Tags
Anti China Propaganda, Anti communist, BJP, China, communist, Elon Musk, Elon Musk daughter, Karl Marx, RSS
ఎం కోటేశ్వరరావు
కమ్యూనిజం భావజాల వ్యాప్తిని అరికట్టేందుకు తొలుత ఐరోపాను ఆవరించిన భూతంగా నిందించారు. కారల్ మార్క్స్‌ను జర్మనీ, బెల్జియంల నుంచి వెళ్లగొట్టారు. తొలి సోషలిస్టు రాజ్యం ఏర్పడిన తరువాత కమ్యూనిజం విస్తరణను అడ్డుకొనేందుకు అమెరికా ఇతర ధనిక దేశాలు ప్రచ్చన్న యుద్ద్ధం సాగించాయి. అనేక దేశాల్లో కుట్రలు చేశాయి. అలెండీ వంటి వారిని హత్య చేశాయి. మిలిటరీ నియంతలను గద్దెలపై కూర్చో పెట్టాయి. సైనిక కూటములను ఏర్పాటు చేశాయి. వియత్నాం, లావోస్, కంపూచియా, ఉత్తర కొరియాలపై భౌతిక దాడులకు పాల్పడి భంగపడ్డాయి. విధిలేని స్థితిలో వియత్నాం నుంచి అమెరికన్లు బతుకు జీవుడా అంటూ పారిపోయారు.కమ్యూనిజం అంతమే తమ పంతం అని ప్రకటించిన అమెరికా గడ్డమీదే ప్రపంచ ధనికుడైన ఎలన్ మస్క్ కుమార్తె కమ్యూనిస్టుగా మారింది. అక్కడే లక్షలాది మంది యువత నేడు అక్కడ అవును మేము సోషలిస్టులం, కమ్యూనిస్టులం అంటూ ముందుకు వస్తున్నారు.
తన కుమార్తె కమ్యూనిస్టుగా మారిందన్న ఉక్రోషం, కమ్యూనిస్టు భావజాల ప్రచారానికి ఒక వేదికగా ఉన్నందున నిరోధించేందుకు ఏకంగా సామాజిక మాధ్యమం ట్విటర్‌నే కొనుగోలు చేసినట్లు త్వరలో వెలువడనున్న ఎలన్ మస్క్ జీవిత చరిత్రలో వెల్లడించారు. ఎలన్ మస్క్ 2000 నుంచి 2016వరకు మూడు వివాహాలు చేసుకొని ముగ్గురికీ విడాకులు ఇచ్చాడు, తరువాత 2018 నుంచి 2021వరకు ఒకామెతో సహజీవనం చేశాడు. ఇప్పుడెలా ఊరేగుతున్నాడో తెలవదు. పది మంది పిల్లల్ని కన్నాడు. వారిలో ఒకడైన గ్జేవియర్ అలెగ్జాండర్క్ మస్క్ 2004లో పుట్టాడు. 2022 జూన్‌లో కాలిఫోర్నియా కోర్టుకు సమర్పించిన ఒక వినతిలో తన పేరును వివియన్ జెనా విల్సన్ అని మార్చుకొనేందుకు అంగీకరించాలని, తాను యువతిగా లింగమార్పిడి చేయించుకున్నట్లు పేర్కొన్నాడు. తన తండ్రి ఎలన్ మస్క్‌తో గానీ, అతని ఆస్తిపాస్తులతో గాని తనకు ఎలాంటి సంబంధం లేదని క్రటించాడు.2021లో లింగమార్పిడి జరిగింది.
తన కుమారుడు లింగ మార్పిడి చేయించున్నదాని కంటే స్కూల్లో వామపక్ష భావజాలానికి ప్రభావితుడు కావటం ఎలన్ మస్క్‌కు ఆగ్రహం తెప్పించింది. పచ్చి మితవాది అయిన మస్క్ తన కుమార్తెను కమ్యూనిస్టుగా వర్ణించాడు.కాలిఫోర్నియాలోని ఒక స్కూల్లో ఏడాదికి 50వేల డాలర్ల ఫీజు చెల్లించి చదివిస్తుండగా కమ్యూనిస్టు భావజాల వైరస్‌కు గురైందని, తన పట్ల కుమార్తె వైఖరి మారటానికి కొంత వరకు క్రాస్‌రోడ్స్ ఆర్ట్స్ అండ్ సైన్సు స్కూలు పురోగామి విధానాలు కూడా కారణమని ఆరోపించాడు. తన కుమార్తె సోషలిజాన్ని అధిగమించి ధనవంతులందరూ దుష్టులని భావించే పూర్తి స్థాయి కమ్యూనిస్టుగా మారిందని చెప్పాడు. తొలి రోజుల్లో ఉదారవాద భావాలతో కొడుకు లేదా కుమార్తె ఉన్నట్లు సరిపెట్టుకున్న తరువాత తెగతెంపులు చేసుకున్నాడు. అంతే కాదు, దీనంతటికీ కమ్యూనిస్టు భావజాల ప్రచారానికి వేదికగా ఉపయోగపడుతున్న ట్విటర్ కూడా తన బిడ్డ వంటి అనేక మందిని కమ్యూనిస్టులుగా మార్చుతున్నదని, ట్విటర్ వేదికగా ఆ భావజాలం రోజు రోజుకు పెరుగుతున్నదని భావించాడు.అది ప్రజాస్వామ్యం, స్వేచ్చా భావ ప్రకటనకు ముప్పుగా మారిందని, దాని విధానాలను మార్చేందుకు ఏకంగా 44 బిలియన్ డాలర్లతో ఆ సంస్థను కొనుగోలు చేశాడు. అంటే పురోగామి భావాలను అడ్డుకొని మితవాద ప్రచారానికి దాన్ని వేదికగా మార్చనున్నాడన్నది స్పష్టం. దానికి అనుగుణంగానే గత యాజమాన్యం రద్దు చేసిన డోనాల్డ్ ట్రంప్ వంటి పచ్చి మితవాదుల ఖాతాలన్నింటినీ పునరుద్దరించాడు. ట్విటర్ పేరు ఎక్స్‌గా మార్చాడు. వాల్టర్ ఇసాక్‌సన్ రాసిన ఎలన్ మస్క్ జీవిత చరిత్రను సెప్టెంబరు 12న మార్కెట్‌కు విడుదల చేయనున్నారు. దాని గురించి ఆసక్తి కలిగించేందుకు కొన్ని భాగాలను మీడియాకు విడుదల చేశారు.
ఎలన్ మస్క్ వంటి కమ్యూనిస్టు వ్యతిరేక మితవాద భావజాలం ఉన్న వారు అమెరికాలో తీవ్ర ఆందోళనకు గురౌతున్నారు. ఒక బంతిని ఎదురుగా ఉన్న గోడవైపు ఎంత గట్టిగా విసిరితే అంతే వేగంతో తిరిగి మనవైపు వస్తుంది. భావజాలం కూడా అంతే. దేన్నయినా అణచివేయాలని చూస్తే అంతేవేగంతో విస్తరిస్తుంది. కొత్త రాతియుగం నుంచి చైనా నేత షీ జింపింగ్ వరకు కమ్యూనిజం చరిత్ర పేరుతో జర్నలిస్టు పాల్ మాసన్ రాస్తున్న పుస్తకం 2026లో విడుదల కానుంది. ఒక భావం, ఒక ఉద్యమం, ఒక పాలన వరకు ఎలా పరిణమించిందీ దానిలో ఉంటుందని చెబుతున్నారు. పురాతన, మధ్యయుగాలలో సంభవించిన తిరుగుబాట్ల నుంచి కమ్యూనిస్టులు ఈ భావ చరిత్రను గుర్తించారు. పందొమ్మిదవ శతాబ్ది పెట్టుబడిదారీ వ్యతిరేక ఉద్యమాల పెరుగుదలతోనే ఈ కధ ముగియలేదు అన్నాడు పాల్ మాసన్. ” పశ్చిమ దేశాల ప్రజాస్వామ్యాలు గిడసబారాయి, తమ మీద తమకే విశ్వాసం లేకుండా ఉన్నాయి. వాతావరణం గురించి పెరుగుతున్న ఆందోళన విప్లవాత్మక ఆర్థిక సమాధానాలను డిమాండ్ చేస్తున్నది. ప్రపంచ పేద దేశాల్లోని కోట్లాది మంది జనం దృష్టిలో చైనా ముందుకు తెచ్చిన అధికారతత్వ(ఇది రచయిత పదజాలం కాదు), రాజ్య నేతృత్వంలోని అభివృద్ధి ప్రత్నామ్నాయ నమూనాగా చూస్తున్నారు. ఇరవై సంవత్సరాల క్రితం కమ్యూనిజం అంతాన్ని చూశామని అనుకున్నాం.. ఈ రోజు ప్రపంచంలో అతి పెద్ద రాజకీయ పార్టీ కమ్యూనిస్టు పార్టీయే.ప్రపంచంలో అత్యంత విజయవంతమైన ఆర్థిక వ్యవస్థగా ఉంది. కావున ప్రచ్చన్న యుద్ధంలో భావజాల విజేతలు సెలవు తీసుకుంటూ రాసిన ఉద్గ్రంధాలన్నిటినీ భిన్నమైన చరిత్రగా చూడాల్సిన అవసరం ఉన్నదని భావిస్తున్నాను. ఇప్పటికీ అనేక మంది ఆర్థిక పురోగతి సాధనకు స్వేచ్చకోసం ఎందుకు సిద్దం అవుతున్నారో అర్ధం చేసుకోవటానికి తోడ్పడుతుంది.” అని పాల్ మాసన్ చెప్పాడు.
అమెరికా స్కూళ్లలో విద్యార్ధులు కమ్యూనిస్టులుగా మారుతున్నారని గుండెలు బాదుకుంటున్నది ఒక్క ఎలన్ మస్క్ మాత్రమే కాదు. అనేక మంది మితవాద రాజకీయ నేతలు, ప్రజా ప్రతినిధులు కూడా కమ్యూనిస్టు, చైనా వ్యతిరేకతతో ఊగిపోతున్నారు.అమెరికా స్కూళ్లు, విశ్వవిద్యాలయాలు చైనా సంస్థలతో పరిశోధనా ప్రాజక్టులలో భాగస్వాములు కావటాన్ని నిషేధించాలని సెనెటర్ జేమ్స్ లాంక్‌ఫోర్డ్ డిమాండ్ చేశాడు. అంతర్జాతీయంగానే కాదు, అమెరికా గడ్డ మీద కూడా దేశాన్ని చైనా సవాలు చేస్తున్నదని, విద్యా సంస్థలలో పాతుకుపోతున్నదని ఒక ప్రకటనలో తాజాగా ఆరోపించాడు. అమెరికా పరిశోధనలను తస్కరిస్తున్నదని, రాజకీయంగా విద్యార్థులు, బోధకులు, వారి కుటుంబాల మీద ప్రభావం చూపుతున్నదని చెప్పుకున్నాడు. అమెరికాలో తన ప్రతిష్టను పెంచేందుకు అనేక పధకాలను రూపొందించిందని, వాటి ద్వారా గూఢచర్యం జరుపుతున్నదని ఆరోపించాడు. ఆగస్టు 27న చైనాతో పరిశోధన ఒప్పందం ముగిసినప్పటికీ జో బైడెన్ సర్కార్ మరో ఆరునెలలు పొడిగించిందని వాపోయాడు.
కమ్యూనిస్టు వ్యతిరేక ఉన్మాదం అమెరికా పక్కనే ఉన్న మెక్సికోకు కూడా పాకింది. పాఠ్యపుస్తకాలకు కమ్యూనిస్టు వైరస్ సోకిందంటూ కొన్ని చోట్ల క్రైస్తవ మత బృందాలు తలిదండ్రుల పేరుతో కొందరిని సమీకరించి పుస్తకాలను తగులబెట్టే కార్యక్రమాన్ని చేపట్టారు. ఆ పుస్తకాల్లో లైంగిక విజ్ఞానం, లింగసమానత్వం వంటి అంశాలు ఉన్నాయన్నది వారి ఆరోపణ. వాటి పంపిణీ నిలిపివేయాలని వారు డిమాండ్ చేశారు. ఆ పుస్తకాల్లో మార్క్సిస్టు-కమ్యూనిస్టు సిద్దాంతాలను చేర్చారని ఆరోపించారు. ప్రభుత్వం ఈ ఆరోపణలను కొట్టిపారవేసింది. పాఠ్య అంశాలను టీచర్లు, నిపుణులు రూపొందించినట్లు పేర్కొన్నది.
అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్ర శాసనసభలో రిపబ్లికన్ పార్టీ ప్రతినిధి మరియ ఎలివిరా సాలాజార్ ఒక బిల్లును ప్రవేశపెట్టారు.దానిలో కమ్యూనిజం, నిరంకుశత్వాలను ఒకే గాటన కడుతూ వాటివలన సంభవించే నష్టాలను విద్యార్ధులకుచెప్పాలని పేర్కొన్నారు. అమెరికా యువత కమ్యూనిస్టుల పాలనలో జరిగిన నేరాల గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉందన్నారు.కమ్యూనిజం బాధితుల ఫౌండేషన్‌కు పాఠాలను రూపొందించే బాధ్యత అప్పగించాలని ప్రతిపాదించారు. గతంలో కూడా సాలాజార్ ఇదే బిల్లును ప్రవేశపెట్టగా దాన్ని చర్చించక ముందే మురిగిపోయింది. ఈ బిల్లును ప్రతిపాదించినపుడు అధికారంలో డెమోక్రాట్లు ఉన్నారు. ఇప్పుడు రిపబ్లికన్లు ఉన్నందున తిరిగి ప్రవేశపెట్టారు.క్యూబా, కొరియా, వియత్నాం తదితర దేశాల నుంచి పారిపోయి వచ్చిన కమ్యూనిస్టువ్యతిరేకులు ఈ బిల్లుకు మద్దతు తెలిపారు.
కమ్యూనిస్టు వ్యతిరేక వైరస్ ఒక్క అమెరికా, ఐరోపాల్లోనే కాదు మనదేశంలో కూడా ఉంది. ఇటీవల మహారాష్ట్రలోని నాగపూర్ విశ్వవిద్యాలయం ఎంఎ చరిత్ర విద్యార్ధుల సిలబస్‌లో అధ్యయనం చేయాల్సిన అంశాల్లో బిజెపి, రామజన్మభూమిని చేర్చింది. కమ్యూనిస్టు ఉద్యమానికి సంబంధించిన పాఠ్యాంశాలను తొలగించింది. నూతన విద్యా విధానంలో భాగంగా సిలబస్‌లో మార్పులు చేర్పులు చేసినట్లు అధికారులు చెప్పారు. ఇదే విశ్వవిద్యాలయం గతంలో బిఏ విద్యార్ధులకు ఆర్‌ఎస్‌ఎస్ గురించి పాఠాన్ని సిలబస్‌లో చేర్చింది. కమ్యూనిస్టు ఉద్యమం, పార్టీల గురించి నేర్చుకోవాలి, తెలుసుకోవాలనే ఆసక్తి కలగాలేగానీ పాఠ్యపుస్తకాలు, ట్విటర్, ఫేస్‌బుక్‌లతో పనేముంది. అవేవీ లేనపుడు ప్రపంచమంతా వ్యాప్తి చెందలేదా ? కమ్యూనిస్టు సిద్దాంతాలకు సంబంధించిన పుస్తకాలను బ్రిటీష్‌వారు, ఇతర సామ్రాజ్యవాదులు,అనేక దేశాల్లో ప్రభుత్వాలు నిషేధించినపుడు జనం వాటిని సంపాదించుకోలేదా అధ్యయనం చేయలేదా ? ఈ చరిత్ర తెలిసి కూడా ఇలాంటి పిచ్చిపనులు చేస్తున్నారు. చరిత్రలో యంత్ర విధ్వంసకుల గురించి చదివాము. ఐరోపాలో చేనేత రంగంలో మరమగ్గాలు వచ్చినపుడు తమ వృత్తిని అవి దెబ్బతీస్తున్నాయని ఆగ్రహించిన కార్మికులు వాటిని ధ్వంసం చేస్తే సమస్య పరిష్కారం అవుతుందని భావించి కొన్ని చోట్ల ఆపని చేశారు. సమస్య యంత్రాలది కాదు, వాటిని ధ్వంసం చేస్తే యాంత్రీకరణ ఆగదు. అదే విధంగా భూస్వాములను అంతం చేస్తే భూస్వామిక వ్యవస్థ రద్దవుతుందని నమ్మి ఆ పని చేసిన వారి సంగతి తెలిసిందే. అరచేతిని అడ్డుపెట్టి సూర్యకాంతిని ఆపలేరన్నది ఎంత వాస్తవమో నిషేధాలద్వారా ఒక భావజాల వ్యాప్తిని అడ్డుకోవటం కూడా సాధ్యం కాదన్నది కూడా అంతే నిజం.












