Tags
ANDHRA PRADESH, BJP, CHANDRABABU, Narendra Modi Failures, Pawan kalyan, Prakash Raj, RSS, Tirupati Laddu Controversy, YS jagan
ఎం కోటేశ్వరరావు
ఆంధ్రప్రదేశ్‌లో ఏం జరుగుతోంది ? మాజీ సిఎం జగన్ మోహనరెడ్డిని ఇరుకున పెట్టాలని చూసిన చంద్రబాబు నాయుడు చివరకు తిరుమల పర్యటనను తీవ్ర వివాదాస్పదం గావించి మొత్తం మీద జగన్ నెత్తిన పాలుపోశారనే చెప్పాలి. పోలీస్ సెక్షన్ 30 తదితర ఆంక్షల పేరుతో ఆటంక పరచకుండా అనుమతించి ఉంటే పరమతాలకు చెందిన వారందరి మాదిరే జగన్ కూడా ఆలయసంప్రదాయాలను గౌరవిస్తున్నట్లు రిజిస్టర్‌లో సంతకం చేసేవారా లేదా అనేది తేలిపోయి ఉండేది.చేయకపోతే అభ్యంతరం తెలిపి ఉంటే బంతి జగన్ కోర్టులో ఉండేది. అలాంటి అవకాశం లేకుండా వ్యవహరించటంతో జగన్ వ్యతిరేకులందరూ ఒక రకంగా నీరుగారిపోయారు. అయితే దీని మీద ఎవరి భాష్యం వారు చెప్పుకుంటున్నారు గనుక జనం ఎవరికి వారే నిర్ణయించుకోవాలి. ఇకనైనా లడ్డు రాజకీయానికి తెరదించి రాష్ట్ర సమస్యల మీద కేంద్రీకరించాలి.
చంద్రబాబు నాయుడు చేసిన పాపానికి ప్రాయశ్చిత్తంగా తిరుమల వెంకటేశ్వరుడి దర్శనాన్ని చేసుకొని ప్రార్ధిస్తానని ప్రకటించిన వైఎస్ జగన్‌మోహన రెడ్డిని పరోక్షంగా ప్రభుత్వం అడ్డుకుంది. అంతకు ముందు తెలుగుదేశం, జనసేన, బిజెపి, వారి కనుసన్నలలో పనిచేసే సంస్థలు, వ్యక్తులు స్వామి దర్శనం చేసుకోవాలంటే ఆచారాలను మన్నిస్తూ దేవస్థాన రిజిస్టర్‌లో సంతకం చేయాల్సిందేనని, తలనీలాలు సమర్పించుకోవాల్సిందేనని ప్రకటించాయి. లడ్డూ నెయ్యిలో జంతువుల కొవ్వు కలిసిందంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించి పాపానికి పాల్పడ్డారని దానికి ప్రాయచిత్తంగా సెప్టెంబరు 28 తమ పార్టీ కార్యకర్తలు, అభిమానులు దేవాలయాల్లో పూజలు చేయాలని క్రైస్తవమతావలంబకుడిగా అందరికీ తెలిసిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపు ఇచ్చారు. మరోసారి శుక్రవారం నాడు మీడియా సమావేశంలో కూడా అదే చెప్పారు. తాను నాలుగు గోడల మధ్య బైబిలు చదువుతానని, బయట అన్ని మతాలను పాటిస్తానని, తనది మానవమతమని ఏం కావాలంటే అది రాసుకోవచ్చని కూడా చెప్పారు. తమ ప్రభుత్వం జగన్‌కు ఎలాంటి నోటీసులూ ఇవ్వలేదని, తిరుమల పర్యటనను అడ్డుకోలేదని చంద్రబాబు నాయుడు ప్రకటించారు. అన్యమతస్తులెవరైనా ఆలయ రిజిస్టర్‌లో సంతకం చేయాల్సిందే అన్నారు. ఇప్పుడు లడ్డు రాజకీయం ఏ మలుపు తిరుగుతుందో చూడాలి. ప్రభుత్వం నియమించిన సిట్ దర్యాప్తులో తేలేదేమిటి, జరిగిందని చెబుతున్న లడ్డు నెయ్యి కల్తీ ఎప్పటికి నిర్ధారణ అయ్యేను, నిందితులుగా ఎవరిని తేల్చేను, ఏ శిక్షలు పడేను అన్నది భక్తులు నమ్మే ఆ భగవంతుడికే తెలియాలి. లడ్డు పరిణామాలతో అనేక ముఖ్య సమస్యలు జనం అజెండానుంచి మాయమయ్యాయి. ముఖ్యంగా ఇటీవలి వరదల్లో సంభవించిన భారీ నష్టానికి కేంద్రం నుంచి వరదలా సాయం వస్తుందని ఆశలు రేకెత్తించిన వారికి కనీసం మబ్బులు కూడా కనిపించటం లేదు.
తిరుమల దేవుడి మహిమల సంగతి తెలియదు.అఫ్ కోర్స్ నిజంగా మహిమే ఉంటే తన లడ్డూలో కల్తీ జరుగుతూ ఉంటే పట్టించుకోకపోవటమేమిటి, దాని పేరుతో రాజకీయం చేస్తుంటే ఉపేక్షించటం ఏమిటి అని ఎవరైనా ప్రశ్నిస్తే ఎవరూ మనోభావాలను గాయపరుచుకోనవసరం లేదు. దేవుడి లడ్డులో కల్తీ నెయ్యి దగ్గర ప్రారంభమైన వివాదం మలుపులు తిరుగుతూ మతం, సనాతన ధర్మ పరిరక్షణ వైపు పయనిస్తోంది. అనేక మంది నిజరూపాలను బహిర్గతం చేస్తోంది. మతం పేరుతో రాజకీయం, ఓటు బాంకులను ఏర్పాటు చేసుకొనే పార్టీల జాబితాలో బిజెపితో పాటు తెలుగుదేశం, జనసేన కూడా పోటీ పడుతోందన్నది తేలిపోయింది. అయితే దేశంలో మతరాజకీయాలు చేసే వారి గురించి జనం కళ్లు తెరుస్తున్న స్థితిలో ఆంధ్రులు అలాంటి తిరోగమన రాజకీయ వలలో పడతారా ? తిరుమల లేదా మరొక మతకేంద్రం కావచ్చు, మతేతరులు వాటిని సందర్శించాలని అనుకున్నపుడు అక్కడి ఆచారాలను గౌరవిస్తున్నట్లు అంగీకరించాలన్న నిబంధనలు, ఆచారాలు ఉన్నాయి. శుక్రవారం నాటి విలేకర్ల సమావేశంలో తాను వాటిని పాటించనని లేదా పాటిస్తానని గానీ జగన్ రెడ్డి ఎలాంటి ప్రకటన చేయలేదు. మరోసారి తిరుపతి వెళతానని కూడా చెప్పలేదు.
లడ్డు కల్తీ సంగతి విచారణ తరువాత ఏదో ఒకటి తేలుతుంది. కానీ ఈ వివాదం తెచ్చిన సమస్యలు మాత్రం ముందుకూడా కొనసాగుతాయి. భగత్ సింగ్, చేగువేరా భావజాలం కలవ్యక్తిగా అనేక మంది ఇప్పటివరకు పవన్ కల్యాణ్ గురించి భావిస్తున్నవారికి భ్రమలు తొలిగిపోయాయి. అఫ్‌కోర్స్ వారాహి పూజలను చూసినపుడే చాలా మందికి అర్ధమైంది. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి పాచిపోయిన లడ్డూలిచ్చిందని విమర్శించి తిరుమల లడ్డుకు మరోవిధంగా ప్రచారం కల్పించిన పవన్ కల్యాణ్ ఇప్పుడు ఆ లడ్డూతోనే రాజకీయం ఆడుతున్నారు. అందువలన కొత్త భక్తుడికి పంగనామాలెక్కువ అన్నట్లుగా ఆ పెద్దమనిషి సనాతన ధర్మం గురించి రెచ్చిపోయి మాట్లాడటం ఆశ్చర్యం కలిగించలేదు. ఎన్నో పుస్తకాలు చదివినట్లు చెప్పుకున్న మేథావికి సనాతన ధర్మం పేరుతో ఈ దేశంలో జరిగిన దారుణాలు, కలిగించిన హాని అర్ధం కాలేదా లేక పుస్తకాలు చదవటం అన్నది ఒట్టి కబుర్లేనా ? నిజంగా అర్ధమై ఉంటే కనీసం మౌనంగా ఉండేవారు తప్ప దాన్ని పరిరక్షిస్తానంటూ విరుచుకుపడేవారు కాదు. బంగ్లాదేశ్‌లో హిందువులను చంపివేసినపుడు ప్రకాష్ రాజ్ ఎక్కడకు వెళ్లారంటూ పవన్ కల్యాణ్ ప్రశ్నించారని ఒన్ ఇండియా అనే వెబ్‌సైట్ తన విశ్లేషణకు శీర్షిక పెట్టింది. అక్కడ జరిగిన వాటి గురించి వాస్తవాల కంటే అభూత కల్పనలే ఎక్కువ వచ్చాయి, కాదూ ఒక వేళ నిజమే అనుకుంటే నరేంద్రమోడీ, బిజెపి ఎందుకు పెద్దగా స్పందించలేదో చెప్పగలరా ? చిన్న పాటి విమర్శ, అభ్యంతరాన్ని కూడా బిజెపి, హిందూత్వశక్తులు సహించవు. ఆరునెలలకే వారు వీరవుతారన్నట్లుగా అంతకంటే ఎక్కువ కాలమే బిజెపితో బంధంలో ఉన్నందున అదే జరిగినట్లు కనిపిస్తోంది. అసలు లడ్డు వివాదం గురించి ప్రకాష్ రాజ్ అన్నదేమిటి ? ‘‘ ప్రియమైన పవన్ కల్యాణ్, ఇది మీరు ఉపముఖ్యమంత్రిగా ఉన్న రాష్ట్రంలో జరిగింది.దయచేసి దర్యాప్తు చేయండి.దోషులను పట్టుకోండి కఠినమైన చర్యలు తీసుకోండి. జాతీయ స్థాయిలో అనవసర భయాలను ఎందుకు వ్యాపింపచేస్తారు,ఎందుకు పెద్దదాన్ని చేస్తారు.మనకు ఇప్పటికే తగినంత మతతత్వం ఉంది(కేంద్రంలో ఉన్న మీ స్నేహితులకు కృతజ్ఞతలు) ’’ అని ఎక్స్‌లో పేర్కొన్నారు. దీని మీద పవన్ కల్యాణ్ విరుచుకుపడ్డారు. ‘‘ నేను ప్రకాష్ రాజ్‌ను ఇష్టపడతాను, ఆయన నాకు మంచి స్నేహితుడు, మేము గొప్ప బంధాన్ని పంచుకుంటాము.రాజకీయ అంశాల మీద మేము విబేధించవచ్చు గానీ, ఒక నటుడిగా నేను నిజంగా గౌరవిస్తాను. అయితే ఈ సమస్య మీద వ్యాఖ్యానించే అవసరం ఆయనకు లేదు ’’ అంటూ స్పందించారు. ప్రపంచంలోని వారందరూ స్పందిస్తున్నట్లు అనేక అంశాల మీద నిరంతరం తన భావాలను వెల్లడిరచే ప్రకాష్ రాజ్ దీని మీద మౌనంగా ఎలా ఉంటారు ? ఎందుకు ఉండాలి ? వద్దని చెప్పటానికి పవన్ కల్యాణ్ ఎవరు ? ఇదేమీ వ్యక్తిగత వ్యవహారం కాదు.
వన్ ఇండియా ఇంటర్వ్యూలో చెప్పినట్లు రాసిన అంశాలను బట్టి చూస్తే మామ తిట్టినందుకు కాదు తోడల్లుడు తొంగి చూసినందుకు విరుచుకుపడినట్లుగా పవన్ కల్యాణ్ తీరు ఉంది.‘‘ ప్రకాష్ రాజ్ వ్యాఖ్యలను చూస్తే రాజకీయ అంశాలను ముందుకు తెచ్చినట్లుగా ఉంది.బిజెపిని, ప్రధాని మోడీని చర్చలోకి లాగుతున్నారు. తానొక గొప్ప లౌకికవాదినని ఆయన భావిస్తున్నారు. అతని ఆలోచనలు ఎక్కడి నుంచి వస్తున్నాయో నాకు తెలుసు. నా ప్రశ్న ఏమిటంటే బంగ్లాదేశ్‌లో హిందువులను చంపివేస్తుంటే ఆయన ఎక్కడ ఉన్నారు ? దాని మీద మాట్లాడారా ? కానీ అనేక మంది లౌకికవాదులు హిందూ సమాజం మీద వ్యాఖ్యానించటం సులభం కానీ ఇతర మతాల వారి మీద వ్యాఖ్యానించటానికి భయపడతారు. వారికి లౌకిక వాదం అంటే ఒక వైపు మాత్రమే ప్రయాణించే దారి వంటిది, హిందూయిజం వెలుపల ఉన్న సమస్యలను విమర్శించటాన్ని తప్పించుకుంటారు. అందరి పట్ల సమంగా చూడకపోతే లౌకికత్వం అంటే ఏమిటి ? వ్యాఖ్యానించదలచుకున్నవారు అందరినీ ఒకేవిధంగా చూడాలి, దీన్నే సగటు భారతీయుడు వాంఛిస్తున్నాడు. మాట్లాడే ముందు వందసార్లు ఆలోచించాలి లేకపోతే మౌనంగా ఉండాలి ’’ ఇవన్నీ సంఘపరివారం స్కూల్లో బోధించే తర్కంలోని అంశాలే. ప్రతిదాన్నీ ప్రశ్నిస్తాను, అవసరమైతే తోలువలుస్తా, తాట తీస్తా అని మాట్లాడిన పవన్ కల్యాణ్ ఇలా మాట్లాడటం అవకాశవాదం తప్ప మరొకటి కాదు. అందుకే ప్రకాష్ రాజ్ పరోక్షంగా ఒక చురక అంటించారు. ‘‘ గెలిచే ముందు ఒక అవతారం, గెలిచిన తరువాత మరో అవతారం, ఏంటీ అవాంతరం … ఎందుకు మనకీ అయోమయం… ఏది నిజం, ఊరికే అడుగుతున్నా ’’ అంటూ ఒక ఎక్స్, ‘‘ చేయని తప్పుకి సారీ చెప్పించుకోవటంలో ఆనందమేమిటో, ఊరికే అడుగుతున్నా ’’ అంటూ మరో ఎక్స్‌లో స్పందించారు. అంతే కాదు, మరో ఎక్స్‌లో ఇలా పేర్కొన్నారు.‘‘ ప్రియమైన పవన్ కల్యాణ్ గారూ … మీ ప్రెస్ మీట్‌ను నేను చూశాను. నేను చెప్పిందేమిటి, మీరు దానికి వక్రభాష్యం చెప్పటం ఆశ్చర్యంగా ఉంది. నేను విదేశాల్లో షూటింగ్‌లో ఉన్నా, మీ ప్రశ్నలకు సమాధానం చెప్పటానికి నేను తిరిగి వస్తా, ఈ లోగా నేను ఇంతకు ముందు చేసిన ట్వీట్‌ను పూర్తిగా పరిశీలించండి, అవగాహన చేసుకోండి, ఊరికే అడుగుతున్నా ’’ అని పేర్కొన్నారు. సినిమా హీరో కార్తి ఎప్పుడూ నవ్వుముఖంతో కనిపిస్తాడు. లడ్డు గురించి అడిగితే అదే ముఖంతో అది సున్నితమైన అంశం అని చెప్పటాన్ని కూడా పవన్ కల్యాణ్ తప్పుపట్టారు.
ఎవరు ఎటు ఉన్నారో, ఎవరి రంగు ఏమిటో జనాలు గ్రహిస్తున్నారు. మాంసం తింటాంగనుక ఎముకలను మెడలో వేసుకు తిరుగుతాం అన్నట్లుగా తాము భారత మితవాదులమని సగర్వంగా చెప్పుకొనే పత్రిక ‘‘ స్వరాజ్య ’’. అది లడ్డు వివాదంపై ఒక విశ్లేషణకు ‘‘ తిరుపతి లడ్డు సమస్య : పవన్ కల్యాణ్ మీ ముఖంలో కనిపిస్తున్న హిందూయిజానికి ఆంధ్రలో స్వాగతం ’’ అని శీర్షిక పెట్టింది. పార్టీలతో నిమిత్తం లేకుండా మరింత మంది బిజెపి ఏతర పార్టీల నేతలు సనాతన ధర్మం గురించి మాట్లాడాలని తద్వారా హిందువుల ప్రయోజనాలు రక్షించబడతాయని నొక్కి వక్కాణించారు. సనాతన ధర్మ పరిరక్షణకు జాతీయ బోర్డు నెలకొల్పాలని పిలుపు ఇచ్చిన తరువాత సినిమా నటులు కార్తీ, ప్రకాష్ రాజ్ వ్యాఖ్యలపై గట్టిగా స్పందించారని ప్రశంసలు కురిపించారు. నీవెవరో తెలియలాంటే నీ స్నేహితులను చూస్తే చాలన్నది గత లోకోక్తి ఇప్పుడు నీ బండారం తెలియలాంటే నిన్ను పొగుడుతున్నవారిని చూస్తే చాలు అని చెప్పాల్సి వస్తోంది. పవన్ కల్యాణ్ గారు చెబుతున్న సనాతన ధర్మం ఈ దేశంలో దాదాపు నలభై కోట్ల మంది దళితులు, గిరిజనులను అంటరానివారిగా వేల సంవత్సరాల పాటు వెలివాడల్లో దూరంగా పెట్టింది. వెనుకబడిన తరగతుల వారినీ పరిమితం కావించింది. మహిళలను అణచివేసింది.శూద్ర కులాలకు చెందిన వారితో సహా అందరినీ విద్యకు దూరం చేసింది. అందుకే అంబేద్కర్ ఈ సనాతన వాదాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. పవన్ కల్యాణ్ ఆయనకంటే ఎక్కువ అధ్యయనం చేసి ఉంటారని అనుకోలేము. సనాతన వాదాన్ని పరిరక్షించాలని కోరుతున్నవారు నిజానికి ఎంత మంది దాని ప్రకారం నడుచుకుంటున్నారు. సనాతన వాదం మారేది కాదంటున్నారు. ఏక పత్నీవ్రతుడైన రాముడిని, బహుపత్నులున్న కృష్ణుడినీ ఒకే రకమైన భక్తితో సనాతనులు సమర్థిస్తున్నారు.వివాహ బంధంతో నిమిత్తం లేకుండా వేరేవారికి పిల్లలను కనటాన్ని కూడా మహాభారతంలో సమర్ధించారు. పెళ్లితో నిమిత్తం లేకుండా ఏళ్లతరబడి సహజీవనం చేసిన వారు, ఏ కారణంగా చెప్పకుండా భార్యలను వదలివేసిన వారూ, సనాతనంతో సంబంధం లేని ఆధునిక చట్టాల ప్రకారం విడాకులు తీసుకొని అనేక వివాహాలు చేసుకుంటున్నవారు కూడా సనాతన పరిరక్షణ గురించి మాట్లాడుతున్నారు. అదొక ఫాషనైపోయింది. సనాతనం గురించి మరొకదాని గురించి గతంలోనే అనేక చర్చలు జరిగాయి.ముఖం మీద నామం అడ్డంగా పెట్టుకోవాలా నిలువుగా పెట్టుకోవాలా అంటూ దాడులు చేసుకున్న సనాతనుల గురించి తెలిసిందే. ఇప్పటికీ దాని మీద ఏకీభావం లేదు. ఇప్పుడు అలాంటి వారంతా ఒకటై సనాతనాన్ని విమర్శించేవారి మీద దాడులకు దిగుతున్నారు. గతంలో లోకాయతులను అణచివేశారు. కొత్తగా మతం పుచ్చుకున్నవారు మరీ రెచ్చిపోతున్నారు. సనాతనం మనదేశాన్ని అభివృద్ధి చెందిన దేశాల బాటలో నిలుపలేదు. ఆ తిరోగమనవాదాన్ని పరిరక్షించి దేశాన్ని ముందుకు తీసుకుపోతామని చెబుతున్నవారు తాత్కాలికంగా ఓటు బ్యాంకులను సృష్టించుకోవచ్చు తప్ప దేశానికి చేసే మేలేమీ ఉండదు.
