Tags

, , , , , , , , , , , ,

గద్దె నెక్కిన తరువాత ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు, చంద్రశేఖరరావు పని కంటే మాట్లాడటం ఎక్కువ చేసి వుండవచ్చు. నరేంద్రమోడీ విదేశీ పర్యటనలు, జన్‌కీ బాత్‌తో సంబంధం లేని మన్‌కీ బాత్‌ తప్ప పనీ, మాట్లాడటం రెండూ ఆపి వుండవచ్చు.

   ఎం కోటేశ్వరరావు

      అటు కేంద్రంలో ఇటు రెండు తెలుగు రాష్ట్రాలలో కొత్త ప్రభుత్వాలు కొలువు దీరి రెండు సంవత్సరాలు కావస్తోంది. వచ్చే నెలలో ద్వితీయ వార్షికోత్సవాలు జరుపుకోబోతున్నాయి.ఈ రెండేళ్లలో వారు చేసిందేమిటో తెలియదు గానీ వసంతం రా ముందే కూసిన కోకిల మాదిరి వచ్చే ఎన్నికల రావాలు అక్కడక్కడా అప్పుడప్పుడు వినిపిస్తున్నారు. దీపం వుండగానే ఇల్లు చక్క పెట్టుకోవాలన్నట్లుగా ఫిరాయింపుదారులు కూడా జాగ్రత్తలు పడుతున్నారు. మూడు ప్రభుత్వాలకు ముగ్గురు భిన్న పార్టీల వారు నేతృత్వం వహిస్తున్నారు. భిన్నత్వంలో ఏకత్వం అన్నట్లుగా మొత్తం మీద ఏ ఒక్కరూ తాము ఓటర్లకు చేసిన బాసలు మినహా మిగతా అంశాలపైనే, (అవి ఎవరికి లబ్ది చేకూర్చేవి అన్నది వేరే విషయం ) కేంద్రీకరిస్తున్నారు. ఇదంతా ముందే కూడ బలుక్కున్నారా లేక అధికారానికి వచ్చాక సమన్వయం చేసుకుంటున్నారా,లేక ముగ్గురూ ఒకతానులో ముక్కలేనా అంటే ఎవరికి వారు తమకు తాము అన్వయించుకోవచ్చు. ఫిరాయింపుదారులు కూడా పార్టీలతో నిమిత్తం లేకుండా నియోజక అభివృద్ధి కోసమే తాము పార్టీలు మారుతున్నట్లు ఒకే మాట చెబుతున్నారు. అంతిమ ఫలితం, మనకు కనిపిస్తున్నదే ముఖ్యం. మూడు పక్షాలకూ సంపూర్ణ మెజారిటీ వుంది, అన్నింటికీ మించి ఏ పార్టీలోనూ తిరుగుబాటు శక్తులూ, వున్నవారికి అంత సీనూ, శక్తీ లేదు. ఎందుకంటే అనేక అనుభవాల తరువాత నీకది, నాకిది అనే సర్దుబాటు మనస్థత్వం బాగా వంట బట్టించుకున్నారు గనుక ఎవరూ తెగించి కూర్చున్న వారిని కూలదోసేందుకు గద్దెల కాళ్లు లాగటం లేదు. అందుకే పుష్పక విమానాల్లా ఎంత మంది వచ్చినా ఒకరికి ఖాళీ అన్నట్లు ఎన్ని పార్టీల నుంచి, ఎన్ని ముఠాల నుంచి ఎందరు వచ్చినా మరొకరికి ఖాళీ కనిపిస్తోంది.అక్షయ పాత్ర మాదిరి జనం సొమ్ము ఎంత తిన్నా తరగటం లేదు. అందుకే ముగ్గురు నేతలూ ప్రత్యర్ధి పార్టీల నుంచి ఫిరాయింపులను ప్రోత్సహించి తమకు ఎదురు లేకుండా చేసుకొనేందుకు ప్రయత్నిస్తున్నవారే. అధికారంలో తాము మాత్రమే వుండాలి, ప్రశ్నించే వారెవరూ వుండకూడదు అనేది తప్ప నైతిక సూత్రాలు, రాజ్యాంగంపట్ల గౌరవం, భవిష్యత్‌ తరాలు తమను ఎలా భావిస్తాయి అనే అంశాన్ని ఎవరూ ఖాతరు చేయటం లేదు. ఇలా అనేక అంశాల విషయంలో వారి వ్యవహారశైలిలో ఏకీభావం కనిపిస్తోంది.

    గద్దె నెక్కిన తరువాత ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు, చంద్రశేఖరరావు పని కంటే మాట్లాడటం ఎక్కువ చేసి వుండవచ్చు. నరేంద్రమోడీ విదేశీ పర్యటనలు, జన్‌కీ బాత్‌తో సంబంధం లేని మన్‌కీ బాత్‌ తప్ప పనీ, మాట్లాడటం రెండూ ఆపి వుండవచ్చు. మోడీకి, బిజెపికి, ఇతర అనుబంధ సంఘాల వారికీ మార్గదర్శనం చేసే ఆర్‌ఎస్‌ఎస్‌ పరివార నేతల మాటలు లేదా విధానాలను వెల్లడించే అనేక ప్రకటనలు పెరిగి తమ నిజమైన ఎజెండాను ముందుకు తెచ్చి వుండవచ్చు గానీ కాలం ఆగలేదు. మరికొద్ది వారాలలో ముగ్గురు నేతలూ రెండవ వార్షికోత్సవం జరుపుకోవటానికి, వెంకయ్య నాయుడి వంటి వందిమాగధుల స్తోత్ర పారాయణాలు వినటానికి, విజయాల గురించి చెప్పుకోవటానికి సిద్ధం అవుతున్నారు.

     ఈరెండు సంవత్సరాల కాలంలో జనానికి దేశంలో అసలేం జరుగుతోంది అన్నది పూర్తిగా తెలియటం లేదు అనే అభిప్రాయం రోజు రోజుకూ బలపడుతోంది. ఎంత వరకు నిజమో ఎవరికి వారు తమ అనుభవంతో తేల్చుకోవాలి. ఆవు,ఎద్దులు, గొడ్డు మాంస రాజకీయాలు, ఫిరాయింపులు, రాష్ట్రపతి పాలనల మొదలు తాజాగా దేశభక్తులా కాదా అనటానికి భారతమాతాకి జై అన్నారా లేదా జాతీయ గీతంగా జన గణమన కంటే వందే మాతరం గొప్పది అన్న ప్రకటనల వంటి చరిత్ర చెత్తబుట్టలో వేసిన వాటిని పైకి తీసి సంఘపరివార్‌ తన అజెండాగా నడిపిస్తోంది. తొలుత వివాదాస్పద అంశాలపై వ్యాఖ్యానించటం, తరువాత ప్రతిస్పందన తమకు వ్యతిరేకంగా వస్తే వాటిపై వివరణ పేరుతో తోకముడవటం. కానీ దాని అనుయాయులు మాత్రం మొదటి దానినే కొనసాగిస్తారు. ఇదంతా పిర్ర గిల్లి జోలపాడే చౌకబారు ఎత్తుగడలో భాగమే. భారత మాతాకీ జై నినాదం గురించే చూస్తే ఇది అర్ధంలేని వివాదమని అద్వానీ అంతటి కరడు గట్టిన ఆర్‌ఎస్‌ఎస్‌ వాదే కొట్టి పారవేశారు. ఆ తరువాత ఆర్‌ఎస్‌ఎస్‌ అధిపతి కూడా ఆ నినాదాన్ని ఎవరికి వారు అనాలి తప్ప ఎవరిమీదా బలవంతంగా రుద్ద కూడదు అని సుద్దులు చెప్పారు. ఇదంతా జరిగిన తరువాతే మరో ఆర్‌ఎస్‌ఎస్‌ ప్రముఖ్‌ మహారాష్ట్ర ముఖ్య మంత్రి ఫడ్నవీస్‌ ఆ నినాదం చేయనివారు దేశం విడిచి వెళ్లాలని సెలవిచ్చారు. ఇక బాబాగా చెప్పుకొనే రామ్‌దేవ్‌ చట్టాలు వుండబట్టిగానీ లేకపోతే లక్షల మంది తలలు నరికేసేవాడినని నోరు పారవేసుకుంటాడు. అలా మాట్లాడటానికి ఆయనకు వాక్‌ స్వాతంత్య్రం వర్తించదా అని బిజెపి అధిపతి అమిత్‌ షా సమర్ధిస్తారు. అసెంబ్లీ ఎన్నికల కోసం ఈ వివాదాన్ని ప్రతిపక్ష పార్టీలే ప్రారంభించాయని బిజెపి అధికార ప్రతినిధి ఎంజె అక్బర్‌ పచ్చి అవాస్తవాన్ని చెప్పారు.మార్చినెల మూడవ తేదీన ఆర్‌ఎస్‌ఎస్‌ ప్రధాన కార్యాలయంలో మాతృశక్తి అవార్డు ఇచ్చే కార్యక్రమంలో మాట్లాడిన ఆర్‌ఎస్‌ఎస్‌ అధిపతి మోహన్‌ భగవత్‌ యువతరానికి భారత మాతాకు జై అని నినదించటం నేర్పాలని వ్యాఖ్యానించారు. ఆ తరువాత పది రోజులకు మజ్లిస్‌ నేత తాను అలా నినదించనని ఏం చేస్తారో చేసుకోండని రెచ్చగొట్టాడు. ఆ తరువాత అది ఎన్ని మలుపులు తిరుగుతున్నదీ చూస్తున్నాము. కమ్యూనిస్టులకు జనవాదం, మతశక్తులకు మనువాదం(మైనారిటీ మతశక్తులకు సైతం వాటి ఛాందసవాదాలు వాటికి ఎలాగూ వుంటాయి) పాలకవర్గ పార్టీలకు అవకాశవాదం తప్ప మరొకటి పట్టదు. నరేంద్రమోడీ మేకిన్‌ ఇండియా గురించి, బాబొస్తే జాబొస్తుందని తెలుగుదేశం, రాష్ట్రం విడిపోతే తెలంగాణా యువతకు వుపాధి పెరుగుతుందని టిఆర్‌ఎస్‌ ఏం చెప్పినా రంగుల పూసల్లో తెల్ల దారంలా ఒకటే . వివిధ పార్టీలు చెప్పిన అన్ని అంశాలనూ ఇక్కడ చర్చించటం సాధ్యం కాదు. అన్నం వుడికిందా లేదా అని చూడటానికి ఒక మెతుకు చూస్తే చాలన్నట్లు అనేక అంశాలతో ముడి పడి వున్న వుపాధి గురించి చూద్దాం.

    ఈమధ్య కాలంలో రాజకీయ పార్టీల ముఖ్యంగా బిజెపి, కాంగ్రెస్‌,టిడిపి, టిఆర్‌ఎస్‌ వంటి పాలక పార్టీల భాష, పదజాలంలో అనేక మార్పులు చోటు చేసుకున్నాయి.ప్రభుత్వాలు ఒక్కొక్క రంగం నుంచి క్రమంగా తమ బాధ్యతల నుంచి వైదొలుగుతున్నాయి. వుదాహరణకు వుపాధి కల్పిస్తామని చెప్పటానికి బదులు వుపాధిని చూపుతామనే పదాలను వాడుతున్నాయి. వెంటనే బాధ్యతల నుంచి పూర్తిగా తప్పుకుంటే యువతరంలో వ్యతిరేకతను ఎదుర్కోవాల్సి వస్తుందనే భయంతో మన యువతకు నైపుణ్యం తక్కువగా వుందనే ప్రచారం మొదలు పెట్టారు. అందుకు గాను నైపుణ్య శిక్షణ, అప్రెంటిస్‌షిప్‌ అవకాశాలు కల్పిస్తామని ఎక్కువగా చెబుతున్నారు. ప్రభుత్వ రంగంలోని విద్యా సంస్ధలు వున్నత ప్రమాణాలకు పెట్టింది పేరు. అలాంటి వాటిని నిర్వీర్యం చేసింది ఎవరు ? వాటికి తగిన సిబ్బందిని నియమించకుండా, నిధులు ఇవ్వకుండా చేయటంతో పాటు ప్రయివేటు రంగాన్ని ప్రోత్సహించారు. ఆ విద్యా సంస్ధలలో ఎక్కడో ఒకటీ అరా తప్ప అత్యధిక భాగం కేవలం డిగ్రీలు అమ్ముకొనే వ్యాపార సంస్ధలు తప్ప మరొకటి కాదని తేలిపోయింది.చివరకు వైద్య సంస్ధలు కూడా అదేపని చేస్తున్నాయి. అవి ఇచ్చే డిగ్రీలను పట్టుకొని బయటకు వచ్చే వారికి కనీస పరిజ్ఞానం కూడా వుండటం లేదని వెల్లడైంది. మరోవైపు అలాంటి పరిస్థితిని సృష్టించిన వారే మన యువతలో నైపుణ్యం లేదని నిందలు వేస్తూ తాము శిక్షణ కల్పిస్తామంటూ తయారయ్యారు. ఏమిటీ నాటకం ? అది కూడా ప్రభుత్వ ఖర్చుతో అంటే పేరుకు యువతకు శిక్షణ ఆచరణలో ప్రయివేటు రంగానికి పరోక్షంగా ఆమేరకు ఖర్చు తగ్గించి లాభాలను పెంచటం తప్ప మరొకటి కాదు.

     ప్రధాని పదవిలో కూర్చున్న తరువాత నరేంద్రమోడీ వుపాధి కల్పన, నైపుణ్య అభివృద్ధికి పది అంశాలతో కూడిన ఒక పధకాన్ని ప్రకటించిన విషయం బిగ్గరగా వినిపిస్తున్న భారతమాతకు జై నినాదాల మధ్య జనానికి గుర్తు చేయటం అవసరం.ప్రధాని ఎక్కువ కాలం విదేశాల్లో ఎందుకు గడిపారంటే మేకిన్‌ ఇండియా కార్యక్రమానికి పెట్టుబడుల ఆకర్షణ కోసం తప్ప విహార యాత్రలు చేయటం లేదని బిజెపి పెద్దలు మండినపుడు జనం కామోసు అనుకున్నారు. తీరా చూస్తే రెండేళ్ల తరువాత ప్రధాని, కేంద్ర మంత్రుల , చంద్రబాబు నాయుడి వంటి ముఖ్య మంత్రుల విదేశీ ప్రయాణ ఖర్చులు కూడా దండగమారితనంగా తేలిపోయింది.

    తాము రాజకీయాలు, పాలన, ఆర్ధిక విషయాలలో ప్రపంచంలో భారత దేశ విస్వసనీయతను పునరుద్ధరించామని, ప్రపంచ రాడార్‌లో మన దేశం తిరిగి కనిపిస్తున్నదని ప్రధాని నరేంద్రమోడీ చెప్పారు. మోడీ ప్రభుత్వం తొలి ఆరునెలల్లో 2.75లక్షల వుద్యోగాలు సృష్టించింది అని ఫైనాన్సియల్‌ ఎక్స్‌ప్రెస్‌ పత్రిక ఒక వార్తను ప్రచురించింది. అంతకు ముందు సంవత్సరం అదే కాలంలో కేవలం లక్షా ఇరవై వేల వుద్యోగాలు మాత్రమే గత ప్రభుత్వం సృష్టించింది. అంటే మోడీ 118శాతం అదనంగా సృష్టించటానికి కారణం 25 రంగాలలో మేకిన్‌ ఇండియా కార్యక్రమ శుభ ప్రారంభమని దానిలో పేర్కొన్నారు. ఆర్ధిక మంత్రిత్వశాఖ 2014-15 వార్షిక నివేదికలో 2022 నాటికి 50 కోట్ల మందికి నైపుణ్యం కలిగించటం అవసరమని పేర్కొన్నారు. ప్రయివేటు రంగ భాగస్వామ్యంతో 15 కోట్ల మందికి నైపుణ్య శిక్షణ ఇవ్వాలని జాతీయ నైపుణ్య శిక్షణ అభివృద్ధి కార్పొరేషన్‌ లక్ష్యంగా పెట్టుకోగా గతేడాది జూన్‌ నాటికి 51లక్షల మందికి శిక్షణ ఇచ్చారని, వారిలో 15లక్షల మందికి వుపాధి దొరికినట్లు ఆ వార్త వివరించింది.ఈ శిక్షణా కార్యక్రమాలు ఎంత ప్రహసంగా నడుస్తున్నాయో, నిధులు దుర్వినియోగం ఏ స్థాయిలో వుందో అందరికీ తెలిసిందే. ప్రతిదానిలో కుంభకోణం, కుంభకోణం.

     గతేడాది ఏప్రిల్‌ 17వ తేదీన ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌ ప్రచురించిన వార్త ప్రకారం గత ఆర్ధిక సంవత్సరంలో ఎనిమిది కీలక రంగాలలో మూడవ త్రైమాసికంలో అంతకు ముందు మూడు త్రైమాసికాల కంటే వుద్యోగఅవకాశాలు గణనీయంగా తగ్గిపోయాయి. 2014 అక్టోబరు-డిసెంబరు మాసాలలో కేవలం 1.17లక్షల వుద్యోగాలు రాగా అంతకు ముందు సెప్టెంబరుతో ముగిసిన త్రైమాసికంలో 1.58, ఏప్రిల్‌-జూన్‌లో 1.82లక్షల వుద్యోగాలు వచ్చాయి. ఇలా అంకెలను పేర్కొంటూ పోతే ఆల్జీబ్రా మైండ్‌ గాబరా అని ఒకప్పుడు అనుకున్న విధంగా బుర్ర తిరిగి పోతుంది. అంకెలను ఎలా అయినా వినియోగించుకోవచ్చన్నది ఆరునెలల విజయ గాధ, రెండవది ఏడాది పాలన అసలు గాధ వెల్లడించింది. మా తాతలు నేతులు తాగారు కావాలంటే మా మూతులు వాసన చూడండి అని చెప్పుకుంటే కుదరదు. ఇప్పుడేంటి ? మాకేంటి అన్న ప్రశ్నలకు సమాధానాలు కావాలి? నరేంద్రమోడీ లేదా ఆయన భక్త బృందంగానీ ఏం చెబుతుందో తెలియదు.

      ఈ ఏడాది మార్చి 31వ తేదీన హిందూ పత్రిక ‘వుపాధి పెరుగుదల ఆరు సంవత్సరాల కనిష్టానికి పడిపోయింది’ అనే శీర్షికతో వార్తను ప్రచురించింది.దాని సారాంశం ఇలా వుంది. కేంద్ర ప్రభుత్వ కార్మికశాఖ కార్మికులు ఎక్కువగా అవసరం వుండే ఎనిమిది కీలక రంగాలలో సేకరించిన సమాచారం ప్రకారం 2015 తొలి తొమ్మిది మాసాలలో కేవలం 1.55లక్షల నూతన వుద్యోగాలు మాత్రమే నికరంగా వచ్చాయి. ఇది ఆరు సంవత్సరాలలో కనిష్టం. ఇదే సమయాలలో 2013,14 సంవత్సరాలలో మూడు లక్షలకు పైగా వుద్యోగాలు వచ్చినట్లు కార్మికశాఖ సమాచారం తెలిపింది. ఇది ఆరోగ్యకరమైన సూచిక కాదని విశ్లేషకులు పేర్కొన్నారు. ‘ మన పారిశ్రామిక అభివృద్ధి తక్కువగా వుంది,వుత్పత్తి పెరిగినపుడు మాత్రమే వుపాధి వుంటుంది.కార్పొరేట్‌ రంగంలో పెద్ద ఎత్తున సిబ్బందిని క్రమబద్దీకరిస్తున్నారు(తగ్గించటానికి పెట్టిన ముద్దు పేరు).ప్రభుత్వం రంగం కూడా కార్మికులను నియమించటం లేదు. అభివృద్ధి ప్రధాన ఆశయం వుద్యోగ కల్పన. అంతిమంగా మనం అన్ని స్ధాయిలలో వుద్యోగాలను సృష్టించాలి. అదే జరగటం లేదు.’ అని కేర్‌ రేటింగ్‌ సంస్ధ ప్రధాన ఆర్ధికవేత్త మదన్‌ సబ్నవిస్‌ చెప్పారు.

    కేంద్ర కార్మిక శాఖ వుద్యోగకల్పన గురించి 2009 నుంచి ప్రతి మూడు మాసాలకు ఒకసారి సర్వే నిర్వహిస్తున్నది. వస్త్ర, తోళ్ల,లోహ, ఆటోమొబైల్‌, ఆభరణాలు, రవాణా, చేనేత, ఐటి రంగాలలో ప్రపంచ ఆర్ధిక సంక్షోభ ప్రభావం ఎలా పడింది అనే అధ్యయనం కోసం ఈ సర్వే నిర్వహిస్తున్నారు. గత కొన్ని సంవత్సరాలలో ప్రతి ఏడాది జనవరి నుంచి సెప్టెంబరు వరకు వివరాలు ఇలా వున్నాయి. 2009లో నికరంగా 2.49లక్షల వుద్యోగాలు పెరిగాయి.(2009 జనవరి-మార్చిలో 1.17, ఏప్రిల్‌-జూన్‌లో 1.31లక్షలు తగ్గగా జూలై-సెప్టెంబరులో 4.97లక్షలు పెరిగాయి. ఈ కాలంలో నికర పెరుగుదల 2.49లక్షలు) ఇదే విధంగా 2011లో 7.04లక్షలు, 2013లో 3.36లక్షలు, 2015లో 1.55లక్షల వుద్యోగాలు నికరంగా పెరిగాయి. కేంద్ర ప్రభుత్వ కార్మిక శాఖ అధికారికంగా వెల్లడించిన ఈ సమాచారంపై కొంతమంది ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇండియన్‌ స్టాఫింగ్‌ ఫెడరేషన్‌ అధ్యక్షుడు రితుపర్ణ చక్రవర్తి దీని గురించి మాట్లాడుతూ ‘ స్టాఫింగ్‌ పరిశ్రమ ఆరోగ్యకరంగా 18-20శాతం పెరుగుతోంది.కార్మిక శాఖ విడుదల చేసిన సమాచారం వుద్యోగ పెరుగుదల గురించి సమగ్ర చిత్రాన్ని ఇవ్వటం లేదు.అనేక రంగాలను అది స్వీకరించలేదు’ అన్నారు. నరేంద్రమోడీని సంతృప్తి పరచటానికి ఇలా వ్యాఖ్యానిస్తే ఓకే. ఎనిమిది ప్రధాన రంగాలలోనే పరిస్థితి అలావుంటే మిగతా రంగాలలో గొప్పగా వుందని చెబుతుంటే నమ్మటానికి జనం చెవుల్లో పూలు పెట్టుకు లేరు. 2015లో కాంట్రాక్టు వుద్యోగుల నియామకం గణనీయంగా తగ్గినట్లు లేబర్‌ బ్యూరో పేర్కొన్నది. వుపాధి కల్పన లేదా కోల్పోయిన వుపాధి గురించి సమగ్ర సమాచారం సేకరించటం మన దేశంలో సాధ్యం కాదు.ఎందుకంటే అసలు అధికారికంగా నమోదు అన్నది సమగ్రం కాదు. ధోరణులు మాత్రమే మనకు తెలుస్తాయి. కేంద్ర కార్మిక శాఖ ప్రభుత్వ విభాగం కనుక వున్నంతలో దాని సమాచారాన్ని ప్రాతిపదికగా తీసుకోవటం తప్ప మరొక మార్గం లేదు

      వుపాధి కల్పన గురించి కొన్ని సందర్భాలలో ప్రధాని నరేంద్ర మోడీతో సహా ఇతరులు ఏం చెప్పారో చూడండి.’ కేవలం వాగ్దానాలు మాత్రమే అద్బుతాలను సృష్టించవు’ అని మోడీ పాలన ఇరవై నెలల తరువాత ఈ ఏడాది ఫిబ్రవరి నాలుగున బెంగలూరులో ప్రముఖ పారిశ్రామికవేత్త రతన్‌ టాటా చెప్పారు. విదేశీయలు మన సరిహద్దులు దాటి పెట్టుబడులు పెట్టేందుకు భారత్‌లో ప్రవేశించటం లేదన్నది టాటాతో సహా ప్రముఖ పారిశ్రామికవేత్తల అంతరంగం, బహిరంగం కూడా. ప్రపంచ పెట్టుబడిదారీ దేశాలలో ఆర్ధిక మాంద్యం 2008 నుంచి అనేక సమస్యలను ముందుకు తెస్తోంది. పెట్టుబడిదారులు తమకు ఎక్కడ అప్పనంగా లాభాలు వస్తాయో అక్కడికే పెట్టుబడులను తరలిస్తున్నారు. నరేంద్రమోడీ, చంద్రబాబు వంటి వారు జనం సొమ్ము ఖర్చు చేసి ఎన్ని విదేశీ పర్యటనలు చేసినా అయ్యగారి సంపాదన అమ్మగారి బుట్టలోలకులకు చాలటం లేదన్నట్లుగా పరిస్థితి తయారైంది.

    మన దేశంలో పెట్టుబడుల గురించి అధ్యయనం చేసే భారతీయ ఆర్ధిక పర్యవేక్షణ కేంద్రం( సెంటర్‌ ఫర్‌ మోనిటరింగ్‌ ఇండియన్‌ ఎకానమీ(సిఎంఐఇ) కూర్చిన సమాచారం ఇంతవరకు ఏ మాత్రం ఆశాజనకంగా లేదు. 2015 మూడవ త్రైమాసికంలో నూతన సామర్ధ్య కల్పనకు ప్రతిపాదనలు అంతకు ముందుతో పోల్చితే 74శాతం తగ్గిపోయాయి.కేవలం లక్ష కోట్లరూపాయల విలువగల 383 పధకాలు మాత్రమే ప్రకటించబడ్డాయి. ఇది అంతకు ముందు ఐదు త్రైమాసికాల కంటే కనిష్టం. అన్ని రంగాలలో తగ్గుదల కనిపిస్తోందని, కచ్చితంగా ఫలానా అంశాలు కారణమని అప్పుడే చెప్పలేమని సిఎంఐఇ పేర్కొన్నది.నిలిచిపోయిన పధకాల విలువ 10.8లక్షల కోట్ల రూపాయలు. మరి కొత్త ప్రతిపాదనల సంగతేమిటి ? నరేంద్రమోడీ విదేశీ పర్యటనలన్నీ విజయవంతమయ్యాయని అప్పుడు చెప్పారు.ఇప్పుడు వాటి అర్ధమేమిటి ?

    ఐటి రంగంలో ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడుల గురించి చంద్రబాబు నాయుడు, ఆయన ప్రచార మంత్రి పల్లె రఘునాధ రెడ్డి, ముఖ్యమంత్రి కుమారుడు లోకేష్‌ తమ పలుకుబడిని వుపయోగించి అనేక ఒప్పందాలు చేసుకున్నట్లు ప్రకటనల మీద ప్రకటనలు చేశారు. వస్తూత్పత్తి చేసే పరిశ్రమలు పెట్టటానికి, అవి వుత్పత్తి ప్రారంభం కావటానికి సమయం పడుతుంది. కానీ ఐటి కంపెనీలకు అలాంటి అవసరం లేదు. వుదయం కార్యాలయం ప్రారంభిస్తే సాయంత్రానికి వుత్పత్తి ప్రారంభించవచ్చు. అలాంటి మాజిక్‌ జరగటం లేదు. అన్నింటి కంటే అన్నింటి తాను అమెరికాలో కాలి నడకన తిరిగి హైదరాబాదులో ఐటి పరిశ్రమను అభివృద్ధి చేశానని చెప్పుకుంటారు చంద్రబాబు. తాజా సమాచారం ప్రకారం హైదరాబాదులో పదిశాతం కంటే తక్కువే ఐటి వుద్యోగులు వున్నారు. బెంగలూరు నాలుగో వంతు వుద్యోగాలను కల్పిస్తోంది. ఆంధ్రప్రదేశ్‌ స్ధానమెక్కడో వేరే చెప్పనవసరం లేదు. దేశంలో ఐటి రంగం 2015-16లో 12-14శాతం అభివృద్ధి వుంటుందని భావిస్తే అది 10-12 శాతంగా వుందని అంచనా.’ ప్రభుత్వం చేసిన ప్రకటనలు, మేము చూసిన ధోరణులను బట్టి ఒక వేగంతో దేశీయ విభాగం పెరుగుతుందని అంచనా వేశాము. అయితే వాటిలో ఎక్కువ భాగం ఆచరణలోకి రాలేదు. అవి ఎప్పుడు ఆచరణలోకి వస్తే అప్పుడు మనం పెద్ద ప్రభావాన్ని చూడవచ్చు ‘ అని నాస్కామ్‌ అధ్యక్షుడు చంద్రశేఖర్‌ వ్యాఖ్యానించారు. ప్రధాన మంత్రి విదేశీ పర్యటనల మోజు తగ్గిపోయినట్లుగా కనిపిస్తోంది. ఎందుకంటే విమాన ఖర్చులకు కూడా సరిపడా ప్రయోజనం లేకపోతే జనానికి చెప్పుకొనేదేమీ వుండదు. బహుశా ఈ కారణంగానే ఆయన మంత్రులు కొత్త పల్లవి అందుకున్నారు. తమ ప్రభుత్వ ఖాదీ పధకాల కారణంగా 2016-17లో 70-80లక్షల వుద్యోగాలు లభిస్తాయని చిన్న, సన్న, మధ్యతరగతి పరిశ్రమల మంత్రి గిరిరాజ్‌ సింగ్‌ చెబుతున్నారు. అంటే జనం చౌకగా దొరికే మిల్లు వస్త్రాల బదులు ఖరీదయిన ఖాదీ ధరిస్తారని అర్ధమా ? ఖాదీ వడికేందుకు సోలార్‌ రాట్నాలను ప్రవేశపెడితే ఖర్చు తగ్గుతుందని,లాభాలు వస్తాయని మంత్రిగారు చెబుతున్నారు. ‘ప్రధాని నరేంద్రమోడీ విజ్ఞాపనలో ఏదో మాజిక్‌ వుంది. ఖాదీ పెరుగుదల రేటును చూస్తే గణనీయంగా పెరిగిందని’ ఖాదీగ్రామీణ పరిశ్రమల సంస్ధ సిఇఓ అరుణ్‌ కుమార్‌ చెబుతున్నారు. అది పిట్ట కధలా లేదూ !

     ఆంధ్రప్రదేశ్‌ విషయానికి వస్తే బాబొస్తే జాబ్‌ అన్న నినాదం పెద్ద ప్రహసనంగా మారింది. ఆంధ్రప్రదేశ్‌ సామాజిక, ఆర్ధిక సర్వే నివేదిక 2014-15 ప్రకారం 2014 నవంబరు నాటికి 1742 భారీ, మెగా పరిశ్రమలు రు.78,860 కోట్ల పెట్టుబడితో వుత్పత్తిలోకి వచ్చి 4,21,222 మందికి వుపాధి కల్పించాయి.2014-15లో 15 పరిశ్రమలపై 1875 కోట్ల రూపాయలతో 6814 మందికి వుపాధి కల్పించారు.ఇది గాక 1,06,504 చిన్న, మధ్యతరహా పరిశ్రమలు 11,65,102 మందికి 2014 మార్చి వరకు వుపాధి కల్పించాయి. వాటిపై పెట్టిన పెట్టుబడి 1,69,121 కోట్ల రూపాయలు.2014-15లో సెప్టెంబరు వరకు 2,263 కోట్లతో 25,175 మందికి వుపాధి కల్పించారు.

    చంద్రబాబు నాయుడు పూర్తి పాలన సాగించిన 2015-16 ప్రకారం రు.81,261 కోట్ల పెట్టుబడితో 1784 భారీ, మెగా పరిశ్రమలలో కల్పించిన వుపాధి 4,35,506 మందికి మాత్రమే. అంటే ఏడాది కాలంలో ప్రయివేటు రంగంలో సైతం అదనంగా కల్పించిన వుపాధి 14,384 మాత్రమే.ఈ మధ్య రాష్ట్ర ఆర్ధిక మంత్రి యనమల రామకృష్ణుడు ప్రభుత్వ వుద్యోగాల గురించి ఆశలు పెట్టుకున్నవారు వాటి బదులు వేరే చూసుకోవటం మంచిదని ఒక ప్రకటనలో పరోక్షంగా చెప్పారు. రాష్ట్రంలో మంజూరు చేసిన పోస్టుల సంఖ్య 6,97,621 కాగా వాటిలో 1,42,825 ఖాళీ వున్నట్లు వచ్చిన వార్తలు వాస్తవం కాదని పేర్కొన్నారు. మంజూరైన పోస్టులు 4,83,491కాగా ఖాళీలు 77,737 మాత్రమే అని తెలిపారు. వీటన్నింటినీ నేరుగా నింపటం జరగదని, ప్రమోషన్లు, ఇతర సేవల నుంచి బదిలీల ద్వారా నింపుతారని, అందువలన నేరుగా నింపేవి 20వేలకు అటూ ఇటూగా మాత్రమే వుంటాయని వెల్లడించారు. మారుతున్న సాంకేతిక పరిజ్ఞానం కారణంగా నింపాల్సిన పోస్టుల గురించి సమీక్ష జరపాలనుకుంటున్నామని, స్వల్పకాలిక, దీర్ఘకాలిక అభివృద్ధికి అవసరమైన పోస్టులను మాత్రమే నింపాలని ప్రస్తుత ఆలోచనగా వుందని తెలిపారు. ఇప్పటికే రాష్ట్ర స్వంత ఆదాయంలో 55శాతం వుద్యోగుల వేతనాలకు పోతున్నదని, ప్రభుత్వ రంగంలోనే వుపాధి కల్పించటం పరిష్కారం కాదని స్పష్టం చేశారు. కానీ ఇదే మంత్రి నాయకత్వంలో 2014 ఆగస్టులో రాష్ట్ర ప్రభుత్వం ఆర్ధికాంశాలపై శ్వేత పత్రం విడుదల చేసింది. దానిలో వుద్యోగుల వేతనాలకు అవిభక్త ఆంధ్రప్రదేశ్‌లో స్వంతాదాయంలో 58శాతం ఖర్చు కాగా మిగిలిన ఏపీలో అది 73 శాతానికి పెరుగుతుందని తెలిపారు. అందువలన అంకెలతో ఆడుకోవటంలో యనమల తన అనుభవన్నాంతా రంగరిస్తారనటంలో సందేహం ఏముంది?

    చివరిగా ఒక్క మాట. మన దేశంలో నూతన ఆర్ధిక విధానాలపేరుతో వినాశకర సంస్కరణలు ప్రారంభించి పాతికేళ్లు గడిచాయి. గతంలో కేంద్ర ప్రభుత్వ సలహాదారుగా పనిచేసిన అశోక్‌ పార్ధ సారధి తాజాగా హిందూ పత్రికలో రాసిన వ్యాసంలో మేక్‌ ఇన్‌ ఇండియా కార్యక్రమం జయప్రదం కావాలంటే 1991 దశకం తరువాత చేసిన నష్టాన్ని ముందుగా సరిచేయాలని నరేంద్రమోడీ సర్కార్‌కు సూచించారు. ఆర్‌ఎస్‌ఎస్‌ ఏర్పాటు చేసిన స్వదేశీ జాగరణ మంచ్‌ పైకి ఏమి చెప్పినా ఆచరణలో గతంలో వాజ్‌పేయి హయాంలో ప్రస్తుతం మోడీ ఏలుబడిలో అది విదేశీ ఆదరణ మంచ్‌గా మారిపోయింది. గత కాంగ్రెస్‌ పాలకులు విదేశీ ఐటి హార్డ్‌వేర్‌ పరిశ్రమలకు లబ్ది చేకూర్చేందుకు స్వదేశీ హార్డ్‌వేర్‌ పరిశ్రమను దెబ్బతీస్తూ సాఫ్ట్‌వేర్‌ అభివృద్ధి ముసుగులో విదేశీ హార్డ్‌వేర్‌ వుత్పత్తులపై పన్నులను తగ్గించి దిగుమతులకు తలుపులు బార్లా తెరిచారు. ఫలితంగా 1990 దశకంలోనే మన తయారు చేయగలిగిన వాటిని ఇప్పుడు దిగుమతి చేసుకుంటున్నాం. మన సాప్ట్‌ వేర్‌ పరిశ్రమ దిగుమతి చేసుకున్న హార్డ్‌ వేర్‌ను అప్పటికే మన దేశంలో తయారు చేయగలిగి వున్నామని పార్ధ సారధి పేర్కొన్నారు. మన రక్షణ, అణు ఇంధనం, అంతరిక్ష సంస్ధలు వాటిని వుపయోగించటమే గాక అభివృద్ధి చెందుతున్న దేశాలకు ఎగుమతులు కూడా చేసినట్లు ఆయన గుర్తు చేశారు. నూతన విధానాలు మన పరిశ్రమలను ఎలా దెబ్బతీసిందీ, దిగుమతులపై ఎలా అధారపడుతున్నదీ ఆయన సోదాహరణంగా పేర్కొన్నారు. మేకిన్‌ ఇండియా ప్రధాని వినిపించుకుంటారా ?