ఎం కోటేశ్వరరావు
ఆంధ్ర ప్రదేశ్‌లో కొద్ది రోజుల పాటు చర్చ నడిచింది. ఇప్పుడు పాతబడిపోయింది, జనం కూడా మరచిపోయారేమో ! చంద్రబాబు నాయుడు, ఆయన కుమారుడైన మంత్రి లోకేష్ ఎడాపెడా దేశదేశాలు తిరిగి పుంఖాను పుంఖాలుగా రాష్ట్రానికి పెట్టుబడులు తెస్తుంటే ఉబ్బితబ్బిబ్బు అవుతున్నవారు ఎన్నని గుర్తు పెట్టుకుంటారు.ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఏం చేస్తున్నారన్నది పట్టించుకోవాల్సిన అంశం కాదు. బాక్సాఫీసు వద్ద తన సినిమాల గురించి ఆలోచిస్తున్నట్లుగా కనిపిస్తోంది. ముందే చెప్పుకున్న చర్చ ఏమిటంటే డేటా సెంటర్ అంటే ఏమిటి ? అదో గోడౌన్ రెండు వందల మంది కంటే పని చూపదు, కాదు లక్షలాది మందికి ఉద్యోగాలను కల్పిస్తుంది. ఆంధ్రప్రదేశ్‌లో వైసిపి, తెలుగుదేశం, దానికి వంత పాడే జనసేన, బిజెపి నేతల నుంచి వెలువడుతున్న మాటల సారమిది. గూగుల్ డేటా సెంటర్ వలన 1.88లక్షల ఉద్యోగాలు వస్తాయని మంత్రి లోకేష్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఎవరైనా ఈ వాదనలను వ్యతిరేకిస్తే ఒక ముద్ర, సమర్ధిస్తే మరో ముద్ర. మూడో పక్షం వారు ఎవరైనా ఈ రెండు వాదనలతో ఏకీభవించినా, లేక అదే మాదిరి చెప్పినా వారితో రంకు కట్టి చీల్చి చెండాడుతున్నారు. అందుకనే మేథావులు నోరు విప్పటం లేదా లేక రంగుపడుద్ది అని భయపడుతున్నారా ? పోనీ మీడియా మంచీ-చెడును విశ్లేషించే వారేం చెబుతున్నారో పాఠకులు, వీక్షకులకు అందించేందుకు చూస్తున్నాదా అంటే అదీ లేదు. తాము సమర్ధించే పార్టీలు, వ్యక్తులు, శక్తుల ప్రయోజనాలకు హాని లేవనుకున్నవాటిని మాత్రమే వడగట్టి అందచేస్తున్నది. అందువలన రాసేవారు కూడా అనవసర ఆయాసం ఎందుకని ఊరుకొని ఉండవచ్చు. రెండు రెళ్లు నాలుగు అని చంద్రబాబో, జగనో చెబితే ఎవరైనా అవును అన్నారా వారి ఖర్మ కాలిందే, రంగుపడుద్ది. జనం విచక్షణా రహితంగా తయారయ్యారా అంటే వారిని అలా తయారు చేశారు అని చెప్పక తప్పదు. జగన్‌కు ఓటేసిన వారందరూ ఆయన చెప్పిందే వేదంగానూ, లేదా మూడు పార్టీల కూటమికి మద్దతు ఇచ్చిన వారందరూ ఆ పార్టీల నేతలు చెప్పిందే పరమ సత్యంగా గుడ్డిగా భావిస్తున్నట్లు కనిపిస్తోంది, వేరేది ఏదీ వినిపించుకొనే స్థితిలో లేరన్నది ఒక నిజం. ఇంతకీ విశాఖలో ఏర్పాటు కానున్న గూగుల్ డేటా సెంటర్ గోడవునా, ఉత్పత్తి కేంద్రమా, ఒక ప్రక్రియ నిర్వహించేదా ? కృత్రిమ మేథకేంద్రం అని కూడా కలుపుతున్నారు. దేశంలో, ప్రపంచంలో ఇప్పటికే గూగుల్, ఇతర టెక్నాలజీ కంపెనీలు కృత్రిమ మేథ గురించి ఎంతో ముందుకు పోయాయి, వినియోగంలోకి ఇప్పటికే వచ్చేసింది. విశాఖలో కొత్త పరిశోధనలు చేస్తామంటారా ? అదీ చూద్దాం !
నేను ఒక సామాన్యుడిని గనుక చాట్ జిపిటిని ఇదే ప్రశ్న అడిగా, అది ఇచ్చిన సమాధానం గురించి వివరిస్తా.” మంచి ప్రశ్న- దీన్ని గురించి జాగ్రత్తగా వివరించనివ్వండి. చాట్ జిపిటి (నా వంటి వారు-నేను కాదు, చాట్ జిపిటి తన గురించి చెప్పుకుంది) ఒక కృత్రిమ సేవ, దీన్ని నడిపేది ఓపెన్ ఏఐ.మనం డేటా(సమాచారం) రక్షణ లేదా గోప్యత చట్టాల (జిడిపిఆర్ వంటి )గురించి మాట్లాడుకున్నపుడు సాధారణంగా వాటి పాత్ర ఉంటుంది.1. డాటా సేకరణ లేదా ఉత్పత్తిదారు : వీరు ఎందుకు, ఎలా వ్యక్తిగత సమాచార ప్రక్రియ(ప్రోసెస్)ను చేయాల్సిందీ నిర్ణయిస్తారు. 2.డేటా ప్రోసెసర్ : డాటా కంట్రోలర్ తరఫున వ్యక్తిగత సమాచారాన్ని ప్రోసెస్ చేస్తుంది. 3. డేటా సెంటర్ : ఎక్కడ డేటా నిల్వ చేస్తారో మరియు ప్రోసెస్ చేస్తారో దానికి అవసరమైన భౌతిక సదుపాయాలు( సర్వర్స్, నిల్వ, నెట్‌వర్కింగ్)-సాధారణంగా మైక్రోసాఫ్ట్ అజుర్, గూగుల్ క్లౌడ్ లేదా ఎడబ్ల్యుఎస్ కంపెనీలు వీటిని నిర్వహిస్తాయి. ఒక్క ముక్కలో చెప్పాలంటే చాట్‌జిపిటి అనేది డాటా ప్రోసెసర్ లేదా సేవ అందించే సాధనం, ఓపెన్ ఎఐ అంటే డాటాను కంట్రోల్ చేసేది, అజూర్ లేదా అంతకంటే చిన్నవి డాటా సెంటర్లు లేదా మౌలిక సదుపాయాలను అందించేవి. దీన్నిబట్టి ఎవరికి వారు డేటా సెంటర్ గురించి స్వంత అవగాహన ఏర్పరుచుకోవచ్చు, ఇంకా కావాలంటే శోధించి మరిన్ని విషయాలు తెలుసుకోవచ్చు.
ఇక చాట్ జిపిటి వంటి సాధనాలు ఇప్పటికే కొన్ని ఉన్నాయి,రానున్న రోజుల్లో మరికొన్ని కూడా వస్తాయి.పైన పేర్కొన్న సమాచారాన్ని పొందాలంటే డేటా సెంటర్‌కు అయ్యే విద్యుత్, ఇతర నిర్వహణ ఖర్చుల గురించి తెలియదు గానీ ఒక అరలీటరు నీరు ఖర్చు అవుతుందని చదివా.బహుశా పరికరాలు వేడెక్కి దెబ్బతినకుండా చల్లబరిచేందుకు అవసరమైన నీరు కావచ్చు. చాట్ జిపిటిని కొద్ది నెలల క్రితం మరో ప్రశ్న అడిగా. అదేమిటంటే చంద్రబాబు నాయుడు 2014 నుంచి 2019వరకు, తరువాత ఐదేండ్లు జగన్ అధికారంలో ఉన్నపుడు వివిధ సంస్థలతో కుదుర్చుకున్న అవగాహనా ఒప్పందాలెన్ని, అవి వాస్తవరూపందాల్చినవి, వాటి విలువ ఎంత అని అడిగా. ఒక టీవీ చర్చలో వీక్షకులకు నిజం చెప్పేందుకు తప్ప జగన్‌కు అనుకూలంగానో, చంద్రబాబు నాయుడికి వ్యతిరేకంగానో కాదు.( ఎవరికైనా కావాలంటే నేను సేకరించిన వాటిని అందచేస్తా) వివిధ వనరుల నుంచి సేకరించిన సమాచారాన్ని విశ్లేషించి చెప్పిన అంశాలవి, వాటికి రుజువులు,సాధికారిత గురించి అడిగితే ఏ ప్రభుత్వం కూడా తమ ఘనతల గురించి సామాన్యులకు అర్ధమయ్యే రీతిలో ఎక్కడా సమాచారాన్ని అందుబాటులో ఉంచటం లేదు గనుక నమ్మటమా లేదా అన్నది ఎవరిష్టం వారిది. నేనైతే నమ్మాను గనుకనే చెబుతున్నా.మనోభావాలు గాయపడతాయని భయపడేవారు, ఊరికూరికే గాయపరుచుకొనే వారు వివరాలు చదవకండి అని కూడా చెబుతున్నా.
చాట్‌జిపిటి అందించిన సమాచారం ప్రకారం ” చంద్రబాబు ఏలుబడి 2014 నుంచి 2019 వరకు కుదుర్చుకున్న అవగాహన ఒప్పందాల విలువ రు.18.87లక్షల కోట్లు.2019 ఏప్రిల్ నాటికి వాస్తవరూపం దాల్చిన వాటి విలువ రు.60వేల కోట్లు, పురోగతిలో ఉన్నవి రు.67వేల కోట్లు ( పురోగతి అంటే శంకుస్థాపన మొదలు వివిధ దశల్లో ఉన్నవి(తరువాత కొన్ని రద్దు కూడా కావచ్చు, వాస్తవ రూపం దాల్చినవి సగటున ఏడాదికి రు.పన్నెండువేల కోట్లు.) మరో సందర్భంలో చాట్‌జిపిటి చెప్పినదాని ప్రకారం 2016 నుంచి 2018 వరకు సంతకాలు చేసిన అవగాహన ఒప్పందాల విలువ రు.12.32లక్షల కోట్లు కాగా 309 ప్రాజెక్టులతో వాస్తవ రూపం దాల్చినవి రు.1.39లక్షల కోట్లని పేర్కొన్నది. ఇక వైఎస్ జగన్మోహనరెడ్డి ఏలుబడి గురించి చాట్ జిపిటి ఏం చెప్పిందో చూద్దాం. 2019 నుంచి 2022 వరకు ఆమోదం తెలిపిన పథకాల విలువ రు.1,81,221 కోట్లు కాగా ఏడాదికి సగటున అమల్లోకి వచ్చిన వాటి విలువ రు.15,693. వివరాల్లోకి వెళితే 2019 జూన్ నుంచి 2021 మే నెల మధ్య కాలంలో 65 పెద్ద పరిశ్రమల పెట్టుబడి రు. 29,781 కోట్లు, కాగా ప్రభుత్వం నివేదించిన దాని ప్రకారం 2019 నుంచి 2022 మార్చి నెల మధ్య వచ్చినట్లు చెప్పిన పెట్టుబడి రు.43వేల కోట్లు, దీనిలో పెద్ద పరిశ్రమల వాటా రు.36,303 కోట్లు, ఎంఎస్‌ఎంఇల వాటా రు.7,018 కోట్లు. నూతన పెట్టుబడుల గురించి చూస్తే 2018-19 నుంచి 2022-23వరకు ప్రకటించిన పథకాల విలువ రు.9,41,020 కోట్లు కాగా పూర్తయిన వాటి విలువ రు.1.34 లక్షల కోట్లు. పెండింగ్‌లో ఉన్న రు.27,110 కోట్ల ప్రాజెక్టును పునరుద్దరించారు. సంక్షిప్తంగా వివరాలు ఇలా ఉన్నాయి.
కాలం×××××వాస్తవ రూపం దాల్చినవి×××ప్రకటించినవి
2019-22×× రు.1,81లక్షల కోట్లు ప్రభుత్వ ఆమోదం పొందినవి
2019-21×× రు.29,781 కోట్లు ×××—-
2019-22×× రు.43,000 కోట్లు ×××—-
2018-19నుంచి 2022-23×× —××× రు.9.41లక్షల కోట్లు
2024-2025 ××—— ×××రు.9.2- 9.34లక్షల కోట్లు.
గమనిక : జగన్మోహనరెడ్డి ఏలుబడి చివరి సంవత్సరం పదకొండు నెలల్లో ఏకంగా తొమ్మిది లక్షల కోట్లకు పైగా ఒప్పందాలు కుదుర్చుకున్నట్లు చెప్పటం ద్వారా తాము కూడా తక్కువ తినలేదని చెప్పుకొనేందుకు చూసినట్లు కనిపించింది.
చంద్రబాబు నాయుడు జనసేన, బిజెపితో కలసి కూటమిగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన తరువాత సంగతేమిటని అదే చాట్ జిపిటిని అడిగితే చెప్పిన వివరాలు ఇలా ఉన్నాయి. పరిశ్రమల శాఖ మంత్రి టిజి భరత్ చెప్పినదాని ప్రకారం మొదటి ఏడాదిలో నమోదైన లేదా ఆకర్షించిన పెట్టుబడుల ప్రతిపాదనల విలువ రు.14లక్షల కోట్లు, ఈ మొత్తంలో లాంఛనంగా భూ కేటాయింపులు, ప్రోత్సాహకాలతో ఎస్‌ఐపిబి ఆమోదం తెలిపిన వాటి మొత్తం రు.9.2లక్షల కోట్లు. చంద్రబాబు నాయుడు నిర్ధారించినదాని ప్రకారం కొత్త పెట్టుబడులు 9.62లక్షల కోట్లని, అవి అమల్లోకి వస్తే 8.79లక్షల కొత్త ఉద్యోగాలు వస్తాయి.పరిశ్రమల మంత్రి టిజి భరత్ పెట్టుబడులు రు.9.4లక్షల కోట్లని, ఉద్యోగాలు 8.5లక్షలని పేర్కొన్నారు. చంద్రబాబు నాయుడు, లోకేష్ ఇద్దరూ ఎడాపెడా తాజాగా కుదుర్చుకుంటున్న ఒప్పందాలతో ఇప్పటి వరకు మొత్తం విలువ ఎంతో అధికారికంగా వెల్లడిస్తే తప్ప తెలియదు, వివరాలు వెల్లడిస్తారని ఆశిద్దాం.
విశాఖ గూగుల్ డేటా సెంటర్ అని చెబుతున్నప్పటికీ అది గూగుల్‌తో పాటు అదానీ, ఎయిర్‌టెల్ కంపెనీల భాగస్వామ్యం కలిగిన కంపెనీ. వాటి పెట్టుబడి రు.1.25లక్షల కోట్లు లేదా 15 బిలియన్ డాలర్లు. ఆ కంపెనీకి ఇవ్వదలచిన రాయితీల విలువ రు. 22వేల కోట్లని వార్తలు వచ్చాయి. ఇంతేనా ఇంకా ఎక్కువా చెప్పలేము. ఇంత మొత్తం అప్పనంగా ఇస్తున్న తరువాత ఒప్పందాల వెనుక ముడుపులు లేకుండా ఉంటాయా ? సమస్యే లేదు. బహుళజాతి గుత్త కంపెనీలు, దేశీయ బడాకంపెనీలు ఇచ్చే లంచాలను నిరూపించలేముగానీ అవి ఇవ్వటం, పుచ్చుకోవటం నిజం. రాయితీలు, కంపెనీ ఏర్పాటుతో తలెత్తే పర్యావరణ సమస్యలు, పరిష్కారాలు, వచ్చే ఉపాధి గురించి కంపెనీల విశ్లేషణ నివేదికలను బహిర్గత పరిస్తేనే జనాలకు స్పష్టత వస్తుంది. ప్రజల సొమ్మును ఇలాంటి కార్పొరేట్లకు వేల కోట్ల మేర సబ్సిడీలుగా ఇస్తున్నపుడు తెలుసుకోవటం పౌరుల హక్కు, పారదర్శకతను పాటించటం పాలకుల విధి, ఎందుకంటే అవి వారి జేబుల్లోంచి ఇవ్వటం లేదు మరి. అదానీ కంపెనీ ఆంధ్రప్రదేశ్‌లో ముఖ్యమంత్రిగా పనిచేసిన జగన్‌కు 20 కోట్ల డాలర్లు లేదా 1,750 కోట్ల రూపాయలు ముడుపులుగా ఇచ్చినట్లు అమెరికాలో నమోదైన కేసు గురించి ఆంధ్ర ప్రదేశ్ లేదా కేంద్ర ప్రభుత్వం విచారణ జరిపి అలాంటిదేమీ జరగలేదు, జగన్, అదానీ మచ్చలేని వారు అని నిర్ధారించటమైనా చేయాలి, ఏదీ లేదు, తోడు దొంగల వ్యవహారం తప్ప ఇది మరొకటి కాదని ఎవరైనా అంటే తప్పేముంది ? విశాఖ డేటా కేంద్రం కల్పించే ఉపాధి గురించి తెలుగుదేశం పార్టీకి చెందిన కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ చెప్పిందేమిటి ? భారత్ ఏఐ శక్తి పేరుతో ఢిల్లీలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ ఈ కేంద్రం ద్వారా ఐదు నుంచి ఆరువేల వరకు పర్మనెంటు ఉద్యోగాలు, మొత్తంగా 20 నుంచి 30వేల ఉద్యోగాలు వస్తాయని చెప్పారు.( అక్టోబరు 14వ తేదీ పిఐబి విడుదల చేసిన ప్రకటన) ఒకే పార్టీకి చెందిన రాష్ట్ర మంత్రి లోకేష్, కేంద్ర మంత్రి చంద్రశేఖర్ చెప్పిన అంకెలకు ఇంత తేడా ఎలా ఉంది ? ఎన్ని ఉద్యోగాలు వస్తాయనేది వైసిపి, తెలుగుదేశం వారు ఏమి చెప్పారన్నది పక్కన పెడితే ఆ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్న గూగుల్ కంపెనీ చెప్పిన సంఖ్య ఎంతో ఎక్కడా కనిపించలేదు. ఎందుకీ దాపరికం ? సదరు కంపెనీ వ్యాపార వ్యూహాలతో మనకు పనిలేదు. ఎన్ని సంవత్సరాల వ్యవధిలో ఎంత పెట్టుబడి పెట్టేది,పర్మనెంటు ఉద్యోగాలు ఎన్నివచ్చేది కచ్చితంగా ప్రకటించాల్సిందే. ఎందుకంటే దానికి జనం సొమ్మును రాయితీలుగా ప్రభుత్వం ఇస్తున్నది గనుక తెలుసుకొనే హక్కు ప్రతి పౌరుడికీ ఉంది, ప్రభుత్వమైనా అధికారికంగా ప్రకటించాలి, అది దాని బాధ్యత, జవాబుదారీ తనం, కాదంటారా !సంబంధిత మరో విశ్లేషణ దిగువ లింక్‌లో చదవవచ్చు
సముద్రంలో చైనా డేటా సెంటర్ : నిజంగా నరేంద్ర మోడీ, చంద్రబాబు భవిష్యత్ దార్శనికులా !
https://vedikaa.com/2025/10/27/china-underwater-data-center-where-socalled-visionaries-narendra-modi-and-chandrababu-failed/
