ఎం కోటేశ్వరరావు
ఎరువుల కొరత ! దీనికి ఎవరిని తప్పు పట్టాలి ? దేశంలో ఏం జరిగినా చివరికి సూర్యుడు తూర్పున ఉదయించి పడమర అస్తమించినా నరేంద్రమోడీ కారణంగానే జరుగుతోందని చెబుతున్నారు కదా ! మరి ఎరువుల కొరతకు నెహ్రూ బాధ్యుడని అని అందామా, కుదరదే !! సుత్తిలేకుండా సూటిగా చెప్పుకుందాం. కేంద్ర వ్యవసాయ మంత్రిత్వశాఖ సమాచారం ప్రకారం 2025 ఆగస్టు ఒకటవ తేదీ నాటికి యూరియా నిల్వ 37.19 లక్షల టన్నులు ఉంది. అంతకు ముందు ఏడాది అదే తేదీతో పోలిస్తే 49.24లక్షల టన్నులు తక్కువ. తెలంగాణా కాంగ్రెస్ ప్రభుత్వం తగినంతగా నిల్వచేయని కారణంగా యూరియా కొరత ఏర్పడిరది తప్ప కేంద్రానిది తప్పేమీ లేదని చెప్పే బిజెపి నేతల ధైర్యానికి మెచ్చుకోవాలి. ఆంధ్రప్రదేశ్ కొత్తగా రెండిరజన్ల పాలనలోకి వెళ్లింది. అక్కడ కూడా యూరియా రావాల్సినంత రాలేదని తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ నేత లావు శ్రీకృష్ణదేవరాయలు కేంద్రానికి మొరపెట్టుకున్నారు. బిజెపి పాలిత రాష్ట్రాల్లో కూడా యూరియా కోసం రైతులు బారులు తీరుతున్నారని ఎంతగా దాచిపెట్టినా వార్తలు వెలువడుతూనే ఉన్నాయి. గల్లీ నుంచి ఢల్లీి వరకు బుకాయిస్తున్న బిజెపి నేతలవి నోళ్లా మరొకటా అని రైతులు అనుకుంటున్నారు. కొందరు బిజెపి పెద్దలు నానో యూరియా గురించి రైతులు పట్టించుకోవటం లేదని నెపం వారి మీద నెడుతున్నారు. దీన్ని పుండు మీద కారం చల్లటం అంటారు.
కావాల్సింది ఎలుకను పడుతుందా లేదా అని తప్ప పిల్లి నల్లదా తెల్లదా అని కాదు. జనాల మెదళ్లలో మతోన్మాదాన్ని ఎక్కించేందుకు చూపిన శ్రద్ధ నిజంగా నానో యూరియా గురించి చూపారా ? అదే పరిష్కారమే అయితే రైతాంగాన్ని చైతన్య పరిచేందుకు తీసుకున్న శ్రద్ద ఏమిటి ? తమకు లబ్ది చేకూర్చే ప్రతి నవ ఆవిష్కరణను ఆహ్వానించి ఆమోదించిన మన రైతన్న నానో పట్ల ఎందుకు విముఖత చూపుతున్నట్లు ? పంజాబ్ వ్యవసాయ విశ్వవిద్యాలయం సంప్రదాయ మరియు నానో యూరియా వాడక ఫలితాల గురించి రెండు సంవత్సరాల పాటు అధ్యయనం చేసింది. గుళికల రూపంలో వాడిన పొలాల కంటే నానో ప్రయోగ క్షేత్రాల్లో గోధుమల దిగుబడి 21.6,వరిలో 13శాతం చొప్పున తగ్గినట్లు తేలింది.2020 నుంచి 2022వరకు పరిశీలన జరిగింది. అయినప్పటికీ 45 కిలోల యూరియా స్థానంలో 500 మిల్లీ లీటర్ల ద్రవరూప నానో యూరియా అదే ఫలితాలను ఇస్తుందంటూ మార్కెటింగ్ ప్రారంభించిన ఇఫ్‌కో, కేంద్ర ప్రభుత్వం కూడా ఊదరగొడుతున్నాయి. అంతే కాదు, ఇది వాడిన పొలాల్లో పండిన గింజల్లో ప్రొటీన్ కూడా తక్కువగా ఉంటుందని తేలింది. ప్రొటీన్లకు గింజల్లో నైట్రోజన్ అవసరం. వరుసగా వాడితే దిగుబడుల తగ్గుదల ఇంకా ఎక్కువగా ఉంటుందని శాస్త్రవేత్తలు చెప్పారు. ఇఫ్‌కో చెప్పినట్లుగా వాడిన పొలాల్లో పండిన వరిలో 17, గోధుమల్లో 11.5శాతం నైట్రోజన్ తక్కువగా ఉన్నట్లు తేలింది. దీనికి తోడు సాధారణ యూరియా కంటే దీని తయారీ ఖర్చు పదిరెట్లు ఎక్కువ. అంటే ఒక 45కిలోల యూరియా బస్తా రు.242 కాగా దానికి ఎన్నో రెట్ల ధరతో కొనుగోలు చేస్తే గోడదెబ్బ చెంపదెబ్బ మాదిరి వ్యవసాయ ఖర్చు పెరిగి, దిగుబడి తగ్గి రైతులకు గిట్టుబాటుగాక, వినియోగదారులకు ప్రొటీన్లు అందకపోతే నానో యూరియా తయారీ పారిశ్రామికవేత్తల లాభాల కోసం తప్ప దేనికి ప్రోత్సహిస్తున్నట్లు ?
దేశంలో యూరియా నిల్వలు అంతగా పడిపోవటానికి కారకులు ఎవరు ? మోడీ సర్కార్ కాసుల కక్కుర్తే. పిసినారి వాళ్లకు కూడా ముందు చూపు ఉంటుంది. కేంద్ర ప్రభుత్వానికి అది కూడా ఉన్నట్లు లేదు. మే నెలలో టన్ను యూరియా దిగుమతి ధర నాలుగువందల డాలర్లకు అటూ ఇటూ ఉండగా ఇప్పుడు 530 ఉన్నట్లు వార్త. ఎవడబ్బ సొమ్మని రామచంద్రా అని భద్రాచల రామదాసు అన్నట్లుగా ఎవరూ అడిగేవారు లేరనేగా ఇప్పుడు దిగుమతులకు హడావుడి పడటం, దీనిలో కూడా ఏమైనా అమ్యామ్యాలు ఉన్నాయా ? ఈ ఏడాది వర్షాలు పుష్కలంగా పడతాయని వాతావరణ శాఖ చెప్పింది, అదే జరిగితే పంటల సాగు పెరుగుతుందని గ్రహించటానికి కేంద్రంలో వ్యవసాయం గురించి తెలిసిన వారు ఉంటేగా, అదానీ ‘‘ వ్యవసాయం ’’ కూడా చేసినా కాస్త బాగుండేమో ! ఇప్పుడు చైనా నుంచి అధిక ధరలకు దిగుమతి చేసుకొనేందుకు నిర్ణయించినట్లు చెబుతున్నారు, అది రావాలన్నా కనీసం నెలన్నర పడుతుందని వార్తలు.చేతి చమురు వదులుతున్నది, రైతాంగం నుంచి విమర్శలు సరేసరి. ప్రభుత్వాల నుంచి అనేక రాయితీలు పొందిన ప్రైవేటు రంగ కాకినాడ నాగార్జున ఎరువుల కంపెనీ మామూలు యూరియా బదులు గ్రీన్ అమోనియా తయారు చేసి విదేశాలకు ఎగుమతి చేసి లాభాలు పొందుతున్నదని వార్త.ప్రభుత్వమే పట్టనట్లు ఉంటే ప్రైవేటు కంపెనీల గురించి చెప్పేదేముంది.
ఒక్క యూరియా విషయంలోనే కాదు అన్ని ఎరువుల పరిస్థితి కాస్త అటూ ఇటూగా అంతే. డిఏపి నిల్వలు గతేడాది 15.82లక్షల టన్నులుండగా ఆగస్టు ఒకటి నాటికి ఈ ఏడాది 13.9లక్షల టన్నులు, కాంప్లెక్స్ ఎరువులు 46.99లక్షల టన్నులకు గాను 34.97ల.టన్నులు, ఎంఓపి 8లక్షలకు గాను 6.27లక్షల టన్నులు ఉండగా సూపర్‌గా రైతులు పిలిచే ఎస్‌ఎస్‌పి మాత్రం గతేడాది కంటే స్వల్పంగా ఎక్కువగా నిల్వలు ఉన్నాయి.పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో పలువురు ఎంపీలు ఎరువుల గురించి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.తమ ప్రాంతాల్లో ఎదుర్కొంటున్న సమస్యల గురించి వివరించారు.యూరియా తరువాత ఎక్కువగా వినియోగించేది డిఏపి.చైనా నుంచి 2023`24లో 22.28లక్షల టన్నులు దిగుమతి చేసుకోగా మరుసటి ఏడాది 8.47ల.టన్నులు, ఈ ఏడాది జూలైలో కేవలం 97వేల టన్నులు మాత్రమే దిగుమతి చేసుకున్నట్లు ఎరువులు, రసాయనాల సహాయ మంత్రి అనుప్రియ పటేల్ లోక్‌సభకు రాతపూర్వక సమాధానంలో చెప్పారు.చైనా ప్రభుత్వ తనిఖీ నిబంధనలే దీనికి కారణమన్నారు. పోనీ ఇతర దేశాల నుంచి ఆమేరకు దిగుమతి చేసుకున్నారా అంటే అదీ లేదు. అసలు కారణం ఏమంటే అంతర్జాతీయ మార్కెట్‌లో భారీగా ధర పెరగటమే, ఆ మొత్తాన్ని సబ్సిడీ రూపంలో ప్రభుత్వం భరించాలి గనుక అసలు దిగుమతులే నిలిపివేశారు.ఇదీ రైతుల పట్ల నరేంద్రమోడీ సర్కార్ శ్రద్ధ.కేంద్ర మంత్రి సమాచారం ప్రకారమే 2024 ఏప్రిల్‌లో టన్ను డిఏపి దిగుమతి ధర 542 డాలర్లు కాగా 2025 జూలైలో అది 800 డాలర్లకు చేరింది.మరోసారి 2022 నాటి పరిస్థితి తలెత్తే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నట్లు మీడియాలో వార్తలు వచ్చాయి. నాడు డిఏపి ధర టన్ను 900 నుంచి వెయ్యి డాలర్లు ఉండగా ఈ ఏడాది దాని తయారీలో కీలకమైన ఫాస్పరిక్ యాసిడ్ ధర 2025 జనవరి నుంచి మార్చి నెలలో 1,055 డాలర్లకు పెరగ్గా, జూలై మరియు సెప్టెంబరు మాసాలకు 1,258 డాలర్లకు చేరిందట. పులిమీద పుట్ర మాదిరి ధరలు పెరగటమే కాదు మన రూపాయి విలువ పతనం కావటంతో అది కూడా అదనపు భారాన్ని మోపుతున్నది.
ఫాస్పేట్, పొటాష్, డిఏపి వంటి ఎరువుల దిగుమతి మీద ఎలాంటి ఆంక్షలు లేవు.వాటిని ప్రైవేటు వారు తయారు చేయవచ్చు లేదా దిగుమతి చేయవచ్చు.ఎరువుల శాఖ మంత్రి జెపి నడ్డా లోక్‌సభకు రాతపూర్వకంగా తెలిపిన సమాచారం ప్రకారం గత ఐదు సంవత్సరాలలో చూస్తే మూడు సంవత్సరాలు డిఏపి ఉత్పత్తి తగ్గింది. 2022లో 43.47, 2023లో 42.93, 2024లో 37.69లక్షల టన్నుల(ఐదేండ్ల నాటి స్థితి) చొప్పున ఉత్పత్తి జరిగింది. 2023 జూన్ ఒకటి నాటికి 33.2, 2024లో 21.6, 2025 జూన్ నాటికి నిల్వలు 12.4లక్షల టన్నులకు తగ్గాయి. దీంతో అనేక ప్రాంతాల్లో బ్లాక్ మార్కెట్ లేదా అధిక ధరలకు కొనాల్సి వస్తోంది. నరేంద్రమోడీ ఎంతో ముందు చూపుగల నేత, 2014లో నిజమైన స్వాతంత్య్రాన్ని సాధించిన గొప్ప యోధుడని పొగుడుతున్నారు కదా ! అన్నీ కాంగ్రెసే చేసిందనే బొమ్మరిల్లు డైలాగులు వల్లించటం తప్ప పదకొండేండ్లలో చేసిందేమిటి ! ఎరువుల కొరత, అనిశ్చితికి పునాది కాంగ్రెస్ హయాంలో నూతన ఆర్థిక విధానాలలోనే పడిరది.వాటిని మరింత సమర్ధవంతంగా, వేగంగా అమలు జరుపుతున్నట్లు మోడీ చెప్పుకుంటున్నారు. చైనా నుంచి వినిమయ వస్తువులను చౌకగా దిగుమతి చేసుకొని తన పరిశ్రమలను అమెరికా మూసివేసింది లేదా పక్కన పెట్టింది. మన పాలకులు వారు కాంగ్రెస్ అయినా బిజెపి అయినా అదే విధంగా ప్రభుత్వ రంగ ఎరువుల పరిశ్రమలను పక్కన పెట్టారు(మూసివేసిన రామగుండ ఫ్యాక్టరీని తెరవటం తప్ప మోడీ ప్రభుత్వం కొత్తగా పెట్టింది లేదు). కోళ్లను పెంచటం ఎందుకు గుడ్లు, మాంసం దిగుమతి చేసుకుంటే పోలా అన్నట్లుగా పెట్టుబడి, కార్మికులు, వేతనాలు, ఒప్పందాలు ఇవన్నీ ఎందుకు దిగుమతి చేసుకుంటే పోలా అని మన పాలకులు అటువైపు చూశారు. ప్రపంచంలో పరిస్థితులన్నీ ఒకే విధంగా ఉండవనే లోకజ్ఞానాన్ని కోల్పోయారు.
2020 నవంబరు నుంచి 2021నవంబరు కాలంలో అంతర్జాతీయ మార్కెట్లో యూరియా టన్ను 280 డాలర్ల నుంచి 923, డిఏపి 366 నుంచి 804, ఎంఓపి 230 నుంచి 280, అమ్మోనియా 255 నుంచి 825 డాలర్లకు పెరిగింది.యుపిఏ 2010 నుంచి ఎన్‌డిఏ 2019వరకు పది సంవత్సరాల కాలంలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఎరువుల సబ్సిడీ కనిష్టంగా రు.65,836 కోట్లు, గరిష్టంగా రు.83,466 కోట్లు ఉండగా పదేండ్ల సగటు రు.73వేల కోట్లు. పైన చెప్పుకున్నట్లుగా అంతర్జాతీయ మార్కెట్లో ధరలు విపరీతంగా పెరగటంతో దిగుమతుల మీద ఆధారపడటం, ఏడాది పాటు సాగిన ఢల్లీి శివార్లలో రైతు ఉద్యమం కారణంగా సబ్సిడీ కూడా అనివార్యంగా పెంచాల్సి వచ్చిందని అంకెలే వెల్లడిస్తున్నాయి. 2020 నుంచి 2023వరకు కనిష్టంగా రు.1,31,229 కోట్లు, గరిష్టంగా రు.2,54,798 కోట్లు కాగా నాలుగేండ్ల సగటు రు.1,84,772 కోట్లు ఉంది. 2024లో ఈ మొత్తం లక్షా 90వేల కోట్ల రూపాయలు దాటింది. ఇంత మొత్తంలో సబ్సిడీలు ఇవ్వటానికి సిద్దపడుతున్నారు తప్ప ఆ మొత్తాలను పెట్టుబడులుగా పెట్టి ఉంటే ఎరువుల స్వయం సమృద్ధితో పాటు వేలాది మందికి మెరుగైన ఉపాధి దొరికి ఉండేది, ఎరువుల కోసం చైనా లేదా మరొక దేశాన్నో దేబిరించాల్సిన అవసరం ఉండేది కాదు కదా ! జనాభా అవసరాలకు అనుగుణంగా ఆహార ఉత్పత్తి కోసం అనేక దేశాల్లో ఎరువుల వినియోగం మనదేశంతో పోల్చితే ఎక్కువగా ఉంది. మన పక్కనే ఉన్న చైనాలో 2022లో హెక్టారుకు 397కిలోలు ఉండగా మనదేశంలో 193 కిలోలు మాత్రమే ఉంది. ముందుచూపు ఉన్న నేతలు, విధాన నిర్ణేతలు మన అవసరాలకు అనుగుణంగా ఉత్పత్తిని ఎందుకు పెంచలేకపోయారు !
నేడు ప్రతిదీ రాజకీయాలతో ముడిపెడుతున్న తీరు ప్రపంచమంతటా ఉంది. ఎవరూ తక్కువ తినటం లేదు. అందుకే ఎవరి మీదా ఆధారపడకుండా స్వయం సమృద్ధి సాధించాల్సిన అవసరం మరింత పెరిగింది. చైనాతో సాధారణ సంబంధాల పునరుద్దరణకు పూనుకున్న తరువాత అక్కడి నుంచి ఎరువుల దిగుమతికి అవకాశం దొరికిందనే వార్తలు వచ్చాయి. గాల్వన్‌లోయ ఉదంతాల తరువాత మనదేశం చైనా యాప్‌ల నిషేధం, పెట్టుబడుల మీద ఆంక్షలను విధించిన సంగతి తెలిసిందే. దీనికి తోడు అమెరికా, జపాన్, ఆస్ట్రేలియాలతో కలసి క్వాడ్‌గా చైనా వ్యతిరేకతకు పూనుకున్నట్లు మనమీద విమర్శలు వచ్చిన సంగతి కూడా తెలిసిందే.దానికి ప్రతిగా చైనా మనం దిగుమతి చేసుకుంటున్న ఎరువులు, విలువైన ఖనిజాలు, విద్యుత్ వాహనాలకు అవసరమైన మాగ్నెట్లు, ఇతర విడి భాగాల మీద ఆంక్షలు విధించటం బహిరంగరహస్యం. ఇరుగుపొరుగుదేశాలతో మన జాగ్రత్తలో మనముండటం తప్పు కాదు గానీ మన స్వతంత్ర విదేశాంగ విధానంలో భాగంగా ఎవరితోనూ శతృత్వం పెంచుకోవాల్సిన అవసరం లేదు. అమెరికా రాజకీయంలో పావుగా మారకూడదు. మన మీద దాని వస్తువులను రుద్దటానికి పన్నుల ఖడ్గాన్ని మన మీద రaళిపించటాన్ని చూస్తున్నాం. అనువుగాని చోట అధికులమనరాదని మన పెద్దలు చెప్పిన సూక్తిని సదా గుర్తుంచుకోవాలి. అదే సమయంలో తలెత్తే ఇబ్బందుల గురించి మూడు చేపల కథలో మాదిరి దీర్ఘదర్శిగా ఉండాలి. మనం చర్చించుకున్నది ఎరువుల గురించి గనుక గతంలో మోడీ ఏలుబడి పదకొండు సంవత్సరాల్లో ఈ రంగంలో ముందుచూపులేక కోట్లాది మంది రైతాంగాన్ని కేంద్ర ప్రభుత్వం ఇబ్బందుల్లోకి నెట్టింది.మన ఆహార పంటల దిగుబడులు, భద్రతకూ ఈ వైఖరి నష్టదాయకమే, జనం ఆలోచించాలి మరి !
