Tags
8th Pay Commission, Central and State Government Employees, Costliest Pay Hike, Narendra Modi Failures, Pensions and Salaries, Pensions Outpace Salaries
ఎం కోటేశ్వరరావు
కేంద్ర ప్రభుత్వం ఎనిమిదవ వేతన కమిషన్ నియామకం చేసింది. ఈమేరకు నవంబరు మూడవ తేదీన గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ రోజు నుంచి పద్దెనిమిది నెలల్లో నివేదికను సమర్పించాలని దానిలో నిర్దేశించారు. నరేంద్రమోడీ సర్కార్ ఏర్పాటు చేసిన తొలి సంఘం ఇది. ఈ క్రమాన్ని చూసినపుడు ప్రతిదాన్నీ ఓట్ల కోసం ఎలా వినియోగించుకుంటున్నారో దీన్లో కూడా చూడవచ్చు.ఏడవ వేతన సంఘాన్ని 2014 ఫిబ్రవరిలో నియమించగా 2015 నవంబరులో నివేదిక సమర్పించింది. ఈ లెక్కన ఈ పాటికి ఎనిమిదవ వేతన సంఘనివేదిక కేంద్ర ప్రభుత్వానికి అందాల్సి ఉంది. దూరాలోచన లేదా దుష్టాలోచనతో ఎన్నికల కోసం ఆలశ్యం చేశారనిపిస్తోంది. సరిగ్గా ఢిల్లీ ఎన్నికలకు ముందు ప్రకటన చేశారు. ఇప్పుడు బీహార్ ఎన్నికల సందర్భంగా కమిషన్ నియామకాన్ని ప్రకటించారు. దీని సిఫార్సులు, కేంద్రం పరశీలించి అమలు చేయాల్సిన సమయానికి లోక్‌సభ ఎన్నికలు వస్తాయి. ఈ కమిషన్ సిఫార్సులు 2028లోగా అమల్లోకి వచ్చే అవకాశం లేదని సీనియర్ అధికారులు చెబుతున్నారంటే దాని అర్ధం అదే.మరొక ప్రమాదం ఏమిటంటే బకాయిలను ఎగవేసే అవకాశం కూడా ఉందని చెబుతున్నారు. ఎన్నికల ముందు అమలు చేసి చూశారా మీకు ఎంత మేలు చేశామో, దానికి మాకేమిటి అని అడిగేందుకు ఒక ప్రచార అస్త్రంగా ఉండనుంది. ఏడవ వేతన కమిషన్ 2015 నవంబరులో నివేదికను అందచేస్తే 2016 జూన్‌లో కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది.ఒక వైపు డిజిటల్ రంగంలో ముందున్నాం అంటారు. వివరాలు తెప్పించుకొనేందుకు ఎన్ని సంవత్సరాలు కావాలి ? అసలు విషయం ఏమిటంటే ప్రతి వేతన సంఘం వేసినపుడు వేతనాలు, పెన్షన్లు, బకాయిల చెల్లింపుకు బడ్జెట్ కేటాయింపులు జరపాల్సి ఉంటుంది. ఎన్నికల ముందు అది ప్రభుత్వానికి పెద్ద అగ్ని పరీక్షే. బీహార్‌లో బిజెపి చంకనెక్కిన నితీష్ కుమార్ దశాబ్దాల పాలనలో కనీసం ఆలోచించని అంశాలను కూడా ఆఘమేఘాల మీద అమలు చేశారు. చంద్రబాబు నాయుడు 2019 ఎన్నికల సమయంలో మహిళలను ఆకట్టుకొనేందుకు పసుపు కుంకుమల పేరుతో చేసిన మాదిరి రెండు కోట్ల మంది మహిళలకు తలా పదివేల చొప్పున వారి ఖాతాలకు బదిలీ చేశారు. సామాజిక పెన్షన్ల పెంపు ప్రకటన చేశారు. ఇవన్నీ సరిగ్గా అసెంబ్లీ ఎన్నికల ప్రకటనకు కొద్ది రోజుల ముందు జరిగాయి. ఓట్లకోసం మేము ఏదీ చేయం అని నరేంద్రమోడీ చెప్పేదానికి – ఆచరణకు ఇది నిదర్శనం. అయితే కూటికోసం కోటి విద్యలు అన్నట్లుగా వేస్తున్న వేషాలను చూసి జనం ఓట్లేస్తారా ? నిజంగా అలా జరిగి ఉంటే అయోధ్యలో బిజెపి ఎందుకు ఓడిపోయింది, కాశీ విశ్వనాధుని సన్నిధిలో 4.79లక్షల నుంచి 1.52లక్షల ఓట్లకు మోడీ మెజారిటీ ఐదేండ్లలో ఎందుకు తగ్గిపోయింది ? పదేండ్లకు ఒకసారి నియమిస్తున్న వేతన సంఘం ఉద్యోగులు, పెన్షనర్ల మీద ఖర్చు ఎలా తగ్గించాలా అని చూస్తున్నది, అయితే సంఘటితంగా ఉద్యోగులు ఉన్న కారణంగా వాటి అజెండా పూర్తిగా అమలు చేయటం సాధ్యం కావటం లేదు. ఇప్పుడు కూడా అదే జరగనుందా ?
వేతన, పెన్షన్ బిల్లుల గురించి గుండెలు బాదుకుంటూ మీడియాలో విశ్లేషణలు రాస్తున్నారు. వంది మాగధులు రాజుగారి మనసెరిగి వ్యవహరిస్తారన్నది తెలిసిందే. ఇదీ అంతే ! వేతనాలకు మించి పెన్షన్ బిల్లు పెరిగిపోతోందన్నది వాటిలో ఒకటి. భవిష్యత్‌లో ఉద్యోగులకు వార్షిక ఇంక్రిమెంట్లను వారు అందించిన సేవలు, డిజిటల్ పాలన మైలురాళ్లు, పౌరుల సంతృప్తి సూచికల ప్రాతిపదికన ఇవ్వాలని ఆర్థికవేత్తలు సలహా ఇస్తున్నారు. ప్రభుత్వ యంత్రాంగ చరిత్రలో ఎనిమిదవ వేతన సంఘ కసరత్తు పెనుసవాళ్లతో కూడిన వాటిలో ఒకటిగా రూపుదిద్దుకుంటున్నదట. కోటీ ఇరవై లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లే కాదు, అంతకంటే ఎక్కువగా ఉండే రాష్ట్రాల సిబ్బంది మీద కూడా ఈ కమిషన్ సిఫార్సుల ప్రభావం పడనుంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు 50లక్షల మంది వరకు ఉండగా పెన్షనర్లు 69లక్షల మంది ఉన్నారని, రాబడిలో 18శాతం వేతనాలు, పెన్షన్లకే పోతున్నదని, ఒకవైపు పొదుపు మరోవైపు న్యాయమైన వేతన సవరణ డిమాండ్ల మధ్య పోరు జరగనుందని చెబుతున్నారు. ప్రైవేటు రంగానికి నిపుణులైన వారు వెళుతున్నందున ప్రభుత్వ రంగానికి వారిని ఆకర్షించేందుకు 1990దశకం నుంచి ప్రతి వేతన కమిషన్ సిఫార్సులలో వేతన వృద్ధి దేశ తలసరి ఆదాయవృద్ధి రేటుకంటే ఎక్కువగా ఉంటున్నదట. వేతన, పెన్షన్ ఖర్చు పెరిగిపోవటం వలన మౌలిక సదుపాయాలు, విద్య,ఆరోగ్య రంగాలకు నిధుల కొరత ఏర్పడుతున్నదట. ఒక ఏడాది కాగానే ఇంక్రిమెంట్, కరువు భత్యం వాయిదాలు చెల్లించటం కాకుండా సామర్ధ్యం, ఉత్పాదకత ప్రమాణాలు దాటిన తరువాతే ఇవ్వాలని కొందరు సూచిస్తున్నారు.దానికి అనుగుణంగానే జస్టిస్ రంజనా దేశారు ఆధ్వర్యంలోని ఎనిమిదవ వేతన కమిషన్‌కు ప్రభుత్వం సూచించిన మార్గదర్శకాలు ఉన్నాయి. వీటిని చూసిన తరువాత ఇదే చివరి వేతన సంఘం అన్న వారు కూడా ఉన్నారు. పరిహారం చెల్లింపు విషయంలో నూతన నమూనాలను పరిశీలించాలని, జవాబుదారీతనం, సామర్ధ్యం ప్రతిఫలించాలని వాటిలో పేర్కొన్నారు. వీటిని ఎవరూ వ్యతిరేకించటంలేదు, అనుసరించే కొలబద్దలేమిటన్నదే సమస్య. ఉదాహరణకు పశువుల మూతికి చిక్కాలు కట్టి బీళ్లలో మేతకు వదలినట్లు బిఎస్‌ఎన్‌ఎల్ విస్తరణకు అనేక ఆటంకాలను కల్పించి, తీరా ప్రయివేటు సంస్థలు ముందుకు పోయేందుకు అవకాశం కల్పించి అసమర్ధ సంస్థగా చిత్రించిన తీరును మనం చూశాం. అంటే అలాంటి సంస్థలలో పని చేసే సిబ్బందికి సామర్ధ్యం లేదని, తగిన ఉత్పాదకతను చూపటం లేదనే పేరుతో వేతన పెంపుదలను నిరాకరిస్తే అది న్యాయమైనదేనా ?
గతంలో బిజెపి నేత వాజ్‌పాయి నాయకత్వంలోని ఎన్‌డిఏ ప్రభుత్వం 2004లో అమల్లోకి తెచ్చిన నూతన పెన్షన్ పథకం(ఎన్‌పిఎస్) తరువాత కూడా పెన్షన్ బిల్లు పెరగటానికి సగటు జీవితకాలం పెరగటం ఒక కారణం. ఈ పెన్షన్ విధానం ద్వారా బిల్లు తగ్గాలంటే 2040 వరకు ఆగాల్సిందే,ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ వార్షిక పెన్షన్ బిల్లు రు.2.6లక్షల కోట్లు దాటింది. విదేశీ కంపెనీలు, స్వదేశీ కార్పొరేట్లకు ఇచ్చే రాయితీలు మొత్తం తిరిగి దేశంలో పెట్టుబడులుగా రావటం లేదు, ఇతర దేశాలకు చేరుతున్నాయి. విదేశీ పెట్టుబడుల ముసుగులో మరిన్ని రాయితీలు పొందేందుకు తిరిగి ఇక్కడికే చేరుతున్నాయి లేదా ఎక్కడ లాభసాటిగా ఉంటే అక్కడికి వెళుతున్నాయి. కానీ ఉద్యోగులు, పెన్షనర్లకు ఇచ్చే మొత్తాలు అలాంటివి కాదే, నల్లధనంగా మారి స్విస్ వంటి పన్ను స్వర్గాలకు చేరటం లేదు. ఇక్కడే వస్తు, సేవల వినియోగానికి జీవితకాలంలో ఒక స్వంత ఇంటిని, పరిమితంగా బంగారం, ఇతర ఆస్తులను కూడబెట్టుకొనేందుకు వినియోగపడుతుంది. జిఎస్‌టి రూపంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు తిరిగి చేరుతున్నది.
ప్రకటించిన వివరాల మేరకు పద్దెనిమిది నెలల్లో నివేదిక అంటే సమర్పణకే 2027 ఏప్రిల్ వరకు ఆగాల్సిందే. ఇతర కారణాలు చూపి ఆలశ్యం చేస్తే చేయగలిగిందేమీ లేదు. మధ్యంతర నివేదికను కూడా ప్రకటించవచ్చు. నూతన వేతనాలు 2026 జనవరి ఒకటి నుంచి అమల్లోకి రావాల్సి ఉంది. వేతన కమిషన్ ఇంతవరకు ఉద్యోగుల ముందు ఎలాంటి ప్రతిపాదనలు చేయలేదు. అయితే ఫిట్‌మెంట్ ఫాక్టర్ 2.86ప్రకారం రు.19వేల వరకు వేతనాలు పెరగవచ్చని కొందరు చెబుతున్నారు. గత వేతన కమిషన్ 2.57ను తీసుకుంది. దాని ప్రకారం మూల వేతనం రు.7 నుంచి 18వేలకు పెరిగింది. ఇప్పుడు రు.18 నుంచి రు.46,260, పెన్షన్ రు.9 నుంచి రు.23,130కి పెరగవచ్చని ఉద్యోగ సంఘాలు చెబుతున్నాయి. అయితే కేంద్ర మాజీ ఆర్థిక శాఖ కార్యదర్శి సుభాస్ చంద్ర గార్డ్ ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ 1.92గా ఉండవచ్చని, కనీస వేతనం రు.34,500 అవుతుందని చెప్పారు. మధ్య స్థాయిలో ఉండే ఉద్యోగివేతనం ప్రస్తుతం రు. ఒక లక్ష ఉన్నదని, వేతన పెంపుదల శాతాన్ని బట్టి దానికి అదనం అవుతుందని భావిస్తున్నారు.ఉదాహరణకు ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ 2.5 అనుకుంటే అది రెండున్నర లక్షలు అవుతుంది. కమిషన్ ఎలాంటి సిఫార్సులు చేసినప్పటికీ దాన్ని ప్రభుత్వం సవరించవచ్చు.
దేశంలో తొలి వేతన కమిషన్ 1946లో ఏర్పాటు చేశారు. శ్రీనివాస వరదాచారి చైర్మన్. కనీస వేతనంగా రు.55, గరిష్టవేతనం రు.2,000 సిఫార్సు చేశారు. ఏడవ వేతన సంఘం కనీస, గరిష్ట వేతనాలు రు.18,000 మరియు రు.2,50,000గా ఉన్నాయి. ధరల పెరుగుదల కారణంగా 1957లో ఏర్పాటైన రెండవ కమిషన్ కరువు భత్యాన్ని సిఫార్సు చేసింది. 1983ల ఐదవ వేతన కమిషన్ ఇంటి అద్దెను సిఫార్సు చేసింది. నాలుగవ వేతన సంఘం అంతకు ముందు ఏడాదికి నాలుగుసార్లు డిఏ ప్రకటించే విధానాన్ని రద్దు చేసి ఏడాదికి రెండు సార్లు ప్రకటించేట్లు సిఫార్సు చేసింది. నూతన వేతన సంఘనియామకానికి ముందు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ సంఘాలు పదిహేను డిమాండ్లను ప్రభుత్వం ముందు ఉంచాయి.వాటిని వేతన సంఘం పరిగణనలోకి తీసుకొని మధ్యంతర సిఫార్సులు చేస్తుందా లేదా అన్నది చూడాల్సి ఉంది. జీవన వేతన అవగాహనకు అనుగుణంగా కనీస వేతన నిర్ణయం ఉండాలని, ఒకటి నుంచి 4వ స్థాయి వరకు విలీనం చేయాలని, మధ్యంతర భృతి, నూతన పెన్షన్ విధాన రద్దు వంటివి వాటిలో ఉన్నాయి. ఎనిమిదవ వేతన సంఘం గురించి ఒక్క ముక్కలో చెప్పాలంటే వేతన సంఘం అంటే వేతనాలు, పెన్షన్లు, అలవెన్సులను సిఫార్సు చేయటమే కాదు.ఇప్పుడు దేశంలో అమలు జరుగుతున్న విత్తనమూనా తట్టుకొని నిలుస్తుందా లేదా అన్నది కూడా తేలాల్సి ఉంటుందని కొందరు విశ్లేషకులు పేర్కొన్నారంటే ఏదో ముప్పు మూడినట్లే కనిపిస్తోంది. 2026 జనవరిలోగా ఉద్యోగవిరమణ చేసే వారికి నూతన వేతనాలు, పెన్షన్లు వర్తిస్తాయా లేదా అన్నది అనుమానమే. అందువలన ఈ వేతన సంఘం 2029లో జరిగే లోక్‌సభ ఎన్నికల్లో బిజెపి దాని మిత్రపక్షాలకు ఒక అగ్నిపరీక్షగా మారనుందని కూడా చెప్పవచ్చు.





