Tags
BJP, China, Donald trump, Hormuz mission, Narendra Modi Failures, NATO allies, Netanyahu, US attack Iran, Vladimir Putin
ఎం. కోటేశ్వరరావు
ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయిల్ ప్రారంభించిన దాడులు మంగళవారం నాడు పద్దెనిమిదవ రోజులో ప్రవేశించాయి. వాటికి దీటుగా టెహ్రాన్ కూడా ప్రతి దాడులతో బెంబేలెత్తిస్తున్నది. హార్ముజ్ జలసంధి ప్రాంతానికి వచ్చి అక్కడి నుంచి నౌకలకు రక్షణ కల్పించాలన్న ట్రంప్ కోరికను ఏ ఒక్క మిత్ర దేశం కూడా అంగీకరించలేదు. ఇది తమ యుద్ధం కాదని బయటకు చెప్పకుండానే ముఖం చాటేస్తుండటంతో ట్రంప్‌కు దిక్కుతోచక పిచ్చి ప్రేలాపనలకు దిగాడు. అమెరికా దాడులు ప్రారంభమైనప్పటి నుంచీ కొంత మంది అమెరికాకు వ్యతిరేకంగా ఇరాన్ పక్షాన చైనా, రష్యా ఎందుకు దాడుల్లో పాల్గ్గొనటం లేదని ప్రశ్నిస్తున్నారు. ఈ ప్రశ్నకు కాలమే సమాధానం చెప్పింది. ఇరాన్‌కు వ్యతిరేకంగా తమతో కలసి దాడులకు పూనుకోవటంలేదని డోనాల్డ్ ట్రంప్ తన మిత్ర దేశాల మీద తిట్ల పురాణం ప్రారంభించాడు. చివరికి చైనా గనుక హార్ముజ్ జలసంధికి యుద్ధ నౌకలను పంపి ఇరాన్‌ను కట్టడి చేయకపోతే ఈ నెలాఖరులో బీజింగ్ పర్యటనను వాయిదా వేసుకుంటానని చైనాను కూడా బెదిరించాడు. మాకేం తొందరలేదు, వస్తే రా, లేకపోతే లేదు నీ ఇష్టం అన్నట్లుగా చైనా ఉంది. నాటోలో ఉన్న దేశాలే కాదు, ఇరాన్ దాడులకు గురవుతున్న గల్ఫ్ దేశాలు కూడా యుద్ధంలో దిగేందుకు అంగీకరించటం లేదు.
ఇరాన్‌పై దాడులు ఎప్పుడు ముగుస్తాయన్నది మరొక ప్రశ్న. ప్రారంభించిన అమెరికాకే దిక్కు తోచటం లేదు. ఇరాన్ వైపు నుంచి ఇలాంటి ప్రతిఘటన ఉంటుందని తనకెవరూ చెప్పలేదని, నెపాన్ని డోనాల్డ్ ట్రంప్ స్వయంగా సలహాదారులు, నిఘా యంత్రాంగం మీద నెట్టేందుకు పూనుకున్నాడు. అయితే అలాంటిదేం లేదు, ముందుగానే ట్రంప్‌కు హెచ్చరికలు అందాయని వార్తలు. ఒకవైపు ఇరాన్‌లో వేలాది కేంద్రాలపై దాడులు చేశామని, దాని మిలిటరీ నడ్డి విరిచామని రోజూ డోనాల్డ్ ట్రంప్ చెబుతుంటాడు. అదే నిజమైతే జరుగుతున్న క్షిపణి దాడుల సంగతేమిటన్న ప్రశ్నకు సమాధానం చెప్పేవారు లేరు. మొత్తంగా నాశనం చేశావని ఎలాగూ చెప్పావు కదా. ఇంక చేయాల్సిందేమీ లేదని గౌరవప్రదంగా యుద్ధాన్ని ముగించవచ్చు కదా అని ట్రంప్ మిత్రుడే బహిరంగంగా చెప్పిన తరువాత కూడా అలాంటి చర్యకు పూనుకోలేదు. ఎవరికైనా మదం తలకెక్కినపుడు హితవచనాలు రుచించవు. పశ్చిమాసియా యుద్ధంలో పాల్గ్గొనే ఉద్దేశం తమకు లేదని జర్మనీ పేర్కొన్నది. హార్ముజ్ జలసంధిలో నౌకల రక్షణకు మిలటరీని పంపాలనే కోరిక తమకు లేదని స్పష్టం చేసింది. ఆసియాలో అమెరికా అనుయాయి దేశం దక్షిణ కొరియా, అక్కడ అమెరికాకు తొమ్మిది మిలిటరీ కేంద్రాలు, వాటిలో అన్ని దళాలకు చెందిన 25 వేల మంది సైనికులు ఉన్నారు. తాము కూడా హార్ముజ్‌కు నౌకాదళాన్ని పంపటం లేదని అధ్యక్ష కార్యాలయం వెల్లడించింది. తమ దేశంలో నిల్వ ఉంచిన ఆయుధాలను పశ్చిమాసియాకు తరలించారని, దీన్ని అవకాశంగా తీసుకొని ఉత్తర కొరియా దాడి చేస్తే తమ పరిస్థితి ఏమిటని కొద్ది రోజుల క్రితం దక్షిణ కొరియా అధ్యక్షుడు ఆందోళన వ్యక్తం చేశాడు. ప్రస్తుతం ఇంధన ఉత్పత్తుల ఎగుమతులపై పరిమితులు విధించనున్నట్లు చెప్పాడు. నౌకలను పంపే అంశం పరిశీలనలో లేదని జపాన్ ప్రధాని తకాయిచి పార్లమెంటులో చెప్పారు. ఆస్ట్రేలియా కూడా అదే బాటలో ఉంది. ఐరోపా యూనియన్ విదేశాంగ మంత్రి కాజా కలాస్ మాట్లాడుతూ ఇప్పుడు జరుగుతున్న చర్యలను మార్చాలనే కోరిక ఇప్పటికైతే తమకు లేదని చెప్పాడు. బ్రిటన్ ప్రధాని కెయిర్ స్టార్మర్ కూడా తమ దేశం విస్తృత యుద్ధంలోకి రాదని అన్నాడు.
ఇలావుండగా…యుద్ధ లక్ష్యాల గురించి ట్రంప్ మాట మార్చాడు. తాము ముడి చమురు కోసం ఇరాన్ మీద దాడి చేయలేదని ట్రంప్ చెప్పుకున్నాడు. హార్ముజ్ జలసంధిలో నౌకలు స్వేచ్ఛగా తిరిగేందుకు వీలుగా తమ మిత్ర దేశాల కోసమే దాడి చేసినట్లు మాట మార్చాడు. అందుకుగాను ఆ ప్రాంతంలో రక్షణ కోసం చైనా, జపాన్ వంటి దేశాలు యుద్ధ నౌకలను పంపాలని అన్నాడు. తమకు చమురు అవసరం లేదని, కావాల్సిన దానికంటే రెండింతల ఎక్కువ ఉందని, మా మంచి మిత్రుల కోసమే దాడి చేశామని అన్నాడు. నిజానికి ఇతర దేశాలను రక్షించాలని తప్ప మా కోసం దాడులు చేయటం లేదన్నాడు. తమ మిత్ర దేశాలు ముఖ్యంగా నాటో దేశాల వైఖరి ఆశాభంగం కలిగించిందని ట్రంప్ చెప్పాడు. మేం మాత్రం వారికోసం ఎల్లవేళలా ఉండాలి, కాని వారు మాత్రం మాకోసం రారు అంటూ బి-2 స్పిరిట్ బాంబరు బొమ్మను చూపుతూ హార్ముజ్ జలసంధిని తెరిపించేందుకు మాకు ఎవరి అవసరమూ లేదని ఊగిపోయాడు. తమకు సహకరించకపోతే నాటోకు రానున్నది చెడు కాలమన్నాడు.
ఇరాన్‌పై దాడులను ప్రారంభించినప్పటి నుంచి గల్ఫ్, ఇతర దేశాలను యుద్ధంలోకి లాగాలని అమెరికా తీవ్రంగా చేస్తున్న ప్రయత్నాలకు ఊహించని ఎదురు దెబ్బ తగిలింది. ఇరాన్ వైపు నుంచి క్షిపణుల వర్షం కురుస్తున్నప్పటికీ ప్రత్యక్షంగా దాడులకు గల్ఫ్ దేశాలు పూనుకోలేదు. అమెరికాను నమ్మి నిజంగా తమ దళాలను రంగంలోకి దింపితే తలెత్తే పర్యవసానాల గురించి పైకి చెప్పుకోవటం లేదుగానీ అవి తీవ్ర ఆందోళన చెందుతున్నాయి. పొద్దున లేస్తే ఇరాన్‌తో ముఖాముఖాలు చూసుకోవాల్సింది తామని…ఈ రోజు అమెరికా ఉంటుంది, రేపు వెళ్లిపోతుంది. తాము శాశ్వతంగా బలమైన ఇరాన్‌తో వ్యవహరించాల్సి ఉంటుందని చెబుతున్నారు. తప్పనిసరై అమెరికా స్థావరాలు ఉన్న కారణంగా కొన్ని ఆయుధాలను గల్ఫ్ దేశాల మీద ప్రయోగించాల్సి వస్తోంది తప్ప తమ కేంద్రీకరణ అంతా ఇజ్రాయిల్ మీదనే అని తాజాగా ఇరాన్ ప్రకటించింది. అమెరికా యుద్ధ స్థావరాలున్న గల్ఫ్ దేశాల మీద దాడి చేస్తే అవి అమెరికాకు వ్యతిరేకంగా వ్యహరించాలనే ఎత్తుగడ ఉందని బహిరంగంగానే చెబుతున్నారు.
తాజా పరిణామాల్లో మరో ముఖ్యాంశం ఏమంటే ఇరాన్‌పై అమెరికా దాడి రష్యాకు పెట్రో డాలర్లను కురిపిస్తోంది. ట్రంప్ అనుకున్నదొకటి అవుతున్నది ఒకటి. మాస్కో నుంచి చమురు కొనుగోలు చేయవద్దని ఆంక్షలు విధించిన అమెరికా ఇప్పుడు కొనుగోలు చేయవచ్చని అన్ని దేశాలకు అవకాశం ఇస్తున్నట్లు ప్రకటించింది. నరేంద్రమోడీ సైతం ఈ పరిణామాన్ని ఊహించలేదు. ఏ మాత్రం పసిగట్టినా ట్రంప్ బెదిరించగానే రష్యా నుంచి చమురు కొనుగోలును సగానికి సగం తగ్గించి ఉండేవారు కాదు. ఇప్పుడు పరువూ పోయింది. రష్యా నుంచి వచ్చే రాయితీ కూడా లేదని చెబుతున్నారు. చమురుపై ఆంక్షలతో రష్యా ఆర్థిక మూలాలను దెబ్బ తీస్తామని బహిరంగంగానే ప్రకటించారు. అయినప్పటికీ నాలుగేళ్లుగా కొంత ఇబ్బంది పడినప్పటికీ భారత్ చైనా కొనుగోళ్లతో నిలిచింది. ఇటీవల ట్రంప్ బెదిరించటంతో మన దేశం సగానికి కొనుగోళ్లను తగ్గించింది. హార్ముజ్ జలసంధి దిగ్బంధనంతో అనేక దేశాల నుంచి ఒత్తిడి పెరగటంతో రష్యా చమురు కొనుగోలుకు అమెరికా ”అనుమతి” ఇచ్చింది. దీంతో ప్రస్తుతం రోజుకు 15 కోట్ల డాలర్ల మేర పుతిన్ సర్కార్‌కు రాబడి వస్తోంది.
పన్నెండు రోజుల తరువాత బ్రిక్స్ కూటమి అధ్యక్ష స్థానం (భారత్)…ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయిల్ దాడులు అంతర్జాతీయ న్యాయ సూత్రాలకు విరుద్ధమని ఖండించింది. ఇదే సమయంలో ప్రధాని నరేంద్ర మోడీ ఇరాన్ నేతలతో మాట్లాడారు. ఆ తరువాతే మన దేశానికి ఎల్‌పిజి ని తీసుకువచ్చే మూడు ట్యాంకర్లను సురక్షితంగా హార్ముజ్ జలసంధి నుంచి ఇరాన్ అనుమతించింది. మన దేశంపై వచ్చిన ఒత్తిడి, వంట గ్యాస్ సెగ తగిలిన తరువాతగాని మన నేతలకు తత్వం తలకెక్కలేదని చెప్పవచ్చు!
