ఎం కోటేశ్వరరావు
సోమవారం నాడు అమెరికాతో కుదిరిన ఒప్పందం మేరకు నల్ల సముద్ర ప్రాంతలో స్వేచ్చగా నౌకా సంచారానికి రష్యా అంగీకరించింది. అయితే తమ షరతులను ముందుగా అమలు జరపాలని స్పష్టం చేసింది. బంతిని అమెరికా మైదానం వైపు నెట్టింది. తమ ఆహార ఎగుమతులకు వీలుగా ద్రవ్య సంస్థల మీద విధించిన ఆంక్షలను అమెరికా ఎత్తివేసిన తరువాతే ఒప్పందం అమల్లోకి వస్తుందని చెప్పింది. మాస్కోలోని అధ్యక్ష భవనం క్రెమ్లిన్ విడుదల చేసిన ప్రకటన ప్రకారం ఆహార వాణిజ్యంతో సంబంధం ఉన్న రష్యన్ వ్యవసాయ, ఇతర బాంకుల మీద ఉన్న ఆంక్షల ఎత్తివేతతో సహా ఇతర అంశాలను కూడా అమలు జరపాలని స్పష్టం చేసింది. ప్రపంచ మార్కెట్లకు గతంలో మాదిరి ఆహారం, ఎరువుల ఎగుమతుల పునరుద్దరణ, తమ పతాకాలున్న నౌకల మీద ఆంక్షల తొలగింపు, సముద్ర ప్రయాణ బీమా ధరల తగ్గింపు, వివిధ రేవులను, ద్రవ్య లావాదేవీలు జరిపేందుకు చెల్లింపుల వ్యవస్థలను అందుబాటులోకి తేవటం వంటివి ఉన్నాయి. అమెరికా అధ్యక్ష భవనం చేసిన ప్రకటనలో కూడా పైన పేర్కొన్న అంశాల పునరుద్దరణకు చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నది. క్రెమ్లిన్ విడిగా చేసిన మరొక ప్రకటనలో మార్చి 18 నుంచి నెల రోజుల పాటు రష్యా మరియు ఉక్రెయిన్ ఇంథన వ్యవస్థల మీద పరస్పరం దాడులు చేసుకోకుండా ఉండేందుకు అంగీకరించినట్లు పేర్కొన్నది. ఒప్పంద వ్యవధిని పొడిగించేందుకు లేదా ఎవరు విఫలమైనా ఒప్పందం నుంచి వెనక్కు తగ్గేందుకు అవకాశం ఉందని కూడా తెలిపింది. అంతకు ముందు అమెరికా ప్రతినిధులతో సమావేశమైన తరువాత రష్యాతో కుదిరిన ఒప్పందానికి తాము అంగీకరిస్తున్నట్లు ఉక్రెయిన్ ప్రకటించింది. మొత్తం మీద చూసినపుడు పుతిన్ తొలి విజయం సాధించినట్లు స్పష్టంగా కనిపిస్తోంది. అమెరికా ఆంక్షలు, ఉక్రెయిన్ కారణంగానే నల్ల సముద్ర స్వేచ్చా రవాణా ఒప్పందం నుంచి రష్యా వైదొలిగింది. ఇప్పుడు బంతి అమెరికా కోర్టు వైపు వెళ్లింది. దాని చిత్తశుద్దికి పరీక్ష అని చెప్పవచ్చు.
ఉక్రెయిన్ సంక్షోభం గురించి అమెరికా, రష్యా ప్రతినిధి వర్గాల మధ్య సౌదీ అరేబియా రాజధాని రియాద్‌లో సోమవారం నాడు చర్చలు జరిగాయి.వాటి తీరుతెన్నుల గురించి ప్రతినిధులు తమ దేశ నేతలకు వివరించిన తరువాత అవగాహన గురించి మంగళవారం రాత్రి ఎవరికి వారు విడిగా ప్రకటనలు చేశారు. పది గంటల పాటు జరిగిన సంప్రదింపులలో మూడు సార్లు విరామం ఇచ్చారు. చర్చల తరువాత అమెరికా ప్రతినిధులు ఉక్రెయిన్ అధికారులతో చర్చలు జరిపారు. ఒకవైపు చర్చలు సాగుతున్నప్పటికీ రెండు పక్షాలూ దాడులు కొనసాగించాయి. తాము 30 మంది రష్యన్ సైనికులను చంపివేసినట్లు ఉక్రెయిన్ ప్రకటించుకుంది. తాము ట్రంప్ ప్రతిపాదించిన నెల రోజుల కాల్పుల విరమణను అంగీకరించలేదని, ఇంథన మౌలిక సదుపాయాలపై దాడులను వాయిదా వేసేందుకు మాత్రమే అంగీకరించినట్లు రష్యా ప్రతినిధులు అంతకు ముందు చెప్పారు.
నల్ల సముద్రంలో రేవుల నుంచి ఎగుమతి అయ్యే ధాన్యం,నూనెలు,ఎరువుల తనిఖీ గురించి గతంలో కుదిరిన ఒప్పందం నుంచి రష్యా వైదొలిగింది. దానిలో తమ ఎగుమతుల మీద ఉన్న ఆంక్షల భాగాన్ని అమలు జరపలేదని గతంలో పేర్కొన్నది. ఇతర అంశాలపై సైనిక చర్యనాటి నుంచి రష్యా చేస్తున్న డిమాండ్లలో ఇంతవరకు ఎలాంటి మార్పు లేదు. నాటోలో చేరాలన్న ప్రతిపాదనను అధికారికంగా జెలెనెస్కీ ఉపసంహరించుకోవాలి,ఉక్రెయిన్ ప్రభుత్వంపై తిరుగుబాటు చేసి స్వాతంత్య్రాన్ని ప్రకటించుకున్న, స్వతంత్ర దేశాలుగా రష్యా గుర్తించిన నాలుగు ప్రాంతాల నుంచి ఉక్రెయిన్ సేనలను ఉపసంహరించుకోవాలి. సోవియట్ కాలంలో ఉక్రెయిన్ పాలనా పరిధిలోకి వచ్చిన క్రిమియా ద్వీపకల్పాన్ని 2014లో రష్యా తిరిగి తనలో విలీనం చేసుకున్నది. దానితో సహా, రష్యా మద్దతు ఉన్న తిరుగుబాటు ప్రాంతాలన్నింటినీ వెనక్కు అప్పగించాలని ఉక్రెయిన్ కోరుతున్నది. అలాంటి ఆశలు పెట్టుకోవద్దని జెలెనెస్కీకి అమెరికా స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. ఒక వేళ ఒప్పందం కుదిరి మిలిటరీ చర్యను ఉపసంహరించుకున్న తరువాత శాంతి సేనలనో మరొక పేరుతోనో తమను వ్యతిరేకించే దేశాల మిలిటరీని సరిహద్దుల్లో అంగీకరించేది లేదని కూడా రష్యా స్పష్టం చేసింది.
ఒక వైపు చర్చలకు తేదీ, స్థలం నిర్ణయించిన తరువాత జెలెనెస్కీ టైమ్ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పుతిన్‌పై ఆరోపణలు చేశాడు. సౌదీలో చర్చల రోజే వాటిని ఆ పత్రిక ప్రచురించింది. రష్యన్లు చేస్తున్న తప్పుడు ప్రచారాలు అమెరికా అధ్యక్ష భవనంలో పని చేస్తున్న కొంత మంది మీద ప్రభావం చూపుతున్నాయని జెలెనెస్కీ ఆరోపించాడు. వారు స్వంత గూఢచారుల సమాచారం కంటే పుతిన్ మీదనే ఎక్కువగా విశ్వాసం ఉంచుతున్నట్లు చెప్పాడు. యుద్దం ముగియాలని ఉక్రేనియన్లు కోరుకోవటం లేదని అందువలన వారిని దారికి తెచ్చేందుకు ఏదో ఒకటి చేయకతప్పదన్న సూచన అమెరికన్లకు వెళ్లిందని అన్నాడు. రష్యాలోని కురుస్కు ప్రాంతంలో ఉన్న తమ సేనలను రష్యా చక్రబంధం చేసిందన్న ట్రంప్ వ్యాఖ్యలు కూడా తప్పుడు సమాచార ప్రభావమే అన్నాడు. పుతిన్ను సంతుష్టీకరించేందుకు, జెలెనెస్కీని అంకెకు రప్పించేందుకు గానీ అందచేస్తున్న మిలిటరీ సాయం, గూఢచార సమాచార అందచేత నిలిపివేస్తున్నట్లు ప్రకటించిన ట్రంప్ యంత్రాంగం ఐరోపా నుంచి వత్తిడితో తరువాత వాటిని పునరుద్దరించింది. విలువైన ఖనిజాల ఒప్పందంపై సంతకాలు చేసేందుకు వాషింగ్టన్ వచ్చిన జెలెనెస్కీ ఓవల్ కార్యాలయంలో డోనాల్డ్ ట్రంప్, ఉపాధ్యక్షుడు జెడి వాన్స్‌తో గొడవపడి వెళ్లిపోయిన సంగతి తెలిసిందే. పాక్షిక ఒప్పందానికి సుముఖత తెలిపిన తరువాత కూడా రష్యా ప్రతిరోజూ దాడులు చేస్తున్నదని, వాటిని నివారించాలంటే పుతిన్ మీద మరింత వత్తిడి తేవాలని జెలెనెస్కీ తన మద్దతుదార్లను కోరుతున్నాడు. గత ఒక్క వారంలోనే నియంత్రిత బాంబుదాడులు 1,580, 1,100డ్రోన్ దాడులు, వివిధ రకాల 15 క్షిపణులతో దాడులు చేసినట్లు చెప్పాడు. వాటిలో 1,02,000 వరకు విదేశీ విడిభాగాలు ఉన్నాయని, దీని అర్ధం ఇప్పటి వరకు రష్యా మీద విధించిన ఆంక్షలు ఫలించలేదని తేలింది గనుక ఆంక్షల నిబంధనలలో ఉన్న లోపాలను సవరించి కఠినంగా అమలు జరపాలన్నాడు. అందుకోసం కొత్త నిర్ణయాలు, కొత్తగా వత్తిడి అవసరమన్నాడు.
క్రిమియా,డాన్‌బాస్, రష్యా అదుపులో ఉన్న మరో రెండు ప్రాంతాలు ఉక్రెయిన్ సంక్షోభంలో కీలక అంశాలని అమెరికా ప్రత్యేక ప్రతినిధి స్టీవ్ విట్‌కోఫ్ రియాద్ చర్చలకు రెండు రోజుల ముందు చెప్పాడు.రష్యా పాలనకు మద్దతు ఇచ్చిన ప్రజాభిప్రాయ సేకరణ ప్రకారం వాటిని రష్యా ప్రాంతాలుగా ప్రపంచ దేశాలు అంగీకరిస్తాయా అన్నది ముఖ్యమన్నాడు. వాటి మీద అంగీకారం కుదిరితే సమస్య పరిష్కారం అవుతుందన్నాడు. ఈ నాలుగు ప్రాంతాల్లో మెజారిటీ జనం రష్యన్ భాష మాట్లాడతారని, రష్యా పాలనకు ఆమోదం తెలిపారన్నాడు. వీటిని ఆమోదిస్తే జెలెనెస్కీ రాజకీయంగా బతుకుతాడా అన్నది కూడా కీలకాంశమన్నాడు. వాటిని రష్యన్ ప్రాంతాలుగా గుర్తించేది లేదని జెలెనెస్కీ గతంలో స్పష్టం చేశాడు. ఐరోపా ప్రమేయం లేని సౌదీ చర్చల్లో ముందుకు వచ్చిన ఇతర అంశాలేమిటి? ఐరోపా యూనియన్, ఇతర నాటో దేశాలు ఎలా స్పందిస్తాయన్నది, తదుపరి ముందుకు పోవటం ఎలా అన్నది ముందు ముందు చూడాల్సి ఉంది.
ఇజ్రాయెల్‌లో నిరసన ప్రదర్శనలు !
ఒక పరిణామం ఆందోళన, ఆగ్రహాలకు దారి తీస్తున్నది. మరొక సంక్షోభ తాత్కాలిక పరిష్కారం గురించి సానుకూల సంకేతాలు. బందీల విముక్తి దానికి ప్రతిగా ఖైదీల విడుదలకు సంబంధించి గాజాలోని హమస్‌తో కుదిరిన శాంతి ఒప్పందాన్ని ఇజ్రాయెల్ ఉల్లంఘించింది. మరోమారు గాజాలో మారణకాండను ప్రారంభించింది.దీని మీద ప్రపంచంలో వెల్లడైన నిరసన అంతా ఒక ఎత్తయితే ఏకంగా ఇజ్రాయెల్‌లోనే లక్షలాది మంది ప్రధాని నెతన్యాహు రక్తదాహాన్ని నిరసిస్తూ ప్రదర్శనలు జరపటం గమనించాల్సిన పరిణామం. బందీలను తమ వద్ద ఉంచుకొని వేలాది మంది ప్రాణాలను తీసేందుకు, లక్షలాది భవనాలను నేలమట్టం గావించటాన్ని ఇంకా ఎంతకాలం కొనసాగిస్తారనే వత్తిడి పాలస్తీనియన్ల నుంచి వచ్చిన కారణంగానే హమస్ శాంతి ఒప్పందానికి అంగీకరించింది. దీని అర్ధం గాజన్లు హమస్‌ను వ్యతిరేకిస్తున్నారని కాదు. అలాగే బందీల గురించి పట్టించుకోకుండా అరబ్బుల ఊచకోత, పాలస్తీనా ప్రాంతాలపై దాడులతో సాధించేదేమిటని ఇజ్రాయెలీ పౌరులు కూడా పెద్ద ఎత్తున వత్తిడి చేసిన కారణంగానే నెతన్యాహ ఒక అడుగు వెనక్కు వేయాల్సి వచ్చింది. యూదులు మారుమనసు పుచ్చుకొని తమ ప్రభుత్వంపై ఆగ్రహిస్తున్నారని అనుకున్నా పొరపాటే. నిజానికి అలాంటి ధోరణే ఉంటే ఏడాదిన్నర కాలంగా మారణకాండను సహించి ఉండేవారే కాదు. అలా అని మొత్తం యూదులందరూ ఉన్మాదులే అనుకున్నా తప్పే.గాజా ప్రాంతాన్ని శాశ్వతంగా ఆక్రమించేందుకు ఇజ్రాయెల్ పథకవేయనున్నట్లు, దానికి గాను అనేక సాకులు చెబుతున్నదని పరిశీలకులు భావిస్తున్నారు. మార్చి ఒకటవ తేదీన కాల్పుల విరమణ తొలి దశ ముగిసింది. హమస్ వద్ద ఇంకా 59 మంది బందీలు ఉన్నట్లు చెబుతుండగా వారిలో 35 మంది మరణించి ఉండవచ్చని కూడా అంటున్నారు..
గత వారంలో మారణకాండను తిరిగి ప్రారంభించిన ఇజ్రాయెల్ ఈసారి గాజాను శాశ్వతంగా ఆక్రమించుకోవాలని కొందరు బహిరంగంగానే పిలుపు ఇస్తున్నారు. అమెరికా సంగతి సరేసరి. దాన్ని తాము స్వాధీనం చేసుకొని విహార కేంద్రంగా మారుస్తామని, అక్కడ ఉన్న జనాలను జోర్డాన్, ఈజిప్టు తదితర దేశాలకు తరలించి పునరావాసం కల్పిస్తామని ట్రంప్‌తో సహా అక్కడి దుర్మార్గులు మాట్లాడుతున్నది తెలిసిందే.2023 అక్టోబరు ఏడు నుంచి గాజా మీద దాడులు జరుపుతున్నా, దాన్ని అష్టదిగ్బంధనం కావించినప్పటికీ ఇజ్రాయెల్ మిలిటరీ బందీల జాడ కనుక్కోలేకపోవటమే గాక ఒక్కరంటే ఒక్కరిని కూడా విడుదల చేయించలేకపోయింది. దాని దాడుల్లో కొంత మంది బందీలు మరణించినట్లు హమస్ గతంలో పేర్కొన్నది. బందీల ప్రాణాలను ఫణంగా పెట్టి పాలస్తీనియన్లను సాధిస్తారా అని ఆలోచించే వారి సంఖ్య టెల్‌అవీవ్‌లో పెరుగుతున్నది. అందుకే గతంలో జరిగిన ప్రదర్శనలతో పోలిస్తే భారీ సంఖ్యలో జనం పెరిగినట్లు వార్తలు వచ్చాయి. ప్రధాని నెతన్యాహు నివాసం వద్దకూడా నిరసన వెల్లడిరచారు. రాజధాని టెల్‌అవీవ్‌లో లక్ష మంది పాల్గొన్నారు. అంతర్గత గూఢచార సంస్థ అధిపతి, అటార్నీ జనరల్‌ను తొలగించాలనే ఆలోచనకు వ్యతిరేకత కూడా వ్యక్తమైంది. తిరిగి డాడులు కొనసాగిస్తే బతికి ఉన్న బందీలకు ప్రాణహాని కలుగుతుందని, ముందు వారు విడుదల కావాలని నిరసనకారులు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఇజ్రాయెలీ జాతీయ పతాకాలతో పాటు ప్రతిపక్ష పార్టీల జెండాలు, బానర్లు కూడా ప్రదర్శించారు. నియంత్రత్వ ఉన్మాదానికి స్వస్తి పలకాలనే పెద్ద బ్యానర్‌ను ఏర్పాటు చేశారు.
గత వారం రోజులుగా గాజా ప్రాంతంపై ఇజ్రాయెల్ మారణకాండ కొనసాగుతూనే ఉంది. ఒక ఆసుపత్రిలో చికిత్సపొందుతున్న, ఒక గుడారంలో సేదతీరుతున్న హమస్ అగ్రనేతలు ఇద్దరు ఈ దాడుల్లో మరణించారు. అల్ జజీరా విలేకరి ఒకరు కూడా మృతుల్లో ఉన్నారు. గాజాతో పాటు పశ్చిమగట్టు ప్రాంతాలపై కూడా ఇజ్రాయెల్ మిలిటరీ దాడులు జరుపుతూ అనేక మందిని అరెస్టు చేస్తున్నది. ఇప్పటి వరకు గాజా ప్రాంతంలో 50,144 మందిని చంపివేసినట్లు,1,13,704 మంది గాయపడ్డారని, 61,700 మంది కనిపించటం లేదని గాజా ఆరోగ్యమంత్రిత్వశాఖ వెల్లడిరచింది. పాలస్తీనియన్లకు మద్దతు తెలుపుతున్న ఎమెన్‌పై దాడుల పథకం వివరాలను పొరపాటున ఒక జర్నలిస్టుకు పంపిన మాట నిజమే అని అమెరికా ప్రభుత్వం పేర్కొన్నది. మరోవైపు దాడులను కొనసాగిస్తూనే ఉంది. రెండు నెలల కాల్పుల విరమణ తరువాత మరోసారి ఇజ్రాయెల్ దాడులు ప్రారంభించిన పూర్వరంగంలో ఈజిప్టు రెండవ దశ కాల్పుల విరమణకు కొత్త ప్రతిపాదన ముందుకు తెచ్చింది. వారానికి ఐదుగురు బందీల చొప్పున హమస్ విడుదల చేయాలని దానికి అనుగుణంగా దాడుల విరమణ జరగాలని, దీనికి హమస్, అమెరికా అంగీకరించినట్లు ఇజ్రాయెల్ వైపు నుంచి స్పందన లేదని వార్తలు వచ్చాయి. గాజాలో అదనపు ప్రాంతాలను ఆక్రమించాలని రక్షణ మంత్రి ఇజ్రాయెల్ కాట్జ్ తమ దళాలను ఆదేశించినందున రాజీ ప్రతిపాదనలకు సిద్దంగా లేదని స్పష్టం అవుతున్నది. ఇస్లామిక్ జీహాద్ అనే సంస్థ తాజాగా ఇజ్రాయెల్‌పై రాకెట్లదాడి జరిపింది. దాంతో తమపై దాడులు మరింతగా పెరిగాయంటూ బెల్ట్ లహియా ప్రాంతంలో పాలస్తీనియన్లు నిరసన ప్రదర్శన జరిపారని, ముసుగులు ధరించిన హమస్ సాయుధులు వారిని చెదరగొట్టినట్లు బిబిసి ఒక వార్తను ఇచ్చింది. అది వాస్తవమైతే మిలిటెంట్ల రెచ్చగొట్టుడు చర్యలను పాలస్తీనియన్లు సహించకపోవచ్చని చెప్పవచ్చు.
