Tags
Adolf Hitler, BJP, Donald trump, Narendra Modi, Narendra Modi Failures, Nazi Joseph Goebbels, Nazism, RSS
ఎం కోటేశ్వరరావు
రంభా, ఊర్వశి, మేనక వంటి వారితో సంతోషంగా గడుపుతున్న జర్మన్ నాజీ మాజీ మంత్రి జోసెఫ్ గోబెల్స్ భారత్‌లో ఎన్నికలు జరుగుతున్నాయి గనుక తన ఆరాధకులు ఎలా పని చేస్తున్నారో చూద్దామని వచ్చినట్లు కనిపిస్తున్నది. (విడ్డూరంగాకపోతే ఎంతైతే మాత్రం మన భారతీయ సంప్రదాయాలు, విలువలకు కట్టుబడిన అప్సరసలు ఒక మ్లేచ్చుడితో ఆడిపాడతారా, ఇంకా ఏదైనా చేస్తారా అని కొంత మంది సనాతనవాదులకు కోపం రావచ్చు.కంచంలో తేడా ఉంటుంది గానీ మంచంలో ఎలాంటి బేధాలను పాటించని ”విశాల భావాలు” మనవి అన్నది తెలిసిందే.అందులోనూ జర్మన్ గోబెల్స్ మనవా(ఆర్యు)డే అని భావిస్తున్నపుడు, స్వర్గంలో మాట్లాడేది ఎలాగూ సంస్మృతమే, అయినా భాషతో పనేముంది, అంటూ సొంటూ ఏముంటుంది) ఊరకరారు మహాత్ములు అన్నట్లుగా దేశంకోసం-ధర్మకోసం పని చేస్తున్నట్లు చెప్పుకుంటున్న మన నరేంద్రమోడీ, ఇతర సంఘపరివార్ నేతలను గోబెల్స్ ఆవహించినట్లు కనిపిస్తోంది. లేకుంటే ఉత్తర ప్రదేశ్‌లో సమాజవాది పార్టీ-కాంగ్రెస్‌కు ఓటు వేస్తే వారు ఆయోధ్య రామాలయాన్ని బుల్డోజర్లతో కూల్చివేస్తారని, బాలరాముడిని తిరిగి గుడారాల్లో కూర్చో పెడతారని నరేంద్రమోడీ చెప్పేవారు కాదేమో ! ఎందుకిలా మాట్లాడినట్లు ?
వాట్సాప్‌లో తిరుగుతున్న ఒక వర్తమానంలో రచయిత ఎవరో తెలియదు గానీ నరేంద్రమోడీ-హిట్లర్ మధ్య ఒక పోలిక తెచ్చారు.హిట్లర్ వివాహం చేసుకోలేదు.(మోడీ వివాహం చేసుకున్నా కాపురం చేయకుండా విడాకులు కూడా ఇవ్వకుండా వదలివేశారు. భారతీయ ధర్మాన్ని, రాజ్యాంగాన్నీ పాటించలేదు).ఒక మతం వారు దేశానికి వ్యతిరేకులనే భావాన్ని హిట్లర్ తలకు ఎక్కించుకున్నాడు. హిట్లర్‌ను ఎవరైనా విమర్శిస్తే మద్దతుదార్లు సహించేవారు కాదు. అన్ని రకాల మీడియాను తన గురించి గొప్పలు చెప్పుకోవటానికి హిట్లర్ ఉపయోగించుకున్నాడు.తన వ్యతిరేకులందరినీ అణచివేశాడు. వారు దేశ ద్రోహులని, జాతి వ్యతిరేకులని ఎల్లవేళలా పిలిచాడు. అన్ని సమస్యలనూ స్వల్పకాలంలోనే పరిష్కరిస్తానని వాగ్దానం చేశాడు.మంచి రోజులు రానున్నాయన్నది హిట్లర్ నినాదం. మంచి దుస్తులు వేసుకొని అందంగా కనిపించేందుకు హిట్లర్ చూశేవాడు. అబద్దాలను నిజాలుగా భ్రమింపచేసే కళను హిట్లర్ ప్రదర్శించేవాడు.రేడియోలో ఉపన్యాసాలు ఇచ్చేందుకు హిట్లర్ ఇష్టపడేవాడు.స్నేహితులు, సోదరులు, సోదరీమణులంటూ తన ప్రతి ప్రసంగంలో హిట్లర్ మాట్లాడేవాడు.హిట్లర్‌కు ఫొటోలు తీయించుకోవటమంటే పిచ్చి.
పైన పేర్కొన్నవాటిలో నరేంద్రమోడీకి ఏ లక్షణాలు, ఏమి ఉన్నాయో లేవో ఎవరికి వారు బేరీజు వేసుకోవచ్చు. చిన్న తనంలో ఒక రైల్వే స్టేషన్‌లో టీ అమ్మినట్లు మోడీ చెప్పుకున్న సంగతి తెలిసిందే. దానికి ఆధారాలు లేవని చెబుతారు. హిట్లర్ చిన్న తనంలో, కాస్త వయస్సు వచ్చాక కూడా ఆర్థికంగా ఇబ్బందులు పడినట్లు, అనాధ గృహాల్లో గడిపినట్లు చరిత్ర చెబుతున్నది.హిట్లర్ హైస్కూలు విద్యను కూడా పూర్తి చేయకపోవటంతో ఉన్నత విద్యకు అర్హÛత సాధించలేకపోయాడు. నరేంద్రమోడీ ఉన్నత విద్య చదివినట్లు చెప్పుకున్నా దానికి తగిన ఆధారాలు లేవు. నాజీగా హిట్లర్, నాజీల బాటలో నడుస్తుందనే విమర్శలున్న ఆర్‌ఎస్‌ఎస్‌లో మోడీ చాలా తక్కువ కాలంలోనే ప్రముఖ స్థానాలకు ఎగబాకారు.హిట్లర్ ఒకనాడు జర్మనీలో దేవుడిగా ఒక వెలుగు వెలిగాడు. నరేంద్రమోడీని కూడా అభిమానులు అలాగే చూస్తున్నారు. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడే స్వయంగా మోడీ దేవుడి బహుమతి, పేదల పట్ల దేవదూత అని చెప్పిన సంగతి తెలిసిందే.
2024 లోక్‌సభ ఎన్నికల్లో ఇప్పటి వరకు జరిగిన లేదా జరిపిన ప్రచారంలో ఇండియా కూటమి బిజెపి విధానాలపై విమర్శలతో పాటు ఆ కూటమిలోని పార్టీలు విడివిగా ప్రకటించిన మానిఫెస్టోలోని అంశాలను, బిజెపి చెబుతున్నట్లుగా నాలుగువందల సీట్లు ఎందుకు కోరుతున్నదో, ఏం చేసేందుకు అన్నిసీట్లు కోరుతున్నదో స్పష్టంగానే ప్రచారం చేశాయి. బిజెపి వస్తే రాజ్యాంగాన్ని, రిజర్వేషన్లను ఎత్తివేస్తుందన్నది ప్రధానమైన విమర్శ. పదేండ్ల పాటు అధికారంలో ఉన్న బిజెపి ఎంతసేపూ ఎన్నిమరుగుదొడ్లు కట్టించిందీ, ఎన్ని ఉజ్వల గాస్ కనెక్షన్లు ఇచ్చిందీ, రోడ్లు వేసిందీ చెప్పుకోవటం తప్ప జన జీవితాలను మెరుగుపరిచేందుకు చేసిందేమిటో పెద్దగా చెప్పలేదు. పచ్చి అవాస్తవాలను, ఆధారంలేని ఆరోపణలను ఎన్నింటినో స్వయంగా నరేంద్రమోడీ ప్రచారం చేస్తున్నారు. ప్రపంచ చరిత్రలో ఇంతగా వక్రీకరణ, అవాస్తవాలు, అభూత కల్పనలు ప్రచారం చేసిన ప్రభుత్వ నేత మరొకరు లేరన్నది వేరే చెప్పనవసరం లేదు. మీడియాలో ఎన్ని టీవీ ఛానళ్లు వాటి గురించి చర్చలు పెట్టాయి, ఎన్ని పత్రికలు ప్రముఖంగా విశ్వేషణలు, వాస్తవాలను వెల్లడించాయి ? ఇదేం ప్రచారం అన్నట్లుగా కొందరు గొణగినట్లు విమర్శించటం తప్ప గట్టిగా బట్టబయలు చేసే ధైర్యం చేయటం లేదు. విదేశీ మీడియాలో కూడా ఇదే వ్యక్తమైంది.
నరేంద్రమోడీ ఇన్ని పచ్చి అబద్దాలను ప్రచారం చేయటం వెనుక ఉన్న మతలబు ఏమిటి ? పలుకుబడి దిగజారుతున్న పూర్వరంగంలో మైనారిటీ విద్వేషంతో లాభం లేదని గ్రహించి కాబోలు ముందే చెప్పుకున్నట్లు కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రామాలయాన్ని బుల్డోజర్లతో కూల్చివేస్తారంటూ హిందువులను రెచ్చగొట్టి లబ్దిపొందాలన్నది స్పష్టంగా కనిపిస్తున్నది. నిజానికి మసీదులు, చర్చీలను కూల్చివేసిన చరిత్ర కాషాయ దళాలది తప్ప ఇతర పార్టీలది కాదు. రోడ్ల విస్తరణ పేరుతో నరేంద్రమోడీ సిఎంగా ఉండగా అహమ్మదాబాద్‌లో కొన్ని మందిరాలను కూడా తొలగించారన్న వార్తలు తెలిసిందే.హిట్లర్ నాయకత్వంలోని నాజీల ప్రచారం గురించి ఇప్పటికీ చర్చ జరుగుతూనే ఉంది. విశ్లేషణలు వెలువడుతూనే ఉన్నాయి. రాజకీయ,చరిత్ర,మతం, కులం, సాంస్కృతిక అంశం ఏదైనా సరే తమకు అనుకూలంగా ఉంటుందని ఎవరు భావించినా వాటిని వక్రీకరించి తమకు అనుకూలంగా మలుచుకోవటం వెనుక రెండు రెళ్లు నాలుగు అన్న విశ్వవ్యాప్త సూత్రం ఒకటే ప్రాతిపదిక. అదే ” పర్వతమంత అబద్దం ” చెప్పటం, వాస్తవానికి వక్రీకరణ, వక్రభాష్యం చెప్పి జనాన్ని బురిడీ కొట్టించటం. ఒక అబద్దాన్ని పదే పదే చెబితే చివరికి నిజమై కూర్చుంటుంది. ఎంతైతే మాత్రం ఫలానావారు అంత నిస్సిగ్గుగా అబద్దం అడతారంటే నేను నమ్మను అనే విశ్వాసాన్ని సొమ్ము చేసుకోవాలని తొలిసారిగా హిట్లర్ 1925లో మెయిన్ కాంఫ్ అనే గ్రంధంలో చెప్పాడు. మొదటి ప్రపంచ యుద్దంలో ఓడిపోయినపుడు జర్మనీలో చర్చ జరిగింది. జర్మనీ మిలిటరీలో లక్షమందికి పైగా యూదులు సైనికులుగా ఉన్నారు.యుద్ధరంగంలో యూదులు సరిగా పోరాడని కారణంగానే జర్మనీ ఓడిపోయిందని ఒక ప్రచారం జరిగింది.ఓటమి గురించి ప్రభుత్వం విచారణ జరిపింది. పేరు పెట్టి ఫలానా సామాజిక తరగతి అని చెప్పలేదు గానీ వెన్ను పోటు కారణంగానే జర్మనీ ఓడిపోయిందనే ప్రచారాన్ని నిజమే అని చాలామంది నమ్మారు. నిజానికి దానిలో ఎలాంటి వాస్తవం లేదు. దాన్ని హిట్లర్ వంటి జాతీయవాదులు భుజానవేసుకొని యూదులే వెన్నుపోటుదారులంటూ రెచ్చగొట్టారు. అప్పటికే మతరీత్యా యూదులపై ఉన్న అభిప్రాయాలు, అనుమానాలతో ఉన్న జనం నిజమని నమ్మారు. చివరకు అది ఎంతవరకు దారి తీసిందంటే జర్మనీ ఆత్మరక్షణకు యూదులను అంతమొందించటానికి జర్మన్లకు హక్కు ఉందన్నవరకు పోయి మారణకాండకు దారితీసిన సంగతి తెలిసిందే. తన పార్లమెంటు భవనాన్ని(రీచ్‌స్టాగ్) తానే తగులబెట్టించి ఆ నెపాన్ని కమ్యూనిస్టుల మీద మోపి అణచివేసిన దుర్మార్గం తెలిసిందే. హిట్లర్ ప్రచార పద్దతులను ఎన్నికల్లో ఓడిన డోనాల్డ్ ట్రంప్ కూడా వినియోగించుకొనేందుకు చూశాడు.ఎన్నికల్లో డెమోక్రాట్లు అక్రమాలకు పాల్పడ్డారని, ఫలితాలను తారుమారు చేశారని, తాను ఓటమిని అంగీకరించనని చెప్పటమే కాదు, అమెరికా అధికార కేంద్రంపై తన అనుచరులతో దాడి చేయించిన దుండగాన్ని కూడా చూశాము. తాను నిజంగానే ఓడినట్లు ట్రంప్‌కు ముందే తెలిసినా కావాలని రెచ్చగొట్టినట్లు తరువాత వెల్లడైంది. అలాంటి ట్రంప్‌ను గెలిపించాలని పిలుపు ఇచ్చిన మోడీ గురించి తెలిసిందే.
కొందరు పనిగట్టుకొని పదే పదే తప్పుడు సమాచారాన్ని మెదళ్లలోకి ఎక్కిస్తే జనం ఎందుకు నమ్ముతున్నారు అనేది ప్రశ్న. దీని గురించి భిన్న కోణాలు వెలువడుతున్నాయి. తమ ముందుకు వచ్చిన ఒక సమాచారం వాస్తవం కాదని తెలిసినప్పటికీ అది పదే పదే వేర్వేరు మార్గాల్లో చేరితే ఏమో నిజమేనేమో అనే సందేహంలో పడతారు.బ్రాహ్మణుడు-మేకపిల్ల కథ తెలిసిందే. దానికి ప్రతిగా సమాచారం లేకపోతే చివరికి నిజమని నమ్ముతారు. ఉదాహరణకు వైరస్‌తో జలుబు చేస్తుంది. నిజానికి దానికి మందు లేదు. ఎందుకంటే ఎప్పటికప్పుడు మారిన వైరస్‌కు వెంటనే మందు కనుగొనటం సాధ్యం కాదు. ఏదైనా బిళ్ల వాడితే వారంలో వాడకపోతే ఏడు రోజుల్లో తగ్గుతుందన్న లోకోక్తి తెలిసిందే. మనశరీరంలోని రోగనిరోధకశక్తి ఆ వైరస్‌ను ఎదుర్కొన్న తరువాత అదే తగ్గిపోతుంది కానీ అనేక మంది ఫలానా బిళ్ల వేసుకుంటే మాకు తగ్గింది అని చెప్పారనుకోండి, కొంతకాలానికి మిగతావారు పోయేదేముంది మనమూ చూద్దాం అని ఆ బిళ్లలనే వాడతారు. ఇది వ్యక్తులకు సంబంధించిన అంశం కనుక పెద్దగా నష్టం ఉండదు. పొట్టను తగ్గించాలంటే సూక్ష్మంలో మోక్షంలా ఫలానా మిషన్ వాడితే తగ్గిపోతుందనే ప్రచారం తెలిసిందే. ఒకసారి చూద్దాం పోయేదేముంది అనుకొని అనేక మంది కొనుగోలు చేయటం, ఆయిల్ పుల్లింగ్, మంచినీటి వైద్యాల వంటి వాటికి బుర్రలను అప్పగించటం చాలా మందికి తెలిసిందే. ఇలాంటి వాటి వలన వ్యక్తులు నష్టపోతారు. అదే ఒక ప్రతికూల భావజాలానికి చెవి అప్పగిస్తే యావత్ సమాజానికే ప్రమాదకరం. ప్రతి మనిషి సగటున రోజు 35వేల నిర్ణయాలు తీసుకుంటున్నట్లు కొందరు పరిశోధకులు చెప్పారు. ఒక షర్టు ఆరటానికి అర్ధగంట పడితే పది షర్కులు ఎంతసేపటిలో ఆరతాయంటే ఐదు గంటలు అనేవారు, ఒక కిలో దూది బరువా ఒక కిలో ఇనుము బరువా అంటే ఇనుము అని చెప్పేవారి గురించి తెలిసిందే.అంటే ప్రతి క్షణానికి మన మెదళ్లకు ఎంతో సమాచారం అందుతుంటుంది.బహుశా ఈకారణంగానే వెంటనే బుర్రకు తర్కం కూడా తట్టదు. మన బుర్రలో రెండు రకాల ఆలోచనా వ్యవస్థలుంటాయట. ఒకటి అదుపులేని సృహతో తక్షణమే స్పందించేది, రెండవది సృహతో దీర్ఘంగా, లోతుగా ఆలోచించి నిర్ణయించేది. జనాలు మొదటిదానికే ఎక్కువగా పనిపెడతారని,అందువలన లోతుగా ఆలోచించకుండా చేసే పద్దతులు, సమాచారాన్ని కొన్ని శక్తులు మనబుర్రలకు చేరవేస్తాయని భావిస్తున్నందున హిట్లర్ వంటి నియంతలు, మార్కెటింగ్ నిపుణులు, రంగులు మార్చే రాజకీయవేత్తలు ప్రతితరాన్ని ఏదో విధంగా మభ్యపెట్టగలుగుతూనే ఉన్నారు.
ఫేక్,వక్రీకరించిన సమాచారం ఈ రోజు సామాజిక మాధ్యమాన్ని ఊపివేస్తున్నది. ఇవి పెద్దగా జనానికి అందుబాటులో లేని రోజుల్లో వినాయకుడు పాలు తాగాడన్న వార్త ఎంత సంచలనంగా మారిందో తెలిసిందే. సైన్సు పత్రికలో ప్రచురించిన ఒక విశ్లేషణ ప్రకారం వాస్తవ కథనాలకంటే తప్పుడు వార్తలు జనాలకు ఆరు రెట్లు వేగంగా చేరతాయని తేలింది.సంఘపరివార్ వంటి సంస్థలకు చెందిన వారు తొలిసారిగా చెప్పిన అంశాలను అనేక మంది తొలిరోజుల్లో నమ్మలేదు. కానీ పదే పదే వాటిని ప్రచారం చేస్తుండటంతో అనేక భ్రమాత్మక అంశాలు నిజమై కూర్చున్నాయి. ఉదాహరణకు రాహుల్ గాంధీకి అసలు గాంధీ పేరు ఎలా వచ్చిందని ప్రశ్నించటం తెలిసిందే. రాహుల్ తాత ఫిరోజ్ గాంధీ, అతని తలిదండ్రులు జొరాస్ట్రియన్ మతానికి చెందిన వారు. వందల సంవత్సరాల క్రితం పర్షియాపై దండయాత్ర చేసిన ఇస్లాం పాలకులు జొరాస్ట్రియన్లను అణచేందుకు పూనుకున్నపుడు అనేక మంది అరేబియా సముద్ర మార్గం ద్వారా గుజరాత్‌కు వలస వచ్చిన పూర్వీకుల కుటుంబాలలో ఫిరోజ్ గాంధీది ఒకటి. పర్షియాకు మరో పేరు ఇరాన్, అక్కడి నుంచి వచ్చారు గనుక ఇరానీలు, పార్సీలయ్యారు.వారి సంఖ్య ప్రస్తుతం లక్షమందికి లోపే.గతంలో పర్షియాలో ఉన్నపుడే వాణిజ్యంలో ముందున్నారు గనుక మన దేశం వచ్చిన వారు కూడా దాన్ని అందిపుచ్చుకొని దేశంలో నేడు ప్రముఖ వాణిజ్య, పారిశ్రామికవేత్తలుగా ఉన్నారు. మహాత్మాగాంధీలో గాంధీ పేరుతో ఎలాంటి సంబంధం లేదు, పార్సీలలో గాందే పేరుతో ఉన్నవారు చివరికి గాంధీలుగా నామాంతరం చెందారు.ఫిరోజ్ అని ఉంది గనుక అతను మనవాడే అని అనేక మంది ముస్లింలు భావించారు.దీన్ని ఎంత మంది గూగుల్లో వెతికి నిర్ధారించుకుంటారు. వాట్సాప్ ద్వారా పనిగట్టుకు చేస్తున్న ప్రచారం కూడా అలాంటిదే. అనేక తప్పుడు ప్రచారాలు ప్రారంభిస్తే కొన్నాళ్లకవి నిజాలై కూర్చుకుంటాయి. మతోన్మాదశక్తులు ఇంతకాలం చేసింది అదే. వాటితో జనాలు ప్రభావితులౌతున్నారు. అఫ్‌కోర్సు పెరుగుట విరుగుట కొరకే. హిట్లర్‌ను ఆరాధించిన జర్మన్లే ఇప్పుడు ఆ పేరు ఎత్తటానికి కూడా ఇచ్చగించరు వాడొక కుక్క అంటారు.ఎవరికైనా అదే గతి.









