ఎం కోటేశ్వరరావు
పేరు పెట్టి చెప్పకపోయినా చైనాకు పరోక్ష హెచ్చరికలు చేయటంలో మననేతలు తక్కువ తినలేదు. అవి సరిహద్దు సమస్యల మీద కావచ్చు, చైనా స్థానంలో ప్రపంచ ఫ్యాక్టరీగా మనం మారబోతున్నాం అన్న కోతలు ఏవైనా కావచ్చు. మాటలు కోటలు దాటినా చేతలు గడపదాటటం లేదన్న సామెత తెలిసిందే. గత పదేండ్లుగా మేకిన్ ఇండియా, మేడిన్ ఇండియా, ఆత్మనిర్భరత వంటి నినాదాలు మన చెవుల తుప్పు వదలగొడుతున్నాయి. కానీ పదేండ్ల పాలనలో చైనాకు నరేంద్రమోడీ సమర్పించిన మొత్తం ఎంతో తెలుసా ? యాభై లక్షల కోట్ల రూపాయలకు పైమాటే అంటే ఎవరైనా నమ్ముతారా ? తమ విశ్వగురువు ఇలా చేశారంటే వీర భక్తులు అసలు నమ్మరు. కానీ చేదు నిజం. గడచిన పది సంవత్సరాలలో చైనాతో మన వాణిజ్య లోటు 614బిలియన్ డాలర్లు.(గత ఐదేండ్లలో 387బి.డాలర్లు) బిలియన్‌కు వంద కోట్లు అంటే 61,400, ఒక డాలర్‌కు మన రూపాయి మారకం విలువ ఇది రాసిన సమయంలో 83.47 ఉంది. ఆ లెక్కన చైనాకు మనం సమర్పించుకున్న మొత్తం రు.51,25,058 కోట్లు. ఈ వివరాలను 2024 ఫిబ్రవరి 29న ఫైనాన్సియల్ ఎక్స్‌ప్రెస్ పత్రికలో విశ్లేషణ రాసిన గ్రూప్ కెప్టెన్ ప్రవీర్ పురోహిత్(ఐఎఎఫ్ విశ్రాంత ఉద్యోగి) పేర్కొన్నారు.” చైనాతో పెరుగుతున్న భారత వాణిజ్యలోటు వ్యూహాత్మక దుర్బలత్వం ” అనే శీర్షికతో సదరు విశ్లేషణ ఉంది. ఒక వైపు ఏటికేడు చైనా నుంచి దిగుమతులను పెంచుకుంటూ మరోవైపు చైనా నుంచి ముప్పువస్తోంది గనుక అమెరికాతో చేతులు కలపాలి, ఆయుధాలు కొనుగోలు చేయాలి అంటూ జనాన్ని తప్పుదారి పట్టిస్తున్న నరేంద్రమోడీ విధానాలను ఎలా అర్ధం చేసుకోవాలి ?మన దేశం కూడా ఇతర దేశాలతో పోటీ పడి వృద్ధి చెందాలని, జనానికి ఉపాధి కల్పించి సరిపడా ఆదాయకల్పన చేసి మెరుగైన జీవితం గడపాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. దానికి అనువైన విధానాలను అనుసరించటం లేదనేదే పాలకుల మీద విమర్శ. మనోభావాలను రేకెత్తించటం మీద ఉన్న శ్రద్ద అభివృద్ది మీద లేదు. తమ సరకులను దిగుమతి చేసుకోవాలని ఏ దేశాన్నీ చైనా దేబిరించటం లేదు. మా ఊళ్లో దుకాణం తెరవాలని గ్రామస్తులు ఎవరినైనా వేడుకుంటారా ? ఉన్న దుకాణానికి తోడు కొత్తది వెలిస్తే అక్కడ తక్కువ ధరలకు వస్తువులను అమ్మితే జనం అక్కడే కొనుక్కుంటారు.ప్రపంచ మార్కెట్‌లో ఎప్పటినుంచో ఉన్న అమెరికా, జపాన్, జర్మనీ,బ్రిటన్ సరసనే చైనా కూడా దుకాణం తెరిచింది.అక్కడ సరసమైన ధరలకు ఇస్తున్నందున ప్రపంచ దేశాలన్నీ ఎగబడి కొనుక్కుంటున్నాయి. గిరాకీని తట్టుకోలేకపోతున్నాము, ఎవరైనా వచ్చి మా దేశంలోనే వస్తూత్పత్తి చేయండి అంటే వివిధ దేశాల నుంచి పెట్టుబడిదారులు అక్కడకు వెళ్లి ఉత్పత్తి చేసి నాలుగురాళ్లు వెనుకేసుకుంటున్నారు. ఆపని చేయలేక మనం కూడా చైనా, ఇతర దేశాల నుంచి కావాల్సినవి కొనుక్కుంటున్నాం.ఎవరూ ఎవరిని బలవంతం చేయటం లేదు. చైనా వస్తువులను బహిష్కరించాలని మనదేశంలో చాలా మంది వాట్సాప్ ద్వారా సందేశాలను పంపారు. పెద్ద జోకేమిటంటే అందుకోసం వారు కూడా చైనా ఫోన్లనే వాడుతున్నారు.
తాజాగా గ్లోబల్ ట్రేడ్ రిసర్చ్ ఇనీషియేటివ్(జిటిఆర్‌ఐ) అనే సంస్థ వెల్లడించిన సమాచారం ప్రకారం పదిహేను సంవత్సరాల క్రితం మనం దిగుమతి చేసుకున్న పారిశ్రామిక వస్తువులలో చైనా వాటా 21 ఉంటే ఇప్పుడు 30శాతానికి పెరిగింది. విదేశాల మీద ప్రత్యేకించి చైనా మీద ఆధారపడటాన్ని తగ్గించటమే కాదు, అసలు మనమే ప్రపంచానికి ఎగుమతి చేద్దామంటూ నరేంద్రమోడీ ఎంతో హడావుడి చేస్తున్నపుడే ఇదంతాజరిగింది.ఇప్పటికి తాను చేసింది ట్రైలర్ మాత్రమే అని చెప్పిన మోడీ రానున్న రోజుల్లో చైనా నుంచి ఇంకా పెద్ద ఎత్తున దిగుమతులకు పూనుకుంటారా ? మరింత గట్టిగా పని చేస్తానంటూ రెండవసారి అధికారానికి వచ్చిన తరువాత గత ఐదేండ్లలో చైనాకు మన ఎగుమతులు ఏటా 16బిలియన్ డాలర్లకు అటూ ఉండగా అక్కడి నుంచి దిగుమతులు 70.3 నుంచి 101 బి.డాలర్లకు పెరిగాయి. ఇది సమర్ధతా, అసమర్ధతకు చిహ్నమా ? చైనా మీద ఆధారపడటం పెరుగుతున్న తీరు ఆందోళనకరంగా ఉందని జిటిఆర్‌ఐ అన్నది, దేశం కోసం, ధర్మం కోసం అంటూ కబుర్లు చెప్పే నరేంద్రమోడీలో అలాంటిదేమైనా ఉందా ? రామాలయం మీద, దాని ద్వారా ఓట్లు దండుకోవాలన్న యావలో కొంచెమైనా పారిశ్రామికీకరణ మీద ఉందా ? రాజ్యసభలో వైసిపి సభ్యుడు ఆళ్ల అయోధ్యరామిరెడ్డి చైనాతో పెరుగుతున్న మనదేశ వాణిజ్య లోటు గురించి ఒక ప్రశ్న అడిగితే దానికి 2023 డిసెంబరు ఎనిమిదిన కేంద్ర ప్రభుత్వం ఒక సమాధానమిచ్చింది.దానిలో గడచిన తొమ్మిది సంవత్సరాల్లో ఎంతో మార్పు వచ్చిందంటూ గాలిపోగేసి రోజూ చెప్పే కబుర్లను పునరుద్ఘాటించటం తప్ప అసలు సంగతి మన ఎగుమతులు ఎందుకు పెరగటం లేదో దిగుమతులు రికార్డులను ఎందుకు బద్దలు కొడుతున్నదీ చెప్పలేదు.
మనకు అవసరమైన వస్తువులు లేదా ముడి పదార్దాలను చైనా నుంచి దిగుమతి చేసుకోవాలా మరొక దేశం నుంచా అన్న అంశం మీద కూడా చర్చ జరుగుతున్నది. మనవి కానపుడు ఎక్కడి నుంచి దిగుమతి చేసుకున్నా ఒకటే. ప్రపంచ వాణిజ్య సంస్థలో చేరాం గనుక చైనా నుంచి కొన్ని దిగుమతులు చేసుకోక తప్పదు అంటూ కొందరు సన్నాయి నొక్కులు నొక్కుతారు. అదే వాస్తవమైతే పాకిస్తాన్ కూడా దానిలో సభ్యురాలే కదా ? అక్కడి నుంచి ఎందుకు దిగుమతులు చేసుకోవటం లేదు. పూర్తిగా చైనా మీద ఆధారపడితే ప్రపంచ రాజకీయాల్లో తేడా వస్తే, అక్కడి నుంచి నిలిచిపోతే పరిస్థితి ఏమిటని కొందరు అంటున్నారు. అసలు అలాంటి ఆలోచనలు ఎందుకు వస్తున్నాయి. మన విధానాలు సరిగా ఉంటే ఎవరితో నైనా వివాదాలు ఎందుకు వస్తాయి. అమెరికా లేదా దాని కనుసన్నలలో పనిచేసే దేశాల మీద ఆధారపడినా అదే జరగదా ? గతంలో అంతర్జాతీయంగా తమ కూటమిలో చేరకుండా ఉన్నందుకే కదా పరిశ్రమలు, అంతరిక్ష ప్రయోగాలకు అలాంటి సహకారం అందించేందుకు అమెరికా నిరాకరించింది. ఆ కారణంగానే మన దేశం సోవియట్ వైపు మొగ్గింది.చైనాను మనదేశం శత్రుదేశంగా భావిస్తే ఏ ప్రధానీ కలవనన్ని సార్లు చైనా నేతలను రికార్డు స్థాయిలో నరేంద్రమోడీ ఎందుకు కలసినట్లు ? ఇరు నేతలూ అటు ఊహాన్ ఇటు మహాబలిపురంలో కలసి ఉయ్యాలలూగారు. గాల్వన్‌లోయ ఉదంతాల తరువాత చైనా నుంచి వచ్చే పెట్టుబడులు మనదేశానికి ముప్పు తెస్తాయంటూ కేంద్ర అనుమతి లేకుండా అంగీకరించకూడదని గిరిగీసుకున్నది మనమే. దానికి ప్రతిగా చైనా మన దిగుమతుల మీద లేదా అక్కడి నుంచి వస్తుదిగుమతుల మీద ఎలాంటి ఆంక్షలు లేవు. మరింత పెరిగాయి, వాటితో ముప్పురాదా ?
పోనీ చైనా మీద ఆధారపడటాన్ని తగ్గించారా అంటే అదీ లేదు. ఇతర దేశాలతో పోలిస్తే చైనా నుంచి దిగుమతుల వేగం 2.3రెట్లు పెరిగిందని, 2023-24 మనదేశం 677.2 బి.డాలర్ల మేర దిగుమతులు చేసుకుంటే దానిలో 101.8 బి.డాలర్లు చైనా నుంచి అంటే 15శాతం ఉన్నట్లు జిటిఆర్‌ఐ నివేదిక పేర్కొన్నది.కీలక రంగాలలో దిగుమతులు ఎక్కువగా ఉన్నట్లు కూడా తెలిపింది. గత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్-జనవరి మధ్య మనదేశం మొత్తం 67.8 బి.డాలర్ల మేర ఎలక్ట్రానిక్స్, టెలికాం, ఎలక్ట్రికల్ ఉత్పత్తులను దిగుమతి చేసుకుంటే వాటిలో చైనా నుంచి చేసుకున్నవాటి విలువ 26.1 బిలియన్ డాలర్లు, 38.4శాతం,యంత్రాల దిగుమతిలో కూడా అక్కడి నుంచి 39.6శాతం,రసాయనాలు, ఫార్మా ఉత్పత్తులు 29.2శాతం ఉంది.మొత్తం దిగుమతుల్లో 50శాతం యంత్రాలు, ఇతర ఉత్పాదక సంబంధమైనవే ఉన్నాయి. శత్రుదేశమంటూ మన మీడియా, సంఘపరివార్‌కు చెందిన సంస్థలు సామాజిక మాధ్యమాల్లో దుమ్మెత్తి పోస్తున్నా చైనా వాటిని పెద్దగా పరిగణనలోకి తీసుకోవటం లేదు. జపాన్ తదితర దేశాల సముద్ర ఉత్పత్తులను తిరస్కరించినట్లుగా, ఆస్ట్రేలియా ఉత్పత్తుల మీద ఆంక్షలు విధించినట్లుగా మన వస్తువులను తిప్పిపంపిన దాఖలాలు లేవు. చైనా నుంచి దిగుమతి చేసుకుంటున్న వస్తువులు ఇతర దేశాల్లో కూడా దొరుకుతాయి, అయితే అంత చౌకగా దొరకవు గనుక మోడీ ప్రభుత్వ మెడలు వంచి దిగుమతిదారులు, పారిశ్రామికవేత్తలు విదేశీమారకద్రవ్యాన్ని కేటాయింప చేసుకొని వస్తు దిగుమతులు చేసుకుంటున్నారు. మనదేశంలో చిన్న పరిశ్రమలకు పెద్ద ఎత్తున ప్రోత్సాహమిస్తున్నట్లు ప్రచారం చేసుకుంటున్నారు.ఎంఎస్‌ఎంఇ సంస్థలు మనదేశంలో ఉత్పత్తి చేయగలిగిన వస్త్రాలు, దుస్తులు,గాజువస్తువులు, ఫర్నీచర్, కాగితం, చెప్పులు, బొమ్మలను కూడా దిగుమతి చేసుకుంటున్నట్లు జిటిఆర్‌ఐ నివేదిక ఆవేదన వెలిబుచ్చింది.రానున్న రోజుల్లో మనదేశ రోడ్ల మీద తిరిగే ప్రతి మూడు విద్యుత్ వాహనాల్లో ఒకటి చైనా సంస్థలు లేదా వాటితో భాగస్వామ్యం కుదుర్చుకున్న లేదా దిగుమతి చేసుకున్నవే ఉంటాయని జిటిఆర్‌ఐ పేర్కొన్నది.మన మార్కెట్‌లోకి చైనా సంస్థలు ప్రవేశిస్తే వాటి ఉత్పత్తులకు అవసరమైన విడిభాగాలన్నింటినీ చైనా నుంచి దిగుమతి చేసుకొనేందుకే ప్రాధాన్యత ఇచ్చే అవకాశం ఉన్నందున దిగుమతులు మరింతగా పెరుగుతాయని తెలిపింది.మన జిడిపిలో పారిశ్రామిక ఉత్పత్తి ఇప్పుడున్న 17 లేక 18శాతం స్థితి నుంచి 25శాతానికి పెరగాలంటే చైనా నుంచి మరిన్ని దిగుమతులు అవసరమని పారిశ్రామికవేత్తలు చెబుతున్నారు.
అమెరికా ప్రారంభించిన వాణిజ్య యుద్దంలో భాగంగా చైనా నుంచి దిగుమతి చేసుకున్న వస్తువుల మీద భారీ మొత్తంలో దిగుమతి పన్ను విధిస్తున్నారు. ఆ మొత్తం అక్కడి వినియోగదారుల మీదనే మోపుతున్నారు తప్ప దిగుమతులను నిలిపివేయలేదు. ప్రత్యక్షంగా వాణిజ్య పోరుకు దిగినట్లు ప్రకటించకపోయినా మనదేశం కూడా చేస్తున్నది అదే. రెండుదశాబ్దాల క్రితం ప్రపంచ వాణిజ్య సంస్థలో చైనా ప్రవేశించినపుడు మనదేశంతో వాణిజ్య లావాదేవీల విలువ 3.6బిలియన్ డాలర్లు మాత్రమే. దానిలో మనలోటు కేవలం 0.19బి.డాలర్లు మాత్రమే. అదే 2022లో ద్విపక్ష వాణిజ్యం 136 బి.డాలర్లకు చేరగా మనలోటు 101బి.డాలర్లు ఉంది.మరుసటి ఏడాది పరిస్థితి కూడా అలాగే ఉంది.దిగుమతులు మన పరిశ్రమలు, వాణిజ్యం మీద ప్రతికూల ప్రభావం చూపుతుండటంతో కేంద్ర ప్రభుత్వం 2016 నుంచి దిగుమతి పన్ను 500 రెట్లు పెంచింది. అయినా తగ్గలేదు, అంటే పెంచిన పన్ను మొత్తాలను భరిస్తున్నది మన వినియోగదారులే. మన దేశంలోనే వస్తూత్పత్తి చేసి జనానికి ఉపాధితో పాటు చౌకగా సరకులను అందించాల్సిన నరేంద్రమోడీ దిగుమతి చేసుకున్న వస్తువుల మీద కూడా పన్నులు మోపి జనం జేబులు గుల్లచేస్తున్నారు.రష్యా నుంచి చౌకగా దిగుమతి చేసుకున్న ముడి చమురు మీద కూడా అంతే చేస్తున్న సంగతి ఎరిగిందే.వినియోగదారులకు ఒక్క పైసా అయినా తగ్గించారా ? ఫార్మాదిగుమతులపై పన్ను పెంపును మనదేశంలోని పరిశ్రమ వర్గాలు వ్యతిరేకించటంతో 76 ఔషధాలపై పెంపుదలను వెనక్కు తీసుకున్నారు. అనేక వస్తువులపై దిగుమతి పెంపును ఉత్పత్తిదారులు స్వాగతిస్తే దిగుమతిదారులు వ్యతిరేకించారు. ఆర్థికశాఖ తీసుకున్న నిర్ణయాలను ఇతర మంత్రిత్వశాఖలు వ్యతిరేకించాయి.ఈ ఏడాది తాత్కాలిక బడ్జెట్‌కు ముందు అనేక వస్తువులపై పన్నులను తగ్గించారు. ఉత్పాదకత ఎగుమతులతో ముడిపెట్టిన ప్రోత్సాహక పధకం(పిఎల్‌ఐ) రాయితీలను ఉపయోగించుకున్న సంస్థలు పన్నెండింటిలో పదకొండు చైనా సరఫరా గొలుసు భాగస్వాములు లేదా సేవలు అందించే సంస్థలున్నట్లు వార్తలు వచ్చాయి. గత పది సంవత్సరాల కాలంలో అనేక ప్రోత్సాహాకాలు, రక్షణ చర్యలు చేపట్టినా మన పారిశ్రామిక ఉత్పత్తి వాటా జిడిపిలో 15శాతం చుట్టూ తిరుగుతున్నది తప్ప పెరగలేదు. గాల్వన్ ఉదంతాల తరువాత మనదేశం నుంచి ఎగుమతులు నిలిపివేస్తే చైనా మన కాళ్లదగ్గరకు వస్తుందని అనేక మంది కలలు గని అలాంటి పిలుపులే ఇచ్చారు. మొత్తం చైనా చేసుకునే దిగుమతుల్లో మనదేశ వాటా కేవలం మూడుశాతమే, అదే మనం దిగుమతి చేసుకుంటున్నది 15శాతం ఉన్నాయి.చెరువు మీద అలగటం మంచిది కాదని మన విధాన నిర్ణేతలకు అర్ధమైంది.
