నరేంద్రమోడీ దశాబ్ది పాలన : రాజస్థాన్‌లో సముద్రం, హిమాలయాల్లో వేడి కబుర్లు !

Tags

, , , ,


ఎం కోటేశ్వరరావు


మనం బుర్రను పక్కన పెట్టి చెవులప్పగిస్తే ఎదుటి వారు రాజస్థాన్‌లో సముద్రం, హిమాలయాల్లో భరించలేని వేడి, ఎండిపోయిన బంగాళాఖాతం అంటూ ఎన్నికబుర్లైనా చెబుతారు. ఈ మధ్యనే ప్రపంచ ఆర్థిక వేదిక మీద 34 ముప్పుల్లో తప్పుడు సమాచారంలో భారత్‌ మొదటి స్థానంలో ఉందని ప్రపంచవ్యాపితంగా1,490 వివిధ రంగాలకు చెందిన ప్రముఖులను సర్వే చేసినపుడు వెల్లడైన నిష్టుర సత్యం. విశ్వగురువుగా నరేంద్రమోడీకి ప్రపంచం నీరాజనాలు అర్పిస్తున్నదని చెబుతున్నవారు దీని గురించి ఏం చెబుతారో తెలియదు. అలాంటి ముప్పులో భాగమే ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఆర్థిక పరిస్థితి మీద విడుదల చేసిన శ్వేత పత్రంలోని అంశాలు. పదేండ్ల క్రితం తాము అధికారంలోకి వచ్చినపుడు దేశం సంక్షోభ స్థితిలో ఉందని, దాని గురించి చెబితే పెట్టుబడులు పెట్టేవారు ప్రతికూలంగా ఆలోచిస్తారని, అందుకే అప్పుడే శ్వేత పత్రం ప్రకటించకుండా ఇపుడు పరిస్థితి బాగుపడినందున విడుదల చేస్తున్నట్లు మొదటి పేరాలోనే జనాన్ని తప్పుదారి పట్టించారు.నిజంగా ఇప్పుడు పరిస్థితి బాగుపడిందా, దాని అర్ధం ఏమిటి ?


ఏటా రెండు కోట్ల ఉపాధిని పెంచుతామని 2014లో చెప్పారు. వాస్తవ పరిస్థితి ఏమిటి ? బిజెపి అధికారానికి రాకముందు ఉన్న సమాచారం ప్రకారం 2012లో నిరుద్యోగం 2.1శాతం అది 2018లో నేషనల్‌ సర్వే సంస్థ సమాచారం ప్రకారం 6.1శాతానికి చేరింది. దేశ కార్మికశక్తి సర్వేల ప్రకారం అంతకు ముందు 45 సంవత్సరాలతో పోలిస్తే అది అధికం. పదిహేను నుంచి 24 సంవత్సరాల యువతలో నిరుద్యోగం ఎంత అన్నది ప్రధానంగా చూడాలి. స్టాటిస్టా సంస్థ విశ్లేషణ ప్రకారం 2014లో మోడీ అధికారానికి వచ్చినపుడు 22.4శాతం మందికి ఉపాధి లేదు. తరువాత 2022లో 23.22 శాతం, తొమ్మిది సంవత్సరాల సగటు 24.74శాతం ఉంది. ఏటా రెండు కోట్ల ఉద్యోగాలను కల్పించి ఉంటే ఈ పెరుగుదల ఎలా సంభవించింది? మాక్రోట్రెండ్స్‌ సమాచారం ప్రకారం 15-24 ఏండ్ల వయస్సులోని యువత కార్మిక శక్తిలో 2014లో 31.64శాతం ఉండగా మోడీ ఏలుబడిలో 2022లో 28.04శాతానికి తగ్గింది. విద్య పెరిగిన కొద్దీ యువతలో నిరుద్యోగశాతం కూడా పెరుగుతున్నదనే అంశాన్ని ఎందుకు మూసిపెడుతున్నట్లు ? నరేంద్రమోడీ గొప్పగా చెప్పుకొనే నైపుణ్యం తీరు ఎలా ఉంది. 2021 భారత నైపుణ్య నివేదిక ప్రకారం దాదాపు సగం మంది డిగ్రీ కలిగిన వారు నిరుద్యోగులు. ప్రైవేటు కాలేజీలు పెరిగినందున నైపుణ్యాలు లేని పట్టాదారులు తామర తంపరగా పెరిగారన్నది మింగుడు పడని వాస్తవం. అందుకే ప్రభుత్వం 2015లో జాతీయ నైపుణ్య విధానాన్ని ప్రకటించింది.కార్మిక శక్తిలో 40 కోట్ల మందికి 2022 నాటికి నైపుణ్యాలను పెంచుతామని చెప్పారు. జరిగిందేమిటి ? 2012లో కార్మికశక్తిలో వృత్తి విద్యావంతులు లేదా శిక్షణ పొందిన వారు 2.3శాతం కాగా మోడీ గారి శిక్షణ తరువాత 2.4శాతానికి మాత్రమే పెరిగారు. కేంద్ర ప్రభుత్వం వెల్లడించిన సమాచారం ప్రకారం పిఎంకెవివై (నైపుణ్య శిక్షణ) మూడు రకాలుగా శిక్షణ పొందిన వారు 18-45-4 లక్షల మంది చొప్పున ఉన్నారు.వారిలో 14-43-7శాతాల చొప్పున ఉపాధి పొందినట్లు పేర్కొన్నారు.ఈ శిక్షణ తీరుతెన్నుల గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. సాంకేతిక విద్య అభ్యసించిన ఇంజనీరింగ్‌,పాలిటెక్నిక్‌ పూర్తి చేసిన వారిలో నిరుద్యోగం గత పది సంవత్సరాల్లో రెట్టింపైంది. మన దేశంలో 2030 వరకు ఉపాధిని కోరుకొనే వారి సంఖ్య ఏటేటా గణనీయంగా పెరగనుందని వర్తమాన ధోరణి వెల్లడిస్తోంది. అంటే నిరుద్యోగమూ పెరగనుంది.


కార్మిక శక్తిలో మొత్తంగా, ప్రత్యేకించి మహిళల శాతం పెరగటం లేదన్నది అందరికీ తెలిసిందే. ఎందుకు అన్నది సమస్య. అధికారానికి వచ్చిన తొలి రోజుల్లో విదేశాలు తిరిగి పెద్ద మొత్తంలో విదేశీ పెట్టుబడులు తెచ్చినట్లు నరేంద్రమోడీ చెప్పారు. పది సంవత్సరాల తరువాత జనానికి అందిన వాటి ఫలితాలేమిటో చెప్పరు. తమ వికసిత భారత్‌ నినాదంతో త్వరలో చైనా, అమెరికాలను మించిపోతామని చెబుతున్నారు. ఎంతగా చెట్టపట్టాలేసుకొని తిరుగుతున్నప్పటికీ మన దేశంలో పెట్టుబడి వాతావరణం వ్యాపారం చేసేందుకు పెద్ద సవాలుగా ఉందని 2022 నివేదికలో అమెరికా చెప్పింది. రక్షణాత్మక చర్యలు, భారతీయ ప్రమాణాల నుంచి అంతర్జాతీయ స్థాయికి చేరలేకపోవటం వంటి కారణాలను దానిలో పేర్కొన్నారు. అంతేకాదు ప్రపంచ ఆర్థిక స్వేచ్చ సూచిక 2023 నివేదిక ప్రకారం 131వ స్థానంలో మనదేశం ఉంది. ఆసియా-పసిఫిక్‌ ప్రాంతంలోని 39దేశాల్లో 27వదిగా ఉంది. దేశ ప్రతిష్టను, పలుకుబడిని పెంచానని, భారీ మొత్తంలో పెట్టుబడులను ఆకర్షిస్తున్నట్లు చెప్పుకోవటమే తప్ప కనిపించటం లేదు, విదేశీ పెట్టుబడుల ఆకర్షణలో 2022లో తొలి పది దేశాల్లో మనం పదవ స్థానంలో ఉన్నాం.మొదటి స్థానంలో ఉన్న అమెరికాకు 388, రెండవదిగా ఉన్న చైనాకు 180 బిలియన్‌ డాలర్లు వస్తే మన దేశానికి వచ్చింది 50బి.డాలర్లు. విదేశీ పెట్టుబడుల సంగతి అలా ఉంటే చైనా జిడిపిలో 50శాతం పెట్టుబడులు పెడుతుంటే మనదేశంలో 30శాతమే ఉంది. చైనా ఉత్పాదకరంగం జిడిపికి 30శాతం సమకూర్చుతుంటే మనదగ్గర 20శాతమే ఉంది. యుపిఏ పాలనలో ఎన్నివేల కిలోమీటర్ల రోడ్లు వేశారు, మా పాలనలో ఎలా వేశామో చూడండి అని బిజెపి అడ్డుసవాళ్లు విసురుతుంది. మౌలిక సదుపాయాలకు గాను 2013-14లో జిడిపిలో 1.7శాతం ఉన్న మొత్తాన్ని 2022-23లో 2.9శాతానికి పెంచాం చూడండి అని చెబుతారు. పదేండ్ల సగటు 1.93శాతం. ఇక్కడ సమస్య పెట్టుబడి వ్యయాన్ని పెంచాల్సిందేఅది అవసరాలకు తగినట్లుగా ఉండాలి. పారిశ్రామిక ఉత్పత్తి లేకుండా ఎన్ని రోడ్లు, రైలు మార్గాలువేసినా, ఓడరేవులను అభివృద్ధి చేసినా ప్రయోజనం ఏముంటుంది.


పెట్రోలు, డీజిలు మీద విపరీతంగా సెస్‌లను పెంచారు. ఎందుకు అంటే దేశ రక్షణకు డబ్బు ఎక్కడ నుంచి తేవాలనే మనోభావాన్ని ముందుకు తెచ్చారు. ఇది నిజమా ? కేంద్ర ప్రభుత్వ 2022-23 ఆర్థిక సర్వే60వ పేజీలో ఇచ్చిన సమాచారం ప్రకారం 2013-14లో జిడిపిలో 1.1శాతం కేటాయిస్తే 2022-23లో 0.9శాతంగా ప్రతిపాదించారు.పదేండ్ల సగటు 1.04శాతం. ఈ కాలంలో చేసిన అప్పులు 4.5 నుంచి 6.4శాతానికి చేరాయి. పదేండ్ల సగటు 4.99శాతం.దీనికి అనుగుణంగానే వడ్డీ చెల్లింపులు 3.3 నుంచి 3.6శాతానికి పెరిగాయి. అచ్చేదిన్‌ గురించి కబుర్లు చెప్పిన పెద్దలు సబ్సిడీ మొత్తాన్ని 2.3 నుంచి 1.2శాతానికి దిగ్గోశారు. పదేండ్ల సగటు 1.74శాతం. ముందే చెప్పినట్లుగా అవసరాలకు అనుగుణంగా మౌలిక సదుపాయాల ఖర్చు పెరగాలి. దాని కోసం సంక్షేమ కార్యక్రమాల ఖర్చు తగ్గింపు సమర్దనీయమా ? పారిశ్రామిక ఉత్పత్తి విలువ తమ ఏలుబడిలో ఎంత పెరిగిందో చూడమని మోడీ భక్తులు చెబుతారు. ఆ మేరకు ఉపాధి ఎందుకు పెరగలేదో చెప్పలేరు. మరోవైపు జిడిపిని ఎంత పెంచామో చూడండి అంటారు. ప్రపంచబాంకు విశ్లేషించినదాని ప్రకారం 2014లో మన పారిశ్రామిక ఉత్పత్తి విలువ 307బిలియన్‌ డాలర్లు, అది 2022 నాటికి 450 బి.డాలర్లకు పెరిగింది. ఇదే కాలంలో జిడిపిలో దాని వాటా 15 నుంచి 13.32శాతానికి దిగజారింది. కార్మిక శక్తిలో 15-24 సంవత్సరాల వయస్సు వారు ఎందరున్నారు అంటే 2014లో 31.64శాతం ఉంటే 2022 నాటికి 28.04కు పడిపోయింది. దీని అర్ధం ఏమిటి ఉపాధి రహిత వృద్ధి జరుగుతున్నది. దీని వలన కార్పొరేట్ల సంపద పెరుగుతుంది తప్ప జనానికి దక్కేదేముంది.


ఏ దేశమైనా ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నపుడు డిమాండ్‌ను పెంచేందుకు ప్రభుత్వాలు పెద్ద ఎత్తున పెట్టుబడులు పెడతాయి. దాని వలన వివిధ రంగాలు కొంత మేరకు సానుకూలంగా స్పందిస్తాయి. ఉదాహరణకు రోడ్ల నిర్మాణం జరిపితే సిమెంటు, ఉక్కు, చమురు, రోడ్డు నిర్మాణ వాహనాలు తదితర ఉత్పత్తులకు గిరాకీ పెరుగుతుంది. ఈ కారణంగానే 2020-21లో మూలధన వ్యయం కేంద్ర బడ్జెట్‌లో రు.4.26లక్షల కోట్లుండగా 2023-24లో రు.10లక్షల కోట్లకు పెంచారు.(ఎన్నికల సంవత్సరం కదా !) ఒక్కసారిగా ఇంత పెరుగుదల ఎప్పుడూ లేదు. రైల్వే, రోడ్లు,రక్షణ రంగం వాటా 66శాతం ఉంది. రాష్ట్రాలలో మౌలిక సదుపాయాలకు ఇచ్చే 50 ఏండ్ల వడ్డీ లేని రుణ మొత్తం అంతకు ముందు ఉన్న రు.76వేల కోట్లను 130వేల కోట్లకు పెంచారు. ఇదే సమయంలో కొన్ని రంగాలకు ఎలా కోతలు పెట్టారో చూద్దాం. 2009 తరువాత తొలిసారిగా సామాజిక సంక్షేమ ఖర్చు 18శాతానికి తగ్గింది.2023-24 బడ్జెట్‌లో రు.8.28లక్షల కోట్లుగా ప్రతిపాదించారు. అంతకు ముందు సంవత్సరం కంటే 56వేల కోట్లు తక్కువ. విద్యారంగానికి కేటాయింపులు 2009-2021 మధ్య 20 నుంచి 9శాతానికి తగ్గాయి. 2023-24లో 14శాతం ఉన్నప్పటికీ తక్కువే కదా ! గ్రామీణాభివృద్ధి కేటాయింపులు 28 నుంచి 19శాతానికి తగ్గాయి. ద్రవ్యోల్బణాన్ని పరిగణనలోకి తీసుకుంటే ఆరోగ్యం, విద్య, పోషకాహారం వంటి వాటికి తగ్గటం లేదా గిడసబారి ఉన్నాయి. పదకొండు సాంఘిక సంక్షేమ రంగాలలో కరోనాకు ముందు 2019-20లో ఉన్న కేటాయింపుల కంటే 2023-24లో ఐదింటిలో తగ్గాయి. అవి స్వచ్చ భారత్‌, సమగ్ర విద్యా శిక్షణ, గ్రామీణ ఉపాధి హామీ పధకం, జాతీయ ఆరోగ్య కార్యక్రమం. రాష్ట్రాలు తమ వాటాను చెల్లించని కారణంగా కొన్ని పధకాలకు నిధులు పెంచలేదని కేంద్ర అధికారులు చెప్పారు. ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని కొన్ని రంగాలకు పెంచారు.మొత్తంగా చూసినపుడు కార్పొరేట్లకు లబ్ది చేకూర్చే మౌలిక సదుపాయాలకు ఖర్చు పెంపుదల కోసం కోట్లాది మంది సంక్షేమానికి చేసే ఖర్చును కోత పెడుతున్నారు లేదా మంచం చాలకపోతే కాళ్లు ముడుచుకొని సర్దుకోమని చెప్పినట్లుగా చేస్తున్నారు.

ప్రహసన ప్రాయంగా పాకిస్థాన్‌ ఎన్నికలు !

Tags

, , , , ,


ఎం కోటేశ్వరరావు


ఫిబ్రవరి ఎనిమిదిన పాకిస్థాన్‌ జాతీయ అసెంబ్లీ(పార్లమెంట్‌), నాలుగు రాష్ట్రాల అసెంబ్లీల ఎన్నికలు జరిగాయి.రాష్ట్రాలలో ఒక్క సింధులో మాత్రమే పీపుల్స్‌ పార్టీకి స్పష్టమైన మెజారిటీ వచ్చింది. జాతీయ అసెంబ్లీ, మిగిలిన మూడు రాష్ట్రాలలో ఏ పార్టీకీ మెజారిటీ రాలేదు. జాతీయ అసెంబ్లీలో ఇమ్రాన్‌ ఖాన్‌ నాయకత్వంలోని నిషేధిత పాకిస్థాన్‌ తెహరిక్‌ ఏ ఇన్సాఫ్‌(పిటిఐ) పార్టీ మద్దతుదార్లు స్వతంత్ర అభ్యర్ధులుగా పోటీ చేసి ఇతర పార్టీల కంటే ఎక్కువ సీట్లు తెచ్చుకున్నారు. అసెంబ్లీలో మొత్తం 336 స్థానాలకు గాను 266 నియోజకవర్గాలలో ఎన్నికలు జరిగాయి. మిగిలిన 70 సీట్లలో 60 మంది మహిళలను రాష్ట్రాల వారీగా పార్టీలు తెచ్చుకున్న ఓట్లను బట్టి దామాషా పద్దతిలో నియమిస్తారు.దేశమంతటి నుంచి మరో పది మంది ముస్లిమేతర సామాజిక తరగతులకు చెందిన వారిని నామినేట్‌ చేస్తారు. ఎన్నికలు జరిగిన స్థానాలలో రెండు ఖాళీగా ఉన్నాయి. పార్టీల వారీ పిటిఐ బలపరిచిన స్వతంత్రులు 101 గెలిచినట్లు వార్తలు వచ్చాయి. ఇది రాసిన సమయానికి 91 మంది పిటిఐ స్వతంత్రులు, ముస్లింలీగ్‌(ఎన్‌) 80, పీపుల్స్‌ పార్టీ 54, ముత్తాహిదా క్వామీ మువ్‌మెంట్‌(ఎంక్యుఎం) 17 సీట్లు తెచ్చుకోగా ఐదుగురు ఇతర స్వతంత్రులు, మరో పది చిన్న పార్టీలకు 17 స్థానాలు వచ్చాయి. అంతిమంగా పార్లమెంటు సమావేశాల నాటికి పార్టీల బలాబలాల్లో మార్పులు ఉండవచ్చు. ఓటర్లలో 47శాతం మంది పాల్గొన్నారు.


నాలుగు రాష్ట్రాల ఎన్నికల వివరాలు ఇలా ఉన్నాయి. ఖైబర్‌ ఫక్తూన్‌లోని 145 మొత్తం స్థానాలకు గాను ఎన్నికలు జరిగిన 115లో 84 స్థానాలను పిటిఐ స్వతంత్రులు గెలుచుకున్నారు. అతి పెద్ద పంజాబ్‌లో 371కి గాను ఎన్నికలు జరిగిన 297లో ముస్లిం లీగుకు 137, పీటిఐ స్వతంత్రులు 116, పీపుల్స్‌ పార్టీ పది స్థానాలు గెలుచుకుంది.మరో రాష్ట్రమైన సింధులో 168కి గాను ఎన్నికలు జరిగిన 130లో పీపుల్స్‌ పార్టీ 84, ఎంక్యుఎం 28, పిటిఐ స్వతంత్రులు 11 మంది గెలిచారు. ఇక్కడ పీపుల్స్‌ పార్టీకి ఎవరి మద్దతు అవసరం లేకుండానే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉంది.బలూచిస్తాన్‌లో 65కు గాను ఎన్నికలు జరిగిన 51 చోట్ల పీపుల్స్‌ పార్టీ, జమాతే ఉలేమాకు పదకొండు చొప్పున ముస్లింలీగ్‌కు పది, మిగిలినవి స్వతంత్రులు, చిన్న పార్టీలకు వచ్చాయి. పంజాబ్‌లో ముస్లిం లీగ్‌కు మద్దతు ఇస్తామని, దానికి బదులు ప్రధాని పదవిని తమకు ఇవ్వాలని పీపుల్స్‌ పార్టీ తన డిమాండ్‌ను ముందుకు తెచ్చింది. పాకిస్థాన్‌లో 12.85కోట్ల మంది నమోదైన ఓటర్లు ఉన్నారు. వీరిలో 5.6 కోట్ల మంది 35 సంవత్సరాలలోపు వారే.36-45 సంవత్సరాల వారు 2.9 కోట్ల మంది.మొత్తం ఓటర్లలో మహిళలు 46శాతమే. కాశ్మీరు నుంచి ఆక్రమించుకున్న ప్రాంతంతో పాటు గిల్గిట్‌-బాల్టిస్థాన్‌కు జాతీయ అసెంబ్లీలో ప్రాతినిధ్యం లేదు. వాటిని స్వతంత్ర విముక్త ప్రాంతాలుగా ప్రకటించిన సంగతి తెలిసిందే. అక్కడ విడిగా ఎన్నికలు నిర్వహిస్తారు. జాతీయ అసెంబ్లీకి 5,121 మంది, నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో 12,695 మంది పోటీ చేశారు. వీరిలో 882 మంది మహిళలు, నలుగురు ట్రాన్స్‌ జెండర్లు ఉన్నారు.అభ్యర్దులలో 11,785 మంది స్వతంత్రులు, వారిలో 607 మంది మహిళలు.


పాకిస్థాన్‌ గద్దెమీద ఇమ్రాన్‌ ఖాన్‌ ఉండటం అమెరికాకు సుతరామూ ఇష్టం లేదు. అతగాడు చేసిన ”పాపం” ఏమిటంటే అమెరికాతో పాటు చైనా, రష్యాలతో కూడా సామరస్యంగా ఉండాలన్న వైఖరి తీసుకోవటమే. తటస్థంగా ఉండటం కూడా తమను వ్యతిరేకించటమే అన్నది అమెరికా భావన, అందుకే అనేక దేశాధినేతలను కుట్ర చేసి కూల్చివేసిన చరిత్ర తెలిసిందే. ఇస్లామాబాద్‌లో ఎవరు అధికారంలో ఉన్నప్పటికీ తమకు మాత్రమే విధేయత చూపాలని అది కోరుకుంటున్నది. ఉక్రెయిన్‌ మీద రష్యా ప్రారంభించిన సైనిక చర్య 2022 ఫిబ్రవరి 24 నుంచి జరుగుతున్న సంగతి తెలిసిందే. సరిగ్గా అదే రోజున మాస్కోలో వ్లదిమిర్‌పుతిన్‌-ఇమ్రాన్‌ ఖాన్‌ భేటీ జరిగింది. వివాదాన్ని సామరస్య పూర్వకంగా పరిష్కరించుకోవాలని ఖాన్‌ చెప్పాడు. రష్యాపై విధించిన ఆంక్షలను కూడా వ్యతిరేకించాడు. అది అమెరికాకు నచ్చలేదు. మార్చి నెల ఆరవ తేదీన ఇమ్రాన్‌ ఖాన్‌ ఒక పెద్ద బహిరంగ సభ నిర్వహించాడు. దానిలో ఒక కాగితాన్ని చూపుతూ ” రష్యాను ఖండించాలని, వ్యతిరేకంగా ఓటు వేయాలని కోరుతూ ఐరోపా యూనియన్‌ రాయబారులు ఒక లేఖ రాశారు. మీరు మా గురించి ఏమనుకుంటున్నారు. మీరేం చెబితే దాన్ని చేయటానికి మేము మీ బానిసలమా ? మేము రష్యాకు, అమెరికాకు, చైనాకు, ఐరోపాకూ స్నేహితులమే. మేము ఎవరి శిబిరంలోనూ లేము.పాకిస్థాన్‌ తటస్థంగా ఉంటుంది, ఉక్రెయిన్లో యుద్ధాన్ని ముగించేందుకు చూసేవారితో కలసి పని చేస్తుంది ” అని ప్రకటించాడు. ఆ మరుసటి రోజే కుట్రకు తెరలేచింది.


వాషింగ్టన్‌లో పాక్‌ రాయబారి అసాద్‌ మజీద్‌ ఖాన్‌తో జరిపిన సమావేశానికి దక్షిణ, మధ్య ఆసియా వ్యవహారాల అమెరికా సహాయ మంత్రి డోనాల్డ్‌ లు, మరో అధికారి వచ్చారు. ఆ సమావేశంలో డోనాల్డ్‌ లు మాటల సారం ఇలా ఉంది. ఉక్రెయిన్‌ అంశంలో పాక్‌ వైఖరి అమెరికా, ఐరోపాకు ఆందోళన కరంగా ఉంది. తటస్థం అని చెప్పుకోవచ్చుగాని అలా కనిపించటం లేదు. ప్రధాని మీద అవిశ్వాస తీర్మానం నెగ్గితే రష్యా పర్యటనను కేవలం ప్రధాని తీసుకున్న నిర్ణయంగా పరిగణించి మిగతా అందరినీ అమెరికా క్షమించి వేస్తుంది. లేకుంటే గట్టిగా వ్యవహరించాల్సి వస్తుంది. ఐరోపా దీన్ని ఎలా చూస్తుందో చెప్పలేము, నేననుకోవటం వారి స్పందన కూడా ఇలాగే ఉంటుంది. ఖాన్‌ గనుక అధికారంలో కొనసాగితే ఐరోపా, అమెరికా అతన్ని ఒంటరిపాటు చేస్తాయి. అమెరికా అధికారి మాట్లాడిన దాని మీద పాక్‌ రాయబారి స్పందన సారం ఇలా ఉంది. అమెరికా నేతల నుంచి ఎలాంటి స్పందన, సంప్రదింపులు లేవు.దీన్ని బట్టి మారు మాట్లాడకుండా మీకు అవసరమైన వాటన్నింటికీ పాకిస్తాన్‌ మద్దతు పలుకుతుందనే భావనలో మీరున్నట్లు, మమ్మల్ని ఖాతరు చేయటం లేదని మావారు అనుకున్నారు. ఉక్రెయిన్‌-రష్యా పోరు మన సంబంధాల మీద ప్రభావం చూపదు. దీని మీద లూ మాట్లాడుతూ మీరు అనుకుంటే అనుకున్నారు కొంత నష్టం జరిగినా అదేమీ పెద్దది కాదులే.ఖాన్ను సాగనంపిన తరువాత మన సంబంధాలు తిరిగి మామూలు స్థితికి చేరతాయి. ఇప్పటికే కొంత దెబ్బ తగిలింది. కొద్ది రోజుల్లో మీ దేశ రాజకీయ పరిస్థితి మారుతుందో లేదో చూద్దాం.మారితే ఈ సమస్య గురించి మాకు పెద్ద విబేధాలేమీ ఉండవు, లేదో దీని సంగతి తేల్చుకోవాల్సి ఉంటుంది, ఎలా అదుపులోకి తేవాలో నిర్ణయిస్తాం అన్నాడు. ఈ సమావేశం జరిగిన తరువాత మార్చి ఎనిమిదవ తేదీన అవిశ్వాస తీర్మానం పెట్టారు. నెల రోజుల తరువాత అమెరికా జోక్యం గురించి ఇమ్రాన్‌ ఖాన్‌ బహిరంగంగానే తన మద్దతుదారులతో సభలో చెప్పాడు.


అమెరికా సిఐఏ కుట్ర ప్రకారం సాకులు చూపి పాక్‌ చరిత్రలో తొలిసారి ఒక ప్రధాని మీద అవిశ్వాస తీర్మానం పెట్టి 2022 ఏప్రిల్లో ఖాన్ను పదవి నుంచి తొలగించారు. పిటిఐ పార్టీలో అంతర్గత ఎన్నికలు తమకు సంతృప్తి కలిగే విధంగా నిర్వహించలేదని సాధారణ ఎన్నికల్లో పోటీకి ఎన్నికల కమిషన్‌ అనర్హత వేటు వేసింది, ఎన్నికల చిహ్నం క్రికెట్‌ బాట్‌ను స్థంభింప చేసింది. దాంతో ఆ పార్టీ అభ్యర్ధులందరూ స్వతంత్రులుగా వేర్వేరు గుర్తులతో పోటీ చేయాల్సి వచ్చింది. వారంతా పార్లమెంటులో మరొక కొత్త పార్టీ పేరుతో ఒక బృందంగా ఏర్పడతారా, ఏం జరుగుతుందో తెలియని స్థితి. వారిని చేర్చుకొనేందుకు ప్రధాన పార్టీలు ప్రలోభాలు, బెదరింపులకు పాల్పడుతున్నట్లు వార్తలు. పాక్‌ నిబంధనల ప్రకారం వచ్చిన ఓట్ల దామాషా ప్రకారం పార్టీలకు నామినేటెడ్‌ సీట్లను కేటాయిస్తారు. పిటిఐ ప్రస్తుతం ఒక పార్టీగా గుర్తింపు లేనందున దానికి వచ్చే అదనపు సీట్లేమీ ఉండవు. గత ఎన్నికల్లో 31.82శాతం ఓట్లతో పెద్ద పార్టీగా అవతరించి 336కు గాను 149 సీట్లను కైవశం చేసుకుంది.ఈ సారి ఏ పార్టీ కూడా సంపూర్ణ మెజారిటీకి అవసరమైన 169 సీట్లను తెచ్చుకొనే పరిస్థితి లేదు. ముస్లింలీగ్‌, పీపుల్స్‌ పార్టీ సంకీర్ణ కూటమి సర్కార్‌ ఏర్పాటుకు పూనుకున్నట్లు వార్తలు. డెబ్బయి ఒక్క సంవత్సరాల ఇమ్రాన్‌ ఖాన్‌కు మూడు కేసుల్లో 31 సంవత్సరాల జైలు శిక్షతో పాటు పదేండ్ల పాటు ఏ ఎన్నికల్లోనూ పోటీ చేయకూడదనే అనర్హతను కూడా కోర్టు ప్రకటించింది.


ఈ పూర్వరంగంలో జరిగిన ఎన్నికలు ఎంత ప్రహసనంగా సాగిందీ అర్ధం చేసుకోవచ్చు. ఓట్ల రిగ్గింగు, లెక్కింపును సాగదీశారని, 24 చోట్ల గెలిచినట్లు ప్రకటించిన వారికి వచ్చిన మెజారిటీ కంటే చెల్లవని ప్రకటించిన ఓట్లే ఎక్కువని తేలింది. వాటిలో 13 సీట్లు ముస్లింలీగ్‌కు, ఐదు పీపుల్స్‌ పార్టీ, నాలుగు చోట్ల పిటిఐ-స్వతంత్రులు, మరోరెండు చోట్ల ఇతర స్వతంత్రులు గెలిచారు.ఎన్నో ఆరోపణలు వెల్లువెత్తినప్పటికీ 91 మంది పిటిఐ మద్దతుదార్లు గెలిచారంటే పాక్‌ ఓటర్లు ప్రజాస్వామ్యాన్ని కోరుకుంటున్నారని, మిలిటరీ, న్యాయవ్యవస్థ కుట్రలను వ్యతిరేకిస్తున్నారని, అన్నింటికీ మించి ముఖ్యంగా యువత అమెరికా పట్ల వ్యతిరేకతను వెల్లడిస్తున్నారన్నది స్పష్టంగా కనిపిస్తోంది. అనేక విదేశీ మీడియా సంస్థలు వెల్లడించిన అభిప్రాయం కూడా ఇదే. ఈ అక్రమాల గురించి పిటిఐ మద్దతుదార్లు, సాధారణ ప్రజానీకం ఎలా స్పందించేదీ చూడాల్సి ఉంది. దేశ రాజ్యాంగం ప్రకారం ఎన్నికల ఫలితాల నోటిఫికేషన్‌ వెలువడిన తరువాత 21రోజుల్లోపు(ఫిబ్రవరి 29) కొత్త పార్లమెంటు సమావేశం కావాల్సి ఉంది. అంతకు ముందే కూడా ఏర్పాటు కావచ్చు. తొలుత స్పీకర్‌ ఎన్నిక ,తరువాత సభా నేత ( ప్రధాని )ఎన్నిక నిర్వహిస్తారు. ఈ పదవికి ఎందరైనా పోటీ పడవచ్చు. సాధారణ మెజారిటీ 169 ఓట్లు తెచ్చుకున్నవారిని విజేతగా ప్రకటిస్తారు. ఆ మేరకు రాకపోతే ఎక్కువ ఓట్లు తెచ్చుకున్న తొలి ఇద్దరి మధ్య మరోసారి ఎన్నిక నిర్వహిస్తారు. తొలి రోజు సభ్యుల ప్రమాణ స్వీకారం, మార్చినెల ఒకటిన స్పీకర్‌, రెండవ తేదీ ప్రధాని ఎన్నిక జరుగుతుంది. తరువాత సెనెట్‌ ఎన్నికలు జరుగుతాయి.


1985లో పార్టీ రహిత ప్రాతిపదికన ఎన్నికలు జరిగాయి. గెలిచిన వారందరినీ స్వతంత్రులుగా పరిగణించారు. తరువాత అత్యధికులు తాము పాకిస్థాన్‌ ముస్లిం లీగ్‌ అనే పార్టీగా ఏర్పడినట్లు ప్రకటించుకున్నారు. తరువాత ఆ పార్టీలో చీలికలు వచ్చాయి.ఇప్పుడు కూడా పిటిఐ మద్దతుతో గెలిచిన స్వతంత్రులు ఏదో ఒక పార్టీ పేరుతో ఏర్పడతారా లేదా అన్నది చూడాల్సి ఉంది.ఒక వేళ అలా ఏర్పడితే ప్రభుత్వం వేధింపులకు పాల్పడే అవకాశం ఉంది. ఇప్పటికే అనేక మందిని అకర్షించేందుకు ప్రధాన పార్టీలు బేరసారాలు, బెదిరింపులకు దిగినట్లు వార్తలు వచ్చాయి. అందువలన పార్లమెంటు సమావేశం నాటికి పార్టీల బలాబలాల్లో మార్పులు జరిగే అవకాశం లేకపోలేదు. నోటిఫికేషన్‌ ఇచ్చిన తరువాత మూడు రోజుల్లో స్వతంత్ర అభ్యర్ధులు పార్టీలను ఎంచుకోవచ్చు. తరువాత పార్టీలకు వచ్చిన ఓట్ల దామాషాలో నామినేటెడ్‌ సీట్లను కేటాయిస్తారు. తరువాత అసెంబ్లీ సమావేశం జరుగుతుంది.

నాడు రోడ్లపై మేకులు – నేడు రైతులను బందెల దొడ్లో పెట్టాలన్న కేంద్రం ! వీపులు పగలగొట్టి అడ్డుకోవాలన్న పోలీసు బాస్‌ !!

Tags

, , , , ,


ఎం కోటేశ్వరరావు


మరోసారి రైతులు ఢిల్లీబాట పట్టారు.వారిని ఎట్టి పరిస్థితిలోనూ నగరంలో ప్రవేశించకుండా అడ్డుకొనేందుకు బిజెపి సర్కార్‌ పూనుకుంది. అనేక చోట్ల రైతుల మీద బాష్పవాయువు, లాఠీ ఛార్జీ జరిపారు, అడుగడుగునా హర్యానా బిజెపి ప్రభుత్వం ఆటంకాలు కల్పించింది. ఉత్తర ప్రదేశ్‌ నుంచి ఢిల్లీలోకి ప్రవేశించే మార్గాలలో కూడా రవాణాకు తీవ్ర అంతరాయం కలిగింది. ఈ ఆందోళనకు సంయుక్త కిసాన్‌ మోర్చా(ఎన్‌పి-రాజకీయ రహిత) పిలుపు నిచ్చింది. గతంలో ఏడాది పాటు ఆందోళన నిర్వహించిన సంయుక్త కిసాన్‌ మోర్చా(ఎస్‌కెఎం) నుంచి విడిపోయిన వారు, గత ఆందోళనకు దూరంగా ఉన్న కొని సంఘాలు తాజా ఆందోళనకు పిలుపునిచ్చాయి. గతంలో రైతులు ఢిల్లీలో ప్రవేశించి తమ డిమాండ్ల మీద నిరసన తెలుపకుండా అడ్డుకొనేందుకు రోడ్ల మీద మేకులు, కాంక్రీటు దిమ్మలను ఏర్పాటు చేసిన నరేంద్రమోడీ సర్కార్‌ తీరు తెలిసిందే.ఇప్పుడు ఢిల్లీలో ఉన్న బవనా స్టేడియంను బందెల దొడ్డిగా మార్చి రైతులను అందులో నిర్బంధించేందుకు అవకాశమివ్వాలని మంగళవారం నాడు ఢిల్లీ ప్రభుత్వాన్ని కోరింది. రైతుల ఆందోళన వలన రోడ్లు, రైలు ప్రయాణీకులకు ఇబ్బందులు కలుగుతాయి గనుక రైతుల మీద చర్యలు తీసుకొనే విధంగా రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించాలంటూ అరవింద్‌ సేత్‌ అనే లాయరు పంజాబ్‌-హర్యానా హైకోర్టులో ప్రజా ప్రయోజన వాజ్యం దాఖలు చేశారు..రైతులు న్యూసెన్సు చేస్తున్నారని ఆరోపిస్తూ వారు బలవంతంగా నగరంలోకి అడుగుపెట్టకుండా చర్యలు తీసుకోవాలని సుప్రీం కోర్టు బార్‌ అసోసియేషన్‌ ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్‌ను కోరింది. ఇలాంటి వారు అదే రైతులకు కనీస మద్దతు ధరల కోసం వేసిన కమిటీ నివేదికను వెంటనే ఇప్పించి రైతులు ఆందోళనకు దిగకుండా చూడాలని కేంద్రం మీద ఎలాంటి వాజ్యాలు ఇంతవరకు దాఖలు చేయలేదు.నోరులేని రైతులను అడ్డుకొనేందుకు పూనుకున్నారు. రైతులు వినకుండా దురుసుగా ముందుకు వస్తే పోలీసులు చూస్తూ ఊరుకోవాల్సిన అవసరం లేదని, మనం కూడా అదే పద్దతిలో ఉండాలని లేకపోతే వారిని అపలేమని ఢిల్లీ శాంతి భద్రతల స్పెషల్‌ పోలీసు కమిషనర్‌ రవీంద్ర యాదవ్‌ ఢిల్లీ శివార్లలోని శింఘు సరిహద్దులో పోలీసులతో మైకులద్వారా ప్రకటించారు.మనం ఆత్మరక్షణలో పడనవసరం లేదు, బాష్పవాయువు వదలండి, లాఠీలను ప్రయోగించండి, ఇది ఒక రోజంతా జరగవచ్చు అని కూడా చెప్పారని మంగళవారం రాత్రి పొద్దుపోయిన తరువాత ఎకనమిక్‌ టైమ్స్‌ పత్రిక ఇచ్చిన వార్తలో పేర్కొన్నది. ఎవరైనా అలసిపోతే వారి స్థానంలో వేరొక బృందం వస్తుందని, ఎట్టి పరిస్థితిలోనూ రైతులను నగరంలోకి అనుమతించవద్దని కూడా చెప్పినట్లు తెలిపింది.


రైౖతుల డిమాండ్లు న్యాయబద్దమైనవని అందువలన స్టేడియంను జైలుగా మార్చాలన్న కేంద్ర కోరికను తాము అంగీకరించేది లేదని ఢిల్లీ ఆమ్‌ ఆద్మీ ప్రభుత్వం తిరస్కరించింది. రైతులతో చర్చించి పరిష్కరించాలని కోరింది. శాంతియుతంగా నిరసన తెలిపే రాజ్యాంగబద్దమైన హక్కు ప్రతి పౌరుడికీ ఉన్నదని అందువలన రైతులను అరెస్టు చేయటం సరైంది కాదని ఢిల్లీ హౌం మంత్రి కైలాష్‌ గెహలట్‌ చెప్పారు. ఢిల్లీ పోలీసు యంత్రాంగం కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉంటుందన్న సంగతి తెలిసిందే. తమ డిమాండ్ల మీద నిరసన తెలిపేందుకు మంగళవారం నాడు ఢిల్లీ వస్తున్న రైతులను అనేక చోట్ల పోలీసులు అడ్డుకున్నారు. పంజాబ్‌ నుంచి వస్తున్న వారి మీద హర్యానా బిజెపి ప్రభుత్వ పోలీసులు లాఠీ చార్జి చేశారు. రైతులు అన్నదాతలు, వారి పట్ల ఈ విధంగా ప్రవర్తించటం పుండు మీద కారం చల్లినట్లే, స్టేడియంను జైలుగా మార్చాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయంలో భాగస్వాములం కాలేమని కైలాష్‌ గెహలట్‌ కేంద్రానికి రాసిన లేఖలో పేర్కొన్నారు.2021లో రైతుల ఆందోళన సందర్భంగా కూడా అదే స్టేడియంను జైలుగా మార్చాలని కోరిన నాటి కేంద్ర ప్రభుత్వ కోరికను అప్పుడు కూడా ఆమ్‌ ఆద్మీ సర్కార్‌ తిరస్కరించింది.


ఇటీవలనే ప్రముఖ వ్యవసాయ ఆర్థికవేత్త ఎంఎస్‌ స్వామినాధన్‌కు కేంద్ర ప్రభుత్వం భారత రత్న గౌరవ పురస్కారాన్ని ప్రకటించింది. ఆయన సూచించిన పద్దతిలో రైతాంగానికి కనీస మద్దతు ధరలు ప్రకటించేందుకు, వాటికి చట్టబద్దత కల్పించేందుకు మొరాయిస్తున్నది.కనీస మద్దతు ధరలకు చట్టబద్దత కల్పించటం మినహా రైతులు ఏమైనా కోరుకోవచ్చని ఏడాది పాటు సాగిన రైతుల ఆందోళన సందర్భంగా బిజెపి నేతలు చెప్పారు. విధిలేని పరిస్థితిలో ప్రధాని నరేంద్రమోడీ దేశానికి క్షమాపణలు చెప్పి మూడు సాగు చట్టాలను వెనక్కు తీసుకున్నట్లు ప్రకటించారు, కనీస మద్దతు ధరల గురించి సిఫార్సు చేసేందుకు ఒక కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ఆ మేరకు ఆరునెలల తరువాత 2022 జూలై 18న 26 మందితో కమిటీని ప్రకటించారు.దానిలో అందరూ ప్రభుత్వానికి మద్దతు ఇచ్చేవారు, మూడు సాగు చట్టాలను రూపొందించిన పెద్దలే ఉన్నందున తామా కమిటీని బహిష్కరిస్తున్నట్లు సంయుక్త కిసాన్‌ మోర్చా (ఎస్‌కెఎం) ప్రకటించింది. తరువాత ఆ కమిటీ ఏం చేస్తున్నదో, ఏం చెబుతుందో తెలియదు.
తమ ప్రభుత్వ హయాంలో 2014-15లో ఏ గ్రేడ్‌ వరి మద్దతు ధర రు.1,400 నుంచి 2023-24లో రు.2,203కు అంటే రు 803 పెంచినట్లు మోడీ సర్కార్‌ చెప్పుకున్నది.సగటున వార్షిక పెంపుదల 5.7శాతం. అంతకు ముందు కాంగ్రెస్‌ ఏలుబడిలో 2004-05 రు.590 నుంచి రు.1,400కు పెరిగింది. రు.810 పెరిగింది. దీన్ని సగటు వార్షిక పెరుగుదలలో చూస్తే 14శాతం ఉంది. పొడవు పింజ పత్తి ధర రు.1,760 నుంచి కాంగ్రెస్‌ ఏలుబడిలో రు.4,050 పెరిగింది. నిఖర పెరుగుదల రు.2,290 వార్షిక సగటు 13శాతం, అదే నరేంద్రమోడీ కాలంలో రు.4050 నుంచి రు.7,020కి పెంచారు.నిఖర పెరుగుదల రు.2,970 కాగా వార్షిక సగటు 7.3శాతమే. దీని అర్ధం కాంగ్రెస్‌ రైతులను ఏదో ఉద్దరించిందని చెప్పటం కాదు, పెరిగిన సాగు ఖర్చులతో పోలిస్తే అది కూడా తక్కువే. దానితో పోలిస్తే మంచి రోజులను తెచ్చి అమృత కాలంగా మార్చి రైతుల రాబడి రెట్టింపు చేస్తామన్న నరేంద్రమోడీ పాలనలో మరింత దిగజారింది అని చెప్పేందుకే ఈ పోలిక.ఎంఎస్‌ స్వామినాధన్‌ కమిషన్‌ చేసిన సిఫార్సులను పక్కన పెట్టి వార్షిక ద్రవ్యోల్బణ ప్రాతిపదికన నామమాత్రంగా పెంచుతున్నారు తప్ప సాగు ఖర్చులను పరిగణనలోకి తీసుకోవటం లేదు.


కేంద్రం ఏర్పాటు చేసిన ఆ కమిటీ పరిధి ఏమిటి ? ఏ అంశాలను అది పరిశీలిస్తుందో వివరించాలని రైతు ఉద్యమం నడిపిన సంయుక్త కిసాన్‌ మోర్చా కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాస్తే సమాధానం లేదు. అందువలన ఆ కమిటీలో ఉండి చేసేదేమీ లేదు గనుక ప్రతినిధుల పేర్లను ప్రతిపాదించటం లేదని స్పష్టం చేసింది. ఈ కమిటీ చైర్మన్‌ ఎవరంటే రైతులు తిరస్కరించిన మూడు సాగు చట్టాలను రచించిన వ్యవసాయశాఖ మాజీ కార్యదర్శి సంజయ అగర్వాల్‌. ఆ చట్టాలను ఎలా రూపొందించాలో సలహా ఇచ్చిన రమేష్‌ చాంద్‌ నీతిఅయోగ్‌ సభ్యులు.కనీస మద్దతు ధరలకు చట్టబద్దత కల్పించకూడదని చెప్పిన ఆర్థికవేత్తలను నిపుణుల పేరుతో చేర్చారు. ప్రభుత్వ ప్రతినిధులు సరేసరి, వీరుగాక రైతుల ఆందోళనను వ్యతిరేకించిన ఐదు సంఘపరివార్‌ సంఘాలకు చెందిన వారిని చేర్చారు. ఆందోళనకు నాయకత్వం వహించిన వారిని మూడు పేర్లు ఇవ్వాలని కోరారు. మూడు సాగు చట్టాలను అమలు జరపకుండా 2022 నాటికి రైతుల రాబడిని రెట్టింపు చేయటం కుదరదని నీతిఅయోగ్‌ సభ్యులు రమేష్‌ చాంద్‌ రైతుల ఆందోళన సమయంలో చెప్పారు.ఇటీవలి కాలంలో ఎక్కడా దాని గురించి ప్రధాని నరేంద్ర మోడీ మాట్లాడటం లేదు.


తాజాగా ఢిల్లీ చలో ఆందోళనకు పిలుపు ఇచ్చి ఎస్‌కెఎం(ఎన్‌పి), కిసాన్‌ మజ్దూర్‌ మోర్చా ముందుకు తెచ్చిన డిమాండ్లు పాతవే.ఎవరు పిలుపునిచ్చినా సమర్ధించాల్సినవే.పంజాబ్‌ నుంచి వస్తున్న రైతులు ఢిల్లీ చేరకుండా హర్యానా పోలీసులు పంజాబ్‌ సరిహద్దులోని పాటియాలా సమీపంలోని షాంభు వద్ద అడ్డుకున్నారు. రైతుల మీద బాష్పవాయు ప్రయోగం చేశారు. కనౌరీ వద్ద లాఠీ ఛార్జి చేశారు.అనేక చోట్ల రోడ్ల మీద పోలీసులు కల్పించిన ఆటంకాలను పక్కకు తొలగించి రైతులు ముందుకు వస్తున్నారని వార్తలు. చర్చలు జరపాలి తప్ప ఢిల్లీ వెళ్ల వద్దని హర్యానా హౌంమంత్రి అనిల్‌ విజి రైతులకు సలహా ఇచ్చారు.రెండుసార్లు కేంద్ర మంత్రులు ఇక్కడకు వచ్చారు. రైతులు వారితో మాట్లాడలేదంటే దీని వెనుక ఏదో దురుద్దేశ్యం ఉందని ఆరోపిస్తూ రాష్ట్రంలోకి రానిచ్చేది లేదని అన్నారు. కనీస మద్దతు ధరలకు అనేక మందితో చర్చలు జరపాల్సి ఉందని, రైతులు కూడా మాట్లాడాలని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి అర్జున్‌ ముండా చెప్పారు. మంగళవారం నాడు ఢిల్లీకి దారితీసే అనేక మార్గాలలో రవాణాకు తీవ్ర అంతరాయం కలిగింది.నగరంలో అనేక మెట్రో స్టేషన్లను మూసివేశారు.

ఆంధ్రప్రదేశ్‌లో కంపుకొడుతున్న అవకాశవాదం – దివాలా కోరు, అసంబద్ద వాదనలు !

Tags

, , , , , , , , ,


ఎం కోటేశ్వరరావు


రానున్న అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల ప్రకటన నాటికి ఏవైనా అనూహ్య మలుపులు తిరిగితే తప్ప ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాలలో తెలుగుదేశం-జనసేన-బిజెపి ఒక కూటమిగా, వైసిపి విడిగా, ఇండియా కూటమిలోని కాంగ్రెస్‌,వామపక్షాలు,ఇతర కొన్ని పార్టీలు, శక్తులు ఒక కూటమిగా పోటీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. వీటి పట్ల జనం ఎలా స్పందిస్తారన్నది ఎత్తులు, పొత్తులు ఒక కొలిక్కి వచ్చిన తరువాత, ఇతర అంశాల మీద ఆధారపడి ఉంటుంది. మూడు ప్రధాన ప్రాంతీయ రాజకీయ పార్టీలు నోటాకంటే తక్కువ ఓట్లున్న బిజెపి చుట్టూ తిరగటం అనేక మందికి జీర్ణం కావటం లేదు. వైసిపి విషయానికి వస్తే తన సంక్షేమ పధకాలను చూసి ఓటేయమంటోంది. ఇప్పుడున్న వాటిని మరింత మెరుగుపరుస్తామని, కొత్త వాటిని అమలు చేస్తామని తెలుగుదేశం-జనసేన చెబుతున్నాయి. తమ కూటమి కేంద్రంలో అధికారానికి వస్తే ప్రత్యేక హౌదా అమలు చేస్తుందని కాంగ్రెస్‌ ప్రచారం చేస్తున్నది. సంక్షేమ పథకాలు అమలు చేస్తే రాష్ట్రాలు రుణ ఊబిలో కూరుకుపోతాయని చెబుతున్న బిజెపి ఏం చెబుతుందో చూడాలి. వివిధ పార్టీలు, కొన్ని శక్తులూ ముందుకు తెచ్చిన కొన్ని దివాలాకోరు, అసంబద్ద వాదనల గురించి చూద్దాం.


అధికార వైసిపిని ఓడించేందుకు బిజెపితో నిమిత్తం లేకుండానే తెలుగుదేశం-జనసేన కూటమికి తగిన మద్దతు ఉందని, బిజెపితో పొత్తును తెలుగుదేశంలోనే కొందరు వ్యతిరేకిస్తున్నారని అంటూనే విధిలేని పరిస్థితిలో బిజెపితో చేతులు కలపక తప్పదు అని చేదు మాత్రను మింగించేందుకు చూస్తున్నారు. ఎందుకటా ? వచ్చే ఎన్నికలు సజావుగా జరగాలంటే కేంద్రం, ఎన్నికల కమిషన్‌ సహకారం అవసరం గనుక బిజెపితో దోస్తీ అవసరమట.ఎన్నికలను సక్రమంగా జరపటం ఎన్నికల కమిషన్‌ విధి. దాన్ని ప్రసన్నం చేసుకోవాలంటే బిజెపిని భుజాల మీద ఎక్కించుకొని మోయాలని చెప్పటమే. గత ఐదు సంవత్సరాలలో ఎన్నికల జాబితాలో జరిగిన అక్రమాల గురించి తెలుగుదేశం, జనసేన, ా బిజెపి లేవనెత్తిన అంశాలను ఎన్నికల సంఘం పెద్దగా పట్టించుకోలేదు. తెలుగుదేశం నేత చంద్రబాబును బిజెపి పెద్దలు పిలవగానే సిద్దం సుమతీ అన్నట్లు వెళ్లారు. వెంటనే ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి పొలో మంటూ ఢిల్లీ యాత్ర చేశారు. మరికొన్ని శాలువాల ఖర్చు దండగ. ఎందుకయ్యా అంటే రాష్ట్రానికి రావాల్సిన నిధుల గురించి అడగటానికని వైసిపి పెద్దల వివరణ. తాటి చెట్టు ఎందుకు ఎక్కావంటే దూడగడ్డి కోసం అన్నట్లుగా ఉంది. కేంద్ర ప్రభుత్వం తన చివరి(ఓట్‌ఆన్‌ఎకౌంట్‌) బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది. వైసిపి కూడా ఓట్‌ ఆన్‌ ఎకౌంట్‌తో సరిపుచ్చింది. ఇప్పుడు నిధుల గురించి అడిగితే పట్టించుకొనేదెవరు ? పక్కా రాజకీయ యాత్ర మాత్రమే. గత ఐదేండ్లుగా అన్ని సందర్భాలలో మద్దతు ఇచ్చి ఆదుకున్నట్లుగానే రానున్న రోజుల్లో కూడా విధేయులుగా ఉంటామని, తెలుగుదేశాన్ని నమ్మవద్దని చెప్పేందుకు తప్ప ఢిల్లీ పర్యటన వెనుక మరొక కారణం కనిపించటం లేదు.


నరేంద్రమోడీ ఎంతో బలంగా ఉన్నారని అందువలన కేంద్రాన్ని ఎదిరించి చేసేదేమీ లేదని పిరికిమందు నూరిపోస్తున్న వారిని ఏమనాలి. అలాంటపుడు ఆ బిజెపి మందలోనే చేరిపోవచ్చు, వేర్వేరు పార్టీల దుకాణాలు ఎందుకు ! బతికిన చేప ఎదురీదుతుంది చచ్చిన చేప వాలునబడి కొట్టుకుపోతుంది. స్వాతంత్య్ర ఉద్యమ సమయంలో కూడా రవి అస్తమించని బ్రిటీష్‌ సామ్రాజ్యాన్ని మనం ఎదిరించలేమంటూ దాని మోచేతి నీళ్లు తాగుదామని చెప్పిన వారు ఆ రోజుల్లో కూడా ఉన్నారు. ఫలితంతో నిమిత్తం లేకుండా చేయాల్సింది చేశామా లేదా అన్నదే గీటురాయి. కేంద్రంలో ఉన్న పాలకులు రాష్ట్రాలకు అన్యాయం చేస్తుంటే, అనుచిత పద్దతులకు పాల్పడుతుంటే రాష్ట్రాల హక్కులు, ప్రజల కోసం పోరాడాలి, మెడలు వంచాలి తప్ప మోకాళ్ల మీద కూర్చుంటే కనికరిస్తారా ? ఎన్‌టి రామారావు ప్రభుత్వాన్ని అక్రమంగా కూల్చివేసినపుడు ఆ నాటి తిరుగులేని బలమైన కాంగ్రెస్‌కు తెలుగుదేశం లొంగిపోయి మీ అడుగుజాడల్లో నడుస్తామని చెప్పలేదు, జనాన్ని వీధుల్లోకి సమీకరించి ఆందోళన చేసి పునరుద్దరణ జరిపించుకున్న చరిత్రను తెలుగుదేశం మరిచినా జనం మరిచిపోతారా ?


నాదెండ్ల భాస్కరరావు రూపంలో తిరుగుబాటు చేయించి ఎన్‌టి రామారావు సర్కార్‌ను కూలదోయించింది కాంగ్రెస్‌ పార్టీ. నేడు బిజెపి వివిధ రాష్ట్రాలలో అంతకంటే తక్కువ చేస్తున్నదా ? రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్రంతో సయోధ్యతో ఉండాలని కాంగ్రెస్‌కు ఏనాడైనా తెలుగుదేశం మద్దతు ఇచ్చిందా ? మరి ఇప్పుడెందుకు ఆ పేరుతో బిజెపిని మోసేందుకు సాకులు వెతుకుతున్నట్లు ? తెలుగుదేశం పార్టీని దెబ్బతీసేందుకు కాంగ్రెస్‌ ప్రయత్నించింది అని చెప్పవచ్చు, బిజెపి చేసిందేమిటి ? తెలుగుదేశం రాజ్యసభ పక్షం మొత్తాన్ని తనలోనే విలీనం చేసుకుంది కదా ! వాజ్‌పాయి సర్కారుకు తెలుగుదేశం మద్దతు ఇచ్చింది. స్పీకరు పదవి(జిఎంసి బాలయోగి)ని కూడా తీసుకుంది. నాడు రాష్ట్రానికి కేంద్రం నుంచి శాశ్వతంగా గుర్తుపెట్టుకోదగిన పెట్టుబడులు గానీ, మరొకటి గానీ ఏమీ రాలేదు. దేశం వెలిగిపోతోంది అంటూ బిజెపితో కలిసి పోటీ చేసి 2004 ఎన్నికల్లో ఓడిన తరువాత తిరిగి బిజెపితో చేతులు కలిపేది లేదని తెలుగుదేశం ప్రకటించిన అంశాన్ని మరచిపోలేము. పదేండ్ల పాటు ప్రతిపక్షంలో ఉండి 2014లో తిరిగి అదే బిజెపితో చేతులు కలిపి ఎన్నికల్లో నెగ్గారు. పోనీ అప్పుడేమైనా సాధించారా అంటే ఏమీ లేదని అందరికీ తెలిసిందే. ప్రత్యేక హౌదా లేదని నరేంద్రమోడీ అడ్డం తిరిగితే సరే అన్నారు, దాని బదులు ప్రత్యేక పాకేజీ అంటే మహాభాగ్యం జీహుజూర్‌ అంటూ తల ఊపారు. చివరికి దానికి కూడా మొండి చేయి చూపితే బిజెపితో తెగతెంపులు చేసుకున్నారు.2019 ఎన్నికల్లో ప్రత్యర్ధులుగా ఎంతటి తీవ్ర విమర్శలు చేసుకున్నారో తెలిసిందే.


ఇప్పుడు అవన్నీ విస్మరించి రాష్ట్రం కోసం జనాన్ని కూడా మరచిపొమ్మంటున్నారు. తాము నందంటే నంది పందంటే పంది అనాలని చెబుతున్నారు. పోనీ ఇప్పుడు బిజెపి పెద్దలు విభజన హామీల అమలు గురించి, రాష్ట్రానికి చేయాల్సిన వాటి గురించి మారుమనసు పుచ్చుకున్నారా అంటే దుర్భిణివేసి చూసినా కనిపించటం లేదు. రేపు బిజెపి తిరిగి కేంద్రంలో అధికారానికి వస్తుందో రాదో తెలియదు, వచ్చినా గత పది సంవత్సరాల ఆచరణను బట్టి రాష్ట్రానికి ప్రత్యేక హౌదా లేదా దానికి సమానమైన ప్రత్యేక పాకేజీ ఇచ్చే సమస్యే లేదు. విభజన హామీల్లో ఒకటైన విశాఖ రైల్వే జోన్‌ గురించి తెలుగుదేశం-బిజెపి ఉమ్మడి పాలనలో ఒక్క అడుగూ ముందుకు పడలేదు. ఎందుకో తెలుగుదేశం పెద్దలు చెప్పాలి. గత లోక్‌సభ ఎన్నికల ప్రకటనకు కొద్ది వారాల ముందు విశాఖ రైల్వే జోన్‌ ఏర్పాటు ప్రకటనను కేంద్రం వెలువరించింది. పోనీ దాన్నయినా నోటిఫికేషన్‌ ఇచ్చి ఏర్పాటు చేసిందా అంటే అదీ లేదు. మరోసారి ఎన్నికలు వస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం భూమి ఇవ్వలేదు అని చెబుతున్నారు. కేంద్రం ఎప్పుడైనా భూమి ఎందుకు ఇవ్వరు అని రాష్ట్ర ప్రభుత్వం మీద వత్తిడి తెచ్చిందా?ఇస్తామని చెప్పిన భూమిని స్వీకరించేందుకు ముందుకు రాకుండా వంకలు చెబుతున్నది. జోనల్‌ కార్యాలయాన్ని ఏర్పాటు చేసేందుకు విశాఖలో రైల్వేలకు అసలు భవనాలే దొరకవా ? రాష్ట్ర ప్రభుత్వం ఇస్తే తప్ప అసలు భూమే లేదా ? విశాఖ డివిజన్ను రద్దు చేయాలని నిర్ణయించారు, అక్కడే కార్యాలయాన్ని ఏర్పాటు చేసి తరువాత తీరికగా భూమి తీసుకొని కొత్త భవనాలు నిర్మించుకోవచ్చు, అదీ చేయలేదు. నాటకాలాడుతున్న అలాంటి బిజెపిని బలపరిచి రాష్ట్ర ప్రయోజనాలను సాధించుకోవచ్చని చెబితే జనం మరీ అంత అమాయకంగా కనిపిస్తున్నారా ?


తోలువలవటం, తాటతీయటమే తన కార్యాచరణ అని ప్రకటించుకున్న జనసేన నేత పవన్‌ కల్యాణ్‌ విశాఖ ఉక్కును ప్రయివేటీకరించవద్దని చెబుతున్నారు, అది మంచిదే. కానీ పవన్‌ కల్యాణ్‌ ప్రకటించిన ప్రతిసారీ ఉక్కును తుక్కుకింద అమ్మివేస్తామని చెబుతూనే ఉన్నా నోటికి తాళం వేసుకున్నారు. పాచిపోయిన లడ్డూలంటూ ప్రత్యేక హౌదా గురించి మాట్లాడిన ఆ పెద్ద మనిషి తరువాత దాన్ని మరిచిపోయి తనకు అధికారం లేదు గనుక అడగటం లేదు అని సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. నోటికి తాళం వేసుకున్నారు. ఆ డిమాండ్‌ను వదులుకున్న తెలుగుదేశంతో చేతులు కలిపి రాష్ట్రాన్ని బాగుచేస్తామని చెబుతున్నారు. ప్రత్యేక హౌదా గురించి మరిచి పొమ్మని, ప్రభుత్వ రంగ సంస్థల విక్రయం తమ విధానమని పదే పదే చెబుతున్న బిజెపిని బలపరచి రేపు ఒక వేళ అధికారానికి వచ్చినా బిజెపి విధానాలను తెలుగుదేశం-జనసేన కూటమి మార్చగలదా ? ప్రకటించిన రైల్వేజోన్‌ గురించి కూడా అడగలేని వారు రాష్ట్ర ప్రయోజనాలను సాధిస్తామని అంటేే నమ్మేదెలా ? పన్నులలో వాటాలు, కేంద్రం అమలు జరిపే పథకాలను నుంచి కొన్ని రాష్ట్రాలను మినహాయించే అవకాశమే లేదు. కొన్ని నిధులకు సంబంధించి ప్రతిపక్ష పాలిత రాష్ట్రాలను ఇబ్బంది పెడుతున్నమాట నిజం. అలాంటి సందర్భాలలో వత్తిడి తేవాలి, పోరాడాలి లేకుంటే కేరళ మాదిరి సుప్రీం కోర్టును ఆశ్రయించాలి తప్ప లొంగుబాటు మార్గం కాదు. అందులోనూ ఆత్మగౌరవ నినాదం ముందుకు తెచ్చిన వారికి, ప్రశ్నించటం తమ డిఎన్‌ఏలోనే ఉందని చెప్పుకొనే వారికి అసలు తగనిపని.


వైఎస్‌ జగన్మోహనరెడ్డి సర్కార్‌ ప్రశ్నించిన ప్రతిపక్షాలు, ప్రజా సంఘాలు, ఉద్యోగులు, టీచర్ల మీద అణచివేత చర్యలకు పాల్పడుతున్నది, అనేక భారాలను మోపిన మాటనిజం. ఆ ప్రభుత్వాన్ని మార్చాలన్న వాంఛను తప్పు పట్టాల్సిన పనిలేదు.రాజధాని మార్పుతో సహా అనేక అంశాలలో బిజెపి నాటకాన్ని ఇంతకాలం జనం చూశారు.వైసిపికి అండదండగా ఉన్న అంశం తెలిసిందే. ఏనాడూ దాని విధానాలను నిరసిస్తూ వీధుల్లోకి వచ్చిన ఉదంతాలు లేవు. తెలుగుదేశం పార్టీని బలహీన పరిచేందుకు వైసిపిని ప్రోత్సహించింది, తిరిగి అధికారంలోకి వస్తుందని, తనకు విధేయురాలిగా ఉంటుందని ఇంతకాలం భావించిన కారణంగానే ఎన్ని విమర్శలు వచ్చినా ఖాతరు చేయలేదు. రోడ్డుమాప్‌ ఇవ్వాలని పవన్‌ కల్యాణ్‌ కోరినా పూచికపుల్ల కింద తీసిపారవేసింది. వచ్చే ఎన్నికల్లో సీట్లు గణనీయంగా తగ్గనున్నట్లు బిజెపి పసిగట్టింది. ఆంధ్రప్రదేశ్‌లో మారుతున్న సమీకరణాల్లో వైసిపికి అవకాశాల్లేవని నిర్ధారించుకున్న తరువాత సరిగ్గా ఎన్నికల ముంగిట బిజెపి తన వైఖరి మార్చుకొని తెలుగుదేశానికి స్వాగతం పలుకుతోంది తప్ప వేరు కాదు.


బిజెపి తన మత అజెండాను ముందుకు తీసుకువస్తున్నది.సిఏఏను అమలు జరుపుతామని ఇప్పుడు ప్రకటించటం దానిలో భాగమే. అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ తమకు మియాల(అసోంలో ముస్లింలను అలా పిలుస్తారు) ఓట్లు అవసరం లేదన్నారు. గతేడాది కర్ణాటక ఎన్నికల సందర్భంగా బిజెపి అగ్రనేత జగదీశ్వరప్ప తమకు ముస్లింల ఓట్లు అవసరం లేదని ప్రకటించారు.అలాంటి మాటలే ఆంధ్రప్రదేశ్‌లోనూ చెప్పగలరా ? మణిపూర్‌లో గిరిజనుల మీద, వారి చర్చీల మీద దాడులు జరుగుతుంటే, మహిళలను నగంగా తిప్పితే ఇంతవరకు ప్రధాని ఆ రాష్ట్రాన్ని సందర్శించి వారికి ఎలాంటి భరోసా కల్పించలేదు. తెలుగుదేశం పార్టీ బిజెపితో సర్దుబాటు చేసుకుంటే ఈ అంశాలన్నింటికీ జవాబు చెప్పుకోవాల్సి ఉంటుంది. ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం-జనసేన కూటమిలో బిజెపి కలిస్తే కలిగే లాభం కంటే జరిగే నష్టమే ఎక్కువ అనే అభిప్రాయాలు వెలువడుతున్నాయి.

మతసామరస్యత గిట్టని సనాతన వాదులు, ఏడుసార్లు గాంధీజీపై హత్యాయత్నాలు !

Tags

, , , , , , , , ,


ఎం కోటేశ్వరరావు


ఆమె ఒక ప్రతిష్టాత్మక జాతీయ సాంకేతిక విద్యాసంస్థ (నిట్‌), కాలికట్‌లో మెకానికల్‌ ఇంజనీరింగ్‌ విభాగ ప్రొఫెసర్‌, పేరు డాక్టర్‌ ఏ షాయిజా.” భారత్‌ను రక్షించినందుకు గాడ్సేను చూసి గర్విస్తున్నా ” అని ఫేస్‌బుక్‌లో పోస్టు పెట్టి ఇప్పుడు పోలీసు కేసులను ఎదుర్కొంటున్నారు. జనవరి 30వ తేదీన మహాత్ముడి వర్ధంతి. ఆరోజు బిజెపి ఫేస్‌బుక్‌ ఖాతాలో ఒక న్యాయవాది ” హిందూమహాసభ కార్యకర్త నాధూరామ్‌ గాడ్సే భారత్‌లో ఎందరికో ఆదర్శం( హీరో )” అని పెట్టాడు. దాని మీద ” భారత్‌ను రక్షించినందుకు గాడ్సేను చూసి గర్వపడుతున్నా ” అని డాక్టర్‌ షాయిజా స్పందించారు. దాన్ని ఫొటో తీసి కోజికోడ్‌ లోక్‌సభ కాంగ్రెస్‌ ఎంపీ ఎంకె రాఘవన్‌ ఎక్స్‌(ట్విటర్‌)లో పోస్టు చేశాడు.” మహాత్మాగాంధీకి వ్యతిరేకంగా పోస్టు పెట్టటం నాకు సిగ్గుగా ఉంది.నిట్‌లో ఒక బాధ్యతాయుతమైన పోస్టులో ఉన్న వ్యక్తి గాడ్సేను పొగిడారు. సంబంధిత అధికారులు తగిన చర్యలు తీసుకోవాలి ” అని ఎంపీ స్పందించారు. అది సంచలనం కావటంతో ఆమె తన పోస్టును ఫేస్‌బుక్‌ నుంచి తొలగించారు. అయినప్పటికీ డివైఎఫ్‌ఐ, ఎస్‌ఎఫ్‌ఐ, ఎన్‌ఎస్‌యుఐ, తదితర సంస్థలకు చెందిన వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు.కొట్లాటలను ప్రేరేపించేందుకు కావాలనే రెచ్చగొట్టారన్నది నేరారోపణ. ఆమె తన చర్యను సమర్ధించుకున్నారని ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌ రాసింది.” నేను గాంధీని ఎందుకు చంపాను అనే గాడ్సే పుస్తకం చదివాను. గాడ్సే కూడా స్వాతంత్య్ర సమరయోధుడే. తన పుస్తకంలో ఎంతో సమాచారాన్ని వెల్లడించాడు. అది సామాన్యులకు తెలియదు. ఆ పుస్తకంలో గాడ్సే మనల్ని వివేకవంతుల్ని చేశాడు. ఈ పూర్వరంగంలో ఒక లాయర్‌ ఫేస్‌బుక్‌ పోస్టు మీద నేను స్పందించాను. జనాలు నా వ్యాఖ్యను వక్రీకరిస్తున్నారని గుర్తించిన తరువాత దాన్ని తొలగించాను” అని షాయిజా చెప్పారు. తన వ్యాఖ్య గాంధీజీ హత్యను ప్రశంసించటం కాదని కూడా ఆమె చెప్పుకున్నారు. ఆమె పోస్టు వైరల్‌ కాగానే సంజాయిషీ తీసుకోవాలని సంస్థ డైరెక్టర్‌ రిజిస్ట్రార్‌ను కోరారు.


ఆమె వయస్సు, అనుభవంలోనూ తక్కువ వారేమీ కాదు. గాడ్సే మీద మీడియాలో జరుగుతున్న అనుకూల, వ్యతిరేక చర్చలు తెలియకుండా ఉంటాయని అనుకోలేము. అన్నీ తెలిసే కావాలనే ఆమె స్పందించారన్నది స్పష్టం. దీనికి కొద్ది రోజుల క్రితం ఆమె పని చేస్తున్న సంస్థలోనే ఒక ఉదంతం జరిగింది. అయోధ్య రామాలయంలో విగ్రహ ప్రతిష్ట సందర్భంగా సంఘపరివార్‌కు చెందిన విద్యార్ధులు ఉత్సవాన్ని చేసుకున్నారు. వ్యాషక్‌ ప్రేమ్‌కుమార్‌ అనే విద్యార్ధి(దళిత సామాజిక తరగతికి చెందిన వ్యక్తి) నిరసన తెలిపాడు. నిట్‌ ప్రధాన భవనం ముందు ” ఇండియా రామ రాజ్యం కాదు ” అనే నినాదం రాసి ఉన్న ఒక ప్లకార్డును పట్టుకొని ఒక్కడే ప్రదర్శన చేశాడు. సైన్స్‌ అండ్‌ స్పిరిట్యువల్‌ క్లబ్‌ పేరుతో రామాలయ ఉత్సవాన్ని నిర్వహించిన వారు ప్రేమకుమార్‌ మీద దాడి చేశారు. జనవరి 21వ తేదీన ఉత్సవం జరిపిన వారు దేశ చిత్రపటాన్ని కాషాయ రంగులో విల్లు, బాణం ఉన్న రాముడి బొమ్మతో చిత్రించారని, జై శ్రీరామ్‌ అంటూ నినాదాలు చేశారని, ఇది భారత మాప్‌ను అగౌరవ పరచటమే అని విద్యార్ధి వ్యవహారాల మండలి(ఎస్‌ఏసి) ఒక ప్రకటనలో పేర్కొన్నది. ప్రేమకుమార్‌ చేసింది ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించటంగా, విద్యాలయ ప్రాంగణంలో అశాంతిని రేకెత్తించటంగా పరిగణించి ఏడాది పాటు సంస్థ నుంచి వెలివేశారు. జరిగిన ఉదంతాన్ని వాట్సాప్‌ గ్రూప్‌లో పోస్టు చేసిన ఎస్‌ఏసి ప్రతినిధి కైలాష్‌ను కూడా కొట్టారు. నిట్‌ సంస్థలు కేంద్ర ప్రభుత్వానికి చెందినవన్న సంగతి తెలిసిందే.
ప్రేమ్‌కుమార్‌, కైలాష్‌పై చేసిన దాడుల వెనుక శివ పాండే అనే విద్యార్ధి ఉన్నట్లు నిట్‌ విద్యార్ధులు చెప్పారు. అతను సంస్థలో భజరంగ్‌దళ్‌ను ఏర్పాటు చేశాడు, కొంత మంది విద్యార్ధుల మీద దాడులు చేశాడు. ఇన్ని జరిగినప్పటికీ అతని మీద ఎలాంటి క్రమశిక్షణా చర్యలు లేవు. ప్రేమకుమార్‌ను ఏడాది పాటు సస్పెండ్‌ చేస్తూ నిర్ణయం తీసుకున్న సమావేశంలో ఎస్‌ఏఎస్‌కు ఎలాంటి ప్రాతినిధ్యం లేదు.ప్రతినిధులుగా ఉన్న వారిని సమావేశానికి రానివ్వలేదని విద్యార్ధులు విమర్శించారు. అలాంటి వాతావరణం ఉన్న సంస్థలోనే ఫ్రొఫెసర్‌ షాయిజా పని చేస్తున్నారు.ఈ ఉదంతం జరిగిన తరువాతే ఆమె వివాదాస్ప వ్యాఖ్యలను ఫేస్‌బుక్‌లో చేశారు. ఆమెపై ఎస్‌ఎఫ్‌ఐ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగానే పోలీసులు కేసు నమోదు చేశారు. ఫ్రొఫెసర్‌ చర్యను నిరసించిన మిగతా సంస్థల వారు కూడా ఆమెను బోధనా బాధ్యతల్లో కొనసాగనివ్వరాదని డిమాండ్‌ చేశారు. ఆమె చర్య జాతిపితను అవమానించటమే అని కేరళ ఉన్నత విద్యాశాఖ మంత్రి ఆర్‌ బిందు ఖండించారు. డైరెక్టర్‌గా ఉన్న అధికారి ప్రసాద కృష్ణ కాలికట్‌ నిట్‌ను కాషాయీకరణ చేస్తున్నట్లు గతంలోనే విద్యార్దులు, సిబ్బంది విమర్శించారు.


హిందూ-ముస్లిం ఐక్యతను ప్రబోధించినందుకు మతోన్మాదశక్తులు గాంధీ మహాత్ముడిని తూలనాడుతున్న సంగతి తెలిసిందే.1948 జనవరి 30న నాధూరామ్‌ గాడ్సే గాంధీని తానెందుకు చంపిందీ కోర్టులో చెప్పిన మాటలను తరువాత పుస్తకంగా వేసి పంచుతున్నవారందరూ గాడ్సే వారసులే.చివరికి గాడ్సేకు గుడి కట్టేందుకూ చూశారంటే ఉన్మాదం ఏ స్థాయికి చేరిందో అర్ధం అవుతుంది. ఒక నాటికి గాంధీ హత్యలో నిజమైన విలువ ఏమిటో తెలుస్తుందని విచారణ సందర్భంగా గాడ్సే చెప్పాడంటే కాలికట్‌ నిట్‌ ప్రొఫెసర్‌ వంటి వారు రాబోయే రోజుల్లో ఇంకా తామర తంపరగా పెరిగే అవకాశం కనిపిస్తోంది. స్వాతంత్య్ర ఉద్యమానికి సారధ్యం వహించిన మహాత్ముడిని చంపిన ఒక హంతకుడి చర్యలో దేశరక్షణను చూస్తున్న విద్యావంతులను చూసి జాతి గర్వపడాలా గర్హించాలా ? దేశం గాంధీని గుర్తుపెట్టుకున్నంత వరకు గాడ్సేను కూడా మరచిపోకూడదు. ఎందుకంటే మత సామరస్యానికి ప్రతిక గాంధీ అయితే, విద్వేషానికి, సమాజ ఐక్యత విచ్చిన్నానికి చిహ్నం గాడ్సే. గడచిన ఏడున్నరదశాబ్దాల కాలంలో గాడ్సే వారసులు పెరిగారు, గాంధీ వారసులు తగ్గారు. అందుకే చరిత్రను తిరగరాసి అసలైన దేశభక్తుడు గాడ్సే అన్నా నిజమే అని నమ్మేదిశగా మన సమాజం ఉండటం ఆందోళన కలిగిస్తోంది.హిట్లర్‌ అసలైన దేశభక్తుడు అని జర్మన్లను నమ్మించిన గోబెల్స్‌ ప్రచారం కంటే ఎన్నోరెట్లు ఎక్కువగా ఇప్పుడు ప్రమాదకారులను, స్వాతంత్య్ర ఉద్యమంలో విద్రోహం చేసిన వారిని దేశభక్తులుగా చిత్రీకరణ జరుగుతోంది.దేశభక్తి అంటే అర్ధాన్నే మార్చివేస్తున్నారు.


” గాంధీ కారణంగానే ముస్లింలకు ప్రత్యేక దేశంగా పాకిస్థాన్‌ ఏర్పాటు జరిగింది. కాశ్మీరుపై దురాక్రమణకు పాల్పడిన తరువాత కూడా పాకిస్థాన్‌కు రు.55 కోట్లు ఇవ్వాలని నిరాహారదీక్ష చేయటం, గాంధీజీ సంతుష్టీకరణ విధానం కారణంగానే ముస్లింలు రెచ్చిపోతున్నారు.” ఇవీ మహాత్మా గాంధీ హత్యను సమర్ధించేవారు సాధారణంగా చెబుతున్నకారణాలు ? అందుకే గాడ్సే హత్య చేశాడని, తప్పేమిటని వాదిస్తారు.నిజానికి ఇది ఒక సాకు, వక్రీకరణ మాత్రమే. పాకిస్థాన్‌ ఏర్పాటుతో నిమిత్తం లేకుండానే గాంధీపై ఎన్నో సంవత్సరాల ముందే సనాతన శక్తులు హత్యాయత్నాలు జరిపాయన్న చరిత్రను మూసిపెడుతున్నారు.నిజానికి హిందూత్వ అజెండాను అమలు జరపాలని చూసిన శక్తులకు గాంధీ వైఖరి ఆటంకంగా మారింది. 1917 నుంచి 1948వరకు గాంధీ పలుసార్లు హత్యాయత్నం జరిగింది.వాటికీ దేశవిభజన,కాశ్మీరుపై దాడికి సంబంధమే లేదు. గాంధీ హత్యను సమర్ధించుకొనేందుకు తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నది వాస్తవం. రెండు జాతులు, రెండు దేశాలంటూ చెప్పిన వారిలో విడి సావర్కర్‌ ప్రముఖుడు.1937లో అహమ్మదాబాద్‌లో జరిగిన హిందూమహాసభ సమావేశంలో ఇప్పుడున్న మాదిరి దేశం ఒకటిగా ఉండబోదని చెబుతూ హిందు-ముస్లిం దేశాలుగా ఉంటాయని చెప్పాడు.(మహారాష్ట్ర ప్రాంతీయ హిందూమహాసభ, పూనే ప్రచురించిన స్వాతంత్య్ర వీర సావర్కర్‌, ఆరవ భాగం పేజీ 296).అంతేకాదు, మరో సందర్భంలో మాట్లాడుతూ రెండు దేశాల సిద్దాంతంతో జిన్నాతో నాకు పేచీ లేదు. హిందువులం స్వతహాగా మనది ఒక జాతి, హిందువులు, ముస్లింలు రెండు దేశాలన్నది చారిత్రక వాస్తవం ” అన్నాడు.


” దేవుడి దయవలన ఏడు సార్లు మరణపు కోరల నుంచి తప్పించుకున్నాను. నేను ఎవరినీ ఎన్నడూ గాయపరచలేదు, నాకు ఎవరూ శత్రువులు లేరని భావిస్తాను. ఎందుకు నాపై ఇన్నిసార్లు హత్యా ప్రయత్నాలు జరిగాయో నేను అర్ధం చేసుకోలేకపోతున్నాను. నిన్న ప్రయత్నం కూడా విఫలమైంది.నేను అంత తేలికగా మరణించను, నూట ఇరవై అయిదు సంవత్సరాలు వచ్చేదాకా జీవిస్తాను ” అని 1946 జూన్‌ 30న పూనాలో గాంధీ చెప్పారు. ఈ అంశాన్ని గాంధీ మునిమనుమడు తుషార్‌ గాంధీ రాసిన ” లెటజ్‌ కిల్‌ గాంధీ ” (గాంధీని చంపుదాం ) అనే పుస్తకంలో పేర్కొన్నారు. తొలిసారి బీహార్‌లో భూస్వాములకు వ్యతిరేకంగా 1917 ఏప్రిల్‌ 15చంపారాన్‌ సత్యాగ్రహం సందర్భంగా ఇర్విన్‌ అనే ఆంగ్లేయుడు హత్యకు ప్రయత్నించాడు. ఇంటికి పిలిచి పాలలో విషమిచ్చి చంపేందుకు చూశాడు. సహాయకుడు యజమాని ఆజ్ఞను పాటించినట్లు నటిస్తూనే గాంధీకి గ్లాసు ఇవ్వబోతూ ఒలకపోశాడు. అవి తాగిన పిల్లి మరణించిన తరువాత జరిగిన కుట్ర వెల్లడైంది. ఏడు ప్రయత్నాల్లో మూడు సార్లు హిందూమహాసభకు చెందిన నారాయణ ఆప్టే, నాధూరామ్‌ గాడ్సే ప్రయత్నించాడు.1948 జనవరి 20న బాంబుతో చంపాలని చూశారు. ఆ ఉదంతంలో మదన్‌లాల్‌ పహ్వా అనేవాడిని అరెస్టు చేశారు. భారతీయులు జరిపిన తొలి హత్యాయత్నం చారిత్రాత్మక హరిజన యాత్ర సందర్భంగా 1934 జూన్‌ 25న పూనాలో జరిగింది. టౌన్‌హాల్లో జరిగిన సభకు ముందుగా వచ్చిన కారులో గాంధీజి ఉన్నాడని భావించిన సనాతన ఉన్మాదులు బాంబు పేలుడు జరిపారు. అయితే గాంధీ కారు ఆలస్యంగా రావటంతో ప్రమాదం తప్పింది. అంటరానితనానికి వ్యతిరేకంగా ఉద్యమించటం నచ్చని సనాతనవాదులు నాడు గాంధీని వ్యతిరేకించారు. రెండవ సారి 1944 జూలైలో మహారాష్ట్రలోని పంచాగ్నిలో జరిగింది. ఒక ప్రార్ధనా సమావేశం జరుగుతుండగా నాధూరామ్‌ గాడ్సే ఒక కత్తి పట్టుకొని గాంధీ వ్యతిరేక నినాదాలు చేస్తూ దూసుకు వచ్చాడు.ప్రమాదాన్ని గ్రహించిన వారు అతన్ని పట్టుకున్నారు. గాడ్సేతో పాటు వచ్చినవారు పారిపోయారు. అతన్ని వదలివేయమని గాంధీ చెప్పాడు.తనతో ఎనిమిది రోజులు గడిపి చర్చలు జరపమని కోరగా గాడ్సే తిరస్కరించాడు. అదే ఏడాది సెప్టెంబరులో జిన్నాతో చర్చలకు గాంధీ సిద్దంగావటాన్ని హిందూమహాసభ, ఆర్‌ఎస్‌ఎస్‌ వ్యతిరేకించాయి. అప్పుడు కూడా సేవాగ్రామ్‌లో గాడ్సే ఆయుధంతో వచ్చాడు. ఇతరులతో కలసి గాంధీ సేవాగ్రామ్‌ నుంచి బొంబాయి వెళ్లకుండా అడ్డుకోవాలని చూశాడు.అప్పుడు కూడా ఆశ్రమవాసులు పట్టుకొని నిరాయుధుడిని చేశారు.తరువాత 1946 జూన్‌ 29న గాంధీ ప్రయాణిస్తున్న ప్రత్యేక రైలును పడగొట్టి హత్య చేసేందుకు పట్టాలపై పెద్ద బండరాళ్లను ఉంచారు.డ్రైవరు అప్రమత్తంగా ఉండటంతో ప్రమాదం తప్పింది.ఐదవ సారి 1948 జనవరి 20న బిర్లా హౌస్‌లో గాంధీ ప్రార్ధన చేస్తుండగా కొద్ది మీటర్ల దూరంలో బాంబు పేలింది. చివరికి 1948 జనవరి 30న గాంధీని గాడ్సే కాల్చిచంపాడు.అందుకే ఆ రోజును మతసామరస్య దీక్షాదినంగా పాటిస్తున్నారు. మతశక్తులను సమాజం నుంచి వెలివేయటమే మహాత్ముడికి అసలైన నివాళి.

ఎన్నిబాంబులు వేస్తే అంతగా లాభాలు :యుద్ధం వద్దు శాంతి ముద్దు !

Tags

, , , , , , , , , , ,


ఎం కోటేశ్వరరావు


” అక్కడ మిగిలిందేమీ లేదు ” ఐరాస సహాయ సంస్థ గాజాలో పరిస్థితి గురించి తాజాగా చెప్పిన మాట ఇది. ఇజ్రాయెల్‌ ధ్వంసంగావించిన తమ ఒక ఆసుపత్రి చిత్రాన్ని చూపుతూ ఎక్స్‌లో వ్యాఖ్యానించింది. ఇజ్రాయెల్‌ నౌకల నుంచి జరుపుతున్న దాడుల కారణంగా తమ ఆహార సరఫరా వాహనాలకు ఆటంకం కలుగుతున్నదని సంస్థ డైరెక్టర్‌ థామస్‌ వైట్‌ పేర్కొన్నాడు. గాజాలో బందీలకు బదులుగా ఇజ్రాయెల్‌ జైళ్లలో ఉన్న పాలస్తీనా వాసుల విడుదల గురించి అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోని బ్లింకెన్‌ మధ్య ప్రాచ్యదేశాల పర్యటనలో ఉన్నాడు. అక్టోబరు ఏడు నుంచి ఇప్పటి వరకు గాజాలో 27,478 మందిని హత్య చేసిన ఇజ్రాయెల్‌ 66,835 మందిని గాయపరచింది. వారిలో 70శాతంపైగా మహిళలు, పిల్లలే ఉన్నారు.ఇరాక్‌, సిరియా, ఎమెన్‌లపై దాడులకు పూనుకున్న అమెరికా యుద్ధాన్ని విస్తరిస్తున్నదని భద్రతా మండలిలో రష్యా విమర్శించింది.తమ దాడులు ఆరంభం మాత్రమేనని అమెరికా అంతకు ముందు ప్రకటించింది. నాటోతో కలసి తమకు ముప్పు తలపెట్టిన ఉక్రెయిన్‌ మీద రష్యా ప్రారంభించిన సైనిక చర్య 713వ రోజులో ప్రవేశించింది.ఎంతగా వర్షాలు పడితే అంతగా పంటలు పండుతాయని రైతాంగం, జనం మురిసిపోతారు, కానీ యుద్ధోన్మాదులకు ఎన్ని బాంబులను కురిపిస్తే అంతగా లాభాలు వస్తాయని చరిత్ర రుజువు చేసింది. అందుకే ఏక్కడో ఒక దగ్గర ఉద్రిక్తతలను రెచ్చగొట్టి యుద్ధాల వరకు కొనిపోవటం నిత్యకృత్యంగా మారింది.ఐరోపాలో ఉక్రెయిన్‌ సంక్షోభం, మధ్య ప్రాచ్యంలో గాజాపై ఇజ్రాయెల్‌ జరుపుతున్న మారణకాండ సారమిదే. 1990దశకంలో ప్రచ్చన్న యుద్ధంలో తామే గెలిచామని అమెరికా ప్రకటించుకున్నప్పటికీ వర్తమానంలో తిరిగి నాటి పరిస్థితిని అది సృష్టిస్తున్నది. దాని విదేశాంగ విధాన వైఫల్యాలు పెరుగుతున్న కొద్దీ ప్రపంచ మిలిటరీ ఖర్చు కూడా పెరుగుతున్నది. ఎనిమిది సంవత్సరాల వరుస పెరుగుదలలో 2022లో ప్రపంచ మిలిటరీ ఖర్చు 2.24లక్షల కోట్ల డాలర్లకు చేరింది.


గత సంవత్సరం అమెరికా విదేశాలకు అమ్మిన ఆయుధాల విలువ 238 బిలియన్‌ డాలర్లు.ఉక్రెయిన్‌ సంక్షోభం ఈ పెరుగుదలకు ప్రధాన కారణంగా తేలింది.ఐరోపాలోని అనేక దేశాలు తమ వద్ద ఉన్న పాత ఆయుధాలను ఉక్రెయిన్‌కు బదిలీ చేసి కొత్తవాటిని కొనుగోలు చేస్తున్నాయి.ఐరోపా వెలుపల ఆస్ట్రేలియా, దక్షిణ కొరియా, జపాన్‌, కెనడా, కతార్‌ తదితర దేశాలు ఎక్కువగా కొనుగోలు చేశాయి.ఆయుధాల అమ్మకం అమెరికా ఆర్థిక వ్యవస్థకు ఉత్తేజాన్ని ఇస్తున్నది. అమెరికా ప్రభుత్వం నేరుగా అమ్ముతున్న ఆయుధాలు, మిలిటరీ సేవల విలువ 2022తో పోలిస్తే గతేడాది 51.9బి.డాలర్ల నుంచి 80.9కి పెరిగింది. ఆయుధ వ్యాపారులు నేరుగా అమ్మిన వాటి విలువ 157.5బి.డాలర్లు. ప్రభుత్వమే నేరుగా ఆయుధ వ్యాపారం చేస్తున్నదంటే యుద్ధాలను ప్రోత్సహించే విదేశాంగ విధానాలను మరింతగా కొనసాగిస్తున్నదనేందుకు సూచిక. ఆయుధాలను అమ్ముతూ ప్రపంచానికి ముప్పుగా పరిణమించిన రష్యాను దెబ్బతీసేందుకే తామీపని చేస్తున్నట్లు చెప్పుకొంటున్నది. పుతిన్‌ దళాల నుంచి ఐరోపాను రక్షించే పేరుతో ఉక్రెయిన్‌కు 50బిలియన్‌ డాలర్ల నిధులు ఇవ్వాలని ఐరోపా సమాఖ్య తాజాగా నిర్ణయించింది.అక్టోబరు ఏడున గాజాపై మారణకాండను ప్రారంభించిన ఇజ్రాయెల్‌ చర్య కూడా మిలిటరీ ఖర్చు, ఆయుధ విక్రయాలు పెరిగేందుకు దారి తీస్తున్నది.


అమెరికా తన ఆయుధాలను ఇతర ప్రాంతాలలో నేరుగా ప్రయోగించి వాటి పనితీరును ఎలా పరీక్షిస్తున్నదో ఇజ్రాయెల్‌ కూడా తన ఆయుధాలు, నిఘా పరికరాలను గాజా, పశ్చిమగట్టు ప్రాంతాలలో పాలస్తీనియన్లు ప్రయోగ సమిధలుగా వాడుకుంటున్న దుర్మార్గానికి పాల్పడుతున్నది. హైఫా నగర కేంద్రంగా ఉన్న ఎల్‌బిట్‌ సిస్టమ్స్‌ అనే సంస్థ తాను రూపొందించిన ఐరన్‌ స్టింగ్‌ అనే మోర్టార్‌ బాంబు ఎలా పని చేసేదీ 2021 నుంచి తన వెబ్‌సైట్‌లో ప్రచారం చేసుకుంటున్నది. గాజాలో ఇప్పుడు హమస్‌ను అణచేపేరుతో వాటిని ప్రయోగించి చూస్తున్నారు. పట్టణ ప్రాంతాలు, బహిరంగ ప్రదేశాల్లో కూడా నిర్ణీత లక్ష్యాలను చేరేవిధంగా వీటిని తయారు చేశారు.గాజా జనసమ్మర్ధం గల పట్టణ ప్రాంతమన్నది తెలిసిందే. గురితప్పకుండా ఇక్కడ లక్ష్యాలను చేరితే ప్రపంచవ్యాపితంగా ఎవరికి కావాల్సివస్తే వారికి అమ్మేందుకు ఈ ప్రయోగాలు చేస్తున్నారు. గతంలో ఇలాంటి ప్రయోగాల్లో మారణకాండను సృష్టించిన అనేక ఆయుధాలను ఇప్పుడు ఇజ్రాయెల్‌ ఎగుమతి చేస్తున్నది. అలాంటి వాటిలో ఏకంగా నలభై గంటల పాటు ప్రయాణించి నాలుగు క్షిపణులను మోసుకుపోగల ఇటాన్‌ అనే డ్రోన్ను ఇజ్రాయెల్‌ 2007లో గాజా పౌరుల మీద ప్రయోగించింది, అప్పుడు కూడా వీటి దాడిలో పిల్లలే ఎక్కువగా మరణించారు. ఇప్పుడు వాటిని భారీగా విక్రయిస్తున్నది. మన దేశం వందకు పైగా వీటిని కొనుగోలు చేసి అగ్రస్థానంలో ఉంది. ఇజ్రాయెల్‌ నుంచి ఆయుధాలను కొనుగోలు చేస్తున్న 130కి పైగా దేశాలలో కొలంబియా ఒకటి. అక్కడి అధ్యక్షుడు గుస్టావ్‌ పెట్రో గాజాలో జరుపుతున్న మారణకాండను ఉగ్రవాదంగా వర్ణిస్తూ ఖండించాడు.దాంతో కొలంబియాకు ఆయుధ విక్రయాలను ఇజ్రాయెల్‌ నిలిపివేసింది. ఆయుధ వ్యాపార ఒప్పందాన్ని ఇజ్రాయెల్‌ ఆమోదించలేదు.మారణకాండ, మానవాళిపై నేరాలకు పాల్పడేవారికి ఆయుధాల విక్రయాన్ని ఆ ఒప్పందం నిషేధిస్తున్నది. అందువలన ఇజ్రయెల్‌ జరిపే లావాదేవీలన్నీ రహస్యంగానే ఉంటాయి. ఎవరు, ఎవరికి అమ్మిందీ చెప్పదు, కొనుగోలు చేసిన వారు కూడా వెల్లడించరని 2019లో ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్‌ ప్రకటించింది. అందువలన లావాదేవీలు ఎంత అన్నది కూడా అంచనా కష్టం.దక్షిణాఫ్రికాలో స్థానిక ఆఫ్రికన్‌ జాతీయులను అణచివేసిన జాత్యహంకార పాలకులకు విక్రయించింది.అవసరమైతే అణ్వాయుధాలను కూడా ఇచ్చేందుకు సిద్దపడినట్లు బహిర్గతం కావించిన పత్రాలు వెల్లడించాయి. ఎల్‌ సాల్వడార్‌లో తిరుగుబాటుదార్లను అణచివేసేందుకు అక్కడి నియంతలకు నాపాం బాంబులు, ఇతర ఆయుధాలను విక్రయించింది, వాటితో 75వేల మంది పౌరులు మరణించారు. ఎనిమిది లక్షల మంది ప్రాణాలు కోల్పోయిన ర్వాండా మారణకాండలో కూడా ఇజ్రాయెల్‌ తయారీ తుపాకులు, బుల్లెట్లు,గ్రెనేడ్‌లు వాడినట్లు తేలింది.బోస్నియా మీద దాడులు చేసిన సెర్బియాకూ, మయన్మార్‌ మిలిటరీ పాలకులకూ, అజర్‌బైజాన్‌కూ ఆయుధాలను విక్రయించింది. అమెరికా, ఐరోపా దేశాల మాదిరి ఎలాంటి ఆంక్షలనూ విధించదు గనుక ఇజ్రాయెల్‌ నుంచి ఆయుధాలను కొనుగోలు చేయాలని 2018లో నాటి ఫిలిఫ్పీన్స్‌ అధ్యక్షుడు రోడ్రిగో డుటెర్టె ప్రకటించాడు. తాజాగా సవరించిన నిబంధనల ప్రకారం ఎలాంటి అనుమతులతో నిమిత్తం లేకుండా ఎవరికైనా ఆయుధాలను విక్రయించవచ్చు. ప్రస్తుతం గాజాలో మరణించిన, గాయపడిన పాలస్తీనియన్లను పరీక్షించినపుడు కాలిన, ఇతర గాయాలను చూసినపుడు అవి ఎలా జరిగాయన్నది వైద్యులకు సమస్యగా మారింది. గతంలో ఇలాంటి వాటిని చూడలేదని చెప్పారు. దీన్ని బట్టి కొత్త ఆయుధాలను ప్రయోగించారని అనుమానిస్తున్నారు.


యుద్ధం అనేక అనర్ధాలకు మూలం అవుతున్నది. ప్రత్యక్షంగా ఎన్ని ప్రాణాలు పోతాయో, ఎంత మంది దిక్కులేనివారౌతారో, ఎన్ని కుటుంబాలు ఇబ్బందులు పడతాయో, ఎంత బాధ, వేదన కలుగుతుందో చెప్పలేము. పరోక్షంగా జనాల మీద ప్రత్యేకించి కష్టజీవుల మీద విపరీత భారాలను మోపుతుంది. కార్పొరేట్‌ మీడియా వార్తలను ఇస్తుంది తప్ప అది యుద్ధానికి వ్యతిరేకం కాదు. ఇజ్రాయెల్‌ జరుపుతున్న మారణకాండను ఆత్మరక్షణ పేరుతో సమర్థిస్తున్న వారికి మద్దతు ఇస్తున్నది. రష్యాకు నాటో తలపెట్టిన ముప్పును మూసిపెట్టి అది జరుపుతున్న సైనిక చర్య మీద చిలవలు పలవలుగా వార్తలు ఇస్తున్నది. దీనంతటికి అమెరికా, దాన్ని సమర్ధించేదేశాల లాభాల కాంక్ష, యుద్ధోన్మాదమే కారణం. ఏ నేతా శాంతివచనాలు వల్లించటంలో వెనుకబడటం లేదు.ఆచరణలో ఏదో ఒకసాకుతో మిలిటరీ ఖర్చు పెంచుతున్నారు. గతంలో సోవియట్‌ యూనియన్ను మాత్రమే బూచిగా చూపే వారు, ఇప్పుడు రష్యా, చైనాలను పేర్కొంటూ ఆయుధాలను మరింత ఎక్కువగా అంటగట్టేందుకు పూనుకున్నారు. 2020లో డెమోక్రటిక్‌ పార్టీ మిలిటరీ ఖర్చును తగ్గిస్తామని చెప్పింది. గతంలో రిపబ్లికన్‌ డోనాల్డ్‌ ట్రంప్‌ మాదిరి జో బైడెన్‌ అధికారానికి వచ్చిన తరువాత ప్రతి ఏటా పెంచి మరోసారి ఎన్నికలకు సిద్దమౌతున్నాడు. ఎవరు అధికారంలో ఉన్నప్పటికీ యుద్ధాలను రెచ్చగొట్టటం, ఆయుధాల వ్యాపారం, లాభాలు పిండుకోవటం మామూలే. మిలిటరీ ఖర్చు విషయానికి వస్తే 230 దేశాల్లో ఒక్క అమెరికా చేస్తున్న ఖర్చు 227దేశాల మొత్తానికంటే ఎక్కువ. ఆయుధాల ఎగుమతుల్లో కూడా అదే విధంగా ఉంది. నాటో దేశాలు మిలిటరీ ఖర్చును పెంచాలని డోనాల్డ్‌ ట్రంప్‌ తెచ్చిన వత్తిడిని జో బైడెన్‌ కూడా కొనసాగిస్తున్నాడు. అమెరికా చేస్తున్న ఖర్చులో రష్యా మొత్తం పదిశాతం కంటే తక్కువే.
తాము ఎదురులేని శక్తి అని విర్రవీగుతున్న అమెరికాకు ప్రతి చోటా పరాభవమే మిగులుతోంది. దాన్ని నమ్మితే ఇంతే సంగతులని అనేక దేశాలు అంతర్గతంగా భావిస్తున్నప్పటికీ మిలిటరీ శక్తిగా ఉన్నందున భయపడుతున్నమాట వాస్తవం. చైనా, రష్యాల ముందు అమెరికా పప్పులుడకవని తేలిపోయింది. ఈ పూర్వరంగంలోనే ఐరోపాకు సోవియట్‌ నుంచి ముప్పు ఉందని చెప్పి నాటోను ఏర్పాటు చేశారు. ఇప్పుడు అదే చెబుతూ రష్యాను చుట్టుముట్టేందుకు పూనుకున్నారు. దాన్ని మరింత బలపరుస్తున్నారు. మరోవైపు చైనా నుంచి ఆసియాకు ముప్పు అని ఏ క్షణంలోనైనా తైవాన్ను ఆక్రమిస్తుందని ప్రచారం చేస్తున్నారు.ఈ దశాబ్ద్ది చివరికి చైనా వెయ్యి అణ్వాయుధాలను సమకూర్చుకోనుందని అమెరికా రక్షణశాఖ తప్పుడు నివేదికలను ప్రచారంలో పెట్టింది. ఇవన్నీ చైనా ప్రపంచ మిలిటరీ శక్తిగా ఎదుగుతోంది జాగ్రత్త అని ఇరుగు పొరుగుతో పాటు ప్రపంచ దేశాలను ఆయుధపోటీకి ప్రోత్సహించే ఒక వ్యూహంలో భాగమే. అణ్వాయుధాలు ప్రపంచానికి ముప్పు అన్నది నిజం, ముందుగా ఎవరు మీట నొక్కినా కొద్ది క్షణాల్లో ఇతరులు కూడా అదేపని చేస్తారన్నది కూడా తెలిసిందే.అదే జరిగితే ప్రపంచం మిగలదు. ఎవరికి వారు తగుజాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇతర దేశాలన్నీ తమ మీద కుట్ర చేస్తున్నట్లు, ముప్పు తలపెట్టినట్లు స్వజనాన్ని నమ్మించటం అమెరికా నిత్యకృత్యాలలో ఒకటి. ఆ పేరుతో అన్ని ఖండాలలోని 80 దేశాలలో 800కు పైగా చిన్నా, పెద్ద సైనిక కేంద్రాలను ఏర్పాటు చేసింది. అంటే ఎక్కడికైనా కొద్ది గంటల్లోనే తన మిలిటరీని దింపగలదు. ఇంతవరకు అమెరికా మీద దాడి చేసిన దేశం ఒక్కటంటే ఒక్కటీ లేదు. బ్రిటన్‌ నుంచి స్వాతంత్య్రం పొందిన తరువాత 1,776 నుంచి ఇప్పటి వరకు అమెరికా 68 దేశాల మీద దాడి చేసింది.అందువలన ముప్పు అమెరికా నుంచి రావాలి తప్ప మరొకదేశం నుంచి వచ్చే అవకాశమే లేదు.

”విశ్వగురువు” కు ”పెద్దన్న” ఆదేశంబెట్టిదనిన……అమృతకాలం, ఆత్మనిర్భరత కబుర్లు కట్టిపెట్టండి !

Tags

, , , , , , , , , , ,


ఎం కోటేశ్వరరావు


ఈ గడ్డ మీద పుట్టి ఇక్కడి తింటూ దేశానికి వ్యతిరేకంగా మాట్లాడతారంటూ తమ రాజకీయ, సామాజిక, ఆర్థిక విధానాలను విమర్శించిన వారి మీద కాషాయ దళాలు విరుచుకుపడుతున్నది తెలిసిందే. పన్నెండు వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న అమెరికాలోని వాషింగ్టన్‌ నుంచి ఢిల్లీ వచ్చి అమెరికా రాయబారిగా ఉన్న వ్యక్తి కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన అమృత కాలం, ఆత్మనిర్భర భారత్‌ పధకాలను పూచికపుల్ల తీసివేసినట్లుగా మాట్లాడితే ఎలాంటి స్పందనలూ లేవు. ఎవరూ నోరెత్తరు ! అమృతకాలం, ఆత్మనిర్భర (స్వావలంబన) భారత్‌ వాగాడంబరాన్ని కట్టిపెట్టండిి, మేం చెబుతున్న మార్పులు చేస్తేనే మీకూ మాకూ మంచిది ఆపైన మీ ఇష్టం అన్నట్లుగా మన దేశంలో అమెరికా రాయబారి ఎరిక్‌ గార్సెటీ నిర్మొహమాటంగా చెప్పాడు. జనవరి 30వ తేదీన ఢిల్లీలో ” అమృత కాలం, ఆత్మనిర్భర భారత్‌లో భారత-అమెరికా సంబంధాలు ” అనే అంశం గురించి ఇండో-అమెరికన్‌ ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌, ఉత్తర భారత కౌన్సిల్‌ మహాసభలో గార్సెటీ ప్రసంగించాడు. దురాక్రమణదారులు వచ్చి గుంజుకు పోతారనే పాతకాలం కాదిది, స్వావలంబన అన్నది దుర్భేధ్యమైన కోటగా భావించరాదని తమ దేశం కోరుతున్నదని గార్సెటీ అన్నాడు. పెట్టుబడులు, మేథోసంపత్తి హక్కులు, ఎగుమతి-దిగుమతులు, పన్నుల వ్యవస్థలో భారత్‌ మార్పులు చేయాలి. ప్రభుత్వం స్వావలంబన వైపు మొగ్గు చూపితే వాణిజ్యం, ఆర్థిక వృద్ధి వేగం తగ్గుతుంది. ప్రస్తుతం రక్షణ, ఆధునిక సాంకేతికతలు, ముఖ్యమైన ఖనిజాలు, సెమికండక్టర్ల వంటి అంశాలలో రెండు దేశాలూ వేగంగా ముందుకు పోతున్నప్పటికీ వాణిజ్యం, పెట్టుబడుల అవకాశాలను పూర్తిగా ఉపయోగించుకోవాలంటే ఇవి చాలవు. ఎగుమతి ఆంక్షలు, విదేశీ పెట్టుబడులు, కార్పొరేట్‌ పన్ను వంటి అంశాలు పారదర్శకంగా లేవు, భారత్‌లో పెట్టుబడులు పెట్టే అమెరికా కంపెనీలకు ఆటంకాలను తొలగించాలి, వీటి గురించి మరింత నిర్మొహమాటంగా ఇద్దరం మాట్లాడుకోవాలి అన్నాడు.


చైనా నుంచి విదేశీ పెట్టుబడులు(ఎఫ్‌డిఐ) భారత్‌కు రావాలని అమెరికా కోరుకుంటున్నది, కానీ వాస్తవ అంకెలను చూస్తే రావాల్సినంత వేగంగా ఎఫ్‌డిఐ భారత్‌కు రావటం లేదు, ఆగేయాసియాలోని వియత్నాం వంటి దేశాలకు పోతున్నది. భారత్‌ స్వావలంబనతో ఉండాలని అమెరికా కూడా వాంఛిస్తున్నది, దాన్నొక దుర్భేధ్యమైన కోటగా చూడకూడదని కూడా కోరుకుంటున్నది.ఎందుకంటే భారత కంపెనీలు కూడా ప్రపంచంలో ఎక్కడైనా పెట్టుబడులు పెడుతున్నాయి, ఉద్యోగాలను సృష్టిస్తున్నాయి గనుక పాతకాలపు ఆలోచనలను వదలి పెట్టాలి. ఏ ఒక్క దేశమూ ఇంకేమాత్రమూ స్వావలంబనతో ఉండలేదు. భారత్‌ నుంచి సరఫరా గొలుసులు అమెరికాకు కీలకంగా ఉండాలని మేం కోరుకుంటున్నాం, ప్రతిదీ భారత్‌లోనే తయారు చేయాలని వాక్పటిమను ప్రదర్శిస్తే వేగం తగ్గుతుంది. ఉత్పత్తి మీద మీరు పన్నులు వేస్తే మా మీద వేసినట్లు కాదు, మార్కెట్‌ను రక్షించినట్లు కాదు, మేం పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టాలని కోరుకుంటుంటే మీరు దానికి పరిమితులు విధిస్తున్నట్లు. కార్పొరేట్ల పన్నుల్లో పారదర్శకత ఉండాలని మేం కోరుకుంటాం. ఇక్కడ ఉండాలని కోరుకుంటున్న మా కంపెనీలకు అదొక ఆటంకంగా ఉంది. ఒక అమెరికా కంపెనీ భారత్‌లో అడుగుపెట్టేందుకుగాను రెండు కోట్ల డాలర్లను పెట్టుబడిగా పెట్టింది. అదే కంపెనీ వియత్నాంలో ఇరవై కోట్ల డాలర్లు పెట్టింది, ఎందుకంటే దిగుమతి చేసుకున్న వాటి మీద అక్కడ పన్నులు లేవు అని ఉదాహరణగా గార్సెటీ చెప్పాడు. కోర్టులు తరచూ మేథోసంపత్తి హక్కుల ఉల్లంఘన జరిగిందని తీర్పులు ఇస్తాయి. తరువాత దాని కొనసాగింపేమీ ఉండదు అన్నాడు.


అమెరికా రాయబారి ప్రసంగమంతా ఇలానే కొనసాగింది. ప్రపంచీకరణ, స్వేచ్చా వాణిజ్యం అంటూ కబుర్లు చెప్పిన అమెరికా, తదితర ధనిక దేశాలు దాన్ని పక్కన పెట్టి రక్షణాత్మక చర్యలు తీసుకుంటూ దేశాలతో విడివిడిగా ఒప్పందాలు చేసుకొనేందుకు వత్తిడి తెస్తున్నాయి. ఇలాంటి ఒప్పందాలు గతంలో మనకు పెద్దగా ఒరగబెట్టిందేమీ లేదని తేలింది. తమ షరతులను మన మీద రుద్దుతున్న కారణంగా అమెరికాతో తలపెట్టిన సమగ్ర వాణిజ్య ఒప్పంద ప్రక్రియ ముందుకు పోవటం లేదు. ఎక్కడన్నా బావేగానీ వంగతోట దగ్గర కాదన్నట్లుగా అమెరికాకే అగ్రతాంబూలం అనే విధానాన్ని యాంకీలు బలంగా ముందుకు తీసుకుపోతున్నారు. దానికోసం ఎంతకైనా తెగిస్తున్నారు. డోనాల్డ్‌ ట్రంప్‌-నరేంద్రమోడీ ఇద్దరూ కావిలించుకొని, చెట్టాపట్టాలేసుకొని తిరిగారు. పరస్పరం పొగడ్తలను గుప్పించుకున్నారు. అదే ట్రంప్‌ మన దేశం నుంచి దిగుమతి చేసుకొనే కొన్ని వస్తువులపై ఎన్నో ఏండ్లుగా ఇస్తున్న (జిఎస్‌పి ) రాయితీలను 2019లోనే రద్దు చేసిన తరువాతే ఇద్దరూ విడదీయరాని బంధంతో ఉన్నట్లు ప్రదర్శించారు.జిఎస్‌పి కింద మనదేశం 2017లో ఎలాంటి దిగుమతి పన్నులు లేకుండా అమెరికాకు ఎగుమతి చేసిన సరకులు విలువ 570 కోట్ల డాలర్లు. ఆ రాయితీని పునరుద్దరించాలని మన దేశం వినతులు మీద వినతులు చేయటమేతప్ప ఇప్పటి వరకు బైడెన్‌ సర్కార్‌ పట్టించుకున్న పాపాన పోలేదు.మనకున్న పలుకుబడికి ఇది నిదర్శనం. దీనికి బదులు చైనాను చూపి మనల్ని భయపెట్టటం, వారి ఆయుధాలను మనకు అమ్మి సొమ్ము చేసుకోవటం విపరీతంగా పెరిగింది. చిత్రం ఏమిటంటే మనతో సహా మిగతా ప్రపంచాన్ని భయపెట్టేందుకు చూస్తున్న అమెరికా తాను మాత్రం అదే చైనాతో వాణిజ్య లావాదేవీలను జరపటానికి ముందుకు సాగుతూనే ఉంది.


అమెరికాలో ఎవరిని కదలించినా చైనా నుంచి మనకు ముప్పు ఉందని చెప్పేవారే, ఎందుకంటే అది వారికి లాభసాటిగా ఉంది. రిపబ్లికన్‌ పార్టీలో పలుకుబడి కలిగిన కాలిఫోర్నియా ఎంపీ డారెల్‌ ఇసా జనవరి 30 అమెరికాలోని హడ్సన్‌ సంస్థలో పరిశోధకురాలిగా ఉన్న అపర్ణా పాండేతో మాట్లాడుతూ చైనా నుంచి తలెత్తిన ముప్పు కారణంగా పద్దతైన స్వేచ్చావాణిజ్య ఒప్పందంతో సహా అనేక ఒప్పందాలను అమెరికా-భారత్‌ కుదుర్చుకోవాల్సి ఉందన్నాడు.ప్రస్తుతం రెండు దేశాల మధ్య ఉన్న సంబంధాలపై చైనా ముప్పు ప్రభావం చూపతున్నదన్నాడు.చైనాలో తయారు చేస్తున్న వస్తువులనే అదే ధరలకు భారత్‌లో కూడా తయారు చేయవచ్చు, కానీ దానికిగాను బలమైన ఒప్పందాలు కావాలి అన్నాడు. అమెరికాలో ఇది ఎన్నికల సంవత్సరం రెండు పార్టీలూ ఓటర్లను ఆకర్షించేందుకు నానా గడ్డీ కరుస్తున్నాయి.తాను గనుక మరోసారి అధ్యక్షుడిగా ఎన్నికైతే పన్నుల యుద్ధాన్ని ప్రారంభిస్తానని, తద్వారా అమెరికా ప్రయోజనాలను కాపాడతానని, విదేశాలకు తరలిన ఆటోమొబైల్‌ పరిశ్రమను తిరిగి వెనక్కు తీసుకువస్తానని రిపబ్లికన్‌ పార్టీ ఎన్నికల ప్రచారంలో డోనాల్డ్‌ ట్రంప్‌ చెబుతున్నాడు. గతేడాది జూన్‌లో ఒక సందర్భంగా మాట్లాడుతూ ” అమెరికా తయారీ వస్తువులపై భారత్‌, చైనా లేదా మరో ఏదేశమైనా వంద లేదా రెండువందల శాతం దిగుమతి పన్నులు విధిస్తే మేం కూడా అదే విధంగా బదులు తీర్చుకుంటాం.మరో మాటలో చెప్పాలంటే వందశాతమంటే వందశాతమే. వారు గనుక అమెరికా మీద విధిస్తే మనం కూడా విధిస్తాము.కంటికి కన్ను, పన్నుకు పన్ను, ఎంతైతే అంత ” అన్నాడు. అమెరికన్లనే శాసించుతున్నారని చెప్పుకుంటున్న విశ్వగురువుకు ఎలాంటి మినహాయింపులు లేవన్నది స్పష్టం.” ఇప్పటికే 55శాతం ఆటోమొబైల్‌ పరిశ్రమ అమెరికా నుంచి వెళ్లిపోయింది.నేను గనుక అధ్యక్షుడిగా ఎన్నిక కాకుంటే మిగిలింది కూడా అదే దారిలో ఉంటుంది. చైనా లేదా ఇతర దేశాలన్నీ అమెరికాలో అమ్ముకోవాలంటే ఇక్కడే తయారు చేయాలి, మా కార్మికులతోనే పని చేయించాలి. ఇప్పుడు వారు మెక్సికోలో పెద్ద కర్మాగారాలను నిర్మిస్తున్నారు, పన్నులు లేకుండా అమెరికాలో కార్లు అమ్ముకుంటున్నారు.” అని ట్రంప్‌ పేర్కొన్నాడు. తాను గనుక ఎన్నికైతే అమెరికా దిగుమతి చేసుకుంటున్న మూడులక్షల కోట్ల డాలర్ల విలువగల వస్తువులపై పదిశాతం, చైనా వస్తువులపై 60శాతం పన్ను విధించే అవకాశాలను పరిశీలించాలని తన సలహాదారులను కోరినట్లు వాషింగ్టన్‌ పోస్టు పత్రిక రాసింది.


డోనాల్డ్‌ ట్రంప్‌ ఏలుబడిలో చైనా వస్తువులపై విధించిన పన్నులు ప్రపంచ వాణిజ్య సంస్థ నిబంధనలకు విరుద్దం. అది చివరికి అమెరికాకే నష్టమని తేలటంతో ట్రంప్‌ ఇంటిదారి పట్టాల్సి వచ్చింది. ఇప్పుడు అంతకంటే ఎక్కువ పన్నులు విధిస్తానని చెబుతున్నాడు అంటే జనం, కార్పొరేట్స్‌ ఎలా స్పందిస్తాయో చూడాల్సి ఉంది. అమెరికా ప్రారంభించిన క్రీడలో భాగస్వాములయ్యేందుకు ఐరోపా యూనియన్‌ దేశాలు సిద్దంగా లేవు. అందుకే ఫిబ్రవరి మొదటి వారంలో బ్రసెల్స్‌లో జరిగిన మూడవ ఇండో-పసిఫిక్‌ వేదిక సమావేశానికి అమెరికా, చైనా రెండు దేశాలనూ ఆహ్వానించలేదు. గతేడాది అమెరికా పొల్గొన్నది. అసలు ఏ సమావేశానికీ చైనాను ఆహ్వానించలేదు. దీని అర్ధం ఏమిటంటే ఈ రెండింటిలో ఏదో ఒక దేశం వెనుక చేరటం గాకుండా ఎవరి ప్రయోజనాల మేరకు వారు వ్యవహరించాలని చెప్పటమే అని విశ్లేషకులు భాష్యం చెప్పారు. రెండింటి నుంచి వీలైన మేరకు ఎక్కువ రాయితీలు పొందే ఎత్తుగడ కూడా కావచ్చు. దీన్నుంచి మన దేశం పాఠాలు నేర్చుకుంటుందా ? పెరుగుతున్న చైనా పలుకుబడిని అడ్డుకునేందుకు అమెరికా ముందుకు తెచ్చిన ఐపిఇఎఫ్‌ (ఇండో-పసిఫిక్‌ ఎకనమిక్‌ ఫ్రేమ్‌వర్క్‌ ) పట్ల అమెరికా నేతలే ఆసక్తి చూపటం లేదని తాజాగా విశ్లేషణలు వెలువడ్డాయి.ఈ కూటమిలో అమెరికా, జపాన్‌, దక్షిణ కొరియా, ఆస్ట్రేలియా, బ్రూనే,భారత్‌, ఇండోనేషియా, మలేసియా, ఫిజీ, న్యూజిలాండ్‌, ఫిలిప్పీన్స్‌, సింగపూర్‌, థారులాండ్‌, వియత్నాం ఉన్నాయి. వాణిజ్యం మీద ఒప్పందం కుదుర్చుకోవాలని గతేడాది నవంబరులో జరిగిన సమావేశంలో చూసినప్పటికీ అమెరికాలోని పలువురు ఎంపీలు లేవనెత్తిన అభ్యంతరాల కారణంగా కుదరలేదు. ఇది ఆలస్యం కాదు, పూర్తిగా వెనక్కుపోయినట్లే అని బ్రౌన్‌ అనే ఎంపీ మీడియాతో చెప్పాడు.చైనాను దెబ్బతీసేందుకు పన్నెండు పసిఫిక్‌ ప్రాంత దేశాలతో కూడిన టిపిపి కూటమిని అమెరికా ముందుకు తెచ్చింది. అయితే దాన్నుంచి తాము వైదొలుగుతున్నట్లు ప్రకటించిన అమెరికా ఐపిఇఎఫ్‌ను ముందుకు తెచ్చింది. దీన్లో కూడా తమకు పెద్దగా ప్రయోజనం లేదనే భావనతో అమెరికా ఉంది. ఈ ఒప్పందానికి ట్రంప్‌ పెద్దగా ఆసక్తి చూపటం లేదు. విదేశాల నుంచి వస్తున్న దిగుమతులతో అమెరికా పారిశ్రామిక ఉత్పత్తి పడిపోయింది, కార్మికులకు ఉపాధి పోయింది. జనంలో ఉన్న అసంతృప్తిని సొమ్ము చేసుకొనేందుకు మరోసారి అమెరికాను గొప్పగా తయారు చేయాలనే పిలుపుతో డోనాల్డ్‌ ట్రంప్‌ ప్రచారంతో ముందుకు పోతున్నాడు. ఒక వేళ జో బైడెన్‌ గెలిచినప్పటికీ ఐపిఇఎఫ్‌లో వాణిజ్యం అనే నాలుగువ స్థంభాన్ని నిర్మించటం సాధ్యం కాదని జపాన్‌-ఆసియా ట్రేడ్‌ నిపుణుడు డేవిడ్‌ బోలింగ్‌ చెప్పాడు.ఈ పూర్వరంగంలో మన మార్కెట్లో తన వస్తువులను గుమ్మరించటానికి, పెట్టుబడులకు రాయితీలు పొందటానికి అమెరికా తెస్తున్న వత్తిడికి రాయబారి ప్రసంగం తీరు నిదర్శనం. తమ ప్రయోజనాలను ఫణంగా పెట్టి విదేశీ సంస్థలకు పెద్ద పీట వేస్తామంటే మన కార్పొరేట్‌ సంస్థలు అంగీకరిస్తాయా ? వీలైతే వాటితో చేతులు కలిపి లబ్ది పొందుతాయి లేకుంటే ప్రతిఘటిస్తాయి.

లక్షాధికారి అక్కలంటూ మునగ చెట్టెక్కించిన నరేంద్రమోడీ !

Tags

, , , , ,


ఎం కోటేశ్వరరావు


ఏదీ ఊరికే రాదు అన్న ఒక ఆభరణాల వాణిజ్య ప్రకటన గురించి అందరికీ తెలిసిందే. అటువంటపుడు ప్రధాని నరేంద్రమోడీ మహిళల గురించి ఊరికే మాట్లాడతారా ? సమస్యేలేదు. అందునా ఎన్నికలు, ఓట్ల కోసం మహిళలను ఎందుకు వదలిపెడతారు. పార్లమెంటు బడ్జెట్‌ సమావేశాల సందర్భంగా మీడియాను ఉద్దేశించి(పత్రికా గోష్టి కాదు) మాట్లాడుతూ ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్‌ ప్రవేశపెట్టబోయే బడ్జెట్‌ బ్రహ్మాండమైన నారీశక్తి (మహిళా సాధికారత) అవుతుందని చెప్పారు. ఆమె ప్రవేశపెట్టింది ఓట్‌ ఆన్‌ ఎకౌంట్‌ తప్ప దాన్ని బడ్జెట్‌గా పరిగణించరు. ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేసిన ప్రసంగం, నిర్మలా సీతారామన్‌ బడ్జెట్‌ ” మహిళా సాధికారత పండగ ” అని కూడా వర్ణించారు.నూతన పార్లమెంటు భవనంలో జరిగిన తొలి సమావేశంలో నారీశక్తి అభియాన్‌కు ఆమోదాన్ని చూశారని, జనవరి 26న కర్తవ్యపథ్‌లో మహిళాశక్తిని చూశారని అన్నారు. రామ్‌ రామ్‌ అంటూ మీడియాతో మాటలు ప్రారంభించిన ప్రధాని అలవాటుగా అల్లరి చేసే, ప్రజాస్వామిక విలువలను నిలువునా కాలరాసే ప్రతిపక్షాలు ఆత్మశోధన చేసుకోవాలని కూడా సలహా ఇచ్చారు. చివరిలో కూడా రామ్‌ రామ్‌ అంటూ ముగించారు. ఎనభై మూడు లక్షల స్వయం సహాయక బృందాలలో తొమ్మిది కోట్ల మంది ఉన్నారని, వారిలో కోటి మంది ఎంతో మందికి స్పూర్తినిస్తూ చిన్న చిన్న వ్యాపారాలతో లక్షాధికారి అక్కలు(లక్‌పతి దీదీ)గా మారినట్లు మూడు కోట్ల మందిని లక్‌పతి దీదీలుగా మార్చనున్నట్లు తాత్కాలిక బడ్జెట్‌ ప్రసంగంలో నిర్మలా సీతారామన్‌ చెప్పారు. దీనికి పండగ చేసుకోవాలని ప్రధాని మోడీ గారు ముక్తాయింపు ఇస్తున్నారు.


గతంలో బేటీ బచావో, బేటీ పఢావో అని పిలుపు ఇచ్చారు.ఇప్పుడు మరో కొత్త నినాదంతో ఆకర్షించేందుకు పూనుకున్నారు. దేశంలో మహిళల సంఖ్య ఎక్కువ అన్నది తెలిసిందే. ఏ దేశంలోనైనా ఎందరు మహిళలు శ్రామికశక్తిలో ఉన్నారన్నది ఒక గీటురాయిగా చూస్తారు. ప్రతిదాన్నీ డబ్బుతో, లాభ నష్టాలతో కొలుస్తున్నారు గనుక శ్రామిక శక్తిలో మహిళలు ఎందరు అంటే లెక్కలతో ఆడుకుంటున్నారు. ఏటా రెండు కోట్ల మందికి ఉపాధి కల్పన ఎంతవరకు వచ్చిందని గతంలో ప్రధాని నరేంద్రమోడీని అడిగితే పకోడీ బండివారికి కూడా ఉపాధి కల్పించినట్లే లెక్కవేసుకోవాలని చెప్పిన సంగతి తెలిసిందే. అఫ్‌కోర్సు పకోడీ బండి వేసుకోవటమేమీ తప్పు కాదు. అసలు పకోడీలు కొని తినే శక్తి ఎంత మందికి ఉందన్నది ప్రశ్న. ఏ దేశమైనా సేవారంగంలో కాకుండా ఉత్పాదక రంగంలో ఎంత మందికి ఉపాధి కల్పించారు, ఎంత ఉత్పత్తి చేస్తున్నారన్నదే ప్రధాన అంశంగా చూస్తారు. దేశంలో 2022-23లో నియమిత కాల కార్మిక శక్తి సర్వే ప్రకారం మహిళలు అంతకు ముందుతో పోలిస్తే 4.2శాతం పెరిగి యూజువల్‌ స్టేటస్‌ లెక్కింపు అవగాహన ప్రకారం 37శాతానికి చేరినట్లు కేంద్ర ప్రభుత్వం గతేడాది అక్టోబరు తొమ్మిదిన ప్రకటించింది. ఈ పదానికి అర్ధం ఏమిటి ? ఉదాహరణకు సర్వే చేసినపుడు ఒక వ్యక్తి అతడు లేదా ఆమె సదరు ఏడాదిలో తాను ఏడు నెలల పాటు పని చేసినట్లు లేదా పనికోసం అందుబాటులో ఉన్నట్లు గానీ, పని కావాలని కోరినట్లయితే శ్రామికశక్తిలో ఉన్నట్లు లెక్కవేస్తారు. అందుకే ఇది అంకెల గారడీ అని చెప్పాల్సి వస్తోంది. ఒక్కసారిగా ఇంత పెరుగుదల ఎలా సాధ్యమైంది అంటే నరేంద్రమోడీ అమలు జరుపుతున్న నైపుణ్యవృద్ధి, మహిళా అనుకూల విధానాలు, మహిళల నాయకత్వంలో జరుగుతున్న అభివృద్ధి ఫలితం అని ఠకీమని చెబుతారు. ఒక పదార్ధాన్ని కొలవగలం గానీ గాలిని పట్టుకోలేం, చూడలేం !


ప్రభుత్వం ప్రకటించిన సమాచారాన్ని విశ్లేషించిన పరిశోధకులు చెబుతున్న అంకెలకు వీటికి పొంతన కుదరటం లేదు. అందుకే అమిత్‌ షా మాటల్లో ప్రభుత్వ ప్రకటనలను జుమ్లా (అవసరానికి ఏదో చెబుతుంటాం) అనాల్సి వస్తోంది. ఇండియా టుడే వెబ్‌సైట్‌ 2023 జూన్‌ పదకొండున రోషిణీ చక్రవర్తి రాసిన విశ్లేషణకు ” భారత్‌లో తగ్గుతున్న మహిళా శ్రామికులు, ఎందుకు పని చేయటం లేదు ” అనే శీర్షిక పెట్టింది. భారత్‌లో వేతనాలు చెల్లించే ఉపాధిలో మహిళలు ఇరవైశాతానికి లోపుగానే ఉన్నట్లు ప్రపంచ కార్మిక సంస్థ (ఐఎల్‌ఓ) నివేదికను దానిలో ఉటంకించారు. ఐఎల్‌ఓ నివేదిక ప్రకారం ఉపాధిలో కేవలం 19.2శాతం మంది మాత్రమే మహిళలు ఉండగా పురుషుల్లో 70.1శాతం ఉన్నారు. ప్రపంచ ఆర్థిక వేదిక లింగ అసమానతల నివేదిక 2022 ప్రకారం 146 దేశాల జాబితాలో 135వ స్థానంలో భారత్‌ ఉంది.ప్రపంచ శ్రామిక శక్తిలో లింగ సమానత్వం రావాలంటే 132 సంవత్సరాలు పడుతుందని ఆ నివేదిక పేర్కొన్నది. అట్టడుగున్న ఉన్న మన దేశానికి ఇంకా ఎక్కువ వ్యవధి పడుతుందని వేరే చెప్పనవసరం లేదు. మహిళల భాగస్వామ్యం పెరిగితే 2025 నాటికి జిడిపిలో 70వేల కోట్ల డాలర్లు పెరుగుతుందన్నది ఒక అంచనా. ఐఎల్‌ఓ నివేదిక ప్రకారం భారత్‌లో 52శాతం మంది మహిళలు వేతన ఉపాధి లేదా లేదా కుటుంబ సంరక్షణలో రెండింటిలో ఉంటామని చెప్పారు. కానీ 2005లో 32శాతంగా ఉన్న మహిళా శ్రామిక శక్తి 2021నాటికి 19.2శాతానికి తగ్గింది.


అరబ్బు, ఇస్లామిక్‌ దేశాల్లో ప్రముఖ మీడియా సంస్థ అల్‌ జజీరా. అది 2023 ఏప్రిల్‌ పదిన ఒక విశ్లేషణ ప్రచురించింది.” జనాభాలో భారత్‌ దూసుకుపోతున్నా శ్రామిక శక్తిలో తగ్గుతున్న మహిళలు ” అని పేరు పెట్టింది.ప్రపంచంలో వేగంగా వృద్ధి చెందుతున్న ఆర్ధిక వ్యవస్థ ఉన్న భారత్‌ మహిళా శ్రామిక శక్తిలో ప్రపంచంలోని అతితక్కువ 20దేశాల్లో ఒకటిగా ఉందని, గత కొద్ది సంవత్సరాలుగా తగ్గుతున్నట్లు పేర్కొన్నది. పెరుగుతున్న జనాభాకు ప్రత్యేకించి మహిళలకు ఉపాధిని చూపటంలో విఫలమైతే భారత్‌కు అది గుదిబండగా మారుతుంది. అధికారిక సమాచారాన్ని విశ్లేషించినపుడు 2004లో గరిష్టంగా 35శాతం మంది మహిళలు ఉపాధి పొందగా 2022 నాటికి అది 25శాతానికి తగ్గినట్లు అజీమ్‌ ప్రేమ్‌జీ విశ్వవిద్యాలయానికి చెందిన ఆర్థికవేత్త రోజా అబ్రహాం చెప్పిన అంశాన్ని అల్‌ జజీరా ఉటంకించింది. సిఎంఐయి ఉపాధి నిర్వచనం ప్రకారం 2022లో పని చేసే వయస్సులో ఉన్నవారిలో కేవలం పదిశాతం మంది మాత్రమే అంటే 3.9 కోట్ల మంది మహిళలు మాత్రమే పని చేస్తూ ఉండటం లేదా పని కోసం ఎదురు చూస్తున్నవారున్నారని , అదే పురుషుల విషయానికి వస్తే 36.1కోట్ల మంది ఉన్నట్లు పేర్కొన్నది. పని చేయగలిగిన వయస్సు వారి పెరుగుదలకు అనుగుణంగా ఉపాధి పెరగటం లేదని, గత దశాబ్దిలో మంచి ఉద్యోగాలు గణనీయంగా తగ్గినట్లు, మహిళలు తక్కువ వేతనాలతో పని చేయటం కంటే ఇంటి దగ్గర ఉండి ఇల్లు, పిల్లలను చూసుకోవటం మరింత లాభదాయకమని వారి కుటుంబాలు భావిస్తున్నాయని సిఎంఐఇ డైరెక్టర్‌ మహేష్‌ వ్యాస్‌ చెప్పిన మాటలను ఉటంకించింది.శ్రామిక శక్తిలో మహిళల భాగస్వామ్యం పదిశాతం పెరిగితే జిడిపి 552 బిలియన్‌ డాలర్ల మేరకు అదనంగా పెరుగుతుందని 2018లో మెకెన్సీ నివేదిక పేర్కొన్నది. క్వాల్‌ట్రిక్స్‌ డాట్‌కామ్‌ సమాచారం ప్రకారం 2022లో ప్రపంచంలోని 180దేశాలలో శ్రామిక శక్తిలో 52.7శాతం మహిళలతో ఆర్మేనియా మొదటి స్థానంలో ఉంది.ప్రపంచ సగటు 39.49శాతం.మన దేశం 23.54శాతంతో 166వ స్థానంలో ఉంది.మనకంటే ఎగువన 147లో నేపాల్‌, 153, 156 స్థానాలలో శ్రీలంక, బంగ్లాదేశ్‌, దిగువున 168వ స్థానంలో పాకిస్తాన్‌ ఉంది. మనతో జనాభాలో పోటీ పడుతున్న చైనా 45.17శాతంతో 89వ దేశంగా ఉంది.


ఇక లక్షాధికారి అక్క (లక్‌పతి దీదీ ) పధకం గురించి చూద్దాం. రెండు కోట్ల మంది లక్షాధికారులైనట్లు నిర్మలమ్మ చెప్పారు. ఈ పథకాన్ని పర్యవేక్షిస్తున్న గ్రామీణాభివృద్ది మంత్రిత్వశాఖ వెబ్‌సైట్‌లో ఫిబ్రవరి రెండవ తేదీన ఉన్న సమాచారం ప్రకారం స్వయం సహాయక బృందాలలో ఉన్న మహిళలు 9 కోట్ల 17లక్షల రెండువేల 245 మంది.వీరిలో ఏడాదికి పాతికవేల కంటే తక్కువ ఆదాయం వచ్చిన వారు 44,72,431(ఐదుశాతం) మంది, ఇరవై అయిదు నుంచి 60వేలకు వరకు వచ్చిన వారు 3,99,16,213(48శాతం) మంది, అరవై ఒకటి నుంచి లక్ష వరకు రాబడి వచ్చిన వారు 2,43,09,855(29శాతం) మంది, లక్షకు పైగా వచ్చిన లక్షాధికారి అక్కల సంఖ్య 1,42,53,969(17శాతం)గా పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో 2023 ఏప్రిల్‌ ఒకటి నుంచి అమల్లో ఉన్నాయని చెబుతున్న కనీసవేతనాల ప్రకారం నైపుణ్యం లేని వారికి నెలకు రు.12,344, నైపుణ్యం కలిగిన వారికి రు.13,844, అధిక నైపుణ్యం కలిగిన వారికి రు.14,844 కంటే తక్కువ చెల్లించటానికి లేదు. వీరిలో స్వయం సహాయక బృందాల మహిళలను ఏ తరగతిలో చేరిస్తే ఆ మేరకు ఏడాదికి వారికి రావాల్సిన కనీసవేతనాల రాబడి వరుసగా రు.1,48,128, రు.1,66,128, రు.1,78,128గా ఉంటుంది. ఇక బంగారు తెలంగాణా గురించి చెప్పుకుంటే రాష్ట్ర విభజనకు ముందు ఉన్న వేతనాలు తప్ప ఇంతవరకు సవరించలేదు గనుక చెప్పుకోకపోవటమే మంచిది. ఆంధ్రప్రదేశ్‌లో లక్షాధికారి అక్కల పరిస్థితి చూస్తే 89,56,262 మందిలో ఏడాదికి రు. పాతికవేల కంటే తక్కువ వచ్చే వారు ఎనిమిది శాతం, పాతిక నుంచి అరవైవేల మధ్య వారు 39, అరవై నుంచి లక్ష వచ్చే వారు 37, అంతకు మించి వస్తున్నట్లు చెబుతున్నవారు 17శాతం(దేశ సగటుతో సమానం) ఉన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో అంగన్‌ వాడీలను జగన్‌ సర్కార్‌ అధిక నైపుణ్యం కలిగిన వారిగా పరిగణించి, తాము ప్రకటించిన కనీసవేతనాలు అమలు జరిపి ఉంటే నలభై రోజులకు పైగా వారు సమ్మె చేసి ఉండే వారు కాదు, లక్షలాది మంది పిల్లలు, పోషకాహారం అందాల్సిన మహిళలను ఇబ్బంది పెట్టి ఉండేవారు కాదు. అంగన్‌వాడీలకు నైపుణ్యం లేకపోతే ఆ బాధ్యతల్లో నియమించరు.

ఆంధ్రప్రదేశ్‌లో సర్వేచేసిన యాంకర్‌ పరిశోధన సంస్థ 2022 డిసెంబరులో నివేదించిన ప్రకారం ప్రకాశం జిల్లా గ్రామీణ ప్రాంతాలలో గౌరవ ప్రదమైన జీవనంలో ఒక భోజనానికి అయ్యే ఖర్చును రు.81.89గా లెక్కించింది. కుటుంబంలో నలుగురు ఉంటే స్కూల్లో ఉన్న పిల్లలకు ఉచిత భోజనం ఉన్నందున ఆ మేరకు తగ్గిస్తే రు.79.16కు తగ్గుతుంది.ఈ లెక్కన ఒక మనిషికి నెలకు రు.2,408, కుటుంబానికి రు.9,632 అవుతుంది. ఇవిగాక బట్టలు, ఇతర అవసరాలను లెక్కిస్తే అవి అదనం. ఆ సంస్థ వేసిన అంచనా ప్రకారం ప్రకాశం జిల్లాలో ఒక కుటుంబానికి గౌరవ ప్రదమైన జీవన రాబడి నెలకు రు.25,269 ఉండాలని, జీవన వేతనం రు.16,077 ఉండాలని పేర్కొన్నది. పైన పేర్కొన్న వివరాల ప్రకారం లక్షాధికారి అక్కతో పాటు కుటుంబంలో మరొక సంపాదన వ్యక్తి ఉన్నప్పటికీ వచ్చే రాబడి సరిపోతుందా ? గౌరవ ప్రదమైన జీవనానికి అవసరమైన రాబడి లేదు గనుకనే పోషకాహార లోపంతో పిల్లలు, మహిళలు ఉన్నారు.దానికి పక్కా నిదర్శనం రక్తహీనత ముక్త భారత్‌గా రూపొందించాలని కేంద్ర ప్రభుత్వం పిలుపు ఇవ్వటమే. జాతీయ ఆరోగ్య సర్వే 2019-21లో సేకరించిన సమాచారంతో అంతకు ముందు సర్వే వివరాలతో పోలిస్తే దేశంలో ఆరేండ్లలోపు పిల్లలు, 15-49 సంవత్సరాల మధ్య ఉన్న గర్భిణులు, మొత్తం మహిళల్లో రక్తహీనత పెరిగింది. ఆంధ్రప్రదేశ్‌ పిల్లల్లో 58.6 నుంచి 63.2 శాతానికి పెరగ్గా మహిళల్లో స్వల్పంగా మాత్రమే తగ్గింది. తెలంగాణాలో పెరిగింది. రెండు రాష్ట్రాలు సంక్షేమ పధకాలను అమలు జరుపుతున్నప్పటికీ మిగతావాటితో పోల్చినపుడు పరిస్థితి పెద్దగా తేడాలేదు. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణా మాదిరి సంక్షేమ పధకాలు లేని కేరళలో రక్తహీనత సమస్య ఉన్నప్పటికీ తెలుగు రాష్ట్రాలతో పోలిస్తే చాలా తక్కువగా ఉంది. ఓట్ల కోసం మహిళలను మునగ చెట్టు ఎక్కించటానికి చూస్తారు. స్వయం సహాయక బృందాల ద్వారా లక్షాధికారి అక్కలు తయారైతే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం ఏలుబడిలోనే మొత్తం పరిస్థితి మారిపోయి ఉండేది. అందువలన తుపాకి రాముడి మాటలను నమ్మితే మరోసారి మోసపోవటమే !

పోరుబాటలో ఐరోపా రైతాంగం, బుధవారం నాడు అనేక దేశాల్లో రోడ్ల దిగ్బంధనం !

Tags

, , , , , ,


ఎం కోటేశ్వరరావు


బ్రసెల్స్‌లో జరుగుతున్న ఐరోపా యూనియన్‌ సమావేశాల సందర్భంగా తమ నిరసన వెల్లడిస్తూ బెల్జియం, ఫ్రాన్స్‌, ఇటలీ తదితర దేశాల్లో రైతులు (జనవరి 31) బుధవారం నాడు ఆందోళనకు దిగారు. నౌకాశ్రయాలు,ఇతర ఆర్థిక కేంద్రాలలో లావాదేవీలను జరగకుండా చేశారు. అనేక చోట్ల ట్రాక్టర్లు, ఇతర వ్యవసాయ వాహనాలతో రోడ్లను దిగ్బంధనం చేశారు.బ్రసెల్స్‌ నగరంలో ప్రవేశించేందుకు పెద్ద ఎత్తున నలుమూలల నుంచీ తరలి వస్తున్నట్లు వార్తలు వచ్చాయి. గురువారం నాడు నిరసన తెలపనున్నట్లు ప్రకటించారు. అనేక చోట్ల పౌరజీవనానికి కూడా ఆటంకం కలిగింది. రైతుల సమస్యలను వినాల్సి ఉందని బెల్జియం ప్రధాని అలెగ్జాండర్‌ డెకరో అన్నాడు. వాతావరణ మార్పుల నుంచి పర్యావరణ కాలుష్యం వరకు అనేక పెద్ద సమస్యలను వారు ఎదుర్కొంటున్నారని చెప్పాడు. తీవ్ర వ్యతిరేకత వెల్లడవుతున్న కారణంగా దక్షిణ అమెరికా దేశాలతో స్వేచ్చావాణిజ్య ఒప్పందాన్ని తాత్కాలికంగా పక్కన పెడుతున్నట్లు ఫ్రెంచి అధ్యక్షుడు మక్రాన్‌ ప్రకటించాడు. ఐరోపా యూనియన్‌ పార్లమెంటు ఎన్నికలు త్వరలో జరగనున్నాయి. పార్టీలన్నీ సిద్దం అవుతుండగా వివిధ దేశాల్లో రైతులు పోరుబాట పడుతున్నారు.నిన్న జర్మనీ, రుమేనియాలో, నేడు ఫ్రాన్సు, ఇతర దేశాల్లో రైతులు రోడ్డెక్కారు. అనేక దేశాల్లో వివిధ రూపాల్లో ఆందోళనలు జరుగుతున్నాయి. అక్కడ రైతులు మన మాదిరిగా జెండాలు పట్టుకొని ప్రదర్శనలు చేయటానికి బదులు ట్రాక్టర్లు, ట్రక్కుల వంటి వాటితో వచ్చి ఎక్కడికక్కడ రోడ్ల మీద నిలిపివేసి నిరసన తెలుపుతున్నారు.అనేక యాప్‌లు అందుబాటులోకి వచ్చాయి. టిక్‌టాక్‌ వంటి వాటిలో నిరసన వీడియోలు నింపుతూ ప్రచారంలో పెడుతున్నారు. ఐరోపా సామాజిక మాధ్యమాల్లో ఆకర్షిస్తున్న పదాల జాబితాలో ” రైతులు ” కూడా చేరిందంటే సమస్యల తీవ్రతకు అద్దం పడుతున్నది.


ఐరోపా యూనియన్‌ దేశాల్లో రుమేనియాలో అత్యధికంగా 35లక్షల మంది రైతులు ఉన్నారు. జనవరి పది నుంచి వీరితో పాటు రవాణారంగ కార్మికులు అనేక సందర్భాలలో కలిసే ఆందోళనలు చేస్తున్నారు. ప్రభుత్వానికి సమర్పించిన 47 డిమాండ్ల జాబితాలో డీజిల్‌ పన్ను తగ్గింపు, మోటారు వాహనాలపై పౌర సంబంధ బీమా ప్రీమియం తగ్గింపు వంటి అంశాలతో పాటు ఉక్రెయిన్‌ సంక్షోభం ముందుకు తెచ్చిన ప్రధాన అంశాలు ఉన్నాయి.ఐరోపా దేశాల్లో రవాణాకు పర్మిట్లు అవసరం, ఉక్రెయిన్‌ సంక్షోభం తరువాత వాటిని ఎత్తివేశారు. దాంతో రవాణా ఖర్చులు తక్కువగా ఉండే ఉక్రెయిన్‌ వాహనాల నుంచి వచ్చిన పోటీని రుమేనియా, ఇతర దేశాల ట్రక్కుల యజమానులు తట్టుకోలేకపోతున్నారు. అంతేకాదు, అక్కడి నుంచి చౌకగా దిగుమతి చేసుకుంటున్న ధాన్యం వంటి వ్యవసాయ ఉత్పత్తుల కారణంగా మిగతా దేశాల్లో ధరలు పడిపోయి రైతాంగానికి గిట్టుబాటు కావటం లేదు. రుమేనియా రాజధాని బుఖారెస్ట్‌లో నిరసన తెలిపేందుకు వచ్చిన వారిని జనవరి పదిన అడ్డుకున్నారు. దాంతో ఇరవై కిలోమీటర్ల పొడవున రైతులు భైఠాయించారు. పది రోజుల తరువాత 21వ తేదీన అనుమతి ఇచ్చారు. అంతకు ముందు ఉక్రెయిన్‌తో రెండు చోట్ల సరిహద్దులను రైతులు దిగ్బంధించారు. మన దేశంలో నిరసన తెలిపిన వారిని రైతులు కాదని ఎలా నిందించారో రుమేనియాలో కూడా అదే జరిగింది. సాధారణ రైతులతో పాటు వ్యవసాయ రంగంతో సంబంధం ఉన్న చిన్న, మధ్య తరగతి వ్యాపారులు కూడా బాసటగా నిలిచారు.
నాలుగుశాతం భూమిని సాగు చేయకుండా వదలి వేయాలని, పంటల మార్పిడి పద్దతిని విధిగా పాటించాలని, రసాయన ఎరువుల వాడకాన్ని ఇరవై శాతం తగ్గించాలనే నిబంధనలను ఐరోపా యూనియన్‌ అమలు చేయనుంది. దీని వలన ప్రపంచంలో ఇతర రైతులతో చౌకగా వచ్చే దిగుమతులతో తాము పోటీపడలేమని స్థానిక రైతులు చెబుతున్నారు.దీనికి తోడు ద్రవ్యోల్బణం కారణంగా తమకు నేరుగా ఇచ్చే నగదు విలువకూడా తగ్గుతున్నదని ఆందోళన వెల్లడిస్తున్నారు. ఉక్రెయిన్‌ సంక్షోభం ఐరోపా అంతటా రైతాంగాన్ని ప్రభావితం చేయటంతో వారు వీధుల్లోకి వస్తున్నారు. ఉక్రెయిన్లో సగటు కమత విస్తీర్ణం వెయ్యి హెక్టార్లు కాగా, ఐరోపా ఇతర దేశాల సగటు కేవలం 41హెక్టార్లు మాత్రమే. అందువలన గిట్టుబాటులో కూడా తేడా ఉంటున్నది.ఉక్రెయిన్‌ దిగుమతులను నిరసిస్తూ పోలాండ్‌ రైతులు జనవరి 24న దేశవ్యాపితంగా ఆందోళన చేశారు.ఉక్రెయిన్‌ ధాన్యాన్ని ఆఫ్రికా, ఆసియా మార్కెట్లకు పంపాలి తప్ప ఐరోపా దేశాలకు కాదని పోలాండ్‌ రైతు సంఘ ప్రతినిధి చెప్పాడు.

ఉక్రెయిన్‌ యుద్ధం కారణంగా ఇప్పటి వరకు స్పెయిన్‌, ఇటలీ,పోర్చుగీసు రైతులు ప్రభావితం కాలేదని, అయితే పర్యావరణ రక్షణ చర్యలు వారిని కూడా వీధుల్లోకి తీసుకురానున్నాయని విశ్లేషకులు చెబుతున్నారు.స్పెయిన్‌, పోర్చుగీసులో కొన్ని ప్రాంతాల్లో అనావృష్టి కారణంగా వ్యవసాయానికి వాడే నీటిపరిమాణం మీద ప్రభుత్వాలు ఆంక్షలు విధించాయి. జరిగిన నష్టాలకు తమకు పరిహారం ఇవ్వటం లేదని రైతులు విమర్శించారు. ఒక్కోచోట ఒక్కో సమస్య ముందుకు వస్తుండటంతో గత కొన్ని సంవత్సరాలుగా వివిధ ఐరోపా దేశాల్లో రైతులు రోడ్లెక్కటం ప్రారంభించారు.పర్యావరణ పరిరక్షణలో భాగమంటూ నత్రజని వాయువు విడుదలను పరిమితం చేసేందుకు పూనుకోవటంతో 2019లో నెదర్లాండ్‌ అంతటా రైతులు రోడ్లను దిగ్బంధించారు. గతేడాది డిసెంబరులో కూడా నిరసన తెలిపారు. ఉక్రెయిన్‌ డ్రైవర్లకు పర్మిట్‌ పద్దతి అమలు జరపాలని కోరుతూ పోలాండ్‌ ట్రక్కరు సరిహద్దులను మూసివేసి అడ్డుకున్నారు. ఉక్రెయిన్‌ నుంచి వస్తున్న చౌక దిగుమతులను అడ్డుకోవాలని రైతులు జనవరి ప్రారంభంలో వీధుల్లో ప్రదర్శనలు చేశారు. వ్యవసాయ సబ్సిడీల కోత ప్రతిపాదనలకు నిరసనగా జర్మన్‌ రైతులు వేలాది మంది బెర్లిన్ను దిగ్బంధం చేశారు. తాజాగా ఫ్రాన్సులో పెద్ద ఎత్తున నిరసన తెలుపుతున్నారు, కొన్ని చోట్ల హింసారూపం తీసుకుంది.


వివిధ దేశాల నుంచి చౌకగా దిగుమతులు చేసుకుంటూ తమ పొట్టగొడుతున్నారని ఆగ్రహించిన ఫ్రెంచి రైతులు తమ దేశం గుండా స్పెయిన్‌ నుంచి మొరాకో వెళుతున్న వైన్‌, కూరగాయల రవాణా ట్రక్కులను అడ్డుకొని ధ్వంసం చేశారు. తమను ఫణంగా పెట్టి మక్రాన్‌ ప్రభుత్వం ద్రవ్యోల్బణాన్ని తగ్గించేందుకు పూనుకుందని, ఫలితంగా ఆహార ఉత్పత్తిదారులు ధరలను తగ్గించాల్సి వచ్చిందని, హరిత విధానాల పేరుతో తీసుకుంటున్న చర్యలు కూడా తమను దెబ్బతీస్తున్నాయని రైతులు నిరసన తెలుపుతున్నారు.జీవ వైవిధ్యం పేరుతో ఐరోపా యూనియన్‌ నుంచి సహాయం పొందాలంటే నాలుగుశాతం భూమిని ఖాళీగా ఉంచాలని, రసాయన పురుగుమందులను వాడకాన్ని తగ్గించాలనే షరతులు పెడుతున్నట్లు చెబుతున్నారు. ఇటలీ నుంచి వస్తున్న కమలాలు కిలో 6.3 డాలర్లకు లభిస్తుండగా పురుగుమందులు తక్కువ వాడుతున్న కారణంగా ఉత్పత్తి ఖర్చులు పెరిగిన తమ సరకు 8.57 డాలర్లకు విక్రయించాల్సి వస్తున్నందున పోటీ ఎక్కువగా ఉందని రైతులు వాపోతున్నారు. అటు వినియోగదారులు, ఇటు రైతులూ ఇద్దరూ నష్టపోతున్నారు. ఇటీవల జరిగిన ఒక సర్వేలో 82శాతం మంది పౌరులు రైతాంగానికి మద్దతు తెలిపారు. ఫ్రాన్సులో మూడో వంతు మంది రైతులు దారిద్య్రరేఖకు దిగువున ఉండగా సగటున రోజుకు ఇద్దరు ఆత్మహత్య చేసుకుంటున్నట్లు పర్యావరణవేత్త యానిక్‌ జడోట్‌ చెప్పాడు. మట్టిపిసుక్కొనే వారని మన దేశంలో చిన్న చూపు చూస్తున్నట్లే ఫ్రాన్స్‌లో కూడా రైతులంటే చిన్న చూపు ఉంది. రైతుల ఆందోళన కారణంగా వ్యవసాయ ఇంథనంపై పన్నులు పెంచాలనే ప్రతిపాదనను వెనక్కు తీసుకుంటున్నట్లు ఫ్రెంచి నూతన ప్రధాని గాబ్రియెల్‌ అటాల్‌ జనవరి 26న ప్రకటించినప్పటికీ నిరసనలు కొనసాగుతూనే ఉన్నాయి.


ఉక్రెయిన్‌ నుంచి చౌకధరలకు వస్తున్న ధాన్యం, పంచదార, కోడి మాంసం, గుడ్లు కారణంగా తమ దేశాల్లో సమస్యలు తలెత్తిన కారణంగా వాటి మీద ఆంక్షలు విధిస్తామని తూర్పు ఐరోపా దేశాలను గతంలో ఫ్రాన్సు తప్పుపట్టింది. ఇప్పుడు అదే పాలకులు రైతుల ఆందోళన కారణంగా తమ వైఖరిని మార్చుకొని దిగుమతులను అడ్డుకోవాలని చెబుతున్నారు.బెల్జియంలో కూడా రైతులు నిరసన తెలిపారు. రాజధాని బ్రసెల్స్‌లో స్పెయిన్‌ నుంచి వస్తున్న ఐదు లారీల కూరగాయలను ధ్వంసం చేశారు. పారిస్‌కు దారితీసే రోడ్లను దిగ్బంధం చేయటం అంటే గీత దాటటమేనని, గ్రామీణ జీవనాన్ని నాశనం చేస్తున్నారని ప్రభుత్వం జనవరి 29న హెచ్చరించింది.రైతులు రాజధానిని దిగ్బంధం చేయనున్నారనే వార్తలతో అధ్యక్షుడు మక్రాన్‌ పారిస్‌ ముట్టడి అనే అంశం గురించి మంత్రులతో అత్యవసర సమావేశం జరిపాడు.పరిస్థితిని ఎదుర్కొనేందుకు మొత్తం ప్రభుత్వం, అధ్యక్షుడు కూడా సిద్దపడినట్లు ప్రభుత్వ ప్రతినిధి స్పష్టం చేశారు. నగరంలోకి ట్రాక్టర్లను అడ్డుకొనేందుకు పదిహేను వేల మంది పోలీసు, ఇతర సిబ్బందిని సిద్దం చేశారు. విమానాశ్రయాలు, ప్రధాన ఆహార మార్కెట్లకు ఆటంకం కలగకుండా చూడాలని ఆదేశించారు. రైతుల దిగ్బంధన ఆందోళన కారణంగా తాము దక్షిణ ఫ్రాన్సులో ప్రవేశించలేకపోతున్నామని బ్రిటన్‌ పౌరులు కొందరు చెప్పారు. తమ ఆందోళన పౌరులకు ఇబ్బంది కలిగించటం కాదని, సమస్య తీవ్రతను ప్రభుత్వానికి తెలియచేయటమే అని రైతులు చెప్పారు.


అనేక దేశాల్లో ప్రభుత్వాలు విఫలమైన కారణంగా మితవాద శక్తులు పేట్రేగిపోతున్నాయి. జూన్‌లో జరగనున్న ఐరోపా యూనియన్‌ పార్లమెంటు ఎన్నికల్లో తమ సత్తాచాటాలని చూస్తున్నాయి.ఐరోపా యూనియన్‌ కారణంగానే అన్ని తరగతుల వారూ సమస్యలను ఎదుర్కొంటున్నారని ప్రచారం చేస్తున్నారు. ఇటీవలి ఒక సర్వే ప్రకారం ఆస్ట్రియా, బెల్జియం, చెక్‌, ఫ్రాన్స్‌, హంగరీ, ఇటలీ, నెదర్లాండ్స్‌, పోలాండ్‌, స్లోవేకియాలలో మితవాద శక్తులది పైచేయి కావచ్చని, మరో తొమ్మిది దేశాలలో రెండవ, మూడవ స్థానాలలో ఉండవచ్చునని తేలింది.ఈ శక్తులు సామాజిక మాధ్యమంలో పెద్ద ఎత్తున ప్రవేశించాయి. రుమేనియాలో 2019లో కేవలం 1.75వేలుగా ఉన్న టిక్‌టాక్‌ వినియోగదారులు 2023నాటికి 78.5లక్షలకు పెరిగారు. ఫ్రాన్సులో 2.14 కోట్లు, జర్మనీలో 2.09కోట్లు, ఇటలీలో 1.97 కోట్ల మంది టిక్‌టాక్‌ వినియోగదారులు ఉన్నారు. రుమేనియాలో చౌక థరలకు లభిస్తున్న ఇంటర్నెట్‌ కారణంగా రైతుల ఉద్యమానికి ఎంతో ప్రచారం లభించిందని, మితవాద శక్తులు ప్రభుత్వాల పట్ల వ్యతిరేకతను పెంచుతున్నాయని కొంత మంది ఆరోపించారు. అసలు సమస్యలు తలెత్తకుండా ఎవరెన్ని ప్రచారాలు చేసినా జనం స్పందించరన్న సంగతి వేరే చెప్పనవసరం లేదు.

చావు బతుకుల మధ్య ప్రపంచీకరణ – దవోస్‌ ప్రపంచ వేదిక చెబుతున్నది ఇదేనా !

Tags

, , , , ,


ఎం కోటేశ్వరరావు


వాణిజ్య, రాజకీయ, మేథావులు, సమాజంలోని ఇతర నేతల ప్రమేయంతో ప్రపంచ పరిస్థితిని మెరుగుపరిచేందుకు, ప్రపంచ, ప్రాంతీయ, పరిశ్రమల అజెండాలకు ఒక రూపమిచ్చేందుకు ప్రపంచ ఆర్థిక వేదికను ఏర్పాటు చేసినట్లు ఐదు దశాబ్దాల క్రితం స్థాపకులు పేర్కొన్నారు. తొలుత ఐరోపా యాజమాన్య వేదికగా 1971లో ప్రారంభమైన ఈ స్వచ్చంద సంస్థ తరువాత 1987లో ప్రపంచ ఆర్ధిక వేదికగా పేరు మార్చుకుంది. ఈ ఏడాది జనవరి 15 నుంచి 19వరకు జరిగిన 54వ వార్షిక సమావేశాలలో పాల్గొన్నవారి వివరాలు చూస్తే అది ఎవరికి ప్రాతినిధ్యం వహిస్తుందో అర్దం చేసుకోవటం కష్టమేమీ కాదు.ప్రపంచంలోని వివిధ రంగాలలో వెయ్యి బడాకంపెనీల ప్రతినిధులు ఈ సంస్థ సభ్యులు. హాజరైన వారిలో 925 మంది కంపెనీల సిఇఓలు కాగా వారిలో 254 మంది ఒక్క అమెరికా నుంచే వచ్చారు.వీరుగాక వాణిజ్య సంస్థల ప్రతినిధులుగా మరో 799 మంది, 225 మంది అంతర్జాతీయ సంస్థల ప్రతినిధులు, 60 మంది వివిధ దేశాల నేతలు, మరో 851 మంది ఇతరులు వెళ్లారు. గతంలో చంద్రబాబు నాయుడు, కెటిఆర్‌, తాజాగా ఎనుముల రేవంత రెడ్డి వెళ్లి వచ్చిన తరువాత పెట్టుబడుల మీద ఒప్పందాలు కుదుర్చుకున్నట్లు చెప్పారు. అంటే అది వాణిజ్య, పరిశ్రమల ప్రతినిధుల క్లబ్‌, దాని సమావేశాలు జరిగే స్విడ్జర్లాండ్‌లోని దవోస్‌ ఒక విహార కేంద్రం.ఈ క్లబ్‌లో వ్యక్తులుగా సభ్యులుగా చేరాలంటే ఏడాదికి 52వేల డాలర్లు(మన కరెన్సీలో 43లక్షలు), పరిశ్రమల భాగస్వామిగా 2.63లక్షలు(రు.2.18 కోట్లు), వ్యూహాత్మక భాగస్వామిగా 6.20లక్షల(రు.5.21కోట్లు) డాలర్ల వంతున చెల్లించాలి.


ఐదు దశాబ్దాల తరువాత జరిగిన సమావేశ తీరుతెన్నులు, స్పందనలను చూస్తే వేదిక స్థాపక లక్ష్యం నెరవేరిందా అంటే అవునని చెప్పటం కష్టం. అంతర్జాతీయ అస్థిరతకు దోహదం చేసే తీవ్రమైన వాతావరణంలో దవోస్‌ వార్షిక సమావేశాలు జరుగుతున్నట్లు పోప్‌ ఫ్రాన్సిస్‌ తన సందేశంలో పేర్కొనటం గమనించాల్సిన అంశం.మరింత నైతిక పరమైన ప్రపంచీకరణ కోసం పని చేయాలని అది తప్పనిసరి అని పేర్కొన్నారు. ఈ ఏడాది భౌగోళిక రాజకీయాలు అస్థిరంగా ఉండటమే కాదు, దాదాపు 50దేశాల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఆ సందర్భంగా తప్పుడు సమాచార ముప్పు ఉందని, వాటిలో మనదేశం తొలి స్థానంలో ఉన్నట్లు సమావేశాల సందర్భంగా విడుదల చేసిన సర్వే హెచ్చరించింది. మరోవైపు అమెరికాలో డోనాల్డ్‌ ట్రంప్‌ మరోసారి గద్దెనెక్కనున్నారని అనేక మంది భావిస్తున్నప్పటికీ అమెరికా నుంచి కూడా ఉత్సాహంగా ప్రతినిధులు రాలేదు. అమెరికా, ఇతర ధనిక దేశాల విధానాలు ఎలా ఉంటాయో తెలియని స్థితిలో చైనా, భారత్‌ వంటి దేశాల నేతలు కూడా హాజరుకాలేదు. ఈ ఏడాది జరిగిన సమావేశాల తీరుతెన్నుల గురించి మాట్లాడుతూ ” సమస్యలను గుర్తించటానికి దవోస్‌ ఒక మంచి ప్రదేశం తప్ప వాటిని పరిష్కరించటానికి అంత మంచిది కాదు ” అని మార్క్‌ మలోచ్‌ బ్రౌన్‌ అనే బ్రిటీష్‌ ప్రముఖుడు చేసిన వ్యాఖ్య వర్తమాన ప్రపంచ కార్పొరేట్‌ రంగం, పెట్టుబడిదారీ వ్యవస్థ ఎదుర్కొంటున్న సంక్షోభానికి, ప్రారంభ లక్ష్యాలకు అసలు ఈ సంస్థ ఎంత దూరంగా ఉందో అద్దం పడుతున్నది. ఇంకా అనేక మంది భిన్నమైన అభిప్రాయాలను, అంచనాలను కూడా వెల్లడించారు.గడచిన మూడున్నర దశాబ్దాలలో ప్రతి దేశం లేదా కొన్ని దేశాల కూటములు రక్షణాత్మక చర్యలకు ఎక్కువగా పూనుకుంటున్నాయి తప్ప ప్రపంచీకరణ లక్ష్యానికి అనుగుణంగా పనిచేయటం లేదు. ఈ కారణంగా దానికి భిన్నమైన పరిణామాలు జరగటం ఆందోళన కలిగిస్తోందని గతేడాది ప్రపంచబ్యాంకు చెప్పింది.ఐరోపాలో అభివృద్ధి గిడసబారింది, దిగుమతి చేసుకొనేదేశాల్లో పరిస్థితులు బాగోలేవు గనుక చైనా వస్తువులు ఎగుమతి సమస్యలను ఎదుర్కొంటున్నాయి. అయితే ఎలక్ట్రిక్‌ వాహన రంగంలో అగ్రదేశాలకు సవాలు విసురుతున్నది. రష్యా నుంచి వచ్చే చౌక గ్యాస్‌ మీద ఆధారపడి నిర్మితమైన జర్మనీ ఆర్థిక వ్యవస్థ ఉక్రెయిన్‌ సంక్షోభం కారణంగా సమస్యలను ఎదుర్కొంటున్నది. రక్షణాత్మక చర్యలు, ప్రతిచర్యల్లో భాగంగా సరఫరా గొలుసులు ఏమౌతాయో తెలియదు.రక్షణాత్మక చర్యల్లో భాగం పెంచిన వడ్డీ రేట్లు అంతే వేగంగా తగ్గుతాయని ఎవరూ భావించటం లేదు.


అమెరికాాచైనాల మధ్య 2018 నుంచి వాణిజ్యపోరు కొనసాగుతున్నప్పటికీ అనేక మంది భావించినట్లు అది తీవ్రం కాలేదు గాని స్థిరపడిందని చెప్పవచ్చు. ఎవరికి ఉండే సమస్యలు వారికి ఉండటమే కారణం. తాము సృష్టించిన ఉక్రెయిన్‌ సంక్షోభం నుంచి పశ్చిమ దేశాలు ఎలా బయటపడాలో అర్ద్ధంకాని స్థితిలో ఉన్నాయి. ఇదే సమయంలో మధ్య ప్రాచ్యంలో పెట్టిన పితలాటకంతో తలెత్తిన సంక్షోభం ఎంతకాలం కొనసాగుతుందో, ఏమలుపులు తిరుగుతుందో తెలియటం లేదు. దాని ప్రభావం ప్రపంచం మీద పడే సూచనలు కనిపిస్తున్నాయి. పాలస్తీనా రాజ్య ఏర్పాటు అనే అంతిమ పరిష్కారం కుదరాలని అరబ్బుదేశాలు కోరుతున్నాయి. గాజాపై ఇజ్రాయెల్‌ దాడులను నిలిపివేసేంతవరకు ఎర్ర సముద్రంలో హౌతీలు నౌకలపై దాడులను కొనసాగిస్తూనే ఉంటారని దవోస్‌ సమావేశాల్లో ఇరాన్‌, ఎమెన్‌ ప్రతినిధులు స్పష్టం చేశారు. ఎక్కువ దూరం ప్రయాణించాల్సి రావటంతో చమురు, గ్యాస్‌ రవాణాకు టాంకర్ల కొరత ఏర్పడే అవకాశం ఉందని సౌదీ అరామకో కంపెనీ సిఇవో చెప్పాడు. చమురు ధరలు పెరుగుతాయనే హెచ్చరికలు సరేసరి.ప్రపంచంలో జరుగుతున్న పరిణామాలు ధనికదేశాల ఇబ్బందులను మరింత పెంచేవిగా ఉన్నాయి. ఎర్ర సముద్రం బదులు ఆసియా నుంచి ఐరోపాకు సరకులు ఎగుమతి కావాలంటే ఆఫ్రికా ఒక చివరి అంచు గుడ్‌హౌప్‌ ఆగ్రం నుంచి చుట్టి రావాలంటే ఒక ఓడకు కనీస ఏడు రోజులు అదనంగా పట్టటంతో పాటు అదనంగా మిలియన్ల డాలర్ల ఖర్చు అవుతుంది. ఇప్పటికే అది కనిపిస్తోంది. ఈ పూర్వరంగంలో జరిగిన దవోస్‌ సమావేశాలు ఏ ఒక్క సమస్యకూ పరిష్కారాన్ని సూచించలేకపోయాయి. ప్రపంచమంతటా ఇప్పుడు కృత్రిమ మేథ గురించి చర్చ జరుగుతున్నది.దీన్లో మంచి చెడూ రెండూ ఉన్నాయి. దాన్ని జనం కోసం ఉపయోగిస్తే మంచి జరుగుతుంది, కార్పొరేట్ల లాభాల కోసం అమలు జరిపితే ఉద్యోగులకు జరిగే మంచేమిటో తెలియదు గానీ నలభై శాతం వరకు ఉద్యోగాలు పోతాయని ఐఎంఎఫ్‌ వంటి సంస్థలు హెచ్చరించాయి. పర్యావరణాన్ని కాపాడే హరిత ఇథనం, కృత్రిమ మేధకు ఐదు సంవత్సరాల క్రితం ఐదు వందల కోట్ల డాలర్లు ఖర్చు చేస్తే గతేడాది 1.8లక్షల కోట్లకు పెరిగింది, ఈ దశాబ్ది చివరికి నాలుగు లక్షల కోట్ల డాలర్లు అవసరం కావచ్చని అంచనా.
వలసవాదం రూపం, పేరు మార్చుకుంది. దేశాలను స్వాధీనం ఆక్రమించుకోవటం కుదురదు గనుక రెండవ ప్రపంచ యుద్ధం తరువాత ప్రపంచీకరణ పేరుతో మార్కెట్లను ఆక్రమించుకొనేందుకు పూనుకున్నారు.అర్జెంటీనాలో ఇటీవలే అధికారానికి వచ్చిన జేవియర్‌ మిలై అనే పచ్చి కమ్యూనిస్టు వ్యతిరేకి దవోస్‌ ప్రధాన వేదిక మీద దహనకాండకు దివిటీలు పట్టుకు వచ్చిన దుండగుడి మాదిరి ప్రవర్తించినట్లు వార్తలు వచ్చాయి.రాజ్య జోక్యం చేసుకోవాలని ప్రతిపాదించే వారిమీద విరుచుకుపడ్డాడు. స్వేచ్చా వాణిజ్య పెట్టుబడిదారీ విధానమే ఆకలి,దారిద్య్రాలను అంతం చేస్తుందని చెప్పాడు.ఏడు దశాబ్దాల తరువాత ” ప్రపంచీకరణ అంతరించిందా అన్నది దవోస్‌లో పెద్ద వెతుకులాట ” అన్న శీర్షికతో అల్‌ జజీరా మీడియా ఒక విశ్లేషణ ప్రచురించింది. గతంలో పెట్టుబడి నిర్ణయాల మీద వాణిజ్య ఖర్చు అనే అంశం ప్రధానంగా ఉండేది. అలాంటిది ఇప్పుడు భౌగోళిక రాజనీతి, జాతీయ భద్రత, ప్రభుత్వాల విధాన నిర్ణయాలను బట్టి నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తోంది. టింగ్‌లాంగ్‌ డెరు అనే ప్రపంచీకరణ నిపుణుడు మాట్లాడుతూ ప్రపంచీకరణ ఇంకా చావలేదు గానీ బతికేందుకు పోరాడుతోంది అన్నాడు.వస్తు, సేవల స్వేచ్చా వాణిజ్యం తీవ్రమైన పరిమితులకు లోనౌతుంది. పశ్చిమ దేశాలలో స్వేచ్చ పెరగవచ్చుగానీ చైనా, రష్యా, వంటి దేశాలతో పెట్టుబడులు, ఎగుమతి దిగుమతులు పరీక్షలకు గురౌతాయి అన్నాడు.


ప్రపంచీకరణ అంతం గురించి మిశ్రమ అభిప్రాయాలు వెల్లడవుతున్నప్పటికీ దానికి వ్యతిరేకమైన, నిరాశాజనక అభిప్రాయాలు రోజు రోజుకూ పెరుగుతున్నాయి. ప్రపంచీకరణను ముందుకు తీసుకుపోవాలని, ప్రపంచ వాణిజ్య నిబంధనలను పాటించాలని గట్టిగా డిమాండ్‌ చేస్తున్నది ప్రస్తుతం ఒక్క చైనా మాత్రమే. ధనిక దేశాలు తమ కోసం ఆ విధానాన్ని ముందుకు తెచ్చినప్పటికీ గరిష్టంగా లబ్దిపొందింది చైనా మాత్రమే. మిగిలిన దేశాలన్నీ రక్షణ పేరుతో అడ్డుగోడలు కడితే అది చైనాకూ నష్టమే గనుక ఎలాంటి ఆటంకాలు లేని ప్రపంచీకరణ కావాలని చైనా కోరుతోంది. అది తనకు నష్టదాయకం అని భావించినపుడు వ్యతిరేకిస్తుందన్నది వేరే చెప్పనవసరం లేదు. ఈ ఏడాది దవోస్‌ సమావేశాల పట్ల పెద్దగా ఆసక్తి కనపరచలేదు. జి7 ధనిక దేశాల కూటమిలో తీవ్ర సమస్యలను ఎదుర్కొంటున్న జర్మన్‌ ఛాన్సలర్‌ ఒలాఫ్‌ షుల్జ్‌ ఒక్కడే హాజరయ్యాడు.మిగిలిన వారంతా ముఖం చాటేయటానికి కారణం అక్కడ తేలేదేమీ ఉండదని స్పష్టంగావటమే. మొత్తం మీద చూస్తే అమెరికా ప్రతినిధులే ఎక్కువగా ఉన్నప్పటికీ గతంతో పోల్చితే చాలా తక్కువ మంది వచ్చారు.చైనాలో వేతనాలు, ఇతర ఉత్పత్తి ఖర్చులు పెరుగుతున్నందున యాపిల్‌ వంటి కంపెనీలు కొంత మేరకు తమ ఉత్పత్తి కేంద్రాలను వియత్నాం, భారత్‌లకు తరలిస్తున్నాయి( ఇది ప్రపంచీకరణ ఇంకా కొనసాగటానికి నిదర్శనం అని చెప్పేవారు ఉన్నారు) తప్ప అమెరికా లేదా ఐరోపా దేశాలకు కాదు.అక్కడ చౌకధరలకు ఉత్పత్తి చేయలేవన్నది స్పష్టం. చైనాతో పోల్చితే వేతనాలు తక్కువగా ఉండటం, స్థిరమైన విధానాలను అమలు జరిపే కమ్యూనిస్టు ప్రభుత్వం ఉన్న కారణంగా విదేశీ పెట్టుబడులు భారీఎత్తున వియత్నాం చేరుతున్నాయి. తమ దేశాన్ని 2050నాటికి అభివృద్ధి చెందిన దేశంగా మారుస్తామని, అందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్లు ఆ దేశ నేతలు చెబుతున్నారు. ఐక్యరాజ్యసమితి శరణార్దుల హైకమిషన్‌ రాయబారి ఎమి మహమ్మద్‌ మాట్లాడుతూ పరిగణనలోకి తీసుకోవాల్సిన అసలైన ప్రశ్న ప్రపంచాన్ని మార్చటం అన్న సమస్య కాదు, ప్రతి రోజూ మనం ప్రపంచాన్ని మారుస్తూనే ఉన్నాం, ఆ మార్పు మంచికి దోహదం చేస్తున్నదా అన్నదే ప్రశ్న అన్నాడు. గత ఏడాది సమావేశాల్లో జీవన వ్యయ సంక్షోభం, ప్రకృతిపరమైన ముప్పు, భౌగోళిక ఆర్థిక వైరుధ్యాల వంటి అంశాలు ప్రధాన చర్చనీయాంశాలుగా ఉంటే ఈ ఏడాది ప్రపంచం ఎదుర్కొంటున్న ముప్పుల్లో తప్పుడు సమాచార వ్యాప్తి అని పదిహేను వందల మంది వివిధ రంగాల ప్రముఖులతో జరిపిన సర్వే ఒక ముఖ్యాంశం.