ఎం కోటేశ్వరరావు
కొద్ది రోజుల క్రితం వైఎస్ జగన్ కుటుంబానికి చెందిన సాక్షి పత్రిక విద్యుత్ బిల్లుల పెరుగుదల గురించి ఒక వార్త ఇచ్చింది. దాన్లో ఉన్న వ్యాఖ్యలను పక్కన పెడితే అంకెల సమాచారం పక్కా వాస్తవం. తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇస్తాయని చెబుతున్న మీడియా వాటి మీద చర్చలు పెట్టింది, తెలుగుదేశం ప్రతినిధులు విద్యుత్ బిల్లుల పెరుగుదలకు తమకు ఎలాంటి సంబంధం లేదని, అది గత ప్రభుత్వ పాపమే అంటూ నానా యాగీ చేస్తున్నారు.ఇక్కడ మహాకవి శ్రీశ్రీ కవితను ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోక తప్పటం లేదు.
జెంఘిజ్ ఖాన్, తామర్లేన్
నాదిర్షా, ఘజనీ, ఘోరీ
సికిందరో ఎవడైతేనేం
ఒక్కొక్కడూ మహాహంతకుడు
అన్నట్లుగా సిఎంగా వైఎస్ జగన్, చంద్రబాబు నాయుడు ఎవరైతేనేం ? జనానికి వాచిపోతోంది. జగన్ వైసిపి కార్యకర్తలకు, ఓటర్లకు మినహాయింపు ఇచ్చింది లేదు, చంద్రబాబు మూడు పార్టీల వారికీ ఒరగబెడుతున్నదీ లేదు. పవన్ కల్యాణ్ చెప్పినట్లు సేమ్ టు సేమ్ (అంతా ఒకటే ) జగన్ పాలన ఐదు సంవత్సరాల్లో విద్యుత్ బిల్లులు మోతమోగించారు, బాదుడే బాదుడు అని ఊరూవాడా ప్రచారం చేసిన చంద్రబాబు నాయుడు అండ్ కో అధికారానికి వచ్చిన ఏడాది కాలంలోనే రు.15,485 కోట్ల మేర విద్యుత్ భారాన్ని 2026 ఆఖరు వరకు వినియోగదారుల నుంచి వసూలు చేయాలని నిర్ణయించి బాదుడే బాదుడు ప్రారంభించింది.
వైకింగులు, శ్వేతహూణులు
సిథియన్లు, పారశీకులు
పిండారీలు, థగ్గులు కట్టిరి
కాలానికి కత్తుల వంతెన
అన్నాడు శ్రీశ్రీ. అదే మాదిరి కొందరి వ్యవహారం ఉంది. గతం, వర్తమాన భారాలకు కారకుల గురించి వారి మద్దతుదారులైన మీడియా సంస్థలు, జర్నలిస్టులు గతంలో చేసిందీ, ఇప్పుడు చేస్తున్నదీ అదే. వారికి బిల్లులు ఎంత పెరిగినా మౌనంగా కట్టేయటం తప్ప చెప్పుకోలేని దుస్థితి. జనంతో ఆడుకుంటున్నారు.
మేం విద్యుత్ ఛార్జీలు పెంచలేదు కదా అంటున్నారు మూడు పార్టీల చెట్టుకింది ప్లీడర్లు. పెంచారని ఎవరన్నారు, చార్జీల బదులు మా జేబులను గుల్లచేసే బిల్లులు పెంచారుగా అని కదా ప్రజానీకం మొత్తుకుంటున్నది. పళ్లూడగొట్టటానికి ఇనుప సుత్తి అయితేనే బంగారుదైతేనేం. ఆ పాపం మాదికాదు జగన్‌మోహనరెడ్డిదే అంటున్నారు, అది నిజం. 20142019 కాలంలో చంద్రబాబు నాయుడు చేసింది కూడా అదే. విద్యుత్ గురించి మాట్లాడుకుంటున్నాం గనుక ఆ రంగంలో జగన్ ముగ్గురు పిల్లల్ని కన్నారు. ఒక పిల్ల వినియోగదారులకు స్మార్టు మీటర్లు, రెండవది చంద్రబాబే చెప్పినట్లు రానున్న పాతిక సంవత్సరాల్లో లక్షకోట్ల రూపాయల భారం మోపే సెకీ ఒప్పందం. మూడవది కొరత సమయాల్లో విద్యుత్ కొనుగోలు(ఇప్పుడు వస్తున్న అదనపు బిల్లులు). వీటిలో మొదటి ఇద్దరు పిల్లలు ఓకే, మూడోదానితో మాకు సంబంధం లేదని తెలుగుదేశం అంటే కుదురుతుందా ! మూడూ అక్రమ సంతానమనే కదా గతంలో చెప్పింది. ఇప్పుడు మూడోదాని భారం మీరే మోయాలంటూ జనం మీదకు వెంటనే వదిలారు. నిజానికి మిగతా ఇద్దరి భారాన్ని కూడా మోసేది జనమే. తేడా ఏమిటి అంటే వాటిని తరువాత వదులుతారు, తక్షణం భారం పడదు అంతే ! స్మార్ట్ మీటర్లను పగలగొట్టమని పిలుపు ఇచ్చిన వారు ఇప్పుడెందుకు వాటిని పెడుతున్నారు అంటే కరెంటు ఎంత కాలింది లెక్కలు తేలాలి కదా అని తెలుగుదేశం వారు టీకా తాత్పర్యం చెబుతున్నారు. నరేంద్రమోడీ, ఆ పెద్ద మనిషి రుద్దిన స్మార్ట్ మీటర్లను పెట్టేందుకు అంగీకరించిన జగన్మోహన్‌రెడ్డి కూడా చెప్పింది అదే కదా. మరి తెలుగుదేశం చెప్పేదానికి తేడా ఏమిటి అంటే అది చిల్లి కాదు తూటు అంటున్నారు. సెకీ ఒప్పందాన్ని రద్దు చేయండి అంటే, దాన్ని రద్దు చేస్తే పెట్టుబడులు పెట్టేవారికి విశ్వాసం దెబ్బతింటుంది అందుకే కొనసాగిస్తాం అన్నారు. ఎవరో పెట్టుబడి పెడతారంటూ రాష్ట్ర జనం మీద లక్షకోట్లు భారం మోపటానికి ఏం నాటకం ఆడుతున్నారు ! నిజానికి సెకీ వప్పందంతో రాష్ట్రానికి కొత్తగా ఒక్క రూపాయి పెట్టుబడి కూడా రాదు.గతంలోనే కుదిరాయి. అదానీ వంటి వారి నుంచి కొనుగోలు చేసే సెకీ ఆ విద్యుత్‌ను రాష్ట్రాలతో ఒప్పందం చేసుకొని సరఫరా చేస్తుంది. దానికి డబ్బు చెల్లించాలి, అంతకు మించి వచ్చే పెట్టుబడులేమిటో 40 సంవత్సరాల అనుభవం ఉన్న సిఎంచంద్రబాబు నాయుడిని, వేల పుస్తకాలు చదివిన డిప్యూటీ సిఎం పవన్ కల్యాణ్‌లను చెప్పమనండి. మూడు పార్టీల కార్యకర్తలు, అభిమానులు మేం నందంటే నంది పందంటే పంది అంటారని ఆ పార్టీల నేతలు అనుకోవచ్చు, కొంత మంది రచ్బబండల దగ్గర అదే వాదించి ఇంటికి వెళ్లిన తరువాత బిల్లులను చూసినపుడు గొల్లుమంటారు తప్ప బయటకు చెప్పుకోలేరు. కానీ మిగతావారు అంత అమాయకంగా లేరు.
విద్యుత్ రెగ్యులేటరీ కమిషన్ చైర్మన్‌గా పని చేసిన వ్యక్తి జగన్మోహన్‌రెడ్డి వీరాభిమాని, జగన్ హయాలో చేసిన కొనుగోళ్లకు సంబంధించి ఎంత వసూలు చేయాలో అప్పుడు నిర్ణయించకుండా తమనేత చంద్రబాబు అధికారానికి వచ్చిన తరువాత కావాలనే ఖరారు చేశారన్నది మరొక తర్కం. అదనపు విద్యుత్ కొనుగోలు విధిగా కమిషన్ అనుమతి తీసుకోవాలి. అలా కొన్నదాని ఖర్చు గురించి కమిషన్ విచారణ జరిపిన తరువాతే కదా నిర్ణయించేది, ఎప్పుడైనా తెలుగుదేశం,జనసేన, బిజెపి నేతలు వాటికి వ్యతిరేకంగా కమిషన్ ముందు వ్యతిరేకించారా ? ప్రకటనలు చేశారేమో తప్ప కమిషన్ ముందు వామపక్షాల వారి మాదిరి వ్యతిరేకంగా వాదించినట్లు కనపడదు, లేదూ మేం కూడా వ్యతిరేకించాం,వాదించాం అంటే కాసేపు అంగీకరిద్దాం, కమిషన్ చేసిన నిర్ణయాన్ని కోర్టులో సవాలు చేయకుండా ఎందుకు అమలు చేస్తున్నట్లు ?అవసరం లేకపోయినా విద్యుత్ కొనుగోలు చేశారు అన్నది మరొక వాదన. విద్యుత్ గురించి కనీస పరిజ్ఞానం ఉన్నవారు అలా మాట్లాడరు. కరెంటు నిల్వ ఉండదు, ఎంత ఉత్పత్తి అయితే అంతా వినియోగం కావాల్సిందే, తగ్గితే ఉత్పత్తిని తగ్గిస్తారు, సరఫరా తగ్గిస్తారు తప్ప అదనంగా కొని రోడ్లపక్కనో చెరువుల్లోనే పోయరు. అదనంగా బిల్లులు వసూలు చేయాలని కమిషనే చెప్పింది అన్నది మరొక వాదన. ఉత్పత్తి, చాలకపోతే అదనంగా కొనుగోలు చేసేది విద్యుత్ ఉత్పత్తి సంస్థలు, జనాలకు అందించేది పంపిణీ సంస్థలు. ఈ రెండూ ప్రభుత్వ అజమాయిషీలోనే ఉంటాయి. పెట్టుబడి, రాబడి మధ్యవచ్చే తేడాను తేల్చి ఆ మొత్తాన్ని ఆయా సంస్థలకు చెల్లించాలని యజమాని అయిన ప్రభుత్వానికి విద్యుత్ కమిషన్ చెబుతుంది తప్ప ఎలా వసూలు చేయాలో చెప్పదు, ఒకవేళ చెప్పినా వసూలు చేయాలా లేదా అన్నది ప్రభుత్వం నిర్ణయించాలి. వ్యవసాయానికి, మరికొందరికి సబ్సిడీ లేదా ఉచితంగా విద్యుత్ ఇస్తామని ప్రభుత్వాలు చెబుతాయి. అందుకయ్యే ఖర్చును బడ్జెట్ నుంచి చెల్లిస్తున్నారు. ఇప్పుడు సర్దుబాటు, మరొక పేరుతో వడ్డిస్తున్న మొత్తాలను తేల్చిన తరువాత ప్రభుత్వమే సబ్సిడీగా చెల్లించవచ్చు లేదా వినియోగదారులనుంచి వసూలు చేయవచ్చు. చంద్రబాబుపవన్ కల్యాణ్ రెండో పద్దతినే ఎంచుకుని బాదుడే బాదుడు ప్రారంభించారు.ఎందుకంటే స్వంత పార్టీల వారు అడగరు, ప్రతిపక్షం అడిగితే ఎదురుదాడికి దిగుతారు. ఇప్పుడు వసూలు చేస్తున్నదిగాక 202425ఆర్థిక సంవత్సరంలో జగన్‌మోహనరెడ్డి, చంద్రబాబు నాయుడు ఇద్దరి పాలనా కాలంలో కొనుగోలు చేసిన కరంట్‌కు ఎన్నివేల కోట్ల రూపాయలు జనం మీద మోపుతారో ఇంకా ఖరారు కాలేదు. రెగ్యులేటరీ కమిషన్ గత చైర్మన్ కావాలనే ఆలశ్యం చేసి జగన్మోహరెడ్డి పాలనా కాలంలో ఖరారు చేయలేదని చెబుతున్న తెలుగు తమ్ముళ్లు ఇప్పుడు కొత్త చైర్మన్‌తో ఎంత త్వరగా ఖరారు చేయిస్తారో తెలియదు, చేస్తే మాత్రం వెంటనే బాదుడు మొదలు పెడతారు.
ఇదిగాక కనిపించని మరొక భారం మోపేందుకు కూటమి ప్రభుత్వం పూనుకుంది. అదానీ కంపెనీ ద్వారా బిగించే 59,21,344 స్మార్ట్ మీటర్ల బిగింపు పూర్తి అయిన తరువాత రెండు రకాల చార్జీలు ఉంటాయి. వేసవి కాలంలో కూరగాయలు తక్కువగా పండుతాయి గనుక రేట్లు ఎక్కువగా ఉంటాయి. అలాగే వేసవిలో ఉక్క పోతకు తట్టుకోలేక ఫాన్లు, ఎసిలు వేసుకున్నపుడు కాలే కరంటు ధర ఎక్కువగా, మిగతా సమయాల్లో మామూలుగా ఉంటుంది. ఈ మీటర్లు బిగించిన తరువాత సెల్‌ఫోన్లకు ముందుగానే డబ్బు చెల్లించినట్లుగా విద్యుత్‌ను కూడా ముందుగానే డబ్బు చెల్లించాలి. ఉదాహరణకు ఇప్పుడు నెలకు రెండు వందల రూపాయల బిల్లు ఇప్పుడు వస్తుందనుకోండి. దాన్ని వాడుకున్న తరువాత ఒకేసారి చెల్లించాలి, లేకుంటే ఫీజులు పీకి వేస్తారు. స్మార్ట్ మీటర్లు వచ్చిన తరువాత ఫీజులు పీకేవారు ఉండరు.వారు లేకపోతే పక్కింటి వారి ముందు మన పరువూ పోదు. ముందే కరెంటును కొనుక్కోవాలి. మన దగ్గర సమయానికి ఎంత డబ్బు ఉంటే అంత మేరకు కరంటు కొనుక్కోవచ్చు, అది అయిపోగానే సరఫరా ఆగిపోతుంది, తిరిగి కావాలంటే డబ్బు చెల్లించాలి. ఇక రెండు రకాల చార్జీలు ఎలా ఉంటాయంటే. చలికాలంలో వంద రూపాయలు చెల్లిస్తే నెల రోజుల పాటు కరంటు ఉంటుంది. అదే వేసవిలో పగలు ఫాన్లు,ఎసిలు వేసుకుంటే ఒక రేటు, పొలాలు, ఉద్యోగాలకు వెళ్లినపుడు వేసుకుంటే ఒక రేటుతో పదిహేను లేదా ఇరవై రోజులకే వస్తుంది. భవిష్యత్‌లో చంద్రబాబుపవన్ కల్యాణ్ ఇచ్చే మహత్తర కానుక ఇది.దీనికే టైమ్ ఆఫ్ డే (రోజులో కరంటు కాల్చే సమయ) అనే స్మార్ట్ (ముద్దు ) పేరు పెట్టారు. చీకటి పడగానే ఇంట్లో లైట్లన్నీ వేసుకోవటం ఉండదు,ఎక్కడ కూర్చుంటే అక్కడే వేసుకోవాలి.ఎవరన్నా రాత్రిపూట వస్తే లైట్లు వేయాల్సి వస్తే ఇప్పుడెందుకు వచ్చార్రాబాబూ అనుకుంటాం. ఇంకా ఇలాంటివే రానున్న నాలుగేండ్లలో ఎన్ని స్మార్టు విధానాలను ముందుకు తెస్తారో చూద్దాం ! 2000 సంవత్సరంలో విద్యుత్ భారాలకు వ్యతిరేకంగా చంద్రబాబు సర్కార్ మీద జనం పెద్ద ఎత్తున ఉద్యమించటం, బషీర్‌బాగ్ కాల్పుల ఉదంతం, అది కూడా 2004లో తెలుగుదేశం ఓటమికి ఒక ప్రధాన కారణం కావటం తెలిసిందే. ఇప్పుడు మళ్లీ చంద్రబాబు తీసుకుంటున్న చర్యలు 2029 ఎన్నికల నాటికి ఒక గండంగా మారటం ఖాయం, జనం స్మార్ట్‌గా పాఠం చెబుతారు !
జగన్‌మోహనరెడ్డి పాలనా కాలంలో మద్యం కుంభకోణం జరిగిందని, దాని మీద కూటమి ప్రభుత్వం విచారణ జరుపుతోంది. మాజీ ఎంపీ విజయసాయి రెడ్డిని విచారణకు పిలిపించగా కొండను తవ్వి ఎలుకను పట్టినట్లు ఎంత సేపు ప్రశ్నించినా తనకేమీ తెలియదని కసిరెడ్డి రాజశేఖరరెడ్డికే అంతా తెలుసని అతన్ని విచారించాలని సిట్‌కు ఉచిత సలహా ఇచ్చారు. ఒకవేళ అతను ఏదైనా చెబితే దానికి సాక్ష్యాలు ఉండాలి కదా అని వైసిపి అంటోంది. ఇక అసలైన సూత్రధారిగా చెబుతున్న రాజ్‌శేఖర రెడ్డి అజ్ఞాతం నుంచి ఒక ఆడియో పంపి ఆ కుంభకోణం గురించి తనకేమీ తెలియదని, తనపై ఆరోపణలు చేసిన విజయసాయి రెడ్డి సంగతి బయటపెడతానంటూ దానిలో పేర్కొన్నారు. మొత్తం మీద దీన్లో తేల్చేదేమిటో తెలియదు గానీ సిట్ దర్యాప్తు పూర్తి చేసి కేసు నమోదు చేసిన తరువాత మనీలాండరింగ్ గురించి ఇడి రంగంలోకి దిగుతుందని చెబుతున్నారు. మొత్తం మీద జనం సూపర్ సిక్స్ గురించి ఆలోచించకుండా ఇలాంటి విచారణ కబుర్లతో కాలక్షేపం చేసేందుకు బాగా పనికి వస్తుందని చెప్పవచ్చు ! పంచపాండవులంటే మంచం కోళ్ల మాదిరి కుంభకోణ మొత్తం ఇప్పటికే తగ్గిపోయింది, చివరికి సున్నాగా తేలుతుందా, కూటమి ప్రభుత్వానికి చివరికి ఆయాసమే మిగులుతుందా ? డబ్బు కొట్టేయలేదని ఎవరూ చెప్పటం లేదు, ఎందుకంటే ప్రతి కుంభకోణం స్మార్డ్‌గా జరిగే రోజులివి !
