Tags
Amaravathi capital, BJP, BJP-JDU, CHANDRABABU, Narendra Modi, Nirmala Sitaraman stimulus package, Nithish Kumar
ఎం కోటేశ్వరరావు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి అధికార యంత్రాంగం సహకరించటం లేదా ? ఆర్థిక ఇబ్బందుల ఆత్రంతో చేయాల్సింది చేయటం లేదా ? రాజకీయంగా నరేంద్రమోడీ చాణక్య నీతిని ప్రదర్శిస్తున్నారా ? మొత్తం మీద ఏదో జరుగుతోంది. నీతి ఆయోగ్ సమావేశాలకు వెళ్లిన సందర్భంగా మరోసారి సిఎం కేంద్ర మంత్రులను కలుస్తారని చెబుతున్నారు. బడ్జెట్ పెట్టక ముందు ముఖ్యమంత్రి కూడా ఢిల్లీ పర్యటన జరిపి అనేక అంశాలను కేంద్రానికి నివేదించారు. ఎన్నికలకు ముందు బిజెపి పెద్దలు చెప్పింది ఒకటి తరువాత చేస్తున్నది ఒకటి అన్న సంగతి అమరావతికి అప్పు ఇప్పిస్తామనటంలోనే వెల్లడైంది. బయటకు చెప్పుకోలేక చంద్రబాబు అదియును మంచిదే అన్నారు. దేవుడు నైవేద్యం తినడని పూజారికి మాత్రమే తెలుసు. కేంద్రం ఇచ్చేదేమిటో చంద్రబాబుకు ముందే తెలుసు గనుకనే వచ్చేదేమీ ఉండదని బడ్జెట్‌ను రెండునెలలు వాయిదా వేసుకున్నారు. బడ్జెట్ కేటాయింపులు చూసిన తరువాత అది వాస్తవమని తేలింది. అసలేమీలేని దానికంటే పదే పదే రాష్ట్రం పేరును ప్రస్తావించటాన్ని చూసి కడుపు నింపుకున్న వారు కొందరు ఉన్నారు. అమరావతికి గ్రాంటు బదులు అప్పు ఇప్పిస్తామంటే పండగ చేసుకున్నారు. పోలవరాన్ని పూర్తి చేస్తామంటే ఆహా ఓహౌ అన్నారు. కానీ ఆకస్మికంగా ప్రత్యేక మంత్రివర్గ సమావేశాన్ని ఏర్పాటు చేసిన చంద్రబాబు నాయుడు పోలవరం గురించి చర్చించి ఒక తీర్మానాన్ని ఆమోదించాల్సిన అవసరం ఏమొచ్చిందో తెలియదు. బడ్జెట్‌కు ముందు జరిగిన కాబినెట్‌లో ఆ తీర్మానాన్ని ఎందుకు చేయలేదు ? దాని అవసరం గురించి అధికార యంత్రాంగం తప్పుదారి పట్టించిందా ? ఇంతకూ ఏమిటా తీర్మానం ?
పోలవరం ప్రాజక్టు డయాఫ్రం వాల్ 2020వరదల్లో దెబ్బతిన్నది. ఏది జరిగినా అందుకయ్యే ఖర్చును భరించాల్సింది కేంద్రమే. దేవుడు చేసిన దానికి మా బాధ్యత లేదంటే కుదరదు. అది జాతీయ ప్రాజెక్టు, ఖర్చంతా భరించేందుకు ఎప్పుడో అంగీకరించారు. కొత్త డయాఫ్రం వాల్ నిర్మించాలని జూలై మూడున నిపుణుల సమక్షంలో కేంద్ర జలసంఘం చైర్మన్ కుశ్చిందర్ ఓహ్రా నిర్ణయం తీసుకున్నారని చెబుతున్నారు. దానికి అవసరమైన నిధులు ఇవ్వటమే తరువాయి, అంచనాలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వమే తన నిపుణులను పంపవచ్చు లేదా రాష్ట్రం పంపిన వాటిని పరిశీలించి ఆమోదముద్ర వేయవచ్చు. డిపిఆర్‌లో లేని కొత్త అంశమైతే అర్ధం చేసుకోవచ్చు, అలాకానపుడు ముద్ద ముద్దకు గోవిందా గోవిందా లేదా బిస్మిల్లా బిస్మిల్లా అనాల్సిన అవసరం ఏమిటి ? దీనికి గాను ఆకస్మికంగా మంత్రి వర్గ సమావేశం, తీర్మానంతో పనేమిటి ? కొత్త డయాఫ్రం వాల్ నిర్మాణానికి రు.900 కోట్లు కేటాయించాలని, తొలిదశ సవరించిన అంచనా రు.30,437 కోట్లకు గాను ఇంకా రు.12,157 కోట్లు రావాల్సి ఉందని, ఆ మొత్తాన్ని ముందుస్తుగా మంజూరు చేయాలని మంత్రివర్గ తీర్మానంలో పేర్కొన్నారు. సాంకేతికంగా అలాంటి తీర్మానం అవసరం అయితే బడ్జెట్‌కు ముందే కేంద్రానికి పంపివుంటే నిర్మలా సీతారామన్ కేటాయించి ఉండేవారు కదా ! ఎందుకు పంపలేదు ? అధికార యంత్రాంగానికి తెలియదా ? ఇప్పుడు బడ్జెట్‌ను సవరించి కేటాయిస్తారా ? లోగుట్టు పెరుమాళ్లకెరుక !
తమ ప్రభుత్వ హయాంలోనే డయాఫ్రం వాల్ నిర్మాణానికి అనుమతించాలని కేంద్రాన్ని కోరినా అనుమతి రానందున తామేమీ చేయలేకపోయినట్లు వైసిపి నేతలు ఎన్నికల ఫలితాలు వెలువడిన తరువాత చర్చల్లో చెప్పారు. అంతకు ముందు కేంద్ర నిర్వాకాన్ని గురించి జగన్ మోహనరెడ్డి లేదా పార్టీ పెద్దలు ఎవరూ ఎక్కడా చెప్పిన, లేదా అనుమతికి కేంద్రం మీద వత్తిడి తెచ్చిన దాఖలాలు లేవు. గురువారం నాడు రాష్ట్రమంత్రి వర్గం ఆకస్మిక సమావేశం జరిపి తీర్మానం చేసిన వార్తతో పాటు శుక్రవారం నాడు సాక్షి పత్రిక కొన్ని విషయాలను ప్రస్తావించింది. దాని కథనం ప్రకారం ” దెబ్బతిన్న డయాఫ్రం వాల్ భవితవ్యాన్ని తేల్చితే ప్రాజెక్టు నిర్మాణాన్ని త్వరిత గతిన పూర్తి చేస్తామని నాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చేసిన ప్రతిపాదన మేరకు 2022 మార్చి నాలుగవ తేదీన కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెఖావత్ పోలవరం ప్రాజెక్టును సందర్శించారు.దెబ్బతిన్న డయాఫ్రం వాల్‌కు సమాంతరంగా కొత్తది నిర్మించాలని అప్పట్లోనే ప్రతిపాదించారు.వైఎస్ జగన్ విజ్ఞప్తి మేరకు తొలిదశ పూర్తి చేయడానికి రు.10,911 కోట్లు, డయాఫ్రం వాల్ పునరుద్దరణ, మరమ్మతులకు రు.2వేల కోట్లు వెరసి రు.12,911 కోట్లు ఇచ్చేందుకు అంగీకరిస్తూ 2023 జూన్ ఐదున కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నోట్ జారీచేశారు. ఆ నిధులు విడుదల చేయాలంటే కేంద్ర కాబినెట్ ఆమోదం తప్పనిసరి. ఎందుకంటే 2016 సెప్టెంబరు ఆరున పోలవరం నిర్మాణ బాధ్యతలను దక్కించుకొనే క్రమంలో 2013-14 ధరలతోనే ప్రాజెక్టును పూర్తిచేస్తానని చంద్రబాబు కేంద్రంతో ఒప్పందం చేసుకున్నారు. ఆ ఒప్పందం ప్రకారం 2014 ఏప్రిల్ ఒకటి నాటికి నీటిపారుదల విభాగంలో మిగిలిన పనులకు అయ్యే వ్యయం అంటే రు.15,667.90 కోట్లు ఇవ్వాలని 2017 మార్చి 15న కేంద్రకాబినెట్‌నిర్ణయించింది. ఇప్పటికే పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం రు.15,146.28 కోట్లు విడుదల చేసింది.దీనికి తోడు రు.12,157.52 కోట్లు విడుదల చేయాలంటే 2017 మార్చి 15న తీసుకున్న నిర్ణయాన్ని కేంద్ర కాబినెట్ మారుస్తూ తీర్మానం చేయాలి. ఈ మేరకు కేంద్రజలశక్తి శాఖ ఈ ఏడాది మార్చి ఆరున కేంద్ర కాబినెట్‌కు ప్రతిపాదన పంపింది.”
అయితే అప్పటికే ఎన్‌డిఏలో చేరిన టిడిపి అధినేత చంద్రబాబు ఆ నిధులు ఇస్తే రాజకీయంగా తనకు ఇబ్బందులు వస్తాయని కేంద్ర ప్రభుత్వ పెద్దల చెవుల్లో ఊదారని, దాంతో కేంద్రం పక్కన పెట్టిందని కూడా సాక్షి కథనం ఆరోపించింది. రు.30,436.95 కోట్లకు ఆమోదం తెలిపిన అంశాన్ని చంద్రబాబు కాబినెట్ సమావేశం గుర్తు చేసిందని ఆంధ్రజ్యోతి వార్తలో పేర్కొన్నారు. అదే నిజమైతే మిగిలిన మొత్తం రు.12,157కోట్లు విడుదల చేయాలంటూ ఆకస్మికంగా రాష్ట్ర కాబినెట్ తీర్మానించాల్సిన అవసరం ఏమిటి అన్నది ప్రశ్న. దీనిపై కేంద్ర ప్రభుత్వం అదే మాదిరి చంద్రబాబు నాయుడు కూడా వాస్తవాలేమిటో జనానికి వెల్లడించాలి. తాజాగా పోలవరంపై విడుదల చేసి శ్వేత పత్రంలో సవరించిన ప్రాజెక్టు వ్యయాన్ని కేంద్రం ఆమోదించినట్లు చెప్పలేదు. 2013-14 సంవత్సర సిఫార్సులను మాత్రమే కేంద్ర ప్రభుత్వం అంగీకరించింది.ఇక 2017-18 సంవత్సరాల సవరించిన అంచనాలను 2019 ఫిబ్రవరి 11న చంద్రబాబు నాయుడు సిఎంగా ఉండగానే టెక్నికల్ అసిస్టెన్స్ కమిటీ రు.55,657 కోట్లకు ఆమోదం తెలిపింది. దానికి ఇంతవరకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలపలేదు. ఒకవేళ రు.30వేల కోట్లకు ఆమోదం తెలిపితే విడుదల కోసం ప్రత్యేకంగా తీర్మానంతో పనిలేదు. తరువాత పెరిగిన ధరల ఖర్చు సంగతేమిటి ? నీతి అయోగ్ సమావేశాల్లో పాల్గొనేందుకు ఢిల్లీ వెళుతున్న చంద్రబాబు కేంద్ర మంత్రులను కూడా కలుస్తారని చెబుతున్నారు. బడ్జెట్ ప్రవేశపెట్టిన తరువాత ఇప్పుడు చేసేది ఉంటుందా ? ప్రతిపాదనలను సవరించేందుకు కేంద్రం అంగీకరిస్తుందా ? అదే జరిగితే మిగతా రాష్ట్రాలు చేస్తున్న వత్తిడి మరింత పెరగదా ? చూద్దాం ఏం జరుగుతుందో !
కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాజధానికి అప్పు ఇప్పిస్తామని చెప్పి బీహార్‌కు పెద్ద మొత్తంలో పథకాలకు నిధులు ఇస్తామని ప్రకటించింది. ఎందుకిలా చేసింది ? ఏమిటీ వివక్ష ? ఆ రాష్ట్రానికి మొత్తం 62వేల కోట్ల రూపాయల విలువగల పథకాలను ప్రకటించినట్లు వార్తలు వచ్చాయి. వీటిలో రోడ్లు, వంతెనలకు రు.26వేల కోట్లు, 2,400 మెగావాట్ల నూతన విద్యుత్ కేంద్రంతో సహా విద్యుత్ ప్రాజెక్టులకు రు.21,400 కోట్లు, వరదల నిరోధంతో సహా సాగునీటి పథకాలకు రు.11,500 కోట్లు, ఇవిగాక మెడికల్ కాలేజీలు, విమానాశ్రయాలు, క్రీడలకు మౌలిక సదుపాయాలు, దేవాలయాల టూరిజం పాకేజ్‌లు ఉన్నాయి. వీటిని బీహార్‌కు ఇచ్చినందుకు ఎవరూ తప్పుపట్టటం లేదు. అయితే ఒక్కసారిగా ఎందుకు ఇంత ప్రాధాన్యత ఇచ్చారన్నది ప్రశ్న. బీహార్‌లో లోక్‌సభ ఎన్నికల్లో బిజెపి-జెడియు కూటమికి ఎదురుదెబ్బ తగిలింది. తొమ్మిది సీట్లతో పాటు దాదాపు తొమ్మిదిశాతం ఓట్లను కూడా కోల్పోయింది. నరేంద్రమోడీకి ఎదురులేదని భావించిన నితీష్ కుమార్ అంచనా తప్పింది, బిజెపి స్వంతంగా మెజారిటీని సాధించలేకపోయింది. మోడీ, బిజెపి బలహీనత వెల్లడైనందున దాని ప్రభావం వచ్చే ఏడాది జరగాల్సిన అసెంబ్లీ ఎన్నికల మీద కూడా పడుతుంది. పలుకుబడి ఇంకా దిగజారక ముందే జాగ్రత్త పడేందుకు ముందస్తు ఎన్నికలకు పోయినా ఆశ్చర్యం లేదు. ఈ కేటాయింపులను చూస్తే ఈ ఏడాది మహారాష్ట్ర, హర్యానాలతో కలిపి జరుపుతారా అన్న అనుమానం కలుగుతోంది. ఈ రాష్ట్రాలలో కూడా లోక్‌సభ ఎన్నికల్లో బిజెపికి ఎదురుదెబ్బలు తగిలాయి. అసెంబ్లీ ఎన్నికల్లో కూడా అదే జరిగితే బీహార్‌ను వదులు కోవాల్సిందే. వచ్చే ఎన్నికల్లో తిరిగి తనకే సిఎం కుర్చీ కావాలని అడిగే అవకాశాలు నితీష్‌కుమార్‌కు సన్నగిల్లుతున్నాయి. లోక్‌సభ ఓటింగ్ వివరాల ప్రకారం ఆర్‌జెడి తరువాత బీహార్‌లో బిజెపి పెద్ద పార్టీ, అది అక్కడ నిలవాలంటే జెడియు నితీష్ కుమార్ అవసరం ఉంది.
అదే ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం మీద బిజెపి ఆధారపడాల్సి ఉంది. అక్కడ పెద్ద పార్టీగా ఎదిగే అవకాశాలు లేవు. అందువలన నితీష్ కుమార్ కంటే తన స్థానాన్ని పటిష్టపరుచుకొనేందుకు బిజెపి బీహార్ మీద వరాల వాన కురిపించింది.ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు ముగిశాయి, ఎక్కువ సాయం చేస్తే అది తెలుగుదేశం, జనసేనకే రాజకీయ లబ్దితప్ప బిజెపికి పెద్దగా ఒరిగేదేమీ లేదు. తెలుగుదేశం పార్టీ తాను తప్ప మరొక పార్టీని ఎదగనివ్వదు. అయినా ఇంకా ఐదు సంవత్సరాల వరకు జనంతో సంబంధం ఉండదు, అడిగేవారు ఎవరూ ఉండరు. ఎందుకంటే తెలుగుదేశం, జనసేన మిత్రపక్షాలు గనుక నోటికి తాళం వేసుకుంటాయి. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే తమకే అధికారం కట్టబెట్టాలని అడగాలంటే తెలుగుదేశం బలపడకూడదు.దానికి తోకగా ఎంతకాలం ఉండాలి. అప్పులు ఇప్పిస్తామనటం అంటే పొమ్మనకుండా పొగపెట్టటమే. పోలవరానికి పెరిగిన అంచనాను ఆలశ్యం చేస్తే అది పూర్తిగాక విమర్శలను ఎదుర్కోవాల్సింది చంద్రబాబే. బహుశా ఈ తర్కంతో బిజెపి ఉన్నట్లు కనిపిస్తోంది. అందుకు రాష్ట్రాభివృద్ధిని దెబ్బతీసేందుకు కూడా వెనకాడటం లేదా ? ఏమో దేన్నీ కాదనలేం !!






