ఎం కోటేశ్వరరావు
మన దేశంలో విధిని నమ్మేవారు ఎక్కువ, నమ్మనివారు తక్కువ. విధి వైపరీత్యం గురించి చెప్పే బాబాలు, జ్యోతిష్కులు,ప్రవచనకారులను రోజూ చూస్తూనే ఉన్నాం. పోతులూరి వీరబ్రహ్మం కాలజ్ఞానం అంటూ కొత్త కొత్త అంశాల గురించి అనేక మంది చెబుతారు. ఫ్రెంచి జ్యోతిష్కుడు నోస్ట్రాడమస్ 1,555లోనే నరేంద్రమోడీ గురించి జోశ్యం చెప్పాడని కేంద్ర మంత్రి కిరెన్ రిజుజు గతంలో ప్రకటించిన సంగతి తెలిసిందే. 2014లో హిందువులు అధికారానికి వస్తారని ( అతల్ బిహారీ వాజ్‌పాయిను హిందువుగా గుర్తించలేదా లేక దుర్భిణికి కనిపించలేదా) భూమ్యాకాశాలను పాలిస్తారని, ఆసియాలో వారిని ఎవరూ నిరోధించలేరని,భారత అధినాయకుడు గుజరాత్‌లో జన్మిస్తాడని,అతని తండ్రి టీ అమ్ముతారని,అతని మొదటి నామం నరేన్‌దసు అని, 2026వరకు అధికారంలో ఉంటారని రాతపూర్వకంగా ఉందని సదరు మంత్రి సెలవిచ్చారు. ఇన్ని చెప్పిన సదరు జ్యోతిష్కుడు బాబరీ మసీదు కూల్చివేత, గుజరాత్ మారణకాండల గురించి, ఆ కారణంగా అమెరికా తన గడ్డమీద అడుగు పెట్టనివ్వదనీ, 2024లో ముస్లిం అనుకూల పార్టీల దయతో ఏలుబడిలోకి వస్తారని ఎలా పసిగట్టలేకపోయారన్నది ప్రశ్న. ఇంకా చాలా ఉన్నాయి. అయోధ్యలో రామమందిరం కట్టిస్తారని, ఓట్ల కోసం దాన్ని పెద్ద ఎత్తున ప్రచారం చేస్తారని, చివరకు అక్కడ పార్టీని గెలిపించటంలో మోడీ చతికిల పడతారని, రామాలయాన్ని బుల్డోజర్లతో కూల్చివేస్తారని నరేంద్రమోడీ ఎవరి గురించి చెప్పారో ఆ సమాజవాది పార్టీ ప్రతినిధిని ఆ రాముడే తన ఆలయ రక్షణకు గెలిపిస్తారని, బిజెపిని ఓడిస్తారని ఎందుకు చెప్పలేదు. హిందూ హృదయ సామ్రాట్టుగా మన్ననలను అందుకున్న, ముస్లింల సంతుష్టీకరణను తీవ్రంగా వ్యతిరేకించిన 56 అంగుళాల ఛాతీ ఉన్న ధైర్యవంతుడిగా స్తోత్రపాఠాలు అందుకున్న నేతపట్ల విధి ఎందుకు ఇంత విపరీతంగా ప్రవర్తించినట్లు ?నోస్ట్రాడామస్‌ను పక్కన పెడదాం, సాధారణ మానవుల మాదిరిగాక దైవాంశ సంభూతుడిగా జన్మించినట్లు చెప్పుకున్న కారణజన్ముడు సైతం రాగల పరిణామాలను ఎందుకు ఊహించలేకపోయారు.
తాను బతికి ఉండగా ముస్లిం రిజర్వేషన్లను అనుమతించే ప్రసక్తి లేదని నరేంద్రమోడీ ప్రతిజ్ఞ చేశారు, దేశానికి గ్యారంటీ ఇచ్చారు. తాము అధికారంలోకి వస్తే నాలుగుశాతం రిజర్వేషన్లు అమలు చేస్తానని చంద్రబాబు చెప్పారు. నితీష్ కుమార్ కూడా ముస్లింలకు అనుకూలంగానే వ్యవహరించారు.బీహార్‌లో కుల గణన సర్వే వివరాలు నిలిపివేయాలని కోరిన కేసులో సుప్రీం కోర్టు తిరస్కరించిన తీర్పు మరుసటి రోజు 2023 అక్టోబరు ఏడున నితీష్ కుమార్ తన నివాసంలో ముస్లిం మత పెద్దలతో సుదీర్ఘసమావేశం జరిపారు.మైనారీటీల సంక్షేమం, సామాజిక భద్రత గురించి వారికి హామీ ఇచ్చి లోక్‌సభ ఎన్నికల్లో తనకు మద్దతు ఇవ్వాలని కోరారు. కుల సర్వే వివరాల ప్రకారం బీహార్‌లో ముస్లిం జనాభా 17.7శాతం ఉంది.కులగణనలో ముస్లింలలో ఉన్న పాతిక కులాల వారిని అత్యంత వెనుకబడిన తరగతి(ఇబిసి)గా పరిగణించి లెక్కించారు.స్థానిక సంస్థల ఎన్నికలలో రిజర్వేషన్లకు అర్హత కల్పించారు.నితీష్ కుమార్ రిజర్వేషన్ ఫార్ములా ప్రకారం దళితులకు 16, గిరిజనులకు ఒకటి, ఇబిసిలకు 18, ఓబిసిలకు 12, ఇబిసి మహిళలకు మూడు శాతం అని చెప్పారు.ఇదంతా చేసిన తరువాత ఆ పెద్ద మనిషి ఇండియా కూటమినుంచి ఫిరాయించి తిరిగి ఎన్‌డిఏ కూటమిలో చేరి బిజెపితో అధికారాన్ని పంచుకున్నారు, లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేశారు. వచ్చే ఏడాది అక్టోబరు-నవంబరు మాసాల్లో బీహార్ అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉంది. నితీష్ కుమార్‌కు అవి పెద్ద పరీక్షగా మారతాయి.తాజా లోక్‌సభ ఎన్నికల్లో ఎన్‌డిఏ పార్టీలకు వచ్చిన ఓట్లను చూసినపుడు 2019లో వచ్చిన ఓట్లకంటే ఆరుశాతం తగ్గగా ఇండియా కూటమి ఓట్లు 3.5శాతం పెరిగాయి. ఓట్లపరంగా చూసినపుడు ఆర్‌జెడి 22.41శాతం ఓట్లతో పెద్ద పార్టీగా ఉంది.బిజెపి 20.5శాతంతో ద్వితీయ, 18.52శాతంతో జెడియు మూడవ స్థానంలో ఉంది.బిజెపి, జెడియు రెండూ గతంలో ఉన్న లోక్‌సభ స్ధానాలలో తొమ్మిదింటిని కోల్పోయాయి.తెలుగు ప్రాంతాలలో ఇంత బతుకూ బతికి ఇంటివెనకాల చచ్చినట్లు అనే లోకోక్తి తెలిసిందే. తమ పార్టీ ఓట్ల కోసం ఎవరినీ సంతుష్టీకరించదు, మిగతా పార్టీలన్నీ మైనారిటీల సంతుష్టీకరణకు పాల్పడుతున్నట్లు వూరూ వాడా చెడా మడా ప్రచారం చేసిన బిజెపి గురించి తెలిసిందే. ముస్లిం సంతుష్టీకరణకు వ్యతిరేకం, ఎట్టి పరిస్థితిలోనూ దానికి లొంగేది లేదని చెప్పిన వారు ఇప్పుడు ముస్లిం అనుకూల విధానాలను అమలు చేస్తామని చెప్పిన చంద్రబాబు నాయుడు, నితీష్ కుమార్ నాయకత్వంలోని పార్టీల దయమీద కేంద్రంలో అధికారానికి రావటాన్ని ఏమనాలి ? ముస్లిం రిజర్వేషన్లు అమలు జరిపితీరుతామని చెప్పిన చంద్రబాబుతో మోడీ రాజీపడతారా లేక చంద్రబాబు నాయుడు నితీష్ కుమార్ ఇద్దరూ మోడీతో సర్దుకుపోదాం పదండి అంటారా ? విధి వైపరీత్యం ఎవరితో ఎలా ఆడుకుంటుందో, వారిని నమ్మిన వారిని ఏం చేస్తుందో చూద్దాం.
నరేంద్రమోడీని ఇప్పటి వరకు అనేక మంది విశ్వగురువుగా, ప్రపంచ దేశాలను ప్రభావితం చేసే నేతగా ప్రచారం చేశారు. నిజమే అని నమ్మి అబ్‌కీబార్ ట్రంప్ సర్కార్ అని బాహాటంగా ప్రకటించిన నరేంద్రమోడీ అమెరికాలో చేతులు కాల్చుకున్నది తెలిసిందే. సదరు ట్రంప్ అధికారం పోయింది. స్వంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం లేకుండా మోడీకి జనం తగిన పాఠం చెప్పారు.అదే ట్రంప్ మనదేశం వచ్చి నరేంద్రమోడీకి అనుకూలంగా చెప్పి ఉంటే ఏం జరిగేదో అనూహ్యం.ఎన్నికల తరువాత మోడీ గురించి ప్రపంచం ఏమనుకుంటోంది అంటే మీడియా వ్యాఖ్యలను చూడాల్సిందే. బిజెపి పెద్దలు తరచూ పాకిస్తాన్‌తో పోల్చి తాము సాధించిన విజయాల గురించి చెప్పుకుంటారు.అదే పాక్ ఆంగ్ల పత్రిక ”డాన్ ” మన ఎన్నికల గురించి పతాకశీర్షిక పెట్టింది.” విద్వేషాన్ని ఓడించిన భారత్, ముస్లిం అనుకూల పార్టీల దయాదాక్షిణ్యాలపై ఆధారపడిన మోడీ ” అని రాసింది. దీన్ని చూస్తే మోడీ భక్తులకు మామూలుగా మండదు. మామ తిట్టినందుకు కాదు తోడల్లుడు తొంగిచూసి కిసుక్కున నవ్వినందుకు అనే ఒక సామెత గుర్తుకు రావటం లేదూ ! అందరూ ఈ వార్తను చూస్తారో లేదోనని ఆ పత్రిక మొదటి పేజీని బిజెపి నేత సుబ్రమణ్యస్వామి తన ఎక్స్ ఖాతాలో పంచుకొని మోడీని ఎద్దేవా చేశారు. నరేంద్రమోడీ హిందూత్వ ఉత్సాహం, ముస్లింలు, ఇతర మైనారిటీలను లక్ష్యంగా చేసుకోవటాన్ని అంగీకరించని బీహార్, ఆంధ్రప్రదేశ్‌లోని లౌకిక పార్టీల దయమీద ఆధారపడాల్సి వచ్చిందని, కేరళలో తొలిసారిగా విజయం సాధించిన బిజెపి అభ్యర్థికూడా మైనారిటీలతో సన్నిహిత సంబంధాలు కలిగి ఉన్న వ్యక్తని కూడా డాన్ పేర్కొన్నది. బలహీన పడినప్పటికీ ఇంకా ప్రాణాంతకమే అంటూ బిజెపి, నరేంద్రమోడీ గురించి అదే పత్రిక మరో విశ్లేషణలో హెచ్చరించింది.
”భారత్‌లో మోడీ పార్టీ బిజెపి తన ఆధిక్యతను ఎలా కోల్పోయింది ” అనే ప్రశ్నార్ధక శీర్షికతో అంతర్జాతీయ ఎఎఫ్‌పి సంస్థ వార్త ఇచ్చింది.పది సంవత్సరాల క్రితం హిందూ జాతీయనేత అధికారానికి వచ్చిన తరువాత తొలిసారిగా సంపూర్ణ మెజారిటీని సాధించటంలో భారత ప్రధాని నాయకత్వంలోని బిజెపి విఫలమైంది అని వ్యాఖ్యానించింది.వరుసగా మూడవ సారి భారీ మెజారిటీ సాధించటంలో వైఫల్యానికి కారణాలను పేర్కొన్నది.విభజన వాద ప్రచారం దెబ్బతీసింది.హిందూ మెజారిటీని సమీకరించుకొనేందుకు అసాధారణ రీతిలో ముస్లింలకు వ్యతిరేకంగా మోడీ మాట్లాడారు.తన సభల్లో వారిని చొరబాటుదార్లు అన్నారు, ప్రతిపక్ష కాంగ్రెస్ అధికారానికి వస్తే దేశ సంపదలను ముస్లింలకు పంచుతుందని చెప్పారు. ఇది హిందూ ఓటర్లను ఉత్సాహపరచలేకపోయింది, మైనారిటీల మద్దతు ప్రతిపక్షానికి గట్టిపడేట్లు చేసింది.ఎన్నికల సందర్భంగా తాము ఓటర్లను కదిలించినపుడు ప్రభుత్వ భావజాల(హిందూత్వ) అజెండా కంటే తమకు నిరుద్యోగ సమస్య ప్రధానమని చెప్పినట్లు పేర్కొన్నది. జనం తమ జీవనం, నిరుద్యోగం, ధరల పెరుగుదల గురించి ఎక్కువ ఆవేదన చెందినట్లు , మోడీ, బిజెపి చెబుతున్నవి తమకు సంబంధం లేని అంశాలుగా జనం భావించారని మోడీ జీవిత చరిత్రను రాసిన నిలంజన్ ముఖోపాధ్యాయ కూడా అన్నట్లు ఈ వార్తా సంస్థ పేర్కొన్నది. పెద్ద రాష్ట్రమైన ఉత్తర ప్రదేశ్‌లలో విఫలం కావటం, దక్షిణాది రాష్ట్రాలలో బలం పెంచుకొనేందుకు పదేపదే పర్యటించినా ఫలితం లేకపోవటం, అయోధ్యలో ఓటమి తదితర అంశాలను అది ఉటంకించింది.
”భారత ఎన్నికల్లో బిజెపికి ఎదురుదెబ్బలు, మోడీ విజయం” అంటూ అమెరికా టీవీ సిఎన్‌ఎన్ వార్తలను ఇచ్చింది.ప్రపంచ అతి పెద్ద ప్రజాస్వామిక వ్యవస్థలో ఓటర్లు ప్రజాకర్ష హిందూ దేశానికి అగ్రతాంబూలం అనే దృక్పధాన్ని ఓటర్లు పాక్షికంగా తిరస్కరించారని విశ్లేషణలో పేర్కొన్నది.మోడీ ముద్రగల హిందూ దేవాలయం ఉన్న పెరటితోటలో తిరుగులేని ఓటమి అంటూ అయోధ్య గురించి న్యూస్‌వీక్ పత్రిక పేర్కొన్నది. ఎట్టకేలకు మేలుకున్న భారతీయ ఓటర్లు అంటూ న్యూయార్క్‌టైమ్స్ పత్రిక శీర్షిక పెట్టి విశ్లేషణ రాసింది.అజేయమైన శక్తి అనే మోడీ ప్రతిష్టకు చిల్లుపడింది, సంకీర్ణ రాజకీయాలు తిరిగి వచ్చాయి అని పేర్కొన్నది. మోడీ, ఆయన పార్టీకి తిరుగులేని దెబ్బ అని వాషింగ్టన్ పోస్టు పేర్కొన్నది. మోడీ పేలవ ప్రదర్శన ప్రతిపక్షం పుంజుకోవటానికి నిదర్శనం అని బ్రిటన్ పత్రిక ఇండిపెండెంట్ పేర్కొన్నది. ”మోడీ విజయంతో చైనా, అమెరికాలతో భారత్ మరింత దగ్గర ” అంటూ చైనా పత్రిక గ్లోబల్‌టైమ్స్ విశ్లేషణ శీర్షిక పెట్టింది.మోడీ ఏలుబడి తొలి ఐదు సంవత్సరాలలో చైనాతో ముద్దులతో మొదలై గుద్దులదాకా వచ్చింది, తరువాత మరింత ఆర్థిక సహకారం కోసం ఉద్రిక్తతలను సడలించింది.2019 నుంచి సరిహద్దు ప్రతిష్ఠంభను ఒక ప్రధాన సమస్యగా చేసింది. మూడవసారి మరింత జాగ్రత్తలతో కూడిన మార్పులు జరగవచ్చు.శాంతియుత, స్థిరమైన సంబంధాలు రెండుదేశాలకూ కీలకం, సంబంధాలు దెబ్బతిన్నప్పటికీ రెండు దేశాల మధ్య వాణిజ్యం 2023లో అమెరికా-భారత్ లావాదేవీలను అధిగమించింది. గుడ్డిగా వివాదపడితే ఎవరికీ ఉపయోగం ఉండదని రుజువైందని పేర్కొన్నది.
అనేక అంతర్జాతీయ మీడియా సంస్థల విశ్లేషణలు ఇంకా రానున్న రోజుల్లో వెలువడతాయి. వాటితో మోడీ ప్రతిష్ట మరింత మసకబారేదే తప్ప వెలిగేది కాదు. దేశీయంగా సంపూర్ణ మెజారిటీ లేని నరేంద్రమోడీ ఇతర పక్షాల మీద ఆధారపడి ఎలా పని చేస్తారో చూడాల్సి ఉంది. అజేయశక్తి అనుకున్న నేత బలహీనత వెల్లడైన తరువాత ప్రపంచ దేశాలు, నేతలు గతం మాదిరే గౌరవిస్తారా ?ఎలా స్పందిస్తాయన్నది ప్రశ్న.మూడోసారి ప్రధానిగా పదవీ స్వీకారం చేయనున్న నరేంద్రమోడీ రానున్న రోజుల్లో తన ప్రాధాన్యతలు ఏమిటో వెల్లడిస్తారని ఎదురు చూసిన దేశానికి పాత చింతకాయ పచ్చడి కబుర్లు వినిపించారు.శుక్రవారం నాడు జరిగిన ఎన్‌డిఏ ఎంపీల సమావేశంలో మోడీని తమ నేతగా ఎన్నుకున్న సందర్భంగా కాంగ్రెస్ మీద దాడికి ప్రాధాన్యత ఇచ్చారు. కాంగ్రెస్‌కు ఇప్పుడున్న సీట్లు కూడా రావన్న మోడీ మనిషి పదేండ్లలో వంద సీట్లు కూడా తెచ్చుకోలేకపోయిందన్నారు. స్వంతంగా 370, కూటమిగా 400కు పైగా సీట్లు తెచ్చుకుంటామన్న బిజెపి తన బలాన్ని కోల్పోయి 240కి ఎందుకు పరిమితమైందనే చర్చ దేశంలో జరుగుతుండగా దాన్ని తక్కువ చేసి చూపేందుకు కాంగ్రెస్ మీద దాడికి దిగారు.బిజెపి, నరేంద్ర మోడీ బలహీన పడివుండవచ్చు తప్ప ప్రమాదకరంగా ఉంటారన్నది ఇండియా కూటమే కాదు, ఎన్‌డిఏ పక్షాలు కూడా గ్రహించాలి.తన మిత్రపక్షాలను అది ఎలా మింగివేసిందో తెలుగుదేశానికి, శివసేనకూ తెలిసిందే.