమ్మాన్‌ యోజనం పధకం, ఎన్నికలలో బిజెపి చేసిన కొన్ని వాగ్దానాలు ముఖ్యంగా చిన్న, సన్నకారు రైతాంగాన్ని ఆకర్షించినట్లు వెల్లడైంది.లఖింపూర్‌ ఖేరీ, పశ్చిమ ఉత్తర ప్రదేశ్‌లో కూడా తాము గణనీయంగా రైతుల మద్దతు పొందినట్లు బిజెపి చెప్పుకొంటోంది. అంగీకరిద్దాం, క్షమాపణలు చెప్పి రద్దు చేసిన మూడు సాగు చట్టాలను తిరిగి నరేంద్రమోడీ ప్రవేశపెడతారా ? కనీస మద్దతు ధరలకు చట్టబద్దత కల్పించే అంశాన్ని పరిశీలించేందుకు వేస్తామన్న కమిటీని ఉత్తిదే అంటారా ? చూద్దాం !